శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/31వ అధ్యాయము

31వ అధ్యాయము.

భక్తుల లక్షణములు

596. బాగుగబరువులతోనింపిన రైలుబండ్లవరుసను ఇంజను సులభముగ లాగికొనిపోగలదు. అటులనే భగవంతుని ప్రియసంతానము భక్తివిశ్వాసభరితులై ఐహికజీవనపు కష్ట నిష్టురములను భరించుటలో దిగులుపడరు. మఱియు అనేకులను భగవంతునివైపునకు త్రిప్పి నడుపగలరు.

597. చకుముకిరాయి, యుగాంతరములుగ నీటియడుగున పడియుండినను దానిలోనిఅగ్నిని కోలుపోదు. నీయిష్టము ఎప్పుడైననుసరియే దానినిఉక్కుతోకొట్టుము. తళుక్కుమని అగ్నినివెలిగ్రక్కును. గాఢవిశ్వాసముగల భక్తుడట్టులుండును. సంసారికమలములు వానిని ఎన్నిచుట్టుకొనియున్నను వాని భక్తివిశ్వాసములకు నాశముండదు. భగవన్నామము చెవిని బడినతోడనే అతడు భక్తావేశము పూనగలడు.

598. ప్రశ్న:- భగవద్భక్తుని బలము ఎందున్నది?

ఉ:- అతడుభగవంతునిబిడ్డ! భక్తిచేవెల్లివిరియు ఆనందబాష్పములు వానికి అవిజేయమగు ఆయుధము!

599. ఒక జ్ఞానియు, ఒకభక్తుడును, అడవిగుండ పోవుచుండిరి. త్రోవలో వారికి ఒకపులి కాన్పించినది. "మనము పాఱిపోవలసిన కారణము కాన్పించదు. సర్వశక్తిమంతుడగు భగవంతుడు మనను కాపాడగలడు." అని జ్ఞానిపలికెను. "సోదరా! అటులకాదుసుమీ! పరుగెత్తి పోదుమురమ్ము! మనయత్నముచేతనే కాగలపనికై భగవంతునికి శ్రమకలిగించుటెందుకు?" అని భక్తుడు పలికెను.

600. పాము భీకరవిష జంతువు; దానిని పట్టుకొనబోయినవానిని కఱచును. కాని పాముమంత్రము నేర్చిన యతడు, చాలపాములను సులభముగ పట్టుకొనుటేగాక, వానిని ఆభరణములవలె కంఠమునను హస్తములందును అనేకములుగా వ్రేలవేసికొనగలడు. అటులనే పారమార్ధికజ్ఞానము కలవాడు లోభమోహముల విషముచేత భంగపడడు.

601. తామర లేచినచోట గోకినకొలదిని దురద హెచ్చు చుండును; ఎంతగోకిన అంత సుఖముగానున్నట్లు తోచును. అట్లే ఈశ్వరారాధకులు భగవస్తోత్రముల పాడుటతో తృప్తిచెందరు.

602. భగవన్నామస్మరణ మాత్రాన ఎవని శరీరము పులకరము పొందునో, ఎవని నేత్రములు ఆనంద భాష్పములతో నిండునో అట్టివానికి అది తుదిజన్మ!

603. మంచికలకండను రుచిచూచినవాడు బెల్లపుతెట్టెను తిని ఆనందింప జాలడు. సుందర మందిరములందు నిద్రపోవువాడు పెంటకుప్పలపై పరుండి సంతసింప జాలడు. అటులనే బ్రహ్మానందమును రుచుచూచినవాడు సంసారిక సుఖములందు సంతుష్టి నందజాలడు. 604. పారమార్ధిక చింతగలవారు, సంఘాచారముల కతీతమగు ఒకకూటముగ నేర్పడుదురు.

605. స్త్రీ అనుదినము తనభర్తతో నడుపు ముచ్చటలను బయటికి చెప్పుటకు సిగ్గుపడును. ఆ రహస్యములను ఆమె ఎవరితోడను చెప్పదు; చెప్పుటకిష్టముపడదు. ఒకవేళ కర్మము చాలక అది బయలుపడెనా తహతహపడును. అయినను తన ప్రాణసఖితో మాత్రము దాపరిక మింతయు లేక సర్వమును చెప్పును. ఇంతేగాదు అట్టి సఖితో చెప్పుటకై ఆరాటపడును; చెప్పగల్గినప్పుడు అత్యానందము నందును. అదేతీరున భగవద్భక్తుడు తానీశ్వరసన్నిధిని అనుభవించిన బ్రహ్మానందమును గురించి నిజమగుభక్తునికితప్ప యితరులకు తెలుపనిచ్చగింపడు; మఱియు అట్టిభక్తునికి తనఅనుభవములను తెలుపుటకు ఆతురపడుచు, అటుల జరిగినప్పుడు ఎంతయోసంతసించును.

606. రాజునే తనప్రియుడుగా గలిగినస్త్రీ దరిద్రునిప్రేమింపదు. అటులనే భగవంతుని కృపావీక్షణముల బడసిన నరుడు సాంసారిక తుచ్ఛభోగములకు ఆశపడజాలడు.

607. చేట తేలిక యై పనికిమాలినపదార్ధములను ఎగురకొట్టివేసి ఘనమై ఉపయోగపడు పదార్ధములను తనలోనిలుపుకొనును. ఉత్తమనరుల లక్షణము అటులుండును.

608. ఇసుకయు, పంచదారయు కలసియుండినను, చీమ యిసుక రేణువులనువిడిచిపెట్టి పంచదారనే తీసుకొనును. అటులనే పావనమూర్తులగు పరమహంసలును సాధుసత్తములును అయోగ్య విషయములనుండి వేఱుచేసి సద్విషయములను చేకొనగలరు.

609. ప్రశ్న:- ఇంద్రియలోలతయు, ఐహికసుఖవాంఛయు, ఎప్పుడు నశించును?

ఉ:- అఖండబ్రహ్మానంద సాగరుడగు పరమాత్మయందు సర్వసుఖములును, సర్వానందములును, పర్యవసించును. దేవునియందానందము ననుభవించువారు అల్పమును తుచ్ఛమును అగు ఐహికభోగములను మెచ్చుకొనజాలరు.

610. ఆవులమందలోనికి అన్యజంతువేదియైన చొఱబడినయెడల, ఆఆవులు కొమ్ములతో కుమ్మియు, గిట్టలతోతన్నియు దానిని తఱిమివేయును. కాని మఱొక ఆవే వచ్చినయెడల అవన్నియు చుట్టుచేరి దానితో నెయ్యమునుజూపి ఒకదాని నొకటి నాకుకొనును. అటులనే భక్తుడు వేఱొకభక్తుని కలిసికొనినప్పుడు యిరువురును మహదానందమును పొంది, యెడబాటునకు ఓర్వకుందురు. కాని అవిశ్వాసియొకడు తమతో చేరెనేని వారందఱుచేరి వానిని దూరముగ వెడల నడుపుదురు.

611. భగవద్భక్తుడు ఏకాంతవాసమన యిష్టపడకుండుటేల?

జవాబు:- గంజాయి త్రాగునతడు సహవాసగాండ్రు లేకుండ పొగత్రాగి ఆనందింప జాలడు. అటులనే భగవద్భక్తుడు బాగవతసంగము లేకుండ దూరముగ నెక్కడనో ఈశ్వరుని పావననామ సంకీర్తనము చేయుటచేత ఆనందింప జాలడు.

612. వడివడిగపాఱు జలప్రవాహము కొన్నికొన్నిచోట్ల గిరగిర సుడులు తిరుగుచు పోవును. కాని త్వరలోనె ఈస్థితిని దాటిపోయి తిన్నని త్రోవను వడిగ ప్రవహించును. అట్లే భక్తుని హృదయము తఱుచుగా నిరాశ, దుఃఖము, అవిశ్వాసము అను సుడుల చిక్కుచుండును; కాని యీస్థితి క్షణకాలపు వైపరీత్యమె; చిరకాలముండదు.

613. ప్రశ్న:- దుశ్చరితయగు స్త్రీ భక్తుని వెంటబడి వానిని తన దుర్వర్తనమునకు లోబఱచుకొనుటకు ప్రయత్నించిన ఏమగును?

ఉ:- పక్వమైయున్న మామిడిపండును గట్టిగా నొక్కినయెడల, దానిలోని టెంకయు గుజ్జును తప్పించుకొనిపోయి తోలుమాత్రమే చేతిలో మిగులుతీరున, భక్తునిహృదయము భగవంతునికడకు తప్పించుకొనిపోవును; మట్టి గుల్లయగు తనువు మాత్రమే ఆస్త్రీచేత చిక్కును.

614. మామిడిపండుతిని, ఎవరికైన తెలిసిపోవునేమోయని పెదవులను బాగుగ తుడుచుకొనువారు కొందఱుందురు. మఱికొందఱో తమకొకమామిడిపండు దొఱకగానే యితరులను కూడ కేకవేసిపిలిచి వారితో పండును పంచుకొనితిందురు! అట్లేకొందఱు బ్రహ్మానందముదొఱకగానె ఎవరికితెలియకుండ తామేఅనుభవింతురు. మఱికొందఱో తమ అనుభవమును ఇతరులకును కల్గింతురు. 615. నిజమైన భక్తుడు తనను ఏమానవుడును చూడజాలని ఏకాంతముననున్నప్పుడు సయితము, భగవంతుడు నిరంతరము తనను చూచుచుండుననిగ్రహించి, పాపకార్యములను ఆచరించజాలడు. ఎవడు ఒంటరిగ నట్టడవిలో, తనకొక యౌవనవతియగుమోహనాంగి యితరనరునికంటబడునను భీతిలేని తావున, వలపుజూపినయెడల, భగవంతుడు తమనుచూచుచున్నాడను భయముతోడ లోబడకుండునో, మఱియు కామ వీక్షణములనైన ఆమెవైపుపోనీయడో, అట్టివాడు నిజమైన దైవభక్తుడు. పాడుపడినయింటిలో ఎవరును లేనిసమయమున బంగారుసంచి కనబడినను దానినితాకక ఎవడు నిగ్రహము చూపునో, ఆతడు నిజమగుభక్తుడు. నలుగురు ఏమనుకుందురో యను భీతిచేత కర్మకలాపముల నిర్వహించువాడు నిజమైన భక్తుడుకాడు. నిశ్శబ్దముగ ఏకాంతస్థలమున నిర్వహింపబడు మతమే మతము. ఆడంబరము డాంబికము సాగుచోట సర్వమును బూటకమే, శుద్ధమోసమే!