శ్రీరంగమాహాత్మ్యము/అష్టమాశ్వాసము

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

అష్టమాశ్వాసము

      శ్రీమదలమేలుమంగా
      హైమశలాకోపమాంగ హరినీకాశ
      శ్రీమహనీయ మహాబా
      హామధ్యవిలాస వేంకటాచలవాసా.
వ. అవధరింపు మిట్లు నాగదంతమహామునికి వ్యాసు లానతిచ్చిన తెఱంగు సూతుండు
      శౌనకాదుల నుద్దేశించి.
గీ. ఆత్మజుల వేడిరేని పాయసము చేసి, బిల్వమునకు నైవేద్య మిప్పించి యింతి
      కిడిన వెన్నుని బోలిన కొడుకుఁగాంచు, నిటులుజేసిన మరి వంధ్య లెవరు గలరు.
క. షష్ఠివ్రతంబు నట్లన, నిష్ఠాపరులగుచు నాత్మనియమముతోడన్
      సౌష్ఠవమతులై స్నానా, నుష్ఠానము లాచరించి నోమఁగవలయున్.
గీ. పూనియరగంట మారేడుమ్రాని మొదట, బిల్వపాటుగ నరుగు గల్పించి శ్రీసు
      దర్శనము నావహించి యంతయు ప్రదక్షి, ణముగ దిక్పాలకాయుధోత్తముల కెల్ల.
క. వారల వారలదిక్కుల, వారలతోఁ గూడియుండ వచియించి నితాం
      తారక్తగంధసుమన, స్త్రారాధన వస్తువుల క్రియాచతురుండై.
శా. జ్వాలావాప్తిదిగంతరాళుఁ డగు శ్రీచక్రాత్మకస్వామికై
      చాలున్ భక్ష్యఫలోపహారములు పూజల్ చేసి వేఱొక్కటన్
      మ్రోలన్ మర్త్యులవేడి మ్రుగ్గులిడి తూముల్ రెంటిబియ్యంపువుం
      జాలంబుట్టి యమర్చి యాపయిదిలన్ సంపూర్ణభావంబునన్.

గీ. నించి నాలుగుకలశంబు లుంచి నడుమ, చక్రకలశంబు లుంచినఛాయ నున్న
      కలశముల శంఖశార్ఙ్గాదిసిగదల బూన్చి, పాయసగుడాజ్యదధ్యన్నభాగ మిచ్చి.
క. పంచాయుధముల నెల్లను, పంచవిధప్రసవములు విభాగించి సమ
      ర్పించి సుదర్శనవిభు పూ, జించఁగవలయున్ సుమాద్యశేషము చేతన్.
మ. తళుకుల్ జిల్లెడువెల్ల బట్టుసిడ ముద్యత్స్వర్ణదండంబుతో
      కెలన న్నాదిగరుత్మదాకృతిగతత్కేతుస్థలిన్ హేమరే
      ఖల నిర్మించి తదీయచిత్రపటిపై కద్రూసుతద్వేషి ని
      మ్ముల నావాహనజేసి భక్తిపరుఁడై పూజావిధానంబులన్.
క. అని పలికి జలదమాలిక, ననిలుఁడు పోవీచునటుల నస్మదఫలముల్
      పెనురెక్కగాడ్పుపొలుపం, బున దూలికెలట్లు పరపు భుజగారాతీ.
గీ. అనుచు వినుతించి యజమాను నవనిసురలు, ధగధగాయతగారుడధ్వజనిరుద్ధ
      కాంచనోత్తాలమూలవికస్వరంబు, చిఱుతగద్దియపైని యాసీనుఁ జేసి.
క. మునుమధ్యకలశజలములు, వెనుకన్ దిక్కలశతీర్థవితత స్నానం
      బొనరించి కనకపాత్రిక, కనగనుమను సరసపాత్రకంబగు నత్తిన్.
గీ. నేరజాతి ప్రదక్షిణహేతు వమర, పొసగ నైదువు లారతి యొసఁగి జోతి
      పరిహరింపంగ తాలేచి కరము మొగిచి, సదనమున కేగి యా రేయి నిదురమాని.
