సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అల్బేనియా
అల్బేనియా :- ఇది ఐరోపా ఖండము యొక్క ఆగ్నేయభాగములో బాల్కన్ ద్వీపకల్పమునందు ఏడ్రియాటిక్ సముద్రతీరముననున్న రాజ్యము. దీనికి పశ్చిమమున ఏడ్రియాటిక్ సముద్రమును, పూర్వోత్తరభాగములలో యుగోస్లేవియాయు, దక్షిణమున గ్రీసును ఉన్నవి. దీని వైశాల్యము 10,629 చ. మై. జనసంఖ్య 13 లక్షలు. ఇది పర్వతమయమగు దేశము. సముద్రతీరమున మాత్రము సారవంతమయిన సన్నని మైదాన మున్నది.ఉత్తరదిశయందు గల పర్వతములు సుమారు 8 వేల అడుగుల ఎత్తుగలవి. ఉత్తరభాగములో "డ్రిన్" అనునదియు దక్షిణమున “వొయుట్సా" అనునదియు, ప్రవహించును. “ష్కుంబి” అను మరియొక నది అల్బేనియా నట్టనడుమ భాగములో ప్రవహించుచు, దేశమును రెండు భాగములుగా విభజించుచున్నది. ఉత్తరార్ధములో “ ఘెగ్" భాష మాట్లాడువారు, దక్షిణార్థములో “టోస్క్" అను భాష మాట్లాడువారు నివసించుచున్నారు.
అల్బేనియా పర్వతమయమగు దేశము అగుటవలన ముఖ్యనగరములను కలుపు కొలదిపాటి రోడ్లు తప్ప వేరు రాకపోకల సౌకర్యములు లేవు. డురాజో, వలోనా, సారాం డే, అనునవి ఏడ్రియాటిక్ తీరమున ముఖ్యమయిన రేవుపట్టణములు. రాజధాని “స్కూటారి". అది ముప్పది వేలజనాభాగల నగరము. కోరిట్సా, ఎల్బాసాని, ఆర్గిరో కాస్ట్ర౯, చెరాటి పేర్కొనదగిన నగరములు, వ్యవసాయమే జనుల ప్రధాన వృత్తి. గోధుమలు, పొగాకు, ఇతర ధాన్యములును పండును. ప్రత్తికూడ కొలదిగా పండును. ఇటీవల దేశములో పరిశ్రమలు కూడ అభివృద్ధి చెందు చున్నవి. రాగి, బొగ్గు ముఖ్యమయిన ధాతువులు. ఇవికాక పెట్రోలియం, లిగ్నైట్, అలుమోనియం,అస్ఫాల్టుకూడ లభించును. పెట్రోలియం ఉత్పత్తి బాగుగా పెంచుటకు ప్రయత్నములు సాగుచున్నవి.
1951 లో అల్బేనియా ప్రభుత్వము ఒక పంచవర్ష ప్రణాళికను సిద్ధముచేసికొని, దానిప్రకారము ఉత్పత్తి పెంచుటకు కృషి చేయుచున్నది. 1955 వ సంవత్సరాంతము నాటికి 11.1 బిలియను లెక్సు విలువగల వ్యవసాయ పదార్థముల ఉత్పత్తిని ; 8.2 మిలియను లెక్సు విలువగల పారిశ్రామిక వస్తూత్పత్తిని చేయవలెనని అంచనా వేయబడినది. గనులనుండి ధాతువులు త్రవ్వకముకూడ ఎక్కువ చేయుచున్నారు. దేశములో భూసంస్కరణలు అమలుపరచినారు. 1954 వ సంవత్సరములోనే 70 వేల సేద్యపు భూఖండములు భూమిలేని రైతులకు పంచిపెట్టబడినవి. 1954 వ సంవత్సరపు బడ్జెటు అంచనాల ప్రకారము అల్బేనియా ఆదాయము 1020 కోట్ల లెక్సులు. వ్యయము 990 కోట్ల లెక్సులు. (50 లెక్సులు= 1 డాలరు.)
విద్య : ఈ దేశములో విద్య ప్రభుత్వాధీనములో ఉన్నది. బాలబాలికలందరు ఏడు సంవత్సరముల నిర్బంధ ప్రాథమిక విద్య పొందుదురు. ఇచ్చట సుమారు 2 వేల 5 వందల ప్రాథమిక పాఠశాలలు కలవు. ముఖ్యపట్టణములలోను, జిల్లా కేంద్రములలోను పెక్కు సెకండరీ పాఠశాలలు కలవు. ఇచ్చట విశ్వవిద్యాలయము లేదు. వృత్తివిద్యాసంస్థలు మూడు కలవు. నిరక్షరాస్యతా నిర్మూలనమునకు అనేకములైన వయోజన విద్యాప్రణాళికలు అమలుపరచుచున్నారు. అయినను, నిరక్షరాస్యత దేశములో ఎక్కువగానే ఉన్నది. దేశమందంతటను 12 దైనిక వార్తా పత్రికలును, 20 ఇతర పత్రికలును కలవు. అన్నియును ప్రభుత్వాధీనములోనే ఉన్నవి.
భాష : జనులభాష అల్బేనియన్ భాష. ఇది ఇండో యూరోపియన్ భాషా కుటుంబములోని ఇల్లిరియ౯ తెగకు చెందినది. మెగ్, టోస్క్ అనునవి రెండును మాండలికములు, ఉత్తరదేశస్థులందరు ఘెగ్ను మాట్లాడుదురు. దాక్షిణాత్యులభాష టోస్క్, మరియు, దక్షిణ దేశములో గ్రీకుభాషమాటాడు వారుకూడ కొందరున్నారు. జనులలో 66% ముస్లిములు, 23% గ్రీకు - ఆర్థో డాక్చు క్రైస్తవులు. 11% రోమ౯ క్యాథలిక్కులు ఉన్నారు.
ప్రభుత్వము : అల్బేనియా కమ్యూనిస్టు ప్రజాస్వామిక రాజ్యము. "కమ్యూనిస్టు పీపుల్సు రిపబ్లిక్" ప్రభుత్వము కార్మికుల చేతులలో ఉన్నది. దేశము 10 జిల్లాలుగా విభజింపబడి ఉన్నది. 17 ఏండ్లు నిండిన స్త్రీ పురుషు అందరకును వోటింగు హక్కు కలదు. 10 వేల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున ఎన్నుకొనబడి "పీపుల్సు ఎసంబ్లి" ఏర్పడును. ప్రధానమంత్రి కాక పదుగురు మంత్రులుగల మంత్రిమండలి పరిపాలనమును నిర్వహించును. 1954 నుండి మహ మత్ షెహూ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 1953 లో హాజీలెచీ (Hadji Lechi) పీవుల్సు అసెంబ్లీకి అధ్యక్షుడుగా నియమింపబడెను.
చరిత్ర : ప్రాచీన ఇల్జీరియా మరియు ఎపిరస్ ప్రాంతములతో కలసి ఉన్న అల్బేనియా క్రీస్తునకు పూర్వము నుండియే ఎందరో పాలకుల అధికారములో ఉండుచు వచ్చినది. కాని ఎవరి అధికారమైనను తీరప్రాంతములకే పరిమితమై ఉండెడిది. కాని అంతర్భాగములోని కొండ జాతులవారిని లోబరచుకొనలేకపోయినది. ఎపిడామ్నస్, అపొలోనియా తీరనగరములు, కార్ఫా, కార్నిత్ రాజ్యముల వలసలుగా ఉండెడివి. లోపలి కొండజాతుల సరదారులు స్వతంత్రులుగానే ఉండెడివారు. క్రీ. పూ. 3 వ శతాబ్దమువరకు అల్బేనియా ఉన్నత దశకు వచ్చినది. ఆ తరువాత మాసెడోనియా, రోమను దేశముల పరస్పర ఘర్షణలో రాపిడిపడెను. క్రీ.శ. మొదటి శతాబ్దము నాటికి పేరునకు మాత్రము ఇది రోమన్ పరిపాలనలో ఉండినది. 5వ శతాబ్దములో "ఆస్ట్రో గోత్స్" (తూర్పు జర్మనులు) ఈ దేశమును అక్రమించిరి. మొదటి జస్టినియన్ చక్రవర్తిచే జయింపబడి ఈ దేశము 535 లో బై జాంటైన్ సామ్రాజ్యములో నొక భాగమైపోయినది. కాని అప్పుడుకూడ తీరప్రాంతములవరకే విజేతల పరిపాలన పరిమితమయి ఉండెడిది.
11 వ శతాబ్దము తరువాత అల్బేనియా అంతర్జాతీయ సంఘర్షణలకు రంగస్థలమైనది. 1082 లో రాబర్టు గైస్కాడ్ యొక్క నాయకత్వమున నార్మనులు బైజాం టైన్ సామ్రాజ్యముతో పోరునకు దిగిరి. 1272 లో నేపుల్సు రాజయిన మొదటి చార్లెసు అల్బేనియా రాజయ్యెను. డురాజో రేవు వెనీస్ అధికారములోనికివచ్చెను. తరువాత కొలది కాలమునకు అల్బేనియా టర్కీ హస్తగత మయ్యెను. అల్బేనియా జాతీయ వీరు డయిన స్కాండర్ బర్గు టర్కీ వారిని తీవ్రముగా ప్రతిఘటించెను. వెనీస్, నేపుల్సు రాజ్యములు అతనికి తోడ్పడినవి. 1478 నాటి టర్కీలో ఆటోమన్ సామ్రాజ్యము ఏర్పడెను. అల్బేనియా, ఆ సామ్రాజ్యములో చేరిపోయినది. డురా జోనును, 1501 వరకు వెనీస్ వారు తమ చేతిలో నిలుపుకొనిరి. ఆటోమన్ సామ్రాజ్యాధికారము చాల కాలము సాగినది. ఈ కాలములోనే అధిక సంఖ్యాకులు ఇస్లాం మతమును స్వీకరించిరి.
1912 లో మొదటి బాల్కన్ యుద్ధము జరిగెను. దానితో అల్బేనియా వారికి స్వాతంత్య్రం సంపాద నావకాశము లభించినది. అంతర్జాతీయ సంఘమొకటి అల్బేనియా సరిహద్దులను నిర్ణయించినది. ఇంతలో 1918 లో రెండవ బాల్క౯ యుద్ధము తటస్థించెను. తత్ఫలితముగా
అల్బేనియా సర్బులచే ఆక్రమింపబడెను. 1914 లో విలియమ్ అను నతడు రాజ య్యెను. అతని మంత్రి ఎసాద్ పాషా అనునతడు రాజును తరిమివేసి తానే పాలకుడయ్యెను. ఇంతలో మొదటి ప్రపంచ మహా సంగ్రామము ప్రారంభ మయ్యెను. సర్యులు, గ్రీకులు, ఇటాలియనులు ఆల్బేనియాను ఆక్రమింప మొదలిడిరి. 1916 లో బల్గేరియనులు ఆస్ట్రియనులును ఈ దేశములో ప్రవేశించిరి. యుద్ధము ముగియు వరకు అల్బేనియా రణరంగముగా నుండెను.
1928 లో అహమదుజంగు అను ముస్లిం నాయకుడు తాను అల్బేనియా రాజునని ప్రకటించుకొని నిరంకుశముగా పాలించెను. రెండవ ప్రపంచ మహా సంగ్రామము ప్రారంభము కాగానే అల్బేనియా మరల యుద్ధ రంగముగా మారెను. 1939 లో ఈ దేశముపై ఇటలీ వారు దురాక్రమణ జరిపిరి. ఇటలీ రాజైన మూడవ ఇమ్యాన్యుయల్ చక్రవర్తిగా ప్రకటింపబడెను. 1940 లో ఇటాలియనులు గ్రీసుపయి దాడి చేసిరి. దక్షిణ అల్బేనియా రణరంగముగ మారెను. దేశమున ఫాసిస్టు వ్యతిరేక వర్గము లేర్పడెను. స్వాతంత్య్రము కొరకు ఇటాలియనులపయి గొరిల్లా యుద్ధము సాగించిరి. వీరిలో ఎన్వర్ హాక్సుహా (Envar Hoxha) అను నతని నాయకత్వమున వామపక్షము ఏర్పడి విజృంభించినది. 1946 వరకు హాక్సుహా సైన్యములు అల్బేనియాలో చాల భాగమును ఆక్రమించి 1946 సం. 11 జనవరినాడు “రిపబ్లిక్”గా ప్రకటించెను. హాక్సుహా అధ్యక్షతలో కమ్యూనిస్టు ప్రభుత్వము ఏర్పడెను. నాటినుండియు ఈ దేశమును నియంతగా హక్సుహా పరిపాలించుచున్నాడు. 1946 సం. మార్చి 7 వ తేదీనాడు నూతన రాజ్యాంగము ఆమోదింపబడినది. నాటి నుండి అల్బేనియా సోవియట్ కూటమిలో చేరి ఉన్నది. యూగోస్లావియా సోవియట్ రష్యునుండి విడిపోయిన తరువాత అల్బేనియాకూడ యూగోస్లావియాతో విడిపోయి ఆర్థికముగాను, వ్యాపార దృష్టిలోను చాల చిక్కులపాలయినది. 1954 వ సంవత్సరములో యూగోస్లావియాతో స్నేహపు ఒడంబడిక చేసికొన్నది.
1946 నుండి నిరాఘాటముగా సాగుచు వచ్చిన హాక్సుహా ప్రభుత్వము 1953 లో కూలిపోయినది.
ఉ.రా
[[వర్గం:]]