శ్రీ సాయిసచ్చరిత్రము /రెండవ అధ్యాయము
←మొదటి అధ్యయము | 'శ్రీ సాయిసచ్చరిత్రము' (రెండవ అధ్యాయము ) | మూడవ అధ్యాయము → |
శ్రీ సాయిసచ్చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథమురచనకు కారణము, పూనుకొనుటకు అసమర్థత; బాబా అభయము; వాడాలో వివాదము; ’హేమడ్‍పంతు’ అను బిరుదు ప్రదానము; గురువు యొక్క యావశ్యకత. మొదటి యధ్యాయములో గోధుములు విసరి యాపిండిని ఊరుబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క యితరమహిమలు విని సంతోషించితిని. అ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలును చర్యలను మనస్సున కానందము కలుగచేయును; అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును; తుదకు పాపములను బోగొట్టును గదా యని భావించి బాబా యొక్క ప్రవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయమొదలిడితిని. యోగీశ్వరుని జీవితచరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును, అధ్యాత్మికమునునైన మార్గమును జూపును.
గ్రంథమురచనకు పూనుకొనుటకు అసమర్థత - బాబా అభయము:
శ్రీ సాయిసచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థతగలవాడను కానని హేమడ్‍పంతు భయపడెను. అతడిట్లనుకొనెను: " నా యొక్క సన్నిహితస్నేహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగిశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతారపురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్తసముద్రముల లోతును గొలువవచ్చును. అకాశామును గుడ్డలో వేసి మూయవచ్చును. కాని యోగిశ్వరుని చరిత్ర వ్రాయుట బహుకష్టము. ఇది గొప్ప సాహసకృత్య మని కూడ నాకు తెలియును." అందువలన నలుగురిలో నవ్వులపాలగుదునేమోనని భయపడి శ్రీసాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్దించెను.
మహరాష్ట్ర దేశములోని ప్రథము కవియు, యోగిశ్వరుడునగు జ్ఞానేశ్వరమహరాజు యోగులచరిత్ర వ్రాసినవారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగులచరితలను వ్రాయ కుతూహలపడెదరో వారి కొరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేకమార్గముల నవలంబించెదరు. యోగులే యట్టిపనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారివారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్ర వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి అ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసుగణు యెక్క సేవను అమోదించిరి. మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి భక్త లీలామృతమును సంకథామృతములోని మాత్రమే. అధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు. భక్తలీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంకథామృతములోని 57వ యధ్యాయమందును సాయిబాబా జీవితచరిత్రయు, వారి బోధలును చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక, సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ యధ్యాయములు కూడ పఠించవలెను. శ్రీసాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రీబాయి రాఘునాథ్ తెండూల్కర్ చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసుగణు మహరాజుగారు. కూడ శ్రీసాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవాని మెహతా యను భక్తుడు శ్రీసాయి కథలను ముద్రించినారు. సాయినాథప్రభ అను మాసపత్రిక శిరిడీలోని దక్షిణభిక్ష సంస్థవారు ప్రచురించి యున్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్రవ్రాయుటకు కారణమేమి? దాని యవసరమేమి? - యనిఎవరైనను ప్రశ్నింపవచ్చును.
దీనికి జవాబు మిక్కిలి తేలిక! సాయిబాబా జీవితచరిత్ర సముద్రమువలె విశాలమైనది, లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తిజ్ఞానములను మణులను వెలికితీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చును. శ్రీసాయిబాబా నీతిబోధమగు కథలు, లీలలు మిక్కిలి యాశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందినవారికి విచారగ్రస్టులకు శాంతి సమకూర్చి యానందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదములవలె రంజకములును ఉపదేశకములునునగు బాబా ప్రబోధములు విని, వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి, అనగా బ్రహ్మైక్యయెగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తకరూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల అనందము కలుగజేయును. అందుచేత బాబాగారి యాత్మసాక్షాత్కారఫలితమగు పలుకులు, బోధనలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే యీ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా యహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా యిహపరసౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని.
