సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అభినయము

అభినయము  :- "నటుడు తన హృద్గత క్రోధాది భావములను శరీరాది చేష్టల వలన వ్యక్తీకరించుట అభి నయము. రామ యుధిష్ఠిరాదుల యవస్థలను రంగాది సాహాయ్యముచేత చూపుట అభినయము యొక్క ప్రయోజనము. అభినయమునకు అనుకరణ మావశ్యకము. లోకమునందు తండ్రి తన కుమారుని ముద్దాడుట అభినయ మనిపించు కొనదు. పితా పుత్రులు కానివారు వారి వేషములు వేసికొని, అందు తండ్రివేషము వేసికొనిన వాడు కొడుకు వేషము వేసికొనిన వానిని ముద్దాడిన అది అభినయమగును." అట్లే కోతికి సహజమైన చేష్టలు అభినయ మనిపించుకొనవు. కాని ఆ చేష్టలనే మానవుడు అనుకరించి చేసినచో అది అభినయ మనిపించుకొనును, అభినయమున కిది సామాన్య నిర్వచనము. ఇంక శాస్త్ర సమ్మతములైన వివరములు పేర్కొన బడును.

అభినయము భరత శాస్త్రమునకు సంబంధించినది. 'భరతము'ను ఈ క్రింది విధముగా విభజింప వచ్చును.

భరతము నాట్యము నృత్యము వృత్తము తాండవము లాస్యము అభినయము

నాట్యమ్ నృత్తమ్ నృత్యమితి మునిఖిః పరికీర్తితమ్
నాట్యం తన్నాట కే ష్వేవయోజ్యం పూర్వక థాయుతమ్
రసభావ విహీనంతు నృత్త మిత్యభిధీయతే
రసభావ వ్యంజకాది యుతం నృత్య మితీర్యతే.

నాట్యము, నృత్తము, నృత్యము అని భరతము మూడు విధములు. అందు నాట్యము నాటకములందు పూర్వకథతో గూడియుండునట్టిది.

రసభావ విరహితమయి తాళ లయల నాశ్రయించి యుండు అంగ ప్రత్యం గోపాంగముల విన్యాసము నృత్తము. రసభావములు కలిగియుండి తాళ లయల ననుసరించి, భావానుగుణముగ ప్రదర్శింపబడెడి ఆంగికాభినయము నృత్యము.

ఏతత్రయం ద్విధాభిన్నం లాస్య తాండవ సంజ్ఞికమ్
సుకుమారంతు తల్లాస్యం ఉద్దతం తాండవం విదుః.

సుకుమారమైన అంగవిన్యాసము, భావప్రకటనము కలిగినట్టిది లాస్యము. గంభీరముగా, ఉద్రేక పూరితముగా నుండునట్టి నృత్యము తాండవము. మరియు సభలందు కూర్చుండి రసభావముల నభినయించుట లాస్యముగాను; నిలబడి తాళలయల ననుసరించి నృత్యమాడుట తాండవముగాను జెప్పుదురు,

అభినయ విధానము:

కంఠేనాలంబయే ద్గీతం, హస్తే నార్థం ప్రదర్శయేత్
చక్షుర్భ్యాం దర్శయే ద్భావం, పాదాభ్యాం తాళ మాచరేత్ .

అభినయించువారు కంఠముచే గీతమును శ్రావ్యముగా బాడుచు, ఆ పాట యొక్క అర్థమును పతాకాది హస్తములచేత తెల్పుచు, రసభావములను దృష్టిభేదములతో జూపుచు, తాళమును పాదములతో ప్రదర్శింపవలెను.

మరియు పతాకాది హస్తములతో నర్తకి తాను పాడెడి గీతముయొక్క అర్థమును అభినయించునప్పుడు, దృష్టి యెల్లప్పుడును హస్తమును అనుసరింపవలెను. దృష్టినిల్చిన చోటనే మనస్సు లగ్నమగును. అట్లు లగ్నమైన మనస్సు నందు భావము, భావమునుండి రసము పుట్టుచున్నవి.

'రస' మనగా ః మనస్సుచే నెరుగదగిన సుఖవి శేషము; భావజ్ఞులచే ఆస్వాదింపబడుచున్నది; రసిక హృదయముల స్రవింపజేయునట్టిది.

అభినయము :

అభిపూర్వస్యణీఞ ధాతో రాఖ్యానార్థస్య నిర్ణయః
యస్మా త్పదార్థాన్నయతి తస్మా దభినయః స్మృతః.

అభి- యనెడు ఉపసర్గ పూర్వమందుగల ణి ఞ ధాతువునకు చెప్పుట అని అర్థము. పదముల యొక్క అర్థము ప్రజలకు అభిముఖ మగునట్లు పెంపొందించి తెల్పునట్టిది అభినయము, విభావానుభావముల సహాయముతో ఒక భావమునుగాని, అనుభవమునుగాని ప్రేక్షకులకు తెలియ జేయునట్టిది అభినయము.

ఇట్టి అభినయము ఆంగికము, వాచికము, ఆహార్యము, సాత్త్వికము- అని నాల్గు విధములు.

ఆంగికము అవయవములతో ప్రదర్శింపబడునట్టిది.

ఆంగికాభినయము  : అనగా ఒక పాట యొక్క అర్థమునుగాని, నాటకములోని ఒక సన్నివేశమునుగాని, ముద్రలతో విపులీకరించుట (ఈముద్రలు నాట్య శాస్త్రాదు లందు విపులీకరింపబడినవి). ఇందు భావము ఉండదు. గీతార్థమును దెల్పునట్టి అంగవిన్యాస ముండును. ఇట్టి అభినయము ముఖ్యముగా వర్ణనలతో గూడిన పాటలందు ప్రదర్శింపబడును.

ఉదా. ప. ఇంతి చెంగల్వ పూబంతి,
చెలువల మేల్ బంతి
గుణముల దొంతి వినవే.

అ. శ్రీకాంతుడు గాకున్న, ఖరదూషణాదుల
నావంతలో పలజంప నెంతవారు నరులని
చింతించి దశకంఠు డసురులు శిక్షింప జక్రి యినకులమున
మంతు కెక్క జనించె శ్రీ రామాఖ్య బ్రహ్మాది సుతుండయి యనె.

ఇట్టి కీర్తనలను నృత్యమందు ప్రదర్శించునప్పుడు.. ఇంతి, చెంగల్వపూబంతి, చెలువల మేల్ బంతి, గుణముల దొంతి. ఇట్లు ప్రతిమాటకు ఆ అర్థమునకు సరిపోవు హస్తమును (ముద్రను) పట్టి అభినయింపవలసియుండును. ఇట్టి ముద్రలతో గూడినదే ఆంగికాభినయము.

వాచికము  : నాట్యమందుగాని, నాటకమందుగాని పాత్ర యొక్క రసభావములను పోషించు విధమున సంభా షించుటగాని, గానము చేయుటగాని వాచిక మగును. ఆహార్యము  : నృత్య, నాటకాదులందు ఆయా సన్నివేశములకు తగినట్లు పాత్రలు అలంకారాదులను ధరించుట, రంగాలంకరణము ఆహార్య మనబడును.

సాత్త్వికము  : భారతీయ నృత్యకళయందు ప్రధానమైనట్టిది సాత్త్వికాభినయము. సత్వగుణ ప్రధాన మైనట్టిది సాత్త్వికము. ఒక దృశ్యమును మనము జూచినప్పుడు గాని, ఒక సంఘటననుగూర్చి వినినప్పుడుగాని మన మనస్సు పొందు అనుభూతియే సాత్త్వికము. ఈ సాత్త్వికక భావములు ఎనిమిది విధములు : స్తంభము, ప్రళయము, రోమాంచము, స్వేదము, వైవర్ణ్యము, వేవధువు, అశ్రువు వైస్వర్యము,

సాత్త్విక భావములను గూర్చి రసమం జరియందు ముచ్చటైన శ్లోకములో చెప్పబడియున్నది.

"భేదో వాచి, దృశో ర్జలం, కుచతటే
     స్వేదః, ప్రకమ్పో ౽ధరే,
పాడ్లు ర్గణ్ణతటే, తనౌ చ పులక
     వ్రాతో, లయ శ్చేతసి,
ఆలస్యం నయనద్వయే, చరణయోః
     స్తమ్భః, సముజ్జృమృతే;
తత్కీం రాజపథే ప్రజేన్ద్రతనయః
కృష్ణ స్వయా౽౽లోకితః ?

