సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అపభ్రంశము
అపభ్రంశము :- మనకు తెలిసినంత వరకు అపభ్రంశ శబ్దమును ప్రయోగించిన ప్రాచీనుడు భగవంతుడైన పతంజలియే (భూయాంసోఽ పశబ్దాః అల్పియాంస శ్శబ్దాః, ఏకైకస్యహి శబ్దస్య బహవో ఽపభ్రంశాః. తద్యథా- గౌరిత్య స్య శబ్దన్య గావీ గోణి గోశా గో పోతలికా 'ఇత్యేవ మాదయో అపభ్రంశాః' - మహా భాష్యము), ఆ సందర్భముననే 'అపశబ్ద'మనెడు మాటయు నాతడు వాడినాడు. అనగా, అతని దృష్టిలో ఈ రెండును పర్యాయపదము అన్నమాట. మహాభాష్య కాలము నాటికి “అపభ్రంశము" ఒక భాషగా తయారైనదని చెప్ప వీలులేదు. సంస్కృత భిన్నములైన పదముల నన్నిటిని అపభ్రంశములని భాష్యకారులు తలచినట్లు మన మూహింపవచ్చును. కనుకనే సంస్కృత భిన్నములన్నియు అపశబ్దములే అని దండి అనెను. (శాస్త్రేతు సంస్కృతా దన్య దపభ్రంశతయోదితం కావ్యాదర్శము) పతంజలి 'గో' శబ్దమున కొసగిన రూపాంతరములు ప్రాకృత భాషలలో-ముఖ్యముగ 'మహారాష్ట్రి'లో కనబడుచున్నవి. శ్వేతాంబరులు భాషయైన యర్ధమాగధిలో గూడ ఈ ప్రయోగములున్నవి. సంస్కృతేతరముల నన్నిటిని కలిపి అపభ్రంశములనుటలోనే. ఆనాటివారికి- సంస్కృతము పై నున్న అభిమానమును ఇతరములపై నున్న అసమ్మతియు స్పష్టమగును.
ప్రాకృతములు అనుమాటతో ప్రాచీనులు వేటిని వేరు పరచిరో చెప్పుట చాల కష్టము, అట్లే, అపభ్రంశ శబ్దమునకును వారొసగిన వ్యాఖ్యలు ఒక తీరుగలేవు. (ప్రాకృత మేవాఽపభ్రంశః అని రుద్రటుడు అనెను.) నాట్య శాస్త్రకారుడు సప్తభాషలను విభాగించెను. (మాగధ్య వంతి జా ప్రాచ్యా శూర సేవ్యర్ధ మాగధీ, వాహ్లి కాదాక్షి ణా త్యాశ్చ సప్తభాషా ః ప్రకీర్తితాః - నాట్యశాస్త్రే) వాటిలో ఆయన అపభ్రంశమును జేర్చియుండలేదు. కాని అర్ధ మాగధిని మాత్రము చేర్చియున్నాడు. (చేటీనాం రాజ పుత్రాణాం శ్రేష్ఠీనాం చార్ధ మాగధీ) భరతుని నాట్య శాస్త్రమందు అపభ్రంశ శబ్దప్రయోగమున్నది. ఆతడు దీనిని 'విభ్రష్ట' మనెను. 'ఆభీర భాష' యని పల్కెను. దండియు భరతుని మతమునే అనుసరించి, కావ్యము నందలి అభీరాది భాషలు అపభ్రంశములని పలికెను. (ఆఖిరాదిగిరః కావ్యే స్వపభ్రంశ ఇతీరితాః - కావ్యా దర్శము) ఈ అభిరాది భాషలేవో ? 'ప్రాకృత లక్షణము, నందు భాషలు ఆరనిచెప్పబడినది. (సంస్కృతం ప్రాకృతం చైవాఽపభ్రంశః పిశాచిని, మాగధీ శారసైనీచ షడ్భా షాశ్చ ప్రకీ ర్తితాః - ప్రాకృత లక్షణే )వాటిలో అపభ్రంశమునకును స్థానమబ్బెను. కాని అర్ధమాగధి, చూశిక మొదలైనవాటిని అత డెగురగొట్టెను. భరతుని లక్షణములో చోటు దొరకిన అర్ధమాగధికి, ఇందులో పురస్కృతి కలుగలేదు. కొందరు ప్రాకృతములు