సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అళియ రామరాయలు

అళియ రామరాయలు  :- అళియ రామరాయని జీవితము విజయనగరసామ్రాజ్య చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. విజయనగర చక్రవర్తులలో సర్వశ్రేష్ఠుడగు శ్రీకృష్ణరాయని జామాతయై, అతని యనంతరము రామరాయలు సర్వాధికారి అయ్యేను. యుద్ధతంత్రము నందును, రాజనీతిలోను సమకాలికులలో అసమాను డని ప్రఖ్యాతిగడించి, దక్కను సుల్తానులను తన చేతి కీలు బొమ్మలను గావించుకొని, దక్షిణాపథమున విజయనగరము ప్రముఖస్థానము వహించునట్లు అత డొనర్చెను. కాని అతని స్వార్థపరతయు, అధికార కాంక్షయు, కుటిల తంత్రములును విజయనగర సామ్రాజ్య విధ్వంసమునకు దారితీసెను.

రామరాయని వంశము : 'అళియ' యను మాటకు కన్నడభాషలో "అల్లుడు" అని అర్థము. శ్రీకృష్ణరాయని పుత్రిక యైన తిరుమలాంబికను వివాహమాడుటను పురస్కరించుకొని ప్రజలు వాత్సల్యముతో అల్లుడని పిలచుటచే అళియ రామరాజని అతడు ప్రసిద్ధికెక్కెను. అతడు అరవీటి వంశస్థుడు. ఆరవీటి వంశజులకు నరపతివారని గూడ వ్యవహారము గలదు. చంద్రవంశ క్షత్రియుల మనియు, కలచురి బిజ్జలుని సంతతివార మనియు, వీరు చెప్పుకొనిరి. ఆరవీడు మండలాధిపతు లయిన తరువాత నరపతి వంశజులు ఆరవీటి వారయిరి. ఈ వంశమునకు మూలపురుషుడు వీరహొమ్మాళి రాయడు లేక బొమ్మరాజు. ఇతని పౌత్రులయిన కోటిగంటి రాఘపుడు, సోమ దేవరాజు ఆంధ్ర దేశమున క్రీ.శ.1323-1336 ల మధ్య జరిగిన స్వాతంత్య్ర మహోద్యమమున సుప్రసిద్ధ మగు పాత్రను నిర్వహించిరి. కంపిల రాజ్యము యొక్క పతనానంతరము (1328) ఢిల్లీ సుల్తానుకు ప్రతినిధియైన మాలిక్ నాయబును పారద్రోలి, తురుష్క పరిపాలనను వీరు తుదముట్టించిరి. సోమదేవరాజు మనుమడయిన పిన భూపాలుడే ఈ వంశమున మొదటి ఆరవీటి ప్రభువు. ఇతని పుత్రుడయిన బుక్కరాజు "సాళువ నరసింహరాయ రాజ్యప్రతిష్ఠాపనాచార్యు" డయ్యెను. బుక్కరాజు కుమారు డయిన రామరాజు కందనవోలు నేలెను. అతని కుమారుడయిన శ్రీరంగరాజునకు తిమ్మాంబయందు ఐదు గురు సుపుత్రులు ఉద్భవించిరి. అందు మూడవవాడు అళియ రామరాయలు. క్రీ. శ. 1565 లో జరిగిన తళ్ళికోట యుద్ధమునాటికి రామరాయలు 80 సంవత్సరములవా డని తెలియుచున్నది. అందుచేత అతడు క్రీ.శ. 1485 ప్రాంతమున జన్మించియుండు నని ఊహింపవచ్చును. రామరాయులు, శ్రీకృష్ణదేవరాయలు  : రామరాయల బాల్యచరిత్రను గురించి తెలియుటలేదు. “గోల్కొండ సుల్తానైన కులీకుతుబుషావలన కందనవోలు మండలమును బడసి. కొంతకాలమునకు ఆదిల్ షా (బీజపూరు) చే ఓడింప బడి ఆ మండలమును కోల్పోవుటచేత, కుతుబ్ షా అగ్రహించి రామరాయలను తన కొలువునుండి బహిష్కరించెను. తరువాత అతడు శ్రీకృష్ణరాయల కొలువునందు చేరేను,” అని ఒక ముస్లిము చరిత్రకారుడు వ్రాసియున్నాడు. పై సంఘటనలు కృష్ణరాయలు సింహాసనము ఎక్కుటకు (కీ. శ. 1509) పూర్వము జరిగియుండును. క్రమముగా రామరాయలు కృష్ణరాయని ఆస్థానమునందలి ప్రముఖవ్యక్తులలో ఒకడయ్యెను. అతని శక్తిసామర్థ్యములను రాజనీతివై శారద్యమును గుర్తించి కృష్ణరాయలు అతనికి తనకుమా ర్తెనిచ్చి వివాహమొనర్చెను. అనంతరము దిగ్విజయ యాత్రలలోను, తెలుగు, బడగ రాజ్యములను ఏలుటలోను రామరాయలు కృష్ణరాయలకు తోడ్పడెను,తన మరణకాలమున (1530) సామ్రాజ్యపాలనా భారమును రామరాయలకు అప్పగించి, తన తమ్ముడైన అచ్యుతదేవరాయలకు పట్టాభిషేక మొనర్చుటకు కృష్ణరాయలు ఆతనిని ఆజ్ఞాపించెను.

