సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్న జీవ పరివర్తన వ్యాధులు
అన్న జీవ పరివర్తన వ్యాధులు :- పిండిపదార్ధముల అన్నజీవ పరివర్తనము (కార్పోహైడ్రేట్ మెటాబోలిజం) : లాలా (ఉమ్మి) జలమండలి టైలీన్, స్వాదు పిండపు ద్రవములోని ఎమైకస్, చిన్ని పేగు ద్రవములోని యిన్ వక్టేస్, మాల్టేస్, లాక్టేస్ అనునవి పిండిపదార్థములను గ్లూకోసుగా మార్చును. పేగులలోని సూక్ష్మజీవులు కొంత గ్లూకోసును బొగ్గుపులుసు వాయువుగను, మిథేనుక్రిందను మార్చును. పేగులద్వారమున గ్లూకోసు రక్తములోనికి పేగుల యొక్క పైపొర సహాయముతో పీల్చుకొనబడును. గాలక్టోసు, లీవ్ లోసు,కాలేయమును చేరి, అచట అవి రెండును గ్లూకోసుగా మార్పు నొందును. గ్లూకోసులో చాల భాగము గ్లైకోజను క్రింద మార్చబడి, కాలేయపు కణములలో నిలువచేయబడును. కొంత మాత్రము కాలేయముగుండ రక్తప్రవాహములోనికి పోవును. సుమారు 500 గ్రాముల గ్లైకోజను శరీరమునందు నిలువ చేయబడి యుండును. అందు 100 గ్రాములు కాలేయములోను, మిగిలినది అస్తి పంజర కండరములందును ఉండును. సాధారణముగ రక్తమునందు 80-120 మిల్లీగ్రాముల చక్కెర యుండును. 50 గ్రాముల గ్లూకోనును ఇచ్చి రక్తము నందలి చక్కెరను ప్రతి అరగంటకు అంచనకట్టిన యెడల అది ఒక గంటలో 130-160 మిల్లీ గ్రాములకు పెరుగును. రెండు, రెండున్నర గంటలలో మామూలు పరిస్థితికి తగ్గిపోవును. దీనినే శర్క రాసహన పరీక్ష(సుగర్ టాలరెన్సు టెస్టు) అందురు. రక్తమందలి చక్కెర 180 మిల్లీగ్రాములకు మించియున్నచో, మూత్రము నందు చక్కెర కానవచ్చును. ధాతువులు వ్యయమగుట మూలమున, రక్తమందలి చక్కెర తగ్గిపోయినయెడల, కాలేయమందలి గ్లైకోజను గ్లూకోసుగా మార్పు చెంది రక్తప్రవాహములోనికి విడుదల చేయబడును. పెక్కు ఆమినో ఆసిడ్లను, బహుళముగ క్రొవ్వును గ్లూకోసుగా మార్పు శక్తి కాలేయమునకు గలదు.
స్వాదుపిండము నందలి సహజకణములతో సంబంధము లేని లాంగరుహన్సు దీవులలోని బి కణముల నుండి యిన్ సులిను స్రవించును. ఇది యొక హార్ మోను. దీని సంఘటమును గూర్చిన వివరములు C254 H377 O75 అని సాంగర్ అను శాస్త్రజ్ఞునిచే 1955 లో కనుగొనబడెను. దీనివలన ధాతువులలోని గ్లూకోసును వినియోగించుటకు వీలు కలుగును. కాలేయములో, కండరములలో, గ్లైకోజను నిలువ చేయుటకు అవకాశము లభించును. అమినో ఆసిడ్సు, క్రొవ్వు, వ్యయము గాకుండ రక్షణము ఏర్పడును.
మూత్రములో చక్కెర ఉండిన యెడల దానిని మధు మూత్రవ్యాధి (గ్లైకొసూరియ) అందురు. గ్లైకోజను 100. ఘ. సెం.మీ. రక్తములో 180 మిల్లీగ్రాముల కంటె ఎక్కువగా తయారైనయెడల మధుమేహము (డయాబెటిసు. మెల్లిటసు) సంభవించును.