క. మరునాఁడు కలశపూజలు, కరమర్థిం జేసి విప్రగణ భూజనముల్
      బరగించి భూరిదానా, భరణాంబరవస్తు లిచ్చి పనిచిన వెనుకన్.
క. తామారగించి యీక్రియ, నోమినవారలకు నందనులు రణజయమున్
      భామామణు లైశ్వర్యము, సామగ్రిం గలుగు నదియ సందియ మెందున్.
గీ. జన్మనక్షత్రముల శుక్లషష్ఠియందు, డాసి మారేడుకడ గరుడధ్వజంబు
      నిలిపి యుపచారము లొనర్చి యేడునాళ్లు, బ్రహ్మములు వేడఁదగు ఫలప్రాప్తికొఱకు.
గీ. నిలుపునది యగ్రకలశ మేవలను నొరఁగి, కదలుదానును మేల్గీడుఁ గనఁగవలయు
      యుద్ధముఖముల శత్రుజయోత్సవముల, తూర్పు గదలిన గెలుచుట ధ్రువముసుమ్ము.
సీ. టెక్కెంబు దక్షిణదిక్కున గదసిన, నపజయం బగు పశ్చిమాశ గదల
      పరసైన్యములు వీగిపఱచు నుత్తరమున తనమూక దిరుగు నయ్యనలుఛాయ
      దొరకొనుకొరగాదు నిరుతియందు బలంబు పొలియు వాయువుదెస బోరుగలుగు
      నీశాన్యమున మ్రగ్గు నేనుగుల్ ధ్వజశాటి చినిగిన గాయముల్ తనకు గల్గు
      కదలకున్నను నేరికిఁ గొదువలేదు, విరిగివడిరేని పగరాజు ధరణిద్రెళ్ళు
      యుద్ధకార్యంబు కా దెల్లతీర్థులందు, పారి యిది గారుడధ్వజప్రశ్న మనఁగ.

క. అది నోమిన సకలప్రద, మిడి తమచేగాని వార లీకథ విన్నన్
      కదనజయంబును సఫలం, బొదవు నిజంబనుచుఁ బరమయోగి వచించెన్.
ఆ. వె. షష్ఠి నుపవసించి సప్తమీతిథినోము, తెరఁగు వినుము బిల్వతరువు మొదట
      చౌకమైనయరుగు సవరించి లక్ష్మీస, మేతు శౌరి నందుమీఁద నునిచి.
క. తూమెడుజలములు నించిన, హైమంబగు పాత్రయందు నలరు లునిచి ది
      గ్భూములునాలుగు కలశము, లామేర యమర్చి యంబు లమరించి తగన్.
క. బడినుప్పుతిలలు బసపుం, బొడి ధాన్యమునించి నుట్టి మూకుడులందున్
      గుడమును దేనియ పాలున్, బొడిశర్కర యునిచి విప్రపూర్ణాంగనలన్.
క. ఎనిమిది వాయనముల కొక, యెనమండ్ర నమర్చి పూజలిచ్చి యెసఁగి భో
      జనమిడి కలశప్రతిమల, నెనయ రమన్ శౌరి నావహింపఁగవలయున్.
క. పూజించి పెక్కులగు నీ, రాజనములు నారతులును రమణులు పాటల్
      శ్రీజాని దదాష్టాక్షర, పూజారాధనలఁ బ్రీతిఁ బొదలింపనగున్.
గీ. యువిదతో నాఁటిదినమెల్ల నుపవసించి, దక్షిణ లొసంగి మంగళాదాయకంబు
      సప్తమీవ్రత మీరీతి జరుపవలయు, జేసి మఱునాఁడు బారణ సేయవలయు.
గీ. అష్టమీవ్రత మెట్లన్న నష్టదళళము, లలర పద్మంబు తండుటంబుల నమర్చి
      పూజలొనరించి మెట్టులబొడవుసొంపు, దనర నొకహోమకుండ మత్తరి నమర్చి.
