సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరిస్టాటిల్ (5.తత్త్వవిషయము)
అరిస్టాటిల్ (5.తత్త్వవిషయము): -అరిస్టాటిల్ యుగ యుగముల యందలి మహోత్తమ ప్రతిభాశాలురలో నొకడు. మనస్సంబంధమైన పాండిత్యములో అతనికి సమానులగువారు మిక్కిలి కొలదిమందిమాత్రమే కలరు. ఫలవంతమైన ఆతని అసాధారణ క్రియాకలాపమునుండి ఉద్భూతమైన రచనము చాల విస్తారమైనదిగా నుండెను. కాని అతని రచనలు చాల కొలదిమాత్రమే నేడు పదిల పరుపబడి యున్నవి. శాస్త్రీయతా లక్షణముచే అవి ప్రత్యేకముగా మిక్కిలి ప్రాధాన్యముగలపై యున్నవి. అతడు చేసిన సంవాదములలో కొన్ని మాత్రమే ఖండ ఖండములుగా నేటికి నిలిచియున్నవి. అరిస్టాటిల్ రచనలు ప్లేటో రచనల యొక్క నాజూకుతనముతో గూడిన అందమును, ఒక మతప్రవక్త కుండెడి రసానుభూతిని కలిగి యుండవు. అయినను నిజముగా ఒక శాస్త్రీయతా బుద్ధి ప్రకర్షను ఒక విషయమును సావయవముగా పరిశీలించెడి అత్యుత్తమమైన మనస్సును అరిస్టాటిల్ రచనలు ద్యోతకము చేయుచున్నవి. అరిస్టాటిల్ యొక్క తర్కము (Logic) మానవ భావన యొక్క పరాకాష్ఠ యనియు, కొలది మార్పులు చేయుటకు గూడ అవకాశ మీయనంత పరిపూర్ణతను తనలో ఇముడ్చుకొన్నదనియు అనేక శతాబ్దములు భావింపబడియుండెను. అరిస్టాటిల్ తర్కము నెడల కాంట్ (Kant) గూడ ప్రశంసాభావమును కలిగి యుండెను. ఈ ప్రశంసాదృష్టి అతిశయోక్తితో గూడి యున్నదని ఎవరుచెప్పినను అరిస్టాటిల్ రచన యొక్క నిర్వివాదమైన ప్రాముఖ్యమును మాత్రము ఇది సూచించు చున్నది. శాస్త్రీయజ్ఞానమునకు తర్కమును ఒక సాధనాంగముగ అరిస్టాటిల్ భావించియుండెను. ఆ పద్ధతి క్రమ ప్రణాళికాబద్ధమైన ప్రాధాన్యమును కలిగియున్నది. ప్లేటోవలెనే, అరిస్టాటిల్ కూడ సామాన్య ధర్మమే (the universal) వాస్తవమైన సత్యమనియు, దాని జ్ఞానము 'భావరూప దర్శనము' (concept) లో మాత్రమే లభింపగల దనియు, భావించుచున్నాడు. కాని యీతడు సర్వసామాన్య ధర్మము (the universal) ను, ప్రత్యేక ధర్మము _ (the particular) ను ఎట్టి సంబంధమును లేక యున్నవని ప్లేటోవలె భావింపక, అతనితో భేదాభిప్రాయమును కలిగియున్నాడు. సామాన్యధర్మమునుండి అవశ్యముగా ' ప్రత్యేకధర్మము ' ను గ్రహింపగలుగుట ఎట్లో చూపుటయే తర్కముయొక్క పనియై యున్నది. ప్రతిపాదనాత్రయ హేతువాదము (Syllogism) అరిస్టాటిల్ యొక్క తర్క సిద్ధాంతమునకు కేంద్రస్థానమై యున్నది. ఒక మధ్యపదముద్వారా మరి రెండింటినుండి ఒక న్యాయమును పరిగ్రహించుటయే అంత్యమున సాధింపబడు ఫలితము (Conclusion) గానున్నది. కావున సామాన్య ధర్మముక్రింద ప్రత్యేక ధర్మమును ప్రతిక్షేపించుట (Substitution) అను సంభావ్యత మీద అరిస్టాటిల్ యొక్క తర్కము తన దృష్టిని కేంద్రీకరించు చున్నది. “విరుద్ధ తాధర్మము" (The law of contradiction) అనున దొక్కటిమాత్రమే ఇతడు ప్రతిపాదించిన సాధారణ సూత్రము (General Principle). ఒకే 'భావరూప దర్శనమునకు చెందిన సంబంధము' (Conceptual Relation) యొక్క అస్తిత్వ, నాస్తిత్వములు మరియొక సంబంధమునకు అవకాశ మీయ వనియు, ఒక వస్తువు 'ఉండగలదు, లేకుండగలదు' అనిచెప్పుట సాధ్యము కాదనియు ఈ సూత్రము చెప్పుచున్నది.
