శ్రీరంగమాహాత్మ్యము/షష్ఠాశ్వాసము

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

షష్ఠాశ్వాసము

      శ్రీహరణ శాబనయనా
      మోహన కుచకలశఘసృణముద్రావిలస
      ద్బాహాంతర మునిహృత్కమ
      లా హితచంక్రమణ వేంకటాచలరమణా.
వ. అవధరింపు మిట్లు నాగదంతముహామునికి వ్యాసు లానతిచ్చిన తెఱంగు సూతుండు
      శౌనకాదుల నుద్దేశించి.
క. ఈజంబూతీర్థమున, భూజనులు న్నీవు గ్రుంకు భూవర యన నా
      రాజట్లన యొనరించిన, తేజము బలపుష్టి గలిగి దేహంబులకున్.
క. నీరోరగాత్రు లమలా, కారులునై రాజు ప్రజలు కాశ్యపువెనుకన్
      శ్రీరంగమార్గమున జను, వారలు గని రామ్రతీర్థవర్యము నెదురన్.
గీ. ఆమ్రతీర్థంబు డాయంగ నరిగి పనస, నారికేళ రసాల ఖర్జూర వకుళ
      నింబ జంబీర జంబూ కదంబ పూగ, పాటలీ కదలికా తరుప్రకరములను.
క. మీరిన యామ్రసరత్తీ, రారామములందు నున్న యనఘులతో నీ
      సారసిని మహిమమును మా, కేరుపడన్ బలుకు మనిన నిందఱు వినఁగన్.
మ. అపు డాసంయములందు భార్గవసమాఖ్యన్ మీరు మౌనీంద్రుఁడో
      నృప శ్రీరంగము చూడ భూమిసురుఁ డర్థిం బుష్కరాఖ్యుండు రా
      కపధోర్వి న్నెదిరించి బెబ్బులివలెన్ గన్పట్టి పట్టంగ నొ
      క్కపిశాచంబు పయింబడన్ గినిసి హంకారంబుతో విప్రుఁడున్.

క. అదలించి నిలువుమనుటయొ, నదిరా కడువింత బాపనయ్య బిగువు నే
      నిది చూతుఁగాక యనినను, గదిమిన యటుఁ బోననిత్తుఁ గనకని నిన్నున్.
గీ. పట్టి మ్రింగకపోనన్నఁ బట్టఁదరమె, యేద్విజుండఁ దపోనిధి నిట్టి దుష్ట
      జంతువులు జేరునే యన్న నింతయేల, నేను భూతంబ పోనిత్తునేని యన్న.
గీ. భూత మెటుఁజేరు నాపంచభూతములును, సాక్షిగా భూతములకెల్ల స్వామియైన
      యీశ్వరధ్యానరతు నన్ను యీశ్వరుండె, పట్టుమని పంచెనని విప్రుఁ డిట్టులనియె.
సీ. ఏమీపిశాచంబ యీశ్వరుండే నిన్ను భేదబుద్ధిని బంచ ప్రేరకుండు
      కాక భూసుర యేను గర్తనే యయ్యీశు యనుమతి మ్రింగెదనంటి నిన్ను
      నవివేకభూతంబ యాబుద్ధి నీ కెట్లు గలుఁగఁజేసినది మత్కర్మ మింతె
      వెఱ్ఱిబాపడ యెల్లవృత్తులు నీశ్వరునాజ్ఞ లేకఁ దృణంబు నాడరాదు
      గాలిద్రిమ్మరి యీశుం డకల్మషుండు, హింసఁజేయించునే కాల మింతెగాక
      యోరి వినరోరి జాతిమాత్రోపజీవి, కాలమని యీశుఁడని వేరుగాదు వినుము.
క. కర్మఫల మనుభవించెద, కర్మము ఫలమిచ్చు నింతెకా కీశ్వరుఁ డీ
      కర్మము సేయించుననన్, గర్మం బీశ్వరుని నంటుఁగదవె పిశాచీ.
మ. అనినన్ గర్తయు భోక్త కారణము కార్యంబెల్ల నీశుండె తా
      వెనుగుం బాపడ నోరిసేయను సుఖాభివ్యక్తకర్మంబు లెం
      చునుఁ గన్పట్టుడు నెన్నఁగాఁ బ్రకృతియందుం జూవె తద్రూపమై
      చను నెందున్ గుణజాత మీశుఁ డమరున్ సాక్షిత్వ మాత్రంబునన్.
గీ. అనిన బ్రాహ్మణుఁడవుగావు మునుపె నీకు, వేదమును రాదు శిక్షయు లేదు శుంఠ
      సత్యమంతర్బహిశ్చతత్సర్వమనియు, వ్యాప్తనారాయణస్థిత యనెడు చదువు.
గీ. ఉండు నిండి యధస్తిర్యగూర్ధ్వములను, స్వామి నారాయణుండను జదువు వినవె
      వేదశిరము లవేమన్న విశ్వమెంత, నంద నొక్కొకయెడల వినంగ లేదె.
క. జందెముఁ జూచియు భ్రమసితి, నెందు కులాలుండువౌదు వేమోయన భూ
      బృందారకుఁ డోరసి యల, మందరకే పుట్టినావొ మహి వక్త్రోక్తిన్.
గీ. సేయబడనవి సేయుట సేయువాఁడ, నొక్కడంటివి వచనంబు లొక్కకొన్ని
      చెప్పితివి మేలు మారటచెప్ప నాతి, యీశ్వరుఁడు వేరుగా మది నెన్నికొనుము.
క. యుక్తమగు కార్యసాధన, శక్తిన్ సకలంబు నతఁడు సాధించు క్రియా
      శక్తిని శుభాశుభంబులు, సక్తములుగ ననుభవింప జనులు వలసెన్.
క. ఈశుఁడు విలక్షణుండౌ, దాసీకన్యాకరమయ దబ్బర వినరా
      యాశాపాశ కులాధమ, లేశంబును వినియు నెఱుఁగలే వేమందున్.