పదునెనిమిది అనిరి. కువలయమాలా కథాకారుడైన ఉద్యోతనుడు పదునెనిమిది ప్రాకృతములను చూచాయగా చూపుటకు ప్రయత్నించెను. నాటి ఆంధ్ర దేశమునందును గర్ణాటకము నందును దేశ భేదము లుండెనట. ఇంత లెక్క బెట్టినను, ఆ భాషలు ముగిసినవికావు. అందుకే ఆతడ 'పారిస బర్బరాదులు' అని ఆది శబ్దము యొక్క మరుగు జొచ్చెను. మృచ్ఛకటిక- ముద్రారాక్షసకారులు కూడ ఉద్యోతనుని అభిప్రాయమునే అంగీకరించినట్లున్నది. (బహువిధ దేశ వేష భాషాచార సంచారవేదినో, నానా వ్యంజనాః ప్రణీధయః. ముద్రారాక్షసే)
భరతుడు అపభ్రంశమునకు కొన్ని ఉదాహరణము లిచ్చెను. వీటికి పోలికలు అపభ్రంశ వ్యాకరణములలో నున్నవి. ఈ భాష యొక్క ప్రకృతి ప్రత్యయ విభాగ నియమములు కొన్ని శాసన కాలికములైన బౌద్ధ ప్రాకృతములలో కలవు. కొన్ని అపభ్రంశ రూపములు ప్రాచీనులైన 'విమలసూరి' 'సౌమ చరియ' (క్రీ. శ. 1300) లో కనపడును. అవి పాలిభాషలో గూడ నున్నవి. అనగా క్రీ. శ. 300 నాటికే అపభ్రంశము వాడుక భాషగా నుండియుండును. భరతుడు దీనిని అనాగరక భాషయనియు, గొల్లల పలుకుబడి అనియు అవహేళన జేసెను. ఆయన శాబరికిని, అపభ్రంశమునకును, భేదమంతగా గమనించి నట్లు లేదు. కాని, ద్రావిడికన్న ఇది భిన్నమనెను. తరువాత మూడు శతాబ్దులకు అనగా భామహుని నాటి కిది కావ్యభాష అయ్యెనని ఊహింపవచ్చును. వలభిరాజగు ధారాసేనుడు మహా ప్రసిద్ధుడు. (" సంస్కృత ప్రాకృతాఽపభ్రంశ భాషాత్రయ ప్రతిబద్ధ ప్రబంధ రచనా నిపుణ తరాంతః కరణః') అతడొక వైయాకరణుడు (క్రీ. శ. 600). చండుడు గూడ వ్యాకరణ కర్తయే. వీరుఇరువురును అపభ్రంశమును ఒక భిన్న భాషగా గమనించిరి. ఈగమనింపుగూడ భామహుని నాటికి ఇది కావ్యభాషయను నిర్ణయమునే బలపరచును. మరి రెండు శతాబ్దములకు ఉద్యోతనుడు తన "కువలయ మాల" యందు అపభ్రంశ భాగములు కొన్ని వ్రాసెను. అనగా అప్పటికి అపభ్రంశములో సంస్కృత ప్రాకృతములు చేరి —— ఆ భాషకు కావ్యత్వమును కల్పించిన వన్నమాట. అపభ్రంశము మనో హరమని ఉద్యోతనుని అభిప్రాయము. కొందరు ప్రాకృత వైయాకరణులు సంస్కృతము దేవభాష అనెడు వాదముపై దండెత్తిరి. శ్వేతాంబరులు అర్ధమాగధీ దేవభాష యనిరి. అర్ధమాగధి రానివాడు ఆర్యుడేకాడట! కొందరు మాగధీ భాషయే, నికరముగ, దేవతలు భాషించునదని చెప్పిరి. పాలి దేవభాషయన్న వారును లేకపోలేదు. శివానుచరులు పైశాచిని భాషింతురని యొక వాదము. వీరి గడబిడలో అపభ్రంశముగూడ దేవభాషయై కూర్చున్నది. పైవారందరును సంస్కృతమును ద్వేషించినవారే. కువలయమాలా కథాకారుడు, సంస్కృతము “దుర్జన హృదయము వంటిది" అని (దుర్జన హృదయ మివ విషమం) నిస్సంకోచముగ వచించెను.
