శ్రీరంగమాహాత్మ్యము/దశమాశ్వాసము

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

దశమాశ్వాసము

      శ్రీమానితాంబరీష ధ
      రామండల రమణ నిజపురాతన పుణ్య
      శ్రీమంగళవిగ్రహ తను
      తామగ మునియూధ వేంకటాచలరమణా.
వ. అవధరింపు మిట్లు నాగదంతమహామునికి వ్యాసు లానలిచ్చిన తెఱంగు సూతుండు
      శౌనకాదుల నుద్దేశించి.
శా. విన్నా సర్వశుభావహంబగు సుఖావిర్భావమౌ చూచినన్
      పున్నాగంబను తీర్థరాజ మది యొప్పున్ చంద్రకోనేరుచెం
త న్నిర్వాణరతిన్ సువర్చనుఁ డనన్ ధాత్రీశ్వరుం డొక్కఁ డ
      వ్వెన్నుం జేరును ముక్తుఁడై యనిన తద్వృత్తాంత మాద్యంతమున్.
క. తెలపమని నాగదంతుఁడు, పలికిన నియ్యకొని వ్యాసభట్టారకుఁ డ
      వ్వలికథ వేడితి గావున, కలుషవిముక్తుఁడవు మౌనిగణములయందున్.
గీ. జననముల నొంది యేకవింశతిశరీర, దుఃఖములు కర్మసంగతి దొడరుచుండ
      దాని నత్యంతము లయంబుగా నొనర్చు, జాడ యిది దాపు యిది ముక్తిసౌధమునకు.
క. సరమైకాంతులు ధర్మా, చరణులు సత్యవ్రతులు ప్రశాంతులు ఋషులున్
      నిరతము నీకథ వినుచున్, జరుపుదురు దినంబు లిది ప్రశస్తము వినుమా.
సీ. అనఘ గౌతమమహామునిశిష్యులు సుమంతుఁడును నందుఁడు సమాఖ్యులనెడి యిద్ద
      ఱమ్మునిబాలకు లాచార్యసన్నిధి నధ్యయనము చేసి యతనివలన

వేదముల్ మొద లెల్లవిద్యలు నేరిచి తజ్జన్యమైన మేధానిరూఢి
      నలరి వసిష్ఠమహామునియాశ్రమం బనతిదూరము గాన నచటి కరిగి
      యమ్మునీంద్రున కభినందన మ్మొనర్చి, నిలుచుటయు వారి యాకారవిలసనములు
      గాంచి మీ రెవ్వరన వారు గౌతమునకు, శిష్యుల మనంగ మెచ్చి వసిష్ఠుఁ డనియె.
క. ఎయ్యది జదివితి రనవిని, యయ్యా నిగమములు నాల్గు యనవిని మే ల్మే
      లియ్యాకారము లరసిన, యయ్యర్థం బడుగ నేల యడిగితి దానన్.
శా. ఏదీ మీకు గురూపరిష్టమును మీ యిచ్ఛానురూపంబులౌ
      వేదం బొక్కటి యుచ్చరింపుఁ డన నవ్విప్రార్భకుల్ వీనులా
      హ్లాదం బొందఁగ జోడుగా శుతిహితంబై మీకు విన్పింప వి
      ద్యాదీక్షాగురు నమ్మహాముని మనం బానందమున్ బొందఁగన్.
గీ. చాలు నుచ్చారణాభ్యాసశక్తులందు, బాలుపడినారు గౌతముపాటి గురుని
      శిక్ష యిదియేల యొచ్చము ల్జందుఁగాన, మంచివారౌట మీ రభ్యసించవలయు.
క. ఆవెలితిఁ దీర్చుకొనుచో, నీవేదము లెల్ల మీకు హృద్గతమని యా
      పావనముని యావటువుల, కీవిధమని మర్మసరళు లేర్పడఁ బలికెన్.
క. వేదార్థరహస్యము లీశాదులకును దుర్లభంబు లివి మరుగిడ లే
      దాదేశించితి జనుఁ డన, మోదంబున మరలివచ్చి మునిబాలకులున్.
ఉ. ఆదర మొప్ప గౌతముని యంఘ్రులకున్ బ్రణమిల్లి మౌని యా
      గాదివిశిష్యులన్ జులకఁగాఁ గని యోరిదురాత్ములార మీ
      రేదెస కేగినార లిపు డెక్కడనుండి తలంచి క్రమ్మఱన్
      నాదుసమక్షమంబునకు వచ్చినవారయి వచ్చినా రనన్.
సీ. ఆదరంబున విను మోదేశికోత్తమ యలవసిష్ఠమునీంద్రు నాశ్రమంబు
      చేరి మీ రానతిచ్చిన యాగమము లెల్ల వినుపింప నలరి యావేదవేత్త
      మఱియుఁ దా నాగమమర్మంబు లగుకొన్ని యుపదేశ మొసఁగి మీయొద్ద కనిచె
      ననుమాట వీనుల నాలించి భగ్గున నెయ్యంటునాహవనీయు నటుల
      మండిపడి నిండచమటలు మఱియుగ్రమ్మ, కన్నుగోరుల నంగారకణము లురుల
      బొమలముడిగొన నాగ్రహంబున మునీంద్ర, బాలకులఁ జూచి యొకవేడిపలుకు బలికె.
క. నాకును బ్రియశిష్యులరై, మీ కవ్వల నొక్కగురుఁడు మిశ్రములనుచున్
      జేకొని యిటకును నెంతయు, రాకునికిని దెల్చవత్తు రా మీరిటకున్.
గీ. మీరు నాకును శిష్యులు గారు నేను, మీకు గురుఁడను గాను ప్రాడ్వాకులార
      మీకుఁబడినట్టిట్టిపా టెల్ల మిథ్య యయ్యె, అలవసిష్ఠుండు నాకెక్కుడా యటంచు.

