సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంతర్వేది
అంతర్వేది:- ఆంధ్ర దేశమును పవిత్రము గావించు గోదావరీనది రాజమహేంద్రవరమునుండి, కాశ్యప(తుల్యభాగ), అత్రి (కోరింగనది), గౌతమి, భరద్వాజ,కౌశిక, జమదగ్ని, వశిష్ఠ అను ఏడుపాయలుగా చీలి సముద్రముతో సంగమించుచున్నది. వీటిలో భరద్వాజ. జమదగ్నిపాయ అంతరించినవి. కౌశిక, తుల్యభాగలు చిన్న కాలువలవలె నున్నవి. యాత్రికులీ సప్తసంగమ స్థలము లందును స్నానముచేయుటకు "సప్తసాగర యాత్ర" చేయుదురు. వీటిలో మిక్కిలి పడమటిది వసిష్ఠాసాగర సంగమము. ఇచ్చట వసిష్ఠపాయకు ఎడమఒడ్డున అంతర్వేది క్షేత్రమున్నది. ఇది నరసాపురమను ప్రాచీన చారిత్రక పట్టణమునకు ఏడుమైళ్ళ దూరములోనున్నది. క్రీ.శ. 1602 వ సంవత్సరమున పోలెండు దేశస్థులగు డచ్చివారు ఈప్రాంతమునకు ఓడవర్తకము కొరకు వచ్చిరి. మన ర్తకముకొరకు దేశస్థులు హాలెండువారిని వలందువారు అనుచుండిరి సముద్రములోనిల్చిన వలందుల ఓడలనుండి గొప్పపడవలు అంతర్వేది మీదుగా నరసాపురమునకు జేరుచుండెను. ఓడలకు మార్గసూచనకొరకు డచ్చివారు అంతర్వేదిదగ్గర ఒక గొప్ప స్తంభమును కట్టిరి. ఇది దీపమున్న స్తంభము కాదు. పెద్దఓడలు ఒడ్డునకు రాకూడదని హెచ్చరిక తెల్పుటకీ స్తంభము పయోగించెడిది. ఈ ప్రాంతమును పిమ్మట ఆక్రమించుకొన్న ఆంగ్లేయులీ స్తంభమును బాగుచేయించిరి. 1951 వ సంవత్సరమున ఆగస్టులో వచ్చిన ఉప్పెనలో ఈ స్తంభపు పై భాగము పడిపోయినది. అప్పుడు సముద్ర మించుమించుగ నొక మైలుదూరము భూమిమీదికి చొచ్చుకొని వచ్చినది. పూర్వము సముద్రజలమున కరమైలు దూరముననుండెడి యీ స్తంభమిప్పుడు సముద్రములో నున్నది. దీనికి కొంతదూరములోనుండెడి ఆంజనేయ స్వామి ఆలయమునుగూడ సముద్రుడు మ్రింగివేసినాడు. ఆలయము కూలిపోయినది. ఆంజనేయ విగ్రహము అంతర్వేది చెరువుగట్టున నొక ఇటుకగుడిలో భద్రపరుపబడినది.
ఈప్రదేశమున కృతయుగమున బ్రహ్మ నూరేండ్లు యాగముచేసి యజ్ఞశాలలో అంతర్వేదికా స్థలమున నీలకంఠేశ్వరుని ప్రతిష్ఠించి క్షేత్రపాలకుని గావించెను. పిమ్మట వసిష్ఠ మహర్షి యిట నాశ్రమమేర్పరచుకొని గోదావరి నుండి వసిష్ఠపాయను తీసికొనివచ్చెనట. హిరణ్యాక్ష పుత్రుడగు రక్తలోచనుడు ఈశ్వరవర గర్వమున కన్నుగానక, విశ్వామిత్ర ప్రేరితుడై వసిష్ఠపుత్రులను చంపగా, వసిష్ఠుడు విష్ణువును ప్రార్థించెను. హరి, లక్ష్మీనృసింహ రూపమున మునికి ప్రత్యక్షమై, మాయాశ క్తియు తన సోదరియునగు అశ్వారూఢాంబ (గుఱ్ఱాలక్క) రాక్షసుని రక్తము భూమిమీద బడకుండ దననాల్కతొ పీల్చి వేసి తోడ్పడుటవలన, రక్తలోచనుని సంహరించెను. పిమ్మట రాక్షసరక్తమును గుఱ్ఱాలక్క విడిచివేయగా నది రక్తకుల్యయను పేరున ప్రవహించెను. వసిష్ఠుని ప్రార్థనచే లక్ష్మీనృసింహస్వామి అర్చారూపమున నట నిల్చిపోయెను. వసిష్ఠుడు లక్ష్మీ నృసింహ విగ్రహమును ప్రతిష్ఠించి అర్చాదులు గావించెను. ఈస్థలమునకు కొంతదూరమున రక్షణగా ఆంజనేయస్వామినిగూడ వసిష్ఠుడు ప్రతిష్ఠించెను. అస్వామి ఆలయమే 1951 లో సముద్ర గర్భమునపడేను.
