సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికా సంయు క్తరాష్ట్రములు (చరిత్ర)

అమెరికా సంయు క్తరాష్ట్రములు (1 చరిత్ర) : ఉత్తరమున కెనడాకును దక్షిణమున మెక్సికోకును నడుమ ఉత్తర అమెరికాలోనున్న విశాలము, సారవంతము అయిన భూభాగమునకు అమెరికా సంయుక్త రాష్ట్రములని పేరు. క్రీ. శ. 17, 18 శతాబ్దులలో, ఐరోపానుండి క్రమక్రమముగ వచ్చిన ప్రజలు, వారు తీసికొని వచ్చిన సంస్థలు, ఆ ధర్మములు, క్రొత్తగా గనిపెట్టబడి, అసంకీర్ణమైన దేశములో స్థాపింపబడి పరిణతి చెందుటవలన అమెరికా సంయుక్త రాష్ట్రములు ఏర్పడినవి. ఈ విధముగా అనేకులు ఇచ్చటకు వలస వచ్చుటకు వారి రాజకీయ స్వాతంత్య్రకాంక్ష, మతవిషయక స్వాతంత్య్ర నిరతి, ఆర్థిక పురోగమనాభిలాష ముఖ్యకారణములు.

మొదట వలసవచ్చినవారు ఉత్తర అమెరికా తూర్పుతీరమున స్థిరపడి, స్వతంత్రమైన కొన్ని వలసలు ఏర్పరచు కొనిరి. ఈ వలసలలో మూడు విభాగములు ఏర్పడెను. ఉత్తర భాగములోనున్న వలసలు పారిశ్రామికముగా ప్రధానములై నవి. దక్షిణభాగములోనున్నవి కృషిప్రధానములైవి. మధ్యభాగములో నున్న వలసలలో వైవిధ్యము ఎక్కువగా నుండి పరిస్థితులకు అనుగుణముగా నడచుకొను మన స్తత్వము ప్రబలెను. వలసలలో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగియుండుట వలన, వలస వచ్చినప్పటినుండియు స్వాతంత్య్రమునకు అలవాటు పడియుండుటవలన,ఇవియన్నియు కలిసి ఏక రాష్ట్రముగా ఏర్పడుట అంసంభవమాయెను.

మొదట వలసవచ్చినవారు ఉత్తర అమెరికా తూర్పు తీరమున స్థావరము ఏర్పరచుకొనిరి. వీరిలో కొందరు తరువాత వలసవచ్చినవారితో కలిసి లో భాగముననున్న సారవంతమయిన భూములను క్రమక్రమముగా ఆక్రమించుకొనసాగిరి. వీరు ఈ విధముగా పడమటగా చొచ్చుకొని పోవుటవలవ (Westward expansion) ఈ దేశచరిత్రలో ముఖ్యమైన మార్పులు కొన్ని ఏర్పడెను.

ఇంగ్లండు మొదలైన దేశములనుండి ప్రజలు తమంతట తామే అచ్చటకు వలసవచ్చిరికాని ఆయా దేశ ప్రభుత్వ

ముల యొక్క ప్రోద్బలమువలన కాదు. ఇచ్చట వలసలు ఏర్పడిన తరువాతకూడ ఆంగ్లదేశ ప్రభుత్వము కాని మరి యితరదేశ ప్రభుత్వములు కాని యిక్కడి ప్రజల యొక్క స్థితిగతులతో ఎక్కువజోక్యము కలిగించుకొనలేదు. అందువలన ఈవలస రాష్ట్రముల ప్రజలలో స్వాతంత్య్రబుద్ధి, మాతృదేశము నెడల ఒక విధమైన నిర్లక్ష్యము బయలుదేరెను. 18వ శతాబ్ది మూడవ పాదములో ఫ్రెంచి వారిని ఈ ప్రాంతమునుండి తరిమి వేసిన తరువాత ఆంగ్లప్రభుత్వము ఈ వలసల మీద అధికారము నెరపుచు ఒక విధమైన క్రొత్త సామ్రాజ్య దృక్పథము అలవరచు కొనెను. మొదటినుండియు స్వాతంత్య్రమునకు అలవాటు పడిన ఈ వలసలలోని ప్రజలు ఈ మార్పును గర్హించిరి. క్రమ క్రమముగా ఆంగ్ల ప్రభుత్వము వలస రాష్ట్రముల పరిపాలనకు అగు వ్యయములు వలసవారే భరింపవలెనను తత్త్వమును అనుసరింపగా వలస రాష్ట్రప్రజలుతమకు ప్రాతినిధ్యములేని బ్రిటిష్ పార్లమెంటు విధించు పన్నులు తామెందులు కీయవలెనని వాదింపసాగిరి. ఈ సంఘర్షణము నానాటికి తీవ్ర రూపముదాల్చి క్రీ. శ. 1775 వ సంవత్సరములో ఇంగ్లాండునకును వలసరాజ్యములకును మధ్య ఒక యుద్ధముగా పరిణమించెను. దీనికే అమెరికా స్వాతంత్య్ర యుద్ధము అని పేరు. జార్జివాషింగ్టన్ నాయకత్వమున వలసల వారు 6 సంవత్సరముల కాలము హోరాహోరిగ పోరాడి తుదకు క్రీ. శ. 1783 లో విజయముపొంది తమ స్వాతంత్య్రమును సంపాదించుకొనిరి.

స్వాతంత్య్రము లభించిన తరువాత దాని నేవిధముగ నిలువబెట్టుకొనవలయు ననునది ప్రధాన సమస్య యయ్యెను. అదియును కాక యీ వలసలలో, యీ పరస్పరము ఏ విధమైన సంబంధము ఉండవలెనో కూడ నిర్ణయించుకొనవలసి వచ్చెను. క్రీ. శ. 1787వ సంవత్సరమున ఫిలడెల్ ఫియాలో ఈ వలసల ప్రతినిధులు సమావేశమై ఒక రాజ్యాంగ ప్రణాళికను తయారుచేసి ఆమోదించిరి. ఈ ప్రణాళికలో స్థానిక స్వాతంత్య్రము సాముదాయిక మగు అధికారము అను రెండు భిన్నసూత్రములు సమన్వయింపబడినవి. సాముదాయిక అధికారము కాంగ్రెసు అను శాసనక ర్తృత్వమునకు వశముచేయబడెను. ఈ సంస్థలో రాష్ట్రములకు ప్రాతినిధ్యము వహించు సెనేటు అనియు, మొత్తము ప్రజలందరికి ప్రాతినిధ్యము వహించు ప్రజాప్రతినిధి సభయనియు, రెండు విభాగములు ఏర్పరచబడెను. ఈ విధముగా ఏర్పడిన సంయుక్త రాష్ట్రములకు యుద్ధములో విజయమునకు కారుకుడైన జార్జి వాషింగ్ టన్ మొదటి అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను.

స్వాతంత్య్రము ను సంపాదించుకొని ఒక రాజ్యాంగమును ఏర్పరచుకొనిన తరువాత అర్ధ శతాబ్దికాలములో అమెరికా సంయుక్త రాష్ట్రముల చరిత్ర సంస్కృతులలో చాల ముఖ్యమగు మార్పులు వచ్చెను. దేశములో ప్రభుత్వము సుస్థిరమై, పరిశ్రమలు, వాణిజ్యము, వ్యవసాయము అభివృద్ధి చెందెను. క్రమ క్రమముగా ఈ సంయుక్త రాష్ట్రములు పడమటగా వ్యాపించసాగెను. దీనిఫలితముగా క్రీ.శ. 1821 వ సంవత్సరము నాటికే మరి ఆరు క్రొత్త రాష్ట్రములు ఈ సమాఖ్యలో చేరుటయు ఒక క్రొత్త జాతీయభావము ఏర్పడుటయు జరిగెను. కేంద్రము యొక్క అధికారము ఎక్కువగా ఉండవలెనని 'హేమిల్ టన్ నాయకత్వమున ఒక పక్షమును, రాష్ట్రములకు ఎక్కువ అధికారముండవలెనని చెఫర్ సన్ నాయకత్వమున మరియొక పక్షమును బయలుదేరగా వాదోపవాదములు సాగెను. ఈ కాలములోనే వాఙ్మయము అభివృద్ధి పొంది దేశము యొక్క సాంస్కృతిక వ్యక్తిత్వమునకు దోహద మొనంగెను. పారిశ్రామికుల స్థితిగతులలో అభి వృద్ధి, జాతీయాభివృద్ధి, స్త్రీ స్వాతంత్య్రొద్యమ ప్రారంభము ఈ కాలములోనే జరిగెను. వ్యవసాయములోను, పరిశ్రమలలోను యంత్రములను ప్రవేశ పెట్టుటవలన దేశ మార్థికముగా అభివృద్ధిచెంది సామాన్య ప్రజల జీవితము సుఖకరముగా సాగజొచ్చెను. క్రీ. శ. 1812 వ సం॥ మొదలు 1852 వరకు గల మధ్యకాలములో అమెరికా సంయుక్త రాష్ట్రముల జనసంఖ్య 72 లక్షల నుండి 230 లక్షల వరకు పెరిగినది. వ్యవసాయ యోగ్యమయిన భూమి యూరపు ఖండమంత విస్తీర్ణతకు వృద్ధిచెందెను. ఇవి యన్నియు ఈ కాలములో అమెరికా రాష్ట్రము పొందిన అభివృద్ధిని సూచించుచున్నవి.

యుద్ధకాలములో తటస్థ దేశముల హక్కులు, అధికారములు ఈవిషయములపై కొన్ని భేదాభిప్రాయములు కలిగెను. ఈ కారణమువలన క్రీ. శ. 1812 లో ఇంగ్లండు అమెరికాల మధ్య ఒక యుద్ధము ప్రారంభమయ్యెను. ఈ యుద్ధము మూడు సంవత్సరముల కాలము జరిగెను. తుదకు క్రీ. శ. 1815లో అమెరికాకు విజయము లభించెను. ఈ యుద్ధఫలితముగా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రజలలో జాతీయ భావము, దేశభక్తి బాగుగా ప్రబలుటయే కాక అంతర్జాతీయ రంగములో అమెరికాకు కొంత ప్రాముఖ్యము లభించెను.

క్రీ. శ. 1783 లో అమెరికా సంయుక్త రాష్ట్రములు స్వతంత్ర మైనప్పటినుండియు ఈ రాష్ట్రములకు దక్షిణముగానున్న లాటిన్ అమెరికన్ వలసలలోని ప్రజలలో కూడ స్వాతంత్య్రకాంక్ష ప్రబలి విప్లవమునకు దారితీసెను. క్రీ.శ. 1824 సం॥ నాటికే లాటిన్ అమెరికాలోని వలసలు చాల భాగము స్వాతంత్య్రము సంపాదించుకొనెను. వీరి స్వాతంత్య్రమును అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము గుర్తించెను. ఇది ఇట్లుండగా యూరపులో రష్యా, ఆస్ట్రియా మొదలైన కొన్ని సామ్రాజ్యవాద రాజ్యములు కలిసి హోలీ ఎలయన్స్ (Holy Alliance) అను పేరుతో క్రీ.శ. 1815 లో ఒక సంస్థను స్థాపించెను. ఈ సంస్థను స్థాపించుటలో ముఖ్యమగు ఉద్దేశము అభ్యుదయ శక్తులను అణగద్రొక్కి అభివృద్ధి నిరోధక సామ్రాజ్యవాద తత్త్వమును సుస్థిరము చేయుటయే. ఈ సంస్థ లాటిన్ అమెరికా విషయములలో జోక్యము కలిగించుకొని అచ్చటి స్వాతంత్రోద్యమములను అణగద్రొక్కుటకు ప్రయత్నములు చేసెను. ఈ ప్రయత్నములను ప్రతిఘటించుచు అప్పటి అమెరికా సంయుక్త రాష్ట్రముల అధ్యకడుగానున్న జేమ్సుమన్ రొ ఒక సిద్ధాంతమును ప్రతిపాదించెను. ఈ మన్రో సిద్ధాంతము జాతుల స్వయం నిర్ణయాధికారము, ఒక దేశము ఇతర దేశముల వ్యవహారములలో జోక్యము కలిగించు కొనకుండుట. మొదలైన కొన్ని ముఖ్య సూత్రములను, పునరుద్ఘాటించెను. ఈ మన్రో సిద్ధాంతమే అమెరికా సంయుక్త రాష్ట్రముల విదేశాంగ నీతికి పునాదిగా పరిణమించినది.

