శ్రీ రామాయణము - మూడవసంపుటము/సుందరకాండము

శ్రీరస్తు.

కట్టా వరదరాజకృతమగు

శ్రీ రామాయణము

(ద్విపద కావ్యము)

__________:o:____________

సుందర కాండము

శ్రీరాజితశుభాంగ! - స్థిరగుణి సంగ
హారి కృపాపాంగ! -యల మేలు మంగ
భావుక! శతకోటి - భానుసంకాశ!
సేవకాత్మనివేశ! - శ్రీ వేంకటేశ!
అవధారు కుశలవు - లారామచంద్రుఁ
డవధరింపంగ రా - మాయణంబిట్లు
వినుపించు తత్కథా - వృత్తాంత మెల్లఁ
గనుపించు నవ్వలి - కథ యెట్టులనిన.

-: హనుమంతుఁడు మహేంద్రపర్వతముపై విశ్రమించుట :

తరవాత వాయునం - దనుఁడు మహేంద్ర
గిరిశిఖరం బెక్కి - కేళియపోలి 10
జలరాశి చూచి ద - శగ్రీవుఁ డెందు
నిలసుత డాఁచెనో - యీలంక ననుచు

నేరిచేఁ దీఱని - యింతటి కార్య
భారమంతయుఁ దృణ- ప్రాయంబుగాఁగ
దలఁపుచు వినువీధి - దాఁట నూహించి
నలుదిక్కులునుఁ జూచి - నగముపై నున్న
పచ్చిక తిన్నెల - పై విశ్రమించి
యచ్చోటి మృగపక్షు - లన్నియుఁ జెదరఁ
బంచవర్ణంబులఁ - బరగిన ధాతు
సంచయంబులను ని-ర్ఝర సమూహములఁ 20
గామ రూపంబులుఁ - గల యనుచరులఁ
గామినీమణులను - గలసి చరించు
సురకుమారకులఁ గు- సుమితవిశేష
తగువుల రత్నకం - దరముల దివ్య
ఫలములఁ జూచుచుఁ - బద్మాకరమునఁ
దులకించు గంధసిం - ధురము చందమున
నటునిటు నడయాడి - యాగట్టుచట్టు
దిటముచూచుక నిల్చి - దివిజులు మింటఁ
గెలన వానరులు నం - కింపుచుఁ జూడ
జలనిధి దాఁట ను - త్సాహమొందుచును 30
కమలజు నింద్రుని - ఖరకరు ననలు
హిమకరు ఖగరాజు - నెల్ల వేలుపులఁ
బంచభూతంబుల - భావించి మ్రొక్కి
పంచాస్యుఁ దనతండ్రిఁ - బవమానుఁ దలఁచి
పదములు కరములు - పర్వతాగ్రమునఁ
బదిలంబుగానుంచి - పర్వకాలముల
జలధి వొంగినరీతిఁ - జదలు తారకలు

మొలపూసలుగ సర్వ - మును నాక్రమించి
యతిమాత్ర దేహుఁడై - యట్టిట్టు నూప
నతనిచేఁ జదిసి య - య్యచలరాజంబు 40
దొనల నీరందిందుఁ - దొలుచుక వెడలి
మునుపు వారెడు ఝరం - బులఁ బ్రోదిసేయ
మాసటీఁడై తాను - మదధారలొలుక
భాసిల్లు కరినిఁగా - భావించె గిరిని;
బందికానికిఁ జిక్కి - పాదఘట్టనలఁ
గందువులను బూడ్చు - కలధనంబెల్లఁ
బూడికలెత్తి చూ - పుగృహస్థురీతిఁ
బీడితంబైన యా - పృథివీధరంబు
అతిగుప్త కార్తస్వ - రాది ధాతువులు
క్షితిమీఁద వెలువరిం - చెను బెట్టుజడిసి; 50
చరులందుఁ దరులందు-జంతుజాలంబు
లిరకటంబులఁ జిక్కి - యెల్లెడ మొరసె;
సగము మేనులు రాల - సంధులఁ జిక్కి
మొగము లార్పుచు విషం - బులు గ్రక్కుకొనుచు
గండూఫలంబులఁ - గఱచుచు వ్రాలి
యుండె నందందు మ - హోరగ శ్రేణి;
ఉర్వీధరంబు పై - నున్న యోషధులు
దర్వీకర విషంబు - తమరు హరింపఁ
జాలక కలపెంపు - సడలిపోవుటను
వ్రీలెఁ బన్నగదష్ట - వివిధోపలములు; 60
అమరుల సుమవృష్టి - యనఁగ భూమీరు
హములుర్విపైఁ బడి - యలరులు రాల్చె;

ఇది యేమి యుత్పాత - మిపుడని యచట
మెదలక దేవతా - మిథునముల్ చనియె;
ఆవనాంతమున వి - ద్యాధరావళులు
పానభూములు డించి - పాయసంబులును
నాసవమాంస శ - రాస ఖడ్గములు
వేసినచోఁ బడ - వేసి బిట్టులికి
వ్యోమయానములపై - నుడు వీథికెగసి
యామట పొడవున - నట నిల్చిచూచి 70
'యదిరయ్య!' యీకొండ - నడగఁగఁ బొక్కె
నిదియొక్క పెనుభూత - మిపుడంచుఁ బాఱ
నొడలు జాడించి మ - హోరగేంద్రంబుఁ
గడకతోఁ గబళించి - గరుడఁడు మింట
నాడించుగతి వాల - మార్చి కర్ణములు
జోడుగా రిక్కించి - చూపులు మింట
సాగించి గళము చాఁ - చక కుదియించి
యోగికైవడిఁ జాల - నూర్పులు నిలిపి
యెగుర నుంకించి తా - నెల్ల వానరుల
మొగములు జూచి స - ముద్ధతిఁ బలికె. 80

-: మహేంద్రపర్వతమునుండి సముద్రమును హనుమంతుఁడు లంఘించుట :-

"ఇదె చూడుఁడెగసెద! - నీలంకలోన
వెదకి జూనకిఁ జూచి - వేగంబె యిటకు
మఱలెద రాముని - మగువ లేదేని
సురలోకమున కేఁగి - చూచెద నచట

నందును లేదేని - యా దశాననుని
ముందల పట్టుక - మును కాలఁదన్ని
యీడుచుకొనితెచ్చి - యిపుడె నిల్పుదును!
పాడుసేయుదు వాని - పట్టణం బెల్ల"
ననుచు రివ్వున నుర - గారాతి కరణి
వినువీథి కెగసి యా - వీరాగ్రయాయి 90
పోవుచో వెంటనే - భూరుహశ్రేణి
యీవలావలఁ బోక - యెగిసి మింటికిని
పోరాని చుట్టంబు - పోవుచోఁ గొంత
దూరంబు వచ్చు బం - ధువులను బోలి
విహగస్వనములతో - వెనువెంట వచ్చి
రహి మాని నీరాక - రంబులోఁ బడియె!
నడుగు వెట్టిన పట్ల - నవనీధరంబు
పిడుగు కొట్టినయట్ల - పెళపెళ విఱియఁ
గేలుమోపిన పట్ల - గిరిశిఖరంబు
కీలువాపినయట్లు - క్షితిమీఁద డొల్లఁ 100
బోవుచో దివి మెఱు - పులతోడి మబ్బు
కైవడి నాత్మీయ - గాత్రసంజనిత
పవనాప హృతతరు - ప్రసవముల్ మేన
రవణంబుగా నవి - రాలిచి దాన
నల వారినిధికి పు - ష్పాంజలి చేసి
యలరించి పొడవుగా - హస్తంబులెత్తి
పంచాననాహులు - పజ్జలవచ్చు
సంచునన్ గరభుజా- స్తంభముల్మెఱయఁ

గారుచిచ్చుల రెంటఁ - గరమొప్పు నగము
తీరున లోచన - దీప్తులుప్పొంగ 110
జతగాఁగ నుదయించు - చంద్రార్కులనఁగ
నతిశోణరుచివర్తు - లాక్షులు దనర
చరమసంధ్యారాగ - సంవృతుండైన
తరణియోయనఁగ వ - క్త్రము శోభిలంగ
నొకచాయఁ జక్కనై - యొప్పువాలంబు
చకచక లింద్రధ్వ - జంబు గీడ్పఱపఁ
దనుచుట్టుఁ గనుపట్టు - తరిఁ బరివేష
మినమండలము చుట్టు - నెన్నికఁదోఁప
వరధాతు రుచులఁ బ - ర్వతనితంబంబు
సరణిఁ గటీప్రదే - శంబు రాణింప 120
దూరి బల్చంక సం - దులఁ బోవుగాడ్పు
భోరున నురుముల - వోలిక మొరయఁ
జదలు పైఁజను బురు - సాజూలుతోడి
మదదంతియనఁగ రో - మములుమై నిండ
నోడవోయిన యట్ల - నుదధిలోఁ దనదు
నీడ దక్షిణముగా - నీటిపైఁ దేలఁ
గేలార్ప జలధిలోఁ - గెళ్లుబ్బు నూర్మి
మాలికల్ తనరార - మగుడఁ బొరల్ప
సుడివడి జలధి యి - చ్చోఁ జాలభ్రమసి
బెడిదంవు మ్రోతతో - బిట్టు ఘూర్ణిల్ల 130
గగనమంతయుఁ దానె - కబళించిమ్రింగు
తగవుగాఁ దెఱచిన - తనముఖం బమర

వలుద రొమ్మునఁ గొట్టు - వడు తరంగంబు
లలమి మింటికి శార - దాభ్రముల్ గాఁగ
జలరాశిలోఁ దోఁచు - జంతుజాలంబు
వలువమాటు దొలంగు - వైఖరినుండ
వడినేఁగుచో నీరు - వాయలై వార్థి
నడుమ సందిచ్చి ని - మ్నస్థలిఁ దోఁపఁ
బరవశంబున నీడ - పదియోజనముల
పరపును పొడవు ము - ప్పదియును గాఁగ 140
ఱెక్కలతోడి య - ద్రియుఁ బోల మింటి
చక్కి దివ్యులకు నా - శ్రయబుద్ధి వొడమ
కరడులలో సమ - గతి నూర్ధ్వగతిని
శరదంబులను బోవ - జలదాగమమునఁ
గనిపించి యొకచోట - గనిపించకున్న
వనజవిరోధిభా - వము గోచరింప
నలరువానలు దేవ - తావళి ముంప
వలిమీర దక్షిణ - వాయువుల్ విసర
వెన్నెలగతి నర - నింద బాంధవుఁడు
తిన్నని యెండలా - తెరపునఁ గాయ 150
నరుగుచో, 'సగరాన్వ - యమున జనించు
ధరణిజా రమణు దూ - త సమీరసుతుఁడు
హితము సేయుదుగాక - యేను సాగరుఁడ
నితనికి నని' తన - యిచ్చలోఁ దలఁచి
మైనాకుఁ బిలిచి "యో - క్ష్మాధరాధీశ!

-: మైనాకుఁడు సముద్రుని యానతిని హనుమంతునకు నాతిథ్య మొసగుట:-

ఈనగచరవీరుఁ - డిపుడు పూజ్యుండు
పాతాళమున నున్న - భయద రాక్షసుల
భీతిచే వారలు - పెరిగి రాకుండ
నా రసాతల బి - లాయతనంబునందు
నేరుపాటుగ నిన్ను - నిడియె నింద్రుండు. 160
అది మాని వచ్చిన - యట్టినేరంబు
మదినెన్నక సహించు - మఘవుఁడు నిన్ను.
కామరూపకుఁడవు - గావుననెగసి
యామర్కటాధీశు - నర్థించి తెచ్చి
తీయని ఫలములఁ - దృప్తునిఁ జేసి
నీయందు గల స్వాదు - నీరంబులిచ్చి
యుపచరించు మటన్న - నుదధివాక్యంబు
లపుడాలకించి మ - హాశైలరాజు
సరసులతో నికుం - జనావళితోడ
సురసిద్ధచారణ - స్తోమంబుతోడఁ170
గాంచనదివ్య శృం - గములతో గోచ
రించిన యాకేస - రి కుమారకుండు
"నిదియేమి విపరీత - మీవార్థి నడుమ
నుదయించె నీకొండ - యుప్పరం బెగయ!
ఏమిగాఁగలదియో - యిఁకరామకార్య
మేమైన నగుగాక - యెంతలేద" నుచు
మోరతోపున వచ్చి -మొగ్గరంబైన
బోరతోఁపున శృంగ -మును గూలఁదాకి

        
తిరుగుడువడఁ జేయఁ - దెరలకా గట్టు
దొర చెంతనొకవేల్పు - దొరఁబోలి నిలిచి
" ఓయి! వానరవీర! - యుదధినాయఁకుఁడు
నీయత్న మెఱిఁగి మ - న్నించి నాచేత
బహుమాన మొనరింపఁ - బనిచె నిచ్చోట
విహరింపు మాఁకటి - వేళకు వలయు
ఫలములు సేవింపు - బడలిక దీఱ
వలయు తావునకుఁ బో - వఁగ సమ్మతింపు"
మన విని "జలధి రా - జాడినమాట
తనమౌళి నున్నదిం - తటివాఁడవీవు
ఆతిథ్యమొనరింప - నది ద్రోఁచిపోవ
నీతియే శ్రీరాము - నికి బంటనగుట? 190
అతని కార్యమునకై - యరిగెద నిపుడు
హితముగా దాహార - మేమియు నాకు
మఱలుచో నిను బహు - మానించి యవల
నరిగెదఁ గాదని - యనరాదు నీకు
ననుమతింపు" మటంచు - నాయద్రి మీఁదఁ
దనకేలు చేర్చి సాం - త్వనములు వలుక
నొడఁబడి కాదన - నోడిశైలంబుఁ
గడలియుఁ బ్లవగపుం - గవుని దీవించి
"పోయిరమ్మిపుడు - నీ పూనినకార్య
మోయన్న! చేకూడి - యొకనాఁడు నీవు 200
తలపువ్వు వాడక - తపన వంశంబు
నిలువరింపు" మటన్న - నింగిపై నెగయు
పవనజుఁ గాంచి సు - పర్వులు మింట

       
పువులువానల జళ్ళు - భోరున గురియ
శతమఘుఁడటఁ జేరి - శైలేంద్రుఁ జూచి
"హితము చేసితివి నా - కెల్ల వేల్పులకుఁ
గావున నిన్ను నే - గాచితి మఱలి
పోవల దీవాయు - పుత్రుఁడు మాకు
మాననీయుఁడు గాన - మాకు నీరాక
యానందకరమయ్యె - నభయమిచ్చితిని 210
నిలువు మిచ్చట" నని - నిర్జరులెల్లఁ
గొలువ నింద్రుఁడు వోవఁ - గొండ యచ్చోట
నమరుల కాధార- మై మిన్ను మోచి
కమలాకరంబులోఁ - గదలకయుండె.

-:దేవతలు హనుమంతుని శక్తిఁ బరీక్షించుటకు సురసను నడ్డగింపఁ బంపుట:-


పవమానతనయుఁ డం - బరమున కెగసి
జవమున నేగఁ ని - ర్జరులాత్మఁ దలఁచి
'యనితరసాధ్యమై - నట్టి యీకార్య
మునకు నేఁగెడు గాడ్పు - ముద్దులకొడుకు
శక్తి చూతముగాక - చనుచోట నేఁడు'
యుక్తిచే నపుడు మ - హోరగమాత 220
సురసను బిలిచి "యో! - సురస నీ వితని
విరసించి తచ్ఛక్తి - వీక్షింపు" మనిన
నాకొమ్మ దానవి - యై అడ్డగించి
"నీకింకఁ బోవచ్చు - నే వార్ధి దాఁటి?
కనుపట్టువారి మ్రిం - గఁగ నాకు నిచ్చె

వనజసంభవుఁ డొక్క - వరమట్లు గానఁ
గడవఁ జెల్లునె బ్రహ్మ - కట్టడ నిన్ను
విడువ నాయందుఁ బ్ర - వేశింపు మనుచు
వదనంబు దెఱచిన - వాయుసుతుండు
బెదరగ దానిఁగో - పించి యిట్లనియె. 230
"శ్రీరాము నానతి - సేయంగఁ బూని
యో రామ! నేనేఁగు - చున్నాఁడ నిపుడు
మఱలి వచ్చిన నీదు - మాటచే పట్టి
తెఱచిన నీదు వా - తికి నగ్గమౌదు
నిపుడు తీరద" టన్న - "యేనేల విందు?
కపివీర! నిన్ను మ్రిం - గక మాన” ననుచు
వదనంబుఁ దెఱచిన - వాయుసుతుండు
పదియోజనంబుల - పాటిగాఁ బెరిగె
వలుద నోరదియు ని - ర్వది యోజనముల
కొలదిఁ బెంచిన గాలి - కొడుకు గాత్రంబు 240
ముప్పది యోజనం - బులుగాఁగఁ బెంప
నప్పుడు నలువది - యామడ వెళుపు
నాగమాతయు వద - నముఁ బెంప నతఁడు
నాఁగతి నేఁబది - యామడ బెరిగె!
అరువది యామడ-యాసురి నోరు
వఱప వాయుజుఁడు డె - బ్బది యోజనములు
బలిసి నిల్చిన యెనుఁ - బది యోజనములు
వెళపుగాఁ దననోరు - వెంచెను సురస!

అంతటఁ దొంబది -యామడ వాయు
సంతతి మైపెంప - శత యోజనములు 250
తననోరు నాగమా - తయుఁ బెంపఁ జూచి

-: హనుమంతుఁడు సురసను జయించుట :-

యనిల సంభవుఁడు సూక్ష్మాకృతిఁ దాల్చి
గ్రక్కున దాని మొ - గంబులోఁ దుమికి
యక్కడ నిల్వక - యావల వెడలి
“శరణు జొచ్చితిని దా - క్షాయణి నీకు
కరుణించిమాట ని -క్కముగాఁగ నిలువు
వదనంబుఁ జొరక పో - వలదంటి గాన
నదియుఁ జేసితి నన్ను - నడ్డగింపకుము!
అమ్మ ! నాకీవు సా - హాయ్య కారిణివి
గమ్ము శ్రీరాముని - కార్య మీడేర్పు 260
మన" విని యాయింతి - హనుమంతుఁజూచి
మనసులో మెచ్చి స - మ్మతముతోఁ బలికె
“పోవన్న పవనజ! - బుద్ధిమంతుఁడవు
లావును ధైర్యబ - లంబు నీ సొమ్ము
సీతను గనుఁగొని - శ్రీరాముపాలి
కేతెమ్ము మరల నీ - కెసఁగు మంగళము
సురలెల్ల నీశక్తి - చూడఁగ నన్ను
పురికొల్ప వచ్చితి - భుజగమాతృకను
జయమందు" మనఁబోవఁ - జయ్యననెగసి
రయమునందు ఖగేశ్వ - రసమానుఁడగుచు 270

-: సింహిక హనుమంతునడ్డగించుట - అతఁడామెను చంపి సముద్రములోఁ బడవేయుట:-


నరుగుచో సింహిక - యనునది నీడఁ
దరల నీయక పట్టి - తనునరికట్టి
నిలుప ఛాయాగ్రాహి - నిగ్రహశక్తిఁ
దొలఁగ నేరక తన - తో రవిసుతుఁడు
చెప్పిన మాటలు - చిత్తంబులోన
నప్పుడు సరివచ్చె - నని జీనివేయు
నోడకైవడి నిల్చి - యొడలుజాడించి
చూడఁజూడంగఁ బెం - చుటయు నద్దనుజి
తననోరు వెంచినఁ - దాసూక్ష్మరూప
మున వచ్చి దానవి - మొగములోఁ జొచ్చి 280
కడుపులోనికిఁ దన - కరములు చాచి
పిడికిళ్ళచే దాని - ప్రేవులు వట్టి
పెకలించి వధియించి - పెన్నీట వైచి
సకియను జంపఁ దో - షము వచ్చుననక
యాకాశమున నేఁగు - ననిల నందనుడు
లోకులనెల్ల నా - లోకింపఁ దగియె!
వాలంబు వాలంబు - వటువుగా నాంత్ర
జాలంబుఁ దనకరాం - చలమునఁ బట్టి
చనుచోట నవి సూత్ర - సంగతి మెఱయ
వనధికుమారుఁడు - వడిఁ బట్టి యాడు 290
హనుమంతు ప్రతిమకో - యనఁ బోయి పోయి
వినువీథి నట్టింటి - వేడెంబు వెట్టి
నాలుగు గెలుపులు - నాకులు మెచ్చ

         
గాలిబిడ్డఁడు తన - కరములనున్న
ప్రేగులు జలధి క - ర్పించి తామెఱపు
తీగకైవడి మింటి - దెసవచ్చు నపుడు
నొకచోట గంధర్వు - లొకయెడ సిద్ధు
లొకట విద్యాధరు - లొకమేర సురలు
నొకక్రేవ మౌనులు - నొకతరి యక్షు
లొకచక్కిఁ బన్నగు - లొకవంక మునులు
సేవింప రంభోర్వ - శీమేనకాది
దేవతాభామినుల్ - తెరువులు గట్ట
సకల దిక్పాలకుల్ - సముఖంబునందు
నొకరొకళ్ళను జేరి - యోలగింపంగఁ
దనుఁజూచి విరివాన - దట్టంబుగాఁగ
వినువీథిఁ గురియించు - విబుధ నాయకుని
గనుఁగొని యవ్వల - గడచి దక్షిణపు
వనరాశిగట్టు పా - వని విలోకించి
యుత్తరగాములై - యుదధినాయకుని
పొత్తుఁగూడిన యట్టి - పుణ్యవాహినులఁ
గనుఁగొని జంబీర - ఖర్జూరచూత
పనసబిల్వతమాల - పాటల వకుళ
నారికేళాదికా - ననముల గుట్టు
మీరు త్రికూటాద్రి - మీఁద నున్నట్టి

-:సముద్రముదాఁటి హనుమంతుఁడు త్రికూటాద్రి మీదఁనున్న లంకనుఁ జూచుట:-


లంకవీక్షించి మె - ల్లన చెంతవ్రాల
శంకించి యిట్టి వే - షము చూచిరేని

      
జగడింతు రిచటి రా - క్షసులని కొంచ
మగునట్టి మేనితో - నలయిక లేక
కడలిఁ బువ్వులతోఁటఁ - గాలువ దాఁటు
వడువుగా మైశ్రమ - వారి గన్పడఁగ 320
నిట్టూర్పు లూర్చక - నెళవుల నున్న
యట్టి మృగంబుల - ట్టట్టై కలంగ
మెల్లమెల్లనవచ్చి - మిహిరమండలము
చల్లఁబాఱిన వేళ - శైలశృంగమున
ప్రోలు కాదిది దివం - బుననుండి యపుడు
వ్రాలినిల్చిన యమ - రావతి యనఁగ
రథగజ హయభట - వ్రాతనిశ్శంక
పృథుగోపురాగ్రకుం - భితహరిణాంక
పౌలస్త్యదోర్దండ - బలబిరుదాంక
సాలగుప్తి నిరస్త - శాత్రవాతంక 330
పరబలోపల శారి - భటశౌర్యటంక
శరధివేలావనాం - చత్కలావింక
కలధౌత సౌధస - ఘటిత విటంక
లలితశృంగారాక - లంక యాలంక
పసిఁడి కోటలు మేల్మి - బారి దల్పులును
రసవర్గములు రస్తు - రాజవీథులును
రంగమంటపముల్ బి - రంగులు జబురు
జంగులు నట్టళ్ళు - సావళ్ళుగుళ్ళు
రాక్షసప్రభువు లా - రక్షులు నగర
రక్షకుల్ గణికాప - రంపరల్ గలిగి 340

యగిడితయై చుట్టు - నంబుధియుండఁ
బొగడొందు గిరిదుర్గ - ముల రాజనంగఁ
బ్రాకారజఘనయై - పర్వతశిఖర
కోకస్తనాగ్రయై - గురుతరాట్టాల
మస్తకయై యంత్ర - మాలికాచికుర
శస్తయై నిన్ను కా - సారగభీర
నాభియై భువనాభి - నందమాణిక్య
శోభయై మానిని - చూపట్టు కరణి

-: లంక యుత్తరద్వార మాతఁడు చేరుట :-

నొప్పు లంకాపురి - యుత్తర ద్వార
మప్పుడ మ్మేధావి - యంజక చేరి 350
మును విశ్వకర్మ యా - మొదట నిర్మింప
ధనదునిచేఁ బాలి - తంబయి వెనక
రావణుఁడేలు కా - రణమున దనుజు
లీవీథిఁ జూచిన - హేతి త్రికూట
సాధనకరులై యె - సంగు నీపురము
సాధింపఁ గలఁడె ని - ర్జరనాథుఁడైన?
కపులేమి సేతురు? - కాకుత్స్థ వంశ
నృపులేమి సేతు రే- నేమి సేయుదును?
చేనగునే కపి - శ్రేణి కిచ్చటికి
రానగునే సము - ద్రముమీఁద నెగసి 360
తాను వాలిసుతుండు - తరణి నందనుఁడు
నానీలుఁడును దక్క - నన్యు లిచ్చటికి
రాలేరు వచ్చిన - రావణుఁ జెనకి

పోలేరు మఱల నో - పుదు నేనొకండ
సీతను వెదకి చూ - చిన తరువాత
చూత మామీఁదటి - చోఁద నేఁడేల?
కారాదు వానరా - కారంబు పగలు
వోరాదు చీకటి - ప్రొద్దునగాని
కడలకుఁ గనుపించి - కనుపించనట్టి
యొడలు దాలిచి పిల్లి - యోయనుకొనఁగఁ 370
జొరవలె నీవీడు - చొరరానియట్టి
తరివలె నుచితమౌ - దారిఁగైకొనఁగ
బుద్ధి లేనట్టి పం - పులవారి వలన
సిద్ధింప నేరవు - చేకూరు పనులు
కావున రాక్షసా - కారంబుతోడ
నీవీడు చొత్తునో - యెఱిఁగిన యపుడె
హాని వచ్చును తన - కందుచేఁ గార్య
హానియౌ మఱి తీర - దన్యులచేత
నెప్పుడు గ్రుంకునో - యినుఁడంచు” నెంచ
నప్పుడ యస్తాద్రి - నర్కుఁడు చేరె 380
కొనచీకటిని చొచ్చి - కొంచెంపు మేన
హనుమంతుఁ డొక్క హ - ట్టాగ్రంబుఁ బ్రాకి
యాకొత్తడంబుపై - నాసీనుఁడై వి
లోకింపఁ దెరలుజ - ల్లులు నుప్పరిగెలు
మేరువుల్ కురుఁజులు - మేలుకట్టులును
తోరణంబులును వీ - థులుఁ జప్పరములు
దొంతరమేడలు - తూర్య ఘోషములు
దంతులు రథము లు - త్తమతురంగములు

నగరులు దనుజ సై - న్యము నెడలేని
నగరంబులో దశా - ననుబెంపుఁ జూచి
యబ్బుర మందుచో - నబ్జారి పొడవు
గుబ్బలిపై దోఁచె - గోరగింపుచును
కోరిక లబ్బె చ - కోరంబులకును
జారులకెల్ల వి - చారముల్ ముదిరె
కవలెడవాసి జ - క్కవలు చింతిల్లె
రవణంబు దొరఁగె సా - రసవనంబులకు
కలకల నవ్వెను - కైరవపాళి
జలజల జాలెత్తె - చంద్రకాంతములు
విరిసెఁ జీకటి దిశా - వీథులయందుఁ
గురిసెను బన్నీరు - గొజ్జంగిపొదల 400
నిండెను బండు వె - న్నెల లుర్విమీఁద
పండె ముచ్చటలు దం - పతులకెల్లెడల
ఘుమఘుమమని పొంగి - ఘోషించె జలధి
కమనులకెల్ల రా - గంబులు హెచ్చె.
ఆవేళ బహుదీపి - కాయతనంబు
రావణు నగరంబు - రాముని దూత
చొచ్చెదనని పోవు - చోట లంకాఖ్య

- : లంకనుగాచు లంకిణి హనుమంతు నడ్డగింప నతఁడామెను జయించి లంకలోఁ బ్రవేశించుట :-

నచ్చోట గాచు పు- రాధిదైవతము
అట్టహాసము చేసి - యరికట్టి గాలి
పట్టిఁ బోనీక “నా - పట్టణం బెట్లు 410

       
        చొరవచ్చు? నిలుమ" న్నఁ - "జొచ్చిన నేమి?
        తెరువిమ్ము తల" మన్నఁ - "దెరువేలయిత్తు?
        నెవ్వఁడ? నీ" వన్న - "యేరాముబంట
        నెవ్వతె? వీ" వన్న - " యే నీపురంబు
        గాచు దేవతను లం - కా నామధేయ
        నీచాయ రా గతం - బేమి? నీ క" నిన
        "వేడుకవుట్టి యీ - వీటి చందంబుఁ
        జూడవచ్చితి" నన్న -" జూడుము మొదట
        నాతోడి రణమ" న్న -" నాతి! నేమఱల
        నేతెంతుఁ బని కల - దిపుడు పోవలయుఁ 420
        దీఱదిప్పటికన్న" - "తీరునే నన్ను
        మీఱి పోవఁగ? "నని - మిణుగురుల్ చెదర
        నతివజ్రసారమౌ - నంజనాదేవి
        సుతుని పేరెదను గా - జులు వగులంగ
        రక్కసి గ్రుద్దిన - రాముని బంటు
        గ్రక్కునఁ దనవామ - కరముపై నెత్తి
        రొడ్డవెట్టుగ వ్రేయ - రొమ్ముపైఁ దాకి
        పడ్డపాటెఱుఁగక - పైచీర మఱచి
        తలవీడ నోట ర - క్తము గ్రక్కికొనుచు
        ములుఁగుచు గడసేవు - మూర్ఛిల్లితెలిసి 430
        మిడిగ్రుడ్లు తెఱచి యే - మియుఁ జేయలేక
        తడవున కదిలేచి - తలఁచుక పలికె.
        "పొమ్ము! నీ యిచ్చగా - బురములోపలికిఁ
        గ్రమ్మఱు మెంచిన - కార్యంబుఁ దీర్చి
        యజుఁడు నాకిచ్చిన - యట్టివరంబు

      నిజమయ్యె 'నీలంక - నీవు రక్షింప
      వానరుఁ డొక్కండు - వచ్చి నీపురము
      పూని తాఁబిడికిట - పోటుచేఁ బొడిచి
      గెలుచు నెన్నఁడు నాఁటి - కీలంక చెడును
      తలఁచుకొమ్మని' పల్కె - తనుగెల్చితీవు 440
      జయముఁ గైకొనిరమ్ము - చనుమన్నదానిఁ
      జెయికాచి మన్ననఁ - జేసి యాలంక
      దీవెనలంది యా - దిత్యులు బొగడ
      పావని లంకలో - పలఁ బ్రవేశించె.

-: హనుమంతుడు లంకలోని విశేషములను జూచుచు సీతను వెదకుట :-

      ఆలంబుగాఁగఁ దా - నాలంబుగెలిచి
      సాలంబు వాకిట - చాయగాఁ జనక
      చాయగా లంఘించి - సామీరి మీఱి
      దాయమస్తకముపైఁ - దానిల్చి నటులఁ
      దన వామచరణప - ద్మము మున్నుగాఁగ
      దనుజనాయకురాజ - ధానిలోఁజొచ్చి 450
      చుట్టు కొల్లారముల్ - సోరనగండ్లు
      తొట్టి కట్టులు సర్వ - తోభద్రకములు
      స్వస్తికాగారముల్ - చతురంగకములు
      హస్తి శాలలు మంద - రావాసములును
      కలధౌతసౌధరే - ఖలు సుధాధౌత
      కలధౌతమణిమయా - గారముల్ గనుచు
      నందందు మంద్రమ - ధ్యమతారకములఁ

        
         జందనగంధులు - షడ్జనిషాద
         ధైవతరిషభగాం - ధారపంచమప
         రీవాహ సుస్వర - రీతులచేత 460
         గౌళకన్నడనాట - కాంభోదిపాటి
         మాళవభైరవి - మలహరి బౌళి
         సావేరి యాహిరి - శంకరాభరణ
         మావేళలకుఁ దగి - నట్టి రాగములు
         రంగరక్తులుగ జం - త్రములు గాత్రములు
         సంగతంబులుగాఁగ - సంగీతమపుడు
         వినిపించు చోటులు - వెదకుచు నవలఁ
         జనునెడ దశకంఠ - జయబిరుదాంక
         వినుతగాథాశతా - న్వీతపద్యముల
         నని గెల్చు విజయంబు - లన్నియుఁ గూర్చి 470
         ప్రత్యక్షబాహట - పాంచాలనటన
         లత్యంతమును మీఱు - నట్టి శయ్యలను
         చదువు రాక్షసభట - జాలంబు రవళి
         యదిరా! యనుచు వీను - లానించి మెచ్చి
         దత్తిళభరత మ - తంగాదులైన
         నృత్తశాస్త్రంబుల - నిపుణతమెఱయు
         నాటలపాటల - నందంబులైన
         నాటకశాలల - నట్టువలైన
         దనుజుల కొనుగోలు - తత్తకారములు
         మనసొగ్గి విని పవ - మానబాలకుఁడు 480
         మేడలమీదికి - మెట్టికల్ మెట్టి
         జోడుగూడుక యెక్కు - చో వధూమణుల

       
       మొలనూలి గంటల - మ్రోఁత యందియల
       ఝళఝళధ్వనులు మ - జ్జాపుట్టఁ జేయఁ
       గడచి పోవఁగ సామ - గానంబులొక్క
       కడ ఋగ్యజుషపాఠ - కవ్రాతమొకట
       పాడి పదక్రమ - ఫణితి నధ్యయన
       మీడు వారలతోడ - యెలుఁగులురాయ
       చదివెడి బ్రహ్మరా - క్షసుల ఘోషంబు
       మదిమెచ్చి యవ్వలి - మౌళిఁ గేలందు 490
       పువ్వుల పూఁతల - భోగభాగ్యముల
       జవ్వనులను గూడి - జలజాంబకునకు
       బొమ్మలఁ గట్టిన - పొలదిండి వంగ
       డమ్ము రాచకుమాళ్ళ - డాయకఁ దొలఁగి
       సాదనలను మల్ల - చఱపుచుఁ బలల
       ఖాదులై తగుహొంత - కారులనెల్ల
       సామిచ్చి బేతాళు - సయిదోడులైన
       భీమరాక్షసమల్ల - బృందంబు వొరలు
       గరుడు లాలోకించి - ఖండాలు వూని
       మెఱుఁగు కోఱలతోడ - మిడిగ్రుడ్లతోడఁ 500
       గాటుకకొండల - గతినొప్పు సుభట
       కోటి వీరాలాప - కోలాహలంబు
       లట్టహాసములు గో - రంతయు మదినిఁ
       బెట్టక యంజనా - ప్రియనందనుండు
       దీక్షితాసురుల మాం - త్రికులను వైద్య
       రాక్షసావళిని ద - ర్భపవిత్రకరుల
       ముండితశిరుల దు - ర్ముఖుల గోచర్మ

       ఖండోత్తరీయులఁ - గాపాలికులను
       హోమవాటికలను - హోతల నూర్ధ్వ
       రోముల నేకనే - త్రుల వక్రముఖుల 510
       భయదలంబస్తన - భామల రుధిర
       నయనుల తిర్యగా - ననుల శిరోధి
       లోచనాలోకుల - లూనమస్తకుల
       గోచి వెట్టక తిరు - గు దిగంబరులను
       పొడువాటి దనుజుల - పొట్టిదానవుల
       బడుగుల ముక్కుల - పై నోటివారి
       కరములు క్రిందును - గాళ్ళు మీఁదగుచుఁ
       బరువులెత్తిడి వారిఁ - బాషండమతులఁ
       బులితోళ్ళు బూడిదె - పూఁతలు జడల
       తలముళ్ళు రుద్రాక్ష - దామముల్ మెడల 520
       దేవళ్ళు చెవులఁ బ - త్తిరి త్రిపుండ్రములు
       చేవాఁడి శూలముల్ - శివజపంబులును
       గలవారి లోహిత - గాత్రులరెండు
       తలలవారిని మూఁడు - తలల రాక్షసుల
       వికృతాంగుల వికార - వేషధారులను
       వికలగాత్రులను భా - వించి యవ్వలికిఁ
       బోవుచోఁ బరిమళం - బులు మేనఁబూసి
       గోవజవ్వాది చె - క్కులవెంట జార
       తమయురసి గల మం - దారదామముల
       ఘుమఘుమ ల్దిశలనా - గుబ్బుకొనంగ 530
       నడపముల్గట్టు తొ- య్యలులచే యాకు
       మడపులకై కేలు - మలచు భోగులును

ననువు మిటారుల - నాలిచేష్టలకు
మనసొగ్గి మంచుదు - మారంబు నెనయు
వలిపె దుప్పటి వలె - వాటులతోడఁ
జలువ వెన్నెల బైటి - చప్పరంబులను
మెలఁగెడు విటుల యె - మ్మెలువిలోకించి,
వెలలందుఁ బుష్పలా - వికల యంగళ్లు
కనుఁగొని శూలము - ద్గర భిండివాల
ధనురస్త్రకుంతగ - దాశక్తిముసల 540
పట్టెస తోమర - ప్రాసముల్దాల్చి
ఘొట్టాణహయదంతి - కోటులతోడ
జత్తాయతముగ ల - క్షలకొలఁదికిని
మత్తిల్లు దనుజ కు - మారవర్గంబు
బలకరంబుగ నుండ - బంగరుకోట
తళుకుచుక్కలు వోవు - దారిఁ దప్పించి
యగణితంబైన ద - శానను నగరి
మొగశాలఁ జొచ్చి రా - మునిబంటు చనుచు
రెండవకక్ష్య రా - త్రించరనాథ
మండలియును, దద - మాత్యవర్గంబు 550
మణిరథంబులను, వి - మానముల్ కొలువు
గణికాజనంబు బం - గరు రథంబులును
చౌదంతులును సింధు - జములైన హరులు
సాదులు జోదులు - సైన్యనాయకులు
మానితచ్ఛత్రచా - మరకేతనములఁ
బూనెడువారును - బూమెలవారు
నందలంబులు చతు - రంతయానములు

సందడిగానుండఁ - జని కనుఁగొనుచు
నవలి యంతరమున - హరిణాది విపిన
వివిధమృగంబులు - వీణామృదంగ 560
కాహళవేణుఢ - క్కానియోజిత స
మూహంబు దశకంఠ - మూలబలంబు
శారికాకీరపం - జరములు కేకి
పారావత మరాళ - పక్షిజాతంబు
వేరువేరుగఁ జూచి - వేడుకనవలి
ద్వారంబుఁ దూరి మీఁ - దటి యుత్తరమున
నవరత్నరాసులు - నాకేశముఖ్య
వివిధోపధావస్తు - విమలాంబరములు
సాంకవమృగమద - చందనచంద్ర
రాంకవకల్పక - ప్రసవమాలికలు 570
కౌశికాగరుధూప - కనకరండ
కౌశికార్పితహేమ - కలశమధ్యములు
చంద్రహాసాదిమ - శస్త్రప్రకాశ
చంద్రికాయతనముల్ - చాల మెచ్చుచును
గనుఁగొంచు వచ్చి యా - కడ నంతిపురము
వనితలు మెలఁగు తా - వలననియెంచి
పజ్జ నున్నట్టి యు - ప్పరిగెకుఁ బ్రాకి
సజ్జికమ్మగు నొక్క - చవికలో నిలిచి
నెలఁజూచి పండు వె - న్నెలఁజూచి కెలన
జలజల ప్రవహించు - చంద్రకాంతముల 580
లోవలు జూచి యా- లోచనఁ జేసి
"దేవి యాసీత యే - దెసను నున్నదియొ?"

అనుచు నాలోకింప - నాకాశవీథి
వనజారి యుడుపశు - వ్రాతంబులోనఁ
బాయఁ జాలని వృష - భమురీతి తనదు
రేయెండచే నల - రించె విశ్వంబు!
కవ్వపు కొండకుఁ - గలిగిన శోభ
యవ్వారినిధిని పా - యక యున్నలక్ష్మి
జలములఁ గలుగు పు - ష్కర విలాసంబు
నలరినగతి మించె న - బ్జారి చెలువు! 590
వెండిపంజరములో - వెలయు రాయంచ
కొండబిలంబు నె - క్కొన్న సింహంబు
మదసింధురంబుపై - మావంతుఁడనఁగఁ
బొదలె నబ్జారి న - భోమండలమున!
రెండుశృంగములొప్పు - వృషభంబు రీతి
వెండికొమ్ములతోడి - వెలి దంతికరణి
కవశిఖరములతోఁ - గైలాసమనఁగఁ
బ్రవిమలశృంగ సం – పదఁగాంచె విధుఁడు!
భానుకరంబులో - పలఁ బ్రవేశించి
దానపంకము బోవఁ - దమముహరించి 600
తన ప్రకాశంబుచే - తను నిగళంబుఁ
గననీక చంద్రరే - ఖ దివంబు వ్రాఁకె!
ఆసమయంబున - నఖిలదానవులు
నాసవ సేవాప- రాయణులగుచు
గురు వెట్టుచును మేని - కోకలు మఱచి
పొరలుచుండఁగఁ గాంచెఁ - బురవీథులందు.
బొబ్బలు వెట్టుచుఁ - బొలఁతుల గబ్బి

గుబ్బల నొరిగికై - కొను శరాసములు
నెక్కులు వెట్టియా - యిక్క నల్గడల
నుక్కున జరియింపు - చున్న దానవుల 610
నొండొరు మెచ్చక - యురుభుజాదండ
చండిమంబులతోడఁ - జదరులాడుచును
జరియించు వారల - సతులతోఁ గూడి
పరమానురాగ సం - పద నోలలాడి
క్రీడించువారలఁ - గిన్నరుల్ మీటి
పాడుచునున్న బిం - బఫలాధరలను
గౌఁగిళులందు నం - కములందుఁ జేర్చి
లోఁగి శయ్యాశయా - ళువులైనవారి
పొలయల్క మరుమొగం - బులువెట్టి మగలు
బిలిచినఁ బలుకక - బిగువులనుండి 620
మల్లాడు పతులకు - మనసీని యటులఁ
జెల్లుగాఁ బెనఁగు రా - జీవలోచనల
నిపుణతఁ గింకిణీ - నిక్వణం బమర
నుపరతి క్రీడల - నోలలాడుచును
గులుకు టెలుంగులఁ - గూజిత మధుర
కలరావముల వల - కారి చిన్నెలనుఁ
బతులను గరఁగించి - పరవశలగుచు
జతగూడి యురముల చక్కటివ్రాలఁ
గదియించి రమియించు - కామశాస్త్రార్థ
విదులైనవారల - వేర్వేరఁ గనుచు 630
దానుల నర్థిని - దానుల సుపరి
ధానుల వివిధాభి - ధానుల సదప

దానుల రుచిరోప - ధానుల సావ
ధానుల జయసంవి - ధానుల సప్ర
ధానుల బహుయాతు - ధానులఁ గనుచు
నావల వివిధమా - యావులఁ గౄర
భావుల దీనసం - భావుల సాను
జీవులఁ గలుషోప - జీవుల మద్య
సేవులఁ గృతవీర - సేవులఁగాంచి
ధీరులఁ బోషిత - ధీరుల సమర 640
శూరుల విక్రమ - శూరుల సపరి
వారుల శౌర్యదు - ర్వారుల వరవి
చారుల దుర్గుణా - పారుల నాత్త
చారుల యామినీ - శౌరులఁ జూచి
వెంటాడు విటులను - వెతలను బెట్టి
నంటువాసి తొలంగు - నాలి తొయ్యలులఁ
గడగేలు వట్టిన - గాజులు మొరయ
విడిపించుకొనిపోవ - వెనువెంటనంటి
జడలువట్టుక నిల్పి - చరణపద్మములఁ
బడి యడిగినవిచ్చి - బ్రతిమాలుచున్న 650
వారలఁ దనయిరు - వంకల సూళ
గేరులలోన నె - గ్గించి చూచుచును
కొప్పులోఁ దురిమిన - క్రొవ్విరిదండఁ
దప్పుపైమోపి చెం - తల సఖీమణులు
వలదన్న మానక - వరులఁ దమించుఁ
వలకారికొమ్మల - వళుకులు వినుచు
జెలులు దార్చినఁ బోక - శిబ్బితిపడుచు

నిలుచుచు దలవాంచి - నెయ్యముల్ దాఁచి
పడకయిండ్లను దమ - పతులున్న యెడకుఁ
గడుప్రయత్నమున రాఁ - గన్నె పాయంపుఁ 660
జెలులఁ గరంబుల - చేపట్టి దిగిచి
తలిమంబులను జేర్చి - తరితీపు వెనిచి
కసిగాటు పెనుకువన్ - గలయు నాయకుల
రసికత్వముల భ్రమ - రంబు వీక్షించి
తొడలపై నిదిరించు - తొయ్యలి నొయ్యఁ
దొడ నెచ్చరించు కం - దువ మాటలాడి
నగుమోముతోడ పు - నారతంబులకు
నెగపోయు రమణుల - యిక్కువల్ చూచి
విటులకైదండ ను - వీథులవెంటఁ
బటువుగుబ్బలమీఁది - పయ్యదల్ జాఱ 670
ఘమ్మన మృగనాభి - కమ్మనెత్తావి
తెమ్మెర లవలి వీ - థికిఁ దావిఁగట్ట
జడలఁ జుట్టిన పారి - జాతంపు విరుల
ముడి పువ్వుటెత్తులు - మురిపంబు నెరప
ఘలుఘల్లుమన పాద - కటకముల్ మొరయ
వెలువడు వెలజాతి - వెలఁదులఁ జూచి
చలువ వెన్నెలబైటి - చప్పరంబులను
కలపముల్ పూసి కో - కలు కడవైచి
సారాయి మబ్బుల - సతులును బతులు
నూరక నిదురింపు - చునికి భావించి 680

యొకవిరిపాన్పుపై - నొంటి నిద్రించు
నొక యిందుముఖి మొకం - బొకమేడమీఁదఁ
గనుఁగొని చెంతఁ జు - క్కలరాజు తోడ
నెనవచ్చునని చూచి - యెంతయు మెచ్చి
" యీయమ్మ సీతయో? - యిటులేలయుండు
నాయకుఁ బాసి చిం - తలనొందు సాధ్వి?
ఉత్తలంబున నెందు - నున్నదో? యకట!
ఉత్తమ కులజాత - యూర్జితశీల
తనమని రాముని - తా రఘువీరు
మనసులో బాయని - మానిత చరిత
మైలచేల ధరించి - మౌనంబుతోడఁ
దాలిమిలేక సం - తాప మొందుచును
గన్నీట దోఁగు మొ - గంబుతోఁ జాల
ఖిన్నయై వలకుఁ జి - క్కిన లేడి కరణి
చదలఁ గన్నట్టి రే - శశిరేఖరీతి
పొదఁ జిక్కుపడి నెమ్మి - పొలఁతి యున్నట్లు
కగ్గువారిన పైఁడి - కమ్మి పోలికను
వెగ్గలంబగు గాలి - వీవఁ జలించు
జలదమాలికమాడ్కి - చాలనెత్తురుల
కళమాయు బాణరే - ఖయుఁ బోలి సకల
మానినీ లక్షణ - మహనీయమైన
మానవతీ శిరో - మణి మహీపుత్రి
యెచట నున్నదియకొ? - యెప్పుడు చూతు?
నిచటనిల్చి విచార - మేల నాక ? "నుచు
" నగరిలో నున్న సం - దడి యోసడిల్లె

సగము రాతిరియయ్యె - జానకీదేవి
యెందునున్నదియకొ - యీ రాచనగరి
సందులు గొందులుఁ - జని చూడవలయు."

--: హనుమంతుడు రావణుని యంతఃపురమున సీతను వెదకుట :--

అని సింగములుగాచు - నడవి చందమున
దనుజాన్వయంబు పె - ద్దలు వసియించు 710
సావడి మీఱి కాం - చన దంతి దంత
దేవయానములున్న - దిక్కులు చూచి
కొల్లారు బండులు - గుజరాతి కెంపు
పల్లకీలును రత్న - భద్రాసనములుఁ
గనుఁగొని యాఱవ - కక్ష్య నెగళ్ళ
వనితల కలకల - స్వనము లాలించి
తీరిన మాణిక్య - దీపికాస్తంభ
వారంబు క్రీనీడ - వచ్చి యాకెలనఁ
గుందేలు తేళ్ళు త - గుర్లునుఁ గోళ్లు
పందులేదులును జా - పలునుఁ పలునుఁ దాఁబేళ్ళు 720
నుడుములు షడ్రస - వ్యూహంబు సయిఁద
మడవి పిట్టల బుట్లు - నమరించియున్న
పాకశాలలు చెంత - పానశాలలును
వాకిళ్ళఁ బొంచి స - ర్వముఁ దేఱిచూచి
బోనపుటింటి క - పోతపాలికల
పైనిచ్చి కాంచనో - పకరణావళుల
హోమశాలలు నగ్ని - హోత్రముల్ దీప్య

ధామముల్ చూచి సౌ - ధముమీఁది కెగసి
కొలకొలమను వధూ - కోటులతోడ
నలరు రావణుని గే -హము చొరరాక 730
యందుండి మిన్నుల - నంటినప్రహరి
కుందనంపుంగోడ - కుప్పించిదాఁటి
తొలుదొల్త నలప్రహ - స్తుని యిల్లుజొచ్చి
కలయంగఁ జూచి చెం - గట మహాపార్శ్వ
నిలయంబు వెదకి దా - నికెలంకు నందు
కలిమి మించిన కుంభ - కర్ణుని నగరు
జతగూడుకొను విభీ - షణుని గేహంబు
వెతకి మహోదరు - విడిచి శోధించి
యా చక్కటిని విరూ - పాక్షుని యిల్లు
చూచి విద్యున్మాలి - చొరరాని యిల్లు 740
చొచ్చి విద్యుజిహ్వు - సోరణగండ్ల
మచ్చుపై కెగసి వెం - బడి వజ్రదంష్ట్రు
నాలయంబరసి ధూ - మ్రాక్షు వాసంబు
గాలించి సంపాతి - కనక గేహంబు
కాంచి విద్యుద్రూప - ఘనభీమ విఘన
కాంచనాగార రే - ఖలు విలోకించి
శుకశారణుల యిండ్లు - చూచి సంపదలఁ
దుకమైన యింద్రజి - త్తుని గీము వెదకి
తోడన రస్మికే - తుని యిల్లు నందు
తోడాయు సూర్యశ - త్రుని యిల్లుఁ జూచి 750
మాలి యిల్లును జంబు - మాలి గేహమును
మాలివాసము ప్రాలు - మాలక యరసి

శుకనాభశఠవజ్ర - సుందరాలయము
లఁకు వికటునా - లయము వీక్షించి
రోమసహ్రస్వక - ర్ణులయిండ్లు దంష్ట్ర
ధామంబు మత్త స - ద్మము విలోకించి
యవలన యింద్ర జి - హ్వధ్వజగ్రీవ
భవనయుద్ధోన్మత్త - భవనముల్ వెదకి
అమ్మూలను, కరాళ - హస్తిముఖాల
యమ్ములావల పిశా - చాసురు నిల్లు 760
నరసి ముంగల శోణి - తాక్షుమందిరము
దరసి యిందఱి సంప - దలు విలోకించి
ప్రతియామములకును - బ్రహరులు తిరుగు
నతివల వెలిగోడ - యంచులఁ దిరుగు
చతురంగ బలమున - సవరణల్ మెచ్చి
క్షితితనూజాతఁ జూ - చినవాఁడు కాక
యొకమేడపై నుండి - యుప్పరంబెగసి
చకచకలీను వ - జ్రప్రకాశముల
రావణు తేజః ప - రంపర చేత
నేవల మణిదీప - హేతుల వలన 770
ధిగధిగలీను దై - త్యేంద్రు నగరి
గగనమహలు మీది - కక్ష్యకు దాఁటి
యంత్రవైఖరిఁ బవ - నాహతిఁ బలుకు
తంత్రులపాటల - తానవైఖరిని
జతఁగూడి రత్నపాం - చాలికా శ్రేణి
ద్రుతవిలంబితముల - తోడి కయ్యెడలు
కని యొక్కయెడ ఘటి - కాఘంటికాతి

నినదముల్ విని యామి - నీ వేళలరసి
యారావణుని శయనా - గారమునకుఁ
జేరి యందు వినోద - చిత్రవైఖరుల
దేటగాఁ జతురసీ - తి విశేషబంధ
పాటవ లిఖిత దం - పతులఁ గన్గొనుచు
సకినల పసిఁడి మం - చములును సరము
బకదారులును రత్న - పంజరంబులను
వీర రావణకథా - వినుతులుసేయు
కీరశారికలును - కేకి మరాళ
కోలాహలంబును - గొడిగల కడల
ప్రాలంబముక్తాస - రంబుల మేల్మి
పట్టు కుడారముల్ - పరిమళధూమ
దట్టంబు పారిజా - తలతాంతదామ
రచితవితానముల్ - రంగవల్లికలు
ఖచితంబులైన చె - క్కడపు రత్నములుఁ
బచ్చరాల నివాళి - పళ్ళెరంబులును
ముచ్చటలాడుచు - మురియుచు నడచు
రమణుల నూపురా - రావంబుఁజూడ
రమణీయమైన యా - రావణు నగర
ధ్వజపటి పల్లవో - ద్ధతఝటాత్కృతుల
నిజసమాగమనంబు - నిండినపూవు
చప్పరంబులు మాట - సద్దుగానీక
నెప్పులన్నియుఁ జూచి - నెమకుచు వచ్చి 800
జాలంబు సందుల - జగతిపై యువతి
జాలంబుఁ గనుచు - కేసరి కుమారకుడు

వేళంబ యందందు - వెదకుచు నతివి
విశాలాయతన చంద్ర - శాలాంతరముల
రాజితంబులును బు - రందర ప్రముఖ
పూజితంబులును సం - పూర్ణ వస్తువుల
నూర్జితంబులును ది - వ్యోపధావిధస
మార్జితంబులును మా - యాసుర శిల్పి
నిర్మితంబులును మా - ణిక్య ప్రకాశ
నర్మితంబులును రా - వణ భుజాశౌర్య 810
పాలితంబులును న - పార విభూతి
లాలితంబులును నీ - ల మణి ప్రవృద్ధ
నీలిమంబులును గం - ధిల ధూపధూమ
కాళిమంబులు రం - గన్మాలికాంత
రామణీయకములు - రత్నవితర్ది
కామనీయకములుఁ - గాంచనకుడ్య
భాగంబులును దైత్య - భామాహితాను
రాగంబులును నైన - రాక్షస విభుని
సడిసన్న రాణివా - సముల వాసములు
పుడమిపట్టిని జూచుఁ - బూనికఁజూచి 820

--: హనుమంతుఁడు రావణుని రాణివాసమందిరములో సీతను వెదకుట - రాణివాసస్త్రీ వర్ణనము :--

కైలాసమో యిది - కనకాచలంబొ
భూలోకమునవ్రాలు - పురహూతపురమొ
యన మబ్బున మెఱుంగు - లమరిన రీతి
తనఁమీద దేవతా - తరుణులు వెలుఁగ

బహుచిత్ర కేతన - పాళితో దివ్య
మహిమతో చిత్రస- మాజంబు తోడఁ
బురములో నెన్నియ - బ్బురములో దానఁ
దిరముగా నన్నియుఁ - దీఱిచి నిలుప
వైడూర్య భుజగముల్ - వజ్రప్రకాశ
నీడజంబులును మ - ణీపుత్రికలును 830
చతురంగ బలముల - సామజమధ్య
శతపత్ర వాసలు - జతకట్టియున్న
పరమకల్యాణ పు- ష్పక విమానంబు
హరిశేఖరుఁడు చూచి - యబ్బురమంది
యందుపై జానకి - నరసి లేకున్న
డెందంబులోని క - డింది ఖేదమున
"నెచ్చోట వెదకుదు? - నేమి సేయుదును?
వచ్చియుఁ గననైతి - వసుమతీ సుతను"
అని మున్ను చూచుచు - నాపుష్పకంబు
వినువీథి దేవతా - విభుల యానముల 840
మీఱి యపారమై - మిన్నెల్ల నిండి
యేరిచేతఁ గొలంది - యేర్పడనేని
కందువలను విశ్వ - కర్మ నిర్మింప
నందమై యునికిఁదా - నచటికి మఱలి
తపముచే నతుల ప్ర - తాపంబుచేత
నపరిమితంబౌ మ - హానుభావమున
సాధించి యింట పూ - జలు సేయు దనుజ
యూధవుని విమాన - మొయ్యనఁ జొచ్చి

వచ్చినచోటికి - వచ్చువెండియును
జొచ్చినచోటికిఁ - జొచ్చు తదీయ 850
మహిమంబులకు మెచ్చు - మణి గవాక్షముల
విహరించు సీతను - వెదకు నీయెడల
పావనమై పుణ్య - భవనంబురీతి
శ్రీవెలయింపుచుఁ - జింతితార్థములు
స్వామికి నొసఁగుఁచు - జనియెడి చోట
నేమేరఁ దలఁచని - యెడల కేఁగుచును
నిలువఁ దలంచుచో - నిలుచుచు లోక
ములు మూఁడును ముహూర్త- మునఁజూచి మఱల
సాధకంబై రణ - స్థలముల నిర్ణి
రోధకంబయి భాను - రోచుల నమరి 860
బహులకేతనముల - బహుకోణములను
బహుకలశంబుల - భావచిత్రముల
రాక్షస ప్రతిమాధు - రంధరత్వముల
వీక్షింపఁదగి చూడ - వేఱొక్కయెడల
జేసిన ప్రతిమలు - చిఱునవ్వు నవ్వ
వ్రాసిన లతికలే - వలఁ బువ్వులీన
మలచిన కంబముల్ - మాఱాకులెత్త
నిలిచిన పుత్రికల్ - నిలిపి మాటాడఁ
గరువులఁ బక్షులు - కలకలఁ బలుకఁ
బఱచు పుల్గులు చిత్ర - భావముల్ దాల్పఁ 870
జేతనావళియు న - చేతన శ్రేణి
యీతెఱంగిదియని - యేర్పడనీక
బయలంచుబోఁ గుడ్య - భాగంబులగుచు

బయలౌచు మణికుడ్య - భాగముల్ దోఁచి
వేడ్క సేయు విమాన - విభవముల్ తనదు
చూడ్కుల కరిది మె - చ్చులు పాదుకొల్ప
యోజనాయత మర్థ - యోజన విస్తృ
తాజీరమునునైన - యాదశాననుని
శయన గేహమునకు - జని నిశితాసి
శయనులై ధీర రా - క్షస భామినులను
నలుగడ మూఁడును - నాలుగుదంత
ములతోడి భద్రేభ - ములవిలోకించి
జలజంతువుల మీఱు - జలధియుఁ బోలి
కొలఁదిమీరిన వధూ - కోటులచేత
నలబలంబగు శయ - నాగారమెల్ల
గలయఁ గన్గొనుచు రా - ఘవ కింకరుండు
నచ్చటి భక్ష్యభో - జ్యాది వస్తువుల
మెచ్చులచూడ్కి కా - మెతలు సేయంగ
నందులఁ దడసిన - యనిలుడు సుతుని
విందునకై పిల్చు - విధమునఁ దనకు
నచ్చటి వస్తువు - లాఘ్రాణమునకు
నచ్చవు వేడ్క సే - యఁగ డాయనేఁగి
యావిమానములోని - యరల చెల్వంబు
లావాడ లివియవి - యనరాకయుండ
మిగులవేడుక సేయ - మెట్టెకమణుల
దిగదిగ వెలుఁగ జో - తికి నడ్డమైన
కడల నిల్చిన మర - కతపుటేనుఁగుల

కడనున్ను నీలాల - కంబముల్ చేరి
యాభవంతిని చుట్టి - యందుకు నడుమ
నీభవంతము గాన - మెచ్చోట? ననఁగ 900
నెగయుచున్నదొ! మింటి - కెగసి తావచ్చి
జగతివ్రాలెనొ! పైఁడి - జగతి ననంగఁ
బదియాఱు వన్నియ - పసిఁడి కంబములు
పదియారు కలిగి తా - పనమగఱాల
చీర్ణ దంతమునను - జిక్కినపంచ
వర్ణ రత్నములరు - వారంపువెల్ల
జల్లుల నునుబురు - సాచందువాలఁ
జల్లని పువ్వుల - చప్పరంబులను
పలకకప్పురపు ధూ - పకరండకముల
మెలఁగెడు పెంపుడు - మెకములు గలిగి 910
యొప్పుల కుప్పయౌ - నొకపెండ్లి చవికె
ఱెప్ప వేయక భళి - రే! యంచుఁ జూచి
యచ్చట జూజంబు - లాడి యోడినను
రిచ్చలు పడిన య - ర్థి కుమాళ్ళ వోలి
కదలని మణిదీపి - కాస్తంభములకు
నెదమెచ్చి యాపడ - కింటిలోపలను
మదిరాగృహముఁ జూచి - మధుపానమత్త
మదవతీ మణులందు - మ్రాన్గన్ను వెట్టి
యాచెంత నిదురింప - నందఱుఁ దేఱి
చూచి మృగాంకుండు - చుక్కలలోన 920
విలసిల్లుగతి నర - విరి విరిశయ్య
తలగడమీద ని - ద్రారతుండైన

రావణుఁ గొంత దూ - రంబునఁ జూచి
యీవలావలివార - లెఱుఁగక యుండ
మెల్లమెల్లనె వచ్చి - మింటిపై నుండి
త్రెళ్లిపోవని చుక్క - తెఱవలో యనఁగ
నడుగులఁ దొడిగిన - యందియల్ వీడ
జడలఁ జుట్టిన పారి - జాతముల్ జాఱ
మొనయు నిట్టూర్పులు - ముసుఁగులు గదల
చనుగుబ్బలందు కం - చలియలు బిగియ 930
చెక్కుల మకరికా - చిత్రముల్ చెదర
మొక్క లేఁజమరులు మొగములన్ గమ్మ
కమ్మలు తలగడ - కడలందు వెలుఁగఁ
దమ్ములవంటి కం - దళుకులు మొగుడఁ
బచ్చికస్తురి పూఁత - పఱపుల నంట
గచ్చుమోవులు వీటి - కాసక్తిఁ జిటుల
పొరలి మణీసరం - బులు చిక్కువడఁగ
నెరికలూడిన జాఱి - నీవులు వదల
కరవలికాసూత్ర - కలితచాంపేయ
సరములరీతి కాం - చన తనూలతలు 940
మెఱయంగ నిదురించు - మెలఁతలచాలు
దరియంగఁజేరి యం - దఱఁ జూచునపుడు
హాలారసోన్మత్త - లగుటచే మేని
చేల లెఱుంగక - శిబ్బితి లేక
గరడకిన్నర యక్ష - గంధర్వఖచర
సురసిద్ధచారణ - సుందరీమణులు
రావణుదైర్య శౌ -ర్య విలాసగతులు

భావించి వలరాజు - బారికిఁ దగిలి
వలచి చేకొనుమని - వచ్చినవారు
కలన నోడినవారి – కన్యల నెల్లఁ 950
జెఱలుగాఁ పట్టి తె - చ్చినవారు చెలుల
యొఱపులు విని కని - యును జగత్రయిని
వలెనంచుఁ దెచ్చిన - వారునుఁదనదు
కులములోఁగల పెండ్లి - కూఁతులౌ వారు
దేవతల్ కప్పముల్ - దెచ్చి చేకాన్కఁ
గావించువారు లం - కాపురిలోన
నగరికిఁ దగిన సౌం - దర్యముల్ గలుగు
మగువలు బవళించి మత్తాయిఁ గొనుచు
దశకంధరుండని - దండనున్నట్టి
శశిముఖిఁ గౌఁగలిం - చఁగ నున్నవారు 960
నొకతె బింబాధరం - బొకయింతి గమిచి
సకినలరీతిఁ గొం - చక పల్కువారు
"రావణ ! దక్కితి - రా! నీకు” ననుచు
నావలి చెలి రతు - లాసించువారు
కలవరింతలఁ దొంటి - కాముకశ్రేణిఁ
దలఁపుచు బెదరి చెం - తలు చూచువారు
యుపరతి నొకతెపై - నొకకొమ్మ గదిసి
నిపుణత మరుకేళి - నిఁ బెనంగువారుఁ
దన చన్నులని పయ్యె - ద చెఱంగు చెంత
వనితగుబ్బలమీఁద - వైచినవారుఁ 970
దలగడయని యొక - తరుణిపై దమదు
తలలుంచి యురక ని - ద్రలు పోవువారు

నొకతెపై నిరువురు - నొకతెపై నేవు
రొకయంతఁ బవళించి - యుండెడివారు
"తెచ్చి నీతఁడు రాము - దేవేరి మనల
నిచ్చలో గైకొనఁ - డిఁక" ననువారు
నొకతె వల్కిన మాట - యొకచెలివేఱె
యొకయుత్తర మొసఁగ - నూకొనువారు
నై యుండఁ జూచుచు - హనుమంతుఁ డవల
చాయఁ బోవఁగ నొక్క - చక్కటియందు 980
నెడలేక శయనించు - నిందఱు సతులు
గడెయైన దశకంఠుఁ - గానక యున్న
నిలుపోవలేక వా - నికె దక్కెసీత
వెలిగాఁగ వలపులు - వెదఁజల్లుచున్న
వారలఁజూచి రా - వణుఁదేఱి చూచి
"యౌరౌర! యింతభా - గ్యముఁ గల్గియుండి
చెడుబుద్ధియేల వ - చ్చెను? దశాననుఁడు
పుడమిపట్టిని రఘు - పుంగవుఁజేరి
యెప్పగించిన వీని యొ - చ్చంబు లెల్లఁ
గప్పుగా! యంత భా - గ్యము సేయునేమొ! 990
సీతను దెచ్చి యి - చ్చిన వీనిపుణ్య
మీతెఱంగని పల్క - నెంతవాఁడోపు?
కృతకృత్యుఁడైన సు - గ్రీవునికీ ర్తి
యతిశయంబగు సుకృ - తార్థుఁడౌ నతఁడు
నదియేల నేఁజేసి - నట్టితపంబు
తుదిముట్ట యేను జెం - దుదు మహోన్నతులు!
కాదని నాస్వామి - కమలాప్తసుతుఁడు

వైదేహిఁ దెచ్చు రా - వణునికి బదులు.
ఈ నిదురించు నే - నింటిలో సతుల
వానరావళిచేత - వడి విడిపించి 1000
చెఱలు వట్టించిన - చేసిన ప్రతిన
యిదియౌ నతనికి - నట్టి వేడుకలు
కన్నులఁ జూచినఁ - గా నాదు తనువు
పన్నలు వొగడ సా - ఫల్యమ్ము నొందు!
అక్కట! యిట్టి మ - హానుభావుండు
చక్కని యిటువంటి - సతుల గడించి
సీత యొక్కతెకునై - చెడఁగోరినాఁడు
ధాతవ్రాసిన వ్రాఁత - తప్పు రాకునికి!”

-:హనుమంతుఁడు నిద్రించుచున్న రావణాసురునిఁజూచుట:-

ననుచు మౌక్తిక ధవ - ళాతపత్రంబుఁ
గనకచామరయుగ్మ - కము వానినడుమ 1010
నవరత్న సింహాస - నంబు నశోక
నవమల్లికా ప్రసూ - న స్రగన్వితముఁ
బట్టెమంచము పువ్వుఁ - బానుపు మెఱుఁగు
పట్టుతలాడయు - బటువు బిల్లలును
బానుపు మీఁదటఁ - బవళించి నిదుర
చేనున్న రావణుఁ - జేరి వీక్షించి
యుడిగపు బిత్తరు - లోలగింపంగఁ
గడల గద్దియలును - గంబళంబులును
బురనీసులుంజూచి - పూర్ణేందువదన
లిరువురు చామర - లిరుగడ వీవఁ 1020

గడమంచమున నుండి - గాజులు మొరయఁ
దొడరెడు నలఁతి ని - ద్దురల సోలుచును
కళుకుఁ గమ్మల డాలు - గల్లపాళికలు
జలపోతవోయు కాం - చన కంకణములు
గలుఘల్లుమనఁగ వ్రే - కపుఁ జన్నుదోయిఁ
గలపముల్ చెదరంగఁ - గదలికఁ దెలుపఁ
గొప్పులన్ దురిమిన - కుసుమముల్ జాఱఁ
జప్పుడుగాఁ దాళ - సంగతుల్ మొరసి
తొడలు జోకొట్ట ని - ద్దుర వోవుచున్న
నొడయుని దనుజుకు - లోత్తంసుఁ గాంచి 1030
పదియడుగుల మేర - పాటికి వెనుక
కొదుగుచు వచ్చితా - నొకచెంత నిలిచి
యైరావతము కొమ్ము - లానిన నాల్గు
జీర లురంబుపైఁ - జెలువొందువాని
నగవైరి వజ్రంబు - నాఁటుగాయంబు
నెగుభుజంబుల మీఁద - నెసఁగెడువాని
హరిచక్రహతిఁ జిన్కు - లైన కంధరను
పరిమళంబులు పూని - పవళించువానిఁ
దలకిరీటము చెంతఁ - దలగడ నుంచి
యలరు దండలు చుట్టి -యలరెడువాని 1040
మధుపానవాసనా - మహిమంబుఁ దెలుపు
నధికంబులగు నూర్పు - లడరెడువానిఁ
పంచాననములొప్పు - ఫణిరాజులనఁగఁ
గాంచనాంగదభుజా -ర్గళములవాని
గుంకుమగంధంబు - ఘుమ్మన మైన

లంకారముగ దుకూ - లము వైచువాని
దేవాసురాదులు - దృష్టింపరాని
లావును శౌర్యలీ - లయుఁ గల్గువాని
నిద్రచే నిసుము ది - న్నియమీఁద నున్న
భద్రేభమనఁగఁ జూ - పట్టినవానిఁ 1050
దనచుట్టు గాంచన - స్తంభదీపములు
కనఁగన వెలుఁగఁ బ్ర - కాశించువానిఁ
జరణభాగంబుల - శయనించి మేను
లెఱుఁగని యుడిగంపు - టింతులవాని
రక్కెస జాతిని - రాజైననేమి
చక్కదనంబున - సరిలేనివాని
నల్లనివానిఁ బ్రా - ణంబులఁ గడవఁ
బల్లవాధరలెల్లఁ - బాటించువాని
జగదేకవీరు వై - శ్రవణునిఁ జూచి
పొగడుచుఁ బవమాన - పుత్రుఁడాచెంతఁ 1060
బడక కైదువలఁ గం - బములతో నొరిగి
యొడ లెఱుఁగక కూర్కు - చున్నకామినులు
నాటల పాటల - నడవడియున్న
నాటకశాలల - నాళీకముఖుల
మగలపై నురికిన - మాడ్కి మద్దెలలు
తగఁ గౌఁగలించి ని - ద్రలు వోవువారి
నురముల వీణియ - లునిచి కుడ్యముల
నొరిగి బయల్ మీటు - చున్న కామినులు
తప్పెటల్ తమభుజాం - తరములఁ బొదివి
ఱెప్పలు మూయు నా - రీశిరోమణులు 1070

నడుగులు తొడలపై - ననుచుక తూఁగి
పడుచున్న బిరుదుల - పడుచు గుంపులును
తాళముల్ దప్పంగ - తంబురాల్ మీటి
యాళతుల్ మఱచు శ - యాళుభామినుల
విటుల వాతెఱలాను - విధమున సంకు
లటువట్టి యురకున్న - యలినీల కచలఁ
గిన్నరల్ చన్నులఁ - గీలించిచెంత
కన్నెలపై వ్రాలు - గాయనీమణుల
సారాయిమబ్బుల - జతఁగూడి పొరలి
తారుమారైన చి - త్తరి బిత్తరులను 1080
దమ చనుఁగవ తామె - తమితోడఁబట్టి
రమణహస్తములంచు - రాగిల్లు చెలుల
కొనగోరి చిరుతసోఁ- కులు మెడలందు
నునుపుచుఁ గొసరుచు - నున్నతొయ్యలులఁ
జూచుచో నెచ్చలుల్ - చుట్టి నిద్రింప
మేచాయ పసిఁడి క - మ్మికి వన్నెలిడఁగఁ
గబరికాభరములోఁ - గల్పక దామ
నిబిరీసగంధ మ - న్నిటి నిండికొనఁగఁ
గమ్మకస్తురిబొట్టుఁ - గలనగుమోము
తుమ్మెదజవరాలి - తోఁ దమ్మి నెనయఁ 1090
దొడిగిన నెమ్మేని - తొడవులకెల్లఁ
దొడయైన యవయవ - ద్యుతులు రాణింప
రంగైన కుంకుమ - రసము పయ్యదకుఁ
గంగుల రవికె సిం - గారంబుగాఁగ
హత్తి తంబూలర - సారుణిమంబు

లత్తుక కెమ్మోవి - లచ్చనసేయ
నడుగులొత్తుచునున్న - యడపంపుఁబోఁడి
తొడలపై నందెల - తో నంఘ్రులమర
లంకామహారాజ్య - లక్ష్మియుఁబోలి
పంకజాస్త్రుని పూజ - బాణమోయనఁగ 1100
రావణు పట్టపు - రాణివాసంబు
దేవి మండోదరి - దృష్టియానంగఁ
గనిపించటయు "గంటి! - కంటి! జానకిని!
మనఁగంటి!” ననుచు సు - మాళించి యెగసి
గంతులువైచి తోఁ - క ధరిత్రి నార్చి
దంతెల కెగబ్రాకి - దాఁటి యట్టిట్టు
లానందపారవ - శ్యముచేతఁ దనదు
వానరత్వంబు స - ర్వముఁ దేటపఱచి
యంతటఁ దెలివొంది - హనుమంతుఁ "డేల
యింతమాత్రంబు నే - నెఱుఁగలేనైతి? 1110
తలఁపవచ్చునె యిట్టి - తలఁపరానట్టి
తలఁపు నాబుద్ధి కెం - తయు మోసమయ్యె!
ఇంద్రుఁ డాసించిన - నేఁటికి రామ
చంద్రుని దేవేరి - సమ్మత మొందు?
చూచితిఁ గొంచెపుఁ - జూపు వానరుఁడ
చూచి నేభ్రమసిన - చో నేరమేమి?
ఇది రావణాసురు - నింతిగానోపు!
వెదకియు సీత నే - వీక్షింపనైతి
నక్కట! వీరెల్ల - నభిమానవతులు
చొక్కుల నిదురింపు - చోఁ బాపమనక 1120

 
చూడరానివి యెల్లఁ - జూచితి మదిని
వ్రీడ యించుక లేక - వ్రీడావతులను
కపినేను వీతరా - గ వికారమతినిఁ
గపటంబుతో వీరిఁ - గనఁగోరి యేను
రాలేదు వీనింట - రామునిదేవి
బాలిక లున్నట్టి - పట్టునఁగాని
యుండ దొక్కెడ నన్న - యూహచేనింత
చండించి సతులతో - జరియింప వలసె!”
అనుచు రావణు మనో - జాహవ కేళి
జనితశ్రమాలస - స్వాంతయు నుదిత 1130
హాలారసావశ - తాంగియునైన
యాలేమ నెడవాసి - యవ్వలి కరిగి
మీనమేషము లెంచ- మేరగాదనుచు
మీనమేషాదిమా - మేయ మాంసములు
బూజగుండల నించి - పూన్చిన మధువు
రాజులకైన సా - రాయి తత్తెరలు
బహుమద్యములుగల్గు - పానమందిరము
విహితవైఖరిఁ జేరి - వెలితి గిన్నెలును
నిండు సారాయి గి - న్నెలు గొంతద్రావి
యుండిన మధువుతో - నున్న పళ్లెములు 1140
నంజి డించినయట్టి - నంజుడుల్ తాటి
ముంజెలు విరిసి బ - ల్ముద్దలు పైఁడి
కొప్పెఱలును తంబు - గులు నెళనీళ్లు
కప్పుర భాగముల్ - గంధసారములు

గల దిక్కులన్నియుఁ - గలయంగఁ జూచి
కలగన్నగతి నిర్వి - కారుఁడై యలరి

-: హనుమంతుఁ డెంతవెదకినను సీతనుఁ గానక మిక్కిలి చింతిల్లుట :-


“యెందుఁ జూచియుఁగాన - నిచ్చోట సీత
యెందునున్నది యొకొ - యీవీటిలోన?
కాననేనని పోవఁ - గానెటు వచ్చు
భానుజుచే నాజ్ఞ - పడ సమ్మతించి 1150
యిన్ని పగ్గెలు వల్కి - యేవాలిసుతుని
కన్నుల యెదుటికేఁ - గతిఁ జేర నేర్తు?
పరువునఁ బోయి జాం - బవదాదులైన
దొరలకేమని పల్కు - దును మోముచూచి
హనుమంతుఁడాడిన - యట్టులో నిజమొ
యనక యుందురె రాజు - లనుచరావళిని?
ఏల ముద్రిక రాముఁ - డిచ్చె? సుగ్రీవుఁ
డేల నాతోడ ము - న్నేకాంతమాడె?
ఏనేల వచ్చితి - నీవార్ధిదాఁటి?
వానరులకు తల వంపు సేయంగ! 1160
జనకజ మృతినొందె - చావకయున్నఁ
గనిపించకున్నె లం - కాపట్టణమున?
తనదు పాతివ్రత్య - ధర్మంబుఁ దలఁచి
మనసీకయున్న దు - ర్మానంబుచేత
నీరావణుఁడు చంపె - నేమొ? కాదేని
ఘోరరాక్షస వధూ - కోటులఁ జూచి

 
దిగులుచే నెవ్వరు - దిక్కు లేకున్నఁ
దెగియెనో లేదొ? సం - దియమేల యిచట
నింకఁ జూచెదఁగాక - యే"నని యెంచి
లంకలో మరుఁగులె - ల్లను జూచి బుద్ధి 1170
శ్రీకిని కామ్యార్థ - సిద్ధికి ధైర్య
మే కారణముఁగా న - మేధమేధావి
మఱియుఁ జూచినగృహ - మాలికలెల్లఁ
దిరిగి రావణుని మం - దిరము శోధించి
సేయ నేమియులేక - చిత్తంబు గలఁగఁ
బ్రయోపవేశంబె - బాగని తలఁచి
యడియాసఁ గ్రమ్మఱ - నందిందువెదకి
సుడిసి పోరానట్టి - చోటులఁజూచి
నిచ్చెన లెగబ్రాకి - నెళవరివోలి
మచ్చులపై నెక్కి - మాళిగల్ దూరి 1180
తనతండ్రి చూపిన - దారులఁ దాను
జనుచు కాంచనగవా - క్షములందుఁ జొచ్చి
కోటలు వీథులు - గొలఁకులు వెదకి
వీటిలో బెత్తెడు - వెళపుచోటైన

--:హనుమంతుఁడు సీతనుఁగానమికి దుఃఖించి ప్రాణత్యాగముఁ జేయ నిశ్చయించుట:--



చూడని యెడలేక - చూచిన యట్టి
వాడలు క్రమ్మఱ - వచ్చి కన్గొనుచు
"అందఱిఁ జూచినాఁ - డను నింతెకాని
యెందును జానకి - నీక్షింపనైతి!”

సురగరుడోరగ- సుందరీమణులఁ
జెఱఁ జిక్కువారిఁ జూ - చి క్రమక్రమమున 1190
"కన్నులు తనకును- గలిగిన ఫలము
లన్నియుఁ గనుఁగొంటి” - ననుచుఁ దలంచి
"ఏఁటికి తనువింక? - నెత్తంగ రాము
బోఁటిఁ గానని నను - బోఁటికి!"ననుచు
మోదంబు భేదంబు - ముప్పిరి గొనఁగ
నాదశాననుని గే - హముచుట్టి వెదకి
దురుసునఁ గోటపైఁ - దొలకరి మెఱుపు
మెఱచినగతి నెక్కి - మీఁదులుచూచి
మేదిని వీక్షించి - మేను జాడించి
"లేదెందు రాముని - లేమ యీవీట! 1200
నేజనకజఁ గంటి - యీవీట ననుచు
నాజటాయువు నన్న - యనియె నాతోడ,
ఈ దశాస్యుఁడు సీత - నెత్తుక రాఁగఁ
జేదప్పి పడియెనో - క్షితి నెందునైన?
జలనిధిఁ గాంచి వి - షాదంబుతోడఁ
గలఁగుచుఁ దలక్రిందు - గాఁ ద్రెళ్ళెనొక్కొ?
దిగులుచేఁ జచ్చెనో? - తినియెనో విఱిచి
పగవూని వీఁడు కో - పముసైఁపలేక?
శారిక యరచి పం - జరములోఁ జిక్కు
మేర వీనింటిలో - మృతి నొందెనొక్కొ? 1210
సీతఁగాన నటంచు - శ్రీరాముతోడ
నేతేరున వచింతు - నేమేనితోడ?
చెప్పిన యీవార్త - చెవికొంత సోఁకి

నప్పుడే రఘుపతి - ప్రాణముల్ విడుచు!
చెప్పకయున్నచోఁ - జెందు ద్రోహంబు!
తప్పెఁ గార్యము ప్రయ - త్నము వ్యర్థమయ్యె!
అట్టి రామునిమాట - యాలించి కైక
పట్టి సౌమిత్రులు - బ్రదుకమి నిజము!
వారల తల్లులు - వారితోవారు
వారికి మునుపుగా - వాలినందనుఁడు 1220
భానుతనూజుఁడు - బ్రదుకరు దాన
వానరులకు నెల్ల - వచ్చును హాని
ననువంటి వానర - నాథులందఱును
వెనుక మ్రాఁకుల నురి - వెట్టుకయైన
బుడిబుడి తమశిరం - బులు రాలతోడఁ
బొడుచుకయైన ను - ప్పొంగువారధిని
నందఱుఁ బడియైన - ప్రాణముల్ వాతు
రిందఱి హానికి - నేనె కారణము!
కావున నేల య - క్కడి కేను బోదు?
దావాగ్నిఁబడి మేను - దరికొల్పుటొకటి 1230
కడలిలోపలి మహా - గ్రాహసంతతికిఁ
గడివోని మేను మ్రిం - గఁగ నిచ్చుటొకటి
పందనై ప్రాణాశఁ - బాల్మాలియున్న
కందమూలాదులు - గైకొని యిచట
మునివృత్తితోడరా - ముని దలఁపుచును
వనములఁ జరియించు - వాఁడనై యొకటి
గాని వేరొక జాడ - గాననే" ననుచు

మానసంబునఁ బలు - మారు చింతించి
వంచిన తలయెత్తి - వానరోత్తముఁడు

-: హనుమంతుఁ డశోకవనమునఁ గనుగొనుట :-
              -: అశోకవన వర్ణనము:-


కాంచెఁ జెంగట నశో - కమహావనంబు! 1240
కని "యిందులో వెదు - కఁగ లేదు సీత"
నని యష్టవసువుల - నాత్మలోఁదలఁచి
"యీ వనంబున రాము - నిల్లాలిఁజూచి
కావరించు నిశాట - గణముల నోర్చి
చిరతపోనిధి తప - స్సిద్ధియుఁ బోలి
ధరణినందనఁ గూడు - దశరథాత్మజుని
సేవించుకొనియుండఁ - జేయుఁడీ!" యనుచు
కేవలమైన భ - క్తినమస్కరించి
రాముని రమణిని - రామసుగ్రీవ
సౌమిత్రులను వాయు - శంకరార్కులను 1250
భావించి సేవించి - "పాకశాసనుఁడు
దేవత లిచట వై - దేహినిఁ జూపి
యందఱు ననుకూలు - లై శుభదృష్టి
నుందురు గాక నా - కూరటసేయ
నుండునొకో యిందు - నొకచోట చంద్ర
మండలాననయైన - మాతల్లి సీత?
కనుఁ గొందునో చేరి - కమలపత్రములఁ
జెనకు కన్నులు గల్గు - శ్రీరాముసతిని!”

అని కోటకొమ్మల - నడుగులుమోపి
తన కరంబులు నీటఁ - దా నీఁదు కరణి 1260
యడ్డంబుగాఁ జాఁచి -యళ్లెతోఁ బాసి
కడ్డివేసిన సాయ - కము వారినటుల
నా వాయునందనుఁ - డావనభూమి
యవరణము మీఱి - యావలఁ దాఁటి
నారికేళాశోక - నాగపున్నాగ
పారిజాతరసాల - పాటల వకుళ
పనస జంబూచూత - బదరీలవంగ
తినిస చందనసాల - తిందుక క్రముక
మాధవీకురువక -మాకందకుంద
యూధికా ముఖతరు - వ్యూహంబులెల్ల 1270
నన్నియుఁ గనకమ - యంబులై ఖగము
లన్నియు మణికాంచ - నాగంబులగుచు
నందనవనములో - ననుచైత్రరథము
నందులోఁ గల వింత - లన్నియుఁ గలిగి
తనమేనఁ బుట్టు ను - ద్ధత మారుతముల
వనపక్షు లెగయు ను - ర్వడిచేత రాలు
పువ్వులు మేనఁ గ - ప్పుకయుండ నతఁడు
పువ్వుల కొండతోఁ - బురుడు వహించి
యవి ధరిత్రిని రాల్ప - నారామసీమ
యువతి తాఁగైసేసి - యున్నట్టులుండె! 1280
అలరు పర్ణంబులు - నన్నియు రాలి
చులుకనై తరువులు - జూదంబులాడి
యోడి యన్నియుఁబోయి - యున్నమానవుల

జాడనుండియు సొంపు- సడలకయుండె!
చెదరు పూఁదేనియ - చెమటగాఁ గడల
రొదచేసి చనుమత్త - రోలంబచయము
వీడు వేనలిగాఁగి - వీడిన చేల
జాడగా నెగయు ర - జఃపుంజమెల్లఁ
గలకలాయిత విహం - గమ విరావంబు
కలకూజితంబుగాఁ - గపివీరచరణ 1290
విన్యాసపీడిత - విపినధరిత్రి
కన్యారతిశ్రమా - కారంబవోలె
గాలిమేఘంబులఁ - గడకోసరించు
పోలిక శాఖలు - ప్రోవఁ ద్రోలుచును
దనతండ్రి యిన్నాళ్లు - తనయుఁడు నచటి
పనికి రాఁడను నప - వాదంబు దీఱఁ
దడలేక తనవచ్చు - దారి వృషభముఁ
బడద్రోయుచును బాల - భానుసంకాశ
తపనీయ గుల్మల - తాతతుల్ గనుచుఁ
గపికులాగ్రణి విశృం - ఖలమదేభంబు 1300
బాగుగా మగఱాల - పలక మెట్టికల
జాగరూకత నేఁగ - జను సరోవరముఁ
గనుఁగొని దాని బం - గారు తామరల
తనివోని తావి సే - దలువోవఁ జేయ
నావల జగతి నా - మాచలేంద్రంబు
రావణునకు విహా - రప్రదేశంబు
కాంచి కేళీదీర్ఘి - కా సహస్రంబు
మించి యాగిరిని జ - న్మించిరాఁజూచి

యడుసెల్ల నపరంజి - యందలి యిసుము
పొడియెల్లఁ జుఱుకుఁ గెం - పులు ప్రవహించు 1310
నీరెల్లఁ దేట ప - న్నీరు తజ్జంతు
వారంబు నవరత్న - వర్ణనీయంబు
గాఁగ నన్నదులలో - గడల జొంపములు
వీఁగి వ్రేలఁగ దరి - విరళభూజములు
నలిగిన యట్టి తొ - య్యలిపిండు మచ్చి
కల వేడికొను భు - జంగశ్రేణిఁ బోలె!
ఆ భూమిరుహసమూ - హంబుల కనక
శోభావికాశల - క్ష్ములు తనుముంప
బాలాతపశ్రీలఁ - బరిగిన హేమ
శైలమో యనఁగ కే - సరి పుత్రుఁడలరె! 1320
ఆ పర్వతంబు పై - నపరంజి తరులఁ
జూపట్టు నొకయేరు - సుందరి మగని
తొడలపై మురియుచుఁ - దులఁదూగియున్న
వడువునఁ గననయ్యె - వామభాగమున
నపరంజి దీర్చిన - యరుగుతో విరుల
నెపమున చుక్కలు - నిలిచినవనెడు
పొడవుతో నుదిరి పు - ప్పొడి రాశితోడ
గడనాడు నీల భృం - గశ్రేణితోడ!
పచ్చనిఱెక్కలు - బలుగెంపు ముక్కు
లచ్చమౌ గోమేధి - కాక్షులు సోఁగ 1330
పవడంపు గాళ్లును - బరగిన కీర
నివహంబుతో రామ - ణీయకంబైన
నొక శింశుపావృక్ష - ముత్తుంగ భుజుఁడు

నికటభూమిని గాంచి - నీడకుఁ జేరి
యాచాయఁ జెట్టుచా - యనె ప్రకాశించు
మేచాయతో నందు - మీఁదికి నెగసి
యాకులత దొలంగి - యాకులచాటు
గైకొని "యిది యశో - కవనంబుగాని
యిదియ శోకవనంబ - టేని నామనసు
కుదురుపాటునఁ జెలం - గునె?"యంచుఁ బొంచి 1340
“లేదకొ యిచట మా - లిమిఁ జరియింప?
రాదొకో పనిగల్గి - రామునిదేవి ?
వచ్చునిచ్చటికి న - వశ్యంబుఁ గాఁగ!
నెచ్చట రావణుఁ - డిదిమాని యునుచు?
నడురేయి మీఱె! - ప్రాణములతో నున్న
పుడమి కానుపు రాక - పోవదిచ్చటికి!”
అని నలుదిక్కులు - నటునిటు జూడఁ
గనులొప్పు రోహణ - గ్రావమో యనఁగ
వెండియుఁ బైఁడియు - వెదజల్లు రుచుల
వెండికొండయె తెచ్చి - విడియించిరనఁగ 1350
వెలలేని మగఱాల - వేయుగంబములఁ
దళతళ ద్యుతుల చం - ద్రప్రభలీన
నవి యాక్రమించి మ - హాంధకారంబుఁ
గవియ నీలపు వేది - కలు వాదుకొనఁగ
నదిమీఱి రానీక - యరికట్టి కొణిగె
ముదురుఁ గెంపులు పాళ - ముగ నెండఁగాయ
దాని లోఁగొని మర - కత కుట్టిమములు
లేని పచ్చికలు గ - ల్పించి పోషింప

నాచాయఁ గడఁద్రోచి - యాణిముత్తియపు
వాచూరు జల్లు లు - ర్వర మ్రుగ్గులిడగఁ 1360
బగడంపు దంతె లా - పైఁ జెందిరంపు
నిగనిగల్ చల్లుచు - నెరజాజు నింప
నన్నియుఁ బైకొని - యపరంజిగోడ
మిన్నభవంతముల్ - మిరిమిట్లు గొలుప
నామీఁదఁ జాలఁగా - యత్నప్రకాశి
గోమేధికముల ని - గ్గులు వలవైన
దానిలోఁ దగులకఁ - దారు మాణిక్య
నానా విహంగాభి - నయములుఁ దోఁప
నవి యుంట విండ్ల చే - నందరంట నేయఁ
దివురు రత్నకుమార - దీప్తులు వెలుఁగ 1370
ఛత్రసింహాసన - చామరహేమ
పుత్రికావినియోగ - ములు విరాజిల్లఁ
గలశంబుమీఁది చె - క్కడపు రత్నంబు
పొలుపున దినమణి - పోవుచో నిలుచు
పొడవు గల్గినయట్టి - భూరిసౌధంబు
గడెసేపు చూచి రా - ఘవ కింకరుండు

-:అశోకవనమున హనుమంతుఁడు శింశుపావృక్షచ్ఛాయను సీతనుఁ గాంచుట:-


నందు చెంగట మాన - వాంగనఁ జూచి
“సందియంబేఁటికి? - జానకిఁ గంటి!"
అని రాక్షసాంగన - లాచుట్టునుండ
తనదిక్కులేమికై - తలఁగెడుదాని, 1380

మాసిన తనయొంటి - మైలతో మిగుల
గాసిల్లి యూరటఁ - గాననిదాని
కన్నీట దోఁగు మొ - గంబునఁ జాల
చెన్ను దొఱంగి వాం - చిన తలదాని
యుపవాసములఁ జిక్కి - యురగవధూటి
నుపమింపఁ దగిన ని - ట్టూర్పులదాని
మేనంత డస్సిన - మిగుల సౌందర్య
మానిత లక్ష్మిఁ దా - మానిన దాని
మినుమినుక్కను పాడ్య - మీచంద్రుఁ బోలి
తనచెల్వ మంతయు - దరిగిన దాని 1390
నిగురు గప్పినయట్టి - నిప్పును బోలి
మిగుల మైసొబగు లే - మియు లేనిదాని
సారసంబులు లేని - జలజాకరంబు
మేర మైతొడవుల - మెఱయనిదాని
భీకరాంగారక - పీడిత రోహి
ణీకాంత కైవడి - నెగులొందు దాని
కుక్కల నడుమ ద - గుల్వడు లేడి
పెక్కువ రక్కెసల్ - పీడించుదాని
వనరేఖ నొప్పు ను - ర్వరఁ బోలి తొడలఁ
గనుపట్టు జడసోయ - గము మించుదానిఁ 1400
గనుఁగొని ఋష్యమూ - కము నందు మొదట
దనుజ నాథుడు తెచ్చు - తరిఁ జూచియున్న
యెఱుకచేఁ నొకకొంత - యిట్లుండు సీత
మఱవకుమను రాము - మాటచేఁ గొంత
మొదట తాఁగనిన సొ - మ్ములమూట చెఱఁగు

ముదితచేలయు నేక - ముగనున్కి కొంత
యచటఁ జూచినయట్టి - యాభరణంబు
లిచట గానమిఁ గొంత - యితరాంగకములు
సొమ్ములన్నియుఁ దీసి - సూరెల చుట్టు
కొమ్మల నునుపఁ గ - న్గొని యొకకొంత 1410
యనుమానములు దీఱి - 'యౌనొకొ? కాదొ?
యను చింతలేక పం - చాయుధురాణి
కైవడిఁ గనుపించుఁ - గల్యాణి పరమ
పావనిఁ బావని - పరికించి చూచి
"ఈసాధ్వి సీతగా - దే! తనుకాంతిఁ
జేసె మొలాము దాఁ - జెంత మేడకును
ఇతర మానవతుల - కేడది యిట్టి
ప్రతిలేనికాంత? త - ప్పదు సీతయగుట!"
అతివ సంశయయుక్త - మగు స్మృతి కరణి
నతనాభి పడిపోయి - న సమృద్ధి యనగ 1420
తరళలోచన విహ - తశ్రద్ధ రీతి
అరవిందముఖి వ్యర్థ - మగు నాశకరణి
చెలియ వమ్మగుఁగార్య - సిద్ధియ పోలి
పొలంతి కలంగిన - బుద్ధికైవడిని
తరుణి యుక్తాపరా - ధసమాఖ్యమాడ్కి
భరతాగ్రజుని బాసి - పరితపించుచును
విన్నబాటున నుల్కి - వీక్షించి తాను
విన్ననై సదసద్వి - వేకంబులేక
యర్థి వల్లింపని - యాగమవిద్య
యర్థాంతరముఁ బొందు - నట్టివాక్యంబు 1430

కరణి నౌఁగాములుఁ - గననీక యున్న
ధరణితనూజ వ - ర్తన మాలకించి
“కమ్మలు గాజులు - కడియముల్ దాల్చి
సొమ్ములు చూచియఁ - జూడనివెల్ల
నచట నిచట నున్కి - యనుమానమేల?
యచలాతనూజు యౌ” - నని నిశ్చయించి

-:అశోకవనమున దుఃఖతయైన సీత పరిస్థితిఁ జూచి హనుమంతుఁడు విచారించుట:-


ఈయమ్మ కొఱకునై - యెన్ని దుఃఖముల
రాయిడిఁ బడుచు శ్రీ - రాముఁడున్నాఁడు?
వనితగా యనుచు భా - వనసేయుఁ గరుణఁ
దనవెంట వచ్చెగ - దాయన్న వగపు 1440
చక్కని యిల్లాలి - క్షణమైన బాసి
యొక్కఁడు నిలునోప - కున్నట్టి వలపు
వలరాజుచేత ని - ల్వఁగరామి యెన్ని
యలమటలకు నోర్చు - నకట రాఘవుఁడు!
అటువంటి ప్రాణనా - యకు నెడవాసి
యిటువంటి ప్రాణనా - యిక నెడవాసి
ప్రాణముల్ వీరలు - వట్టుక యున్నఁ
ద్రాణలకును మెచ్చఁ - దగుగాక యిట్లు
పలువరించుటలు చె - ప్పఁగ నేల యిట్టి
చెలువముల్ గలవె? రా - జీవనేత్రులకు! 1450
ఈ రామ నెడవాసి - యిన్నాళ్లు బ్రదుకు
నారామునిదియె ధై - ర్యము మఱికలదె?”

అని తలయూఁచి తా - నాత్మలోఁ బొగడి
జనకతనూజఁ బ్ర - శంసించి "యిట్టి
పరమపతివ్రతా - భరణమిట్లైన
నొరులు కాలముఁ నోర్చు - నుపమ నేరుతురె?
ఆదిగర్భేశ్వరి - యైనట్టి సీత
యీదుఃఖ జలరాశి - నిందుఁ బాలయ్యె!
కులముల రూపుల - గుణముల వీరు
తులఁదూగఁ గల దంప - తులుగాన ధాత 1460
యోర్వక యిట్టి వి - యోగంబుచేత
నిర్వహింతురె వీరు - నిమిషంబు బాసి?”
అనికొంత సేపు తా - నాత్మఁ జింతించి
హనుమంతుఁ డాసాధ్వి - యాలింపఁ బలికె
“ఈ సీతకై రాముఁ - డెందఱిఁ జంపె!
ఈసుతోడ విరాధుఁ - డీల్గె నందఱను
తునిసిపోయిరి ఖర - దూషణత్రిశిరు
లనిలోన వాలి యొ - క్కమ్మునఁ గూలె
చాయనున్నాఁడు రా - క్షస చక్రవర్తి
రావణాసురుఁ డపా - రబలంబుతోడ 1470
ఈ యమ్మచేఁ గల్గె - నినకుమారునకుఁ
బోయిన రాజ్యంబు - బొలఁతియు మఱల
నుదధి యీరమణికై - యెంటిగా దాఁటి
వెదకితి నీ రాత్రి - వీడెల్లఁ గలయ
నీపుణ్యసాధ్వికై - యెల్లలోకములు
కోపించి వరసతోఁ - గూల్చిన నేమి?
ననువంటి వారిచే - నాలుగుదిక్కు

లినసూతి వెదకించు - టేమి యబ్బురము ?
తనవెంట నేతెంచి - దండకారణ్య
వనముల నిత్యోప - వాసముల్ చేసి 1480
కందమూలముల నాఁ-కలి దీఱి క్రియల
నిందు నేమఱకున్న - యనుకూల సతిని
యీ రావణుఁడు దెచ్చి - యిచ్చోట నుంప
శ్రీరామవిభుఁడోర్చి - చింతిల్లుటరుదె?
దశకంథరుఁడు దెచ్చు - తరణి నెమ్మొగము
దశరథరాజనం - దనుఁడు చూచినను
యెండకాఁకలఁ బడి - యెడు వాఁడు చెంత
నుండిన ప్రపఁజూచి - యుత్సాహ మొందు
ననువున నేక్రియ - నలరుచో నాఁటి
యనుపమానంద మెం - తనవచ్చుఁ దనకు? 1490
పగవారిచేతఁ జే - పడిన రాజ్యంబు
మగుడఁ గైకొనిన స - మర్థుని కరణి
సీత క్రమ్మఱఁ జేర - శ్రీరామవిభుని
చేతోవికాస ల - క్ష్మికి మేర యెద్ది?
రామలక్ష్మణుల మే - రలు హృదయములు
నీమానవతి చూచి - యెఱిఁగిన దగుట
నమ్మికచేతఁ బ్రా - ణముఁ దాల్చెఁగాక
నమ్మనేడవి జీవ - నమున కన్యములు!
ఆసాసలను దన - ప్రాణ వల్లభుఁడు
'వాసవాదుల గెల్చు - వాఁడు గావునను 1500
వననిధి యింకించి - వచ్చి రావణునిఁ
దునిమి క్రమ్మఱఁ దన్నుఁ - దోకొనిపోవు'

ననియెంచి యున్నదీ - యసమలావణ్య
ఖనియైన కాంచన - గాత్రి భూపుత్రి
మానవతులకెల్ల - మగఁడె భూషణముఁ
గాన వన్నెఁ దొలఁగి - గాసిలె మిగుల!
ఈ మనోహారిణి- నెడవాసి యెట్లు
రాముఁడు బ్రదుకు? నే - రని మాటగాక!
ఏను చూచినయంత - నింతటి చింత
నానరాని విషాద - మందితినిపుడు! 1510
తననాయకుఁడు గావఁ - దాఁబ్రమోదించు
జనకతనూజ రా - క్షససతుల్ గావ
నున్నది జనయిత్రి - యోరుపు తాను
గన్నది తల్లి యే - గతి నుంటివమ్మ?
వనిత! యీ రేయి నీ - వలె మంచుచేత
వనజినీలక్ష్మి చె - ల్వము చాలమాసె!
నీకయివడిఁ గాంతు - నెడవాసి చక్ర
వాకి యీకియలార్చి - వగలపాలయె!
ఈ యశోకము నీకు - నింతశోకంబు
సేయునే యిదివిధి - చెయిదంబుఁ గాదె!” 1520
అని పల్కుచును - నసిలతల్ దాల్చి
కినిసి కోపించి జం - కింపుచు నున్న
యేకకర్ణ వికర్ణ - యేకాక్షి చండి
కాకాస్య లంబోష్ఠి - గజకర్ణ హ్రస్వ
కర్ణలంబోదరి - గజపాద ధూమ
కర్ణ లంబస్తని - కాలినీజటిల
యజముఖి మహిషాస్య - హరివక్త్ర శునికి

గజముఖ నిటలాక్షి - గర్దభరోమ
లంబనాస పిశాచి - లంబాస్య ధూమ్ర
లంబకర్ణ ప్రలంబి - లంబనితంబి 1530
యేకపాద త్రిపాద - హేమకకేశి
ఘూకాక్షి గోకర్ణ - గోష్పద త్రిజట
యనువారు మధురుధి - రాపూపమాంస
కనదురు కరపుటి - కాంస్య పాత్రికలఁ
ద్రావుచు కాయలు - తలుపును గలుగఁ
బ్రేవు తంత్రులు గట్టి - పెద్ద యెమ్ములను
నొళవు లేర్పఱచి చి - ట్టురువడి వీణె
వెలిమీటుచును బాడు - వెకలి రెక్కెసలు
తందనానలు పాడి - తప్పుతాళములఁ
జిందులు ద్రొక్కుచుఁ - జెలరేఁగువారు 1540
బెదరించువారు పే - ర్పెడు కల్లుద్రావి
నిదురించువారు నౌ - నిర్జరాహితుల
నెలఁతలఁ గనుఁగొని - నిజపుణ్యభరము
తలఁగిపోయినఁ దోఁచు - తారచందమునఁ
గమలాప్తముఖ బహు - గ్రహములలోన
హిమధాముఁ బాసి రో - హిణి యున్నకరణి
నీరద మాలికా - న్విత శోభయైన
శారద యామినీ - శశిరేఖ రీతి
పంకసంకలితమై - పరగు మృణాళి
పొంకంబుతో మైల - పుత్తడి సరిగ 1550
చేలఁ గట్టుక తన - చెలువెల్లమాని
కేలుదమ్ములను చె - క్కిటిమీఁదఁ జేర్చి

బెదరి కిరాతుని - పెనువలఁ జిక్కు
కొదమ లేడనఁగఁ జూ - డ్కులు చంచలింప
జానకి శింశుప - చ్ఛాయ వసింప
మానసంబున హను - మంతుఁ డుప్పొంగి

-:సీత గూర్చుండిన శింశుపా వృక్షముపై హనుమంతుఁడు చేరుట:-


ఆ చెట్టుకొమ్మపై - నాకులచాటు,
చూచుక తానిల్చి - సుగ్రీవునకును
రామలక్ష్మణులకుఁ - బ్రణమిల్లి మదిని
సేమంబు గాంచి వ - సించి యున్నంత 1560
వేకువ జామయ్యె - విఱియంగఁ బాఱెఁ
జీకటి కుక్కుట - శ్రేణులు మొఱసె
వీదులలోఁ జది - వెడు దైత్యవటుల
వేదఘోషంబులు - వినవచ్చె నపుడు
గాయక మంగళ - గాన ఘోషముల
నాయత ప్రణవతూ - ర్యధ్వానములను
రావణాసురుఁడు ని-ద్రఁ దొలంగి లేచి
దీవించు బ్రాహ్మణ - ద్వితయంబుఁజూచి
జాఱినసిగఁ బారి - జాతంబు సరుల
పూరాలు పని పసు - పు రుమాలు తోడఁ 1570
బానుపుపై నంటి - పలుచనై చెదరు
మేనఁ బూసిన పచ్చి - మృగనాభితోడ
వలెవాటు జిలుగు దు - వ్వలువ జీరాడి
యిలరాయఁ జేఁదాల్చు - నెలనాఁగతోడ

నడిప యొక్కతె తేర - నడపంబు గట్టు
నుడిగంపు చెలిమీఁది - యొకకేలు తోడ
ముదురు కెంపులరవల్ - మొఱయంగఁ దొడుగు
పదముల దంతపు - పావాలతోడ
"స్వామి భూమాన మె - చ్చరిక" యటంచు
నామున్ను వలుకు తొ - య్యలి జోడుతోడ 1580
మదనరాగంబున మతిఁ గన్నుదోయి
తుదిఁ గెంపుఁదేఱు ని - ద్దురమంపుతోడఁ
దనకు లోఁగాదను - దమియు మచ్చరము
తను పెడరేఁచు కాం - తాళంబుతోడు
నవరత్నభాసమా - న విచిత్రకేళి
భవనతోరణ మంట- ప వితర్దికలను
నందమై తగునశో - కారామమునకు
సందడిమాని రా - సదనంబులోనఁ
దడఁ బాటువడుచు ని - ద్రలుమాని లేచి
పడఁతులు కుంకుమ - పయ్యెదల్ జాఱ 1590
గలుగల్లుమన హస్త - కటకముల్ మొఱయ
నలువు దొరంగి వే - నలులు జాఱంగఁ
బూసిన కుంకుమ - పూఁతలు చిటుల
నాసవ మదశోణి - తాక్షులు సోల
నందియల్ గోరంకి - యరపులు గులుకఁ
జెందక హారముల్ - చిక్కువడంగ
"నోయమ్మలార! మం - డోదరీ ప్రాణ
నాయకుఁడెచట ను - న్నాఁడెందు వోయె?”

అని "సీతపై విర - హముననశోక
వనమునకేఁగె నె - వ్వరిఁ బిల్వలేదు! 1600
అమ్మక చెల్ల! రం - డాలస్య మేల?
అమ్మలార! యొకఁడు - నరిగె నాయకుఁడు.”
అనుచుఁ గాళాంజియు - నడపంబు గిండి
కనకపల్లకియు ము- క్తాచామరములు
ధవళాతపత్రంబుఁ - దావి సారాయి
గవిశనతోడి బం - గరు కలశమును
గైకొని కరదీపి - కా సహస్రములఁ
గోకస్తనులఁ గూడి - కునుకుఁ బర్వులును
మేళంపు చెలుల స - మేళంబుతోడ
నేలిక గూడిరా - నిందఱితోడ 1610
వచ్చుచునున్న రా - వణుని యైశ్వర్య
మచ్చెరవుగఁ జూచి యాంజనేయుండు

-: అశోకవనమునకు వచ్చు రావణుని హనుమంతుఁడు చూచుట :-


కలకల వెలుఁగు చు - క్కలలోనఁ బొలుచు
కలువలరాజు బిం - కము మించువాని
చెఱకు సింగాణి పూ - సెలగోల లవలఁ
దొఱఁగించి వచ్చు కం - తునివంటివాని
వనమెల్ల నలరింప - వచ్చె వసంతుఁ
డనఁగ నొచ్చెములేని - యందంబువాని
జాఱి దువ్వలువు హ- స్తవిభూషణాగ్ర
హీరాంకురములాన - నెసఁగెడువాని 1620

నగుమోము లోచనా - నందంబుగాఁగ
మగువలకును జొక్కు- మందైనవానిఁ
దనుఁ జూచు కన్నులు - తడవులకై న
జనులకు నవ్వలఁ - జననీనివాని
సకల విభూషణో - జ్జ్వలుఁ బీనవక్షు
నకళంకుఁ దేజస్వి - నాజానుబాహు
జలధరవర్ణుని - శతపత్రనయను
వలమానవిభవు రా - వణుఁ జూచునంత
నాయశోకము క్రింద - నవనితనూజ
చాయనే వచ్చు రా - క్షసనాథుఁజూచి 1630
యదరుపాటునఁ బవ - నాహతిచలిత
కదళినీకాశయై - గజగజ వడఁకి
యురమూరువుల నున్న - తోరోజయుగళిఁ
గరముల నేమ్మేను - గప్పుఁ బయ్యెదను
మరువెట్టి తలవాంచి - మౌనంబుతోడ
మరుఁగు చుండఁగ రాగ - మదవికారముల
నల్లంత రాఘవా - యల్లకతాప
హల్లోహల స్వాంత - యై యున్నదాని
కోరిక లనియెడు - ఘోటకంబుల మ
నోరథంబపుడు మి - న్నులఁ బఱపించి 1640
రామునికడకుఁ జే - రఁగనాత్మలోన
నేమించె ననెడు పూ - నిక నున్నదాని
మలచి భోగము మణి - మంత్రౌషధములఁ
గలఁగెడు పన్నగాం - గన బోలుదాని
అతిభీమరాహుగ్ర - హగ్రస్తయగుచు

వెతనొందు రోహిణి - వీడ్వడుదానిఁ
గులవతియై హీన - కులజుని యింటి
పొలఁతియౌ సతిఁబోలి - పొక్కెడుదాని
నపవాదమును బొంది - యణఁగిన కీర్తి
నుపమింపఁదగి చింత - నొందెడుదానిఁ 1650
జెడిన యాజ్ఞయుఁ మఱ - చిన వేదవిద్య
యుడుగు ప్రజ్ఞయుఁబోలి - యున్నట్టిదాని
మొన మావసులు వడ్డ - మూఁకతోఁ గలఁగు
వనజినితో సాటి - వచ్చినదానిఁ
నరులాక్రమించిన - యజ్ఞవేదికను
దరలని చీకటిఁ - దవిలిన ప్రభను
నారియుండిన పావ - కార్చిని చంద్రుఁ
జేరని యామిని - సింధురేంద్రంబు
కరమునఁ జిక్కిన - కమలమాలికను
సరివోల్పఁ దగి సొంపు - చాలనిదాని 1660
మజ్జనభోజన - మాల్యవస్త్రాదు
లుజ్జగించిన దాని - నొక మైలఁగట్టి
యొక కబళము ప్రాణ - మునుప భుజించి
యొక నిమిషము తన - కొకయేఁడు గాఁగఁ
జెదరక యేప్రొద్దు - శ్రీరామచంద్ర
పదపద్మయుగళముల్ - భావన చేసి
తనకు మృత్యువుఁబోలి - తరివేచియున్న
జనకజఁ గదియంగఁ - జని రావణుండు
చావునకొడిగట్టి - సదసద్వివేక
మావలఁ దొలఁగించి - యాస నిట్లనియె. 1670

-: రావణుఁడు సీతతో తనమనోరథముఁ దెలుపుట :-


" కొమ్మ! నీవేల చె - క్కునఁ జేయిచేర్చి
కమ్మికొల్కులవెంట - కన్నీరురాల
నిలమీఁద వసియించి - యీమైలఁ గట్టి
తలవాంచి మాల్యగం - ధవిభూషణములు
కైకోక భాగ్యంబు - కడకు ద్రోచెదవు?
నాకులకాంతవై - నాకులచేతఁ
బూజలొందుచు నిత్య - భోగభాగ్యముల
రాజిల్లు! మీవిచా - రమునీకునేల?
రావణు నంతటి - రాక్షసరాజు
కావలెనని కోరఁ - గావలెగాక! 1680
కాదనవచ్చునే? - కడకంటి చూపు
వైదేహి! పాలింప - వలసి వచ్చితిని!
రసభంగమౌనని - రమణి! నేనిన్నుఁ
బొసగఁ బల్కకబల్మి - భోగింపనొల్ల !
పరకామినులు బల్మిఁ - బట్టుకతెచ్చు
సరసిజాక్షులును మా - జాతివారలకుఁ
గామింపఁ దగువారు - కంటి నేనొకఁడ
నీమేరఁ బ్రతిమాలి - యిచ్చబోనిచ్చి
యిచ్చకమ్ములు వల్కి - యేమన్నఁ దాళి
పచ్చవిల్తునిబారిఁ - బడి కలంగెదను! 1690
శరణు చొచ్చితి నీదు - చరణాబ్జములకు
బరిరంభణము చేసి - భయము వారింపు!
నినుఁగోరి యున్నవా - నికి గుట్టుపెట్టి
మనసీని పాపక - ర్మంబుచేఁగాదె?

తల జడగట్ట నీ - తరువు క్రీనీడ
బలవంతమగు చింత - పాలైతివీవు
కానవింతియకాక - కలదె యెందైన?
ఏ నిలుచుండి నీ - విటు గూరుచుండి
మాఱుమాటాడక - మౌనంబుఁ దాల్చి
యూరకే యుండఁగ - నుచితమే నీకు? 1700
వెఱవక మనురూప - వేషంబుఁదాల్చి
యరవిందముఖి! నిన్ను - నలరింపనేర్తు!
కాదన్న నాకిను - కకు నిర్వహింప
రాదెవ్వరికి జగ - త్రయిని నెన్నటికి!
వలనేల నీదు జ - వ్వనము వ్యర్థముగ
వలపెఱుంగ కశోక - వనికి నిచ్చెదవు?
పోయిన నదుల యం - బువులు క్రమ్మఱని
చాయ రానేరదు - చనినప్రాణంబు.
చేసె యపూర్వసృ - ష్టి విరించినిన్ను
నాస లీడేర నా - కబ్బితి వీవు 1710
నీయంగకములందు - నిలిచిన చూడ్కి
పాయదవ్వలికి నీ - పాదంబులాన!
ఈ యింతులకునెల్ల - యేలికసాని
వైయుండు మేల యీ - యవివేక చింత?
నాసొమ్ము నీలంక - నాశరీరంబు
నీసొమ్ము నన్ను మ - న్నించితివేని.
జనకుఁడైనట్టి మీ - జనకుని కేను
తనరాజ్యముననిత్తు - తగఁబంచి సగము.

నిన్ను శృంగారించి - నీచక్కఁదనము
కన్నియ! మఱి చూడఁ - గాఁ దలంచితిని. 1720
ఓడనెవ్వరికి నా - కోడనివానిఁ
జూడ సురాసుర - స్తోమంబునందు?
నను నీవు బ్రదికించి - నాచేతనీదు
మనసువచ్చినవారి - మనువులీడేర్పు.
రాముఁడు నారచీ - రలు గట్టి యడవి
భూమిపై నిడుమలఁ - బొరలెడు వాఁడు
నిన్నుఁ గైకొన నేర్చు - నే? వానికొఱకు
నెన్ని వేడబముల - నీవు వొల్లెదవు?
కలభాషిణి! హిరణ్య - కశిపుఁడు మున్ను
బలిమి నింద్రుఁడు తన - పట్టాన దేవిఁ 1730
గొనిపోవ మఱలఁ గై - కొన్నట్టు నిన్ను
ననుగెల్చి చేపట్టు - నా? రఘూద్వహుఁడు!
గరుడఁడు కాలాహిఁ - గబళించినట్లు
తరుణి వేకొంటి వీ - తరి నామనంబు
నలకువతోడ ను - న్నను నిన్నుఁజూచి
తలఁపుఁ ద్రిప్పఁగనేరఁ - దరణులయందు.
హరిరాణిఁ గొల్చిన - యచ్చరలట్ల
తరుణి! నీసేవ నా - తరుణులుండుదురు.
బలపరాక్రమ ధైర్య - పదవులఁ దనకుఁ
దులవచ్చు రాఁడని - తోఁచదుగాక 1740
రాముని దలఁచి క - రంగుటేకాక
యేమి సేయుదు? వేల - యేలవు నన్ను?”

అని కర్ణకటువు లి - ట్లాడినవానిఁ
గనుఁగొని సీత యాగ్రహముతోఁ బలికె.

సీతకోపముతో రావణుని మాటలకుఁ బ్రత్యుత్తరము జెప్పుట


"ఏల నీకిటులాడ - హీనోక్తు? లింకఁ
జాలింపు వలవదీ - జాలి యేమిటికి?
నీకులకాంతను - నీవు రమించి
కైకొమ్ము చెడని సౌ - ఖ్యము లిచ్చగించి.
ఏను పతివ్రత - నీమాటలాడ
నౌనె? యాసించి నీ - యంతవానికిని" 1750
అని కేలఁ దృణమంది - యాగ్రహశోక
జనకమౌ బుద్ధిచే - జనకజవల్కె.
"నినుగూడి యేవేళ - నీవుమన్నించు
వనితలకైవడి - వారి వారికిని
మగలును గల రభి - మానముల్ గలవు
తగవును గలదని - తలఁపు ముల్లమునఁ
బరభామినుల గోర - భంగంబు వేల్పు
దొరకైన వచ్చు నీ - దు విభుత్వమెంత?
చెడుబుద్ధియేల? నీ - చేటుచే లంక
చెడనున్నయది! మేలు - చెప్పెదనీకు.1760
కులమేల చెఱచెదు - కొంచెపుఁ దలఁపు
తలఁచి? దీర్ఘవిచార - తను బ్రవర్తిలుము.
కలిమి బల్ములు నాకుఁ - గనుపించి నీదు
తలవ్రాఁతచేత వ్య - ర్థముగఁ బల్కెదవు!

భానునితోఁ బ్రభ - వాయునే? రాము
నేనేల మఱతు? నీ - వెఱుఁగవుగాక
విప్రునకును వేద - విద్యనే పోలి
యప్రతిమప్రతా - పాధికుండైన
శ్రీరామవిభున క - ర్పింపుము నన్ను.
నేరముల్ చూడక - నిన్ను రక్షించు 1770
శరణాగతత్రాణ - సద్ధర్మపరుఁడు
భరతాగ్రజుండు నా - ప్రాణవల్లభుఁడు!
బ్రదుకాస కలదేని - పరమకారుణ్య
సదనాత్ముఁడౌ రామ - చరణంబెదిక్కు!
రాముఁడు వింట న - స్త్రము పూనెనేని
నీ మాటమాత్రలో - నింద్రాదులైన
సురలతో భువనముల్ - చూర్ణంబు సేయు!
పరిహరింపఁగలేరు - బ్రహ్మాదులైన!
రామలక్ష్మణుల నా - రాచముల్ భుజగ
భీమంబులై లంక - బెకలించి కూల్చి 1780
దానవాన్వయమెల్ల - దహియించి నీదు
మేను వ్రయ్యలు జేసి - మేదినిఁ గూల్చి
తరువాత నను దత్ప - దద్వయ శోణ
సరసిజంబులఁ జేర్ప - జాలు నిక్కముగ!
శునకంబు బెబ్బులుల్ - చూచిన రీతి
ననిలోన నినుఁజూచి - నపుడు రాఘవులు
దిగిరేని వారల - దృష్టింప గలరె
నగవైరి నగచాప - నలినసంభవులు?

ఎందుఁ జొచ్చెద వపు - డీవిట్లుగాక
ముందుగా రాముని - ముందర నన్ను 1790
నపరాధినని యుంచి - నప్పుడె నిన్నుఁ
గృపఁజూచి రక్షించుఁ - గీడొంద వీవు!
కాకున్న భానుని - కరములు కొంచ
మై కనిపించిన - యంబువుల్ గ్రోలు
క్రమమున రఘువీర - కనక పుంఖాస్త్ర
సమితి నీరక్తముల్ - చవిచూడఁ గలదు!”
అను మాటలాలించి - యవనిజఁ గాంచి
దనుజనాయకుఁడు క్రో - ధమున నిట్లనియె.

-:రావణుఁడు సీత మాటలకుఁ గోపించి యామె ప్రత్యుత్తరమున కరువది దినములు గడువిచ్చుట:-


మగువలకై ప్రాలు - మాలి విరాళి
మగవారు చల్లని - మాటలాడినను 1800
నంతంత బిగియుదు - రదివారి ప్రకృతి
ఇంతయు నీతల - నే వేగినది యె
మరుఁడు నీకతన నా - మది విరహాగ్ని
దరికొల్పఁ బుట్టదు - తాలిమి యింక!
సారథి విడివడు - జవతురంగముల
నేరుపుతోఁ బట్టి - నిలిపినయట్లు
కోరిక లెఱిఁగి చే - కూడనియట్టి
నారుల మీఁది మ - న్ననఁ దప్పువారి
వలరాజు తెగనీక - వారల మఱల
నలకలు దీర్చి మో - హములు గల్పించుఁ 1810

గావున నామాట - గాదని యెన్ని
యేవలు పుట్టంగ - నీవు వల్కినను
దెగజాల నరువది - దినముల దనుక
మగువ! యీరెన్నెల్ల - మనసీయకున్న
నీవేళనాఁటికి - నిద్దురలేచి
కావలెనన్న నా - కట్టడచేతఁ
జవులు మీఱఁగ బాన - సాపు విరిఁబోడుఁ
లువిద! వండుకతెచ్చి - యునుతురు నిన్ను
పొమ్మని" యప్పుడే - బోనకత్తియల
రమ్మని తనయుంగ - రము చేతికొసఁగ 1820
వలదని కేల్వెట్టి - వారించి చనవు
గలయట్టి దేవతా - కామిను లెల్ల
మండాడుటయు వారి - మనవి యాలించి
కొండంత కోపంబు - కొణుగుచుఁ దాళి
తలఁడని మఱల సీ - తమొగంబుఁ జూచి
వలవంత నున్న రా - వణుని యాగ్రహముఁ
గనుగొని చీరికిఁ - గైకోక మఱలఁ
గినుక పుట్టఁగ జాన - కీదేవి వలికె.
“ ఏల, రావణ ! నీకు - నింత చలంబు?
చాలింపు మింద్రుని - సతీఁ బట్టినట్లు 1830
రామచంద్రుని గూర్మి - రాణివాసంబుఁ
గామించువానికిఁ - గలుగునే బ్రదుకు?
ఏనుఁగు ముందఱ - నెదురు కుందేలు
పోనోపునే గెల్చి? - భుజశౌర్య నిధినిఁ
గాలకంధర భీమ - కార్ముకభంగ

శీలుని వికచరా - జీవలోచనునిఁ
గోదండపాణి ర - ఘుశ్రేష్ఠు నెదిరి
యేదండఁ జేరెద? - వెఱుఁగ వేమియును!
కామించి ననుఁ జూచు - కన్నుల నీకు
రామునిచే నీళ్లు - రాఁగల దింక 1840
జనకతనూజఁ గౌ - సల్య కోడలిని
మునిచర్య మెలఁగు రా - మునిదేవి నన్ను
నీమాట లాడిన - నిపుడె నీనాల్క
సీమవారలు చూడఁ - జీఱి పోకున్నె
ప్రియుఁడైన శ్రీరాము - పెంపుఁ దలంచి
నియమ భంగమునకు - నిలిచితిఁ గాక
నీవారితోడుత - నీలంకతోడ
రావణ! నిమిషమా - త్రంబులో నిన్ను
శపథంబువల్కి భ - స్మము సేయఁగలను!
శపియించునది నాకుఁ - జనదనికాక 1850
రాఘవుఁ బాపి చో - రప్రచారమున
లాఘవమ్మునకు నా - లయమైన నీవు
కాలంబు పెడరేఁప - గా నన్నుఁ దెచ్చి
ప్రేలెద విపుడు ద - ప్పినదేమి నీకు?
కాకుత్స్థ తిలకులుఁ - గనరైరి కాక
పోకుండ నొక్కతూ - పున నీదు శిరము
ఖండించి నీవారు - ఖరదూషణాదు
లుండెడి యమపురి - నునుపరే నిన్ను!
తెలియక కాలచో - దితుఁడవై నీకు
నలవి కానివి పల్క - నగునె” యిట్లనిన 1860

నాలించి సతులలో - నలరులు దివియ
లాలితంబైన క - ల్పక శాఖి యనఁగ
నపరంజి మొలత్రాట - నహిరాజుఁ జుట్టి
నపుడుండు మంధాద్రి - యందంబుఁ దోఁప
సొమ్ములు దాల్చియుఁ - జూడ భయంక
రమ్మయి సీత కా - రావణు మేను
కాచి పూచి ఫలించి - కడవాలు చేర
నోచని చోటీయ - నోహకం బనఁగ
చాల నాగ్రహమునఁ - "జంపుడు దీని
మేలంబు చాలు నీ - మేలునుఁ జాలు 1870
తనకు లోఁగాని సీ - తఁ బ్రభాతసంధ్య
నినుఁడు తేజముమాన్పు - నెన్నిక మీఱ
రాముని మీఁది పో - రామిచే నన్ను
సామాన్యుగా నెంచు - చలపాది నిపుడె
తెగవేతు" నని పల్కి - దిగదిగ వెలుఁగు
సగమొరఁ దిగిచిన - చంద్రహాసంబుఁ
గేలుతోఁ గూడ బి - గ్గె కవుంగలించి
మాలిమితో ధాన్య - మాలిని వలికె
"ఏలయ్య! ప్రాణేశ! - యీ సీతనీకు?
చాలరే నీకు నీ - చంద్రాస్య లెల్ల? 1880
వారేల? నినుఁగూడి - వలరాచకేళిఁ
గోరికలెల్లఁ జే - కూర్పనే యేను?
జానకి మాత్రంబు - చక్కనిదానఁ
గానేమి? మరలచేఁ - గనలేవుగాక!
త్రుంపుదువో పొందె - దో నన్ను" ననుచుఁ

దెంపుసేయుదురె ప - తివ్రతలందుఁ
దన్నునొల్లనిదానిఁ - దాఁ బైకొనంగ
నిన్నువంటి రసజ్ఞు - నికిఁ దగునయ్య?
వల" దని హేతి నా - వలి యూడిగంపు
చెలియచేతికిఁ దన - చేఁదీసి యిచ్చి 1890
తొలఁగఁ ద్రోచిన నవ్వు - తోఁ దనవెంటఁ
దలిరుఁ బాయపు దేవ - దానవ స్త్రీలుఁ
గొలువ నావలి కేఁగఁ - గోపంబుతోడఁ

-:తనచుట్టునున్న రాక్షసస్త్రీలు సీతను రావణుని కోర్కి నెఱవేఱ్పుమని నయభయముల బోధించుట:-



జలపాదియగు నేక - జట యిట్టులనియె.
“కలగంఠి! బ్రహ్మకు - కశ్యపబ్రహ్మ
తొలిచూలు యలపుల - స్త్యుండు తత్సుతుని
సూనుఁడు విశ్రవ - సుండు విరించి
కా నయనిధి కల్గె - నట్టి రావణునిఁ
జులకనగాఁగ నెం - చుట నీదు బుద్ధి
వెలితిగా కతనికి - వెలితిగాదెందు" 1900
అనుమాట వెంబడి - హరిజట చేరి
తనవంతు కలియ సీ - తకు నిట్టులనియె.
“తనమాటలో జగ - త్రయమును మెలఁగఁ
బనిఁగొను దేవతా - ప్రభుల నితండు!
ఆరావణుఁడు నిన్ను - నాసించి చెంతఁ
జేరిన నొల్లమి - సేతురే? నీవు
మదిలో వివేకంబు - మాని యీచలము

వదలవు! నిన్నుఁగా - వలసినవానిఁ
బరిహరించిన నీకు - పాపంబు రాదె!
ఎఱుఁగ వీతని కన్న - నెవ్వఁడున్నాఁడు? 1910
నామాట హితమని - నమ్మికావింపు
మో మానవతి! చలం - బుపసంహరింపు!
లేచిరమ్మ"నిన నా - లించి యాజాడ
చూచుక ప్రఘస భూ - సుతకు నిట్లనియె
“బాలవుగానఁ జే - పట్టక బిగువు
చాలించ........................దవు
నీకొద్ది వారటె - నిర్జరలోక
రాకేందు వదనలీ - రావణు చెంత
నుడిగముల్ చేసుక - యున్నట్టి వారు?
పడఁతి! నీచేసిన - భాగ్యంబు వలనఁ 1920
జేరిన రావణుఁ - జేపట్టి తేని
కోరికలన్నియుఁ - గొనసాగు నీకు
నెలనాఁగ! వలపురూ - పెఱుఁగవుగాన
వలచెను నీకురా - వణుఁ డంతవాఁడు!
అతనినిఁ జేరి మా - యమ్మ నామనవి
హితముగాఁ గనుమన్న” - నెడ దూరి నిలిచి
ధర్మాసనము వల్కు - తగువరింబోలి
దుర్ముఖి జానకి - తో నిట్టులనియె
“ఇందీవరేక్షణ! - యిదియేటి మతము!
మందమేలములేల - మానవు నీవు? 1930
రావణు నాజ్ఞ మీ - ఱఁగ నీవెకాదు
దేవతలకునైనఁ - దీఱునే చెలియ?

తనయింట మెలఁగునో - దక్షిణానిలము
లినుఁడు కాయునొ - వెండి యెండలీవీట
కురియునో వానలు - కొలఁదికి మీఱ!
చరియింపవచ్చునొ - శమనుని కిచట?
వెలుఁగునొ సెలవీక - వీతిహోత్రుండు?
కలఁగునొ వారధి - కడలుబ్బి మొరసి?
ఉరుమునొ మేఘంబు - లురువడిగాగ?
శిరములెత్తునొ మ్రోల - శేషాహియైన? 1940
యేఋతువుల ఫలి - యించు వృక్షంబు
లేరు చాల్సోకక - యిల పంట పండు
వాడనేరవు చుట్టి - వైచినపువ్వు
లీడెవ్వరీ రాక్ష - సేంద్రుని కబల!
నీవెంత? యతడెంత - యెక్కడికెక్క
డావల నీకెద్ది - యాధార మొకటి?
చెప్పినయట్ల చే - సినగాని నీకుఁ
దప్పిపోవచ్చునె - తమచేతఁ జిక్కి?
తెగఁ జాలకున్నచో - దెలియకున్నావు
దిగమ్రింగుదునొ పట్టి - తిత్తి యొల్పుదునొ! "
అనునంత మఱికొంద - రాచుట్టుఁ జేరి
జనకజఁ జూచి రో - షమున నిట్లనిరి
" అడవులలోపల - ననదయై చిక్కి
యిడుములఁ బడి నిన్ను - నెడవాసి నపుడె
బ్రతుకునొ బ్రదుకఁడొ - భామిని! యట్టి
యదవమానిసి యడి - యాసలేమిటికి?
ఈతనిఁ జేపట్టి - యేనాడునీదు

చేతులో వానిగాఁ - జేయక యేల
బేలవై నీబుద్ధి - పెడతల పెట్టి
మైలవాయక యిట్టి - మ్రాకు చేరితివి? 1960
మనుజకామిని గాన - మనుజునిఁగాని
మనుజాశనుని పొందు - మానుదునన్న
మానుదుమే నిన్ను - మర్దింపక" నిన
జానకి యాదైత్య - సతులకిట్లనియె


-:సీత వారిమాటలకుఁ బ్రత్యుత్తరమిచ్చుట :-



" దనుజుల దనుజకాం - తలు మనుజులను
మనుజాంగనలను కోరు - మాట నిక్కువము
ఇలయెల్ల నేలిన - నిడుముల బడిన
పొలఁతులకును దైవ - ములు ప్రాణవిభులు
రాముని చరణసా - రసములు గాక
నామది నేల య - న్యంబులు దలఁతు? 1970
ఛాయకు సూర్యుఁడు - శచికి నింద్రుండు
నాయరుంధతికి జో - డై వశిష్ఠుండు
రోహిణీసతికిఁ జం - ద్రుడు సుకన్యకు
నూహింపఁ జ్యవనుడు - నుర్వి శ్రీమతికి
కపిలమౌనియును స - గరుఁడు కేసినికి
కృపనేల దమయంతి - కిని నైషధుండు
జతగ సావిత్రికి - సత్యవంతుండు
శ్రిత చంద్రమతికి హ - రిశ్చంద్ర విభుడు
భామ కుంభజునిలో - పాదముద్ర కెట్టు
కామింపఁ దగుదు రా - కైవడి చూవె 1980

రామచంద్రుండె నా - రమణుఁడుగాక
కామింప నేర్తునే - కడ వాని నేను?”

-: రావణుని ప్రేరణచే సీతచుట్టును గాపున్న రాక్షస స్త్రీ లామెను రావణుని ప్రేమింపకున్న చంపెదమని భయపెట్టుట :-

అన విని యతి వికృ - తాకారులైన
దనుజ కామినులెల్ల - తను వెఱపింప
నాచోటు వాసి యా- హనుమంతుఁడున్న
పూచిన శింశుపా - భూరుహచ్ఛాయఁ
జేర నన్నియుఁ బరీ - క్షింపుచు నతఁడు
దారిఁగాకునికి చెం- తల వినుచుండఁ
గన్నీరు రాలంగఁ - గడకొమ్మ వట్టి
యన్నెలంతుక నిల్చి - యడలుచు నుండ1990
“నేటికి నడలెద? - వేడ్వకు” మనుచు
వేఁట దీమముఁ బోలి - వినత యిట్లనియె.
"నిద్దురయును గూడు - నీవు వర్జించి
ముద్దియ! దినము రా - ముఁడు రాముఁడనుచు
పలవరించిన నేమి - ఫలమింత నీకు?
సులభమె రావణా - సురునిఁ గాదనఁగ?
ఏముమ్రింగెడు వేళ - నేమన నేర్తు?
రాముఁడేకైవడి - రానేర్చు నిటకు?
ఏల యీమరులు? నీ- యెల జవ్వనంబు
బాల! వీఱడిఁ బోవ - బ్రదుకాస పడవు!2000

 
ఇంకఁ గాదంటివే - నేవైతు నిపుడ
యంకిట నాఁకటి - యంకిలితీర!”
అనునంత వికట హు - మ్మని ముష్టివట్టి
తనకేలు పొడవెత్తి - దండకుఁ జేరి
"ఎవ్వరు వలదన్న - నేమాన దీని
క్రొవ్వు మాన్పక!” యంచు - కోపించి పలికె.
"సీత! నీకొఱకు మ్రు - చ్చిలిపోయి సగము
రాతిరివేళ మా- రావణాసురుఁడు
మారీచుఁ బురికొల్పి - మైడాఁచి నిన్ను
కోరి వేడియుఁబట్టు - కొని వార్ధిదాఁటి 2010
మోచుక తెచ్చి యీ - మూలలఁ బెట్టి
కాచియుండగ మమ్ముఁ - గట్టడచేసి
యీపాటు బడుటెల్ల - నేనొల్ల ననుచుఁ
బాపజాతివి నీవు - పలికెడు కొఱకె?
రాముఁడు నిన్ను జే - రఁగ సమర్థుండొ?
కామించి తెచ్చురా - క్షస నాయకుండు
ఒప్పక విడుచునొ? - యో యమ్మ! చాటి
చెప్పితి చెప్పితి - చేతనైనట్లు
యెటులైనఁ దప్పులే - దిఁకమీద మాకు
చిటుకవైచిన యంత - సేపు నేఁదాళ2020
నామీఁది ఫలము నీ - వనుభవించెదవు!
మామాట విని నాదు - మనవి యీడేర్పు
మీ రావణునకు నీ - విల్లాలవైన
నోరామ! నిన్ను మం - డోదరి మొదలు
వెలఁదులు గలరేడు - వేలు రావణుని

కులకాంత లందఱు - గొలిచి యుండుదురు!
ఒప్పుమీ" వనిన చం - డోదరి కంట
నిప్పులు రాలంగ - నిశిత శూలంబుఁ
గేల జాడింపుచుఁ - గిటకిట పండ్లు
చాల గీఁటుచు వచ్చి - జనకజ కనియె 2030
"వీరి వారిని బోలె - వికటముల్ వలికి
పోరాదు నీకు నా - బుద్ధులు వినక
చెడనేల? రావణుఁ - జెట్ట వట్టెదవు
కడిచేసి నిన్ను నాఁ - కటికి మ్రింగుదును
నేరువు చూతము - నీవిందు నొకటి
యేరుచు కొమ్మునా - కెటులైన లెస్స!”
అనునంతఁ బ్రఘస “యీ - యవనీతనూజ
మన రావణునిఁ దీర్చి - మారుమాటాడె!
అందుకు నాజ్ఞ యీ - యలివేణి కుతికె
ముందుగాఁ గఱచి రా - మునిఁ గూడుమనుచు 2040
నెత్తురుత్రావుదు - నేనన్న” నగరి
యుత్తరు వడిగి రం - డొకమాటు మీరు"
అన యజముఖి వల్క - నందఱికన్న
మునుపుగా శార్దూల - ముఖి యిట్టులనియె
"సెలవిచ్చె రాక్షస - శేఖరుం డిపుడు
'చెలిమి రమ్మ'ని నాదు - చెవిలోనఁ జెప్పె
అడపంబుఁ గట్టెడి - హరిణియే సాక్షి
తడవేల యిదిమన - తామసంబింతె
సీత యంగము లెల్ల - చేతి నూరీల
కోత మిప్పుడె పంచు - కొంద మిందఱము 2050

పంచంగనేల? యీ - బలు రోటవైచి
దంచి సంబార సై - దంబులు వైచి
పాలవెంబడిని కు - ప్పలు చేసి తింద
మేలకిపొడి చల్లి - యెళనీళ్లు తెండు!
బందించి కాళికిఁ - బట్టిన పెద్ద
బిందె సారాయి కొ- ప్పెరలోని కల్లు
తొలువార్పు నాల్కల - త్రుప్పుడుల్ దీఱఁ
జలిదీర మనుజి మాం - సంబున్న యపుడె
వేగుజామాయె తే - వే యేకపాద
యోగిని! చండి! లం - బోదరి! వికట! 2060
ఏకాక్షి! గజపుచ్ఛ - వృకముఖి! కాళి!
ఘాకనేత్రి! యజిహ్వ! - గోముఖ! వ్యాఘ్రి!
ఈసుమాలంబుచే - నిప్పుడే వరవి
లాసంబుల నికుంభి - లావనిలోనఁ
జిందులాడుదమని” - చిమ్మి రేఁగుటయు
నందఱి నీచోక్తు - లాలించి జడిసి

-:సీత వారిమాటలకు శోకించుట:-



చేకొమ్మ వదలి హా! - శ్రీరామ! రామ!
హాకైక! హాకోస - లాత్మజ! భరత
హాలక్ష్మణా!” యని - యవనిపైఁ బొరలి
జాలిచేఁ దాలిమి - చాలక వేణి 2070
యిలమీఁద జీరాడ - నేడ్చుచు జలధిఁ
గలము చందంబునఁ - గంప మొందుచును
"పోవ వేలకొ ప్రాణ - ములు మేన నింక?

ఈ వేడుకలు చూడ - నీడిగిల్లెడునొ?
ఎంతకు నోర్చితి? - నెవ్వారి నిట్ల
కాంతుల నెడవాపి - గాసిఁ బెట్టితినొ?
ఆరాఘవునిఁ బాసి - నప్పుడు జావ
నేరని తనకు ని - న్నియును గావలయు!
బలిమిఁ జావఁగరాదు - పతియాజ్ఞ లేక
బొలియును గాదేది - బుద్ధియో తనకు? 2080
మాటలేకాని చం - పరు వీరలైన
చోటివే భూదేవి! - చొత్తు నీలోన!
ఖరదూషణాది రా - క్షసుల మర్దించు
శరచాపములకు మో - సము వచ్చెనేమొ?
మఱచెనొ నను? నేల - మఱచుఁ గారుణ్య
శరనిధి నమ్మిదా - స్యము సేయుదాని?
ప్రిదిలెనొకో తన - బిరుదంబు చేయి
వదలు చేపట్టు - వారిఁ గాచుటలు?
తెలియకున్నట్టి నా - తెఱఁ గెవ్వరైన
దెలివిడి చేసి కీ - ర్తి వహింపరొక్కొ? 2090
యెంతలేదనియెనొ - యేఁటికి తనదు
పంతంబు మాను నా - ప్రాణనాయకుఁడు?
రాలేఁడొ జలధిపై? - రాక తదస్త్ర
కీలికి వార్ధి యిం - కించుట యెంత?
నాకడ్డపడియెనొ - నాయదృష్టంబు
రాకుండ నరికట్టి - రఘురాముఁగాచి?”
అనియాస చాలించి - యసుర భామినులఁ
గనుఁగొని మఱియుఁ గొం - కక యిట్లు వలికె

-:సీత రాక్షసాంగనలతో తనమనోనిశ్చయముఁ దెలుపుట:-

“రోసితి ననుఁడు మీ - రు దశాస్యుఁ బార
వేసితి ననుఁడు నా - విభునకు జడిసి 2100
చంపుదు ననుఁడు నా - స్వామిచే తనకు
తెంపుగల్గినవచ్చి - తెగవ్రేయు మనుఁడు
మీరైనఁ గత్తుల - మెడఁ గోయుఁ డొక్క
పారిగా మ్రింగి మీ - పగఁ దీర్చుకొనుఁడు.
ఉనికితిరే జటా - యువు మూర్ఛఁ దెలిసి
ననువెదకుచు వచ్చు - నాస్వామితోడఁ
దెలుపక మానఁడి - త్తెఱఁగెల్ల నేమి
దలఁచుక యున్నాఁడొ - దశరథాత్మజుఁడు?
వచ్చిననడ్డమే - వారిధి తనదు
చిచ్చఱ కోలల - చే బీడు చేసి 2110
శరపరంపర సరా - క్షసముగా లంక
నురుమయిపో దహ - నునికి నర్పించి
రావణుఁ బుత్రమి - త్రకళత్ర యుతము
గావధియించు వే - గమె వచ్చుననుఁడు!
తనకు మృత్యువు చేర - తరియయ్యెఁగాన
కనుగల్గి యుండ వే - గమె పల్కుఁ డరిగి
ఏనున్నకైవడి - నీనీచు నగరి
మానవతీమణుల్ - మఱి దిక్కులేక
రాముని నగరి కా - రాగృహాంతమున
సేమముల్ మాని వ - సింపుదు రనుఁడు 2120

యీలంకలోపల - నింటింట సతులు
రాలఁ గన్నీరు తీ - ఱని దుఃఖములను
దమవారు రాఘవా - స్త్రములచేఁ బడిన
క్రమమున శోకింపఁ - గా వీనులలర
నవి లెస్స వినికాని - యటమున్నుగాఁగ
రవివంశతిలకుఁ జే - రఁగఁ బోవననుఁడు!
మితికట్టిపోయె నీ - మీఁద రెన్నెల్లు
నితఁడన్ని నాళ్లుండు - నేతనయింట?
కాదన విషమింత - కై కొనిరండు
నాదు విచార మం - తయుఁ దీఱు! గాని 2130
యామాట విని రాముఁ - డసువులఁ బాసి
యామఘవుని వీటి - కరిగిన నచటి
సురలెల్ల రాఘవుఁ - జూచి సంతోష
భరితులై యానంద - పరులు గానిండు!
రామునిఁ గాంచువా - రలదె పుణ్యంబు
రామునిఁ గొలుచు వా - రలదె పుణ్యంబు!
శ్రీరాముఁ బేర్కొను - జిహ్వయే జిహ్వ!
ఆరాఘవుని దేవి - యైనట్టి నన్ను
వీఁడేమి సేయును? - విచ్చలవిడిగ
వేడిపల్కులు బల్కి - వెఱపించి నన్ను 2140
మీరేమిసేతురు? - మీరు చింతించి
చేరరాకుఁడు వల - సిన జీవనములు!
ఏటికి రాఁడొకొ - యిన్నాళ్లు? నాదు
మాట వాకొనడొ ల - క్ష్మణుఁడు దానైన!
శస్త్రసన్యాసంబు - సల్పెనొ? కాక

యస్త్రముల్ పనికి రా - వయ్యెనో తనకు
చంపెనొ వారి మో - సముచేసి వీఁడు?
తెంపు సేయఁగఁ జేతఁ - దీఱకున్నదియె?
ననుబాసి తానుండు - నారాముఁ డెంత
పనియైన నెఱుఁగఁడె - భావశీలములు?"2150
అనుచుఁ గ్రమ్మఱఁ గను - లందు నశ్రువులు
చినుకంగఁ దలవాంచి - సీత యున్నంత
నారామ హృదయ మ - య్యాసుర వనిత
లారావణునితోడ - నడియాసతీఱ
నెఱిఁగింతమని కొంద - ఱేఁగిరి నిదుర
తరిదప్పెదనుచు కొం - దఱు కూర్కుకొనిరి
“మనచేతఁ దీఱదీ - మానిని హృదయ
మనురాగ మొందింప - నలయింపనేల!
చేతనైనట్లు చూ - చితిమింక బ్రహ్మ
చేతను మఱలింపఁ - జెల్లదీమనసు 2160
యురకుండుఁ" డఁను నంత - నొక చెంత నిదుర
గురువెట్టుచుండి గ్ర - క్కున లేచి త్రిజట

-:త్రిజట తన స్వప్నవృత్తాంతముఁ జెప్పుట:-



"అమ్మక చెల్ల! ని - ట్టట్టని మీరు
క్రమ్ముక సీతను - గాసి సేయకుఁడు!
ఓయమ్మలార ! నే - నొకకలఁ గంటి
నీయమ్మ తెరువిక - నేల పోయెదరు?
కలయనరాదు ని - క్కలగాని నాదు
పలుకు నమ్ముఁడు మీఁదు - పరికించుకొనుఁడు!

చెడనున్నయది లంక - శ్రీరాముపాలఁ
బడనున్నయది సీత - పదర నేమిటికి?" 2170
అన విని "యక్కక్క! - యాకల మాకు
వినుపింపు మందఱు వినఁగ వేడితిమి.
అంతియె చాలు భా - గ్యంబుఁ జేసితిమి
సంతోషమయ్యె నీ - స్వప్నంబు తెఱఁగు
వినుపింపు"మన దాన - విశ్రేణితోడ
వినుఁడని త్రిజట య - వ్విధమెల్లఁ బలికె.
ధవళచందనవస్త్ర - దామముల్ దాల్చి
నవనవంబైన దం - తపు పల్లకీని
యీసీతతోఁ గూడి - యెల్లరు గొలువఁ
గౌసల్యపట్టి రా - ఘవుఁడు రాఁగంటి 2180
ఛాయతోఁ గూడు భా - స్కరుని చందమున
నీ యమ్మతోఁగూడి - యినకులోత్తముఁడు
వెల్లయేనుఁగు మీఁద - విరుల లాజలను
జల్లుచుఁ బురిసతుల్ సందడి సేయ
ధవళాతపత్రంబు - తమ్ముఁడు దాల్ప
రవివంశరత్నంబు - రాఁ గలఁగంటి!
ఎనిమిది వృషభంబు - లెనిమిది దిక్కు.
లను గట్టినట్టి తె - ల్ల రథంబులోన
సీతాసమేతుఁడై - శ్రీరాఘచంద్రుఁ
డేతేర వేకువ - నేఁ గలఁగంటి! 2190
జనులనందఱిఁ బ్రోచి - శత్రులఁగెలిచి
తనటెంకి యైన శ్వే - తద్వీపమునకు
పట్టాభిషిక్తుఁడై - పడఁతియుఁ దాను

నెట్టుక యుండఁగ - నేఁ గలఁగంటి!
ఆదినారాయణుఁ - డక్షరుం డభవుఁ
డాదిమధ్యాంత శూ - న్యస్వరూపకుఁడు
ఆరాముఁడనియు నీ - యవనితనూజ
శ్రీరామయనియున - శేషదేవతలు
భజియింవ దివ్యపు - ష్పకముపై వీరు
విజయంబు సేయుచో - విబుధకామినులు 2200
నుడిగంబు లొనరింప - సోదరుఁగూడి
కడిమి నయోధ్య కేఁ - గఁగ కలగంటి!
మనరావణుఁడు రక్త - మాలికఁ దాల్చి
ఘనమైన ఖరముపైఁ - గాంతలఁ గూడి
తలనూనె వడియింగ - దక్షిణ దిశకు
వెలువడి తరువాత - వేసడంబులను
కట్టిన తీరెక్కి - కంధరయందుఁ
జుట్టిన రక్తప్ర - సూనమాలికల
నెఱ్ఱని కోకల - నేఁగుచు నొక్క
మిఱ్ఱున జారి భూ - మినిఁ బడిలేచి 2210
వికవిక నవ్వుచు - వెఱ్ఱియుఁ బోలి
యొకఁడును బలురొంపి - యోలంబులోనఁ
బడి తన్నుకొనువేళ - భామినుల్ చేరి
మెడఁ ద్రాడుగట్టి దొ-మ్మిగఁ జేదుకొనఁగఁ
గలఁగంటి నదిగాక - కాళియోయనఁగ
బలురక్కసి యొకర్తు - పాశవల్లరులఁ
గుంభకర్ణుని గట్టు - కొని యింద్రజిత్తు
కుంభినికుంభాది - ఘోరరాక్షసుల

తలల నూనియలును - ద్రావుతైలములు
గలవారి తలవెంట్రు - కలు వట్టి యీడ్చి 2220
కొనిపోవఁ గల కంటి! - కుంభకర్ణుండు
మునుపుగా లొటిపిట - మూపుపై నెక్కి
కడల రావణుఁడు సూ - కరముపై నతనిఁ
గదిసి నక్రము మీఁద - కడ నింద్రజిత్తు
నితరకుమారకు - లిరుగడఁ బోవ
సతులార! యీకాని - స్వప్నంబుఁ గంటి!
నలుగురు మంత్రులు - నలుగడఁ దన్ను
గొలిచిరాఁ దెల్లని - కుంభిపై నెక్కి
పూవులు భూషణం - బులు దాల్చి లంక
నీ విభీషణుఁడు రా - నేఁగలఁగంటి! 2230
గోపురంబులతోడఁ - గోటలతోడ
నీపట్టణము నార్తి - నిప్పుడే పడఁగ
నొకపేడ మడువులో - నురక రావణుని
మొకము క్రిందుగఁ బడి - ముణిఁగిపోవంగ
నొక కల యేఁగంటి - నోయమ్మలార!
ఒకనాఁడు నిటువంటి - యుత్పాత మెఱుఁగ!
ముందుగా వచ్చి రా - మునిదూత యొకఁడు
బందికాఁడై లంక - భస్మంబు చేసి
జానకి నూరార్చి - చనియె నటంచు
నేనొక్క కలగంటి - నిదియేల తప్పు? 2240
ఎడమ కన్నదరెడు - నిపుడు సీతకును
కుడికన్నులదిరె మీ- కును నాకు నిపుడు
సేమంబు సీతకుఁ - జెప్పె నీపక్షి

యేమి కాఁగలదియొ? - యెఱుఁగ మేమియును
నడుగులకును మ్రొక్కు - డభయముల్ వేడుఁ
డుడిగముల్ సేయుఁ డ - య్యుత్తమాంగనకు!
అమ్మ! మానేరంబు - లన్నియు సైచి
నమ్మింపు మనుఁడు మి - న్నక యుండరాదు!
రావణు మరణంబు - రఘురాము గెలుపు
నేవిధంబునఁ దప్ప - దెఱిఁగి వర్తిలుఁడు.” 2250
అనిన దానవ కాంత - లందఱు దొలఁగి
కనులను ముకుళించి - కడలు నిద్రింప
ననుమానముఁల జిక్కి - యవనితనూజ

-:సీత తనకు మరణముకన్న వేఱుమార్గము లేదని యురిపోసికొన నిశ్చయించుట:-


"తన కేది బ్రతుకు దై - త్యస్త్రీలచేత?
నిండు గర్భముల జ - న్మింపని సుతుల
ఖండించి తివియు మం - గళియును బోలి
గోసి తెప్పించు నా - కొంటి నే ననుచు
నీసున రావణుఁ - డింతులచేత!
రాముఁడీ వేళకు - రాకున్నఁ దాళఁ
డీమీఁద మఱియుండి - యేమిటిదాన? 2260
కైకయై వెనక మృ - గంబయి వచ్చి
నాకర్మ మిట్లు ప్రా - ణమునకుఁ దెచ్చె!
తనదు పాతివ్రత్య - ధర్మశీలంబు
చెనఁటి వానికిని జే - సినమేలు వోలి
ఫలియింపదయ్యె! నా - ప్రాణనాయకుని

పలుచఁ జేసె తదేక - పత్నీవ్రతంబు!
శ్రీరామ! తండ్రితోఁ - జేసినపూన్కి
దీఱిచి యమరావ - తికి నింద్రునట్ల
నీవయోధ్యకు నేఁగ - నీతోడఁ గూడి
కావలిసినయట్టి - కామితార్థముల 2270
సనుభవింపుదునని -యాసించి యుంటి!
తన పుణ్యమీయవ - స్థల నొందఁ జేసె!"
అని జీవనంబుపై - నడియాస విడిచి
యనుమానములు మాని - ప్రాణముల్ విడువ
నే యుపాయము లేక - యిచ్చఁ జింతించి,
వేయేల? యితరముల్ - వెదుక నాక"నుచు
మెడచుట్టు బిగియించి - మిగిలినయట్టి
జడ తటాలున లేచి - శాఖను గట్టి
వ్రేలెద ననునట్టి - వేళ 'యీ తెగువ
చాలింపు'మను శుభ - శకునముల్ వినియె 2280
కలకల దక్షిణ - గౌళి చందమునఁ
బలికె చాటున నుండి - పవమానసుతుఁడు,
చెంపచేఁ గదలిన - చెందమ్మి కరణి
నేపు చూపుచు సీత - యెడమ కన్నదరె
దశరథాత్మజునకుఁ - దలగడయైన
శశిముఖి దాపలి - సందిలియదరె.
ఇదివచ్చె రఘురాముఁ - డీక్షింపు మనిన
కదలిక వామోరు - కదిలి చలించె.
తనుదాన మైలవ - స్త్రము కొంతజాఱె.
కనుపించెఁ దనయందు - కడలందు మఱియుఁ 2290

శకునసంతతి మన - స్తాపంబుఁ దీఱ
రకమయ్యె వజ్రకో - రకరదాంకురము!
వలిగాలిఁ జివురాకు - వడఁకిన యట్లు
చలియించె నధరంబు - జానకీసతికి!
గ్రహణ పర్యవసాయి - కై రవిణీశు
రహిగన్న వదనసా - రస వికారమునఁ
బంకజాననశుక్ల - పక్షత్రియామ
పొంకంబుఁ దాల్చె బ్ర - భూతహర్షమున
జడముళ్లు వదలించి - జగతిపైఁగొంత
యడియాస గూర్చున్న - యాసమయమున 2300
రావణు రాకయు రాక్షసాంగనల
కావలి కట్టడల్ - గాసిఁ బెట్టుటలు
కలగని త్రిజట మే - ల్కని వల్కుటయును
గలఁగని మనసుతోఁ - గడుతెంపుచేసి
శుభశకునంబులు - చూసినసీత

-:హనుమంతుఁడు సీతతో మాటాడుటకిది మంచి సమయమని తెలిసికొని ముందువెనుక లాలోచించుట :-


యభిరతియును గాంచి - యమరనాయకుని
వనములోఁ గాపున్న - వనలక్ష్మి బోలి
కనుపట్టుచున్నట్టి - కల్యాణితోడ
తనరాకఁ బవమాన - తనయుఁడు దెలుపఁ
జను నిప్పుడని "మంచి - సమయంబుగాన 2310
మాటాడుదునో చేరి ? - మాటాడకున్న
సూటిఁ దప్పును సీత - సోఁకోర్వదింక ?

మానవోక్తులుగాని - మాజాతివార్త
లీనారి యెఱుఁగలే - దిట్టి వేషమునఁ
గనిపించుకొన్న రా - క్షసమాయ యనుచు
మనసొగ్గి నాతోడ - మాటాడ దిపుడు.
ఏను భాషింపుచో - నెవ్వతెయైన
దానవి యెఱిఁగిన - దశముఖుతోడఁ
జెప్పిన వాడు వ - చ్చి రణంబు సేయు.
తప్పును కార్యంబు - తన కొక్కటైన 2320
వానిఁ జంపుకు రఘు - వర్యుఁడు పూను
పూనిక వ్యర్థమౌ - పోనీక వాఁడు
కట్టివైచిన దివా - కరసూతి మాట
పట్టును దప్పు నీ - భామిని వెదక
నలుదిక్కులంచు వా - నరులను బంపె.
దొలుత సుగ్రీవుఁడం - దులనే నొకండ
గంటిని వైదేహిఁ - గాంచినవార్త
యుంట వారికిఁ దెల్ప - నొకరుఁడు లేడు.
ననునంపి మదినమ్మి - నారాకఁగోరి
వనధితీరమునందు - వానరప్రభులు 2330
అంగదజాంబవ - దాదులు చాల
పొంగుచుందురు వారు - పొలసి పోవుదురు!
ఊరకీ రఘుపతి - యున్నదిక్కునకుఁ
జేరి నేసీతఁ జూ - చిత నంటినేని
గురుతేమియైన నా - కును లేకయున్న
పరమార్థమని నమ్మి - పలుకియ్యకొనఁడు!
పోవకుండఁగరాదు! - పోరాదు! సీత

భావంబుఁగాంచి నా - పలుకు నమ్మించి
యుంగరంబొసఁగి యీ - యువతినిఁ గనిన
యంగమచ్చమున కే - మైనఁ గైకొనుచు 2340
నామీఁద తోచిన - యది నడిపించి
స్వామిగార్యముఁ దీర్పఁ - జనుట యుత్తమము.
అందుకు తగిన పూ - ర్వాగమంబెల్లఁ
గందువగాఁగ ని - క్కడనుండి పలుక
నామీఁది నడఁచిన - యది చూత"మనుచు
రామప్రశంస పూ- ర్వమునఁ గావించి
సీతకు నొయ్యన - చెవిసోఁక సరళ
రీతిగా నలకేస - రికుమారుఁడనియె.

-: సీతవినునట్లుగా హనుమంతుఁడు రామప్రశంస చేయుట :-


“మనువంశమణి నీతి - మార్గకోవిదుఁడు
జననుతకీర్తి యి - క్ష్వాకు వంశజుఁడు 2350
తపనసంకాశుండు - దశరథనృపతి
తపముల జపముల - దానయాగములఁ
గోరి కాంచిన పెద్ద - కొడుకు రాఘవుఁడు
కారుణ్యనిధి కార్ము - కకళావినోది
స్వజనరక్షణశాలి - సత్యసంధుండు
సుజనసన్మాన్యుఁడు - సుదతియుఁ దాను
తమ్ముఁడు వనులకు - తలిదండ్రులాజ్ఞ
సమ్మతించి విరాధుఁ - జక్కడగించి

పంచవటిస్థలి - భామినితోఁ జ
రించునప్పుడు ముని - శ్రేణులఁ బ్రోచి 2360
దురములోపల ఖర - దూషణాదులను
బొరిగొని తరుణి పం - పున మాయలేడి
పట్టెదనని రఘు - పతిత్రోవ నజుని
కట్టడచేత ల - క్ష్మణుఁడు దొలంగ
వంచించి వచ్చి రా - వణుఁ డింతిఁ బట్టి
కొంచుఁ బోయిన రాచ - కొమరలు వెదకి
యువిదఁ గానక జటా- యువుచేతఁ దెలిసి
రవిసూతుతోడ పో - రామి వాటించి
వాలినిఁ బడనేసి - వానరరాజ్య
మేలించి సుగ్రీవు - నింతితోఁ గూర్చి 2370
యాయన బలముల - నన్నిదిక్కులకు
జాయను వెదకి రాఁ - జనుఁడని పనుప
దక్షిణదిశకు గొం - దఱు మేమువచ్చి
పక్షీంద్రుఁడైన సం - పాతి మాటలను
నగునొ కాదో నిశ్చ - యము లేక చేరఁ
దగవు గాదనుచు నిం - తట నున్నవాఁడ
మ్రానిపై" నని హను - మంతుఁడు వెనుక
మౌనముద్రవహించి - మాటాడకున్న

--: సీతయామాటలనువిని వితర్కించుట :--


వెఱగంది జనకజ - విని మోముమీఁది
కురులు చక్కఁగఁ ద్రోచి - కుజముపై నున్న 2380

వానరంబునుఁ జూచి - వానరుఁ డెట్లు
మానిసి కైవడి - మాటాడ నేర్చె?"
అని విచారింపుచో - నవనియు దిశలు
వినువీథియుఁ జాల - వింతకాఁ గనుచు
తెల్లనితోకయుఁ - దీగె క్రొమ్మెఱుఁగు
తల్లియై కెంజాయఁ - దగుగాత్రయష్టి
పుత్తడి జిగిఁదేఱు - భుజములు క్రొత్త
లత్తుక చాయల - లపనంబు పచ్చ
పిల్లికన్నులు గల్గు - పెనుగ్రోతిఁ జూచి
తల్లడిల్లుచు రాముఁ - దలఁచి తలంచి 2390
"కలగంటినొక్కొ? ని - క్కమొ?" యని భ్రమసి
కళవళింపుచు సీత - గడియ మూర్ఛిల్లి
తెలివిడి నొంది "క్రో - తినిఁ గలగంటి
కలలోనఁ గ్రోతులఁ - గనినఁ గీడనుచు
వినియుందుగాన నా - విభుఁడైన రాఘ
వునకు సోదరుల ము - వ్వురకు నాతండ్రి
జనకభూపతికి వి - చారముల్ లేక
మనవలె!" నంచు ప - ల్మారు దీవించి
కల నిద్రలేక యే - గతిఁ గంటినిపుడు
కల నిద్రయెల్ల రా - ఘవుఁడె కైకొనియె!" 2400
అని " రామ! రామ! రా - మా!" యంచు సారె
పునరుక్తములుగాఁగ - భూమిజ వలికి
"ఆడునే వానరుఁ - డకట! యీమాట
లాడక మఱి యెవ్వ - రాడి రిందుండి?
ఇటు లెవ్వరాడిన - యేవిన్నయట్టి

యటువంటిదే సత్య - మయ్యెనుగాక!
మంచిమాటకు నను - మానింపనేల?
ఎంచ దైవంబు తో - డింక నౌనేమొ? "
అనుమాటలోన శా - ఖాగ్రంబు డిగ్గి
జనకతనూజాత - చరణాబ్జములకు 2410
సాగిలి మ్రొక్కి యం - జలిచేసి భక్తి
యోగంబుతోడ వా - యుతనూజుఁ డనియె.

-: హనుమంతుడు సీతకు నమస్కరించి మాట్లాడుట :-

"అమ్మ! యిట్లు మహీరు - హచ్ఛాయ నొంటి
కొమ్మ వట్టుక కన్నుఁ - గొలుకులయందు
వెలిదమ్మిఱేకుల - విరిదేనె చిందు
నలవున నుడివోని - యశ్రులురాల
నేమి హేతువు? నీకు - నిచ్చోటనుండ
నేమిటి? కెవ్వరి - యెలనాఁగ వీవు?
అమరభామినివొ! వి - ధ్యాధరయక్ష
రమణివొ! కిన్నర - రాజీవముఖివొ! 2420
గారుడకాంతవొ! - గంధర్వసిద్ధ
నారీలలామవొ! - నాతి! వాకొనుము.
తెలియఁజూచితి వన - దేవతవనుచుఁ
దలఁచెద నెవ్వరి - దానవు నీవు?
హరిణాంకు నెడవాసి - యవనికి డిగ్గి
తిరిగి పోలేక చిం - తించు రోహిణివొ!
పంతంబు డించుక - ప్రణయకోపమునఁ
జెంత వసిష్ఠు బా - సిన యరుంధతివొ!

ఎవ్వారు తలిదండ్రు - లింతి? నీకాంతుఁ
డెవ్వడు? నీకుఁ బే - రెద్ది యేర్పఱపు
మేరాజునో చింత - నిందాఁక నీకు
పేరుకొంటివిగాన - పృథివిపై నీదు
యడుగులు సోకిన - యందుచేఁగట్ట
వెడలు గన్నీటిచే - వేదనఁ బుట్టు
నెమ్మోము చెమటచే - నీవు వేలుపుల
కొమ్మవు గావని - గురుతెఱింగితిని!
మానవాంగన వను - మానంబులేదు
కాననెవ్వరిఁ బాసి - గాసి నొందెదవు?
లలితతావక శుభ - లక్షణా వళులు
తలఁచి చూచిన మహీ - తలమెల్ల నేలు
పట్టభద్రుండు చే - పట్టంగఁ దగిన
యట్టి సాధ్వివి గాని - యన్యవుగావు!
ఈరావణుఁడు మాయ - నెత్తుకవచ్చు
శ్రీరాము దేవేరి - సీతవీవైన
తెలుపుము కాదేని - దీనవై యింత
కలఁగు నేజయ శీల - గౌరవశ్రీలు
తరగక యుందువే? - తరుణి! యట్లగుటఁ
బరమార్థమిది రామ - భార్యవే నీవు!
అతిమానుషంబైన - యట్టి యీపాటి
యతిశయ సౌందర్య - మదియేల కలుగు
కడమ తొయ్యలులకు? - గావునఁ దెలియ
నుడువుము నాదు వీ - నులు చల్లగాఁగ"

అనవిని శ్రీరాము - నంకించి పొగడు
వనచరోత్తమునితో - వైదేహి వలికె.

-:సీత హనుమంతునితో సంభాషించుట:-

జనక భూపాలుఁడు - జనకుఁడు నాకు
మనవంశనృపనభో - మణి దశరథుఁడు
నామామ లోకైక - నాయకుఁడైన
రామచంద్రుండు నా - ప్రాణనాయకుఁడు
కౌసల్యమాయత్త - గారు మరందు
లాసుమిత్రాపుత్రు - లాభరతుండు 2460
ఏను మాయత్తవా - రింటికిఁ జేరి
యానగరము ద్వాద - శాబ్దముల్ సకల
సంతోషమున నుండు - సమయంబు నందు
చింతించి దశరథ - క్షితిపతి రాము
నభిషేక మొనరింప - యత్నంబు సేయు
విభవంబుఁ గైకేయి - విని యోర్వలేక
వరమడిగిన సత్య - వాది మామామ
తరుణిపై మిక్కిలి - దయవాఁడుగాన
నడవులకు దన్ను - ననిచిన నన్ను
నడలార్చి రఘువీరుఁ - డత్త చెంగటను 2470
నను నుండుమని పల్కి - న సహింపలేక
తనవెంట నేవచ్చె - దనటంచు నడల
ననుమతి నాకిచ్చి - యటమున్నుగాన
తనవెంట నాసుమి - త్రాకుమారకుఁడు

పయనమైయున్నఁ జే - పట్టి యిర్వురను
రయమునఁ దోకొని - రఘుకులోత్తముఁడు
దండకాటవి నుండ - దశకంధరుండు
కండక్రొవ్వున మీఁదు - గానకనున్న
మావారిఁ గికురించి - మాయలు వెంచి
చావందలంచి వం - చనచేత నన్ను 2480
చెఱవట్టి తెచ్చి యుం - చినవాఁడు బ్రదుకు
దరముగాదింక నీ - దశకంఠు చేత
రెండు నెల్లకు సంహ - రించును గడువు
నిండకమునుప వీ - నివధింపలేరు
మావారలనుచు నే - మరిగెద" ననిన
నావధూమణితోడ - హనుమంతుఁడనియె

-: హనుమత్సీతా సంభాషణము :-


"శ్రీరామచంద్రుండు – సేమంబుతోడ
నోరమణీమణి! - యున్నవాఁడిపుడు
నిను జూచి రమ్మని - నీ ప్రాణవిభుఁడు
పనిచిన నమ్మిక - బంటను నేను 2490
నీచందమారసి - నీవున్నచోటు
చూచి నీతోడను - శుభవార్తఁ దెలిపి
రమ్మని పనిచెనో - రమణి! లక్ష్మణుఁడు
ముమ్మారుగా నీకు - మ్రొక్కితిననుచు
వినిపించు మనియె నా - వృత్తాంత మిట్టి"
దని పల్కుటయు విని యది నమ్మలేక

యాస యుండదుగాన - హనుమంతుఁజూచి
యాసీత మధుర వా - క్యముల నిట్లనియె
"మది చూడ వేఁడి యీ - మాటలాడితివి
బ్రదికి యుండినఁ గల్గు - భద్రంబు లెల్ల 2500
సేమంబెకాక మా - శ్రీరామ విభున
కేమి కొఱంత? నీ - వెఱిఁగిన పాటి
యేను నెఱుంగుదు - నింతియచాలు!
వానరోత్తమ! మేలు - వార్తఁ దెచ్చితివి!"
అనిపల్క నిజముగా - నాడిన దనుచు
జనకజఁ జేరఁగఁ - జనుదేరఁ జూచి
యదియు రావణుఁడుమా - యావియై తన్నుఁ
గదియుచున్నాఁడని - కరపల్లవమునఁ
బట్టిన కొమ్ముఁ దాఁ - బట్టూడి వదల
నెట్టిచోనిలిచె న - య్యెడఁ గూరుచుండి 2510
తలవాంచియున్నఁ జెం - తను గేలు మొగిచి
నిలుచున్నయట్టి వా - నికి సీత వలికె
"మేలు శ్రీరాముని - మేలు చెప్పితివి
చాలునింతియె నాకు - సంతోషమయ్యె
నిన్ను రాఘవుఁడంపె - నే? రాముచెంత
నెన్నినాళ్ళాయె నీ - విప్పుడు కొలిచి?
కల్లలు నేరవు గద? - మంచివాఁడ
వెల్లిదమ్ములు సేయ - నెంచిన నీకు
నీకోతి వాళక - మేల వేఱొక్క
యాకారమున మాట - లాడిననేమి? 2520

రాక్షసాధమ! యావి - రాధారి నన్ను
రక్షింపుచుండ దూ - రంబుగాఁ దిగిచి
కపట సన్యాసివై - కనిపించినన్ను
నపలవించితివింక - నయ్యెడిదేమి!
వానరతనుమ్రింగ - వచ్చినావేమొ?
ఐనట్టులయ్యె డా - యఁగ రాకుమిావు
వాకొమ్ము నాస్వామి - వార్తలు దనకు
నాకర్ణనము సేయ - నభిలాషమయ్యె!
నినుజూచి నపుడు కం - టికి వింతదోఁచి
తనమనంబునకు విం - తగ నుండలేదు! 2530
భీతివుట్టదు గాన - ప్రియవచనముల
హేతువుచే నిన్ను - నిటు నిల్వమంటి
ఉభయతారక మౌట - నోడక నీకు
నభిముఖినై రాఘ - వాలాప కథలు
నెఱిఁగియుండిన వచి - యింపుమీా"వనిన
మఱల సీతకు హను - మంతుఁ డిట్లనియె
"రాముని సుగుణ కీ - ర్తనములు సేయ
సామాన్యమే బృహ - స్పతి బుద్ధికైన?
ధనదుఁడు కల్మిచే - దయ నంబురాశి
యినుడు తేజమున స - హిష్ణుత ధరణి
ధర్మశాస్త్రార్థత - త్త్వజ్ఞుఁ డక్లిష్ట
కర్ముఁడు నీతిమా - ర్గ విశారదుండు
శతకోటి మన్మథ - సౌందర్యమూర్తి
శతపత్రనయనుఁడా - జానుబాహుండు
ఆ రాఘవుఁడు నిన్ను - నరసి రమ్మనియె!

ఓరామ! యతని స - హోదరుఁడైన
సౌమిత్రియును నమ - స్కారంబుఁ జేసి
నీమేలుచూచి సం - ధించి రమ్మనియె 2550
దారాఘవుని యాప్తుఁ - డైన సుగ్రీవుఁ
డారసి నీదు మే - లడిగి రమ్మనియె
వారుసేసిన భాగ్య - వశమున నిట్టి
ఘోరరాక్షస వధూ - కోటులచేత
నలమటలకు నోర్చి - ప్రాణంబుతోడ
మెలఁగెద వింక నే - మి కొఱంత నీకు?
అసుర వల్లభుఁడు మా - యామృగవ్యాజ
మెసకొల్ప రాఘవు - నెలయించి బంచి
నినుదెచ్చియిచట వ - నీక్షోణియందు
నునిచిన ఫలమంద - నున్నాఁడు మీఁద!
మారాజు తరణికు - మారుఁడాప్తుండు
శ్రీరామునకుఁగాన - సీతను వెదకి 2560
చూచిరమ్మని పను - చుటయు నేవచ్చి
యేచి క్షణంబులో - నీవార్ధిదాఁటి
ద్రోహిరావణు తలఁ - ద్రొక్కిన యటుల
యూహించి నిన్ను నీ - యూరెల్ల వెదకి
కనుఁగొంటినని పల్కు - కపివీరు మాట
తనమది నమ్మక - ధరణిజ వల్కె
" కలఁగంటి నొక్కొ? రా - క్షసనాథుఁ డిట్టి
బలుమాయవన్నెనొ? - భ్రమసితినేమొ?
మనసులో బాయని - మరులు చందంబొ?
కనుఁగవ మిరిమిట్లు - కపియైనదదియొ? 2570

కాక రావణుడు ని - క్కము పుట్ట నిట్లు
వాకొనుచున్నాఁడొ? - వలను జూచుటకు!"
అన పల్కి " యెవ్వఁడ - వైన నేమాయె?
వినవన్న! యేవచ్చి - వీనింట నుండు
యిన్నినాళ్ళకు రాముఁ - డిట్టి వాఁడనుచు
విన్నదియె చాలు - వేడుక యయ్యె!
ఇది కలయైనచో - నెదిరి నామాట
కిది యుత్తరంబని - యియ్యనేరుచునె?
కలగాదు నిజమని - కనరాదు మేలు
వలికెదు గాన నీ - పలుకీయకొంటి. 2580
రామదూతవయేని - రావన్న నీకు
సేమమౌగాక య - శేషకార్యముల.
నరనాయకులకు వా - నరులకునెట్లు
దొరకును జెలిమి? నీ - దొర భానుసుతుడు
అనిచిన మంత్రి నే - నంటివి యిచటి
దనుజుల మాయలఁ - దవిలి నేవిసివి
దరిదాపులేనట్టి - దానను గాన
నెఱనమ్మి నీతోడ - నేఁ బల్కవెఱతు
నిజమైన రాముని - నెమ్మేని గుఱుతు
లజరులు మెచ్చఁగ - నగు లక్షణములు 2590
నీతెఱఁగును నాకు - నిక్కంబుఁ దెలిపి
ప్రీతిఁ గావింపుము - విరతిగ" ననిన
నామాటలకు మెచ్చి - యనిలనందనుఁడు
రామునిల్లాలితోఁ - గ్రమ్మఱఁ బలికె.
హనుమంతుఁడందు - రోయమ్మ! నాపేరు

నను నెఱిఁగెదవు నీ - నాయకుఁడైన
రామభద్రుని శరీ - రవయోవిలాస
సాముద్రికాంగ ల - క్షణములు వినుము

-:శ్రీరామ రూపవర్ణనము:-



తమ్మికన్నులవాఁడు - దాక్షిణ్యశాలి
యమ్మ! భూజనమనో - హరుఁడు చెల్వమున 2600
మతిగలవాఁడు నే - మముగలవాఁడు
ధృతి గలవాఁడు బు - ద్ధిబలాధికుండు
దయగలవాఁడు స - త్యము గల్గువాఁడు
జయశాలి సర్వజన ర - క్షణ విచక్షణుఁడు
రక్షకుడు స్వధర్మ - రక్షణుండతి వి
చక్షణుడు హిత ప్ర - చారుఁడెల్లరకు
ఓరుపుగల్గువాఁ - డుర్వర యేలు
నేరుపుగలవాఁడు - నిపుణమానసుఁడు
కారయితయుఁ గర్త - కారణంబగుచు
ధారుణి నన్నియుఁ - దానైనవాఁడు 2610
సర్వపూజ్యుఁడు బ్రహ్మ - చర్యవ్రతైక
నిర్వాహకుఁడు కారు - ణికతాంబురాశి
వినయగాంభీర్యవి - వేకప్రతాప
జనక చరిత్రుఁ డా - ర్జవగుణాన్వితుఁడు
వేదవేదాంగ కో - విదుఁడు కోదండ
వేదపారీణుఁడ - వేలధైర్యుండు
ఉత్తంగభుజుడు మ -హోరస్కుఁ డప్ర
మత్తుఁ డాజానుకో - మలభుజార్గళుఁడు

చారురాజన్య ల - క్షణుఁడు కామాది
దూరుఁడు గూఢజ - త్రు వరిందముడు 2620
సుభ్రూవిలాసుండు - సులలాటుఁ డధిక
శుభ్రయశోనిధి - సుగుణాకరుండు
సమవిభక్తాంగుండు - సమదర్శనుండు
సముఁ డింగితజ్ఞుండు - సౌమ్యవర్తనుఁడు
బింబాధరుఁడు దుందు - భి ధ్వనివాఁడు
కంబు కంధరుఁడు శృం - గారనాయకుఁడు
కలికలనవ్వు చ - క్కని మోమువాఁడు
వలరాజు నేలు చె - ల్వము గల్గువాఁడు
మానుషాఢ్యుండు చా - మనచాయ మెఱుఁగు
మేను గల్గినవాఁడు - మిక్కిలి దాత 2630
ముష్టి కరమ్మున - ముంగేల బలము
పుష్టి గల్గినవాఁడు - పొడవులైనట్టి
చేతుల బొమల మిం - చినవాఁడు సోగ
లై తగుజాను గే - శావళివాఁడు
ఉన్నతనాభి వ - క్షోదరుం డరుణ
సన్నుత చరణ లో - చనకరాంచలుఁడు
కరయుగ చరణరే - ఖానఖావళుల
యరుణత్వముల మించి - యమరినవాఁడు
నున్ననికాళ్ళు వెం - ట్రుకలు గాంభీర్య
సన్నర్థనాభికా - స్వరగమనములు 2640
గలవాఁడు త్రివళిరే - కల నుదరంబు
గళమును గలవాఁడు - కనుపించనీని
చరణరేఖానళి - చనుమొనల్ గలిగి

కరమొప్పువాఁడు క్రీఁ - గడుపును గళము
కుఱుచలై తగువాఁడు - కొమరొప్ప సుడులు
శిరమున మూఁడుగాం - చిన భాగ్యరాశి
లలన! యంగుష్ఠమూ - లమునఁ ద్రిరేఖ
లలవడువాఁడు క - రాలికంబులను
నలురేఖలను జర - ణంబుల వజ్ర
హల కులిశాబ్జధ్వ - జాది రేఖలను 2650
బరఁగినవాఁడు తొం - బదియాఱు తనదు
కరతలాంగుళి కేలఁ - గల ప్రమాణమున
మీఱు గాత్రమువాఁడు - మీఁగాళ్ళు చెవులు
నూరువుల్ నయనంబు - లోష్ఠజానువులు
చేతులు భుజములు - చెక్కులు నొక్క
రీతిఁ బోల్చినవాఁడు - శ్రీలచేమించి
తళుకులైనట్టి దం - తంబులు నాల్గు
పలువరుసకు మధ్య - భాగంబు నందు
రాజిల్లువాఁడు వా - రణసింహవృషభ
రాజ యానమువాఁడు - రక్తాధరుండు 2660
మెఱుఁగు కన్నులవాఁడ - మేయుండు దీర్ఘ
కరచరణాంగుళి - కళికలవాఁడు
సరసజోపమరస - జ్ఞాముఖనయన
కరపదద్వయములు - గలిగినవాఁడు
వెళపైన వక్షంబు - వీఁపును నుదురు
గలవాఁడు నిడుసోయ - గపు నాసవాఁడు
తేజోయశశ్రీల - దినకరాన్వయము
రాజులకెల్లను - రాజైనవాఁడు

అత్యున్నతోజ్జ్వల - దళికనాసాగ్ర
మత్యుపాయ బలాభి - మానవైభవుఁడు
కాలంబులను ధర్మ- కామార్థలాభ
శీలముల్ మఱువక - చేకొనువాఁడు
నిగ్రహానుగ్రహ - నిపుణుఁడు ధర్మ
విగ్రహుఁ డఖలాస్త్ర - వేది ప్రాజ్ఞుండు
మగువ! కౌసల్యాకు - మారు నెవ్వారు
పొగడ నేర్తురు? తలఁ - పుల కొద్దిగాక!
అతఁడట్టివాఁడ సు - మ్మతని సోదరుఁడు
చతురుఁ డన్నిటను ల - క్ష్మణకుమారకుఁడు!
వీరిద్దఱును నిన్ను - వెదకుచువచ్చి
యోరామ! యలజటా - యువు వార్తవలన
రావణు చందమా - రసి విని వార
లీవలగా వచ్చి - ఋశ్యమూకంబుఁ
జేర దవ్వులను వీ - క్షించి భీతిల్లి
మారాజు తరణి కు -మారుఁడు వెఱచె.
వెఱవకమని యేను - వెనుఁ జఱచుటయుఁ
దిరిగి చూచుచు బాఱి - ధృతివూని నిలిచి
యారాజుల తెఱంగు - లరసిరమ్మనుచు
నారీశిరోమణి! - నను బిల్చి పనిచె.
రాముని తెఱఁగు స - ర్వంబును దెలిసి
నామూపుపై వారు - నడిచి రాకుండఁ 2690
దాలిచి తెచ్చి చెం - తల డించి నన్ను
నేలిన దొరతోడ - నెఱిఁగించి వారి
యిరువురకును సంధి - యే నడిపింప

తరుణి! యావేళ వా - ర్తలు చెప్పరాదు!
"తనరాజ్యము హరించి - తనయాలి నుడిచి
తనుజెట్లు వట్టించె - తమ యన్న వాలి
దిక్కుగావే!" యని - దినకరతనయుఁ
డొక్క దిక్కునఁ బల్క - నూరడించుటయు,
"తనకాంతఁ జెఱవట్టి - దశవదనుండు
కొనిపోయె మాకు ది - క్కును బ్రాపుదాపు 2700
నీవు దక్కఁగలేరు - నీవారమగుచు
సేవకవృత్తిఁ గొ - ల్చెదము రక్షింపు
సీతను గ్రమ్మఱఁ - జేకూర్పు" మనుచు
నాతి! మీవారు బ - న్నంబు నొందుటయు
సరిపడియుండ బా - సలు నేమికలును
నిరువాగు నడిపింప - నేనట్టివేళ
మును నీవు చెఱఁగు చే - ముడిచి మా నడుమ
వినువీథి నరుగుచో - వ్రేసినయట్టి
సొమ్ములు దెచ్చి యేఁ - జూపిన మూర్ఛఁ
గ్రమ్మ ధారుణిఁబడి - కనువిచ్చిలేచి 2710
రామ! యావేళ శ్రీ - రాముని దుఃఖ
మేమనవచ్చు! న - ట్లేడ్చుచునున్నఁ
గాంచి సుగ్రీవుఁడు - కన్నీరు దుడిచి
మంచి మాటలు వల్కి - మౌళిఁ గేలుంచి
సీతను దెచ్చి కూ - ర్చెదనని ప్రాణ
దాతయై యొకకొంత - తాల్మి పుట్టింప
నిదురలేమియుఁ జాల - నెగులు శోకంబు
మదిని త్రేతాగ్నుల - మాడ్కిఁ జూపట్ట

నోతన్వి! యిపుడగ్ని - హోత్రగృహంబు
రీతి నీమగఁడు భ - రింప లేఁడయ్యె! 2720
భూకంపమునఁ దాను - భూమీధరేంద్ర
మాకంపమునఁ బొందు - నట్ల శోకాగ్ని
తానోర్వఁడయ్యె నీ - దశకంఠు నిఖల
దానవశ్రేణితోఁ - దన దివ్యబాణ
పావకజ్వాలికా - పటలిచేఁ బ్రేల్చి
దేవి! చేకొను నిన్ను - దివిజులు మెచ్చ
నిను వెదకింప న - నేకవానరులఁ
బనిచెదనని పూని - ప్రతినలు వలుక
నందుచే వాలి నొ - క్కమ్మునఁ గూల్చి
యందలంబున నుంచి - యర్కసంభవుని 2730
యతని రాజ్యమునకు - నభిషిక్తుఁ జేసి
సతితోడఁ గూర్చి వి - చారముల్ దీర్చె!
ఆరాఘవుఁడు చేసి - నట్టి మేలునకు
మారాజు మది మేలు - మఱవక నిన్ను
వెదకి కన్గొనిరండు - వేగంబయనుచు
ముదితాత్ముఁడై దిశా - ముఖములకెల్ల
కపివీరులను బంచె - గాన యేనొకఁడ
నివుడు వచ్చితి నిన్ను - నిచ్చోటఁ గంటి!
పవననందనుఁడ నీ - పతితోడ నిన్ను
నువిద! కూర్పఁగ మది - నూహించినాఁడ! 2740
అందఱు వానరు - లన్ని దిక్కులకు
నిందు నంగద ముఖ్యు - లినకుమారకుని
పనుపునఁ బనిపూని - బలములఁగూడి

నిను వెదుకఁగఁ బోవ - నిజశక్తులెల్ల
మాటక చరియింప - మాజతవారు
మాట వాసుల దొర - మానసులగుట
‘గడువు మీఱెను జన - కజఁ గానమైతి
మడియాస లిఁకనేల - ప్రాణంబులందు
ననుచుఁ బ్రాయోపవే - శాలోచనముల
వెనుకటి సుద్దులు - వినఁ బల్కువేళ 2750
ననుజుఁడై నట్టి జ - టాయువు మాట
విని యా బిలంబులో - వెడలి సంపాతి
యెగిరి పోవుచు మాకు - నిచ్చోట నీవు
వగలతో నున్న తా - వల మేఱుపఱచి
పోవ నే మెల్ల నం - బుధిచెంతఁ జేరి
లావుల కొలఁదులె - ల్లరు తేటపఱుప
నెవ్వరిచేఁగాని - యీపూన్కిఁ జేసి
ఱివ్వున నేదాఁటి - ఱెక్కలతోడి
యచలమో యనఁ ద్రికూ - టాద్రిపై వ్రాలి
యిచట లంకాపురం - బెల్ల శోధించి 2760
అమ్మ! నాదైన పు - ణ్యవశంబుచేత
నిమ్మేర నినుగంటి - నీడేరెఁ బాటు!
మఱలి మావారికి - మాట యేర్పఱచి
తరణిజ దశరథ - తనయులతోడ
నీదు చందముఁ దెల్పి - నేవారిఁ గూడి
యీదశానను మదం - బెల్ల నడంచి
నినుఁగూర్తు శ్రీరాము - నికి నందుకతన
ననుపమంబైన వి - ఖ్యాతిఁ గైకొందు!

మును కౌరవాచలం - బున నుండి యొక్క
పని గల్గి గోకర్ణ - పర్వతంబునకుఁ 2770
గేసరియను గపి - కేసరి నాక
వాసుల హితము భా - వమునఁ దలంచి
జలధి తీరంబున - శంబసాదనుని
బలియుని దానవ - పతిఁ బొలియించి
యసము గైకొనియె నే - నతని నందనుఁడ
నసమానశౌర్యబా - హాబలాన్వితుఁడ!
వాయువొసంగిన - వరముచేఁ గాంచె
మాయమ్మ యంజన - మందరాగమున!
నీపతి సద్గుణా - నీకముల్వరుస
రూపించితిని నాస్వ - రూపమంతయును 2780
విన్నవించితి” నన్న - విని హనుమంతుఁ

-: హనుమంతుని మాటలకు సీత సంతోషించుట :-


డన్న మాటలకునై - యవనిజ మొగము
చెలువంబు రాహువు - చేత వీడ్వడిన
కలువలరాజు చ - క్కదనంబుఁ గాంచె!
ఆనందబాష్పంబు - లవనిజ కన్ను
గోనల సోనలై - కురియంగఁజూచి
యుడుగని కన్నీట - నోరంతప్రొద్దు
నెడపని చింతచే - నేడ్చుచు నునికి
మనసు గానఁగ లేక - "మాయమ్మ! యింక
జనదు శోకింప వి - చారంబు మాను 2790

మేమి సేయుదు నీకు? - నెద్ది యభీష్ట?
మేమి కావలయు? నా - కెయ్యది బుద్ధి?
వాయుపుత్రుఁడ గాన - వాయువుకన్న
నాయత జవశక్తు - లధికముల్ నాకు!
పొమ్మనఁ బోయెదఁ - బోయి యీక్షణమె
రమ్మన్న వత్తు శ్రీ - రాము నూరార్చి!"
అని వెండియును సీత - యనుమానముడుప
మనసున నెంచి య - మ్మారుతి పలికె.


-:హనుమంతుఁడు సీతకు రాముని ముద్దుటుంగరము నానవాలుగా నిచ్చుట:-

" పరమకల్యాణి! నీ - పతి నన్నుఁ బిలిచి
'గురుతుగాఁగడమ గై - కొనదు మాసీత 2800
యిది చూచునెడ నమ్ము - నింద' పొమ్మనుచు
ముదిత! చేతికినిచ్చె - ముద్దుటుంగరము
కొమ్మ"ను నంతఁగై - కొని రాముచేతి
సొమ్ము ప్రాణేశ్వరుఁ - జూచిన యటుల
తీసుక మదిని సం - దియమెల్లఁ దీఱి
యాసీత ప్రమదాబ్థి - యందు నోలాడి
శిరముపై నునిచి మ - చ్చికఁ జెక్కుఁ జేర్చి
యురముపై నిడి లోచ - నోత్పలంబులను
హత్తించి కరమున - నమరించి కపికు
లోత్తముఁ గనుఁగొని - యొకమాట వలికె. 2810

-:శ్రీరాముని ముద్దుటుంగరము చూచి యానందభరితయై సీత హనుమంతునిఁ బ్రశంసించుట:-


“తజ్ఞుఁడ వతిశౌర్య - ధనుఁడవార్యుఁడవు
ప్రాజ్ఞుఁడ వసమాన - బలుఁడవు ధైర్య
శాలివి వానర - సాధారణుండ
వే! లంక కితరుఁడే - విధమున వచ్చు?
జలరాశి నూఱుయో - జనము లావడుగు
పొలువున దాఁట నో - పునె యొకరుండు?
ఈరావణునిఁ జూచి - యెదవడ కొకఁడు
ధీరుఁడై నగరుశో - ధించి రాఁగలఁడె?
చాలఁ జిత్తమునకు - సరిపోకయున్న
బాలించునే రఘు - పతి యుంగరంబు? 2820
నాతోడ మాటాడ - నాతోడబుట్టు
వై తగువానిఁగా - కనుచునే విభుఁడు?
అంత నమ్మినవాఁడ - వగుట నీతోడ
మంతనంబున నేను - మాటాడఁ దగవు!
రామసౌమిత్రులు - ప్రాణముల్ దాల్చి
భూమి నున్నారను - పుణ్యమొక్కటియె
కలుగఁ గావలె గాక - కపివీర! యేమి
తలఁచిన నది యసా - ధ్యంబె వారలకు?
శ్రీరాము కోపాగ్ని - చే విశ్వమెల్ల
నీఱు కాకుండదే - నిమిషమాత్రమున? 2830
ఈమీద నాకర్మ - మెట్టిదో? కాక
రాము నెదుర్చునే - రావణాసురుఁడు?
సేయు కార్యములందు - చింతిలుచుండి

సేయక మానునో - సేయునో పూని?
సామదానములాప్త - జనులందు నహిత
భూమీశులెడ భేద - మును దండనీతి
నద నెఱింగి యొనర్చు - నాయాప్తజనుల
పదవులు తాఁబరి - పాలించునొక్కొ?
దేవమానుషవిధుల్ - తెలిసి వర్తిలునె?
నావార్తలుగఁ బల్కు - నా యేకతమున? 2840

-:శ్రీరాముఁడు తన్నెప్పుడు చెఱనుండి విడిపించునో యని సందేహముతో సీత యడుగుట:-



ఎడవాసినప్పుడె - యెంతలేదనుచు
విడువక నాచెఱ - విడిపించు నొక్కొ?
ఎన్నడు నొకచింత - యెఱుఁగని భర్త
యిన్ని దుఃఖములచే - నిందుచున్నాఁడొ?
కౌసల్యయు సుమిత్ర - కైకేయి లెస్స
లే? సోదరులు సుఖు - లే? వారివార్త
వినఁబడునే? మహీ - విభుఁడైన భరతుఁ
డనుచరావళిఁ బంచి - యన్నసేమంబుఁ
దావిచారించునే? - తరణినందనుఁడు
రావణుపై నెత్తి - రాఁగలఁడొక్కొ? 2850
వివిధశస్త్రాస్త్రసం - వేదియైనట్టి
రవివంశమణి సుమి - త్రా కుమారకుఁడు
నానిమిత్తముగ దా - నవుల వధింపఁ
బూనుక యున్నాఁడె - పోవనిమ్మనక?
రాము బాణములచే - రణభూమిలోన

నాముందఱను గూలు - నా దశాననుఁడు?
నీటఁ బాసిన యట్టి - నెత్తమ్మిఁ బోల్ప
సాటియై శ్రీరామ - చంద్రుని మొగము
ననుఁ బాసి వాడియు - న్నదియొక్కొ? ధర్మ
మునకునై తన రాజ్య - ముఁ దృణీకరించి 2860
వనులకు ననుగూడి - వచ్చిననాఁటి
యనుపమధైర్యమే - మయ్యెనో యిపుడు?
తల్లిదండ్రులకన్నఁ - దనపాలిప్రాణ
వల్లభు మేలిమి - వార్త యేవినఁగ
నిన్నాళ్లు తాల్చితి - నీ శరీరమునఁ
జన్న ప్రాణంబులు - చననీక యాఁగి!
ఎంతలేదిటఁద - నేమైన లెస్స
చింతలు దీర్చి ర - క్షించితి వీవు!"
అని కంటఁ దడియుంచు - నవనీతనూజఁ
గనుఁగొని వానరా - గ్రణి యిట్టులనియె. 2870

-: హనుమంతుఁడు తానీనృత్తాంతము తెలిపిన తక్షణమే శ్రీరాముఁడు రావణుని సంహరించి యామెను విడిపించునని ధైర్యము చెప్పుట :-


ఇచట నీవుండిన - యీవార్త వినిన
శచి నింద్రుఁడును బోలి - స్వామి రాఘవుఁడు
అమ్మ! తోకొనిపోవు - ననుమాన మేల!
నమ్ముము నామాట - నారాకఁ గోరి
యున్న రాఘవుఁడు నీ - యున్నట్టివార్త
విన్నయప్పుడె కపి - వీరులఁ గూడి

జలధి యింకించి రా - క్షసుల రావణునిఁ
బొలియించి నీఖేద - ములు మాయఁజేయు
నినుబాసి యోరుచు - నే రఘువరుఁడు!
తనునమ్ము మఖిల భూ - ధరముల యాన 2880
నాకుఁ జీవనమౌ వ - నశ్రేణి యాన
రాకమానఁడు రఘు - రాముఁ డిచ్చటికి
నైరావతంబుపై - నమరేంద్రుఁ డనఁగ
నోరామ! ప్రస్రవ - ణోర్వీధరమున
నున్నట్టి భానువం - శోదధి చంద్రుఁ
గన్నులు చల్లఁగాఁ - గాంతువు మఱల
వన్యమాంసంబులు - వలదని యితఁడు
వన్యాసియై మౌని - వర్గంబు కరణి
దేవతలకు పితృ - దేవతావళికి
సేవకాతిథులకుఁ - జేఁజేతఁ బంచి 2890
యైదవపాలు సా-యంతనంబులును
నీదయితుండు క - న్నియ! తాభుజించు
మేనిపై వ్రాల నీ - మీఁద విరాళి
దానెఱుఁగడు చొంప - దంశకాదులును
నినుబాసి క్షణమైన - నిద్ర యెఱుంగఁ
డనుచోట నతని కా - హార మెక్కడిది?
ఒకవేళఁ గనుమూసి - యొకకొంత నిదుర
నొక క్షణమాత్ర దా - నుండి రాఘవుఁడు
అదరి పాటున లేచి - హా! సీత! యనుచు
నెదురువారలు విన - నెలుగెత్తి పలుకు 2900

మంచిపువ్వులు పరి - మళములు చవులు
గాంచిన ఫలములు - కమ్మ తెమ్మెరలు
పొదరిండ్లు చూచిన - ప్పుడు నినుఁదలఁచి
మదిఁ గందియసురని - మ్రాన్గన్ను పెట్టు
లోలుఁడై నీతోడి - లోకంబె కాక
యోలేమ! రఘువరుఁ - డొల్లఁ డేమియును
తామసింపక వచ్చి - దశకంఠుఁ దునిమి
నీమనోరథముల - న్నియు నొనగూర్చు
నూరడిల్లు” మటన్న - నుర్వీతనూజ
మారుతనందను - మాటలచేత 2910
శరదాగమనమున - జలధరశేష
పరిచితిఁ గన్నట్టి - పద్మారితోడ
నెసఁగిన యామిని - కెనయైన సీత
యెసకంబు మానితా - నిట్లని పలికె

-: సీత యామాటలకు ధైర్యముఁ జెందుట :-

“అన్న! వాయుకుమార! - యమృతంబుఁ జిలుక
విన్న నీమాటలు - వేడుక చేసె
రాముని చింతాభ - రంబునే వినిన
నేమందు రావణు - నింటిలో నున్న
యీ దుఃఖమునకన్న - నినుమడియైన
ఖేదంబుఁ జేసెనే - క్రియ నోర్చుదాన? 2920
కలిత సుఖాసుఖ - కరములై నీదు
పలుకుల తెఱఁగు నా - భావంబులోన
నమృతంబు విషము జో - డైకూడి నట్టి

క్రమమునఁ బ్రమదంబు - గాసియుఁ బెనిచె.
మేలును గీడునే - మేరలఁ జెందు?
కాలంబు వచ్చినఁ - గడప లేకునికి
మముఁ జూచితివె నడు - మఁ బయోధిలోనఁ
దెమలి క్రుంగిన యోడ - తెరవరులెల్ల
గడ తేర నేరని - కైవడి నిట్టి
యెడపని వెతలచే -నీఁత లీదెదము! 2930
రాముఁ డెప్పుడు గెల్చు - రావణు నపుడు
నామీఁది కరుణఁ బ్రా - ణములిచ్చి నిలుపు
దశమాసములకు నిం - త గొఱంత నేను
దశరథాత్మజుఁ బాసి - దశకంథరుండు
మితి చేసె రెణ్ణెల్లు - మీదటఁ దనకు
నతనిచే బ్రదుకు లే - దటుగాన వేఁగఁ
గాకుత్స్థతిలకు లం - కాపురంబునకు
నేకైవడి దెచ్చు - నెన్నిక నీకుఁ
దోఁచె నట్టిది చేసి - తోకొనిరమ్ము
దాఁచక నీకు నిం - తయు వివరింతు. 294 0
అసురనాథుని తమ్ముఁ - డగు విభీషణుఁడు
విసువక మంత్రులు - వినఁ గొల్వులోన
"వలదన్న! రాముని - వనిత నీ కేల
కులమెల్లఁ జెడు సీతఁ - గోరితివేని
రామునిచరణ సా - రసములు చేరి
నామీఁద నేరమె - న్నక ప్రోవుమనుచు
నొప్పగించితివేని - యోర్చి నీదైన
తప్పుసైరించు సీ - తానాయకుండు

అనియెంత చెప్పిన - నామాట వాఁడు
వినఁడేమి తలచియో - విధివశంబునను! 2950
ఆవిభీషణు భార్య - యైనట్టి సరమ
యీవిధంబెల్ల నా - కేర్పరించుటకు
ననల యనంగ ప్రి - యంవదయైన
తనపెద్దకూఁతురుఁ - దనచెంత కనిచి
నాతోడ వివరించు - నాఁడు నాఁటికిని
భీతి నొందకుమని - బిమ్మటిఁ దీర్చు
మారుతాత్మజ! నీదు - మాటచేఁ గొంత
యూరడిల్లితి దైవ - యోగంబుచేత
ధైర్య ఋజుత్వ స - త్య వివేక ధర్మ
శౌర్యశాంతిదయాది - సద్గుణంబులకు 2960
నెళవైన శ్రీరాము - నికి నెంత వీనిఁ
బొలియించుటని నాదు - బుద్ధిలోఁగలదు.
ఖరదూషణాది రా - క్షసుల సంగ్రామ
ధరణిలో నొకముహూ - ర్తములోనె తునిమి
యనుజునిఁ గడనుంచి - నట్టి రాఘవుని
గినియ శక్యమె యేరి - కిని వానరేంద్ర?
ఇంద్రుని మహిమంబు - లిట్లని కన్న
చంద్రాస్యయైనట్టి - శచియును బోలి
శ్రీరామచంద్రుని - చిత్తవర్తనము
లీరూపనియు చాల - నేనెఱుంగుదును 2970
బాణకరంబు లంబర - దైత్యకోటి
ప్రాణంబు లంబురూ - పమునఁ గ్రోలించు

శ్రీరామ సూర్యు నీ - క్షింతునే యీశ
రీరంబుతోఁ గేస - రికుమార నేను?”
అనునంత జలజల - నశ్రుపూరములు
కనుగొలుకుల నోడి -కలుగాగఁ గురియఁ
దలవంచు కొనుటయు - ధరణిజఁ గాంచి
'వలదని' యాకరు - వలిపట్టి పలికె

-:హనుమంతుఁడు సీతను రామునికడకుఁగొని పోవుదునని విన్నవించుట:-

'అమ్మ! చింతింపకు - మదె రాఘవుండు
తమ్మునితో భాను - తనయునితోడ 2980
వచ్చును వచ్చిరా - వణుని ఖండించు
నిచ్చలో నదినమ్మ - వేని యింతేల
నిన్ను వీపునఁ దాల్చి - నిమిషంబులోన
మున్నీరు దాఁటి రాముని - చెంత నునుతు!
కొనిపోవఁ జాలఁ డొ -కోయను శంక
మనసులోపల నీవు - మాను మీలంక
యీరాక్షసాళితో - నే బెల్లగించి
కోరకైవడి కేలఁ - గొని మింట నేఁగ
సత్తువ కలదు వి - చారమేమిటికి?
ఉత్తమగుణవతి! - యొక సెలవిమ్ము 2990
హుతవహుఁడందు నా - హుతులు తాఁదెచ్చి
శతమఘునకు నిచ్చు - చందంబుఁ దోఁపఁ
గానుక సేతు రా - ఘవునకు నిన్ను

మానినీమణి! మాఱు-మాటాడవలదు!
ఇతనిపైఁ జనవచ్చు - నే నాకు ననక
యతివ రోహిణి చంద్రు - నందినరీతి
నీ నాయక-నిఁ బొంది - నెమ్మదినుండు
మేను గల్గియు నింక - నేల భేదంబు?
ఏలీల వచ్చితి - నేవార్ధి దాఁటి
యాలీలఁ జులకఁగా - నమ్మ! యేనెగసి 3000
నిను దాల్చి పోవుచో - నిర్జరులైన
నను గూడలేరు దా - నవులేమి లెక్క?
మానసవేగాస - మానసత్వములు
మానిని! కలవాఁడ - మసలక రమ్ము."
అన విని పులకించి - యనురాగ మొంది
హనుమంతుతో జన - కాత్మజ వలికె.

-:సీత హనుమంతుని బలము సందేహించుట:-

"నాతోడ నీవు వా - నరుఁడవుగాన
జాతికిఁ దగినట్టి - జాడఁ బల్కితివి.
ఏనెక్కఁ డీవెక్కఁ - డెంతకునెంత?
పూనిన నెత్తుక - పోవ నోపుదువె! 3010
జలధి నేక్రియ దాఁట - జను? నీకునింత
సులభమే? కనుఁగొను - చో నింత లేవు!
ఇందాక నీమాట - లే వినుటెల్ల
సందియంబయ్యె నీ - శపథముల్ వినిన.”
అని తన్ను నమ్మక - యసదుగా నెంచి
జనకజ వలుక స్వ - చ్ఛందగాత్రుండు


-:హనుమంతుఁడు తన నిజస్వరూపమునుఁ జూవుట :-

"కాదింక నానిజ - గాత్రంబుఁ జూపి
వైదేహికిని నిక్కు - వము సేయకున్న"
నని హిమాచల మంద - రాగ కైలాస
కనకాచలంబుల - గతి మేను వెంచి 3020
తామ్రవక్త్రుఁడు వజ్ర - దంష్ట్రానఖుండు
కమ్రభీకరభుజా - ర్గళుఁడును నగుచు
ననలార్కసంకాశుఁ - డై పవమాన
తనయుఁడు క్రమ్మఱ - ధరణిజ కనియె
'కొత్తడమ్ములతోడఁ - గోటలతోడ
మత్తేభతురగస - మాజంబు తోడ
నీరావణునితోడ - నింతులతోడ
నీరాక్షసాళితో - నీత్రికూటంబుఁ
బెకళించుకొని కేల - బెల్లపుటచ్చు
నకునుద్దిగా గగ - నంబున కెగసి 3030
చనుదునో! నిన్నుభు - జాపీఠి నునిచి
వనధి దాఁటుదునొ! రా - వణముఖ్యులైన
యీదానవులనెల్ల - నిరుగేలఁ జమరి
యో దేవి! యరులపే - రుడుగ జేయుదునొ!
అమ్మ! యిందొకమాట - యానతి యిచ్చి
నమ్మి యాపైరమ్ము - నామీఁద నీవు!"
అనునంత గజగజ - నవనిజ వణఁకి
మనసు రంజిల హను -మంతున కనియె


-: సీత హనుమంతునకు సమాధానముఁ జెప్పుట :-

అంజనాతనయ! నీ - వహితదైతేయ
భంజనుఁడవు నీదు - బాహాబలంబు 3040
జవసత్త్వములును ని - జంబులు జలధి
చవుకళించుట నీ క - సాధ్యంబు గాదు!
నీదుపైరా రాము - ని యనుజ్ఞ మొదట
లేదు గావున వెంట - లేచి రారాదు
కాకవచ్చిన నీదు - గమన వేగమున
నాకంపమునఁ బొంది - యంబుధిలోనఁ
బడిన నమ్మీనముల్ - భక్షించిపోవు
పడనీక గట్టిగా - బట్టితివేని
వెంటాడి వత్తురీ - వీరదానవులు
మింటిత్రోవను వారి - మీఱిపోరాదు!3050
'వారలు నాకెంత? వధియింతు' ననినఁ
బోరాడ నాయుధ - మ్ములు నీకు లేవు
వారికే మఱలఁ గై - వశమైతి నేని
నేరరు మఱి తాళ - నేఁడె మ్రింగుదురు!
నీవె రావణుఁ బట్టి - నిర్జించితేని
యావల రాముశౌ - ర్యము నిరర్థకమ్ము!
ఒంటిగాడవు నన్ను - నొకయెడ డించి
బంటించి యహితులఁ - బైకొనరాదు
తనకెట్టులైన చో - దయె తీఱె! నీకు
నని హానియైనఁ గా - ర్యము వమ్మువోవు!3060
నీవుగెల్చిన రాము - నికిఁ గీర్తి లేదు!
చావనీయక వారు - చలపట్టుపట్టి

కొనిపోయి రే నొక్క - గొందిలో డాఁచి
యునుతు లన్యులెఱుంగ - కుండ నెందైన
నటుగాన నీనేర్చి - నట్ల శ్రీరాము
నిటకుఁ దోకొనివచ్చి - యీనిశాచరులఁ
దునిమించి యామీఁదఁ - దోకొని నన్ను
చను నొప్పుఁగాని యో - జన యిదిగాదు
రామలక్ష్మణులకు - ప్రాణంబు లెల్ల
నామీఁదనుండు గా - నఁ బ్రమాద వశతఁ 3070
దనకొక్కటైన చోఁ - దమ్ములు దాను
మనఁడు కౌసల్యాకు - మారుఁడే యెడల
నదిగాక యితరుల - నంటనెవ్వరిని
మదియొగ్గి యొక్క ప్ర - మాదంబు చేత
దిక్కులేనట్టిచోఁ - దెగపట్టి తెచ్చె
రాక్షసుఁడను విచా - రమునఁ గుందెదను
అందుచేఁ బుత్ర మి - త్రాదులతోడ
మ్రందించి దనుజేంద్రు - మదమడగించి
కొదవలు దీర్చి తో - కొనుచుఁ బొమ్మనుము
సదయాత్ముఁడగు రామ - చంద్రునితోడ 3080
వాయువుతోఁగూడు - వహ్నియో యనఁగ
నాయుధపాణియై - యనుజుఁడుఁ దాను
నిలిచిన శ్రీరాము - నికి నెదిరింపఁ
గలరె దేవాసుర - గంధర్వముఖులు?
తామసించక నన్ను - దరిచేర్పఁ దలఁచి
రామలక్ష్మణులను - రవికుమారకునిఁ
దోకొనివచ్చి నా - తుందుడు కార్చి

కైకొనుమీవు సం - కల్పసిద్ధులను.”
అనుచు దైన్యోక్తు లి - ట్లాడిన సీతఁ
గనుఁగొని సామీరి - క్రమ్మఱఁ బల్కె 3090
“అమ్మ! నాతోడ నీ - వాడిన మాట
సమ్మతంబది పుణ్య - సాధ్వివిగాన
మున్నీటిమీఁద నా - మూపుపై నెక్కి
మిన్నులఁ జూపుట - మేరగాదనియుఁ
బోరాకయును పర - పురుషుల నంట
దీఱునే యెందు స - తీమణి కనియు
నాడిన వాక్యంబు - లవి నీకె చెల్లు!
వేడుకయయ్యె! నీ - విభుచెంతఁ జేరి
నీవున్న చందంబు - నీ విచారంబు
నీవచనంబుల - న్నియుఁ దేటపఱచి3100
నీ మనోరథములు - నెఱవేర్చువాఁడ
రామలక్ష్మణులు వా - రాశిపై దాఁటి
రాలేరనియు వాన - రశ్రేణి చేరఁ
జాలదంచును యత్న - సాధ్యంబుగాని
సులభంబు గాదని - చూచి యేనిట్లు
పలికితి 'రమ్మునా - పై' నంచు నిన్ను,
అదిగాక తనయుని - యట్లయే మిమ్ము
మదినమ్మి కొలిచిన -మందమేలమున
రమ్మంటి యేవాన - రస్వభావమున
నమ్మ! నామాట యె - గ్గని యెంచవలదు 3110
ఇపుడె పోయెద రాము - నెటకు నామీఁదఁ
గృపయుంచి గుఱుతుగా - నెద్దియే నొకటి

పాలించి పొమ్మని - పనుపు ” మటన్న
నాలించి క్రమ్మర - యవనిజ వలికె

-: సీత హనుమంతునితో రామునికి కొన్ని గుఱుతులు చెప్పుమనుట

“రావన్న గుఱుతువా - ర్త యొకండు గలదు
పావని! నీతోడఁ - బల్కెద నిపుడు
ఒకనాఁడు చిత్రకూ - టోపరికుంజ
నికటంబునందు వ - నీకేళి నలసి
మున్నుగా ఫలమూల - ములకు నామఱఁది
చన్నట్టియెడ నొక్క - చలువరాపలక 3120
మీఁదరాముఁడు విశ్ర - మించిన నేను

-: కాకాసుర వృత్తాంతము :-

నాదండఁ జరియించు - నపుడొక కాకి
నాచనుమఱ తన - నఖమునఁ జీరఁ
జూచి యేనొక్క పెం - చున నదలించి
వ్రేసిన నదిపోక - వినుజాడ నెగసి
లాసి క్రొవ్వాఁడి గో - ళ్లనురంబుఁ జీరఁ
గరపల్లవమున బం - గరు మొలనూలు
సరగునఁ గీలూడ్చి - చాల గోపమునఁ
దరిమి కొట్టెదనని - తానేఁగఁ బైఁట
చెఱఁగు జాఱఁగ బిగిం - చిన నీవి వదలి 3130
వలువ జాఱిన రఘు - వర్యుఁడు చూచి
కలకల పరిహాస - గతిని నవ్వుచును

జూడ మాయలకాకి - జోపక మఱలి
వ్రీడ గైకొని ప్రాణ - విభు తొడలందు
వసియింప నలసిన - వాఁడౌట విభుఁడు
వసుధ శయించి నా వామోరు పీఠిఁ
దలగడగాఁగ ని - ద్రాసక్తి నుండఁ
జలపట్టి యాకాకి - చంచువుల్ నాఁట
నురముపైఁ బొడిచిన - సూరకతాళి
తఱిచూచి రమణుని - ద్రాభంగమునకు 3140
జాలకయున్న న - స్ర ప్రవాహంబు
జాలెత్తి తనదు భు - జంబుపైఁ గురియ
నిదుర మేల్కాంచి కం - టికిఁ గోరగించు
నెద గాయమునఁ బ్రవ - హించు రక్తమునఁ
దోఁగిన నను జూచి - 'తొయ్యలి! నీకుఁ
రాగతమేమి యు - రంబుపై నంటు?
యనవిని యిది హేతు - విని విన్నవింపఁ
గనలుచు నొకయీషి - కనుజేత నంది
బ్రహ్మమంత్రంబుఁ దాఁ - బలికి వేయుటయు
బ్రహ్మాస్త్రమై తన - పై దర్భపోఁచ 3150
రాజుచు విలయాగ్ని - రవులు కొన్నట్లు
రాఁజూచి కాకి పా - ఱఁగ నది తరుమఁ
గాకారవంబుతోఁ - 'గావరే!' యనుచు
లోకంబు లెల్ల నా - లోకించి చుట్టి
యజహరేంద్రాదులౌ - నమరులవేడ
గజగజ వడకుచు - గాంచి వారెల్ల
మ్రొక్కుచు 'రాఘవా - మోఘదివ్యాస్త్ర

మెక్కడ యదిమాన్చు - టెక్కడ? నిన్ను
గాచు టెక్కడ? యెఱుఁ - గక వచ్చినావు
చూచుకొమ్మింక గా - చు తెఱఁగు నిన్ను 3160
నిందు నుండక చను - మెచ్చోటికైనఁ
బొందుపట్టున' కని - పోవఁ ద్రోలుటయు
నేకాకియై చొర - నెచ్చోటు లేక
యాకాకి రాముని - యడుగులుచేరి
'శరణు చొచ్చితినయ - జగదేకవీర!
శరణంబు నీకు కౌ - సల్యా కుమార!
ఆదరింపుము శర - ణాగతత్రాణ!
కోదండ దీక్షాది - గురుకీర్తినిరత!
రామ! నీమహిమ మె - ఱంగక రాజ
సామాన్యుగా నెంచి - జనకతనూజఁ 3170
జెనకితిఁ గృపఁజూచి - చేపట్టి నన్ను
మనుపుము మఘవకు -మారుఁడ నేను
పేరు జయంతుఁడు - పిచ్చుకమీఁద
నో రామ! బ్రహ్మాస్త్ర - మురక వేయుదురె?
చేతనంటి తృణంబు - చిదిమి వేయుటయు
నాతతంబైన బ్ర - హ్మాస్త్రమై వచ్చె
నన 'నమోఘంబు నా - యస్త్రంబు నీదు
తనువున నొకచోటు - దాని కొసంగి
చను' మన్న వామలో - చన మిచ్చి వాఁడు
చనియె నేనును రామ - చంద్రుఁడుగాని 3180
యీమాట సౌమిత్రి - యెఱుఁగఁడీ గుఱుతు
స్వామితో నేకాంత - సమయంబు నందు

వినిపించు" మనిన సా - ధ్వీశిరోమణికి
హనుమంతుఁ డబ్బుర - మంది యిట్లనియె
"రాముఁడు నిన్నేమ - ఱక యున్నవాఁడు
సౌమిత్రి మఱచునే - స్వప్నంబులోన?
ఱేపె రాఁగలఁడు గ - ర్వితుల నడంచి
చేపట్టు నిన్నుఁ గౌ - శిక రక్షకుండు!
అందఱితో నేమి - యందు నేఁబోయి
యిందీవరాక్షి! నా - కెయ్యది బుద్ధి 3190
పలుకు మీవన గాలి - పట్టినిఁజూచి
యిలసుత వెండియు - నిట్లని పలికె

-: సీత హనుమంతునితో శ్రీరామునికిఁ జెప్పఁదగిన సంవాదమునుఁ జెప్పి శిరోమణినిచ్చుట :-

సకలలోకములకు - స్వామియైనట్టి
సకలజ్ఞు రాముఁ గౌ - సల్యాకుమారు
నడుగుల కెఱఁగి నే - నడిగితి ననుచు
నుడువుము పవనత - నూజ! మున్నుగను
తల్లిదండ్రుల నన్న - దమ్ములఁ బాసి
యెల్లభోగముల మీ - యింట నేమాని
వచ్చిన తరువాత - వనులందు నన్ను
మచ్చిక నందఱి - మాఱుగా నీవు 3200
రక్షించి నన్ను నూ - రక చేయి వదల
దక్షుఁడవగునీకుఁ - దగ వౌనె? యనుచు
సౌమిత్రితో రామ - చంద్రుఁడు వినఁగ
నామాటగాఁగ వి - న్నప మాచరింపు

తలిదండ్రులని మమ్ముఁ - దలఁచును దండ్రి
దలఁపఁ డాయనఁజూచి - తన ప్రాణవిభుఁడు
దయఁగలవాఁడు 'సీ - తా' యంచు వచ్చి
శయనవాసము చెంత - సైదోడువోలె
యాకలి యరసి తి - య్యని పండ్లు నచటి
పోకపాళెల మాంస - ములు దెచ్చి యిచ్చు 3210
గంటికి ఱెప్పయై - కాచు నే వేళఁ
గంటెఱుంగడు నిలు - కడఁ గలవాఁడు
పసి బిడ్డవలె నాదు - పరిచర్య సేయు
విసువఁ డేమఱఁ డేక - వృత్తంబు వాఁడు
అట్టి లక్ష్మణునితో - నడిగితి ననుచు
గట్టిగా ముమ్మారు - గాఁబల్కుమీవు
భారకుఁడైనట్టి - భానుజుతోడ
నేరూపమునఁ బల్కి - యీ కార్యమునకుఁ
బురికొల్పవలయునో - పొసఁగిన యట్టి
సరణిగాఁ బలికి ద - శగ్రీవుఁ దునిమి 3220
నన్నురాఘవు పాద - నళినముల్ చేర్చు
నెన్నిక మఱువక - యేరీతి నీకు
సరిపోయినటులాడి - సంకల్పసిద్ధిఁ
బరగుము నాకేమి - పని నీకె తెలుసు
నెలకు మిక్కిలి దాల్ప - నేరఁ బ్రాణములు
తొలుత నింద్రుని చేతఁ - దోయజాక్షుండు
విష్ణుఁడు సేయించి - వెలుతులు దీర్చి
వైష్ణవయాగ ది - వ్య ప్రభావమునఁ

బాతాళ బిలమునఁ - బడిపోయినట్టి
శాతమన్యవమహై - శ్వర్యంబు మఱల 3230
నిచ్చినకైవడి - నీవు రాఘవునిఁ
దెచ్చి సంగరయాగ - దీక్షితుఁ జేసి
నన్ను జేకూర్చి పు - ణ్యముఁ గట్టుకొమ్ము
బన్నంబుఁ దీర్పు మా - పద నివారించి!"
అని తన జిలుగుఁ బ - య్యంట చెఱంగు
కొనగొంగుముడి వాలు - గోళ్ళచే విడిచి
మానినీమణి శిరో - మణి హనుమంతు
చే నిచ్చుటయు నంది - శిరసావహించి
మేను గొంచెము చేసి - మేరువుగాలి
లేనిచో నురక చ - లింపకున్నటులఁ 3240
గన్నులుంగరము లొ - క్కట మొగిడించి
సన్నుతింపుదు రాము - చరణముల్ దలఁచి
మఱిలిపోవుదునని - మదిలోన నెంచి
కరువలిపట్టి యా - కల్యాణి కనియె.
“ఇదె చనుచున్నాఁడ - నేఁ దెత్తు రాము!
కొదవలన్నియుఁ దీఱెఁ - గులములోఁ దనకు
వన్నెవాసులు గల్గె - వైదేహి! యింత
మిన్నగల్గిన తల - మిన్న యిచ్చితివి
అనుమతియే?" యన్న - ననిలనందనునిఁ
గనుఁగొని మిథిలేంద్ర - కన్య యిట్లనియె.3250
“పోయిరమ్మిపుడ య - భ్యుదయమౌఁగాక
మాయన్న! యనిలకు - మారక నీకు
నీ శిరోమణిచేత - నింకిటమీఁద

 దాశరథుల మన - స్తాపముల్ దీఱు
నందుచే నుత్సాహ - మగ్గలికయును
జెంది మావారు వ - చ్చి జయింపఁ గలరు
తరణితనూజుఁడు - తన సేన నెల్లఁ
బురికొల్పి లంక యి - ప్పుడె చూఱవట్ట
నీవు పూనిక కార్య - మీడేరుఁ జనుము!
కావలసిన నేడు - క్రమియింపు మిచట 3260
నలసినవాఁడ వి - య్యంబుధి దాటఁ
గలవె! సామాన్యమే? - కన్నుల నిన్ను
జూచుచు నీతోడ - సుద్దులాడుచును
నాచింత మఱచి యుం - డఁగనేల కలుగు?
భాగ్యహీనత నిన్నుఁ - బనిచెదఁ జెలిమి
యోగ్యుల వీడఁ జే - యుట సౌఖ్యకరము
యెడవాయునది దుఃఖ - మిఁక నిన్నుఁబాయ
గడియయైనను బ్రహ్మ - కల్పమైతోఁచు.
తడవుగాఁ బ్రాణముల్ - దాలుపు శక్తి
వొడమ దీమీఁద నా - పుణ్య మెట్టిదియొ? 3270
ఎట్టులున్నదియొ నీ - హృదయప్రచార
మెట్టుగాఁదన తపం - బీడేఱఁ గలదొ?
నమ్మితి నున్నవా - నరబలంబునకుఁ
గిమ్మన వంచునే - కీలాలరాసి?
గరుడఁడు నీవును - గాడ్పును రామ
తరణిసూనులు సుమి - త్రాకుమారకుఁడు
దాఁటఁ జాలుదురీ యు - దన్వంతుఁగాక
యేఁటిమాట కపీంద్రు - లెట్లు రాఁగలరు!

ఐన వీఁడన నెంత ? - యర్కజునంత
వాని సహాయంబె - వలె నింతెకాని 3280
వచ్చునే యెదుర నా- స్వామి విల్లంది
చిచ్చఱమ్ములు గురి - సిన నేరికైనఁ
దోడాస సేయునే? - తోయజారాతిఁ
జూడఁ డెదిర్చిన - చోరామవిభుఁడు!
తోడితెమ్మెటు లైనఁ - దోయధి దాఁటి
నేఁడె చేరుదె రాము - ని సమీపమునకు?
పోయెదవే?”యన్న - భూమిజఁ జూచి
ధీయుక్తి వానరా - ధిపుఁ డిట్టులనియె.
"జనయిత్రి! వానర - సాధారుణులకు
వననిధి లంఘింప - వచ్చునే యనుచు 3290
నంటివి నా స్వామి - యర్కనందనుని
బంటులకిది యెంత - పని? వినవమ్మ
నాకన్న నధికులు - నాసముల్ గాని
నాకుఁ దక్కువయైన - నగచరాధముని
వెదకి చూచెదమన్న - వేలంబులోనఁ
బదికోట్లు కొకనిఁ జూ - పఁగఁ జాలరొకరు?
ఒక్కమా టూరుపు - వుచ్చక నడుమ
గ్రుక్కక జలధి చం - గున దాఁటఁగలరు
కపివీరులెల్ల కి - గ్గాడి వానరుఁడఁ
దపనాత్మజుని చెంతఁ - దాకొక్కరుండ 3300
రామలక్ష్మణు లెట్లు - రానేర్తురనిన
నోమానవతి! నాదు - జోరుపీఠముల
నిరవుర ధరియించి - నెగిరియేవచ్చి

నురుమింతు నీరావ - ణు సరాక్షసముగ!
పూఁట కాఁపులు రఘు - పుంగవు శస్త్ర
కోటి నాపూనికఁ - గొనసాగఁజేయు
నాసత్యమాన యె - న్నడుఁ గల్లలాడ
నోసాధ్వి! యిపుడె పో - నోపుదు నేను
సింగంబునకు వెఱ - చిన మదేభంబు
సంగతిఁ బంచాస్త్ర - సాయకంబులకు3310
లొంగినవాఁడు తా - ళునె రాకఱేపె?
కాఁగల్గియున్నట్టి - కార్యముల్ గలవు
చెవులార కపివీర - సింహనాదముల
రవళియు దశరథ - రామకోదండ
రణదురుజ్వాలతా - రావంబు ఘోర
రణహతస్వజనకా - రణదైత్యయువతి
రోదనంబులును మ - రుల్లోక సాధు
వాదంబు విందువా - వలహితంబులుగ
నామాట వినియు క్ష - ణంబైన నోర్చి
సీమగఁడిఁకఁ దాళు - నే? యేఁటికమ్మ3320
యీ విచారంబు నీ - వెఱుఁగవుగాక
నీవిభు మదిఁగాన - నే చూచి యేను?"
అనుచు నమ్మికలిచ్చు - హనుమంతుఁజూచి
యనుకంపతో వసు - ధాత్మజ వలికె.

-: సీత హనుమంతు నాశీర్వదించి పంపుట :-

"వాడుఁ దేఱితి నీదు - వదనంబుఁ జూచి
నేఁడెట్టిదో పది - నెల్లకీదినము

కల్యాణకరమయ్యెఁ - గరుణింపుమని య
హల్యామహాదోష - హారితో నీవు
తెలుపుము కాశ్మీర - తిలకంబు నీదు
నెలవంటి మోముపై - నిన్నెడవాయు 3330
నాఁడు దీర్చితిగాన - నాయనవాలు
చూడుము తలఁచి యం - చు వచింపుమీవు.
కాకాసురుని దుండ - గము లేకతమున
వాకొను మితరు లె - వ్వరు విననీక
తలమానికం బిమ్ము - తరణినందనుని
తలమానసులనెల్లఁ - దలఁచితిననుము.
రాముని మారుంగ - రముఁ జూచి చూచి
భూమిజ యోర్వక - పొగిలెడి ననుచు
నక్కడిపెద్దల - యందఱితోడ
మక్కువవుట్ట నా - మాటగా ననుము. 3340
ఈ శిరోమణి యిచ్చి - యిఁక నెలగాని
క్లేశంబునకుఁ దాళ - లేనిటమీఁద
నీవు వచ్చుటచేత - నిమిషంబులోనఁ
బోవు ప్రాణములు గొ - బ్బున మఱల్చితిని
రావణనకు దయ - రాదు నామీఁదఁ
జావునకును దెగు - సందేహమేల?
నన్ను రక్షింపు వా - నరవీర!" యనుచుఁ
గన్నీరు నించి గ - ద్గదకంఠి యగుచు
శోకించు సీతను - జూచి యేమియును
వాకొనలేక పా - వని యూరకున్న 3350

మఱియు జానకి హను - మంతునితోడ
పరమహితాదర - ప్రౌఢి నిట్లనియె.
"గుఱుతు వేడితివి నా - కోర్కె దీర్చుటయె
గుఱుతింతె కాకవి - గుఱుతులు గావు.
మాయన్న నీవు సే - మంబుతో వేగ
పోయిరమ్మిఁకఁ దల - పూ వాడకుండ.
త్రోవలో విఘ్నముల్ - ద్రోచి ధైర్యంబు
లావును విజయ వి - లాసంబుఁ గాంచి
మేలొందు” మనిన భూ - మిజ మాటలోనె
వేళంబె యాకపి - వీరశేఖరుఁడు 3360

-: హనుమంతుఁడు రావణుని శక్తిని పరీక్షించుటకు నశోకవనమును పాడుచేయుట :-

"వచ్చితీ లంకకు - వైదేహిఁ గంటి
ముచ్చనే డాఁగి రా - మునిఁ జేరఁబోవ?
కనిపించుకొనియెదఁ - గాక యశోక
వనమెల్లఁ గూల్చి రా - వణుభావ మరసి
సామాద్యుపాయముల్ - చనదిట్టియెడలఁ
జేమీది యిటునడ - చినఁ గార్యమునకు
దండనోపాయంబె - తగుఁ గాన వీని
దండించుటొప్పు సీ - తానిమి త్తముగ
రాక తీరదు రఘు - రామున కేను
వాకొన్న యప్పుడే - వచ్చు దండెత్తి 3370
వీని బలాబల - వృత్తముల్ చూచి
కాని పోరాదేను; - కనిపించుకొన్నఁ

బోరికి నంపక - పోఁడు రాక్షసుల
నీరావణుఁడు వారి - నెల్ల వధింప
నందుచే బలహాని - యగుఁ గొంతవీరి
కిందఱి శౌర్యంబు - లేర్పడుఁ దనకు
రావణు హృదయవ - ర్తన మేనెఱింగి
పోవుట లెస్స చ - ప్పుడుగాక యుండ
చననేల నాకని" - శతమఖోద్యాన
వనసన్నిభాశోక - వనము నీక్షించి 3380
యుత్తాలమై వాల - ముడువీథి నాడ
నుత్తరముఖముగా - నుత్తుంగ కనక
గిరినిభగాత్రుఁడై - కేసరిసుతుఁడు
బరవసంబున నూరు - భాగసంజనిత
పవన నిర్మూలిత - పాదపగుల్మ
నివహుఁడై కనకమ - ణీసౌధయూధ
కాసారశతదీర్ఘి - కాకాయమాన
భాసమానంబై సు - పర్వులకైన
దేఱి చూడఁగరాని - దేవారి విభుని
యారామ మంతయు - నారాముదూత 3390
పెఱికి వేఁటాడి ద - ర్పించి దైత్యులకు
వెఱపు పుట్టించి దో - ర్వీర్యంబు మెఱసి
యారామసాలమ - హాద్వార సౌధ
తోరణంబున నిల్చి - దుర్వారుఁడగుచు
దిక్కులు చూచుచోఁ - దెలవాఱవచ్చె.
ఒక్కట లంకలో - నుల్కలు రాలె!
ఆ వేళ మేల్కని - యవనిజ చుట్టుఁ

గావలియున్న రా - క్షసభామ లెల్ల
నల్లనికొండ చం - దంబునవాల
మల్లార్పుచును దోర - ణాగ్రంబునందుఁ 3400
గదలక యున్నట్టి - కపివీరుఁ జూచి
బెదరి జానకిఁ జూచి - భీతిఁ దొట్రిలుచు
“వీఁడెవ్వఁ డమ్మ! యీ - విపినంబుఁ గూల్చి
నాఁడు? దర్పించి యు - న్నాఁడు వాకిటను.
నీతోడి మాటాడి - నీ యనుగ్రహము
చేత నీవనముఁ గూ - ల్చె నశంకవృత్తి
వెఱపు పుట్టెను మాకు - వివరింపు"మనిన
ధరణిజ దనుజకాం - తలకు నిట్లయె.
"ఎవ్వడో వాఁడు మీ - రెఱుఁగుదు రిట్టి
నవ్వులు గలవె? వా - నరమూర్తిఁ దాల్చి
వచ్చినవాని రా - వణుఁ డంపెనేమొ.
ఇచ్చోటి కదిగాక - యే రాక్షసుండు
మాయావియై యీ క్ర - మమునవనమ్ము
రాయిడిచేసి తో - రణ మెక్కినాఁడు
వానికిఁ దెలుసు నా - వల మీకుఁ దెలుసు
నే నెఱుంగుదునె పొం - డెటు పోతిరేని.”

-: సీతవద్ద కాపున్న రాక్షసస్త్రీలు రావణునితో అశోకవనభగ్నవృత్తాంతముఁ దెలుపుట :-

అన భీతితోఁ గొంద - ఱసురభామినులు
దనుజవల్లభుని చెం - తకుఁ జేరఁబోయి

గజగజ వడకుచుఁ - గరములు మొగిచి
యజరారివిభుఁ “డేమి?" - యన వారలనిరి. 3420
అయ్య! యీ వేళఁ గొం - డంత వానరుఁడు
దయ్యమువలె వచ్చి - ధరణిజతోడ
నిందాఁక యేమేమొ - యేకాంతమాడి
నందనోద్యానంబు - నకు జంటయైన
మన యశోకవనంబు - మాటమాత్రమునఁ
దన యిచ్చవలయు చం - దమున నుగ్గాడ
శింశుపావృక్షంబు - సీతకై యునిచి
కింశుకవకుళకం - కేళిరసాల
పనసనింబకదంబ - పాటలప్రముఖ
వనమహీరుహముల - వసుధ పాల్చేసె! 3430
పాకశాసనుఁడు పం - పఁగ వచ్చినాడొ
కాక కుబేరుఁ డి - క్కడికిఁ బొమ్మనఁగ
వచ్చిన దూతయో - వసుమతీతనయ
ముచ్చట దీర్ప రా - మునిపంపు వూని
యేతెంచెనో వాని - యెదురు కట్టునను?
సీతఁ జేరఁగ వెఱ - చితిమిందఱమును
దలఁపరాదిఁక సీ - తఁ దలయెత్తిచూడఁ
బొలియించువాఁడు మీ - బోటులనెల్ల!
కావలసినయట్టి - కార్యంబుఁ జూడు
మావల నీచిత్త” - మని వల్కునంత. 3440
“ఏమేమి?” యని కన్ను - లెఱ్ఱగాఁ జేసి
రోమముల్ మిగుల ని - ట్రుపడంగ నలిగి

మండు దీపముల సం - పఁగి నూనె వడియు
చుండుకైవడి నశ్రు - లుప్పతిలంగ

- : రావణుఁడు పదివేలమంది రాక్షసవీరులను హనుమంతునిపైఁ బంపుట :-

నలుబదివేలు దా - నవ వీరభటుల
బల శౌర్యములఁ దన - పాటి వారలను
బిలిపించి "నేఁడొక్క - పెనుగ్రోతి వచ్చి
చిలివిషంబులు జేసి - సీతయున్నట్టి
వనమెల్లఁ బెఱికి యె - వ్వరి లెక్కఁగొనక
మనతోఁట వాకిటి - మంటపాగ్రమున 3450
నున్నది దాని మీ - రొడిసి పోనీక
వెన్నంటి యాజ్ఞఁగా - వింపుఁడుపోయి.”
అనవారు శలభంబు - లనలంబులోనఁ
గనియుఁ గూలఁగఁ బోవు - గతిఁ జేరఁబోయి
భానుని కరముల - పాటినిశాత
నానాస్త్రకోటి వా - నయుఁబోలి కురియ
నవి యెల్ల హనుమంతుఁ - డలవోకగాఁగ
నవలికీవలికి వా - లాగ్రంబు చేత
వారించి శౌర్యదు - ర్వారుఁడై తోర
ణారూఢుఁడై యట్ట - హాసంబుఁ జేసి 3460
"జయమొందు శ్రీరామ - చంద్రుఁడు నేఁడె
జయశాలి యగును ల - క్ష్మణకుమారకుఁడు
రామపాలితుఁడు మా - రాజు సుగ్రీవుఁ
డామేర జయశాలి - యై యొప్పుఁగాక

కోసలేంద్రునకు ర - ఘుప్రవీరునకు
దాసుఁడఁ బవమాన - తనయుఁడ నన్ను
హనుమంతుఁ డందు రా - హవమున రిపులఁ
దునుముదుఁ దరులు న - ద్రులు బ్రయోగించి
సరిగారు రావణ - శతసహస్రములు
దురములో నొకవీనిఁ - దునుముఁట యెంత! 3470
నాదు శక్తిని వీని - నగరమంతయును
వైదేహి వెదకి యీ - వనములోఁ గంటి
మాటలాడఁ గృతార్థ - మతినైతి, వనము
వేఁటాడితిని నాదు - పెంపెల్ల మెఱసి
యిదె పోవుచున్నాఁడ - నెఱుఁగమేమనక
కదిసి కన్గొనుఁడు రా - క్షసయోధులెల్ల.”

-: హనుమంతుఁడు వారినందఱిని సంహరించుట :-

అనునంత వారెల్ల - హనుమంతుమీఁదఁ
గనలి దివ్యాస్త్ర సం - ఘముఁ బ్రయోగింప
బరిఘ మొక్కటికేలఁ - బట్టుకఁ దాఁటి
బిరబిరఁ ద్రిప్పి యా - భీలసత్వమున 3480
నందఱ నురుమాడి - యని నెదిరింప
నెందు నెవ్వరు లేక - యెగరి మింటికిని
గదతోడ వేడెంబు - గాఁ బన్నగేంద్రుఁ
బొదివి పట్టిన పక్షి - పుంగవు రీతి
నెప్పటి తోరణం - బెక్కి నిప్పుకలు
కుప్ప వోసిన తెఱం - గునఁ బ్రకాశించు
హనుమంతుఁ గనుఁగొని - హతశేషులైన

 దనుజులు భీతిచే - దశకంఠు జేరి
యంతయు నెఱిఁగింప - నతఁడు గోపించి

-: రావణుఁడు జంబుమాలిని హనుమంతుని పైకి బంపుట :-

యంతకు రీతిఁ బ్ర - హస్తకుమార 3490
మగఁటిమిఁగల జంబు - మాలినిఁ జూచి
పగవూని నడచిన - పనిఁ దేట పఱచి
చనుమన్నవాఁడు రా - క్షససేనతోడ
ననికి నేతేరక -యటమున్ను గాఁగఁ
బొద్దుపోకల వన - భూమిలోఁ జెంత
మిద్దెలు పడఁద్రోచి - మేడలుగూల్చి
చప్పరంబులు ద్రొబ్బి - చదలెల్ల నిండ
దెప్పరంబుగ నార్వ - దిగులొంది యచటి
కావలియున్న రా - క్షసులెల్లఁ దమదు
లావులకొద్ది నా - లములకుఁ జేరి3500
పొడుఁడు పొడుండని - పోనీక గంగ
సుడివోలి నలుగడఁ - జుట్టుక పోర
హనుమంతుఁ డమ్మహా - యతనంబులోనఁ
గనకమయంబైన - కంబంబు వెఱికి
బిరబిరఁ ద్రిప్పినఁ - బెనుమంటలందుఁ
గరికట్టి సౌధంబుఁ - గాలిచి కూల్చె.
ఆ మహా స్తంభంబు - హస్తిహస్తమునఁ
దామరతూడు చం - దంబున మెఱయ
దానిచే నెదిరించు - దానవావళినిఁ
బీనుఁగు పెంటగాఁ - బీచంబడంచి

మఱల నవ్వాకిటి - మాళిగె మీఁద
గరువంబు దిటమున - గ్గలికయు మీఁది
భుజమున కంబంబుఁ - బూనుకఁ దనదు
విజయంబు లంకలో - వినరాఁగ నార్చె.
"కేసరిసుతుఁడ సు - గ్రీవానుచరుఁడ
దాసుఁడ నేను సీ - తానాయకునకు.
వారు వొమ్మని పం - పవచ్చితి నమ్మ
వారి పాదంబుల - వ్రాలి యేవచ్చు
పనిదీర్చి మఱలెద - బవరంబులోన
నను మారుకొన రావ - ణ సహస్రమైన 3520
చాలరు, నాస్వామి - జలజాప్త తనయుఁ
డేలిన పంపున - నీసీత కొఱకు
వెదకఁ బోయిన కపి - వీరులొండేను
పదినూఱు వేయి వే - ల్పదులొక లక్ష
కోటిగజంబుల - కునుగల్గు సాహ
సాటోప సత్త్వంబు - లమరని యట్టి
కపులెల్ల దిశలకుఁ - గదలినా రట్టి
యపరిమితంబౌ మ - హావానరాళిఁ
జేకూర్చికొని వచ్చి - శ్రీరామచంద్రుఁ
డీకంధి దాఁటి ద - హించు నీలంక!3530
అనిలోన పుత్రపౌ - త్రాదులతోడ
దనుజేంద్రుఁ దునుము సీ - తానిమిత్తముగ
నను నెదిరింప ను - న్నారు మీ వీటి
దనుజులలో? ధర్మ - దార వట్టుదునొ ?
పలుకుడు హతశేష - పలలాశు" లనుచుఁ

బలుకునంతట మిన్ను - పరియలు గాఁగ
విల్లుమోపెట్టుచు - "వేఁడి వానరుఁడు?
త్రుళ్ళడంచెదఁ బట్టి - తోఁకయుఁ జెవులు
తెగఁగోసి విడిచెదఁ - దెగి పారనీక
నగచరుఁ బట్టి దా - నవులార!" యనుచు 3540
నరుణ చందనభూష - ణాంబరమాల్య
సురుచిరద్యుతులతో - సూర్యుఁడోయనఁగ
పూజించి ఖరములఁ - బూన్చిన యరద

-: జంబుమాలి యుద్ధము - హనుమంతుఁడు జంబుమాలినిఁ జంపుట :-


మాజంబుమాలి చా - యన పఱపించి
సటలు వీడఁగ నర్ధ - చంద్రబాణమున
నిటలంబు నాటించి - నిశితాస్త్రయుగళిఁ
గరములఁ గ్రుచ్చినఁ - గరము కోపించి
హరివీరుఁ డతిశోణి - తాస్యంబుతోడ
గిరి శిఖరము వెల్ల - గించి పై నేయ
దురుము సేసెను వాఁడు - తూపులచేత 3550
శైలంబు వమ్మైన - సామీరి మీరి
సాలంబు వేలంబ - సంధించి మించి
వ్రేసిన దానవ - విభుఁడు తూణమున
దీసిన బలుదూపుఁ - దెగనిండఁ దీసి
చెట్టు చూర్ణముఁ జేసి - చిట్టాడగాలి
పట్టిపై వాఁడైదు - బాణముల్ దొడిగి
రొమ్ము నాటించిన - రోషంబు మిగుల

తెమ్మరకొడుకు న - ల్దిక్కులు జూచి
యొక పరిఘం బెత్తి - యురువడి నేయ
నొకరూప మిదియని - యూహింపరాక 3560
తేరువాజులు సార - థియు రథికుండు
నూరి చూర్ణముఁ జేసె - నోయని తలఁపఁ
జెవి కన్నుముక్కును - జెక్కు నగంబు
లివియవి యనరాక - యిలతోడఁ గలియ
హతశేషులగు దైత్యు - లా జంబుమాలి
హతుఁడైన తెఱగుద - శానను తోడ

—:రావణుఁడు మంత్రితనయుల నేడుగురిని హనుమంతునిపైకి బంపుట - ఆతఁడు వారిని దునుముట:-

వినుపింప నాగ్రహ - వృత్తితో మంత్రి
తనయుల నేడ్వురం - దాఁ బిలిపించి
పనిచినఁ దల్లులు - పలవింపుచుండ
జనకులు పుత్రవాం - ఛల శోక మొంద 3570
పృథుశక్తితో విధి - ప్రేరితు లగుచు
రథములమీఁద సా -రథులు మెచ్చంగ
జేరి శిలీముఖ - శ్రేణిచే నతని
వారిధరంబులు - వానయపోలి
కురియించి మించినఁ - గోపించి నాటు
శరములువో మేను - జాడించి పెంచి
తోఁకచే నొకని కు - త్తుక బిగియించి
యూఁకించి యిలఁగొట్టి - యుక్కడగించె!

పిడికిటిపోటుచేఁ - బ్రేవులు వెళ్ల
కడుపుపై గ్రుద్ది యొ - క్కని మన్నికొనియె!3580
అరచేతఁ జెంపపై - నఱచి యొక్కరుని
గరువంబుతో మన్నుఁ - గఱచుకోఁ గొట్టె!
మోచేతిపోటున - ముక్కుచుఁ బోర
చాచుక పడఁగఁ బీ - చమడంచెనొకని!
ఈకడాకడ పక్క - టెమ్ములు విఱుగు
మోకాటఁ బొడిచి దు - మ్ములురాల్చె నొకని!
కాలికొద్దినిఁ దన్ని - కాలుని వీడు
పాళెవట్టుగ నిచ్చి - పనిచె నొక్కరుని!
ఒకచెట్టువెఱికి తా - నురముపైఁ గొట్టి
చెకబికల్ చేసి ని - ర్జించె నొక్కరుని! 3590
హనుమంతుఁడీరీతి - నసురేశు మంత్రి
తనయుల నేడ్గురిఁ - దరిమి వధింప
విఱిగెను తేరులు -విఱిసె నేనుఁగులు
తెఱలె నశ్వంబులు - తెగియెఁ గాల్బలము
పగిలె ఖేటకములు - పడియెఁ గేతువులు
నొగిలె ఛత్రంబులు - నురుమయ్యెఁ దలలు
తునిగెఁ జామరములు - తొరగె రక్తములు
చినిగె మేమరువులు - చెదరె మాంసములు
ఆడెభూతము లట్ట - లాడె విన్వీథి
మూడె దైత్యులకు రా - ముని బంటు గెలిచి 3600
మగుడఁ దోరణమెక్కె - మడియుచోఁగొంత
మిగిలి పాఱిన మూఁక - మెలకువలేక
వినిపింప నంతయు - విని రావణుండు

-: తన మంత్రులైదుగురిని రావణుఁడు పంపుట :-

తన మంత్రులను బంచ - తంత్రకోవిదుల
ననఘచిత్తుల విరూ - పాక్షుయూపాక్షు
ప్రఘనుని దుర్ధరు - భాసకర్ణాఖ్యుఁ
బిలచి యేవురతోడ - "బిరుదువానరుఁడు
చలపట్టి దైత్యులఁ - జంపుచున్నాఁడు
వాఁడెవ్వఁడో యక్ష - వరుఁడొ వేలుపుల
ఱేఁడొ నాపైబచా - రించి మార్కొనిన 3610
సురసిద్ధచారణ - స్తోమంబులోని
దొరయెవ్వఁడో మాయ - తోనిట్లు చేరి
మున్ను నాచేనైన - మోసంబుఁ దీర్ప
నెన్ని యీ మూర్తితో - నేతేరనోపు!
ఎంత లేదని పోక - యెంతయుఁ బుద్ధి
మంత్రులై చాలస్తో - మములతోఁ గదలి
మిముఁగాచుకొని యహ - మిక లేక సాధ
నములతో దైత్యసై - న్యములతోఁజనుఁడు.
వాలిన శౌర్యని - ర్వాహకంబులను
వాలి భానుజ జాంబ వన్నలతార 3620
నీరాది వానరుల్ - నిర్జరశ్రేణి
నాలంబులలో మెచ్చ - రది యెఱుంగుదును
వారిలో నొకరుఁ డీ - వానరుఁడున్న
వారికే డదియో య - వార్యశౌర్యంబు?
కదనంబున జయంబుఁ - గామించి తన్నుఁ
బదిలంబు చేసుకోఁ - బరగునెవ్వరికి?
దుడుకుగాఁ బోవక - దుర్జయు నతనిఁ

దొడరి జయించి వ - త్తురుగాక మీరు
చనుఁడం" చుఁ దనదు పం - చప్రాణములను
బనిచినగతి వారిఁ - బనిచిన వారు 3630
బలములతోఁ గూడి - బాలార్కబింబ
తులితప్రకాశగా - త్రుని హనుమంతుఁ
జేరఁగఁ బోయి వీ - క్షించిన వారి
నారామ దాసుఁడ - ల్లంతటఁ గాంచి
సరకు సేయక నల్ది - శలు గనుఁగొనుచు
ధరణిపై వాలంబు - దాటించు కొనుచు

-: హనుమంతుఁడు వారితో యుద్ధము చేయుట - వారి నైదుగురిని సంహరించుట:-

నున్నచో దుర్ధరుఁ - దుత్పల చాప
సన్నద్ధ శతపంచ - సాయకంబులను
వ్రేసిన నవిపోవ - విసరి కుప్పించి
కేసరిసుతుఁడు నిం - గికి నెగయుటయుఁ 3640
బాఱకు మెక్కడఁ - బఱచెద ననుచుఁ
గ్రూరాస్త్రములు వెను - కొని ప్రయోగించి
యఱముటయును బర్వ - తాగ్రంబునందు
మొఱయుచుఁ బిడుగుల - మూటవడ్డట్లు
రభసంబుతోడ దు - ర్ధరు తేరుమీఁద
నభమున నంజనా - నందనుఁడూర్చి
దుమికిన నరదంబు - తోవాఁడు చదిసి
నిమిషమాత్రంబున - నేలతోఁ గలసె!

ఆ విరూపాక్ష యూ - పాక్షులు తీసి
పోవక ముద్గరం - బులు ప్రయోగించి 3650
నొప్పించుటయును హ - నూమంతుడొక్క
గొప్ప భూరుహముఁగై - కొని యిరువురను
బడఁగొట్టి యసువులఁ - బాపిన ముగురు
మడిచిపోవుటఁ జూచి - మచ్చరింపుచును
భాసకర్ణుండును - బ్రఘనుండు తోమ
రాసిలతాహస్తు - లై యెదురించి
జగడింపుచో నొక్క - శైల శృంగంబు
నగలించి వారిపై - నదలించి వ్రేయఁ
బడె గంట పడ్డట్లు - బవరంబులోనఁ
బడిరి వారిరువురు - ప్రాణముల్ విడిచి! 3660
వెంట వచ్చిన దైత్య - వీరుల వెంట
నంటి పోనీయక హ - యమును హయము
రౌతును రౌతును - రథమును రథము
సూతుని సూతుని - సుభటుని సుభటు
నేనుఁగ నేనుఁగ - నిట్టట్టు గొట్టి
పోనీక దనుజులఁ - బోకడ వెట్టి
పోరు తీఱె నటంచుఁ - బోరు తీరుటయు
తోరణాగ్రంబుపైఁ - దొలుతటియట్ల
వసియించు మాట రా - వణుఁడాలకించి

-: రావణుఁడు యక్షకుమారునిఁ బంపుట :-

మసలక యక్షకు - మారునిఁ బిలిచి 3670

పనిచిన సెలవంది - బంగరు రథము
మనసు రంజిల నెక్కి - మణిమయాభరణ
కుండలకోటీర - కోదండచండ
కాండప్రకాండ ప్ర - కాశితుండగుచుఁ
జతురంగ బలముల - జతకట్టు చేసి
ధృతిశాలియై బారు - దీరుక నడచి
తోరణాగ్రంబుపై - దుర్వాంతవిలయ
మారతాప్త నిలస - మాన తేజమున
మీరు ధీరాత్ము స - మీరకుమారు
దేరి కన్గొని శర - త్రితయంబు చేత3680
నాఁటించుటయుఁ జిఱు - నవ్వుతో నిలకు
దాఁటి యక్షకుమారు - దర్పంబుఁ జూచి
గిరులును దరువులం - కించి యుంకించి
బిరబిరవైవ న - భేద్యవిక్రముఁడు
అక్షుఁడు శౌర్యహ - ర్యక్షుఁడు వాని
లక్షించి వాలమ్ము - లను వమ్ము చేసి
శరములు గుఱియంగ సమరంబు మిగుల
నరుదని వినుతించి - రమరులు మింట!

-: హనుమంత యక్షకుమారుల యుద్ధము :-

ఆవేళఁ గరువలి - యసియాడ వెఱచె
త్రోవలు దప్పి రిం - ద్రుఁడు భాస్కరుండు3690
అలమట లొంది కు - లాద్రులు వడఁకె
జలరాసి కలఁగె ర - సాచక్రమగలె
దిక్కులేర్పడవయ్యె - తిమిరంబు కప్పె

చుక్కలు రాలె పాం - సువు లెందుఁ బొదివె!
అంతటఁ గోపించి - హనుమంతు మీఁదఁ
బంతంబుతో నైదు - బాణంబు లేసి
యపరంజిపింజల - యమ్ములవాని
కపివరాచలముపైఁ - గదిసి ముంచుటయుఁ
దన తనువెల్ల ర - క్తంబులఁదోఁగ
హనుమంత డతని సా - హసమాత్మ మెచ్చి3700
నవ్వుచు మేనిండ - నాఁటు నస్త్రముల
దవ్వులఁ బోవ వి - దర్చి యార్చుచును
సరణి నూతనతృణ - ఛ్ఛన్నకూపంబు
కరణి నిల్చిన వాఁడు - గజము చందమున
సింగముల్ నొగలఁ బూ - న్చిన తేరుఁద్రోలి
సంగరవీథి న - క్షకుమారుఁ డలిగి
కదియరా వానరా - గ్రణి మింటి కెగయ
నది చూచి చేవిలు - నమ్ములు వూని
పక్షీంద్రుఁడెగసిన - పగిది నవ్వెంట
నక్షాసురుఁడు రాఁగ - హనుమంతుఁడెదిరి3710
నవ్వుచు “నౌరౌర! - నా వెంట నెగసె
చివ్వకు మగఁటిమి - చేఁ గొంకులేక!
అక్కట! చంపఁ జే - యాడునే యింత
చక్కనివాని రా - క్షసుఁడైన నేమి?
తల్లడిల్లక యిట్టి - తనయునిఁ గన్న
తల్లియోరుచునే పు - త్రవ్యధచేత ?
అటులైన వీఁడు కా - లాగ్నియ పోలి
పటుతరాశనికల్ప - బాణజాలముల

దండపెట్టఁగ నిండు - తనచేత నేఁడు
నిండెఁ గాఁబోలు వీ - నికి శతాబ్దములు!" 3720

- యక్షకుమారుని మరణము :-

అని చేతఁ జఱచిన - నరుదెంచు హరలు
తునిసి దుమ్మయి తన - తోధాత్రిఁ బడిన
విదిలించుకొని లేచి - వీరరసంబు
చిదిమి పెట్టిన యట్లు - సిగ్గు రోషంబు
చిట్టాడఁగ మొలాము - చేసిన కత్తి
వట్టి చేతనుగాని - వట్టి బీరమున
దివమున కెగసి హే - తి కొలఁది నఱికి
జవముచేఁ గేడించి - చౌకళించుటయుఁ
నా నఱుకున కిసు - మంతయుఁ జీఱ
వానరకుల మౌళి - వక్రకాయమున 3730
సోఁక కున్నెడ వానిఁ - జూచి పోనీక
తోఁకచే వానికు - త్తుక బిగియించి
బిరబిరఁ ద్రిప్పి కుం - భిని మీఁదవైవ
నురుమయ్యె దశవద - నుని పిన్నకొడుకు!
అగ్గించి రప్పుడా- హనుమంతు గెలుపు
లుగ్గడింపుచు సుర - వ్యూహంబు మింట!
అచ్చి వచ్చిన తోర - ణాగ్రంబునందుఁ
గచ్చలకై తాను - కాలు ద్రవ్వుచును
"ఇంక నంపక పోవఁ - డెచ్చైన బంటు
నంకంబునకు నీద - శాననుం" డనుచు 3740

నున్నఁ జావక చిక్కు - నొక్కట పిరికి
జన్నెపు రక్కసుల్ - జగడంబు తెఱఁగు
నక్షుని పాటును - హనుమంతు గెలుపు
రాక్షసవిభున కే - ర్పడఁ బల్కుటయును
దనకొల్వులో నగ్ర - తనయుని దుర్మ
దుని శూరు నింద్రజి - త్తును విలోకించి

-: రావణుఁ డింద్రజిత్తును హనుమంతుని పైకి పంపుట :-

“ఒక కోతి వచ్చి యి - ట్లోడక యక్షు
నకు మృత్యువయ్యె దా - నవకోటిదునిమె
వాని ఖండింపు మ - వార్య శౌర్యుఁడవు
దానవవంశవ - ర్ధనుఁడవు వివిధ 3750
దివ్యశస్త్రాస్త్రవే - దివి సమర్థుఁడవు
కావ్యశిష్యుఁడవు సం - గ్రామభీముఁడవు
అజుని వరంబుచే - నమరేంద్రు గెలిచి
విజయంబుఁ గైకొన్న - వీరాగ్రమణివి.
దేశకాలంబులు - దెలిసి యుపాయ
కౌశలమునను జే - కన్న పోటరివి.
అనిఁ బెక్కుమారు లిం - ద్రాదులఁ గెలిచి
దనుజమాయోపాయ - దారుణక్రియల
నాయంతవాఁడవై - నావు నిన్నెదుర
నీయజాండంబులో - నెవ్వఁడున్నాఁడు? 3760
మర్కటుఁడతఁడు సా - మాన్యుండు గాడు
కర్కశుండస్త్రముల్ - గాడవువాని!
ఆయుధమరణంబు - నని నపజయము

దాయల భయ మసా - ధ్యములైన పనులు
వాఁడెఱుఁగడు వాని - వధియించువాఁడు
లేడు 'గాలియును గీ - లియు నోడి' రనుచు
గరువించి పోరక - కనుఁగల్గి వాని
బరిభవింపుము పొమ్ము - పయనమై" యనిన
వల్లె యనుచుఁ దండ్రి - వలగాఁగవచ్చి
తెల్లని కేతువె - త్తించిన యట్టి3770
సింగపు రాచతే - జీలీడ్చి తెచ్చు
బంగరుతేరిపై - బాలార్క కిరణ
సంకాశరత్నకాం - చన కిరీటాద్య
లంకారములతోడ - లంకాపురంబు
వెలువడి దానవ - వీరులు వడిన
కలను గల్గొని యశో - కవనంబు చెంత
తన వింటి యల్లె మ్రోఁ - తయు బెట్టిదంబు
తన భీమ సింహనా - దంబుల రవళి
తన రథనేమికా - ధ్వని ముమ్మరంబు
తనచెంత బిరుదవా - ద్యంబుల యులివు 3780
తనసేన కలకల - ధ్వానంబు చెవుల
విని “భళిరే!” యని - విశ్వమంతయును
గజగజ వడఁకంగ - గర్జించి మింట
నజర గంధర్వ వి - ద్యాధర యక్ష
చారణ ముఖులు మె - చ్చఁగవాయుసుతుఁడు

—: హనుమ దింద్రజిత్తుల యుద్ధము :-

తారసించినచోట - దనుజవీరుండు
కనకపుంఖాస్త్ర ప్ర - కాండ వర్షంబు

తనమీఁద నిండ ను - ద్ధతిఁగురియింప
సేకరింపఁగ లేక - శ్రీరామదాసుఁ
డాకసంబునకు ర - యంబునతో నెగయ 3790
‘నెటు వోయెద'ని నిశి - తేషువుల్వఱప
నటునిటుఁ దప్పుచు - నజ్జగాకున్న
చొరవఁగానక చేయి - చూచుక వాని
శరములు వట్టి రా - క్షసుల నేయుచును
తరుశిలావర్షము - ద్ధతి నింద్రజిత్తు
నరదంబుపై ముంప - నమ్ముల చేత
నవియెల్లఁ దునిమి ది - వ్యాస్త్రముల్ వైచి
యవశుఁగాఁ జేయ స - మర్థుఁడు గాక
శరముల వీనికిఁ - జావు లేదనుచు
నరుదంది వింట బ్ర - హ్మాస్త్రంబుఁ దొడిగి 3800
వ్రేసిన నది విను - వీథిఁ బోనీక

- : ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రప్రయోగమున హనుమంతుని గట్టి వైచుట :-

యాసమీరాత్మజు - నదరంటఁ గట్టి
యిలఁ బడవైచిన - నింతయు మేనుఁ
దెలియక మూర్ఛిల్లి - తెప్పిరి లేచి
బ్రహ్మాస్త్రమునఁ గట్టు - వడుటయు మొదటి
బ్రహ్మవరంబును - బ్రహ్మాస్త్రవరముఁ
గడఁ ద్రోయరామియుఁ గదలక పుడమిఁ
బడిబ్రహ్మమంత్ర జ - పంబుపాంశువుగఁ

జేయ నప్పుడు బిగి - సినకట్లు వదలి
చేయిగాలును గద - ల్చి పితామహేంద్ర3810
వాయువులఁ దలంచి - వలసినయట్టి
చాయ నేఁగఁగశక్తి - చాలియు మదిని
“ఏనిట్టులున్న న - న్నితఁడు దోకొనుచు
దానవవిభుని ముం - దఱఁ దెచ్చియునుచు
నందుచే వాని మ - ర్యాద లన్నియును
గందు నమ్మీఁదటఁ - గదలి పోవుదును”
అని యచేతనుఁడైన - యట్టిచందమునఁ
గనుఁ దేలవైచి యే - గతి మున్నువడియె
నట్టి చందంబున - హనుమంతుఁడున్న

-: హనుమంతుని రావణుని సమక్షమునకుఁ దీసికొనిపోవుట :-

కట్టి యీతని దశ - కంఠుని యెదుర3820
నునిచెద ననుచు దై - త్యులఁ జేరఁ బిలిచి
జనపనారల త్రాళ్లు - సవరని వాళ్లు
బండిమోకులు దేరఁ - బనిచి "కట్టుండు
కొండకై వడిఁ బడ్డ - కోఁతి” నటంచుఁ
బగ్గంబులను బిగిం - పఁగఁ దనశక్తి
తగ్గబ్రహ్మాస్త్రంబు - తనమీఁది నితర
రజ్జులఁగట్ట నో -ర్వమిచేత నదియె
యజ్జగాఁ దొలఁగిన - నది గానలేక
కట్టి యీడ్చిన లేవఁ - గని “వీని నేల
కట్టితిఁ గడమ ప - గ్గములచే మఱచి3830

నారత్రాళులఁ గట్ట? - నాదు బ్రహ్మాస్త్ర
మాఱడిఁ బోయె నై - నటులయ్యె నింక!”
అనితండ్రి సన్నిధి - కరుగుచో వెంట
దనుజులు గుద్దుచుఁ - దరమి కొట్టుచును
లాతముల్వట్టి ఛ - ళాలునఁ గొట్టి
కోఁతి పాఱుమటంచు - గొల్లున నగుచు
తోఁకపట్టుక యీడ్చి - త్రోయుచుఁ దమరు
"వేఁకమే నీకని " - వీపెక్కి కొనుచు
“నెందఱెందరిఁ జంపె - నీకోఁతి పురువు
మందెమేలము లేల? - మర్దింపు మనుచుఁ 3840
గూడి గుంపులఁగట్టి - కోఁతిని త్రాటి
నీడిచికొని దాన - వేంద్రుని యెదుర
నునిచినఁ గొలువులో - నున్న వారెల్లఁ
గనుఁగొని "యెవ్వఁడె - క్కడ వానరుండు?
'యేమేమి చేసె? వీఁ - డేఁటికిఁ బట్టి
దామెన త్రాళ్ళ నిం - దఱు గట్టినారు?”
అన హనుమంతుఁడు - యక్షాదులైన
దనుజులఁ దునుము వా - ర్తలు తేటపఱుప
"పొడువుఁడు నరకుఁడు - పొరలింపుఁ డగ్నిఁ
బడఁ ద్రోయుఁ డబ్ధిలో - పల వేసిరండు 3850
చంపుఁడు కోయుఁడు - చరులను ద్రోయుఁ
డంపుడు పురిపెళ్ళ - నాజ్ఞసేయింప!"
అని బెదరింపుచో - నందఱఁ గనుచు
ననలసంకాశు సిం - హాసనాసీను
నరుణాంబుజేక్షణు - నాజానుబాహు

హరిమధ్యు సకలసు - రాసురాసాధ్యు
నూరక వీక్షింపు - చుండంగఁ జూచి
యా రావణుఁడు ప్రహ - స్తాది మంత్రులను
గనుఁగొని “యెక్కడి - కపివీఁడు?" తెలియుఁ
డనినఁ బ్రధానులా - హనుమంతుఁజూచి3860
“గొంట! యెవ్వఁడ?” వన్నఁ - గొంకి “సుగ్రీవు
బంట నేన”ని మాఱు - పల్కి వారలకు
ఱెప్పవేయక మది - రిచ్చపాటొదవ

-: హనుమంతుఁడు రావణుని రాజసమును వైభవమునుఁ జూచుట :

నప్పుడు గనుచో మ - హాసింహపీఠి
చిఱుతగద్దియ మీఁద - శృంగారరసము
కరువునఁ దీర నా - కారమై నటుల
మేరువుపై వ్రాలు - మేఘమో యనఁగ
చారుతను ప్రకా - శములు శోభిలఁగ
దశశిఖరముల మం - దరనగం బనఁగ
దశవదనముల గా - త్రము వెలుఁగంగ3870
మింటను హరుమేను - మిహిరద్వయంబు
నంటు చేసుకయున్న - నలిన బాంధవులు
కడమవారలు వచ్చి - కాచి యున్నట్టి
వడువున మకుటముల్ - వైఖరిమీర
కటకకేయూర కం - కణ రత్నదీప్తి
పటలిచే నిరువది - బాహువుల్ దనర
చందురుతోడి న - క్షత్రమాలికలు

నందముల్ దెలుపునా - యకములచేతఁ
దళుకొత్తు కట్టాణి - తారహారముల
వలుద యురంబుపై - వలవొప్పు నపుడు3880
లాలిత వివిధ బా - లాంక రేఖలను
నీలాంబుదంబు క - న్పించు నట్లమర
వెలలేని మగరాల - విడిమీరఁ దీర్చు
నలఘు మంజీరంబు - లంఘ్రుల మొఱయ
యిరువురు వేలుపు - టింతులు మరుని
శరములన్నట్లు విం - జామరల్ వీవ
నడపంబుఁ కట్టెడు - నలివేణి చెంతఁ
బడతి యొక్కతె జిల్గు - పావడి వూన
కాళాంజిఁ దాల్చు జ - క్కవచంటి చెంత
బాలయొక్కతె గిండి - వట్టుక నిలువ3890
చంద్రహాసము వూను - సతి చెంత నొక్క
చంద్రాస్య సురటి యె - చ్చరికతో వీవ
నిలుపుటద్దంబు వూ - నిన దాని చెంత
వలకారి చెలియ పా - వలు ధరియింప
తరళాక్షి పారిజా - తపు ముడిపువ్వు
సరము పొట్లములు హ - స్తములఁ గీల్కొలుప
ఘుమ్మను మృగనాభి - కుంకుమరసము
కొమ్మలు జాళువా - కోరలఁ దాల్చ
పదములొత్తుచునున్న - పద్మాక్షి తొడలఁ
గదియు పాదము శోణ - కమలంబుఁ దెగడ3900
కొలువున్న రావణు - కొలువులో నున్న
బలుగొండలనఁ బోలు - భద్రాసనముల

నున్నట్టి దానవ - యోధుల కడలఁ
గన్నవారికి భయం - కర మూర్తులగుచుఁ
గొలుచు నానాకార - ఘోరరాక్షసులఁ
గొలువు సావిడిలో ర - ఘుశ్రేష్ఠు దూత
కలెజూచి తలయూఁచి - "కటకట! యింత
కలిమి మీఁదట నేమి - గానున్నయదియె?
ఎంతటి గాంభీర్య - మెంత ప్రతాప
మెంతటి రాజస - మెంత వైభవము!3910
కారుగదా సాటి - కాలిగోరునకు
రారు పోల్పఁగ సుర - ప్రభువు లీతనికి!
రాక్షసేశ్వరు మహా - రాజమూర్ధన్య
లక్షణమ్ములు కన్ను - లకు విందు చేసె!
తరమెన్నరాని యిం - తటి భాగ్యశాలి
పరకాంతలను బల్మిఁ - బట్టి రమింపఁ
దలఁచక యుండుఁగ - దా వీఁడె కాక
కలుగునే యెల్లలో - కము లేల నొకఁడు!
తమ జీవనములకుఁ - దలఁపకుండుదురు
యమరనాథులు వీని - యడుగలు గొల్వ?3920
రావణునకు నధ - ర్మమె లేక యున్న
నీవిశ్వమంతయు - నేలక యున్నె?
ఇంతటివానికి - నీచెడుబుద్ధి
సంతరించునె? పాప - జాతి విరించి!”
అనిచూచునంత ద - శాననుండతని
గనుఁగొని “యెక్కడి - కపివీరుఁడొక్కొ?
ఎక్కడి కపివీరుఁ - డేను కైలాస

ముక్కుతో నెత్తగఁ - నూచి కదల్ప
నాఁడుకోపించిన - నందియేకాక
వీడు వానరుఁడే వి - వేకించి చూడ?”3930
అని ప్రహస్తునిఁజూచి - "యడుగు మెవ్వారు
వనిచి రిచ్చటికిరాఁ - బనియేమి తనకుఁ?
వనమేల చెఱచె? నీ - వానరుం డడుగు”
మనుఁడు ప్రహస్తుఁడా - హనుమంతుఁజూచి

-: ప్రహస్తుఁడు హనుమంతుని ప్రశ్నించుట :-

“ఎవ్వరు పొమ్మని - రేల వచ్చితివి?
చివ్వకై వనమెల్లఁ - జెఱుప నేమిటికి
పలుకుము నిజముగాఁ - బలుకక యున్నఁ
బొలియింతు మెక్కడఁ - బోనిత్తు మింక!
మాచేతఁ జిక్కి నీ - మనసింక లెస్స
చూచుక మాటాడు - జుణిగి పోరాదు.”3940
నావిని యంజనా - నందనుఁ డపుడు
రావణు చెవిసోఁకఁ - గ్రమ్మఱఁ బలికె

-: హనుమంతుని ప్రత్యుత్తరము - తాను రామకార్యార్థమై దూతగా వచ్చిన సంగతి నెఱుకపఱచుట :-

“నిజము పల్కెదఁ గపి - నే యౌదు నేను
నీ రావణునిఁ జూడ - నిచటికి వచ్చి
యూరకే పోరామి - యుద్యానవనము
పెఱికి వైచితి నన్ను - బెదరింప వచ్చు
సురవైరులను బట్టి - సుంకురాల్చితిని

యనిలోన నాకు బ్ర - హ్మవరంబు గలుగఁ
దనుగట్టి తేర నెం - తటివాఁడు గలఁడు?3950
ఇతనిఁ జూచుటకునై - యే నింద్రజిత్తుఁ
బ్రతిసేయ నొల్లక - బ్రహ్మాస్త్రముననుఁ
దగిలితిఁ గాని యీ - తనివంటి వాఁడు
పగవూని నాతోడఁ - బట్టి తేఁగలఁడె?
కపటమేఁటికి! నాకుఁ- గలిగిన కార్య
మిపుడి తెల్చెద"నని - యిట్టని పలికె
“నీతోడ బుట్టువు - నీరజబంధు
సూతి వానరరాజు - సుగ్రీవుఁ డిపుడు
పనిచిన దూత నేఁ - బవమానసుతుఁడ
హనుమంతుఁ డండ్రు లం - కాధీశ! నన్ను3960
రాముఁడు రవివంశ - రత్నము నాదు
స్వామి యిచ్చటి కేలఁ - జనుదేర ననిన
దశరథుండను దమ - తండ్రి వొమ్మనిన
శశిముఖి యగునట్టి - జానకీసతియు
తమ్ముఁడు సౌమిత్రి - తనుఁగొల్వ భీక
రమ్మగు దండకా - రణ్యంబుఁ జేరి
సత్యసంధుఁడు రామ - చంద్రుఁ డున్నెడను
ప్రత్యవాయము దిన - బ్రదుకు లేదనక
వంచనతో నీవు - వై దేహిఁ పట్టి
కొంచుఁ బోయిన వెద - కుచు వచ్చి వారు3970
రామలక్ష్మణులు - మారాజు సుగ్రీవుఁ
గామించియాప్తుని - గాఁగఁ జేపట్టి
యతని సోదరు వాలి - నతిసత్త్వశాలిఁ

బ్రతినఁ దప్పక యొక్క - బాణంబుచేతఁ
బడనేసె! వాలి యే - పాటివాఁడనుచు
నడుగఁ దెల్పఁగ నేల? - యది నీకె తెలుసు
నావాలి సోదరుఁ - డైన సుగ్రీవు
లావు నాబోటులె - ల్ల నెఱుంగ లేరు.
అట్టి భానుజుఁడు నీ - న్నడిగితి ననుచు
జుట్టఱికము సేయఁ - జూచి రమ్మనియె!3980
నారవితనయుని - యానతిచేత
వీరవానరకోటి - విశ్వమంతయును
వెదుకఁ బోయెను లంక - వెదకి రమ్మనుచుఁ
బదువురితో నన్నుఁ - బనిచె నిచ్చటికి
వారెల్లఁ గడలి యా - వల నున్నవారు
తారాంగదాదులిం - దఱు నన్నుఁబనుప
జలధి లంఘించి ని - శావేళలంకఁ
గలయఁ గన్గొని యశో - కవనంబులోన
సీతను బొడగాంచి - సేవించి రామ
దూత నేనని పల్కి - తుందుడుకార్చి3990
మఱలివోయెడువాఁడ - మదమత్తు నిన్ను
ధరఁగూల్చిగాని వృ - ధా పోవననుచుఁ
దలఁచి నాస్వామి సీ - తాప్రాణవిభుని
తలఁవున కది విరు - ద్ధం బెట్టులనిన
రావణుఁ బుత్రపౌ - త్ర కళత్రయుతము
గా వధింపుదునని - కపినాథుతోడఁ
బ్రతిన వల్కఁగ యేను - బజ్జననుండి
యతని యానతి విన్న - యది కారణముగ

నిను జంపరాదని - నీకు నారాక
గనిపింప నేనిన్నుఁ - గని పోవఁదలఁచి4000
చెట్టుచేమలు నుగ్గు - చేసి నీవంపి
నట్టి రాక్షసుల బా - హాశక్తిఁ దునిమి
యేల నాకీగోల - యిఁకఁ జాలుననుచు
నాలంబు మాని నీ - యాత్మజుచేతఁ
జిక్కిన యటుల వ - చ్చితి గాక యేను
చిక్కుదునే యింద్ర - జిత్తునిచేత?
నినుగూడ యీలంక - నీవారితోడ
దునిమి వైదేహి నె - త్తుకపోవఁగలను!
ఆయమ్మ యొడఁబడ - దందుకు నేమి
సేయుదు నీతల - సీతవ్రాసినది4010
యైన నేమాయె! ని - న్నావాలిగాఁగ
భానుతనూజుఁడొ - ప్పారి వట్టుటను
అతఁడను మన్నట్టు - లనక పోరాదు
హితమది యాలింపు - మెట్లంటివేని
'సీతఁ దోడుకవచ్చి - శ్రీరామవిభుని
చేతికి నందిచ్చి - శ్రీపాదములకు
సాఁగిలి నాతప్పు - సైరింపుమనిన
నాగుణసాగరుఁ - డన్నియు నోర్చు!
అందుపై హాని రా - దా తరువాత
నెందుకు చింతిల్ల - నేనున్నవాఁడ' 4020
నని పల్కుమనియె నీ - వది చేసితేని
మను నీకులంబు సే - మము గల్గునీకు!
కాదని నామాట - కడఁద్రోచితేని

కోదండ దీక్షాది - గురుఁడైనయట్టి
రాము బాణము లీపు - రంబుతో నిన్ను
సాము జామింట భ - స్మము సేయఁగలవు!
తగునె నీ కీ పర - దారాభిరాష?
అగణితంబగు పాప - మందు నిందులను
పుణ్యము ల్పాపంబుఁ - బ్రోఁద్రోయుననిన
పుణ్యపాపము లను - భూతియోగ్యములు4030
చేసిన పుణ్యముల్ - క్షీణించుదనుక
నీసర్వసౌఖ్యంబు - లీవు వొందితివి
పాయని పాపాను - భవకాలమునకు
నీయవనిజఁ దెచ్చి - యింట నుంచితివి.
కాలుని పాశముల్ - గళమునఁ జుట్టు
పోలిక మృత్యువు - భూపుత్రి నీకు!
నీయంతవానికి - నీచకృత్యంబు
సేయఁ జెల్లునె? పర - స్త్రీలఁ గోరుదురె?
ధరణి నీయంత ప్ర - ధానపూరుషుఁడు
పరకాంతఁ దల్లి గాఁ - బాటింపవలదె?4040
అప్పుడుగా నీ మ - హామహిమంబు
కప్పువాసి త్రిలోక - గణనీయ మగును
ఈలంకఁ జెఱుపంగ - నిలఁ బుట్టినట్టి
కాళరాత్రి యనంగఁ - గనుము జానకిని
తెలియవు సీతపా - తివ్రత్యమహిమఁ
బొలిపోవు నీ పుణ్య - భోగభాగ్యములు!
ఖరదూషణాదుల - ఖండించుటయును
శర మొక్కటను వాలిఁ - జంపివైచుటయు

గుఱుతులుగా నెఱుం - గుము రామునెదిరి
సురనాథునకుఁ దల - చూపంగరాదు4050
సురగరుడోరగా - సురసిద్ధసాధ్య
వరులు గెల్వఁగ లేని - వరములు నీకు
నల ధాత యిచ్చినాఁ - డనుచు గర్వింప
వలవదు వారిలో - వాఁడె భానుజుఁడు?
బహుకాల ముగ్రత - పంబులు చేసి
విహితవైఖరిఁ గన్న - విభవమంతయును
కటకటా! సీత యొ - క్కరితెకె యొక్క
చిటికి వైచినయంత - చెడగఁ జూచెదవు!
రాముఁడు గవిసిన - బ్రహ్మరుద్రాదు
లేమని వచ్చివ - హించుకో గలరె?4060
నామాట నిజముగా - నమ్మి జానకిని
రాముని కర్పించి - బ్రదుకు” మీవనినఁ
గోపించి “మీరలీ - క్రోఁతినిఁ బట్టి
యీపొద్దె యాజ్ఞ సే - యింపుఁడు పొండు.”
అని కింకరులఁ జూచి - యాడిన యన్న
గని విభీషణుఁడు డ - గ్గరి యిట్టులనియె.

-: హనుమంతుని మాటలను విని యాతనిఁ జంపుటకాజ్ఞయిచ్చిన రావణుని విభీషణుఁడు నివారించుట :-

“అగ్రజ ! వలవని - యాగ్రహంబూని
సుగ్రీవుచారు ని - చ్చో నాజ్ఞ సేయ
చెల్లునే? దూతలు - సేయరానట్టి
చుల్లకమ్ములు సేయఁ - జూచిన దొరలు4070

తగిన యాజ్ఞయ కాని - దండింప రేల?
తెగ చూడ వీని క్రోఁ - తికిఁ దప్పు గలదె?
దూతమానసులపై - దోషముల్ చూచి
వ్రేతురు తఱటుల - వెడలఁ ద్రోయుదురు
తల గొఱగింతు రం - తటఁ దీఱకున్న
వెలితి సేయుదురు భా - వించి యంగముల.
ఇది ధర్మమని మీర - లెఱుఁగరె? యొక్క
కొదవసేయుఁడు తాళు - కొనుఁ డాగ్రహంబు
ధైర్యనీతిబల ప్ర - తాపగాంభీర్య
మర్యాదలందు స- మస్తలోకముల 4080
నీయంతరాజవు - నీవింతెకాక
వాయెత్తి పలుక నె - వ్వరు గలరింక?
ఇంద్రుఁడో వాఁడా యు - పేంద్రుఁడో వాన
రేంద్రుఁడంపిన వాని - హింసింప నగునె?
కీర్తి వంతుఁడవు లౌ - కిక వైదిక ప్ర
వర్తనంబుల నుడు -వగసమర్థుఁడవు
కాదిట్టి తలఁపు లో - కవిరుద్ధ మఖిల
వేదివి శాస్త్రకో - విదుల కగ్రణివి
వీనిఁ జంపిన రఘు - వీరులతోడ
జానకీదేవి నీ - సదనంబులోన4090
నున్నదియని పల్క - నొకరుఁడు లేఁడు
విన్నఁ గాకా రఘు - వీరుఁడు రాఁడు
వచ్చినగాక నీ - వైరులఁ దునుమ
వచ్చునె నీవిందు - వారందు నున్న
రాముఁడెక్కడనైన - ప్రాణంబుతోడ

భూమిపై నున్నట్టి - ప్రొద్దుల కెల్ల
నాతనిపై నడి - యాసలేకాని
సీత నీమాటలు - చెవి సోఁక వినదు
నీకోప మారాము - నికిఁ జూప నమరు
గాక వానరు మీఁదఁ - గనిపించుకొన్న4100
నపకీర్తి యేకాక - యందుచే నేమి
యిపుడు సాధించితి - మిది మేరగాదు.”
అనుచు విభీషణుఁ - డాడిన మాట
విని పదితలల న - వ్వి 'యథార్థ' మనుచు

- : రావణుఁడు హనుమంతుని తోఁక కాల్చుట కాజ్ఞ యొసంగుట :-

దూతమానసుల నెం - దును జంపరామి
నీతంబు తోఁక వీ - నికి నాస్తిగాన
నిజముగాఁ దోఁక వీ - నికి నాస్తిచేసి
ప్రజలు నవ్వఁగఁ జింపి - బట్టలు చుట్టి
నూనెలోఁ దోఁచి గం - తులు వేయుచుండ
వీని తోఁక దహించి - వీడ్చి పొమ్మనుఁడు.”4110
అను నంతలో వికృ- తాకారులైన
దనుజులు కొలువులోఁ - దనుకడ కీడ్చి
కోకలు చుట్టంగ - కొంచెపుతోఁక
యాకడ నిరవధి - యై కొనసాఁగ
నూరిలో నింటింట - నున్న పెట్టియల
చీరలన్నియును దె - చ్చి సమీరసుతుని
వాలాగ్రమునఁ జుట్టి - వలయు కొప్పెరల

తైలంబులో నది - దరికొల్పి వారు
పురవీథులను మెడఁ - బువ్వులు చుట్టి
హరివీరు పంచవా - ద్యంబులు మొఱయ4120
బాలకుల్ వెం - బడి బడి కూఁతలిడుచుఁ
గోలచేఁ దోలుచు - కొని పోవుచుండ
"చీకటివేళఁ జొ - చ్చితి లంక నేను
తేఁకువ వీథివీ - థికిఁ జూడలేదు.
దివిటీలు వీరు దై - తేయులు నాకు
రవులు కొల్పిన తోఁక - రాఁజినవెనక
నా వెలుఁగున పురం - బంతయుఁ జూచి
కావలసిన లంకఁ - గాల్చి పోయెదను!”
అని యూరకేపోవు - నప్పుడీ వార్త
దనుజకాంతలు మహీ - తనయతోఁ దెల్పఁ 4130
జింతించి యిందు వ - చ్చినవాఁడ వేల
యింత సేసితి వింక - నేమి సేయుదును?”

-:సీతకు హనుమంతుని వృత్తాంతము దెలిసి యాతని కగ్ని యంటక, చల్లగానుండున ట్లామె వర మొసంగుట :-

అని "యేఁ బతివ్రత - నైతినే నిపుడె
యనలుఁడు కడుచల్ల - నై యుండుగాక!
రామునిఁ దక్క ప - రవ్య క్తులందు
నేమది నిలుపని -యిది నిక్కమేని
యనిలకుమార! నీ - కాపద లేక
యనలుఁడు కడుచల్ల - నై యుండుగాక!

శ్రీరామచంద్రుండు - చేపట్టి నన్ను
యీరాక్షసాళి జ - యింప నోపుటలు4140
మనసున సరిపోవ - మాయన్న! నీకు
ననలుండు కడుచల్ల - నై యుండుఁగాక!
ధర్మంబు గలచోట - తప్పదు జయము
ధార్మికులకు నంచు - తజ్ఞులు వలుక
వినుమాట సత్యమై - వెలసిన నీకు
ననలుండు కడుచల్ల - నై యుండుఁగాక!
ఏనె పతివ్రత - నేని రాఘవుఁడ
ధీనాత్ముఁ డేకప - త్నీవ్రతుఁడేని
దనుజులు నీతోఁక - దవిలించినట్టి
యనలుండు కడుచల్ల - నై యుండుఁ గాక!4150
నెయ్యుఁడైనట్టి వా - ని సుతుఁడు వీని
కియ్యెడ రామార్థ - మితవుఁ గావింతు
నని రావణుని యాజ్ఞ - యాత్మఁ గైకొనక
యనలుండు కడుచల్ల - నై యుండుగాక!
అవనిఁ బరోపకా - రార్థులైనట్టి
ప్రవిమలాత్మకుల నా - పదలొంద వనుచు
జనులాడు వచనంబు - సత్యమౌ నేని
యనలుండు కడుచల్ల - నై యుండుఁగాక!
సుగ్రీవుఁ డగచర - స్తోమంబుఁ గూర్చి
యగ్రణియై వచ్చి - యసురేంద్రుఁ దునిమి4160
నను దెచ్చి రఘురాము - నకుఁ గూర్చునేని
యనలుండు కడుచల్ల - నై యుండుఁగాక!"
అనునంత పెనుమంట - లడరు పావకుఁడు

తన వాలమునకు శై - త్యము సంఘటించి
చల్లగాఁ బన్నీరు - చల్లినయట్లు
పెల్లుబ్బు నూనియ - పృథిపై దొరుగఁ
దావి చావంతి పూ - దండలు చుట్టు
ఠీవిగా నిండఁ జు - ట్టిన చీరలమర
దహనుఁడు తనకు శీ - తలభావమొందు
మహిమంబునకు హను - మంతుఁడుప్పొంగి4170
"రాముని కార్యభార - ము వూను కతన
నామున్ను మైనాకుఁ - డాప్తుఁడై నటుల
నమరులు వేడుకో - నగ్నియీరీతి
శమియించి నాపాలఁ - జల్ల నైనాఁడొ!
దిక్కుల సీతపా - తివ్రత్య మహిమ
మెక్కుడై వెలయుగా - కిందుచే ననుచు
ధార్మికుఁడగు బృహ - ద్భానుండు నన్నుఁ
గూర్మిచే మనుపఁ గై - గొనియెనో చలువ!
ఏనొనరించిన - యీ వీరకర్మ
మానిలింపుల కెల్ల - నాశాస్యమగుట4180
వారికి హితముగా - వహ్ని నా మేనఁ
బూరించెనేమొ క - ర్పూరంపుఁ జలువ!
అదిగాక నాతండ్రి - యాప్తుండుగాన
నది తలఁచుక సౌమ్యుఁ - డయ్యెనో కీలి!”

-: హనుమంతుఁడు లంకనుఁ గాల్చుట :-

అని తలంపుచు పణ - వాది వాద్యములు
తనమ్రోల మొఱయ ను - త్సాహంబు మెఱసి

మును వెంచిన తన - మెయిఁ గట్టుత్రాళ్లు
వానికివానికి - వదలిపోవుటయుఁ
దమ్మినూలునఁ జిక్కు - దంతావళంబు
చిమ్మి రేఁగినయట్లు - చెంత రాక్షసుల4190
విలయాగ్ని దరికొల్పు - విధమునఁ దోఁక
వలమానగతిఁ ద్రిప్ప - వారలందఱును
దారుణ వహ్ని ప్ర - దక్షిణ శిఖలఁ
బోరాక రారాక - బూదియై పడినఁ
గుప్పించి వానర - కుంజరుండలిగి
యప్పుడు భయదాట్ట - హాసంబు చేసి
చంగునఁ గోటపైఁ - జౌకళించుటయు
నింగలంబులవాన - లెల్లెడఁ గురిసె!
అందుపైనున్న మ - హాపరిఖంబు
సందడి విరియ రా - క్షససేన మీఁద4200
వేసిన నదివచ్చి - వీథి పీనుఁగుల
రాసులుగాఁ జేయ - రాముఁ బేర్కొనుచుఁ
బగలింటి సూర్యుని - పగిది వాలాగ్ని
దిగదిగ వెలుఁగ మీఁ - దికిఁ బొడవెత్తి
త్రిప్పుచు లంక నల్ - దిక్కులుచూచి
యుప్పరిగలు సౌధ - యూధముల్ జూచి
"సీతను వెదకి చూ - చినవాఁడ మఱలి
దూతకృత్యము మాత్ర - తోఁ బోవనైతి
వనమేలఁ గూల్చితి? - వాదులకేల
పెనఁగితి? నిదియేటి - బీరంబు తనకు4210

నైనట్టులయ్యె మ - హావాలజాయ
మానపావకశిఖా - మాలికలందు
నీకోటతో లంక - యెల్లను గాల్చి
పోకున్నఁ గీర్తి య - బ్బునె నాకు ననుచుఁ
బెడబొబ్బవట్టి కు - ప్పించి ప్రహస్తు
నడిమింట దాఁటి భ - గ్నము చేసి కాల్చి
యచ్చోట నుండి మ - హాపార్శ్వు పసిఁడి
మచ్చుమీఁదికి హను - మంతుఁడు దాఁటి
దరికొల్పి యదివజ్ర - దంష్ట్రుని మేడ
నెరియించి శుకుఁడున్న - యిలుఁ గాలవేసి4220
సారణు గృహము భ - స్మము చేసి మింటి
తో రాయు నింద్రజి - త్తుని మందిరంబు
నగ్నికి నపుడ పూ - ర్ణాహుతి యిచ్చి
భగ్నంబు చేసి యా - పై జంబుమాలి
మాలిసుమాలుల - మణి భవనములఁ
గీలి యందిన రశ్మి - కేతు వాసంబు
వాసంబులందుఁ బా - వకు రవుల్ కొలిపి
త్రోసిపై సూర్యశ - త్రుని నిలయంబు
విలయంబు నొందించి - వీతిహోత్రునకు
సెలవిచ్చి చంచలా - జిహ్వుధామంబు4230
హస్తికంధరశోణి - తాక్షాలయముల
ధ్వస్తముల్ చేసి మే - ధావి ధరించి
రుధిరాక్ష కుంభక - ర్ణుల నికేతనము
లధముల గుడిసెలో - యనఁ జిచ్చువెట్టి
మకరాక్షు సదనంబు - మాడిచి దహను

నకు యజ్ఞశత్రుని - నగరొప్పగించి
కొనతోఁక కుంభిని - కుంభినీకాయ
కనకాజిరముల సా - గఁగ నిల్చిప్రేల్చి
యంతటఁ బోక న - రాంతకు సౌధ
మంతయు వెలిగించి - యన్య రాక్షసుల4240
విడుదులు దహియించి - వీడెల్ల నింగి
పొడవుతోఁ బూడిద - ప్రోవుల నించి
చలముతో నావిభీ - షణుని గేహంబుఁ
దొలఁగ నన్యుల యిండ్లు - దుమ్ములు చేసి
చిచ్చఱఁ గన్ను వి - చ్చెనొ శంభుఁ డనఁగ
ముచ్చిచ్చులపు డొక్క - మూర్తి యైనట్లు
పావక విశ్వరూ - పంబు లంకామ
హావరణంబులో - నాపూర్ణమయ్యె!
అనలుఁ డీక్రియ వాన - రాకార మొంది
తనపగఁ దీర్చుకోఁ - దలఁచెనో యనఁగ4250
నజుని కోపాగ్ని మ - హా ప్రళయములఁ
బ్రజలపై జూపఁ బ్రా - రంభించె ననఁగ
జముఁడు వీఁడనఁగ నీ - శానుఁ డనంగఁ
నమరనాయకుఁడన - నర్కుఁ డనంగఁ
ద్రిపురంబు లేర్చుధా - త్రీరథుండితఁడె
యిపుడు లంక దహించ - నేతెంచె ననఁగ
మేడలు మాడుగల్ - మేలు కట్టులును
వాడలు ధనధాన్య - వస్తుచయంబు
పట్టాంశుకంబులు - భస్మముల్ చేసి
చిట్టెముల్ గట్టించి - చిటచిటాత్కృతుల4260

నాలుకల్ గోయుచు - నాగాశ్వధేను
శాలలం దనిల భ - స్మములు సేయుచును
రథములు గాల్చి తో - రణములు గూల్చి
పృథుగతి లంకలోఁ - బెనుమంట లెగయ
నమరయానములో గ - డాకులో యనఁగఁ
దెమలఁ బారుచు నలు - దిక్కుల నొదుగ
పైలోకములనున్న - పావనాత్మకులు
పేలగింజల రీతిఁ - బెటిలిపడంగ
సెగఁ దాఁకి యిలమోచు - శేషుఁడు పడగ
లెగ నెత్తజాలక - యించుక వంప4270
వెలుఁగు పట్టణములో - వీరు వారనక
చిలచిల నెత్తురుల్ - చింద రాక్షసులు
మగ్గిన మగలపై - మగువలు వ్రాలి
యగ్గలికలఁ జేసి - రనుగమనములు
చంకల బిడ్డలు - జాఱిపడంగ
నంకించి పట్టుక - యట్టిట్టు సుడిసి
పొగచుట్టి కన్నులఁ - బొదివిన నూర్పు
లెగదొట్టి యిండ్లలో - నీల్గినవారు
యిల్లాండ్రు లోపలి - యిండ్లలోఁ దగిలి
వెళ్లిరాఁ ద్రోవలు - వెదకి కూయిడుచు4280
వాకిళ్లు కడపుచో - వారి వల్లభులు
కోకటాడఁగఁ దోడి - కొనివత్తు మనుచుఁ
జొరఁబారి యీలోన - సుడిగొని తమరు
తిరిగి రాఁజాలక - త్రెళ్లెడువారు
కుచ్చిళుల్ మును రవు - ల్కొనిన కెంగేల

నుచ్చిపోవఁగ దివి - యుచుఁ గడవైవ
పయ్యెంట లంటి లో - పలి జల్లుఱవిక
చెయ్యందుకొని విద - ర్చినఁ బోక మేన
దరికొను మంటల - తమవార లెల్లఁ
బురపురఁ బొక్కంగఁ - బొరలెడువారు4290
కాయముల్ దరికొన్న - కవచంబులూడి
హా! యని పొరలుచు - నంగముల్మఱచి
కొఱప్రాణములతోడ - కుత్తుక లెండి
యిరవుల నిల్లాండ్రు - మృతినొందువారు
సొమ్ములు దే నిండ్లు - చొచ్చి చేతులను
రెమ్మి నల్గడల దొ - రికిన మాత్రంబు
కైకొని వచ్చుచోఁ - గడపలు దాఁకి
వాకిళ్లఁ బడిమేను - వ్రస్సినవారు
దంపతుల్ నిదురించు - తరిఁ గాలికాలి
కొంపలు పైవచ్చి - కూలంగఁ బడిన4300
నెట్లు మున్నుండిరి - యిట్టట్టు మెదల
కట్లమేనులు నూర్పు - లడఁగినవారు
కలుద్రావి యొడలెఱుం - గక మంటలనుచుఁ
దెలియక యందందుఁ - దెరలినవారు
నగుచుండ హనుమంతుఁ - డాలంకనడుమ
బెగడ లోకములెల్లఁ - బెనుబొబ్బవెట్టి
కుప్పించి యెగిరి చం - గున దశాననుని
యుప్పరిగెల వ్రాలి - యొడలు జాడించి
కొనతోఁక సందుల - గొందులదూర్చి
యనలునిఁ బురికొల్పి - యసమిచ్చుటయును4310

నతఁడు దూరంతయు నల పవమాన
సుతునిపై వైచి రాఁ - జుచు విమానములు
సింహాసనంబులు - చీర్ణదంతములు
సింహతలాటముల్ - చీనాంబరములు
చప్పరంబులు పెండ్లి - చవికెలుపట్టు
కప్పడంబులును ము - క్తాచ్ఛత్రములును
చామరంబులును ధ్వ - జంబు లమూల్య
సామజంబులు కేళీ - సౌధ యూధములు
పడకయిండ్లును విండ్లు - పసిఁడి తల్పులును
కొడిగెలు కేరులు - కొల్లారు బండ్లు 4320
తేరులుగాల్చి - బూదిగఁ జేసి తనదు
పేరువాడి సుపర్వ - బృందంబు వొగడ
ప్రళయ కాలార్కుని - పగిది తానెగసి
యలవోకగాఁ ద్రికూ - టాద్రిపై నిలిచి
యుత్తరంబుగఁ జూచి - యుదధిలోఁ బెద్ద
వత్తికైవడి మండు - వాలంబుముంచె
జానకి శ్రీరామ - చంద్రుల తాప
మేనె జల్లార్పుదు - నిటులన్న రీతి!
వాలాగ్ని మార్చి భా - వములోనఁ బవన
బాలకుఁ డుత్సాహ - పరతచే నుండి 4330

-:హనుమంతుఁడు సీత యగ్నిలోదగ్ధమైనదని చింతించుట :-

తనలోనఁ జింతించి - "తప్పెఁ గార్యంబు
కినుకఁ గల్గిన వాని - కిని మేలు గలదె?

క్రోధంబు విడనాడు - కొని తాల్మినుండు
సాధువులకుఁగాక - సౌఖ్యంబు గలదె?
గోపంబు కలిగిన - గుణములఁ జెఱచి
పాపంబులకు నెల్ల - పాల్వడఁ జేయు
నేల కాల్చితి లంక? - యీ హింసవలన
నేలాభ మందితి - నే గార్యమయ్యె
ఏమిటికై వచ్చి - యేమిసేసితిని!
తామసాత్మకులు గ - దా వనచరులు!4340
అనుపంగఁ దగువాని - ననిపినఁగాక
ననుబోటి పనిగొన్న - నగుబాటుగాదె?
ఆలోచనంబు సే - యక వేగిరించు
పాలసులెందు నా - పద పొందుటరుదె?
దూత నై వచ్చి తో - డ్తోడఁ గ్రమ్మఱక
సీతఁ జంపగ లంక - చిచ్చు పెట్టితిని!
ఇందుచే జానకి - యేమౌనొ యనక
ముందు చూడక యేల - మోసపోయితిని?
జానకిఁ జంపి ల - క్ష్మణ భానుజులకు
నేనోరు పెట్టుక - యేను దెల్పుదును?4350
రాముఁ డీవార్త క - ర్ణంబుల సోఁకు
నామున్నుగా మేనఁ - బ్రాణముల్ విడుచు
వారివారలును మా - వారలు గొలుచు
వారు రామునితోడి - వారు నిక్కముగ
నెవ్వరికిని బని - యేమి నావలన?
నవ్వు పాలయ్యె వా - నర నాథుపూన్కి.
మిగిలినవేల స్వా - మి ద్రోహియనుచు

నగుచుఁ బల్కుదురు వా - నరు లెల్లఁ జూచి
జనకజ వెదకెదఁ - జని యయ్యశోక
వనిలోన నాయమ్మ - వసియించి యున్న4360
మఱలిపోవుదు లేక - మఱి యొక్కటైన
శరధిలోఁ బడుదు మ - త్స్యములు మ్రింగుటకు
ననలమేనియుఁ జొత్తు - నంతియకాని
తనువుతో మెలఁగ నిం - తట సిగ్గుగాదె!"
అనుచు నాలోచించు - హనుమంతుఁ డెదురఁ
గనిపించు శుభసూచ - కముల కుప్పొంగి
“పరమపతివ్రతా - భరణమైనట్టి
ధరణిజ కేల చిం - తవహింప నాకు?
రాముని మహిమ మా - రమణి శీలంబు
నేము న్నెఱింగియు - నెఱుఁగలేనైతి!4370
తోఁక నంటిన చిచ్చు - తోఁ గాలిపోక
పోఁకవ్రయ్యక మున్న - పురము గాల్చితిని!
ఆసతీమణి తేజ - మనలుని కన్న
వీసమంతయుం దక్కు - వే? కాననైతి
యింతేల వహ్నివ - హ్ని దహింపఁ గలదె?
యంతకొంచెపు బుద్ధి - యదియెన్ననైతి?
అనలుఁ డేగతిముట్టు - నాపతివ్రతను?
తన తపంబున శీల - ధర్మవర్తనలు
శ్రీరాముపై భక్తి - సీత కోపించి
యారుపుగానోపు - హవ్యవాహనునిఁ4380
గాక పావకుఁడు ద - గ్గరఁ జేరఁ గలఁడె!
నా కేలచింత ?” య - నంగ ఖేచరులు

-:దేవతలవలన సీత సురక్షితముగానున్నదని యెఱిఁగి యామెవద్ద సెలవు గైకొనుట :-

మిన్నుల నుండి “భూ - మిజకేమి కొఱఁత?
విన్నబాటేల? సే - వించి భూమిజను
చనుము క్రమ్మర రామ - చంద్రునిఁ దెమ్ము
తునిమింపు మెల్ల దై - త్యుల" నంచుఁ బలుక
తలయెత్తిచూచి యా - దారిగా మ్రొక్కి
వలకన్ను గదల న - వ్వైదేహిఁ జేరి
యడుగులఁ బ్రణమిల్లి - "యమ్మ! పోయెదను
తడయక దశరథా - త్మజుని సన్నిధికి. 4390
ననుమతి యమ్మ”న్న - ననిల నందనునిఁ
గనుఁగొని మరల రా - ఘవురాణి వలికె.
“పోవన్న! వాయుజ! - పోయి శ్రీరాముఁ
దేవన్న! తెచ్చి దై - తేయులతోడ
రావణుఁ దునిమించి - రామునిచేతి
కీవన్న! నన్ను నా - యిడుములు దీర్చి
నమ్మితిఁ బ్రాణదా - నము సేయు మీవు!
పొమ్మ"న్నఁ బవమాన - పుత్రుఁడు వలికె.
“పోయెద నేను గొ - బ్బున రాముఁ దెచ్చి
మాయమ్మ! ఱేపె నీ - మది చల్లఁ జేసి4400
లంకపైఁ గపుల నె - ల్లను డించి నాఁటి
యంకంబులోన ద - శానను ద్రుంచి
నీవు నీమగనిఁ జెం - ది యయోధ్యకడకు
దేవియు దేవర - తీరున మఱలి

పట్టాభిషిక్తులై - పరిణామమొందు
నట్టివేడుక చూతు - నదిచూడు!” మనుచు

-: హనుమంతు డరిష్టకాద్రిని దాటుట :-

రింగున నెగసి య - రిష్టకాద్రికిని
చంగున దాఁటి కే - సరికుమారకుఁడు
నిలిచిన నసిత వ - నీ శ్రేణితోడ
నలరారె కొండ నీ - లాంబరు కరణి!4410
పొగడొందె శారదాం - బుదముల చేత
నగము గౌరోత్తరీ - యము దాల్చి నటుల!
వైణవరంధ్ర ని - స్వనములచేత
వేణునాద వినోది - విధమందె గట్టు!
తనయందుఁ గదలెడు - తరువులఁ గొండ
కనుపించె నొకయాట - గాని చందమున!
వాయువువలన గ - హ్వరములు మెఱయ
నాయద్రి యొప్పె గా - యకుని వైఖరిని!
సెలయేటి మొత్తంబు - చే మహీధరము
పొలిచె ముత్తెపుసరుల్ - బూనినరీతి!4420
క్రేవ ధాతువులచే - గిరిరాజు వెలిచె
ఠీవి చెంగావి ధ - ట్టినిఁగట్టి నటుల!
కమలసరంబుచే - గ్రావంబు దనరె
కమనీయమగు పత - కము వైచుకరణి!
యటులున్న యచలమా - హనుమంతుఁడెక్కి
యటునిటు మెలఁగి త - దగ్రభాగమున

శృంగంబుఁమీద ని - ల్చి యభంగతిమితి
మింగిల తద్గిరో - ర్మిప్రవాహములఁ

-: హనుమంతుఁడు సముద్రము దాటుట :-

గనుపట్టు నుత్తర - కమలధిఁ గాంచి
తన పాదములు సము - ద్ధతి జోడుగూర్చి4430
కరములు వీచి యు - త్కంఠతో నెగసె!
కరువలిపట్టి యా - కాశమార్గమున
నెగిరిన యంతలో - నిట్టట్టు గదలు
నగముపై నున్న కి - న్నర మిథునములు
అదరిపాటున వ్యోమ - యానంబులెక్కి
కదలే హేతువు మదిఁ - గనలేక జడిసి!
పెట్టెలు పెట్టుక - పెను త్రాచులెల్ల
చుట్టలు చుట్టుక - సుడిగొని పడియె!
అడఁగిపోవుచుఁ గొండ - యడలఁ గన్నీటి
వడువున దొనలలో - వారి పెల్లుబ్బె!4440
కొండ యెంతయు గుల - గులలైన డొల్లె
గండోపలంబును - గవులెల్లఁ జదియ
పదియోజనంబుల - పఱపును మూఁడు
పదుల యోజనముల - పాటి యున్నతియుఁ
గలిగిన యమ్మహా - గ్రావంబు ధరణి
దొలుచుక యదినేల - తో సరిగాఁగఁ
ద్రొక్కి వాయుజుఁడు చే - తులు పొడవెత్తి
చక్కగాఁ జూపులు - చనిన వేగమున

కారండవాళిగాఁ - గమలబాంధవుఁడు
కైరవశ్రేణిగాఁ - గైరవహితుఁడు4450
శ్రవణపుష్యములు హం - సములుగా జలద
నివహంబు నాచుగా, - నెలకొన్న కుజుఁడు
మకరిగా, దీవిగా - మఘవగజంబు
ప్రకటవైఖరిఁ బున - ర్వసువు మీనముగఁ
గొక్కెరగా స్వాతి - కొదమ తెమ్మెరల
పెక్కువల్ కరడుల - పెనకువఁగాఁగ
వెన్నెలవారిగా - విబుధగంధర్వ
కిన్నరుల్ వికచపం - కేరుహంబులుగఁ
గలిగిన గగన సా - గరము సాగరము
తులగాఁగఁ దావొడ - దూరినయట్లు4460
వచ్చి పయోధి యా - వలి గట్టునందు
ఱిచ్చలువడి కను - ఱెప్పలు మూయ
నేమఱి తనరాక - కెదురులు చూచు
సోమరులగు కపి - స్తోమముఁ గాంచి
దర్పించి సింహనా - దముసేయ నట్టి
యార్పు వీనులు సోఁక - "నల్లదేవచ్చె
కరవలిపట్టి రా - ఘవు దేవిఁ జూచి
మఱలివచ్చెను లేక - మఱియొకటైన
యిట్టి సుమాళంబు - నిలయెల్లనిండు
నట్టహాసంబు సే - యఁడు సీతఁజూచె "4470