క. దుత్తూరుప్రసవముగతి, సత్తుగడన్ హేమనాళ మలరించి కడున్
      జిత్తులు దర్భల నమరిచి, యత్తఱి బెడిదముగ జ్వాలలల్లాడుతఱిన్.
క. జ్వాలామధ్యంబున ల, క్ష్మీలోలుని యుగ్రనారసింహుని గలుగన్
      మేలెంచి తలఁపు నిలిపి ద, యాళుని ప్రణవోక్తి వహ్ని నట నిల్పనగున్.
గీ. అగ్ని ప్రతిష్టఁ జేసి పూర్వాగ్రమున, దర్భ లమరించి తత్క్రియాద్రవ్య మెల్ల
      యెడమకడనుంచి వేలిచి యిధ్మమాజ్య, మున హనిస్సున హోమంబు దనరజేసి.
గీ. ఆయువర్గించి గలికి తొయ్యలులు వేడి, బిల్వదళముల రుజలు వోబెట్ట నుత్త
      రేని ఘృతమున తిలలును బూని తిప్ప, తీగె నపమృత్యువునకు వర్తిల్ల వెల్వ.
క. సంపదలు వేడువారును, సంపెఁగపువ్వులును వేల్వ జను వైరుల ని
      ర్జించుటకు నెఱ్ఱగన్నెరు, లింపున హోమంబు సేయ నెసఁగు మునీంద్రా.
క. మారణహోమంబునకు, గారణ మావాలు వేపకాయలజివురున్
      మారీచ ముప్పునెముకయు, గారంబులు తవుడు మొదలుగా వేల్వనగున్.
క. చిత్తభ్రమ నొందఁగ ను, మ్మెత్తలు తామరలచాత మెలతలవలపున్
      బత్తియు స్తంభన మోహన, వృత్తాదులకొఱకు నిటుల వేలువగదగున్.

క. కదళీఫలములు వేల్చిన, యది నృపవశ్యమగు నేతియాహుతు లిరువేల్
      పదివేలు నైదువేలున్, గుదురుగఁ జేయవలెఁ గోరుకోరిక కొలఁదిన్.
క. ఆకలశోదకములచే, శ్రీకరముగ స్నాన మపుడు చేసి నివాళుల్
      గైకొని వ్రతము సమాప్తిగ, నేకడ సంకల్పసిద్ధి నెసఁగుచు నుండున్.
క. నవమీవ్రత మెఱిఁగించెద, నవధాన్యముతోడ వినుమ నా కావేరీ
      నవిధప్రవేశ మైనన్, మివుల ఫలంబిచ్చు లేక మేదినియందున్.
ఉ. ఏనదినైన గ్రుంకి సకలేశ్వరుఁ గృష్ణుని రుక్మిణీవిభున్
      ధ్యాన మనర్చి యందు సికతాస్థలి నుండదలచి వశ్యముల్
      సూనములున్ ఫలాదులును శోభనవస్తుల పూజసేయు క
      న్యానియమంబగున్ తగినయట్టి వరుండొనఁగూడు గోరికన్.
ఉ. నేయును పాలునుం బెరుగు నించినపాత్రలు వాయనంబుగాఁ
      జేయుచు దానమీవలయుఁ జేకొని యేవుర పేరఁటాండ్రకున్
      పాయక వారి వల్లభుల పంక్తిని భోజనమాచరింపఁగాఁ
      జేయుట యెయ్యెడన్ నవమిసిద్ధము లిట్టి వ్రతప్రచారముల్.
చ. దశమిని దండ్రి సోదరియు తల్లియు మున్నగువారిలోపలన్
      గుశలముఁ గోరి కన్యకలకున్ వ్రతముల్ నడిపింపనొప్పు దా
      నశనము మాని యానవమియం దుపవాసము జేసి యిందిరా
      వశుందలంచి కుంభము నవారిగ నుంచదగున్ యురస్థలిన్.
గీ. హృద్యమైన గుడాన్ననైవేద్య మిచ్చి, తిలలు మండలముగ నుంచి తిలశితాక్ష
      దళసరోజంబు వ్రాసి యంతకుని గమల, భద్రకర్ణిక నావహింపంగవలయు.
