సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అగ్గిపుల్లలు
అగ్గిపుల్లలు :- నిప్పును తయారుచేసికొనుట మానవుడు తన నిత్యజీవితమందు ఎదుర్కొసిన తొలి సమస్య. ఎండుకఱ్ఱల రాపిడిచే అగ్నిని రగుల్కొల్పు పురాతన విధానము నేటికిని భారతదేశ గ్రామములలో గాన వచ్చుచున్నది. రాతి యుగములోను, కంచు యుగములోను రెండు రాళ్ళను ఇందుకొరకై ఉపయోగించెడి వారు. వీనిలో నొకటి పై రైట్సు రూపమున ఇనుమును కలిగియుండును. క్రమేణ. ఈ పద్ధతి ఉక్కు చెకుముకిరాయి నుపయోగించు టిండరు బాక్సు (Tinder Box) విధానముగా మార్పుచెందెను. "టిండర్ ” పెట్టె నుండి వెలువడు నిప్పు రవ్వలను దూది పై గాని, మాడిన నారపై గాని, గంధకపు పూతగల్గిన పుల్లలపై గాని పట్టి, నిప్పు తయారుచేసెడివారు. రసాయనిక పదార్థముల సహాయముచే, తయారుచేయబడు అగ్గిపుల్లలకిది నాంది అని చెప్పవచ్చును.
1673 లో హాంబర్గు' నివాసియగు 'బ్రాండు' అను శాస్త్రజ్ఞుడు భాస్వరమును కనుగొనినప్పటి నుండియు, దాని నుపయోగించి కృత్రిమముగా నిప్పు తయారు చేయుటకై చేయబడిన ప్రయత్నములన్నియు వ్యర్థమాయెను. ఈలోగా 'బెర్డెలాట్' అను శాస్త్రజ్ఞుడు, దహ్యపదార్థములను గాఢామ్లముల సమక్షమున హరితములతో ఆమ్లజనీకరణము చేయుట కనుగొనెను. ఈ పద్ధతి హరిదాన్లుపు అగ్గిపుల్లలను (Eximuriated Matches) తయారుచేయుటకు దారితీసెను. దీని ప్రకారము గంధకము, పొటాషియ హరితము, చక్కెర, బంక, రంగు పదార్థములు కలిపి తయారుచేసిన ముద్దను సన్నని పుల్లల కొనలకు పట్టించి, ఆ కొనలను గాఢగంధకి కామ్లములో ముంచినచో పుల్లలు మండెడివి. కాని ఎల్లప్పుడును గాఢ గంధకి కామ్లము నొక సీసాలో తీసికొనిపోవలసి వచ్చుటచే, ఈ పద్ధతి చాల అసౌకర్యమనిపించెను. 1809 లో 'పారిస్' నగరవాసియైన 'డెరిపాస్' నకు, భాస్వరము నుపయోగించి కృత్రిమముగా నిప్పును కల్పించు విధానమునకై పేటెంటు (Patent) ఈయబడెను.
1827 వ సంవత్సరములో 'రాపిడి అగ్గిపుల్లల' ను ఇంగ్లాండు దేశీయుడగు జాన్ వాకరు మొదటిసారి జయప్రదముగా తయారుచేసెను. ఈ పుల్లల కొనలు అంటి మొనిగంధకిదము, పొటాషియ హరితము, తుమ్మబంక కల్గినముద్దచే పూయబడినవి. ఈ కొనలను గాజుపొడుము కలిగిన గరుకు కాగితముపై రాచినప్పుడు మంట కలుగును.