రామరాయలు, అచ్యుతదేవరాయలు : కృష్ణరాయల మరణముతో రామరాజునందు అధికార వ్యామోహము పెంపొందెను. చేజిక్కిన సామ్రాజ్యమును అచ్యుతరాయలకు అప్పగించుటకు ఇష్టపడక, అత్యల్పవయస్కుడైన కృష్ణరాయల కుమారుని సార్వభౌమునిగా ప్రకటించి రామరాయలే పరిపాలన సాగించెను. కాని అచ్యుతరాయని పక్షమువారు కొందరు రామరాయలను ప్రతిఘటించి రాజ్యసింహాసనమును అచ్యుతునకు అప్పగించిరి. అచ్యుతరాయలు కూడ · రామరాయల బలాధిక్యమును గుర్తించి, కృష్ణరాయని కుమారునితో బాటు రాజ్యమేల సాగెను. క్రీ... 1533 ప్రాంతమున కృష్ణరాయని కుమారుడు.. మరణించుటచేత రామరాజు, పలుకుబడి వెనుకంజ వేయసాగెను. ఆ రహస్యమును కనిపెట్టి అచ్యుతరాయలు, తన బావమరదియైన పలక రాజు తిరుమలయ్యను ప్రధానిగా నియమించి (1534) రాజ్యము చేయసాగెను.

రామరాజు ఈ పరిణామములను ముందుగనే ఊహించి ఎదు రెత్తు లెత్తుటకు తగిన జాగరూకతను వహించి యుండెను. సామ్రాజ్యమున బలవంతులైన ప్రభువులు అనేకులు అతనికి అండయై నిలచిరి. ఆతని తమ్ములైన తిరుమలరాజు, వేంకటాద్రిరాజు, గుత్తి, కందనవోలు, రాజ్యములను ఏలుచుండిరి. ఆతని పినతండ్రులలో తిమ్మరాజు అవుకు రాజ్యమునకును, కొండరాజు ఆదవాని రాజ్యమునకును అధిపతులుగ నుండిరి. గండికోట పెమ్మసాని తిమ్మానాయకుడు, అనంతపురము హండె హనుమప్పనాయకుడు, నడిమిదొడ్డిపాలెము మెసా పెద్దానాయకుడు, ఆతని చెప్పుచేతలలోనివారు, వీరి సాయముతో రామరాయలు అచ్యుతుని చెరగొనెను. తిరుమల దేవియు చిన్నా దేవియు (శ్రీకృష్ణరాయని భార్యలు) రామరాయల పట్టాభి షేకమునకు సన్నాహములొనర్చిరి. కాని సలక రాజు తిరుమలయ్య అతని పట్టాభిషేక వివర్యయ మొనరించి, అచ్యుతుని బంధవిముక్తుని గావించి సింహాసనమున అతనిని పునః ప్రతిష్ఠించెను. ఈ పరిస్థితులలో విజయనగరముపై దండెత్తివచ్చి, స్వదేశమున విప్లవము చెలరేగుటచే వెంటనే మరలిపోవుచున్న ఆదిల్ షా అచ్యుతరాయ రామరాజుల నడుమ ఒడంబడికను కుదిర్చెను. దాని ననుసరించి రామరాజు తన జాగీరును స్వతంత్రముగ నేలుకొనుటకు అచ్యుతరాయలు సమ్మతించెను.

