శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/6వ అధ్యాయము

6వ అధ్యాయము.

భగవంతుడు — భక్తులు.

166. జమీందారుడు గొప్పధనికుడుగ నుండవచ్చును; కాని బీదరయితు అల్పపుకానుకలను తెచ్చి ప్రీతిపూర్వకముగ అర్పించినప్పుడు, వానిని ఆజమీందారుడు మిగుల ఆనందముతో స్వీకరించును. అటులనే సర్వేశ్వరుడగు భగవంతుడు తాను మహిమాఢ్యుడును మహాశక్తిసమన్వితుడును అయిననుగూడ భక్తిపూర్వకముగ అర్పణచేయబడు అల్పపు కానుకలను సయితము మహానందముతోడను పూర్ణసంతృప్తితోడను స్వీకరించును.

167. దుమ్ములోపొర్లాడి ఒడలెల్ల బురదచేసికొనుట పసిబిడ్డకు సహజము. అయినను తల్లిబిడ్డను సదా అట్లే మలినముగ నుండనీయదు. పదేపదేకడుగుచుండును. అటులనే పాపకార్యములు చేయుచుండుట నరునికి సహజము. కాని ఆతడు పాపముచేయుట ఎంతనిశ్చయమో, అతనికి భగవంతుడు తరుణోపాయముల గూర్చుచుండుట ద్విగుణముగా నిశ్చయము.

168. చేపలతోచేయబడు పులుసు, కూర, మొదలగు వానిలో ప్రతివాడును తనకు హితవగుదానిని కోరుకొనునట్లు తనభక్తుల కోరికలదీర్చునిమిత్తము ఒకేభగవంతుడు వేర్వేఱు రూపములు తాల్చుచుండగా, ఒక్కొక భక్తుడును తనకు హితవగురూపమును పూజించుచుండును. కొందఱికి దేవుడు స్వామి, కొందఱికి తండ్రి, కొందఱికి ప్రియమాత, కొందఱికి సఖుడు, కొందఱికి ప్రేమంపుభర్త, మఱికొందఱికి అత్యంతవిధేయుడగు సుతుడుఅయి ప్రత్యక్షమగుచుండును.

169. దేవఋషులు భగవంతునకు సన్నిహితబంధుకోటిలోనివారనవచ్చును. వారు మిత్రులవంటివారు. భగవంతునికి చుట్టాలును, సహవాసగాండ్రునైయుందురు. తక్కిన సామాన్యప్రజలు దూరపుబంధువులవంటివారు. వీరు భగవంతుని పరిపాలనమునమాత్ర ముందురు.

170. నరునికి వానిసంకల్పముల ననుసరించియు, వాని యుద్దేశ్యముల ననుసరించియు ఫలము లభించుచుండును. భగవంతుడు కల్పవృక్షమువంటివాడు. భక్తులుకోరుకొనుదానినెల్ల ప్రసాదించుచుండును. ఒక పేదవానికొడుకు చాలప్రయత్నించి ఉన్నతన్యాయస్థానమున ధర్మాధికారిపదవిని పొంది "అమ్మయ్యా! నిచ్చెన మెట్లలో కొనదాని కెగబ్రాకితిని, మహానందము! ఇప్పుడుబాగున్నది" అని తలపోయును. అటువంటివానికి భగవంతుడు "ఎల్లప్పుడు ఆస్థితియందేయుండు"మని చెప్పును.

అయినను ఈ ఉన్నతన్యాయస్థానాధికారి ఉపకారవేతనముపొంది పని విడచినప్పుడు, గతజీవితమును విమర్శించుకొని, తనజీవనము వ్యర్ధముగ గడచిపోయునటుల గ్రహించి యిట్లనును:- "అయ్యో! ఏమిచేసియుంటిని?" వానితో భగవంతుడిట్లనును:- "అయ్యో! నీవేమిచేసితివి?" 171. సూర్యరశ్మి ఎచ్చోటపడినను ఒకేతీరుననుండును. అయినను నిశ్చలముగనున్ననీరో, లేక అద్దమో, లేకమెఱుగుపెట్టిన లోహపురేకో, సూర్యబింబమును పూర్తిగ ప్రతిఫలింపజేయును. భగవంతుని దివ్యతేజము నిట్లేయగును. పక్షపాతము లేక అది సమానముగా అందఱి హృదయములమీదను ప్రసరించును. కాని సజ్జనుల యొక్కయు, సాధుపుంగవుల యొక్కయు నిర్మలనిష్కళంక హృదయములు మాత్రమేదానిని స్వీకరించి చక్కగా ప్రతిబింబింపజేయును.

172. భగవంతుడును, వానివాక్కులును, వానిభక్తులును, అందఱును ఒక్కటియే, అభిన్నము.

173. నిజముగ భక్తుడు భగవంతుని యెట్లుభావించును? బృందావన గోపికలు శ్రీకృష్ణుని జగన్నాధునిగా భావించక తమప్రియుడగు గోపికానాధునిగా చూచినవిధమున భక్తుడు భగవంతుని తనకొక దగ్గఱచుట్టముగా చూచుకొనును.

174. నరునిఆత్మ భగవంతునితోడ సంపూర్ణముగ ఐక్య సంధానమును పడయుటసాధ్యమే. అటుల పొందినప్పుడే "ఆతడును నేను నొక్కటియే" (శివోహం) అని భావన చేసి వచింపగల్గును. ఒకగృహమందలి వృద్ధసేవకుడు కాలక్రమమున ఆయింటివారిలో నొకడైపోవ, ఒకానొక దినమున యజమానియే, వానిపనిని మిగుల మెచ్చుకొనినవాడై తాను కూర్చుండు గౌరవస్థానమున కూర్చుండబెట్టి, చుట్టునున్నవారితో ఆదినమునుండి తనకును ఆసేవకునికిని భేదములేదని చెప్పవచ్చును. యజమానుడు "ఇతడును నేనును ఒక్క టియే. నాయెడల మీరు విధేయులై వర్తించురీతిని వీనియెడల వర్తింపుడు. అటులచేయనివానికి శిక్షజరుగును" అనవచ్చును. ఇట్టి నూతనగౌరవమునుగూర్చి తడబడుచు, ఆసేవకుడు నమ్రుడై వెనుకాడినను కూడ, యజమానుడే బలవంతముగ వానిని ఉత్తమాసనమున కూర్చుండబెట్టును. చిరకాలము భగవత్సేవచేసి, వానితోడి ఐక్యసంధానమును పడసిన ఆత్మలదశ యిట్లుండును. భగవంతుడు తనమహిమను, విభూతులను వారియందుంచి, విశ్వాధిపత్యమును సూచించు తనసింహాసనమున వారిని కూర్చుండబెట్టును.

175. భగవద్భక్తుడు భగవంతుని తల్లీ! అని పిలుచుచు ఆనందపరవశుడగుటకు కారణమేమి? చంటిబిడ్డ ఇతరుల దగ్గఱకంటె యెక్కువచనువుతో తల్లికడ మెలగును. అందువలన ఆబిడ్డకు అందఱిలో తల్లిమీద మక్కువహెచ్చు.