భాస్వరము నుపయోగించి తృప్తికరమైన రాపిడి అగ్గిపుల్లలను 1831 లో తొలిసారిగా ఫ్రాన్సు దేశీయుడైన 'ఛార్లస్ సౌరియా' అను నతడు తయారు చేసెను. అతడు పొటాషియం హరితమును ఆమ్లజనీకరణ సాధనముగా నుపమోగించుటచే, మందులోనికి కావలసిన పచ్చభాస్వరము నూటికి 50% నుండి 5% వరకు తగ్గిపోయెను. కాని ఇంతవరకు భాస్వరము నుపయోగించి చేయబడిన అగ్గిపుల్ల లన్నింటిలోను, పచ్చభాస్వరము వాడుటచే కార్మికులకు 'ఫాసీజా' (Phossy jaw) అను ప్రమాదమైన దౌడజాడ్యము సంభవించు చుండెను. 1864 లో 'లెమాయిన్' కనుగొనిన 'ఖాస్వరత్రిగంధ కిదము' ను పచ్చభాస్వరము (Sesanisulphide of Phosphorus) నకు బదులుగా నుపయోగించి, ఫ్రాన్సు దేశ ములో నెవీన్ మరియు 'కహన్' అను వారలు 1898 లో మొదటిసారి, అగ్గిపుల్లలు మందును తయారు చేపిరి. 20 వ శతాబ్ది ప్రారంభమునకు ప్రపంచమంతటను అగ్గిపుల్ల లమందు చేయుటకై భాస్వరత్రిగంధకిదము వాడుకలోనికి వచ్చెను.
అగ్గిపుల్లలలో, ఇష్టమువచ్చినచోట గీయతగినవి (strike-anywhere), పెట్టె మీద గీయతగినవి (strike-on-box or safety) అనునవి రెండు ముఖ్యమైన రకములు. వీటిలో మొదటిరకపు పుల్లలను, ఏ ప్రదేశముమీద గీచినప్పటికి మంట బయలుదేరును. రెండవరకపు 'క్షేమ' అగ్గిపుల్లలను స్వీడను దేశీయుడైన 'జాన్ కోపింగ్' 1855 లో తయారుచేసెను. ఇవి ప్రత్యేకతలములపై గీచినప్పుడు మాత్రమే మండును. కావున వీటిని సురక్షితముగ నువయోగింపవచ్చును. పుస్తకరూపముననుండు పెట్టెలలో దొరుకు మరియొకరకపు పుల్లలు కూడ క్షేమకరమైనవి. ఇవిగాక 'మైనపు అగ్గిపుల్లలు' 'రెండుకొనల అగ్గిపుల్లలు' రంగుపుల్లలు, ఫ్యూజీ; గాలిలో మండునవి (‘Fuzee', 'Wind flamer') మొదలగు వివిధరకములు గలవు. ఇవి ప్రత్యేకావసరములకు వాడబడును.
అగ్గిపుల్లలను తయారుచేయుటకు కావలసిన ముడిపదార్ధములు కఱ్ఱ, రసాయనిక పదార్థములు, జిగురుపదార్థములు, పైన చుట్టు కాగితముపట్టీలు మొదలగునవి. పుల్లలను తయారుచేయుట కుపయోగించు ముడిపదార్థములో కఱ్ఱ ముఖ్యమైనది. అగ్గిపుల్లల నాణ్యము చాలవరకు దీనిపై ఆధారపడియుండును. ఈ కఱ్ఱ మెత్తగను, చదునుగను, శుభ్రముగను, పగుళ్ళు, బొడిపెలు లేకుండగను ఉండవలెను. అగ్గిపుల్లలను తయారుచేయుటకు చాలరకముల కలవల నుపయోగించెదరు. 'ఆస్పెన్,' *పోప్లార్,బర్చ్,' మున్నగు రకములను పాశ్చాత్యదేశములలో తరచు వాడుచున్నారు. భారతదేశములో, 'పైనస్ లాంగి ఫోలియా' (Pinus longifolia) 'పైనస్ ఎక్సెల్సా' (Pinus exelsa), 'విల్లో' (Willow), 'పాప్యులస్ సిలియాటా' (Populus ciliata) అడవిమామిడి, ముని మోదుగ, పెద్దమాను, అడవి గుమ్మడి, గుగ్గిలము, బూరుగ మున్నగు వృక్షముల కలపలను ఈ పరిశ్రమలో వాడుచున్నారు.