వసిష్ఠుని యనంతరము నృసింహ విగ్రహమొక పుట్టలో నణగియుండెను. కలియుగమున కేశవదాసను గొల్లవాడు తన కపిలగోవు ప్రతిదినమును ఆపుట్టమీద తనపొదుగు పాలు విడుచుచుండుట చూచి అట త్రవ్వింపగా స్వామి విగ్రహము దొరికెను. దానికతడు దారువులతో ఆలయము నిర్మించి పూజాదికము లారంభించెను. స్వామి పెక్కు మహిమలు చూపెను. స్వామివారి అర్చాదులు నిర్వహించుటకు కేశవదాసు కొన్ని భూములను దానముచేసెను. కేశవదాసు నిర్మించిన కొయ్య గుడిస్తంభములు చక్కని శిల్పపు చెక్కడపు పనితనముతో నొప్పుచు, ఉక్కుస్తంభములవలె గట్టిగనున్నవి. ఈ దార్వాలయపు స్తంభములును ప్రస్తుతపు శివాలయము ప్రక్కను భద్రపరుపబడి స్వామివారి పాకశాలగా నేర్పడియున్నది. కేశవదాసు పాలెమను గ్రామము నేటికిని అంతర్వేదికి సమీపమున నున్నది. కేశవదాస నిర్మిత దార్వాలయము శిథిలావస్థకు రాగా బెండమూర్లంక కాపురస్థులును, అగ్నికుల క్షత్రియులును అగు కొపనాతి ఆదినారాయణగారు జీర్ణాలయోద్ధరణమునకు పూనుకొనిరి. ఇసుకతప్ప ఏ రాయియు దొరకని, యీ దూరసముద్ర ప్రాంతమునకు మహాలయ నిర్మాణమునకు గావలసిన శిలాస్తంభములును, రాళ్లును గొనిరాబడుట వింత. ఆదినారాయణ కొడుకు కృష్ణమ్మ. వీరు ఓడవర్తకము చేయుచుండిరి. ఆనాడు బెండమూర్లంక నుండి ఓడల మూలమున, బట్టలు మొదలగునవి సరకుల వర్తకము విదేశములతో జరుగుచుండెను. పోయినవను కొన్న ఓడలు నృసింహస్వామి యనుగ్రహమున విశేష ధనసంపదతో తిరిగిరాగా కృష్ణమ్మగారు, తండ్రి సంకల్పించిన ఆలయ మండపాదుల నిర్మాణము పూర్తిగావించిరి. ఈపని శాలివాహన శకము 1745 వ. సంవత్సరమునకు సరియయిన క్రీ. శ. 1823 న ముగిసినట్లు ఆలయపు గోడమీద నొక శిలాశాసనమున్నది.
గర్భాలయముననున్న స్వామి విగ్రహము పశ్చిమ ముఖముగానుండును. గర్భాలయమునకు నెదుట దానికి జేరి బలమైన మండపములున్నవి. నృసింహాలయమునకు కుడిప్రక్కను రామాలయమున్నది. ఈయాలయ మండపములందు గాఢాంధకారము నెలకొనియున్నను సాయంకాలమున పడమటనస్తమించు సూర్యుని కిరణములు స్వామి విగ్రహ వక్షస్థలమున ప్రసరించి బంగరుకాంతులతో వెల్గులీనుట రమ్యముగ నుండును. ఆ సొగసు ఆలయనిర్మాణమునందే గలదు. స్వామి ఆలయమున కెడమ నైపున కల్యాణ మండపమున్నది. దీనికి చుట్టును నాల్గువైపులను మండపమున్నది. పశ్చిమ ద్వారముమీది గోపురముకాక, పది చుట్టుకోవెల లున్నవి. నృసింహస్వామి చుట్టును రాజలక్ష్మి తాయారు, వెంకటేశ్వరస్వామి, భూదేవి తాయారు, శ్రీరంగనాయకస్వామి, సంతాన గోపాలస్వామి, కేశవస్వామి, పన్నిద్దరాళ్వారులు, ఆంజనేయస్వామి, శ్రీరాములవారు, గోవాలస్వామియు గలరు. వీరందరును సన్నిధి దేవతలు. మండపములమీది విమా నములు కొన్ని గుండ్రముగను, కొన్ని కూచిగను ఉండును. నీలకం ఠేశ్వరస్వామి వారి కొక రెడ్డి ప్రభువు ఆలయము కట్టించెను. అది శిథిలము కాగా, దుడ్డు బాబయ్యగారను పేరూరు వాస్తవ్యులును, ఆత్మూరి చినతాతయ్య యను నరసాపురపు ఓడ వర్తకులును జీర్ణాలయోద్ధారము గావించిరి. ఈ యాలయము నేడు శిథిలమగుచున్నది.