సఖి నాయికతో ననుచున్నది:

ఓ మందయానా ! నీ మాటలయందు గాద్గద్యము. కన్నులందు బాష్పములు, చనుదరియందు చెమర్చుట, మోవి యందు ఆదరుపాటు, చెక్కిలియందు తెల్లదనము, మేనియందు పులకరింత, కనులయందు మాంద్యము,పాదముల యందు మ్రానుపాటు ఒకటినిమించి ఒకటి అతిశయిల్లుచున్నది. వ్రజకాంతల యుల్లములు కొల్లగొన్న నవనీత చోరుడు నీ కంటబడెనా యేమీ? లేనిచో అఖిల సాత్త్విక భావములు ఒకేవేళ ఏల యుదయించును ?

పై శ్లోకమువలన సాత్వికము లన నేమియో అవి యెట్లు గల్గునో తెలియుచున్నది. సాత్త్వికములు మనస్సు నందు బుట్టి మనయందు గల్గు మార్పులు. నృత్యమందు నవరసాభినయమునకుగాని, పదముల అభినయమునకు గాని సాత్త్విక ప్రదర్శనము ముఖ్యము. సాత్త్వికమందు నర్తకుడు ముందు తానా భావమునందు లీనమై అనుభవించి, అభినయ ద్వారమున ప్రదర్శించి మనచే అనుభవింప జేయును. ఆంగికమందు నర్తకుడు తానా భావము నందు ఐక్యము కానవసరములేదు. అభినయింపవలసిన గీతముయొక్క అర్థములు తీసికొని హస్తములద్వారా వ్యాఖ్యానము చేయును. కనుకనే శాస్త్రము తెలిసిన పండితులు ఆంగిక ప్రధానమైన నృత్యమునకు తక్కువ స్థానమును, అనుభవయోగ్యమైన సాత్త్వికమునకు అగ్ర స్థానమునిచ్చిరి. పదాభినయమందు సాత్త్వికము ముఖ్యము. నాట్యమందు నవరసములు అభినయింపబడినను, "రతి" స్థాయిగాగల శృంగారమందువలె విజృంభించి అభినయింప గల అవకాశ మితర రసము లందు లేదు. కనుకనే పెద్దలు సృష్టి కాధారమైన శృంగారమునందే పదరచనలు చేసిరి. నృత్య నాటకములందు, భాగవత, కలాప, యక్షగానము లందు ఇతర రసముల అభినయమునకు అవకాశ మెట్లున్నను, ఛాయగానైనను శృంగారము లేనిదే ఆ అభినయ ముండుట అరుదు. అట్లే శృంగారము నభినయించు నప్పుడును హాస్య, అద్భుత, భయాన కాది రసములు ఛాయలుగా వచ్చుటయును గలదు. బీభత్సము తప్ప ఇతర రసములు అచ్చటచ్చట వచ్చి సంచారి భావములకు మెరుగులు పెట్టి అభినయమునకు అలంకారములుగా ఉపయోగపడును.

నవరసములు వాటి స్థాయి భావములు
(1) శృంగారము రతి
(2) వీరము ఉత్సాహము
(3) కరుణము శోకము
(4) అద్భుతము విస్మయము
(5) హాస్యము హాసము
(6) భయానకము భయము
(7) బీభత్సము జుగుప్స
(8) రౌద్రము క్రోధము
(9) శాంతము శమము

వీటిలో అభినయమునకు ముఖ్యమైనది శృంగారము. శృంగారాభినయము సాత్వతి, ఆరభటి, కైశికి, భారతి అనెడి చతుర్విధ వృత్తులలో కై శికీవృత్తియందు మాత్రమే ప్రదర్శింపబడును.

శృంగారము  :- సంభోగము, విప్రలంభము అను ఇరు తెరంగులు.

విప్రలంభము  :- అయోగ, విరహ, మాన, ప్రవాస, శాపము అని ఐదు విధములు.

అభినయమునకు విప్రలంభమే శ్రేష్ఠము. విప్రలంభము నందే నర్తకి విజృంభించుట కవకాశమున్నది.

భావోదయము, భావసంధి, భావశ బలత, భావశాంతి అని నాల్గు అవస్థలు తెలుపబడినవి. ఇవి కాక మన్మథావస్థలు పది కలవు: చక్షుః ప్రీతి, చింత, సంకల్పము, గుణస్తుతి, క్రియాద్వేషము, తాపము, అజ్ఞాత్యాగము, ఉన్మాదము, మూర్ఛ, మృతి.