అగ్గిపుల్ల మందు తయారుచేయుట కుపయోగించు రసాయనిక పదార్థములలో పొటాసియ హరితము, పొటాసియ ద్విక్రోమితము, గంధకము, మాంగ నద్విజమ్ల జనిదము, కాల్షియగంధకితము, ఫెర్రిక్ ఆక్సైడ్, బేరియం గంధకితము మున్నగునవి ముఖ్యమైనవి. అగ్గిపెట్టె ప్రక్కల నుపయోగించు 'రాపిడి' మందులో, ఎఱ్ఱ భాస్వరము, భాస్వర త్రిగంధకిదము, అంటిమొని గంధకిదము, సుద్ద మున్నగువాటిని వాడెదరు. బంక, 'జలెటిన్,' తుమ్మజిగురు, కేసీన్ (casein) పిండిపదార్థము మున్నగువాటి నుండి జిగురు పదార్థములను తయారు చేసి మందులలో వాడెదరు. క్రొవ్వొత్తుల మైనము, అమ్మోనియా భాస్వరితము, గాజుపొడి మున్నగు ఇతర పదార్థములను కూడ అగ్గిపుల్లల పరిశ్రమలో వాడెదరు.
అగ్గిపుల్లలను తయారుచేయువద్ధతి చాలా కాలమునుండి వృద్ధిచెందుచు అత్యుచ్ఛదశకు వచ్చినది. పురాతన పద్ధతుల కును నవీన పద్ధతులకును గల భేదము, ఉపయోగించెడు స్వయం చాలక యంత్రములయందును, ప్రమాదరహిత లేక క్షేమమగు అగ్గిపుల్లలకు కావలసిన మందుసామగ్రుల యందును, సరియైన మంటను కల్గించు లక్షణముల యందును, ముడిపదార్థముల నాణ్యమునందును గలదు. కాని పరిశ్రమయందలి మూలసూత్రములలో మార్పులేదు. 'క్షేమ' మగు అగ్గిపుల్లలను తయారుచేయు నూతనపద్ధతి సూక్ష్మముగ ఈ దిగువ వర్ణింపబడినది.
అడవులనుండి తేబడిన దూలములను సుమారు రెండడుగుల పొడవుగల స్తంభాకారపు ముక్కలుగా కోయుదురు. వాటిపై బెరడు యంత్రసహాయముచే తీసివేయబడును. తరువాత ఈ ముక్కలను కడిగి నీటిలో ఉడకబెట్టుట యో, ఆవిరిలో వేడిచేయుటయో జరుగును. ముక్కలు మెత్తబడిన తరువాత వాటిని చీలికలు చేయు యంత్రములవద్దకో, పైన పూతపూయు _ యంత్రముల దగ్గరకో పంపుదురు. ఇక్కడ ఈ ముక్కలనుండి, జాగ్రతగా నమర్చబడిన కత్తితో, ఒకే మందముగల పొరను విడదీయుదురు. ఈ పొర ఒక పొడవైన రేకువలె వచ్చును. దీని వెడల్పు స్తంభాకారపు ముక్కల పొడవునకు సమానము. దీని మందము, అగ్గిపెట్టెలకొరకు 1/32 అంగుళము, పుల్లల కొరకు 1/12 అంగుళము ఉండును. ఈ రేకులను దొంతరలుగా చేసి, పెట్టెలకు పనికివచ్చునట్లు ముక్కలుగను, పుల్లలుగను కోసెదరు. వీటిని మందులను పట్టించుటకై వేర్వేరు విభాగములకు పంపెదరు. పుల్లలను తయారుచేయు విభాగములో, కఱ్ఱపుల్లలను ముందుగా వేడియైన 'మోనో అమ్మోనియం ' భాస్వరితము ద్రావణములో నానబెట్టి ఎండబెట్టెదరు. ఇది పుల్లలను అంటించినతర్వాత మంట ఆరిపోయిన వెంటనే పూర్తిగా నిప్పు ఆరిపోవుటకై అవసరము. పూత పూసి యెండిన