సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అశ్వశాస్త్రము
అశ్వశాస్త్రము :- భారతీయులకు మిక్కిలి ప్రాచీన కాలమునుండియు అశ్వములు పరిచితములై యున్నవి. వైదికముగాను, లౌకికముగాను అశ్వములు ప్రాధాన్యము వహించినవి.అశ్వమును ప్రధానముగా గ్రహించి చేయునట్టి అశ్వమేధమను మహాయజ్ఞము వేదములలోనే వర్ణిత మగుట వేదకాలమునకు పూర్వమే అశ్వపరిజ్ఞానము భారతీయులకు లెస్సగానుండెనని తెలియుచున్నది. తైత్తిరీయ వాజసనేయి సంహితలు, తైత్తిరీయ, శతపథ, ఐతరేయ బ్రాహ్మణములు, ఆపస్తంబ, కాత్యాయన, సాంఖ్యాయన శ్రౌతసూత్రములు అశ్వమేధ ప్రశంస గావించినవి. అశ్వమేధీయమైన యశ్వమునకు 'యయు' వని పేరట. దానినే శ్యామకర్ణమని యందురనియు, అది యొడలెల్ల తెల్లనై చెవులు మాత్రము నల్లనై యుండుననియు శివతత్త్వ రత్నాకరము పేర్కొన్నది. అశ్వసంబంధముగల అశ్వినీదేవతలు ఋగ్వేదములో పేర్కొనబడినారు. సూర్యుని భార్యయయిన సరణ్యు ఆడుగుఱ్ఱము రూపము ధరింపగా సూర్యుడు మగగుఱ్ఱమై వెంట దవి లేననియు వారికి అశ్వినీకుమారులు పుట్టిరనియు వర్ణింపబడినది. పురాణేతిహాసాదులలోను అశ్వముల ప్రశంస యెక్కు వగా గలదు. లౌకికముగా రాజుల చతురంగ బలములో అశ్వము ముఖ్యమైనది. అశ్వపతులకు ప్రసిద్ధిగలదు. దండ యాత్రారంభములో 'వాజి నీరాజనవిధి' చెప్పబడినది.
అశ్వశాస్త్రము :- తమ కనేక విధములుగా అవసరములైన గజములను గురించియు, అశ్వములను గురించియు, భారతీయులు ప్రత్యేకముగా కృషిసలిపి గ్రంథములను రచించిరి. గజశాస్త్రములు, అశ్వశాస్త్రములు ఇట్టివే. వీనిలో గజాశ్వముల స్వభావ స్వరూపాహారాదులు వివరింపబడినవి.· ఆయాగ్రంథములు సప్రమాణములుగా నేటికిని స్వీకరింపబడుచున్నవి. అశ్వశాస్త్ర ప్రవర్తకులలో శాలి హోత్రుడు ముఖ్యుడుగా కనబడుచున్నాడు. శివతత్త్వ రత్నాకరములో శాలిహోత్రుడు పేర్కొనబడినాడు. అశ్వలక్షణసార కర్త మనుమంచినట్టు 'అనఘుడు శాలిహొత్రుడు హయంబులకున్ మునుజెప్పినట్టి యా యనుపమ లక్షణంబులు... తెనుగున నెల్లవారలకుఁ దేటపడన్ రచియింతు' నని శాలిహోత్రుడు అశ్వలక్షణ శాస్త్రమును చెప్పియున్నట్లు నుడివినాడు. మహాభారతమున ద్వితీయాశ్వాసములో 'ఈతండు శాలిహోత్రుడో, మాతలియో, నలుడోయని హయనీతి కోవిదులలో మునుముందుగా శాలిహోత్రుడే యుగ్గడింపబడినాడు. నలుడు, నకులుడు, అశ్వశాస్త్ర పారంగతులుగా ప్రసిద్ధి చెందినారు. నల మహారాజునకు అశ్వ హృదయమను విద్య తెలిసి యున్నట్లుగా భారతము చెప్పినది.
