సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అచ్చుయంత్రముల నిర్మాతలు
అచ్చుయంత్రముల నిర్మాతలు : 1. మెర్జెన్ లరు : మెర్జెన్ థాలర్ ఆట్మన్ అను నాతడు ఒక అమెరిక౯ కల్పకుడు (inventor). అతడు 1854 వ సంవత్సరమున మే నెల 10 వ తేది యందు జర్మనీ దేశములో వర్టెంబర్గు అనుచోట జన్మించెను. బాల్టిమూర్ లో 1899 వ సంవత్సరమున అక్టోబరు నెలలో 28 వ తేదియందు అతడు కాలధర్మమునొందెను. గడియారములు చేయుట అతని వృత్తి. అతడు పదు నెనిమిదవ యేట అమెరికా సంయుక్త రాష్ట్రములకు పోయెను. వాషింగ్టనులో సంయుక్త రాష్ట్ర ప్రభుత్వోద్యోగమున ప్రవేశించెను. అచటి ప్రభుత్వ భవనము లన్నింటియందు నున్న 'క్లిక్కు' లను, విద్యుద్ఘాంటలను సరిచేసెను. సాంకేతిక శాఖయందు వాడుచున్న సాధనములను అభివృద్ధిచేసెను. 1876 వ సంవత్సరమున అతడు బాల్టిమూర్ నకు వచ్చి, ముద్రాక్షరములను కూర్చు నొక యంత్రమును దోషరహితముగ చేయుటలో నిమగ్నుడయ్యెను. అతడు కొన్ని సంవత్సరము లీ విషయమున గడపెను. అతని కల్పన (scheme) కొన్ని దశలలో జరిగినది. వాటిలో 'పంక్తి ముద్రణము' (Linotype) అనునది కడపటిది. ఈ యంత్రవిషయమున ఆతడు నూతన కల్పనాధికారమును పొందిన తరువాత, దానిని వాడుక లోనికి దెచ్చుట అతనికి చాల కష్టమయ్యెను. ఎడముల నేర్పరచు 'రోజర్సుసాధనము' ను ఇంకను పెక్కు ఉపకల్పనలను చేర్చి ఫిలిఫ్ టి డాడ్జి ప్రభృతులు దానికి సంపూర్ణత్వము నిచ్చిరి. అందుచే దానిని కల్పన చేసినవానికి విశేషమగు లాభము దొరకినది. అది ఇప్పుడు పెద్ద పెద్ద ముద్రణ సంస్థలలో సాధారణముగ విశేషమయిన ఉపయోగమును కాంచుచున్నది. ఫలములు సమర్పించుటకు ఉపయోగపడు బుట్టలను "వెనీర్డు" (veneered wood) చక్కతో తయారుచేయుటకై ఒక యంత్రమును కూడ మెర్జెథాలర్ కల్పన చేసెను.
2. రిచర్డుమార్చ్ హో :--రిచర్డుమార్చ్ హో అమెరికా దేశస్థుడు. సామానులుచేయుట అతని వృత్తి. అతడు 1812 వ సంవత్సరమున సెప్టెంబరు నెల 12 వ తేదిని న్యూయార్కు నగరమున జన్మించెను. 1886 వ సంవత్సరమున జూన్ నెల 7 వ తేదీని ఇటలీలో ఫ్లారెన్సు నగరమున చనిపోయెను. అతడు రాబర్టు హో (1784-1833) అనునాతని కొడుకు, మరియొక రాబర్ట్ హో (1889-1909) అనునాతనికి పినతండ్రి. తండ్రి అనంతరము ఆర్. హో అండ్ కంపెనీ యొక్క నిర్వహణమును వహించి, 1847 వ సంవత్సరమున “హో” పరిభ్రమణ ముద్రణ యంత్రమును కల్పనచేసెను. అతడు అల్లికవలెనుండు ముద్రణయంత్రములను (వీటిపై కాగితముయొక్క రెండువైపులను ఒకేసారి అచ్చు వేయుటకు వీలగునట్లు) నిర్మించెను. అచ్చుపడిన కాగితములను మడత పెట్టుటకు ముక్కోణాకారపు సాధనమును కల్పనచేసెను.