కొందరి రక్తములో చక్కెర 180 మిల్లీగ్రాముల కన్న తక్కువ యున్నను మూత్రములో చక్కెర యుండును. దీనినే మూత్రపిండ సంబంధమైన మధుమూత్ర వ్యాధియందురు. ఇది ఎక్కువ ప్రమాదకరమైన వ్యాధి కాదు.
మాంసకృత్తులకుసంబంధించిన అన్న జీవ పరివర్తనము : కడుపు ద్రవములోనున్న పెప్సిను, హైడ్రోక్లోరిక్ ఆసీడు, రేనిన్ స్వాదు పిండములోని ట్రిప్సిను, చిన్న పేగు ద్రవములోని ఎరప్పిను అనునవి మాంసకృత్తులను ఆమీనో ఆసిడ్సుగా మార్పు చేయును. ఇందు నత్రజని (యన్ హెచ్ 2) కలదు. వాటి సంఖ్య 15. ఉదాహరణములు :- ఆలేవిన్, గైసిన్, లూసిస్ మొ. అవి రక్తప్రవాహములోనికి పీల్చు కొనబడి, కాలేయము చేరును. అందు కొన్ని కాలేయము గుండా సాధారణ ప్రవాహములోనికి తీసికొనబడును. ధాతువులు వాటిని గ్రహించి తమయందలి పదార్ధములను పెంపొందించుకొనుటకును, శరీరము యొక్క తరుగుదలను తిరిగి పూర్తిచేయుటకును ఉపయోగించుకొనును.అదనముగ నున్న యెమైనో ఆసిడ్ కాలేయమందే పూర్తిగా యూరియాగా మార్చబడును. సాధారణముగ రక్తములోని యూరియా ప్రమాణము 20-40 మిల్లీ గ్రాముల శాతముండును. అది మూత్రములోనికి స్రవిం చును. యూరియా మూత్రములోనికి స్రవించుటనుబట్టి మాంసకృత్తులు ఎంతలో పలికి తీసికొనుచున్నామో నిర్ణయింప వచ్చును. అత్యవసరమైన సమైన్ ఆసిడ్లు ఏవి యనగా (1) లూసిన్ (2) ట్రిప్టోఫేన్ (3) మిథై యొనిన్ (4) థియొనిన్ (5) ఫినైన్ ఎలనిన్ (6) వాలీన్ (7) లైసీన్ (8) ఆర్జనీన్ (9) హిస్టిడీన్ (10) హైసొ లూసిన్. ఇవి పాలు మొదలగు వస్తువులలో కలవు. ఎదుగుటకై వీటిని తీసికొనుట ఆవశ్యకము. ఆరమాటిక్ అమైనో ఆసిడ్సు కాలేయమునందు ఎథీరియల్ సల్ఫేట్సుగా మారి మూత్రములోనికి స్రవించును.
క్రియాటిన్: రక్తములో 10 మి. గ్రా. శాతము కండరములలోను వృషణములలోను ఉండును. ఇదిస్వల్ప పరిమాణములో రక్తములోను మూత్రములోను 2% కలదు. ఇది శరీర అంతర్గత అన్న జీవపరివర్తనము ద్వారమున వ్యర్థ పదార్థముగా ఏర్పడుచున్నది.
యూరిక్ ఆసిడ్: ఇది ఆహారమందలి మాంసకృత్తుల నుండియు, నూక్లియే ధాతువులనుండియు చెడిన పదార్థముగా ఏర్పడుచున్నది. రక్తములో ఇది 3 మి. గ్రా. శాతముండును. ఇది మూత్రము ద్వారమున విసర్జింపబడును.
