సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అక్బరు
అక్బరు :- అక్బరు భారతదేశ సామ్రాజ్యము నేలిన మొగలాయి పాదుషాలలో నగ్రగణ్యుడు. విశ్వవిఖ్యాత కీర్తి నార్జించిన చక్రవర్తులలో నొకడు. అక్బరు తండ్రి హుమాయూను. తల్లి హమీదాబాను బేగం. అక్బరు అమర్ కొటలో క్రీ.శ. 1542 నవంబరు 32వ తారీకున జన్మించెను.
హుమాయూను మరణించినపుడు అక్బరు తన సంరక్షకుడగు బైరంఖానుతో పంజాబునందుండెను. నాటికతనికి పదుమూడేండ్ల ప్రాయము. ఐనను, వెంటనే బైరంఖాను అక్బరును చక్రవర్తిగా ప్రకటించెను. కాని దేశమున మొగలుల అధికారము నామమాత్రమై యుండెను. నలువైపులను సర్దారులు విజృంభించి స్వతంత్రులగు చుండిరి. ఇది ఇట్లుండ హేము అను హైందవ వీరుడు ఢిల్లీ ఆగ్రాలను అక్రమించేను.
ఈ క్లిష్ట పరిస్థితులలో అక్బరు బైరంఖానుతో హేముపై నడచెను. పానిపట్టు క్షేత్రమున క్రీ. శ. 1556 లో జరిగిన ఘోరసంగ్రామమున హేము పరాజితుడయి వధింపబడెను. ఢిల్లీ, ఆగ్రాలు నాక్రమించి అక్బరు సింహాసన మధిష్ఠించెను.
అక్బరు బాలుడగుటచే పరిపాలనా భారమును బైరంఖాను వహించెను. బైరంఖాను సమర్థుడు, విశ్వాసపాత్రుడు, ప్రభుభక్తి పరాయణుడు. కాని దురహంకారి అగుటచే సర్దారులకు ఈతనిపై ద్వేషము జనించుట గమనించి క్రీ. శ. 1564 లో అక్బరు స్వయముగ పరిపాలనము సాగించుటకు నిర్ణయము చేసెను. అధికార వ్యామోహముతో బైరంఖాను ఒనర్చిన తిరుగుబాటు నణచి అక్బరాతనిని సగౌరవముగ మక్కా యాత్ర కంపెను.
అక్బరు మహావీరుడు. గొప్పవిజేత. భారత దేశము ననేకచ్ఛత్రాధిపత్యము నెలకొల్పుట ఆతని మహాశయము, సింహాసన మెక్కినది మొదలు 25 సంవత్సరములు నిర్విరామముగ విజయయాత్ర లొనర్చె ఆతడు నిర్మించిన మహాసామ్రాజ్యమునకు సాటి రాగలది సమ కాలిక ప్రపంచమున లేదు.
సింహాసన మధిష్ఠించిన తరువాత కొలదికాలమునకే అజ్మీరు, గ్వాలియరు, జేన్పూరు, మాళవము, గోండు వనములు నాక్రమించి ఢిల్లీ పరిసరముల తన యధికారము నెదిరింపగల శత్రువర్గమును అక్బరు నిర్మూలించెను.
రాజనీతి విశారదుడగు అక్బరు రసపుత్రుల మైత్రి మొగలాయి సామ్రాజ్య విస్తరణకును, సుస్థిరత్వమునకును అత్యవసరమని గుర్తించెను. నాటికి రాజపుత్రుల బలము కూడ క్షీణించినది. అందుచే సాధ్యమైనంతవరకు శాంతి యుతముగ తన సార్వభౌమత్వము వారిపయి విస్తరింప జేయుటయే అక్బరు సంకల్పము. 1562 లో జయపురాధీశ్వరుడగు బీహారీమల్లు తన కుమార్తెను అక్బరున కిచ్చి వివాహమొనర్చెను. అతని కుమారుడగు భగవాన్ దాసును, మనుమడగు మాకాసింహుడును మొగలుల కొలువునందు ఉన్నత పదవులను బడసిరి. కాని, మీ వాడ్ రాజవంశము మాత్రము అక్బరును ప్రతిఘటించినది. క్రీ. శ. 1567 లో అక్బరు వారిపయి యుద్ధమును ప్రకటించి వారి రాజధానియగు చిత్తూరును ఆక్రమించెను. మీవాడ్ రాణా ఉదయసింహుడు అక్బరునకు లొంగక ఉదయపూరునందు స్వతంత్ర ప్రభుత్వమును స్థాపించెను. అతని కుమారుడగు ప్రతాపసింహుడును, అనంతర మాతని కుమారుడగు అమరసింహుడును మీవాడ్ స్వాతంత్య్ర పోరాటమును సాగించిరి. అక్బరు కూడ వారి స్వాతంత్య్ర దీక్ష నభినందించి వారియందు ఉదారత వహించెను. రత్నభోరు, బికనీరు, జైసల్మీరు, కలంజరు మున్నగు రసపుత్ర సంస్థాన ప్రభువులు అక్బరునకు సామంతులయిరి.
ఈ లోగా గుజరాతు, బెంగాలు, ఒరిస్సాలు కూడ అక్బరు సామ్రాజ్యమున చేర్చబడినవి. అక్బరు రసపుత్రుల తోడి యుద్ధములందు నిమగ్నుడయి యున్న సమయమున కాబూలును పాలించుచున్న అక్బరు సవతి తమ్ముడు మీర్జాహకీము ఢిల్లీ సింహాసన మాక్రమింపవలెనను దుర్బుద్ధితో పంజాబుపై దండెత్తి వచ్చెను. హకీము యుద్ధమున నోడి పాదాక్రాంతుడగుటచే జాలిదలచి అక్బరాతని రాజ్యమును ఇచ్చివేసెను. క్రీ. శ. 1585 లో హకీము మరణానంతరము కాబూలు మొగలు సామ్రాజ్యమున కలుపబడెను. తరువాత నీ చక్రవర్తి కాశ్మీరము, బెలూచిస్థానము, సింధురాష్ట్రమును స్వాధీనపరచుకొని వాయవ్య సరిహద్దులు నివసించు అనాగరిక కొండజాతులను తన యేలుబడిలోనికి తెచ్చి, వారు మొగలు సామ్రాజ్య శాంతిభద్రతలకు భంగము కలిగించకుండ కట్టుదిట్టములు చేసెను.
ఉత్తర హిందూస్థానమును ఆక్రమించిన పిమ్మట అక్బరు దక్షిణాపథము పై దృష్టిని మరలించెను. క్రీ. శ. 1596 లో చాందుబీబీ నుండి అహమదు నగరరాజ్యమును, 1601 లో ఖాండేషును జయించి వశపరచుకొనేను. 1601లో ఖాండేషు నందు దుర్భేద్యమగు అసీర్ ఘరు దుర్గమును ముట్టడించు చుండ, సలీము రాకుమారుడు తిరుగుబాటోనర్చి రాజ కుటుంబము నందు అశాంతికి కారకుడయ్యెను. ఈ అశాంతియే అక్బరు ఆశయపూర్తికి ఆటంకమాయెను.
పైన వివరించిన విజయపరంపరలలో హిమాలయముల నుండి అహమదునగరము వరకును, హిందూ కుష్ పర్వత ములనుండి బెంగాలు వరకును వ్యాపించిన సామ్రాజ్యమును అక్బరు వదునెన్మిది సుబాలుగా విభజించి సుస్థిరమగు రాజ్యాంగ విధానమును ఏర్పరచెను. తోడరుమల్లు సహాయమున పంట పొలములను మషాయితీ చేయించి పంట ననుసరించి మధ్యవర్తుల ప్రమేయము లేకుండ ప్రభుత్వోద్యోగుల ద్వారమున పన్నులు వసూలు చేయు పద్ధతిని అమలు జరిపెను. రైతులపయి పన్నుల భారము తగ్గించి వారి కనేక సౌకర్యములు కలుగచేసెను. నెల జీతములపయిన ఆధారపడిన మన్సబుదారులు ద్వారమున సైన్యమును బలపరచెను.
అక్బరు దైవచింత గలవాడు. బాల్యము నుండియు హిందూ మహమ్మదీయ మతపై షమ్యములు ఆతనిని కలవర పెట్టుచుండెను. మతసమస్యను పరిష్కరించుటయు, హిందూ మహమ్మదీయుల నుండి సమైక్య భారతజాతిని రూపొందించుటయును అక్బరు జీవితలక్ష్యములైనవి. ఈ లక్ష్యసాధనకయి ఫతేపూరు సిక్రీలో అక్బరు మత చర్చలు జరిపెను. నిరక్షరాస్యుడయిన అక్బరు వివిధ మతాచార్యుల వాదములను శ్రద్ధతో నాలకించి తుదకు అన్ని మతము లందును సత్యము గలదను నిర్ణయమునకు వచ్చెను. పిదప సర్వమత సారమగు "దిన్ ఇ ఇలాహి” అను క్రొత్త మతమునకు ప్రవక్త యయ్యెను. వ్యక్తి స్వాతంత్య్రము, పరమత సహనము ఈ మతమునందలి మూలసూత్రములు. మతసహన విషయమున అక్బరు చిత్తశుద్ధి కిది చక్కని నిదర్శనము.
