సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అజంతా
అజంతా :- అజంతా హిందూ దేశమునందు మిక్కిలి ప్రాచీనమయిన కళాక్షేత్రముగా విఖ్యాతమైయున్నది. ఇది వాస్తుశాస్త్ర శిల్పశాస్త్రములను సరసముగా సమీకరించి రచింపబడిన ప్రాచీన హైందవ భిత్తి చిత్రలేఖనములకు ఒక అసదృశమును, అద్వితీయమును అగు నుదాహరణము.
1. ప్రవేశిక
స్థలము :- అజంతా అను గ్రామము సుప్రసిద్ధిచెందిన గుహా మందిరములకు ఏడు మైళ్ళ దూరములో నున్నది. (20-30 ఉ. 75-45. తూ.) ఈ గుహలు ప్రస్తుతపు బొంబాయి రాష్ట్రమున ఔరంగాబాదు జిల్లాయందలి ఫరద్ పూరు అను గ్రామమునకు మిక్కిలి సమీపమున గలవు. ప్రకృతి సౌందర్య రసజ్ఞుడగు ఒకానొక కళానిష్ణాతునిచే ఈస్థలము వరింపబడినది. హరిత తృణాది సౌందర్యముతో ఇరుదరుల నొరయుచు పారు సెలయేటితో లోయ అత్యుత్తమముగా భాసించు తరుణమున భిక్షువులకు ఏకాంత వర్షావాసముగా ఉపయోగపడుట కయి ఈ అజంతా గుహలు తొలుచబడినవి.
ఈరీతిగా గుహలు సుందర సుందర పరిసరములలో నిర్మితములయినవి. ఇచ్చటి సహజశోభయు, వివిక్తతయు, భిక్షువులు ప్రశాంతముగా ధ్యానము చేసికొనుటకును, కళాభిజ్ఞులును, వాస్తుశాస్త్ర పండితులును ఆవేశపూరితులగుటకును తోడ్పడెను.
భూగర్భశాస్త్ర విషయము :- వాఘోరా (waghora) నది నానుకొనియున్న చరియ పొడుగునను, దాని మధ్య భాగము నందును ఈ గుహలు త్రవ్వబడినవి. ఈ చరియ అర్ధచంద్రాకారమును కలిగియున్నది. మొదటి గుహ మొదలుకొని ఏడవగుహవరకు చరియ యొక్క ముఖ పాతము సాపేక్షముగా క్రమముగాను, పిమ్మట ఆకస్మికముగా మిక్కిలి నిలువుగాను పరిణమించుచున్నది. వస్తుతః ఈగుహలలో సగపాలు గుహలు పశ్చిమాభిముఖముగాను, తక్కు సగపాలు గుహలు ప్రాఙ్ముఖముగాను కనిపించును. మొదటి గుహ మొదలుకొని పడవ గుహ వరకు పైనున్న కొండల వరుస కత్తివాయివలెను, ఆగుహలన్నిటిని 'దాటి జలపాతమునకు చేరువరకు క్రమముగా విస్తృతముగుచు కనిపించును. జలపాతము యొక్క ఎత్తు మొత్తముమీద 178 అడుగులు. అందు ఏడు కక్ష్యలు కలవు. అంత్య కక్ష్యకు "సత్కుండు" అని పేరు. సత్కుండము నుండి వాఘోరానది తిరిగి ప్రవాహరూపమున బయలుదేరును.
ఈ గుహాలయములు ప్రచండ శిలాఖండముల నుండి నిర్మితములై యున్నవి. వీటి పొడవు 600 గజములకు పైగా నున్నది. అసంపూర్తిగా నున్న వాటితో కలుపుకొని ఈ గుహలన్నియు ముప్పదియై యున్నవి. వీటి అడుగు తలము సమముగా లేదు. ఎనిమిదవ గుహ అన్నింటికంటె మిక్కిలి తగ్గుగాను, నీటిదరికి విశేషముగా దగ్గరగాను ఉన్నది. 29 వ గుహ అన్ని గుహలకంటే ఎత్తయినది. ఈ గుహలను నదితోను, ఈగుహల నొండొంటితోను కలుపుచున్నట్టి ప్రాచీన సోపానములు ఇప్పటికిని అచ్చటచ్చట కాననగును. మిక్కిలి ప్రాచీనములయిన గుహలకు సామీప్యము నందును, ఎదుటనున్న కొండల యొక్క ఉన్నత ప్రదేశములందును కొన్ని ఇటుక కట్టడముల అవశేషములు అచ్చటచ్చట కనుపించుచున్నవి.
ఈ ముప్పది గుహలలో 9, 10, 19, 28, 29 సంఖ్యలుకల గుహలు చైత్యశాలలు (లేక సామాజిక ఆరాధనశాలలు), శేషించిన గుహలు సంఘారామములు లేక విహారములు (అనగా భితువులకు నివాసస్థానములు).
త్రప్వుపద్ధతి :- అసంపూర్తిగా త్రవ్వబడి నేటికిని ప్రాథమిక స్థితియందు నిలచియున్న (కొన్ని) గుహలను బట్టి ఈ గుహలను త్రవ్వుటయందు అనుసరింపపడిన పద్ధతిని మనము సులభముగా ఊహింపవచ్చును. మున్ముందుగా వాస్తు శాస్త్రాభిజ్ఞ సార్వభౌము డొకడు సమగ్రముగా ఈ గుహానిర్మాణ విధానమును పరికల్పించి యుండు ననుట స్పష్టము. అందతడు వాస్తుశాస్త్రము, అలంకరణము, ధ్వనిశిల్పము, తక్షణాలంకరణము (అది ప్రలంబ శిల్ప పట్టికా రూపమునగాని జ్యామితి రీతులలోగాని ఉండవచ్చును) మున్నగు వాటి వివరములను, సమృద్ధిగా వెలుతురు కల్పించుటకును, చూపరులకు మనోహరమగు దృశ్యములభించుటకును వలసిన ఏర్పాట్లను చిత్రణముల విస్తీర్ణమును, సన్నివేశములను కూడ అతడు తొలుదొ ల్తనే పథకము వేసి యుండును.
దేశీయమైన చిన్న ఉలిచేతను, సుత్తెచేతను, ఒకప్పుడు శిలయందు లోతైన సందులు కల్పింపగల బరువైనట్టి మొనగల ఒకరీతి గునపము చేతను, గుహలను తొలుచు పని సాక్షాత్తుగా జరిగినట్లు కనిపించును. మొట్టమొదట కఱ్ఱబొగ్గుతో కాని, రంగుల బలపపు రాతితో గాని రూప రేఖను గీచి, వితానమునుండి క్రింది భాగమునకు తొలుచు పని ఆరంభింపబడెను. రాతిలో రెండు మూడు అడుగుల లోతుగల సందులను కొట్టిన మీదట, మధ్యనున్న రాతి కట్టలను పగులగొట్టి తీసివై చి, అవసరమయిన తావులలో స్థూలశిలాఖండములను వదలిపెట్టుచు, వాటిని పిమ్మట స్తంభములుగా గాని, విగ్రహ శిల్పములుగా గాని, ఇతర వాస్తుశాస్త్ర - శిల్పశాస్త్ర ఉక్తలక్షణములు గలవాటినిగా గాని, నిర్దిష్ట విధానానుసారముగాగాని మలచుచుండిరి. ఈ విధముగా నేలమట్టము శగులు వరకు ఖనన కృత్యము సాగెను. అయితే గండశిలను తొలుచుట, మలుచుట, తీర్చిదిద్దుట. ఈ పనులన్నియు తోడ్తోడనే జరిగెననుటను అసంపూర్తిగ నిర్మాణములయిన గుహలు తెలివిడిచేయు చున్నవి.
వర్ణచిత్ర విధానము :- రంగువేయుటకు ఆధారముగా భిత్తితలమును, వితానమును సిద్ధముచేయు విధానమును, వర్ణచిత్ర విధానమునందు సాంకేతిక విద్యా ప్రగల్భతను చూచినచో చిత్రకారునకు గొప్ప కౌశల్యము, ఊహా సమృద్ధి గలదని స్పష్టమగుచున్నది. రాతిపొడిగాని, ఇనుప మట్టిగాని, బంకమట్టి, ఆవుపేడ తరుచుగా పొట్టుతోనో, ఊకతోనో, వనస్పతి పీచుతోనో కలిపి, పెసర కషాయముతో గాని, బెల్లపు నీటితో గాని, జిగురుపదార్థముగా నూరి ఆ పదార్థమును కఠినముగాను, గరుకుగాను ఉన్న శిలాతలముపై గట్టిగాను, సమముగాను లేపనపట్టిగా మెత్తుదురు. ఆ లేపన పట్టిక విషమ శిలాతలమును గట్టిగా పట్టుకొనును. అట్లు గట్టిగా పట్టుకొన్న ఆ లేపన పట్టిక, తడిగా నుండగనే దాని నొక కర్ణికతో చదునుగాను, నునుపుగాను చేయుదురు. దానిపై చక్కగా సున్నము కొట్టగా, ఆ లేపన పట్టిక ఆ సున్నము నాకర్షించును. ఆ స్థలమంతయు ఎండినమీదగాని దానిపై రంగు వేయరు.రంగు వేయబడునపుడు శ్రీ కుమారస్వామిగారు తలంచి నటుల ఆ ప్రదేశమంతయు తడిగా నుంచబడుననుట అనుమానాస్పదము.
మొదట రూపు రేఖలు గీచి, వాటిలో రంగులతో చిత్రలేఖనము జరుపబడును. ఆరూపరేఖలు సర్వదా మొట్టమొదట ధాతురాగముచే గాని, ఎఱ్ఱ సుద్దచే గాని స్పష్టముగా గీయబడును. ఆ రేఖాకృతులలో ఎరుపు రంగు నింపబడును. దాని మీద మిక్కిలి పలుచనై అచ్చమైన పచ్చనిమట్టి పూయబడును. అపుడు దానిగుండా ఎఱ్ఱదనము కనిపించుచుండును. స్థానికముగా లభించు రంగులు భిన్నచ్ఛాయలతో పూయబడుచుండగా కపిశవర్ణముచే గాని, గాఢమైన ఎఱుపు లేక నలుపు రంగుచే గాని, స్థూల సూక్ష్మములై న ఛాయలచే గాని, బిందువులచే గాని, పత్రరేఖలచే గాని రూపరేఖయు నవీకృత మొనర్పబడును. దీనిచే రూపరేఖకు సంపూర్ణముగా ప్రమాణ భూతమును, వలయితమునగు ఘనపరిమాణగుణము ఘటిల్లును.
ఇందు ఉపయోగింపబడిన రంగులలో ధాతురాగము, కుంకుమ లేక సిందూరము, హరిదళము, నీలిమందు రంగు, నీలి మైలుతుత్తము (Lapis lazuli blue), కజ్జలము, ఖడిమట్టి, జేగురుమట్టి, ఆకుపచ్చరంగు మున్నగునవి పేర్కొన దగినవి. రంగులన్నియు స్థానికముగ లభించియుండును. నీలి మైలుతుత్తము (Lapis lazuli blue) మాత్రము జయ పూరు నుండి గాని, దేశపు బహిర్భాగమునుండి గాని తెప్పింపబడియుండును. మిశ్రవర్ణములు కూడ అపురూపముగా ఉపయోగింపబడెను. ఉదా:- బూడిద వర్ణము. వర్ణములన్నియు సమసాంద్రతతో ఉపయోగింపబడ లేదు. అది విషయమును బట్టియు, స్థానిక వాతావరణమును బట్టియు నిర్ణయింపబడెను.
అజంతా చిత్రలేఖనమునందు సాధారణముగా ప్రాచీన హైందవ చిత్రలేఖనము నందువలె వర్ణ సాంకర్య వై లక్షణ్యము ప్రధాన లక్ష్యముకాదు. భిత్తితలమును ప్రధానముగా జాజుమన్ను, పచ్చమన్ను మున్నగు సాంద్రమును, గాటునయిన వన్నెలతో అమేయములయిన భావములతో, ఛాయలతో నింపుటకై యత్నించుటయే ప్రధానలక్ష్యము. ఇట్లు పరిపూర్ణ రచనతో, గాటయిన రంగులతో భిత్తి తలమును నింపుట ప్రాచీన చిత్రలేఖన గౌరవమును అతిశయింప జేయును.
కాల గణనము :- పదవ గుహ ఒక చైత్యశాల. అందు రెండు శాసనములు కలవు. అవి ఆ గుహా నిర్మాణకాలమును నిర్ణయించుటకు తోడ్పడుచున్నవి. ఆ శాసనములలో నొకటి ఆ గుహా ముఖతలమున చెక్క బడియున్నది. రెండవది దాని యెడమ వసారా గోడమీద చిత్రింపబడి యున్నది. ప్రాచ్య పాశ్చాత్య శాసన పరిశోధకులలో ప్రముఖుడయిన ప్రొఫెసరు లైడర్సు (Liiders) యొక్క అభిప్రాయము ప్రకారము ఆ రెండు శాసనములలో చిత్రింపబడిన శాసనము క్రీ. శ. రెండవ శతాబ్ది మధ్యభాగమునకు చెందియున్నది. గుహా ముఖతలమున చెక్కబడిన శాసనము అంతకంటే ప్రాచీనమయినది. ఇట్లనుటకు కారణము అందలి కొన్ని వర్ణములు అశోకుని శాసనము లందలి వర్ణాకృతులను కలిగియుండుటయే. ఈ శాసనము నందు ఈ గుహా పురోభాగమును "వాసిష్ఠీ పుత్తకటహొడి అనువాడు మలిపించి, దానమొసగినట్లు వ్రాయబడి యున్నది. ఈ శాసనము మహాచైత్య వాతాయనమునకు కుడివైపున నెదుట చెక్కబడి యున్నది. ఆ కాలమున దక్షిణాపథమునందు అత్యంత విస్తృతమయిన రాజ్యమును ఆంధ్ర శాత వాహ నులు పరిపాలించుచుండిరి. దక్షిణాపథము నందును ప్రస్తుతము ఆంధ్ర ప్రదేశముగా ఏర్పడియున్న ప్రాచ్య ప్రదేశము నందును, ప్రస్తుతము బొంబాయి రాష్ట్రములో ఒక భాగముగా ఏర్పడియున్న పశ్చిమప్రదేశమందును బౌద్ధ శిల్పము యొక్కయు, వాస్తుశాస్త్రము యొక్కయు అభివృద్ధిని కల్పించి, శాతవాహనులు విఖ్యాతులయిరి. దక్షిణాపథము నందలి స్మృతి చిహ్నములు. అవి కొండనే, బేడ్సా, కార్లే మున్నగు స్థలములందలి ప్రస్తరములను తొలిచి నిర్మించిన గుహా మందిరముల వంటివైనను సరే, (లేక) భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్య పేట మొదలగు తావులందు గల నిర్మాణాత్మక నిదర్శనముల వంటివైనను సరే నిర్మాణ విధానము, సాం కేతికరచన, సన్ని వేశములయందలి సామ్యము మున్నగు వానిచే పూర్వోక్తమయిన అజంతా యొక్క పూర్వకాలికతను ధ్రువపరచుచున్నవి. పదవగుహ యొక్క ఎడమగోడ యందలి చిత్రలేఖనమునకును, దీనికి సమకా లికమయి, రెండవ శతాబ్దికి చెందిన కొండనే, కార్లే వద్దను గల శిల్ప విన్యాసమునకును, వస్త్రధారణము నందును ఆభరణములు, నైతిక లక్షణములు మానవ విగ్రహము లందు ప్రదర్శించుటయందు సన్నిహితమయిన సామ్యము కలదు.
తొమ్మిదవ గుహ కూడా ఒకచైత్యశాలయై యున్నది. దానికిని పదవ గుహకును నిర్మాణ రచనా విషయమున పోలిక కలదు. ఈ రెండును దాదాపుగ సమకాలికములు. తొమ్మిదవ గుహ 10 వ గుహకంటే కొంచెము పూర్వకాలికమని కొందరు వాదించుచున్నారు. కొంద రది 10వ గుహకంటె కొంచెము అనంతర కాలికమని వాదించుచున్నారు. 12 వ గుహ ఒక విహారము, అందు కుడి మూలనున్న ఒక కొట్టునకు ఎడమవైపున వెనుకనున్న గోడపై ఒక శాసనము కలదు. అందు దీనిని (గుహను) ఘనమడదుడను వణిజుడు కట్టించి యిచ్చెనని వ్రాయబడి యున్నది. ఈ శాసనము 10 వ గుహ యందలి వాశిష్ఠీ పుత్తకటహాది శాసనలిఖితము కంటె అనంతర కాలిక మనుట స్పష్టము.
