శ్రీవేంకటాచలమాహాత్మ్యము/షష్ఠాశ్వాసము

శ్రీరస్తు

శ్రీవేంకటాచలమాహాత్మ్యము

షష్ఠాశ్వాసము

శా.

శ్రీమత్కోమలనీలతోయదనిభం శృంగారపూర్ణేక్షణం
హేమాభాంబరదివ్యభూషణధరం హేలావతీఖేలనం
కౌమారీశ్వర సన్నుతాంఘ్రికమలు కల్యాణలీలాగుణో
ద్దామం శ్రీతఱికుండ శేషకుధరాధ్యక్షం భజేహం సదా.

1


క.

శ్రీమద్గురువర శుభకర
శ్రీమన్నరసింహదేవ చిన్మయభావా
శ్రీ మహిళాధిప ఘనతర
శ్రీమద్వేంకటగిరీశ జితదనుజేశా.

2

పద్మపురాణం బనువీరలక్ష్మీవిలాసము

సీ.

అని గురుదైవంబులను దలంపుచు వేంక
        టాద్రిమాహాత్మ్యము చనుచు ధరను
వెలయు వరాహభవిష్యోత్తరపురాణ
        ములయందు నలువదిమూఁడు నైన
భాసురాధ్యాయము ల్పద్యకావ్యంబుగ
        మొనసి యైదాశ్వాసములు రచించి
హరికి సమర్పించి యనల పద్మపురాణ
        మందు వింతగు వేంకటాద్రివిభుఁడు

తే.

సిరిని గూరిచి తపమును జేసినట్టి
చరితములు కొన్ని లభియింప సంగ్రహముగ
సరవి నాశ్వాసమున కవి చాల వనుచు
వేఱకల్పన కొంత గావింపవలసె.

3


క.

కావున నిపు డొకగతిఁ గృతిఁ
గావించెద బుధులు తప్పుగా నెంచక నన్
గావుఁడు సంతస మారఁగ
సేవించెద నెల్లప్రొద్దు చిత్తమునందున్.

4


తే.

ఈకృతికిఁ దగునభిధాన మేది యనిన
శ్రీకరం బగువీరలక్ష్మీవిలాస
మనెడునామంబు పెద్దలయనుమతమున
నిర్ణయించితి నన్ను మన్నింపవలయు.

5


తే.

భారతిని జిహ్వయం దుంచి నారసింహుఁ
డేవిధంబునఁ బలికించు నావిధమునఁ
బలి కెదను భాగవతులు నాబాలభాష
వినుఁడు నెయ్యంబు మీఱఁగ విబుధులార.

6


వ.

తత్కథాక్రమం బెట్టి దనిన శ్రీనివాసస్వామి చారిత్రంబుల
విని శౌనకాదిమునీంద్రులు వెండియు నొక్కనాఁడు ప్రాతః
కాలమున స్నానసంధ్యాద్యనుష్ఠానంబు లొనర్చుకొని
సూతుం జూచి యిట్లనిరి.

7


సీ.

ఓసూతుఁడా శ్రీనివాసునిచరితంబు
        లెన్ని విన్నను దృప్తి నెసఁగ దాత్మ
కావున నీవు తత్కథ లింకనుం జెప్పు
        మనుజవేషమును రమావిభుండు

ధీరుఁడై పద్మావతిం బెండ్లియాడిన
        వెనుక మహాలక్ష్మి విశ్వసించి
హరిపక్షమం దుండ కరిగి కొల్లాపుర
        మందున్న పిమ్మట నబ్ధిసుతను


తే.

దలఁచునో లేక చక్రి నిర్దయను మదిని
దలఁప కాకాశపతిసుతం దాను గూడి
మఱచి యూరకయుండెనో మఱల లక్ష్మి
నెదను జేర్చెనొ లేదొ మా కెఱుఁగమనుడు.

8


క.

మనమున శ్రీవేదవ్యా
సుని దలంచుచు మౌనివరులఁ జూచి నగుచు ని
ట్లనియెను మునులారా హరి
ఘనచరితంబులను జెప్పఁగా వశమె వినన్.

9


క.

నను మీ రడిగినవిధమున
మును దేవలుఁ డడుగ మోదమును దనరారన్
విని దేవదర్శనుం డను
ముని చెప్పెను విశదముగను మొనసి క్రమముగన్.

10


మ.

విను మోదేవల వేంకటేశ్వరుఁడు శ్రీవిష్ణుండు పద్మావతిన్
మన ముప్పొంగఁగ గూడి యుండియును వేమాఱున్ రమాదేవినిం
దనచిత్తంబున నెంచుచుం బ్రియముతోఁ దద్రూపలావణ్యచిం
తనముం జేయుచుఁ బన్నగాచలముమీఁదన్ సర్వభోగంబులన్.

11


సీ.

అనుభవించుచు నుండె నటు కొన్నియబ్దంబు
        లరిగినవెనుక శేషాద్రివిభుఁడు

తనమదిలోఁ దాను దలఁచె నిమ్మెయి సిరి
        నెడఁబాసి నరుఁడ నై యిన్నియేండ్లు
గడపుచు నుంటి నింక నెడంబునం దుంచి
        యుండుట పాడిగా దుదధిసుతను
వక్షమునం దుంచవలెఁ గాని యేరీతి
        నైనఁ బ్రార్థించి నెయ్యంబు నిటకు


తే.

నేను దోడ్కొని రాకున్న నిఖిలకార్య
ములును సంపూర్తిగావు పెంపుగ యశంబు
దక్కదు కుబేరునకు ఋణధన మొసంగు
టకు నుపాయంబు లేదు దృఢంబు తలఁప.

12


తరల.

నిరతము న్మదిఁ జింతఁ జేయుచు నీరజేక్షణుఁ డార్తుఁడై
నరునిచందముగా విరక్తుఁ డనంగ నొప్పుచు సర్వమున్
మఱచి తాఁ దను జూచుచుండెడి మౌనిమాడ్కిని పద్మమం
దిరవిలాసగుణంబులెల్ల మదిం దలంచుచు నుండఁగన్.

13


సీ.

అపుడు పద్మావతి హరి సర్వవై రాగ్య
        కలితుఁడై యున్నలక్షణములెల్ల
భావించి భావించి భయమొంది యొక్కనాఁ
        డేకాంతసమయమం దిట్టు లనియె
శ్రీస్వామి యిపుడు మీచిత్తంబునం జింతఁ
        బుట్టుట మీముఖాంబుజమునందుఁ
గనిపించుచున్న దిక్కాలమం దరుడుగ
        నిటు చింత వొడమిన హేతు వేమి

తే.

దాఁచకయ చెప్పు మనుచుఁ బాదములమీఁద
ఫాలమును జేర్చి విడువక బహువిధముల
వినుతిసేయుచు నడుగఁగ విడువదనుచు
సతిని గరములతో నెత్తి హితము మెఱయ.

14


క.

లాలింపుచుఁ బద్మావతి
నాలింగన మారఁజేసి యన్యోన్యముగా
శ్రీలక్ష్మీశ్వరుఁ డపు డా
హేలావతి మోము చూచి యిట్లని పలికెన్.

15


సీ.

వినవె పద్మావతి వివరంబుగా నీకుఁ
        జెప్పెద నెట్లన సృష్టి లేని
కాలంబునం దొంటిగా నిర్వికారుండ
        నయి నిర్గుణబ్రహ్మ మగుచు నుంటి
నాయం దనాదియై పాయక మూలప్ర
        ధానమ మాయాభిధాన మొంది
చిద్రూపమై లక్ష్మి సద్రూప మై నన్నుఁ
        బొందఁగ నప్పు డానంద మొదవె


తే.

నందు మహదాదితత్వంబు లన్ని వొడమె
వాని మేళనమున సృష్టి వరుసగాను
బట్టుగాఁ బుట్టి సర్వప్రపంచమయ్యె
నప్పు డంతటికిని గర్త నగుచు నేను.

16


క.

అది మొదలుగ బ్రహ్మాదుల
పదపడి పుట్టింతు నీప్రపంచము నాలోఁ
గుదురై యుండును వెలిపెం
పొదవుచు నీరీతి వెల్గుచుండు మృగాక్షీ.

17

క.

ఇంత మహత్వం బా శ్రీ
కాంతకటాక్షమున నాకుఁ గలిగిన దిపు డా
యింతి నెడబాసి యుండుట
కెంతయుఁ జింతింపుచుందు నిందునిభాస్యా.

18


సీ.

అద్వయబ్రహ్మంబు నై నిరాకారమై
        యచలమై నున్న నాయందుఁ బొంది
ఘనసుందరాకారమును నాకుఁ గల్పించి
        తగు సుందరాంగియై తాను నిల్చి
గురుతరకల్యాణగుణములు నా కిచ్చి
        నను గొప్పచేసె నానాఁటనుండి
చంద్రునియందున్న చంద్రికవిధముగ
        వెలయుచు నాయురస్థలిని నిలిచి


తే.

వేడ్కమై నుండఁగా నొకవేళ భృగుఁడు
వచ్చి సిరియున్న యురముపై వఱలఁ దన్నె
నందుచే లక్ష్మి నాయందు నలుక చేసి
విరసములు పల్కి కరవీరపురము చేరె.

19


క.

అప్పుడు సర్వజ్ఞత్వము
తెప్పున నను విడచి లక్ష్మిదేవిం బొందెం
దప్పక యమ్మార్గంబును
దప్పక యీగిరికి వచ్చి దైన్యముచేతన్.

20


సీ.

విలసిల్లఁ దింత్రిణీవృక్షమూలమున
        నున్న వల్మీకాన నుంటి నపుడు
నాకు సర్వజ్ఞత లేకుండె నప్పుడు
        తేఱకు గొల్లచే దెబ్బవడితి

నినుఁ జూచి మోహించి నీసఖిజనముచే
        గలిగె ఱాల్టెబ్బలు కఠినముగను
సిరి లేకయుండుటం చేసి వివాహేచ్ఛ
        చే నాకుబేరునిచేత నప్పు


తే.

గలిగె మీతండ్రి తమ్ములు చెలఁగి యిచ్చి
నట్టిధనమున ఋణమును నెట్టలేక
చింత పుట్టిన దిప్పుడు సేయుకార్య
మేమి దోఁచకయున్నది యిందువదన.

21


క.

అన విని పద్మావతి యి
ట్లనియె మహాస్వామి మీకు నమరఁగ నాలో
చన యేను జెప్పనేర్తునె
నను మీ రిట్లడుగురీతి నబ్బురముగదా.

22


సీ.

సృష్టిపూర్వమునందు చేఁబట్టి మిమ్మింత
        గొప్పచేసిన లక్ష్మి నిప్పు డిట్లు
నెడఁబాయఁదగదు మీ రెట్లైన బ్రార్థించి
        తోడ్కొనివచ్చి నాతోడఁ గూర్చి
మీచెంత నిడికొన్న మీకిర్వురకు దాసి
        నై భక్తిసేవింతు నంతెగాని
నామది కాలోచనం బింతకన్న వే
        ఱింక నేమి తోఁచలే దిందిరేశ


తే.

రయమునం బోయి కొల్లాపురంబు సేరి
కమల కుండెడు కోపంబు కడఁకఁ దీర్చి
యిరువురము దోడుకొని వత్త మిటకు సరవి
ననిన శ్రీచక్రి యిమ్మెయి ననియె నపుడు.

23

మ.

విను పద్మావతి యొంటికాఁపురము నీవే చేయుచు న్వేడ్కఁగా
నను నర్ధక్షణమైనఁ బాయక సదానందాత్మవై యుంటి వా
వనజాతాలయ నచ్చి సంతతము నావక్షస్థలం బందు ని
ల్చిన నీ వప్పుడు చూచి యోర్వఁగలవే చింత న్మదిం బొందకన్.

24


క.

నీ విచ్చట ననుఁ గూడుట
కై వననిధితనయ వచ్చినప్పుడు తిరుగా
నావక్షస్థలి నిడుకొన
కావేళనె పంచి తచటి కబ్జదళాక్షీ.

25


సీ.

అన విని చింతించి యపుడు పద్మావతి
        పలికె నిమ్మెయి రమాభామ యిటకు
వచ్చియున్నపుడు మీవక్షస్థలంబునం
        దిడికొన్న కొదువ నా కేలగల్గు
నాలక్ష్మి మీకు నా కన్యోన్యముగఁ జేసి
        యంతటికిని గర్త యగుచు నుండు
శ్రీరమాకాంతయై సీతయై ననుఁ బెండ్లి
        యాడు మటంచు నీ కాప్తముగను


తే.

జెప్పినందుననే కదా చిత్తగించి
నన్ను జేఁబట్టిరి సదానంద మొదవె
సింత భాగ్యంబు కృపను నా కిచ్చినట్టి
సిరికిఁ బ్రత్యుపకృతి నేను జేయఁగలనె.

26


క.

ఏరీతిగ నిచ్చటికిని
గూరిమిలో సిరిని దోడుకొని వచ్చిన నే
నారామామణిపదములు
గౌరవమునఁ గొల్చియుందుఁ గమలదళాక్షా.

27

మ.

ననుఁ గొల్లాపురమందుఁ జేర్పుఁ డచట న్నానాప్రకారంబులన్
వనజాతాలయ కొప్పఁ జెప్పి మఱి సర్వంబు న్సమర్పించి ర
మ్మని నేఁ దోడ్కొని వత్తు నన్న దరహాసాస్యంబు దీపింప న
వ్వనజాతాక్షుఁడు సంతసం బెసఁగ నవ్వామాక్షితో నిట్లనెన్.

28


క.

సతి నీలలితోక్తికి నా
కతిసంతస మయ్యె వకుళ యలరఁగ దోడన్
హితముగ నుండుము నే నా
సతి దోడ్కొనివత్తు నిటకు సంప్రీతి తగన్.

29


వ.

అని శ్రీనివాసుండు నిశ్చయించె నట్టి వృత్తాంతంబు లక్ష్మి
భావించి తనలోఁ దా నిట్లు వితర్కించె.

30


సీ.

శ్రీవేంకటేశుఁ డాశ్రితజనావనుఁ డింక
        నిందుండ నీయ కహీంద్రగిరికి
నను సత్కృపం దోడుకొని పోవుటకు వచ్చు
        నపుడు నేరాను బొమ్మనుచు నాకు
నోరాడ దిప్పుడ గారవంబుగ డాఁగ
        వలయునే నాస్వామివక్షమందుఁ
బగలు రేయుండిన పద్మావతికిఁ జింత
        గలుగ నాకేల నీకర్మ మంచు


తే.

రయమునను లేచి కొల్లాపురంబు విడచి
దారి తప్పక యరిగి పాతాళమందుఁ
జేరి హరియంశుఁ డయ్యు విశేషయోగ
మహిమచే నొప్పు కపిలాఖ్యమౌనిఁ జేరె.

31


క.

అపు డాలక్ష్మిని గన్గొని
కపిలమునీంద్రుండు మిగుల గౌరవముగ న

వ్విపులాశ్రమతలమున నా
చపలాక్షిని నిల్పె మదిని సంశయపడకన్.

32


క.

హరియంశము గల మునిపై
నరమర మది నుంచుకొనక యంబుధితనయం
దిరవుగ నిలిచి నివేశుని
స్థిరముగ మనసునను బూజ సేయుచు నుండెన్.

33


సీ.

అటుమీఁద శ్రీవేంకటాద్రినాయకుఁడు ప్రా
        తఃకాలమున లేచి తప్తహేమ
చేలభూషణములు చెలువుగ ధరియించి
        గరుడవాహన మెక్కి గరిమ యెసఁగ
నటఁ బోయి వచ్చెద ననుచుఁ బద్మావతి
        కనుకూలముగఁ జెప్పి ఘనత మెఱయ
నందుస్న వకుళతో నావరాహస్వామి
        తోఁ జెప్పి కదలి సంతోషముగను


తే.

బోయి శ్రీకరకరవీరపురమునందుఁ
బద్మమందిర యున్నట్టి భవనమునకు
జేరి యందందు వెదకి యాక్షీరవార్థి
కన్యకామణి లేనట్టికతమునకును.

34


శా.

ఖిన్నుండై మది నేమి దోఁచ కచటం గ్లేశాత్ముఁ డై సారెకుం
గన్నీ రూరక నింపుచున్ వెదకుచుం గామాతురుం డై మహా
పన్నుండై యకట రమాతరుణి నాపై మోహమున్ లేక యిం
దిన్నాళ్లుం డిపు డెందు డాఁగినదొ నే నింకేడ శోధింపుదున్.

35


సీ.

అని చింత సేయుచు నచట నుండక పోయి
        పర్వతాదులఁ జూచి పలికెఁ జక్రి

గిరులార తరులార కిన్నరాంగనలార
        కానరే మారమాకాంత నెందు
సురులార మునులార నరులార మీరైన
        గానరే మారమాకాంత నెందు
పద్మాకరములు మాపద్మాలయను జూచి
        యుండినచోఁ జెప్పు డుండునున్కి


తే.

నన్నుఁ గన్గొని యెచటనో యున్న దిపుడు
దానిఁ జూడక యుండిన తను వదేల
యనుచుఁ జింతించునప్పు డయ్యబ్ధిసుతను
జూచి యుండినవారలు సొరిది నపుడు.

36


వ.