క. మొదలన్ కలశముపై శ్రీ, సదనుని బంచాయుధము లెసంగించి ముదం
      బొదువ నిరుగడలఁ బూజలు, సదమలమతిఁ జేయవలయుఁ జక్కని విరులన్.
గీ. తనమనోబుద్ధి హంకారతతులఁ గూర్చి, కాలమూర్తిని లక్ష్మీశుగాఁ దలంచి
      కలశవిహితాయుధాంచితుగాఁగ నాత్మ, భావనము జేసి కాంచనప్రతిమ నునిచి.
క. పేదను విప్రకుటుంబి స, మాదరమున బిల్చి యధికమగుదక్షిణతో
      శ్రీదంబకు కాలప్రతి, మాదానమొనర్చి విప్రమండలి కెల్లన్.
గీ. కామితాన్నంబు లిడి యందు కలశవారి, చేత నభిషిక్తుఁడై యున్న శేష మపుడు
      బాంధవులఁ గూడి భుజియింపఁ బాయు నఘము, నాయు వభివృద్ధియగు సిరు లతిశయిల్లు
క. ఏకాదశీవ్రతం బిది, లోకస్తవనీయ మెల్లలోకంబులలో
      లోకవ్రత సాధారణ, మాకాదర నిత్య మంగళప్రద మెందున్.

గీ. పక్షపక్షాఘముల కధిప్రాంచితంబు, వైష్ణవవ్రత మట్టి దద్వాదశియును
      దశమి నుపవస మొనరించి యశనిగాక, స్నానజలమాత్రకర్తవ్య మైనవిధిని.
శ్లో. ఏకాదశ్యమహం కించి । తద్దర్శ పురుపోత్తమం
      భోజ్యేపరేహని శ్రేయాన్ । మహిమాం పురుషోత్తమ.
క. అనుమంత్రము సంకల్పం, బొనరించి త్రికరణము గాఁగ నుల్లములోనన్
      వనమాలి నునిచి వనితా, జనితాసంసర్గమున కొసంగక విరతిన్.
క. ఆలోచనములు నిద్రయు, నాలస్యము శయనమంత్రపూర్తియు శూ
      ద్రాలోకము బహిరింద్రియ, లోలతయు వ్యసనవిధులు లోనుగ వెలిగాన్.
క. ఏకాంతులు భగవధ్యా, నాకలితాంతఃకరణ నియామకు లతిసు
      శ్లోకుపురాణపరాయణు, లై కడపుట నాఁటిదిన మహర్నిశ లందున్.
గీ. ద్వాదశిస్నాన మొనరించి తర్పణములు, చేసి హరిఁ గూర్చి మామకజీవనంబు
      తావకాధీనమని పరతంత్రుఁ డగుచు, మనసువచ్చిన పరిశుద్ధి గనఁగవలయు.
గీ. భాగవతసంగమునకు నపారమైన, వత్సరంబున గంధమాల్యోపచార
      విధుల భుజియింపఁజేసి యవ్వెనుక నున్న, శేష మిల్లాలు దాను భుజింపవలయు.
గీ. ద్వాదశీవ్రతయమంబు వదల కెపుడు, నాడు హరివాసరము నట్లనడచి తాను
      ధారుణీదేవతాసంయుతము త్రయోద, శీదినంబున పారణ సేయవలయు.
క. ఏకాదశిలో దశమి క, ళాష్టాంశమును తా గలసి మధురసుధా
      శ్రీకలశము మధుబిందు స, మాకలికం బైనగతి ననర్థముఁ చేయున్.
గీ. కారడవి యేర్చు పావకకరణియట్ల, సేయుపుణ్యంబు లూరక చెరిచి పోవు
      కణిదిపాపంబు దశమి యేకాశి గూడి, నేల రాకాసివేరె మహీజనులకు.
క. శ్రీయేకాదశి శ్రీహరి, సాయుజ్యం బొసఁగు నితరసౌభాగ్యంబుల్
      చేయుననుటెంత మరికల, దే యెంచిన వ్రతములనఁగ నిహపరములకున్.