రామరాయలు, సలకము తిరుమలయ్య  : అచ్యుతరాయల అనంతరము (1542) ఆతని కుమారుడు వేంకట పతిరాయలు సార్వభౌము డయ్యెను. అతడు బాలుడైనందున అధికారము సలకము తిరుమలుని హస్తగత మయ్యెను. దుర్మార్గుడగు తిరుమలయ్య సింహాసనమును ఆక్రమింప యత్నించుటను గ్రహించి సార్వభౌముని తల్లియగు వరదాంబిక, ఆదిల్ షా యొక్క సహాయమును అర్థించెను. ఈలోగా అచ్యుతరాయల అన్న కుమారుడును, గుత్తి దుర్గమున బందీగా నున్న వాడును అగు సదాశివరాయలను సార్వభౌమునిగా ప్రకటించి రామరాయలు కూడ ఆదిల్ షా సహాయమును కోరెను. ఇట్లు ఇరుపక్షముల ప్రార్థనలను అంగీకరించి ఆదిల్ షా దండెత్తి వచ్చెను. అట్టి ఆదిల్ షాను ఓడించి పారద్రోలి వేంకటపతి రాయలను సకుటుంబముగ తుదముట్టించి, భయభ్రాంతులైన ప్రజలను ఒడబరచి సలకము తిరుమలయ్య విజయ నగర సింహాసన మధిష్ఠించెను. నానాటికి అతని దౌష్ట్యములు మితిమీరుటచే ప్రజలు ఆదిల్ షాను ఆహ్వానించిరి.కాని అతడు తన దురహంకారముచే ప్రజల అభిమానమును గోల్పోయి ప్రాణభీతితో తన రాజ్యమునకు పారిపోయెను. ఇట్టి పరిస్థితులలో తిరుమలయ్య యొక్క దుష్ట పరిపాలనమును తుదముట్టించి, దేశమున శాంతి భద్రతలను నెలకొల్పుము అని ప్రజలు అనేక విధముల రామరాయలను ప్రార్థించిరి. రామరాయలు గూడ ఇట్టి తరుణమునకై వేచియుండెను. అందుచేత తన పక్షము వారిని కూర్చుకొని విజయనగరమునకు సరియైన పెనుగొండను వశపరచుకొని అటనుండి బయలు దేరి కోమలి, బేతంచర్ల, జూటూరు, బెడగల్లు, ఆదవాని యుద్ధములందు తిరుమలయ్యను ఓడించి తుద కాతనిని మిత్రబృందముతో తుంగభద్రానదీతీరమున వధించి విజయగర్వముతో రామరాయలు విజయనగరమును ప్రవేశించెను. సదాశివరాయలు పట్టాభిషేకమహోత్సవ మత్యంత వైభవముగ జరిగెను (1543).

