సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంతర్జాతీయన్యాయము (వైయక్తికము)
అంతర్జాతీయ న్యాయము (వైయక్తికము) న్యాయ (విధి) వైరుధ్యము :- ఒక విదేశాంశ ప్రసక్తి కలిగిన అభియోగములను నిర్ణయించుటకు ఉపకరించు నిబంధనలతో గూడిన న్యాయ సూత్ర సముదాయమునకు న్యాయ వైరుధ్యము (Conflict of Laws) అను పేరు ఒసగబడుచున్నది. స్వీయవిచారణాధి కారమునకు లోబడిన ప్రదేశములో ఈ దిగువ సందర్భములలో బయలుదేరు వివాదములను గుర్తించి విచారణ లోనికి తీసికొనుటకై ఒక దేశములోని న్యాయ విచారణ సభలు స్థాపింపబడియున్నవి, ఆనాడు సభల విచారణాధికారమునకు లోబడిన ప్రదేశములలో నివసించుచున్న లేక వ్యాపారము చేయుచున్న వ్యక్తులమధ్య ఘటిల్లిన వివాదములు, లేక, వాటి విచారణాధికారము గల ప్రదేశములోని అభియోగ విషయములు, లేక పూర్తిగాగాని, కొంతవరకుగాని వాటి విచారణాధికార దేశములలో నున్న వివాద విషయములును - ఇట్టి న్యాయసభలు విచారణలోనికి తీసికొని పరిష్కరింపనగును. అట్టి అభియోగములలో నుపయోగింపబడు న్యాయము, ఆ న్యాయవిచారణ సభకు చెందిన న్యాయమై యుండును. దానికి "లాఫోరి" (Lex Fori) అని పేరు.
వాది ప్రతివాదులు ఆ న్యాయ విచారణాధికారము గల ప్రదేశములో నివసింపని వారయినను, అన్య జాతీయులయినను, వివాదకారణము దేశాంతరములో బయలు దేరినదైనను, ఆ వివాద కారణము రెండుగాని, అంతకెక్కువగాని న్యాయశాస్త్ర విధానములతో సంబంధించి యున్న యెడలను పై పరిస్థితులలో న్యాయ విచారణ సభలు ఆ అభియోగమును పరిష్కరింపవలసి వచ్చినను లేదా పరిహారములు (Relief) ప్రసాదింపవలసి వచ్చినను, రెండు ప్రాథమిక సమస్యలు అట్టి అభియోగముల విషయమున బయలుదేరును:- (1) ఆ న్యాయ సభ యొక్క విచారణాధికారము, (2) ఆ వాద విషయమునకు ఉపయోగింపదగు న్యాయశాస్త్ర విధానము. ఉదా :- ఒక ఆంగ్లేయుడు, ఒక ఫ్రాన్సు దేశీయుడును ఇటలీ దేశములో అమలుపరుపదగిన ఒక ఒడంబడికను జర్మనీలో చేసికొన్నారు. వారిలో నొకరు ఆ ఒడంబడికకు భంగముగా ప్రవర్తించుటచే, ఒక ఇంగ్లండు దేశపు కోర్టును ఆ వివాద విషయమును పరిష్కరించవలసినదిగా కోరినచో అట్టి పరిస్థితిలో మొదట నిర్ణయింపవలసిన సమస్య ఆ అభియోగమును స్వీకరించుటకు ఇంగ్లీషు కోర్టుకు అధికారమున్నదా, లేదా అనునది. (2) ఈ మొదటి విషయమున ఇంగ్లండు దేశపు కోర్టున కధికార మున్నట్లుగా నిర్ణయమైన యెడల,అటుతరువాత ఏ న్యాయ విధానము అవ్విషయమున ఉపయోగింపవలసి యుండు నను ప్రశ్న బయలు దేరును.
పై పరిస్థితిలో ఉపయోగింపవలసిన న్యాయమేది? ఒడంబడిక జరిగిన ప్రదేశపు న్యాయమా, అనగా జర్మనీ దేశపు న్యాయమా? లేక, ఒడంబడిక అమలు జరుగవలసి యున్న ప్రదేశపు న్యాయమా, అనగా ఇటలీ దేశపు న్యాయమా ? అట్లుగాక, అభియోగము తీసికొనిరాబడిన ప్రదేశపు న్యాయమా, అనగా ఇంగ్లండు దేశపు న్యాయమా? అనునవి కొన్ని ప్రశ్నలు.
పై ప్రాథమిక సమస్యలను నిర్ణయించుటకు వేర్వేరు దేశములు అనుసరింపవలసిన నిబంధనావళికి ప్రైవేటు(Private) అంతర్జాతీయ న్యాయము లేక "న్యాయ వైరుధ్యము” అని పేరు.
ప్రపంచములో ఒక దానితో నొకటి పరస్పరముగా భిన్నముగానున్న న్యాయశాస్త్ర విధానములుండుటచేత, న్యాయశాస్త్ర విధానములో ఈ నియమము లుండుట ఆవశ్యక మైనది.
ప. వేం.