ప్రతి సంవత్సరమును మాఘ శుద్ధ దశమినాడు నృసింహస్వామి కల్యాణము జరుగును. ఏకాదశినాడు రథోత్సవమున స్వామి రథము గుఱ్ఱాలక్క గుడివరకు పోవును. వేలకొలది యాత్రికులు భీష్మైకాదశి మొదలు పూర్ణిమ వరకును ఉదయములందు సాగర సంగమ స్నానము గావించి పాపక్షయము నొందుదురు. ద్వాదశితో కూడిన ఆదివారమున సముద్ర స్నానము పుణ్య ప్రదము. త్రయోదశినాటి రక్తకుల్యాస్నానము పీడాహరము. చతుర్దశినాడు చోరోత్సవము. పూర్ణిమనాడు స్వామి చక్రతీర్థస్నానముకొరకు సముద్రమున కేగును. ఆ స్థలమున స్వామివారు నిలుచుటకు కట్టబడిన మండపము చక్కగనున్నది. పూర్వ మీ ప్రాంతము. గోల్కొండ నవాబు పాలనలో నుండగా క్రీ. శ. 1582 సంవత్సర మున స్వామివారి చక్రము సముద్రములో కొట్టుకొని పోయెనట. ఎంత వెదకించినను చక్రము దొరకలేదు. అంత పేరూరు ద్రావిడ బ్రాహ్మణు లగు అంతర్వేది చయనులుగారు పదునొకం డహోరాత్రములు మంత్ర జపము చేయగా సముద్రుడు చక్రమును బ్రాహ్మణుని పాదములకడ జేర్చెనట. నాటినుండియు పేరూరి బ్రాహ్మణులకు స్వామి కల్యాణమున ప్రముఖ స్థాన మేర్పడినది. వారు వచ్చి స్వామి రథముమీద సురటులు వీచినగాని రథము కదలదట. స్వామికి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవాదులు జరుగును.
ఈ సముద్రతీర ప్రాంతమును మొదట పరాసు వారాక్రమింపగా 1758వ సంవత్సరమున పరాసులు నోడించి ఆంగ్లేయు లాక్రమించుకొనిరి. దేశమంతయు నొక నిర్ణీత ప్రభుత్వము క్రింద లేదు. పెద్దాపురము సంస్థానపు రాజులగు వత్సవాయి వారి ప్రదేశమునకు ప్రభువులయిరి. పెద్దాపురపు రాజులు సుమారు వేయి ఎకరముల భూమి నృసింహస్వామి వారికిచ్చిరి. స్వామి వారికి లక్షయు ముప్పది వేల రూపాయల విలువగల జవాహరీ నిర్మింపబడెను. సంస్థానపు మర్యాదలనుబట్టి స్వామి వారికి నగారావాద్యములు, పవళింపు సేవలు మొదలయినవి జరుగుచుండెడివి. 1844 లో పెద్దాపురపు కోట ఆంగ్లే యుల వశమాయెను. అందుచే నాటినుండి ఆ రాజ్యపు సామంతులగు మొగలితుఱ్ఱు సంస్థానపు రాజులు, కలిదిండి వంశస్థులు, ఈ ఆలయములకు ధర్మకర్తలై కల్యాణోత్స వాదులు జరిపించుచున్నారు. నేడీ ఆలయ పరిపాలన ప్రభుత్వపు ధర్మాదాయ దేవాదాయసంస్థ చేతిలో నున్నది.
వా. రా. బ్ర.
[[వర్గం:]]