రామరాయలు, సదాశివరాయలు : సదాశివరాయలు పేరునకు మాత్రమే సార్వభౌముడు, ప్రభుత్వభారమంతయు రామరాయలే వహించెను. మొట్టమొదట దండనాథుడుగ నున్న రామరాజు క్రమముగ సర్వాధికారి అయ్యెననియు, రాజాధిరాజ, రాజపరమేశ్వర, వీరప్రతాప మహారాజాది సార్వభౌమోచిత బిరుదములను ధరించెననియు, యువరాజ పదమును గూడ బడ సెననియు స్థానిక చరిత్రలు నుడువుచున్నవి. చివరకు సదాశివరాయలను చెరసాలలోనుంచి సంవత్సరమున కొకమారు మాత్రము అతనిని ప్రజలకు ప్రదర్శించి, సార్వభౌమోచిత మర్యాద లొనర్చుచుండెను అనికూడ తెలియుచున్నది.

సదాశివరాయల పట్టాభిషేకానంతరము రామరాజు తనకు శత్రువులై నవారిని తొలగించి, తన అధికారమును బలపరచు కొనెను. అతని అధికారవ్యామోహమును నిరసించుటచే గాబోలు, నాటివరకును విజయనగర సామ్రాజ్యమును భక్తివిశ్వాసములతో కొలుచుచుండిన సాళువాది వంశములు పదచ్యుతినందెను. స్వార్థపరుడై రామరాజు అనుసరించిన ఈ ఆంతరంగిక విధానము, ఆరవీటి వంశస్థాపనకు సుగమమార్గ మేర్పరచినను, ఆది విజయనగర సామ్రాజ్యపు పునాదులను భేదించి వైచెను.

రాజధానిలో తన మార్గము నిష్కంటకమైన వెంటనే రామరాయలు దక్షిణదేశమున ప్రబలిన అశాంతి నడచుటకు నిర్ణయించెను. ఈ కాలమున దక్షిణ దేశమున స్థానిక ప్రభువులతోబాటు పోర్చుగీసువారుకూడ అల్లరులకు కారకులైరి. పోర్చుగీసువారు మత ప్రచార మొనర్చుటయేగాక, దేవాలయములను పడగొట్టి చర్చీలను నిర్మింపసాగిరి. చోరమండల తీరమందలి పల్లెవాండ్రకు కిరస్తాని మత మొసగి వారిని విజయనగరాధీశులపై దుండగములకై పురికొల్పుచుండిరి. రామేశ్వరమున కేగు యాత్రాపరులను అనేక విధములైన హింసలకు గురిచేయుచుండిరి. సుప్రసిద్ధములయిన తిరుపతి, కాంచీనగరము మున్నగు హైందవ క్షేత్రములనుగూడ కొల్లగొట్టుటకు ప్రయత్నించిరి (1545). అందుచేత వారి దుష్కృత్యములను మాన్పుట అత్యవసరమై యుండెను. రామరాజు ఇది గ్రహించి చిన తిమ్మరాజు, విఠలరాజు అను సోదరులను దక్షిణదేశ దండయాత్రకు పంపెను. వీరు మధుర, తంజావూరు,నాయకులు సహాయముతో తన్నరసునాడు, టూటికారన్, తిరువాడి రాజ్యములందు తిరుగుబాటుల నణచి కన్యాకుమారికడ విజయస్తంభమును ప్రతిష్ఠించిరి. పోర్చుగీసు వారి దుండగములు తగ్గెను, 1546 లో పోర్చుగీసు గవర్నరయిన డకాస్ట్రో రామరాయలతో సంధి గావించుకొనెను. కాని రామరాయలు పోర్చుగీసు వారిని విశ్వసింపక 1548 లో తాను సెయింటు థోమ్ పై దండెత్తి విఠలరాజును గోవాపైకి పంపెను. పోర్చుగీసువారు ఓడిపోయి రాయలకు కప్పము చెల్లించిరి.

రామరాయలు, మహమ్మదీయులు  : రామరాయలు మహమ్మదీయులపట్ల అనుసరించిన రాజనీతి విచిత్ర మైనది. హిందూమతవిధ్వంసమే మహమ్మదీయుల ఆశయమనియు వారిని అరికట్టుటకును, హిందూధర్మములను రక్షించుట కును విజయనగర సామ్రాజ్యము వెలిసెను అను సత్యమును రామరాయలు విస్మరించినట్లు కన్పించును. తన్నెదిరించిన హిందూసర్దారులపై ప్రతీకారమునకో అనునట్లు తన కొలువున ముస్లిము ఉద్యోగుల సంఖ్యను ఇతడు పెంచెను. ఐ౯ - ఉల్ - ముల్కు లవంటివారు ఉన్నత పదవులంది విజయనగర సైనికబలమును, రక్షణను గురించిన విశేషములను గ్రహింపగలిగిరి. విజయనగర, బహమనీ రాజ్యములమధ్య యుద్ధము సంభవించిన క్లిష్టసమయములందు ఈ మహమ్మదీయులు విశ్వాసఘాతకులగుదురనియైన రామరాయలు ఊహింపకపోవుట అనర్థదాయక మయ్యెను. అదియునుగాక డక్కను సుల్తానుల అంతఃకలహములందు జోక్యముకలిగించుకొని రామరాయలు ఒకరిపైనొకరిని రెచ్చగొట్టి, అందరిని తానోడించుటయేగాక విజయనగరమునకు అగ్రస్థానమును సాధింపగల్గెను. ఈ విషయమున రామరాయలు చాలవరకు కృష్ణరాయల అడుగుజాడలలోనే నడచెను, కాని ఆవిధానమును చరమ స్థానమునకు కొనిపోయి, సుల్తానులకు విజయనగరము నందు అసూయాద్వేషములను వారిలో వారికి ఐకమత్యమును పెంపొందించెను. రామరాయల జోక్యము వలన సుల్తానులలో కలిగిన నూతన చైతన్యమే రాక్షసి. తంగడి యుద్ధమునకు దారితీసెను. ఈ ఘోర సంగ్రామమునకు రామరాయలు మహమ్మదీయమతముపై చూపిన ద్వేషమే కారణమని ఫెరిస్తావంటి ముస్లిము చరిత్రకారులు వ్రాసిన వ్రాతలు విశ్వసింపదగవు. రామరాయలు మహమ్మదీయులను అత్యంత గౌరవముతో చూచెను. తన సోదరుడయిన జంషీద్ షాకు భయపడి శరణు చొచ్చిన మాలిక్ ఇబ్రహీమునకు ఆశ్రయ మొనగి అతనికి జాగీరు ఇచ్చుటయేగాక (1543_1550), జంషీ దుమరణానంతరము అతడు గోల్కొండ సుల్తాను అగుటకు రామరాయలు చేసిన ఉపకారము అమూల్యమయినది. బీజపూరు సుల్తానయిన ఆలీఆదిల్ షాను రామరాయలు పుత్రసమానముగా ప్రేమించెను. అతనిని అనేక పర్యాయములు రక్షించెను. తన ఆస్థానమునందలి మహమ్మదీయుల మతవిశ్వాసములను ఏ మాత్రము అతడు తృణీకరింపలేదు. వారు కాఫరునకు నమస్కరింప రని తెలిసికొని, రామరాయలు తన సింహాసనముపై కోరాను యొక్క ప్రతిని ఉంచుకొనెడివాడట ! అందుచే రాయల మతద్వేషముగాక, హిందూమహమ్మదీయుల మధ్యగల సహజద్వేషమే, విజయనగర అధికారవైభవాభివృద్ధి, సుల్తానులలో కలిగించిన భయో ద్రేకములే, రాక్షసి- తంగడి యుద్ధమునకు కారణములు అనుట నిస్సంశయము.

