సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అడవి బాపిరాజు
అడవి బాపిరాజు :- కథలోనే పుట్టి, కళలోనే పెరిగి, కళలకు జీవిత మంకితము చేసి, కళాసేవలోనే కాల ధర్మము చెందిన కళాతపస్వి శ్రీ అడవి బాపిరాజుగారు. ఆయన జననము 1895 అక్టోబరు 8వ తేది. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, ధర్మవరం రామ కృష్ణమాచార్యులు, గురజాడ అప్పారావుగార్లు ఆధునిక సాహిత్య సౌధ నిర్మాణమునకు పునాదులు వేసిన కాలమది.
కళామయుడైన శ్రీ బాపిరాజుగారు ఆ సౌధమున కొక స్తంభము. అదొక విశిష్ట స్తంభము. హంఫీ హజార రామాలయ స్తంభమువలె ఇసుమంత స్పందనమునకై నను చెమ్మగిలునట్టిది; విఠలాలయ శిలా స్తంభము వలె రాగరంజనలు చిలుకరించునట్టిది; కష్టాలు పై కొన్నప్పుడు మందరమువలె మథించునట్టిది.
కథకుడు కవి యగుట, కవి నవలారచయిత యగుట, నవలారచయిత చిత్రకారు డగుట - వీటన్నిటను నిష్ణాతుడు, నాట్యకోవిదుడు అగుట అరుదు. కాని శ్రీ బాపిరాజుగారు కథకుడు, కవి, నవలారచయిత, చిత్రకారుడు, నాట్యాచార్యుడు "ఒకరికీ చేయినిచ్చి, ఒకరికి కాలునిఛ్చి, ఒకరీకి నడుమునిచ్చీ కూరుచున్నానోయ్ అని ఆయన అభినయించుచు పాడుచున్న పాటవలె, తన చేతిని, కాలును యావచ్ఛరీరమును కళలకు అంకితము చేసినాడు.
ఇంతటి కళామయుడు మధురమూర్తి యగుటలో ఆశ్చర్యమేమున్నది? ఆమలిన హృదయము, అజాత శత్రుత్వము, బహుముఖ ప్రజ్ఞా ప్రాభవము - అనెడు త్రివేణుల సంగమము ఆయన. సహృదయత, సరసత, సదయత పెనవేసికొన్న మానవు డాయన.
" ద్వేషమేనా బ్రతుకుమార్గం
వేషమేనా సత్యరూపం
మోసమేనా నిత్యకర్మం
మూర్తి మంతులకున్, "
అని వాపోయి, వ్యత్యాసాలెరుగని సుందర సమాజము నెలకొనవలెనని అంగలార్చిన ఆదర్శ జీవి.
బాపిరాజుగారు జన్మించినది గోదావరీ తీరమున భీమవరము సమీపములోని సరిపల్లెలో. ఈ గోదావరి "గద్గద నదగ్గోదావరి కాదు.” అన్నిటిని గుండెలలో పెట్టుకొని, విస్తృత గంభీరముగా ప్రవహించెడి గోదావరి. ఆ గోదావరి గంభీరత బాపిరాజుగారి గుండెల లోతులలోనికి, గోదావరి విస్తృతి ఆయన దృక్పథములోనికి తొంగి చూచుటలో వింతయేమున్నది? ఈయన తండ్రి శ్రీ కృష్ణయ్యగారు. రసవత్తరమయిన కథలను ఆశువుగా అల్లి వీనులవిందుగా వినిపించుటలో ప్రజ్ఞాశాలి. తల్లి శ్రీమతి సబ్బమ్మగారు. అమలిన హృదయ, ఉదారస్వభావ. ఈ లక్షణాలు బాపిరాజుగారికి ఉగ్గుపాలతో అలవడినవి. కనుకనే శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు —
మీయమ్మ యే తార చాయలో నినుగాంచె
ఏ యోషధులపాల పాయసంబిడి పెంచె
లేకున్న నీశిల్ప లీలాభిరుచి రాదు
కాకున్న నీస్వాదు కంఠమబ్బగ బోదు
అడివోరి చిన్న వాడ
అమృత ధారలవాడ "
అని ఆశ్చర్యము ప్రకటించినారు.
