సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్ర సారస్వత పరిషత్తు

ఆంధ్ర సారస్వత పరిషత్తు  :- ఆంధ్ర సారస్వత సంస్కృతుల అభివృద్ధి, అక్షరాస్యతా వ్యాప్తి అను ఆదర్శాలతో ఆంధ్ర సారస్వత పరిషత్తు హైదరాబాదు నగరమున 1943 సంవత్సరము మే నెల 26 వ తేది నాడు శ్రీలోకనంది శంకరనారాయణరావుగారి అధ్యక్షతన స్థాపితమైనది. ఈ సంస్థ తన ఆదర్శాల ప్రకారము పనిజేయుట కొరకు ఈ క్రింది ఆశయములను నిర్ణయించుకొన్నది.

1. సభలు, సమ్మేళనములు, సమావేళములు.
2. దేశమందలి సారస్వతమును తత్సంబంధమైన విశేషములను గ్రహించి ప్రకటించుట-
3. పారిభాషిక మాండలిక కోశములను సిద్ధపరచుట.
4. రాష్ట్రమందలి ఇతర సారస్వత సంస్థలను జతపరచుకొని సారస్వత కృషి సాగించుట.
5. సారస్వత పరీక్షలు తెలుగులో జరుపుట.
6. రచయితలను ప్రోత్సహించుట.
7. సంబంధ శాఖలను స్థాపించుట.

1948వ సం. పోలీసు చర్యకు పూర్వము హైద్రాబాదు రాష్ట్రములో ఆంధ్ర సారస్వత సంస్కృత్యభివృద్ధికి పెక్కు ప్రతిబంధకము లుండెడివి. ప్రతికూల పరిస్థితులలో 1948 వరకు ఈ పరిషత్తు పనిచేయవలసి వచ్చినది. ఈ సంస్థ యొక్క వార్షికోత్సవాలు ఇప్పటి వరకు హైదరాబాదు, ఓరుగల్లు, నల్లగొండ, మహబూబునగరం, తూపురాస్, మంచిర్యాల, అలంపురములలొ ఏడు పర్యాయములు జరిగినవి. అలంపురము వార్షికోత్సవమునకు భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్వన్మణి ప్రారంభోత్సవము చేసి పరిషత్తును ఆశీర్వదించిరి. ఇవిగాక పరిషత్తు జిల్లా సభలుకూడ పలు ప్రాంతాలలో ఒరిగినవి. ఇప్పటివరకు ఈ సంస్థకు శ్రీ లోకనంది శంకరనారాయణరావు, కీ.శే. శ్రీ సురవరము ప్రతాపరెడ్డి, శ్రీ బుజ్జా వేంకటసుబ్బారాయడు, శ్రీ ఇల్లిందల రామచంద్రరావు, శ్రీ పర్సా వేంక టేశ్వరరావు, శ్రీ దేవులపల్లి రామానుజ రావుగార్లు అధ్యక్షులుగా పనిజేసిరి. ఈ సంస్థకు ఇప్పటివరకు కార్యదర్శులుగా పని జేసిన వారు శ్రీ బూర్గుల రంగనాథరావు, శ్రీ విదురు వేంకట శేషయ్య, శ్రీ నూకల నరోత్తమ రెడ్డి, శ్రీ పులిజాల హనుమంతరావుగార్లు.

పరిషత్తు కార్యక్రమములో పరీక్షల నిర్వహణము అతి ముఖ్యమైనది. పోలీసు చర్య తరువాత యీ పరీక్షలకు వేల సంఖ్యాకులుగా అభ్యర్థులు వచ్చుచున్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ప్రవేశ, విశారద అను పరీక్షలు సంవత్సరానికి రెండు పర్యాయములు జరుగును. ఇందులో ప్రవేశ పరీక్ష యందు ఉత్తీర్ణత గాంచిన వారు ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయ పదవిని ఆక్రమించుటకు అర్హులుగను, విశారద పరీక్షయందు ఉత్తీర్ణతనొందిన వారు సెకండరీ పాఠశాలలలో తెలుగును బోధించుటకు అర్హులు గను హైదరాబాదు ప్రభుత్వమువారు ఆమోదించియుండిరి. ఇప్పటి వరకు ఈ పరీక్షలలో నలుబది వేల వరకు ఆభ్యర్థులు పాల్గొనియున్నారు. ఈ పరీక్షలు ప్రతిసారి 40 నుండి 100 కేంద్రాలలో జరుగుచుండును. ఇందులో అధిక సంఖ్యాకులైన అభ్యర్థులు పల్లెటూళ్లలో నివసించువారు; పాఠశాలలలో చదువుకొను అవకాశములేని వయోజనులు, తెలంగాణ జిల్లాలలోని ప్రతి పల్లెటూరికి ఈ పరీక్షలు సుపరిచితములు. ఇప్పటివరకు తెలంగాణములోని కొన్ని మార్ల పల్లెటూళ్లలో ఈ పరీక్షలు నిర్వహింపబడినవి. అందుచేతనే శ్రీబూర్గుల రామకృష్ణారావు గా రొకమారు పరిషత్తు కృషిని గూర్చి, మాట్లాడుచు సూర్యుని వెలుతురు