తొమ్మిదవశతాబ్దిలో రుద్రటుడు అపభ్రంశమనుట- కొన్ని భాషలకు సామూహికమైన పేరు 'షష్థొఽత్ర భూరి భేదో భూరివి శేషాదపభ్రంశః (2-12) అనెను. రాజ శేఖర మహాకవి పదవశతాబ్దివాడు. ఆయన దానికి సంస్కృత ప్రాకృతములతో సమానమైన గౌరవ మొసగెను. (శ్లో. గిరశ్శ్ర వ్యాది వ్యాః ప్రకృతి మధురాః ప్రాకృత ధురః | సుభవ్యోఽ పభ్రంశస్సరస రచనం భూతవచనం- రాజ శేఖరుని బాలరామాయణము). 'సరస్వతీ కంఠా భరణ ' కర్తయగు భోజుడును, దశరూపక కర్తయగు ధనంజయుడును ఇచ్చిన ఉదాహరణములను జూచినప్పుడు అపభ్రంశమందు అప్పటికే పెద్ద సాహితి యున్నట్లు తోచును. అందుచే రాజ శేఖరుడు న్యాయమే చేసినాడని పించును.
పురుషో త్తము డొక బౌద్ధప్రాకృతమైయాకరణుడు. అతడు తూర్పుదేశపు వాడు. ఆతని నాటికే అపభ్రంశము శిష్టభాష. అతడా భాషకు కొన్ని లక్షణములను వచించెను. తాను చెప్పక వదలినవి శిష్ట ప్రయోగముతో ఊహించికొనవలేననెను. (శేషం శిష్ట ప్రయోగాత్). నిమిసాధువు రుద్రటుని కావ్యాలం కారము పై వ్యాఖ్యానించుచు, కొన్ని సూత్రములను ఒకానొక ప్రాకృత వ్యాకరణము నుండి ఉదాహరించెను. ఆ వ్యాకరణము పేరేమో నిమిసాధువు చెప్ప లేదు. కాని ఆ ఉదాహరణములను చూచినపుడు అపభ్రంశములో చాలమట్టుకు తూర్పునాట వ్యవహారములో నున్న మహారాష్ట్ర చేరియుండును అనిపించును. నిమిసాధు వొసగిన వ్యాకరణమునే హేమచంద్రుడు విపులీకరించి ద్రాసె నేమో ! నిమి సాధువు "అపభ్రంశమందు ' చాలమట్టుకు శౌర సేని మాగధి అను రెండు భాషలలక్షణములు చేరియుండును" అనెను. ఆనాడు “శౌర సేని” “మాగధి” లేక “మహారాష్ట్రి” అను నీరెంటి కలయికతో అపభ్రంశము రూపొందుచుండెనేమో! లేక, ఆ భాషలకు పరస్పర వినిమయమైన నుండి యుండును. నిమిసాధువు ఈ భాషల కన్నిటికిని ప్రాకృతము అనునది సామాన్య నామ మనెను. ( పాణిన్యాది వ్యాకరణోదిత శబ్ద లక్షణేన సంస్కరణాచ్చ సంస్కృత ముచ్యతే | తథా ప్రాకృత భాషైవ కించిద్విశేష లక్షణాత్ మాగధికా భణ్యతే | తథా ప్రాకృత మేవ కించి ద్వి శేషాత్పై శాచికం | శౌర సేన్యపి ప్రాకృత భాషైన, తథా ప్రాకృతమేవాఽ పభ్రంశః-నిమిసాధు కృత కావ్యాలంకార టిప్పణి). అపభ్రంశమునకు ఒక ప్రత్యేకత నంగీకరించినట్టి ఉదారులలో దండిగూడ నొక్కడు. (శబ్దార్ధౌ సహితం కావ్యం గద్యం పద్యం చ తద్ద్విధా | సంస్కృతం ప్రాకృతం చాన్య దవ భ్రంశ ఇతి త్రిధా - కావ్యాదర్శము). . మమ్మటుడు, వాగ్భటుడు, రామచంద్రుడు, గుణచంద్రుడు, కావ్యకల్ప లతావృత్తికారుడు, అమరచంద్రుడు మొదలగు వైయాకరణులందరు అధునాతనులు, ఈ వైయాకరణులు అపభ్రంశము అన్ని ప్రాంతము లందును సమానమైన గౌరవముగల భాష అనిరి. ఈ వైయాకరణులందరును అపభ్రంశ శబ్దమునకు “అన్ని దేశములందున్న వ్యావహారికము" అని అర్ధము చేసుకొన్నట్లున్నది. ఈ అభిప్రాయమునే వాగ్భటుడు "అపభ్రంశస్తు యచ్ఛుద్ధం తత్తద్దే శేషు భాషితం.” (2-3) అని స్పష్టముగ అనెను. ఇట్లే విష్ణుధర్మోత్తర కారుడు కూడ అది అనంతమనెను. (అపభ్రంశం తృతీయంచ తద సంతం నరాధిప ! దేశ భాషా విశేషేణ తస్యాంతో నేహ విద్యతే). హేమచంద్రుని నాటికి అది సంస్కృత ప్రాకృతముల వలె సాహిత్య భాషగా పరిణమించెను. అందుచేత దానినాతడు వ్యావహారికము కంటె వేరు అనెను. హేమచంద్రుని తరువాతి వైయాకరణులు. ఆభాషా స్వరూప నిరూపణములో చాల తారుమారు పడిరి. అట్లే ఈ భాష ప్రచారముననున్న ప్రాంతమును గురించియు, వారికొక నిలుకడయైన నిర్ణయములేదు. దాక్షిణాత్య దేశములందు కొన్ని భాగములలో ప్రచారమున నున్న భాష ‘అపభ్రంశ” మని వారియూహ. ఇక త్రివిక్రముడు సింహరాజు, రామచంద్రుడు మొదలైనవారికి కేవల సాహిత్యదృష్టి. అందుచే వారి అభిప్రాయములు ఈ విషయమున అంతగా ప్రమాణము లనుటకు వీలులేదు. పాణిని సాధించిన రూపములకంటే భిన్నములైన వన్నియు అపభ్రంశములుగా వారు వ్యవహరించిరి. “సకల జగజ్జంతూనాం వ్యాకరణాదిభి రనాహత సంస్థా రస్సహజో వచన వ్యాపారః ప్రకృతిః, తత్ప్రభవం, సైవవా ప్రాకృతం" (నిమిసాధు) —
మూడవ శతాబ్దినాటికి అపభ్రంశము విభ్రష్టభాష. ఆరవ శతాబ్దినాటి కది ఆభీరభాష. అప్పటికి దానికి 'అవహంస-అవహట్ట' అను పదములు పర్యాయములుగ నుండెడివి. ఆ నాటికే- దానిని కొందరు సాహితీ భాషగా నంగీకరించిరి. ఇది యొక్క "ప్రాంతీయభాష”' అని వారి అభిప్రాయము. ఈ వాదమునకు నాంది యొనర్చినది 'చండు' డను వైయాకరణుడు. వలభిరాజగు ధారా నేనుని తామ్రశాసనము ఈ భాషలో మొదటిది. క్రీ. శ.1100 వరకు అది శిష్టభాషగా నుండెను. పండ్రెండవ శతాబ్దియందు-గ్రామ్య భాషకంటే ఇది భిన్నమై-సాహితీ భాషగా పరిణమించెను. ఈ కాలము "అపభ్రంశ” భాషకు వసంతము.