క. కోపించి పిశాచులరై, పోపొండని వారిఁ దిట్టి పొసఁగదనక తా
      శాపం బొసఁగినవా ర, త్యాపన్నత వేడి నెడి యశ్రులు రాలన్.
క. వగచుచుఁ బదములపైఁ బడి, తగునే యోతండ్రి యేమితప్పితి మేమీ
      వగ లదరి జేరుదుమని కడు, దిగులున వినుపింపఁ గరుణ తేకువ నతఁడున్.
ఉ. ఏల విలాపముల్ కినుక యించుక తాళక మించ బల్కితిం
      బాలకులార మి మ్మతికృపానిధి రంగనివాసుఁ డిందిరా
      లోలుఁడు గట్టుఁ జేర్చు నతిలోకుఁ బరాశరుఁ జూచునంత మీ
      జాలిదొలంగుఁ బొండనిన శాపము తమ్ముఁ బరిగ్రహించినన్.
సీ. అతిభయంకరశుష్కితాంగయష్టులతోడ పుడమిఁజేరెడు పల్లజడలతోడ
      వర్తులారుణభయావహలోచనములతో తెమలరాని మహోదరములతోడ
      ననశనామయవివృతాస్యగర్తములతో దారుణక్రూరదంతములతోడ
      నిరసనకాష్టసన్నిభకరంబులతోడ కడుబొడవౌ కుత్తుకములతోడ
      కనవమసిరాసియిడు పెండెకట్లతోడ, చిట్టి కమరెత్తు జీపురబొట్లతోడ
      ప్రేవుజన్నిదములతోడ నావులింత, లిడి పిశాచంబులైరి వారిరువు రపుడు.
క. ఒదుగుచు నెప్పటిమేనులు, వెదకుచు నెవ్వారు లేని విజనస్థలముల్
      కదియుచు నిజధర్మంబులు, వదలక హింసాచరణనిసర్తకమతులై.
క. రంగద్వారముఁ జేరి ని, జాంగశ్రమ మపనయించి యచ్చటి మౌనుల్
      గంగాధరచరణాంబుజ, భృంగాయతహృదయులగుచు పేర్చినమదితోన్.
సీ. సకలపుణ్యపురాణప్రసంగములను, వెడయువారలఁ గని చింత నిలిచి తారు
      గోచరింపక వారాడుకొను సుభాషి, తముల నిలయెల్లఁ గ్రుమ్మరు తలఁపువొడమి.
వ. అప్పటినుండి నిగూఢసంచారంబున సుమంతసునందనుల తమకలుషంబులు
      దొలఁగించు సనాతనుండైన పరాశరబ్రహ్మ సాక్షాత్కారం బెచ్చట సిద్ధించునో
      యని యమనియమాసనప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణసమాద్యష్టాంగ
      యోగనిరంతరాభ్యాసనపరాయణ నానాయోగిజనశరణ్యం బైన నైమిశారణ్యంబు
      ను, నిజసందర్శనమాత్రభూస్వర్గాపవర్గవైభవోదారం బైన కేదారంబును, దేవానాం
      పూరయోధ్యాయను శృతివచననిదర్శనంబై నిర్వాణలాభతత్పరపరమభాగవతా
      రాధ్యయైన యయోధ్యయును, రుక్మిణీసత్యభామాప్రముఖాష్టమహిషీసహచరశ్రీకృ
      ష్ణచరణసరసీరుహన్యాసమానమణిసౌధద్వారకయైన ద్వారకయును, జననావసర
      ప్రసూతిమారుతపరిధూయమానజననీజాఠరగోళపరిపీడ్యమాన విణ్మూత్రపూయాశృ
      త్యున్మేళనసంతప్యమాన జంతుర్యధావిషవల్లివిచ్ఛేదనకారణాసి యైన వారణాసి

      యు, శంబరారాతిశాంజరవిడంబన మోహినివ్యూహాయమాన జగన్మోహనవిలాస
      రుద్రకన్యాసహస్రసింజానచరణమంజీర ఝణఝణత్కార శకలికధైర్యకంచుక
      కుమారచంగదూవాలంబైన శ్రీశైలంబును, నికటాకూటదరీఝరీలహరిముహుర్ముహు
      రుత్వవీతజలశీకరసమాకలితమరుత్కిశోరదంభోళిథారవిదారిత ప్రసన్నజనజనాం
      తరార్జితమహామోఘకుతిలీలంబైన వేంకటాచలంబును, నిజాచరితజపతపస్వాధ్యా
      యాదిసుకృతపరిపాలాయమానాశ్రాంతశ్రవణధన్యతావలయం బమ్మహాయోగిజన
      సంస్తూయమాన వీరపుంభావవేళారణద్గణికాకాంచలకాంచి యైన కాంచియును,
      ఆదివరాహమాహత్యసుధావృష్టిప్రశమితభవాతపోష్టంబైన శ్రీముష్ణంబును, మో
      క్షలక్ష్మీసౌధనిశ్రేణికాశ్రేణికాయమాన సుధాసౌధనిర్మాణంబైన కుంభకోణం
      బును, జహ్నుకన్యాసాపత్య మత్సరసమాచరితతపోబలపరిలబ్ధనిజాతిశయ హేతు
      శ్రీమద్రంగవిమానపరివృతప్రవాహధన్యయైన కవీరికన్యయును, స్వశ్రేయససం
      ధాయకసార్థం బైన జంబూతీర్థంబును, సాతృజనవ్రాతసందర్శనమాత్రదూరతా
      పాస్తవైతరణియైన చందపుష్కరిణియును, మున్నుగాఁగల తీర్థక్షేత్రదైవతం
      బుల నాలోకింపుచు నెచ్చట మనోరథంబు సఫలంబు గానక నప్పిశాచద్వయంబు
      తదగ్రభాగంబున.
మ. కని రాతీరవనీ రసాల కదళీ ఖర్జూర బిల్వాగమున్
      వనితాత్మీయమహత్వవారితమహాపాపద్యఘావేగమున్
      జనురాదిత్రిదశప్రచారభవకాసారోగ్రపున్నాగమున్
      వనజారాతిస్తరోగ్రభాగమున పేన్యంబైన పున్నాగమున్.
సీ. రంగేశపూజాపరాయణ మునిరాజ మశ్రాంతయోగిసంయమి సమాజ
      మాహవనీయాగ్నిహననముద్ధితధూమమధ్య యనాధ్యాప కాగ్రజన్మ
      మతిథిసంతతసపర్యాసక్తమౌనీంద్రమనితరేతరవైరవనమృగౌఘ
      మంబు భక్షణభజనాప్తజటాలోక మహరహస్మరణసన్నాహ సుజన
      మాస్తిమితవిషయాసంగమార్యసేవ్య, మాప్లవనక్రూరకర్మవిఘాతకరణ
      మాకలితరంగమాహాత్మ్య మతిపవిత్ర, మాచరితయోగమైన యయ్యాశ్రమమున.
మ. ప్రసవంబుల్ గొనివచ్చి సన్మునుల పై పైఁ జాల వర్షింపుచున్
      బ్రపరేణుల్ మునిపాదపద్మములఁ బర్వన్ మేను లానింపుచున్
      రసభావంబులు గానలేనితరి నర్థం బొక్కెడం బల్కుచున్
      యసమానంబగు భక్తి వారఁగఁ గరాబ్జంబుల్ మొగిడ్చెన్ దగన్.

