శ్రీ సాయిసచ్చరిత్రము /43-44వ అధ్యాయము

'శ్రీ సాయిసచ్చరిత్రము' (43-44వ అధ్యాయము )


శ్రీ సాయిసచ్చరిత్రము 43,44 అధ్యాయము బాబా మహాసమాధి చెందుట 1. సన్నాహము 2. సమాధి మందిరము 3. ఇటుకరాయి విరుగుట 4. 72 గంటల సమాధి 5. జోగుయొక్క సన్యాసము 6. అమృతము వంటి బాబా పలుకులు


43 మరియు 44 అధ్యాయములు కూడ బాబా శరీరత్యాగము చేసిన కథనే వర్ణించునవి కనుక వాటినొకచోట చేర్చుట జరిగునది.

ముందుగా సన్నాహము

హిందువులలో నెవరైన మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు, మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణాఅచారము. ఏలన ప్రపంచ విషయములనుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమొనర్చినచో నతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిన్మహారాజు బ్రాహ్మణ ఋషిబాలునిచే శపింపబడి, వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా నున్నప్పుడు గొప్పయోగి యగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పుటీకిని అలవాటులో నున్నది. చనిపోవుటకు సిద్ధముగా నున్నవారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని, బాబా భగవంతుని యవతారమగుటచే వారికట్టిది యవసరము లేదు. కాని, బాబా యితరులకు అదర్శముగా నుండుటకు ఈ యలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగనే వారు వజే యను నాతని బిలిచి రామవిజయమను గ్రంథమును పారాయణ చేయమనిరి. అతదు వారములో గ్రంథము నొకసారి పాఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా యాజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదవి మూడు దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి యలసి పోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి అత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకయి యెదురు చూచుచుండిరి.

రెండుమూడుదినములు ముందునుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరవరకు బాబా చైతన్యముతో నుండి, అందరిని ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయెదరో ఎవరికి తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబు దీక్షితు, శ్రీమాన్ బూటీయు వారితో కలసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు (1918 అక్టోబరు 15వ తారిఖు) హారతి పిమ్మట వారిని వారివారి బసలకు బోయి భోజనము చేయమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి శిందే, భాగోజిశిందే, బాయాజి, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబు నిమోకర్ యక్కడనే యుండిరి. దిగువ మెట్లమీద శ్యామా కూర్చొనియుండెను. లక్ష్మీబాయి శిందేకు 9 రూపాయలను దానము చేసినపిమ్మట, బాబా తన కాస్థలము (మసీదు) బాగ లేదనియు, అందుచేత తనను రాతిలో కట్టిన బూటీ మేడ లోనికి దీసికొని పోయిన నచట బాగుగా నుండుననియు చెప్పెను. ఈ తుదిపలుకు లాడుచు బాబా బయాజీ తాత్యాకోతే పై ఒరిగి ప్రాణములు విడిచెను. భాగోజీ దీనిని గనిపెట్టెను. దిగువ కూర్చొనియున్న నానాసాహెబు నిమోనకర్‌కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబు నీళ్ళు తెచ్చి బాబా నోటిలొ పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరిగా "ఓ దేవా!" యని యరచెను. అంతలో బాబా కండ్లు తెరచి మెల్లగా "ఆ!" యనెను. బాబా తన భౌతికశరీరమును విడిచి పెట్టెనని తేలిపోయెను.

బాబా సమాధి చెందెనను సంగతి శిరిడి గ్రామములో కార్చిచ్చువలె వ్యాపించెను. ప్రజలందరు స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి యేడ్వసాగిరి. కొందరు బిగ్గరిగా నేడ్చిరి. కొందరు వీథులలో నేడ్చుచుండిరి. కొందరు తెలివితప్పి పడిరి. అందరి కండ్లనుండి నీళ్ళు కాలువల వలె పారుచుండెను. అందరును విచారగ్రస్తులయిరి.

కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొన మొదలిడిరి. మునుముందు ఎనిమిదేండ్లు బాలునిగా ప్రత్యక్షమయ్యెదనని బాబా తమ భక్తులతో చెప్పిరని యొకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక నెవ్వరును సందేహింప నక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహవిష్ణువీ కార్యమే యొనర్చెను. సుందర శరీరముతో, అయుధముల గల చతుర్భుజములతో, శ్రీ కృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ యవతారమున శ్రీకృష్ణుడు భూమిభారమును తగ్గించెను. ఈ యవతారము(సాయిబాబా) భక్తుల నుద్ధరించుటకై వచ్చినది. కనుక సంశయింపకారణమే మున్నది? యోగుల జాడ లగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధ మీయొక్క జన్మతోడిదే కాదు. అది కడచిన డెబ్బదిరెండు జన్మల సంబంధము. ఇట్టి ప్రేమబంధములు కల్గించిన యా మహరాజు (సాయిబాబా) ఎచటికో పర్యటకై పోయినట్లునిపించుటవలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢవిశ్వాసము భక్తులకు గలదు.

