శ్రీ సాయిసచ్చరిత్రము /పన్నెండవ అధ్యాయము
←పదకొండవ అధ్యాయము | 'శ్రీ సాయిసచ్చరిత్రము' (పన్నెండవ అధ్యాయము) | పదమూడవ అధ్యాయము → |
శ్రీ సాయిసచ్చరిత్రము
పన్నెండవ అధ్యాయము
శ్రీ సాయిలీలలు: 1. కాకా మహాజని 2. ధూమాల్ ప్లీడరు 3. నిమోణ్‌కర్ భార్య 4. ములేశాస్త్రి 5. రామభక్తుడైన ఒక డాక్టరు మొ న వారి అనుభవములు
శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడవతరించునను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలిసికొన్నాము. కాని సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడను నొకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగ వారు భగవంతినికంటె వేరుకారు. సద్గురుశ్రేష్టుడైన శ్రీసాయిబాబా భక్తుల క్షేమముకొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించుచు వారు అందరిని సమానముగ ప్రేమిచుంచెడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు,ఫకీరులు, అందరు వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తులకొరకు తన పుణ్యము నంతయు వ్యయపరచి యెప్పుడు వారికి సహయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారికిచ్చలేనిచో భక్తులు వారివద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు, వారి లీలలు ఎరుగుట కూడ తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శీంచుకొనవలెనను బుద్ధి యెట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలెననుకొనిరి. కాని బాబా మహసమాధి చెందులోపల వారికా యవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలెనను కోరిక గలవారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనమువల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరదృష్టవశమున వారి దర్శనము చేసికొన్నను, బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకొనినను నచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరును తమ యిష్టానుసారము శిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా యాజ్ఞ యెంతవరకు గలదో యంతవరకే వారు శిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే శిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపైననే అధారపడి యుండెను.
కాకా మహాజని
ఒకప్పుడు బొంబాయునుండి కాకా మహజని శిరిడీకి పోయెను. అచ్చటొక వారమురోజులునుండి గోకులాష్టమి యుత్సవమును చూడవలెనునుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా యిట్లనిరి. "ఎప్పుడు తిరిగి యుంటికి పోయెదవు?" ఈ ప్రశ్న విని మహజని యాశ్చర్యపడెను. కాని యేదో జవాబు నివ్వవలయును కదా! బాబా యజ్ఞ యెప్పుడయిన నప్పుడే పోయెదనని కాకా జావాబిచ్చెను. అందులకు బాబా యిట్లనియెను. "రేపు పొమ్ము!" బాబా అజ్ఞ అనుల్లంఘనీయము. కావుననట్లే చేయవలసి వచ్చెను. అందుచే నా మరసటిదినమే కాకా మహజని శిరిడీ విడిచెను. బొంబాయిలో తన అషీసుకు పోగానే వాని యజమానివాని కొరకే కనిపెట్టుకొనియున్నట్లు తెలిసెను. అఫీసు మేనేజరు హఠత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహజని అఫీసులో ఉండవలసిన యవసరము యేర్పడెను. ఈ విషయమై యజమాని శిరిడీలో నున్న కాకా మహజని కొక యుత్తరము కూడ వ్రాసెను. అది కొన్నిరోజుల తరువాత తిరుగు టపాలో బొంబాయి చేరినది.
భావుసాహెబు ధుమాల్
పై దానికి భిన్నమగు కథ నిప్పుడు వినుడు. ప్లీడరు వృత్తిలో నుండిన భావుసాహెబు ధుమాల్ యొకసారి కోర్టుపనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి శిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసికొని, వెంటనే నిఫాడ్ పోవ శలవు కోరెను. కాని బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. శిరిడీలోనే యింకొక వారముండునట్లు చేసెను. అ తరువాత అతడు బాబా వద్ద శలవు పొంది నిఫాడ్ చేరగా. అక్కడి మెజిస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను. తరువాత అకేసువిచారణ కొన్ని నెలలు వరకు సాగెను. నలుగురు మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను.
