శ్రీ సాయిసచ్చరిత్రము /ముప్పదవ అధ్యాయము

'శ్రీ సాయిసచ్చరిత్రము' (ముప్పదవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము ముప్పదవ అధ్యాయము శిరిడీకి లాగబడిన భక్తులు 1. వణీ నివాసి కాకాజీ వైధ్య 2. బొంబాయి నివాసి పంజాబి రామలాల్


ఈ అధ్యాయములో బాబా శిరిడీకి ఈడ్చిన యిద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకొందము.

దయామయుడు భక్తవత్సలుడునగు శ్రీసాయికి నమస్కారము. వారు దర్శనమాత్రముననే భవసాగరమును తరింపజేసి మన అపదలను బాపెదరు. వారు నిర్గుణస్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తుల కాత్కసాక్షాత్కారము కలిగించుటే మహత్ముల కర్త్వ్యము. అది యోగేస్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి యైనది. వారి పాదముల నాశ్రయించినవారి పాపము లెల్లా నశించును. అట్టివారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచుచ్ పుణ్యక్షేత్రములనుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణచేసి, గాయత్రీమంత్రమును జపించెదరు. దుర్బలులము, పుణ్యహీనుల మగుటచే భక్తి యనగా నేమో మనకు దెలియదు. మనకింత మాత్రము తెలియును. ఇతరులు మనలను విడిచి పెట్టునప్పటికి బాబా మాత్రము మనలను విడువడు. వారి కృపకు ప్రాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్యవివేకములను పొందెదరు.

భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది, కృతజ్ఞతతో నుండెవారు. కాని మేము వారికి సాష్టాంగనమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులన్నియు క్షమించి సాయి మా యారాటము లన్నియు బాపుగాక, కష్టములపాలై సాయి నీ విధముగా ప్రార్థించువారు మనస్సు శాంతించి, బాబా కటాక్షముచే వారు సంతుష్టి నందెదరు.

దయాసముద్రుడగు సాయి కటక్షించుటచే హేమడ్‌పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగెనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత యెంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీసాయి ఈ భారమంతయి వహించుటచే హేమడ్‌పంతుకు కష్టముగాని, శ్రమగాని కానరాకుండెను. తన వాక్కును, కలమును గూడ ప్రేరేపించుటకు శక్తివంతుమగు జ్ఞానమనే వెలుతురుండగా నతడు సంశయముగాని, అరాటముగాని పొందనేల? అతడు వ్రాసిన యీ పుస్తకరూపమున శ్రీసాయి అతని సేవను గైకొనెను. ఇది యతని గతజన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను. కావున నాతడదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను.

ఈ క్రింది కథ సాధారణ కథ కాదు; స్వచ్ఛమైన యమృతము. దీని నెవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును దెలిసికొనెదరు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువనక్కరలేదు. దీనికి కావలసినది యంతులేని ప్రేమ, భక్తి; వివాదము కాదు. జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులు మనికొనువారు. ఈ కథల నిష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మకథ లనుకొనెదరు. ఆదృష్టవంతులు అయిన సాయిభక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును. గృహస్థులకు సంతృప్తికలుగును. ముముక్షువుల కిది సాధనగా నుపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించెదము.

కాకాజీ వైద్య

నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య యనువాడుండెను. అతడచటీ సప్తశృంగి దేవతకు పూజారి. అతడనేక కష్టముల పాలై మనఃశ్శాంతి పోగొట్టుకొని చంచలమనస్కుడయ్యెను. అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయింకాలము దేవతాలయమునకు బోయి తనను అందోళననుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి యానాటి రాత్రి యాతనికి స్వప్నమున గాన్పించి "బాబావద్దకు పోమ్ము! నీ మనస్సు శాంతి వహించు" ననెను. ఈ బాబా యెవరో దేవి నడిగి తెలిసికొనుటకు కాకాజీ యుత్సహించెను. కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా యెవరైయుండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు అలోచించిన పిమ్మట యీ బాబా త్ర్యంబకేశ్వరుడు (శివుడు) కావచ్చునని అతడు పుణ్యస్థలముగు త్ర్యంబకము (నాసిక్ జిల్లా) వెళ్ళెను. అచ్చట పదిరోజులుండెను. అక్కడున్నంత కాలము వేకువఝామున స్నానము చేసి, రుద్రమును జపించుచు. అభిషేకమును తదితరపూజలను గావించెను. అయినప్పటికి మునుపటివలెనే అశాంత మనస్కుడగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగివచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి అమె స్వప్నములో గనిపించి యిట్లనెను. "అనవసరముగా త్ర్యంబకేశ్వరమెందుకు వెళ్ళినావు? బాబా యనగా శిరిడీ సాయిబాబా యని నా యభిప్రాయము/"