గీ. బ్రహ్మహత్యాదిదుస్తరపాతకంబు, లాతపముచేత చీఁకటియట్ల తొలఁగు
      నమృతమో వ్రతమో కాక హరిదినంబు, మానవుల కిచ్చు నమృతసౌఖ్యానుభవము.
గీ. రాట్నపుంగోటియ ట్లపారంబు గాఁగ, తీరనేరని విషమసంసారమునకు
      కటకటా హరిదిన మొక్కటియులేక, యున్న నే రీతి దరిఁజేరునొక్కొ నరుఁడు.
గీ. యోగసిద్ధులు నతిపుణ్యయాగఫలము, లిష్టకామితములు తపోభీష్టపదవు
      లఖిలతీర్థాచరణ లాత్మసుఖము, నట్టి యేకాదశిఁ దలంచు నాక్షణమున.
మ. అతిపాపాత్ములు విష్ణుదూషకులు వేదాచారదూరుల్ మధు
      వ్రతపాషండులు మిత్రవంచకులు సర్వద్రోహు లాజన్మదూ

      షితులై కైవడి గట్టు చేరగలరో శ్రీవైష్ణవద్వాదశీ
      వ్రత మేప్రొద్దును పాలుమానిన మునీంద్రా పల్కవే వన్యముల్.
గీ. అక్షయానంతకళ్యాణ మోక్షసౌఖ్య, ఫలద మేకాదశీస్వరూపంబు కర్మ
      కలుషదూరంబు ద్వాదశీక్రమము సకల, కామితార్థప్రదంబు నకారణంబు.
మ. నిరతిం గైకొని యొక్కవిప్రుఁడలరున్ వేదవ్రతాఖ్యుండు పు
      ష్కరనామోత్తర పద్మినీతటమహిన్ గన్గల్గి యచ్చోఁ బరా
      శరశిష్యున్ సుతపోధనాఢ్యు ననఘున్ సన్మౌని మైత్రేయు తా
      శరణంబొంది నమస్కరించి పరభిక్షాందేహివారంబునన్.
క. కట్టెదుట నిలువ నెవ్వఱ, విట్టి విచారమును దైన్యమేలా కలిగెన్
      జిట్టాడవేల ననుగఁని, యిట్టాడగనేల యనిన యిట్లని పలికెన్.
గీ. స్నాయువిణ్మూత్రరక్తమాంసప్రవిష్ట, జంతుజా....రగోళసంసర్గములకు
      సార మెఱుఁగక భవ్యార్థిఁ బడి తపించు, వారిఁగనియును నేనట్టివాఁడవనియు.
గీ. ఆశలును తివియలును వ్యాధు లనెడిముళ్ళు, గల యహంకృతి నిబిడాంధ కారకర్మ
      కర్త నింద్రియజయకశాఖాతశుద్ధ, మానసాశ్వంబు దాటింపఁ గానలేక.
క. చిక్కుపడినాఁడ నీవే, దిక్కని శరణంది వేడ తిలకించి కృపా
      దృక్కోణంబుల కనుఁగొని, యొక్కతెఱం గునికికెల్ల యుచితోక్తులకున్.
గీ. ఆత్మకూటస్థుఁ డన సాక్షి యనఁగ నిత్యుఁ, డన పరంజ్యోతి యన వాచ్యుఁ డగు ప్రధానుఁ
      డనఁగ బ్రకృతిస్వరూపినా నమలజీఁవు, డతఁడు కారణ మతఁడు కార్యాత్మకుండు.
క. ఎండయు తిమిరము పైయివి, యొండొంటికిఁ గూడి రాశయుండియు నొకటై
      యుండున్ జేతనుఁ డతఁడై, యుండి జడంబైన ప్రకృతి నొనరిన వేళన్.
గీ. ప్రకృతిసంసర్గమున తాను బహుశరీర, నాటకంబులు నటియించు చోట జీవి
      ౙారు నానారువీకను నట్టిమమత, బుట్టుకొని పిశిరికాయపుర్వట్టు లణఁగు.
గీ. అరయ కార్పాసబీజంబునటుల యొక్కఁ, డైన సమస్తాకృతులనొందియలరు మృత్యు
      మార్గతిమిరంబు విజ్ఞానమార్గదీప, కలన సుమనోరథుండు గావలయు జనుఁడు.
క. బైరాగివై మునుగు మునుహం, కారము శౌచంబు శాంతి గతి మౌనము శా
      రీరపరిశోషితవ్రత, పారీణత లనఁగ జ్ఞానబహుసాధనముల్.
క. తలపఁగ యొకటి జూడుము, సులభోపాయముగ ననిన జూచితి దేవా
      యిల వ్రతములలో నొక్కటి, తెలుపుము నిర్వాణదానధీకంబనఁగన్.
గీ. మార్గశిరశుద్ధనవమి నేమరక యుపవ, సించి మఱునాడు నీరాడి శ్రీనివాస
      యేకాదశిని యాహారమును త్యజించి, ద్వాదశిని బారణ మొనర్పవలయు గాన.

క. కలదే యేకాదశితో, తులగా వ్రత మనిన ముదముతో మైత్రేయున్
      నలవచ్చి మ్రొక్కి యిట్లని, సలిపెన్ తద్వ్రతము మోక్షసంగతి నొందెన్.
క. ఏకాదశ్యాంగంబై, వైకుంఠప్రాప్తి సేయు ద్వాదశి వినుమీ
      నీకథయని తా వెండియు, వాకొనియెన్ యోగివలన వాల్మీకి వినెన్.
చ. కుశలుఁ డనంగ రాజొకఁడు కుంభినిపై స్వశరీరముక్తుఁడై
      దశదిశలున్ మణిద్యుతవితానము నిండు విమాన మెక్కి తా
      ను శమనురాజధానికి జనుండు తదర్చ లొసంగి కొల్వులో
      విశద సువర్ణపీఠమున వేడుక నుంచె సమాదరంబునన్.
క. తనదు పురివైభవమునం, గనుపింపఁగఁ దగిన మణిహగాండ్లను గూర్పన్
      జనపతి వారలవెంబడి, జని సంయమ నీపురప్రచురము లెల్లన్.
ఉ. రక్కసి శూలముంగొని పరామరిశింపుచు రాఁగ నొక్కచోఁ
      జక్కని దేవకామినుల సందడి జేర్చి సుఖించువారి నొం
      డొక్కట రత్నభూషణసముజ్వలులై వెలుగొందువారి వే
      రొక్కట దివ్యభోగముల నుండెడివారిఁ గ్రమక్రమంబునన్.
గీ. చూచుచును వచ్చి దక్షిణక్షోణియందు, భయదహాహారవరుతిప్రపంచఘోష
      మాలకించి యదెట్టిదోయనుచు వారి, నడిగి వివరంబుగావిని యచటఁ జేరి.
సీ. రౌరవంబును మహారౌరవంబును నశిపత్రవనము కాలసూత్ర కూప
      మంధతామిప్రలాలంబు సేవనములు కంటకంబు నధోముఖంబు కూట
      శాల్మలియును విశపసమయఃపాత్రభంజనము తప్తాగ్నిసేచనము తైల
      భాండ మజ్ఞన మగ్నికుండ గోపనశిలాభక్షణంబులు క్రిమిభక్షణంబు
      రాక్షసకరాళమును వికరాళమును వి, ధుంతుదము కుంభిపాకంబు ధూమగర్త
      మనఁగ నిరువదియొక్కటి నైనయట్టి, ఘోరనారకభీభత్సకూపములను.
క. పడునారిఁ బొరలువారిన్, బొడవెట్టెడువారి మునిఁగిపోయెడు వారిన్
      దడఁబడువారిన్ భయమున, సుడిగొనువారలను దేరిచూచి భయమునన్.
క. గడగడ వణకుచుఁ గన్నుల, గడువడి మూసుకొని చెవుల గరము లదిమి య
      క్కడ నిలుపక వైవస్వతు, కడకుం జని కేలు మొగిచి కరుణాపరుఁడై.