తొమ్మిదవ శతాబ్దినుండి అపభ్రంశ శబ్దమును ప్రాంతీయ భాషలకు వాడుచు వచ్చిరిగదా ! అట్లే “దేశి”, “దేశ్య”, “దేశిమత" "దేశీ ప్రసిద్ధ" ఇత్యాది శబ్దములను కూడ వ్యావహారికముల నుద్దేశించియే వాడిరి. మరి "అపభ్రంశము” వీటికన్న భిన్నమా? లేక -వాటిలో చేరినదేనా ? భరతాచార్యుడు దేశ భాషా శబ్దమును- “అపభ్రంశ”మును కొంచెము తక్కువగ జూచినను దానిని ప్రాకృతములకు అన్నిటికిని సామాన్య నామముగ వాడెను. ఆయన దేశిమతశబ్దములకు ఉదా హరణము లేవియు నియ్యలేదు. తరువాత పాదలి ప్తుడు. *దేశివయన' శబ్దముతో అపభ్రంశమునుగాక మహారాష్ట్రిని నిర్దేశించెను. చండుడు దేశీప్రసిద్ధ శబ్దమును-సంస్కృత ప్రాకృతభిన్నముల నన్నిటిని తెలుపుటకై ఉపయోగించెను. అంతేకాని ఒక నిర్దిష్టమైన వ్యావహారిక భాషను సూచించుటకు కాదు. అపభ్రంశ కవులు మాత్రము తొమ్మిదవ శతాబ్దినుండి “దేశి” పదమును తమ గ్రంథములలో నుపయోగించిరి. కామశాస్త్ర కర్తయైన వాత్స్యా యనుడును - దేశిశబ్దముతో ప్రాకృతముల నన్నిటిని నిర్దేశించెను, “సుర తే కర్ణ మూలేషు యచ్చదేశీయ భాషయా। దంపత్యోర్జల్పితం మందం, మన్మనంతం విదుర్బుధాః కామసూత్ర)"- కువలయ మాలాకర్తయైన ఉద్యోతనుడు కూడ ఈ యభిప్రాయమును వాడెను. రుద్రటుడు ప్రకృతి ప్రత్యయమూలమైన వ్యుత్పత్తిలేని శబ్దములు దేశీపదము లనెను హేమచంద్రుడును ఈ అభిప్రాయమునే ఆమ్రేడించెను, శబ్దముల విషయమం దెట్లున్నను - భాషనుద్దేశించి నపుడు మాత్రము. దేశిశబ్దము ప్రాకృత సామాన్య వాచకమనుటయే చాలమందికి సమ్మతమైన అభిప్రాయము, "పడమటి నాట” మాటలాడు అపభ్రంశములో ఎక్కువగ శౌరసేని చేరును. దాక్షిణాత్యమైన అపభ్రంశము గుజరాతు - రాజస్థానీ భాషలకు మూలము. మృచ్ఛకటికములోని శకారుడు "శకారి" యను నొక భాషాభేదమును సూచించెను. ఇది అపభ్రంశ భాషయొక్క చిరుకొమ్మయే కావచ్చును.
అపభ్రంశములో ప్రసిద్ధములైన కావ్యములు అనేకములు కలవు. కాన, శరహులను కవులు క్రోడీకరించిన 'దోహాకోశము' తొట్ట తొలుతటి అపభ్రంశ కావ్యము. కనకామరుని 'కరికండ చరివు' 'సోమప్రభుని' 'కుమార పాలప్రతిబోధ”, “రామసింహు”ని "పాహుడ దోహ" మొదలైనవి - రమణీయములైన మరికొన్ని కావ్యములు. ఇంకను అనర్హములైన రచనలెన్నో యున్నవి. ప్రాకృతకవులకు భావనూత్నత ప్రధానమైన గుణము.
అపభ్రంశము ముఖ్యముగ దిగంబర జైనుల భాష. శ్వేతాంబరులు గూడ కొద్దికొద్దిగ దీని నుపయోగించిరి. దిగంబర జైనుల సాహిత్య మంతయు ఇంచుమించుగా అపభ్రంశమే. "సనత్కుమార చరియ" "పరమప్పయ అనునవి (క్రీ. శ. 600) ఈ భాషలలో గల వేదాంత బోధకములయిన ప్రాచీనగ్రంథములు. “పరమవ్పయా” అను గ్రంథమును వ్రాసినవాడు "జోయిందుడు”. హేమచంద్రుడు కుమారపాల ప్రతిబోధను కొంత సంస్కృతమునను- కొంత ప్రాకృతమునను వ్రాసెను. లక్షణగని వ్రాసిన సపాసనాచరియమున (క్రీ. శ. 1143) అరువది యెనిమిది అపభ్రంశగాథలు గలవు. శ్రీచంద్రుడు కథాకోశమును వ్రాసెను. దానిలో 537 అపభ్రంశ గాథలున్నవి. హేమవిజయుడు (క్రీ.శ. 1600) కథారత్నాకరమును రచించెను. అందులో 258 గాథలు గలవు. వాటిలో కొన్ని ప్రాచీనహిందీ- గుజరాతీ భాషలలో కూడ నున్నవి. అపభ్రంశము ముఖ్యముగ పడమటి నాట పెరిగిన భాష. కావ్యమీమాంస యందు యాయా వరరాజ శేఖరుడు ఒక రాజదర్బారు నేర్పాటు చేసెను. అతనికి స్వయముగ ప్రాకృతాభిమానము కలదు.రాజునకు తూర్పుదిక్కున ప్రాకృతకవులు గూర్చుండ వలెనట ! అపభ్రంశకవులకు పశ్చిమదిశను నిర్ణయించెను. భూత భాషాకవులు దక్షిణదిశయందు ఆసీనులు కావలెను.(“తస్యాం రాజాసనం; తస్యచోత్తరత స్సంస్కృత కవయోని విశేరన్, పూర్వేణ ప్రాకృతాః కవయః పశ్చిమే నాఽపభ్రంశినః. కవయః; దక్షిణతో భూత భాషా కవయ స్తతః పరం భుజంగ గణికాః" - కావ్య మీమాంస) ఈ వర్ణనమును జూచినప్పుడు కవిచే నిర్దేశింపబడిన దిక్కులు కేవలము ఏదో యొకటి చెప్పవలెనని చెప్పినవి గావనియు ఆయా భాషలకు ఆయా దిక్కులందలి ప్రాధాన్యమును బట్టి నిర్దేశింపబడె ననియు స్పష్టమగును. ఆనాటి భారత దేశము యొక్క పూర్వదిక్కున నున్న బౌద్ధులు గూడ కొందరు-అపభ్రంశమును వాడినట్లున్నది. సమ్మితీయులు అపభ్రంశమును-మహా సాంఘికులు ప్రాకృతమును- స్థవిరవాదులు పైశాచిని, ముఖ్యముగ గ్రహించి రని వినీతిదేవుని అభిప్రాయము. విక్రమోర్వశీయము నందు కాళిదాసు పురూరవునిచే కొన్ని అపభ్రంశ "చర్చిక" లు పాడించెను. ఈ భాష, పేరునకు అపభ్రంశమే గాని - ఆ వాఙ్మయములోని తీపి ఈ రచనములకు అంటినది కాదు. పురూరవుడు తీవ్రవిరహమున పిచ్చివాడై నప్పుడు హఠాత్తుగ అపభ్రంశములోనికి దిగును. ఇవి కాళిదాసు వ్రాతలు కావనియు. తరువాత నెవరో కొందరు ఆ నాటకమున వాటిని చేర్చిరనియు కొందరు విమర్శకుల వాదము. ఈ విమర్శన మెట్లున్నను, విక్రమోర్వశీయమునందు అపభ్రంశ చర్చలను వాడుటనుబట్టి - పూర్వకాలమున ఈ భాష, ప్రధానముగ సంగీతమునకు ఉపయోగింప బడుచుండె నని మరికొంద రండురు.. ఇది కొంతవరకు నిజమే కావచ్చును. ఇతర నాటకము లందును నటి 'మొదలైన పాత్రలు గానావసరములందు ప్రాకృతమును వాడుచుండుట మన మెరిగినదే.