శిరిడీకి పోవుటెట్లు? ఎప్పుడు పొవలెను? బాబాను జూచుటెట్లు? అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరయిన యోగీశ్వరుని చూడవలె ననుకున్నచో, ఆ యోగియేగాక దైవముకూడ అతని కోరిక నెరవేర్చుటకు సహయపడును. యదార్థముగా యోగియు భగవంతుడు నొకరే. వారిలో నేమియు భేదము లేదు. ఎవరైన తానై పోయి యోగిని దర్శించుటన్నది యుత్తబూటకము. యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారెవరు? అతని యాజ్ఞ లేక చేట్టు అకు గూడ కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తివిశ్వాసములు జూపునో, యంత త్వరగాను, బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై అహ్వనించువాడే వచ్చువానికి స్వాగతసన్నాహము లొనర్చును. కాకాజీ విషయములో అట్లే జరిగెను.

శ్యామ మ్రొక్కు

కాకాజీ శిరిడీకి పోవుట కాలోచించుచుండగా, ఒక యతిథి అతనిని శిరిడీకి తీసికొనిపోవుట కాతని యింటికే వచ్చెను. అతడింకెవడో కాదు. బాబాకు ముఖ్యభక్తుడు శ్యామాయే. శ్యామా ఆ సమయమున వణీకి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామా బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వణిలోని సప్తశృంగికీ, ’జబ్బు నయముకాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై బెట్టెద’నని మ్రొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి అమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో రెండు వెండికుచములు సమర్పించెదనని అప్పడింకొక మ్రొక్కు మ్రొక్కెను. కాని ఈ రెండు మ్రొక్కులు కూడ అమె చెల్లించలేదు. అమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి రెండు మ్రొక్కులు చెల్లించు భారము నాతనిపై వైచి అమె మృతిచెందెను. శ్యామా కొన్నాళ్ళుకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడచెను. అప్పట్లో శిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను. శ్యామా తమ్ముడు బాపాజి జ్యోతిష్యపండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించక పోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగ జేయుచున్న దనెను. బాపాజీ యీ సంగతి శ్యామాకు తెలియపరచెను. అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను అలస్యము చేసినచో హానికరమని యెంచి శ్యామా ఒక కంసాలిని బిలిచి, రెండు వెండి కుచములను చేయించెను. మసీదుకు బోయి బాబా పాదములపై బడి, రెండు కుచముల నచట బెట్టి, తన మ్రొక్కులను చెల్లజేయుమని, బాబాయే తన సప్తశృంగి దేవత యగుటచే వాని నమోదించుమని వేడెను. "నీవు స్వయముగా బోయి సప్తశృంగి దేవతకు మ్రొక్కును చెల్లింపు" మని బాబా నిర్బంధించెను. బాబా ఊదీని అశీర్వాదమును పొంది. శ్యామా వణి పట్టణమునకు బయలదేరెను. పూజారి యిల్లు వెదకుచు తుదకు కాకాజీ యిల్లు చేరెను. అప్పుడు కాకాజీ శిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలములో నుండెను. ఆట్టి సమయములో శ్యామా వారింటికి వెళ్ళెను. ఇది ఎంత యాశ్చర్యకరమైన కలయికయో చూడుడు!