బాబా శరీరము నెట్లు సమాధి చేయవలెనను విషయము గొప్ప సమస్య యాయెను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును అరుబయట సమాధిచేసి దానిపై గోరీ కట్టవలెననిరి. కుషల్‌చంద్, అమీర్‌శక్కర్ కూడ ఈ యభిప్రాయమునే వెలిబుచ్చిరి. కాని రామచంద్ర పాటీలు అను గ్రామమునసబు గ్రామములోని వారందరితో నిశ్చతమైన దృఢకంఠస్వరములో "మీ యాలోచన మాకు సమ్మతము కాదు. బాబా శరీరము రాతి వాడాలో పెట్టవలసినదే" యనెను. అందుచే గ్రామస్థులు, రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి.

బుధవార ముదయము గ్రామములోని జ్యోతిష్కుడును, శ్యామాకు మేనమామయునగు లక్ష్మణ్‌మామా జోషికి బాబా స్వప్నములో గాన్పించి చేయిపట్టి లాగి యిట్లనెను: "త్వరగా లెమ్ము, బాపూసాహెబు నేను మరణించితి ననుకొనుచున్నాడు. అందుచే నతడు రాడు. నీవు పూజ చేసి, కాకడహారతిని ఇమ్ము!" లక్ష్మణ్‌మామా సనాతనాచారపరాయణుడయిన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను ఫుజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడి వాడు. అతనికి బాబా యందు పూర్ణభక్తివిశ్వాసము లుండెను. ఈ దృశ్యము చూడగనే పూజాద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు అటంక పరచుచున్నను పూజను హారతిని చేసి పోయెను. మిట్టమధ్యాహ్నము బాపూసాహెబు జోగ్ పూజద్రవ్యములతో నందరితో మామూలగా వచ్చి మధ్యహ్న హారతిని నెరవేర్చెను.

బాబా తుది పలుకులు గౌరవించి ప్రజలు వారి శరీరము వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్యభాగమును త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రహతనుండి సబ్‌ఇన్‌స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలములనుండి వచ్చిరి. అందరు దానిని అమోదించిరి. అ మరుసటి యుదయము అమీర్‌భాయి బొంబాయినుండి వచ్చెను. కోపర్‌గాంనుండి మామలతదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరము బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి. కనుక, మామలతదారు ఎన్నికద్వార నిశ్చయించవలెననెను. వాడా నుపయోగించుటకు రెండు రెట్లకంటె ఎక్కువ వోట్లు వచ్చెను. అయినప్పటికి జిల్లా కలెక్టరుతో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకాసాహెబు దీక్షిత్ అహమద్‌నగర్ పోవుటకు సిద్దపడెను. ఈ లోపల బాబా ప్రేరేణవల్ల రెండవ పార్టి యొక్క మనస్సు మారెను. అందరు ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుట కంగీకరించిరి. బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసికొనిపోయిరి. మురళీధరుడు కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యధార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయ మయ్యెను. అది యొక పూజమందిర మాయెను. అనేకమంది భక్తులచ్చట బోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తరక్రియలు బాలాసాహెబు భాటే, ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా, బాబాకు గొప్పభక్తుడు.

ఈ సందర్భములో నొక విషయము గమనించవలెను. ప్రోఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికి అది బిగిసిపోలేదు. అవయవములన్నియు సాగుచుండెను. వారి కఫనీ చింపకుండ సులభముగా దీయగలిగిరి.

ఇటుకరాయి విరుగుట

బాబా భౌతికశరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకున మయ్యెను. మసీదులో ఒక పాత యిటుక యుండెను. బాబా దానిపై చేయవేసి యానుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై అనుకొని యాసనస్థు లగుచుండిరి. అనేకసంవత్సరము లిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు, ఒక బాలుడు మసీదును శుభ్రపరుచుచు, దానిని చేతుతో పట్టుకొనియుండగా, అది చేతి నుండి జారి క్రింది పడి రెండు ముక్కలయిపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి యిట్లని యేడ్చిరి. "ఇటుక కాదు, నా యదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడునీడ. దాని సహాయమువలననే నేను అత్మనుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడిచినది." ఎవరైన ఒక ప్రశ్న అడుగవచ్చును. "బాబా నిర్జీవియగు ఇటుక కోసమింత విచారపడనేల?" అందులకు హేమడ్‌పంతు ఇట్లు సమాధానమిచ్చెను. "యోగులు బీదవారికి, నిస్సహయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారి ప్రజలలో కలసి మసలునప్పుడు ప్రజలవలె నటింతురు. వారు మనవలె బాహ్యమునకు నవ్వెదరు, అడెదరు, ఏడ్చెదరు. కాని లొపల వారు శుద్ధచైతన్యలయి వారి కర్తవ్యవిధుల నెరగుదురు."