నిమోనకర్ భార్య
నిమోన్ గ్రామ వతనుదారును, గౌరవ మెజిస్ట్రేటును అగు నానాసాహెబు నిమోనకర్, తన భార్యతో శిరిడీలో కొంతకాలముండెను. అ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపూరులో నున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కూమారుని, అక్కడున్న తమ బంధువులను జూచి, యక్కడ కొన్ని దినములుండవలెనని తల్లి అనుకొనెను. కాని బేలాపూర్ పోయి అ మరుసటి దినమునకే శిరిడీ తిరిగి రావలెనని భర్త చెప్పెను. అమె సందిగ్దములో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. అమె దైవమైన శ్రీసాయినాథుడే యామెన్నప్పుడు ఆదుకొనెను. బేలాపూరుకు పోవుటకు ముందు అమె బాబా దర్శమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాఠేవాడా ముందర నానాసాహెబు మొదలగువారితో నుండెను. అమె బాబా వద్దకు పోయి సాష్టాంగనమస్కారము చేసి, బేలాపూరు పోవుటకు అనుమతి నిమ్మని కోరెను. అప్పుడు బాబా అమెతో యిట్ల చెప్పెను. "వెళ్ళుము, అలస్యము చేయవద్దు! హాయిగా బేలాపూరులో నాలుగురోజులుండి రా! నీ బంధువులందరిని చూచి, నింపాదిగా శిరిడీకి రమ్ము!" బాబా మాటలెంత సమయానుకూలముగ నుండెనో గమనించుడు. నిమోన్‌కర్ అదేశమును బాబా అజ్ఞ రద్దుచేసెను.
నాసిక్ నివాసియగు ములేశాస్త్రి
ములేశాస్త్రి పూర్వాచారపరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. అయన షట్‌శాస్త్రపారంగతుడు. జ్యోతిషసాయుద్రిక శాస్త్రములలో దిట్టి. అతడు నాగపురుకు చెందిన కోటిశ్వరుడగు బాపూసాహెబు బూటీని కలిసికొనుటకు శిరిడీకి వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడిపండ్లను, కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికి పంచి పెట్టుచుండెను. మామిడిపండును బాబా యొక్క చిత్రమైన విధముగ అన్నివైపుల నొక్కెడివారు. తినువారు అ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి బోయి తొక్క, టెంక మిగిలెడివి. అరటిపండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచి పెట్టి, తొక్కలు బాబా తమ వద్ద యుంచుకొనెడివారు. ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయిచాచుడని యడిగెను. బాబా దానినసలు పట్టీంచుకొనక, నాలుగు అరటిపండ్లు అతని చేతిలో బెట్టిరి. తరువాత నందరు వాడా చేరిరి. ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని యగ్నిహొత్రము మొదలగునవి యాచరించుటకు మొదలిడెను. బాబా మామూలుగనే లెండీతోటకు బయలదేరెను.
మార్గమధ్యమున బాబా హఠాత్తుగా, "గేరు(ఎఱ్ఱరంగు) తయారుగనుంచుడు. ఈనాడు కాషాయవస్త్రమును ధరించెదను" అని యనెను. అ మాటలెవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీతోటనుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్దమయ్యెను. మధ్యాహ్న అరతికి తనతో వచ్చెదరా యని ములేశాస్త్రిని బూటి యడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసికొనెదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన యాసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. అరతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్దనుంచి దక్షిణ తెమ్మనెను. బూటి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా యాజ్ఞ అతనికి చెప్పగనే అతడు అశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను: "నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహత్ముడేకావచ్చును. కాని, నేనాయన అశ్రితుడును గానే! వారికి నేనెందులకు దక్షిణ నీయవలెను? సాయిబాబా యంతట మహత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వార దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను. తన అనుష్ఠానమును మధ్యలోనే అపి, బూటితో మసీదుకు బయలుదేరెను. మడీతో నున్న వాను మసీదుతో అడుగిడిన మైలపడిపోవుదునని భావించి, మశీదు బయటే దూరముగ నిలువబడి, బాబాపై పువ్వులను