3. గూటెన్ బెర్గు జొహాన్నిస్, లేక, హెన్ని:- జొహాన్నిస్ గూటెన్ బెర్గ్ అనువాడు కదలించుటకు వీలైన ముద్రాక్షరములతో ముద్రణ విధానమును కల్పించిన జర్మను కల్పకుడు. ఇతడు క్రీ. శ. 1400 సంవత్సర ప్రాంతమున మెయింజ్ అనుచోట జన్మించి, క్రీ. శ. 1468 వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 23 వ తేదిని అచటనే చనిపోయెను. అతని బాల్యదశనుగూర్చి మనకేమియు తెలియదు. 1434 వ సంవత్సరమున అతడు స్ట్రాస్ బర్గులో నివసించుచుండెను. రహస్యమైనవియును, అద్భుత మైనవియు నగు తనకళలనన్నిటిని వారికి బోధించునట్లును, వాటిని వారి ఉమ్మడి ప్రయోజనము కొరకు వినియోగించునట్లును 1436 వ సంవత్సరమున అతడు ఆండ్రియాడై జెల్మ్ మున్నగు వారితో ఒడంబడిక చేసికొనెను. 1438 వ సంవత్సరాంతమున డ్రైజెల్మ్ చనిపోవుటచే ఆ కంపెనీ ఒడంబడికకు భగ్నముకలిగెను. తరువాత 1448 వ సంవత్సర ప్రాంతమున అతడు మెయింజ్ కు తిరిగివచ్చి, వెంటనే ధనికస్వర్ణ కారుడగు జోహాన్ పాస్టుతో భాగస్వామిగా చేరెను. పొస్టు ఒక ముద్రణాలయమును స్థాపించుటకు వలయు ధనము సమకూర్చెను. ఆముద్రణాలయమునందు లాటిన్ భాషలో నున్న బైబిలు గ్రంథము మొదట అచ్చువేయబడెను. 1450 వ సంవత్సరమున ముద్రణము ప్రారంభింపబడి 1455 వ సంవత్సరమున పూర్తిచేయబడిన 'మజారి౯ బైబిలు' అను గ్రంథము చలనాత్మక ముద్రాక్షరములతో ముద్రింపబడిన ప్రథమగ్రంథముగా తెలియుచున్నది. కొన్ని యేండ్ల తరువాత ఈసంబంధము విడిపోయినది. పొస్టు ముందుగా పెద్దమొత్తములను పెట్టుబడి పెట్టెను. వాటిని తీర్చవలసినదని ఆతడు గూటెన్ బెర్గును నిర్బంధించెను. గూటెన్ బెర్గు వాటిని తీర్చుటకు శక్తి లేకయో. ఇష్టము లేకయో ఊరకుండుటచే, ఈ విషయము న్యాయస్థానమునకు తీసికొని పోబడెను. దాని ఫలితముగా ముద్రణాలయము ఫాస్టునకు అధీనమయ్యెను. అతడు దానిని అభివృద్ధిచేసి, జెర౯షీమ్ వాస్తవ్యుడగు పీటర్ షోఫర్ అనునాతనితో చేరి ఉపయోగించుచుండెను.
మెయింజ్ వాస్తవ్యుడగు కోనార్డుహమ్మర్ అను నొక వకీలు పోషకత్వముచే ఆమరుసటి సంవత్సరము గూటెన్ బెర్గు మరలనొక ముద్రణాలయమును స్థాపింపగలిగెను. ఆముద్రణాలయమునుండి 1460 వ సంవత్సరములో ఒక చక్కని "కాథొలికన్"', 1454, 55 వ సంవత్సరములలో "లెటర్సు ఆఫ్ ఇండల్జెన్స్"అను గ్రంథములు వెలువడినవి. ఆతని ముద్రణాలయమునుండి వెలువడిన ఏగ్రంథము పైనను గూటెన్ బెర్గు యొక్క పేరు కనిపించదు. అతని స్నేహితులు గాని, పోషకులుగాని ముద్రణ విషయమగు కల్పనల సందర్భమున గూబెన్ బెర్గు నామము పేర్కొనరు.
గ. శి. శా.
[[వర్గం:]] [[వర్గం:]]