సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అస్సీరియా
అస్సీరియా :- అస్సీరియాయను నామముతో నేడు మనము వ్యవహరించుచున్న దేశమునకు అస్సీరియా భాషలో "అషుర్" అనియు, పారసీక భాషలో "అధుర” అనియు పేళ్లు ఉండెను. ప్రాచీన కాలమున ఈ దేశీయులు గొప్ప రాజ్యమును స్థాపించి వీరులని పేరుగాంచుటయే గాక, చక్కని నాగరికతను పెంపొందించుకొనిరి. ఐరోపాఖండ చరిత్రలో రోమకజాతివారి కెట్టి ప్రశస్తి గలదో, ఆసియా ఖండమునందు అస్సీరియావారికీ కూడ అట్టి విఖ్యాతియే కలదు.
అస్సీరియా నేటి మెసొపొటేమియా దేశములోని ఉత్తర భాగము. దీనికి ఉత్తరమునను, తూర్పునను కొండల వరుసలును, దక్షిణమున ప్రాచీన బాబిలోనియా రాజ్యమును, పశ్చిమమున సిరియా ఎడారియు కలవు. అస్సీరియా రాజ్యముగుండ టైగ్రిసునది తన ఉపనదులతో కూడ ప్రవహించి, అచ్చటి భూమిని సారవంతముగా చేయుచున్నది. పురాతన కాలమునుండియు అచ్చటి జనులు ఆవులు, గొజ్జెలు మున్నగు పాడి జంతువులను గుఱ్ఱములు, ఒంటెలు మున్నగు భారవాహక జంతువులను పెంచెడివారు. అస్సీరియా దేశమున భరింపరాని వేడిమి కాని, చలికాని లేక సమశీతోష్ణస్థితి యుండును. కావున ఇచ్చటి ప్రజలు దృఢగాత్రులుగను వీరులుగను ఉందురు.
ప్రాచీనకాలపు అస్సీరియా నగరముల శిథిలములు ఇటీవలనే బయలుపడినవి. ఇందు టైగ్రిస్ నదీతీరమున నెలకొనిన అషుర్ పట్టణమును, అస్సీరియా రాజ్యమునకు ముఖ్య పట్టణముగ నుండి విఖ్యాతిగాంచిన నైనివా నగరమును, కాలా, దుర్ షరూకిన్, అను ప్రాచీన నగరములు ప్రత్యేకముగ పేర్కొనదగినవి. ఇచటి శిధిలావశేషములను పరీక్షించుటవలన, అస్సీరియా దేశపు ప్రాచీన చరిత్రను గూర్చి అనేక నూతనాంశములు తెలియవచ్చినవి. ఆ ప్రాచీనయుగమువా రొక ప్రత్యేకమగు లిపినివాడెడి వారు. ఇటుకలవంటి మట్టిదిమ్మలపై ఆ లిపితో అనేక ముఖ్యాంశములు వ్రాయబడియున్నవి. ఆ వ్రాతల నుండియు, పురాతనయుగమునాటి కట్టడములనుండియు వాటి యందలి శిల్పములనుండియు, అస్సీరియా జాతి చరిత్ర సంగ్రహింపబడినది.
సుమారు ఆరువేల సంవత్సరములకు పూర్వము అస్సీరియా దేశమున జనులు నివసించుచుండినట్లు నిదర్శనములు కలవు. ఈజాతి వారికిని బాబిలోనియాలోని సుమేరు జాతివారికిని పెక్కు సామ్యములు కలవు. కావున వీరు సుమేరులై యుండవచ్చును. ఈప్రజలు మిక్కిలి ప్రాచీనమగు "అషుర్" అను పట్టణమును నిర్మించిరి. కొన్ని శతాబ్దులు గడచిన వెనుక ఈ పట్టణము అగ్నిపాలై నశించెను. క్రీ. పూ. 2500 ప్రాంతమున అస్సీరియా దేశమునకు అక్కాడులు అను ఒక నూతన జాతివారు వలస వచ్చిరి. వీరు స్థానికులగు ప్రజలతో కలసిపోయి ఒక నూతన జాతిగ మారిరి, ఈ నూతనజాతి వారు స్థానికపరిపాలనములలో స్వతంత్రులుగనుండియు, బాబిలోనియా రాజుల ఆధిక్యమును అంగీకరించిరి. అస్సీరియా బాబిలోనియా ప్రజలకు ఆనాడు వ్యాపారసంబంధములు మెండుగ నుండెను.