విసరెను. హాఠత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువగు ఘలప్‌స్వామి కూర్చొని యుండెను. అతడు అశ్చర్యపోయెను. అది కలా నిజమా యని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగ్రదావస్థలోనే యున్నడు. భ్రాంతియగుటకు వీలులేదు. అయినచో యేనాడో గతించిన తన గురుఇచ్చటకెట్లు వచ్చెను? అతనికి నోట మాటరాకుండెను. తుదకు సందిగ్దములన్నియు విడచిపెట్టి, మసీదులో ప్రవేశించి, తన గురువు పాదములపై బడి, లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరు బాబా అరతి పాడుచుండుగా, ములేశాస్త్రి తన గురునామము నుచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రుడను యను అభిజాత్యమును వదలిపెట్టి, తన గురుని పాదముల పైబడి సాష్టాంగ నమస్కార మొనర్చి, కండ్లు మూసికొనెను. లేచి, కండ్లు తెరచి చూచుసరికి, వానిని దక్షిణ యడుగుచూ సాయిబాబా కాన్పించెను. బాబావారి అనందరూపమును, ఊహాకందని వారి శక్తిని జూచి ములేశాస్త్రి మైమరచెను; మిక్కిలి సంతుష్ఠిచెందెను. అతని నేత్రములు సంతోషభాష్పములచే నిండెను. మనస్పూర్తిగ బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు, తనకు గురుదర్శనమైనదనియు చెప్పెను. బాబ యొక్క యా అశ్చర్యకరమైన లీలను గాంచినవారందరు అచ్చెరువొందిరి. "గేరు తెండు! కాషాయవస్త్రముల ధరించెద"నని అంతకు ముందు బాబా పలికిన మాటలకర్ధమును అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు అశ్చర్యకరములు.
రామభక్తుడైన డాక్టరు
ఒకనాడొక మామలతదారు తనస్నేహితుడగు డాక్టరుతో కలసి శిరిడీ వచ్చెను. శిరిడీ బయలదేరుటకు ముందు, తన మిత్రునితో అ డాక్టరు ’తన అరాధ్యదైవము శ్రీరాముడనియు, తాను శిరిడీ పోయి యొక మహమ్మదీయునికి నమస్కరించ మనస్కరించుట లేదనియు చెప్పెను. అక్కడ శిరిడీలో బాబాకు నమస్కరించుమని యెవ్వరూ బలవంతపెట్టరనియు, కలసి సరదాగా గడుపుటకు తనతో రావలెననియు మామలతదారు కోరెను. దానికి అ డాక్టరు సమ్మతించెను. శిరిడీ చేరి, బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటె ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట జూచి అందరు అశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని యొక మహమ్మదీయునికేట్లు నమస్కరించితివని యందరు అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు అ గద్దెపైన తనకు గాన్పించుటచే వారి పాదములపైబడి సాష్టాంగనమస్కార మొనర్చితినని డాక్టరు బదులిడెను. అతడట్లని, తిరిగి చూడగా, అక్కడ సాయిబాబానే గాన్పించెను. ఏమి తోచక, అతడు, "ఇది స్వప్నమా యేమి? వారు మహమ్మదీయుడగుట ఎట్లు? వారు గొప్ప యోగసంపన్నులైన యవతారపురుషులు" అని నుడివెను.
అ మరసటి దినమే డాక్టరు యేదో దీక్ష వహించి ఉపవాసముండెను. బాబా తనను అనుగ్రహించువరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు మూడు రోజులు గడచెను. నాలుగవ దినమున తన ప్రియ స్నేహితు డొకడు ఖాందేషునుండి రాగా, వానితో కలసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పొవలసివచ్చెను. బాబాకు నమస్కరించగనే, బాబా అతనితో, "ఎవరైన వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా, యేమి? ఇట్లు వచ్చితివి" అని ప్రశ్నించెను. అ ప్రశ్న డాక్టరు మనస్సును కదలించెను. అనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప అధ్యాత్మికానుభూతి కలిగి, అనిర్వచనీయమైన అనందాన్ని అనుభవించెను. అ తరువాత అతడు తన ఊరికి బోయిననూ, అ యానందానుభూతి 15 దినములవరకు అటులనే యుండెను. అ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ది పొందెను.
పై కథలు వలన, ముఖ్యముగా ములేశాస్త్రి కథ వలన, నేర్చుకొనిన నీతి యేమన మనము మన గురువునందే అనన్యమైన నిశ్చలవిశ్వాసముంచవలెను. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలు చెప్పెదను.
శ్రీ సాయినాథాయ నమః
పన్నెండవ అధ్యాయము సంపూర్ణము
సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు