శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము/పాఠము


శ్రీప్రబంధరాజ వేంకటేశ్వర



విజయ విలాసము





అవతారిక




శ్రీలలనామణీ ముఖ విశేష వికస్వరలోచనాబ్ద
క్షాళిమదాళిమేచక విభాన్వితమై తగు పారిజాత పు
న్మాలిక గల్వపూసరము మాడ్కి భుజాంతరపాళిమీఱ ను
ద్వేలదయాసనాథుఁడగు వేంకటనాథుఁడు మము బ్రోవుతన్.


ద్రాక్షాపాకము


 సీ. రతికి భారతికి మేరలు నియోగింప నె
              చ్చరిక నెమ్మదిఁగొన్న గరితమిన్న
    గారాబమునఁ బాలకడలి ముద్దులు సేయ
              నలరు నిల్లంట్రపు టాఁడుబిడ్డ
    కలుములు వెదచల్లు కడకంటి చూపుల
              మగని ఱొమ్మెక్కిన మాయలాడి
    చెలికత్తెయగు మంచుమలపట్టి పోరామి
              గీలుఁగొల్పిన రాయగేస్తురాలు

గీ. తనకడుపు చల్లఁగా జగత్రయముఁ గన్న
   తల్లి జాబిల్లికినిఁ గూర్మి చెల్లెలయిన
   మంగళాకార యలివేలుమంగ నాదు
   తలఁపు లీడేర్చి మాయింట నిలుచుఁ గాత. 2

సీ. శ్రీకర భోగంబు సింహాసనంబుగాఁ
              జుట్లు క్రొమ్మగఱాల మెట్లుగాఁగ
    ఘనఫణాశ్రేణి ముక్తా ఛత్రరాజిగాఁ
              జెలఁగు తన్మణులుపై కలశములుగ

   వెలయునిట్టూర్పులు వీచోపుగములుగా
              వినుతులు కాహళధ్వనులు గాఁగ
   మేనితళత్తళల్మేలుకట్టులుగ నా
              నందాశ్రు లభిషేచనంబుగాఁగ

గీ. నీలనీలాంబరము జముకాళముగను
   జలరుహాక్షునకెల్ల రాజసము లొసఁగఁ
   జాలి సురనుతిగను భోగిసార్వభౌము
   శేషు శ్రీభాష్యరచనా విశేషుఁ గొలుతు. 03

సీ. వినతాప్త చిరదాస్య విశ్రాణనోదగ్ర
               నిష్ఠురాహిత కవినిగరణములు
    సద్యోతిగమన వేళోద్యక్షతగ్రావ
               తీవ్ర సంస్కృత భిదురవ్రణములు
    మహనీయతర మేరుమందరోపమ గజ
               కచ్ఛప గ్రహణ కర్కశకిణములు
    శక్రనియంత్రితా వక్ర యక్షాధ్యక్ష
              రక్షితైక సుధాహరణ చణములు

గీ. దనుజరాణ్ణీరసారణ్యదావ శిఖలు
   దాస జన కల్య కల్యాణదాయకములు
   పన్నగశయాన రథరాజ పన్నగములు
   దురిత పత్రభిదాక్రీడఁ బరఁగు గాత. 4


ఉ. చిత్రచరిత్రుఁడైన సరసీరుహనేత్రుని యాజ్ఞచే మణీ
    వేత్రము పద్మజాండములు వేగలిగింప నణంప బ్రహ్మగాఁ
    బాత్రముఁ జేసి మించిన కృపాజలరాశిని సైన్యనాయకు
    న్సూత్రవతీకళత్రుని విశుద్ధచరిత్రుఁ బవిత్రుఁ గొల్చెదన్ 5

చ. శ్రితహితభోగద న్గదను సేవకశఁఖము శంఖము న్సము
    న్నతి దిగధీశనందకము నందకము న్గుణజాతటంక్రియా

    సతత హతోగ్రదైత్యవర శార్ఙ్గము శార్ఙ్గముఁ బాలితత్రయీ
    శతధృతి ముఖ్యదేవమునిచక్రముఁ జక్రము నాశ్రయించెదన్ 6
 

 

ఆశీర్వచనము


ఉ. తమ్ముల కెల్ల విందగు నిధానముఁ దమ్ముల యిండ్లకొమ్మకు
    న్దమ్ముఁడు కన్నులైన గుణధన్యుని పొక్కిటఁ బుట్టినట్టి పొం
    దమ్మిఁ జనించి మించిన విధాతకృపారసమొల్కు దచ్చి కం
    దమ్ములమాకు నీవృత నుదారతమీఱఁ జిరాయు రున్నతుల్. 7