నా యంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యెక్క యనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అను వారు బాబాకు ముఖ్యభక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్దించమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి "ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. ’నేను భిక్షాటినముచే జీవించు ఫకీరును, నా జీవితచరిత్ర వ్రాయనవసరము లేదని యనవద్దు! మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు. లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యెక్క యనుమతి యాశీర్వాదము లేనిదే యేదియు జయప్రదము చేయలేము." అది వినినంతనే శ్రీసాయిబాబా మనస్సు కరిగి, నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను. మరియు (శ్యామతో) నిట్లు చెప్ప దొడంగెను: " కథలను, అనుభవములను, ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకిగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తులు కోరికలు నెరవేర్చవలెను. వాడు తన యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెటువలెను. ఎవరయితే వారి జీవితములో నిట్లు చేసెదరొ వారికి నేను మిక్కిలి సహయపడెదను. నా జీవితచర్యలకొరకే కాదు. సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని యహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడ లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును. నా కథలు బోధలు విన్నా భక్తులకు భక్తివిశ్వాసములు కుదురును, వారు అత్మసాక్షాత్కారమును బ్రహ్మనందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్దారణ చేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయము నైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు.
వివాదమునగనే నన్ను ’హేమడ్‍పంతు’ ని పిల్చుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోవుచున్నాను. కాకాసాహెబు దీక్షత్, నానాసాహెబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను శిరిడి పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి. అట్లే చేసెదనని వారికి నేను వాగ్దానము చేసితిని. ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా శిరిడి ప్రయాణమున కడ్డుపడినది. లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములన్నియు నుపయోగంచెను గాని నిష్పలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయెజనము లేకుండెను. ఈ సంగతి విని, "నా స్నేహితుని కుమారుని రక్షంచలేనట్టి గురువు యెక్క ప్రయెజనమేమి? గురువు మనకు ఏమియు సహయము చేయలేనప్పుడు నేను శిరిడి యేల పోవలెను?" అని భావించి, శిరిడీ ప్రయాణము మానుకొంటిని. కాని కానున్నది కాకమానదు. అది యీ క్రింది విధముగా జరిగెను.
నానాసాహెబు చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా యొకనాడాయన వసయీకి పర్యటనకై పోవుచుండెను. ఠాణా నుండి దాదరుకు వచ్చి యచ్చట వసయీ పోవు బండికొరకు కనిపెట్టుకొని యుండెను. ఈ లోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి, నన్ను పిలిపించి శిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నాకు సంతోషదాయకముగను సమ్మతముగాను ఉండను. అందుచే నా రాత్రియే శిరిడీకి పోవ నిశ్చయించితిని. సామానులు కట్టుకొని శిరిడే బయలుదేరితిని. బాంద్రా నుండి దాదరు వెళ్ళి, అచ్చట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకొంటిని. అటులనే దాదరుసు టిక్కట్టు కొని, రైలు రాగానే ఎక్కి కూర్చొంటిని. బండి ఇక బయలు దేరుననగా, మహమ్మదీయుడొకడు నేను కూర్చోనిన పెట్టెలోనికి హడావిడిగా వచ్చి, నా సరంజామానంతయు జూచి, యెక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా యాలోచన వారికి చెప్పితిని. వెంటనే అతడు దాదరు స్టేషనులో దిగవద్దునీ, ఎందుకనగా మన్మాడుమెయిలు దాదరులో అగదనీ, అదే రైలులో ఇంకనూ ముందుకుబోయి బోరీబందరు స్టేషనులో దిగమని నాకు సలహ చెప్పెను. ఈ చిన్న లీలయే జరుగకుండినచో నేననుకొనెన ప్రకారము అ మరుసటి ఉదయము శిరిడీ చేరలేకపోయెడివాడను. అనేక సందేహములు కూడ కలిగి యుండెడివి. కాని నా యదృష్టవశాత్తు యది యట్లు జరుగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను శిరిడీ చేరితిని. శిరిడీలో నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకొని యుండెను.
ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడా యొక్కటియే శిరిడీ వచ్చు భక్తుల కోరకు నిర్మింపబడి యుండెను. టాంగా దిగిన వెంటనే బాబా దర్శించవలెనని నాకు అత్రము కలిగెను. అంతలో, అప్పుడే మసీదునుండి వచ్చుచున్న తాత్యాసాహెబు నూల్కరు, బాబా వాడాచివరన ఉన్నారనియూ, మొట్టమొదట ధూళిదర్శనము చేకుకొనమని నాకు సలహ యిచ్చెను. స్నాననంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను. ఇది వినిన తోటనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసితిని. నాలో అనందము పొంగిపొరలినది. నానాసాహెబు చాందొర్కరు చెప్పినదానికన్ననూ ఎన్నోరెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తిచెంది యాకలి దప్పికలు మరచితిని. మనస్సు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను. నాకు శిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికి నేనెంత ఋణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి ఋణమును నేను తీర్చుకొనలేను, వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా మనస్సులో సాష్టాంగప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యాలోచనలు మారిపోవును. వెనుకటికర్మల బలము తగ్గును. క్రమమగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను.
తీవ్ర వాగ్వివాదము:
నేను శిరిడీ చేరిన మెదటి దినముననే నాకును బాలాసాహెబు భాటేకును గురువు యెక్క యావశ్యకతను గూర్చి గొప్ప వాగ్విఅవాదము జరిగెను. మన స్వేచ్చను విడిచి యింకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని. "మన కర్మలను మనమే చేయుటకు గురువు యెక్క యావశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి, మిక్కిలి యత్నముతో యీ జన్మదుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమియు చేయక సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడు?" అని నేను స్వేచ్చపక్షమును అశ్రయించితిని. భాటే యింకొక వాదమును బట్టుకొని, ప్రారబ్ధము తరపున వాదించుచు, "కానున్నది కాక మానదు. మహనీయులు కూడ నీ విషయములో నోడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండానిమ్ము. గర్వముగాని యహంకారము కాని మీకు తోడ్పడవు" అనెను. ఈ వాదన యొక గంట వరకు జరిగెను. కాని యిదమిత్థమని యేమియూతేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణవల్ల నా మనఃశ్శాంతి తప్పినది. దేహాత్మబుద్ది, అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించితిని. వేయేల, వివాదమునకు మూలకారణము మహంకారము.
ఇతరలతో కూడ మేము మసీదునకు పోగా, బాబా కాకాను బిలిచి యిట్లడిగెను: "వాడాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమడ్‍పంతు ఏమనుచున్నాడు?"
ఈ మాటలు విని నేను అశ్చర్యపడితిని. సాఠేవాడా మసీదునకు చాలా దూరముగా నున్నది. మా వివాదముగూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞడై యుండవలెను. లేనిచో మావాదన నెట్లు గ్రహించును? బాబా మన యంతరాత్మపై నధికారియై యుండవచ్చును.
హేమడ్‍పంతు అను బిరుదునకు మూలకారణము
సాయిబాబా నన్నెందులకు ’హేమడ్‍పంతు’ని పిలిచెనని అలోచింపసాగితిని? ఇది ’హేమద్రిపంతు’ అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవవంశ రాజులకు హేమద్రిపంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు; మోడి భాషను, ఒక నూతన గణిత విధానమును కని పెట్టినవాడు. ఇక నేనా? వానికి వ్యతిరేకబుద్ది గలవాడను, మేధాశక్తి యంతగా లేని వాడను. మరి, సాయిబాబా నాకెందుకీ ’బిరుదు’ నొసంగిరో తెలియకుండెను. అలోచన చేయగా నిది నా యహంకారమును చంపుటకొక యమ్మనియు, నేనెప్పుడును అణుకువ నమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరికయయి యుండవచ్చుననియు గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా యీ రీతిగా అభినందించియుండవచ్చని యనుకొంటిని.
భవిష్యచ్చరితము బట్టి చూడగా బాబా పలుకులకు (దాభోళ్కరును "హేమాడ్‍పంతు" అనుట) గోప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా యట్లనెననియు భావించవచ్చును. ఏలయనగా హేమడ్‍పంతు శ్రీసాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగ నుంచెను. అదేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామెహము, అత్మశరణాగతి, అత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీసాయి సచ్చరిత్ర యను గొప్ప గ్రంథము రచించెను.
గురువు యెక్క యావశ్యకత
ఈ విషయమై బాబా యేమనెనో హేమాడ్‍పంతు వ్రాసియుండ లేదు. కానీ, కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రచురించును. హేమాడ్‍పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షీత్ బాబావద్దకు వచ్చి "శిరిడి నుండి వెళ్ళ వచ్చునా" యని యడిగెను. బాబా యట్లేయని జవాబిచ్చెను. "ఎక్కడకు" అని ఎవరో యడుగగా, "చాలా పైకి" అని బాబా చెప్పెను. "మార్గమేది" యని దీక్షిత్ యడిగెను. "అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. శిరిడి నుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున నున్న యడవిలో పులులు, తోడేళ్ళ కలవని" బాబా బదులిడెను. "మార్గదర్శకుని వెంటదీసికొని పోయినచో" నని కాకాసాహెబు యడుగగా, "అట్లయినచో కష్టమే లేద’ని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడేళ్ళు, పులులు, గోతులనుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును. లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మశీదులో అప్పుడచ్చటనే యున్న దాభోళ్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్చాపరుడా కాడా? యను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్దము నిజముగా గురుబోధలవల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వసిష్ఠసాందీపులకు లొంగి యణకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము (నిష్ఠ), ఓపిక (సబూరీ) యను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. శ్రీ సాయినాథాయ నమః రెండవ అధ్యయము సంపూర్ణము సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు