శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/34వ అధ్యాయము

34వ అధ్యాయము.

గృహస్థులకు హితబోధ.

631. ఒకస్తంభమును పట్టుకొని పడిపోదుననుభయము లేకుండ వడిగ గిఱగిఱతిరుగు బాలునితీరున భగవంతుని స్థిరముగ బట్టుకొని, నీసాంసారిక ధర్మముల నిర్వర్తించుకొనుచుండుము; నీకు అపాయముండదు.

632. ప్రశ్న: - ఏదినమున కాదినము, తిండికై పాటుపడవలసిన నేను, ప్రార్థనాది కర్మలను ఎట్లు నిర్వర్తించగలను?

ఉ:- నీవు ఎవరికొఱకై పాటుపడుదువో ఆతడే నీఅవసరముల దీర్చును. నిన్నీలోకమునకు పంపుటకు పూర్వమే భగవంతుడు నీపోషణకు ఏర్పాటుల చేసియున్నాడు.

సంసారపరిశోధనలందుజిక్కి జీవించుచును పూర్ణతను సాధించు నాతడు మహావీరుడనదగును.

633. ప్రశ్న:- ప్రకృతిని భగవంతునికిని సామరస్యము కుదుర్చుటెట్లు?

ఉ:- ఆవైశ్యవనితను చూడుము. ఆమె ఎన్నివిధముల పనులు చక్క పెట్టుచున్నదో! రోటిలో అటుకులువేసి ఒకచేత రోకలిపూనిదంచుచున్నది; రెండవచేతితో బిడ్డనుసాకుచున్నది. మఱియు అటుకులుకొనవచ్చినవారితో బేరమాడుచున్నది. అటుల ఆమె అన్నిపనులు చేయుచున్ననుకూడ, రోకలిజారి కాలిమీదపడి హానిచేయకుండ అతిజాగరూకతతో మెలగుచున్నది. ఆవిధముగా నీవు సంసారములో నుండుము; కాని సర్వదా భగవంతుని సంస్మరించుచుండుము; వాని మార్గము నుండితొలగి ఎన్నడును వర్తించకుము.

634. మొసలికి నీటిపైని ఈదులాడుటయిష్టము. కాని అది పైకిరాగానే వేటగాండ్రు దానిపై గురిపెట్టుదురు. కావున విధిలేక అదినీటిలోపలనేయుండవలసినదై పైకిరావీలులేకుండును. అయినను సురక్షితముగాపైకివచ్చుటకు అవకాశము చూపట్టినప్పుడెల్ల, బుస్సలుకొట్టుచు పైకిలేచి, ఆనందముతో నీటిపైని ఈదులాడును. ఓమానవా! సంసార సాగరములో తగుల్కొని నీవు ఆనందసాగరో పరిభాగమున ఈదులాడ వాంఛించుచున్నావు. కాని సంసారతాపత్రయములు నీకవకాశము నొసగుటలేదు. అయినను దిగులుపడకుము. తీరికిచిక్కినప్పుడెల్ల ఆతురపడి భగవంతుని పిలువుము, భక్తిమెయి ప్రార్ధింపుము, నీదుఃఖముల నన్నిటిని వానికి తెలుపుకొనుము. సమయము వచ్చినప్పుడు భగవంతుడు నిన్ను రక్షించి ఆనందసాగరమున ఓలలాడ జేయగలడు.

635. యువతులు నాలుగైదు కుండలను దొంతరగా తలమీద పెట్టుకొని నీళ్లుతెచ్చికొనునప్పుడు, త్రోవలో తమ కష్టసుఖములను గుర్చించి ఒండొరులతో ముచ్చటలాడుకొనుచు పోదురు. అయినను ఒక్కకుండలోని నీరైనను తొణికి పోనీయరు. ధర్మమార్గమున నడచుయాత్రికుడు అటుల వర్తించవల యును. తనకు ఎట్టి పరిస్థితులు వాటిల్లినను కూడ, తనహృదయము న్యాయమార్గము తప్పిపోకుండ జాగ్రత్త పడవలయును.

636. దిక్చూచి యందలి (కాంతశక్తిభరితమగు) సూది నిరంతరము ఉత్తరదిశను చూపుచుండును. అందువలన ఓడ దారితప్పకుండ సముద్రముపైని పోగల్గుచున్నది. అట్లే మానవునిహృదయము భగవంతునివైపు తిరిగి యున్నంతకాలమును ఆతడుసంసారసాగరమున దారితప్పకుండ పోగలడు.

637. నీవుధ్యానముచేయు సమయమునందు, ధ్యానమనగా హేళనచేయునట్టియు, సాధువులను సాధువర్తనమును నిరసించునట్టియు జనులకు దూరముగ పొమ్ము.

638. వ్యభిచారిణియగు వనిత తన యింటిపనుల నన్నిటిని సవరించుకొనుచును తనమనస్సును విటునిపైననుంచు తీరున, ఓగృహస్థుడా! నీసంసార వ్యవహారములనన్నింటిని నిర్వర్తించుకొను చుండుము; అయినను నీహృదయమును భగవంతుని పైని నిలుపుము.

639. శ్రీమంతునియింటబిడ్డకు పాలిచ్చుదాది, ఆబిడ్డను తన బిడ్డవలె ప్రేమతో చూచును. తనబిడ్డకాదని సదా గుర్తునుంచుకొనియే వర్తించును. అటులనే నీవునీబిడ్డలకు పోషకుడవును, ఉపచారకర్తవుమాత్రమే అనియు, వారి నిజమగు తండ్రి భగవంతుడనియు సదా జ్ఞప్తినుంచుకొనుము.

640. ఒకనాడు కొందఱు బ్రహ్మసమాజపు బాలురు తాము జనకుని ఆదర్శమును అనుసరించుచు సంగములేకుండ కుటుంబమున మెలగుచుంటిమని నాతోచెప్పిరి. నేనిట్లుపలికితిని:"ఆమాటచెప్పుట సులభమే. కాని నిజముగా జనకునిబోలి వర్తించుటవేఱు. తగులుపడకుండ సంసారవ్యవహారముల నడపుట అతిదుర్ఘటము. ప్రారంభదశలో జనకుడు ఎట్టినిష్ఠురనీమముల నవలంబించెనో తెలియునా? కాని మీరందఱు అట్టి కఠిననియమములను అనుసరింపుడని చెప్పను. కాని భక్తిని సాధనచేయవలయుననియు, శాంతిగలచోట కొంతకొంత కాలము నివసించుడనియు మిమ్ముకోరుచున్నాను. కొంచెము జ్ఞానము, భక్తిని సంపాదించుకొనిన అనంతరము సంసారమున దిగుడు. పాలు కదలకుండ నొకచోటపెట్టినగాని పెరుగుగా తోడుకొనదు. కదలించినను, ఒకకుండనుంచి మరియొక కుండలోనికి మార్చిననుకూడ, పెరుగుచెడును. జనకుడు నిస్సంగుడు; అందువలన వానిని "విదేహుడ" నియు పేర్కొందురు. ఆతడు జీవన్ముక్తుడై మెలగినాడు. దేహస్ఫురణను రూపుమాపుట చాలకష్టమగు సాధన. జనకుడు మహావీరుడు సుడీ! ఒకచేత జ్ఞానము, రెండవచేత కర్మ అను రెండుఖడ్గములను అవలీలగ ధరించిన ధీరుడు!"

641. నీవు నిస్సంగుడవై సంసారమున వర్తించ కోరుదువేని, ఒక సంవత్సరమో, ఆరునెలలో, ఒక్క నెలయో, తుదకు పండ్రెండు దినములైనను ఏకాంతస్థలమున, మొదటగా భక్తిసాధనచేయ వలయును. ఏకాంతవాసకాలమున భగవంతునిగూర్చి నిరంతరధ్యానము చేయవలయును; భక్తిని ప్రసాదింపుమని దేవుని వేడుకొనవలయును. ఈప్రపంచములో నీవు నీదనుకొనదగినది యిసుమంతయు లేదనుభావ మును మరలమరల నీమనస్సున మననము చేయవలయును. నీవు "నావారు, నావారు"అనుకొను వారందఱును యెప్పుడో యొకప్పుడు నిన్ను విడువవలసినవారే యనుట నిశ్చయమని తెలియుము. భగవంతుడొక్కడేనీవాడు! నీసర్వస్వమును ఆయనయే. వానిని నీవానిగ జేసికొనుట యెట్లాయను చింత ఒక్కటియే నీకుండదగినది.

642. నీపరిస్థితులు పాపపుప్రేరణలు గలచోటునకు బలాత్కారముగ నిన్ను తోడ్కొనిపోయినయెడల, నీదివ్యజనని స్మరణను నీతోడతీసికొనిపొమ్ము. నీమనస్సున సయితము దాగియుండు దుష్టచింతలనుండి ఆమె నిన్ను కాపాడగలదు. ఆజనని యెదుటనుండెనేని, దుష్కార్యములును, దుశ్చింతలును నీదరిరాసిగ్గుపడి పారిపోవును.

643. నీచేతులకు ముందుగా చమురురాచుకొని, పనసపండును ఒలచినయెడల, ఆపండుయొక్క జిగటరసము నీచేతులకు అంటుకొని నిన్ను తిప్పలు పెట్టదు. ముందుగా నీవు పరమాత్మజ్ఞానమను రక్షపూనుకొంటివా, సంపదల మధ్యను, సంసారమునడుమను నీవు జీవించినను, అవి నిన్నెంతమాత్రమును బాధించవు సుమీ!

644. దాగుడుమూతలాటయందు ఒక ఆటగాడు తల్లిని తాకినయెడల, తఱుముకొనివచ్చువాడు వీనిని దొంగచేయ జాలడు. అటులనే ఒక్కసారిమనము భగవత్సాన్నిధ్యమును పొందితిమా సంసారబంధములు మనను ఇంక బాధింపవు. తల్లినితాకిన ఆటగాడు తనను తఱిమి దొంగను చేయుదురను భయములేకుండ యిష్టము వచ్చినటుల తిరుగాడు చందమున, భగవంతుని పాపముల స్పృశించిన వాడు సంసారమను వినోదక్షేత్రమున నిర్భయముగ తిరుగగలడు. వానికి సంసార తాపత్రయముల చిక్కు లేదు; ఎదియు వానిని బంధించునది యుండదు.

645. తాంత్రికుడు, మృతునిఆత్మ సాహాయమున దేవతను ప్రత్యక్షము చేసికొను సాధనచేయుచో, అతడు క్రొత్తపీనుగు మీద కూర్చుండి దాపున అన్నమును కల్లును ఉంచునట. ఉపాసనా సమయమున, ఆపీనుగకు తాత్కాలికముగ ప్రాణమువచ్చి, ఎప్పుడైన నోరుతెరచిన యెడల, ఆసాధకుడు కనిపెట్టి, ఆపీనుగునం దప్పుడావేశించిన భూతమును తృప్తిపరచుటకై, కల్లును ఆపీనుగ నోటిలోపోసి, అన్నమును నోటకూరునని చెప్పుదురు. ఆతడు అటులచేయని యెడల ఆభూతము వాని ఉపవాసమును భంగపఱచి దేవతా ప్రసన్నము కాకుండ అడ్డపడునట. అటులనే ఈసంసారము పీనుగుపైని వసించుచు, బ్రహ్మానందపదవిని పొందగోరుదువేని, సంసారమున నిన్ను బాధించు వారిని తృప్తిపఱచుటకవసరములగు వస్తువులను ముందుగ సంపాదించి పెట్టుకొనుము; లేదా నీభక్తి సాధనలకు అడ్డుదగిలి, జీవన తాపత్రయములు నిన్ను చీకాకు పఱచును.

646. వీధిలో బిచ్చమెత్తుకొనుచు తిరుగు పాటగాడు తాంబురను ఒక చేతితోమీటుచు, చిఱతను ఒక చేతితో వాయించుచు, నోటితోకూడ కీర్తనలు పాడుచుండును గదా! అటులనే ఓ సంసారీ! చేతులతో నీకుటుంబ వ్యవహారముల నన్నిటిని చేసికొనుచుండుము. కాని పూర్ణహృదయముతో భగవన్మహిమలను తలంచి గానము చేయుచుండుము.

647. బాలుని హృదయమందలి ప్రేమ పూర్ణముగను అభిన్నముగను నుండును. కొన్నాళ్లకు అతనికి పెండ్లికాగనే సగముహృదయమైనను భార్యకు పంచబడును; ఇక బిడ్డలు పుట్టినప్పుడు యింకొక పాతికభాగము వారికి పోవును; మిగతా పాతికభాగమును వాని తల్లి, తండ్రి, గౌరవము, మర్యాద, వేషము, పౌరుషము మున్నగువానికి పోవును. అందువలన భగవంతునికై అర్పణ చేయుటకు వానియొద్ద ప్రేమ మిగులకుండును. కాబట్టి బాలుడుగనుండగ, పంపుడు పడిపోకుండ వాని హృదయము పూర్ణముగ నున్నప్పుడే, పెందలకడ వాని హృదయమును భగవంతునికై త్రిప్పిన యెడల, అతడు భక్తుడై, సులభముగా దైవమును కాంచ గల్గును. కాని పెద్దవారైన మానవులు అటుల చేయజాలుట సులభము కాదు.

648. సంసారముననే నిలుచు జ్ఞానులకును, సన్యాసము పుచ్చుకొను జ్ఞానులకును భేదమేమని మీరు నన్ను ప్రశ్నించినయెడల, యిరువురును సములని నేను చెప్పుదును. ఇరువురకును జ్ఞానము సమమే; ఒక్కటే. కాని సంసారియై జీవించు జ్ఞానికి, ఏకొలదిగనైనను, కామ్యకర్మల ఆకర్షణ యుండును గాన భయ కారణము కలదు. పొగచూరియున్న గదిలో నీవెంత జాగ్రత్తతో మెలగినను, ఎప్పుడో కొంతమసి అంటుకొనక తప్పదు గదా!

649. చిన్నబిడ్డలు తల్లిని వదలి దూరముగ గదిలో బొమ్మలను పెట్టుకొని యధేచ్ఛగా ఆటలాడుకొనుచుంద్రు. కాని తల్లిరాగానే బొమ్మలనన్నిటిని త్రోసివేసి అమ్మా! అమా! అని కేకలువేయుచు ఆమెచుట్టు చేరుదురు. మీరలు కూడ ఈ ప్రపంచములో, సంపదలు, గౌరవములు, కీర్తులు మొదలగు బొమ్మలతోడి ఆటలందు మఱిగి యున్నారు! ఇతరమేమియు మీకక్కఱలేదు. కాని ఒక్కసారి మీరా జగజ్జననిని మీహృదయములో కాంచితిరేని, ఈ సంపదలు ఈ ఖ్యాతులు, ఈ గౌరవములు మీకింక ఆనందము నొసగ జాలవు. వీనిని సర్వము విడిచివేసి ఆతల్లికడకు పర్విడుదురు!

650. సమస్తమును త్యాగముచేసి, భగవంతుని పాదారవిందములకడచేరుడని మీరు సంసారులను కోరినయెడల వారు మీమాటాలకించరు. కావున చాలగా ఆలోచనచేసి యీమానవులను ఆలర్షించుటకొఱకు చైతన్యనిత్యానందులు ఒకయుపాయమును పన్నిరి. "సోదరులారా! హరినామ స్మరణచేయుచు పాయసముల గుడువుడు. వన్నెకత్తెల కౌగిండ్ల ననుభవించుడు." రండు! రండు! అని బోధించుచు వారికి ఎఱజూపిరి. వీనికాశపడి ప్రజలు భగవన్నామ సంకీర్తనము చేయుటకై గుమిగూడెడివారు. కాని వలలోచిక్కుకొనెడి వారు. క్రమక్రమముగా వారు భగవన్నామామృతమును గ్రోలినకొలదిని, నిత్యానందుని బోధలోని రహస్యార్థము వారికితెలిసిపోయినది. భగవద్భక్తిచేత వారిహృదయముల నుండి వెల్లివిరిసివచ్చు ఆనందబాష్పముల పారవశ్యముతో పాయసములు తులరావయ్యె! ఆత్మానంద పారవశ్యమున నిలువలేక పడిపోయి భూమిని కౌగలించుకొనుటే, వయ్యారంపుయువతుల కౌగిలింతలనుమీరు ఆనందమని వారికి తెలియవచ్చెను.

651. బయటికిపోయి శత్రువు నెదిరించి పోరుటకు పూర్వము యోధులు తమ నివాసముల చెంతను, బహిరంగ యుద్ధరంగమునవాటిలుఅపాయములు లేనితావున, రణకౌశలమును నేర్చుకొందురు. అటులనే సన్యాసాశ్రమపు కఠిన నిష్ఠలను పూనుటకు పూర్వము, మీ ఆత్మోన్నతిని గడించుటకు, గృహస్థ జీవనపు సౌకర్యములను వినియోగించుకొనుడు.

652. నీవు గృహజీవనమును విడిచి సన్యాసివైనను, సంసారివై యుండినను, ఒక్కటియే - నీహృదయమును మాత్రము భగవంతునిపై స్థిరముగ నిలుపుము చాలును. ఒక చేతితో నీగృహస్థ ధర్మములను నిర్వహించుము; రెండవ చేతితో స్వామి పాదముల బట్టుము. గృహకృత్యములు నీకు లేనప్పుడు నీరెండు చేతులతోడను భగవంతుని పాదములను హృదయమున నద్దుకొనుము.

653. గృహస్థుడు సయితము భగవంతుని సాక్షాత్కారము పడయవచ్చును. జనక మహారాజును చూడుడు, అతడు రాజఋషి. కాని ఆకస్మికముగా జనకరాజువంటి వారగుట పొసగదు. జనకమహారాజు లోక వ్యవహారాడంబరములకు దూరముగా, ఏకాంత వాసముచేయుచు ధ్యాన సాధనలును ఎన్నిసంవత్సరములో సాగించియున్నాడు. కావున గృహస్థులు ఏకాంత స్థలములందుచేరి, అప్పుడప్పుడు మూడేసి దినములైనను, భగవత్సాక్షాత్కారము పొందునిమిత్తము, సాధనలు చేయుచుండుట చాలమేలు గూర్చును!

654. "లోకము భగవంతునిది; నాదికాదు" అని కృతనిశ్చయుడవై యుండుము. "నేను, వాని ఆజ్ఞలను చెల్లించుటకై ఏర్పడిన వాని సేవకుడను మాత్రమే!" అనుట మఱవకుము.