క్రొవ్వు యొక్క అన్న జీవ పరివర్తనము: ఆహార మందలి తటస్థమగు క్రొవ్వుపదార్థములపై జీర్ణరసములోని లెపీసు, స్వాదుపిండములోని లెపీసు పనిచేయును. పైత్యరస లవణములు వాటి సామర్థ్యమును 14 రెట్లు హెచ్చించును. పైత్యరస లవణములు, నీరు, మ్యూసిన్ కలసి క్రొవ్వును నీరు క్రింద మార్చును. క్రొవ్వు గ్లిసరిన్ గాను ఫాటీ అసిడ్సుగాను పూర్తిగా చితుక కొట్టబడును. ఫాటి ఆసిడు, క్రొవ్వు, ఆమ్లములు మున్ముందు మార్పులు పొందునపుడు ముందుగా కలిసి పేగులలోని పాల గొట్టమును చేరుకొనును. పేగుగోడలో ఫాటీ ఆసిడ్లు పైత్యరస ఆమ్లములు విడిపోవును. పైత్యరసము పేగు బైటికివచ్చి మరల పాటీ ఆసిడ్సుతో కలిసి లోపలికి ప్రవేశించును. పేగులోపల ఫాటీ ఆసిడ్సు తటస్థమైన క్రొవ్వుగామారి రక్తమునందు చేరును. అవి రక్తమునందు ఈక్రిందిరూపములతో నుండును. (1) తటస్థమగు క్రొవ్వు (2) లెసితిన్ (8) కొలేస్టో రాలు.(180 మి.గ్రా. శాతము) క్రొవ్వు నిలువయుండు స్ధానములనుండి కాలేయపు ధాతువులు క్రొవ్వును తీసికొని పోవును. కండరములు పిండిపదార్థములను, క్రోవ్వును, శక్తికొరకు ఉపయోగించు కొనును. బొగ్గుపులును వాయువుగను, నీరుగను, మారుటకు చక్కెర తగినంత యుండవలెను. మధుమేహము లేక నిరాహారత మొదలగునవి కలిగినపుడు చక్కెర తగినంత ఉండదు. కావున క్రొవ్వు అసిటోను బాడీస్ ను ఇచ్చును. అది మూత్రములో విసర్జింపబడును. ఇన్సులిను కావలసిన గ్లూకోసును సరఫరాచేసి కిటోసిన్ ను నిర్మూలించును.
ఆల్కాప్ట నూరియా; ఇది పుట్టుకతోవచ్చు వ్యాధి, ఇది అరుదైనది. మూత్రము క్షారము అగుచో గాలి కొంత సేపు తగులగనే అది నల్లగా నగును. ఇందు హిమో జెంటిసిక్ ఆసిడ్ కలదు.
హెమోక్రొమోటిసిస్ ; ఇది శరీరాంగము లన్నిటి యందును అసాధారణ పరిమాణములో ఇనుము నిలువయుండు వ్యాధి. ఇది ముఖ్యముగా హెమొ నెడరిన్ రూపములో నుండును. అందులకుగల కారణము తెలియదు. అదికూడ అరుదైన వ్యాధి.
మధుమేహము (డయాబిటిస్ మెల్లిటిస్): స్వాదు పిండములోని లాంగరు హన్సు దీవులలోని యిన్సులిను ఉత్పత్తిచేయు 'బి' కణములు తక్కువ అగుటవలన ఈ వ్యాధి వచ్చునని ఇదివరలో నమ్మెడువారు. కాని కుక్కలకు ఆం టేరియర్ పిట్విటరీ ఎక్స్ట్రాక్టు సూది మందుగా ఇచ్చుటవలన వాటికి మధుమేహము కలుగుచున్నది. పిల్లలయందును యౌవనములో నున్న స్త్రీ పురుషులందును ఇది తీవ్ర ఫలితములకు దారితీయును. వృద్ధులం దిది చాల సాధువుగ వచ్చును. పిండిపదార్థముల అన్న జీవ పరివర్తనమునందు కలవరము వాటిల్లును. యిన సులిన్ లేని యెడల కాలేయము గ్లూకోసును గ్లైకోజనుగా మార్ప జాలదు. ధాతువులు గ్లూకోసును ఉపయోగింపలేవు. అందువలన రక్తములోని చక్కెర మిక్కుటమగును. అది 180, మి. గ్రా. శాతమును మించును. మూత్రములోచక్కెర కాననగును. గ్లూకోసు లేనియెడల క్రొవ్వు పదార్థములు పూర్తిగా ఉపయోగించలేక కెటోన్ పదార్థములు ఉద్భవించును. అవి మూత్రముగుండా వచ్చును. రోగి అధికముగా మూత్రముపోయుట, దాహము, ఆకలి, బరువు తగ్గుట ఏర్పడును. మూత్రములో గ్లూకోస్ ఉండుటచేత దాని విశిష్ట గురుత్వము (స్పెసిఫిక్ గ్రావిటీ) హెచ్చును. రోగి తా నధికమగు బలహీనతతో నున్నట్లు చెప్పును. ఇందు రాగల క్లిష్ట పరిస్థితులు
- 1. క్షయ కూడ వచ్చుట.
- 2. మధు మేహముచే స్మృతి తప్పుట. నెత్తురులో అధికముగ చక్కెర యుండుటవలన ఇది జరుగును స్మృతి తప్పిన :రోగికి సరియైన చికిత్స జరుగని యెడల చనిపోవును.
- 3. మాంసము కుళ్ళుట రాచపుండు మొదలగు శస్త్రచికిత్స అవసరమగు వ్యాధులు కలుగుట.
- 4. చర్మముపై దురదలు కలుగుట.
- 5. కాలుచేతుల తిమ్మిరులు ఏర్పడుట.
- 6. కంటిలో పువ్వు మొలచుట.
- 7. రెటీనా అను కంటిగ్రుడ్డు లోపలి పొర వాచుట.( రెటినిటిస్)
- 8. మూత్రకోశపు వావు.
ఇన్సులిన్ వ్యాప్తిలోనికి రాక పూర్వము చిన్నతనము నందు మధుమూత్రవ్యాధికి గురియైన వారి సరాసరిజీవితము 5 సం. ల పరిమితి ఉం డెడిది. ఆ రోగి మధుమూత్ర మూర్ఛచేగాని, క్షయ చేగాని చనిపోవుచుండెను. ఇన్ సులిన్ అందుబాటులో నున్న నేడు రోగి క్రమబద్ధముగ ఆహారమును తగినంత మోతాదులో ఇన్సులిన్ ను తీసికొన్నచో అతడు అకాలమరణమునకు గురికావలసినఅవసర మెంతమాత్రమును లేదు. రోగి, ఆహారమును క్రమబద్ధముగ తీసికొనుచు బరువును ఒక ప్రమాణములో కాపాడుకొనుచు తనకు తానే సూదిమందు తీసికొనుట అలవాటు చేసికొనవలెను. ప్రతి రోగియు ఇన్సులిన్ పెద్ద మోతాదుగా తీసికొని ఆ పిమ్మట త్వరపడి భుజించని యెడల శరీరమందలి చక్కెర తగ్గునని గ్రహించవలెను. అతనికి చెమట, వణకు పుట్టును. అతడు బలహీనుడగును. మనస్సు వికలమై సొమ్మసిల్లుట జరుగవచ్చును. ఇనసులిన్ తీసికొనుచున్న మధుమూత్రరోగి తనయొద్ద చక్కెర నుంచుకొని ఆసూచన కానవచ్చిన వెంటనే తినవలెను. ఇన్సులిన్ రెండు రకములు, 1. కరిగెడు రకము. ఇది నాలుగు గంటల సేపు పనిచేయును. రోగికి రోజుకు రెండుమార్లు సూదిమందు లీయవలెను. (2) గ్లోబిన్ ఇన్ సులిన్. ఇది చాల సేపు పని చేయును. రోగికి రోజుకు ఒకసారి సూది మందు ఇచ్చిన సరిపోవును.
ఆయత్నకృత (స్పాంటేనియస్) హైపొగ్లైసీమియా : స్వాదుపిండము యొక్క లాంగర్ హాన్ దీవులనుండి యిన్సులిన్ పుట్టును. అందుండి ఇన్ సులిన్ ఎక్కువగా స్రవించుటవలన గాని, దీవులలో గ్రంథి పుట్టుటవలన గాని యెక్కువ ఇన్సులిన్ తయారగును. పొట్టలో అనిర్దిష్టమైన నొప్పి ఉన్నదనియు, బలహీనముగ నున్న దనియు, భోజనము తర్వాత కొంత శాంతించినదనియు, రోగి మొరపెట్టును. వ్యాధి తీవ్రమైనయెడల రోగికి స్మృతి తప్పుటకూడ సంభవింపవచ్చును. రక్తములోని గ్లూకోసు పరీక్ష చేయుటవలన రోగమును నిర్ణయింపవచ్చును. ఇది 80 మి. గ్రా. లు మొదలు 60 మి. గ్రాముల వరకుండును. ఇందులకు చికిత్స :- (1) తరచుగా ఆహారమిచ్చుట (2) స్వాదుపిండములోని ఆభాగమునుకాని, లేక ఏదేని గ్రంథి కనుపించినచో దానిని కాని శస్త్రచికిత్స మూలమున తీసి వేయుట.
