సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరిస్టాటిల్ (2. జంతు విషయము)

అరిస్టాటిల్ (2. జంతు విషయము):- తనతండ్రి వైద్యుడగుటవలననో, లేదా ప్రతి విషయమును విపులముగా తెలిసికొన వలయునను ఆసక్తిగలిగినందు వలననో, అరిస్టాటిల్ తన జీవితము యొక్క చరమదశలో శారీరక శాస్త్రము నందును, జంతుశాస్త్రమునందును, మిక్కుటమగు అభిరుచిని చూపినవాడాయెను.

అరిస్టాటిల్ ప్రపంచమునకు తెలిసిన జంతుశాస్త్రజ్ఞులలో గొప్పవాడుగను, ప్రథముడుగను ఎన్నబడు చున్నాడు.గ్రీసు, మాసిడోనియా, ఏషియా మైనరు అను దేశములలో నివసించు పెక్కు జంతువుల నిర్మాణములు, అలవాట్లు మున్నగు వివిధవిషయములను తెలిపెడు బృహద్గ్రంథము నొక దానిని వ్రాసెను. దీనినే హిస్టోరియా ఏనిమాలియం (Historia Animalium) అందురు. అనగా 'జంతుచరిత్ర' అని యర్థము, ఇందు తొమ్మిదిభాగములు కలవు.

ఇతడు సూక్ష్మగ్రాహి. ఇతని వర్ణనలలో అధికాంశములు స్వయముగా చేసిన పరిశీలన ఫలితములయి నిర్దుష్టముగా నుండును. అయినను, ఇతర ఆధారముల ననుసరించి ఇతడు వ్రాసిన కొన్ని విషయములు అసత్యములుగాను, విపరీతమైనవిగాను ఉన్నవి. గ్రీకు దేశమునకు సంబంధించిన దాదాపు 520 జాతుల విషయములు ఇతని రచనలలో గుర్తింపబడినవి. జంతువులను వాటి నిర్మాణములను బట్టియు, అలవాట్లను బట్టియు విభజించవచ్చునని నిర్ణయించెను. కాని వర్గీకరణ పద్ధతిని ఇతడు పేర్కొనలేదు. మిగిలినవారు ఇతని వ్రాతలనుండి వర్గీకరణ పద్ధతులను పేర్కొనిరి. ఇతడు సంపూర్ణమగు పరిశీలనాదృష్టి కలిగినవాడు. కోడిగ్రుడ్డునందలి పిండము పిల్లగా మారుటయు, మగ తేనెటీగలు సంయోగక్రియ లేకయే వృద్ధిచెందుటయు, కొన్ని షార్కు చేపలు తల్లి గర్భమునందే పెరుగుటయు మున్నగు విషయములను చక్కగా పరిశీలించెను.

ఇతడు క్రమానుసారియైన ప్రకృతిశాస్త్రవేత్త. పరిశీలనము యొక్క ప్రాముఖ్యమును నొక్కి వక్కాణించెను. జీవశాస్త్ర సంబంధమగు దృశ్యములందలి క్రమ నియమములను గుర్తించెను.

ఇతడు పరిశీలించిన విషయములనుండి నిర్ణయములను చేయుటలో అనుమాన ప్రమాణమును ఆశ్రయించేను, తులనాత్మకములైన చర్యలయందు మానవ దేహమును ప్రమాణముగా గ్రహించెను. శారీరశాస్త్ర విషయము లందు కొంతవరకు ఇతడు పొరపాటు పడియుండెను.ఆకాలమున రసాయనశాస్త్ర పరిజ్ఞానము లేకపోవుటచే ఇట్టి పొరపాటు సహజమైనదియే. జీవకోటి అల్పత్వము నుండి అధికత్వమునకు పరిణామము చెందుచుండునని అతడు విశ్వసించెను, ఈ పరిణామమునకు చిచ్ఛక్తి యొక్క అనుశాసనమే కారణమని అతడు అభిప్రాయ పడెను.

డా. బా. రె.

అరిస్టాటిల్ (3. రాజకీయము) :- అరిస్టాటిల్ ప్లేటోకు శిష్యుడైనను ప్లేటోకును వీనికిని ఎంతేని వ్యత్యాసము కలదు. ప్లేటో యొక్క నైతిక దృష్టి అరిస్టాటిల్ యందును కలదు. కాని ప్లేటో యొక్క కవితా శక్తియు, భావచాతుర్యమును అరిస్టాటిల్ గ్రంథములయందగపడవు. ప్లేటో రచనలు సంభాషణ రూపమున నుండుటచే అతి మనోహరములై యున్నవి. కాని అరిస్టాటిల్ గ్రంథములు శాస్త్రరీత్యా వ్రాయబడినవి. కవితాశక్తి గాని, అపూర్వమైన శైలిగాని అందు కానరావు. అతని ఉపన్యాసముల నుండి శిష్యులు గ్రహించిన విషయములను అనంతరము వారే, గ్రంథరూపమునకు దెచ్చిరని పలువురి అభిప్రాయము.

అరిస్టాటిల్ పద్ధతి శాస్త్రపద్ధతి. భావనాశక్తి ప్లేటో యందు ప్రధానమైనది. అరిస్టాటిల్ గ్రంథములయందు వాస్తవిక దృష్టి ప్రధానము, ఆదర్శములు, భావములు ప్లేటోకు సత్యమైనచో, వాస్తవ ప్రపంచము కూడ అరిస్టాటిల్ కు ముఖ్యమైనది. దేశ కాల పరిస్థితులకు సంబంధము లేని ఆదర్శములు, తత్త్వములు అతనికి పనికిరావు. అతనిది శాస్త్రపద్ధతి కనుక రాజ్యమునుగూర్చి వ్రాయబూనుటకు మునుపు అతడు నాటి రాజ్యాంగములను. వాని చరిత్రను, చక్కగా పరిశీలించెను. అతడు రచించిన "పొలిటిక్సు" అను గ్రంథము ఆకాలపు పరిస్థితులపై ఆధారపడి వాస్తవికముగ నున్నది.

మానవుని అనేక వాంఛలను తృప్తిపరచుటకుగాను నానాసంస్థలు ఏర్పడును. కాని ఈ సంస్థ అన్నిటికన్నను రాజ్యము ఉత్తమమైనది. ఇతర సంస్థలు మానవుని ప్రత్యేక వాంఛల కొరకును, సంకుచితములయిన కోర్కెల కొర

[[వర్గం:]]