విభిన్నమైన సత్య ప్రపంచము మరియొకటి దృశ్యమానమగు ప్రపంచమునకు కారణమని ఆరిస్టాటిల్ భావింపలేదు. 'పరిణామ' (Evolution) సిద్ధాంతమును ప్రవేశపెట్టి, "సారము"నకును, “కనబడుదానికి"ని (Essence and appearance) గల సంబంధము నాతడు తెలియ జెప్పుచున్నాడు. పదార్థములలో (Matter) “సారము” (Essence) తన “సంభవత" (Possibility “Potentia')తో గూడినదై మనకు దగ్గరగా నున్నది. రూపముయొక్క ప్రాప్తిచేత, అది 'నిజమైనది' ('Actu') అగుచున్నది. 'సర్వ సామాన్యమైనది' (the universal) ప్రత్యేక మైన (the particular) దానిచేత మాత్రమే నిజమైనది అగుచున్నది. 'ప్రత్యేకమైనది' 'సర్వసామాన్యమైనదాని' యొక్క సత్య సంసిద్ధి యగుచున్నది. 'దృశ్యమానము' (Appearance) లో 'సారము' (Essence) యొక్క ఆత్మీయ సత్య సంసిద్ధినే అరిస్టాటిల్' 'వాస్తవికత' (Entetechy) అని పిలుచుచున్నాడు. ప్లేటో అభిప్రాయమునకు విరుద్ధముగా అరిస్టాటిల్ 'ప్రత్యేక వస్తువు' మాత్రమే సంపూర్ణ సత్యముగలది యని వాదించుచున్నాడు. 'వస్తువే' (Substance) మొట్ట మొదటిదియు, పరమ ప్రధాన మైనదియునని అతని అభిప్రాయము. వస్తువు దృశ్యమానమయ్యెడి భిన్న రీతులను బట్టియు అందుండి సంభవమగు 'అభిధానము’లను బట్టియు (predications) "జాతి భేదము" (categories) లేర్పడుచున్నవి.
అరిస్టాటిల్ యొక్క పరిణామ తత్త్వశాస్త్రము (Metaphysics of Evolution) ననుసరించి, రూపము (Form) నకును, పదార్థము (Matter) నకును పరస్పర సంబంధము కలదు. తక్కువ స్థాయిలోని జీవికి (being) ఏది రూపమగుచున్నదో, అది అంతకంటెను పైస్థాయిలోని జీవికి ‘పదార్థము' అగుచున్నది ('Form' and 'Matter”). వస్తువులు వాని జాతులు ఇట్లు ఒక 'కొలబద్ద' (Scale) గా ఏర్పడుచున్నవి. ఇటునటు రెండువైపులను గూడ వానికి పరిమితులు గలవు. రూపముగా ఏర్పడని పదార్థము, లేదా స్వచ్ఛ సంభవత్వము (Pure possibility), మరియు స్వచ్ఛ రూపము లేదా స్వచ్ఛక్రియ (Pure form or pure act). ఇవి రెండును జీవి యొక్క క్రమములోని రెండు చివరల యందును గల హద్దులుగా నున్నవి. స్వచ్ఛ రూపమునకు పదార్థ మేమియును అవసరములేదు. అత్యుత్తమమైన సత్యము (Highest reality) తో నది సమానము. స్వచ్ఛ సంభవత్వముగా నున్న పదార్థము చలన సూత్రమును (Principle of movement) గాని, తనంతట తాను సత్యసిద్ధిని గాని కలిగియుండదు. స్వచ్ఛ పదార్థము (The pure matter) స్వయముగా చలనములేనిదిగా నుండును. ప్లేటో త త్త్వశాస్త్రమునందలి భగవంతుని భావనవలె అది శాశ్వతమై మార్పులేనిదియు, చలనము లేనిదియుగా నున్నది. అది పదార్థ రహితమును, పరిపూర్ణమును అగు జీవముగా