ఈ దశావస్థలు ముఖ్యముగా 'ప్రోషిత భర్తృక ' ను అభినయించునప్పుడు ప్రదర్శింపబడు చున్నవి. 'మృతి' తప్ప మిగిలిన వాని నెల్ల నర్తకులు తమ అభినయమందు ప్రదర్శింతురు.

మన్మథ పంచబాణములు  : (¹) అరవిందము, (2) ఆశోకము, (3) చూతము, (4) నవమల్లిక, (5) నీలోత్పలము.

ఇందు నాలుగు బాణములు మాత్రము సంధింపబడును. 'నీలోత్పల' ప్రయోగము మరణమునకు కారణమగునుగాన నిషేధింపబడినది. ఈ బాణమునకు పట్టునట్టి ముద్రను మాత్రము ప్రదర్శించి ముగింపవలెను.

సంచారి భావములు 33  : నిర్వేదము, గ్లాని, శంక, అసూయ, మదము, శ్రమ, ఆలస్యము, దైన్యము, చింత, మోహము, స్మృతి, ధృతి, వ్రీడ, చపలత, హర్షము, ఆవేగము, జడత, గర్వము, విషాదము, ఔత్సుక్యము, నిద్ర, అపస్మారము, సుప్తి, విభోధము, అమర్షము, అవహిత్థము, ఉగ్రత,మతి, వ్యాధి, ఉన్మాదము, మరణము, త్రాసము, వితర్కము.

ఇక నాయికా నాయక భేదములు : స్వీయ, పరకీయ, సామాన్య - భేదములచేత స్త్రీలు త్రివిధముల గలరు. శృంగారనాయికలు అష్టవిధముల నున్నారు: ప్రోషిత భర్తృక, వాసకసజ్జిక, విరహోత్కంఠిత, అభిసారిక, విప్రలబ్ధి, ఖండిత, కలహాంతరిత, స్వాధీనపతిక అని, అభిసారిక జ్యోత్స్నాభిసారిక, తమోభిసారిక, దివాభిసారికా భేదముల చేత ముత్తెరగుల గలదు. పద్మిని, హస్తిని, చిత్రిణి, శంఖిని అనువారు చతుర్విధ కళాశాస్త్ర నాయికలు. దూతి, దాసి, సఖి, చేటి, ధాత్రేయి, ప్రాతి వేశిని,

లింగిని, కల్పిని - అనువారు నాయికా సహాయలు. పతి, ఉపవతి, వైశికుడు అను భేదములచేత పురుషులకు త్రైవిధ్యము చెప్పబడినది. శృంగార విషయ నాయకులు- దక్షిణుడు, శకుడు, ధృష్టుడు, అనుకూలుడు అని నలు వురు. పాంచాలుడు, కూచిసూరుడు, భద్రుడు, దత్తుడు. అను వారలు ప్రఖ్యాత కళాశాస్త్ర నాయకులు. పీఠమర్దుడు, విటుడు, చేటుడు, విదూషకుడు. అనువారలు నాయకుని నర్మ సచివులు.

ఇచ్చట తెల్పబడిన నాయికా నాయకులు గాక ఇంకను ఎందరో ఉన్నను వీరుమాత్రము అభినయము నందు ముఖ్యులు. ప్రాచీన పండితుల మతానుసారము నాయికలే 1152 విధముల నున్నారు.

ఇందు ధీరోదాత్తుడు మొదలయిన ప్రఖ్యాత నాయకులు నాటకములందు కనిపింతురు. శృంగార నాయకులు పదముల, వర్ణముల అభినయమునందు ముఖ్యులు. నర్మ సచివులు నాయకునికి సహాయపడువారు, చేటి, దూతి మొదలయిన వారు నాయికకు తోడ్పడునట్టివారు.

ఇక కళాశాస్త్ర నాయికానాయకులు భరతకళ- 'నాట్య ధర్మి' 'లోక ధర్మి' యని రెండు విధముల గలదు. 'నాట్య ధర్మి' యనగా నటులు శాస్త్రము ననుసరించి, హస్త విన్యాసమును, ఆంగికాభినయమును అభ్యసించుట. 'లోక ధర్మి' యందు అట్లు అభ్యసించిన విద్యను లోకానుభవముతో సరిదిద్దుకొని అనుభవ పూర్వకమైన విద్యను ప్రదర్శించుట కళాశాస్త్రమందు వివిధజాతులకు చెందిన నాయికలు, వారి అవయవ సౌష్ఠవము, హావభావ ప్రదర్శనము మున్నగువాటిని గూర్చి విపులముగా పూర్వులు తెల్పిరి. కావున ఆ శాస్త్రపఠనము నర్తకులకు, అత్యవసరముగా తోచుచున్నది. మరియు సాత్త్విక ప్రధానమైన అభినయమునందు - కళాస్థానములు అభినయమందు, ఆలింగన చుంబనాది శృంగార క్రీడలను నర్తకులు అభినయింపవలసి యుండును. ఈ అభినయమునకుగూడ కళాశాస్త్ర పఠన మవసరము.

ఉదాహరణములు : (1) స్వీయ : పెండ్లియాడిన పతినే దైవముగా నెంచి పూజించునట్టి పతివ్రత.

ఉదా: ప.

ఆడుదాని జన్మ మెత్తిన ఫలమేమి
         అతివరో వ్యర్థమమ్మా.

అను.

మేడలు మిద్దెలు మెండు గలిగిననేమి
ఈడైన విభునితో - నెనసి యుండకపోతే. ఆ.
అతివ మిక్కిలి రూప - వతియైతేనేమి
సతతము పతిభక్తి - సలిపితేనేమి,
అతులిత వ్రతములు - ఆచరించిన నేమి
పతితోడ హితవుగా పలుకు లేకపోతే ॥

(2) వరకీయ ః భర్త యున్నను పర పురుషులయందనురాగము గల్గినట్టి నాయిక.

ఉదా : ప.

అత్తవా రూరికి అంపేరు మావారు
అయ్యయో ఇక నేనేమి సేయుదునే
ఆను. కత్తి కోతగాడు మగడేమి జేసునో
పొత్తు మరువకుండు పోయివచ్చెదసామి ॥

(3) సామాన్య : ద్రవ్యార్జనమునకు పరపురుషుల యందు అనురాగము ప్రదర్శించునట్టిది.

ఉదా : ప.

పూసలోని దారమువలె
     యెంత చేసెనే నమ్మినందుకు
ఆ. ప. మోస మేమని యడిగితే
     తగని రోసమే వేణుగోపాలుడు
అటకమీద సరిగ చీరచాటుగ
     నా పె కిచ్చి సేవించు కొనెనట
కటకటా యితని పేరు దలచిన
     కాశియాత్ర పోయిన తీరదు.<?poem>

(1) ప్రోషిత భర్తృక : పతి దేశాంతర మందుండగా వేదన పడునట్టిది.

ఉదా : <poem>భామరో ! ఊరికి బయలు దేరెడి వేళ
ప్రేమమీర నాసామి పిలిచి చెప్పినమాట
ఏమని తెల్పుదు ఏలాగు తాళుదు
ఏమి సేతునే చెలియ ॥
"అన్నమందక అతి వెత నొందకు
కన్నీరు గార్చకు కలవరింపకు” మని
ఎన్నెన్నొ విధముల హితవుల దెల్పుచు
కన్నీరు గార్చుచు కాంతుడు చెప్పినమాట.

(2) వాసక సజ్జిక  : ప్రియుడు వచ్చుచున్నాడని తెలిసి, తా నలంకరించుకొని అనుభవయోగ్యములైన పదార్థము లను సిద్ధపరుచునట్టిది.

ఉదా :

అక్కట మరుపాయె నౌర మరేమాయె
అక్కర దెలిసి రావై తి వదేమాయె ॥
ఏడాది పండుగ నేడని యెంచి
యీ మేడ శృంగారించితి
జలకమ్ముల నాడి వల్వయు ధరించితి
కస్తూరిబొట్టు వాడిగా నొనరించితి
నాడునాటికి వేడుకల్ బల్పోడిమిగ సేయుదామని
యా వాడవాడల చేడె అంపిన
లేడు లేడని మరలివచ్చిరి ॥

(3) విరహోత్కంఠిత  : సంకేతస్థలంబునకు ప్రియుడు రాలేదని చింతించునది.

ఉదా :

సామిని రమ్మనవే సఖియరో
సామాన్య దొరగాడే ॥

(4) అభిసారిక : ప్రియుని గూర్చి తాను బోవునది లేక ప్రియుని తన యొద్దకు రప్పించుకొనునది.

ఉదా :

మగువ తన కేళికా మందిరము వెడలెను.
వగకాడ మాకంచి వరద తెల్లవారె ననుచు ॥

(5) విప్రలబ్ధ : ప్రియునిచే వంచింపబడి చింతించునట్టిది.

ఉదా :

కథితసమయే ౽పిహరి రహహ! నయ యౌవనం
మమ విఫలమిద మమలరూప మపి యౌవనం
యామి హే! క మిహశరణం.
సఖీజన వచన వంచితా ౽హమ్ |

(6) ఖండిత : అన్యస్త్రీ సంభోగ చిహ్నములు గల్గి ప్రాతః కాలమున ఇంటికి వచ్చిన నాయకుని జూచి కోపించు నాయిక.

ఉదా :

చల్లనాయెనా మనసు చల్లనాయెనా
చల్ల నాయె ప్రాణేశ స్వామి మువ్వగోపాలా,
వద్దికి రావేమోయి వాడిన ముఖమేడదోయి
నిద్దుర కన్ను రెప్పలపై నిండియున్న దేమోయి
అద్దపు చెక్కిలి నొక్కి ముద్దిడుకున్న దెవతోయి
దిద్దిన కస్తూరీబొట్టు చెదరెనేమో దెలుపవోయి.

(7) కలహాంతరిత : పతిని అవమానించి పిమ్మట పశ్చాత్తాపపడు నట్టిది.

ఉదా :

మోసమాయెనే నాబుద్ధికి మోసమాయెనే
మోసమాయె ఏమి సేతు మువ్వగోపాలుడు నేడు
మ్రొక్కి వేడిన రాడే ఓ చెలియరో.

అందరికి చల్లనైన ఆ చందమామ నాపాలిటి
కనలమాయె నయ్యో ! చెలియ !
ముందు నే నెవ్వరికి పొందెడ బాపితినో
అందుకు నే నీలా గై తినో ఓ చెలియరో.

(8) స్వాధీన పతిక : తన ఆజ్ఞల ననుసరించు పతిగల నాయిక.

ఉదా :

ఎందుదాచుకొందు నిన్ను నేమి సేతు నేను
అందమైన నీమోము అయ్యారే ముద్దు గుల్కుచున్నది.
ముదముతో నాముద్దు మువ్వగోపాలసామి
గుదిగొన్న తమకమున గూడి యిద్దరము
నిదురపరవశమున వదలునో కౌగిళ్ళు
పదిలముగ నాజడను పట్టి కట్టుకొందునా ?

పదార్థాభినయము, విశేషాభినయము : అభినయమందు ప్రతిమాటకు సరియగునట్టి అర్థమును స్ఫురింప జేయుచు హస్తములను పట్టుట పదార్థాభినయము.

ఉదా : 'గోవు'-నాట్యమందు 'గోవు'ను అభినయించు నప్పుడు 'సింహముఖ” హస్తమునుబట్టి దాని ఆకారమును అనగా గోవుయొక్క ముఖము, కొమ్ములను జూపుట.

విశేషాభినయము  : ఒకే విషయమును అనేక విధములుగా వర్ణించుట. ఉదా : 'కమలాక్షుడు"

(1) తామర రేకులవంటి కన్నులు గలవాడు.
(2) కెందమ్మి రేకులవంటి యెరుపుగలిగిన నేత్రములు గలవాడు.
(3) సూర్యోదయకాలమున సూర్యరశ్మి సోకినంతనే వికసించు కమలముల రేకులవంటి నేత్రములు గలవాడు.
(4) తామర పువ్వువలె వికసించిన నేత్రములు కలవాడు.
(5) భ్రమరముల నాకర్షించు కమలములవంటి నేత్రములు కలవాడు.

ఇట్లు 'కమలాక్షుడు' అను మాటకు అనేక విశేషణములు గల్పించి అభినయించుట విశేషాభినయము,

అభినయము గూర్చు విధము  : ఒక వదమును అభినయించునప్పుడుగాని, అభినయమును గూర్చు నప్పుడు గాని - ముందుగా ఆపదమును పూర్తిగా జదివి, అంధలి నాయికా నాయకు లెట్టివారో తెలిసికొనవలెను. అటుపై అందలి శృంగారమును గూర్చి, అవస్థాభేదములను గూర్చి, అలంకారములను గూర్చి, సంచారీ భావములను గూర్చి చక్కగా తెలిసికొని పిమ్మట అభినయము కల్పింపవలెను. భావములను కూర్చునప్పుడు పల్లవియందే పదములో నుండు అన్ని భావములు అన్వయమగునటుల చేయవలయును. పల్లవి, పదమునకు జీవము. అభినయమును గూర్చు విధము తెల్పుటకుగాను ఇట నొక పదము ఉదాహరణముగా నీయబడు చున్నది.