కువలయ మాలా కారుడు అపభ్రంశము “సంస్కృత ప్రాకృత - ఉభయ శుద్ధాశుద్ధపదసమతరంగ రంగదవల్గు” వన్నాడు. ఆ భాష "నవప్రావృడ్జలద ప్రవాహ పరిప్లావితగిరి నదీసదృశముగ” సమవిషమమైనదట. "ప్రణయ కుపిత ప్రియ ప్రణయినీ సముల్లాప సదృశ "మట! కాని, పైశాచి అంతకంటెను మధురమైనదని అతని యూహ.
'ఛవిసత్తకహొ' అనునది అపూర్వమైన కావ్యము. దీనిని “జకోబీ” మహాశయుడు క్రీ. శ. 1918 లో తొట్ట తొలుత ప్రకటించెను. ఇది సాహిత్యమున కాతడు చేసిన గొప్ప సేవ.
పుష్పదంతుడు అపభ్రంశ కవులలో రత్నమువంటి వాడు. అతని పేరెంత సుందరమో పలుకు కూడ నంత సుందరమే. 'మహా పురాణము' 'ణాయకుమార చరివు' 'జసహర చరివు' అనునవి ఈతడు రచించిన గ్రంథములు. ఈ మూటి యందును బోధింపబడినది జైనధర్మమే. కాని ఆ ధర్మమును బోధించుటకు అత డెన్నుకొన్న పద్ధతి చాల మనోహరమైనది. ఆయన వాడిన వృత్తములు ప్రజా జీవితముల నుండి ఏరికొన్నవి. ఆ ఛందస్సునకు పేరులు కూడ మన మీనా డెరుగము. పుష్పదంతుని కావ్యములు చదువునప్పుడు పచ్చని చేలనడుమ, సువాసితములై నతోటల నడుమ నడచిపోయినట్లుండును. ఆ కవులకు ప్రజాజీవితమే జీవగఱ్ఱ, వారెంత యుత్ప్రేక్షించినను ఆ యలంకారములు సామాన్య ప్రజల హృదయములలో తోచు నుత్ప్రేక్షలే. నేలవిడిచిన సాము వారెన్నడును చేయరు. క్లిష్టములైన విపరీత కల్పనలు, స్వభావముతో సంబంధములేని ఊహలు సంస్కృత కవులకే చెల్లినవి. పుష్పదంతుడు చెప్పిన మారి దేవళము, పోతులరాజు, బలులొసగుట- ఇట్టి దృశ్యములను నేటికిని మనము పల్లెలలో చూడవచ్చును. ప్రాకృత కావ్యము వ్రాయగలవానికిని, దానిని చదువగలవానికిని కూడ ఆకవులు నమస్కారము పెట్టినారు. ఈ ఇరువురి అదృష్ట మంత గొప్పదట! కుంద ప్రసూనములను మాలగా గ్రుచ్చుటకును, కుపితయైన ప్రియురాలి నోదార్చుటకును, ప్రాకృత కావ్యమును చదువుటకును తెలిసిన అదృష్టవంతులు కొందరే అని 'వజ్ఞలగ్గ' కారుని సవాలు.
రాగ రాగ ప్రాకృతములను జక్కగా చదువు సంప్రదాయమే పోయినది. సంస్కృత నాటక కారులు శాస్త్రము కొరకై ప్రాకృతములను వ్రాసిరే కాని వాటిపై సానుభూతి సామర్థ్యములు కలిగి కాదు. అందునను వారు వాడుకొన్నవి మహారాష్ట్రి, మాగధి వంటివే. నీచపాత్రములు అరుదుగ పైశాచివంటి భాషలను అక్కడక్కడ వాడును. ఒకరీతిగ వీరందరిలో మృచ్ఛకటికాకారుడు మిగుల సాహసి. ఈనాడు ఈ భాషలలో కృషి యొనర్ప వలసిన భారము పరిశోధకులు, పండితులు, రసజ్ఞులు మున్నగువారిపై నున్నది.
పు. నా.
[[వర్గం:]]