మొట్టమొదట 1548 లో రామరాయలు నిజాంషాతో(అహమ్మదు నగరము) చేరి ఇబ్రహీంఆదిల్ షా (బీజపూరు)తో పోరాడెను. ఇబ్రహీం సంధిచేసికొని యుద్ధము నుండి విరమించెను. 1556 లో అహమ్మదునగరు, గోల్కొండ సుల్తానులు కలిసి బీజపూరుపై దండెత్తి, గుల్బర్గాను ముట్టడించిరి. ఇబ్రహీం ప్రార్థనపై రామరాయలు జోక్యము కలిగించుకొని సుల్తానులమధ్య సంధి కుదిర్చి యుద్ధమును మాన్పెను. ఇబ్రహీం మరణానంతరము అతని కుమారు డయిన ఆలీ అదిల్ షా, బీజపూరు సింహాసన మెక్కెను. ఆలీ బాలుడగుట సదవకాశముగా గ్రహించి నిజాంషా బీజపూరుపై దండెత్తెను. ఆలీ విజయనగరమునకు పారిపోయి రామరాయల సహాయము అర్థించెను. కుతుబ్ షాను (గోల్కొండ) కూడ గట్టుకొని రాయలు నిజాంషా పై దండెత్తి దౌలతాబాదువరకును సేనలను నడిపించెను. నిజాంషా పరాజయమంది, కల్యాణిదుర్గమును ఆలీ అదిల్ షా కొసగి సంధిచేసికొనెను.

రామరాయల విజయ పరంపరలు, గోల్కొండ సుల్తానైన ఇబ్రహీం కుతుబ్ షాలో అసూయాద్వేషములను ప్రజ్వలింప జేసెను. రామరాయలు తన కొనర్చిన మహోపకారమును గూడ విస్మరించి అతని తుదముట్టించుటకై ఇబ్రహీం కుతుబ్ షా ప్రయత్నింపసాగెను. పై యుద్ధమున రాయలు అహమ్మదు నగరమును ముట్టడించు సందర్భమున కుతుబ్ షా రహస్యముగ నిజాంషాతో సంధిచేసికొని దుర్గరక్షకులకు సహాయ మొనరించెను. అదియునుగాక, కొండపల్లి దుర్గము నొసగుదు నని రాయలను నిజాంషాతో సంధి కొడబరచెను. కాని ఆ వాగ్దానమును మన్నింపలేదు. రామరాయలు గూడ కుతుబ్ షా పై తిరుగుబా టొనరించిన జగదేవరావునకు ఆశ్రయ మొసగి ఆతని ఆగ్రహమును రెచ్చగొట్టెను. అందుచే కుతుబ్ షా నిజాంషాతో సంధిచేసికొని తన కుమార్తెను అతని కొసగుటకు నిర్ణయించెను. ఈ వివాహము కల్యాణదుర్గమును జేయవలె నని కుతుబ్ షా నిజాంషాలు 1558 లో కల్యాణిని ముట్టడించిరి.

ఆదిల్ షా బరీదుషా (బీదరు) లతో కలిసి రామరాయలు కుతుబ్ షా, నిజాంషాలతో యుద్ధమునకు దిగెను. తన తమ్ముడైన వేంకటాద్రిని గోల్కొండ పైకి బంపి రామరాయలు కల్యాణిపై సేనలను నడిపించెను. ఇది విని నైజాంషా, కుతుబ్ షాలు ముట్టడిని విరమించి తమతమ రాజ్యముల కేగిరి. రాయలు అహమ్మదు నగరము వరకు నేగి, నిజాంషా తన ఆధిపత్యమును అంగీకరించున ట్లొనరించి గోల్కొండపైకి మరలెను. ఇంతలో రాయలు ఆజ్ఞపై కొండవీటి ప్రభువైన సిద్ధిరాజు, తిమ్మరాజు, కొండపల్లి, మచిలీపట్టణములమీదను, వేదాద్రి, సీతాపతు (చిత్తావఖాను) లు ఏలూరు, రాజ మహేంద్రవరములమీదను దండెత్తిరి. ఇట్లు తన రాజ్యము నాలుగు మూలలపై శత్రువులు దండెత్తుటను కుతుబ్ షా గమనించి రాయలదృష్టి మరలించుటకు కొండవీటిపై దండయాత్రకు ఉద్యమించెను. కాని గోల్కొండ సైన్యమును ఓడించి తరుముచు యెర తిమ్మరాజు, వెలుగోటి చినతిమ్మరాజు అనువారు దేవరకొండ, దేవులపల్లి, నల్లగొండ, ఇంద్రకొండ మున్నగు దుర్గములను ఆక్రమించిరి. కోవిలకొండ, పానగల్లు, గణపురము రాయల స్వాధీనమయ్యెను. గత్యంతరములేక కుతుబ్ షా రాయలకు గణపురమును, పానగల్లును ఒసగి ఆతనితో సంధి చేసికొనెను.

ఈ విధముగ దక్కను సుల్తానులందరును రామరాయల శౌర్య పరాక్రమములకు దోసిలొగ్గి, ఆతని ఆధిపత్యమును అంగీకరింపవలసినవారైరి. దక్షిణ రాజకీయములందు ఆతనికత్తికి ఎదురుకత్తి లేకుండెను. కాని ఈమహోత్కృష్ట బల గౌరవములే విజయనగర సామ్రాజ్యపతన హేతువులు అయ్యెను. రామరాయల విశృంఖల వీరవిహారములను అరికట్టనిచో తమకు ముప్పుతప్పదనియు, దినదినాభివృద్ధిని పొందుచున్న విజయనగర సామ్రాజ్యము తమ రాజ్యము లను కబళింపగలదనియు, దక్కను సుల్తానులు భయపడి పరస్పర విద్వేషములను మాని హుస్సేన్ నిజాంషా, ఇబ్రహీంకుతుబ్ షాల ప్రోత్సాహముతో, ఒక కూటమిగా ఏర్పడిరి, ఆలీ ఆదిల్ షా కూడ కృతఘ్నుడై వారితో కలిసెను.

రాక్షసి = తంగడియుద్ధము  : 1565 :- సుల్తానుల కూటమి రామరాయలపై యుద్ధమును ప్రకటించి దండెత్తి వచ్చెను. రాయలు ఆ వర్తమానమును విని అపార సైన్యముతో వారి నెదుర్కొనేను, కృష్ణానదికి దక్షిణమున 10 మైళ్ళ దూరమునందున్న రాక్షసి - తంగడి అను గ్రామములకు మధ్యనున్న మైదానముపై ఉభయసైన్యములును తారసిల్లెను. 1564 డిశెంబరు 26 నుండి 1565 జనవరి 24 వరకు యుద్ధము జరిగెను. దీనినే తళ్ళికోట యుద్ధమని సాధారణముగ వ్యవహరింతురు. రామరాజు వృద్ధుడైనను యుద్ధభూమిలో వీరవిహార మొనరించి, సైనికులలో ధైర్యోత్సాహములను ఇనుమడింప జేసెను. ప్రథమమున విజయలక్ష్మి రాయలనే వరించెను. నిజాంషాకుతుబ్ షాలు యుద్ధభూమి నుండి సుమారు ఇరువది మైళ్ళు వెనుకకునడచి, మాయోపాయమున రామరాయలను జయించుతలంపుతో, సంధికై సంప్రతింపులు ప్రారంభించిరి. విజయనగర సైన్యములు ఈ మోసమును గ్రహింపక విజయగర్వముతో శిబిరరక్షణ విషయమున ఏమరియుండిరి. ఇంతలో రామరాయల పక్షమందలి మహమ్మదీయ సర్దారు లిద్దరు సుల్తానులతో చేరిరి. తుదకొక అర్ధరాత్రమున మహమ్మదీయులు విజయనగర సైన్యము పై బడిరి. హిందువులు ధైర్యసాహసములతో పోరాడిరి కాని, లాభము లేకపోయెను. రామరాయలు పట్టుబడి నైజాం షా చేత వధింపబడెను. మహమ్మదీయులు భయభ్రాంతులైన హిందూ సైనికులను చుట్టుముట్టి వధించిరి. అనాయకమై, రక్షణరహితమైన విజయనగరము మహమ్మదీయులకు వశమై నామరూపములు లేకుండ ధ్వంసము చేయబడెను. ప్రపంచమున సాటిలేనిదని కీర్తి నార్జించిన మహానగరము రామరాజు మరణముతో హఠాత్పరిణామమును బొంది శ్మశానముగ మారిపోయెను.

రామరాజుకుటుంబము  : రామరాజునకు నలుగురు భార్యలుండిరి. అందు కృష్ణరాయల కుమార్తెయగు తిరుమలాంబ అగ్రమహిషియై యుండెను. జిల్లేళ్ళ పెద నంది రాజయ్య - దేవమహారాజు పుత్రికయగు అప్పలాంబయు, పోచిరాజు తిమ్మరాజయ్య కుమార్తె అయిన కొండమ్మ, లక్ష్మమ్మలును, ఇతర భార్యలు. రామరాయలకు కృష్ణరాజు, పెదతిమ్మరాజు, కొండరాజు అనుకుమారులుండిరి. రాయలతోబాటు వీరు సుల్తానులతో జరిగిన యుద్ధములందు పాల్గొనిరి. రాక్షసి - తంగడి యుద్ధానంతరము పెదతిమ్మరాజు విజయనగరమున అధికారము వహించుటకు ప్రయత్నించి విఫలుడయ్యెను. రాయల సోదరులలో తిరుమలుడు, వెంకటాద్రి అనువారు సుప్రసిద్ధులు. నిజాంషా, కుతుబ్ షాలతోటి యుద్ధములందు అసహాయశూరుడని పేరువడసిన వెంకటాద్రి, రాక్షసి -తంగడియుద్ధమున వీరస్వర్గ మలంకరించెను. ఆ యుద్ధానంతరము, తిరుమలరాయలు చంద్రగిరిలో ఆరవీటి వంశమును స్థాపించి, జీర్ణకర్ణాట సామ్రాజ్య పునరుద్ధరణమునకు పూనుకొ నెను,

రామరాయలు - భాషాపోషణ  : రామరాయలు పరాక్రమవంతుడు, రాజతంత్రజ్ఞుడు, ధర్మతత్పరుడు, విష్ణుభ క్తి యుతుడు. అతడు అనేక దేవాలయములను కట్టించి పోషించెను. అగ్రహారము లొసగి వేద వేదాంగవిదులైన బ్రాహ్మణులను గౌరవించెను. అతనిలో మతసహనము మూ ర్తీభవించెను.

రామరాయలు సంస్కృతాంధ్రములందు పండితుడు. సంస్కృతాంధ్రకవులను పోషించెను. మాధ్వమత బోధకులై న విజయేంద్రస్వాములవారు రాయలవలన అగ్రహారములను బడ సెను. అహోబిల మఠాధీశు అయిన షష్ఠ పరాంకుశులు రాయలకు కార్యకర్తలుగానుండి సిద్ధాంత మణిదీప, ప్రపత్తియోగ, నృసింహస్తవాది గ్రంథములను రచించిరి. రాయల ఆస్థానకవులలో సుప్రసిద్ధుడు రామరాజ భూషణుడు. రామరాజు ఆస్థానమునకు భూషణము వంటి వాడగుటచే అతనికి ఆపేరు వచ్చియుండును. పదకవిత్వ ప్రసిద్ధులయిన తాళ్ళపాక తిరుమలయ్యయు, అతని కుమారుడయిన తిరువెంగళ నాథయ్యయు రాయలచే ఆదరింపబడిరి.

నానా కళాపారీణుడై నను రామరాయలు సంగీతము నందు ప్రత్యేకాభిమాన- అభినివేశములు గలవాడు. అతని మంత్రియైన రామయామాత్యుడు సంస్కృతమున “స్వర మేళకళానిధి" అను సంగీతశాస్త్రగ్రంథమును రచించి, రామరాయలకు అంకితము చేసెను.

బి. యస్. యల్. హ.

[[వర్గం:]]