నున్నది. అది భగవంతుడు. అది స్వచ్ఛక్రియ ; భావనకు భావన. అది ఆత్మ పరిజ్ఞానము (Self-consciousness). అది స్వయం సమగ్రమై, స్వచ్ఛమైన ఆనందమై యున్నది. అది ప్రపంచమునందు తన స్వకీయమైన క్రియా శక్తి వలన పనిచేయుటలేదు; భగవంతుని కొరకు పదార్థము యొక్క ఆవేదనయే ప్రపంచమును కదలునట్లుగా చేయునదై యున్నది. భగవంతునికిని పదార్థమునకును మధ్యను, స్వచ్ఛరూపమునకును స్వచ్ఛ పదార్థమునకును మధ్యను వస్తువులతో నిండిన ప్రపంచమంతయును గలదు; దీనికే ప్రకృతియని అరిస్టాటిల్ నామకరణము చేసెను. ఈ అంతర్భాగమున నున్న వస్తు ప్రపంచము చలనముల ననుభవించును. మరియు అతని తత్త్వశాస్త్ర వికాసములో చలనమును ప్రేరేపించును. అరిస్టాటిల్ ప్రాచీనమైన పైథాగరస్ భావనావిధానమునుండి కొన్ని విచిత్రములైన అభిప్రాయములను స్వీకరించియున్నాడు. ప్రపంచము యొక్క ఆకృతి -వర్తులము గాన, వర్తులాకార చల నమే మిక్కిలి పరిపూర్ణమైనది. గ్రహములు మానవాతీతమైన తెలివిని కలిగియున్న వనియు, అవి దైవత్వమును పోలిన వనియు, వాని ప్రభావములే క్రిందనున్న భూమిపై పడుచుండు ననియు నీతడు చెప్పెను.
కాని గుణసంబంధమైన భేదములన్నింటిని (Qualitative differences) పరిమాణ సంబంధమైన భేదములనుగా (Quantitative) మార్చుటకు చేసిన డెమాక్రిటస్ యొక్క సనాతన ప్రయత్నమును (classical attempt) అరిస్టాటిల్ ప్రతిఘటించుట ఎక్కువ ముఖ్యమైనది. గుణవిశేషణము నూతనమైనది, పరిమాణముగా మార్చుటకు శక్యము కానిది.
అరిస్టాటిల్ తన మానసిక శాస్త్రమునందు, మానసిక జీవనము వివిధములైన అంతరువుల (layers) చే నిర్మింప బడినదని చెప్పుచున్నాడు; క్రింద అంతరువు లేదా పొర అంతకంటే పైనున్న దానికి పదార్థముగా నేర్పడుచున్నది. వృక్ష సంబంధమును, పశు సంబంధమును అగు ఆత్మను (Vegetive and animal soul) ఆధారముగా జేసికొని హేతువాదము లేక 'రౌస్' (Reason or rous) మానవునిలో వృద్ధిపొందుచున్నది. హేతువాదము తిరిగి క్రియావంతము, క్రియావిరహితము (active and passive aspects) అను భేదముల చేత ద్వివిధముగానున్నది. క్రియా విరహితమైన బుద్ధి వ్యక్తిగతమును, వ్యక్తి సంబంధమై అనుభవముచే ఏర్పడు నదియునై యున్నది. క్రియావంతమగు బుద్ధి వ్యక్తులందరకును సాధారణమై యున్నది ; అందుచే నది అమరమైనది. క్రియావిరహితమైన బుద్ధి వ్యక్తి గతజీవితముతో దృశ్యమానమై, దానితోనే అదృశ్య మగుచున్నది. మానవజీవితము యొక్క లక్ష్యము సుఖ స్థితిగా నుండుట (wellbeing). అందుచేత అరిస్టాటిల్ 'ఆనంద వాది' (hedonist) అను పదముచే సాధారణముగా సూచింపబడు వర్గమునకు చెందినవాడని చెప్పుటకు వీలులేదు. సుఖస్థితిగానుండుట