బాపిరాజుగారి విద్యార్థిదశ రాజమహేంద్రవరములో ఓస్వాల్డ్ కూల్ డ్రేగారి అంతేవాసిత్వములో గడచినది. కూల్డ్రేగారి ఒజ్జరికము బాపిరాజుగారిలో నిద్రాణమైన కవితను, కళను మేల్కొల్పినది. దీనికితోడు పాల్, లాల్, 'బాల్' అనెడు త్రిమూర్తులలో ఒకరైన బిపినచంద్ర పాల్ ఆవేశపూరిత ప్రసంగములు బాపిరాజుగారి హృదయములో దేశభక్తి నారులు పోసినవి. దాని ఫలితమే ఆయన 1921 లో సత్యాగ్రహోద్యమములో పాల్గొని కారాగారవాసము అనుభవించుట, తర్వాత ఆయన బి. ఎల్. పట్టముపొంది, కొన్నాళ్ళు. న్యాయవాది వృత్తి సాగించినను, నాలుగేళ్ళపాటు బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేసినను, పిదప చలనచిత్రరంగంలో కళాదర్శకుడుగా పనిచేసినను, గుంటూరులో కళాపీఠము స్థాపించి " కులపతి " అయినను, పదపడి హైదరాబాదులో 1943 నుంచి నాలుగేండ్లపాటు "మీజాన్ " తెనుగు దినపత్రిక సంపాదకత్వము నిర్వహించినను, అనంతరము 1952 సెప్టెంబరు 22 వ తేదీన చెన్నపురిలో "పాహి మృత్యుంజయా - పాహి మృత్యుంజయా" అని సంస్మరించుచు, తుదిసారిగా కన్నుమూసెడు వరకు ఆయన హృదయ నైర్మల్యము చెక్కు చెదరలేదు. ఆయన కళాతృష్ణ కలక బార లేదు. సాహిత్యారాధన పసి చెడలేదు. పది నవలలు, పది కథా సంపుటాలు, వంద చిత్రాలు, వందపాటలు పూర్తిచేయవలెనని ఆయన కోరిక.
శ్రీ బాపిరాజు గారివలె ఇన్ని కళలలో, కావ్యరూపాలలో కలం నడిపినవారు చాల అరుదు. కలము నడపిన ప్రతి రంగములోను ఆయనవలె కన్నాకు అగుట అంతకన్న అరుదు. ఏకకాలములోనే అన్నింటిని ప్రారంభించి, ఇంద్రజాలికునివలె నిర్వహించెడువారు మరీ అరుదు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి కనుకనే ఆయన తన కోరికకు అనుగుణముగా పది నవలలు (పదవది “మధురవాణి " అసంపూర్ణము), ఏబదింటికి పైగా కథలు, శతాధికముగా గేయాలు వ్రాసినారు. పెక్కు చిత్రాలు గీసినారు.
తెలుగు నవలా సాహిత్యములో బాపిరాజు గారిది తొట్టతొలిబంతిలో మొట్టమొదటి పీట. ఆయన హిమబిందు, గోన గన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, అంశుమతి, మధుర వాణి ( అసమగ్రము) ఆంధ్రుల ఇతిహాసము ఇతి వృత్తముగా గలవి. " హిమబిందులోని ఇతివృత్తము ప్రథమాంధ్ర సామ్రాజ్య స్థాపకులయిన శాతవాహనుల నాటిది. అడవి శాంతిశ్రీ ఇక్ష్వాకుల నాటి కథ. అంశుమతిలోనిది ఆంధ్రచాళుక్య సామ్రాజ్యస్థాపన కథ. "గోన గన్నా రెడ్డి” కాకతి రుద్రమ దేవినాటి గాథ. "మధురవాణి" తంజాపు రాంధ్ర రాజుల నాటి సంగతి. ప్రాచీనాంధ్ర చరిత్రను ప్రామాణికముగా గ్రహించి, జాతి జీవనమును చిత్రించుటకు నవలలు రచించిన వారిలో ప్రథముడు, ప్రధానుడు బాపిరాజుగారే. ఆయన తక్కిన నవలలు నారాయణరావు, కోనంగి, తుఫాను, జాజిమల్లి, నరుడు సాంఘికమైనవి.
బాపిరాజు గారి నవలలోని ప్రత్యేక లక్షణా లివి :
1. చరిత్రాత్మకమైన నవలలో, చరిత్రానుసరణ విషయములో, ఆయనది అసిధారావ్రతము. కథా గమనము కోసమో, చమత్కారము కోసమో చరిత్రను తారుమారు చేయుట ససేమిరా పనికిరాదు. ఏ రాజుల కాలపు కథ తీసికొని నవల వ్రాయదలచినా, మొదట ఆకాలపు శాసనాలు మొదలు కవిలెకట్టలదాక కుణ్ణముగా చదివి, చరిత్ర కారులతో తర్క వితర్కాలు జరిపి, సమన్వయించు కొని, అప్పటి ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు లోటు రాకుండ రచన సాగించేవారు. తుదకు రాజుల బిరుదావళులను కూడ వదలెడువారు కారు. ఇందులకు "గోన గన్నా రెడ్డిని ప్రత్యేకముగా ఉదహరించవచ్చును.