క. ఆచుట్టుఁ జుట్టుఁ జుట్టుఁ బి, శాచంబులు విజనమైన జక్కటిలను దృ
      గ్గోచరులు గాక నందఱిఁ, జూచుచు వైష్ణవుల కొదుకుచును నికటములన్.
గీ. చంద్రపుష్కరిణీస్నాతజనులదరిని, శయపుటంబుల నార్ద్రవస్త్రములు పిడువ
      తజ్జలంబులు దొరుగ నౌదలలు సాచి, పావనుల మైతి మనుకొండ్రు భావములను.
ఉ. రాడొకొ శ్రీపరాశరుడు రంగమహత్వముఁ జూడ నిచ్చటన్
      లేడొకొ యేల యేమరెనొ లెంకల మమ్ముఁ దలంప కెందును
      న్నాఁడొకొ బ్రోచుఁ బొమ్మనుచు నమ్మకఁ బల్కిన గౌతమర్షియున్
      గాడొకొ సత్యవాది మునుగాథ లసత్యము లయ్యెనో కదే.
క. అనుచుం బున్నాగసరో, జునిచుట్టు వసించు మౌనిసింహులలోనన్
      జనకుని వెదకుచునుండఁగ, మును లచటివిశేషములకు ముదితాత్మకులై.
సీ. అలికి మ్రుగ్గులువెట్టి నరుగులు నేలకో కుప్పగా కురిసె నీకుసుమరాజి
      మధురస్వరముల సమ్మతి వీనులలరఁగ విననీయవేలకో వేదచయము
      విలసితసైకతస్థలముల నేలకో వంకరయడుగులు పొంకమయ్యె
      చీరలు మురళింప నీరంబు లేలకో యిలరాల నటునిట్టు తొలకబారె
      వీర లెవ్వరొ మాయావు లౌర రంగ, మంగిరమునకు వచ్చి రేమందమనుచు
      గుములగొని యబ్బురమునొంది తెమలబార, దారుగొని నవ్వుకొనుచు చెంతల మెలంగు
ఉ. వచ్చె సనాతనుండు మునినర్యులు గొల్వ పరాశరుఁడు నా
      రిచ్చదలంచినట్ల మును లీతఁడె బహ్మమనంగ వచ్చినాఁ
      డిచ్చటి కచ్యుతుండనఁగ నేమిటిమాట హుతాశనుండు తా
      వచ్చెననంగ భాస్కరుఁడు వచ్చెననన్ మహనీయమూర్తితోన్.
శా. చేరన్ రా మును లర్ఘ్యపాద్యములు నర్చింపంగ భూలోకమం
      దారుం డమ్మునిచక్రవర్తి తనచెంతన్ దద్వినిర్దిష్టపీ
      ఠారూఢుండయి పొన్నమ్రానులను చాయంబుట్టి వృత్తాంతముల్
      పౌరుల్ దెల్పఁగ సర్వముం దెలిసి యాపద్బాంధవుం డయ్యెడన్.
క. ఆమౌనీంద్రులు యోగ, క్షేమము లారసి పిశాచచేష్టితములుగా
      నా మొదట నడుమకార్యము, లామూలముగాఁ దలంచు నాసమయమునన్.
సీ. అఖిలప్రపంచమహాభూతమోహినీమునిజనానుష్ఠాన ముఖ్యవేళ
      స్వైరిణీపుణ్యసాక్షాత్కారదైవంబు చోరావళీభావిశోభనంబు
      కలితనిశీధినీకాళికాజనయిత్రి కమలామయావహక్షతజమూర్తి
      మందేహగృహకుంకుమస్థావకసమృద్ధి యస్థాగదావానలాభివృద్ధి

      పరగపడమటినెరసంజబంధుజీవ, ఘుసృణకంకేళి దాడిమీప్రసవకింశు
      కప్రవాళజపారాగగైరికాగ్ర, కిసలకిలయితగప్రభాగ్రసన మగుచు.
మ. అపు డామౌనిగణంబు కాల్యకరణీయంబుల్ చనన్ దీర్చి రం
      గపురాణశ్రవణప్రసంగతతి రంగధ్యాననిష్ఠామహా
      జపతాతత్వనిరూఢి రంగరమణాంచత్పూజనాసక్తి రం
      గపురీతీర్థమహత్వకీ ర్తనల శ్లోకంబుల్ ప్రసంగింపుచున్.
ఉ. వేకపువేడి కాకఁబడు విశ్వము శాంతి వహించునట్లుగా
      చీకటిపేర యొక్క జపసిద్ధుఁడు గొంగడి గప్పివచ్చి యొ
      క్కూకున మంత్రభూతి పయినూదిన కైవడి తాపి పూఁబొదల్
      సోకిన రాగపూరములఁ జొక్కిలి తీర్చి సమీరవారమున్.
క. పుప్పొడి వెంబడి పూవుల్, కుప్పలుగాఁ గురిసె మౌనికుంజురుపైఁ దా
      నప్పూజ లంది తలఁచిన, యప్పుడ కనుమ్రోల గర్హితాకారములన్.
సీ. నిల్చి తద్పదపద్మముల కింతయెడగల్గి సాగిలి మ్రొక్కి యంజలు లమర్చి
      వేదోక్తముగ పెక్కువినుతులు గావించి తమ తెరఁగెల్ల మాతండ్రితోడ
      విన్నపం బొనరింప విని యేల చింతిల గౌతముండు శపించుఁగాక యేమి.
      యఖిలలోకారాధ్యుఁ డైనట్టి మాతాత యాచార్యుఁడటె మీకు నతని గరుణ
      నొక్కయక్షర ముపదేశ మొందువారు, జగతిభేదంబు లొంద ప్రసక్తి గలదె
      మిమ్ముఁ గడతేర్తు నింతకు మిగిలినట్టి, తలఁపు లేదెందు నాకు గర్తవ్య మొకటి.
క. కావలయు నర్థ మెయ్యది, యేనరము లొసంగవలయు నిదియది యని మీ
      భావములఁ గొంక నేటికి, యీ వేళ వచింపుఁడన బ్రహృష్టాత్మకుఁడై.
గీ. వరము లేటికి మీ పాదవనరుహములు, వరము లితరంబులైన దైవతులగడన
      పొడగనితినున్న యామాటనుడువ దడవ, విడిచె వారిపిశాచత్వవిభాగములు.
ఉ. చక్కఁదనంబు నంగములు చాయలు బ్రహ్మవిశుద్ధతేజమున్
      నిక్కముగాఁగఁ దొంటికరణిన్ దెరమాటుననుండి వచ్చిన
      ట్లక్కజమై యొసంగుటయు నందఱు విస్మయ మంది వారలన్
      బెక్కుతెఱంగులం బొగడి పేర్చి సుమంతసునందు లేపునన్.
క. తనసన్నిధి నిలిచినచోఁ, గని యాసక్తిఁ బ్రసూతి కరుణాపరుఁడై
      మునిబాలకులం గని యి, ట్లనియె భావ్యర్థనిశ్చితాత్మకుఁ డగుచున్.
గీ. ఈశ్వరుఁడు మేనులనియెడి యిళ్లలోన, బూనుకొనియుండు గుణరూపియైన మాయ
      ననుసరించుఁ జరించు దేవాదితనువు, లెత్తి యిందుకుఁ దగినభోగేచ్చ మెలఁగు.

క. ఏమేను లెత్తు యీశ్వరు, తా మేనులయెడ మమత్వమంది స్వరూపం
      బేమరి కులాలచక్రము, "నేమం బగు సంసృతికిని నెలవై మెలఁగున్.
క. ప్రాజ్ఞులరై సాలంబున, విజ్ఞానము లేమరక వివేకము బలిమిన్
      జిజ్ఞాసాపరులగుట న, భిజ్ఞులు పొగడంగ నిట్లు పెంపును గలిగెన్.
క. ఇతనివిధానం బాత్మా, యతనమునం జేయుడీ భవానలతాప
      చ్యుతి యొనరింపుఁడు యోగ, ప్రతిభామృతసేచనమున బాయుఁ డఘములన్.
క. శ్రీరంగబ్రహ్మము మీ, కోరిక లీడేర్చుఁగాత గురుసన్నిధికిన్
      మీరరుగుఁ డనినమాటకు, వారలు నిర్వేదపారవశ్యాతురులై.
మ. గురు లెవ్వారలు పోవు టెచ్చటికి మాకున్ దల్లియుం దండ్రియున్
      గురువున్ దైవము ప్రాపు దాపు భవదంఘ్రుల్ గాక వే ఱున్నదే
      కరుణాసాగర చాలుఁజాలు భవదుఃఖంబుల్ సహింపంగలే
      మరసేయం దగదిమ్ము ముక్తి కరుణాయత్తైకచిత్తంబునన్.
సీ. నిను నమ్మి శరణుజొచ్చినవారి నీలీల పొమ్మని విడనాడ పొసగునయ్య
      అనిన మీహృదయశోధనతకై యిట్లంటి నటుల గావించెద నన్నలార
      తాతశిష్యులరునై తనరిరిగావున మే లొనర్పఁగఁ బూని జాలినాడ
      నున్నాడు దీనులపెన్నిధి శ్రీరంగనిలయుండు నాదుపూనికె వహించు
      గట్టుఁ జేర్చుటకై యటుగాన నిపుడ, ముక్తి కనుపుదు మీచే బ్రసక్తమైన
      కార్య మొక్కటి యవునది గాదనకను, పూను డది మన్నిమిత్తంబు పూర్ణకరుణ.
మ. ఇదె యీచెంత సువర్చలుండనఁగ మౌనీంద్రుండు మోక్షార్థియై
      మదిలో నన్ను గురుంచి యాగనిరతిన్ మాటాడకున్నాడు పూ
      ర్ణదయన్ మీ రతనిం గటాక్షమిడి నిర్వాణంబు నొందించి నా
      మది గైకొం డనునంతలో నతఁడు ధన్యత్వంబునుం బొందెడున్.
క. మీరు పిశాచాకృతులన, చేరుం డచ్చటికి ముక్తిఁ జెందుడటుల శా
      పారంభముక్తముక్తియు, నారయ నొకటైనగాని యందఱు రెంటన్.
క. నా కిది యుపకారంబని, వాకొన శిరసావహించి వారలు పుణ్య
      శ్లోకు పరాశరు వీడ్కొని, లోకస్తుతుఁ డగు సువర్చలుం జేరి రనన్.
క. నవ్వి సువర్చలుం డనువాఁ, డెవ్వం డతఁడెట్లు చేరె నీపున్నాగం
      బావృత్తాంతం బానతి, యీవేళ నొసంగుఁడనిన యిట్లని పలికిన్.
గీ. నాగదంతనమనంతపుణ్యంబు వినిన, నాసువర్చలుచరిత్ర మాద్యంత మేను
      తేటగా వివరింతు నెంతేని భక్తి, నానుపూర్విగ వినుఁడని యానతిచ్చె.