"మీ రెవ్వరు? ఎచ్చటినుండి వచ్చినా"రని కాకాజీ యడిగెను. "మాది శిరిడీ, నేను సప్తశృంగికి మ్రోక్కు చెల్లించుట కిక్కడకు వచ్చినా" నని శ్యామా యనెను. శిరీడినుంచి వచ్చెనని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగలించుకొనెను, ప్రేమచే మైమరచెను. వారు సాయిలీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామా మ్రొక్కులన్నియు చెల్లించిన పిమ్మట వారిద్దరు శిరిడీకి బయలు దేరిరి. శిరిడీ చేరగనే కాకాజీ మసీదుకు బోయి బాబాను జూచి, వారి పాదములపై బడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగిదేవత స్వప్నములో తెలియపరచిన రీతిగా బాబాను చూడగనే అతని మనస్సులోని చంచలత్వ మంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనస్సులో నిట్లనుకొనెను. "ఏమి ఈ యద్భుతశక్తి! బాబా యేమియి పలుకలేదు. ఉత్తరప్రత్యుత్తరములు కూడ జరుగలేదు అశీర్వచనములనైన పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శన మాత్రముననే నామనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున అనంద ముద్భవించినది. ఇదియే దర్శనభాగ్యము." అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని యతని సంతోషమున కంతులేకుండెను. బాబాను సర్వస్యశరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన యానందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదమును అశీర్వచనమును పొంది యిల్లు చేరెను.

రహత్ కుశాల్‌చంద్

తెల్లవారుఝామున వచ్చిన స్వప్నము నిజమగునని యందురు. ఇది సత్యమే కావచ్చు. కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణ: ఒకనాడు సాయ్ంకాలము బాబా కాకాసాహెబు దీక్షితును రహతాకు పోయి, చాలా రోజులనుండి చూడకుండుటచే, కుశాల్‌చంద్‌ను తీసికొని రమ్మనెను. ఒకటాంగాను దీసికొని కాకా రహాతా వెళ్ళెను. కుశాల్‌చంద్‌ను కలిసికొని బాబా చెప్పిన వార్త నందజేసెను. దీనిని విని కుశాల్‌చంద్ యాశ్చర్యపడెను. మధ్యాహ్నభోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే శిరిడీకి రమ్మనినందున నతడు శిరిడీకి పోవుటకు అతురతతో నున్నానని చెప్పెను. తన గుఱ్ఱము అచ్చట లేకుండుటచే, తన కుమారుని బాబాకు ఈ సంగతి దెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవు సరికి దీక్షిత్ టాంగాను తీసికొని వచ్చెను. కుశాల్‌చంద్‌ను దీసికొని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే, నిద్దరు టాంగాలో కూర్చుండి శిరిడీకి చేరిరి. కుశాల్‌చంద్ బాబాను దర్శించెను. అందరు సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను జూచి కుశాల్‌చంద్ మనస్సు కరిగెను.

పంజాబి రామలాల్ (బొంబాయి)

ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబి బ్రాహ్మణుడు రామాలాల్ యనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి శిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతువలే గనిపించెను. కాని అతనికి వారెచట గలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలెనని మనమున నిశ్చయించెను. కాని చిరునామా తెలియకుండుటచే చేయుట కేమియు తోచకుండెను. ఎవరినైన మనము పిలిచినచో వచ్చువారికొరకు కావలసిన వన్నియు మనము సమకూర్చెదము. ఈ విషయములో కూడ అట్లనే జరిగెను. అతడు అనాడు సాయంకాలము వీథిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను జూచెను. స్వప్నములో జూచిన మహంతు ముఖలక్షణములీ పటములో నున్న వానితో సరిపొయెను. కనుగొనగా యా పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే శిరిడీకి పోయి యచ్చటనే తన యంత్యకాలము వరకుండెను.

ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శన మిచ్చుటకై శిరిడీకి తీసికొని వచ్చుచుండెను. వారి యిహపరముల కోరికలు నెరవేర్చుచుండెను.


శ్రీ సాయినాథాయ నమః ముప్పదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు నాల్గవరోజు పారాయణము సమాప్తము