క. ఈయామ్రతీర్థమునకుఁ, బోయి మహామునులతోడఁ బుట్టిన నాదం
      బీయెడ వినుపింతుము వా, రేయర్థము సత్యమనిన నెసఁగున్ జయమై.
క. ఇందున కోడిన వారలు, బొందిం బెడఁబాయునాజ్ఞ బొందిడువారీ
      పందెమునకు నిలుతే యనఁ, బొందుగఁ జెయిఁ జేతఁజఱచి పుష్కరుఁ డలుకన్
క. రమ్మని యిరువురు చూతస, రమ్మునకున్ జేరి మౌనిరాజుల కచటన్
      సమ్మతిని గేలుమొగినిచి, త మ్మిద్దఱు వచ్చినట్టి తలఁ పడుగుటయున్.
శా. ఈవిప్రుండు వచించు నీశ్వర వివాదాలాపముల్ వ్యాఘ్రమా
      యాచక్రమ మానుపూర్విగఁ దదీయారామమౌనవ్రజం
      బావేళన్ విని రెండుపక్షములు తా నౌగాకనన్ లేక వా
      రేవాక్యంబు నెఱుంగలేక రొదగా నిట్టట్టు తర్కింపఁగన్.
మ. కురియున్ ద్రిచ్చలు కన్బొమల్ ముడిపడం గోలాహలం బొప్పఁగా
      నిరువాగై స్వమతప్రతిష్ఠకులుగా నిట్టటు గట్టై వినన్
      సరిగా వాదిబలంబునన్ నిగమశాస్త్రగ్రంథరాద్ధాంతవా
      గురుశక్తిన్ దనువుల్ చెమర్పఁ దమగెల్పొట్లాప్పంగఁ బోరాడఁగన్.
క. పోరఁగఁ దమతగవిచ్చటఁ, దీరదు వీరంటివారె తీర్చకయున్నన్
      దీర దిఁక నెందు దైవం, బేరీతిఁ దలంచెనదియు యెఱుఁగ మనంగన్.
సీ. ఒసపరి సికజుట్టు ప్రసవమాలికలకు నంగంబు తేటుల నామతింప
      యెలనవ్వు టారుచెక్కులకు మాణిక్యకుండలములు నీరాజనంబు లెత్త
      దయలీను తెలిగన్నుదామరలకు ముఖలావణ్య మొరసి యుల్లాస మెసఁగ
      వలివాటువైచు దువ్వలువ బంగకువొళ్ల తరువితానము కొత్త తలిరులెత్త
      జకచకల్ చల్లు కట్టాణిసరుల వలన, నొకట వవనిధి రంగవల్లికలు దాల్పఁ
      జాల నమ్మినవారల మేలుదలఁచి, యేలుకొను రాజు మౌనులమ్రోల నిలిచె.
క. నిలిచిన మౌనులుఁ దమలో, గలిబిలి చాలించి కన్నుఁగరువులు దీరన్
      గొలవను మ్రొక్కను బొగడన్, దలఁపులు పురిగొలుపఁ జూచుతఱి నవ్వెనుకన్.
సీ. తీరైన జడచుట్టు పారిజాతపుసరుల్ తావి పువ్వుల కొక్కతావిఁ గట్ట
      నురుపయోధరములు నురుపార రవికెలోఁ గాంచనాచలశృంగగరిమఁ దెలుప
      ముఖచంద్రుకెమ్మోవి ముద్దాడు రోహిణి నాసాగ్రమున మౌక్తికంబు మెరయ
      చెక్కులచిద్రంబు చిలికినారనిపించు కడవన్నియ కదానికమ్మ లమరఁ
      అట్లచూపులు చలన వసంతమాడ, సన్నదువ్వలువ పైఁట మైచాయఁ దెలుప
      నరవిభూతీషణావతి వగపులాడి, వచ్చె నొక్కతె హరిరాణివాస మనఁగ.

క. సడిసన్నఁ జేరి యొపపరి, నడవుల నందియలు మొరయ నడు మసియాడన్
      జెడు వారలుగని యబ్బుర, పడ నా రాజమణి వామభాగముఁ జేరెన్.
ఉ. ఎక్కడనుండి వచ్చిరొకొ యిర్వురు మువ్వురుఁ జూడ నన్నిఁటన్
      జక్కనివార లవ్విభుని చాయన చామనచాయమేనివా
      రక్కడఁ జేరి కేల్మొగిచి యంతట నింతట నిల్వ రిట్టివా
      రెక్కడనుండి వచ్చిరని యెవ్వరుఁ జూచి యెఱుంగ రేమియున్.
సీ. ఆదిగర్భేశ్వరుఁడగు పట్టభద్రుఁ డీరాజన్యుఁ డెక్కడిరాజొ యనుచు
      రాజుగా డాదినారాయణుఁ డీలీల నేతెంచె లక్ష్మీసమేతుఁ డగుచు
      నారాయణుఁడుగాడు శ్రీరామచంద్రుఁడో వైదేహితోఁ గూడివచ్చె ననుచు
      రామచంద్రుఁడుగాడు రాధాసమేతుఁడై వనవీథిఁ గృష్ణుఁడు వచ్చెననుచు
      నగుదు మీరుదలంచిన నట్టివాఁడు, యేల కలహింప మీకితఁ డెవ్వఁ డెట్టి
      వ్యాఘ్రి యెవ్వతె వివరింపవలయు ననిన, .............................
క. వారఁదఱు నోపుణ్యశ, రీర యితం డొక్కద్విజవరేణ్యుడు వ్యాఘ్రా
      కార పిశాచం బిది వా, రారంభం బిట్టులనుచు నామూలముగన్.
గీ. తెలిపి మీ రెవ్వరయ్య కన్నులకుఁ జూడఁ, జల్లనైనారు మీకటాక్షములు మిగులు
      జల్లనైనవి మీసుభాషణములట్లఁ, జల్లనైయున్న వని తపశ్రాంతి యణఁచి.
మ. అని నీచెంతనె ముందు మెల్లపుడు నీయారామసీముబులన్
      వనితారత్నముఁ గూడి యేము మృగయావ్యాపారపారీణు వ
      ర్తనచే వచ్చితి మిచ్చటన్ బహుజనారావంబు లేతేర నే
      మినిమిత్తం బని చూచి పోదలఁచి సుమ్మీ వచ్చినా మియ్యెడన్.
శా. ఇచ్చో మిమ్ములఁ జూచి ముచ్చటలు మా కీడేర సంతోషముల్
      హెచ్చెన్ జిత్రము లందు వీరికలహం బీడేర్చు టట్లుండఁగా
      నెచ్చెయ్యం బనిలేనిపాటలకుఁ దోచీనంత కొట్లాటకై
      రచ్చన్ గూడుకు నింతపెద్దలకు మేరా యిట్లు పోరాఁడగన్.
గీ. నాకుఁ దోఁచినయర్థంబు వాకొనంగ, మీకు సరిపోయియుండిన మెయికొనుండు
      కాకయుండిన ఖండించి కక్ష్యయిడుతు, యిత్తు నిందుకు నుత్తరం బిట్టులనియె.
సీ. సకలచరాచరాత్మకుఁ డీశ్వరుఁడు హేయమైన విశ్వమునకు నన్యుఁ డతఁడు
      హేయరాహిత్యుఁడు నేకదోషాత్మక ప్రకృతి శరీరసంప్రాప్తి చేత
      బరగె శుభాశుభఫలముల నందుచో సాక్షియై పరమాత్మ జలమునందు
      నబ్జమైయుండియు నంటకయుండిన యీశ్వరాజ్ఞయె శాస్త్ర మిట్టి శాస్త్ర