క. వీణా సరోజపుస్తక
   పాణిన్ శుకవాణిఁ, బద్మభవురాణిన్ సు
   శ్రోణిన్, బంభరవేణిన్
   వాణి న్వినుతింతు మిగుల వాగ్వైఖరికిన్ 8

 

పరికరాలంకార సహితాశీర్వచనము


చ. గిరిజ యురోజదుగ్ధములు క్రేవల జాఱఁగఁగ్రోలి బొజ్జపై
    వఱదలు బాఱు చాఱ లహివల్లభ హారము జోడుకోఁడెగా
    మెఱయఁగ బాలలీలలను మేలములాడుచు ముద్దుఁ జూపునా
    కరిముఖుఁ జూచి నవ్వు శితికంఠుఁడు మాకొనఁ గూర్చు సంపదల్. 9


భ్రాంతిమ దద్యుక్తి సంబంధాతిశయోక్తి రూపకాలంకార
 సంసృష్టిసీసము


సీ. లఘుపదాహతి నిర్దళద్రసాతలరవా
            శని సద్భ్రమ జపద్భుజంగరాజ,
    ముక్షిప్తకృత్తివాతోత్పతతౌతుకీ
            కంతుకీభవదద్రి గణరవమ్ము
    మండలక్రమ చరన్మకుటగంగావర్త
            మార్గభ్రమన్మరు మండలంబు
    హస్తవిన్యాసవేగాభ్రగాశాకుంభి
            మక్షికాక్రాంతేందు మధుపదంబు

గీ. సప్తపాతాళ సుగుణవజ్జలధిపటహ
   మంబికాధవ తాండవాడంబరంబు
   పుత్రపౌత్రాయురారోగ్య భోగభాగ్య
   శాశ్వతైశ్వర్యములు మా కొసంగుఁగాఁత. 10


సీ. జానకీ రఘురామచంద్ర ఘోరవియోగ
                  కాండాకరప్లవదండవరము
    మాల్యవదాది సమస్త దానవపత్ర
                  రథకంఠషటు వాగురాగుణంబు
    సంజీవనిగ్రాహజలరుహోత్పాటన
                  నిరుపమ గంధసింధురకరంబు
    లంకాపురీ మహాలంకారమణి గృహా
                  హుతిసమిద్దర వీతిహోత్ర ముఖము

గీ. శస్త్రశౌర్యప్రశస్త ప్రహస్తతనయ
   ధారుణీధర విదళనోద్ధత భిదురము
   వాయుతనయ మహోత్తాలవాలమెపుడు
   దండనాధార దండమై దనరుఁగాత. 11

క. రతిరాజ జనక తుల్యుని
   మతి రాజీవ ప్రభవుని మహనీయ గుణా
   రతిరాజ దంతరంగుని
   యతిరాజాచార్యుఁ గొలుతు నస్మద్గురునిన్ 12

క. స్మరియింతు నారదుఁ బరా
   శరు రుక్మాంగదు వసిష్ణు శౌనకు దాల్భ్యు
   న్నరుఁ బుండరీకు శుకునం
   బరీషుఁ బ్రహ్లాదు భీష్ము వ్యాసు దనుజపున్ 13

సీ. వాగ్వధూ భోగినీ వల్మీకు వాల్మీకు
                వరపురాణాగమవ్యాసు వ్యాసు

    నవవచశ్చాతురి భవభూతి భవభూతి
                      శారదాహృద్దన చోరుఁజోరు
    సూరినీలాభ్రమయూరు మయూరు స
                      త్ప్రజ్ఞా సతీపంచబాణు బాణు
    సారథీలోల మురారి మురారి ను
                      ద్దండ విలోకనదండి దండిఁ

 గీ. గావ్యరచనా మహోల్లాసుఁ గాళిదాసు
    బహువిచిత్రకళాహర్షు భట్టహర్షు
    సత్కవీశ్వర సంతతశ్లాఘు మాఘు
    నభినవప్రీతి నెంతయు నభినుతింతు. 14

 క. అనవద్యశబ్దశాసను
    ఘను నన్నయభట్టు నుభయకవిమిత్రునిఁ ది
    క్కనమఖిఁ బ్రబంధపరమే
    శు నెఱ్ఱప్రగడను దలంతు సూక్తి ప్రౌఢిన్ 15

 సీ. జల్లిమాటలు నపశబ్దములను జజ్జు
                  టల్లికల్ ప్రావలం దతుకుఁ బలుకు
     లును పునరుక్తములును వట్టి పూదెలుఁ
                  గాకుదెనుంగులుఁ గటువు లీఁచ
     లును ప్రాలుమాలికలును సందియము లేమ
                  ఱఁపులు మఱఁగులు వ్యర్థపదములు ర
     వణమీఱు బదునైదు వాక్యదోషములు గ
                  నక యవి సరవిగనక మినుకులు

  గీ. జిగిబిగి మెఱవడియు వడి సొగసు లంద
     చందములు నందచందము ల్సందులు తెలి
     య కవితాకవితల రాజహంస కవులఁ
     గదసి కావుకావనెడి కాకవులు కవులె. 16

ప్రతిజ్ఞాదికము

వ. అని నిఖిల దైవతాచరణంబును, ఆచార్య చరణ స్మరణంబును, సుకవి బహూకరణంబును కుకవి
    నిరాకరణంబునుం గావించి

క. సాహసమునఁ గృతి సేయఁగ
   నూహించితి రసికసుకవి యూధము విని సం
   దేహము గలిగిన నధిక
   స్నేహమ్మునఁ దీర్చి మేలుఁ జేకొనవలయున్. 18

[1] తే. గీ. తప్పుగలిగిన చోటనె యొప్పుగలుగు
    సరస కవితా చమత్కార సరణియందుఁ
    గప్పుగలిగిన నీహారకరుని వలన
    నమృతధార ప్రవృద్ధమై యలరినట్లు 19

తే. తప్పులనితోఁచునవియేల్ల యొప్పులగును
    మధుమధుర మత్కవిత్వ చమత్కృతిఁ గన
    రీతిరీతిగఁ గన్పట్టు జాతికనక
    మొరయఁబదియాఱు వన్నెయై యున్నయట్లు. 20

క. ప్రతిపద్యంబుఁ జమత్కృతి,
    బ్రతిపదమును బ్రౌఢి మివులఁ బరగిన కృతి స
    త్కృతిగాక జల్లిమాటల
    యతకడపుం దడిక సభల కర్హంబగునే 21

క. మునివచనంబుల లెస్సగఁ
    దెనుఁగించెద మనుచు వానిఁ దెలియక బెనుప

    న్దెనుఁగును సంస్కృతమును గా
    కెనసిన కబ్బములు సుకవు లెంతురె సభలన్.

            

ఉపమాలంకారసీసము



సీ. బహువిధాలంకార పరిపూర్తిఁ జెలువొంది
                    కమనీయశబ్ద సంగతుల నలరి
    వృత్తసౌభాగ్య సద్వృత్తి రూఢిగఁజెంది
                    బహుళార్థసంగ్రహ భావమలరి
    చిత్రబంధమ్ములచే సోయగము మించి
                    లలితకలధ్వనులను జెలంగి
    జాతివార్తా పాక రీతి శయ్యలమీఱి
                    నయమును జవరదనమ్ము గలిగి

గీ. నట్టి కవితాంగనారత్న మలరు వార
   కాంత కైవడి బ్రౌఢిమ కతన దనదు
   తలఁపు గోల్కొల్పి బుధు లను వలవఁజేయ
   మేలని రసజ్ఞులగువారు మెత్తు రెపుడు.

క. చెఱకుతుదనుండి మొదటికిఁ
   బరగఁగ రుచిగొన్నయట్టి భంగిని గృతియున్
   సరణి విన మఱియు మఱియును
   సరసత మధురిమము మీటి చవు లీవలయున్.

క. తోఁచిన వగ రచియించెదఁ
   దోఁచనిచోఁ జిలువగట్టుదొరతోఁడై వా
   యాచకనె యానతియ్యఁగఁ
   దోఁచ దసాధ్యంబు కవనధోరణి పట్లన్.

పంచపాదిసీసము



సీ. శ్రీకరంబుగఁ బదిరెండవయేఁటఁ దా
                 రావళు ల్ఘటియించి ప్రౌఢఁగన్న
    మునిమునిమీసంబు మొనయునేఁట యమక
                 శతక మొనర్చి కౌశలముఁగన్న

     నిరువదియేఁటను శృంగారమంజరి
                   యు నుదాహరణఁజేసి ఘనతఁగన్న
     నిరువదేనవయేఁటఁ గృష్ణమల్లకథ చ
                   తుర్భద్ర జెప్పి సంతుష్టిఁగన్న
     మఱియును బాలరామాయణ ద్విపద పొ
                   సంగించి బహువిధచాటుకవిత

గీ. నతిశయముఁగన్న నాదుజిహ్వాంచలంబు
     తనివినొందదు కులదేవతావతంస
     వేంకటేశ్వర చరణారవింద మహిమ
     నవనవోన్మేషలేశవర్ణనలఁగాక 26

వ. అని తలంపుచు నొక్కనాఁడు కర్ణాటతుండీర చోళపాండ్యదేశాదీశ ముఖనిఖిలధరణీవర మణిదత్త మత్తేభ ఖత్తలాణిక పల్యంకి కాందోళికాదిచిరత్న రత్నఖచిత రుచిరాభరణ గణప్రకాశిత విభవుండును, సద్గుణ ప్రభవుఁడును; కార్యఖడ్గపటిమధురీణుండును, చతుష్టష్టి విద్యాప్రవీ ణుండును; సనక్షత్రాత్రినేత్రోద్భవోపమానాచ్చ ముక్తాగుళుచ్ఛచ్చవి సంకీర్ణకర్ణభూషావిశేషవదనుండును, దిగంతాయాత విద్వత్కవి వ్రాతబంధుజనావన సదనుండును; నిరంతరాభ్యాగత భూసురాన్న దాన నిష్ఠాతురుండును ధర్మరహస్య పరిశీలన కళావిఖ్యాతుండును; దైనందినాజ్ఞాన ప్రాపితపాపహరణ చుంచు చంచ దష్టాక్షరమంత్ర పఠనాసారుండును ప్రభుసందేశ సకల లోకోపకార కృత్ప్రచారుండును, సత్యవాక్య ప్రతిష్ఠాగరిష్ఠుండును, సదాచారనిష్ఠుండును; అసాధారణ మేధాఘటిత మంత్ర తంత్ర సంధానాబంధన గంధవాహ బాంధవ నిర్గంధిత గంధాంధదండనాధ యూధ స్కందాపార పారావారుండును, శారదా శారద నారదా నారద పారదా పారద శార సౌరాహారాచల నీహార మందార వనీసార వనివంచిత సమంచిత శాశ్వత విశ్వజనీనకీర్తివిహారుండును, పరస్త్రీ పరధన పరాఙ్ముఖశీలుండును, దీనదయాళుండును, కాశీసేతు మధ్యస్థలప్రసిద్ద నిజచరిత్రుండును, కృతసుధీజనస్తోత్రుండనగు నేను నిత్యకృత్యంబులఁ దీర్చి, నిశాసమయంబునఁ గర్తు మకర్తు మన్యధాకర్తు మతి సమర్థ హరికృపాపాణింధమాపాంగలబ్ధ బహువిధ భోజనమూల్య జాంబూనదాంబర సార గంధసారరుచిర విచికిల ఘనసార తాంబూల ప్రియకామినీ సంగీతగోష్ఠి సుమశయ్యాష్టభోగాభోగ సంగతుండనై హంసతూలికా తల్పంబున వేకువఁదేఁకువగల సుఖసుప్తినున్న సమయంబున-

 
సీ. చక్రిదంష్ట్రాదృత సర్వంసహా చక్రి
                   చక్రివిదారణాశ్వంబువాఁడు
     దాని రమావధూమాన ధనాదాని
                   దానిరాడ్వరద సద్గరిమవాఁడు
     మాలితనుద్యుత మర్ధితఘనమాలి
                   మాలిన్యవిరహిత మహిమవాఁడు
     హరినీలాహ్వయధారుణీధ్రవిహారి
                   హారిద్రరుచి నిచయంబువాఁడు

గీ. పాలమున్నీటిదొలఁకులఁ దేలువాఁడు
     లీఁల బొలదిండి మూఁకలఁ ద్రోలువాఁడు
     వేలుపులచాలునేవేళ నేలువాఁడు
     బాలవేంకటశౌరి నామ్రోలనిలిచె. 28

తే.గీ. నిలచి జలధర గంభీర నిస్వనమునఁ
      బలికె నాతోడ వీనుల పండువుగను
      మాకు నంకిత మొనరింపుమా కుమార
      యీ విలాసంబునకు సాటి యెందులేదు.29

శబ్దచిత్రసీసము



సీ. సుకవిరాజులుగాని సుకవిరాజులుగారు
                       పోలికనయభూరి భూరిగరిమ
      గురుచంద్రములుగాని గురుచంద్రములుగారు
                       తరముబుద్ధినిదాన దానపటిమ
      సద్బుధేంద్రులుగాని సద్బుధేంద్రులుగారు
                       ప్రతియుక్తి సౌభాగ్య భాగ్యమహిమ



   
     రాజభద్రులు గాని రాజభద్రులుగారు
                పాటిగీత్యనుభావ భావకలన

గీ. క్షితి నితని కని ఘనులెంచఁ బ్రతిభ గాంచి
    తౌర! లక్షణ లక్ష్యశబ్దార్థ చిత్ర
    రాజితాంధ్ర కవిత్వ సామ్రాజ్య సతత
    పాలనాప్పయ వేంకటపతి కవీంద్ర!

నవగ్రహ నవరత్న నవనిధి నవరస ప్రతిపాదకప్రతాప సత్కర్తిసీసము

సీ. పద్మాప్త విద్రుమప్రభఁగరుణఁగని హి
           మకరత శృంగార మహిమ వెలసి
    ఘననీలగురుమణి ఖగరౌద్ర తనుగేరి
           శంఖజకవుల హాస్యంబుఁజేసి
    క్ష్మాజవిదూరజౌఘ ముకుంద భయమిడి
           కృతవజ్రవరతమస్థితి శమమయి
    బుధపుష్యరాగ సాద్బుతకచ్చఁ బరగించి
           భానీలకుంద భీభత్సమందఁ

గీ. దగి మహాపద్మ గోమేధిక గరిమ హార
   వీరకేతు ద్యుతి జయించి వేఱువేఱ
   నీ ప్రతాపంబు సత్కీర్తి నెగడె నౌర
   యప్పయామాత్యకవి వేంకటార్యవర్య:

సీ. క్షితిలోన రాజగోపతి కృష్ణకృష్ణగో
                పతిరాజు లీడని పలుకవచ్చుఁ
    జింతింప సోమకౌశికభద్రభద్రకౌ
                శిక సోము లెదురని చెప్పవచ్చు
    బాగొప్ప హరిహరీ నాగారి నాగారి
                హరిహరులుద్దని యాడవచ్చు.
    నలువొంద శుక్రవ నవధర్మధర్మవ
                నవ శుక్రులెన నీకనంగవచ్చు

గీ. ధనధృతి భృతిజయోక్తి గీత వితరణ వి
   భవగుణవిలాస శక్తిమాబలరుచిజవ

     శౌర్యమతి దయాశుచితాంగశాంతి సత్య
     భావనీతుల వేంకటపతికవీంద్ర!

సీ. భూరి శృంగారంబు పొడగట్టి నిలిచిన
                          పోలిక ఘనరసస్పూర్తి జెలఁగ
     వలపుబోవని నీటి పైఁదేలుపూవుఁ జ
                          ప్పరము దెఱంగున భావమలర
     వనధివీచిక మీఁద వచ్చు వాలుగవిధం
                          బున నొకమిన్న గమ్ముకొనిరాఁగ
     నాడెమై ననుఁగాంచు ననుఁగాంచు మనుచును
                          బ్రాణముల్గల పదరాజి మెఱయ

గీ. మునుపు నిపుడుఁ గవు లొనర్చు ననువుఁదెనుఁగుఁ
     గబ్బములలోనఁ దెరనాటకంబులెస్స
     గా వినికిసేయుగతి నలంకార సరణి
     వెలయ రచియించు యప్పయ వెంకటార్య.

సీ. [2]అల విన్న కోట పెద్దన లక్షణజ్ఞత
                     శబ్దశాసనకవి శబ్దశుద్ధి
     బ్రాబంధిక పరమేశ్వరు నర్థమహిమం బు
                     భయకవిమిత్రుని పదలలితము
      శ్రీనాథువార్తా ప్రసిద్ది నాచన
                     సోము భూరికాఠిన్యంబు, పోతరాజు
      యమకవిధము మల్లయమనీషిచి
                     త్రంబుఁ, బింగళ సూరకవివరు శ్లేష

గీ. నాంధ్రకవితా పితామహు నల్లిక బిగి.
      ముక్కుతిమ్మన తేటయు భూషణుని య
      లంకృతియు, నీకే గలదౌ తలంప లక్ష
      ణకవి యప్పయ వేంకటసుకవిచంద్ర,

తే.గీ. జగతిఁ బాణిని లింగానుశాసనంబు
       రామకవి లింగనిర్ణయక్రమ మొకటిగఁ
       జేర్చి తెనుంగుఁగబ్బంబుఁ జేసితౌర
       గణపవరవార్థిచంద్ర ! వేంకటకవీంద్ర !

క. అతులిత విద్యానాథ
       ప్రతాపరుద్రీయ భాసుర రసమంజరులన్
       గృతులెంచ నాంధ్రకృతులుగ
       వితముగఁ జేసితివి సరస వేంకటసుకవీ!

సీ. అమరమునకు బదు లభినవాంధ్రఘనిఘంటుఁ
                           గౌముది కెన యాంధ్ర కౌముదియును
      [3] గణయతిప్రాసలక్షణ సీసమాలికఁ
                           నాంధ్ర ప్రయోగరత్నాకరంబు
       నిఖిల రేఫఱకార నిర్ణయ పద్దతి
                          షట్ప్రత్యయముల ప్రస్తారసరణి
        దగనిర్వదాఱుఛందములకు వచనంబు
                          సమధికాలంకారసారమను మ

గీ. హాకృతులు సేయ మా పేర నీకె జెల్లుఁ
        గాక వేఱకవులకునెట్లు గలుగఁ నేర్చు
        నౌర నీశక్తియెక్కడనైనఁ గలదె
        గణపవర మప్పనార్య వేంకటకవీంద్ర!

ప్రతిచరణ త్రి స్తబక యమ కైకనియమ భాసమాన సీసము

సీ. కవనమా భువనమా నవనమా నయహారి
                  నయహారి భయకారి జయము దయము
       లవనమా యవనమా నవనమా నలభాతి
                  నలభాతి కలరీతి నానుమేను
       భవనమా సవనమా న్యవనమా యవికాసి
                 యవికాసి పవిభాసి నదము మదము



   జవనమా పవనమా నవనమా సుకృతిత
                      సుకృతితత్వకృతి విత్సుగతి జగతి

గీ. వదన మామద మాతుల సదన మనుచు
   ననుచు ఘనులెంచి పొగడఁగ వినుచుఁ గవుల
   మనుచు దయమీఱ నప్పయార్యుని కుమార
   లక్ష్మణకవి వేంకటమంత్రి లలితతంత్రి. 38

ద్రాక్షాపాకము



శా. ఔరా! హారివచోరసస్థితి యహా హాశబ్దదాంపత్య మ
   య్యారే! పాకఋజుక్రమంబు బళి శయ్యారీతు లోహో చమ
   త్కారం బద్ఱఱ జాతివార్తలు పురే ! ధారాసమారూఢి మ.
   మ్మారారాజదలంక్రియల్ కవులలో మాన్యుండ వీ వన్నిటన్.

క. అనియానతిచ్చి నను ది
   గ్గనమేలని యద్ధిఱయ్య ! గలిగెఁగదా నేఁ
   డనుకూల నాయకుఁడు మో
   హన మత్కృతి యనెడి కన్నెకని ముదమందన్.

క. నేనా దేవుని పేరను
   నానావిధ శబ్ద గుంభన చమత్కృతిఁ గాఁ
   బూనితి నొకకృతిఁ దద్దే
   వానుమతిం దత్కటాక్ష మాధారముగాన్.
 

కవి చరిత్రము



సీ. శోభిత రామాయణోభయ పరమభా
                  గవత చరిత్ర ముఖ ప్రబంధ
    బంధుర వచనాను బంధ నందవరాన్వ
                 యాబ్ది చంద్రాయమా నప్పనార్య
    నందన వేంకటనాథ వర ప్రసా
                 ద ప్రసాదిత కవితా విలాస

  

[4]కాటేపలీ ముఖ్య గణపవర గ్రామ
                  శేఖర శిష్ట వసిష్ట గోత్ర

గీ. శోభమా నాశ్వలాయన సూత్ర మంత్రి
   వర్య లక్షణకవి వేంకటార్య ఘనుఁడ
   మంగమాంబామణీ గర్బ మహితశుక్తి
   మౌక్తిక ప్రతిమానసమాన తనుఁడ

క. అమితాశువు మధురము చి.
   త్రము విస్తారము చతుర్విధ కవితలను చి
   త్రముగను వింశ త్యవధా
   నముల న్ఘటియించు లక్ష్మణకవివరుండన్.

క. పంకజ భవ భార్యాకర
   కంకణ ఝణ ఝణ నినాద కవితాపటిమన్
   బొంకంబగు లక్ష్మణకవి
   వేంకటపతి మంత్రి యనఁగ వెలసినవాఁడన్.

క. మును శ్రీహర్షుడు సంస్కృత
   మునఁ జేయు ద్విరూపకోశమునకు దినుసుగాఁ
   దెనుఁగున ద్విరూపకోశము
   ఘను లెన్నఁగఁ జేసినట్టి కవిచంద్రుండన్.

క. జగతి న్వృత్త చతుష్టయ
   మగణితముగఁ జిత్రకవిత లై దిర్వదిలోఁ
   దగ మెప్పుగనం దగురూ
   ఢిగఁ గల్పిత కల్పలత ఘటించిన ప్రౌఢన్.

క. వాణీలీణానిక్వణ
   పాణింధమ పదనిబంధ బంధుర ఫణతుల్

  
    రాణింప వసంతతిలక
    భాణముఁ దెనుగించి కీర్తి బడసిన సుకవిన్. 47

క. సుకవులు పొగడఁగ మా
    తృక లన్నియు వరుస నెసఁగనే దొలుదొలుతన్
    జికిలిగఁ గఠినప్రాసశ
    తకరాజము సేసినట్టి ధన్యుఁడఁ బుడమిన్. 48

తే. రహిగఁ బాణిని యాచార్యరచితమైన
    ప్రక్రియాకౌముదిని యాంధ్రరచనచేత
    సీసమాలికఁ జేసి ప్రసిద్ధిఁ గాంచి
    నట్టి యప్పయకవి వేంకటార్యమణిని. 49

క. ఎన్నఁ దెనుఁగునకు రాజను
    గ్రన్ననయతిరాజునకును రమణయకును నే
    జిన్నను ద్విపద నొనర్పను
    జిన్నన్నను బిరుదుగద్యఁ జెప్పిన ఘనుఁడన్. 50

సీ.[5]
  (నవనవముగను జాంబవతీవిలాసమన్
జిత్రకావ్యము విరచింప వశమె)
  చండవిద్యావతీదండకరాజంబు
సులభమే రసము హెచ్చుగనొనర్ప
  లాలితచక్రవాళాకృతిఁ దారాళిఁ
దరమె యన్యులకు వింతను ఘటింప
  నఖిలపురాణసారాంశ మి ట్లలవియే
యిల విలాసంబుగాఁ దెనుఁగుఁ జేయ

  వేంకటేశప్రసాదప్రవృద్ధసుప్ర
  సిద్ధసారస్వతోద్బోధసిద్ధి కతనఁ
  గలిగె నీ భాగ్యమని యెల్లకవులు నన్ను
  నెన్న నే నెన్నుకొను టెన్నఁ జిన్నగాదె. 51


మ. అనివార్యస్థితి ధారుణీసురులు మృష్టాన్నంబు లాదిత్యనం
    దను వారమ్ముల ద్వాదశీవ్రతములన్ దర్వీకరేంద్రాద్రి రా
    యనికిన్ బ్రీతిగ నారగించఁగను నిత్యాశీర్వచోన్వీత శో
    భన మంత్రాక్షత వర్ధమాన విభవప్రాప్తుండనై భక్తితోన్. 52

షష్ఠ్యంతములు



క. విద్యాగరిమనిరస్తా
   విద్యాగతవాసనాత్మ విద్యాగునకున్
   సద్యోగర్భజహృదయల
   సద్యోగున కవనకేళి సద్యోగునకున్. 53

క. శరదాగమాబ్జతులితా
   శరదారుణ నేత్రయుగళ శరదాభునకున్
   వరదానవేంద్రనందన
   వరదానునకున్ఖల ప్రవరదానునకున్. 54

క. కమలాసనాదివిభునకుఁ
   గమలాసన కార్యమిత్ర కమలాసన హృ
   త్కమలాకరలీలాకర
   కమలాక్షునకున్ నతైక కమలకరునకున్. 55

క. నిగనిగచిలువమల వెలుం
   గ గని దనరు సంతసంపుగని నిండిన ప్రే
   మ గని యెడఁదెగని మది గ్ర
   మ్మగ నిలిచిన చిన్నికల్మి మగువ మగనికిన్. 56

క. పుడమి గరికడుగని తొడుకు
   నడగని నడగను నొడయని నాణెంపుముంజే
   కడియంపుబాసగుబ్బలి
   నడవడి గల విడిదినలరు నలనాయనికిన్. 57

క. స్నేగ్ధాత్మకత్వవిరహిత
   దోగ్థ్రాశరహరణచండదోశ్చక్రునకున్
   వాగ్ధ్రావావక్రునకమ
   వాగ్ధ్రావలి స్వపదభక్తి నతచక్రునకున్.58

క. ఘృణినిన్ ఘృణిజిత ఘృణికిన్
   ఘృణికిన్సతానువృత్తి హితఫణిగుణికిన్
   గుణికిన్ దురగవిమణికిన్
   మణికిన్ నిత్యసకల నిగమవిపణిపతికిన్.59

క. భార్ఙ్గోపమానకంధర
   శార్ఙ్గామర్దననిరూఢ సారభుజబలో
   పార్ఙ్గాస్రవప్రభువునకున్
   శార్ఙ్గిస్థల్యధికశేషశైలవిభునకున్. 60

క. దక్షాహితరక్షాయత
   వీక్షాయతి భువనభరణ విభవున కసురా
   ద్యక్షోధరవక్షోవర
   శిక్షాకరభయదచక్ర శీలభవునకున్. 61

క. లంకానాయకలలనా
   లంకారాపహజయాకలంకరతిక మీ
   నాంక సహస్రాకృతికిన్
   వేంకటపతికిన్ గటాక్ష విభవోన్నతికిన్. 62

వక్ష్యమాణలక్ష్యవిశేషోద్దేశ వచనము

వ. అంకితంబుగాఁ బంకజాసన విలాసినీకరాంచల మణివిపంచికా ఘుమ ఘుమార్భటి నిర్భరసుధాప్రాదుర్భా వాస్పదన వరస సందర్భంబు గుబాళింప విభవంబులకుఁ బ్రభవంబును, విద్యాధికులకు హృద్యంబును, విన్నాణంబులకుఁ జెన్నును, వింతలకుఁ బొంతనంబును, విటవిటీజనం బులకుఁ బుటపుటయును, విరహులకు మెఱమెఱయును, వీటికి నీటును, శబ్దశాస్త్రరీతికి విఖ్యాతియును, ధ్వనులకు నునికియును, ఉక్తాత్యుక్తాదిగాఁగల యిరువదాఱుఛందంబులకుఁ జందంబును, కావ్యాలంకారచూడామణికిఁ గావ్యాలంకారసంగ్రహమ్మును, సకలాలంకారమ్ముల కలంకారమ్మును, లక్షణసారసంగ్రహ సరస్వతీవిలాస సాహిత్యచింతామణి సత్కవిజనసంజీవని భీమానంత ఛందోముఖ్యాష్టాదశ లక్షణంబులకు లక్ష్యమును, రేఫఱకారనిర్ణయమ్మును, అమరామరశేష విశ్వశాశ్వతశబ్దార్ణవ యాదవ వైజయంతికాకార నానార్థరత్నమాలికాకార హలాయుధ వాగురి కేశవ తారపాల ధరణి ధన్వంతరి ధనంజయ రభస విశ్వప్రకాశ మాధవ చింతామణి జయప్రతాప శుభాంగజయపాల క్షీరస్వామి ప్రణీత చతుర్వింశతివివిధనిఘంటుపదమ్ములకుఁ బదమ్మును, షష్ఠివిధయతిచమత్కారముల కాధారమును, చతుర్వింశతిప్రాసమ్ముల కావాసమ్మును, ప్రౌఢికిఁ బ్రౌఢియును, తేఁటకుఁ దేఁటయును, చిరంతనాంధ్రప్రబంధజాలంబుల కాలవాలంబును, సనాతనవిద్వత్కవి వితాన రచనావిధంబునకు ఘంటాపథంబును, ఇదానీంతన సత్కవినికాయంబునకు సహాయంబును, భవితవ్యకవికలాపంబునకు నాచార్యరూపంబును, నిఖిలభాషావిశేషంబులకు న్మేషణంబును, మూఢజాతులకు బోధహేతువును, ప్రౌఢతతికి సమ్మతియును, సర్వజనకరంబున కాశ్చర్యకరంబును, బహువిధాచుంబితకవితాచమత్కృతికి వసతియును, నగరార్ణవశైలర్తు చంద్రసూర్యోదయోద్యాన సలిలకేళీ మధుపాన సురతి వియోగ *వివాహ కుమారోదయ మంత్ర*ద్యూతప్రయాణ రణనాయకాభ్యుదయ వర్ణనాతిశయంబున కాశయంబును, అన్యానధీన సుధీనవనవస్తవ్య సర్వపధీన పాండితీమండితచమత్కారంబుగా నా రచియింపబూనిన రసికజనహృదయోల్లాసంబైన ప్రబంధరాజవిజయవేంకటేశ్వరవిలాసంబునకుఁ గథాగ్రమంబెట్టిదనిన.

  1. ఈ పద్యము తెనాలిరామకృష్ణుని పాండురంగమహాత్మ్యమున నిట్లుండినది. “తప్పుగల్గినచోటనే యొప్పుగల్గు | నరసికావళి కవితల యవగుణములు | సరసకవితావశోక్తుల సరణియందు | నమృతధారా ప్రవాహంబు లడరుఁ గాదే” (1.14) ‘అవగణములు... లడరు' అని యనన్వితము. “యవగుణముల సరసఁ గవితా' యని పఠించిన సరిపడును” అని మా తాతగారు విమర్శ వినోదములో వ్రాసినారు. చూ. 51.
  2. ఈ మహాకవి “కావ్యాలంకార చూడామణి" యను లక్షణ గ్రంథమును దెనుఁగున వ్రాసియున్నాఁడు (పూ రా.)
  3. (గణనీయ సర్వలక్షణ శిరోరత్నంబు) అని పాఠాంతరము(పూ.రా)
  4. కామేఫలీ - అని కొన్ని ప్రతులలోఁ జూపట్టు. ఈ విషయమును బీఠిక లో జూడనగు (పూ. రా.).
  5. ప్రాసంబు లిర్వదేఁబదియతు ల్లక్షణం । బుగ సీసమాలికఁ బూన్పవశమె' పా. (పూ.రా.)