13 వ గుహ ఒక చిన్న విహారము. దీని ముఖభాగము పడిపోయినది.12వ గుహయందువలె ఇందొక స్తంభరహిత శాల (Astylar) కలదు. అందు మూడు ప్రక్కలందు కొట్టిడీలు ఉన్నవి. ఒక్కొక్క కొట్టిడీలో రెండేసి రాతి సెజ్జలు కలవు. ఒక కొట్టిడీలో ఎత్తైన రాతి దిండ్లుగూడ నున్నవి. ఎనిమిదవ గుహాలయముకూడ ఒక విహారము. అది అత్యంతము నిమ్నతలముననున్నది. ఆ గుహాలయము విశేషముగా నాశనము కావింపబడియున్నది. అందలి తలము విద్యుద్దీపములను సమకూర్చు విద్యుదుత్పాదక యంత్రములను స్థాపించుటకు అనుకూల ప్రదేశముగా ఉపయోగ పడుచున్నది.
8, 9, 10, 12, 13 సంఖ్యలు కల అయిదు గుహలు క్రీస్తుశకముకంటే పూర్వకాలమునకు చెందినవిగా కనిపించుచున్నవి.
ఇయ్యాద్య గుహాఖనన కార్య సంరంభానంతరము వాకాటక రాజుల ఆధిపత్యకాలము వచ్చువరకు ఈ సృజనాత్మక కార్యమునందు ఒక విధమగు స్తబ్ధత యేర్పడినట్లు కనిపించును. వాకాటక రాజుల రాకతో శిలాఖననము అత్యధికముగా భారీయెత్తున ఆరంభింపబడెను. వాకాటక రాజులును, ఉత్తర హిందూస్థానమునందు సామ్రాజ్యాధిపత్యమును వహించిన గుప్తరాజులును సమకాలికులై యున్నారు. ఈ రెండు రాజకుటుంబములును వైవాహిక సంబంధమును కలిగియుండెను. పూర్వమందు నిర్మింపబడిన గుహాలయములయొక్క ఆదర్శము, వాటి యందలి చిత్రలేఖన సంపద కారణములుగానో - కళాత్మకమును, సృజనాత్మకమునగు నీ కార్యమునందు గుప్త చక్రవర్తులను మించవలెనను సమంచిత స్పర్థాభావమే కారణముగానో ఈ పునరుజ్జీవన విషయకమయిన ప్రచోదక శక్తి ఎద్ధియైననుసరే ఈ కాలమునందు మనకు రమణీయము లయిన గుహాలయములు లభించినవి. ఇవి ఈకాలమున ప్రవర్తిల్లిన వాస్తు విద్య, మూర్తి నిర్మాణము, చిత్రలేఖనము మున్నగువాటికి అత్యుత్తమ నిదర్శనములు. వీటిలో పెక్కింటి ఉత్పత్త్యభివృద్ధులకు కారణము ఉద్యోగుల' యొక్కయు, వత్స గుల్మము నందలి (నేటి బేసిమ్, అకోలా జిల్లా, బెరారు) వాకాటక రాజుల సామంతుల యొక్కయు, ఔదార్యమే. వాకాటక రాజగు హరిసేనుని (క్రీ. శ. 475-500) మంత్రి వరాహదేవుడు, 16 వ గుహాలయమును బౌద్ధ సంఘమునకు సమర్పించెను. 17వ గుహాలయమును హరిసేనుని సామంతుడు అశ్మకుడను రాజకుమారుడు దాన మొనర్చెను.
1, 2, 16, 17 సంఖ్యలుకల గుహాలయముల కాలానుక్రమమును గూర్చి విమర్శించినచో, 1, 16 సంఖ్యలుకల గుహాలయములు సమకాలికము లనియు, 17 వ గుహ, వాటికి అత్యంత సన్నిహితోత్తర కాలిక మనియు, 2 వ గుహ ఆ గుహాలయ శ్రేణిలో తుట్టతుదకు నిర్మితమయినదనియు, విద్వాంసు అందరును అంగీకరించిన విషయమే. కాబట్టి ఈ నాలుగు గుహాలయములును క్రీ. శ. 5 వ శతాబ్దికి చెందినవనియు, క్రీ. శ. 5వ శతాబ్ది మధ్యభాగమున నిర్మాణ కార్యశక్తికి సంబంధించి నట్టియు, అత్యంతోగ్రమును, ఫలప్రదమునగు కాలము ఘటిల్లిన దనియు తేటపడుచున్నది.
26 వ గుహ కొంచెము అనంతర కాలమునకుచెందినది. కుడివైపు దర్వాజా పైభాగమున వరండాకు వెనుకనున్న గోడపై శాసనమొకటి చెక్క బడియున్నది. అందు సుగతాలయము (బుద్ధాలయము) ను బుద్ధభద్రు డను నొకభితువు ధర్మముచేసినట్లు వ్రాయబడినది. ఇతడు భవ్వి రాజునకు స్నేహితుడు. భవ్వి రాజు అశ్మకుడను రాజునకు మంత్రి. ఇతడు 17వ గుహాలయమును కట్టించి యిచ్చినవాడుగాని, అతని ఉత్తరాధికారిగాని యైయుండవచ్చును. లేఖన శాస్త్రానుసారముగ, ఈ శాసనము క్రీ. శ. 450-525 సం॥రముల మధ్యకాలమునకు చెందినదిగా నిర్ణయింపబడినది. కావున క్రీ. శ. 6 వ శతాబ్ది ప్రథమార్ధ భాగమునందు శిల్పవిద్యా విషయకమును, కళాత్మకమునగు క్రియా సంరంభము ప్రవర్తిల్లినట్లును ఏడవ శతాబ్దిలో ఎట్టిప్రయత్నములేనట్లును తలంచుట కవకాశము గలదు. అయినను, 26 వ గుహోకోణమునకు ఎడమవైపునగల సమతలమునకు సంబంధించిన కుడిగోడపై వ్రాయబడిన ఒకానొక రాష్ట్రకూట శాసన ఖండము ఈ గుహాలయములు క్రీ. శ. 8, 9 శతాబ్దులలో ఉపయోగమున నుండెనని రుజువు చేయుచున్నది.
2. వాస్తువు
అజంతా యందలి ముప్పది గుహలలో రెండు గుహలు (9, 10 సంఖ్య గలవి) హీనయాన బౌద్ధమత శాఖకు చెందిన చైత్యాలయములని తెలిసికొని యున్నాము. ఇవి క్రీస్తు పూర్వయుగమునకు చెందినవి. మరి మూడు గుహలు ( 19, 26, 29 సంఖ్య గలవి.) మహాయాన బౌద్ధ శాఖకు చెందిన చైత్యాలయములు. ఇవి హీనయాన చైత్యముల కన్న చాల అర్వాచీనములు. క్రీ.శ. 5, 6 శతాబ్దుల కివి చెందియుండవచ్చును. మిగిలినవి గుహా విహారములు. ఇక్కడకూడ రెండు స్థూల విభాగములను మనము గుర్తింపవచ్చును. నాలుగు గుహలు ( 8, 12, 13, 30 సంఖ్య గలవి) క్రీస్తు పూర్వపు హీన యాన బౌద్ధశాఖకు సంబంధించినవి. మిగిలినవి అర్వాచీన కాలమున విలసిల్లిన మహాయాన బౌద్ధశాఖకు సంబంధించి యున్నవి. ఈ విహారములు పైన పేర్కొన్న మహాయాన చైత్యములతో సమకాలికములై యుండియుండును.
చైత్యాలయము లన్నిటికిని సామాన్యమగు ముఖ్య లక్షణములు కొన్ని కలవు. వీటి పై కప్పు గుమ్మటము లేక కమాను రూపములో నుండును. చైత్యము వెలువలి ముఖ భాగము (facade) నందు ద్వారముపైన గుఱ్ఱపు డెక్క ఆకారములో నున్న ఒక పెద్ద వాతాయనము కొట్టవచ్చినట్లుండుట మరియొక విశేష లక్షణము, చైత్యాంతర్భాగము స్తూపాకృతి స్తంభములతో వేరు చేయబడి, గర్భగుడి (నడిబొడ్డు), విశ్రాంతి మండపము (apse)చుట్టివచ్చు వసారాలు కలిగియుండును. వసారాయే విశ్రాంతిమండపము వెనుక భాగమునుగూడ చుట్టియుండి, ప్రదక్షిణ పథముగా ఉపయోగపడును. విశ్రాంతిప్రదేశపు నట్టనడుమ పూజాస్థానముండును. అది చైత్యాకారమును గాని, లఘు స్తూపాకారమును గాని, దగోడా (ధాతు గర్భము) ఆకారమునుగాని కలిగియుండును. ఇవియు పర్వతగర్భమున తొలువబడినవి యే.
మొదటి దశ చైత్యములు :- క్రీస్తు పూర్వము వెలసినవియు, హీనయాన బౌద్ధుల నిర్మాణములును అయిన ప్రాచీన చైత్యములలో బుద్ధవిగ్రహములు కాన్పించవు. బుద్ధభగవానుని భౌతికరూపమును యథాతథముగ ప్రదర్శించుట వారి సంప్రదాయమునకు విరుద్ధము. దీనిని వారు పట్టుదలతో పాటించిరి. శతాబ్దములు గడచి మహాయాన బౌద్ధము మహోన్నత స్థితికి వచ్చినప్పుడు ఈ లోపమును పూరించుటకై ప్రయత్నములు సాగెను. 9వ సంఖ్యగల గుహా బహిర్భాగమునందు బుద్దుని సమున్నత విగ్రహములు ముందున్న చెక్కడములపై తిరిగి చెక్కబడెను. అయినను పూర్వచైత్యాలయములందలి వాస్తువు నిరాడంబరమై, అర్వాచీన చైత్యముల వాస్తు నిర్మాణముతో అత్యంతము భిన్నించుచున్నది.
9వ సంఖ్య గుహ:- ఈ గుహ యొక్క వాస్తు లక్షణములను సంగ్రహముగ వీక్షించినచో పై అంశము విశదమగును. ఈ గుహ చతురస్రాకారములో నున్నది. దాని వెనుక కొనను దగోడాయు, దాని చుట్టివచ్చుచు, వర్తుల స్తంభపరంపరయు గలవు. ఇది విశ్రాంతి మందిరస్థానము. దగోబా మీది యండము అర్ధవర్తులముగా నుండి, విషమ వృత్తాకారమైన దిమ్మపై నిలచినది. ఈ దిమ్మ ఎత్తుగా నుండి నిరలంకృతముగా నున్నది. దాని చుట్టును కంచెకట్టు ఉన్నది. మీదికి పోయిన కొలదియు ఇది తలక్రిండైన పిరమిడు రూపములో నున్నది. శిఖర భాగమునందు రెండు దారునిర్మిత ఛత్రములుండిన ట్లూహించదగియు న్నది. ఛత్రదండములను నిలుపుటకు పై భాగమున కల్పింపబడిన గుంటలు దీనికి నిదర్శనములు. ఈ గుహయందలి స్తంభములు సాధారణాలంకారము మాత్రము కలవియై అష్టకోణాకృతి కలిగి, క్రింది దిమ్మకాని, మీది దిమ్మకాని లేకుండ నున్నవి. విశ్రాంతి మందిర భాగముల పైకప్పు చదునుగా నుండి రెండు చిన్న కిటికీల గుండ వెలుతురు లోనికి ప్రసరించుచున్నది.
ఈ కాలపు చైత్యముల ప్రధానలక్షణ మేమన, అవి దారు నిర్మాణములను అంధప్రాయముగ ననుకరించు చున్నవి. వాటి పూర్ణాకృతులును ముఖ్య వివరములును గూడ దారు నిర్మాణముల యనుకృతులే. నాటి శిలా శిల్పులు వీటిలో కట్టె దూలములను, వాసములను గూడ నిష్ప్రయోజనముగనే చొప్పించుటకు సిద్ధపడిరి.
అర్వాచీన చైత్య సభలు :- అనంతర కాలమున వెలసిన మహాయాన చైత్య సభలు మూడింటిలో ఒక్కటైన 29 వ సంఖ్య గుహ అసంపూర్తి నిర్మాణము. మిగిలిన రెండును అనగా 19, 26 సంఖ్యల గుహలు ప్రాచీన చైత్యముల యొరవడినే ఆకృతిగా గలిగియున్నవి. అత్యంత ముఖ్యమైన భేద మేమన, వీటిమీది యలంకరణము సువిపులమై, అణువణువునకు శ్రద్ధతో చేయబడి యున్నది. దగోబామీదనే గూళ్ళలో బుద్ధ విగ్రహములు చెక్కుట జరిగినది. బుద్ధుడు సింహాసనముపై కూర్చున్న యట్లును, నిలుచున్నట్లును, వివిధరీతులలో బుద్ధ విగ్రహములు లాజుల పై భాగపు కుడ్యముల మీదను, విశ్రాంతి మందిరపు వెనుక గోడలమీదను చెక్కబడియున్నవి. బుద్ధాకృతులు కుప్పలు తిప్పలుగా వీథి నదరున (Fracade) మలచబడియున్నవి. వాస్తవమునకు గుహాంతర్బహిర్భాగము అన్నియు సమానముగ శిల్ప బాహుళ్యముచే కృతములై యున్నవి. ప్రాచీన చైత్యములందలి ప్రశాంత గంభీర వాతావరణము తొలిగి దానిస్థానే ప్రభూతాద్భుత శిల్ప సంపద చెలువారుచున్నది. అర్వాచీన చైత్యములలో నడికప్పునకును, చైత్యవాతాయనముల గళ్ళ పనికిని గూడ కట్టెవాసములను వాడు ఆచారము త్యజింప బడెను. సభాభవనమునందలి స్తంభములు నిట్టనిలువుగా తొలువనై నది. పిరమిడు ఆకృతిలోని పిట్టగోడ వీటియందు కాన్పించదు. స్తంభములు వర్తులములై చక్రాకృతిలో నున్న వలయపు గుంటలుగల్గి, లతాలంకరణములు. ఆభరణాకృతులు వీటిపై చెక్కబడి యున్నవి.
19 వ సంఖ్య గుహ బౌద్ధుల గుహా నిర్మాణ వాస్తువునకు సమగ్ర ప్రతినిధియైన మచ్చుతునకగా పరిగణింపబడు చున్నది. గుహాంతర్భాగము నందలి స్తంభము లన్నిటికిని స్తంభపు పైదిమ్మె మీద మధ్యభాగమున ఆసీన బుద్ధుని విగ్రహములు చెక్కబడియున్నవి. దూలముల తన్నులు (Brackets) ముందుకు చొచ్చుకొని వచ్చినట్లుండును. ఇవి మావటీలతోగూడిన ఏనుగులు, శార్దూలములు, ఎగురుచున్న మిధునములు, సన్న్యాసులు, గాయకులు మున్నగు రూపములలో చెక్కబడినవి. అగ్రభాగమునందున్న రెండు స్తంభములపైని తన్నులు సాలభంజికల రూపమున నున్నవి. లాజులమీది కుడ్యముపైన బుద్ధ విగ్రహములు ఆసీన స్థితిలోను తిష్ఠదాకారములోను, గదులు గదులుగ చెక్కబడినవి. వీటికి నడుమ నడుమ జంతు మనుష్య విగ్రహములలో అల్లుకొనిన జిలుగుపని కూర్పబడినది.
ఈ గుహ వీథినదరు అత్యద్భుతమైన చిత్రములతో నలంకరింపబడి యున్నది. ద్వారమంటపము చిన్నదయ్యు, అందలి స్తంభములు లలితలలితములై యున్నవి. ముంజూరుపైన చైత్య వాతాయనము గంభీరముగా కాననగును. దీని కిరుప్రక్కలను స్థూలాకృతి యక్షవిగ్రహములు చెక్కబడియున్నవి. వీటికి తిరోభాగమున సున్నితమైన స్తంభపు అంచుకట్టు పనితనము గలదు. ఈ భాగమంతయు చిత్రభావన యందును, పనితనమునందును, శిఖరముల నందుకొన్నది. చిత్రవివరణములయందు నిస్తుల సంపదయు, చిత్రముల పరిమాణములయందు లాలిత్యమును ముఖ్యముగ గమనింపదగినవి.
26 వ సంఖ్యగల గుహకూడ మహాయాన చైత్య సభా మంటపమే. అయినను అది 19 వ గుహకన్న పెద్దది. కాని గుహానిర్మాణము నందును, అలంకరణము నందును ఇది 19 వ గుహకు తీసికట్టు అని చెప్పవచ్చును. ఇచ్చటి చిత్రాలంకరణము కడుశ్రద్ధను చూపెట్టుచున్నను, చిత్రకారుడు అతిగాపోయి శిల్పించినాడను భావము తోచును. చిత్రపరిమాణములలో సమత్వలా లిత్యములు కొరవడి లయ సమన్వయము చెడినట్లనిపించును. మొదటిదశ : విహారములు :- క్రీస్తుపూర్వపు విహారములు నిరలంకృతములై, ఆకృతినిష్ఠురములై కాన్పించును. వీనిలో మధ్య గది యొకటి యుండును. దీని చుట్టును మూడు ప్రక్కలను అరలు (cells) ఉండును. ఈ యరలు చిన్న పరిమాణములలో నుండును. ప్రధాన మందిరముతో కలుపుటకు వీటికి ఇరుకుద్వారములు కలవు. అరలలో నిడుపు బల్ల లరీతిగ చెక్కి, ఒక భాగము తలగడవలె నుండుటకై కొంచెము ఎత్తుగ ఏర్పరుపబడి యున్నది. ఇది బౌద్ధ సన్యాసుల శయన సౌకర్యములు.