      మార్గసంచారి జీవుఁడు మతముచేత, నొక్కటొక్కటి జంట యైయుండు గాన
      గాదు వీరల నొక్కరిఁ గాదనంగ, నిద్దరును సరి గెలు పోట మిందు లేదు.
క. ఇందుకు నిదర్శనంబుగ, నిందుల నిర్వురును గూయ నీయామ్రరసం
      బొందించు ముక్తినన విని, యందులఁ బుష్కరుఁడు వ్యాఘ్రి యవగాహింపన్.
క. దానన్ మణిమయదివ్యవి, మానంబులు వార లెక్కి మౌనులుఁ జూడ
      శ్రీనాకపథముఁ బొందిరి, నానందరసాబ్ధిమగ్ను లై వారెల్లన్.
శా. ధీరంబుల్ మధురాక్షరంబులు నసందిగ్ధంబులున్ వేటలున్
      సారస్యంబులు నర్థగర్భితములున్ స్వల్పంబులున్ శైత్యగం
      భీరంబుల్ లఘువుల్ శ్రవోహితములై పెంపొందు తత్సూక్తముల్
      వారల్ మెచ్చుచు నాలకించి యచటన్ వశ్యాత్ములై యున్నచోన్.
క. అంత న్వారలుఁ జూడఁగ, నంతర్ధానంబుఁ జెందె నానుచరుండే
      యంతట మౌనులు లక్ష్మీ, కాంతుం డితఁ డేమరితిమి కనలే కనుచున్.
క. విలపింపుచుఁ గైవారం, బులు సేయుచుఁ జెట్టుఁజెట్టుఁ బొదపొద జాటుల్
      కలయంగఁ జూచి కలయో, తెలివిడియో యనుచు నలసి దిమ్మరి వగలన్.
క. ఆయామ్రతీర్థనికటను, హాయతనముఁ జేరి తపము లవ్విభుఁ జూడన్
      జేయదలంచిన యపుడవి, హాయనము మొలచెనను నయాలాపంబుల్.
క. చేరువగా నే నిదిగో, శ్రీరంగములోన సుజనసేవధినై ర
      క్షారూఢి నున్నవాఁడన్, గోరిక లీడేర్తుఁ జేరికొలువుఁ డటన్నన్.
ఉ. అందఱు నట్లుజేరి వసుధామరభూజము రంగమందిరా
      ళిందనివాసుఁ గొల్చి యవలీల నభీష్ట సమస్త సౌఖ్యముల్
      జెందిరి గాని మానవు లశేషము నీకథ విన్నఁ గామినీ
      నందన వస్తువాహన ధనంబులుఁ గాంతు రసంశయంబునన్.
సీ. అపుడు సుకీర్తిమహారాజు సేనతో నామ్రతీర్థస్నాన మాచరించి
      తనపురోహితుఁడు దెల్పినరీతి నచ్చట బహ్మాండఘటతిలసర్వతేభ
      సాలంకరణ గోసహస్ర హేమాచలహీరాది మణితులాపూరుషాశ్వ
      కన్యకా కామిీగణ పాంచలాంగలోభతో ముఖిచ్ఛాగసంచకాగ్ర
      హారముఖదానములు పెక్కు నాచరించి, దేవతాలయదీర్ఘికాధికము లైన
      సప్తసంతానముల నొంది యాప్తజనస, మన్వితంబుగ రంగధామంబుఁ జేరి.
సీ. ఏవీథిఁ జూచిన శ్రీవైష్ణవప్రబంధానుసంధానమహానినాద
      మేచాయఁ జూచిన వాచంయమీక్రతుస్వాహానునేతికోలాహలంబు

      లేమేరఁ జూచిన సామాదివేదవేదాంగపారంగతాధ్యయననినద
      మేజాడఁ జూచిన నిష్టమృష్టాన్నదానావాసఘోషశాంత్యాదిరావ
      మెచటఁ జూచిన నుపవనప్రచురరుచిక, వికచవిచికలముఖసుమప్రకరమధుర
      మధురసవివృద్ధసహ్యకుమారికామ, హాప్రవాహాయ తానుకూల్యాచయంబు.
గీ. చూచి యందందఁ గన్నులఁ జొక్కుచుండ, వినెడు చోటను వీనులవిందు గాఁగ
      నాడునెడఁ జిత్తమవ్వల దాటకుండ, నబ్బురమునొంది చనునోఁ దదగ్రమునకు.
సీ. కుంభద్ధ్వజాగ్రకౌశుంభాంశుకాంశుకసంధ్యాయమాననక్షత్రవీథి
      రమణీయరత్నతోరణరశ్మిరింఛోళిపింజరీకృతహరిత్కుంజరంబు
      కరిదంతవిదళితకావేరీతీరచూళిధూసరితరోధోదిశంబు
      సీమంతినీశిరస్సిందూరపరిభూతబాలార్కబింబప్రభామయంబు
      నిరత వారవిలాసినీ చరణకమల, మంజుశింజానమంజీరమధురనినద
      పూరముఖరితకనకగోపురసువర్ణ, పట్టకుట్టిమ మొప్పు నప్పట్టణంబు.
గీ. ద్రవిడవాగనాపాంగధాళధళ్య, సరణి యతనుండు మోహనాస్త్రములుఁజేసి
      వెలయ శ్రీరంగవీథుల విరహిహృదయ, గోళములు లక్ష్యములుజేసి లీలనేయు.
గీ. కలితకలకంఠకాకలకలరవంబు, మదనశాస్త్రోపనిషదర్థమంత్ర మగుచు
      వికచకుంజకటీగర్భ విరహమాణ, వీట విటపాళిఁ బ్రోదిగావించు వీట.
ఉ. శ్రీకరలీల నందులఁ బసిండిగృహంబులలోన సంగలీ
      లాకలహోత్సవంబున విలాసవతీ జఘనాంశుకంబు లు
      త్సేకమునన్ బ్రియుల్ దిగువ సిగ్గుల మున్గఁగఁ దన్నితంబముల్
      పైకొని చీరపైఁ బొదవు భాసుర గుగ్గులధూప ధూమముల్.
చ. కుసుమసుగంధు లచ్ఛమణికుట్టిమహర్మ్యము లెక్కి నిక్కి ధీ
      మసమున నాసికాభరణ మౌక్తికమౌ ననిపట్టిఁ జూచి రా
      క్షసగురుఁ ద్రిప్పిత్రిప్పి యళికంబగు బెజ్జము లేనితేటికిం
      బొసఁగదు గుడ్డపోచయని పోవఁగ మీటుదు రప్పురంబునన్.
ఉ. చండమయూఖు మీరు పురిసాల వినిర్మిత నాటశిల్పికా
      ఖండలు లుగ్రటంకకళికాశిపురంబులఁ బుండరీక గ
      ర్భాండకరండకర్పురపు టాంచలముల్ పగులించి తద్బహి
      ర్మండల నిర్మలోదకముఁ ద్రావుదు రూర్థ్వవిధానవేళలన్.
క. భూపాలనందన శ్మ, శ్రూపరికరములకొకింత యూరటగలదే
      యాపురి పుణ్యవధూటుల, చూపులు తముఁ జేరె నెదురుచూచుట దక్కన్.