పుల్లలను ఒక యంత్రములో మెరుగు పెట్టి, మరి యొక యంత్రములో సమర్చబడిన పళ్లెములలో వరుసలుగా పేర్చెదరు. తరువాత ఈ పళ్లెములు అగ్గిపుల్లలను తయారుచేయు స్వయంచాలక యంత్రముల వద్దకు తీసికొనిపోబడును. ఈ యంత్రములు సింప్లెక్సు, ఆటోమాట్, ఆదర్శ (‘Simplex’, “Automat’, ‘Ideal”) మొదలగు పేర్లతో పిలువబడుచున్నవి. ఇవి వేరు వేరు యంత్ర నిర్మాతలచే తయారు చేయబడినవి. ఈ యంత్రములు పనియంతయు స్వయముగానే మనుష్య సహాయము లేకుండా చేయగలవు. ఆగకుండా విద్యుచ్ఛక్తి సహాయముచే పనిచేయును. మొదట, పళ్లెములలో నున్న పుల్లలు, ఒక పట్టాపైనుండు సన్నని రంధ్రములలో నిలువుగా వరుసలలో అమర్చబడును. ఈ పట్టా, వేడిచేయబడిన లోహపు పట్టీమీద కొంతదూరము ప్రయాణముచేయును. ఈ ప్రక్రియవలన, పట్టాపై అమర్చబడిన పుల్లలు వేడి యెక్కును. తరువాత ఈ పట్టా, 220° ఫా. ఉష్ణోగ్రత వద్ద నుంచబడిన మైనముపై పోవును. అప్పుడు పుల్లల కొనలకు ½ సెం॥ మీ॥ పొడుగున మైనపు పూత పూయబడును. అదనముగా అంటిన మైనమును కరగించి తీసి వేయుటకై పుల్లలను తిరిగి ఒక వేడిపట్టాపై పంపుదురు. తరువాత పుల్లలు చల్లార్చబడును. పిమ్మట పుల్లలతో నున్న పట్టాను, తిరుగుచున్న ఒక పొత్రముపై పంపెదరు. ఈ పొత్రము అగ్గిపుల్ల మందుంచిన ఒక తొట్టెలో తిరుగుచుండును. కావున పట్టా పొత్రముపై పోయినప్పుడు ప్రతి పుల్ల కొనకును కొంచెము మందు పట్టించ బడును. పుల్లల చివర మందును ఎండబెట్టి చల్లార్చెదరు. అంతట తయారైన పుల్లలను పెట్టెల సొరుగులలో యంత్ర సహాయమున నింపెదరు. ఒక్కొక పెట్టెలో సుమారు 50 పుల్లల చొప్పున సమానముగా నింపబడును. సొరుగులను యంత్ర సహాయమున పెట్టెలలోనికి అతికించెదరు.
అగ్గి పెట్టెలను తయారుచేయుటకు కఱ్ఱనుండి తయారు చేసిన చదునైన ముక్కలను వాడెదరు. ఈ ముక్కలపై పెట్టెకు సరిపోవునట్లు కొంచెము లోతు కల్గిన గాడులు గీయబడును. ఈ గాడుల వెంబడి ముక్కలను వంచి కావలసినట్లు సొరుగులను, పెట్టెలను తయారుచేయుదురు. సొరుగుల పైనను. పెట్టెల పైనను రంగుకాగితము అంటించబడును. ఈ పనియంతయు యంత్రముల చేతనే చేయబడును. పుల్లలతో నింపిన పెట్టెలు రెండు గుండ్రని కుంచెల మధ్య ప్రయాణముచేయును. ఈ సమయములో పెట్టెల కిరువైపులను 'రాపిడి' మందు సమానమందముతో పూయబడును. తరువాత పెట్టెలను ఎండబెట్టి, రవాణా కొరకు వీలగునట్లు డజనుల చొప్పున, గ్రోసుల చొప్పున కట్టలుగా కట్టెదరు. కట్టలు కట్టుటగూడ యంత్ర సహాయముననే జరుగును.