క. వరుణాతరంగిణీపరి, సర మార్యావర్తభూమి సకలధరిత్రీ
      తరుణీసీమంతముగతి, పుర మమరు విశాల యనవిభూతి దలిర్పన్.
సీ. వెడమువెట్టకరాని ప్రియుగూర్పు మనిరంభ కిచ్చకమ్ములు పల్కి తెచ్చు విటుల
      పారిజాతపుపువ్వు పరిమళంబులు గట్టి గంధంబుపొడి వీల్చు గంధకారు
      యిసుమంత గాలి లేవిట లెంత పనిచేసితని యగస్త్యునిపల్కు నననిసురలు
      వలయుకార్యములు మా కెలనికొక్కరిఁ బంపుచుని యింద్రుఁడేచు రాజావళియును
      కలశములు దివ్యవాహినీకమలకోర, కముల బెనఁగొను నరదంబు లమరి యమర
      పురము నప్పురమున సౌధవరము లొప్పు, కతన నేకీభవించె నూర్జితవిభూతి.
గీ. అష్టమదముల ఝరపూరితాద్రు లనఁగ, మీరు దంతుల తనదుసజ్జారమునకు
      రావుగాయనుభీతి నైరావతంబు, వెలుకనౌ యుండె నప్పురి దరమె పొగడ.
క. ఆవీట నింద్రుపాగా, మావులు దిగుకతనగాదె మావులనంగా
      భూవినుతమరుజ్జయనిజ, ధావనముల మీరె నున్నతతురంగమముల్.
క. ఆగణితకరణిన్ వెలువడి, నగరికవీనులను జూచి నానాఁటికి ప
      న్నగపల్లవులూర్చఁగ బె, ట్టుగఁ దత్సంతతికి నలవడును నిట్టూర్పుల్.
వ. మఱియు నప్పురంబు సుందరీమణిగణనికరమణిభూషణమాణవప్రభాకలితమందార
      మంజీరచంపకోత్పమాలికాసుగంధబంధురంబై రుచిరప్రభాతభాస్కరవిలసితమ
      ణిమాలికాసుందరంబై వసంతతిలకాకుసుమితలతావల్లిత వనమయూరమత్తకోకిలా
      క్రౌంచపదాదిఖచరప్లుతమనోజ్ఞంబై స్రగ్ధరాశ్వలలితభద్రకమత్తేభవిక్రీడితంబై
      భూనుతభూతిలకానందంబై మేఘవిస్ఫూర్జితవిద్యున్మాలికాతరళ మానినీరతిప్రియ
      భుజంగవిజృంభితప్రహర్షణమంజుభాషంబై సర్వతోముఖమంగళమహాశ్రీకరంబై
      వృత్తరత్నాకరమధ్యంబున వృత్తారంబునం బలె నలరుచుండె. వెండియు.
ఉ. ఆపురి కాశ్యపాహ్వయమహాద్విజముఖ్యుఁడు మాధవీవధూ
      టీపతియై పదార్థము గడించి క్రతువ్రజముల్ సమస్తమున్
      మాపతిఁగూర్చి చేసె సుకుమారు సువర్చలునాముఁ బుత్రుగా
      నాపరమేశులబ్ధపరుఁడై కనియెన్ గృతపుణ్యవాసనన్.
క. పాడియు పంటయు తొడవులు, పోడిమియును గలిగి కాశ్యపుఁడు మహి నెనఁగా
      నేడు గృహమేధియని యే, నాడున్ దనమాట వాసిన మెలంగుతఱిన్.
మ. సుతుఁడైనట్టి సువర్చలుండు నిగమస్తోమంబులున్ శాస్త్రసం
      తతులున్ నేరిచి తండ్రియాజ్ఞ నొకకాంతారత్నమున్ బెండ్లియై

      శతవర్షంబులు నిండ మన్నగరులన్ సంతాపవారాశిలో
      నతఁ డన్యాయతముంచి తా విరతిచే ధన్యాత్మబోధంబునన్.
ఉ. చెక్కిట చేయిఁజేర్చి తనచిత్తములో వగపుంచి యాలిపై
      యక్కఱలేక సొమ్ములని యందక ద్రవ్యమునందు డెందమున్
      జిక్కఁగనీక యెవ్వనిని జీరక పిల్చిన పల్క కూరకే
      యెక్కడనో విచారమయి యింటికి రా కొకపంచ నుండఁగన్.
క. ఉన్నెడను దల్లిదండ్రులు, గన్నట్టి జనంబుచేత గల చుట్టములున్
      విన్న ప్రజలెల్ల మూగుకు, యెన్నఁడు నీచింత యెఱుఁగ మెఱుఁగ మనంగన్.
గీ. కాశ్యపుడు నంతఁ గనకపొంగళ్లు గదల, తలనణంకగ తనసోమిదమ్మగారి
      నూతఁగొని యొండుకరమున నూతకోల, దాల్చి మెల్లనవచ్చి నందనుని గాంచి.
క. లేవడు జనకుఁడు వచ్చిన, నావలకుం దొలఁగ డున్నయరుగునఁ జో టీ
      డేవచనము నాడడు కను, గావడు తలయెత్తి చూడఁ గానడు విరతిన్.
క. ఇటులున్న కుమారుని చెం, గటికిన్ దాఁజేరి వెడదకన్నుల నశ్రుల్
      బొటబొటఁ గురియఁగ నెమ్మది, దిటఁదప్పి యెలుంగురాల దీనుం డగుచున్.
క. ఆసీనుఁడై విశిష్టా, గ్రేసరధర్మంబు లీ వెఱింగియు మమ్మౌ
      దాసీన్యంబునఁ జూచిన, నీసభ్యత కంతవెలితి నేడు ఘటిల్లెన్.
ఉ. నేర్పితి నాగమమబు లుఁక నేరనిశాస్త్రము లెల్లఁ దెల్పితిన్
      దీర్పరివైతి వీవు జగతీవరసన్నిధులందు నన్నిఁటిన్
      నేర్పరి విట్టులుండఁదగునే యి యేటివిచారమన్న మా
      నేర్పులు నేరముల్ మదిగణించితొ నీకొరు లెగ్గుఁ జేసిరో.
ఉ. కానకకన్నబిడ్డడవు గావున నీవిటు చింత నొందఁగాఁ
      దా నిదెవచ్చి నీజనని దైన్యముతోఁ గనుగంటనీరు వె
      ల్లానుచు మాట వెల్వడక యండనవుంగుడువుంగుఁడై విచా
      రానుభవంబుతో నడల నక్కటికింప విదేమి పుత్రకా.
సీ. అడుగువెట్టిన గందు నరికాళ్ల మురిపెంపుకొరమాట గండచక్కెరలు రాలు
      గేలు గదల్చిన కిసలయంబు లిగుర్చు పొలయుచో నెల్లమించులు ఘటించు
      మొగమెత్తునపుడెల్ల మొలపించు హరిణాంకు నిలిచిన జాళువానిగ్గుపలుకు
      నింద్రజాలంబు వహించు పెన్నెరులార్చి కలవరేకులు చల్లకలయు జూచి
      శీలములకెల్ల నెలవు లక్ష్మీవిలాస, మందిరము పుణ్యసాధ్వి నీమందిరమున
      సమవయోరూపముల గౌరవముల మఱియు, యుండియుండంగ నేర కిట్లుండనేల.