2. సాంఘికమయిన నవలలలో తన దృష్టిని కేవలము పాత్రల మీదనే కేంద్రీకరించక పరిసర పరిస్థితులను, దేశములోని ఘటనల్లో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తులను కలిపివేసి, వాస్తవికతను మరింత స్పష్టముగా తోవజేసెడువారు. కనుకనే "నారాయణరావు” లోని జమీందారీ పద్ధతి నిర్మూలనము గాని, తుఫానులోని శర్వరీ భూషణుని కళాతృష్ణ కాని, “నరుడు”లోని హరిజన-ఆంగ్లో ఇండియను వనిత వివాహము కాని, విడ్డూర మనిపించవు సరిగదా, పాఠకునికి సన్నిహితముగాను, వాస్తవికము గాను కనుపించును. "నారాయణరావు" ఆంధ్ర విశ్వవిద్యాలయము మన్ననపొందినది.
3. దేనికి తగిన భాష దానికి అనేది బాపిరాజుగారి రచనలోని మొదటి కిటుకు. “హిమ బిందు”లో భాష ప్రాచీన ప్రబంధ ధోరణిలో కదం తొక్కును. 'కోనంగి', 'నరుడు' వంటి సాంఘికాలలో వ్యవహార భాషలో నల్లేరుపై బండివలె సాగును. భాష యేదయినా ఈ శైలిలో కవిత్వము తొంగిచూచుచుండును.
4. చరిత్ర విషయములో వలెనే భూగోళ విషయములోను ఆయనకు పట్టుదల యెక్కువ. ఆయన ఏ నవల చదివినను (ఏ కథ చదివినా) ఆయా ప్రాంతాలలో విహరించినట్లు పాఠకులు తన్మయులయ్యెదరు. తనదేశ పర్యటనానుభవాలను యుక్తాయుక్త విచక్షణతో క్రోడీకరించి, అక్కడక్కడ చొప్పించుట ఆయనకు పరిపాటి. “తుఫాను” లో ఆయన వివిధరాష్ట్రాల ప్రజల జీవితాలకు సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మవిషయాలను అద్భుతముగా చర్చించుట చూడవచ్చు.
5. ఆయనపాత్రలలోని ఉదాత్తత నిరుపమానము. సంఘములోని ఎగుడు దిగుళ్ళను సరిచేసే ఆ వేశము పాత్రలలో తొణికిసలాడుచు ఉండును. ఆయన సిసలైన గాంధీ వాది. తనకు నచ్చని విధానాలను, సిద్ధాంతాలను వికారముగా చూడక సానుభూతితో పరిశీలించే సహనముగలవాడు. రచయితకు అవసరమయిన ఈ నిజాయితీ గలవాడు-కనుక ఆయన పాత్రలుకూడ ఈఉదాత్తతను పోతపోసికొన్నవి. ప్రతిపక్షుల వాదాలను ఎంత ఉదాత్తతతో తర్కించునది "తుఫాను” సాక్ష్యమియ్యగలదు.
కథలు :- బాపిరాజుగారి కథలు కళా మూర్తులు, రసగుళికలు. అతి సామాన్య విషయముతో అసాధారణ కథ అల్లగల మొనగాడాయన. బాపిరాజు గారితో తెనుగు కథారంగములో నూతన కళాత్మకాధ్యాయము ప్రారంభమై, మహోన్నతిని పొందిన దనుట నిస్సందేహము. ఆయన కథలలో "శైలబాల, భోగీరలోయ, వీణ” దివ్యపారిజాతాలు. ఆయన కథలు కొన్ని, రాగమాలిక, తరంగిణి, అంజలి" అనే మూడు సంపుటాలుగా వెలువడినవి. కొన్ని కథలు శైలబాలవంటివి, ఆంగ్ల, కన్నడ, హిందీభాషలలోకి అనువదింపబడినవి కూడ.
బాపిరాజుగారి కథలలో ధగధగలు, భుగభుగలు కనుపించవు, వినిపించవు. నిస్పృహ, దౌర్బల్యము అగుపించవు. "ఆయన కాళ్ళు నేలమీదనే యున్నను ఆయన చూపు నింగిమీదే. అందుచేత, ఆయన కథలు ఇతరుల కథలవలె కన్పట్టవు. అవి ఆయన దివ్యస్వప్నాలుగా ఉండును. ఆయన కనెడుకలలనే కథలుగా చెప్పివాడు...ఆయన తన కల్పన ద్వారా హృదయస్పందన లెన్నింటినో కథాత్మకముగా చేసినాడు.”