-:సముద్రతీరమున హనుమంతుని రాక కెదురుచూచుచున్న వానరులాతని రాకకు సంతోషించుట; సీతవృత్తాంతము నెఱుకపఱచుట :--

నని యెళనీళ్లు తీ - యని ఫలంబులును
దనువుట్ట తేనియల్ - తనకామతించి

యున్నచో మిన్నుల - నుండి పక్షములు
చన్నయప్పుడు గ్రాలు - శైలమోయనఁగ
నామహేంద్రమహీధ - రాగ్రంబునందు
నేమియు నలియక - నెఱుఁగక వ్రాలి
యంగదజాంబవ - దాదులు వచ్చి
సంగడి నిలిచి "కే - సరితనూజాత!
వచ్చితివే!” యన్న - "వైదేహిఁ గంటి
వచ్చితి మఱలి రా - వణు నింటిలోనఁ4480
దలజడఁగట్టి సం - తాపంబుతోడ
వలువ మిక్కిలి మాని - వనములోపలను
తనచుట్టు దనుజకాం - తలు బెదరింప
ననదయై యున్నచో - నాయమ్మఁ జేరి
మ్రొక్కి యూరటఁ జేసి - ముద్రిక యిచ్చి
యక్కమలాక్షి పొ - మ్మని పంపుటయును
నతికృశత్వమున పా - డ్యమి నాఁడు చదువు
నతని విద్యయుఁ బోలు - నాసీతఁ బాసి
వచ్చితి" నని కొన్ని - వార్తలఁ బూస

-: సీతవార్తకై వానరులు సంతోషము వెలిబుచ్చుట :-

గ్రుచ్చిన గతిఁ దెల్పఁ - గోతులందఱును4490
గంతులు వేయుచు - కరములు చఱచి
పంతమ్ములాడుచు - పరువులెత్తుచును
తోఁకలార్పుచుఁ జెట్ల - తుదికొమ్మలెక్కి
యూఁకించి దాఁటుచు - నురక నవ్వుచును
కిలకిలా రవముతోఁ - గెలనికిఁ జేరి

పలుమారు హనుమంతు - పై నివురుచును
గౌఁగలింపుచు సీత - కథ విందమనుచు
మూఁగుచు నినుమాఱు - ముమ్మాఱుగాఁగ
యడిగిన మాటలే - యడుగుచు "నింక
విడిచె దుఃఖము రఘు - వీరుఁ" డటంచు4500
“పావని ! మమ్మెల్ల - బ్రదికించినట్టి
దేవుఁడ వీవ" ని - దీవనలిచ్చి
పొగడుచు నుండు న - ప్పుడు తనచుట్టు
నగచరులుండ బృం - దారకుల్ గొలువ
నున్నయింద్రునిఁబోలు - యొప్పినవాలి
గన్నబిడ్డఁడు వేడు - కల నోలలాడి
యాకొండదరి నుండు - హనుమంతుఁ జూచి
వాకొని యాజాంబ - వంతుఁ డిట్లనియె

-: జాంబవంతునితో హనుమంతుఁడు తన వృత్తాంత మెల్ల సవిస్తరముగా వినిపించుట:-

"మాయన్న! పవనకు - మార! మాయెదుర
తోయధిపై మింటి - త్రోవగా నరుగు 4510
నినుఁ గనుఁగొంటి మిం- తియెకాని యవలి
పని నీవు మాకుఁ దె - ల్పక యేఱుపడదు
లంకాపురమున ని - లాసుత యెట్టి
యంకిలి నున్నది - యా యమ్మతోడ?
నేమంటివీవు ని - న్నేమని పనిచె?
రామసౌమిత్రుల - రవికుమారుకుని
జూచి యేమంద, మె - చ్చో నున్నదనుచు

సూచింపవలయు! ర - క్షోనాయకుండు
నేరీతివాఁడు? వాఁ - డేకొద్ది మనల
పోరాడఁ గలఁడు? తె- ల్పుము కన్న తెఱఁగు.4520
అందఱు నందుపై - నాలోచనంబుఁ
గంద మారాఘవా - గ్రణిఁ జేరఁబోవ”
అనునంత జాంబవ - దంగదముఖులఁ
గని హనుమంతుఁడు - క్రమ్మఱఁ బలికె.
"వినుఁడేను జేసిన - వృత్తాంతమెల్ల
వినుపింతు నానుపూ - ర్విగ ” నని తాను
జలధిపైఁ జనుటయు - జలరాశి వనుప
వలిమలపట్టి ది - వంబరికట్టి
మైనాకుఁడను కొండ - మాఱొడ్డి నిలువఁ
దాను భేదించినన్ - దనుఁ జూచి యతఁడు4530
“మీతండ్రి చెలికాఁడ - మిహికాచలేంద్ర
జాతుఁడఁ దన్నుఁ బ - క్షంబులతోడఁ
బక్షంబుతోడుతఁ - బవనుఁ డిచ్చోట
రక్షించి యునిచె నిం - ద్రభయంబుఁ దీర్చి!
అందుకునై నీకు - నాతిథ్యమేను
కందమూలము లిత్తుఁ - గైకొను”మనిన
వలదనిపో నగ్ర - వనధిపై సురస
యల నాగమాత త - న్నరికట్టుటయును,
ఏరాము పనిపూని - యేఁగెద నిపుడు
కారాదు మరలి యా - కలిఁ దీర్తు నీకు4540
ననుపు మీవని ” తదీ - యాస్యంబుదూరి
చనుటయు నవ్వలి - చాయఁ బై చాయఁ

బోవుచోఁ దనచాయఁ - బోనీక పట్టి
కావరంబున సింహి - కానామ దనుజి
మ్రింగెదనని నోరు - మిక్కిలి తెరవఁ
జంగున దానియా - స్యంబులో దుమికి
యుదరంబుఁ జించి య - త్యుద్ధతిచేత
గుదిగొన్న దాని ప్రే - గులు వట్టి యీడ్చి
కొనిపోవుటయు లంక - కును జేర లంక
యనునది వాకిలి - యరికట్టి కోటఁ 4550
జొరనీకయుండ ర - క్షోవీథి యెడమ
కరమునఁ గొట్టినఁ - గంపించి లంక
దీవించి పొమ్మని - తెరువిచ్చుటయును
దావచ్చి నగరమం - తయుఁ జుట్టి చూచి
జానకిఁ గానక - సాలాగ్రమెక్కి
గానుపించిన యశో - కవనంబు నందు
సీతను గనుచోట - శింశుపాచ్ఛాయ
శీతాంశుఁబాసి వ - చ్చిన చిత్ర యనఁగ
నలకువతోడ వే - నలి జడగట్ట
నలయుచుఁ గనుగంట - నశ్రులు రాల4560
మైలవస్త్రము గట్టి - మహినుండఁ జూచి
యాలేమ సీతయౌ - నని గాచియన్న
దనుజకాంతలఁ జూచి - తాఁ జెట్టుమీఁద
ఘనమైన శాఖపైఁ - గదలకుండుటయు
నావేళ రావణుఁ - డటు వచ్చి రాము
దేవేరితో సమ్మ - తింపు మటంచు
బెదరించుటయు సీత - పెడచెవిఁబెట్టి

యదరక దుర్భాష - లాడి దూషింప
నలిగి చంపంగఁ బోవ - నరికట్టి వాని
దొలఁగ మండోదరి - ద్రోచిన నతఁడు4570
గడువిడి చనుటయుఁ - గదిమి రక్కెసలు
చెడుమాట లాడుచోఁ - జేరి యాత్రిజట
కల గన్న తెఱఁగును - గడకు వారేఁగఁ
దలఁపులో నిదిమంచి - తరియంచుఁ దాను
మాటలాడుటయు న - మ్మని మహీసుతకుఁ
దేట పడంగ ము - ద్రిక నిచ్చుటయును
గుఱుతులుగాఁ దన - కు వచించి సీత
శిరము మానిక మిచ్చి - శ్రీకరంబుగను
దీవించుటయు రాము - దేవేరి వనుప
నావనంబెల్ల ను - గ్గాడి కూల్చుటయుఁ4580
బైకొని యప్పుడే - బదివేలుదైత్యు
లేకవారంబుపై - నెదిరించి పోరఁ
బొరిఁగొనుటయు మంత్రి - పుత్రులేడ్వురను
జరిమివైచుటయు రా - క్షస నాయకుండు
దళవాయులను మహో - ద్ధతి నైదువురను
గలనికిఁ బనిచిన - గమి చంపుటయును
నాజినెదుర్చు న - క్షాసురవధము
చేఁ జేత నయ్యింద్ర - జిత్తుని చేత
బ్రహ్మాస్త్రమునఁ గట్టు - వడుటయుఁ దాను
బ్రహ్మమంత్రము జపిం - పఁగ నొవ్విలేక4590
కట్టులఁ బడ దశ - కంఠుకొల్వునకుఁ
బట్టుకేఁగుటయును - బంఙ్క్తికంధరుఁడు

తాను గోపించి ప్ర - ధానులఁ జూచి
వానరుఁ డీతఁడె - వ్వరివాఁడటన్న
నే దాశరథిబంట - నినసూనుఁ డనుప
వైదేహిఁ జూడంగ - వచ్చితి ననుట
తానన్న మాటలు - దానికి నలిగి
దానవేంద్రుఁడు వీని - దండింపుమనుటఁ
దగవుగాదనుచు నా - తరి విభీషణుఁడు
తగు నాజ్ఞసేయ హి- తంబు పల్కుటయుఁ 4600
దోఁకఁ గాలిచి పార - ద్రోలుఁ డటన్న
నాఁక సేసిన వార - లాముదంబులను
జీరలు ముంచితె - చ్చి మదీయవాల
దారుణలయకాల - దండాచలమునఁ
జుట్టి ముట్టించిన - చో నెఱమంట
లుట్టినప్పుడ లేచి - యొడలు పెంచుటయుఁ
బాశవల్లరులెల్లఁ - బరిసి పోవుటయు
దాశరథిశ్రేష్ఠు - దయచేత సీత
పరమపాతివ్రత్య - పటిమచేఁ దోఁక
చుఱుకు వుట్టక దాఁటు - చును లంక యెల్లఁ4610
గాలుచుటయు జన - కతనూజయున్న
మేలు కన్నులఁ జూచి - మింటికి నెగసి
వచ్చుటయును దెల్ప - వానరులెల్ల
నచ్చెరవున నమ్మ - హా మహుఁ జూచి
వినుతింప నంతయు - విని యంగదుండు
వనచరుల్ విన జాంబ - వంతున కనియె
"పోయెద లంక కి - ప్పుడె దశాననుని

మాయింతు దానవ - మండలితోడ
లంకాపురంబు నే - లను గూల్చి దనుజ
పంకజాక్షులఁ జెఱ - పట్టి తెప్పించి4620
యమ్మవారినిఁ బుష్ప - కారూఢఁ జేసి
కొమ్మని రామున - కును సమర్పింతు!
ఇన్నాళ్లు మితిమీఱి - యిప్పుడు సీత
యున్నది యనిపల్క - నుచితమే మనకు?
పోవుదునే?” యన్న - భుజబలశాలి
నావాలితనయు మే - నరచేత నిమిరి
జాంబవంతుఁడు కార్య - సంవేది యనున
యంబుతోఁ దగు విన - యమున నిట్లనియె.
"ఈవు రాజవు మమ్ము - నిందఱం గరుణఁ
బ్రోవజాలుదు వతి - భుజశౌర్యనిధివి!4630
ఆడినయంత సే - యఁగ సమర్థుఁడవు
నేఁడు మాబోఁటులు - నిను లంకకనిచి
యిచట నూరకయుందు - మే రాముఁడున్న
యచటికిఁ జని మన - హనుమంతుచేత
విన్నపం బొనరించి - వేగఁ దోతెచ్చి
మున్నీరు గడచి రా - ముని సమక్షమున
రావణాదుల మీఁద - రణభూమిలోనఁ
గావలసినయట్లు - గనుపించుకొన్న
నదిమాటవాసి గా - కందఱుఁ గలిగి
యిదియేఁటిమాట నీ - కెట్లుఁ బోవచ్చు?4640
వల"దన్న యా జాంబ - వంతుని మాటఁ
దలఁచియందఱు ప్రమో - దము నొందునంత

-: వానరులు హనుమంతునితోగూడి సీత వృత్తాంతమును రామునకు నివేదింప నరుగుట :-

నంగదు నానతి - నగచరు లెల్లఁ
నింగికి నెగసి ము - న్నీరు దాఁటుటకుఁ
బందలై యందఱు -ప్రాల్మారు వారి
కెందుండి వచ్చెనే - యీజవంబనఁగ
నొక్కరి మీఱఁగ - నొక్కరుత్తరపు
దిక్కుగా శైలన - దీ మహాటవులు
గనుఁగొంచు గరుడవే - గంబుల వచ్చి
జనకజ వెదకఁగఁ- జనునాట నుండి4650
హితమైన యాహార - మెఱుఁగరు గాన
క్షితిమీఁద నున్న సు - గ్రీవుని నగరి
వల్లభలకు మనో - వర్తికిఁ జెల్లు

-: దారిలో మధువనమునందలి సమస్తఫలములను గ్రహించుట :-

వల్లభంబగు మధు - వనము నీక్షించి
“కంటిమిరా! నేఁడు - కన్నుల మిట్ట
పంట! యిందుల తీయ - ఫలములు గ్రోల
నాగ్రహించిన నేమి? - యామీఁద మనల
సుగ్రీవుఁ డేమి చే - సుక పోయెనేమి!"
అనితేనెపెరమీఁద - నాఁడు మక్షికల
యనువున నందఱు - నందులోఁ జొచ్చి4660
పనటుల కైవడిఁ - బనసల నున్న
తనువైన ఫలములు - తనివోక మెసవి

తియ్యమామిడిపండ్లు - తీయనివేడ్క
బయ్యాడి యామెత - పారణల్ చేసి
గుళపానకము చవుల్ - కుఱుచఁగావించు
నెలనీళ్లు మేనుల - యెళపారఁద్రావి
పెరతేనియలు కుండ - బెట్టు తేనియలు
కురజు తేనియలును - కొమ్మ తేనియలు
బుట్ట తేనియలును - బొదల తేనియలు
జుట్టు తేంటులఁ బీల్చు - జుంటి తేనియలు4670
బడులుబ్బ గుత్తుక - బంటిగాఁ బట్టి
తరువుల నీడలన్ - దగ విశ్రమించి
యొకకొమ్మపైనుండి - యొకకొమ్మ కెగిరి
యొకచెట్టు వడ సూఁచి - యొకచెట్టు ద్రోచి
సారువుల్ గోరాడి - సారణుల్ గ్రొచ్చి
పేరముల్ వారుచుఁ - బెనఁగు లాడుచును
తీగె యుయ్యెలల ని - ద్రించి పూఁదేనె
వాఁగులలో శ్రమ - వారిఁబోనీఁది
యాడుచుఁ బాడుచు - నరకట్టు లేక
చూడనైనను రాక - సుగ్రీవునాజ్ఞ4680
వాయువు చొరరాని - వనములోఁ గపులు
వాయునందను ప్రభా - వమున మెలంగ

-: వనపాలకుఁడగు దధిముఖుఁడు వానరులనాజ్ఞ పెట్టుట :-

మధువనమంతయు - మధియింపఁ జూచి
దధిముఖుఁడను భాను- తనయుని మామ

వనపాలకులతోడ - వచ్చి “యోరోరి!
వనచరాధములార! - వలదు వెల్వడుఁడు
పొండని తిట్టుచుఁ - బొడుచుచు నింక
నుండిన నాజ్ఞ సే - యుదు నొకనొకని!
మీకు సుగ్రీవుని - మీఁదాన!" యనిన
నాకపులందఱు - హనుమంతుఁ జూడ4690
నంగదుఁ డెంత లే - దని దధిముఖునిఁ
జెంగిపోవఁగనాడి - సెలవిచ్చుటయును
గోతులు కొల్లయై - కొమ్మలువిఱిచి
యేతముల్ బడద్రోచి - యిట్టట్టుతమకు
నడ్డముల్ వచ్చిన - యా నెళవరుల
దుడ్డుచు మొకములు - దోఁగ నీడ్చుచును
హనుమంతుఁ డెసపోయ - నాదధిముఖుని
వెనుకముందఱచేసి - వెనుకలు చూపి
“పోరోరి!” యనుచును - “బోయి సుగ్రీవుఁ
దేరోరి!” యనుచును - “దేకున్న సీమ4700
కోఁతుల కెల్లను - గొడుకవైనావు!
కోఁతలఁ బడకుము - కొనచెవులింక
జను” మంచు నట్టహా - సములు బొబ్బలును
వినువీథి నిండఁగా - వింపుచుఁ గపులు
వనమెల్లఁ జెఱచిన - వనపాలురెల్లఁ
దనవెంటఁ గూడిరా - దధిముఖుఁ డలిగి

-:వానరులు తనమాటలను వినకపోవుటచేత దధిముఖుండు సుగ్రీవునితో
          వనము పాడుచేసిన వృత్తాంతముఁ దెలుపుట :-

“కానిండు మీకు నం - గదుఁడిచ్చు సలిగె
పూనికదా వాయు - పుత్రునిఁ గూడి

యింత చేసితిరి మి - మ్మీడ్చి తెప్పించి
యింతింత కండగా - నిందఱిఁ బట్టి4710
కోయించకున్నచోఁ - గులములోఁ జేట
పేయగా మీపేరఁ - బిలువుఁడు తన్ను!”
అనికొమ్మ దాఁటుచు - "నంగద! యింత
వనమెల్లఁ జెఱపించు - వాఁడవు నీవు
జాంబవంతుఁడు సుమీ - సాక్షిగా నిమ్ము
చింబోతు బిగువుచేఁ - జెడఁ గోరినావు
చూడుమంచు” ను బోయి - సుగ్రీవుఁ జేరి
యేడువు మొగముతో - నిలఁ జాగిమ్రొక్కి
తలచాఁచి నిలిచిన - దధిముఖుఁజూచి
“తలఁకకు" మని భాను - తనయుఁ డిట్లనియె4720
“ఎవ్వరేమనిరి నీ - కేల యీచింత?
యెవ్వారిచే భీతి - నిటకుఁ జేరితివి?
పలుకు మీవ” న వీపు - పై పెట్లు చూపి
ములుగుచు నల దధి - ముఖుఁడిట్టులనియె
“వాలిపుత్రుఁడు నీదు - వనమెల్లఁ జెఱచి
గాలిపట్టియుఁ దాను - కవులపై గొలిపి
మోటువారుకొని మి - మ్ముల నాడరాని
మాటలాడఁగ మేన - మామనేనైన
పాపంబుచే వారి - భానునందనుని
తోఁపులో నుండ 'వ - ద్దు తొలంగుఁ' డనిన4730
నీకు దిక్కైనవా - నికిఁబోయి చెప్పి
తోకొని రమ్మని - తోఁకలఁ గొట్టి
మెడవట్టి నూఁకింప - మీతోడవచ్చి

నుడివితి నింక నెం - దుకు నీవు తనకు
నీమణియముచాలు - నిఁకమీఁద నీదు
సీమనుండగరాదు - సిగ్గెల్లఁ బోయె
నేమైన దన కేమి - యీ యపకీర్తి
నీ మీఁద వచ్చు మ - న్నించితి వేని!'
అనవిని “యేమేమి!" - యనుఁడు లక్ష్మణున
కినకుమారకుఁడు తా - నిట్లని వలికె 4740
"అంగదజాంబవ - దాదులౌ కీశ
పుంగవుల్ చొచ్చియి - ప్పుడు మధువనము
చూఱవట్టిరి యటం - చును వారిమీఁద
దూరు చెప్పెడుగాని - తోఁచ దీయనకు
నంతియె చాలు మే - లయ్యెను! జాంబ
వంతుఁడు పెద్ద మా - వాయునందనుఁడు
బుద్ధిమంతుఁడు వాలి - పుత్రుఁడు సుగుణ
వృద్ధుఁడు గావున - వీరల యుద్ది
వారెల్ల వచ్చినా - వనమెల్ల నేఁడు
చూఱలువట్టి రం - చును బల్కినపుడె 4750
బ్రదికితి మాఋక్ష - రజుఁడు వాలియును
తుది యేను నొక్కరీ - తుల నాజ్ఞనడుప
మేర మీఱినవారు - మేదిని లేరు!
వీరిటు సేయుటల్ - వేడుక యయ్యె!
సీతను జూచివ - చ్చెను హనుమంతు
డాతఁడుండఁగ నసా - ధ్యంబులు గలవె?
చేసిన దుడుకులు - సేయనిమ్మిందు

వాసిపోవదు నీకు - వలవదీ చింత
నినుఁ జేసినదిగాదు - నీకుఁబనేమి?
ననుఁజేసినదిగాన - నానిమిత్తముగ4760
దాళుకో పొమ్మ” ని - దధిముఖుఁ బలికి

         -: సుగ్రీవుఁడు దధిముఖుండు చెప్పినది విని యందలి యథార్థము గ్రహించి
                     యావానరులను తనవద్దకుఁ దోడ్కొని రమ్మనుట:-

వేళంబె వానర - వీరులు నిటకు
రమ్మంటి మనుమన్న - రామలక్ష్మణులు
నెమ్మనంబుల గల్గు - నెగులెల్లఁ దీఱి
యాసమీర కుమారు - నగ్గించు కతన
నాస మీఱఁగ వారి - నట్ల రప్పింపు
మనిపల్క మువ్వురు - నాడు వాక్యములు
తనమదిలోని సం - తాపంబుఁ దీర్ప
గ్రక్కునఁ బోయి యం - గదుచెంత నిలిచి
మ్రొక్కి “యోయయ్య! రా - ముఁడు మిమ్ముఁబిలిచె 4770
నెఱుఁగక యిప్పుడే - వేమి వల్కితినొ
దొరలట్ల రాజ పు - త్రులు సేవకులకు
మాకు నూరక యున్న - మాటలువచ్చు
నాకడ తమచిత్త - మని యెంచి యేను
మాఱు వల్కితి నది - మదిలోన మఱచి
యారాఘవులఁ జేరు” - డనఁ దారకొడుకు
కపుల నందఱఁ జూచి - "కదలి పోవుదుమె?

తపననందను సన్ని - ధానంబుఁ జేరఁ
దలపించుటయెకాని - తగుఁ దగరనుచుఁ
బలుక నేరుతునె నేఁ - బసి బిడ్డనగుట? 4780
ఒకమాట యాడితి - నోర్చికొనుండు
సకలంబు మీకెట్లు - సరిపోయె నదియె
సేయుఁడు మనము వ - చ్చినరాక వినియె
మాయయ్య దామ - సింపఁగరాదు మనకు”
అనిపల్కుటయు నంగ - దాలాపనములు
వినిచేరి యాకపి - వీరు లిట్లనిరి

-: హనుమదాదులగు వానరులు సుగ్రీవుని వద్దకువచ్చుట :-

"రాజు లెచ్చటనైన - రాణువవారి
యోజింప రాత్మప్ర - యోజనంబులను!
మదమత్తులై తమ - మదికెట్లు తోచు
నదిసేతురు విధేయు - లగువారు లేరు!4790
రాజపుత్రుఁడవయ్యు - రక్షణీయులఁ బ్ర
యోజకులని యెంచి - యుపలాలనమున
నడిగితి వది నీమ - హానుభావతకుఁ
దొడగని తొడవిది - దోషంబు గాదు
యెటుల నీవానతి - యిచ్చితిమేము
నటుల సేయుదము మ - మ్మడుగ నేమిటికి!
విచ్చేయుఁ డేమెల్ల - వెనువెంటఁ గూడి
వచ్చెద” మనవుఁడు - వాలివాయుజులు

ముందఱ నెగసిన - మూఁకలతోడ
నందఱు పవమాన - హతి మింటఁ బఱచు4800
జలద మాలికలనఁ - జనువేళ నచటఁ

-: రాముఁడు సుగ్రీవునితో సీతవృత్తాంతము దెలియలేదని చింతించుచు నడుగుట :--

గలఁగుచు రాముఁడ - ర్కజుఁ గాంచిపలికె
"వచ్చియుండియు మన - వారు రారైరి
యిచ్చటికేమిటి - కింత తామసము?
ఎట్టులున్నదియె నీ - హృదయంబుఁ దెల్పు
మిట్ట” ని యనిన న - య్యినసూనుఁడనియె

-: సుగ్రీవుఁడు రామునకుఁ గార్యసాఫల్యమగునని ధైర్యము చెప్పుట :-

“గడువును మీఱి యీ - కపులెల్ల వచ్చి
కపట భయమెఱుంగ - క సురాసురలు
దేఱి చూడఁగరాక - దేవరబంటు
తారా రుమా ముఖ్య - తరుణుల కెల్ల4810
నేఱుపాటుగ నిచ్చు - నీమధువనము
చూఱవట్టిరి యన్న - చో మేలుగాదు?
పరమకల్యాణముల్ - ప్రాపించు మిమ్ము
నిరుపమ భుజసత్త్వ- నిధి వాయుసుతుఁడు
సీతను జూచివ - చ్చెను లేకయున్న
నీతెంపు కపివీరు - లెట్లు సేయుదురు?”
అనునంత లక్ష్మణుఁ -“డంతటివాఁడె

హనుమంతుఁ డనుపుచో - నందఱిలోనఁ
గౌఁగిలించుక రాము - కార్యమీడేర్చు
వ్రేఁగుమోపితి” వన - విని రఘూద్వహుఁడు4820
వాయుజుఁ డీపాటి - వాఁడని యెంచి
నాయుంగరంబిచ్చి - నాఁడు పంచితిని
యొనరి యున్నది నీదు - యోజన యనఁగ
వినువీథి నప్పుడె - వినవచ్చెఁ గపుల
కిలకిలాయిత విశం - కిత విరావంబు
పెళపెళ నురములు - పెనుగొన్న యటుల
హనుమంతు నంగదు - నానగా మొదట
నునుచుక వానర - వ్యూహమంతయును
వచ్చినంతన తమ - వారల నెల్ల
మెచ్చి కన్గొనుచుండె - మిహిరనందనుఁడు4830

-: హనుమంతుఁడు సీతనుఁ జూచితినని శ్రీరామునితోఁ జెప్పుట :-

“చూచితి సీత!” నం - చును రఘువీరు
జూచి వాకొని వాయు - సూనుఁడు వలుక
మెచ్చి సుగ్రీవ సౌ - మిత్రులు వొగడి
రచ్చెరువున నుండ - నవనిజాప్రియుఁడు
కలగొని రామునిఁ - గాంచి వానరులు
"జలరాశి దాఁటెను - జానకిఁ జూచె
లంకఁ గాలిచె దైత్యు - లను వధియించె
యంకలిలేక కా - ర్యము నిర్వహించె!

      
ఈ హనుమంతుఁ డం - తింత గాదితని
సాహస కథ" లన్న - సంతోషమంది 4840
పవనజుమోముఁ ద - ప్పక చూచి కరుణ
చివురొత్తఁ గ్రమ్మఱ - శ్రీ రాముఁ డనియె.
"ఎందు నున్నది సీత? - యెట్టి చందమునఁ
గుందియున్నది నల - కువ కెట్టులోర్చె?
ఏమంటి వాయింతి - యేమని తనదు
సేమంబు నాతోడఁ - జెప్పి రమ్మనియె?
గుఱుతు లెయ్యవి పేరు - కొను”మన్న మ్రొక్కి
కరువలిపట్టి రా - ఘవున కిట్లనియె.

       -: సీతయిచ్చిన శిరోమణిని శ్రీరామున కొసంగుట :-

"జలజాప్తవంశభా - స్కర! రామచంద్ర!
జలరాశి దాఁటి యేఁ - జనుచోట నడుమఁ 4850
బెక్కు విఘ్నములు గ - ప్పిన నవి ద్రోచి
యుక్కుతో లంకకు - నొక్కడఁ జేరి
రేయెల్ల నమ్మవా - రినిఁ బురి నెల్ల
చాయల వెదకి ద - శగ్రీవు నగరు
జూచి లేకునికి య - శోక వనంబుఁ
జూచి యందొక చోట - చుట్టు నున్నట్టి
దనుజకాంతలలోనఁ - దన నెఱివేణి
పెను జడగట్ట మీ - పేరు వాకొనుచుఁ
గన్నీరు గురియ నం - గము మైలవాఱఁ
జెన్నుచాలక మైల - చీరధరించి 4860

         
            తలవాంచి యున్న సీ - తా దేవిఁ జూచి
            పలుకరింపఁగ శింశు - పావృక్ష మెక్కి
            దాని మీఁదట నుండి - తావక చరిత
            మేను వాకొనఁ దల - యెత్తి చూచుటయు
            సమయంబు గాంచి యేఁ - జని చేరి మ్రొక్కి
            రమణీమణికి నుంగ - రము చేతి కిచ్చి
            యా యమ్మ మిముఁ బాసి - ప్రాణముల్ దాల్ప
            నే యుపాయము లేమి - యెఱిగి యూరార్చి
            గుఱుతుగా నొకటి పే - ర్కొనుమన్నఁ గాకి
            పరిభవించిన కథా - భాగంబు నుడివి 4870
            జేవురు బొట్టు దీ -ర్చిన నాటి తెఱఁగు
            నావన సంచార - మపుడు వాక్రుచ్చి
            తన శిరోమణి యిచ్చి - తను వీడుకొలుప
            వన మెల్లఁ బెఱికి రా - వణ మంత్రిసుతులఁ
            జంపి సైన్యేశ పం - చకము నడంచి
            తెంవుఁ జూపిన యక్షుఁ - దెగటార్చి వెనక
            నింద్రజిత్తుని చేత - నేఁ జిక్కి దాన
            వేంద్రుని కొలువున - కేఁగి యేనతని
            దూషింప విని యల్క - తో రావణుండు
            రోషంబుతోడ వి - రూపుఁ గావింపఁ 4880
            దోఁకఁ గాలిచి వీనిఁ - ద్రోలుఁడటన్న
            నాఁక చేసుక దైత్యు - లట్లు సేయుటయు
            లంక గెలిచి మఱ - ల మహిజఁ జూచి
            పంకజేక్షణ ! నీదు - పదములు గంటి !
            నెలగాని యిటమీద - నేఁదాళ ననుచుఁ

       
        బలికె జానకి లంక - పై వీడియుటకు
        జల రాశిఁ దాఁట యో - జన సేయుఁ”డనుచుఁ
        బలికి భానుప్రభా - భాసురం బైన
        సీత శిరోమణి - చే చాఁచి యొసఁగఁ
        జేత నందుక రఘు -శ్రేష్ఠుఁడుప్పొంగె ! 4890
        అప్పుడు సన్నిధి - నవనిజఁ గాంచు
        చొప్పునఁ దనివోక - చూచి హర్షించి
        గళ్ళ పాలిక నొత్తి - కన్నులఁ జేర్చి
        యుల్లంబు చల్లగా - నురము పై నుంచి
        "హా ! సీత !”యని యేడ్చు - నన్న నీక్షించి
        యాసుమిత్రాపుత్రుఁ - డడలుచు నుండ
        "వనధిఁ గౌస్తుభముద్బ - వము నొందినట్లు
         జనియించె నిది నిట - జనకభూపతికి
         బృందార కేంద్రుఁ డ - ర్పించె యాగమున !
         ఎందును వెల లేని - యీ మానికంబు 4900
         నా పెండ్లి నాఁడర - ణముగాఁగ నిచ్చెఁ
         జేపట్టి పట్టియౌ - సీతకొప్పునకు
         నీమణివరముఁ దా - నెప్పుడు సీత
         సీమంతవీధికి - శృంగారకరము !
         సీత ధరింపఁ జూ - చిన వాఁడ నాదు
         చేతఁ గైకొని ధరిం - చిన మనఁగలనె ?
         స్త్రీశిరోమణియైన - సీత వేనలిని
         యీశిరోమణిఁ దాల్ప - యిఁకఁ జూతునొక్కో !
         ఏమయ్యెనో సీత - యెందు నున్నదియొ ?
         ఏమి సేయుదునని - యేనుంటిగాక 4910

       
        యీ మేర సీత చో - ప్పెఱిఁగిన వెనుక
        నీ మేనఁ బ్రాణము - లేఁటికి నుండు ?
        దాళ లేనిఁక నిట్లు - దమ్ముఁడా!”యనుచు
        వ్రాలి సౌమిత్రిపై - వాతెఱ యెండ
        "రక్షింపవే సుమి - తాపుత్ర ! నన్ను
        రక్షింప సుగ్రీవ ! - రావే ” యటంచు
        మఱల రాముఁడు పవ - మాన బాలకునిఁ
        గరుణారసము చిల్కఁ- గాఁ జూచి పలికె.
        "అన్న ! వాయుకుమార ! - యాపన్నునన్ను
        మన్నించి ప్రాణముల్ - మఱలింపు మీవు ! 4920
        నన్ను నెత్తుకపోయి - నలినాక్షి సీత
        యున్న వనంబులో - నునిచి రమ్శివుడు !
        ఏల చెప్పితి ' సీతఁ ” - నేఁ గంటిననుచు ?
        తే లేవె మూవుపై ? , దేవలెనన్నఁ
        జూచియు డించి వ - చ్చునె నిన్నువంటి
        ధీ చతురుండు నా - తెఱగెఱిఁగియును ?
        ఏమి వల్కెను సీత ? - యెటులోర్చె దనుజ
        భామల చేతి ని - ర్బంధంబుకును ?
        నీవేమి యంటివి ? - నిమిషమాత్రంబు
        నీవలఁ దాళ లే - నెగిరి పోఁజూల 4930
        నెట్టులున్నది సీత ? - యేమని మాట
        పట్టులిచ్చితి వింకఁ - బ్రదుకునే నెలయు ?
        తెలియఁ బల్కుము వెతఁ - దీఱి కొన్నాళ్లు
        నిలువరించెద ” నంచు - నిలుపోప లేక

      
       కలఁగుచునున్న రా - ఘవు మోముఁజూచి
       యలమటల్ దీఱగ - హనుమంతుడనియె.

            -: హనుమంతుఁడు చెప్పిన సీత వృత్తాంతము విని
                    శ్రీరాముఁ డానందము నొందుట :-

      “ అయ్య! నేఁ బొడగన్న - యప్పుడే చిత్త
        మియ్యక రావణుఁ - డేతప్పదనుచు
        ననుఁ జూచి మదిలోన - నమ్మిక మిమ్ము
        వినుతింపుమని రూప - వృత్తంబు లడిగె. 4940
        జనకజయాత్మకు - సరిపోవఁ జెప్పి
        వెనుక నిచ్చితిని మీ వ్రేలి యుంగరము
        నందుచే విశ్వాస - మంది నాతోడ
        మందలించినయట్టి - మాటలు నాకు
        బలుక నోరాడదు - పలవరింపుచును
        విలపింప శ్రీరామ - విభునిఁ దెచ్చెదను
        రావణుఁ దునిమింతు - రమణుని తోడ
        దేవి కూర్చెద నిన్ను - ధృతివదలకుము.
        అనుచు బాసలు చేసి - యానవాలడుగఁ
        దనదు చూడాగ్రర - త్నముఁ బ్రసాదించి,
        తాను నిద్రించుట - తరువాత నిదుర
        వూని మీరున్న య - ప్పుడు జయంతుండు
        కాకియై తనదు వ - క్షము నఖాగ్రముల
        రేక వారింప జా - ఱిన రక్తధార
        మీ మూఁపుపై సోఁక - మేల్కని యిందు 4950

కేమి నెపంబన్న - నేర్పరించుటయు
నందుకు నలిగి బ్ర - హ్మాస్త్ర మేయుటయుఁ
గొందలంబునఁ గాకి - కూయుచుఁ బఱచి
యేలోకములకుఁ బో - యిన నభయంబు
పాలించు దేవతా - ప్రభువులు లేక 4960
శరణుఁ జొచ్చినవానిఁ - జాల మన్నించి
కరుణాపరుండవై - కాచి పొమ్మనుట
వినిపించి నేఁటికి - "విపినంబులోన
ననఘాత్మ! నిలువు మా - యాసంబుఁ దీఱ
నే నల్పభాగ్య నొ - క్కించుకఁ దాల్మి
వూనెద నీరేయి - యూరడిల్లెదను.
అన్న! రాఘవుఁ దెత్తు - నంటి వేరీతి
మున్నీరు దాఁటి త - మ్ముఁడు దాను వచ్చు
కరువలియును నీవు - గరుడుండుగాక
శరధి నన్యులు దాఁట - శక్తులు గారు 4970
మీ రాజు కొలఁది యే – మియు నేనెఱుంగ
శ్రీరాము నన్నుఁ గూ - ర్చినపుణ్యమనుము!
చెనకినఁ గాకి ని - షీకంబువైచి
వనజాండమునను ది - వ్యశ్రేణి కెల్ల
వెఱపు వుట్టించు నీ - విక్రమంబునకు
సుర లెంత రావణా - సురుఁడెంత గలఁడు?
అట్టి నామీఁద ద - యారసంబొకఁడు
పట్టుక పోవుచో - పాటిరాదయ్యె!

తనయదృష్టంబొ చే - తను గాక మీరు
కనిపించుకొనరొ యే - గతి నోర్తు? ననుము 4980
రామునిఁ దెత్తు వా - రాశిపై ననుట
నామది సరిపోదు - నమ్మించితేని.
నీవిట్లు రా వేని - నిమిషంబులోనఁ
బోవు ప్రాణము లట్లు - బోకుండఁ జేసి
మఱలించినావు సే - మముఁ గాంచి పోయి
మఱలుము నాదు నె - మ్మది శాంతినొందె'!
ననుటయు మరల న - య్యవనిజ మొగముఁ
గనుఁగొని యేను రా - ఘవ! యిట్టులంటి
"అమ్మ! సుగ్రీవుని - యంతటివాఁడు
నమ్మించినాఁడు నీ - నాథుని మొదట 4990
నతనిఁ గొల్చిన వాన - రానీకమునకు
నతివ! యీ జలరాశి - యన నెంతగలదు!
వాలాయుధులు బల - వంతులు శౌర్య
శాలులు నాతోడ - సరివారు ఘనులు
కాంచనాచల నిభుల్ - గాని నాకన్నఁ
గొంచెపువానిఁ బే - ర్కొన నెందు లేఁడు.
మనసులో నెన్నుము - మర్కటేశ్వరులు
జనకజ యున్నట్టి - చందంబుఁ జూచి
రమ్మని పనుచు కా - ర్యము వూనివచ్చి
యెమ్మెలఁ బోయిన - నెంతురే నన్ను! 5000
అంతమాత్రపువాఁడ - నగచరు లెల్లఁ
జెంతకు రాఁగొట్టి - చెప్పినయట్టి

పనుల మెలంగెడు - పాటినానడకఁ
గనియెదు ఱేపె యీ - కపివీరవరుల
నెప్పుడు నేఁబోయి - యిచట నీవున్న
చొప్పు వచించిన - సుగ్రీవుఁడచటఁ
గాలూఁది నిలువఁడు - కపినాథులెల్ల
నేలిక దండు బో - యినఁ బోదమనుచు
దలఁపరు సెలవిమ్ము - దశకంఠుఁ దానె
పొలియింతు ననుచు ని - ప్పుడె వత్తురిటకు! 5010
రామలక్ష్మణు లెట్లు - రానేర్తు రనిన
నామూపులందుఁ ది – న్నఁగ నెక్కి కదలి
గగనమార్గమున ని - క్కడ వచ్చి నిలిచి
మగువ! రావణుఁ బట్టి - మర్దింపఁ గలరు.
శ్రవణపర్వంబగు - జ్యావల్లిమ్రోత
చెవిసోఁకు భీకర - సింహనాదములు
రామలక్ష్మణ కపి - వ్రాతంబువలన
భూమిజ! నమ్ము నేఁ - బోయివచ్చెదను
నాసత్యమాన నీ - నాయకుఁ గూడి
యోసాధ్వి! మీరల - యోధ్యాపురమునఁ 5020
బట్టాభిషిక్తులై - ప్రజలఁ బాలింప
నట్టి వేడుక చూచి - నప్పుడిచ్చోటఁ
బలికిన యట్టి నా - పలుకు లన్నియునుఁ
గలకంఠి! నాఁడు తార్కాణ సేయుదును”
అనునంతలో సీత యనుమాన ముడిగి

తనలోన మీ చెంతఁ - దానున్నయట్లు
యశోకవనంబె - యంతరంగమున
నాయయోధ్యాపురం - బనినంత కలిగి
నెమ్మదితో నోరు - నిండ దీవించి
పొమ్మన వచ్చితి - భూరి శౌర్యమున ! 5030
వీరవానరులతో - విచ్చేసి కలన
నారావణునిఁ ద్రుంపుఁ - డవనిజఁ దెండు.”
అనిన సీతా దేవి - యచట నుండుటయు
మనసులో ననురాగ - మగ్న యౌటయును
వీనులు చల్లఁగా - వీని రఘువీరుఁ
డానంద మగ్నాంత - రంగుఁడై యుండె.


-: కాండాంతగద్య :--

విలసిల్లెనని వేద - వేద్యునిపేర
నలమేలుమంగాంగ - నాధీశుపేర
నంచిత కరుణాక - టాక్షునిపేరఁ
గాంచనమణిమయా - కల్పునిపేర 5040
వేదవేదాంతార్థ - వినతునిపేర
నాదిత్యకోటి ప్ర - భాంగుని పేరఁ
గంకణాంగదరత్న - కటకాఢ్యుపేర
వేంకటేశునిపేర - విశ్వాత్ముపేర
నంకితంబుగ వేంక - టాధీశ చరణ
పంకజసేవాను - భావమానసుఁడు
హరిదాసమణి కట్ట - హరిదాసరాజు

వరదరాజు నితాంత - వరదాన శాలి
రచియించు వాల్మీకి - రామాయణంబుఁ
బ్రచురభక్తిని మదిఁ - బాటించి వినినఁ 5050
జదివిన వ్రాసిన - సభలఁ బేర్కొనిన
మదిఁ దలంచిన నెట్టి - మనుజులకైన
ధారుణిమీఁద సీ - తా రామచంద్ర
పారిజాతదయా - ప్రభావంబువలన
హయమేధ రాజసూ - యాదిమయాగ
నియతఫలంబులు - నిరతాన్నదాన
సుకృతంబు నిత్యయ - శోవైభవములు
నకలంక తీర్థయా -త్రాది పుణ్యములు
సత్యవ్రతపదంబు సకల సౌఖ్యములు
నిత్య మహాదాన - నిరుపమశ్రీలు 5060
కలికాల సంప్రాప్త - కలుషనాశనముఁ
గలుములు హరిభక్తి - గౌరవోన్నతులు
శత్రుజయంబును - స్వామిహితంబుఁ
బుత్రలాభంబును - భోగభాగ్యములు
ననుకూలదాంపత్య - మంగనాప్రియము
ధనధాన్య పశువస్తు - దాసీసమృద్ధి
మానసహితము ధ - ర్మప్రవర్తనము
నానందములు ఖేద - మందకుండుటయు
నలఘువివేకంబు - నతులగౌరవము
వలయు కార్యములు కై - వశములౌటయునుఁ 5070

బావనత్వము దీర్ఘ - పరమాయువులునుఁ
గైవల్యసుఖము ని - క్కముఁగాగఁ గలుగు!
నెన్నాళ్లు రవిచంద్రు - లెన్నాళ్లు గిరులు
నెన్నాళ్ళు నిగమంబు - లెన్నాళ్లు విశ్వ
మున్నాళ్లు నీకథ - యలరు నార్షంబు.
ఆదికావ్యంబు స - మస్తపూజ్యంబు
వేదసమానంబు - విశ్వసన్నుతము
శోభనకరమునౌ - సుందరకాండ
మీభూమిఁ బూజ్యమై - యిరవొందుఁగాత.5079

కట్టా వరదరాజకృతమగు
ద్విపద రామాయణమున
సుందరకాండము
సమాప్తము

శ్రీ రామచంద్రార్పణమస్తు