హరిం జూచి యిట్లనిరి.

37


మత్తకోకిల.

దేవదేవ మేచకదేహ యిచ్చట లేదు శ్రీ
దేవి యెచ్చట నుండునో యది తేటగాఁ గనలేదు మీ
కేవిధంబున విన్నవింతు మహీంద్రశైలనివాసకా
నావుడున్ విని శౌరి యూరక నాల్గుదిక్కులు చూచుచున్.

38


వ.

ఇవ్విధంబునఁ గొంతతడవుండి యాకొల్లాపురంబున నొక్కెడ
నర్చారూపంబుగ లక్ష్మిని దీర్పించియుంచి పూర్వంబున నగ
స్త్యుండు పూజించుచున్న ఆత్మవిగ్రహంబును జూచి
యచ్చోట నిల్చి తద్విగ్రహంబును బూజించుచు దశవత్స
రంబులు తపంబు సేయుచుండె, నంత నొక్కనాఁడు సిరిం
దలంచి చింతాక్రాంతస్వాంతుం డై యుండుసమయంబున
నశరీరి యాహరి కిట్లనియె.

39

సీ.

దేవ యిచ్చట రమాదేవి మీ కిప్పుడు
        పొడసూప దీతపంబునకు మెచ్చి
గాన నిచ్చటికిఁ జక్కఁగ దక్షిణంబుగఁ
        గీర్తి కెక్కినయట్టి కృష్ణవేణి
యను నది ప్రవహించు నటకు ద్వాత్రింశతి
        యోజనంబులదూర ముండునట్టి
ముఖ్యమైన సువర్ణముఖరి యున్నది తత్త
        టముఁ జేరి తపము సేయుము క్రమముగఁ


తే.

గుంభసంభవుఁ డుస్న దిక్కుకును దూర్పు
గాఁ బ్రకాశించు సిద్ధసౌఖ్యస్థలంబు
స్వర్గమందున్న దివ్యసువర్ణకమల
మొకటిఁ దెప్పించి నాఁటి యం దొనర నిలిచి.

40


క.

ఆకమలమునకుఁ దూర్పు ది
వాకరుని బ్రతిష్ఠ చేసి యర్చించినచో
నాకంజము ముకుళింపక
ప్రాకటశుభముగను వెలయు భావం బలరన్.

41


శా.

నీ వాకంజమునందుఁ జూ పిడుచు సన్నిష్ఠారతుండై కన
ద్భావం బందు రమాసతిం దలఁచి తత్పద్మాంతరాసీమయం
దేవేళం గనుచుండు పుష్పములతో నింపొందఁగాఁ జేయుమా
దేవిం బొందఁ బ్రసన్నయై నిలుచు నీదేహంబునన్ శ్రీధరా.

42


క.

పదిరెండువత్సరంబులు
మది శ్రీసతియంద నిల్పి మౌనంబుగ నిం
పొదవఁగ లక్ష్మీమంత్రము
చెదరక యెప్పుడును జపము సేయు మహాత్మా.

43

సీ.

అని భారతీదేవి యశరీరయై పల్కె
        విని వింతగాఁ జక్రి కనులు దెఱచి
నాల్గుదిక్కులు చూచినను దేని కెవరందుఁ
        గన్పట్టకుండఁగ గగనవాణి
చెప్పినమాటలు సిద్ధం బనుచు లేచి
        గరుడవాహన మెక్కి కదలి దారి
దప్పక శేషభూధరము గ్రక్కునఁ జేరి
        వేఱ తా నొకరాజవేష మచట


తే.

గ్రమముగా ధరియించి పుష్కరిణియందు
స్నానసంధ్యాదికృత్యముల్ సల్పుచున్న
గాంచి రారాజవరుఁ డని గౌరవముగ
నెంచి వైఖానసార్యులం దిష్టు లగుచు.

44


తే.

వేగ క్రతుభోక్త యగుమహావిష్ణు దేవు
నతిథి యని పూజ చేసి దివ్యాన్న మపుడు
పొసఁగ నర్పించి విడె మిచ్చి పుణ్యకథలు
చెప్పి దయయుంచు మంచు నాశీర్వదించి.

45


క.

తను వీడ్కొల్పఁగఁ బర్వత
మును డిగ్గి యగస్త్యనామముఖ్యాశ్రమముం
గనుఁగొని దానికి దూర్పుగఁ
జని సిద్ధస్థలమునంద సరగున జేరెన్.

46


వ.

అప్పుడు విష్ణుండు గరుడుని డిగ్గి వాయుదేవుని స్మరింప
నతండు వచ్చి చక్రికిఁ బ్రణమిల్లి యిట్లనియె.

47


క.

దేవా నన్నుఁ దలంచుట
కీవేళం గార్య మేమి యెఱిగింపుము నే

నేవిధకార్యం బైనను
శ్రీవల్లభ చేసె దేను సేవకుఁ డగుచున్.

48


వ.

అనిన విని శ్రీహరి పవనునిం గనుంగొని.

49


సీ.

పలికె నిట్లని విను పవన నీ వాస్వర్గ
        మున కేగి యచ్చట ముఖ్యమైన
యలరుమందాకిని యందుండు వరకాంచ
        నాబ్జంబు సురపతి నడిగి తెమ్ము
పొమ్మనఁగా జక్రి కమ్మారుతుం డిట్టు
        లనియె హేమాబ్జంబు లమిత మగుచు
ముఖ్యంబుగా స్వర్ణముఖియందు నుండఁగ
        వేఱ భర్మాబ్జము ల్వెదుక నేల


తే.

ననఁగ నశరీరి తనకుఁ జెప్పినవిధంబు
నతని కెఱింగించి పంపఁగ ననిలుఁ డరిగి
వరసహస్రదళముల సువర్ణపద్మ
మమరపతి సెలవునఁ దెచ్చి హరి కొసంగి.

50


క.

నిలువఁగ మాధవుఁ డిట్లని
పలికెను విను పవన నేఁ దపం బిచ్చోటన్
సలిపెద నీ కీగోప్యము
దెలిపితి నిది యెవరితోడఁ దెలుపకు మనఘా.

51


తే.

అనిన విని పవనుండు మహాప్రసాద
మంచు హరియాజ్ఞ గైకొని యరిగె నంతఁ
గమలలోచనుఁ డచట పుష్కరిణ నడుమఁ
గుంతమునఁ గ్రుచ్చి గోకర్ణ మంతయైన.

52

సీ.

ఖాతంబు చేసి యక్కడ సువర్ణాంబుజ
        నాళంబు లోతుగ నాటి నీటి
పైనఁ బద్మము నుంచి భాస్కరు నాతూర్పు
        నందుంచి పూజించి యచలమదిని
బద్మాకరమునకుఁ బశ్చిమతటమునఁ
        జేరి పద్మాసనాసీనుఁ డగుచు
నేకాగ్ర మగుదృష్టి నాకాంచనాబ్జమం
        దుంచి శ్రీసతిని భావించి యచట


తే.

నిలిపి మానసపూజ తా నిత్య మొనర
ధీరుఁడై చేయుచును రమాదేవిమంత్ర
ముసు జపించుచు నచ్చోట మొనసి తపము
సేయుచుండెను వెన్నుండు సిరిని గూర్చి.

53


క.

హరి యిటు తప మొనరించుట
హరిహయుఁ డెఱిఁగియును మఱచి యవనీస్థలిపై
నరపతి యెవఁడో ఘనతకు
మురునిష్ఠను నిల్చి చేయుచున్నాఁ డనుచున్.

54


ఆ.

తలఁచి యతఁడు సేయుతపము పూర్ణంబైన
తనపదంబు సేరు ననుభయంబు
పొడమ దపమునకును బుడమిపై విఘ్నంబు
సేయు నంచు నెంచి జిష్ణుఁ డపుడు.

55


చ.

తన మది నిశ్చయింపుచును దక్కక యప్పుడ వారకామినీ
జనములఁ బిల్చి యిట్లనియె సాహసి యొక్కఁడు మత్పదంబు చే
రను దప మాచరించు నలరాజును మోసముచేసి తత్తపం
బును జెఱుపందగుం జనుఁడు పుష్పశరు న్జతగూడి వేడ్కతోన్.

56

మ.

అని రంభాదిసతీసమూహమును నెయ్యం బొప్పఁ బంపింప న
త్తనుమధ్యల్ మణిభూషణంబులు సువస్త్రంబుల్ విరుల్ దివ్యచం
దనముం దాల్చి యొయారము ల్చెలఁగఁగాఁ దాంబూలముల్ చేయుచుం
జన విష్ణుండు తపం బొనర్చు ఘనసుస్థానంబునం జేరఁగన్.

57


క.

కలకంఠము లళులును జిలు
కలు కలకలరవము సేయఁగా సూనశరుం
డులుకక మలయానిలమును
జెలువలరఁగఁ గూడి యచటిచేడెలచెంతన్.

58


క.

చేరిన మారుని గని యా
నారీమణు లెల్ల మెఱయ నగి యచ్చటిశృం
గారవనములోఁ జొరబడి
కోరిక లుప్పొంగఁ బూలు గోయుచు నెలమిన్.

59


క.

చిలుకలవలెఁ దగిజిలిబిలి
పలుకులు పల్కుచును జెలఁగి పకపక నగుచున్
జెలువారఁగ నొండొరులను
బిలుచుచు నిట్లనిరి చాలప్రేమ యెసంగన్.

60


సీ.

అక్కలారా కొమ్మ లెక్కి పువ్వులు గోసి
        చక్కగ వనమెల్లఁ జల్లరమ్మ
భువిని వసంతమాధవుఁజెంత వనలక్ష్మి
        జేర్చి వివాహంబు చేయరమ్మ
మల్లెపువ్వులఁ గోసి మగువలారా వేడ్క
        దలఁబ్రాలు వోయరె దంపతులకు

గీరంబులం జెంతఁ జేరి పాటలు పాడ
        సెలవు మీరొసఁగరె చేడెలార


తే.

యనుచు ఘనతాళపద్ధతి నాడిపాడి
రభసములు సేయఁగాఁ బరరాజవేష
ధారియై తపమొనరించు దానవారి
నాకపతిచేత కాత్మలో నవ్వుకొనుచు.

61


చ.

కనులొగి నెఱ్ఱచేసుకొనఁ గాంతులు దిక్కులు పిక్కటిల్లఁగా
ననజదళాయతేక్షణుఁడు వారిని జూచి చలింప కాత్మలో
వనధిసుతం దలంచుచును జారక యజ్ఞము దిక్కుఁ జూడఁగా
ననిమిషకాంతలే భ్రమసి యాహరిపైఁ దమమోహ ముంచుచున్.

62


మ.

అపు డంచంచుకుఁ బోయి పూలసరముల్ హాస్యంబుగాఁ బూని య
త్తపనీయాంగుఁడు శౌరివక్షముపయిం దా మేయుచున్ నవ్వుచున్
గపటంబుం దగ నవ్యనాట్యములు సద్దానంబులం జేసినన్
జపలం బించుక లేక యచ్యుతుఁడు నిష్ఠన్ నిల్చి యొప్పెం గడున్.

63


వ.

అప్పు డయ్యంగనామణులు తమ కేమియుం దోఁచక.

64


సీ.

ఒక రొక్కరిని చూచి యోయక్కలార యీ
        నరపతి తపమే ఘనంబు చూడ
మొనసి విశ్వామిత్రమునితపంబున కన్న
        ద్వైపాయనుని మేటితపముకన్న
నతిశయించిన దిమ్మహారాజు కోడితి
        మింకఁ బోవుద మని యెంచుచుండ
నప్పుడు దైత్యారి తెప్పున నొకమోహి
        నీదేవి సృజియించె నెమ్మిఁ దనర

తే.

దేవతాస్త్రీలు మోహినీదేవిఁ జూచి
విస్మయానందచిత్తలై విశ్వమునను
జూచితిమె యిట్టి యింతిని సుదతులార
యనుచు లజ్జించి యిట్లనుకొనిరి మఱియు.

65


శా.

ఈకాంతామణి నద్భుతం బెసఁగఁగా నీరాజు పుట్టించినాఁ
డేకాలంబున నైన నిట్టి మహిమం బెం దేని గన్గొంటిమే
లోకాతీతుఁడు గాని యీపురుషుఁ డీలోకంబునన్ నుండువాఁ
డే కాఁడు మనుష్యుఁ డంచు మన మి ట్లీపుర్షుని న్వేడ్కతోన్.

66


వ.

వచ్చి చూచి మోహించుట ధర్మంబుగాదు గావున.

67


సీ.

మఱి కొంద ఱప్పుడు మానినీమణులార
        యీతండు తపసిగ నెంచఁదగదు
శ్రీగురుం డనవలెఁ జెలులార లేకున్న
        యొకయింతి సృజియింప నోపనగునే
చెనకితి మూరక సిగ్గుపా ట్లయ్యె నిం
        కేమియు లేదుపో యిచట మనకు
ననుచుఁ జింతింపఁగ నాపుష్పబాణుండు
        తలఁచె నిమ్మెయి నాదుతండ్రిఁ జూడఁ


తే.

దపము సేయుచు నుండఁగఁ గపటపుష్ప
బాణమును బట్టి యెందుకు వచ్చి తేను
తండ్రి యేమి తలంచునో తపము మాని
యంచు గడుభీతి నొందుచు నరిగె నంత.

68


మ.

దిగులుం బొందుచు నేమి దోఁచ కపు డాదేవాదిదేవు న్మహా
జగదీశుం గని భ క్తి మీఱఁగ నమస్కారంబులం జేసి మె

ల్లఁగ మాటాడుచు విస్మయం పడుచు శ్రీలక్ష్మీశ్వరుం బాసి యా
మృగనేత్రల్ సని నాక నాయకుని సామీప్యంబునం జేరఁగన్.

69


క.

వారిం గని పురుహూతుఁడు
నారీమణులార ధరను నరపతితపమున్
వారించితిని గదా యన
నారంభాస్త్రీలు ఖేద మందుచు నపుడున్.

70


సీ.

పలికి రిట్లని నీవు పంపింపఁగాఁ బోయి
        నరపతి యనుచు నానావిధములఁ
దలకొని నృత్తగీతము లెంతఁ జేసిన
        మాదిక్కుఁ జూడక మహిమ మెఱయఁ
దనచెంత విశ్వమోహినిని బుట్టించినాఁ
        డాకాంత కన్న మే మందఱముసు
దక్కువైనందునఁ దగ్గి వచ్చితి మిట్లు
        చిరతరతపము చేసెడు ఘసుండు


తే.

మనుజుఁ డనియుంటి మతఁడు రమావిభుండు
గనుక చలియింపకున్నాఁడు కాముఁ డతని
కదరి చనినాఁడు తత్తపం బతిశయించి
యున్న దిది నిక్క మోపురుహూత యనిన.

71


ఆ.

విని సురేశ్వరుండు విస్మయస్వాంతుఁడై
చక్రి తపముచేయు సరవి మఱచి
యేను జేసి తిప్పు డిటువంటి యపచార
మనుచు హరికి మ్రొక్కి వినుతి చేసె.

72

సీ.

దనుజారి యచ్చట తనమాయచేఁ బుట్టి
        నట్టిశక్తిం జూచి యచలుఁ డగుచుఁ
బలికె నిట్లని నీవు ప్రజలచే నిందందుఁ
        బూజలందుచు నుండు పొమ్మటంచుఁ
దా దాని పంపించి తదనంతరంబున
        జిష్ణుండు నేనక చేసినట్టి
పనికిఁ గోపింపక తనయుని జనకుండు
        గాచినకైవడి బ్రోచె నంత


తే.

శాంతమానసుఁడై హేమజలజమునన
పూర్వరీతిని మఱల సంపూర్ణదృష్టి
నిల్పి చలియింప కత్యంతనిష్ఠ మెఱయఁ
దపము సేయుచు నుండె నాదానవారి.

73


తే.

అచటఁ బద్మావతీదేవి హరిని బాసి
నది మొదల్ నిద్ర లేక యాహారమైన
లేక యాచక్రధరునిపై నాసతనరి
వికహతాపజ్వరంబుచే వేగుచుండి.

74


క.

ఇరువదిరెండేం డ్లాయెను
హరి యిచటికి రాకమానె ననుకొని చింతం
బొరలుచు మఱచుచుఁ దెలివిన్
దొరకొని యొకనాఁడు వకుళతో నిట్లనియెన్.

75


మ.

వకుళా వెన్నుఁడు నన్ను శేషగిరిపై వర్తింప నేమించినాఁ
డకలంకంబుగ మాటలాడి చని రాఁ డయ్యె న్మహాచింతచే
నొకనాఁ డొక్కయుగంబుగాఁ గడపలే నోయమ్మ నాప్రాణనా
యకుఁ డాలక్ష్మిని గూడి యెం దరిగినాఁ డంచు న్విచారించుదున్.

76

ఆ.

నిలిచియున్నచోట నిలువ సహింపదు
మఱచియుండు మనిన మఱపు రాదు
కనులఁ గట్టినట్లుగాఁ దోఁచుచున్నాఁడు
మాటలాడఁ డిపుడు మౌనివలెను.

77


సీ.

కనిపించుచున్నాఁడు కలలోన నిత్యంబు
        తపసివేషము దాల్చి దగ్గఱగను
ధ్యానయోగంబును బూనినట్లున్నాఁడు
        జోడులే కొక్కఁ డున్నాఁడు చూడఁ
గమల యాస్వామికిఁ గన్పట్టెనో లేదొ
        నా కనుమానమైనది యిదేమొ
నా కిట్టికల వచ్చె నీకారణం బింత
        కేమని తలఁతు నాయీశుఁ డెఱుఁగు


తే.

ననుచుఁ గన్నీరు నింప నయ్యబ్జముఖిని
జూచి పరితాపపడుచుఁ దా లేచి వకుళ
మాలికాదేవి యాదేవి మ్తసకంబు
నివిరి కన్నీరు దుడుచుచు నెనరు మెఱయ.

78


తే.

పల్కె నిట్లని తల్లి యీపామరంబు
విడువు భయమేమి శ్రీమహావిష్ణునకును
గడగి మునిరీతిఁ గలలోనఁ గానుపించు
ననుచుఁ జింతింప కేది శుభం బలరునమ్మ.

79


క.

అమ్మా సంతోషస్వాం
తమ్మును దనరారుచుండు తద్దయు నేఖే
దమ్మును బూనకు లక్ష్మిని
నెమ్మదిఁ దోడ్కొనుచు నిటకు నెఱి హరి వచ్చున్.

80

సీ.

అని వకుళాదేవి యచట పద్మావతి
        నాదరింపుచునుండె నంత లక్ష్మి
కపిలాశ్రమంబులోఁ గన్పట్టఁ బద్మావ
        తీదేవి చింతఁ దాఁ దెలిసి చక్రి
తలఁచి నాకై మేటితపము సేయఁగ నేల
        యాకాంత కొండపై నడల నేల
యని చింత సేయుచు నందుండు కపిలము
        నీశ్వరు నీక్షించి యిట్టు లనియె


తే.

మౌని పద్మావతిం బెండ్లి మాధవుండు
చేసుకొని దాని విడనాడి చెలఁగి నన్నుఁ
గూర్చి తప మొనరించుచుఁ గొంకుమాని
యుండువాఁ డేమి సేయుదు యోగివర్య.

81


వ.

అనిన విని యమ్మునీశ్వరుం డిట్లనియె.

82


క.

హరియురమున వసియింపక
సిరి నీ వపు డలుగ నేల చిత్రముగద! యా
సరవిం జెప్పుము విని నీ
కరయఁగ నంతయును జెప్పె దంబుజనయనా.

83


క.

అని కపిలుం డపు డడుగఁగ
విని శ్రీసతి యిట్టులనియె వెన్నుని యురమం
దొనరఁగ నే నుండఁగ భృగు
ముని హరియురమందుఁ దన్నె మూఢాత్ముండై.

84


క.

పరుఁడగు పుర్షునిపాదం
బరుదుగఁ దాఁకిన యురంబునందుండిన నా

తిరమగు పాతివ్రత్యము
కరముగఁ జెడునంచు దవ్వుగా నేగి తొగిన్.

85


చ.

అన విని మౌని యిట్లనియె నాభృగుఁ డెవ్వఁడు నీసుతుండు మున్
గనినకుమారుఁ డన్యుఁ డనఁగాఁ దగ దెట్టులటన్న వాఁడు నీ
మనుమఁడు పుత్త్రతుల్యుఁ డనుమానము నుంచకు మాత్మలో మఱిన్
దనుజవిరోధి యీసరణి డాఁచక చెప్పెనొ లేదొ మానినీ.

86


చ.

అనవుడు లక్ష్మి యిట్లనియె నంబుజనాభుఁడు నాకు మున్ను చె
ప్పినవిధ మీవు చెప్పితిని భేదము లేదిఁక నించుకేని యం
చనఁగ మునీంద్రుఁ డిట్లనియె నాతనిబాసి ప్రియంబు మాని నీ
వనువుగ వచ్చు టేల యపు డాకరవీరపురంబు చేరఁగన్.

87


క.

అని కపిలుఁడు వల్కఁగ విని
వనజాలయ చింతనొంది వారక యపు డా
ఘనయోగీంద్రుని గనుఁగొని
వినయంబును మెఱయ ననియె విధి దూఱు చొగిన్.

88


క.

ఆవిప్రుం డతిగర్వము
తో విష్ణుని దన్నినట్టి దుఃఖముచే నా
శ్రీవక్షము నెడఁబాసితిఁ
బోవలె నని తలఁచి తపుడు పుణ్యాంబునిధీ.

89


ఉ.

నావుడు నవ్వుకొంచు మునినాయకుఁ డిట్లనియెం గ్రమంబుగా
నీవిభుఁ డొప్పినట్టిపని నీమది కొప్పక యుండవచ్చునే
నీవు పతివ్రతామణివి నీమదిఁ దోచనిధర్మ మున్నదే
శ్రీవనితాలలామ హరిచిత్త మెఱుంగక యిట్లొనర్తువే.

90

సీ.

సిరి నీవు తపములు చేసి యాశ్రీస్వామి
        యురమందు వసియించి యుండి భృగుని
యందు నేరం బిడి యలిగివోవుట నీకుఁ
        దగునె భృగుం డేమి తప్పు చేసె
మూఁడుమూర్తులగుణములు పరీక్షించుట
        కై మును లంపఁగ నజుని జేరి
యతనిరజోగుణం బట పరీక్షించి శం
        కరునితమోగుణం బరసి యంత


తే.

హరిమహాసత్వగుణము బ్రహ్మాదులకును
దెలియఁజేసెడికొఱకుఁ దా నెలమిభక్తి
నుంచికొని తన్నినాఁడు గర్వించి తన్నె
ననుచుఁ బల్కకు మునిభావ మరయకుండ.

91


సీ.

స్వల్పదోషములకు జలజజుండును రుద్రుఁ
        డలిగిన యాదోష మతిశయముగఁ
దాఁ జేసి చక్రి యందఱచేత మెప్పింప
        వలె నంచుఁ దన్నినవాఁడ గాని
కోపంబు మదినుంచుకొని తన్నలేదు గా
        వున వెన్నుఁ డాపని కనుమతించి
యతని గొప్పగ నెంచి యంపించె నాహరి
        యందు నాభృగుమునియందుఁ దప్పు


తే.

లుంచి హరి నెడఁబాసిపోవుటను నీద
తప్పు గొప్పదిగాన నింతటివిరోధ
మీవు చేయంగరాదు శ్రీదేవుఁ డచట
నిలువ కప్పుడ వేంకటాచలము చేరి.

92

తే.

అచటఁ గొన్నాళ్లు కష్టంబు లనుభవించి
నట్ల నటియించి పిదప నయ్యబ్జముఖిని
ప్రేమ మీఱఁగ నీక్షించి పెండ్లియాడె
నతని కెందున్నఁ గొదువలే దంబుజాక్షి.

93


క.

హరి కరుణామృతసింధుఁడు
సరవిగ నిను బిలువవచ్చు సంతసముగ నీ
వరుగుము తడయక యాకరి
వరదుని వంచించి యిటకు వచ్చుట తగునే.

94


చ.

పరమపతివ్రతామణివి భర్తకుఁ జిక్కులు పెట్టి యిమ్మెయిన్
ధరణిని వేడ్క బాలకులు డాఁగురుమూతల నాఁడురీతిగాఁ
దిరుగుచు నుండుచందము పతివ్రత కొప్పునె యెందునైన నీ
వరయనినీతులుం గలవె హా యిది యేమి విచిత్ర మంగనా.

95


సీ.

వనితా ద్వివింశతివత్సరంబులనుండి
        తలజడ ల్గట్టఁగఁ దపసి యగుచు
నాహారనిద్రాసుఖాసక్తులను మాని
        నీకొఱకై సర్వలోకకర్త
మనుజుఁడై నీనామమంత్రజపంబును
        జేయుచున్నాఁడు సుస్థిరముగాను
నీవు మ త్రాధీనవై విష్ణుదేవుని
        జేరఁగాఁ దగు నిది సిద్ధ మెలమి


తే.

నింక నీ వేడ డాఁగెద విపుడ లేచి
యంబుజాక్షుఁడు నాటియున్నట్టి పద్మ
నాళపథమున నరిగి నీనాయకుండు
దృష్టినిడినట్టి కమలాన శ్రీకరముగ.

96

ఆ.

నిలిచి యచట నుండు నీరజాసనముఖ్యు
లటకు వత్తు రప్పు డందఱెఱుఁగ
వనిత నీవు చక్రి వక్షస్స్థలమునందుఁ
జేరియుండు భూప్రసిద్ధముగను.

97


క.

అని కపిలుం డాప్తముగా
వినిపించిన విమలతరవివేకోక్తుల కా
వనధిజ సంతోషించుచు
మన మలరఁగ నిట్టులనియె మౌనీంద్రునితోన్.

98


సీ.

నీవు చెప్పినమీఁద నావలనం దప్పు
        గలదని తోఁచె నిక్కంబుగాను
నే నేమి సేయుదు నానాఁటికిం గాల
        గతు లీవిరోధంబు గలుగఁజేసె
నటుగాన నాస్వామి కమితచింతను గల్గఁ
        జేసితి నిఁకమీఁద సిగ్గులేక
నేను వక్షమునందు నిలువఁబోయినఁ జక్రి
        నవ్వఁడే భృగు నెంచి నయముగదుర


తే.

కాన సంకోచమైనది కాయ మిచట
నుంచి నే నర్ధకళతోడ నురుతపంబు
చేసి పతి కపచారంబు చేసినట్టి
పాపమును నీగవలయు నోపావనాత్మ.

99


క.

ఈదేహముతో నపకృతి
నాదేవుని కాచరించినందున నిపుడే
యీడేహము హరియెదపై
నాదరముగ నిల్పనొల్లనయ్య మహాత్మా.

100

ఉ.

కావున నవ్యదేహమును గైకొని వెన్నుఁడు పూజసేయురా
జీవములోన నుండి హరి చేరి యురస్స్థలమందు నిల్చెదన్
నీవిధి సమ్మతించుము మునిప్రవరా యని సన్నుతింప న
ద్దేవిముఖంబు దివ్యతరదృష్టిని జూచి మనంబులోపలన్.

101


సీ.

తలఁచె నీరీతిగఁ దాపసశ్రేష్ఠుండు
        తెఱవ దేహంబు ప్రత్యేకపూజ
లంగు కారణముండు ననికొంచు నిట్లనె
        దేవీ యిందుండుము దిరము తపము
చేయుచునుండును చెలఁగి పద్మసరోవ
        రప్రాంతమునకు నిర్ణయముగాను
జని పాంచరాత్రపూజల నందుఁ గొనుచుండు
        మందుపై నీచిత్తమందుఁ దలఁచి


తే.

నట్లనే చేయుమని లక్ష్మి కానతిచ్చి
మఱల నిట్లనియెను లోకమాత నీవు
హరికి నిత్యానపాయని వగుచుఁ జక్రి
యెన్ని యవతారముల నెత్తుచున్న నీవు.

102


క.

అన్ని శరీరము లమరం
జెన్నుగ ధరియించి విభుని జెలఁగుచుఁ గీర్తిం
గన్నట్టి నీప్రభావము
మున్నెఱుఁగుదు నేను విశ్వమోహిని ధరపై.

103


క.

నీవెత్తిన దేహంబులు
నావెన్నుం డెత్తినట్టి యనతారము లిం
గా వేయుతలల శేషుని
కావనజజ శంకరులకు నలవె గణింపన్.

104

క.

మీ రాదిమదంపతు లై
భూరిజగత్త్రయము నిట్లు పుట్టించినవా
రారయ నిపు డెడఁబాయను
గారణ మున్నందువలనఁ గార్యము గల్గెన్.

105


క.

వేంకటగిరిపై మీ రిపు
డంకితముగ నుండవలసినందున నాఁ డా
శంక మనంబునఁ బొడమెను
బంకజముఖి నీకు భేదభావము గలదే.

106


క.

నిను నేఁ దప్పులు పట్టితి
నని కోపము సేయవలవ దాప్తుఁడ నై నా
మనమునఁ దోఁచిన యర్థము
వినుపించితిఁ గూర్మి చేత విమలేందుముఖీ.

107


ఆ.

అనఁగ లక్ష్మి యిట్టు లనియె నోమునినాథ
నీవు చెప్పినందుచే విరోధ
మడఁగె నిటకు వచ్చినప్పటి నాభావ
మిపుడు విన్నవింతు నెట్టు లనిన.

108


క.

అల పద్మావతి చక్రిని
గలసి మెలంగుచును వేడ్కగా నుండఁగ నా
జలజాక్షునివక్షముపై
నెలమిని నే నిల్చియుందు నెట్లన్న నొగిన్.

109


తే.

తలఁచి హరి నిన్నుఁ గరుణతోఁ బిలువవచ్చు
నపుడు వంచించి వచ్చి నీయాశ్రమంబు
నందుఁ జేరితి ననగ సంయమివరుండు
చిఱునగవు నవ్వి లక్ష్మి నీక్షించి పలికె.

110

తే.

వినుము విష్ణుండు కృష్ణుఁడై వేలసంఖ్య
లైన కాంతల చేఁబట్టి యందఱకును
నన్నిరూపములై గూడునపుడు నీవు
శౌరి నెడఁబాసి యుంటివి చంద్రవదన.

111


క.

మాయాశ్రమము పవిత్రము
చేయుట కిటు వచ్చితివి విశేషం బయ్యెన్
నీయాత్మేశ్వరు నిఁక నెడఁ
బాయక శేషాచలంబుపై నుండు సిరీ.

112


క.

అని యివ్విధమునఁ జెప్పఁగ
విని సిరి యాకులగురుని వీడ్కొని వేడ్కం
దనయోగమహామహిమం
బును బెంచుచు లేచి లోకపూజ్యతకొఱకై.

113


సీ.

పూర్వాంగమునకుఁ దపోనిష్ఠఁ బుట్టించి
        యందుంచి దివ్యదేహంబు దాను
బ్రత్యేకముగఁ దాల్చి పద్మనాళంబునఁ
        జొచ్చి యాదారిని వచ్చివచ్చి
పైన వెల్గుచునుండు పద్మకర్ణికయందుఁ
        జేరి సుఖాసనాసీన యగుచుఁ
గ్రొక్కాఱుమెఱపులు గుమిగూడి విగ్రహం
        బై నిల్చినట్టు లయ్యబ్జమందు


తే.

శ్రీరమాదేవి యున్న నీక్షించి విష్ణు
దేవుఁ డానందజలధిలోఁ దేలి సిరిని
జూడ నాలేమ హరిమోముఁ జూచి సిగ్గు
చేతఁ బల్కక తలవాంచి చింతనొంది.

114

సీ.

తనమదిలోఁ దాన తలఁచె నిట్లని లక్ష్మి
        నాకతంబున నిందు నావిభుండు
తపసియై ఘనజటాధారియై తా నిరా
        హారియై భోగంబు లన్ని విడచి
యీరీతిగానుండు వైరాగ్యవిగ్రహం
        బిటుచూడవలసె నింకేమి సేతు
ననుచుఁ జింతింపఁగ నాలక్ష్మిభావంబు
        భావించి విలసితాభరణములను


తే.

గనకచేలము శంఖచక్రములఁ దాల్చి
నీలమేఘనిభాంగుఁడై నిల్చియున్న
హరిని శ్రీదేవి చాల మోహమునఁ జూచు
చుండఁగాఁ జక్రి తలవాంచి యూరకుండె.

115


చ.

సిరి తను జూచుచున్నపుడు శీర్షము నేలకు వంచి లజ్జతో
నరమరఁ జేయుచున్న పతి నంబుధికన్యక చూచి సిగ్గునన్
మఱల శిరంబు వంచి యనుమానమునం దను జూడకుండఁగా
హరి కమలాలయాననము నప్పుడు మోహముమీఱఁ జూడఁగన్.

116


క.

కందర్పుడు మదిని భయం
బొందక సిరి నెదకుఁ బిలువకున్నాఁడని గో
విందుని మదిలోఁ జొరఁబడి
సందడి సేయుచును బుష్పశరముల నేసెన్.

117


సీ.

అప్పు డాగోవిందుఁ డళికియు నళుకక
        ధీరుఁడై శ్రీరమాదేవి తొలుత

దనుఁ జూచి మాటాడినను దాను మాటాడ
        వలె నంచు శిరమును వాంచి యుండె
హరి పిల్చినపుడు మాటాడె నంచును లక్ష్మి
        కమలంబుపై నిల్చి కదలకుండె
బ్రహ్మరుద్రాదు లాభావము ల్భావించి
        తమవాహనము లెక్కి తరలివచ్చి


తే.

రమ్యతరమైన పద్మసరస్సుచెంతఁ
జేరి శుభవాద్యములను ఘోషింపఁజేసి
పుష్పవర్షము గురియించి పొగడి వారి
కిర్వురకు భక్తితో మ్రొక్కి యిట్టు లనిరి.

118


దండకము.

శ్రీమత్పరంధామ జీవాంచితస్తోమ శ్రీమానినీలోల
శృంగారసల్లీల కందర్పలావణ్య కంజోద్భవాగణ్య సాద్గుణ్య
సంపన్న సంరక్షితాపన్న సత్యవ్రతాచార సాధువ్రజోద్ధార
సారాంబుదశ్యామ సంపూర్ణసత్కామ వేదాంతసంచార
విశ్వంభరాధార శ్రీవేంకటాద్రీశ సచ్ఛిత్ప్రకాశా పరా
కాశలోకేశ వాగీశ గౌరీశ నాకేశ వంద్యాంఘ్రిపద్మద్వయా
నిత్య సత్యాద్వయా సద్దయాసాంద్రయోగీంద్ర హృత్పద్మ
భంగా శుభాంగా సుచారిత్ర మిత్రాబ్జనేత్రా ధరిత్రీకళత్రా
మహోల్లాసభక్తప్రియా శ్రీనివాసా మమున్ సత్కృపం
జూడు మోతండ్రి తఱ్గొండవాసా నృసింహా సదా శ్రీనమస్తే
నమస్తే నమస్తే నమః.

119


వ.

అని మ్రొక్కుచు వినుతించి యిట్లనిరి.

120


సీ.

క్షీరసాగరజాత చిత్తజాతునిమాత
        ప్రథితగుణోపేత భాగ్యదాత

అమృతాంశుసోదరి యార్తిదోషవిదారి
        నవ్యసుందరి సదానందలహరి
భక్తసజ్జనసాల పాపవనానల
        విహితాలవాల సద్వినయశీల
కనకపద్మాలయ కవివర్యగణగేయ
        విబుధనికాయ సద్విజయనిలయ


తే.

లక్ష్మి నీస్వామి వక్షస్స్థలంబునందుఁ
జేరి శేషాద్రిపై భూప్రసిద్ధముగను
వెలసి మామీఁద సత్కృప నిలుపవలయు
ననుచుఁ బ్రార్థించి వారిట్టు లనిరి మఱల.

121


సీ.

పరఁగఁ గార్తికశుద్ధపంచమీభృగువార
        ముత్తరాషాఢసంయుతదినంబు
చక్రివక్షమునందు సంతసంబునఁ జేర
        వలె మైత్రతారగ వఱలునాఁడు
తడవేల నంచు విధాత శంకరులును
        విన్నవింపంగ నావిజయలక్ష్మి
పలుకకుండినఁ జూచి బ్రహ్మదేవుఁడు భృగు
        సంయమీంద్రుని కనుసైగఁ జేసె


తే.

నపుడు భృగుముని సిరిపాలి కరిగి మ్రొక్కి
మాతృదేవత నాతప్పు మఱచి యిప్పు
డైన నే నీకుఁ బుత్రుండనంచు నెంచి
హరియురంబునఁ జేరు మాయమ్మ యనుచు.

122


క.

బహువిధముల వినుతింపఁగ
సహజజ్ఞానమున నధికసంతసమున శ్రీ

మహిళామణి భృగుమౌనిని
విహితంబుగ నాదరించి వేడ్కం గనియెన్.

123


క.

ముని నీదృఢతరభక్తికి
ననుపమధైర్యముకు మెచ్చి తల సత్వగుణుం
డనఁదగు నాదేవునిపై
ననుమానము నొంది దూర మరిగితి నయ్యా.

124


సీ.

నారజోగుణమున కారీతి కాఁగల
        గతి జతగూడిన కారణమునఁ
బ్రాణేశు నెడఁబాసి పరదేశమున నుండు
        టొక్కటి విభునిచే నుగ్రతపము
చేయించు టొక్కటి సిద్ధించె నందుచేఁ
        గాల మెంతటివారు గడుపలేరు
నీతప్పుగా దది నాతప్పుగా దది
        కపటనాటకసూత్రకరధరుండు


తే.

నైన యాచక్రికార్యంబు లన్ని తలఁప
నతనిపను లన్ని చూడఁగ నతని కెఱుక
యనుచు భృగుమునితో నని యను ముదమున
మహితుఁడౌహరిపాదపద్మములయంద.

125


వ.

దృష్టి నిల్పి భక్తి తుఱంగలింపఁ జేయుచునుండ.

126


క.

పుత్తడిబొమ్మవిధమ్మున
నత్తన్వి సువర్ణపద్మమం దుండి విభుం
డెత్తి యురంబున నిడుకొను
నిత్తఱి నని తలఁచి కదల కిందిర యుండెన్.

127

చ.

వనజజ శంభులిద్దఱును వార్ధితనూభవమోము చూచి త
న్మనమున నుండునట్టి యనుమానము తాము గ్రహించి పద్మలో
చనునకు మ్రొక్కి యిట్లనిరి సాగరకన్యక నెత్తి వక్షమం
దొనరఁగ నుంచుకొమ్ము హరి యోజగదీశ యటంచుఁ బల్కఁగన్.

128


చ.

విని హరి నన్వి యిట్లనియె వింతగఁ జూచుచు నుండనేల న
వ్వనధిజ కెల్లకాలము నివాసముగాఁ దగినట్టి నాయురం
బున నిఁకనైన నిల్వుమని పొందుగఁ జెప్పుడు మీర లిప్పు డ
న్నను విధి రుద్రులిద్దఱు మనంబున సంశయ మొంది తాల్మితోన్.

129


తే.

పలికి రిట్లని దేవి నీప్రాణవిభుని
పక్షమునఁ జేరి యుండఁగ వలయు నిపుడు
మంచిలగ్నంబు గనుక నెమ్మదిగఁ జేరు
నునఁగ నంభోధికన్య ప్రియంబు మెఱసి.

130


సీ.

ఘల్లుఘల్లని కాళ్లగజ్జ లందెలు మ్రోయ
        మొలనూలు గజ్జె లిమ్ముగను మెఱయఁ
జెలువారు పసిఁడియంచులనొప్పు తెల్లని
        చీర నద్దపుఁగాంతి చెన్ను మీఱ
రహిని చందురుకావి రవికెను బంగరు
        గిండ్లి భంగిగను బాలిండ్లు తనరఁ
జారుకొప్పునఁ బూలసరులు సొంపును జూప
        ముంగురుల్ నుదుటను మురువుఁ దెల్పఁ


తే.

గర్ణకంఠాభరణకరకంకణములు
వరశిరోభూషణంబులు సురుచు లెసఁగ
మందహాసంబు సేయుచు మహితవినయ
ధన మొసంగుచుఁ జూచుచుఁ దనువు మెఱయ.

131

సీ.

భాసుర నాసికాభరణంబుతోఁ గూడి
        బింబాధరముకాంతి పిక్కటిల్లఁ
దీరగు కస్తూరితిలకంబుతోఁ గూడి
        నిటలతటద్యుతుల్ నివ్వటిల్ల
నెలవంక బొమలును నేత్రాంజనము సరి
        గా సొగ పై నీలకళల నీనఁ
బరిమళగంధలేపనముతో నెనసి స
        త్కుసుమసౌరభము దిక్కులను నెఱయ


తే.

హంసగతి నొప్పు నుదధిదుగ్ధాబ్ధినుండి
వెడలి మునువచ్చి హరి చేరు విధముగాను
రమ్యతరమైన పద్మసరస్సు వెడలి
శ్రీరమాసతి పతిచెంతఁ జేరి నిలచి.

132


క.

మును తనకు నివాసంబై
తనరెడు హరి యురమునందుఁ దనకరములఁ జు
దన మలది మోహముం దగ
మనమున భక్తియు నెసంగ మాన్యత మెఱయన్.

133


సీ.

తులసీదళంబులు దూర్వాంకురంబులు
        మల్లెపూవులును జేమంతిపూలు
మొల్లలుతోఁ గడు మోదంబు దనరు పూ
        దండ యొక్కటిఁ గట్టి తనివిఁ దీరఁ
గరములతో నెత్తి కంకణంబులు మ్రోయ
        హరికంఠమం దుంచి యచట నిలిచి
యున్న లక్ష్మిం జూచి మన్ననఁజేసి తా
        హస్తంబునంబట్టి యల యురమునఁ

తే.

జక్రధరుఁ డుంచుకొనియె నాసమయమునను
వారిశిరములపైఁ బుష్పవర్షములను
దొడరి గురియించి దేవదుందుభులు మొరయఁ
జేసి హరిచెంత జిష్ణుఁడు చేరి మ్రొక్కె.

134


సీ.

ఆడిరి రంభాదు లంబరంబున నిల్చి
        పాడిరి గంధర్వపతులు సతులు
తుంబురునారదాదులు వీణ మీటి గా
        నములు చేసిరి కడునయము మెఱసి
కశ్యపాదిమునీంద్రఘనులు వేదాంతర
        సూక్తులఁ బొగడిరి భక్తవరులు
మఱి గొనియాడిరి మాన్యతగా గిరి
        జాసరస్వతు లొగి భాసురముగ


తే.

మంగళారతు లిచ్చిరి మంగళమని
శంకరుండును బ్రహ్మయు సదమలాత్ము
లగుచు సేసలు చల్లిరి యమరవరులు
కీర్తిఁ బ్రకటించు చెలమి మ్రొక్కిరి దొడంగి.

135


వ.

అప్పుడు విష్ణుం డానందసుధాంబుధి నోలలాడుచు నిజరథంబు
నెక్కి శ్రీకాంతతో శ్రీవేంకటాచలారోహణంబు సేయుచుండె,
నాసమయంబున బ్రహ్మేంద్రాదు లాలక్ష్మి యుదయించిన
పద్మసరస్సునం దీకార్తీకశుద్ధపంచమిదినంబున జనులు
స్నానంబు చేసిరేని వారలకు లక్ష్మీకటాక్షంబు గల్గు నని
తత్తీర్థంబునం దాము మునింగి యాస్వామి వెనువెంట నరిగిరి.
శ్రీస్వామి వరాహస్వామియనుమతంబుస విష్వక్సేనాదిపరమ
భాగవతు లలంకరించియున్న నిజనివాసము చేరె నప్పుడు

పద్మావతి సకలభూషణాంబరాలంకృతయై తదానందనిల
యంబునం బ్రవేశించి హరికి సిరికి నమస్కరించి, నంతఁ బద్మా
లయ పద్మావతిని దీవించి చెంత నుంచుకొని వకుళను విశ్వా
సంబుఁ జూపి యిచ్ఛామాత్రంబున సకలపదార్థంబుల నాకర్షించి
బ్రహ్మాదులకు విందు చేయించి సువస్త్రభూషణాదుల నొసంగి
సంతుష్టులం జేసి మునులను గౌరవింప, నందఱు తమ నివాసం
బుల కరిగిరి, వెన్నడి వేంకటేశ్వరుండు లక్ష్మీపద్మావతుల
తోడం గూడి సుఖంబుండి యొక్కనాఁడు వినోదంబుగ లక్ష్మిం
జూచి యిట్లనియె.

136


తే.

శ్రీరమాదేని నీవు వచ్చినకతమున
నాకు సంతోషమయ్యె నానాఁడు ధనదు
చేతఁ దీసిన ఋణము దీర్చెడునుపాయ
మేమి నా కిప్పు డెఱిఁగించు మిందువదన.

137


క.

అనుచు వినోదంబుగ నా
వనజాక్షుం డడుగ నపుడు వనజాలయ యి
ట్లనె ఋణము సేయునప్పుడు
నను నడిగితివే యటంచు నగి మఱి పలికెన్.

138


మ.

అనఘా పెండ్లికి నేను వచ్చినపు డిం దర్థంబు లేదంచుఁ జె
ప్పినఁ ద ప్పే మటు చెప్పిన న్ధనము నేఁ బ్రే మారఁగా నియ్యనే
నను నీ వప్పుడు తేరఁ జేసి ధనదు న్నాపెండ్లి కీ వర్థ మి
మ్మని యాచించి ఋణంబు సేయుపని కేమందున్ జగన్నాయకా.

139


క.

అపు డఱమఱఁ జేయఁగఁ గద
కపటాత్ముఁడ ననుచుఁ దెలిసి కరవీరపురం

బుపశమముం జేరితి నొగిఁ
జపలతఁ బాతాళమునకుఁ జనుట మహాత్మా.

140


ఉ.

నావుడు వెన్నుఁ డిట్లనియె న న్నెడఁబాసినజాలిచేత నే
నీ వతిచింత నొందఁగను నెమ్మి ధనంబును గూర్చి పెండ్లికిం
గావలెనంచు ని న్నడిగి కైకొనలేదు కడంగి యోరమా
దేవి మఱద్ది తప్పనుచుఁ దేరగఁ జూడకు మింకఁ బల్కఁగన్.

141


శా.

ఆమాటల్ విని లక్ష్మి యిట్లనియె నాఁ డారీతి నయ్యెంగదా
యామీఁదం దడవైన వడ్డి బరువై యాపత్తురా దేమి నీ
కీమర్యాదను నిల్పనుండిన ధనం బీవేళ నే నిచ్చెదన్
స్వామీ వానిఋణంబు దీర్చు మనినన్ సంతోషసంయుక్తుఁడై.

142


సీ.

హరి యిట్టు లనె నీ మహామహిమంబు నే
        నెఱుఁగనె మును క్రొత్త యేమి తలఁప
నిపుడు కుబేరుని కీనర్థ మీ నేల
        నానాఁటి వడ్డి నిర్ణయముగాను
గ్రమముగ నిచ్చుచుఁ గలియుగాంతంబునం
        దంతయుఁ దీర్చి విశ్రాంతి నొంది
వైకుంఠపురిఁ జేరవచ్చునంతకు శేష
        శైలమం దుండి భూజనులనెల్లఁ


తే.

బాలనము చేసి వారిపాపముల నింకఁ
బరిహరింపుచు రక్షింపవలయు నెలమిఁ
గాన నయ్యప్పు తలఁప శీఘ్రంబ యీయ
వల ద దెట్లన్న విను ప్రేమ వఱల నిపుడు.

143


సీ.

కలియుగంబునఁ బాపకర్మంబు లొనరించు
        ప్రజకు రోగాది తాపత్రయములు

కల్గఁగ వెఱచి తత్కాలంబుగా నన్నుఁ
        బేర్కొంచు కడు మొరల్ వెట్టునపుడు
వారియాపదలు నివారించి బ్రోవక
        నే నూరకుండుట నీతి గాదు
గనుక యానరుల దుష్కర్మము ల్వారి ద్ర
        వ్యంబుపై నాకర్షణంబు చేసి


తే.

వచ్చు నాపదలను దీర్చి వారిధనము
నేను గొండకుఁ దెప్పించి నిస్పృహుండ
నగుచుఁ దత్పాపరూప మైనట్టిధనము
మూఢజనులకు నిప్పింతు మొనసి వింటె.

144


తే.

ఎలమిఁ బుణ్యాత్ము లైనవా రిచ్చినట్టి
ధనమునం గొంతఁ గైకొని ధనధునకును
గొంత వడ్డికిఁ జెల్లించి వింతలీల
లెసఁగఁ జేయుట మేలంచం బొసఁగఁ బల్కి.

145


సీ.

మఱల నిట్లనె నో రమాదేవి ద్రవ్యంబు
        నెల్లవారికిని నీ విచ్చుచుండు
మాద్రవ్య మిచటికి నాకర్షణముచేసి
        సుజన దుర్జనుల కిచ్చుచుఁ గ్రమంబు
గాఁ బ్రభుత్వము నిందుఁ గడపుచు నీకలి
        కాలంబు మౌనంబులీల నడుప
వలయుఁ గావున ధనపతికి న ప్పిప్పుడ
        తీర్చఁగూడదని నేఁ దిరముగాను


తే.

వ్రాసియిచ్చితిఁ గడువిడి పత్ర మలర
దాని నిప్పుడఁ జెఱుపంగఁ దలఁప నేల

మఱియు మొదలీయనేల నెమ్మదిగ ననఁగ
విని రమాదేవి హరిఁ జూచి వెలయఁ బల్కె.

146


క.

దేవా మీచిత్తమునం
దీవిధమునఁ దలఁచియుండి యీఋణ మిఁక నే
నేవిధమునఁ దీరుతు నని
యావేళ వినోదలీల నడిగిన దేలా.

147


క.

అనుచు రమాసతి యడుగఁగ
విని హరి యిట్లనియె నీవు విత్తము ప్రజకున్
ఘనముగ నిచ్చిన నది గై
కొనియెద నని నిన్ను వేడుకొంటిని లక్ష్మీ.

148


వ.

అనిన విని లక్ష్మీదేవి యిట్లనియె.

149


క.

మన మలరఁగ నే ద్రవ్యం
బనఘా నీ కిత్తుఁ దీర్చుమా ఋణ మనినన్
వినక పరస్పరముగ భూ
జనులకు నే నియ్య ననెడి సరణిం జెపుమా.

150


సీ.

అన విని మఱల నిట్లనియె నో ప్రాణేశ
        కలియందు నరు లెఫ్డు గఠినహృదయు
లగుచు దానములు సేయరు గాన జన్మజ
        న్మాంతరంబులను జంద్రాంశ నొంది
నశియింతు రటువంటి నరులకు ధనము నీ
        వీయు మటన్న నే నీయలేను
వరద నీ కెంతద్రవ్యంబైన నిచ్చెద
        నీవె వారల కిమ్ము నెనరు మించి

తే.

యనఁగ హరి యిట్టు లనియె మోక్షార్హులైన
వారలకు ముక్తి కోరికల్ కోరి పుణ్య
కర్మములు సేయువారి కాకర్మఫలము
లిచ్చి రక్షించు నదియ నాకిష్ట మతివ.

151


సీ.

కలుములచెలి నీవు గావునఁ గలుము లి
        చ్చెడుపని నీవంతు చెలఁగి వారి
మెండు రూకల నాక్రమించి యాపదల ని
        వారించి సంతానవరము లొసఁగి
సంతసించుటకు నా వంతని పల్కఁగ
        హరిని వీక్షించి యి ట్లనియె లక్ష్మి
మనుజులు దానధర్మపరోపకారముల్
        చేయరు వారికి సిరుల నొసంగు


తే.

టెల్ల వా రది దెచ్చి నీ కిచ్చు టెల్ల
ధనము గల్గఁగనే దంభదర్పలోభ
ములను బెంచుదు రాద్రవ్యమును నిజముగ
నీకు నొగిఁ దెచ్చి యిత్తురే నీరజాక్ష.

152


వ.

అనిన విని హరి శ్రీలక్ష్మిం జూచి నీవు చెప్పినయట్ల కలియుగము
నందుఁ బుట్టిన నరులట్ల లోభు లగుటకు సందియంబు లేదు
నిక్కంబగు నందొక్కయుక్తి గల దది యెట్లంటివేని జనులు
పాపంబులు సేయుదురు. దాన రోగాది బాధల ననుభవిం
తురు. అట్టి కాలంబున నన్నుఁ దలంతురు. అపు డవ్వారి
స్వప్నంబులం బ్రత్యక్షంబై వారి కలిమికొలఁదిగ ముడుపులు
గట్టించి తద్విత్తంబుసకు నధికంబుగ వడ్డి పెచ్చు పెఱుగనిచ్చి
ప్రతివత్సరంబున వారిని దండించి యీ వేంకటాద్రికిఁ

దోడ్కొని వచ్చి వారు దెచ్చిన ధనంబు నీక్షించి పుణ్యపాప
విత్తంబుల నేర్పరించి సుజనదుర్జనులకుఁ బంచిపెట్టించి నాకు
సంతర్పణంబు సేయుండని యాచించి వారిచేత నన్నదానం
బులం జేయింపుచు నందున వారి ద్రవ్యాన్నదానంబులు
చేసినవా రగుచుందురు గావున వా రొనర్చిన స్వల్పదానం
బైన నధికంబుగ నెంచి నీవు వారికి ధనధాన్యంబు లిచ్చు
చుండవలయు, నేను వారికి నయభయంబులం జూపి తద్ద్ర
వ్యాన్నంబు లిచ్చటికి చెప్పించి వారిచేత దానంబులు చేయింపు
చుండవలయు నీ వేంకటాద్రియందుఁ జేసిన దానంబులకు
నధికఫలంబుల నిచ్చు నందు నే నీయుక్తి పన్నితి నీయుక్తి
చేయకుండినఁ గలిపుర్షుండు సకలధర్మంబులం జెఱచి ప్రజల
ననేకవిధంబుల బాధించి నరకంబులం ద్రోయించుం గావున
మదంశసంభవులైన జీవుల కలికాలంబులం దీప్రకారంబు
రక్షించుకొఱకు నే నీయద్రియందు నిలిచితి నీవును నాకు
దోడ్పడి మదర్పణంబులు సేయుటకై ప్రజలకు భాగ్యంబుల
నిచ్చుచుండుమని నిన్నుఁ బ్రార్థించి, నీ విప్పుడ కుబేరుని
యప్పు దీర్చితి వేని నే నిందు నిరుద్యోగంబుగ నుండవలయు
న ట్లూరకుండుట ధర్మంబుగాదు గావున నీ విపు డిట్టి యుద్యో
గంబు నా కొసంగుమనిన విని నవ్వి లక్ష్మీదేవి యిట్లనియె.

153


సీ.

ధన్యాత్మ నీతోడ దబ్బ రాడఁగరాదు
        చెప్పెద నిప్పుడ సిద్ధముగను
మహియందు దానధర్మపరోపకారము
        ల్జేసి నీ కర్పణ చేయుచున్న

వారికి ధన ధాన్యవరసంపదల నిత్తు
        నందున లోభపాపాత్ము లైన
నరులధనంబులు నానాఁట నశియింప
        జేయుదు నది వృద్ధి చేయ ననుచు


తే.

హరికి సమ్మతముగఁ జెప్పి నరుల కెల్ల
సంపదల నిచ్చుచుండె నాసమయమునను
సకలజనములు వేంకటాచలము చేర
వచ్చి ధనరాసు లాస్వామి కిచ్చి మ్రొక్కి.

154


వ.

అదియునుంగాక శ్రీనివాసార్పితంబుగ ననేకబ్రహ్మాదులకు
సకలదానంబులు చేసి యిహపరసౌఖ్యంబు లనుభవింపు
చుండి రాశ్రీనివాసుండు సకలజనుల నెలమి రక్షించుచుండె
నని దేవదర్శనుండు చెప్పిన విని సంతసించి క్రమ్మఱ దేవలుం
డిట్లనియె.

155


సీ.

ఘనదేవదర్శనముని శుకాశ్రమమందుఁ
        దపనీయచేలుండు తపము సేయు
నప్పు డాయోగీంద్రుఁ డందుండెనో లేదొ
        యనిన దేవలున కి ట్లనియె నతఁడు
విను విప్ర హరి తపం బొనరింప కట మున్నె
        బ్రహ్మపదానందభరితుఁ డగుచు
శుకయోగిచంద్రుడు సూర్యమండలమున
        జొరఁబడి పో చూచి సూర్యుఁ డతని


తే.

నిల్పి యిట్లని పల్కె నోనిర్మలాత్మ
నీకు గురుఁడైన వ్యాసుఁ డీలోకమునను

నిన్ను వెదకుచునుండఁగ నీవు నింగి
కెగిరివోవుట పాడిగా దెట్టులనిన.

156


క.

నీ వాశ్రమధర్మములను
బోవిడిచి మహావిరక్తిఁ బొందుట తగునే
దేవర్షి పితౄణంబులఁ
బావనమతి వగుచు దీర్చి పై కరుగు మయా.

157


సీ.

ఆదియం దమరంగ వేదముల్ చదివితి
        వందుచే ఋషిఋణం బపుడ తీఱె
సతి నింకఁ జేఁబట్టి సవనముల్ గావించి
        ధీరుఁడవై దీర్చు దేవఋణము
పుణ్యాత్తు లగునట్టి పుత్త్రకులను గాంచి
        పెంచి గ్రక్కున దీర్చు పితృఋణంబు
కొంకక ఋణవిముక్తుండవై జ్ఞానివై
        మహి విరక్తుండ వై మఱల నిటకు


తే.

వచ్చి నామండలము దాఁటి హెచ్చి పైకిఁ
గ్రమముగాఁ బోయి మీదిలోకములు గడచి
పరమపదమును జెందుమో పరమమౌని
యనినఁ జిఱునవ్వు నవ్వి యిట్లనియె శుకుడు.

158


వ.

నీ వాదిత్యుండవు త్రిమూర్త్యాశకుండవు కర్మసాక్షివి జగచ్చ
క్షుండవు భాస్కరుండవు నీచిత్తంబునకుఁ దెలియనియర్థంబు
లే వైన నామనంబునం దోఁచిన యర్థంబు విన్నవించెద నెట్ల
నిన మాతృగర్భంబు సొచ్చి దేహధారియై భూమియందు
నుదయంచిన దినంబు మొదలుకొని యుదయాస్తమయ
వ్యాజంబునఁ బురుషాయువును గాలంబు వంచించి కొంపోవు

చుండును గావున జలబుద్బుదంబున నిత్యంబుగాని దేహంబు
నందుండి చతురాశ్రమంబుల నడపి దేవఋషి పితృఋణం
బులం దీర్చి జ్ఞానవైరాగ్యంబు లభ్యసింపవలయు నంటిరి
వేదోక్తకర్మ మర్యాద యగుం గావున నాచరింపందగు
నైనను దేహం బనిత్యం బైనందున ముముక్షుం డైనవాఁడు
కర్మారణ్యంబునం బ్రవేశింపఁ డనిన శుకుం జూచి సూర్యుఁ
డిట్లనియె.

159


శా.

ఆదిన్ విశ్వము వృద్ధిచేయుటకుఁ బద్మాక్షుండు గల్పింపగా
వేదోక్తాశ్రమధర్మకర్మతతి భూవిఖ్యాతమై యుండగా
గాదంచు న్విడనాడి నీ వెగిరిపోగా వచ్చునే యంచు న
య్యాదిత్యుండు వచింపఁగా శుకుఁడు నెయ్యంబొప్పగా నిట్లనెన్.

160


సీ.

వనజాప్త విను సర్వవర్ణాశ్రమాచార
        ధర్మంబులును మోక్షధర్మములును
మాతండ్రి బోధింప నాతత్వవిజ్ఞాన
        మాత్మయం దుదయించె నపుడ గురుని
గాంచి యిట్లంటి నిక్కంబుగఁ బ్రథమాశ్ర
        మమున నాత్మవివేక మమరఁ గలిగి
నట్టివాఁ డావలి యాశ్రమధర్మముల్
        విడువఁగ వచ్చునో విడువరాదొ


తే.

తేటగా నిశ్చయము నాకుఁ దెలుపుఁ డంచు
నేను బ్రార్థింపఁగాఁ జూచి నెనరుచేతఁ
జెప్పఁజాలక మిథిలేశుఁ జేరి యడుగు
మనఁగ నేఁ బోయి జనకు నట్లడుగ నతఁడు.

161

సీ.

నను జూచి పలికె నో మునివర విజ్ఞాన
        మబ్బుటకై చతురాశ్రమములు
నడిపింపఁగావలె నాటిన జన్మజ
        న్మాంతరవాసన నంటినట్టి
సదమలవిజ్ఞాన ముదయించినప్పు డా
        శ్రమధర్మకర్మముల్ సల్ప కపుడ
పట్టైన స్వస్వరూప పరస్వరూపముల్
        దెలిసి వర్ణాశ్రమాతీతుఁ డగుట


తే.

విహితధర్మం బటంచును వీడుకొల్పె
నది మొద ల్గాఢవైరాగ్యమందుఁ బొంది
నట్టినన్ను గృహస్థుఁడ వగుమటంచు
నింతగా నిందు మీ రానతీయఁదగునె.

162


చ.

అని శుకయోగి వల్క విని యంబుజమిత్రుఁడు నవ్వి యిట్లనెన్
జనకుఁడు జ్ఞానకర్మముల సల్పుచు సర్వసమత్వ మొంది భూ
మిని బరిపాలనం బెపుడు మెచ్చఁగఁ జేయుచు నుండి బిడ్డలన్
గనినటువంటివాఁడు నిను గాఢవిరక్తిని బొందఁ జెప్పినే.

163


సీ.

హరియందు బద్మజుం డజునియందు వసిష్ఠుఁ
        డామునినాథునియందు శక్తి
శక్తియందుం బరాశరుఁ డాఘనునియందు
        వ్యాసుఁ డావ్యాసునియందు నీవు
పుట్టి విరక్తిని బొంది యూరకపోక
        పుణ్యాత్ముఁ డైనట్టి పుత్త్రు నొకని

గాంచి ధరిత్రిపై నెంచవచ్చిన నిన్నుఁ
        బోనిత్తు నందాక పోవఁగూడ


తే.

దంచు సూర్యుండు వల్కఁగ నాశుకుండు
సమ్మతించుచు నిజతనుచ్ఛాయ నొక్క
పుణ్యపుర్షునిగాఁ జేసి బుద్ధి నిచ్చె
నప్పు డా పురుషుండు మహాత్ముఁ డనుచు.

164


చ.

శుకునకుఁ బద్మమిత్రునకు సుస్థిరుఁడై ప్రణమిల్లి భక్తితో
ముకుళితహస్తుఁడై నిలిచి ముందరనుండఁగఁ జూచి సూర్యుఁ డా
శుకమునియోగసిద్ధి కతిచోద్యము నొందుచు సంతసించి తా
నకుటిలచిత్తుఁడై జనితుఁ డైనకుమారుని చూచి యిట్లనెన్.

165


క.

మాయగ శుకమునిదేహ
చ్ఛాయను బుర్షుండ వగుచు జనియించిన నీ
వీయవనీస్థలి నరుదుగ
ఛాయాశుకుఁ డనెడుపేరఁ జరియించు మయా.

166


క.

అని సూర్యుఁ డానతిచ్చిన
నిని ఛాయాశుకుఁడు చాలవినయము మీఱన్
వినుతించి యవల నాశుకుఁ
గనుఁగొని యిట్లనియెఁ జాలగౌరవ మొప్పన్.

167


క.

జనకా నన్ను సృజించిన
పనియే మిపు డానతిచ్చి పంపుఁ డటంచున్
వినయంబున మ్రొక్కినఁ గనుఁ
గొని ఛాయాశుకున కాశుకుం డి ట్లనియెన్.

168

సీ.

పుణ్యాత్మ నీ వింక భూలోకమున కేగి
        శ్రీవేంకటాద్రి దక్షిణముగాను
ముఖ్యమైన సువర్ణముఖరికి నుత్తర
        తటమున వెల్గు సిద్ధస్థలమున
మహిమ నొప్పు మదాశ్రమంబున నీ వుండు
        మదిగాక శ్రీగంగ కరిగి మాకు
దండ్రియైన వేదవ్యాసముని నన్నుఁ
        బేర్కొన్న నపు డతిప్రేమ మీర


తే.

నీవు నారీతిగా నందు నిలిచి పలికి
చెలఁగి వారికి శుశ్రూష చేసి వారి
యనుమతిం బెండ్లియాడి నందనులఁ గాంచి
కులము నభివృద్ధిసేయుము గొప్ప తనరి.

169


తే.

ఇప్పుడు ముందుగ శ్రీకాశి కేగి యచట
నచలభక్తిని బాదరాయణుని గొన్ని
వత్సరంబులు గొలిచి యవ్వల మదాశ్ర
మస్థలంబునఁ జేరు కుమార యనుచు.

170


సీ.

వానికి నియమించి వసుధకుఁ బంపించి
        పంకజాప్తుని గాంచి పల్కె నిట్లు
మార్తాండ నీకృపామహిమచే సుతుఁ డుద
        యించె నన్నింకఁ బోనిమ్ము మనిన
నగి సూర్యుఁ డిట్లనె నాస్వరూపంబగు
        జీవతత్వం బెద్ది చెప్పు మనిన
శుకుఁ డిట్టు లనె జగజ్జ్యోతిస్వరూప నీ
        చిన్మాత్రసత్తు నేఁ జెప్పఁగలనె

తే.

నాకుఁ దోఁచినయంత నిర్ణయముగాను
మద్గురునిసత్కటాక్షసన్మహిమచేత
విన్నవించెద మదిని భావించి యంచుఁ
బద్మబాంధవునకు మ్రొక్కి పలికె గరిమ.

171


వ.

నారాయణపరబ్రహ్మంబను చిద్బిందువువలనఁ బ్రణవస్వరూపం
బైన శబ్దంబు పుట్టి నాశబ్దంబువలన బయలైన నభంబునందు
స్పర్శవలన వాయువు పుట్ట నవ్వాయువు గగససంబంధముచేత
నుష్ణరూపంబగు తేజంబు గలిగె నం దగ్ని జనించె నయ్యగ్ని
యధికంబై ప్రకాశించి తనయందు వ్యాపింపఁగ నాబిందువు
రసాత్మకంబగు సారమును మహాజలముగ సృజించి తేజోరూ
పంబగు నప్పరమాత్మ తా నామహాజలమునందు నిలిచె నది
య హిరణ్యమయంబగు తేజంబై కొంతకాలంబునకు నారికేళ
వృక్షంబులు ఫలంబులు నొందుచందంబున ననేకకోటిబ్రహ్మాం
డంబులలో నొక్కొక్కబీజము వృక్షఫలంబులం దనేక
బీజరూపంబై నిల్చినట్టుగ మూలకారణం బైన హిరణ్మయ
తేజస్సు సూర్యరూపంబై స్థావరజంగమాత్మకంబైన జగత్తును
దనరసాంశమువలన జీవమై పోషింపుచును, తేజాంశమువలన
హరింపుచును వటబీజము భూజలసంబంధముచేత వృక్షా
కృతియై వృక్షములో రసరూపమై నిలిచినట్లు హిరణ్మయ
తేజస్సు సప్తద్వీప సప్తసాగర సప్తకులాచలాధారంబైన
బ్రహ్మాండంబుగఁ బరిణమించి సూర్యరూపంబై నిలిచియున్న
యది. ఆ స్వరూపంబు సకలభూతంబులయందును రసరూప
మైన జీవంబగు నారసమునంద తైలవర్తియందు జ్వాల వెల్గి
నట్ల తెలివి వెలుఁగుచుండు నా తెలివియ తన్నును జెవుల వినిన

శబ్దంబులను జర్మంబువలనం దెలియు స్పర్శంబులను గన్నులవ
లనఁ జూచు రూపంబులను జిహ్వచేత గ్రహించిన రుచులను
ఘ్రాణంబువలన నాఘ్రాణించిన గంధంబులను గర్ణేంద్రియవిష
యంబులైన వచనదానగమనవిసర్జనానందంబులను మనోబుద్ధి
చిత్తాహంకారవిషయంబులైన సంశయనిశ్చయవిచారకర్తృ
త్వంబులను దెలియు నెఱుకయ చిన్మాత్రంబైన స్వస్వరూపం
బగు నింకఁ బరస్వరూపం బెద్దియనిన వ్యష్టిసమష్టిరూపంబు
లైన పిండాం బ్రహ్మాండంబు యందు నేకరూపం బై వ్యష్టి
సమష్టిరూపంబులయందు మేఘమండలమందలి జలము వర్షిం
చిన భూమియందుం గల వాపీకూపతటాకాదులయందు నిలచి
నచందంబున నీశ్వరచైతన్యంబను మేఘజలంబు జరాయుజాం
డజోద్భిజస్వేదజంబు లను జతుర్విధభూతములయందు నిల్చి
యుండుననిన భాస్కరుం డిట్లనియె.

172


తే.

ఆహిరణ్మయతేజ మీయఖిలభూత
వితతులందున నెట్లు ప్రవేశ మగును
మఱల స్వస్థానమున నేక్రమమునఁ జేరు
నాసరణిఁ దెల్పు బాదరాయణకుమార.

173


వ.

అనిన శుకుం డిట్లనియె.

174


సీ.

కమలజాండమును బ్రకాశింపజేయుచు
        రమణీయవిశ్వకారణము నైన
మహితహిరణ్మయమండలం బధికతే .
        జోరసాత్మకమై విశుద్ధ మయ్యె
నందు రసాంశ మాయమృతాంశరూపమౌ
        నది కాలవశమున ననిల మగుచుఁ

దా మేఘ మగుచుఁ జంధ్రరసాత్మకంబైన
        జలముచేఁ బూర్ణమై చల్ల నగుచు


తే.

వర్షధారలు నిండింప వసుధయందు
సస్యములు వృద్ధి బొందు సస్యములయందు
సారతరమైన ఘనజీవసత్తు నిలిచి
ధాన్యమై మర్త్యతతుల కోదనము నగును.

175


వ.

మఱియు దృఢరసమై పశువుల కన్నం బగు వివిధఫల
రూపంబుల నొంది విహంగాదిజంతువుల కన్నంబగు వాయు
రూపంబై సర్పాదుల కన్నంబగు నయ్యన్నంబు తత్తద్భూతం
బులయందుండు జఠరాగ్నివలనం బచనంబై పాలలో
ఘృతంబు పైకిఁ దేలినవిధంబున బిందురూపమై పుర్షులయందు
నిలిచి స్త్రీగర్భంబులం జొచ్చి పిండరూపంబగు తత్పిండంబుల
యందు జరాయుసంబంధమువలన మాతృధాతృసంబంధము
వలన షాణ్మాసంబులు వహ్ని దానియందుఁ బ్రకాశంచుకరణిఁ
జైతన్యంబు దీపించుఁ దదనంతరంబు గాలకర్మపరిపూరితం
బైనతఱి సుదయించు, మఱియు నవ్వర్షజలంబే వృక్షముల
యందు రసాత్మకంబై జీవనంబగు నీయుత్పత్తిప్రకారం బింక
లయప్రకారంబెట్లనిన, వాతపిత్తశ్లేషాదిరోగంబులవలన
భూతంబులు లోఁబడినప్పుడు పల్లముల నిలచిన వర్షజలం
బుల సూర్యకిరణంబులు పీల్చుకరణిఁ గాలస్వరూపమగు
సూర్యుఁడు సర్వభూతంబుల యందలి జీవరసంబుం బీల్చి
వోవునప్పు డారసస్వరూపంబు సూర్యకిరణంబులందు మిళి
తమై వాయుమండలంబున నేకమై గగనమార్గంబునఁ జంధ్ర
మండలంబునం జొచ్చి చంద్రుడు సూర్యునియం దేకీభవించి

నప్పుడు సూర్యునియందుఁ జెందునని మద్గురుం డుపదేశించె
ననిన విని సూర్యుం డిట్లనియె.

176


తే.

దేవరాక్షసముఖుల సుస్థితిలయముల
వరుసగాఁ జెప్పు మనఁగ నవ్యాససుతుఁడు
జలజబాంధవు నీక్షించి సంతసించి
మఱల నిట్లని పల్కె నెమ్మనముగాను.

177


వ.

దేవా వటబీజంబునకు భూసంబంధం బొక్కటి యైనఁ గాని
వ్రీహిపరిణామంబు షాణ్మాసంబులను వటపరిణామంబు సహస్ర
సంవత్సరపర్యంతంబు గల డాప్రకారంబు బ్రహ్మాదిదేవశరీర
ములకును మసుష్యశరీరంబులకును గాలభేదం బున్నయది,
ఆహిరణ్మయతేజస్సత్త్వాంశం బధికంబుగాఁగ నిలావృత
ఖండాదిదేశంబులయందు దేవజాతులు తృప్తియై దీర్ఘా
యుష్మంతులై వర్తింతురు. సామాన్యదేవజాతులకు సుర్మా
వధియు నింద్రాదులకు మన్వంతరావధియు బ్రహ్మాదులకు
బ్రహ్మాండప్రళయావధియుఁ గల్గియుండు నంతటికి నాధారమై
సచ్చిదానందనిత్యపరిపూర్ణుండై వాఙ్మానసాతీతుం డైననారా
యణుండు ప్రకాశించుఁ దత్ప్రకాశంబు నీవ నిశ్చయించి
యుందుసని మఱియు సకలవేదాంతసారనిశ్చితార్థానుభవ
క్రమంబు విన్నవింప విని సూర్యుండు శుకుం జూచి యిట్లనియె.

178


సీ.

ఓ మహామౌనీంద్ర నీమనోదార్ఢ్యంబు
        యోగసిద్ధియుఁ దెలియుటకుఁ జాల
నాక్షేపములు చేసి యడిగితి నన్నిటి
        కన్ని యుత్తరము లీ వనుభవముగఁ

జెప్పితి వందుచేఁ జిత్తంబు రంజిల్లె
        మహితాత్మ నీవు నామండలంబు
లోఁ జొచ్చి వెడలి పైలోకంబులను దాఁటి
        పట్టిపైనుండెడు పరమపదము


తే.

నందుఁ బొందు మటంచు నయ్యబ్జసఖుఁడు
చాల మన్నింపఁగా శుకసంయమీంద్రుఁ
డచలితానందరసమగ్నుఁ డగుచు లేచి
దినకరునిమండలంబు భేదించి వెడలి.

179


వ.

తదనంతరంబున నూర్ధ్వమండలంబుల నూర్ధ్వలోకంబుల
నతిక్రమించి శుకుఁడు నిర్వాణపదంబు నొందె నంత ఛాయా
శుకుండు కాశి చేరి వేదవ్యాసులకు వివిధశుశ్రూషాదులు
చేయుచుండి కొన్నియుగంబుల కాకృష్ణద్వైపాయనుని
యనుమతంబున శుకాశ్రమస్థలంబునందుఁ జేరి వివాహంబు
చేసికొని సంతానంబు వడసె నని దేవదర్శనుండు చెప్పిన విని
దేవలుండు విని యిట్లనియె.

180


తే.

శ్రీరమాదేవి పూర్వశరీరకలిత
యై తపము కపిలాశ్రమమందుఁ జేయు
చుండె నంటివి మఱల నీయుర్విమీఁదఁ
జేరినటువంటికథ నాకుఁ జెప్పుమయ్య.

181


మ.

అని యా దేవలమౌని తా నడుగఁగా నాదిత్యయోగీంద్రుఁ డి
ట్లనె నాదేవి సుశీలయై హృదయమం దాచక్రి నర్చింపుచున్
మన మాస్వామిపదారవిందములపై మగ్నంబు గావించుచున్
దనదేహస్మరణంబు లేక జగముల్ దైత్యారిరూపంబుగన్.

182

క.

భావించుచుఁ గొన్నేండ్లా
శ్రీవనితామణి తపంబు సేయఁగ నపు డీ
శ్రీవేంకటగిరినిలయుం
డావెలఁదిని మెచ్చి తలఁచె నపు డీరీతిన్.

183


సీ.

తనుఁగూర్చి తొలుతన తప మాచరించితి
        నని నన్నుఁ గూర్చి యయ్యాదిలక్ష్మి
పాతాళమందె తపం బాచరించుచు
        నను జిక్కపట్టియున్నది ధరిత్రి
పైకి వచ్చుట కేయుపాయంబు గావింతు
        నని వీరలక్ష్మీహృదబ్జమందు
వెలిగెడితనరూపములను నచ్చట తిరో
        ధాన మొందింపఁగ ధ్యాననిష్ఠఁ


తే.

జలన మొందఁగ నప్పు డాశ్చర్య మొంది
కన్నుఁగవ విప్పి చూచి పంకరుహనాభు
నచటఁ గానక చింతించి యపుడు లేచి
కపిలమునిపాలి కరిగి శ్రీకాంత నిలిచె.

184


క.

అపు డాలక్ష్మిని గనుఁగొని
కపిలమునీంద్రుండు మిగులఁ గరుణం బలికెం
జపలత్వరహిత మగునీ
తప మమలంబై ఫలించెఁ దామరసాక్షీ.

185


క.

ఇఁక నీ విందుండక సని
ప్రకటితశేషాద్రిదిగువఁ బద్మసరసునం
దకుటిలమతివై చేరుము
శుకమునిసుతుఁ డందు నిన్నుఁ జూచి ముదమునన్.

186

సీ.

ఘనపాంచరాత్రప్రకారంబుగా నిన్నుఁ
        బూజించు నచటికే పొమ్మటంచుఁ
బలికి పంపింపఁగఁ బాతాళమందున్న
        శేషుండు లక్ష్మి నీక్షించి మ్రొక్కి
బహురత్నవిలసితాభరణాంబరంబులు
        చందనసుమదామచయము లొసఁగి
రమణీయమగు దివ్యరథములోఁ దగు సహ
        స్రారహేమాబ్జంబునందు వెలుఁగు


తే.

కర్ణికాపీఠమున నుంచి గజచతుష్ట
యంబుతో వీడుకొల్ప నయ్యాదిలక్ష్మి
సంతసింపుచు మధ్యాహ్నసమయమునకు
ధరణి భేదించుకొనుచు మోదమున వచ్చి.

187


తే.

మహిమతో నూటయెనిమిదిమంది సేవ
కాజనంబులు గొల్వఁగ ఘనత మెఱయ
శేషపర్వతమునకు దక్షిణముగాను
గలుగు స్వర్ణముఖరికిఁ దద్భాగమందు.

188


సీ.

ఘనతరంగయుతంబు గంగోపమానంబు
        నలినకైరవకోకనదయుతంబు
భాసురమకరందపానమత్తమిళింద
        పటలవిహారంబు పావనంబు
మత్స్యకచ్చపభేకమకరకుళీరక
        ప్రాతనివాసంబు శీతలాంబు
పూర్ణమలఘుసోపానావృతంబును
        స్వాదుగంధాఢ్యమై జగతి మీఱ

తే.

రమ్యమైయున్న పద్మసరస్సునడుమ
వెలయు నావీరలక్ష్మి తా వెడలి రాఁగఁ
బారిజాతము లాలక్ష్మిపైన నించి
చెలఁగి జయజయశబ్దముల్ చేసి సురలు.

189


చ.

పొగడుచు నుండగా జలధిపుత్త్రికదివ్యశరీరకాంతు లీ
జగతిని నిండి దిక్కులను సాంద్రముగాఁ బ్రసరించి పిమ్మటన్
గగనము నావరింప నదిఁ గాంచి ఫణీంద్రగిరీశ్వరుండు దా
ఖగపతి నెక్కి యచ్చటికి గ్రక్కున వచ్చెఁ బ్రమోదచిత్తుఁ డై.

190


క.

అప్పుడు బ్రహ్మ శివాదులు
తప్పక యచ్చటికిఁ బోయి తమ వాక్యతతుల్
గొప్పగ మొరయం జేయుచు
నుప్పొంగుచు లక్ష్మి లోచనోత్సన మెసఁగన్.

191


సీ.

చూచుచుఁ గార్తీకశుద్ధపంచమి యుత్త
        రాషాఢ భృగువార మమరఁ గూడి
యున్ననాఁ డరుదుగ వ్యూహమహాలక్ష్మి
        హరికి ము న్బ్రత్యక్ష మయ్యె నట్టి
విమలదినమునంద వీరలక్ష్మి ప్రసన్న
        మయ్యె నందఱకు మహాదినంబు
ముఖ్యం బనుచు బ్రహముఖ్యు లాలోచించి
        ఫణిగిరీంద్రుని జూచి పలికి రిట్లు


తే.

దేవ యీపుణ్యమైనట్టి తీర్థమందు
వెలయఁగా వ్యూహలక్ష్మియు వీరలక్ష్మి
వెడలివచ్చిరి గనుక నీవిమలతోయ
మవనిపైఁ బద్మతీర్థాఖ్య నమరెఁ బొగడ.

192

వ.

కావున నత్తీర్ధంబున స్నానమాచరించిరేని సౌభాగ్యసంపన్ను
లగుదురని నిర్ణయించి యందఱు స్నానంబుచేసి యప్పద్మ
తీర్థంబున కాగ్నేయభాగంబున దివ్యాలయంబు విశ్వకర్మచే
నిర్మితంబు గావించి యావీరలక్ష్మిని బ్రార్థించి తోడ్కొనివచ్చి
సకలలోకోత్సవంబులతో నాలయంబునం దుంచి ఛాయా
శుకునిచేతఁ బాంచరాత్రోక్తంబుగ సకలోపచారపూజలు
చేయించి రందుఁ జక్రి తనకంఠముననున్న పుష్పహారంబు
నవ్వీరలక్ష్మీకంఠంబునం దుంచి శుకాశ్రమంబు నగ్రహారంబు
గావించి ఛాయాశుకున కొప్పగించి బ్రహ్మాదులకు విందు
సేయించి వస్త్రతాంబూలంబు లిప్పించి సెలవిచ్చి వారి నంపించి,
వీరలక్ష్మితో నిట్లనియె.

193


సీ.

పద్మాలయా నీదు ప్రథమశరీరంబు
        కనుఁగొంటి కన్నుల కరువుదీఱె
నీవ్యూహలక్ష్మితో నెనసి వేంకటశైల
        మందుండ వచ్చు నీ వచటి కపుడు
రమ్మన నారమారమణి చక్రికి మ్రొక్కి
        పటుభక్తి దీపింపఁ బలికె నిట్లు
నాప్రాణనాయక నాకొఱకై నీవు
        తపము చేసిన మహాస్థలము గనుక


తే.

శ్రీకరంబైన దీశుకక్షేత్రమంద
నిలిచెదను నాహృదయములో నీవు నిలిచి
వ్యూహలక్ష్మి నురంబుపై నుంచుకొనుము
నన్నిచట నుంచి రక్షించు నలిననాభ.

194

క.

నాకిది యిష్టంబైనది
నీ కనుమానంబు వలదు నీఘనకరుణే
యీకాయమునం దుంచుచు
నాకనకాచలము సేరు మంబుజనయనా.

195


తే.

నేను రా లేదనుచు మది నీవు కొదువ
నుంచవల దింక నేనె శ్రీవ్యూహలక్ష్మి
రూపమును దాల్చి వచ్చి నీరొమ్ముమీఁదఁ
గుదురుగా నిల్చి తింక నీకుఁ గొదువ యేల?

196


క.

కరుణను బద్మావతి నం
దరమర లేకుండ యేలు మహిగిరిపైకిం
బరమజనుల రావించుచు
వరముల నొసగుచుఁ జెలంగు వనజదళాక్షా.

197


సీ.

శుభకర కార్తికశుద్ధపంచమి వచ్చు
        నప్పుడు నీపుష్పహార మొకటి
ప్రియమైనవస్త్రంబు ప్రేమతోఁ బంపించు
        చుండుము నేను మహోత్సవముల
నంగీకరించి నాయాత్మలో వెలుఁగునీ
        కన్నియు నర్పించి యచలమతిని
నిన్నుఁ జూచుచు నిందె నే నుండెదను మీరు
        శేషాద్రిమీఁద వసించి యుండుఁ


తే.

డంచుఁ బాదంబులకు మ్రొక్కినపుడు చక్రి
వీరలక్ష్మిని వీడ్కొని వేంకటాద్రి
చెంత నావ్యూహలక్ష్మితో స్నేహ మెసఁగఁ
గలసి క్రీడించుచుండె నుత్కంఠ మెఱయ.

198

చ.

అపుడు శుకాగ్రహారవరమందు శుకుం డతిభక్తి మీఱఁగా
నెపుడు మహోత్సవక్రమము లిందిర కిచ్చట నాచరింపఁగా
నపరిమితంబుగాఁ గలుము లందఱ కిచ్చుచుఁ బూజలందుచున్
విపులసుఖస్థితిన్ నిలిచి వీరరమామణి యుండె నచ్చటన్.

199


సీ.

అంతకుముందుగ నాదిశుకుం డందుఁ
        జేరినప్పుడ భూప్రసిద్ధముగను
బలరామకృష్ణుల భక్తిమై భావించి
        యందుంచి పూజించి యతఁడు చనిన
వెనుక ఛాయాశుకుం డనెడు విప్రుఁడు పాంచ
        రాత్రోక్తముగ రమారమణి నచట
నర్చింపఁ బరకాంత యగులక్మి హరిచెంతఁ
        జేరియుండక యిందుఁ జేరినపుడు


తే.

నే నిచట నిల్చియుండుట నీతి గాదు
తిన్నఁగా లేచి యిప్పుడ తీర్థయాత్ర
చనుదు నని సీరి లేచె నాసమయమునను
బట్టి కృష్ణుఁడు గూర్చుండఁబెట్టె నతని.

200


క.

అప్పుడు కృష్ణునిఁ గని బలుఁ
డప్పా కూర్చుండఁబెట్ట నర్హం బగునే
గొప్పై పరసతి వేడ్కఁగ
నిప్పుడు దా నిందు నిలిచె నింపుఁ దలిర్పన్.

201


సీ.

కావున నేను వేంకటగిరిపై కేగి
        యందొకతీర్థంబు నాశ్రయించి
యుండెద ననఁగ న న్నొంటిగ నిందుంచి
        యోయన్న పోనేల యుండు మిచట

ననినఁ గృష్ణుని జూచి హలపాణి పల్కె నీ
        వును రమ్ము నావెంట ననఁగఁ గృష్ణ
దేవుఁ డిట్లనె రమాదేవి నిందొంటిగ
        నుంచి నే వచ్చుట కుచిత మగునె


తే.

యంచుఁ గృష్ణుండు వల్కఁగ హలధరుండు
పరఁగ నిట్లనెఁ గరవీరపురము జేరి
యొంటిగా నీమహాలక్ష్మి యుండినపుడు
నీవు తోడుగ నుంటివే నిర్మలాత్మ.

202


చ.

అని హలసాణి పల్క నపు డల్లన నవ్వుచుఁ గృష్ణ దేవుఁ డి
ట్లనె సిరి దవ్వుగా నిలచినప్పటిరీతిఁ దలంప నేల యిం
దొనరఁగఁ జేరి యున్న దిపు డొంటిగ నిచ్చట నుంచి నేను బో
యిన జను లైన నవ్వరె యహీంద్రగిరీశ్వరుఁడైన మేచ్చునే.

203


తే.

మనకు భయమేమి యిచట రమాలలామ
విభవములు చూచుచుందము వేడ్క నిలచి
యనిన బలభద్రుఁ డామాట విని భయమును
జెంది శ్రీకృష్ణదేవు నీక్షించి పల్కె.

204


సీ.

భృగుమునీంద్రుని పూర్వమగుడు సేయుచుఁ బర
        పురుషుఁ డంచును మదిఁ బెరికియుంచి
హరిఁ బాసి కరవీరపురిఁ జేరి పాతాళ
        మున కేగి విభునిచేతనె తపంబు
చేయించి తపము దాఁ జేసి యీస్థలమందుఁ
        జేరి యిచ్చట నిల్చె వీరలక్ష్మి
యసఁగాఁ బ్రసిద్ధమై హరివలెనే చతు
        ర్భుజములతో మహాస్ఫురణ మెఱయ

తే.

నిలిచినది గాక నే నిందు నిలువ వెఱతు
ననిన దరహాసతాస్యుఁడై యన్నమోము
గాంచి కృష్ణుండు పల్కె నోకామపాల
చూడ సిరియందుఁ గొదువలెంచుటను దగునె?

205


సీ.

వైకుంఠపురమందు వరమృదుతల్పమై
        యున్నతాకృతిని నీ వుండినపుడు
హరిఁ గూడి నీమీఁద నానందముగ నుండు
        నంతియ కాని ని న్నన్యుఁడంచుఁ
దలఁచునె లక్ష్మి సీతాదేవి యైనప్పు
        డిలను లక్ష్మణుఁడవై యెల్లయెడలఁ
జరియించునపుడైనఁ బరుఁడంచు నీమీఁద
        నరమర నుంచెనె యనిన సీరి


తే.

నవ్వి యిట్లని పల్కె నానాఁడు సీత
యన్న మాటలు మఱపురాకున్న విపుడు
సిరి రజోగుణమును దలంచిన భయంబు
నామదిని బుట్టుచుండునో నందతనయ.

206


క.

అని తాలాంకుఁడు పల్కఁగ
విని కృష్ణుం డిట్టులనియె విశ్రవసునిపు
త్త్రుని రామునిచేఁ జంపిం
పను బని గలుగంగ నట్లు పలికెఁ గదన్నా.

207


క.

ఆమాటలు మఱువక యిపు
డీమాడ్కిని లక్ష్మితప్పు లెన్నుచు మదిలోఁ
బ్రేమయు నుంచక యరుగఁగ
నీమహితాశ్రమము విడువ నేమిటి కనఘా.

208

తే.

మించి సిరిమీద నిటు తప్పు లెంచ కిపుడు
శాంతమును బొందు మీశుకాశ్రమతలంబు
విడిచి వోవల దనుచు వివేకసరణి
నన్నతోఁ గృష్ణుఁ డేకాంత మాడుచుండె.

209


సీ.

ఛాయాశుకుఁడు తనజనకుఁ డర్చించిన
        రామకృష్ణుల రమారమణి నచట
నర్చించుచుండఁగ నపుడు గన్యామాస
        మందు బ్రహ్మోత్సవం బద్రియందు
జరుపఁగా నట కేగి ఛాయాశుకుఁడు వీర
        లక్ష్మి సేవకులైన లలితమతులు
మొనసి తా నాకమాట యెనుబనిమందిని
        హరియాజ్ఞఁ బడసి వాహకులఁ జేసి


తే.

శుకపురము చేరి రామకృష్ణులను వీర
లక్ష్మి నర్చించుచుండె నుల్లాస మెసఁగ
నచట హరి నిల్పినటువంటి యజ్ఞసఖుని
జేరి వైఖానసులపూజ సేయుదురని.

210


వ.

ఇవ్విధంబున దేవదర్శనుండు దేశలునకుఁ జెప్పెనని సూతుం
జూచి శౌనకాదు లిట్లనిరి.

211


సీ.

ఓ సూత యాశ్రీనివాసుని శేషాద్రి
        యం దెవ్వరెవరు ము న్నర్చనములు
చేసి రాచందముల్ చెప్పఁగవలె నంచు
        నాశౌనకాదు లి ట్లడుగునపుడు
విని సూతుఁ డిట్లనె మునినాథులార మీ
        రతిశయప్రశ్న న న్నడిగినారు

చెప్ప శక్యంబుగా దిప్పు డావ్యాసగు
        రుండు నాజిహ్వయం దుండి దయను


తే.

బరఁగఁ బలికించినట్లు నేఁ బలుకవలయు
ననుచు వ్యాసుని ధ్యానించి యచలుఁ డగుచు
శౌనకాదిమునీశ్వరసంఘమునను
జూచి సంతోషచిత్తుఁడై సూతుఁ డనియె.

212


సీ.

వేంకటాచలమందు విధిరుద్రముఖులకు
        హరి తాను బ్రత్యక్ష మైనయపుడు
కమలాసనుండు వైఖానససూత్రక్ర
        మంబుగఁ దా నర్చనంబు చేసి
మొనసి కన్యామాసమున రథోత్సవము గా
        వించె నాపిమ్మట విఖనసుండు
నర్చించె నమ్మునియాజ్ఞచేత మరీచి
        యర్చించె నటుమీఁద నత్రి పూజ


తే.

చేసెఁ గశ్యపుఁ డవల నర్చించె భృగుము
నీశుఁ డావనల నర్చించె నెల్లమునులు
పూజచేసిరి యావలఁ బొసఁగ యక్షు
లంత స్వాయంభువను మను నవలఁ జేసే.

213


సీ.

సమయంబునను సంధి సంవత్సరములతో
        మొనయు ముప్పదికోటు లెనుబదియును
నాలుగులక్షల నలువదియెనిమిది
        వేలయింటికి బ్రహ్మ విశ్వసృష్టిఁ
దాఁ జేయ నూహించి ధ్యానకాలముకోటి
        యవి డెబ్బదియు లక్షలనుచుఁ బలుకు

నవి నఱువదినాల్గువే లబ్దముల్ గాక
        నిల్చిన యేండ్లు గణింప సరవిఁ


తే.

గుదిరి యిర్వదితొమ్మిదికోట్లపదియు
మూఁడులక్షలు నదిగాక మొనసి పైన
నేను బదియు నాలుగగువేల నెన్నఁ గూర్చి
భాగములఁ చేసి చూడఁ జొప్పడు నెసంగి.

214


తే.

ఇన్ని ముప్పదికోటులు నెనుబదియును
నాల్గులక్షలు నదిగాక నలువదెనిమి
దైనవేలేండ్లకును బాగు సరసి కూర్ప
నందు బహుధాన్యవత్సరం బాదిగాగ.

215


వ.

అఱువదియెనిమిది చతుర్యుగంబులయింటి కప్పటి కీశ్వర
నామాబ్దంబువఱకు జతుర్యుగ మొక్కింటికి సంవత్సరాలు
నలువదిమూఁడులక్ష లిరువదివేల లెక్కను మహాయుగంబులు
మున్ను చెప్పిన క్రమంబుగ నఱువదెనిమిదింటికి సంవత్సరము
లిరువది తొమ్మిదికోట్లు ముప్పదియేండ్ల లక్షలఱువదివేలును
వైఖానససూత్రక్రమముగ విఖనసబ్రహ్మకు శిష్యుడైన పుల్ల
మహామునికి శిష్యులైన యక్షు లర్చించి రందు.

216


సీ.

నయమగు బహుధాన్యనామసంవత్సరం
        బాదిగ వైఖానసాగమోక్త
పద్ధతిన్ విఖనసబ్రహ్మసంతతివార
        లటకోటి నలువదియాఱులక్ష
లెనుబదియును మఱి యెనిమిదివేలేండ్లు
        చిరభక్తులై పూజ చేసి రవల

మహిని స్వాయంభువుమనుకాల మీన్నియేం
        డ్లయ్యె నీక్రమముగ నబ్దసంఖ్య


తే.

తనర స్వారోచిషుండు నుత్తముఁడు తామ
సుండు రైవతుఁడును జాక్షుషుండుననెడు
పంచమనువులకాల మేర్పఱచి సంధి
యజ్ఞములతోడ నెక్కింప నవనియందు.

217


తే.

నయముగా నూటయేఁబదినాల్గుకోటు
లిరువదియు రెండులక్షలు నిదియుఁ గాక
యొక్కనలువదివేలయేం డ్లోజ యాయె
నవల వైవస్వతాఖ్య మన్వంతరమున.

218


క.

ఆవిధముగ నేక్షితిపై
నావేంకటశైలభర్త కానందముగా
నావైఖానసు లిపుడుసు
సేవించుచు నర్చనములు సేయుదు రెలమిన్.

219


సీ.

జగతిపై దివ్యవత్సరములు నాల్గువే
        లాకృతయుగమునం దమరి నడచు
నదిగాక తత్సంధి యగు నెనిమిదినూర్లు
        మొనసి త్రేతాయుగమునకు మూఁడు
వేలగు తత్సంధి వివరింప నాఱునూ
        ఱాద్వాపరంబున కసుపు నెంచ
నొకరెండువేలయేం డ్లొప్పఁగఁ దత్సంధి
        యబ్దముల్ నన్నూఱు నవలవచ్చు


తే.

కలియుగానికి వేయేండ్లు గాఁగ దాని
సంధిసంవత్సరంబు లెంచంగ ద్విశత

మగు చతుర్యుగకాలంబు లవనియందు
సార్వకాలంబు నీరీతి జరుగుచుండు.

220


తే.

భూమిపై నాల్గుయుగములు పుట్టి పుట్టి
వేయుమాఱులు పోయిన విధికి నొక్క
దినమగున్ రాత్రి యట్లగుఁ దెలియ సరవి
ననుచు గుఱుతొండు సూతుండు వినఁగ నుడివి.

221


వ.

మఱియుఁ జతుర్యుగసహస్రంబులు గడచునంతకు బ్రహ్మ సృష్టిం
జేయుచుండు నది గడచిన తుద నిద్రఁ జెందినపుడు లోకంబు
లడంగు నతండు మేల్కాంచినప్పు డన్నియుం బుట్టుచుండు
నిట్టి బ్రహ్మదినంబునం జతుర్దశమనువు లివ్వసుంధరఁ బాలింపు
చుందు రట్టిమనుకాలం బెట్టిదనిన స్వాయంభువాదిమనువుల
కొక్కరొక్కరికి దివ్యయుగంబులు డెబ్బది యొకమాఱు చనిన
నది యొకమనుకాలంబని చెప్ప నొప్పు నొక్కొక్క దేవేం
ద్రుఁడు దేవతలు సప్తఋషులు రాజులు హరియంశంబులను
ధరించి యుదయించి లోకంబులు పాలింతురు నారాయణుండు
దేవతిర్యఙ్మనుష్యరూపంబులు ధరించి సర్వంబును దాన
సమర్థించి రక్షింపుచుండు శ్రీవేంకటేశ్వరుండు మూఁడు
యుగంబులు మునియక్షాదులచేత బూజింపఁబడుచుండి
ప్రతికలియుగంబునందు మనుష్యపూజ లంగీకరించి భక్తుల
రక్షించుచుండు నని చెప్పి వెండియు నిట్లనియె.

222


సీ.

మునివరులార మీ రనఘులు సర్వజ్ఞు
        లగుచు నుండియు నన్ను నడుగగాను
భక్తితో శ్రీవ్యాసభట్టారకులదయ
        విశదంబుగను పదివేలసంఖ్య

నమరు బ్రహ్మపురాణమందు ద్వాదశసహ
        స్రములచే బ్రహ్మాండ మమర నొకటి
సరవి నెన్నఁగఁ బంచశతసంఖ్య నమరుచు
        వఱలగ బ్రహ్మకైవర్తనంబు


తే.

వెలయు నిరువదినాలుగువేల సంఖ్య
నమరు విష్ణుపురాణంబు నదియుఁగాక
దశసహస్రకసంఖ్యతోఁ దనరి ధరను
నాణెమగు వామనునిపురాణంబు మఱియు.

223


సీ.

అదిగాక యేఁబదియైదువేలగుసంఖ్య
        నెనయుఁ బద్మపురాణ మెనిమిదియును
బదివేలునగుసంఖ్య నొదవు భాగవతంబు
        వెలయఁగఁ బదిరెండువేలసంఖ్య
నొనరు మత్స్యపురాణమును బదియేడువే
        లైన కూర్మపురాణ మదియుఁగాక
నయముగ నిరువదినాల్గువేలగు లెక్క
        యమరు వరాహమహాపురాణ


తే.

మిరువదియు నొక్కవేలునై వరుసగాను
రచితమైనట్టి గరుడపురాణ మొకటి
పంచవింశతి సాహస్ర మెంచ నార
దునిపురాణంబు నదిగాక ఘనత మీర.

224


తే.

కుతలమందున నొకపదకొండువేల
నొదవు లింగపురాణంబు నదియుఁ గాక
యరయ నిరువదిరెండువే లై దనర్చు
శివపురాణంబు నొక్కండు చెలువు మీరు.

225

తే.

ఎనుబదియు నొక్కవేలసంఖ్యను ఘనముగ
రచితమౌ స్కాందమనెడు పురాణ మొకటి
వింశతిసహస్రసంఖ్యతో వివిధకర్మ
రాజితాగ్నేయనామపురాణ మొండు.

226


సీ.

వెలయఁగ నిరువదివేలగు సంఖ్యతోఁ
        దనరు మార్కండేయమునిపురాణ
మదిగాక యిరువది యగువేలసంఖ్యను
        సారమై తగు భవిష్యత్పురాణ
మేన్న నెనిమిది పదునెనిమిది యగుపురా
        ణంబులు మీకు నిర్ణయముగాను
జెప్పితి నిదిగాక శ్రీవరాహపురాణ
        మున భవిష్యోత్తరమునను మఱియు


తే.

రమ్యతరమగు పద్మపురాణమునను
వింతలగుచుఁ బ్రకాశించు వేంకటాద్రి
పతిచరితములు గొన్ని యేర్పఱచి మీకు
జెప్పితిని నేను మోక్షంబుఁ జెందుకొఱకు.

227


క.

అని యాసూతుఁడు పలుకఁగ
విని శౌనకముఖ్యమునులు విశ్వాసముతో
గనుఁగొని యతని ముదంబున
వినుతింపుచు నిట్టు లనిరి వేడుక మీఱన్.

228


చ.

సురుచిరభక్తియుక్తులను సూనృతవాక్యము లాత్మనిష్ఠయుం
బరమవివేకశీలములు పావనమోక్షవిచారధర్మముల్
కరుణయు శాంతమున్ మొదలుగాఁగల సద్గుణముల్ దృఢంబుగా
నఱిమురి నిల్చె నీహృదయమం దతిధన్యుడ వైతి విద్ధరన్.

229

మ.

నీ వాచక్రిగుణంబులం దలఁపుచున్ నిర్వాణబోధస్థితిన్
భావంబంచు గ్రహించి మా కొనరఁ జెప్పం జాలయోగ్యుండవై
నా వీరీతిని కొంకు లేక యిచట నానాపురాణార్థముల్
ధీవిజ్ఞానుఁడవై వచించితివి సందేహంలం దీర్చుచున్.

230


ఉ.

కావున నీవు ధన్యుఁడవు కంజదళాక్షుఁడు నీహృదబ్జమం
దే వసియించియుండి గణుతింపగ దివ్యతరోక్తులం గృపన్
బ్రోవగ నీ కసాధ్యములు పుట్టవటంచు మునీంద్రు లందఱం
దావిమలాత్ము సూతుసుగుణావళి నెన్న చు నాదరంబునన్.

231


చ.

పలుకఁగ సూతుఁ డిట్లనియెఁ బద్మదళాక్షుఁడు బాదరాయణుం
డల శుకయోగిపుంగవుడు నార్యులునై తగు మీర లందఱున్
విలసితమైన మీకరుణ వేడ్కగ నాయెడ నుంచియుండఁగాఁ
జెలు వలరంగఁ దోఁచినవి చెప్పితినంచు వచించి నమ్రుఁడై.

232


క.

మునులను సన్నుతి చేయఁగ
విన వారలు మెచ్చి యతని వినయానందం
బున కలరుచుఁ గ్రమ్మఱ ని
ట్లని రింకొకఘనరహస్య మడిగెద మనఘా.

233


ఆ.

విను మనేకమర్త్యవితతులలో మోక్ష
కాము లైనవారు కాయములను
విడచి యెచటనెచట విమలులై పొందుదు
రావిధంబు దెల్పు మయ్య సూత.

234


క.

అన విని సూతుం డప్పుడు
తనగురుని మనంబునందుఁ దలఁచి యచలుఁడై

కనుగవ మోడ్చుచు నావె
న్నుని ధ్యానము చేసి యొగి ననూనతబుద్ధిన్.

235


సీ.

సూతుఁ డిట్లనియె నో సూరిజనములార
        వివిధశ్రుతిస్మృతుల్ వినిన మీకు
నఖిలంబు దెలియు నాయందు సత్కృప నుంచి
        యతిరహస్యప్రశ్న యడిగినపుడు
చెప్పలే దన నేల చెప్పెదఁ దప్పొప్పు
        లంగీకరించి నెయ్యమున వినుఁడు
పాపకర్ములువోయి బహునారకములందుఁ
        బడి పుట్టుచుందురు ప్రజ్ఞ లేక


తే.

పుణ్యకర్ములు వోయి తత్పుణ్యఫలము
లనుభవించినతుద భూమియందు వ్రాలి
క్రమ్మఱం బుట్టుచుందురు కామముఖ్య
శత్రువుల గెల్చి గురుకటాక్షమును బొంది
నట్టివారు జనింప నీయవని మీఁద.

236


సీ.

అట్టివా రెవరన్న నాచార్యభక్తులై
        పరమవిరక్తులై పటువివేక
కలితులై శాంతులై గర్వవిదూరులై
        హేయకామాదులఁ బాయఁద్రోచి
గురుతరకల్యాణగుణులై యచంచల
        చిత్తులై విజ్ఞానసిద్ధు లగుచు
హెచ్చక తగ్గక యేకాంతనిష్ఠులై
        నారాయణధ్యానపూరితాత్ము

తే.

లైనఘను లంగముల విడి యఖిలలోక
ముల నపుడ దాఁటి మండలములను గడచి
వరుస మహదాదులైన యావరణములను
గడచి మూలప్రధానముం గడచి మఱియు.

237


వ.

సహస్రశీర్షుం డగు విరాట్పుర్షు నతిక్రమించి యమృతవెల్లి
యననొప్పు విరజానదియందుఁ గ్రుంకులిడి లింగదేహంబులను
విడిచి యప్రాకృతదివ్యదేహధరులై శతసహస్రదివ్యావరణా
మృతంబై యనేకకోటిసూర్యచంద్రప్రకాశమై యొప్పు
చున్న పరమపదమందుఁ బ్రకాశింపుచున్న నారాయణ పర
బ్రహ్మ సాన్నిధ్యంబును బొందుదురు. మఱియు భక్తిజ్ఞాన
వైరాగ్యంబుల నభ్యసించుచు నధ్యాత్మవిద్యానుభవులగు
నాత్మవేత్తలు స్వరూపవిలక్షణంబు లేక నిరాకారప్రకాశ
మైన కైవల్యపదమందుఁ బొందుదురు విజ్ఞానంబ పరబ్రహ్మం
బని యనుభవసిద్ధులగు జ్ఞానవేత్త లమృతసముద్రంబును
విరజయుం బొందుదురు. సహస్రశీర్షుండైన విరాట్పుర్షుండ
పరబ్రహ్మంబని నిశ్చయించి తద్ధ్యానారూఢులగువా రా
విరాట్పుర్షుని శీర్షోపరిప్రదేశంబునందుఁ జేరుచురు. వీరంద
ఱును బునరావృత్తిరహితులై యుందురు. మఱియు నవ్విరా
ట్పుర్షుని భ్రూమధ్యాధఃప్రదేశంబునందుఁ ద్రిగుణమిశ్రంబై
యున్న మూలప్రకృతిని పరతత్త్వంబని తదనుష్టానమంత్ర
సిద్ధులైనవారు దుర్గధామంబు నొందుదురు. తత్ప్రకృతి
జన్యంబులైన మహదాది సప్తావరణంబులను బరతత్త్వంబుగఁ
జూచువార లయ్యావరణంబులందుఁ బొందుదురు. వాసుదేవ
ద్వాదశాక్షరీ నారాయణాష్టాక్షరీ నారసింహ గోపాలాది

మహామంత్రసిద్ధులును సదా నారాయణస్మరణ నేమరక
చేయువారును, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ
వ్యూహంబులందుఁ బొందుదురు. విష్ణుం డొక్కఁడ మహ
ద్భూతంబని మఱి యనేకభూతంబులు పృథగ్భూతంబులని
విష్ణుండ సాత్వికబ్రహ్మంబని నిశ్చయించి విష్ణుషడక్షరీమహా
మంత్రసిద్ధులైన విష్ణుపరాయణులు శ్రీవైకుంఠము సేరు
దురు. సద్వ్రతనిష్ఠ జ్ఞానభక్తివైరాగ్యసంపన్నులు కారణ
వైకుంఠంబులందుఁ బొందుదురు. వీరందఱును వటపత్రశయ
నుని నాభికమలములందుఁ బ్రళయకాలంబులందుఁ జొచ్చి
వెడలుచుందురు. బ్రహ్మ పరతత్త్వమని బ్రహ్మగాయత్రీమహా
మంత్రసిద్ధులగువారు బ్రహ్మలోకమందును దపస్సిద్ధులగు
వారు తపోలోకంబున కెగఁబోయినప్పుడు జనలోకవాసులు
మహర్లోకమునండుఁ జేరుదురు. యజ్ఞాదిసత్కర్మనిరతులు
సువర్లోకంబునందును దానధర్మపరోపకారులు భువర్లోకంబు
నందు నుందురు. సూర్యమంత్రోపాసనాసిద్ధులగువారు
సూర్యలోకంబునందును, జంద్రమంత్రోపాసకులు చంద్ర
లోకంబును జేరుదురు. తత్తత్పుణ్యంబులు క్షీణించినప్పుడు
భూలోకంబునం గ్రమ్మఱ నుదయించి జపహేతుకర్మంబులు
సేయుచుందురు. అనిన విని శౌనకాదు లిట్లనిరి.

238


సీ.

వెలయఁ గర్మము లెన్నివిధములై జీవుల
        కేయేశరీరంబు లిచ్చుచుండుఁ
బుణ్యాతిశయమును బుణ్యమధ్యమమును
        బుణ్యసామాన్యంబు భూరిపాప

మును మధ్యపాపంబు మొనసిన సామాన్య
        పాపంబు నరుల కేఫలము లిచ్చు
మిశ్రకర్మాధిక్య మిధ్యశ్రమము మిశ్ర
        సామాన్య మేగతుల్ జనుల కొసఁగుఁ


తే.

గామ్యకర్మంబులును గతకాలకర్మ
ఫలము లేమార్గములఁ జూపుఁ బ్రజల కనిన
విని మనంబున భావించి మునివరులను
జూచి గురుని దలంచి యాసూతుఁ డనియె.

239


వ.

కర్మలుచేతనే జీవులకు జన్మంబులు గల్గుచుండు కర్మంబు
లెన్నివిధంబు లనినఁ బుణ్యపాపమిశ్రకర్మంబులను మూఁడు
విధంబులు తత్కర్మఫలానుభవంబు లెట్లనినఁ బుణ్యకర్ములు
దేవాదిశరీరంబులందును, పాపకర్ములు తిర్యగాదిశరీరంబుల
యందును, బణ్యపాపమిశ్రకర్ములు మనుష్యాదిశరీరంబులయం
దును బొందుదురు. మఱియుఁ బుణ్యాతిశయులును హిరణ్య
గర్భరూపంబునందును, బుణ్యమధ్యము లింద్రాదిశరీరంబులం
దును, సామాన్యపుణ్యులు యక్షరక్షః ప్రముఖ తామస
దేహంబులం బొందుదురు. మఱియు నుత్కృష్టపాపంబులు
చేసినవారు జనతాపకరంబులైన కంటకవృశ్చికవనమక్షికాది
క్రూరజంతువు లగుదురు. పాపమధ్యములు కదళీ నారికేళాది
వృక్షంబు లగుదురు. సామాన్యపాపులు గోగజాదు లగుదు
రు. సామాన్య మిశ్రకరులు వర్ణాశ్రమ ధర్మార్థకామ్యకర్ము
లై యుదయింతురు. అత్యుత్కర్షపుణ్యపాపమిశ్రకర్ము
లీశ్వరార్పితసత్కర్మ లాచరించి యందువలనఁ జిత్తశుద్ధియు
నందువలన సాధనచతుష్టయసంపత్తి గల్గి యందువలన సద్గురు

భక్తి గల్గి వారికిఁ జతుర్విధశుశ్రూషలు చేసి మెప్పించి వారికిఁ
గరుణకుఁ బాత్రులై వేదాంతసిద్ధాంతరహస్యోపదేశంబు
వడసి శ్రవణమనననిదిధ్యాసనపూర్వకంబుగ సంపూర్ణమయ
జ్ఞాన మవలంబించి యజ్ఞానకారణావరణవిక్షేపశక్తులను
గెలిచి శబ్దానువిద్ధ శ్యామవిద్ధ సవికల్ప నిర్వికల్ప సమాధుల
నభ్యసించి జ్ఞానజ్ఞాతృజ్ఞేయంబు లనెడు త్రిపుటిని దాఁటి
సచ్చిదానందనిత్యపరిపూర్ణబ్రహ్మంబునందుఁ బొంది జీవన్ముక్తు
లగుదురు. కామ్యకర్మాచరణులగువారు సుఖదుఃఖకారణంబు
లగు స్వర్గనరకంబులయందుఁ బొంది క్రమ్మరం బుట్టిగిట్టు
చుందురని చెప్పిన విని శౌనకాదు లిట్లనిరి.

240


క.

చటులోగ్రప్రళయంబున
సటమటమై యున్నయప్పు డంభోరాశిన్
వటపత్రమునం దాహరి
యెటువలె వర్తింపుచుండు నెఱిఁగింపుమయా.

241


తే.

అనిన విని సూతుఁ డనియె లయాబ్ధియందు
మహిమమీఱఁగ నంగుష్ఠమాత్రదేహుఁ
డై నిజాంగుష్ఠ మాస్యమం దమర నుంచి
లీల వటపత్రమునఁ బవ్వళించునపుడు.

242


సీ.

పటుతరంగాహతిన్ వటషత్ర మటునిటు
        లుయ్యెలవలె నూఁగుచుండఁగాను
జిరఁజిర నెగరెడు సీకరమాలిక
        లుయ్యెలఁ జేరున ట్లొప్పఁగాను
ఫేనంబు చుట్టుగప్పి విశాలమయ్ది
        యుయ్యెలతెఱవలె నుండఁగాను

ధ్రువమండలంబడ్డ దూలంబుకైవడి
        నుయ్యెలచేర్లతో నొలయఁగాను


తే.

పరమపదకాంతు లుప్పొంగి పద్మరాగ
ముఖ్యమణిజాలములరీతి ముద్దుగుల్కు
చెండ్లవలెఁ జూడ్కి కెదురుగఁ జెలఁగ దానిఁ
జూచుచును బాలుఁడాత్మలోఁ జొక్కుచుండ.

243


ఆ.

బాలకుండు దానిఁ బట్ట నుద్యుక్తుఁడై
ముఱిసి ముఱిసి కరము మొనసి సాఁచి
పట్టికొనుదుననుచు నట్టిట్టు జుణుఁగుచు
నుబ్బి బాల్యలీల నొప్పుచుండు.

244


క.

ఘనపద్మజాండకోటులఁ
దనసూక్ష్మోదరమునందు దాఁచి యెలమితో
వనరాశిమీఁదఁ దేలుచు
నొనరఁగ డోలోత్సవంబు నొంది సుఖించున్.

245


క.

వనజనిభాకారుండై
వననిధిలోఁ దేలుచున్న వటపత్రముపైఁ
దనుదాన చూచి చొక్కుచు
నెనవుగ నానందయోగనిద్రం జెందున్.

246


వ.

ఇవ్విధంబున యోగనిద్రం జెందియుండి పెద్దకాలంబునకుఁ
గ్రమ్మఱ మేల్కాంచి నిజగర్భగతప్రపంచంబును వెడలి పూర్వ
ప్రకారంబున నిర్మించునప్పుడు ముక్తజీవులు దక్క దక్కిన
కర్మజీవులు యథాప్రకారంబుగఁ బుట్టి గిట్టుచుందురని చెప్పి
వెండియు సూతుం డిట్లనియె.

247

సీ.

పుట్టి గిట్టుచునున్న భూలోకవాసుల
        రక్షించుటకు రమారమణితోడ
వేంకటాచలమందు విఖ్యాతిగానుండి
        నరులచే గోవిందనామభజన
మొనరఁ జేయింపుచు ఘనపాపములనైన
        క్షీణింపఁజేయుచు సిరుల నిచ్చి
పాలింపుచున్నట్టి ఫణిగిరీశ్వరున కా
        వ్యూహమహాలక్ష్మి కుర్విమీఁద


తే.

వెలయు నావీరలక్ష్మి దా విమలహృదయ
యగుచు నలమేలుమంగాఖ్య నవనియందు
నమరెఁ బద్మావతికి వెంకటాద్రి కిలను
వెలయు శుభమంగళము మహావిభవముగను.

248


తే.

అప్పు డామునులెల్లఁ దథా స్తటంచుఁ
బలికి శ్రీవేంకటేశ్వరు భక్తికథలు
సూతుఁ డెఱిగింప వినుచు మెచ్చుచును వార
లంద ఱందుండి రానంద మతిశయింప.

249


క.

ధరణీశ్రీనీళాధిప
కరుణారసపూరితాత్మ కామితఫలదా
వరవేంకటగిరినాయక
తఱికుండనృసింహసుచరితా జగదీశా.

250


మాలిని.

సులలితమణిభూషా సూరిచిత్తాబ్జపూషా
కలుషజలధిశోషా కంజగర్భాండవేషా
కలిపురుషజదోషాక్రాంతజీవాళిపోషా
విలసితమృదుభాషా వేదవిద్యాప్రపోషా.

251

గద్యము.

ఇది శ్రీతఱికుండ లక్ష్మీనృసింహకరుణాకటాక్షకలిత
విచిత్ర వసిష్ఠగోత్రపవిత్ర కృష్ణయామాత్య తనూభవ వేంక
మాంబాప్రణీతం బైన శ్రీవీరలక్ష్మీవిలాసంబును, వేంక టేశ్వర
మాహాత్మ్యంబునందు లక్ష్మికొఱకు హరి కొల్లాపురంబునఁ
దపంబు సేయుటయు, శుకాశ్రమంబునం దపంబు సేయుమని
చక్రి కశరీరవాణి బోధించుటయును, శ్రీస్వామి పద్మసరో
వరతీరంబునం జేరి దివాకరప్రతిష్ఠ చేసి లక్ష్మిం గూర్చి తపంబు
సేయుటయు, దత్తపోవిఘ్నంబు సేయుటకు నింద్రానుమతం
బున రంభాదులు వచ్చి హరిని జలింపఁజేయనేరక యోడి సను
టయు, హరిం దలంచి పద్మావతి చింతనొందుటయు, లక్ష్మీకపిల
మునిసంవాదంబును, వ్యూహలక్ష్మి హరికిఁ బ్రసన్నం బగు
టయు, రమాసహితుఁడై బ్రహ్మాదులతోఁ జక్రి శేషాద్రి చేరు
టయు, లక్ష్మీనారాయణులు వినోదంబున సంభాషించుటయు,
శుకమార్తాండసంవాదంబును, ఛాయాశుకోత్పత్తియు, వీర
లక్ష్మి శుకాశ్రమంబు చేరియుండుటయు, బలకృష్ణసంవాదం
బును, శ్రీనివాసుని బ్రహ్మాదులర్చించిన కాలక్రమంబును,
కాలనిర్ణయంబును, అష్టాదశపురాణవిభజనయుఁ, బుణ్య
జీవులు వొందుసద్గతిక్రమంబును ననుకథలుగల శ్రీవేంకటా
చలమాహాత్మ్యంబునందు సర్వంబును షష్ఠాశ్వాసము.


శ్రీవేంకటాచలమాహాత్మ్యము
సంపూర్ణము.