సీ. వినుత సపక్షమేరునగాయమాన కేతనసమాకలిత రథవ్రజంబు
      ప్రబలనిర్జరసానుభోగశైలోపమ ధారాళదానవేదండకులము
      పవమానమానస జవజిగీషు నిరర్గళోన్నతత్తురగసముత్కరంబు
      పరవాహినీశనిర్బరనీరసారణ్య విలయాగ్నిసంకాశ బలచయంబు
      మహితగంభీరపరిమాయ సహ్య....., కన్యకాలయవాహినీ ధన్యతరము
      కేళికాదీర్ఘికాయి తావేల పుణ్య, పుష్కరిణి రంగధామంబు బొగడఁదరమె.
మ. నృపకంఠీరవుఁ డప్పురీవిభవముల్ నేత్రోత్సవం బొప్పఁగా
      నపుడీక్షింపుచుఁ దన్మహామహిమచే నానందముం బొందిలో
      చపలత్వంబులుఁ దీరి కాంచనసహస్రస్తంభమాణిక్యమం
      టపముం జేరి ప్రధానులం బిలిచి బండారంబు సర్వస్వమున్.
క. తిరువీథుల యిళ్ళిళ్ళకుఁ, దిరుమాలికలకును ధరణి దివిజులకును బే
      ర్వరుసల నాచార్యులకున్, నరవైష్ణవతతికి భూరివహిగా నొసఁగెన్.
క. ప్రాకారంబుల నొక్కొక, వాకిలిచోటు నెడదిరిగి వలగాజనుచున్
      శ్రీకర రంగ విమానం, బాకేలనగాంచి నమ్రుఁడై చేరంగన్.
సీ. రత్నకురంగమరాళపారావతక్రేంకారకలరావసంకులంబు
      నానామణీహిరణ్మయదర్పణప్రభారారజ్జమావతోరణగణంబు
      గంగాసువర్ణసైకతకవీషంకషశాతకుంభద్వయసంభృతంబు
      కనకపంజరగర్భగతకీరశారికాసంస్తూయమానరంగస్తవంబు
      భూరిపరమాన్నశర్కరాపూపసూప, గంధబంధురదశదిశాంగణము నైన
      గరుడమంటప మీక్షించి కదిసి దివ్య, ధామమైనట్టి శ్రీరంగధామమునకు.
క. ఎదురైన వైష్ణవావళి, పదములకున్ మ్రొక్కి ద్వారపాలకులకు న
      భ్యుదయాపేక్షం జాగిలి, మది దలఁగఁగఁ జేరి శ్రీవిమానములోనన్.
చ. పడగలు వేయుగల్గు నునుపానుపుపైఁ బవళించి పద్మపై
      నడుగులు నిల్పి యొక్కకర మల్లన సాచి కరం బొకండు పెం
      పడరఁ దలాడగా నునిచి యజ్ఞవిలాసవిలోకనంబులన్
      బొడము దయారసస్ఫురణఁ బోల్చిన రంగనివాసు నీశ్వరున్.
క. సేవించి ప్రణామంబులుఁ, గావించి తదీయమైన కల్యాణగుణ
      శ్శ్రీవిభవంబులు మదిలో, భావించి సుకీర్తివిభుఁడు ప్రణతు లొనర్చెన్.
సీ. శ్రీమదాదిమభోగశేఖరశయనాయ లోకలోచన శశిలోచనాయ
      మహనీయ రంగనామవిమానవాసాయ సహ్యకన్యా.... ... లగృహాయ

      చంద్రపుష్కరిణీప్రశస్తభూరిఫలాయ శోభనారామసంశోభితాయ
      ప్రతిదినోత్సవ శుభప్రదదర్శనాంగాయ హరముఖాద్యమరసమర్చితాయ
      భక్తసులభాయ లోకైకపావనాయ, మంత్రరూపాయ సింధుజామందిరాయ
      రంగనాయక సజ్జనరక్షకాయ, దేవరాజాయ తే నమస్తే నమోస్తు.
గీ. రంగనాయక కావేరిరంగ చెలువ, రంగ కస్తూరిరంగ భుజంగశయన
      రంగవైభోగ రంగ శ్రీరంగ యనుచుఁ, జూచి మెచ్చుల మునిఁగి యారాచమేటి.
సీ. శ్రీకరంబును బ్రణవాకార మైనట్టి రంగధామునకు శ్రీమంగళంబు
      మహియెల్ల నొకఫణామణి దాల్చు శయ్యాభుజంగమస్వామికి మంగళంబు
      తమ్ములేలని మీపదమ్ములు చేఁదాల్చు మంగళాకారుకు మంగళంబు
      భుజమధ్యమున మిమ్ముఁబూని చరించు విహంగవల్లభునకు మంగళంబు
      సజలజలధర కోమల శ్యామలాంగ, రంగదాకారునకు మీకు మంగళంబు
      హారిభవదీయ కరుణాకటాక్షములకు, మంగళము మంగళము నిత్యమంగళంబు.
గీ. అనుచు వినుతించు రాజుపైఁ గనికరంబు, చాలఁ గనిపింప శ్రీరంగశాయి యపుడ
      ధాతమొదలు విభీషణాంతంబుఁ గాఁగఁ, గలుగు తనరాక తెలివిడిగాఁగఁ బలికె.
క. వింటివి మత్కథఁ గన్నులఁ, గంటివి నామూర్తి దీనిఁ గడచిన భాగ్యం
      బొంటి మరిగలదె ధన్యత, మంటివి సుఖముండు మనుచు మరి యురకున్నన్.
క. ఆధాత్రీపతి రంగా, రాధాబహుమానవిధుల రంజిలి వెడలెన్
      శ్రీధామ మతనితో సం, బోధించెఁ బురోహితుం డపు డమితసూక్తిన్.
ఉ. చూచితివే నృపాలక విశుద్ధము సత్య మనంతశక్తి యు
      ష్మాచరితంబు రంగమహిమాహ్వయ దివ్యవిమాన మిందుపై
      గోచరమైన శృంగము లగున్ నిగమావళియే తదాకృతిన్
      లోచనపద్మమూర్తి బొదలుం బ్రణవం బజహర్విభూతితోన్.
సీ. శయనాసనాంశుక ఛత్రోపధానపాదుకల యుద్భవమని తోయజాక్షు
      సేవించుకతమున శేషి శేషత్వసమ్మద మీశ్వరునకును ఫణిపతికిని
      కలుగుట శేషాఖ్యఁ గాంచనియనఘుండు వీర్యతేజోబలైశ్వర్యశక్తి
      విజ్ఞానముల పేర విలసిల్లు షడ్గుణైశ్వర్యంబులని నివి చాల యునికి
      నయ్యెభగవంతుఁడని నీదృశాత్మగుణము, లందుఁ బరిపూర్ణుడగుట ననంతుఁడయ్యె
      గాన హరి కార్యభార మొక్కరుఁడె పూని, తలకు నెత్తుకుయున్నాఁడు తలకులేక.
గీ. అట్టివిశ్వంభరుని శేషు నాత్మలోన, దలఁచి తాదృశగుణధ్యానపరత నున్న
      వారలకు నెల్ల నిహపరవాససుఖము, లాత్మవలదన్న బోవక యనుసరించు.

క. ఈయీకు నీవిమానము, నీయహివరు నెవ్వరైన యెఱుఁగ కితర దే
      వాయతనసామ్యబుద్దిం బాయరు వారలకుఁ బాలుపడు నిరయంబుల్.
క. అనుఁడు పురోహితువచనము, విని యలరుచు రంగధాము విభవంబులకున్
      మనమున వెరగందుచు గ్ర, క్కున కోవెల వెడలె సైన్యకోటులతోడన్.
మ. కనియెన్ రాజు తదీయదక్షిణదిశన్ గావేరితీరంబునన్
      ఘనమార్గోపనిరోధకంబగు మహాగ్రావంబుఁ దా నందుపైఁ
      దనయాప్తావళిఁ గూడి యెక్కి యతులోత్సాహంబుతో సహ్యనం
      దన సౌభాగ్యము రంగధామమును గాంతారాశ్రమవ్రాతమున్.
క. కనుఁగొని మెచ్చుచు గిరిపైఁ, దనకన్నులనెదుర నంతధారుణిఁ గనియెన్
      గనినంతయు నర్చించెన్, జనపతి శ్రీరంగధామ సదనంబునకున్.
చ. పొడగనవచ్చు వారికిని భోగమువారికి నాటకారికిన్
      దడిగెలు మోచువారికిని దండలుగట్టెడువారికిం బ్రియా
      నడపుతలంపువారికిని నంబులవారికి సాచినట్టి యు
      బ్బడుగుల బోయివారికి ధనాంబరభూష లొసంగెఁ బొంగుచున్.
చ. అది గిరిదుర్గమై దనరు నంతకుఁ జుట్టును గోలలట్టడల్
      సదనములు న్నగళ్ళు వనజాత లగడ్తలుఁ గొత్తడంబులున్
      బదిలములై యెసంగ యొకపట్టణ మందముగా నొనర్చి తా
      మదగజ ఘోట వీరభట మంత్రి వధూటులతో వసింపుచున్.
క. దినమున్ శ్రీరంగమునకుఁ, జనుచున్ రంగేశు దివ్యచరణాంబుజముల్
      గనుచుం గుమ్మరుచున్ బహు, దినములు వర్తించె నపరదివిజేంద్రుఁ డనన్.
శా. ఆరాజోత్తముఁ డిట్లు వర్తిలి తలంపంతర్ముఖంబైనచో
      శ్రీరంగేశు నిజాంశసంభవుని సుశ్రీలున్ సునామున్ సుతుం
      గారామొప్పఁగ రాజ్యలక్ష్మి కభిషేకం బింపుమైఁ జేసి తా
      నారమ్యాశ్రమవాసమందు మునిచర్యన్ రంగరాట్సన్నిధిన్.
క. కొన్నాళ్ళు నిలిచి శ్రీపతి, సన్నిధికిం జనయెఁగాన జను నీకథ పే
      ర్కొన్నను విన్నను జదివిన, సన్నుతసౌభాగ్యముల నొసంగుదు రెందున్.
క. అనిన భరద్వాజుం డి, ట్లను నావాల్మీకితోడ యల్లది కంటే
      విను మోయి నల్లనై యొక, పెనుమ్రాను మహానగంబు పెంపువహించున్.
సీ. మఱియుఁ జూచి క్రుమ్మరుచున్నవార లాక్రింద నానామౌనిబృంద మెపుడు
      శ్రీఖండతామ్రపర్ణీపరిమళ శీతమలయానిలంబులు మలసె నిపుడు

      సామాదినిగమఘోషంబులు వీనులపర్వమై యాచాయఁ బర్వె నిపుడు
      సంతతావహనీయసమిదున్ముఖోద్ధూతధూమమాలికలు పైఁదోఁచె నిపుడు
      నగముమాత్రంబు గాదిది నాకుఁ జూడ, పద్మలోచను విశ్వరూపంబు గాని
      యచట వింతలుగలనని యాత్మఁదోఁచెఁ, జేరి చూతమెయనినఁ బ్రాచేతనుతుఁడు.
మ. అదియే కాదె కదంబతీర్థము సమస్తారాచనీయంబు నీ
      విది నీక్షింతువు గాక రమ్మనుచు మౌనీంద్రుండు వాల్మీకి యా
      హ్రదమున్ డాయఁగ నేగ నచ్చట మునీంద్రవ్రాత మర్ఘ్యాధిక
      ప్రదులైన న్నది మెచ్చి వారలను సంభావించుచు న్మెచ్చుచున్.
ఉ. కొందఱకున్ బ్రణామ మిడి కొందఱు మ్రొక్కిన నాదరించి తాఁ
      గొందఱఁ గౌఁగిలించి మఱికొందఱ హస్తవిలోచనాదులన్
      విందొనరించి వారిడ పవిత్రపవిస్తరణంబుపై ననుల్
      క్రందుగనుండ నుండి ఘను గౌతము సంయమి జూచి యిట్లనున్.
ఉ. యూపము లగ్నికుండములు హోమపదార్థములున్ సమిత్తులున్
      దాపసకోటి పాత్రలు సుదర్భలు సుక్సృవముల్ సమస్తమై
      చూపుల కిమ్మఘంబుఁ గడుంఁజోద్యముఁ బుట్ట సమాప్తిగాని యె
      ట్లే పొలు పేదియున్నయది యత్తెఱఁ గానలియిమ్ము నావుఁడున్.
సీ. అడిగితి రిందులేమనువాఁడ మీమాటఁ గాదని జవదాటరాదు గాన
      బలికెద మిథిలాధిపతి యిందు జన్నంబుఁ గావింపుచును ఋత్విగావళికిని
      బహుపదార్ధము లిచ్చి భక్ష్యభోజ్యాదులఁ దృప్తినొందింప ఋత్విగ్గణంబు
      బలుతిండిచేఁ జాలబల్మారిసోమరితనములఁ బరికరద్రవ్యమెల్ల
      మరిచి పదిలంబు సేయ నేమరి తదీయ, శాల నిద్రింప శునక మచ్చాయ నొకటి
      యిచ్చంకొచ్చి పురోడాశమెల్ల మెసవి, యాజ్యపాత్రలు దొలిపి తినంత జనియె.
క. అది యింతయు నెఱుఁగక నె, మ్మది యాగముఁ దీర్పఁబూని మంత్రము తంత్రం
      బది యిది యనిదోఁచక దిగు, లొదవఁగఁ గాశ్యపునిఁ జూచి యుల్లము గలుఁగన్.
గీ. మంత్రములు రాక యవి నడమంత్రమయ్యె, జన్న మేరీతిఁదీర్చు రాజెన్న నతఁడు
      నన్ను కొను నెమ్మనంబున నన్ను నడిగి,...................................
క. పావన కర్మంబులచే, గావింపఁగ నర్హమైన క్రతు విట్లశుచిం
      గావింప నెందుఁ దీరదు, కావున నజ్ఞాన మపుడు గప్పెను నన్నున్.
క. ఎంతటివారికిఁ దెలియని, యంతటిపని యేనుఁ దెలియ కాకశ్యపుతో
      నంత మహాశ్రేయమునకు, నెంతయు విఘ్నములుగాక యేలా మానున్.

శా. చేయ న్వేడినయట్టి యర్థము మదిం జింతించి కానంగఁ లే
      మీయజ్ఞానము పద్మపత్రనయనుం డేలాగు వారించునో
      చాయాధీశుఁడుఁ జీఁకటుల్ గడుపు నోజన్ గాన మన్యంబు నే
      ఛాయం జర్చయొనర్చి యున్న విని యాసర్వంసహాదేవతుల్.
క. మిథిలాధినాథు మునుఁగొని, యధిక తపోధ్యాననిష్ఠులై చిత్తములన్
      విధియు నిషేధముఁ దెలియక, మధుసూదను చరణకమల మందాత్మకులై.
క. ఉన్నారవ వాల్మీకియు, జన్నము గడ తేరునొక్కొ సంయమివరు లే
      యెన్నికఁ గడతేరుదురో, యన్నియుఁ గండ మనియున్న నాసమయమునన్.
సీ. ఏలీలఁ జేసెనో యీయహీనశయాన మచ్చుగా పులితోలు పచ్చడముగ
      నెటులయ్యెనో జటామకుటరత్న మమూల్యహీరాదిరత్నకోటీరరాజ
      మేగతిఁ బన్నెనో యక్షేశు మాలికానలయంబుగాగఁ జుట్టలుగువాలుఁ
      గావించె నెట్లకో కమ్మగంధపుఁబూక లేతగా భసితవిలేపనంబు
      యోగిమానసములయందు నుండు ప్రోడ, యోగి గా నేరఁడే రంగయోగి యనుచు
      ఖచరులు నుతింప సిద్ధసంకల్పుఁ డైన, మూలవేలుపు మౌనులమ్రోల నిలిచె.
క. మఱికొందఱు శిష్యులుఁ దమ, యరుతనె వేదాధ్యయనపరాయణులై రా
      పరమారాధ్యుం డాయెడ, నరుదేరఁ బ్రణాములై మహామును లెల్లన్.
గీ. కరములు మొగిడ్చినిలిచిన బరమమునులఁ, గాంచి మీ రేల యసమాప్తకర్ము లగుచు
      నున్నవారలు గావింపజన్న మేల, మానితిరి సేయుఁడన్న నమ్మౌనిగణము.
శా. దేవా! తోఁచవు మంత్రతంత్రములు సంధిల్లన్ మహాజ్ఞాన మే
      త్రోవం జన్నముఁ దీర్పఁగాన మిది యందున్ జెల్లె మీచేతఁగా
      కీవృత్తాంతముఁ జిక్కువాప నొకఁ డేడీ నీవె సాక్షాద్ద్రమా
      దేవీవల్లభమూర్తి వౌట కొక సందేహంబు. లే దాకృతిన్.
గీ. అనిన నయ్యోగినరుఁ గనినట్ల వారు, పలుకఁగా విని కొన్నిమాయలు నటించి
      కన్నుఁగవ మూసి భావించుకరణి నుండు, దెలియువాఁడౌచు లేనవ్వు చిలుకఁ బలికె.
క. మీరెఱుఁగరు గా కెఱుఁగని, వారెవ్వరు మనుజులెఱుఁగ వార్త లటుండెన్
      భూరుహములైన నెఱుఁగున్, శౌరి సమస్తముననుండు సాక్షిత్వముగన్.
మ. విదితాత్మీయ మహామహీరుహసమావిర్భాషఘాటంబుచే
      నిదిగో చెంత కదంబభూరుహముచే నీవేళఁ బల్కింతు నె
      య్యది ము న్నట్టితెఱంగె పల్కు కరియై యేతేరఁ దా సాక్షి యౌ
      నది యేశాస్త్రము మర్త్యులే పలుక మీ రేతెండు నావెంబడిన్.

గీ. అమ్మహాభూమిరుహమున కర్ఘ్యపాద్య, ధూపదీపనైవేద్యనాదులు సమగ్ర
      ములుగఁ గావింపుడనిన మౌనులుఁ జెలంగి, రాజునకుఁ దెల్ప కతఁ డపారంబుఁగాఁగ.
క. ఆకులుఁ బోకలుఁ జీరలుఁ, గోకలు నైవేద్యములును గుజ్జులు వన్యా
      నేక ఫల భక్ష్య శర్కర, శాకాదులుఁ గడిమి మ్రానుజాతరఁ జేసెన్.
క. శ్రీరంగరాజయోగి మ, హారాజుం గాంచి చాలఁ దనియఁగఁ బూజల్
      పేరాకట నీభూజము, నేరదు పలుకంగ సాక్షి నిక్కం బనుచున్.
క. అందఱుఁ జూడఁగ సజ్జన, మందారం బపుడు కడిమిమ్రానుగ విశితా
      నందు సుఖాసీనుండై, యందుకొనియె వార లిచ్చు నర్చాదికముల్ .
గీ. పూజలు సుభోజనంబు లీభూజమునకుఁ, జాల వనుమాట విని రాజసచివకోటిఁ
      బంచి నైవేద్యమునకుఁ దెప్పించే నేమి, కోరినను రావె కావేరి తీరమునకు.
సీ. పనసరసాలాది పరిపక్వఫలరసం బమృతమవాహిను లై గమింప
      మృదుకోమల సుగంధ కదళికా ఖర్జూర ఫలరాసు లంద కర్పరము నొరయ
      నారికే ళామ్ల జంబీర పుణ్యఫలంబు లజహానబోనిసమాహన మొనర్ప
      లికు దేక్షు జంబూ క్రముక దాడిమీ ఫలప్రకరమావరణ వైభవముఁ జూడ
      చంపకోత్పలకుందవాసంతికాది, నవ్యసుమధామకాయమానములు మెరయ
      కాశికాగరు కర్పూర ఘనకరండ, ధూపధూముంబు నెరయ వీచోపు లమర.
శా. కేలనా బంగరు గచ్చుఁగోల లులియన్ గేలీపతిం బణ్యకాం
      తాలోకం బసమాస్త్రుఁ గట్టికలనందన్ జైత్రగాథాళుల్
      లీలం బాడెడుగీతి నయ్యెదురఁ గోలే కోలు కోలన్న కో
      లాలాపంబుల దండ లాస్యముల నాట్యంబుల్ మిటారింపఁగన్.
శా. వీణావేణుమృదంగకాహళరవావిర్భావముల్ తూర్యని
      స్సాణాభంగురశంఖదుందుభిరవస్వానంబు దిగ్వీథులన్
      రాణింపం జతురంగసైన్య వివిధారావంబు ధంధంధణ
      ద్ధాఁణధ్వానఢమామికార్భటి నృపాంతక్షోణి ఘోషింపఁగన్.
సీ. అతిరసంబులుకొండ లప్పాలుతిప్పలు బూరెలరాసులు గారెగట్టు
      లిడ్డెనలన్నలు లడ్డువాల్ గుట్టలు గరిశవపోగులు నరిశ మెట్టు
      లప్ప డాలకొఠారు లమృతఫలాదులు వడకుప్పలు దూదిమణుగుగిరులు
      మణ్యంగికణజముల్ మధుశిరోగ్రాసంబు బొబ్బట్లు శైలంబు లుబ్బుకుడుము
      సారువులు నుప్పుటుండలు మేరువులు ను, షారులదీవులు నేతులశరధు లమర
      బ్రేమ నైవేద్యములు సమర్పించఁ జెట్టు, మీఁదఁ గూర్చుండి యయ్యోగి మెసవుచుండె.

గీ. అరఘడియలోన నన్నిపదార్థములును, చెట్టుచే తినిపించె సిద్ధయోగి
      మరియు దైవంబులో నీళ్ళు ధరణిఁ జల్లి, నంది గొనిపోవు భక్ష్యభోజ్యంబు లెల్ల.
క. అనుచు కరంబులు మొగిడిచి, మునులందఱుఁ జూచునెడ బ్రమోదాత్మకులై
      జనపతి కదంబశాఖిన్, గని వినుతించె న్ముదశ్రుకణములు దొరుఁగన్.
సీ. ధ్యాన ముర్వీరుహోత్తమసార్వభౌమున కావాహనము కుటజాగ్రమణికి
      కనకాసనము బాగణపట్టభద్రున కర్ఘ్యంబు సాలవంశాధిపునకు
      తరుషండచూళికాభరణంబునకు పాద్య మగశేఖరునకు భూపార్చనంబు
      దీపమనోహకాదిమకీర్తనీయున కలరు దోయిళ్ళు నగాధిపతికి
      వృక్షహర్యక్షమునకు గంధాక్షతంబు, వరుస నైవేద్యములు లతావల్లభునకు
      హరికి సాష్టాంగములు కదంబాఖ్యామూర్తి, కభినుతులు మీఁదనున్న మహాత్మునకు.
గీ. అనుచు నానావిధంబుల నభినుతింపఁ, జెట్టుతోఁ గూడి నయ్యోగిశేఖరుండు
      వెరుగుమై రాజు మునులును వినుచునుండఁ, బుట్టె నొకమాట యమ్మహాభూరుహమున.
క. మీనుతులచేత నలకితి, యేనందితి మీర లిప్పు డిచ్చినపూజల్
      మీనేరముచే సవనము, హానిం జెందెనని తెల్పె నత్తెరఁ గెల్లన్.
క. ప్రారంభిం చిపుడులకందతలు, దీరె హవిర్భాగములకు దివిజులు మింటన్
      బారులు దీరిచి మంత్రము, లారూఢము లయ్యె మీహృదాబ్జంబులతోన్.
క. యాగంబు దీర్పుఁ డే నృపు, రాగము నొందించి నిజపురము జేర్పుదువే
      వేగనని యూరకున్నను, ధీగణములతోటి కలకదేరిన బుద్ధిన్.
ఉ. ఆమహనీయయాగము సమాప్తి యొనర్చి కృతార్థచిత్తులై
      భూమివరేణ్యుచే నలఘుపూజలు గైకొని హేమరత్నభూ
      షామహితాంబరావళుల సత్కృతి జేసిన నంది యమ్మహా
      భూమిరుహంబుచెంత మునిపుంగవు లున్నెడ నద్భుతంబుగన్.
గీ. చెట్టులో దూరి డాగినయట్టి యోగి, కొమ్మగుప్పున వెలువడి గోచరించి
      యిలకు డిగి బ్రహ్మతేజంబు బర్వ, శిష్యులును దాను యెవ్వారిచెంతఁ జనక.
సీ. ఒకరికంటికి రాజయోగియై కనుపట్టి యొకరిచూడ్కికి మౌని యొరపుఁ దాల్చి
      యొకరిభావమునకు నుర్వీసురత నిల్చి యొకరిడెందమున దేశికతఁ దోఁచి
      యొకరి కీతఁడు శౌరియురగాయు డనిపించి యొకరికి రంగనాయకతఁ జూపి
      యొకరి కీతఁడె బ్రహ్మమొకొ సత్యమనిఁ జాటి యొకరికి యీశ్వరుఁడను యూహ నొసఁగి
      యందరికి నన్నిరూపులై యరుగునపుడు, కణ్వశరభంగకాశ్యపగౌతమాది
      మునులు వలగొని యచటికి జనెదరయ్య, మీకు పేరేమి యెందుండి రాక మొదట.