కాలక్రమమున అస్సీరియా ప్రభువులు బలపడి స్వతంత్రులగుటయేకాక, ఇతర దేశములను ప్రజలనుజయించి తమ రాజ్యమును విస్తృత మొనర్చిరి. అస్సీరియా రాజులు తరచుగా బాబిలోనియా ప్రభువులతోను, ఆనటోలియా ఆర్మినియా కొండలలోని ఆటవిక జనుల తోడను, సిరియా పాలస్తీనములతోడను, ఈజిప్టు పాలకులతోడను యుద్ధములు సాగించెడి వారు. క్రీ. పూ. 1300 నుండి క్రీ. పూ. 606 వరకును గల ఏడుశతాబ్దుల కాలములో అస్సీరియా రాజ్యమును సుమారు నలుబదిమంది రాజులు పాలించిరి. వీరిలో షమీ అదాద్ (క్రీ.పూ. 1870).మొదటి షా ల్మె నాసిర్ (క్రీ.పూ. 1300), టిగ్లాథ్ పిలాసిర్ (క్రీ. పూ. 1120), మూడవ అషుర్ నసీర్ పాల్ (క్రీ. పూ. 884-859), సారగాన్ (క్రీ. పూ. 722-705), సెన్నాచరణ్ (క్రీ. పూ. 705-681), అషుర్ బనిపాల్ (క్రీ. పూ. 668-626) అనువారు ప్రత్యేకముగ పేర్కొనదగినవారు. వీరు గొప్ప పరాక్రమము చేతనేగాక ఇతర ప్రశస్త గుణములచేత గూడ విఖ్యాతి గాంచిరి. షాల్మెనాసిర్ అనునాతడు తన రాజధానిని అషుర్ పట్టణమునుండి మార్చి టైగ్రిస్ నదీ తీరమున నలుబదిమైళ్ళ యెగువన తాను కట్టించినట్టి "కాలా" అను పట్టణమున ప్రతిష్ఠించెను. ఈ నూతన నగరమున ఈరాజు అనేక సుందర భవనముల నిర్మింపించెను. సారగాన్ అను రాజును, అతని కుమారుడు సెన్నా చరణ్ అను నతడును శిల్పకళను చక్కగ పోషించిరి. సారగాన్ అను రాజు దురూషరూకిన్ అను నూతన నగరము ను ప్రతిష్ఠించి అందు అనేక రాజ ప్రాసాదములను కట్టించెను. భారతీయ శిల్ప కారుల వలెనే అస్సీరియా శిల్పులు కూడ దేవతల ఆకృతులను, మహోన్నతములగు విగ్రహములను మలచు చుండిరి. సెన్నా చరబ్ రాజు కాలమున నైనివా నగరము మరల నిర్మింపబడెను. ఇచ్చటి ప్రాసాద కుడ్య అపూర్వకళా భాసురములై చూపరులకు అద్భుతానందముల నొనగూర్చుచుండెను. అషుర్ బనిపాలు రాజుకాలమున విశేషముగా శిల్ప. కళాభివృద్ధి అయ్యెను. ఆ కాలమునాటి శిల్పులు రాతిపైనను, దంతముపైనను, లోహములపైనను తమ పనితనమును ప్రదర్శించి, జీవకళ లుట్టిపడు చిత్తరువులను చిత్రించెడివారు. ఈ రాజు మిక్కిలి విజ్ఞాన ప్రియుడు. ఈతడు తన రాజ్యమందును, బాబిలోనియా రాజ్యమందునుగల గ్రంథములకు ప్రతులు వ్రాసికొనిరండు అని సమర్థులగు వ్రాయసగాండ్రను పంపెను. వారు వ్రాసి తెచ్చిన ప్రతులలో శాస్త్రములకును, మతమునకును వాఙ్మయము నకును చెందిన గ్రంథములు పెక్కులు చేరి యుండెను. ఈ గ్రంథజాలమును తన ప్రాసాదమందలి పుస్తక భాండాగారమున ఈరాజు భద్రము చేయించెను. పై గ్రంథములనుండి అనేక అపూర్వ విషయములను నేటి చారిత్రక పరిశోధకులు తెలిసికొని యున్నారు.
అస్సీరియా ప్రభువులును, ప్రజలునుకూడ గొప్ప వీరులు. కాని ధైర్య సాహసములతోపాటు వారియందు క్రూరత్వముకూడ మిక్కుటముగ నుండెను. వీరు అనేక దేశముల జయించి, తమ శత్రువులను ఖైదీలుగ బంధించి, విదేశములకు పంపి వేయుటయో, లేక వారిని అతి క్రూరముగ చంపుటయో కావించుచుండిరి. తాము జయించిన దేశములు ఎల్లప్పుడు తమకు వశమైయుండుట కొరకు అస్సీరియా పాలకులు ఒక విచిత్రమగు భేదతంత్రమును అవలంబించుచుండెడివారు. జయింపబడిన దేశములో పలువురను బలవంతముగ విదేశములకు పంపివైచి, వారిస్థానమున విదేశీయులను ప్రతిష్ఠించుట అస్సీరియా విజేతల నీతియై యుండెను. అస్సీరియా రాజుల క్రూరపద్ధతుల వలనను, 'వారి కృత్రిమ రాజనీతివలనను, వారు జయించిన రాజ్యములో అశాంతి నిరంతరము ప్రబలి యుండెడిది. అనవరత సంగ్రామముల వలన అస్సీరియా వీరులు పలువురు మడసిరి. దేశము నిర్వీర్యమయ్యెను. అస్సీరియా సేనలో కొలువునకు కుదిరిన విదేశీయ సైనికులలో స్వామి భక్తి కాని దేశభక్తి కాని లేకుండెను. ఈ కారణములచేత అస్సీరియా రాజ్యము బలహీన మయ్యెను. "మీడులు" అను అనాగరక ప్రజలు అస్సీరియాపై దండెత్తివచ్చి, ముఖ్యపట్టణమగు నైనివా నగరమును ముట్టడించిరి. అస్సీరియా రాజు మూడు సంవత్సరములకాలము శత్రువులతో పోరాడి, తుదకు అపజయము అనివార్యమని నిశ్చయించుకొని, రాజభవనములకు నిప్పు పెట్టించి, పుత్రకళత్ర సమేతముగ అందు భస్మీభూతు డయ్యెను. ఈవిధముగ క్రీ.పూ.606వ సంవత్సరమున అస్సీరియా సామ్రాజ్యము నాశనమయ్యెను. అస్సీరియా రాజులు నిరంకుశులుగ రాజ్య పాలనము చేసెడివారు. వీరు తమ ప్రజలకు మతగురువులుగను, న్యాయాధీశులుగను, సేనా నాయకులు గను కూడవర్తించెడివారు. వీరు తమ విశాల రాజ్యమును పరగణాలుగ భాగించి, ఒక్కొక్క పరగణాపై ఒక్కొక్క ఉన్నతాధికారిని నియమించుచుండిరి. ఈతడు తన యేలికకు, ఏటేట నిర్ణీతమగు కప్పమును చెల్లించుచు, స్థానిక విషయములలో స్వేచ్ఛగా పరిపాలనము సాగించెడివాడు. అస్సీరియా రాజ్యమునకు వారి సేన మూలస్తంభముగ నుండెను. ఈ సేనయందు రథికులు, ఆశ్వికులు, పదాతులు ఉండెడివారు, నేనాతతులు సుశిక్షితములును సువ్యవస్థితములును అయినందున, అవి యెంతటి దుర్గముప్రదేశములయందయినను ప్రవేశించి, ఎంతటి బలవంతు లయిన వైరులనయినను సులభముగ జయించుచుండెను. అస్సీరియా ప్రభుత్వమువారు రాచబాటలను నిర్మించియు ఆనకట్టలద్వారమున నీటి పారుదలకు సదుపాయముల గావించియు, ప్రజానీకమునకు సేవ కావించిరి.
ఇ. బా. శే.
[[వర్గం:]]