76 గంటల సమాధి

ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా, 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమినాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధ పడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి దీసికొనిపోయి సమాధిలో నుండవలెననుకొని, భక్త మహల్సాపతితో నిట్లనిరి. "నా శరీరమును మూడురోజులవరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయిన సరే, లేనియెడల నా శరీరము నెదురుగా నున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము’ అని స్థలమును జూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింది కూలెను. వారి ఊపిరి నిలచిపోయెను. వారి నాడి కూడ ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణములు పోయునట్లుండెను. ఊరివారందరు అచ్చట చేరి న్యాయవిచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహాల్సపతి యడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరము నుంచుకొని మూడురోజులట్లే కాపాడుచు కూర్చుండెను. మూడు దినముల పిమ్మట తెల్లవారుఝమున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు గనిపించెను. ఊపిరి ఆడ నారంభించెను. కడుపు కదలెను, కండ్లు తెరచెను, కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను.

దీనిని బట్టి చదువరు లాలోచించవలసిన విషయమేమన బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీర మశాశ్వతముగాని, లోనున్న యాత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధసత్తాయే బ్రహ్మము. అదియే పంచేంద్రియములను, మనస్సును స్వధీనమందుంచుకొనునది, పరిపాలించునది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువులన్నిటీయందు వ్యాపించి యున్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతికశరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి యెల్లప్పుడు ఉండువారు. ఆట్లనే పూర్వము గాణ్గపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీనరసింహసరస్వతియు, వారు సమాధిచెందుట బాహ్యమునకే గాని, సమస్తచేతనాచేతనములందు గూడ నుండి వానిని నియమించువారును, పరిపాలించువారును వారే, ఈ విషయము ఇప్పటికిని సర్వస్యశరణాగతి చేసిన వారికిని, మనఃస్ఫూర్తిగా భక్తితో పూజించువారికిని అనుభవనీయమయిన సంగతి.

ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేన్పటికిని, మనము శిరిడీకి వెళ్ళినచో, వారి జీవిత మెత్తుపటము మసీదులో నున్నది. దీనిని శ్యామరావు జయకర్ యను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడు నైన ప్రేక్షకునికి ఈ పటము ఈ నాటికిని బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికి వారక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వమువలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడు మరణించరు. వారు మానవులవలె గనిపించినను నిజముగా వారే దైవము.

బాపూసాహెబు జోగ్ సన్యాసము

జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమడ్‌పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సఖారాం హరి వురుఫ్ బాపూసాహెబు జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్‌గారికి చిన్నాయన. 1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగమునుండి విరమించి తరువాత (P.W.D. Supervisor), భార్యతో శిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబు జోగ్ మసీదులోను, చావడీలోను కూడ బాబా మహసమాధి పొందువరకు హారతి ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాఠేవాడలో జ్ఞానేశ్వరియు, ఏకనాథ భాగవతము చదివి, వినవచ్చినవారందరికి బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్, బాబాతో "నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని. నా మనస్సు ఇంకను శాంతిము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు?" అనెను. ఆ ప్రార్థన విని బాబా "కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును. నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీ వభిమానమును పోగొట్టుకొని, మోహమును రుచిని జయించెదవో, యాటంకము లన్నిటిని కడచేదవో, హృదయపూర్వకముగ భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుదవయ్యెడవు" అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికింకొక యభిమాన మేదియు లేకుండుటచే నతడు స్వేచ్చపరుడై సన్యాసమును గ్రహించి తన జీవితపరమావధిని పొందెను.

అమృతతుల్యమగు బాబా పలుకులు

దయాదక్షిణ్యమూర్తి యగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధురవాక్యములు పలికిరి. " ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము, నా కథలు తప్ప మరేమియు చెప్పుడు, సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే యేల్లప్పుడు జపించుచుండును. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను, వారికి మోక్షమునిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే యేమియు తినరో అట్టివారిపై నేను అధారపడి యుందును. ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలసిపోయినట్లు నాలో కలసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములో నున్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను."

నేననగా నెవరు?

నేను అనగా నెవ్వరో సాయిబాబ యెన్నొసార్లు బొధించిరి. వారిట్లనిరి. "నన్ను వెదకుటకు నీవు దూరముగాని మరెచ్చటికిగాని పోనకారలేదు. నీ నామము నీ యకారము విడిచినచో నీలోనేగాక యన్ని జీవులలోను, చైతన్యము లేదా యాంతరాత్మయని యొకటి యుండును. అదేనేను, దీనిని గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోను నన్ను జూడుము. దీనిని నీవభ్యసించినచో, సర్వవ్యాపాత్వ మనుభవించి నాలో ఐక్యము పొందెదవు."

హేమడ్‌పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడున దేమనగా వారు వినయవిధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక! బాబా పెక్కుసారులు "ఎవరయితే యితరులను నిందించుదురో వారు నన్ను హింసీంచినవారగుదురు. ఎవరయితే బాధ లనుభవిందరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు" అని చెప్పిరి. గదా! బాబా సర్వవస్తుజీవ సముదాయములో నైక్యమైయున్నారు. భక్తులకు నలుప్రక్కల నిలచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియు కోరరు. ఇట్టి శుభమయిన పరిశుభ్రమయిన యమృతము వారి పెదవులనుండి స్రవిమ్చుచుండెను. హేమడ్‌పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయలును సాయితో నైక్యమగుదురు.


శ్రీ సాయినాథాయ నమః 43,44 అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు అరవరోజు పారాయణము సమాప్తము