శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/18వ అధ్యాయము
18వ అధ్యాయము.
వైరాగ్యము - లేక నిష్కామ్యత.
360. నిత్యానిత్య విచారముచేసి, నిష్కామియైననేతప్ప, వేదములన్నియు పఠించినను, అపారముగ శాస్త్రములు చదివినను, నిష్ఫలమే. వివేకము, వైరాగ్యములేనిది ఆధ్యాత్మికయాత్ర సాగదు.
361. బెదురుగుఱ్ఱమునకు కండ్లగంతలుకట్టిననేతప్ప తిన్నగ నడవజాలదు. అటులనే గృహస్థుని మనస్సునకు వివేక వైరాగ్యము లనెడు గంతలులేని యడల చిందులుత్రొక్కి పెడదారుల పోవును. తిన్ననిత్రోవను నడవదు.
362. ప్రశ్న:- పరమాత్ముని చేరుటెట్లు?
జవాబు:- వానిని దర్శించగోరితివేని, నీతనువును, మనస్సును, సంపదను త్యజించవలసి యుండును.
363. భగవంతుని పాదారవిందములకడ శరణుజొచ్చుట సులభమగునా?
జవాబు:- మహామాయ నిన్నటుల చేయనీయదు. తన ప్రాపుకోరువారు లేకున్నను నరుడు ఒక పిల్లినైన పెంచి సంసారమును కల్పించుకొని బంధనమేర్పఱచుకొనుచున్నాడు. ఆపిల్లికొఱకు పాలు కావలెనని, చేపలుకావలెనని దేవులాడుచు తిప్పలుపడుచుండును. "నేనేమిచేసేది? ఈపిల్లి పాలు చేపలుతప్ప మఱేమియు తినకున్నది." అని మొఱలిడుచుండును.
364. ప్రశ్న:- వైరాగ్యము ఎన్నివిధములుండును?
జవాబు:- సామాన్యముగ అది రెండురీతులనుండును -
తీవ్రవైరాగ్యము, మందవైరాగ్యము. ఒక్క రాత్రిలో చెఱువుత్రవ్వి నిండుగానీరునింపవలయునని పట్టుపూనుటవంటిది తీవ్రవైరాగ్యము, నెమ్మదిగా అడుగడుగునకు ఆగుచునడచునది మందవైరాగ్యము. ఇదిఎన్నడు పక్వదశకువచ్చునో చెప్పవీలులేదు.
365. ఒకడు స్నానమునకై ఏటికిపోవుచు మార్గములో యెవరో ఒక పెద్ద మనిషిచాలాదినములుగా సన్యాసియగుటకు ఆలోచనలు చేయుచున్నటుల వినెను. ఎట్లోఈమాటవలన సన్యాసము పరమోత్తమము యనుబుద్ధి వానికితట్టినది. వెంటనేయతడు సన్యాసముపూని కేవలము కట్టుకొనియున్న అంగవస్త్రముతోడనేవెడిలిపోయినాడు; తిరిగియింటిచక్కి రాలేదు. తీవ్రవైరాగ్యమనగా యిట్లుండును.
366. భగవదనుగ్రహమువలన ఒకనికి తీవ్రవైరాగ్యము లభించెనేని, అతడు కామినీకాంచనముల బంధనమునుండి తప్పించుకొనగలడు. అప్పుడుమాత్రమే వానికి సంసారబంధములు బాయగలవు.
367. గదితలుపు తాళముతీయవలయునంటే తాళపు చెవి వెనుకకు తిరుగవలసియుండును. భగవంతుని ప్రాపించ దలచువాడు సంసారమును సర్వమును విడువవలసియుండును. 368. కామములనెడు పెనుగాడ్పులువీచగా హృదయాంతరాళమున గందఱగోళముసాగుపట్ల మనము పరమేశ్వరుని నిర్మల కాంతులను చూడజాలము. నిశ్చలముగనుండి భగవత్సాన్నిధ్య సుఖమును హృదయమున పొందజాలునప్పుడే ఆదివ్య దర్శనము లభించగల్గును.
369. తైలముతో తడసియున్న కాగితము పైన ఏమియు వ్రాయలేము. అటులనేపాపచింతనము లోలతయను నూనెతో పాడైపోయిన హృదయము భక్తి సాధనకు పనికిరాదు. కాని నూనెకాగితముమీద సున్నము పూసినయెడల వ్రాతకు అనుకూలించును. అదేరీతిగా ఈహృదయమునకు వైరాగ్య మనెడు సున్నమును పూసినయెడల అదితిరిగి ఆధ్యాత్మసాధనకు పనికివచ్చును.
370. విషపు సాలెపురుగొకటికలదు. అదికొఱికినయెడల, పుండును పసుపువేళ్లుతెచ్చి వానితోముందుగానిమిరి మంత్రములుపెట్టిననేతప్ప ఏఔషధముచేతను దాని విషము విరుగదు. అలాపుండును సంస్కరించిన వెనుక యితరములగు మందులు పనిచేయును. ఆవిధముగానే లోభ మోహములనెడు సాలెపురుగులు నరునికొరికినయెడల, ఆతడుపారమార్ధిక సాధనల సాగించగల్గుటకు పూర్వము, వైరాగ్యమంత్రముచే సంస్కారమును పొందక తీరదు.
371. తామరలేచినచోట గోకుకొనునప్పుడు హాయిగ నున్నట్లే కనుపించును; కాని తదనంతరము కలుగు మంటలు బాధలు మిక్కుటముగ నుండును. అట్లే యింద్రియభోగ ములు మునుముందు ప్రీతికరములుగనుండి, తుదినితెచ్చిపెట్టు దుఃఖములు భరింపరాకుండును; ఊహింపజాలము ఆబాధ.
372. ముండ్లతోడనుపొదలతోడనునిండియున్న యడవిలో చెప్పులు లేకుండ నడచుట దుస్సాధ్యము. ఎవడేని యందులోనికి పోవలయుననిన అడవినంతను తోళ్ళతో కప్పివేయవలయును. లేదా తనకాళ్ళకు చెప్పులు తొడగవలసియుండును. అడవియంతటను తోళ్ళుపఱచుట అసంభవము గదా. కావున తనకాళ్ళకే చెప్పులు తొడుగుకొనుటలెస్స. అదేతీరున ఈ ప్రపంచములో లోభము దారిద్ర్యము యనునవి అంతులేని బాధల గల్పించుచున్నవి. వానినుండి తప్పించుకొనుటకు రెండుతెఱగులే కలవు; సర్వసంపదలను పూర్ణముగ త్యజించుట యొకటి; వానిని పూర్ణముగ చేకూర్చుకొనుట మఱియొకటి; అన్నివాంఛలను తీర్చుకొని తృప్తినిబడయుట అసంభవము. ఏలయన ఒకకోరిక సఫలమైన వెనువెంటనే మఱొకటి తలజూపుచునే యుండును. కాబట్టి సంతుష్టిని, సత్యజ్ఞానమును, సంపాదించికోర్కెలనడంచివేయుట దొడ్డబుద్ధిసుమీ!