క. ధార్మికుఁడ వీవు నీకున్, ధర్మాఖ్య జెలంగ నిట్లు దండింపఁగ నే
      కర్మములు చేసి రేలా, శర్మేతరు లైరియనిన శమనుం డనియెన్.
గీ. ఈశ్వరాధీన మిది పనియేమి తనకు, బ్రహ్మవ్రాసిన కట్టడ పాపపుణ్య
      ఫలము లనుభవ మొందు నీప్రాణికోటి, కర్మవశులకుఁ గాదనఁగాఁ దలంచె.

క. అనవుడు లేవే వీరికి, దనరిన నిష్కృతియటన్న ధరణీశ్వరుతో
      నినసూతి బలికె నిచ్చెద, నని తెగువరివైన వినుము నీహరిభక్తిన్.
మ. తొలిజన్మంబున నీవొనర్చితివి చేతోనిష్ఠమై ద్వాదశీ
      విలసత్పుణ్యమహావ్రతంబు త్రిజగద్విఖ్యాతమై నొక్కయే
      డలపుణ్యంబున నొక్కనాఁటి ఫల మియ్యంజాలుదే నందఱున్
      దొలఁగంజాలుదు రిమ్మహానిరయ పంక్తుల్ మాట మాత్రంబునన్.
గీ. కాకయుండిన వీరల కల్మషంబు, బ్రహ్మకల్పంబునందు దీరదు నృపాల
      యనవుఁడు కృపాళుఁడై యతఁ డట్టులైన, దొలుక నిచ్చితినన బ్రాణజాల మెల్ల.
మ. చులకనఁ జేయుచు నమ్మహానరకరాసుల్ మీఱి యక్కోలుగా
      కలగుండై గుమిగూడి చీమపరివీకం ద్రోపుత్రోపాడుచున్
      దొలఁగం ద్రోయఁగరాక పుష్పకములందున్ జెంతలన్ దేవతా
      కలవాణీకరచారుచామరము లంగశ్రాంతి వారింపఁగన్.
క. కుశలుని దీవింపుచుఁ దమ, కుశలంబులు పలికి యింద్రుకొలువున కరిగెన్
      దశదిశల వెలయఁ గీర్తులు, వశ మగు శమనుండు బనుప వసుధకు డిగియెన్.
క. తనరాజ్యంబునఁ గలిగియు, జను లెల్లను ద్వాదశప్రశస్తవ్రతవ
      ర్తనులై యిహపరసుఖములుఁ గని, మన నిలయేలె నతఁ డకల్మషమహిమన్.
క. ఈకథ యెవ్వరు వినినన్, శ్రీకరులై కోర్కులెల్లఁ జేకొని పిదపన్
      వైకుంఠపదవిఁ గాంతురు, నాకులమతి నెపుడు రంగనాయకు కరుణన్.
గీ. రాజకులచంద్ర యల భరద్వాజుతో స, నత్కుమారుఁడు వ్యాసులు నాగదంత
      మౌనివరుతోడ సూతుఁడు శౌనకాది, మునులతోఁ దెల్పెననుచు మృకండుసుతుఁడు.
క. పలికెన్ హేమకుతో న, వ్వలివృత్తాంతంబు యోగివరుఁడు భరద్వా
      జుల కిట్లనియె త్రయోద, శ్యలఘువ్రత మాచరింతు నత్తెఱఁ గెల్లన్.
చ. బలబల తెల్లవారునెడ బావనవారిని దీర్థమాడి తా
      చలువలు గట్టు తామ్రమున శక్తుఁడు గామికి మృణ్మయంబుగా
      కలశ మలంకరించి చిలుకంబడు నప్పటి వెన్నముద్ద మం
     డలములు గట్టు నాపయి నిడన్ వలయుం బరిపూర్ణకుంభమున్.
గీ. అందు శ్రీదేవితో శౌరి నావహించి, వెన్నపై నష్టదళపద్మ మున్న కలన
      ద్వారపాలకుల నమర్చి వేరువేరఁ, బూజసేయంగఁదగు విష్ణుపూజ చేసి.