12 వ గుహ మిక్కిలి ప్రాచీనమైన విహారముల విభాగమునకు చెందును. కాని 13 సంఖ్య గుహ ప్రాచీన విహారములకు చక్కని యుదాహరణము కాగలదు. దీని నడిమిగది 13½ అడుగుల వెడల్పు, 16½ అడుగులలోతు, 7 అడుగుల ఎత్తు కలిగియున్నది. మధ్య మందిరమునుండి వెలువడు అరలు సప్తసంఖ్యలో నున్నవి. ఇందు మూడు అరలు ఎడమ భాగమునను, కుడిభాగమునను వెనుక వైపునను రెండేసి యరలును గలవు. బౌద్ధ భిక్షువులందుకూడ అలంకరణ ప్రీతినిసర్గమగుటచే, వారు తొలికాలమునుండియు ఈ యరల మీద బుద్ధ పవిత్ర చిహ్నములను, దగోబా, పవిత్రమైన కటకటాలు, రాతితెరలు మున్నగువాటిని చెక్కుచుండిరి. ఈయంశమున అజంతా విహారములు, సమకాలికములైన భాజా, బేడ్సా, జున్నారు, నాసికు మొదలగు ప్రదేశములందలి గుహా విహారములను బోలియున్నవి. ఇవియన్నియు క్రీ. పూ. రెండవ లేక ఒకటవ శతాబ్దమునకు చెందినవి.
అర్వాచీన విహారములు :- క్రమముగ బౌద్ధమతముజనాదరణమునందు బలీయమగుచు వచ్చిన కొలదియు, భిక్షుకుల సంఖ్య హెచ్చదొడగెను. విహారముల విస్తీర్ణతా పరిమాణములు పెద్దవయ్యెను. మహాయాన మత విజృంభ ణముతో విహారములు దేవాలయములుగ మారజొచ్చెను. పూజావిధానమునకై బుద్ధుని మనుష్యాకార విగ్రహములను నిర్మించుటకు మహాయానము అనుమతించెను. ఈ కాలపు విహారములందు విహారమునకు వెనుక భాగమున విగ్రహ స్థానమైన మందిర ముండుట ఆచార మయ్యెను. 4 వ సంఖ్య గుహలో మొట్టమొదటిసారిగా పూజావిగ్రహమును, పూర్వమందిరమును ప్రవేశ పెట్టుట చూడనగును. ఇది అత్యంత ప్రాచీనమైన మహాయాన విహారము, దీనిలో 87 చదరపు టడుగుల విస్తీర్ణముగల చావడికలదు. వెనుక భాగమున పూర్వ మందిరమును, పూజావిగ్రహమును ఉన్నవి. బౌద్ధ జీవితము యొక్క ఉత్తమలక్షణములు దీనియందు ప్రతిబింబించు చున్నవి. గుహ మిక్కిలి విస్తీర్ణము కలిగియున్నది. దీని వాస్తులక్షణములు బృహదాకార సంపన్నములై యున్నవి. అలంకార చిత్రము మితిమీరి లేక పొదుపరిలక్షణము కలిగియున్నది. ఈలక్షణములు బౌద్ధ మతము యొక్క సంయమనశీలమును, ఆధ్యాత్మిక జీవితము యొక్క నిరతిశయ వైపుల్యమును సూచించుచున్నవి. ఈ విహారము క్రీ. శ. మూడవ శతాబ్దిలో కాని అంతకు పూర్వము కాని తొలువ బడియుండునని తోచును. ద్వారబంధముమీదను, వాతాయనముల మీదను కనబడు చెక్కడపుపని అనంతర కాల ములో జరిగియుండును.
11 వ సంఖ్య గల గుహ నిర్వివాదముగ మహాయాన గుహలలో పూర్వపూర్వతర కాలమునకు చెందినదని చెప్పవచ్చును. నాసికు నందలి శ్రీయజ్ఞ గుహతో దీనిని పోల్చుట వలన ఇది క్రీ. శ. నాల్గవ శతాబ్ది నిర్మాణముగా భావింపబడుచున్నది. ఈ గుహయందలి హాలు (చావడి) మధ్యమమున నాలుగు స్తంభములున్నవి. 7 వ సంఖ్య గుహలో ఈ స్తంభములు ఒక దాని సరసన మరొకటిగా రెండు వరుసలలో నున్నవి. 6 వసంఖ్య గుహలో మధ్య స్తంభములు చతు స్సంఖ్యలో నున్నను అన్ని వైపుల చుట్టువారుగ మరొక వరుస స్తంభములు కలవు. అజంతా యందు రెండు అంతస్తుల గుహానిర్మాణమునకు 6వ గుహయే ప్రథమోదాహరణము ఈరీతి స్తంభ కల్పన సంతృప్తినీయజాలకపోయెననుట తెల్లము. చావడి చతుర ప్రాకారముతో వలయాకార స్తంభములకు పొత్తు కుదుర కున్నది. మరొక లోపమేమన, రెండువరుసల స్తంభము లుండుట చేత చావడి క్రిక్కిరిసినట్లగుచున్నది. దీని పర్యవసానమే చావడిచుట్టును సుసంగతములై, సమైక్యమైన ఆకృతిగల స్తంభయుగళ నిర్మాణము (colonnade). ఇట్టి రచన 1, 2, 16, 17 సంఖ్యల గుహలలోను, 6వ గుహ పై యంతస్తులోను కాన్పించును. సమతా లక్షణముగల స్తంభయుగళ నిర్మాణమును, సుసమృద్ధమైన అలంకరణ చిత్ర సంపదయు ఈ గుహల కొక యద్భుత సౌందర్యము నాపాదించుచున్నవి. ఈ సౌందర్యము కొన్ని గుహలలో విస్తారమైన వర్ణచిత్ర కల్పనముచే ద్విగుణీకృతమైనది.
శేషించిన అజంతా విహారములలో 16, 17, 1, 2 సంఖ్యల గుహలు మిక్కిలి ప్రాముఖ్యము వహించినవి. మొదటి రెండును క్రీ.శ. 5వ శతాబ్ది చరమపాద నిర్మాణములని నిశ్చయించుటకు వీలగు శాసనలేఖనములు కలిగియున్నవి. 16 వ గుహలో 65 అడుగుల చదరము చావడియున్నది. చుట్టును 20 స్తంభయుగళము లేర్పరుప బడినవి. దీని వెనుక భాగమున ప్రలంబ పాదాసనమునచెక్కబడిన బుద్ధుని విగ్రహముగల పూజామందిరమున్నది.ముందరి భాగమున ఐదు స్తంభములపై మోపిన కప్పుగల వసారా కలదు. వసారాకును చావడికిని రెండు ప్రక్కల 14 అరల వరుస యున్నది. మరి రెండు అరలు పూజా మందిరము రెండు ప్రక్కలను చావడి లోపలి భాగమున కానవచ్చును. చావడియందు 20 స్తంభములు కలవు.
17వ సంఖ్య గుహ :- ఇది పై గుహతో సమానమైన యాకృతి రచన కలిగియున్నది. దాని స్తంభములు కూడ పై గుహా స్తంభముల వలె అలంకార సంపద వహించి యున్నవి. అవి శిఖర ప్రదేశము నందును అడుగుభాగము నందును చతురస్రముగా నున్నవి. వీనికి మధ్యభాగమున మాత్రము అంచుకట్టుపని కలదు. వసారాయందలి స్తంభములకు క్రింద చెక్కుడు దిమ్మలును, పైన చెక్కడపు తన్నులును గలవు. విగ్రహమున్న మందిరపు ద్వారముపై సవిస్తరమైన శిల్పము కలదు. దీనిపై లతాగుల్మాకృతులు, బుద్ధవిగ్రహములు, ద్వారపాలికలు, రింగులు రింగులు, పెనవేయబడిన మోకు నమోనాలు, గోడలో రాసిన చదరపు స్తంభములు, కమల పత్రములు మున్నగునవి చెక్కబడియున్నవి. మూలలందలి ఉబ్బు ప్రదేశములలో మకరములపై నిలిచియున్నట్లు చెక్కబడిన నారీ విగ్రహములు నేత్రానందకరముగ నున్నవి. పూర్వమందిరము నందలి స్తంభములు, చతుష్కోణ స్తంభములు ప్రశస్తా అంకరణమునకు నెలవులై యున్నవి.
1 వ సంఖ్య గుహ :- స్తంభముల యింపు సోంపులలోను, తదితర వాస్తు అంగ ప్రత్యంగముల కళా ప్రభానము నందును, 16, 17 సంఖ్యల గుహలు, 1 వ గుహ కన్న మిన్నగా ఉన్నను మొత్తముమీద పరికించినచో ఆకృతి రమ్యతయందు ఈ గుహ వాటిని అధఃకరించు చున్నది. ఈ నాల్గు విహారములలోను ఇదియే విశాలతమమైనది. దీనిలో ద్వారమంటపము, వసారా, నాల్గు వైపుల సన్న త్రోవలుగల చావడి, పూర్వ మందిరము (Ante-chamber), బుద్ధభగవానుని అంబర చుంబియైన విగ్రహము చెక్కబడియున్నవి. విహారము యొక్క అంత ర్యాగమునందు 14 అర లున్నని. వసారాకు రెండు ప్రక్కలను మరిరెండు చిన్న గదులు గలవు. వసారా 64 అడుగుల నిడివియు, 9 అడుగుల వెడల్పును, 12 అడు గుల 6 అంగుళముల ఎత్తును కలిగియున్నది. దీని మధ్యలో ఒక పెద్ద ద్వార మున్నది. ద్వారబంధము, స్తంభోపరి భాగములు మిక్కిలి సుందరముగ చెక్క బడినవి. ద్వారము 64 అడుగుల చదరమైన పెద్ద చావడిలోనికి తెరచుకొనును. దీని కప్పు భారమును 20 స్తంభయుగళములు మోయుచున్నవి. చుట్టును 9 అడుగుల 6 అంగుళముల వెడల్పు వసారా యున్నది. చావడి వెనుక భాగమున ఉన్న పూర్వమందిరము 10×9 అడుగుల కొలతలతో నున్నది. దీనినుండి పూజామందిరమునకు పోవు ద్వారము కలదు. ఇది యద్భుత శిల్పములతో కూడియున్నది పూజామందిరము దాదాపు 20 అడుగుల చదరముగా తీర్చబడినది.
ఈ గుహాంతర్భాగము నందలి స్తంభములు ఆకృతి యందలి వైవిధ్యముతోను, అలంకార శిల్పము నందలి చమత్కృతితోను, వాటిని శిల్పించిన విశ్వకర్మల బుధ్ధి వైశద్యమును నిరూపించుచున్నవి. ఈ గుణములతోపాటు గుహా విస్తీర్ణతవలన నిరవధిక భావము కలిసి భారతదేశము నందలి సుందరతమమగు గుహావిహారములలో నొక్కటిగా ఇది పరిగణింపబడుచున్నది. ద్వార మంటపము విధ్వంస మొనర్పబడుటచే ఈ గుహావిహారము యొక్క వెలుపలి భాగము కొంత సొంపు చెడియున్నది బుద్ధభగవానుని జీవిత సన్నివేశములును, గజయుద్ధములు వేట చిత్రములు ఇక్కడ అద్భుత కౌశల్యముతో చెక్కబడి యున్నవి. ఇవి శిల్పము యొక్క అగ్రశిఖరము నందు కొన్నవి. గుహయొక్క వీథి సదరు అలంకార శిల్పము నందు నిస్తులమై అత్యంత సుందరమై విపులమై యున్నది. దివ్యసుందరముగ శిల్పించిన స్తంభములును, స్తంభోపరిశిల్పపు విన్నాణము మొత్తమయి విహారము యొక్క అద్భుత రామణీయకతను, గాంభీర్యమును పెంపొందించు చున్నవి.
2 వ సంఖ్య గుహ, 1 వ సంఖ్య గుహకు చాలా వరకు ఆమ్రేడితమని చెప్పవచ్చును. దాని చావడి మొదటి గుహకన్న చిన్నదిగా నున్నది. స్తంభములును వాటి కొలతలలో కొంత భేదించుచున్నవి. కాని ఈ గుహ యొక్క ఆకృతిరచన యందలి క్రమసంపదయు, సమైక్యతయు కలిసి ఒకటవ సంఖ్య గుహకన్న యిది భావనాసీమ యందు విశిష్టతరమైనదిగా భాసించుచున్నది.
ఈ కాలమున వాస్తుశాస్త్రము మహోన్నత స్థితి నందెననియు, ఉత్తమ వాస్తు సంప్రదాయములు క్రమ పరిణామ దశయం దుండెననియు నిరూపించుటకు మరియొకటి రెండు గుహలను గూర్చి ప్రసంగింపవచ్చును. దీని తరువాత ఏ కారణముననో కాని అజంతా యందు సృజనాత్మకమైన చైతన్యము ఒక్క మారుగా అంతర్ధాన మొందెను. ఉదాహరణమునకు 24 వ సంఖ్య గుహను చెప్పవచ్చును. దీనియందలి చావడి 75 అడుగుల చదరమై 20 స్తంభములు కలదిగా కల్పింపబడినది. కాని యిది అసంపూర్ణముగ విడువబడినది. వసారాయు, వీథి నదరు స్తంభములు మాత్రము శిల్ప సమగ్రతను పొందినవి. ఇచ్చటి స్తంభములన్నియు ఒక్కటిమాత్రము వెల్తిగా విధ్వంసక మగుట దురదృష్టము. కాని గుహ - ఆకృతి రచనా సౌందర్యమును, పైకప్పునందలి ముఖ్య దూలమునకు సంబంధించిన స్తంభోపరిభాగములను మలచుట యందు ప్రదర్శింపబడిన శిల్పాచార్యకమును బట్టి ఇచ్చటి విహారము లన్నిటిలోని కిది తలమానికముగాను, అద్భుత నిర్మాణముగల గుహగాను సిద్ధముచేయుట కుద్దేశించిరని తోచును. 21 సంఖ్య గుహ యందు అజంతా గుహా స్తంభముల సామాన్య లక్షణమగు 'తెర' రూపమయిన స్తంభ శిరస్సు అదృశ్యమగుట గణింపదగిన విషయము. ఇప్పటి నుండియు 'కలశము - పర్ణావళి' రూపమైన స్తంభ శీర్షము శిల్పరంగమున ప్రవేశించినది. భారతదేశపు అనంతర వాస్తువునం దిది సర్వజనాదరణము పొందినది. 24వ గుహలో ఈ వస్తువే కొలదిగా అభివృద్ధినొందిన పథకములో కాన్పించుచున్నది. ఈ గుహ మూడవ సంఖ్య గుహకన్న అనంతర కాలమునకు చెందినది కావచ్చును.
3. శిల్పము
అజంతాశిల్ప మంతయు చాలామట్టుకు మహాయాన సంప్రదాయమునకు చెందినదై యున్నది. క్రీస్తుపూర్వపు నాటి ప్రాచీన గుహలలో శిల్పమేమియు లేదనవచ్చును. వాటిలో గోడలమీద వర్ణ చిత్రలేఖనము, కళాద్యోతకములగు అలంకరణములు మాత్రము కలవు. నిజమునకు 'భాజ' మొదలుకొని చాలవర కన్ని గుహాలయములలో నిదియే స్థితి కలదు. శిల్పము క్రీస్తుతరువాత రెండవశతాబ్ది నుండి మాత్రమే కాగనగును.
శిల్పప్రారంభమునకు చెప్పబడిన ఈ కాలమును బట్టి భారతీయ శిల్పకళకూడ కొయ్య చెక్కడపు పనులనుండి ఉత్పన్నమైనదని వాదింపబడుచున్నది. కాని భారతశిల్పకారుడు ఇంతకుపూర్వము కొన్ని శతాబ్దులనుండియు రాతిచెక్కడమునందును తొలుచుటయందును అభ్యాసము కలిగియుండెనని స్పష్టముగా తెలియ వచ్చుచున్నది. మౌర్యుల రాజధానులును, భార్హూత్ శిల్పములును గొప్పనేర్పుతో కూడిన హస్తలాఘవముతో రాతిచెక్కడ మందు శిక్షితులైన శిల్పకారులచే నిర్మింపబడెను.
శిల్పమందలి సాంకేతికత : భారత శిల్ప కారునిచే అనుసరింపబడిన సాంకేతిక విధానము మిక్కిలి కౌశలముతో కూడినదై వంశపరంపరాగతమును, సాంప్రదాయకమును అగు శిల్పవిజ్ఞానము యొక్క అనేక శతాబ్దముల అనుభవమును నిరూపించు చున్నది. స్థూలా కారమును తయారుచేయుటకు వెడల్పగు ఉలియు, సున్నితమైన వివరములను చెక్కుటకు సన్నని ఉలియు వాడబడెడివి. బొమ్మలపై ఉలిచెక్కడముల చిహ్నములేమియు కనుపించకుండ నుండునట్లు చెక్కబడెడివి. ముఖములు, చేతులు నునుపుగా రుద్దబడెడివి. ఈపని అన్ని యెడలను అత్యంత నిర్దుష్టముగ చేయబడినది. ఈ ప్రాచీన శిల్పములలో చాలాభాగము సవ్యహస్త శిల్పులచే చెక్కబడెను.శిల్పముల వామభాగములను చెక్కుటయందు ఆకృతి రచనలోను, నునుపుదనము నందును స్వల్పలోపములు కనబడుచున్నవి. అజంతా శిల్పము సంప్రదాయగతమైన సాంకేతిక చిహ్నములకును, బుద్ధుని మానవాకారములో చిత్రించగూడదను నిషేధమునకును అతీతమైన దగుచు పలు విధములగు రీతులలో కాన్పించును. బుద్దుని యొక్కయు, బోధిసత్వుల యొక్కయు, ఇంకను ఇతరమైన బొమ్మలయొక్కయు పూర్ణ చిత్రణము చేయుటయందు అప్పటికి సాధింపబడిన శిల్పప్రాశస్త్యమును ఇవి ప్రదర్శించును. ప్రాచీనమగు అమరావతి, నాగార్జునకొండ లందు వలెనే ఇచ్చటను ఉబ్బెత్తుబొమ్మల శిల్పము (Bas - relief) తన విశిష్ట జీవచైతన్యమును నిలుపుకొన్నది. వర్ణ చిత్రలేఖన మభివృద్ధి గాంచిన పిదప కథనాత్మకమగు దృశ్యముల చిత్రణమునందు ఉబ్బెత్తు చిత్ర శిల్పము ప్రాచీన కాలమందువలె ప్రత్యేకతను ఎక్కువకాలము నిలుపుకొనలేక పోయెను. అయినను వర్ణ చిత్రలేఖనముగాని కేవల వాస్తువివరణముగాని ప్రత్యామ్నాయముగా వినియోగపడని పరిస్థితులలో అలంకరణ ప్రభావము కొరకై ఉబ్బెత్తు చిత్రముల శిల్పమే యింకను ప్రత్యేకమైన విలువను కలిగి యుండెడిది. నిజమునకు వర్ణ చిత్రలేఖనము అత్యున్నత దశనందిన యీ కాలములో ఉబ్బెత్తు చిత్రముల శిల్పము వాస్తువుతో సమైక్యత పొందినది. విగ్రహనిర్మాణ సమస్యలు శిల్పవిద్యకు వదలిపెట్టబడెను. ఈనాటి విగ్రహ శిల్పులు భక్తులను, కళాభిజ్ఞులనుకూడ సంతోష పెట్టగల అపురూపమైన శిల్పపరాకాష్ఠను సాధించిరి.
స్తంభఫలక చిత్రణ శిల్పము (Pillar Medallion) అమరావతి యందు అసమానమగు పరిపూర్ణతను పొందెను.అజంతా శిల్పి ఈ అమరావతీ కళా కౌశలమును వారసత్వముగా గైకొనుచు ఉబ్బెత్తు చిత్రముల అలంకరణ మందు తన అసమాన ప్రజ్ఞను వెలిబుచ్చెను. పత్రసంపద, పుష్పసమృద్ధి, వీటి నిర్మాణములోని నాణ్యము, కమల సౌందర్యమును, తు, చ, తప్పకుండ శిల్పించుట - " స్తంభఫలకముల మధ్యభాగమున చిత్రితములై, విచ్ఛిన్నమై తీగెచుట్టలుగా పరిణమించు జలముల చిన్న సుడులలో తేలియాడు శతపత్రముల శిల్పము వేయేల, ఆకృతి రచన యందలి నిరతిశయానందము, దాని సజీవచై తన్యశక్తియు అజంతా శిల్పమునందు నిస్సందేహముగా పొడగట్టుచున్నవి. అజంతా పనితనము అమరావతీ శిల్పమునుండి ఆవిర్భవించి పరిణామము నొందిన శిల్పమని యిది నిదర్శించు చున్నది.
శిల్పము వాస్తువు యొక్క సమన్వితాంశముగా అజంతాలో స్పష్టముగా కనిపించును. ఇచట కొన్ని దృష్టాంతములు చెప్పవచ్చును; మొదటి గుహలోపలను, వసారాలోను, స్తంభముల ఆమలకములు (capitals) శిల్పము - వాస్తువు వీని సౌందర్య సమ్మేళనమును చక్కగా నిరూపించుచున్నవి. నాలుగుమూలలందు ఉన్న మరుగుజ్జు బొమ్మలు, ఆధార - ఆమలకముల (bracket-capitals) సవిస్తరాలంకరణము, రెండు మధ్యస్తంభముల నడిమి నిడుపాటి దూలముల మీది మిక్కిలి సున్నితమై అద్భుత సౌందర్యము వెలార్చు శిలాలంకార రీతులును,ఆమలకముల మధ్య కూర్చొనియున్న మరుగుజ్జుబొమ్మలు, కప్పుచూరువంటి భాగము మీద పూలమాలలు పట్టుకొని యెగురుచున్నట్లు చిత్రింపబడిన బొమ్మ జంటలును, సున్నితమగు మకరముల చెక్కడములు కలిగి, మరుగుజ్జులచే `పహింపబడుచున్న ఆమలకముల క్రింది చదరపు ఫలకములును, కాండముల మధ్య సంపీడితమైన మెత్తవంటి ఆమలకమును, వసారాలోని గోడలో కలిసిన రెండు స్తంభములమీద చెక్కబడిన అర్ధకమలములు, పూర్ణకమలములు గల ఫలకములును, ముత్యపు సరులను వెడలగ్రక్కుచుండిన కీర్తిముఖమును, మరియు దాని చివర భాగములను పట్టుకొని యెగురుచున్నట్లు బయటి స్తంభముల మీది ఆమలకముల క్రింది చతురస్ర ఫలకముల మీద చెక్కబడిన రెండు బొమ్మలును, కొన్ని పెద్ద స్తంభములమధ్య ఫలకముల మీద చెక్కబడిన ఉపదేశ బుద్ధుని ప్రతిమలును, కుడివైపున పూర్తిగా బయటనున్న స్తంభము యొక్క మధ్య ఫలకము మీద చిత్రింపబడిన మన్మథ జైత్రయాత్ర. బుద్ధుని ప్రలోభసము- ఇవి అన్నియు శిల్పమునకు వాస్తువునకు గల సమైక్యత యొక్క పరిపూర్ణతను నిస్సందేహముగా వెల్లడించు దృష్టాంతములు.
16 వ, 17 వ గుహలు శిల్పదృష్టిలో నెట్లు ముఖ్యమైనవో అట్లే వర్ణచిత్ర లేఖనమందును, వాస్తు సంపద యందును అంతముఖ్యములై యున్నవి. 16 వ గుహలోని ఆధార ప్రతిమలు, ముఖ్యముగా ఎగురుచున్న జంటలు, ప్రశంసనీయమగు సౌందర్యమందును, ఆకృతులయందును సాటిలేని వై యున్నవి. చావడిలో వెనుక వరుసలోని అతి రమణీయమగు అలంకరణములుగల రెండు మధ్యస్తంభముల అడుగుభాగమును నాలుగు తలలతో మోయు సింహముల యెనిమిది బొమ్మలు చెప్పతగిన వైయున్నవి. ఈ సింహములు ఒక దాని వెన్నును మరియొకటి ఆనుకొని కూర్చున్నట్లు చెక్కబడినవి. ఈ గుహలోని గర్భాలయ ద్వారము, దానిమీద అనేక భాగములలో తొలువబడిన పుష్పసంబంధమగు విపుల చిత్రములతోను, బుద్ధ విగ్రహములతోను,ద్వారపాలికలతోను, వలయాలంకారములతోను, త్రాటి మెలికలతోను, కుడ్య స్తంభములతోను, పద్మ దళములతోను, ఆశ్చర్యజనకముగా నుండును. మూలలందలి చూరులమీది మకరములపై నిలిచియున్న స్త్రీ ప్రతిమలు, ముందుగదిలోని స్తంభములు, కుడ్యస్తంభముల మీది అలంకరణములు కూడ విశేషముగా మనోరంజకములై యుండును.
సంగ్రహముగా చెప్పదలచినచో, ఊహాతీతమైన అల్లిక పనితనమునకును, శిల్పగతమైన వాస్తువిన్యాసములకును, అజంతా ఒక గొప్ప చిత్రప్రదర్శనశాల యని నుడువ వచ్చును, ప్రాచీనమైన భారత దేశపు . ఏ కళా క్షేత్రమునకు గాని పురాభవనమునకుగాని యిది తీసిపోదు. వాస్తు నిర్మాతలైన యీ ప్రాచీన కళావిదుల శక్తిని గూర్చియు, వారికిగల ఓషధీపరిజ్ఞానమునుగూర్చియు గ్రిఫిత్సు చెప్పినది అతిశ యోక్తి కాదు.
వర్ణచిత్రలేఖనము మాసిపోయిన అన్ని గుహలలోను ఉబ్బెత్తు చిత్రములందు కనబడు అలంకరణాత్మకమగు పని నిజముగా అత్యాకర్షణీయమై యున్నది. పౌరాణిక వృత్తాంతములను, రేఖాగణితాకృతులను, పుష్పవితానములను, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు బొమ్మలను కలిగియున్నదై యీ అలంకరణము విన్యాసములయొక్క అనంత వైవిధ్యమును చూపును. పక్షి. జంతు చిత్రములలో ముఖ్యముగా మకరముల యొక్కయు బాతుల యొక్కయు చిత్రణము శిల్పి యొక్క కల్పనా చమత్కృతి ననుసరించి అపురూపమగు అలంకరణములతో కూడి చిత్రవిచిత్రమగు ఆకారములు కలదైయున్నది. ఇచట బుద్ధుని యొక్క వ్యక్తిత్వమును సంపూర్ణముగా శిల్పమందును చిత్రమందును ప్రకటించుటకు తగిన ఆదర్శపూర్వరంగమును సృష్టించుటలో శిల్పి యొక్క అద్భుత కల్పనాశక్తియు, పరిపూర్ణ కౌశలమును తోడ్పడినవి.
జంతువులు : అజంతాలోని బుద్ధ విగ్రహమునకు సంబంధించిన గొప్ప చెక్కడములను పరిశీలించుటకు ముందు వాటికి ఏ విధముగను తీసిపోక శిల్పిచే గైకొనబడిన మరికొన్ని యితివృత్తములనుగూర్చి సంగ్రహముగా చెప్పతగియున్నది. ఉదాహరణముగా అజంతాలో చెక్కబడిన జంతువుల బొమ్మలు వాటి అలవాట్లను, వాస్తవికత ఉట్టిపడునట్లు ప్రకటించగల సామర్థ్యమును వెల్లడించుచున్నవి. ఏనుగు, ఆ జంతువునకు స్వభావ సిద్ధమగు అనేకమైన తీరులలో చూపబడెను; అట్లే యితర జంతువుల శిల్పములు కూడ శిల్పి యొక్క సూక్ష్మ పరిశీలనను నిరూపించుచు జీవ ముట్టిపడు చున్నది. అజంతాలో అనేక స్థలములందు కనబడు లేడి, సింహము, తుదకు పొట్టేలు (రెండవ సంఖ్య గుహలో పొట్టేళ్ళ పోరాటము చిత్రితమైనది) మొదలగు జంతువులు వాటి అవయవ నిర్మాణము నిర్దుష్టముగను, కళాత్మకముగను ఉండురీతిని వాటి వాటి కుచితమగు పరిసరములలో సున్నట్లు శిల్పింపబడినవి.
ఒక స్తంభము యొక్క ఆమలకముపై ఒకే శిరస్సు కలిగిన నాలుగులేళ్ళు చెక్కబడిన ఫలకము ముఖ్యముగా పేర్కొన దగియున్నది. ఈ ఆమలక విషయమునందు శిల్పి యొక్క ప్రతిభ, నాలుగు శరీరముల నొక శిరస్సుతో కలుపుటయందలి 'కొంటెతన మందుగాక, వాటిలో ప్రతిబొమ్మ యందు నిజమగు లేడి యొక్క జీవకళలో కూడిన తీరును చూపుటయందు గలదు. క్రింది యెడమ లేడి నేలమీద కూర్చుండి అపాయమును శంకించినట్లు తలయెత్తి ముందునకు చూచుచున్నది. అదే శిరస్సు వేరొక తీరులో కుడిప్రక్కనున్న దాని సహచర మృగమునకు వెనుకతోచిన అపాయమును పసిపట్టుటకు మెడవంచి జాగరూకతతో నున్నట్టి భంగిని కల్పించుచున్నది. అదే శిరస్సుతోకూడిన పై భాగమందలి లేళ్ళజంటలో ఎడమలేడి శత్రువు యొక్క ఉపసరణమును పరికించు చున్నట్లు మెడనుక్రిందికి వంచి ముట్టెను ముందుకు చాచినట్లును, కుడిపై వుది కాలిగిట్టతో ముట్టెను గోకుకొనుటకు మెడను వెనుకకు త్రిప్పియున్నట్లును అచ్చపులేళ్ళవలె కనుపించును. ఈ నాలుగు బొమ్మలలోని లేళ్ల శరీరములును ఘనాకారమునకు తగిన సరియగు కొలతలతో సజీవాకృతులలో మలువబడెను.
అజంతాలో మానవాకృతులు సంఖ్యాధిక్యతలోను భంగిమలలోను ఆశ్చర్యకరముగా చెక్కబడెను. వీనిని మనము నాగరాజుగను, నాగినిగను, గంధర్వునిగను, యక్షునిగను, హారీతి లేక పంచికగను, ద్వారపాలుడు లేక ద్వారపాలికగను, అప్పుడప్పుడు భగవత్ప్రార్థనలు సలుపు భక్తునిరూపములోను చూడగలము. ఒకే ఒకచోట చేతియందు బెత్తముకలిగి, కొంతమంది బడిపిల్లలతో ఒక బడిపంతులు కానవచ్చును. ఆ పిల్లలలో కొందరు పాఠము లందు నిమగ్నులై యుందురు. మరికొందరు పొట్టేళ్ళ పందెమును చూచి వినోదముగా ముచ్చటించుకొనుచుందురు. ఎచ్చటను మానవుని యొక్క ఆంతరంగిక గాంభీర్యమును, ఠీవిని వెలిబుచ్చుటలో శిల్పి యే విధముగను పొరపడలేదు.
అసంఖ్యాకములగు నాగరాజ ప్రతిమలలో రెండు, కళాదృష్టితో సర్వోత్కృష్టమగు ప్రాశస్త్యమును కలిగి పేర్కొనదగియున్నవి. 19వ గుహ యొక్క యెడమ వైపు చిట్టచివర తొలువబడిన ఫలకమందు నాగరాజు, నాగినియు ఒక సింహాసనము మీద కూర్చుండియున్నట్లు చూపబడెను. మరొక నాగిని తన కుడిచేతియందొక చామరముతో సింహాసనము ప్రక్కన పరిచారిక వలె చూపబడెను. ఈ ఇద్దరు నాగస్త్రీల భంగిమములలో ఎంతో వినాశము సంభవించినను అమూడు విగ్రహముల ముఖ వైఖరులలోని ఆంతరంగిక ప్రశాంతతను బట్టి, బౌద్ధ శిల్పములో ఆధ్యాత్మిక ప్రభావ ప్రకటనమునకు ఎట్టి ప్రముఖ స్థానము కలదో వెల్లడియగుచున్నది.
ఇద్దరు నాగరాజులు 23 వ గుహా ద్వారమున కిరువైపుల ద్వారపాలకులుగా తొలువబడిన మరొక ఉదాహరణము కలదు. ఆ బొమ్మలు ఎక్కువ పెద్దవిగా లేవు. కాని వాటి శిరస్సుల ఆకార నిర్మాణము శిల్పి యొక్క పనితనములోని ఉత్కృష్టతను వెలిబుచ్చుచున్నది. ఆ యాకృతులు సుకుమారములు. ముఖవైఖరులు గాంభీర్యమును, మనః ప్రశాంతతను స్ఫురింపజేయును.
కథనాత్మక శిల్పము :- శిల్పమందు గాథల కూర్పు అనగా బుద్ధుని కథలను లేక జాతకములను (పూర్వ జన్మలు) లేక జీవిత విశేషములను తెలుపు శిల్పము అజంతా యందు చాలవరకు లేదనవచ్చును. కాని వర్ణ చిత్రలేఖనము ఇట్టి యితివృత్తమును గూర్చి యే ప్రవర్తించినది. ఉబ్బెత్తు శిల్పమునకు అమరావతి, నాగార్జునకొండ, సాంచి, భార్హూత్ వంటి స్థలములందు చూపబడిన అత్యంత శ్రద్ధ అజంతాలో చాలమట్టుకు సన్నగిలినది. ఇది వాస్తువునకు అంగమై, సహాయక కృత్యములను పూర్తి చేయుచు అప్రధాన మైయున్నది.
ఐనప్పటికిని మొదటి గుహ యొక్క వీథినదరు (Facade) మీది నాలుగు దృశ్యములను దెల్పు నాలుగు రంగములును, 26 వ గుహలోని ప్రలోభన దృశ్యము, మహా పరి నిర్యాణ దృశ్యము మొదలగునవి అజంతాలో ఉబ్బెత్తు చిత్ర శిల్ప సంప్రదాయ మింకను నశింపలే దనియు, అమరావతి మున్నగు ప్రాచీన స్థలములందు ఈ రీతి శిల్పమున విశ్వకర్మలు సాధించిన పరినిష్ఠి తత్వమును అజంతా శిల్పి కోల్పోవలేదనియు, కధనాత్మక శిల్వన్యాసము పరాకాష్ఠను పొందినదనియు ఈ దృశ్యములు వ్యక్తము చేయుచున్నవి. విపత్కరమైన నాలుగు దృశ్యములు అనగా గౌతముడు తన విహార సమయములందు చూచినట్టియు, చివరకు అతని సన్యాస నిర్ణయమునకు కారణమైనట్టి దృశ్యములు - వ్యాధిగ్రస్తుడు, వృద్ధుడు శవము, (నాలుగవది శిథిలము) - అమరావతీ శిల్పి యెక్క అశేష నైపుణ్యముతో చెక్కబడెను.
ప్రలోభన దృశ్యము (మొదటి గుహ) జనరంజకమును, ఆనాటి కళావేత్త యొక్క అభిమాన విషయమును అయియున్నది. అజంతాలోని అత్యుత్తమ వర్ణ చిత్రములలో నొకటి దానికై వినియోగింపబడెను. కాని 28 వ గుహలోని శిల్పము "బహుశః, ఈ రెంటిలో, దృశ్య ప్రకటనలో అత్యుత్తమమైనది." బుద్ధునికి ఎడమ వైపున మారుడు చేతిలో ధనుర్బాణములతో నిలచి
యుండును; మారుని ముందు ఒక గొడుగు లాంఛనముగనో లేక బుద్ధుని దివ్యశక్తి నుండి తన రక్షణ కగు చిహ్నముగనో పట్టియుంచబడెను. మారుని ముందు భాగమున కొందరు స్త్రీలు ఆసీనులై, మరికొందరు నాట్యమాడుచు ఉన్నారు. వారిలో తహ్న, రతి, రంగ అను నాతని ముగ్గురు కుమార్తెలు వారి అనర్హు శిరోభూషణములచే గుర్తింపదగియున్నారు. మారుడు తాను జైత్రయాత్రకై పోవుచున్నట్లు చూపబడినపుడును, తరువాత శృంగభంగమునొంది బుద్ధునిచే పరాజయమును అంగీకరించుచున్నట్లు చూపబడినపుడును చక్కని యోధ వేషములో కనబడును. కాని మధ్యనున్న బుద్ధ విగ్రహము శిల్పి యొక్క అభీష్టముననుసరించి మొత్తము దృశ్యముపై అధికార ముద్ర వహించు చున్నది. ఈ చిత్రము దానిలోని కథా సన్నివేశములనుబట్టి కథనాత్మక చిత్రముగా నుండవలసియుండును. ప్రకృతచిత్ర మట్లు గాక బుద్ధుని మాహాత్మ్యమును అలౌకిక ప్రభావమును మాత్రము ప్రదర్శించు చిత్రగుళికవలె నున్నది.
అదే గుహలో తొలువబడిన బుద్ధ నిర్వాణ దృశ్యము మూర్తి నిర్మాణసూత్రములు కనుగుణముగనే చెక్కబడి,విషయ సంపత్తి అధికముగా నున్నను కథనాత్మకత యందు మిక్కిలి కొరవడియున్నది. ఇందు అనేకములగు ప్రతిమలును, నాటకీయ విశేషములును కలవు. బుద్ధ భగవానుడు శిరస్సును తలగడ పైనుంచి కన్నులు మూసికొని శయ్యపై పరుండియున్నట్లు చూపబడెను. అతని కుడిచేయి గడ్డము క్రింద ఉంచబడినది. బుద్ధుని ప్రతిమలు తాళవృక్ష పరిమాణము (23 అ.ల 4 అం.ల పొడవు) లో నున్నను వాస్తవికతకు కొంచెమైనను భంగమురాకుండ చెక్కబడినవి. ఇట్టి స్వాభావికతయే దుస్తుల యొక్కయు, తలగడల యొక్కయు ముడుతలలో కూడ కాననగును. ఆతని ముఖము గాఢనిద్రలో నున్నట్లు నిశ్చలత్వమును, ప్రశాంతతను వెలిబుచ్చుచున్నది. శయ్య యొక్క కోళ్ల మీది శిల్పపు తీరులలో నిప్పటికి పదునాలుగు, పదునేను వందల సంవత్సరములు గడచినను ఎక్కువ మార్పులు రాలేదు. అట్టి మాదిరి చెక్కడపు కోళ్లుగల మంచములు నేటికిని భారతదేశపు నగరములందు కానవచ్చును. నీటి కూజా నుంచుట కేర్పరుపబడిన ముక్కాలి పీట కూడ ఒక మనోహర శిల్పముగల గృహోపకరణము. ఆ శయ్య-ప్రక్కన సుమారు ఇరువది మంది భిక్షుకుల యొక్కయు, భిక్షుణుల యొక్కయు విగ్రహములు, తమ గురుదేవుని నిర్వాణమునకై పరితపించుచున్నట్టి భావమును స్పష్టముగా ముఖములమీద వ్యక్తము చేయుచున్నవి. శయ్య పైని గుహాకుడ్యముమీద ఎత్తుగా ఇంద్రాది దేవతలు, దేవదూతలు, గంధర్వులు, ఈ మహామహుని (బుద్ధుని) యొక్క స్వర్గ పునరాగమనమును ఆహ్వానించుటకై క్రిందికి దిగి వచ్చుచున్నట్లు చూపబడినది. శయ్య ప్రక్క నున్న ప్రతిమలందు (మొదట) చూపబడిన విషాదముతో పోల్చిచూచినచో తరువాత దృశ్యభాగములో సమ్మోద భావము గోచరించును. ఈ శిల్పము మొత్తముపై కలుగుభావము సామూహికతయందు కన్న కరుణరసాత్మకత యందు పరాకాష్ఠ నందుకొన్నది. ఈ దృశ్యమునందలి శోకచ్ఛాయయే నేత్రములను, మనస్సును అధికముగా ఆకర్షించును.
గుహాలయములలోని బ్రహ్మాండమగు బుద్ధ విగ్రహములు చైత్యముల సమున్నత ముఖభాగములు భావ గాంభీర్యమును, ఆదర్శమహత్త్వమును చాటుచున్నవి. సారనాధయందలి శిల్పములందుకూడ, అవి యెంత మనోరంజకముగను, రమణీయముగను ఉన్నను ఇట్టి విశేష స్ఫూర్తి కలుగదు. ఇట్టి పరిణామము అనివార్యమై తోచును. ఏలయన, ఇతర విగ్రహములు బుద్ధుని జీవితముతో సంబంధించిన వైనను పరిమాణము నందును, ప్రాముఖ్యమునందును హ్రస్వీకృతములై యున్నవి. బుద్ధ భగవానుని విగ్రహమునకు ప్రత్యేక సమున్నత స్థాన మొసంగబడజొచ్చెను. ప్రాచీన బౌద్ధులు బుద్ధుని యొక్క విగ్రహ కల్పనమును నిషేధించియుండగా, తరువాతిదగు అజంతా శిల్పము అట్టి నియమములను విసర్జించి, ఆతని విగ్రహములను అసంఖ్యాకముగా అనేక ఆకృతులలో తొలుచుటయందు స్వేచ్ఛను వహించెను. బుద్ధ ప్రతిమలు విహారములందును. చైత్యములందును మాత్రమే గాక ద్వారమంటపముల మీదను, గోడ గూళ్లలోను, చూరుల మీదను అలంకరణ వస్తువుగా తొలువబడి యున్నవి.
బుద్ధ విగ్రహములు :- బుద్ధమూర్తుల శిల్పకళా ప్రాశస్త్యమును నిరూపించుటకు ఈ ఒక్క ఉదాహరణము చెప్ప వచ్చును. మొదటి గుహలోని పూజామందిర మందలి బుద్ధవిగ్రహము ధర్మచక్ర ముద్రతో ధర్మోపదేశము చేయుచున్నట్టి వైఖరిలో అట్టి ప్రతిమలకు ఒరవడి శిల్పముగా నున్నది. అతడు సింహాసనముమీద పాదతలములు కనబడునట్లు పద్మాసనాసీనుడై యుండెను. ఆతడొక పారదర్శకమగు దుస్తును ధరించి యుండెను. ఆ దుస్తు యొక్క క్రింది అంచు చీలమండలకు కొంచెముపైగా ఒక రేఖచే గుర్తింపబడెను. కేశ సముదాయమును సాంప్రదాయకమగు రీతిలో మెలివేయబడి నడినెత్తిన ఉష్ణీషమువలె ముడి అమర్చబడెను. శిరస్సునకు వెనుక వైపున ఒక చిత్రితమగు చక్రాకార ఫలకము కలదు. ఇది ప్రభాపరి వేషమును సూచించును. ఇద్దరు మత్త గంధర్వులు స్వర్గధామమునుండి పుప్పోపహారములను తెచ్చుచున్నారు. సింహాసనమునకు వెనుక, బుద్దున కిరువైపుల గొప్ప కిరీటమును ధరించిన ఒక్కొక్క రాజభృత్యుడు కలడు. సింహాసనమునకు ముందు మధ్యభాగములో ధర్మచక్రము చెక్కబడెను. ఆ చక్రమున కిరువైవుల లేళ్ల బొమ్మలుకూడ కలవు. లేళ్ల వెనుకభాగ మందు కొందరుభక్తుల ప్రతిమలుకూడ కాననగును. ఆ భక్తులు పలురకములగు భంగిమలలో చూపబడిరి ;కొందరు నేలమీద ఆసీనులై యుండిరి, కొందరు మోకాళ్ళమీద నిలుచుండిరి, మరికొందరు కాళ్ళను చేర్చి, ఒకటి భూమిని తాకునట్లును, మరొకటి పై కెత్తబడినట్లును కూర్చుండి యుండిరి. ఆ సింహాసనముపై తొలువబడిన విషయము సారనాథమందలి మృగదావములోని బుద్ధుని ధర్మోపదేశమును స్పష్టముగా వ్యక్తపరచుచున్నది. బుద్ధప్రతిమ మామూలు మానవ పరిమాణమునకు పూర్తిగా మూడు రెట్లు కలదు. సింహాసనాధిష్ఠితమైన యీ విగ్రహము 10 అడుగుల 3 అంగుళముల యెత్తున ఉన్నది *. ఆ మూర్తి ఒక సంప్రదాయకమగు రీతిలో మలుచబడినను ధాని ముఖవైఖరి అంతర్గత ప్రశాంతతను, ఉదాత్తతను వెల్లడించుచు అత్యద్భుతమై యున్నది. ఆ మూర్తి యొక్క ఆధ్యాత్మిక ప్రభావము ఆ కాలమున అహర్నిశలు వెలుగుచుండు దీపముల సువర్ణ కాంతిచే అనల్పాధిక్యము నొందింపబడినది. ఆ దీపముల కాంతిలో ఆ మహావ్యక్తి యొక్క పెదవులమీది ఆతని దయాళు స్వభావమును సూచించు చిరునగవుకూడ వ్యక్తమగు చుండును.
గుప్తయుగము నాటి సారనాథ క్షేత్రము నిస్సందేహముగా బౌద్ధ శిల్పము యొక్క అభివృద్ధికి అపారమగు దోహద మిచ్చినను, గుప్తయుగము అవశ్యముగా హిందూమతము యొక్క పునరుద్ధరణకు, బౌద్ధమతము యొక్క క్షీణదశకును చెందిన కాలమని మరువకూడదు. ఇట్టి పునరుద్ధరణాత్మకమగు మతోద్రేకముచే స్పృశింపబడనట్టియు విదేశీయ కళా సంపర్కముచే మిశ్రితము కానట్టియు ఏకైక బౌద్ధ కేంద్రము క్రీ. శ. అయిదవ, ఆరవ శతాబ్దముల నాటి అజంతాయే అయియున్నది. కనుక అజంతా యందలి శిల్పము, వర్ణచిత్రలేఖనము వాటి మతవిషయక, ఆధ్యాత్మిక ప్రభావములం దొక విశిష్ట స్థానమును అలంకరించియున్నవి. అత్యున్నత కళాప్రమాణములతో పరిశీలించిన అజంతా శిల్పము ఆధ్యాత్మిక కృషి యొక్క అత్యంత పరిపూర్ణ సాధనముగను, ఆధ్యాత్మిక భావములను, అభిలాషలను, ఉద్రేకములను, అనుభవములను ప్రకటించుట యందు ఆదర్శసాధనముగను తోడ్పడుచున్నది. ఆశిల్పము బహుశ తరువాత హిందూ ప్రతిమలందు సాధింప బడిన నిగూఢ ఆధ్యాత్మిక భావములందును, విశ్వాత్మకత యందును కొరవడియుండవచ్చును. కాని ఇది అనివార్యము కావచ్చును. ఏలయన బౌద్ధులు భగవంతు డొకడు కలడని యంగీకరింపలేదు. అట్టి సర్వాంతర్యామియైన భగవంతుని అర్చారూపమైన విగ్రహ కల్పనమును గూడ వారు సమర్థింపలేదు. బౌద్ధమతము దాని సిద్ధాంతముననుసరించి అవశ్యముగా భౌతికవాద మత మైయున్నది; కాని అది నేడు మనము గాంచు తర్క ప్రభేదము అందలి ప్రాపంచక భౌతిక వాదము వంటిది కాదు. అది యొక ఉదాత్తమగు భౌతిక వాదము. అనంతుడును, సర్వ శక్తిమంతుడును అయిన భగవంతుని అధికారమును గాని, ఆతని నిశ్వసితములై మార్పరానిపైన ఆధ్యాత్మిక గ్రంథముల ప్రభావమునుగాని బౌద్ధు లంగీకరింపరు. వీరి భౌతిక వాదమునందు ఈశ్వరుని చేతను, వేదము చేతను నిబద్దము కాని ఆధ్యాత్మిక సాధనకు స్వేచ్ఛ యొసంగబడినది. సాధారణముగా బుద్ధ ప్రతిమయొక్క ఆధ్యాత్మికతయు, అలౌకిక మహ త్త్వమును నటరాజ విగ్రహమువంటి హైందవ ప్రతిమల
- ఆ ప్రతిమయొక్క వెడల్పు ఛాతి భుజములతోగూడ ముందు 6 అడుగుల 3 అంగుళములు మరియు మోకాలినుండి మోకాలి వరకు సింహాసనముమీద 8 అడుగుల 10 అంగుళములు,
ప్రభావముకంటే అత్యంత విలక్షణమై యున్నవి. కాని బౌద్ధ సన్యాసుల శతాబ్దుల ఆధ్యాత్మికానుభవమును, అట్టి అనుభవ ప్రకటనమునకై కల్పింపబడిన కళాత్మక చిహ్నములును, మానవోద్యమ పూర్ణ పరిథిలో మహోన్నత స్థానము నలంకరించుచున్న వనుటకు వెనుదీయనక్కరలేదు.
