సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అహోబలుడు

అహోబలుడు  :- క్రీ. శ. 1500 సంవత్సరము ప్రాంతమువాడు. ఆంధ్రుడు. అహోబల క్షేత్ర ప్రాంతీయుడు. ఇతడు వెలనాటి వైదిక బ్రాహ్మణో త్తముడు. శ్రీకృష్ణ పండితుని కుమారుడు. వేద, వేదాంత, తర్క, వ్యాకరణ శాస్త్రనిష్ణాతుడు, సంగీతశాస్త్ర పండితుడు. గొప్ప వైణికుడు. తనకు చేకూరిన సమగ్రమైన అనుభవమును పురస్కరించుకొని 'సంగీత పారిజాతము' అను చక్కని సంగీతలక్షణ గ్రంథమును రెండు కాండములలో రచించెను. అందు మొదటి కాండమున రాగగీతములను రెండవ కాండమున వాద్యతాళములను చెప్పెను. క్రీ. శ. 1210 వ సంవత్సరమున నిశ్శంక బిరుదాంకితుడగు శార్జదేవ మహామహుడు రచించిన సంగీత రత్నాకరము నందలి విషయములను కొంతవరకు అనుసరించి పై గ్రంథమును ఇతడు రచించెను. ఇతడు తాను రచించిన 'సంగీత పారిజాతము' అను గ్రంథమును

శ్లో॥ సంగీత పారిజాతో౽యం సర్వకామ ప్రదోనృణాం !
అహోబలేన విదుషా క్రియతే సర్వసిద్ధయే॥

అను శ్లోకముబట్టి సందేహములను తీర్చి సమస్తమైన కోరికలను సిద్ధింపజేయు దానినిగా ఉద్దేశించి రచించినట్లు తెలియు చున్నది. వీణయందు స్వరస్థానము కొరకు సారికలను మెట్లను పెట్టు పద్థతిలో క్రొత్త సంప్రదాయమును మొదట వెల్లడి చేసినది అహోబల పండితుడే. దీనినిబట్టి వీణయందు ఇంత కొలతలో ఈస్వరము ఉన్నదను విషయము తెలియ గలదు, రత్నాకరుడు ఏడు శుద్ధస్వరములు పండ్రెండు వికృతిస్వరములు కలవని చెప్పెను. అహోబలుడు ఇరువది రెండు వికృతి స్వరములను పేర్కొనెను. హిందూస్థానీ గానములో శుద్ధ వికృతిస్వరములకు క్రమముగ కోమల తీవ్ర అను నామములు కలవు. కర్ణాటక పద్ధతిలోని సాధారణ గాంధారమును తీవ్రగాంధారముగా, కైశికి నిషాదమును నీవ్రనిషాద ముగా, అంతర గాంధారమును తీవ్రతర గాంధారముగా కాకలి నిషాదమును తీవ్రతర నిషాదముగా, మృదుపంచమమును అనగా వరాళీ మధ్యమమును తీవ్రతర మధ్యమముగా, శుద్ధమధ్యమమును అతితీవ్రతమ గాంధారముగా పేర్కొ నెను.

హిందూస్థానీ గానమును అనుష్ఠించువారలకు సంగీత పారిజాతము ప్రమాణ గ్రంధము. దీనినే ఇప్పటికిని హిందూస్థానీ గాయకులు కొంతవరకు అనుసరించు చున్నారు,

నో. నా.

[[వర్గం:]]