ఇంతమాత్రాన ఆయన కాల్పనిక జగములోనే విహరించినారనికాదు. వాస్తవిక జగత్తుకూడ ఆయన విహార భూమియే. "వాన, నేలతల్లి, గాలివాన” వంటి కథలలో ఆయన భూమిబిడ్డల సంగతులు వ్రాసి పేదల పెద్దతనమును పెద్ద చేసి ధనికుల దౌర్జన్యమును ఖండించినారు. ఆయన కథలలో "శైలబాల' శిల్పమునకు, " నేలతల్లి” సంఘపు ఆవేదనకు, "భోగీరలోయ" చిత్రలేఖనమునకు ప్రతీకమని గ్రహించవచ్చును. "రజాకార్" కథలో ఆయన మూడు ముక్కచెక్కలయిన తెనుగునాడు ఏకము కావలయునని ఆవేదనపడినాడు.
"గజపతిదేశం - రాయలసీమా
కళింగరాజ్యం - కాకతిభూమి
ఆంధ్రులందరూ - ఒక టౌతారని
ఏకకంఠమున పాటనిండునని
మోగింపమ్మా - జయజయఢంకా. "
అని ఏనాడో గొంతెత్తి పాడిన విశాలాంధ్రవాది ఆయన.
కన్ను తెరచినది మొదలు కన్నుమూయునంత దనుక సమకాలిక విషయాలను వస్తువుగా తీసికొని దేశమును బాగుపరిచు జీవముతో అతిసన్నిహితత్వముగల పదునైన కలముగలవారాయన.
పాటలు :
" అతడు గీసిన గీత బొమ్మయి
అతడు పలికిన పలుకు పాటై
అతని హృదయములోని మెత్తన
అర్థవత్కృతియై "
అన్న శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి మాటపూర్తి గా అర్థవంతమైనది. ఇట్టి బాపిరాజుగారు కళాదేవిని శశికళా మూర్తిగా భావించుకొని తన్మయులై ఆరాధించెడు వాడు. తమ గీతాలన్నింటికిని ఆ "శశికళే" అధిష్ఠాన దేవి యని భావించి పాడినారు. ఆమె నిజస్వరూప సాక్షాత్కారము కోసము అంగలార్చినారు. ఆవేదన పడ్డారు.
నీకు ఇవతల
అవతల
తెర ఉన్నది బాలా !
తెర ఉన్నదే!
కన్నులు కానని రూపం పిలిచి
కౌగిలి కందనీ భావం తలచీ
తెరవైపున నా చేతులు మోడ్చి
అరమూతలునా తీరని కలలై
చీల్చిన చిరగని తెర ఇవతలనే
చేరగరానీ నీ వవతలనే
తెర ఉన్నది బాలా !
తెర ఉన్నదే ! "/poem>
ఉపాస్య దేవీదర్శనము లభించనప్పుడు పడే ఆ వేదన, తెలిపే పదాలు, కల్పన ఇంతకన్నను ఉండవను కొందును.
<poem>" ఒక్కణ్ణి! ఇసుక బయలు
ఒక్కణే! నీరు దెసలు
కదలిపోవు దూరాలు
బెదరిపోవు మేఘాలు
మరచి పోవ కే."
ఒంటరిబ్రతుకు చూపుచు కదలిపోయే దూరాలు, బెదరి పోయే మేఘాలు మనకు మరపురావు. సుదూరాదర్శాల కోసము ప్రాకులాడే "శశికళ" రస హృదయమునకు, కళాహృదయమునకు ప్రతిబింబము. “అల్పభావము లెట్లు శిల్పవిషయము లౌను ?" అను మతము ఆయనది.
" ఉప్పొంగి పోయింది గోదావరి- తాను
తెప్పున్న ఎగిసింది గోదావరీ!"
అనే గేయము గోదావరి వరదలను మన కనులకు కట్టినట్లు చేయును.
పట్టిసములోని శివాలయము పూజా పురస్కారాలకు నోచుకోలేదన్న విషయమును ఆయన చమత్కారముగా చెప్పిన పద్దతి అపూర్వము.
" గోదారి మద్దేన కొండొకటి వెలసింది
కొండపయి జంగమయ కొలువు వేంచేశాడు
గోదావరి వడులలో కూడె తీర్థాలన్ని
కొండపై జంగమయ కోటి అభిషేకాలు
గోదావరి వరదలో కోటిపూవులపత్రి
కొండపై జంగమయ వెండిపూవుల పూజ
గోదారి కెరటాల కొండతో గుసగుసలు
కొండపై జంగమయ కునుకు బంగరుడోలి”
ఆయన రసహృదయము బెంగాలు, పంజాబులలో జరిగిన దురాగతాలకు వికలమయి పోయినది. వెంటనే
“ ఏమైనారు నా వాళ్లంతా
ఏమైపోయిరి ఈ ఊళ్ళో
కళకళలాడే గల్లీలన్నీ
కలమోస్తరుగా కలిగి పోయినవి. "
అని ఆరాట పడినది. లేపాక్షి బసవన్నను ఎన్నికోట్లమంది చూచుచుండుట లేదు ! కాని బాపిరాజుగారివలె ఎవరు దానిని చూచి, ముగ్ధులై
" లేపాక్షి బసవయ్య లేచిరావయ్య !
కైలాస శిఖరిపై కదలిరావయ్య !
అని ఆంధ్రదేశమునంతను కదిపించ గలిగినారు ?
బాపిరాజుగారు వివిధ భావనలతో కల్పనలతో రూపొందించిన, ఆలపించిన గీతాలలో కొన్ని "గోధూళి, తొలకరి, శశికళ" అనే సంపుటాలుగా వెలసినవి.
చిత్రాలు : "కవి చిత్రకారుడు కాలేడు. చిత్రకారుడు కవి కాజాలడు." అని సుప్రసిద్ధాంగ్లకవి జార్జి బెర్నార్డు షా అన్నారు. కాని బాపిరాజుగారు దీనికప వాదము చిత్ర క ళ లో ను విశిష్టస్థానము సంపాదించుకొన్నాడాయన. పాశ్చాత్య చిత్రకళకు వెలుగునీడలు ముఖ్యమైనవి. భారతీయ చిత్రలేఖనములో రేఖ ప్రధానము. దీనిలో బాపి రాజుగారు అందెవేసిన చేయి. ఆయన కవులలో చిత్రకారుడు, చిత్రకారులలో కవి. ఆయన శ్రీ ప్రమోద కుమార చటర్జీ వద్ద చిత్రకళ అభ్యనించినప్పటి కిని అజంతా రేఖలతో, అమరావతి వంపులతో, మేళవించి తెనుగుచిత్ర సంప్రదాయమునకు కొత్తవన్నెలు కూర్చినారు.
ఆయన చిత్రాలలో 'శబ్దబ్రహ్మ" డెన్మారు ప్రదర్శనశాలను, “భాగవతపురుషుడు” తిరువాన్కూరు రాజ సౌధమును, "సూర్యదేవ” కూచ్ బీహారును, “సముద్రగుప్త” అల్లాడి కృష్ణస్వామయ్య గారింటిని, "తిక్కన "మృత్యుంజయ" మున్నగునవి మిత్రులు మందిరాలను అలంకరించినవి. మద్రాసు ప్రభుత్వపు పనుపుపై లంకలోని "సిగీరియా” గుహాచిత్రాలకు ఆయన ప్రతికృతులు సిద్ధపరచి తెచ్చినారు. ఇవి నేడు మద్రాసు మ్యూజియంలో ఉన్నవి. ప్రతికృతి కల్పనములో వీరికి శ్రీ రాంభట్ల కృష్ణమూర్తి, పిలకా నరసింహమూర్తి, కోడూరు రామమూర్తి, శ్రీనివాసులుగార్లు తోడ్పడ్డారు.
ఇంతటి చిత్రకళాచార్యుడు వెండితెరపయి కళాదర్శకుడుగా విలసిల్లుటలో ఆశ్చర్యమేమున్నది? ఆంధ్రులలో ప్రథమ కళాదర్శకుడు కాగల ఘనత పొందిన వాడు కూడ ఆయనే, “సతీ అనసూయ", "ధ్రువ విజయము”, “మీరాబాయి” చిత్రములలో ఆయన తన చిత్రలేఖనములో వలెనే ఉత్తమాదర్శాలు రక్షించుకొన్నారు.
కళలలోనేకాక వైద్యశాస్త్రములో, సాముద్రిక, జ్యోతిష శాస్త్రాలలో, భరతశాస్త్రములో ఆయనకు అపారమయిన పాండిత్యము ఉండెడిది. ఒక్క మాటలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వము. ఆధునికాంధ్ర కళాసాహిత్య వైభవమును దిగంతములకు వెలార్చిన మహనీయుడు.
తి.రా
[[వర్గం:]] [[వర్గం:]]