క. తన కప్రియం బొనర్చిన, వనితన్ బుత్రవతినైన వదలుట ధర్మం
      బనిమిత్తము కులకాంతా, జనము న్విడనాడు దుష్టజన్ములు గలరే.
సీ. ఏమన్న మాతోడ నెదురాడ దెన్నఁడు నెందు వంచినతల యెత్త దీవు
      తనపాలి దైవంబ వని నిన్ను భావించు మాకు శుశ్రూష లేమరక సేయు
      నతిథిసపర్యల నలయకల్ చూపదు గడపదు ముష్టి భిక్షములవారి
      ననదలఁ దనదునందనులట్ల బోషించు నన్యులఁ జూచి మాటాడఁబోదు
      కోపమెఱుఁగదు తనుఁదిట్టుకొనదు పెద్ద, మాటబల్కదు నిద్దురమరగియుండ
      దరవదాపదు మర్మంబు లవలనుడువ, దట్టియిల్లాలు బాయ నేలయ్య నీకు.
గీ. పుణ్యచారిత్ర మాకేకపుత్రవిషయ, మన్వయము పుత్రులచు గాంచి యలరఁజేయు
      విత్తుమొదలయినవాఁడవు వెన్క ముంద, ఱెవ్వరును లేరు మాకుఁ బ్రాపెవ్వ రింక.
క. నీను విరక్తుఁడ వగుచుఁ ద, పోసననృత్తి మెలంగు దీన పుణ్యము గలదే
      యీవల మేమును యిల్లా, లావలఁ బలవింప దురితమంట కుమారా.
గీ. పుత్రహీనుండు సద్గతిఁ బొందడనుచు, నీవు చదువులఁ జదువుట లేదె యుర్వి
      నాశ్రమంబులలో గృహస్థాశ్రమంబు, సాధుజనులకు నిహపరసాధనంబు.
శా. నామాటల్ విననేరకే నియతినున్నన్ భస్మహవ్యంబుగా
      కేమీ దానఁ బ్రయోజనంబు గలదే యేలన్న బూర్వంబునన్
      రామాదుల్ పితృవాక్యపాలకులుగారా వారు నీసాటి రా
      రా మెలదుండఁగ నేలరా తనయ రారా లేచి నావెంబడిన్.
శా. ఈసొ మ్మీధన మీదుకూలములు నీయిళ్లన్ బశువ్రాత మీ
      దాసీవాసజనంబు లీసకలసంతానంబు లీయూళ్ళు ము
      న్నౌ సంసారసుఖంబు మాని జెడనేలా వృద్ధుఁడే గాక స
      న్యాసం బింతయలంతియే నడప భోగాయత్తకాలంబునన్.
గీ. నేఁడు మముబోఁటులకునెల్ల నిన్నుఁ జూచి, చలువ యింతయెగాక యేవలనుగలుగు
      పలుకవది యేమి యేమింత పలువరింప, రా కటా డెందమూనకురా కుమార.
గీ. ఆదరింపుము ననుఁ దల్లియడలు మాన్సు, మూరడిలఁజేసి యిల్లాలు గారవింపు
      వలువ దిటులుండ లౌకికవైదికముల, నీ వెఱుంగవె నియతమౌనే తనూజ.
క. పితరుల ఋణంబు దీర్పుము, సుతలాభముఁ బొంది మమ్ముఁ జూడుము నీవే
      గతి యనెడువార మింకే, గతి నోర్తుము నిన్ను బాయఁగలమె కుమారా.
మ. వినరావో చెవు లేమి విస్మృతియొ యావేశాంతరంబో మనం
      బున నజ్ఞానము గప్పెనో యనుచుఁ దాఁ బుత్రాశచేఁ బెట్టునా

      కొన నాలించి సువర్చలుండుఁ బితృభక్తుం డిట్లనున్ దండ్రితో
      దనవిజ్ఞానవిరక్తిభావము యథార్థత్వంబు సంధిల్లఁగన్.
సీ. అయ్య యీక్రియ మీర లానతిచ్చినదెల్ల సత్యంబె యేన సంసారి నగుట
      నార్జవం జన మనిత్యం బని కాంచితి కర్మపాశంబులు గట్టువడియు
      తాపత్రయముల సంతప్తుఁ డయ్యును నదృష్టాకశాహతులక్లేశములఁ బడియు
      నజ్ఞానతిమికారావాసమునఁ జిక్కి వాంఛాగ్రహగ్రస్తవర్తనుండు
      నయ్యు మేమత్వమును సుడియందు మునిఁగి, గర్భవాసానలజ్వాలఁ గ్రాగి గోళ
      పంజరాంతరవర్తినై బరగునట్టి, యేను మరచుట చింతిల్లు టేమి యరుదు.
క. అకటా యనవైయామ్య , క్రకచచ్ఛేదనవిభిన్నగాత్రుఁడనై పో
      నొకదిక్కులేని తనుగని, నికటాహితములు వచింప నితరమె తండ్రీ.
గీ. పుట్టుమొదలును మృతికి సంపూర్ణభీతి, పెనచి రోగజ్వరంబుల పీడ నొంది
      కర్మవాసన జెడక యొక్కడ నసత్తుఁ, జూచి సత్తును దానికి సుఖము గలదె.
క. తీరమున నుండి యెయ్యది, భారంబని యెఱుఁగలేని భ్రాంతిమతికి నా
      త్మారామానందసుఖ, శ్రీరంజిలునయ్య యేను జింతిలు టరుదే.
గీ. వలదు చింతిల్లననుచు మీవచనసరణి, దాటరా దటుగాన జింతలు దొలంగి
      యన్నవాఁడ నెఱుంగక యున్నవారె, నాదువర్తన మిది కాదనంగఁ దగునె.
క. తమతమభోగవ్యవహా, రములను దుర్విషయతత్పరత స్త్రీపురుషుల్
      తమిగూడి బంధరూపాం, గముల సృజింపుదురు వారె కారె యహితుల్.
గీ. మాతృపితృశుక్లశోణితాత్మకశరీర, ధారులకు వైష్ణవం బౌషదంబె గాక
      కలుగునే యొండుగతి యౌర కాశ్యపునకు, బుట్టువానికి నసుములు బొందనగునె.
క. కరుణింపుఁడు నను నే నీ, దురితములకు వెరతు జట్టి దొంతక లంతన్
      వెరతునని దల్లితండ్రుల, చరణంబుల వ్రాలుటయుఁ బ్రసన్నాత్మకులై.
క. దీవించి నీదు కతమున, పావనులము నీవు వంశపావనుఁడవు రం
      గావాసము జేరుము మా, దీవన నిష్టార్థసిద్ధి తిరమగు నీకున్.
క. ఆరాధింపు పిశాచా, కారంబుల నున్నవారి ఘనుల నిరువురన్
      శ్రీరంగపుష్కరిణిదరి, వారలచే ముక్తి నీ కవశ్యముఁ గలుగున్.
క. ఆశక్తితనయుఁ డైన బ, రాశరునకు శిష్యు లాకరణినున్నా రా
      వేశాకారంబులతోఁ, బైశాచికరూపవేషభాషణు లగుచున్.
సీ. తనతల్లిదండ్రుల యనుమతిచేతను శ్రీరంగధామంబుఁ జేరి యచట
      విజనస్థలంబులు వెదకుచు చంద్రపుష్కరిణీసరిత్తీరకదళికార

