శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/38వ అధ్యాయము
38వ అధ్యాయము.
సర్వమత సామరస్యము.
711. ఒకేనీరు వేర్వేఱుజాతులవారిచేత వేర్వేఱు పేరులతో పిలువబడును. ఒకజాతివారు జలమందురు; ఇంకొక జాతివారు పాని అందురు; వేఱొకజాతివారు వాటర్ అందురు; మఱొకజాతివారు యవ్యా అందురు. అట్లే సచ్చిదానందమయ పరబ్రహ్మమును కొందఱు దేవుడనియు, కొందఱు అల్లాఅనియు, కొందఱు హరిఅనియు కొందఱు బ్రహ్మ యనియు సంబోధింతురు.
712. పెద్దచెఱువునకు అనేకము రేవులుండును. ఏరేవున ఎవరు దానిలో దిగినను స్నానముచేయ వచ్చును. నీరుదీసికొని పోవచ్చును. ఒక రేవు మఱొకరేవుకంటె శ్రేష్ఠతరమని పోట్లాడుట వ్యర్థపుపని. అటులనే బ్రహ్మానందసరోవరమునకు చాలరేవులున్నవి. ఈరేవులలో దేనిగుండనైనను సరియే నిర్మలహృదయముతో శ్రద్ధాభక్తులతో సరాసరి పొండు. మీకు నిత్యానందజలము లభించగలదు. అంతేగాని నా మతము వేఱొకని మతముకన్న శ్రేష్ఠమని వాదులాడ బోకుడు.
713. భగవంతునికి అనేక నామము లున్నవి. ఆయనను చేర్చురూపములును అనంతములుగనున్నవి. నీకేనామము ఏరూపమునచ్చునో దాని సాహాయముననే నీవు వాని సాక్షాత్కారమును పొందగలవు.
714. కుమ్మరిదుకాణములో కుండలు, కూజాలు, డాకలు, మూకుళ్లు మున్నగునవి అనేక పరిమాణములతో అనేక స్వరూపములతో నుండును. కాని అన్నియు ఒకే మట్టితో చేయబడినవియే. అటులనే భగవంతుడు ఒక్కడు; కాని ఆయాయుగములలో, ఆయాదేశములలో భిన్నభిన్న నామములతోడను భిన్నభిన్న స్వరూప లక్షణములతోడను పూజింపబడుచుండును.
715. ఒకే పంచదార పక్షులు మృగములు మొదలగు ననేకచిత్రరూపములను పొందగల్గును. అటులనే మధురమూర్తియగు జగజ్జనని వేర్వేఱుయుగములందు వేర్వేఱు ప్రదేశములందు వేర్వేఱు నామరూపములదాల్చి పూజల నందును.
716. వేర్వేఱుమతసాంప్రదాయములు భగవంతునిచేరుట కగు వేర్వేఱుమార్గములే. కాళీఘట్టమునందలి కాళీయాలయమునకు భిన్నభిన్నమార్గములు చాలగనున్నవి. అటులనే స్వామిసదనముచేరుటకు మార్గములనేకములున్నవి. ప్రతిమతశాఖయు మానవులను భగవంతునికడచేర్చుట కుపయోగించు ఒకానొకత్రోవ అన్నమాటే!
717. ఒకేబంగారముతో వేర్వేఱుపేరులుగల వేర్వేఱు రూపములతో నుండు నగలుచేయబడుతీరున ఒకేదేవుడు వేర్వేఱు దేశములలో వేర్వేఱు కాలములందు వేర్వేఱు నామరూప ములతో పూజింపబడును. ఆయన భిన్నభిన్నములగు భావనలతోడను విధానములతోడను పూజింపబడినను, అనగా కొందఱు భగవంతుని తండ్రిఅనినను, కొందఱు తల్లిఅనినను కొందఱు సఖిఅనినను, మఱికొందఱు నాధాఅనినను, మఱికొందఱు ఆయనను తమహృదయకోశమందలి పెన్నిధిగ భావనచేసినను, ఇంకకొందఱు వానిని తమ పసిబిడ్డగ జూచుకొనినను; ఒకేదేవుడు వేర్వేఱు భావనాసంబంధములతో పూజింపబడుచుండెనన్నమాటయే!
718. ఒకసారి బర్డ్వాను మహారాజు నాస్థానమునందు శివుడుఘనుడా విష్ణువుఘనుడాయని పండితులలో చర్చబయలుదేఱినది. సభ్యులలో కొందఱు శివుడు శ్రేష్ఠుడనిరి; మఱికొందఱు విష్ణుడు శ్రేష్ఠుడనిరి. చర్చతీవ్రరూపము దాల్చినది. అప్పుడొక పండితుడు "అయ్యలారా! నేను శివుని చూడలేదు, విష్ణుని చూడలేదు. వారిరువురిలో ఎవరుఘనుడో నేనెట్లు చెప్పగలను?" అనెను ఆవిధముగా ఒక దేవతను మఱొక దేవతతోపోల్చి తారతమ్యము నెంచబోకుడు. దేవతలలో ఒక్కనిసాక్షాత్కారమును పడసినను, దేవతలందఱును ఒకే బ్రహ్మముయొక్క వ్యక్తస్వరూపములే అని తెలిసిపోవును.
719. ప్రశ్న :- అన్నిమతములలోని దేవుడును ఒక్కడే అగునెడల ఆయన వేర్వేఱుమతములవారిచేత వేర్వేఱువిధముగా వర్ణింపబడుటేల? ఉ:- భగవంతుడు ఒక్కడే. కాని వానికళలు అనేకము! ఒక గృహయజమాని ఒకనికి తండ్రి; ఒకనికి తమ్ముడు, ఒకనికి అన్న, ఒకామెకు మామ, మఱొకామెకు భర్త కావచ్చునుగదా! అటులనే వానివాని భావనావిశేషము ననుసరించి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క తీరున భగవంతుని అభివర్ణించును.
720. ఒకడు మేడమీదికి నిచ్చెనతోడనో, వెదురుసాయముననో, మెట్లమీదుగనో, త్రాడుతో నెగబ్రాకియో పొవచ్చును. అటులనే భగవంతుని చేరుటకు మార్గములు సాధనలు చాలగానున్నవి. ప్రపంచములోని ప్రతిమతమును అట్టి మార్గములలో నొకదానిని చూపును.
721. ఇద్దఱుమనుజులు ఊసరవెల్లిరంగునుగురించి తీవ్రముగ వాదులాడుచుండిరి. "ఆత్రాటి చెట్టుమీద నేనొక ఊసరవెల్లిని చూచినాను; అది చక్కగ ఎఱ్ఱనిరంగుతో నున్నది" అని ఒకడనెను. వానిపలుకులు ఖండించుచు నీమాటతప్పు. నేనును దానిని చూచినాను. అది యెఱ్ఱగా నుండదు. అది నీలముగా నుండును" అనెను. వాదనచేత తమ తగవును త్రెంపుకొనలేక యిరువురును వేఱొక మనుష్యునికడకు పోయిరి. ఈతడు సదా ఆచెట్టుకడనే నివసించువాడు; ఆఊసరవెల్లి రంగుల మార్పులన్నియు చూచినవాడు. వీనికడకువచ్చి వాదులాడువారిలో ఒకడు "అయ్యా ఆచెట్టుమీది ఊసరవెల్లి ఎఱ్ఱగానుండును కాదండీ?" అనెను. అందుకామనుష్యుడు "ఔనయ్యా!" అనెను. రెండవవాడు ఏమిటండీ? అదెట్లు ? దానిరంగుఎఱ్ఱనకాదే; నీలముగా నుండును!" అనెను. అందుకును ఆమనుష్యుడు నెమ్మదిగా "అవునండీ!" అనెను. ఆమనుజునకు ఊసరవెల్లి తఱచుగా రంగులు మార్చుకొనుచుండునని తెలియును. కావున వాదులాడు ఇరువురి భిన్నవాదనలకును "ఔను" అని అతడు చెప్పగలిగెను. అటులే సచ్చిదానందము వేర్వేఱుస్వరూపములతో నొప్పునది. భగవంతుని ఒక్కకళ మాత్రమే చూచిన భక్తుడు ఆరూపమునుమాత్రమే ఎఱుంగును కాని భగవంతుని వివిధకళలను చూచిన భక్తుడు "ఈ రూపములన్నియు ఆ భగవంతునివే. ఆయన స్వరూపము లనంతములు" అనగలడు. భగవంతుడు నిరాకారుడు; సాకారుడుకూడను. ఆయన అనంతరూపములను ఎవడును ఎఱుంగజాలడు.
722. ప్రతిమానవుడును తనమతమునే అవలంబించవలయును. క్రైస్తవుడు క్రీస్తుమతమును మహమ్మదీయుడు మహమ్మదుమతమును అవలంబించవలసినదే. హిందువునకో ప్రాచీన ఆర్యఋషుల మార్గము నవలంబించుట శ్రేష్ఠము.
723. నిజముగా ధర్మిష్ఠియగు పురుషుడు ఇతరమతములన్నియు సత్యమునుజూపుమార్గాంతరము లేయని తలచవలెను. మనము ఎల్లప్పుడును అన్యమతములయెడ గౌరవము జూపుచు వర్తించవలెను.
724. ఏమతమునందుగాని, ఏసాంప్రదాయమునగాని అసహనముండరాదని శ్రీపరమహంసులవారి అభిప్రాయము. ప్రతిస్త్రీయు ప్రతిపురుషుడును తనమతమునెడల గాఢభక్తియు శ్రద్ధయు కలిగియుండవలయుననియు అసహనము కూడదనియు చెప్పుచుండెడివారు.
725. ('దళములు' అనగా వర్గములు అనియు నీటిపైని మొలచు 'నాచు' అనియు వంగభాషలలో శ్లేషార్థములు కలవు.)
ప్రశ్న:- దళములను ఏర్పాటుచేయుట మంచిదా?
ఉ:- దళములు పాఱుదలనీళ్లలో పెరుగవు. అవికదల మెదలని మఱుగునీటిలో పెరుగును. ఎవనిహృదయము సదా దైవమువైపునకు ప్రవహించుచుండునో వానికి ఇతరవ్యాప్తులకు అవకాశముకాన్పించదు. పేరుప్రఖ్యాతులకై దేవురించు నతడు దళముల సృష్టించుచుండును.
726. నక్కకూతలు సర్వత్ర ఒక్కటిగనే యుండును; జ్ఞానులబోధలును సర్వత్ర ఏకరీతిగనే యుండును.
727. వాదులాడతగదు. నీయభిప్రాయములను నీవిశ్వాసములను నీవు స్థిరముగ నిలుపుకొనుతీరున ఇతరులును తమ అభిప్రాయములను విశ్వాసములను స్థిరముగ నిలుపుకొనుటకు నీవు స్వాతంత్ర్యమునంగీకరించవలయును. కేవలమువాదులాటచేత నీవొకని పొఱబాటును సవరించుకొనునటుల చేయజాలవు. ఈశ్వరానుగ్రహము కలిగిననాడు ప్రతిమానవుడును తన తప్పులను తానె తెలిసికొనగలడు.
728. విద్యుద్దీపములయొక్క వెలుతురు ఆయాస్థలములందు వేఱువేఱుగా ప్రకాశించును. అయినను ఆవెలుతురు నకు ఆధారమగు విద్యుచ్ఛక్తి ఒకేయంత్రమునుండి వచ్చును. అట్లే మతబోధకులు అన్నిదేశము లందును అన్నికాలములందును దీపములవలె ప్రకాశించుచుందురు. వారందఱియందును తేజరిలు ఆత్మప్రకాశము ఒకే పరబ్రహ్మమునుండి వచ్చుచున్నది.
729. కొన్నిసంవత్సరములకు పూర్వము హిందువులును బ్రహ్మసమాజమువారును అత్యుత్సాహముతో తమ తమ మత ధర్మములను బోధింపసాగగా, ఆమతముల రెండింటిని గూర్చియు మీఅభిప్రాయ మేమని ఒకరు శ్రీపరమహంసులవారిని అడిగినప్పుడు శ్రీవారిట్లనిరి:- "రెండు వర్గముల ద్వారమునను నాదివ్యమాతయే తన పనిని సాగించుచుండుట నాకు కాన్పించుచున్నది!"
730. నరులు తమ భూములను కొలకోలలతోడను, హద్దుగీతలతోడను పంపుడులుచేసికొనవచ్చును. కాని నెత్తిపైగానున్న ఆకాశము నెవరును పంచుకోజాలరు. ఆఅదృశ్యాకాశము సర్వమును ఆవరించి సర్వమును తనయందు ధరించుచున్నది. అటులనే జ్ఞానశూన్యుడు తన మూర్ఖతవలన నామతము మాత్రము సత్యమైనది; నామతమే శ్రేష్ఠమైనది అని వాదులాడును. కాని వానికి జ్ఞానప్రాప్తి కలిగినపిమ్మట ఈశాఖాసాంప్రదాయముల పోరాటములకు అతీతముగా ఏకమును, అఖండమును, నిత్యమును, చిన్మయమునగు ఒక్క బ్రహ్మమేయుండునని తెలిసికొనును. 731. తన బిడ్డలుజబ్బుగానుండగాతల్లిఒకనికిఅన్నము కూర మఱొకనికి సగ్గుజావ రొట్టె, వేఱొకనికి కుడుము వెన్న పెట్టుతీరున భగవంతుడు వారివారి నైజగుణములకు తగునటుల వేర్వేఱు మార్గములను జనులకు అనుగ్రహించుచున్నాడు.