సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అబ్రహాము లింకన్

అబ్రహాము లింకన్  :- అమెరికా సంయక్త రాష్ట్రముల 16 వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రఖ్యాతులైన ప్రపంచ రాజకీయ వేత్తలలో ఒకడు. ఆతనియందు మహా పురుషుల కుండవలసిన ముఖ్య లక్షణములగు ధైర్యము, మేధ ప్రబలముగ ఉండెడివి. చక్కని సౌహార్ధ్రమునకు లక్షణము లగు, దయ, దాక్షిణ్యము, ఓర్పు, సానుభూతి అతనిలో మూర్తీభవించి ఉండెడివి. అతనికి కేవలము భౌతిక ధైర్యమేకాక అపారమగు నైతిక ధైర్యముకూడ కలదు. ఈ సద్గుణములు ఆతనిని అమెరికా ప్రజలందరికి ఆరాధ్య దైవముగ పరిణమింప చేసినవి.

అల్పసంఖ్యాకులైన ప్రజలుగల కెంటుకి రాష్ట్రములో జనసమ్మర్దములేని మారుమూలనున్న ఒక కొయ్య ఇంట్లో (log cabin) లింకను క్రీ.శ. 1809 సం. ఫిబ్రవరి 12 వ తారీఖున జన్మించెను. అతని తండ్రి థామస్ లింకను. అతడు నిరక్షరాస్యుడు. అతడు పురోగమనాభిలాష లేని ఒక సామాన్యుడు. అతని సంపాదనతో కుటుంబము యొక్క భుక్తిమాత్రము ఏదో విధముగా గడిచిపోయేడిది. లింకనుతల్లి నాన్సీ హేంక్స లింకను మంచి నమ్రతయు మతములో చాల అభిరతియు కలిగిన వ్యక్తి. అబ్రహాము మీద ఆమె ప్రభావము చాల విశేషముగ ఉండేడిది. అబ్రహాము తన అభివృద్ధి కంతటికిని తన తల్లియే కారణభూతురాలని సగర్వముగా చెప్పుకొనెడివాడు.

లింకను తొమ్మిది సంవత్సరములు పాఠశాలకు పోయి చదివినప్పటికిని, ఒక్క పట్టున వరుసగ ఏడాది కాలమైనను చదివినట్లు కనపడదు. అయినను అతడు స్వయముగానే విద్యను అభ్యసించెను. అతనికి పలక బలపము మొదలయిన సాధనములు దొరకకపోవుటవలన ఒక బొగ్గు ముక్కతో కఱ్ఱపలక మీద వ్రాసికొనెడి వాడట! అందువలననే కాబోలు అతనికి పుస్తకములమీద చాల ప్రేమ ఉండెడిది. తండ్రికి పనిపాటలలో సహాయపడుచు కొంచెము అవకాశము చిక్కించుకొని అతడు దొరకినపుస్తకములనన్నిటిని చదివెడి వాడు. ఈ పుస్తకములను సంపాదించుటకు అతడు చాల. దూరము నడిచిపోవలసి వచ్చెడిది. ఈ విధముగ తన ఇంటికి చుట్టుప్రక్కల 50 మైళ్ళ దూరములో లభింపగల ప్రతి పుస్తకమును అతడు చదివెను.

ఒకసారి క్రీ. శ. 1829 వ సం. లో న్యూ ఆర్లియన్సు పోవుచు నీగ్రో బానిసలను కొయ్యలకు గొలుసులతో బంధించి పశువులను అమ్మినట్లు అమ్ముట అబ్రహాము చూచెను, దీనితో అతని మనసు కరగిపోయి సాధ్యమైనంత త్వరలో నీగ్రోల బానిసత్వమును నిర్మూలింపవలెనని అతడు

నిశ్చయించుకొనెను. ఈ యుదారమైన ఆశయము సఫల మగుననియు ఆవిధమున తనకు శాశ్వతమగు కీర్తి లభించు ననియు అతడు అప్పుడు అనుకొనియుండడు.

క్రీ. శ. 1832 వ సం. లో లింకను ఇలినాయిస్ రాష్ట్ర శాసన సభకు అభ్యర్థిగా నిలబడి ఎన్నికలలో ఓడిపోయెను. రెండు సంవత్సరముల తరువాత తిరిగి పోటీ చేసి ఆతడు విజయమును కాంచెను. ఆతరువాత మరి మూడు పర్యాయములు వరుసగా శాసనసభా సభ్యుడుగా ఎన్నుకోనబడెను. ఈ సభలో అతని రాజకీయ సామర్థ్యము వ్యక్తమయ్యెను. ఈ కాలములో ఆతడు నిరంతరముగా కృషిచేసి తన రాష్ట్రమునకు రోడ్లు, రైలు మార్గములు, జలమార్గములు, మొదలైన సౌకర్యములు కల్పించెను. ఈ కాలములోనే న్యాయవాద వృత్తిని అవలంబించి ధర్మ బద్ధములైన వ్యవహారములలోనే సంబంధము కలిగించుకొని ఆ వృత్తికి ఒక గొప్పతనమును కల్పించెను. ఒకసారి ఒక వ్యవహారములో పనిచేయుచు అది సక్రమమైనది కాదని తెలియగానే మధ్యలోనే దానిని వదలుకొనెను.

లింకను యొక్క వివాహము మేరీ టాడ్ అను నామెతో 1842 వ సం. లో జరిగెను. ఈ వివాహ సందర్భములో లింకనుకు స్టీఫెన్ డగ్లసు అనే ఆయనతో పోటీ ఏర్పడెను. పెండ్లిలో పోటీ చేసిన డగ్లసు తరువాత అమెరికా అధ్యక్ష పదవికి కూడ లింకనుతో పోటీ చేసెను. కొంతకాలమునకు లింకను అమెరికా కాంగ్రెసులో శాఖ అయిన ప్రజా ప్రతినిధి సభకు ఎన్నుకో బడెను. ఆ సమయములో నీగ్రో బానిసత్వ సమస్య తీవ్రరూపమును ధరించియుండెను. ఈ పరిస్థితిలో “బానిసత్వమే తప్పు కాకపోయినచో, ఇక తప్పు అనునది లేనేలేదు" అని ఘోషించి అప్పుడే అభివృద్ధిలోనికి వచ్చుచున్న అమెరికాలోని పశ్చిమ ప్రాంతములకు ఈ బానిసత్వము వ్యాపించకుండ చేయుటకును, కొలంబియా ప్రాంతములోని బానిసలకు విముక్తిని కలిగించుటకును అతడు చాల ప్రయత్నము చేసెను. తరువాత జరిగిన కాంగ్రెసు ఎన్నికలో ఓడిపోయి లింకను తిరిగి న్యాయవాది వృత్తి సాగించెను. 1858 సంవత్సరములో ఆతడు రాష్ట్ర సభకు (Senate) డగ్లసునకు ప్రత్యర్థిగా నియోగింపబడెను. ఈ సందర్భములో జరిగిన ఎన్నికల యాత్రలో లింకను “ఏ మానవునికిని మరియొక మానవునిపై అధికారము నెరపుటకు హక్కులేదు, కాని సత్వము అక్రమము. దానిని నిర్మూలించుట అత్యవస రము. సగము స్వతంత్రముగాను, సగము అస్వతంత్రము గాను ఉన్న అమెరికా ప్రభుత్వము చిరకాలము మన జాలదు." అని అన్ని చోట్ల ప్రచారము చేసెను. తుదకు ఎన్నికలో ఓడిపోయినను అతనికి గొప్ప వక్త అనియు, మానవ స్వాతంత్య్ర సంరక్షకుదనియు దేశమునం దంతటను పేరు వచ్చెను.

1860 సం. లొ అబ్రహాం లింకను అమెరికా సంయు క్త రాష్ట్రములకు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను, ఇంతలో బానిసత్వములేని ఉత్తర రాష్ట్రములకును బానిసత్వమును అమలుపరుచు దక్షిణ రాష్ట్రములకును వైషమ్యము ప్రబలి, దక్షిణ రాష్ట్రములు సమాఖ్యనుండి వైదొలగి ఒక ప్రత్యేక సమాఖ్యగా ఏర్పడెను. ఈ సమాఖ్యవారు జెఫరసన్ డేవిస్ యొక్క అధ్యక్షత క్రింద 1861' వ సంవత్సరములో ఉత్తర రాష్ట్రములతో యుద్ధము ప్రారంభించిరి. ఈ యుద్ధము నాలుగు సంవత్సరములపాటు సాగినది. యుద్ధమున మొదట ఉత్తర రాష్ట్రములకు ఓటమి సంభవించుచు వచ్చెను. యుద్దము జరుగుచుండగనే దక్షిణ రాష్ట్రములనుండి ఉత్తర రాష్ట్రములకు పారిపోయివచ్చిన నీగ్రో బానిసలకు స్వాతంత్య్ర మొసంగుచు అమెరికా కాంగ్రెసు ఒక శాసనము చేసెను. 1863 జనవరిలో లింకను 40 లక్షల మంది నీగ్రోబానిసలకు శాశ్వతముగ స్వాతంత్య్ర మొసగు ప్రకటన మొకటి కావించెను. 1864 వ సంత్సరములో లింకను రెండవసారి అధ్యక్షుపదవికి ఎన్నుకొనబడెను. మరుసటి సంవత్సరము జనవరిలో అమెరికా సంయుక్తరాష్ట్రములో ఎచ్చటను కూడ బానిసత్వము ఉండరాదు అను సవరణ ఒకటి రాష్ట్ర పరిపాలనా ప్రణాళికలో చేర్చబడెను. ఈ విధముగ లింకను యొక్క చిరకాల వాంఛిత మీడేరెను. కాని ఈ విముక్తి నొందిన బానిసల పురోభివృద్ధిని చూచు భాగ్యము మాత్రము లింకనుకు లభింపలేదు. 1865 వ సంవత్సరము ఏప్రిల్ నెల 14 వ తారీఖు రాత్రి సకుటుంబముగా ఫోర్డు థియేటరులో, ఒక నాటకమును చూచుచుండగా ఒక దుష్టుడు తుపాకి పేల్చి లింకనును హత్యచేసెను. అమెరికాలో జన్మించిన మహనీయులలో ఒకడును, నిమ్న మానవోద్ధారకులలో అగ్రగణ్యుడును అయిన అబ్రహాము లింకను ఈ విధముగ కీర్తి శేషుడయ్యెను.

ఆర్. న. రావు.

[[వర్గం:]]