అగ్గిపుల్లలను కుటీరపరిశ్రమలలో తయారుచేయునపుడు పై వివరించిన పనులలో చాలవరకు యంత్రములచే గాక మనుష్యులచే చేయబడును. ఇట్టి పనులలో దుంగలను కోయుట, పళ్ళెములలో నింపుట, పుల్లలకు మందుపూయుట, పెట్టెలలో నింపి కట్టలు కట్టుట, సామగ్రులను ఒక చోటి నుండి మరియొక చోటికి కొంపోవుట మొదలగునవి ముఖ్యమైనవి.
ఇష్టమువచ్చినచోట గీయు రకపు అగ్గిపుల్లలను మంచి తెల్లని ' పైన్ ' కఱ్ఱనుండి తయారుచేయుదురు. వీటిలో మండెడు పదార్థములతోను, ఆమ్లజనీకరణ పదార్థములతోను పుల్లల కొనలకు రెండు పూతలు ఒక దాని పై నొకటి పూయబడును. ఈ రకపు పుల్లలను మండించుటకు వేరే 'రాపిడి మందు' అనవసరము. ఏ గరుకు ప్రదేశము మీదనైనను గీచినచో ఈ పుల్లలు మండును. సామాన్యమైన వాడుకకును, ప్రత్యేకావసరములకును పనికివచ్చు అగ్గిపుల్లల రకములలో చిన్న పుస్తకరూపమున కుట్టబడి తయారగునవియు, సైనికావసరముల కుపయోగపడు విండ్ ఫ్లేమర్ ' ( గాలిలో మండునవి ), ' ఫూజీ ' అనునవియు, రంగుమంట నిచ్చెడు పుల్లలును ముఖ్యమైనవి. రంగుమంట నిచ్చుటకై 'స్టాన్షియం', 'బేరియం ' లవణములు కల్గిన మందులతో మొదట పూతపూసి, దానిపై, మంట కల్గించెడు పదార్థములతో పూతనిచ్చెదరు. ' సేఫ్టీ ' అగ్గిపుల్లల కుపయోగించెడు మందులు పాళ్లు ఉదాహరణకై ఈ దిగువ నీయబడినవి. ( పాళ్ళు బరువు లలో సూచింపబడినవి. ) . ' పుల్లల మందు ' :- పొటాసియ హరితము 36; ఎఱ్ఱ మాంగనము 4 ; పొటాసియ ద్విక్రోమితము 1; యశద ఆమ్లజనిదము ½; పారిస్ గార (ప్లాస్టర్ అప్ పారిస్) ½; గంగ సింధూరము 1; Caput Mortuum 4; గాజుపొడి 8; చౌడు(infusional earth) ½; గుగ్గిలము (Rosin) ½; గంధకము 3 ; బంక 8 ; నీరు 35.
' ప్రక్కలకు పూయు రాపిడిమందు ':- ఎఱ్ఱభాస్వరము 400 ; ఆంటిమొని గంధకిదము 320 ; సుద్ద 52 ; గాజుపొడి 48; బంక 18; తుమ్మబంక 136; బాదము బంక (gum tragacanth) 7; డెక్ట్ స్ట్రేను (Dextrine) 24, నీరు 750.