      సాల పున్నాగ వాసంతకా చంపక మాధవీ రమ్యాశ్రమంబు లరసి
      కొనక పితృపరాధీనుఁ డగునేని యామ్నాయములు సత్యమయ్యెనేని
      గురుల దైవంబుగా నెంచి కొలుతునేని, యెప్పుడును సూనృతం బేను దప్పనేని
      యేను గనుఁగొన నదికారినేని నాదు, మ్రోల నిలుతురుగాక యమ్మునియుగంబు.
క. అనుచుఁ బిశాచాకారులఁ, దనమది దేవతలుగాఁగఁ దలఁచి తలఁచినన్
      గని మ్రోల వారు నిల్చినఁ, గని సాష్టాంగప్రణామకము గావింపన్.
క. ఎటు లెఱిఁగితివో మమ్మున్, జటీవర నీ వనిన సూర్యచంద్రులు నరు లె
      చ్చటనున్నఁ దెలియఁజాలరె, స్ఫుటమై యున్నయది మీయపూర్వఖ్యాతుల్.
క. సర్వేశుకరణి మీరలు, సర్వాంతర్యాము లెందు సామాన్యులరే
      గర్వాంధుఁడ మిముఁ గొల్చుట, సర్వశుభాచరణహేతుసాధన మయ్యెన్.
గీ. అనిన వారు సువర్చలుఁ గని మునీంద్ర, మమ్ముఁ జూచినకతన నీ నెమ్మనమున
      గోరునర్థంబులెల్లఁ జేకూడెననుచుఁ, జాల నమ్ముము మదిలో నసంశయముగ.
క. కోరుము పరమున వారా, త్మారామము పరాశరమహాత్ము గురున్
      శ్రీరంగవిభునిగా మది, నారసి తద్వచనసరణి నని రాతనితోన్.
మ. భవరోగౌషధ మాత్మసౌఖ్యకర మాసన్నార్తివిచ్ఛేదకం
      బవలంబం బగుణం బమేయ మనఘం బాద్యం బనంతం బనన్
      వివిధాభిఖ్యల నొప్పు బ్రహ్మ మతఁ డుర్విన్ రంగధామాఖ్యమై
      యవతారించెఁ దదంఘ్రిమూలములు నీ కౌగాక యాధారముల్.
గే. అని సుమంతుఁడు వెండియు ననియె వాసు, దేవుఁడు పరాశరుండు రమావినోది
      రంగపతి యిచ్చు ముక్తిసామ్రాజ్యసౌఖ్య, మరుగుమని వారు చెయి చూపినంత దడవ.
గీ. ముక్తుఁడయ్యె సువర్చలముని ముకుందు, చరణసరసీరుహధ్యాన నిరుపమాన
      పావనామృత శమితపాపజ్వలంబు, లన వటుజ్వాలులై వారు జనిరి యటుల.
క. కావున పున్నాగంబను, పావనతీర్థంబు శీతభానుసరంబున్
      సేవించువారు ముక్తి, శ్రీవరదులు రెండు నధికసిద్ధం బనఘా.
క. ఈ తొమ్మిదియును బుష్కరి, ణీతీర్థములందు నెపుడు నెలకొను కావే
      రీతోయము నీతోయము, శీతలపవమానవశతఁ జేయునె చలముల్.
క. కావున నీకథ విన్నజ, నావళికిన్ వలయు కామితార్థము లెల్లన్
      దేవాదిదేవుఁడగు రం, గావాసుం డొసఁగు శోభనావహలీలన్.
శా. ఆతీర్థంబులు నట్టిపుష్కరిణి యయ్యారామపుణ్యాశ్రమ
      వ్రాతం బిచ్చటి సహ్యజాతటిని యారంగంబు నప్పట్టణం

      బాతీరోత్సవమంటపంబులను నాహా రంగరాజాత్మకం
      జాతం బెంత యొనర్చె నందుఁగల సౌభాగ్యైకసంయోగముల్.
సీ. విహరించు నొకవేళ బహుళకావేరికాలహరిప్లవారోహవిహరణములు
      జరియించు నొకవేళ సరసవిద్యాధరుల్ గొలువ సైకతశుభస్థలములందు
      మెలఁగు నొక్కొకవేళ నలఘుపుణ్యాశ్రమాంచలమహాభూరుహచ్చాయలందు
      గ్రీడించు నొకవేళ కేళీసరోవరకమఠాంతరాళావగాహనములు
      రంగనాయకితోడ శ్రీరంగవిభుఁడు, రంగు మీఱఁగ నెనలేని రాజసమున
      ప్రతిదినము నిట్లు మెలఁగుచు భావవీథిఁ, దలఁచి యొకనాడు తీరకాంతారములను
సీ. ఒకపరి సికమీఁద నొరపుగాఁ గట్టిన బురుసారుమాలు బిత్తరము మీఱఁ
      దళుకులీను సుతారతపుముత్తెముల పెద్దచౌకళుల్ చెక్కులఁ జౌకళింపఁ
      దగుజిల్లుతాపుతాధట్టిపైఁ బసిఁడిదువ్వలువచెరంగులు దురఁగలింపఁ
      గస్తూరి సాబాలుగలుగు కుంకుమబూత మెయిచాయతోడ సమ్మేళనముగ
      నొక్కసామ్రాణి నెక్కిన హో యటంచు, వందిజనములు సన్నిధి గ్రంచుకొనఁగ
      నాప్తసైన్యంబుతో మృగయావినోద, కేళి రంగేశ్వరుండు వాహ్యాళి వెడలె.
క. ప్రచురోత్సాహముతోఁ దా, నుచితక్రియ వచ్చునప్పు డొరయూరపురిన్
      నిచుళాధినాథకన్యక, విచలితధమ్మిల్ల రంగవిభునిన్ జూచెన్.
ఉ. చూచి విరాళి జాలిపడుచున్ వగజాపఁగఁజేము ప్రాయపున్
      రాచమిటారి తాల్మి వలరాచకటారికి నగ్గమైనచో
      లోచెలి జొక్కి సారసవిలోచనముల్ ముకుళించి పాన్పుపై
      లేచుఁ బడున్ గలంగుఁ దరళీకృతభాష్పముఖారవిందయై.
సీ. అది విని పద్మినీహృదయాంబుజాత మారంగేశునందుఁ గరంగు టెఱిఁగి
      సుత నూరడించి భూసురవరేణ్యులచేత శుభలేఖఁ బనిచిన జూచి యపుడ
      కైచేసి తనతిరుకళ్యాణమునకు మహర్షు లేతేర ప్రహర్ష మెసఁగ
      రాజులు గొల్వ భద్రగజాధిరూఢుఁడై భేరీమృదంగముల్ మూరటిల్ల
      చోళరాజన్యునగరి యస్తోకమహీమ, సుందరంబైన మాణిక్యమందిరమున
      సామజంబును డిగి పెండ్లిచవికె కరిగి, రంగవిభుఁ డొక్కశుభముహూర్తంబునందు.
మ. చోళక్ష్మాపతి పుత్రికన్ గనకవాసోమాల్యభూషాది నా
      నాలంకార విభూషితాంగిని మనోజ్ఞాకారకల్యాణమై
      యాలీలావతిఁ బల్లకీమనిచి రంగావాసముం జేరి తా
      నేలెన్ బద్మిని నిచ్చలున్ రతముఖాభీష్టప్రధానంబులన్.

గీ. తోడు శ్రీరంగనాంచారుతోడఁ గూర్చి, లీల నొరయూరునాంచారు నేలె సరణి
      సమయకారతముఖ్యవాంఛలును దేల్చె, వింత యొకటున్నయది నాగదంత వినుము.
సీ. శ్రీమహనీయమౌ శ్రీవిల్లిభుత్తూర విష్ణుచిత్తుం డను వేదవేత్త
      కలఁ డొక్కవైష్ణవాగ్రణి యమ్మహాతిరుపతి నున్న శ్రీవటపత్రశయనుఁ
      గని కొల్చి మాలికాకైంకర్య మొనరించి మత్స్యధ్వజునిఁ జేరి మధురలోన
      విద్వజ్జనము విశిష్టాద్వైతసుప్రతిష్ఠయు నొంది శౌరి సాక్షాత్కరింప
      నలరి తనవిభుఁడు జేకి కృతార్థుఁ డగుచు, దినములు గ్రమింప నొకనాఁడు వనములోన
      దులసికాననసీమ కన్నులు జెలంగ, నెట్టిదో పుణ్య మొకముద్దుపట్టిఁ గనియె.
ఉ. చామనచాయ మేనుగల చక్కని యన్నున నట్టిచూచి చే
      యామరకెత్తు నేర్పున సమంచితలీలల హస్తపద్మమున్
      బ్రేమ గ్రహించి సంతతము బ్రీతి జెలంగగ రంగధాముఁ డు
      ద్ధామగతిన్ సమస్తజగదావనదీక్షితుఁ డత్తఱిన్ గృపన్.
ఉ. అందఱు రాణివాసముల యక్కఱ లిక్కువముల్ స్వభావముల్
      కందువ లిచ్చలుం దెలిసి కామితివస్తు లొసంగి బ్రోచి తా
      నందఱ కన్నిరూపులయి యార్తశరణ్యుఁడు రంగధారుణీ
      మందిరుఁ డుర్వియేలె నసమానమహామహిమానుభావతన్.
సీ. శ్రీరంగనాయకుఁ డీరీతి నలరుచు ననుదినపక్షమాసాబ్దవిరచి
      తోత్సవంబుల మించి యొకమాటు తనుఁ జేరుకొనువారలకు నెల్లకోర్కు లొసంగి
      యవని నాద్యస్వయంవ్యక్తవిమానమౌ గంగసౌంజ్ఞిక మను నాగకథల
      తెలివిదైన ప్రధానతిరుపతి విలసిల్లె నని నాగదంతుతో వ్యాసమౌని
      తెలిపెనని శౌనకాదిమౌనులకు సూతుఁ, డిటు శ్రీరంగమాహాత్మ్య మేరుపరుస
      వారలెల్లఁ గృతార్థులై మీరి యుభయ, లోకసౌఖ్యము లంది రస్తోకమహిమ.
మ. నరు లీదృగ్విధమైన గారుడపురాణప్రోక్త పద్యావళిన్
      జరణంబైన లిఖించినన్ జదివినన్ జర్చించినన్ బల్కినన్
      బురుషార్థంబులుఁ గామితార్థములు సంపూర్ణాగమస్థైర్యముల్
      పరమాయుర్విభవాంగనాయత సుసౌభాగ్యావళుల్ జేకురున్.
మ. తతకళ్యాణకలాపసేవకజనానందస్వధాపాంగసం
      శ్రితభోగప్రదపాదపద్మభజనక్షేమంకరా వైభవా

      ధృతభక్తవ్రజదానదాత్కృతవిదారీకారనిష్ఠామనో
      వ్రతపుణ్యోదయభాగధేయ సుజనైశ్వర్యోపకన్యాత్మకా.
క. కమలామనస్సరోరుహ, కమలాలంకరణ సతత కరుణా భరణా
      కుముదాది దాసలోచన, కుముదసుధాకిరణ సురమకుటయుతచరణా.
స్రగ్విణి. భండనవ్యాళి నిర్బంధ నిగ్రంధిరూ
      పాండజస్వామిసాహయ్యచర్యద్ధృతీ
      చండదోశ్శౌర్యరక్షాకులీనోచ్చదో
      ర్దండ కోదండ పాండిత్య గండాత్మకా.

గద్యము
ఇది శ్రీవేంకటేశ్వరవరప్రసాదాసాదితచాటుధారానిరాఘాటసరసచతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకలవిద్వజ్జనాధార కట్టహరిదాసరాజ
గర్భాబ్ధిచంద్రవరదరాజేంద్రప్రణీతం బైన గారుడపురాణ
శతాధ్యాయి శ్రీరంగమాహాత్మ్యం బను మహా
ప్రబంధంబునందు సర్వంబును
దశమాశ్వాసము
సంపూర్ణము