ఈవిధముగా క్రీ. శ. 19 వ శతాబ్ది మధ్యకాలమునకు అమెరికా రాష్ట్రములలో పై చూపులకు సర్వతోముఖాభివృద్ధి కానిపించినను రాష్ట్రము లోలోపల విభేదములు బయలు దేరెను. వ్యవసాయ ప్రధానమై, బానిసవృత్తిని అమలుపరచు దక్షిణరాష్ట్రమునకును, పరిశ్రమలు ప్రధానముగా కలిగి బానిసత్వము నిషేధించు ఉత్తర రాష్ట్రములకును నానాటికిని వైషమ్యము ప్రబలసాగెను. దీని ఫలితములు సమ కాలిక రాజకీయములలో కూడ కనిపింపసాగెను. రిపబ్లికన్ పార్టీ అను పేరిట ఒక రాజకీయపక్షము బయలు దేరి బానిసత్వమును నిర్మూలించవలెనని ఆందోళనము ప్రారంభించెను. బానిసల దుర్భరజీవితమును చిత్రించుచు 'అంకుల్ టామ్స్ కాబిన్' వంటి పుస్తకము' లి యాందోళనమునకు చాల దోహద మొసంగెను. బానిసతనమును నిర్మూలింప బూనిన ఈఉద్యమమునకు అబ్రహాంలింకను నాయకత్వము వహించి, బానిసల పాలిటి దైవముగా ప్రసిధ్ధికెక్కెను. క్రీ.శ.1861 సంవత్సరములో లింకను అమెరికా సంయుక్త రాష్ట్రములకు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడుటలో, ఏడు దక్షిణ రాజ్యములు ఏకమై బానిసత్వ సమస్యను పురస్కరించుకొని తిరుగుబాటు చేసెను. ఇది ఒక యుద్ధముగా పరిణమించి, 4 సంవత్సరముల కాలము సాగెను. తుదకు బానిసత్వము ఉండకూడదను ఉత్తరరాష్ట్రములకు విజయములభించుటతో ఈ అంతర్యుద్ధము సమాప్తమయ్యెను.

యుద్ధము సాగుచుండగనే క్రీ. శ. 1863 లో లింకను బానిసత్వమును నిర్మూలించు ఒక ప్రకటనచేసెను. యుద్ధానంతరము అమెరికా కాంగ్రెమ 13 వ సవరణ ద్వారా యీ బానిసత్వ నిర్మూలనమును రాజ్యాంగ ప్రణాళికలో చేర్చెను. దక్షిణ రాష్ట్రములు క్రమక్రమముగా సమాఖ్యలో తిరిగి చేర్చుకొనబడినను, బానిసల విషయములో కొన్ని భేదములను పాటించుచునే వచ్చెను. దీనికి ప్రతీకారముగా కాంగ్రెస్, రాజ్యాంగ ప్రణాళికను మరియొకసారి సవరణచేసి సమాఖ్య అధికారములోనున్న భూభాగములో పుట్టినవారందరికిని, చిరకాలముగా నివసించు చున్న వారందరికినికూడా సమాఖ్యలోను, ఆయా రాష్ట్రములలోను కూడ వర్తించు పౌరసత్వమును ఇచ్చెను. క్రీ.శ. 1870 లో మరియొక సవరణ ద్వారా జాతివర్ణ విభేదములు పురస్కరించుకొని పౌరులెవ్వరికిని ఓటింగు హక్కు నిరాకరింపబడకూడదని కాంగ్రెసు తీర్మానించెను. దీనితో నీగ్రోలకు తెల్ల వారితొ సాంఘికముగను, రాజకీయముగను, శాస్త్రరీత్యా సమానత్వము ప్రాప్తించెను. ఈ సమానత్వము వాస్తవముగా కూడ వర్తించునట్లు చేయుటకై అప్పటినుండి ప్రయత్నములు జరుగుచున్నవి.

అంతర్యుద్ధము నుండి మొదటి ప్రపంచయుద్ధము వరకు గల మధ్యకాలములో అమెరికా సంయుక్త రాష్ట్రములు చాల అభివృద్ధిచెందెను. ఈ కాలములో అనేక క్రొత్త యంత్రములు, పద్ధతులుకని పెట్టబడి వస్తూత్పాదన బాగుగ ఈఅభివృద్ధి చెందెను. ఆ కారణముగ పరిశ్రమలు, వాణిజ్యము అభివృద్ధిచెందెను. ఈ అభివృద్ధికి ముఖ్య కేంద్రము లైన నగరములు కూడ సంఖ్యలోను, సంపదలోను చాల వృద్ధిపొందెను. అదేవిధముగ సాగుబడిలో నున్న భూమి కూడ రెండు రెట్లు ఎక్కువయ్యెను. పంట ఆరురెట్లు పెరిగినది. రాష్ట్ర పరిమితి పడమటి సముద్రము వరకు వ్యాపించెను. ఈ మార్పుల ఫలితముగా పరిస్థితులు తారుమారై అన్యోన్య సంబంధములను సంస్కరించ వలసిన అవసర మేర్పడెను. ఈ సంస్కరణోద్యమమునకు పురోగమవాభి లాషులైన అమెరికా అధ్యక్షుడురూజు వెల్టు మొదలయినవారు దోహదమిచ్చిరి. ఇది ఇట్లుండగా క్యూబా ద్వీపమును గురించి అమెరికాకు స్పెయినుతో యుద్ధము తటస్థించెను. ఇందులో అమెరికా విజయము పొంది తత్ఫలితముగా క్యూబా, పోర్టోరికో, గువం, ఫిలిప్పైన్స్లను సంపాదించెను

మొదటి ప్రపంచయుద్ధము క్రీ.శ. 1914 లో ప్రారంభమైనప్పుడు అమెరికా దీనిలో దిగుటకు సంసిద్ధముగను, సుముఖముగను లేకుండెను. కాని జర్మనులు విచక్షణ లేకుండ సాగించిన నిర్దాక్షిణ్యయుతమైన జలాంతర్గాముల యుద్ధము తటస్థ రాష్ట్రములకు కూడ అపారనష్టము కలిగించుటతో జర్మనుల ఆగడములను అరికట్టు నిమిత్తము, అమెరికా యుద్ధములో దిగవలసివచ్చెను. దిగిన తరువాత జర్మనీయొక్క ప్రతికూల రాష్ట్రములకు విజయము లభించు టకు ఈదేశము తీవ్రకృషి చేసెను. దీనికి ఫలితముగా యుద్ధానంతరము జరిగిన సంప్రదింపులలో అమెరికాకు ప్రముఖ స్థానము లభించెను. భవిష్యత్తునందు ప్రపంచ శాంతిభద్రతలను సుస్థిరముచేయు నుద్దేశముతో స్థాపించబడిన నానా రాజ్య సమితి, అమెరికా అధ్యక్షుడైన విల్సను యొక్క ప్రత్యేక కృషికి ఫలితము. అయినప్పటికిని అమెరికా క్రమక్రమముగా అంతర్జాతీయ రాజకీయములనుండి తొలగి తన దృష్టిని తన అభివృద్ధిమీదనే కేంద్రీకరించెను.

యుద్ధానంతరము దశాబ్దుల కాలము అమెరికా అభివృద్ధి కరముగానే సాగెను. వాణిజ్యములో, పరిశ్రమలలో, వ్యవసాయములో పెక్కు మార్పులు వచ్చి ఉత్పత్తి చాల అభివృద్ధిచెందెను. క్రీ.శ. 1930 లో ప్రపంచమంతట వ్యాపిం చిన ఆర్థికమాంద్యము వలన అమెరికా కూడ చాల నష్టపడెను. తరువాత రూజు వెల్టు అధ్యక్షత క్రింద బహుముఖమైన సంస్కరణ కలాపము జరిగెను. దీనికి ఫలితముగా అమెరికా సంయుక్తశాష్ట్రముల ఆర్థిక స్థితిగతులు చక్కబడినవి. ఇంతవరకు అంతర్జాతీయ రాజకీయములతో తన కేమియు సంబంధము లేనట్లుగా నున్న అమెరికాను ఇప్పుడు తిరిగి విదేశాంగ నీతి ఎక్కువగా ఆకర్షించినది. దీనికి కారణము జర్మనీ, ఇటలీ, జపాను దేశముల నియంతృత్వములు విదేశాంగ విధానము వలన ప్రపంచ శాంతి భద్రతలకు ప్రమాదము కలిగించు పరిస్థితి ఏర్పడుటయే,