భారతదేశములో అగ్గిపుల్లలు చేయు మొదటి కర్మాగారము భారతీయుల యాజమాన్యమున 1895 లో అహమ్మదాబాదు నగరములో స్థాపింపబడెను. అయినప్పటికీ, మొదటి ప్రపంచ సంగ్రామమునకు పూర్వము మన దేశములో అగ్గిపుల్లలు తయారుకాలేదని యేచెప్పవచ్చును. 1922 లో దిగుమతి సరకులపై పన్నులు విధించిన తరువాతను, 1928 లో రక్షణ సుంకములను విధించిన తరువాతను, మనదేశపు అగ్గిపుల్లల పరిశ్రమ త్వరితముగా అభివృద్ధి చెందెను. 1926 నాటికి మనకు కావలసిన అగ్గిపుల్లలు చాలవరకు భారతీయ పరిశ్రమయే తయారుచేయ గలిగెను. దేశములో అమలులో నున్న రక్షణసుంకములను చెల్లించుకొనలేక పాశ్చాత్య ఎగుమతిదారులు భారతదేశములోనే అగ్గిపుల్లల కర్మాగారములను నెలకొల్పుటకు నిశ్చయించిరి. ఈ విధముగ పశ్చిమఇండియా అగ్గిపెట్టెల పరిశ్రమ కంపెనీ (Western India Match Co., Ltd. Wimco) అను పేరుతో స్వీడను దేశపు సంస్థ యొకటి మన దేశములో బెరైలీ, అంబరనాధ్, కలకత్తా, మద్రాస్ పట్టణముల యందు కర్మాగారములను స్థాపించేను. ఈ విమ్కో సంస్థ మనదేశములో ప్రస్తుతము కావలసిన అగ్గిపుల్లలలో నూటికి ఎనుబదివంతులు సరఫరా చేయుచున్నది. అయినప్పటికీ, అనేకచోట్ల మనదేశములో భారతీయ కర్మాగారములు పనిచేయుచున్నవి. ప్రస్తుతము దేశమంతటను 150 అగ్గిపుల్లల కర్మాగారము లున్నవి. వీటిలో మొత్తము 18,000 మంది కార్మికులు పనిచేయు చున్నారు. ఇవి కాక, అనేక పల్లెలలోను, పట్టణములలోను, కుటీరపరిశ్రమల ద్వారా కొంతవరకు అగ్గిపుల్లలు తయారగుచున్నవి. . 1950-1951 నాటికి మొత్తము కర్మాగారములలో 358 లక్షల గ్రోసుల పెట్టెలు తయారుచేయు శక్తియున్నదని అంచనా వేయబడినది. కాని ఆ సంవత్సరములో 291 లక్షల గ్రోసులు మాత్రమే తయారుచేయబడినవి. అదే సంవత్సరములో కుటీరపరిశ్రమ ద్వారా ఆరులక్షల గ్రోసులు తయారయినట్లు అంచనా వేయబడెను. ప్రథమ పంచవర్ష ప్రణాళిక ప్రకారము 1955 - 56 నాటికి దేశములోని కర్మాగారములు 383 లక్షల గ్రోసులు తయారుచేయు శక్తి కల్గియుండవలెననియు, అధమము 358 లక్షల గ్రోసులు తయారుచేయవలెననియు నిశ్చయింపబడినది. కుటీర పరిశ్రమలలో 1955-56 నాటికి 18 లక్షల గ్రోసులు తయారుకావలెనని ప్రణాళిక నిశ్చయించెను. · భారతదేశపు కర్మాగారములలో వాస్తవముగా తయారయిన అగ్గిపుల్లల పెట్టెలు- 1946 లొ 206 లక్షల గ్రోసులు : 1950 లో 262 లక్షల గ్రోసులు; 1952 లో 304 లక్షల గ్రోసులు 1954 లో 270 లక్షల గ్రోసులు.
ఎమ్. జి. కృష్ణ
[[వర్గం:]] [[వర్గం:]]