వాన్ గార్కీస్ రోగము : ఈ వ్యాధికిగల కారణమేమో తెలియదు. గ్లైకోజన్ పెద్ద పెద్ద మొత్తములలో ఇంద్రియములందు నిలువయుండును. పిల్లలు పెద్ద పరిమాణముగల హృదయముతో పుట్టుదురు. అట్టి పిల్లలు సాధారణముగ ఒకటి రెండు సంవత్సరములకంటె ఎక్కువ కాలము బ్రతుకరు.
వాతరక్తము (గౌటు) : ఇది యూరిక్ ఆసిడ్ యొక్క అన్న జీవ పరివర్తనమునందు సంభవించు ఒక కల్లోలము. దీనికి గురియగువారు 40 సంవత్సరములకంటె ఎక్కువ వయస్సు కలవారు. వారు చలిలో తిరిగినచో కాలి బొటనవ్రేలి మొదటి కీలునందు తీవ్రమగునొప్పి వాటిల్లును. కీలు వాచును. ఎఱ్ఱబడి ఏమాత్రము చలనము కలిగినను నొప్పిగానుండును. యూరిక్ ఆసిడ్ పెరుగును. కాలము గడచినకొలదియు మూత్రములోను చెవిలోను ఆరికాలి కీళ్ళలోను అరచేతి కీళ్ళలోను సోడియం యూరేటు చేరి కుంటితనము ఏర్పడవచ్చును. తీవ్రపరిస్థితిలో టించర్ కాల్ సీకమును ఇచ్చిన యెడల అది నొప్పిని పోగొట్టును. మున్ముందు ఈ వ్యాధి రాకుండుటకు రక్తమూత్రామ్లము పెరుగకుండ చూచుట అవసరము. వారమునకు 3, 4 సార్లు సింకోవేన్ మాత్రలను సేవింపవలెను. ఇది చాల విషసంబంధమైన ఔషధము కావున దీని నుపయోగించుటలో మెలకువ అవసరము.
అతి స్థూలత : ఈ పరిస్థితి ఈ క్రింది సందర్భములలో వచ్చును. (1) పిట్ విటరీ మాంసగ్రంథి వలనను (2) థైరాయిడ్ మాంసగ్రంథిలో ద్రవము తగ్గుట వలనను (3) ఓవరీస్ అనగా స్త్రీలకు రజస్సు ఆగుటవలనను. కాని సామాన్యముగా అతిస్థూలత అతిగా తినుటవలన వచ్చును. రోగి ఆహారమును మిగుల తగ్గించు కొనుచు తన శరీరమందలి క్రొవ్వును వ్యయపరచుకొనుచు అదనపు బరువు తగ్గునట్లు యత్నము చేయవలెను. యాంపిటమిన్ గోలీలు తీసికొన్నచో మితిమీరిన ఆకలి ఉండదు. వంకాయలు, టొమేటోలు మొదలగు కూరగాయలను ఉపయోగించినచో అవి తక్కువ కెలో రీల (Calories) ఆహారము నిచ్చుటచే స్థూలత తగ్గుటకు అవకాశమున్నది.
క్రొవ్వు యొక్క ఆహారజీవ పరివర్తనము నందలి అక్రమములు :- ఇందు గాచర్సు వ్యాధి సాధారణమైనది. ఇందు ప్లీహము, కాలేయము మొదలగు అవయవములు క్రొవ్వు కణములతో నిండును. నీమన్ ఫిక్స్ వ్యాధియు, స్కుల్లరు వ్యాధియు ఇట్టివే. కాని నిలువయుండు క్రొవ్వుపదార్థములలో తేడా కలదు. ఇందులకు గల కారణము తెలియదు.