4. చిత్రలేఖనము
పదవగుహలో ఇప్పటికిని నిల్చియున్న కొన్ని చిత్ర లేఖనములు క్రీ. పూ. 2 శతాబ్దికి చెందినవని నిస్సంశయముగా చెప్పవచ్చును. పడమటి భారతదేశము నందలి కొన్ని గుహలలోని చిత్రలేఖన చిహ్నములను, కాలము నిర్ణయించుటకు వీలులేక సాధారణముగా శిలాయుగమునకు సంబంధించినవిగా తలపబడుచున్న శిలాచిత్రలేఖనములను, రామఘర్ కొండలలోని జోగిమర గుహ యందలి అస్పష్టములును, సందేహాస్పదములునైన చిత్ర లేఖన ఖండములను విడిచినచో నివియే ప్రాచీన చిత్రలేఖనమున నిప్పటికిని నిల్చియున్న నిదర్శనములని చెప్పవచ్చును. కాని క్రీ. పూ. 2 వ శతాబ్దికి చెందిన పదవ గుహ యందలి చిత్రములలోని అతి పరిణతమైన కౌశలమును చూచినచో అవి ఆ స్థితిని చెందుటకు ఒకటో, రెండో, ఇంకను ఎక్కువో సహస్రాబ్దులు పట్టియుండునని వ్యక్తమగును. ప్రాచీన భారతదేశమున చిత్రలేఖన కళ మిక్కిలి పరిపక్వమైన స్థితిని చెందియుండెనని సారస్వత నిదర్శనముల వలన తెలియుచున్నది. క్రీస్తు పూర్వపు శతాబ్దులలో ఇతర లలితకళలు, ముఖ్యముగా శిల్పకళ, పొందిన అభ్యుదయము భారతదేశ చిత్రలేఖన కళాప్రాచీనతను గూర్చిన ఈ అభిప్రాయమును బలపరచుచున్నది.
చిత్ర లేఖనకళ యొక్క దేశీయ స్వభావమును గూర్చి కూడ ఎక్కువగా వాదోపవాదములు చేయనక్కరలేదు. అతి ప్రాచీన కాలమున చిత్రలేఖనములో అంత మహాభ్యుదయము సాధించిన ఏ విదేశమును భారతదేశముపై సాంస్కృతిక ప్రభావమును ముద్రించెనని నిరూపించుటకు వీలులేదు. ప్రాచీనకాల మందలి శిల్ప వాస్తు శాస్త్రములను నిష్పాక్షికముగా పరిశీలించినచో నెవ్వరైనను దక్షిణాపథమునందలి గుహా దేవాలయములు పుట్టుక యందును పరిణామమందును దేశీయములే యను నిర్ణయమునకు వత్తురు. అప్పటి శిల్పము సమ కాలమునందో అంతకుముందో ఉండిన దారు, ఇష్టక శిలానిర్మాణముల నుండి అనుకరింపబడినను ఆ మూలప్రకృతులుకూడ నిశ్చయముగా దక్కనుకు సంబంధించినవే. అవి లలిత కళలు దక్కనులో స్వతంత్రముగా నుప్పతిల్లియుండుటయేకాక ఉత్తరహిందూస్థానము నందుకంటే ప్రాచీనతరములై ఉండెనని నిరూపించుచున్నవి.
క్రీ.పూ. రెండవ శతాబ్దిలోని చిత్రలేఖనము - పదవ గుహలోను, సుమా రేబదియో, వందయో సంవత్సరము లంతకంటే అర్వాచీనమైన తొమ్మిదవ గుహలోను గల ప్రాచీన చిత్రలేఖనములందు చిత్రితములైన మానవ రూపములు ప్రత్యేకమైన రూపు రేఖలు, వేషభూషణములు కల దేశీయ ప్రజలవేయై యున్నవి. చిత్రకారుడు వానిని చిత్రించునపుడు తన జాతికే చెందిన అప్పటి ప్రజలను దృష్టి పథమున నుంచుకొని యుండెననుట స్పష్టము. వారు అండాకార ముఖములును, పొట్టి ముక్కులును, దళమైన పెదవులును, సామాన్యమైన ఉన్నతియుగం దక్కనునందలి నేటి దేశీయప్రజలను పోలియుందురు. పురుషులు నడుములందంతగా వెడల్పులేని వస్త్రములు ధరింతురు. స్త్రీ లధో భాగమున నట్టి వస్త్రాచ్ఛాదనమే కలిగియుందురు. కాని పైనొక చోశీయు, తలపై ఆధునిక భారతీయ పద్ధతి నొక వోణీకూడ ధరింతురు. వారు దీర్ఘములైన తమ కేశములను సర్పముల పడగల ఆకారమున తమ యౌదలలపై రిబ్బనులతో కట్టి యుంచుకొందురు. వారికి వివిధములైన భూషణములు కలవు. అందు చక్రాకారములైన పెద్ద కర్ణాలంకారములును పలుమాదిరులు గల లోహ నిర్మిత కంఠహారములును, ముఖ్యములైనవి.
వారు యోధజాతికి చెందిన ప్రజలనుట స్పష్టము. యోధులకు బల్లెములు, గదలు, ధనుర్బాణములు, ఖడ్గములు. కొడవలివంటి వంకరకత్తులు కలవు. వారు పొట్టి చేతుల చొక్కాలు ధరింతురు. వారిలో నొకని కగ్రమున తలపాగ రూపముగల యొక పెద్ద శిరస్త్రాణముకలదు. కర్ణ సంరక్షణమునకై దానినుండి ఇరువంకల రెక్కలవంటి వస్త్రఖండములు వ్రేలాడుచుండును. అట్లే ఆ శిరస్త్రాణమును తలపై సుస్థిరముగా నుంచుటకు కాబోలుగడ్డము క్రింది నుండి వచ్చునట్లుగా ఒక పట్టికట్టబడి యున్నది. సంగీత నాట్యము లీ ప్రజలకు సాంప్రదాయిక లక్షణములుగా ఉండెను. మతాలయములకు సంబంధించిన సాంప్రదాయిక సంస్థలలో పరిణతములైన వాద్య పరికరములును, సుశిక్షితములైన నర్తకుల మేళములును నెలకొని యుండెను. గాయక నర్తకులతో కూడిన ఈ మేళమున పదునైదుగు రుందురు. అందరు స్త్రీలే. అం దిద్దరికి పొడుగైన బాకాలు కలవు. మిగిలినవారు చేతులతో తాళము వేయుచునో, నాట్యము చేయుచునో కనిపించు చున్నారు. కాలమును సూచించుటకో సంగీతమునందు లయా పరాకాష్ఠను కలిగించుటకో కరతాళ పద్ధతి ఇంకను అవలంబింపబడుచునే యున్నది. నర్తకులలో పవిత్ర వృక్షమునకు మిక్కిలి సమీపమున నున్న ఆమె శరీరమునకు సర్పాకారమున మెలికలతో కూడిన చలనము కలిగించుటకో యన చేతులను పైకెత్తి వింతగా త్రిప్పియున్నది. మిగిలిన యిరువురు నర్తకుల విన్యాసములును, అడుగులును ప్రత్యేక భారతీయ సంప్రదాయమునకు చెందియున్నవి. ఆధునిక నాట్యములలో కూడ నట్టివానిని మనము చూడవచ్చును.
కొందరు గాయకులును, నర్తకులును అందమైన అల్లికతో కూడిన బల్లల(Stools) పై కూర్చుండియున్నారు. వారి వేషములును, భూషణములును ఈ దృశ్యమునందలి రాజాంతఃపుర వనితల వానికంటే భిన్నములుగా లేవు. ఈ వివరములను బట్టి దేవాలయములకు సంబంధించిన ఈ గాయనులును, నర్తకులును జీవితమున గౌరవార్హమైన స్థితిని పొందియుండిరే కాని, ఏ విధముగను నిరసింపబడుచుండలేదని తెలియుచున్నది.
నర్తకుల కేశాలంకరణ విధానములు రాజాంతఃపుర స్త్రీలవానివలెనే వివిధ విన్యాసములు కలిగి యున్నవి. అందు కొన్ని మిక్కిలి విస్తృతములై యుండగా కొన్ని తల ఎడమవైపున పాపటతీయు పద్ధతితో కూడి మిక్కిలి సరళములుగా నున్నవి.
అంతఃపుర కాంతల వేష భూషణములు నర్తకుల వేషభూషణముల వలెనే యున్నవి. వారు ధరించు నగలలో కర్ణభూషణములును, కంఠహారములును, దండకడియములును, గాజులును కలవు. గాజు లా కాలమున దక్కనులో ప్రచారమం దుండిన వానివలెనే శంఖద్రవ్యము (couch) తోడనో, దంతముతోడనో చేయబడినట్లు కనబడుచున్నవి. మాస్కి, పైఠను, కొండాపురము మున్నగుచోట్ల జరిగిన ఖననములలో నట్టివి కుప్ప తెప్పలుగా కనిపించినవి. ముంజేయి అంతయు ఆచ్ఛాదిత మగునట్లుగా అట్టివి పెక్కు ధరింప బడుచుండెడివి. దక్కనునందలి లంబాడీల వంటి ఆదిమ జాతులవారిలో అట్టి ఆచార మిప్పటికిని నిల్చియున్నది. కొందరు స్త్రీలకు తలలను, వీపులను ఆచ్ఛాదించు పెద్ద రుమాల్లో, అవకుంఠనములో కలవు. ఇవి ఈ గచ్చు చిత్రము (Fresco) నందేకాని తరువాతి అజంతా చిత్రలేఖనములలో కానవచ్చుటలేదు.
ఈ దృశ్య మెచ్చటిదో ఇంకను పూర్తిగా గుర్తింపబడ లేదు. ఇది యొక రాజు తన పరివారముతో బోధివృక్షమును పూజించుటకై వచ్చు సన్ని వేశమును సూచించు చున్నది. బహుశః ఆ చెట్టునకు సమీపముగా నిలబడియున్న బాలుని విషయమైన మ్రొక్కు చెల్లించుటకై ఆతడరుదెంచి యుండును. ఆతడేదో ప్రార్థనను పఠించు చున్నాడు. అంతఃపుర కాంత లందరును ఆ కర్మకలాపమున పాల్గొనుచున్నారు. ఒక కాంత శిరస్సు మూడు నెమిలి ఈకలచే నలంకరింపబడి యున్నది. రాజు కిరీట మేదియు ధరింపలేదు. కాని జుట్టు ముడిచుట్టును పాము పడగ ఆకారమున అమర్చబడిన కొన్ని భూషణములను ధరించి యున్నాడు.
ఈ చిత్రముల చిత్రణము భావనయందును, నిర్వహణమందును కూడ సుపరిపక్వమైన శిల్పమును సూచించు చున్నది. ఈ శిల్ప మిట్టి స్థితిని పొందుటకు పెక్కు శతాబ్దులు పట్టియుండును. ఈ గచ్చు చిత్రమునందు చిత్రింపబడిన బొమ్మలకును కొండనే, బెడ్స్, కార్లేల యందలి చైత్యములలోని భవనాంగణము లందును, గోడలపైని, స్తంభములపైని చెక్కబడిన శిల్పములందలి బొమ్మలకును ఆలం కారిక వివరముల విషయమున సన్నిహితమైన సాదృశ్యము కనవచ్చుచున్నది.
ఈ చిత్రలేఖకుడు మానవజీవితమును మత ప్రాపంచిక రంగములు రెంటను నిరూపించుటకు యత్నించినాడు. ఈ గచ్చు చిత్రము నందలి బొమ్మల చిత్రణము రాత్త్విక భావములనేకాక ప్రపంచ సుందర సన్ని వేళముల యెడగల సానంద దృక్పథమునుగూడ వ్యక్తము చేయుచున్నది. ఈ చిత్రలేఖన మత్యుత్తమ వైజ్ఞానిక లక్షణములను కలిగి యుండుటేకాక మార్ధవ సౌందర్య చిహ్నితమైన పనితనమును గూడ ప్రదర్శించుచున్నది. ఈ గచ్చు చిత్రమున పసుపుపచ్చమన్ను, జేగురు మన్ను, ఆకుపచ్చ మన్ను(Terra Verta), దీపపు మసి మున్నగునవి రంగుల కుపయోగింప బడినవి. అధరోష్ఠమునకును, కంటి కొలుకులకును చిత్రకారు డెఱ్ఱమట్టినుండి (Red-ochre) తయారుచేయబడిన ఒకరక మైన కెంపు వన్నెను వాడియున్నాడు. వెలుతురు నీడలను సూచించుటకు ఒకటవ రెండవ గుహ లందలి తరువాతి గచ్చు బొమ్మలలో కనవచ్చు లేత ముదురురంగు లుపయోగింపబడి యుండలేదు. దేహముల బాహ్యరేఖలు ముదురు కెంపులో కాని, నలుపులో కాని వ్రాయబడినవి. చిత్రణము స్థిరమును లలితమునై యున్నది. శరీరములు నిశ్చల మృతవిన్యాసములతో కాక జీవకళతో నుట్టి పడుచున్నట్లుగా చిత్రింపబడియున్నవి.
క్రీ. పూ. మొదటి శతాబ్ది యందలి చిత్రలేఖనము :తొమ్మిదవ గుహయం దెడమభాగమున గల స్తంభములపై నున్న చిత్రములలో నొక్క చిత్రము మాత్రమే క్రీ. పూ. మొదటి శతాబ్దిలో చిత్రింపబడినట్లు తలపబడు చున్నది.
ఈ గచ్చుబొమ్మ భీమబలుడైన ఒక పౌరాణిక గోపాలుని కథను సూచించు చున్నది. అతడు కంఠములను, తోకలను పట్టుకొని క్రూరములైన వన్యమృగముల చలనములను గూడ అరికట్ట గలడు. ఆ గోపాలుడు మిక్కిలి సుందరాకారుడు. అతని విలాస ప్రవృత్తిలో మధురా బృందావన శాద్వలములందు గోవులను కాచిన గోపాలకృష్ణుని సాదృశ్యము కొంతవరకు కనవచ్చు చున్నది. ఈ సన్నివేశమే కుద (Kuda) నాసిక్ మున్నగు నితర స్థలములందు కూడ చెక్కబడి యుండుటచే ఆకాలవు బౌద్ధ చిత్రకారులయందు . అది బహుళ ప్రచారము నంది యున్నట్లు కానబడుచున్నది.
ఈ గచ్చుబొమ్మ చైత్యనిర్మాణముతో సమకాలికమై యుండుననుట స్పష్టమె. క్రీ. పూ. మొదటి శతాబ్దిలో కూడ అజంతా చిత్రకారులు తమ కళా ప్రతిభ భావింప జాలిన ఏ విన్యాసముతోనైనను బొమ్మలను చిత్రింప గలిగియుండుటయు, శారీరక చలనమును, సంఘర్షణమును సునాయాసముగా సూచింప గలిగియుండుటయు వింత కలిగించును.
వ్యవధానము :- క్రీ. పూ. మొదటి శతాబ్దినుండి క్రీ. శ. 3వ శతాబ్ది వరకు భారతదేశ చిత్రకళా చరిత్రలో కొంత వ్యవధానమున్నది. తొమ్మిదవ పదవ గుహలలోని కొన్ని చిత్రములకు ఆధార రహితముగనే కొంత ప్రాచీనత నాపాదించుచు, కొందరు గ్రంథకర్త లీ వ్యవధానము లేదని చెప్పుటకు యత్నించినారు. శిల్ప వాస్తు కళా చరిత్రము లందు సైతము అట్టి వ్యవధాన ముండుటను పరికించి చూచినచో, అజంతాలో సుమారు నాలుగు శతాబ్దుల కాలము సృజనశక్తి లోపించియుండెనని నిశ్చయించుట యుచితముగా ఉండును. శాతవాహన సామ్రాజ్యము యొక్క కేంద్రము అమరావతికిని, ఆ సామ్రాజ్యమునకు సంబంధించిన ప్రాగ్భాగమునకును, మారుటయో క్షాత్రపులకును, ఆంధ్ర శాతవాహనులకును నిరంతర యుద్ధములు జరుగుచుండుటచే శాతవాహను లా భాగమున శ్రద్ధవహింపకపోవుటయో, క్షాత్రవులు సైతము స్థిరపడి లలితకళాదులను పోషించుటకు తగిన అధికారమును సంపాదింపజాలకపోవుటయో దానికి కారణమై యుండును.
క్రీ, శ. మూడవ శతాబ్దిలోని చిత్రలేఖనము :- పదవ గుహలోని కుడిగోడ మీద చిత్రింపబడిన షడ్డంత జాతక ముతో ఒక శాసనము కూడ చిత్రితమై యున్నది. అది బహుళః మూడవ శతాబ్దిదని నిశ్చయింపబడిన ఆ చిత్రముతో సంబంధించినదేయై ఉండును. అందుచే ఈ చిత్రము భారతీయ చిత్రలేఖన చరిత్రలో తరువాతి గొప్ప ఘట్టముగా కానబడుచున్నది. దాని నిచ్చట కొంత సవివరముగా పరిశీలన చేయవచ్చును.
