శ్రీ వేమనయోగి జీవితము/ప్రస్తుతకార్యము
ప్రస్తుతకార్యము.
ఇప్పుడు బజారులో ముద్రాపకులు కొందఱు ముద్రించి విక్రయించుచున్న "వేమన పద్యములు" మున్నగు పేరులుగల వేమనగ్రంథములలో చాలా చిత్రములగు మార్పులు కలుగుచున్నవి. అట్టిమార్పులను చేయుచుండుట ఒకరికంటె ఒకరు పద్యముల నెక్కువ గూర్చితిమని ప్రతిష్ఠ నొందుటకో? లేక కనబడిన ప్రతిపద్యమునకు కర్తృత్వము నారోపించి వేమనయెడల దమకున్న నద్భుతకృతజ్ఞతను వెల్లడించు నుద్దేశముతోనో ఏమొ చెప్పజాలము కాని సుమతిశతకము మున్నగు గ్రంథములనుండి రమణీయములని తోచిన ప్రతిపద్యమునకు చివరపాదమున నుండు "సుమతీ, కుమారీ" మున్నగు పదములను తీసివైచి "వేమా" అని కూర్చి కొన్ని పద్యముల నధికముగా జేర్చి సంఖ్యాపూరణమును జేసిరి.
ఇకగొందఱు అసలు బంగారమునకు బదులుగా నిర్మించిన గిల్టువలె వేమనపద్యమునకే యొక్కొక్కదానికి యొకటిరెండు నాల్గైదు వఱకును నకళ్లను కల్పించి గ్రంథసంఖ్యను పెంచి పెద్దదానిని చేసిరి. మఱియును గొందఱు "తమది కొంతయును త్రాళ్లపాకవారిది కొంత" యనునట్టులు వేమనయచ్చటచ్చట సత్యప్రతిపాదమునకై గావించిన పరిహాస పూరితములగు పద్యముల నడుమ తమతమ యిష్టము వచ్చినట్టులు చార్వాకమతావలంబకులై నిందాదుల భోధించు పద్యముల జేర్చిరి. ఇక తక్కినవారు మనమేల యూఱక యుండవలయు ననియొ యేమొకాని "తెలిసీ తెలియని మిట్టవేదాంతపు గుట్టలను" చేర్చి పైవారికి తోడ్పడిరి.
లోకము సాధారణముగా గతానుగతికము. ఇట్టులు ఈమన వేమన శతకమున నితరుల స్వకపోల కల్పితముగా గాని యితర గ్రంథములలో నుండి ఎత్తి కూర్చిరి అని గాని యనినచో నమ్మకపోవచ్చును, కావున నట్టివాని కొకటిరెండింటి నుదాహరణముల నీక్రింద బొందుపఱచుచున్నాడను. భద్రభూపాలుడని నామాంతరముగల బద్దెనరేంద్రునిచే రచింపబడి మనపల్లెటూళ్లలో మొన్నమొన్నటి వఱకు పిల్లలచే గంఠపాఠము చేయింపబడుచున్నట్టి సుమతిశతకములో:-
"గడనగలమగని జూచిన
నడుగులకును మడుగు లిడుదు రతివలు తమలో,
గడనుడుగు మగని జూచిన
నడపీనుగ వచ్చెననుచు నగుదురు సుమతీ."
అని కలదు.
"గడనగలమగనిజూచిన....వచ్చెననుచునగుదురు వేమా."
అని చేర్చిరి.
ఇట్టివి పెక్కులు గలవు. ఇక వచ్చినపద్యములే మఱలి వచ్చుట కుదాహరణము నిచ్చుచున్నాను.
"ఆడి తప్పువారె యభిమానహీనులు"
అని యొకపద్యము గలదు.
దీనిని తలను మార్చుచు
"పలికి తప్పువాడె" యనికొన్ని మాఱులు, "ఆడితప్పువాడె" యని మఱి కొన్నిమాఱులు పెక్కురీతులగా వారివారియిష్టానుసారముగా కూర్చిరి. ఇక గృత్రిమముల కుదాహరణము. దీనినే మాయ బంగారమందురు.
ఉదాహరణము:-
"కాశికి జనువాని కర్మ మేమనవచ్చు"
అని యొకపద్యము గలదు.
దీనికి:-
"కాశికి జనువాని కష్ట మే మనవచ్చు"
అని కొన్నిటిని,
"కాశిపోవలె నని గంతగట్టగ నేల"
అని మఱికొన్నిటిని,
"కాశి కేగునట్టి కష్ట మే మనవచ్చు"
అని కొన్నిటిని కూర్చియుండిరి.
పద్యములలో చాలవఱకు తత్త్వమార్గమును గంభీరభావముతో బోధించుచున్నందున, పండితులమాట నటుండనిత్తము పామరులకుమాత్రము బొత్తుగా తెలియుట లేదు. వీనులకింపగు నీపద్యముల యర్థము దెలిసికొనినచో మానసములకు గూడ నింపుగలుగును గదా! కావుననే ఈవిషయమును గుఱ్తెఱింగినవారును చిరకాలమునుండి వంశానుక్రమముగా పెక్కుల సంస్కృతాంధ్ర గ్రంథములను చక్కగ నచ్చొత్తించి యాంధ్ర దేశమునకు మహోపకారమును చేయుచున్న శ్రీ వావిళ్ల. రామస్వామి శాస్త్రులు అండ్‌సన్స్‌వారు వేమనపద్యములకు సులభశైలిలో తాత్పర్యమును వ్రాయించుచున్నారు. కావున బ్రస్తుతము "ఈ వేమనపద్యములకు షుమారు మూడువేలకు విషయ విభాగములతోటి తాత్సర్యమును వ్రాయుచు ముందుగా పాఠకలోకమునకు "వేమనజీవితము" అను నీచిన్నిపుస్తకమును అందించితిని. ఆంద్రులందఱును శ్రీ యుతులగు వావిళ్ళ వేంకటేశ్వరులుగారి మహోద్యమమునకు ప్రోత్సాహమునొసంగి శ్రీవేమనయోగియందుగల కృతజ్ఞతను వెల్లడింప బ్రార్ధితులు.
పంచాగ్నుల. ఆదినారాయణశాస్త్రీ
-* * *-
చెన్నపురి:
వావిళ్ళ, రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
ఆదిసరస్వతీనిలయముద్రాక్షరశాలయందు
ముద్రితము --1917