అశ్వోత్పత్తి :- అశ్వములకు అమృతము, బాష్పము, అగ్ని, దేవతలు, అండము, గర్భము, సామ అనునవి యుత్పత్తి స్థానములుగా చెప్పబడినవి. దేవదానవు లమృతార్థము సముద్రమును త్రచ్చునపు డమృతముతోగూడ ఉచ్చైశ్రవ మను అశ్వము పుట్టెను. అదియే యమృత సంభవము. యుగముల కాదిని బ్రహ్మదేవుని ముఖము నుండియు, అగ్ని దేవుని నాలుకనుండియు బాష్పములు రాలెను. వానినుండి కొన్ని యశ్వములు పుట్టెను. అవి బాష్పజాశ్వములు. తొల్లి పద్మజుడు హవనము చేయుచుండగా ఆహోమాగ్నినుండి యొక వాహముద్భవించెను. అది యగ్నిసంభవ హయము. దేవతలు సృష్టింపబడగనే యందు ముఖ్యులైన ఇంద్రాద్యష్ట దిక్పాలకులు తమకోరకు గుఱ్ఱములను సృష్టించుకొనిరి. అవి దేవసముత్పన్నము లనబడినవి. ప్రజాపతి యొకప్పుడు ఉలూకరూపమును పొందెను. దాని యండముల నుండి యశ్వము లుదయించెను. అవియే యండజాశ్వములు. మగ గుఱ్ఱము వలన ఆడుగుఱ్ఱము నందు కలిగిన యశ్వము గర్భజము. సృష్టికాలమున సామలతో సృష్టి కర్త అశ్వములను సృజించెను. అవియే సామజములు,
గుఱ్ఱములకు తొల్లి రెక్క లుండెనట : తొలుత అశ్వములకు పక్షము లుండెను. అశ్వములకు పక్షము లుండె నని మన వాఙ్మయములోను, ప్రాచీన చిత్రములలోను, కన్పడుచున్నది. అవి యాకాశమున యథేష్టముగా సంచ రించుచుండెను. అవి దేవతలకును లోబడక తిరుగుచుండెను. ఇంద్రుడు కోపించి వీని రెక్కలను గొట్టుమని శాలిహోత్రు డను ముని నాజ్ఞాపించెను. శాలిహోత్రుడు ఇషీ కాస్త్రమును ప్రయోగించి యశ్వముల రెక్కలను ముక్కలుచేసెను. పాప మా గుఱ్ఱములు జాలీగొలువ ఆ శాలిహోత్రుని ప్రార్థించెను. దయాళు వగు నా ఋషి 'మీ రెక్కల బలము పిక్కలకు వచ్చును పొండని వర మిచ్చెను. అప్పటినుండి అశ్వములు దేవేంద్రునకును, భూమీంద్రునకును వాహనము అయినవి. జంతువులలో వేనికాళ్ళకును లేనిబలము, వేగము అశ్వములకు గలుగుట కిదియే కారణము. పరిణామ శాస్త్ర నిష్ణాతు లయిన యాధునికులే పెద్ద పెద్ద జంతువులకు తొలుక రెక్కలుండెననియు, కాలక్రమ పరిణామ దశ వలన వానికి రెక్కలు పోయె ననియు సిద్ధాంతీకరించు చున్నారు. ఇటీవలి బెల్జియన్ కాంగోలో వేటాడిన యొకమ త్తేభమునకు నాలుగు దంతము లున్నవట!
అశ్వములలో చాతుర్వర్ణ్యము : గుణకర్మ విభాగమును బట్టి అశ్వములలోను బ్రాహ్మణాది చతుర్వర్ణములు గల వని శాస్త్రజ్ఞులు చెప్పినారు. (1) మంచిగుణముకలవి, మంచి యలవాట్లుగలవి, శూరములయినవి, గంధర్వ బలము గలవి, తెల్లనివి, ఎఱ్ఱనివి, తేనెవన్నెగలవి, ఉసిరిక -నేయి, పేలాల వాసనవంటి వాసనగలవి, అలంకారము లందును, పాయసాజ్యములందును ఆసక్తి గలవి బ్రాహ్మణ జాతి హయములు (2) తేజస్సు గలవి, కొంచెము కోప స్వభావము గలవి, పెద్ద ధ్వనిగలవి, పెద్ద శరీరముగలవి, బలముగలవి, తెల్లనిదిగాని, నల్లనిధిగాని యగునట్టి మంచి వన్నెగలవి, పువ్వుల వాసనగలవి, మల్లెపూవులవంటి కన్నులుగలవి, సువిభ క్తములయిన యవయవములుగలవి క్షత్రియజాతి గుఱ్ఱములు. (3) ఎండకు, గాలికి ఓర్చునవి, మిక్కిలి బరువు మోయజాలినవి, సంతోషమునుగాని, దుఃఖమునుగాని ప్రకటింపనివి, మధ్య వేగము గలవి, పానప్రియము అయినవి, చిగురుటాకు రంగుగలవి, మేక కంపు, కోతికంపుగలవి, రాక్షసతత్త్వము గలవి, వైశ్య జాతి తురంగములు. (4) దుర్గుణములు గలవి, ఇతర జంతువులు తినివదలిన యాహారమునుగూడ తినునవి, అపరిశుభ్ర వస్తువులనుగూడ విడువనివి, తన్ను పోషించువానినే తన్నునవి, చెట్టు విరుగునప్పటి సవ్వడి గలవి, తాటికంపు గొట్టునవి శూద్రజాతి తురగములు. ఆయా జాతివానిని గుణచేష్టాదులవలన గుర్తించి వేరు వేరుగా నుంచుట మేలు.
అశ్వముల ప్రకృతి -ఋతువులు : గ్రీష్మాంతమున సారహీనమైన గడ్డి, తీగలు, ఆకులు తినుటవలన అశ్వములు వాతప్రకృతి గలవి యగును. వాని కప్పుడు వాతరోగములు వచ్చును. అవి బలముడిగి కృశించి, వికిరరోమములు గలిగి నిద్రమత్తు గలవియై యుండుము. వర్షర్తువు అంతమునను, హేమంతమునను హయము లెక్కువగా పచ్చగడ్డి తినును. అపుడవి పిత్తప్రకృతిగల వగును. వీని కీఋతువున శూలరోగములు కలుగును. అవి నీటి నెక్కువగా త్రాగును, హయముల కి సమయమున కోప మధికముగా నుండును. శిశిరర్తువులో గుఱ్ఱములు కండపట్టి మిక్కిలి బలముగల పై కార్యదక్షములై యుండును. ఎంతపని చేసినను అలసట చెందవు. ఏ రోగములకును గురికావు. అవి చూచుట కెంతయు నింపుగా నుండును. శ్లేష్మప్రకృతిగలవై యొప్పారును.
అష్టవిధములయిన యశ్వలక్షణములు : శరీరము, సుడులు, కాంతి, గతి, వాసన, స్వరము, వర్ణము,సత్త్వము అని యశ్వలక్షణము లెనిమిది విధములుగా నున్నవి.
శరీరము : సర్వలక్షణములకును స్థానము శరీరమే గావున ముఖ్యమైనది హయశరీరము. తొలుత దానిలక్షణ మెరుంగుట యవసరము. కొంచెము ఎఱ్ఱనివియు, గట్టివియు, ముడుతలు పడనివియు నగు పెదవులును, ఎఱ్ఱని దియు, పల్చనైనదియు నగు నాలుకయు, ఎఱ్ఱని దవుడలును ప్రశస్తములు. దంతములు గట్టిగను, నున్ననైనవి గను, ఒకదానితో నొకటి చేరినవిగను, హెచ్చుతగ్గులు లేనివిగను ఉండవలెను. మిక్కిలి పెద్దవియు, పొడవైన వియు గానట్టి చెక్కిళ్ళు మంచివి. మెత్తని రెప్పలు గలిగి విశాలములై, తేనె రంగు గల కనులు శోభావహములు, మంచి సుడి గలిగి, విశాలమై యున్న నుదురు, సమమై, గుండ్రమై రెండు సుడులతో వెలయు శిరస్సు శుభప్రదములు. చెవులు పొట్టివియై, పల్చనివియై, సూటిగా నిక్కి నవియై యున్న మేలు. మిక్కిలి దృఢమై, దీర్ఘమై యున్న మెడ శ్రేష్ఠ మయినది. పొడవైనట్టిదియు, జడలుగట్టని దియు నగు జూలు మేలు. మూపు మేలు సుడులు గలిగి గట్టిదియై యుండవలెను. ఱోమ్ము సువిశాలమై, దీర్ఘమై యొప్ప దగును. చంకలు ఎత్తుగను, నిడుదలుగను నుండ నొప్పును. తొడలు గుండ్రమైనవియు, సమమైనవియునై యుండవలెను. మోకాళ్ళు గూఢముగా నుండుట తగును. గుండ్రముగా నుండి కండలేని పిక్కలు శ్రేష్ఠములు. గట్టివియు, 'నున్న నివియు, గుండ్రనివియు, పెద్దవియు నగు గిట్టలు ప్రశస్తములు, కొంచెము వ్రేలుచుండి గుండ్రనిదియైన పొట్ట తగినట్టిది. ఎక్కువ దీర్ఘమైనదిగాక, బల్ల పరుపుగానుండి, కొంచెముగా వంగియున్న వీపు శుభ మైనది. పిరుదులు పెద్దవియైయుండవలెను. మెత్తనివియు నిగనిగలాడునట్టివియు, పొడవై నట్టివియు నగు వాలము లతో గుండ్రని కుచ్చుగా నున్న తోక ప్రశంసనీయమైనది.
అవయవముల పరిమాణము : ముప్పది రెండంగుళముల ముఖముగలది యుత్తమాశ్వము. అంతకన్న రెండంగుళములు తక్కువ ప్రమాణము గల ముఖము గలది మధ్యమాశ్వము. తక్కినది కనిష్ఠము. ఉత్తమాశ్వమునకు మెడ ఏబదియారంగుళముల పొడవు గలదై యుండును. నలుబదియారు, ముప్పదియారు అంగుళముల మెడలుగలవి మధ్యమ, కనిష్ఠములు. వక్షస్థలము, వృష్ఠము, కటి యనునవి ముఖముతో సమాన ప్రమాణముగలవి. చెవులు ఏడంగుళములు, తాలువులు ఆరంగుళములు, గిట్టలు ఏడంగుళములు ఉండవలెను. ఎనిమిది యడుగుల యెత్తు గలది యుత్తమాశ్వము. ఏడడుగుల యెత్తు గలది మధ్య మాశ్వము. ఆరడుగుల ఎత్తు గలది కనిష్ఠము. పది యడుగుల యడ్డపుకొలత గలది శ్రేష్ఠమైనది. ఎనిమిది యడుగులది మధ్యమము. ఏడడుగులది హీనాశ్వము.
వర్ణము : తెల్లనివి, నల్లనివి, ఎఱ్ఱనివి, పసుపుపచ్చనివి శుద్ధవర్ణములు. మిశ్రవర్ణము లనేక విధములు. జూలు, తోక వెండ్రుకలు, రోమములు, చర్మము, గిట్టలు, తెల్లనైన గుఱ్ఱము శంఖాభ మనబడును. ఇది విప్రజాతి గుఱ్ఱము. జూలు మున్నైనవి తెల్లనై, చర్మము నల్లనైనది కర్తల మను హయము. సర్వావయవములు నల్లనైనది కాల మను గుఱ్ఱము. ఇది శూద్రజాతిది. సమస్తావయవములు ఎఱ్ఱనైనది కుంజాభ మను తురంగము. ఇది క్షత్రియజాతిది. జూలు, రోమములు, వాలము సర్వము బంగారువన్నె గలది శేరభము. ఇది వైశ్యజాతిది. రోమములు పసుపుపచ్చ, ఎరుపు కలిసియుండి, ముఖము, కాళ్ళు, తోక, జూలు ఎఱ్ఱనై నది చోర మనబడును. వాలము కాళ్ళు, ముఖము నల్లనైనది రురువు. తెలుపు, నలుపు కలిసియున్న రోమములు గలది వీలము కలిగొట్టు పువ్వు వన్నె గలిగి పిక్కలు నల్లనైనది మేఘ మనబడును. పక్వమైన నేరేడుపండు వన్నెగలది జాంబవము. ఇట్లీ చిత్రజాతులలో, రుచిరము, సుమనము, శ్యామకర్ణము,
కల్యాణ పంచకము, అష్టమంగళము, మల్లికాక్షము, ధౌతపాదము, హాలాభము, కరంజము, బింబకము మున్నగునవి కలవు. వీనిలో శ్యామకర్ణ మనునది మిక్కిలి ప్రశస్తమైనది. ఇది శరీర మంతయు తెలుపు, చెవులు మాత్రము నలుపువన్నె గలిగిన గుఱ్ఱము. ఈ శ్యామ కర్ణమే యశ్వమేధ యాగమున ప్రధాన పశువుగా నుపకరించునట్టి యశ్వరాజము. నాలుగు పాదములు, ముఖ మధ్యము తెల్లనైనది కల్యాణ పంచకము. ఇది కల్యాణ ప్రదమైన తురంగము. జూలు, తోక, రొమ్ము, ముఖము, నాలుగు కాళ్ళు అను నెనిమిది యవయవములు తెల్లనైనది అష్టమంగళము. ఇదియు మిక్కిలి ప్రశస్తమైన గుఱ్ఱము.
వర్జనీయములగు అశ్వములు :- శరీరమంతయు తెల్లగా నుండి, నాలుగు పాదములు నల్లగానున్న యశ్వము యమదూత వంటిది. సర్వనాశనకారి. ఇట్టిది వర్ణనీయము. తోకగాని శిరస్సుగాని హీనవర్ణమైనది త్యాజ్యము. శరీర మంతయు నోకవర్ణమై శిరముగాని, తోకగాని వేరొక వర్ణమైనది యశుభము. తక్కువ దంతములు గలదియు, ఎక్కువ దంతములు గలదియు విడువదగినవియే, నల్లనైన తాలువులు గలది కీడు. నమలునపుడు క్రింది దంతములతో పై దంతములుగాని, పై దంతములతో క్రింది దంతములుగాని రాపిడి పడిన గుఱ్ఱము నిలుపదగనిది. మూడుకాళ్ళు నల్లనై, ఒకకాలు తెల్లనైన దానిని ముసలి యందురు. ఇది యశుభంకరము. చెవుల చెంత కొమ్మువంటి సుడిగలది శృంగిక మనబడును. పెద్ద పులివంటి వర్ణముగలది వ్యాఘ్రాభము. స్తనమువంటి చర్మము వ్రేలాడునట్టిది స్తని. అవుగిట్టవలె చీలిన గిట్టగలది ద్విఖురము. మూపున సుడిగలది కకుది. ఒక అండమే కలది ఏకాండకము. బూడిదవన్నె ముఖము, తోకగలది భస్మాభము, ఇవియన్నియు దూష్యములు. సర్వము నల్లనైనది నింద్యము. సర్వము తెల్లనైనది శుభదము.
ఛాయలు :- నునుపుగా నిగనిగలాడుచున్నవి, చూడ ముచ్చటైన ముదురు రంగులవి పార్థివచ్ఛాయలు. క్రొత్త మేఘములు, తామరపూలు, నీరువంటి కాంతి గలవి వారుణములు. బంగారము, చిగురుటాకులవంటి వన్నెలు గలవి ఆగ్నేయీచ్ఛాయలు. విడివిడిగా పరుషమయిన కాంతి గలవి వాయవీచ్ఛాయలు. ఆకాశకాంతి గలవి నాభసీచ్ఛాలు.
గమనము : సింహము, వ్యాఘ్రము, ఏనుగు, హంస, నెమలి, శరభము, వృషభము, ముంగిస, కోతి, లేడి, ఒంటె యనువాని గమనములవంటి గమనములుగల గుఱ్ఱములు శుభదములు. వంకరనడకలుగలవి, విషమగతుల నొప్పునవియు, తొట్రుపాటు గలవియు, నిబ్బరములేని నడకలు గలవియు నగు గుఱ్ఱములు హీనజాతులు.
గంధము : కన్నులు, చెవులు, మోము, ముక్కు రంధ్రము లనువానియందును, చెమ్మటయందును, మూత్ర పురీషములయందును సుగంధము గలవి ప్రశస్త హయములు. దుర్గంధముగలవి దుర్జాతివి. మద్దిచెట్టు, కడిమి చెట్టు, కొండమల్లెలవంటి పరిమళము గలవి యుత్తమాశ్వములు. నేతివాసన, పాలవాసన కలవియు శ్రేష్ఠములు.
స్వరము : వీణ, పిల్లనగ్రోవి, మద్దెల, భేరులధ్వనుల వంటి సకిలింతకలవి శ్రేష్ఠాశ్వములు, గజము ఘీంకరించు నట్లును, వ్యాఘ్రము బొబ్బలిడినట్లును, సింహము గర్జిల్లి నట్లును వినవచ్చు హేషారవము ప్రశస్తము. త్రుటితమైనదిగను, గద్గద మైనదిగను, పరుషమైనదిగను వినబడు హయస్వరము చెడ్డది. రాబందులు, ఒంటెలు, అర చునట్లరచునవి హీనాశ్వములు. ఇట్టి దుష్టాశ్వములు యజమానుని సంపదలను హరింపజేయును.
సత్త్వము : బ్రహ్మ, ఈశ్వరుడు, మహేంద్రుడు, కుబేరుడు, యమధర్మరాజు, గంధర్వుడు మున్నగువారి సత్త్వమువంటి సత్త్వము గలవి యుత్త మాశ్వములు. రాక్షసులు, పిశాచములు, పితృదేవతలు, మహాసర్పముల సత్త్వముగలవి మధ్యమాశ్వములు, వీనిలో దేవసత్త్వములును, రాక్షసాది సత్వములును గల తురంగములు గ్రాహ్యములు. భీరువులు, కలహపరములు, శుచిరహితములు నగు హీనసత్త్వములు త్యాజ్యములు.
ఆవర్తములు : అశ్వలక్షణములలో ఆవర్తము అత్యంతము ముఖ్యములయినవి. శిశువు గర్భమునం దుండగా గర్భవాయువు మిక్కిలి వేగముగ తిరుగుచు, శిశు శరీరము నందలి రోమములను సుడులుగా త్రిప్పుటవలన సుళ్ళు ఏర్పడుచున్నవి. ఆవర్తము, శతపాది, శుక్తి, అవలీఢకము, పాదుక, అర్ధపాదుక, సమూహము, ముకుళము - అని యావ ర్తములస్వరూప మెనిమిది విధములు . నీటి సుడిగుండమువలె నుండు నుడి ఆవర్త మనబడును. జెట్టికి శతపాది యని పేరు. అట్టి జెట్టివలెనుండు సుడి శతపాది. ముత్యపుచిప్ప యాకారముగలది శుక్తి యను సుడి. దూడ నాలుకతో నాకినట్లున్న సుడి అవలీఢకము. పాదుకవంటిది పాదుక సుడి. సగము పాదుకవలె నున్నది. అర్ధపాదుక . మంచుగుట్ట వంటిది సమూహావర్తము. మొగ్గ వంటి యాకృతిగల సుడి ముకుళము.
ఆవర్తముల ప్రమాణము : నీటిగుండమువంటి సుడి ముప్పావంగుళము ప్రమాణము గలదియై యుండవలెను. శతపాది సుడి నాలు గంగుళములు. శుక్తి రెండంగుళములు, అవలీఢకము మూడు అంగుళములు. పాదుక నాలు గంగుళములు. అర్ధపాదుక ముప్పా వంగుళము, సమూహమను సుడి అష్టాంగుళము. ముకుళావర్తము ముప్పావంగుళ ప్రమాణము గలదియై యుండవలెను. ఈ ప్రమాణముగల సుళ్ళు వానివాని ఫలముల నొసగును. ఉక్తప్రమాణములకంటె యెక్కువయై యున్నను తక్కువయైన వైనను వాని ఫలముల నొసగవు.
ముఖ్యములయిన కొన్నిసుళ్ళు : గుఱ్ఱములకు ముఖ్యముగా పదిచోట్ల సుళ్ళుండవలెను. ఉరమునందును, రంధ్రోపరంధ్రములయందును, శిరమునందును రెండేసియు, నుదుటిమీదను, మూతిమీదను, ఒక్కొక్కటిగాను మొత్తము పది సుళ్ళుండవలెను. పదిసుళ్ళకు తక్కువయున్న గుఱ్ఱ మల్పాయు వగును.
జూలునందు శుభావర్తములు : సెలవులయందును, నుదుటియందును, ముంగాళ్ళ యందును, నొసటను, కంఠమునను, జూలు నందును, చెవిగూబలయందునుగల సుళ్ళు శుభప్రదములు. ము త్తెపుచిప్పవంటి సుళ్ళున్న హయము మిక్కిలి ప్రశస్తము. చెవిగూబలయందలి నుడికి వృషభా వర్తమని పేరు. అట్టి వృషభార్తవమను సుడిగల తురంగ మును ఎంత వెలయిచ్చియైనను కొనవలె నని యందురు.నాలుగుమూలల నాలుగు సుళ్ళున్న తురంగము చాతు రంతిక మనబడును. ఏ యశ్వము నెన్నోసట చాతురంతి కావర్తము చూపట్టునో ఆ హయము యజమానునకు రాజ్యలాభమును చేకూర్చును. ఒక దానిపై నొకటి నిచ్చెన మెట్లవలెనున్న సుళ్ళకు నిశ్రేణిక యని పేరు. అట్టి నిశ్రేణిక నొసటగల అశ్వము తనస్వామికి విభవైశ్వర్యముల నొసగజేయును. వక్షస్థలమున నాలుగు సుళ్ళున్న గుఱ్ఱమును శ్రీవక్షకి అందురు. ఇది ఉత్తమోత్తమ హయము. ఉరమున మూడు శుక్తులుగల గుఱ్ఱము నెక్కు వానికి జయము సిద్ధించును. పద్మము, కులిశము, కలశము, తోమరము, చక్రము, ముసలము, ముకురము, శంఖము, చంద్రుడు, మణి, ఖడ్గము, అంకుశము మొదలయిన రూపములలోనుండు తెల్లని బొల్లియుండు గుఱ్ఱములు శ్రేష్ఠము లయినవి.
అశుభావర్తములు : హృదయమున నొకటే సుడిగల గుఱ్ఱము యజమానుని యుద్ధమున మడియజేయును. కక్షావ ర్తముకూడ అశుభమైనదే. మూపురస్థానముననున్న సుడి చెడ్డది. మోకాళ్ళమీదనుండు సుళ్ళు శుభ ప్రదములు కావు. వెన్నున సుడిగల యశ్వము నెక్కరాదు. గండ స్థలముల రెండిటను సుళ్ళుండకూడదు. శంఖమువంటి సుడిచెడ్డది. దండావ ర్తము, క్రోడావర్తము అనునవి దూష్యములు. ముక్కు రంధ్రముల సమీపమునగల సుళ్ళు అమం గళకరములు. ముక్కుదూలమునకు నడుమ సుడియున్న తురంగము మృత్యుదేవతవంటి దని హయలక్షణవేత్త లందురు. పై పెదవులమీదనున్న సుళ్ళు చెడ్డవి, మెడ మీదనుండు గ్రీవావర్త మనునది కీడుకలిగించును. పట్టెడ పెట్టుచోటగల సుడి హాని కలిగించును. గుదము, నాభి, కటిస్థలము, ఉదరము, తొడలు, బీజములు, చెవులు, వృష్ఠభాగమం దున్న సుళ్ళు దుష్టములు.
అశ్వదంతోద్భేదము - వయోజ్ఞానము :- దంతములను బట్టి అశ్వముల వయస్సును గుర్తింపవచ్చును. పుట్టిన మాసమున హయమునకు రెండు దంతములు తోచి, రెండవ మాసమున నవి పూర్ణములగును. మూడవ నెలలో నడిమి దంతములు రెండు పొడమి నాల్గవ నెలలో నవి నిండుగా గన్పడును. అయిదవ నెలలో ప్రక్కదంత యుగ్మము వచ్చి ఆరవనెలలో గట్టిపడును. ఇట్లే పుట్టినది మొదలుగా పండ్రెండవ మాసము పూర్తియగువరకు హయములకు దంతము లన్నియు వచ్చును. ఒక యేడు వయస్సుగల గుఱ్ఱమునకు దంతములు తెల్లగానుండును. రెండవ యేట ఆ దంతములు కషాయ వర్ణములుగా మారును. హయమునకు అయిదవయేటనుండి మూడేసి యేండ్ల కొక వ్యంజనముగా తొమ్మిది వ్యంజనములు తోచును:— కాలికము, హారిణి, శుక్లము, కాచము, మాక్షికము, శంఖము, ఉలూఖము, చలనము, పతనము. మొదటి యైదువర్షములకు బిమ్మట, మూడేండ్ల కొకసారి హయముల దంతముల వర్ణములు మారుచుండుటయు, కడపటి దశలో కదలుటయు, రాలుటయు సంభవించును. హయమునకు సంపూర్ణా యుర్దాయము ముప్పది రెండేండ్లు. చెవికొనలు నలువగా రక్తచ్చాయ, సిందూర వర్ణముగాగన్పడు గుర్రములు దీర్ఘ కాలము జీవించును.
అశ్వసాముద్రికము :- హస్తరేఖలను జూచి మానవుల యాయుః ప్రమాణాది ఫలములను జెప్పినట్లే గుఱ్ఱపు ముక్కు మీది (పోథముమీది) రేఖలనుబట్టి దాని యాయుః ప్రమాణాదులను జెప్పుదురు. ముక్కు నడుమ బుట్టి పైకి వ్యాపించిన రేఖవలన ఆ గుఱ్ఱము ముఖరోగము వలన సంవత్సరార్ధమున మృతిచెందు నని చెప్పనగును. అట్టి యూర్ధ్వ రేఖలు రెండంగుళముల ప్రమాణము గలవి రెండున్నచో ఆ హయము రెండేండ్లు మాత్రమే జీవించునని చెప్పవచ్చును. ఆ రేఖలే అడ్డముగా నున్న యెడల మూడు సంవత్సరములకు దౌడలు పట్టుకొనిపోవు రోగము వలన ఆ గుఱ్ఱము చచ్చును. ఆ రేఖలే వంగినట్లున్న నాలుగేండ్లకు మృతి సంభవించును. ఊర్ధ్వరేఖ ముక్కు మీద ఎడమవైపుననుండి కొన వాలియున్న దైనచో ఆ తురంగము పంచమాబ్దమున పంచత్వము నొందును. రెండంగుళముల ఊర్ధ్వ రేఖ గల దానికి ఆరేండ్లయాయువు. అర్ధాంగుళము పొడవుగల్గి. నడుమ ఎత్తుగానున్న రేఖగల యశ్వము ఏడేండ్లకు చచ్చును. మూడంగుళముల పొడవుగల ముక్కు గీతవలన ఆ గుఱ్ఱము ఎనిమిదవ ఏట జ్వరముతో, మరణించునని తెలియ దగును. మధ్య స్థూలమైనగీతగలది తొమ్మిదవ యేటను, వంకరరేఖ గలది పదియవ యేటను, రెండంగుళముల వెడల్పున ఊర్ధ్వ రేఖగలది ద్వాదశవర్షమునను, లావు పొడవు నుండు రేఖ గలది త్రయోదశాబ్దమునను, కాకి కాలిగుర్తు రేఖగలది పదునా ల్గవ యేటను రెండంగుళములకు మించిగాని, తగ్గిగాని యున్న రెండు రేఖలు గలది పంచదశవర్షమునను, ఆ రేఖయే యొకటి తెల్లగుఱ్ఱమునకైన అది పదునారవ యేటను, నల్లగుఱ్ఱమునకైన అది పదునేడవ యేటను, యూపస్తంభమువంటి రేఖగాని, చైత్యాకార రేఖగాని యున్నచో ఆ హయము పదునెనిమిదవ వర్షమునను, కపిశవర్ణమైన “రేఖగలది పందొమ్మిదవ సంవత్సరమునను మరణించును. చక్ర రేఖ, వజ్రరేఖ, అర్ధచంద్ర రేఖలు కూడ హయమున కరిష్ట సూచకములే. శ్రీవృక్షము, స్వస్తికము, నంద్యావర్త రేఖలు శుభప్రదములు.
అశ్వచేష్టలు శుభాశుభములు :- మోర పై కెత్తి పెద్దగా సకిలించుట, గిట్టలతో నేలను త్రవ్వుట యను చేష్టలు యజమానునకు యుద్ధమున విజయమును సూచించును. పదేపదే మూత్రపురీషములను విడచుట, కన్నీరు గార్చుట, అపజయమునకు సూచకము, అకారణముగా తెల్లవారుజామున సకిలించుట పరులు దాడి వెడలి వచ్చుటను తెలుపును. తోకమీది గగుర్పాటు యజమానునికి ప్రవాసము కలుగు ననుటకు గుర్తు. ఎడమ కాలితో భూమిని త్రవ్వుట, దీనముగా చూచుచు సకిలించుట, తత్స్వామి పరాజయమును సూచించును. మోమున దుమ్ము చిమ్ముకొనుట, ఎండుగడ్డిని, పుల్లలను కరచుట, భయపడినట్లు సకిలించుట, తోక వెండ్రుకలను జల్లిగా విప్పుట యను చేష్టలు అశుభ సూచకములు. జూలు నిగిడ్చి, కుడికాలితో నేలతాచుట విజయ హేతువు.
ఏబదినాలుగు హయజాతులు :- భారత దేశీయములగు హయములను అవి యుద్భవించిన ప్రాంతములనుబట్టి యేబదినాలుగు జాతులుగా విభజించినారు. వానివాని స్వరూపము, స్వభావము భిన్న భిన్నములై యుండును. వీనిలో కాంభోజ, బాహ్లిక, వనాయుజ, గాంధార, చాంపేయ, సైంధవ, తిత్తిల, పాటలీపుత్రక, యవన, కాశ్మీరాద్యశ్వములు శ్రేష్ఠములు, దాక్షిణాత్య హయములు ప్రశస్తములు కావు. కళింగాశ్వములు - స్థూల పాదములు, దీర్ఘకర్ణములు, వంకరమెడలు, అల్ప వేగములు గలవిగా చెప్పబడినవి. అట్లే త్రిలింగదేశజములైన గుఱ్ఱములు కోపము గలవిగాను, పందివలె ఘుర్ఘుర ధ్వని చేయునట్టివిగాను, పెద్ద వక్షస్థలము గలవిగాను, స్తబ్ధములై యల్ప వేగము గలవిగాను వర్ణింపబడినవి.
అశ్వారోహణము : మంచి రూపము, మంచి సుళ్ళు, బలము మొదలైన యుత్తమగుణము లెన్నియున్నను హయము వేగహీన మగుచో నిరర్థకముగా భావింపబడును. కనుక అశ్వారోహకుడు వేగవంతమైన యశ్వమునే యేరుకొనవలెను. మిక్కిలి లావైనవాడు, ముక్కోపి, మూర్ఖుడు, భయముగలవాడు, తొందరపాటు గలవాడు, తల నిలుకడ లేనివాడు, కొట్టతగని చోట కొట్టువాడునైన యశ్వారోహకుడు నింద్యుడు. అట్టివానికి హయము వశవర్తియై మెలగదు. .. అశ్వారోహకుడు ఆయా జాతి గుఱ్ఱముల స్వభావాదులను లెస్సగా ఎరిగి యుండవలెను. బ్రాహ్మణజాతి గుఱ్ఱమును దానికి ప్రీతికరములగు తినుబండారములు పెట్టి లాలించియు, క్షత్రియజాతి గుఱ్ఱమును మేను నిమిరి బుజ్జగించియు, వైశ్యజాతి గుఱ్ఱమును నోటితో గద్దరించియు, శూద్రజాతి తురంగమును దండించియు నేర్పుతో తన యంకెకు తెచ్చుకొని నడుపవలెను. మాటిమాటికి సకిలించినను, భయముతో ముందడుగు వేయని యప్పుడును, త్రోవతొలగి నడుచు నపుడును, కోపముతో రుసరుసలాడునపుడును, మతిచెడినట్లు ప్రవర్తించినపుడును గుఱ్ఱమును దండింప వలెను. మిక్కిలిగా సకిలించునపుడు ముట్టిమీదను, తొట్రుపడునపుడు కణతలకడను, భయపడి నప్పుడు ఱోమ్మునను, దారి తొలగినపుడు తొడలపైనను పిక్కల పైనను, కోపగించినపుడు పొట్టమీదను, మతిచెడినట్లున్నపుడు చెవులమీదను కొట్టవలెను. ఆయా స్థానములను గుర్తింపక ఇష్టము వచ్చినట్లు బాదినచో గుఱ్ఱము మొద్దుబారి యనేక దోషముల కాకరమగును. ఎంతటి యుత్తమాశ్వ మయినను ఎప్పుడును స్వారిచేయక కట్టి యుంచినచో చెడిపోవును. అట్లని మితిమీరి తట్టు తెగ పరువు లెత్తించుటయు తగదు. మితము, హితము పాటించి అశ్వమును నడుపుకొనవలెను.
అశ్వధారలు : విభ్రమము, ప్లుతము, పూర్ణకంఠము, త్వరితము, తాడితము ననునవి యైదు ముఖ్యములైన యశ్వగతులు. వీనినే ధారలనియు నందురు. ఇవియేగాక మయూరీగతి, హంసీగతి, తిత్తిరిగతి, చతుష్క గతి యని యశ్వగతులు మరికొన్నియు గలవు. తలను, మెడను, తోకను పై కెత్తి పరు గెత్తుటకు మయూరీగతి యని పేరు. ప్రక్కల నెగురవేయుచు, తలను కదల్చుచు పోవుటను హంసీగతి యందురు. తొందరగా నడచుచు తోకకదల్ప నిచో తిత్తిరీగతి యందురు. నాలుగు పాదములు సమముగా వైచుచు తొట్రువడని లలితగమనమును చతుష్క గతి యందురు. మరియు అమరకోశానుసారము -
'ఆస్కందితం ధోరితకం రేచితం వల్గితం ప్లుతం
గతయో౽ మూః పంచధారాః ....
అని అశ్వధారలు ఐదుగలవు. (1) ఆస్కందితము = అతివేగమును, అతి మందమును గాక నడితరముగా పరుగెత్తుట. (2) ధోరితకము = ఆస్కందితము కంటె అధికమై చతురమైన అశ్వగతి. (3) రేచితము =వంకర లేక తిన్నగా మిక్కిలి వేగముతో పరుగుదీయుట. (4) వల్గితము = మీదికి కాళ్ళెత్తి వేగముగా పరు గెత్తుట.(5) ప్లుతము =పరువెత్తినంత మేరయు సమమైన వేగముతో పోవుట.
అశ్వశాల : అశ్వరక్షణ విషయమున నతిజాగరూకులై యుండవలెను. వాస్తు శాస్త్రానుసారముగా అశ్వశాలను నిర్మింపవలెను. అశ్వపాలకులు తమ యశ్వశాలలు సురక్షితములై యుండునట్లును, పరిశుద్ధములై యుండునట్లును చూచుకొనవలసి యుందురు. నెమిలి, హంస, కోడి, తొండ, మేక, పిల్లి, ఎద్దు మొదలయిన కొన్నింటిని అశ్వశాలకడకు రానీయకూడదు. అశ్వములకు దృష్టి దోషము తగులకుండుటకును, కొన్ని రోగములు సంక్రమింపకుండుటకును అశ్వశాలలలో ఒండు రెండు కోతులను పెంచుట హితమని చెప్పబడినది.
అశ్వవైద్యము : అశ్వములకు రోగములు రాకుండ కాపాడుట యశ్వపాలకుని విధియై యున్నది. ఒక వేళ ఏకారణమువలన నైనను రోగములు సంభవించినచో వాటికి తగిన యౌషధములు ప్రయోగించి చికిత్సోవచారములు గావించుటయు వాని కర్తవ్యము. కావుననే వివిధములైన యశ్వరోగములను, తత్తచ్చికిత్సలను వివరించు వైద్యగ్రంథములు పుట్టినవి. అశ్వశాస్త్రమును రచించిన శాలిహోత్రుడు మేటివైద్యు డనియు తెలియుచున్నది. అశ్వవైద్యశాస్త్ర గ్రంథములలో గణపండితుని అశ్వయుర్వేదము, జయదత్తుని అశ్వవైద్యకము, దీపంకరుని అశ్వవైద్యము, వర్ధమానుని యోగమంజరి, నకులుని అశ్వచికిత్సితము గ్రంథస్థములై గన్పట్టుచున్నవి. సిద్ధ యోగ సంగ్రహమను వైద్యగ్రంథమును పేర్కొనుచు సుప్రసిద్ధ వ్యాఖ్యాత కొలచెలమ మల్లినాథసూరి'- పూర్వాహ్లికాలే చాశ్వానాం ప్రాయశో లవణం హితం ! శూలమోహ విబంధఘ్నం లవణం సైంధవం పరమ్——' అను శ్లోకము నాగ్రంథమునుండి యుదాహరించి అశ్వములకు పూర్వాహ్లవేళ కొంత ఉప్పును ఆహారముగా పెట్టుట హితమని రఘువంశ కావ్యమున పంచమ సర్గమునందు డెబ్బదిమూడవ శ్లోక వ్యాఖ్యానావసరమున వివరించియుండెను.
అశ్వప్రశస్తి : సర్వలక్షణ సంపన్నములగు అశ్వములు పుణ్యవిశేషమునగాని లభించవని విజ్ఞులందురు. మత్త మాతంగములు, సుందరాశ్వములు గృహద్వారములకడనిల్చుట మంగళకరము. అశ్వలక్షణసారములో అశ్వ ప్రశస్తి కనిపించుచున్నది.
చ. రం.
[[వర్గం:]]