పదము  : ‘మంచిదినము నేడే | మహరాజుగ రమ్మనవే'

పదములోని భావము  : తన్ను విడనాడిన నాయకుడు మరల తనవద్దకు వచ్చుచున్నాడని దూతిక ద్వారమున ఎరిగిన నాయిక, విరహోత్కంఠితయై నాయకుని రమ్మని ప్రార్థించుచున్నది.

నాయిక  : స్వీయ. నాయకుడు  : శఠుడు. ఈర్ష్యామాన విప్రలంభ శృంగారము. సంచారులు  : శంక, వితర్కము, ఔత్సుక్యము, హర్షము, అమర్షము.

ఆనందభైరవి - త్రిపుట

ప.

మంచిదినము నేడే మహారాజుగా రమ్మనవే.
       ఔత్సుక్యము, హర్షము.
అను. పొంచిజూచు టేలే ? పొలతీ ? మువ్వగోపాలుడు.
శంక, వితర్కము - హర్షము, ఔత్సుక్యము.

అభినయవిధానము  : ఆంగిక ప్రధానమైనది.

"మంచిదినము నేడే మహరాజుగ రమ్మనవే”

1. నేడు మంచిదినము-- మహరాజు వలె రమ్మనవే.
2. నేడు మంచిదినము-- ఇప్పుడే రమ్మనవే.
3. నేడు మంచిదినము-- సర్వాలంకృతుడై రమ్మనవే.
4. నేడుమంచిదినము--నే నతని రాక కెదురుజూచు చున్నాను రమ్మనవే.

ఎట్లు? :

"నేను సర్వసిద్ధమైయున్నాను.
స్వామికి ఇష్టమైన విధమున అలంకరించుకొని యున్నాను.
అతనికొఱకు మంచిగంధము నూరియుంచితిని.
అతని కిష్టమైన అలంకారముల సిద్ధపరచియుంచితిని.
షడ్రసోపేతమైన భోజ్యములను సిద్ధపరచితిని.
కేళీగృహము నలంకరించి యుంచితిని.
హారతి పట్టుటకు అన్నియును సిద్ధపరచితిని.
స్వామి నడిచెడి బాటయందు పూవులబరుచుటకు పుష్పములను సిద్ధపరిచితిని.
వీనులకు విందుగొల్పు సంగీతము వినిపించుటకు శ్రుతి చేసి వీణను సిద్ధముగా నుంచితిని.
తలవాకిట స్వామికొరకు వేచియున్నాను.
5. మంచిదినము నేడే-- చల్లనిపిల్ల వాయువులు మెల్లన వీచుచున్నవి.
6. మంచిదినము నేడే--'ఝం'కార ధ్వనుల జేయుచు, తుమ్మెదలు, పూచిన మామిడి పూగుత్తులనుండి :మకరందమును గ్రోలుచున్నవి.
7. మంచిదినము నేడే-- కోకిలలు 'కుహూ' రవముల పంచమస్వరములో పలుకుచున్నవి.
8. మంచిదినమునేడే———చంద్రోదయమైనది.

ఇట్లు ఆయా భావములకు తగినట్లు హస్తములుపట్టి అభినయించుట ఆంగిక ప్రధానమైనట్టి అభినయమగును. ఇక సంచారుల నభినయించు తీరు :

(1) ఔత్సుక్యము (2) హర్షము (3) శంక (4) వితర్కము. ఔత్సుక్యమనగా ఉత్సాహము. తానభిలషించిన వస్తువు లభింపకముం దొక క్షణమైనను తాళజాలకపోవుటయే ఔత్సుక్యము. ‘ఔత్సుక్యము ' నకు అనుభావములు.

(1) సంతాపము (మన్మథతాపము), (2) మనశ్చింత,(3)నిట్టూర్పు, (4) ఎటకై నను పోబూనుట.

