శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/28వ అధ్యాయము
28వ అధ్యాయము.
ముక్తి లేక జీవుని మోక్షము.
566. ప్రశ్న:- నరులందఱును భగవంతుని చూడ జాలుదురా?
జవాబు:- ఏనరుడును సదా పూర్ణోసవాసము చేయబోడు; కొందఱు ఉదయము తొమ్మిదిగంటలకే భుజింతురు; కొందఱు మధ్యాహ్నము; కొందఱు రెండుగంటలకు; యింకకొందఱు సాయంతనము; సూర్యుడుక్రుంకిన పిమ్మట ఆహారము తిందురు. అదేతీరుగా ఎప్పుడో ఒకప్పుడు, ఈ జన్మలోనో, లేక యింక కొన్నిజన్మల యనంతరమో, అందఱును ఈశ్వరసాక్షాత్కారమును పొందియేతీరుదురు.
567. లోభమోహముల జిక్కియున్న మనస్సు, పైబెరడునకు అంటుకొనియుండు పచ్చిపోకకాయ వంటిది. పోకకాయ పక్వము కానంతవరకును. తనరసముతోడనే పైడొల్లకు అంటుకొనియుండును. కాని సకాలమున దాని రసము యెండిపోయి అది డొల్లనుండి విడివడును; కదిలించినప్పుడెల్ల లొటలొటమనుచు తాను లోనవిడివడి యున్నటుల తెలుపును. అటులనే భోగము, ధనమునెడరాగమనుజిగురుఎండబారెనా, నరుడు ముక్తుడే!
568. "దేనికైనను నైజగుణముపోదు." అనిఒకడుఅనగా మఱొకడు "నిప్పుబొగ్గులోప్రవేశించి దానికి నైజమగు నలు పును నాశముచేయుచున్నది సుమీ!" అని ప్రతిపలికినాడు. అటులనే జ్ఞానాగ్నిచేత మనస్సుతప్తమగునేని, దాని నైజగుణమునశించి యది బంధకముగనుండుట మానును.
569. లక్షలాదిగ ఎగురవేయు గాలిపటములలో ఒకటి రెండుమాత్రమె, దారముత్రెంపుకొని స్వేచ్ఛనుపొందును. అదేవిధమున ఎన్నివందలమందియో సాధకులలో ఒకరిద్దరు మాత్రము సంసారబంధములనుండి విముక్తులగుదురు!
570. దయ్యముపట్టినమనిషి తనకు గ్రహముసోకినట్లు గ్రహించగానే, ఆదయ్యము విడిచిపారి పోవును. అటులనే మాయచే ఆవేశితమైన జీవాత్మ తననుమాయఆవేశించినటుల తెలియగానే, ఆమాయ విడిచిపోవును.
571. వేయించిన వరిగింజలు నేలపైనిచల్లినచో మొలక యెత్తవు; వేయించని పచ్చివడ్లుమాత్రమే మొలుచును. అదేరీతిగ ఒకడు సిద్ధదశనుపొంది మరణించినయెడల మరల జన్మనెత్తనగత్యము లేదు; ఆసిద్ధదశయందే మరణించునతడు, సిద్ధత్వమును పొందువఱకును, మరలమరల జన్మించుచునే యుండును.
572. మనస్సే సర్వమును! మనస్సుకు స్వాతంత్ర్యము పోయెనా నీకును పోవును. మనస్సు స్వేచ్ఛగనుండెనా, నీవును ముక్తుడవే; అప్పుడునానిపినతెల్లనిగుడ్డవలె మనస్సునుఏరంగులోనై ననుముంచవచ్చును. ఆంగ్లభాషచదివినయెడల, నీనిశ్చయమునకు విరుద్ధముగకూడ నీప్రసంగములో ఆంగ్లశబ్దములు చొచ్చకుండ ఆపలేవు. సంస్కృతముచదివిన పండితుడు శ్లోకములను నిదర్శనముగ జూపుచుండును. చెడ్డవారిపొత్తుగల మనస్సు, ఊహలందును సంభాషణలందును తనరంగును వెలువరించుచుండును. సాధుసంగమున కాలముగడుపుమనస్సు దైవధ్యానమునందుమాత్రమేనిలుచును. మనస్సుఎటువంటి సహవాసముచేయునో అటులనెల్ల తననైజమునుమార్చుకొనుచుండును.
573. సర్వమును మనస్సునుబట్టియేయుండును. భార్య యెడగలుగు అనురాగము ఒకరకము; కొమరితపైగలుగు ప్రేమవేఱొకరకము. ఒకనికి ఒకవైపు భార్యయు, రెండవవైపు కొమరితయునుండినచో, ఆతడు యిరువురను లాలనచేయును గాని వానిచిత్తవృత్తులు భిన్నములుగ నుండును.
బంధనము మనస్సునది; ముక్తియు మనస్సునదే! "నేనుముక్తాత్మను. నేను ఈశ్వరతనయుడను! నన్నెవరు బంధించగలరు?" అని నీవు ధిక్కరించిపలికితివా నీవుముక్తుడవే! ఒకనిని పాముకఱచినను, అతడు పూర్ణవిశ్వాసముతో దృఢముగా "లేదు, విషములేదు; లేదు!" అని పలికినయెడల వానికి విషబాధయెంతమాత్రము నుండదు.
574. జీవితకాలమంతయు పాపమనియు, నరకయాతన లనియు విలాపములు చేయుచుండుటేల? భగవన్నామస్మరణ చేసి "ఓస్వామీ! నేనుచేయరాని పనులను ఎన్నింటినో చేసితిని, చేయవలసినపనులను ఎన్నింటినో చేయకవిడిచితిని. ప్రభో! ననుక్షమింపుము." అనిఒక్కసారి పలుకుము. అటుల పలుకుచు భగవంతునియందు సుస్థిరవిశ్వాసముంచుము. నీపాపములన్ని తొలగింపబడును సుమీ!