అనగా ప్రకృతితో సమ్మేళనముపొందు క్రియా కలాపము అని అతడు భావించు చున్నాడు. జ్ఞానము సౌశీల్యమునకు (Virtue) కేవలము మార్గదర్శకమగుటకు చాలియున్నదని సోక్రటీస్ తలచినంతగా అరిస్టాటిల్ తలచియుండలేదు. వాంఛలు, భావాతిరేకములు (Passions) వీని ముట్టడి నెదిరించుటకు మన వివేకముతో గూడిన అంతర్దర్శనము నిజముగా శక్తి మంతముగానుండవలెను. ఆత్మ నిగ్రహము (Self-control) ఇట్టి శక్తి నొసంగగలదు; దానిని సంపాదించుటకు అలవాటుల వలనను, సాధనల వలసను మానవుడు తనకుతాను విద్యాశిక్షితుడు కావలసి యున్నాడు. సౌశీల్యము (Virtue) రెండు పరమావధులకు ఒకసాధన మైయున్నది. ధైర్యము, తొందరపాటునకును పిరికితనమునకును ఒక మధ్యస్థానములోనున్నది. కనుక, అరిస్టాటిల్ యొక్క నీతిశాస్త్రము (Ethics) సమభావమునకును, ప్రశాంత స్థితికి ని (Balance and equillibrium) చెందిన నీతిశాస్త్రమై యున్నది. అరిస్టాటిల్ యొక్క "నిచ్ మాచ్ లన్” (నీతిశాస్త్రము) శీలవంతమైన జీవనమును గూర్చిన చక్క నియుదాహరణములతో నిండియున్నది; అంతియే కాక మైత్రి యొక్క విలువ కది యిచ్చెడి ప్రాముఖ్యమును బట్టి అది గ్రీకు సంప్రదాయమునకొక నిదర్శనమై యున్నది. మానవుడు సుశీలవంతమును, నీతిమంతమును అగు జీవనమును ప్రభుత్వపాలనములో మాత్రమే సంపూర్ణముగా నడుపగలడని అరిస్టాటిల్ ప్లేటో వలెనే పూర్తిగా నమ్మి యున్నాడు. నీతిశాస్త్రము రాజకీయములలో ఒక భాగమని నిర్ధారణ చేయబడినది. నైతికమైన మార్గములో వ్యక్తిని పెరుగనిచ్చుటయే ప్రభుత్వము యొక్క ప్రధాన కర్తవ్యమైయున్నది. సంఘము యొక్క సుఖస్థితి లక్ష్యముగా నున్నంతవరకు ప్రతి రాజ్యాంగ ప్రణాళికయు సరియైనదే ; ప్రభుత్వము పరమోత్తమమైన ఈ లక్ష్యము నుండి విడివడినచో సరియైనది కాజాలదు. వ్యక్తి పరిపాలన రాజ పరిపాలనవలె మంచిది కావచ్చును, నిరంకుశ పాలనవలె చెడ్డది కావచ్చును; కొలదిమందిచే చేయబడు పరిపాలన ప్రభువర్గ పరిపాలన (Aristocracy) వంటిదై మంచిదగును. కొలదిమంది పెద్దల కూటమి (Oligarchy) వంటిదై చెడ్డదియగును; అందరిచే చేయబడు పరిపాలన ప్రజాప్రభుత్వము వంటిదై మంచిదిగా నుండును; జన సమూహము యొక్క అరాజకమువంటిదై చెడ్డదిగా నుండును. ప్లేటో వలెనే అరిస్టాటిల్ కూడ మానవుని, ఆదిమ ప్రాకృతిక స్థితినుండి నైతికమును, వైజ్ఞానికమును అగు సంస్కృతికి తీసికొని రాగల విద్యను ఇచ్చుట ప్రభుత్వపు బాధ్యతయే యని నిర్దేశించుచున్నాడు. బానిసత్వమును సమర్థించినందులకు అరిస్టాటిల్ అతి తీవ్రముగా విమర్శింపబడియున్నాడు. కాని ఇందులకు కారణము అతని కాలమునందలి చారిత్రక పరిస్థితులే యని సమర్థింప వచ్చును.
డా. వ
[[వర్గం:]]