చిత్రకారుడు షడ్డంత జాతకములోని సర్వ సన్నివేశములను చిత్రించినాడు కాని వాని క్రమము కొంత మార్చినాడు. అతడు సక్రములతోను, అజగరములతోను(Pythons) గూడిన బురద నేలలు గల దుర్గమమైన అడవిలోని గజముల వన్యజీవితముతో ఆరంభించి, మానవమూర్తులతో నిండిన ప్రాసాద దృశ్యములతోను, ఒక స్తూపము తోడను, విహారముల తోడను గూడిన పవిత్రక్షేత్రమునకు పోవుచున్న రాజాంతఃపుర పరివారము తోడను దానిని ముగించినాడు. మధ్యభాగమున అతడా గజరాజు పద్మసరస్సున స్నానమాడుటయు, ఒక పెద్ద మట్టిచెట్టు క్రింద గల దాని ప్రియమైన ఆశ్రయ స్థలమును చిత్రించియున్నాడు. ఈ విధముగా జంతుజీవితమునకును, ప్రకృతి సౌందర్యమునకును సంబంధించిన దృశ్యములు దుఃఖ క్లేశ తమస్సు భక్తి విశ్వాసాలోకముచే ప్రకాశింప జేయబడు మానవ భావములను చిత్రించు దృశ్యముల నుండి వేరుగా ఉంచబడినవి.
అడవియందలి జంతు జీవితమునకు సంబంధించిన దృశ్యములలో ఒక ఏనుగునకును మొసలికిని జరిగిన పోరాటమును వర్ణించు దృశ్యమును చిత్రకారుడు మిక్కిలి నేర్పుతో చిత్రించియున్నాడు. అందేనుగు తన శత్రువును వెలికిలబడవైచి, దాని పొట్టపై తన ముంగాలొకటి పెట్టి, దానిని తుత్తునియలు చేయుటకై తొండముతో గట్టిగా నొక్కుచున్నట్లు చిత్రితమై యున్నది. దానికి సమీపముననే భీకరమైన మహానాగము ఏనుగు కాలి నొక దానిని పట్టుకొనగా అది దురంతరమైన వేదనపొందుచు తన తోడి ఏనుగుల సాయము నర్థించుటకై ఆర్తనాద మొనరించుటకో అన తొండమును పైకెత్తినట్లుగా చిత్రింపబడి యున్నది. గజయూధ మొకటి పద్మసరోవరమున స్నానము చేయుచు తొండముల నెత్తి వివిధ స్వాభావిక విన్యాసములతో వానిని వంకరగా త్రిప్పుచు జలక్రీడోత్సాహమున ఉప్పొంగు దృశ్యమొకటి మిక్కిలి మనోజ్ఞముగా ఉన్నది.
రాణి గజదంతములను చూచి మూర్ఛాక్రాంతురాలైన ఆస్థానదృశ్యము నాటకీయ ప్రభావముతో కడు మనోహరముగా ఉన్నది. ఆ పద్దంతనాగము పూర్వము ఒక అవతారములో ఆమెకు ప్రియదయితుడై యుండెను. తనపై కంటె అప్పుడింకొక భార్యపై అత డెక్కువప్రీతి కలిగి ఉండినట్లామె భావించుటదే కోపావేశమున దాని దంతములను కొనిరమ్మని ఆమె వేటకాండ్రను పంపి యుండెను. వర్తమాన జన్మమున ఆమెకు భర్తయైన కాశీరాజు ఆమెకు దగ్గరగా కూర్చుండి, తన చేతులలో నొక దాని నామె వీపు వెనుక నుంచియు, రెండవదానితో, నామె కుడిభుజమును పట్టుకొనియు ఆమెకు అవలంబ మొసంగు చున్నాడు. పరిచారిక ఒకతె రాణికి విసనకఱ్ఱతో వినరుచున్నది. తలపై పోయుటకో, ముఖముపై చల్లుటకో వేరొకతె జలము తెచ్చియున్నది. మూడవయామె రాణి కేదో పానీయి మొసగుచున్నది. దృశ్యమునకు కుడి వైపున నున్న నాల్గవయామె భారతీయులకు సహజమైన విధమున విచారభావముల నడచుటకై తన చేతిని ముఖముపై పెట్టుకొనియున్నది. ఛత్ర ధారిణియైన పరిచారిక ఆస్థానము నంతను భయకంపిత మొనరించిన ఆ దంతములవంక చూచుచున్నది. భూతలాసీనయైయున్న వనిత యొకతె రాణిని తెప్పిరిల్ల జేయుటకై ఆమె అరకాళ్ళను రాయుచున్నది. దృశ్యమునంతను ఆవరించియున్న సామాన్య కరుణ వాతావరణము మాట అటుండ, వ్యక్తుల వర్గీకరణమును, మనోహరములైన విన్యాసములును స్త్రీల భూషణ కేశాలంకరణ విధానములును, అల్పమయ్యు కళా సంపన్నమైన వివిధ వ్యక్తుల వస్త్రధారణ ప్రకారమును, చిత్రకారుని సజీవమైన భావనాశక్తిని, సరసమైన అభిరుచిని మాత్రమేకాక సుపరిపక్వమైన అతని సాంకేతిక కళా కౌశలమును తనఊహ ననుసరించి ఏ వస్తువునైనను ఏరీతిగనైనను యథేచ్ఛముగా చిత్రింపగల అతని సామర్ధ్యమును ప్రదర్శించుచున్నది.
క్రీస్తుపూర్వ యుగమునందలి చిత్రలేఖనములవలె ఈ చిత్రమున చిత్రింపబడిన వ్యక్తు లందరునుకూడ అనార్యులుగనే కానవచ్చుచున్నారు. చిత్రణమునందలి సాంకేతిక విధానమును, వస్తుసామగ్రియు కేవల దేశీయములై యున్నవి. అందు పరదేశములకు సంబంధించినదేకాక మిక్కిలి సమీపమునందున్న ఉత్తర హిందూస్థానమునకు సంబంధించినదియు ప్రభావ మిసుమంతయు గోచరించుట లేదు. కాని దృశ్య సౌందర్యమును కల్పించుటలో చిత్రకారుడుచూపిన ఉత్సాహమును, అతడు మృగ జీవితమును గూర్చి కావించిన సునిశిత పరిశీలనమును, మత ముద్రతో కూడిన కరుణరస భావములను చిత్రించుటలో ప్రదర్శించిన నైపుణ్యమును, సూక్ష్మ వివరములతో కూడిన అలంకరణ విధానమందలి ప్రీతియు, ఎడమకుడిగోడలపై చిత్రములను చిత్రించుటలో కలిగిన నాలుగు శతాబ్దుల వ్యవధానమున చిత్రలేఖన కళ వైజ్ఞానికముగను, సాంకేతికముగను కూడ మిక్కిలి అభివృద్ధిని పొందెనని సూచించుచున్నవి.
క్రీ. శ. నాలుగవ శతాబ్దిలోని చిత్రలేఖనము :- పైని వర్ణింపబడిన పడ్డంత జాతకమునకు ఎడమవైపునగల శ్యామజాతకమును, పదవ గుహలో గోడలమీదను, స్తంభములపైనను గల ఇతర చిత్రములును వసారా స్తంభములమీది బుద్ధుని చిత్రములును శాసన లిపి నిదర్శనమునుబట్టి కాని, సాంకేతిక పరిణామమునుబట్టి కాని క్రీ.శ. నాలుగవ శతాబ్దికి చెందినవిగా తలంపవచ్చును.
ఈ కథ శ్రావణకుమార దశరధ శాప వృత్తాంతములకు బౌద్ధులు కల్పించిన రూపాంతరము. గచ్చుబొమ్మలో సూచింపబడిన ముఖ్య సన్నివేశములు పెక్కు వివరములలో జాతకమున చెప్పబడిన వానితో సరిపోవుచున్నవి. సమగ్ర వేషధారులయిన పరిచారకు లై దుగురును, అల్ప వేషధారులయిన పరిచారకు లైదుగురును (వీరు బహుశః వాద్యములు వాయించు వారును, వేట కాండ్రును కావచ్చును) శస్త్రాస్త్ర సన్నద్ధులై రాజు ననుసరించి యున్నారు. రాజు (అస్పష్ట చిత్రితమైన) గుఱ్ఱమునుండి దిగి తాను జంతువని శంకించిన యొక అదృశ్యవస్తువు పై ధ్వనినిబట్టి, లక్ష్యముంచి, విల్లెక్కు పెట్టుచున్నాడు. ఆ వస్తు వాతడనుకొనినట్లుకాక పొదల వెనుకనున్న నదీ ప్రవాహములో కమండలువును ముంచుచున్న బ్రాహ్మణ కుమారుడగుట సంభవించినది. వనదేవత యెవ్వరో రాజును మందలింప యత్నించెను కాని లాభము లేక పోయెను. రాజు పశ్చాత్తప్తుడై శ్యాముని అంధ పితరులను సేవింప ప్రతినపట్టును. వనదేవతా ప్రభావముచే శ్యాముడు రక్షింపబడును; అతని అంధ పితరులకు దృష్టి సంపద కలుగును ; రాజు శ్యామునినుండి " ధమ్మ ”బోధ గ్రహించును.
జాతక కథలో కథన సౌందర్యముతోపాటు కొన్ని దృశ్యకావ్య లక్షణములుకూడ ఉన్నవి. చిత్ర కారుడు వానిని గచ్చుబొమ్మలో అత్యద్భుతముగా అనుకరించినాడు. శ్యాము డమరుడా నాగుడా అని రా జెరుంగ కోరుట, శ్యాముని మన స్థైర్యము, అతని తల్లి దండ్రుల దీనాక్రందనములు, వేగముతో కూడిన వేడి చలనములు, అన్నిటికన్న మిన్నగా' జంతువులను మానవులతో కలుపు అనురాగ బంధములు మున్నగున విందుకు నిదర్శనములు. జలకమండలువును మోయుచున్న శ్యాముని చిత్రమున గ్రీకు శిల్పులు వేల్పుల విగ్రహములలో చూపిన లాలిత్యము కానవచ్చు చున్నది. అట్లే శ్యాముని తండ్రి తల నవవిజ్ఞాన యుగమునందలి (Renaissance) ఇటలీ దేశపు చిత్రములలో ముఖ్యముగా ఏసుక్రీస్తు చిత్రములలో కనవచ్చు కరుణమును సూచించును. లేడి చిత్రములు జంతు పరిశీలనమునకు చక్కని నిదర్శనములు.
క్రీ. శ. 5వ శతాబ్ది యందలి చిత్రలేఖనములు : క్రీ.శ.5 వ శతాబ్దిలో ఇతర కలాపములందువలె అజంతా యందలి చిత్రలేఖన కళలో కూడ అమితమైన ఉత్సాహము గోచరించుచున్నది. వానిలో పెక్కు 1, 2, 16, 17 వ గుహలలో ఇప్పటికిని నిల్చియున్నవి. ఈ గుహ లందు చిత్రితములును, శిలా ఖచితములును, అగు శాసనముల వలన ఇవన్నియు క్రీ.శ. 5వ శతాబ్దికి చెందినవని నిరూపింపవచ్చును. కళా సంకేతములనుబట్టి చూచినచో 1, 16 గుహలు సమకాలికములవలె తోచును. 17 వ గుహ వాని తరువాతను, రెండవగుహ అన్నిటికంటె చివరను వచ్చును. గుహల పౌర్వాపర్యమును నిర్ణయించు నప్పు డీ విషయ మిదివఱకే చెప్పబడినది. మొదటిగుహలో బుద్ధుని మహాభినిష్క్రమణ వృత్తాంత మునకును, 16 గుహలో అతని జనన బాల్యములకు సంబంధించిన కథలకును, సన్యాస జీవితమునకు సంబంధించిన ఇతర గాథలకును ప్రాధాన్య మొసంగబడినది.17వ గుహ యందు బుద్ధుడు తొల్లింటి అవతారములలో ఉదారుడైన రాకుమారుడుగానో, గజము, వానరము, లేడి, బాతు, మత్స్యము, నాగము మున్నగు ఉత్తమమైన జంతువులుగనో వివిధ రూపములలో ఉద్భవించిన కథలు చిత్రింపబడినవి. రెండవ గుహలో బుద్ధుడు సిద్ధార్థుడుగా నున్నప్పటి కథలును, పూర్వజన్మలలో మతి మంతుడైన బ్రాహ్మణుడు, విధుర పండితుడు, క్షాంతి వాది, సన్యాసి మున్నగు రూపములను పొందిన కథలును వర్ణింపబడినవి.
అలంకారిక రచనారీతులు :- వర్ణ చిత్రములందలి వస్తువు మువ్విధములుగా నుండును అలంకరణ విధానము, రూపకల్పనము, కథనము, అలంకార రచనా రీతులలో పశ్రావళులు (Scrolls) జంతువులయు, వృక్ష లతాపుష్ప ములయు బొమ్మలు ఇమిడి యున్నవి. ఇచ్చటి వైవిధ్యమనంతముగా ఉన్నదనియు, సూక్ష్మాతి సూక్ష్మ వివరములు కూడ ప్రదర్సిరంపబడి ఉన్న వనియు, ఎచ్చటను పునరుక్తి గోచరింపదనియు గ్రిప్ఫిత్తు చెప్పుచున్నాడు. సుపర్ణులు (పక్షిశరీరము మానవ పూర్వకాయముతో కూడి యుండును.) గరుడులు, యక్షులు, గంధర్వులు, అప్సరసలు మున్నగు కల్పిత కథా పాత్రలయు, పౌరాణిక వ్యక్తులయు బొమ్మలు స్థలమును నింపుటకై ఉపయోగింపబడి ఉన్నవి. అవి బాణకవి కాదంబరిలో వర్ణించిన ఉజ్జయిని యందలి చిత్రిత మందిరములను స్మరణకు తెచ్చుచున్నవి.
అజంతా చిత్రములందలి ప్రకృతి :- చిత్రకారునికి గల ప్రకృతి ప్రీతియు, వివిధ ప్రకృతి దృశ్యములను సౌందర్య వైభవములతో వర్ణించుటయం దాతడు చూపు నేర్పును ఇక్కడ వేరుగా నొక్కి వాక్రువ్వనక్కరలేదు. 17 వ గుహలో చిత్రింపబడిన పెక్కు జాతక కథలలో ఉత్తమ శ్రేణికి చెందిన కథనాత్మక చిత్రములకు అసంఖ్యాకము లైన నిదర్శనములు ఉన్నవి. ఇతర గుహలలో కూడ ఇట్టివి కొన్ని కలవు. ఈ గుహలో చిత్రింపబడిన ఛద్దన, మహాకపి, హస్తి, హంస, శరభంగ, మత్స్య, మహిష,రురు, శిబి, నిగ్రోధ, మిగ జాతకములను గూర్చి సంగ్రహముగ సూచించుటకు కూడ ఇచ్చట తావు చాలదు. వెస్సంతర, సుతసోమ, మాతుపోషక జాతకములనుగూర్చి సంగ్రహముగా చెప్పవలసి యున్నది. వెస్సంతర జాతకము గోడతో కలిసిపోయినట్లు కట్టబడిన రెండు స్తంభముల నడుమ గల ఎడమప్రక్క గోడనంతను అవరించియున్నది. అది ఎడమప్రక్కనుండి ఆరంభించును. అచ్చట వెస్సంతర రాజకుమారుడు తన నిష్కానన వృత్తాంతమును భార్య యైన మడ్డి(Maddi) కెరిగించును. అతని యందలి లోపము అతిమాత్రమైన ఔదార్యగుణము. వర్షమును కలిగింప జాలు శక్తిగల ఒక దివ్యదంతావళము నాతడు దానము చేసిపై చినప్పుడు, ప్రజలు గగ్గోలు చేసి రాజైన అతని తండ్రిని అతనిని దేశ బహిష్కృతుని చేయుమని బలవంత పెట్టిరి. అతడు తన తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పుట, నాలుగు గుఱ్ఱములను పూన్చిన రథముపై అతడు తన కుటుంబముతో కూడ విపణివీథిని పోవుట, ఆశ్రమమున అతని జీవితము, వన్యమృగములచే ఆశ్రమమునకు రాకుండ ఆపివేయబడిన మడ్డి పరోక్షమున అతడు తన బిడ్డలను జూజకున కిచ్చుట, బంధవిమోచన ధనముగా వారి తాత ఆ బిడ్డలను తిరిగి యిచ్చుట, మడ్డియు, వెస్సంతరుడును తిరిగి రాజధాని కరుదెంచుట మొదలగు సన్నివేశము లీ మనోహరమైన కథలో అతి నుందరముగా చిత్రింపబడినవి.