ఐరోపాలో జర్మనీ ఇటలీల ఆధ్వర్యవమునను, ఆసియాలో జపాను ఆధ్వర్యవమునను ప్రబలిన నియంతృత్వ విధానము, వీని విదేశాంగ విధానమునకు ఫలితముగ సంభవించిన రెండవ ప్రపంచయుద్ధము మొదట అమెరికా దృష్టి నంతగా ఆకర్షించలేదు. కాని క్రీ.శ. 1940 జనవరి 7 వ తేది జపాను ఆసియాలోని అమెరికా సైన్య స్థావరము ముఖ్యమైన పెరల్ హార్బరుపై బాంబులు వేయుటతో అమెరికా యుద్ధములోనికి దిగవలసి వచ్చెను. ఈ యుద్ధములో ముఖ్యముగా పసిఫిక్ మహాసముద్రము మీద జరిగిన పోరాటములో, మిత్రరాజ్యముల వారికి విజయము లభించుటకు అమెరికా ముఖ్యకారణమయ్యెను. 1945 సెప్టెంబరులో యుద్ధము అంతమైన తరువాత అంతకు పూర్వము జరిగిన మిత్రరాజ్యములవారి సంప్రదింపులలో అమెరికా ప్రధానపాత్ర నిర్వహించెను. మొదటి ప్రపంచయుద్ధానంతరము అమెరికా అధ్యక్షుడు విల్సను కృషిఫలితముగ ప్రపంచములో శాంతి స్థాపన కొరకు ఏర్పడిన నానా రాజ్యసమితి స్థానములో ఇప్పుడు ఐక్యరాజ్యసమితి స్థాపింపబడినది. ఈ సంస్థను స్థాపించుటలో ఉద్దేశము కూడ భవిష్యత్తులో యుద్ధములను అరికట్టి ప్రపంచములో శాంతి భద్రతలను సుస్థిరము చేయుటయే. ఈ సమితి స్థాపన విషయములో కూడ అమెరికా ప్రముఖ పాత్రను వహించినది.

యుద్ధము ముగిసినప్పటినుండియు క్రమక్రమముగా అంతర్జాతీయరంగములో అమెరికా ఒక విధమైన ఆదర్శమునకు, రష్యా మరియొక ఆదర్శమునకు చిహ్నములై వైషమ్యమును పెంపొందించుకొనుచు వచ్చినవి. ఒక వైపున రష్యా తనకు అందుబాటులోనున్న రాష్ట్రములలోను, ముఖ్యముగా యుద్ధములో నష్టపడిన రాష్ట్రములలోను, కొన్ని శతాబ్దుల కాలము పాశ్చాత్యదేశముల సామ్రాజ్యవాద శృంఖలములలో బంధింపబడి యుండుట వలన ఆర్ధికముగాను, రాజకీయముగాను వెనుక బడియున్న రాష్ట్రములలోను సామ్యవాద సిద్ధాంతములను, నిర్మాణ విధానమును వ్యాపింప జేయుటకు ప్రయత్నము చేయుచుండగా, ఇంకొక వైపున అమెరికా ఇట్టి దేశములకే కోట్లకొలది ద్రవ్యము సహాయముచేయుచు అవి కమ్యూనిస్టుల వశము కాకుండునట్లును, తమ శక్తిపై తాము ఆధార పడియుండునట్లు చేయుటకును ప్రయత్నించు చున్నది. ఈ ప్రయత్నముల ఫలితము ఎట్లుండునో నిర్ణయించు అధికారము భవిష్యత్తునకు మాత్రమేకలదు.

ఆర్. ఎన్. ఆర్.

[[వర్గం:]]