అక్బరనేక సంస్కరణములను ప్రవేశ పెట్టెను. తన సామ్రాజ్యమున ముస్లిము మతగురువుల ప్రత్యేకాధికారములను తొలగించెను. నాణెములపయి గల ఇస్లాము చిహ్నములను మాన్పించెను. మహమ్మదీయులలో గో మాంసభక్షణము, బహుభార్యాత్వము, బహిరంగ ప్రార్థనా సమావేశములను మాన్పించెను. హిందువులపై జిజియా మున్నగు పన్నులను తొలగించి వారికి ప్రభుత్వమున సమానహక్కుల నోసగెను. బాల్యవివాహము, సహగమనము, నిర్బంధ వైధవ్యము మున్నగు హిందూ దురాచారములను మాన్పుటకు ప్రయత్నించెను.
అక్బరు నిరక్షరాస్యుడు. కాని, కవిత్వమునందును, వేదాంత చర్చలలోను సంగీత చిత్రలేఖనములయందును అతనికి గొప్ప అభిమానము. అతడు కవి పండిత గాయక కల్పతరువు. కవి, చరిత్రకారుడు, వేదాంతి. అక్బరునకు గురువులు దిన్ ఇలాహికి వ్యాఖ్యానకారుడు అగు అబుల్ ఫజుల్ అను నాతడు అక్బరు ఆస్థానమునకు మణిదీపము, అక్బరునామా, ఐనీ అక్బరీ అనునవి అబుల్ ఫజుల్ యొక్క సుప్రసిద్ధ రచనలు. ఆతని తమ్ముడు ఫైజీకూడ గొప్పకవి. హిందువులలో, అక్బరుచే "కవిప్రియ” బిరుదమును పడసిన బీహారీమల్లు ముఖ్యుడు. తాన్ సేన్ అను నాతడు అక్బరు ఆస్థాన గాయకుడు. ప్రశస్త హిందూ గ్రంథములగు రామాయణము, భారతము, అధర్వణ వేదము, లీలావతీ గణితము, అక్బరు ప్రేరణచే పారశీక భాషలోనికి తర్జుమా చేయబడెను. అక్బరు స్వయముగ చిత్రకారుడు. భారతీయ, పారశీక శిల్పులు, చిత్రకారులు అనేకులు ఇతని ఆస్థానమందుండిరి. అక్బరు సేకరించిన 24,000 సంపుటములు గల గ్రంధాలయము ఆతని విద్యాభిమానమునకు నిదర్శనము.
ఈ సార్వభౌముని చివరిరోజులు కష్టములమధ్క కడతేరెను. అక్బరు కుమారులు మువ్వురును దుర్వ్యసన పరులు. అందిద్దరు అక్బరునకు పూర్వమే గతించిరి. పెద్ద కుమారుడగు సలీము అధికార లోభముతో తండ్రిమీదనే కత్తి గట్టెను. 1601 లో సలీము అలహాబాదులో స్వతంత్రుడగుటయే గాక అక్బరునకు ప్రాణమిత్రుడగు అబుల్ ఫజుల్ ను హత్య చేయించెను. ఈ సంఘటనలు అక్బరునకు తీవ్రసంతాప కారణములయి ఆరోగ్యమును పాడుచేసెను. సలీము దురాకృతములను అవకాశముగా గ్రహించి, కొలువుకూటమునందలి సర్దారులు కొందరు అక్బరు మరణానంతరము సలీము కుమారు డగు ఖుస్రూను సింహాసన మెక్కింప కుట్రలు పన్ను చుండిరి. ఇట్టి విషాద సంఘటనల మధ్య, పుత్రవత్సలుడగు అక్బరు సలీమునే తన యనంతరము చక్రవర్తిగా ప్రకటించి క్రీ. శ. 1605 అక్టోబరు 17 వ తారీఖున మరణించెను.
అక్బరు ఆజానుబాహువు. ప్రత్యణువునను రాజఠీవితో నిండిన విగ్రహ మాతనిది. శౌర్యసాహసములం దాతడు అసమానుడు, శరణాగతుడయినచో గర్భశత్రువు నైనను రక్షించు దయాస్వరూపుడు. కపటమెరుగని గంభీర స్వభావము గలవాడు. విద్యావిహీనుడయినను ఉత్తమ సంస్కారమును పొందినవాడు. ప్రజా క్షేమమే ఇతని పరిపాలనకు ఆశయము, ఇతనివలె ప్రజాభిమానమును పడసిన మహమ్మదీయ చక్రవర్తి మరియొకడు లేడు. జహంగీరు చెప్పినట్లు "అక్బరు మానవమాత్రుడు కాడు. అతని ప్రతిచర్యలోను భగవంతుని అంశము ప్రత్యక్ష మగుచుండెను.”
బి. ఎస్. ఎల్. హ. రా.
[[వర్గం:]]
[[వర్గం:]]