వివిధ దృశ్యముల క్రమము కొంత క్లిష్టముగా ఉన్న మాట నిజమేయైనను ముందరి గది కెడమవైపున గల వెనుక గోడపై నున్న చిత్రములో సుతసోమ జాతకము కూడ -మిక్కిలి చక్కగా చిత్రింపబడినది. సుదాసు డశ్వా రూఢుడై తన పరివారముతో కూడ మృగయార్థమై పురద్వారమునుండి బయల్వెడలుటతో ఈ కథ ఆరంభించుచున్నది. ఆ పరివారములో కొన్ని వేటకుక్కలు కూడ ఉన్నవి. అవి ఒక లేడిని తరుముచున్నట్లు కనబడుచున్నవి. తరువాతి దృశ్యములో వన్యమృగసంకులమైన అడవియం దొంటరిగా అశ్వారూఢు డైయున్న రాజు చిత్రింపబడి ఉన్నాడు. ఇంకను కొంతపైని ఈ రాజు నిద్రించుచుండగా ఒక సింహి ఆతని పాదములను నాకుచున్నట్లున్నది. తరువాత ఆతడొక రాతిపై కూర్చుండియుండును. సింహి ఆతని ముందుండును. సింహి గర్భిణియై ఒక మానవ శిశువును. రాజునకు ప్రియ కుమారుడు. కనుట మొదలగు సన్ని వేళములు తొలగింపబడినవి. తరువాత చూపరులు ఆశ్చర్యచకితులై చూచుచుండ ఆ సింహి బజారువీధిని ప్రాసాద ద్వారము వంక కరుగుచున్న సుందరమైన దృశ్యము కానబడును. కుడిప్రక్క అ సింహి రాజసన్నిధికి ప్రవేశ పెట్టబడిన దృశ్యమున్నది. రాజు కుమారుని గ్రహించి తన తొడపై కూర్చుండబెట్టుకొనును. దీని క్రింద సుదాస రాజకుమారుని విద్యాభ్యాసము చిత్రింపబడినది. కుడిప్రక్క అత డొక బల్లపై వ్రాయుచున్నాడు. ఎడమ ప్రక్క అతడు బాణములు వేయుట అభ్యసించుచున్నాడు. దాని కెడమవైపున సుదాసుని పట్టాభిషేకము చూపబడినది, అతని తల్లి సింహి అగుటచే అతడు నరమాంస భక్షకుడగును. తరువాత నున్న మూడు దృశ్యములలో తొలుత వేయబడిన మనుష్యుని దేహమునుండి మాంసము కోయుట, అట్లు తెచ్చిన మాంసమును వండుట, దానిని రాజునకు వడ్డించుట మున్నగువానిచే అది సూచింప బడినది. తరువాత సుదాసుడు వేట కరుగుచున్నట్లు చిత్రింపబడిన చట్రమునకు వెనువెంటనే పైని అంతఃపుర యాదకుని బారినుండి ఒకడు తప్పించుకొని పారిపోవు చుండుట వర్ణింపబడినది. దీనికి పైని వినాశకరమైన ఈ అభ్యాసమును వర్ణింపుమని ప్రజలు సుదాసుని వేడుకొను చున్నట్లు కనవచ్చుచున్నది. బాణ క్షేపమును సూచించు దృశ్యమునకు క్రింద సుదాసుడు తనపై దండెత్తివచ్చిన సేనలతో స్థిరముగా నిల్చి పోరాడుట వర్ణింపబడినది. ఈ చిత్రరచన కెడమవైపున నిష్కాసనానంతర మడవిలో జరిగిన వృత్తాంతములను సూచించుచున్న చిత్రములన్నియు శిథిలము లై పోయినవి. సర్వావయవ హోమమునకై సుదాసుడు పట్టుకొన్న ఏకశత రాజకుమారులలో ఒకడును, కడకు ఆతని పరివర్తనమునకు కారణభూతుడైన వాడును అగు బోధిసత్వసుత సోముడు పద్మాకరమున తాను పట్టుకొనబడిన సమయమున సుదాసుని భుజముపై ఉన్నట్లు కానిపించును.
చిత్రరూపమున చెప్పబడిన సుందరములైన కథలలో మాతృపోషక జాతక మొకటి. అది మాతృదేవోభవ అను వేదసూక్తికి నిదర్శనమైనట్టిది. బోధిసత్వు డొకప్పు డేనుగుగా జన్మించి ఒక వనేచరునిచే వంచింపబడెను. అడవిలో దారి తప్పియున్న సమయమున ఇంటికిపోవు త్రొవచూపి అది వనేచరుని కంతకుముందు ఉపకార మొనరించియుండెను. ఆ గజము పట్టుకొనబడి రాజ గజ శాలకు కొనిరాబడెను. తనకు మిక్కిలి ప్రేమపాత్రురాలయిన చీకు ముసలితల్లి దీనావస్థను తలంచుకొని అది అచ్చట ఎట్టి ఆహారమును గ్రహింప నొల్లకుండెను. రాజు జాలిపడి దానిని విడిచివైచెను. అన్ని దృశ్యములును చక్కగా అమర్పబడినవి. రాజ పరిచారక పరివృతమై అది తన ప్రియజననీజనకుల కలసికొనుటకై ఉత్సాహమున ఇంటికి పరెగెత్తుటను, పితాపుత్ర సుఖసమాగమమును సూచించు చివర దృశ్యములు మిక్కిలి సుందరముగా చిత్రింపబడినవి.
కుడిగోడమీద చిత్రింపబడిన సింహలావదానమును గూడ ఇట పేర్కొనవలసియున్నది. ఇందలి కథ దివ్యావదానము నుండి గ్రహింపబడి వలాహస్సజాతకములోని కొన్ని వివరములచే పుష్టి నొందినది.
చిత్రము యొక్క కుడిచివర అడుగున సింహలుని సముద్రప్రయాణమున జరిగిన నౌకాభంగముతో కథ ఆరంభించు చున్నది. అతడును తదనుచరులైన 500 మంది వర్తకులును రాక్షసాంగనలతో కూడిన ఒక ద్వీపమునకు త్రోయబడిరి. అచ్చటి రాక్షస స్త్రీలు సుందరాకారమును వహించి సగౌరవముగా వారికి ఆతిథ్య మొసంగిరి. సింహలుడు మాత్రము వారిచే వంచితుడు కాలేదు. అతడు గుఱ్ఱముగా జన్మించిన బోధిసత్వుని ఆతిథ్యము గ్రహించెను. ఆ గుఱ్ఱము అతనిని కొందరనుచరులను తిరిగి వెనుకకు కొనిపోయెను. ఈ చిత్రము రాక్షసాంగనల వినోదోత్సాహములను సూచించు దృశ్యమున కించుక పైని రమణీయముగా చిత్రింపబడినది. కొంత సేపైన తరువాత ఆ రాక్షస స్త్రీలు చిత్రములో కనబడునట్లుగా తమ యథార్థ రూపములు గ్రహించి మూర్ఖులై అచ్చట ఉండిపోయిన సింహలుని అనుచరులను కబళించిరి. తన్ను తప్పించినందుకు సింహలుడా గుఱ్ఱమునకు కృతజ్ఞతా వందనములర్పించును. ఆతడొక ద్వారముకడ ఆగుఱ్ఱము ముందు కృతజ్ఞతతో మోకరిల్లి యున్నట్లు చిత్రింపబడి యున్నది. కాని వెంటనే ఒక రాక్షసి సుందరవనితా కారమున ఒక బిడ్డ నెత్తుకొనివచ్చి ఇతడే నా నిజమైన భర్తఅని పల్కును. ఆస్థానదృశ్యమున గల మంత్రి విణ్ణ రూప మాతడు ప్రయత్నించియు రాజు నా సాహస కృత్యమునుండి మాన్పలేకపోయెనని సూచించుచున్నది. దాని ఫలితము ఎడమచివర చూపబడినది. ఆ రాక్షసి రాజును చంపి తిని వేయును. ఆమె అనుచారిణులు అంతఃపురమున నున్నవారి నందరిని సంహరింతురు. సంవృతమైన ప్రాసాదద్వారముపై రాబందు లెగురుట చూచి ప్రజలు భీతులైరి. కాని సింహలు డొక నిచ్చెనసాయమున ప్రాసాదకుడ్యము నెక్కి లోని రాక్షసాంగనల నందరిని బయటికి తరిమెను. సింహలుని సేనలు సముద్రమును దాటుట, గజములు చదునైన అధోభాగముగల పడవలపై ఎక్కుట, మున్నగు తుది దృశ్యములు మిక్కిలి సహజముగా చిత్రింపబడినవి. సముద్రతీరమున సింహలుని సేనలకును శస్త్రాస్త్రసన్నద్ధులైన రాక్షసస్త్రీలకును జరిగిన యుద్ధమును విజేతయైన సింహలుని పట్టాభి షేకమును మిక్కిలి ఉత్తమ తరగతికి చెందిన దృశ్యములు. 16వ గుహ యందలి చిత్రములు చిత్రించిన చిత్రకారుడు సంస్కృతమున అశ్వఘోషునిచే రచింపబడిన మిక్కిలి రమణీయమైన కావ్యమునందలి నందుని కథను వస్తువుగా గ్రహించినట్లు తోచుచున్నది. కాని ఒకటి రెండు దృశ్యములు తప్ప మిగిలిన చిత్రమంతయు పూర్తిగా పాడైపోయినది. నందుని శిరోముండనము, బలవత్సన్యాస స్వీకారముచే అతడు పొందిన విచారము, వాయుమండల ప్రయాణముకల దృశ్యములను మాత్రము కొంచెము గుర్తు పట్టవచ్చును. "మరణించుచున్న రాకుమారి" అని పేరుపొందిన తుది దృశ్యము మిక్కిలి ప్రసిద్ధమైనది. నందుని ప్రియురాలైన సుందరి విరహ వేదన పొందుచు, పరిచారకు డొకడు పైకెత్తి పట్టుకొన్న ఆతని కిరీటమువంక ఆత్రముతో చూచు చుండుట అందు వర్ణితమైనది.
కృతహస్తులైన చిత్రకారులచే అత్యంత నిపుణముగా చిత్రింపబడిన మరి రెండు ముఖ్య జాతక కథ లున్నవి. అందొకటి మొదటి గుహలోని మహాజనక జాతకము, రెండవది రెండవ గుహయందలి విధుర పండితజాతకము. "ధమ్మ" వైభవమును ప్రత్యక్షముగా ప్రదర్శించు 'మొదటి జాతకమునందలి కథలందు ముఖ్యములును, నాటకోచితములు నైన అంశములందే దృష్టి కేంద్రీకృత మగునట్లుగా ఎన్నుకొని అమర్పబడియున్నవి. ఇరువురు సోదరుల నడుమ యుద్ధము జరుగుట, అందొకడు రెండవవానిని చంపుట, గర్భవతియైన రాణి మరొక రాజ్యమునకు పారిపోవుట మున్నగు నీరస విషయములతో కూడిన కథయందలి తొలి సన్ని వేశములు విడిచి వేయబడినవి. నిజమునకు అసలైన కథ తరువాత ఆరంభించును. గర్భిణియైన రాణికి ఉదయించిన కుమారుడు మహాజనకుడను పేరుతో పెరిగి, యువకుడై పణ్య వస్తుసముదాయముతో సముద్రముపై, సువర్ణ భూమికి పయనించును. రూపకోచితమైన నౌకాభంగ దృశ్యమును, తిమినక్ర సంకులమైన సముద్రమున మునిగి పోవుచున్న మనుష్యుని ముఖమునందలి దారుణమైన భయాధిక్యమును, మిక్కిలి సహజముగా చిత్రింపబడినవి. అత డొక దేవతచే రక్షింపబడి మిథిలానగరము చేరుకొనును. తరువాత కొన్ని దృశ్యములు మరల విడిచి వేయబడినవి. కారణమేమన ఇవి అంతకుముందే మరణించిన రాజ్యావహర్త కుమార్తెను మహాజనకుడు వివాహము చేసికొన్న విషయమునకు సంబంధించినవి. వైరాగ్య ప్రధానమైన ఈ కథా నిర్మాణములో ఇట్టిదాని కంతగా ప్రాధాన్యము కనుపింపదు. లౌకిక భోగములయెక వైముఖ్యము వహించిన మహాజనకుని నిర్విణ్ణ ప్రకృతియు, గీత నృత్యాదులచే రాణి అతని మనస్సు నాకర్షింప యత్నించుటయు మిక్కిలి విస్తృతముగా వర్ణింపబడినవి. పరిచారిక పాద సంవాహన మొనరించుచుండగా రాణి రాజున కానుకొని శిబిరమున కూర్చున్న దృశ్య మొకటి కలదు. కుడిప్రక్క గానముతో కూడిన దృశ్యము సాగుచున్నది. నర్తకి చిత్రము మిక్కిలి కోమలమును, మనోజ్ఞమునై యున్నది. శిబిరమునకు క్రిందుగా స్త్రీ యొకతె గుడిసెలో లేప నౌషధమును తయారుచేయుచున్నది.రాజు ముఖ రేఖలనుబట్టి అతడీ వినోదమునందేమియు ఉత్సాహము చూపుటలేదని తెలియుచున్నది. తరువాత శిలా గుహలోనున్న ఒక సన్యాసిచేయు మత బోధలు వినుటకై రాజు గజారూఢుడై పురద్వారము వెలువడి వచ్చుచున్నట్లును, గుహ ముందు కూడియున్న జనసమూహము నడుమ అతడు ముకుళిత హస్తుడై నిలబడినట్లును చిత్రింపబడినది. పిమ్మట ప్రాసాదమున మహాజనకుడు తాను ప్రపంచమును పరిత్యజింప నిశ్చయము చేసికొన్నట్లు రాణి కెరిగించుట సూచితమైనది. అనంతరము రాజు గుఱ్ఱము నెక్కి రాజధాని విడిచి వెళ్ళును. దీని క్రింద భర్త ననుసరించి ఏగుచున్న రాణి 'సివతి' దీనమైన చిత్రము కనిపించును. దురదృష్ట వశమున ఇచ్చటి చిత్రమంతయు పూర్తిగా శిథిలమయిపోయినది. దేవాలయమువంటి ఒక కట్టడము దగ్గర ఉన్న బొమ్మల ఊర్ధ్వభాగములు మాత్రమే దృశ్యము లగుచున్నవి. ఆ జనసమూహమున రాజు చిత్రము మిక్కిలి ప్రాధాన్యము వహించియున్నది.
విధుర పండిత జాతకమును సూచించు చిత్రము పైదానికంటే మేలుగా రక్షితమైనది. అది రెండవ గుహలోని కుడి కుడ్యమునందు చాల భాగమును ఆవరించి యున్నది. దానిక్రింద ఉన్న స్వల్ప వైశాల్యముగల స్థలము'లో దివ్యావదానముమండి గ్రహింపబడిన పూర్ణావదాన మను మరొక కథ చిత్రింపబడినది.
విధుర పండితుడు ఇంద్రప్రస్థ రాజునకు మంత్రిగా ఉదయించిన బోధిసత్వుడు. అతడు సుప్రసిద్ధు డగుటచే విమల అను నాగరాణి అతని బోధలు వినుట కువ్విళ్ళూరు చుండెను. కాని అతనిని తన రాజ్యమునకు రప్పించుట కెట్టి అవకాశమును లేకపోయెను. ఇరందాతి అను ఆమె ముద్దుకూతురు తన ప్రియుడైన పున్నకుడను యక్ష దండ నాథునిపై ఆకార్యభారము మోపెను. అతడు ద్యూత క్రీడయందు ఇంద్రప్రస్థ రాజును జయించి విధుర పండితు నోడుచుకొనెను. ఇరందాతి తూగుటుయ్యాలలో ఊగు చుండుట, పున్నకుడు ఇరందాతిని కలసికొనుట, నాగరాజు తన కూతును పున్నకుడు వివాహ మాడదలచిన విషయమునుగూర్చి తన చుట్టములతో ఆలోచించుట, ఇంద్రపస్థరాజు కొలువుకూటము, అక్షక్రీడ, పున్నకునితో కూడ విధుర పండితుడు పయనించుట, నాగరాజు ప్రాసాదమున ఆతడు మతబోధ కావించుట, సంతోషకరమైన వివాహము. మున్నగు దృశ్యము లన్నియు కథ విచ్ఛిన్నము కాకుండ మిక్కిలి మెలకువతో చిత్రింపబడినవి.
మొదటిగుహ యందలి శంఖపాల శిబిజాతకములు, రెండవగుహ యందలి హంసజాతకము, 16 వ గుహ యందలి హస్తి, వుమ్మగ్గజాతకములు మున్నగు పెక్కితర జాతకములు ఆనాటి నిరుపమానమైన చిత్రరూప కథన కళకు నిదర్శనములుగా నున్నవి. శిథిల ప్రాయములై పోయినను బుద్ధుని జీవితమునుండి గ్రహింపబడిన పెక్కు చిత్రములు రూపకోచిత రామణీయకములో అప్రతిమానములై ఒప్పారు చున్నవి.
డా. పు. శ్రీ.
[[వర్గం:]] [[వర్గం:]]