క. ఇందఱు నీచేఁ బ్రాణముఁ, బొందికగల బొందియట్ల పొరవిరి నిత్యా
      నందస్వరూప నీకృప, నొందెను మంత్రస్వరూప ముల్లమునందున్.
మ. అని నావెంబడిరండు దాఁచ నిఁకనేలా మీకు మద్వర్తనం
      బనిశం బిచ్చట రంగమందిరమె నాాయావాస మే రంగధా
      ముని సంజ్ఞం జనువాఁడ రాజు సవనంబున్ గాంచు బుద్ధి న్మహా
      మునులన్ మిమ్ముఁ గనుంగొనన్ దలఁచి యిమ్మూర్తిన్ విడంబించితిన్.
గీ. నాకు నిపుడీ స్థలాభిమానంబుచేత, యాగమున కిందు కొఱఁత దా నగునె యనుచు
      రావలసె మీకు నిమ్మహారాజునకును, బ్రేమనిచ్చితి శ్రీరంగధామ పదము.
చ. కొలిచి కృతార్థులై మనుఁడు గోరిక లిచ్చితి నంచుఁ బోవుచో
      హలకులిశాంకుశాంబుజ మహత్తరలక్షణలక్షితంబులౌ
      జలధిశయాను పాదజలజాతశుభాంకము లున్న సైకతా
      చలములు జూచి మ్రొక్కుచుఁ బ్రసన్నమనోరథులై మహామునుల్.
మహాస్రగ్ధర. వసుధీశుం గూడి పార్శ్వం బెలమిఁగొలిచి రా వందిబృందంబు పాడన్
      అసమానామ్నాయముల్ నల్లడ భటులలీలన్ బ్రఘోషింప దివ్యుల్
      ప్రసవంబుల్ ముందరంగాభరణ మపుడు శుభద్విమానంబులోనన్
      శ్వసనాంకూరాత్మకుల్ మేల్ సమధికఫణిరాట్శయ్యపై బవ్వళించెన్.
గీ. అప్పుడా రాత్రి కానంగనాయె రత్న, రాజనీరాజనోపచారములు నిగుడ
      నతి విభూతిఁ బ్రకాశించు నాదిదేవు, రంగనాయకుఁ జూచి సాష్టాంగ మెఱఁగి.
లయవిభాతి. రంగశయనాయితభుజంగ కరుణారసతరంగ విహఁగోత్తమతురంగ నినుతత్సా
      రంగకర దాసజన మంగళకరస్ఫురదపాంగ ధృతవారిజరథాంగ గిరికన్యా
      భంగుర తపఃఫలశుభాంగ శశిపుష్కరపదాంగణవిహార మునిపుంగవమనస్సా
      రంగ జలదోపరిపతంగ శశిలోచన తరంగితనివాస జయమంగళనివాసా.
గీ. అనుచు నన్నుతు లొనరించి యవ్విమాన, దర్శనమహత్వమున గృతార్థత వహించి
      వెలయుభాగ్యంబుఁ దమలోన దలఁచి పొగడి, మనమున కదంబభూజంబు మహిమ మెచ్చి.
క. లోకస్తవనీయుఁడు వా, ల్మీకి భరద్వాజు గూడి మెలఁగెననుచు సు
      శ్లోకుఁ డగువ్యాససంయమి, నాకప్రవరుండు మునిగణంబుల కనియెన్.
గీ. ధరణిజను లెవ్వరైన గదంబతీర్థ, రాజమహిమంబు వినినవారలకుఁ గల్గు
      నాయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధు, లకలుషు శ్రీరంగనాయకుని గరుణ.

క. పాయకఁ గదంబభూజ, చ్ఛాయన్ విహరించువారు సౌరమహీజ
      చ్ఛాయ నెలకొందు రచటన్, వ్యాయామ మొనర్తు మస్మదాదుల మనినన్.
మ. సనకాద్యుత్తమయోగిమానస సరోజవ్రాతసప్తాశ్వ స
      జ్జనతాదిత్యయదావదాహనశిఖాజ్వాలవళీవారిదా
      కనకాక్షా సురగర్వభూమిధరలేఖవ్రాతరాజన్య భూ
      జనరక్షా కరబద్ధకంకణసమర్చాముఖ్య హస్తాంబుజా.
క. వైకటికచంద్రపుష్కరి, ణీకమలవృషత్పుషీతనీపదమానా
      వ్యాకందమాన సుమమా, ల్యాకల్పితహృదయ సజ్జనావన సదయా.
మాలిని. బహుళమునిజనాంతఃప్రస్ఫుట బహ్మవిద్యా
      నిహితచరణయుగ్మోన్మేష సత్యప్రభావా
      బహిరబహిరవస్థా ప్రౌఢలోకాంతరస్థా
      జహరజహదమోఘేచ్చా నిసర్గప్రధానా.

గద్య
ఇది శ్రీ వేంకటేశ్వర వరప్రసాదాసాదిత చాటుధారానిరాఘాట సరస చతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకల విద్వజ్ఞనాధార కట్టహరిదాసరాజగర్భాబ్ధి
చంద్రవరదరాజేంద్రప్రణీతంబైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యం బను మహాప్రబంధంబునందు
షష్ఠాశ్వాసము