వలె పరిషత్తు మన రాష్ట్రము నందలి ప్రతిపల్లెను విజ్ఞానముచే ప్రకాశవంతము గావించుచున్నదని తెలిపిరి. "ఆంధ్ర పితామహ శ్రీ మాడపాటి హనుమంతరావుగారు తమ ఆంధ్రోద్యమ చరిత్రలో పరిషత్తు కృషి ఒక మహోద్యమము వలె తెలంగాణమున వ్యాపించుచున్నదని వ్రాసినారు. పరీక్షలతోపాటు అక్షరాస్యతా వ్యాప్తికి పరిషత్తు కృషి చేయుచున్నది. పోలీసు చర్య తరువాత ఇప్పటివరకు పరిషత్తు 114 రాత్రి పాఠశాలలను జిల్లాలలోని పల్లెటూళ్ల యందును, కొత్తగూడెము వంటి కార్మిక కేంద్రాలయందును నిర్వహించినది. ఈ పాఠశాలలలో సుమారు ఎనిమిది వేల మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులు గావింపబడిరి. వయోజనులను అక్షరాస్యులను గావించుటకొరకు ఉపాధ్యాయ శిక్షణ శిబిర మొకటి పరిషత్తు 1950వ సంవత్సరమున నిర్వహించినది. 1951వ సంవత్సరమున ఫిబ్రవరి 17వ తేది నుండి 21 వ తేది వరకు పరిషత్తు తెలంగాణమున వయోజన విద్యా వారమును జయప్రదముగా నిర్వహించినది. 1950 లో జబల్పూరులో జరిగిన వయోజన విద్యా ప్రచార గోష్ఠిలో పరిషత్తు ప్రతినిధులు పాల్గొని యావద్భారతమున జరుగు వయోజన విద్యా ప్రచార పద్ధతిని ఆకళింపు చేసికొనిరి. తరువాత 1953 వ సంవత్సరమున అలహాబాదులో నిర్వహింపబడిన వయోజన శిక్షణాలయమునకు పరిషత్తు ఒక కార్యకర్తను పంపి శిక్షణము నిప్పించినది. భారత ప్రభుత్వమువారు మొదటి పంచవర్ష ప్రణాళిక క్రింద నిరుద్యోగులకు ఉద్యోగము కల్పించు ఉద్దేశముతో ఏర్పాటు చేసిన సాంఘిక విద్యా ప్రణాళిక క్రింద ప్రభుత్వ సహకారముతో పరిషత్తు హైదరాబాదు నగరమున 11 సాంఘిక విద్యా కేంద్రములను రెండు సంవత్సరాలనుండి అత్యంత సామర్థ్యముతో నిర్వహించుచున్నది.

పరిషత్తు ఇప్పటివరకు దాదాపు నలుబది గ్రంథాలను ప్రకటించినది, ఇందులో పండిత సారస్వతము, బాల సారస్వతము, జానపద సారస్వతము చేరియున్నవి. పరిషత్తు ప్రచురణములలో 15 పుస్తకాలు చాల వాఙ్మయమునకు చెందినవి కలవు. ఈ పుస్తకాలలో శ్రీ సన్నిధానము సూర్యనారాయణశాస్త్రిగారి నరసభూపాలీయ వివరణము ఆంధ్ర సారస్వత విద్యార్థులకు పాఠ్యగ్రంథముగా విశేషోపకారకముగానున్నది. పరిషత్తు ప్రచురణములలో స్వర్గీయ శ్రీసురవరము ప్రతాపరెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర మనకు స్వాతంత్య్రము వచ్చినప్పటినుండి ఇప్పటివరకు విశాలాంధ్రమున ఆంధ్రభాషలో ప్రకటితమైన గ్రంథాలలో ఉత్తమమైనదిగా ఢిల్లీలోని సాహిత్య అకాడమీ వారిచే నిర్ణయింపబడి, కేంద్ర ప్రభుత్వమునుండి అయిదువేల రూపాయల బహుమతి పడసినది.ఇదిగాక జానపద వాఙ్మయమునకు సంబంధించిన స్త్రీల రామాయణపు పాటలు, పల్లెపదాలు అను వేయి పుటలు గల రెండు ఉద్గ్రంథములను పరిషత్తు ప్రకటించినది. తెలుగు మహాభారతము పై ప్రామాణిక పండితులు వ్రాసిన విమర్శనాత్మక వ్యాసాలను సంపుటీకరించి పరిషత్తు ప్రకటించినది.

గ్రంథాలయోద్యమ వ్యాప్తికి పరిషత్తు బలమైన చేయూతనిచ్చినది. 1952 వ సంవత్సరములో హైదరాబాదు నగరమున జరిగిన అఖిలభారత గ్రంథాలయ మహా సభా నిర్వహణమునందు ఈ పరిషత్తు యొక్క అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు ఆహ్వానసంఘ కార్యదర్శులుగ పని జేసిరి. మాజీ విద్యాశాఖ డైరెక్టరు శ్రీ సేతు మాధవరావుగారు నిర్వహించిన గ్రంథాలయోద్యమ సందర్భమున ఈ పరిషత్తు రెండు లక్షల తెలుగు పుస్తకాలను, విద్యాశాఖ క్రిందనున్న పాఠశాలలలో చేర్చుటకు పూర్తిగా సహకరించినది.

సాహిత్యముతో పాటు ఇతర కళలను ప్రచారము గావించుటకు పరిషత్తు కృషి గావించినది. 1952 అక్టోబరు నెలలో నృత్యగాన కళాసాహిత్యములనుగురించి హైదరాబాదాంధ్రులకు చక్కని పరిచయము కలుగ జేయుట కొరకై శ్రీ నటరాజ రామకృష్ణగారిని ఆహ్వానించి నగరమందు పలుచోట్ల నాట్యకళా ప్రదర్శనాలను ఏర్పాటు చేసినది. 1955 వ సంవత్సరము సెప్టెంబరు నెలలో తెలంగాణ చిత్రకారుడైన శ్రీ కొండపల్లి శేషగిరిరావు చిత్రించిన చిత్రముల ప్రదర్శనమును హైదరాబాదు నగరమున ఏర్పాటుగావించినది. ఈ ప్రదర్శనమునకు అప్పటి హైదరాబాదు ముఖ్యమంత్రి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు ప్రారంభోత్సవము గావించిరి.

మన రాష్ట్రమునందలి వివిధ వైజ్ఞానిక కార్యక్రమాలలో పరిషత్తు సహకరించుచున్నది. 1950 వ నవంబరు నెలలో మహారాష్ట్ర, కర్ణాటక సాహితీ సంస్థల సహకారముతో హైదరాబాదు నగరమున పరిషత్తు సంస్కృతి సంగమో త్సవమును నిర్వహించినది. 1951 వ మార్చి నెలలో ఢిల్లీలో జరిగిన అఖిలభారత సంస్కృతి సంగమోత్సవములో పరిషత్తు పాల్గొనినది. హైదరాబాదు నందలి సర్వకళాశాలా యాజమాన్యమున ప్రతి సంవత్సరము జరుగు ఆంధ్రాభ్యుద యోత్సవాలకు పరిషత్తు యథాశక్తి సహాయ సహకారముల నిచ్చుచున్నది.లక్ష్మణరాయ పరిశోధక మండలి కార్యకలాపాలను పరిషత్తు పునరుజ్జీవింప జేసినది. తెలంగాణ రచయితల సంఘ స్థావనకు ఇది దోహదముగావించి తెలంగాణ గ్రంథాలయ సంఘ కార్యాలయమునకు వసతి కల్పించినది.

పరిషత్తు రాష్ట్రములో అనేక సారస్వత సభలను నిర్వహించి ఉత్తమ కవి పండితుల నాహ్వానించి సన్మానించినది. శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ, శ్రీ మునిమాణిక్యం నరసింహారావు, శ్రీ పింగళి లక్ష్మీ కాంతము, శ్రీ నేలటూరి వెంకట రమణయ్య, శ్రీ గడియారం వేంకట శేషశాస్త్రి, శ్రీ తల్లావఝల శివశంకరస్వామి, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ నండూరి బంగారయ్య, శ్రీ వేదాల తిరువేంగాళాచార్యులు, శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, శ్రీ కురుగంటి సీతారామయ్య, శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి మొదలయిన కవిపండితుల నాహ్వానించి సాహిత్య, చారిత్రక, వైజ్ఞానికోపన్యాసముల నిప్పించినది. 1955 వ సంవత్సరమున పరిషత్తు తెలుగు భారత మహోత్సవాలను వారమురోజులు దిగ్విజయముగా నిర్వహించినది. కేంద్ర సంస్థవలెనే పరిషత్తు యొక్క శాఖలుగూడ వార్షికోత్సవాలను, సాహిత్యసభలను జరుపుచున్నవి. ఓరుగల్లు, నిజామాబాదు, బాపట్ల బొంబాయి, ఆలూరు, ఇభరాం పట్నము మొదలయిన పరిషత్తు శాఖలు పేర్కొనదగియున్నవి. కీ. శే. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి ఆస్థానకవి బిరుద ప్రదానసభలో పరిషత్తు పాల్గొని రజతకమలము సమర్పించినది.

పోలీసుచర్య తరువాత ఉప్మానియా విశ్వవిద్యాలయము నందలి శిక్షాప్రణాళికలో ప్రజల మాతృభాషలను నిర్బంధ పఠనీయములనుగా జేయించుటకు పరిషత్తు గట్టి కృషి గావించి కొంతవరకు విజయము పొంది

నది. పరిషత్తు పరీక్షలు ప్రభుత్వముచే ఆమోదింపజేయుటకు ప్రాచ్యవిద్యలయందు పట్టములు పొందిన పండితులకు విశ్వవిద్యాలయ పట్టభద్రులతో సమానవేతనముల నిప్పించుటకు, హైస్కూలు తరగతులలో కూడ మాతృభాషల ద్వారమున విద్యాబోధనము చేయించుటకును, పోలీసుచర్య జరిగిన వెంటనే పరిషత్తు కృషిగావించి సఫలత పొందినది. ఇందుకొరకై ఆచార్య శ్రీ తణికెళ్ళ వీరభద్రుడుగారి నాయకత్వమున యం. హనుమంత రావు నాయుడు, 'ఆంధ్ర పితామహ' శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులు, శ్రీ యన్. నరోత్తమ రెడ్డి, శ్రీ దేవులపల్లి రామానుజరావుగార్లతో కూడిన రాయబార వర్గము ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపాధ్యకుని, విద్యాశాఖామంత్రిని కలిసికొని నివేదికలు సమర్పించి, ప్రశంసనీయమైన కృషి గావించినది. 1951 వ సంవత్సరము రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ హైదరాబాదు వచ్చినప్పుడు పరిషత్తు ప్రతినిధులు వారిని సందర్శించి పరిషత్తు కృషిని నివేదించిరి.

పరిషత్తునకు హైదరాబాదు ప్రభుత్వము వారు నగర మందు బొగ్గులకుంటలో 1800 చ. గజాల వసతికల భూమిని ఉచితముగా నిచ్చిరి. ఈ భూమిలో పరిషత్తు కార్యాలయముకొరకు సొంతభవనమును కట్టుకొన్నది. పరిషత్తుకు నాలుగు సంవత్సరాలనుండి హైదరాబాదు ప్రభుత్వముచే ఆర్థిక సహాయము లఖించుచున్నది. ఈనాడు పరిషత్తు తెలుగు దేశములో సుస్థిరమైయున్న సంస్థలలో లెక్క పెట్ట దగినదిగా అభివృద్ధినొందియున్నది.

దే. రా.

[[వర్గం:]]