మిశ్రితాహారము (మిక్సెడ్ డైట్) : మనము దినచర్యలో శక్తిని వ్యయింతుము. మన ఆహారమునందలి కెలోరీలు దీనిని సరఫరా చేయును. పెరిగెడు పిల్లలకు ఎక్కువ ఆహారము అవసరము. శరీరము యొక్క ఒక్కొక్క పౌను బరువునకు కనీసము ½ గ్రాము మాంస కృత్తులు కావలెను. పాలలోను, జంతువుల మాంస కృత్తులలోను జీవసంధాయకములగు జంతుక ఆమ్లములు గలవు. పిండిపదార్ధములు, మాంసకృత్తులు, గ్రామునకు 4 కెలోరీల శక్తిని ఇచ్చును. క్రొవ్వు గ్రాము 1కి 9 కెలోరీల శక్తిని ఇచ్చును. పిండిపదార్థములు లేని క్రొవ్వు, కీటో సెస్కు కారణమగును. కావున మన ఆహారము మిశ్రముగా నుండవలెను. అందు పిండి పదార్థములు, మాంసకృత్తులు, క్రొవ్వు, లవణములు, విటమినులు, కూరగాయలు, ఉన్నప్పుడే సరియగు శక్తి లభించును. మనదేశమునందు కేవలము బియ్యమునే తినెడు వారికి మాంసకృత్తులు తక్కువగా లభించును. శాకాహారులకు మాంసకృత్తులు ఇంకను తక్కువగా లభించును. పాలద్వారమున ఈలోటును కూడా తీర్చుకొనవలెను. సామాన్య మానవునకు సగటున రోజునకు 2500 - 3000 కెలోరీల ఆహారము కావలెను. శ్రమించు కార్మికునకు రోజునకు 4000 కెలోరీల ఆహారము కావలెను. కూరగాయలు, ఆకుకూరలు సమృద్ధిగా తినిన యెడల వాటి మూలమున ఆహారమున సెలులోస్ అను పదార్థము లభించి మలబద్ధకము తగ్గిపోవును.
నిరాహారత (స్టార్వేషను) : నిరాహారులకు అన్న జీవ పరివర్తనక్రియ యావత్తును తలక్రిందగును. శరీర మందలి క్రొవ్వు నిలువలు వ్యయమగును. పిండిపదార్థములు, క్రొవ్వు మండిపోవుటచే కెటోసెస్ వ్యాధి వచ్చును. మూత్రములో ఎసిటోన్ పదార్థములు కాననగును. క్రొవ్వునుండియు ఆమినో ఆసిడునుండియు గ్లూకోసు తయారుచేయు శక్తి కాలేయమునకు కలదు, కాని ఈశ క్తి పరిమితమైనది. నిరాహారతవలన రోగియైన వ్యక్తికి హఠాత్తుగా సంపూర్ణాహారము నిచ్చుట ఎంత ప్రమాదకరమో ఇటీవల యుద్ధకాలములో వంగదేశ క్షామము రుజువుచేసినది. అందువలన అతడు తప్పక మరణించును. అతనికి మొదట గ్లూకోసునీళ్ళు, ఉప్పు, నీళ్లుకలిపిన పాలు, పండ్లరసము ఇచ్చి, అతని జీర్ణశక్తి పెంపొందిన పిమ్మట మెలమెల్లగా క్రమక్రమముగా అతని ఆహారమును అధికము చేయవలెను.
దీర్ఘకాలముగ అసంపూర్ణ ఆహారముపై బ్రతికిన వానికి రక్తములో మాంసకృత్తులు తగ్గిపోవును. అందు వలన శరీరము వాచిపోవును. వైటమిన్ లోపమువలన పాండురోగము కలుగు రోగముల చిహ్నములు కానవచ్చును. మాంసకృత్తుల అభివృద్ధికి, రక్తవృద్ధికి లివర్ ఎక్ స్ట్రాక్టులు, పైటమినులుగల ఆహారములు ఇచ్చుట ఇందులకు జరుగవలసిన చికిత్స.
డా. ఎస్. వేం. రా.