అభినయమందు చూపవలసిన భావములు  :

1. మనస్సు కాక జెందుట,
2. వేగముగ నడుచుట. (ఇది 1-వ సాత్త్విక భావము.అనగా “ స్తంభము')
3. నిశ్వాసములు ప్రదర్శించుట.
4. శరీరము భారమగుట. (4వ సాత్వికము - స్వర భేదము).
5. నిద్ర
6. చింతించుట. ( 7.వ సాత్త్వికము - అశ్రువులు. మొదలైనవి పట్టవలెను.)

ఇందు : - వేగముగ నడచుటయందు : 1వ సాత్విక భావము స్తంభమును పట్టవలసిన తీరు ఎట్లన స్తంభమనగా— కదలకుండుట లేక అనురాగముచే చలించకుండ నుండుట అని అర్ధము. ఇది పాదములందు బుట్టును. నాయిక 'వేగము' నభినయింపవలెను. గాని పాదములు మాత్రము ఉన్నస్థానమునుండి కదలుటలేదు. అట్టితరి శరీరమునందు వణకుబుట్టి శరీరము కంపించును. ఈ భావప్రదర్శనము వలన ఆవేగము, ఆతురత వెల్లడియగును. దీనివలన నాయిక మనస్సులోని ఆత్రము వెల్లడియగుచున్నది. ఇది పూర్తిగా సాత్త్విక ప్రధానమైనట్టి భావప్రకటనము గాన ఈ విధముగా పట్టబడును. ఆంగికమైనచో నాయిక వడివడిగా అడుగులు వేయుట ద్వారా మనస్సులోని ఆందోళన వెల్లడిజేయును. ఇదియే రెంటియందలి భేదము.

శరీరము భారమగుట  : ఇదు 4-వ సాత్విక భావము స్వర భేదము అభినయింపవలెనని తెలుపబడినది. అదెట్లన: స్వర భేదము_సుఖాదులచే గలుగునట్టిది. ఇందు డగ్గుత్తిక మొదలైనవి గల్గును. డగ్గుత్తిక అనగా గద్గద స్వరము. ఇది వాక్కునందు ప్రదర్శింపబడునట్టిది. శరీరము భారమగుటచే... నాయిక ఉచ్ఛ్వాస, నిశ్వాసములు ప్రదర్శించుచు మెల్లన కంఠమును మార్చి గానము చేయుటవలన ప్రదర్శించును.

అట్లే - ‘చింతించుట' యందు 7 వ సాత్వికము.

అశ్రువుల ప్రదర్శనము  : విచార మధికమై అశ్రువులు రాల్చుట, ఆనంద బాష్పములు రాల్చుట- అని రెండువిధములుగా 'అశ్రువుల'అభినయము ప్రదర్శింపబడును.

కన్నీరు విదుల్చుట, కనులు తుడుచుకొనుట -- వలన అభినయింపబడును.

ఇట్లే ప్రతి 'సంచారి' యును అభినయింపబడును. ఈ అభినయము సాత్విక ప్రధానమైన సంచారుల ప్రదర్శనము.

మన్మథ పంచబాణముల అభినయమును గూర్చి కొన్ని వివరములు  : నాయి కాభినయమందు నాలుగు బాణములు మాత్రమే వేసి ముగింతురు. అంతటితో అభినయము ముగియుచున్నది. భామాకలాపము, ఉషాపరిణయము, రుక్మాంగద మొదలైన భాగవతములందు నాలుగు బాణముల ప్రయోగము, అభినయము తరువాత . ఐదవబాణము ప్రయోగమునకు బదులుగా 'మూర్ఛపట్టు' అభినయింప బడుచున్నది. మరణము నిషేధము గాన ' మూర్ఛపట్టు'తో ముగించుచున్నారు. భాగవత నాటకాదు లందు నాయిక చెలికత్తెలు ఆమె యొద్దనే యుండుటచే, ఉప శాంతిని అభినయింతురు. భరతనాట్య ప్రదర్శనము నందు ఏక పాత్రాభినయమగుటచే అట్టి అవకాశము లేదు గనుకనే ‘నవమల్లిక' తో సమాప్త మగుచున్నది.

ఇదియే భారతీయ నృత్యకళకు తలమానికమైన రసాభినయము యొక్క సంక్షిప్తగాథ.

నెం. స.

[[వర్గం:]]