క. కలశాంభఃపద్మం, బుల యెనిమిదియందు నుంపఁ జొప్పరును శ
     క్తులకును ఘననైవేద్యా, దుల నారాధింపఁ నగు వధూయుతముఁ గనున్.

గీ. అట్టి నవనీతకవళంబు నెట్టి రెండు, పాళ్ళుగా వారి కొక్కటి పద్మవాస
      కొక్కటియు వేరె నైవేద్యము కలగి వైష్ణ, వంబయన ముగ్ధభార్య కీవలయు మొదట.
క. శ్రీభాగ మైనకబళము, తా భామినికొసఁగ రెండు ధరణి భుజింపన్
      శోభనకరుఁడగు పుత్రుని, సౌభాగ్యము గాంచు సుతయు జనియించు నొగిన్.
మంత్రం. పురుషః పూర్ణకామశ్య హరిర్భద్రం తనోతినః
         యోషిద్వరాపతీ లక్ష్మీర్మంగళం విశతు స్వయం.
గీ. అనుచు నవనీతమును తనయతివ కొసఁగు, నపుడు మంత్రించి సేవింపుమనఁగవలయు
      తరుణియురమున కేలుంచి నరుఁడు వెనుక, మంత్ర మొక్కటి వలయు నీమమున బలుక
గర్భాదానమంత్రం. యస్వంతరాత్మాభూతానా, మనాదినిధనోచ్యుతః
                 నపరఃపరయాభక్త్యాకుక్షిం రక్షంతు తే సదా.
క. అని నాఁటికి నాచార్యా, ది నిజాశ్రితతికిఁ బెక్కు దీనారంబుల్
      తనశక్తికొలఁది దానము, లొనరఁగఁ గావించి నాఁటి కుపవాసముగన్.
క. జాగర మొనర్చి రాతిరి, వేగిర మఱునాఁడు మున్ను విస్రావళికిన్
      బాగుగ నన్నంబిడి కల, శాగతు లక్ష్మీశుఁ గొలిచి యాతరువాతన్.
గీ. పారణ మొనర్పఁ జండాంశుభాగ్విభూతి, నాటి విధినోపమానులైనట్టి సుతుల
      నెత్తుదురు కోరియీకథయంత వినిన, వంధ్యయైనను సత్పుత్రవతి నిజంబు.
క. కలదె చతుర్దశభువనం, బులలోఁ జతుర్దశీ ప్రభువ్రతమునకున్
      దులగా సద్వ్రతమది వై, ద్యులకున్ గలగుండుగలదె యూహింపంగన్.
గీ. మందులేటికి వెదకంగ మందులగుచు, నష్టవిధకుష్టుగుల్మజ్వరాతిసార
      శూలదోషజ్వరాదులు సోకనీదు, తనచరిత్రంబు చెవిసోక వినినఁ జాలు.
గీ. సర్వరోగాదిశాంత్యర్థపూర్వకముగ, మొదట సంకల్ప మొనరించి మునుఁగలేక
      యున్న శుచియైన నుపవాసముండి సూర్య, జపతపంబులు నాఁడెల్ల జలుపవలయు.
ఉ. భానుఁడు గ్రుంకునట్టితఱి భావములో రవినుంచి యింద్రియా
      ధీనుఁడు గాక సర్వమయు దేవశిఖామణి విష్ణుఁ గొల్చుచున్
      మానుట యొప్పు నిద్ర రవిమండల మమ్మురునాఁటి పౌర్ణమిన్
      దా నతిభక్తిఁ జూచి సుకరంబుగ నిత్యజపంబు సేయుచున్.
క. సేవించి యాత్మ తనుర, క్షావరమతి నైదుపళ్ల సద్యోమృత మిం
      పావహకలశమునం గొని, పూవులు బంగరపురత్నములు నిడవలయున్.
గీ. వస్త్రములు మడ్చి సూర్యమావాహయామి, యనుచు కలశంబు ధూపగంధాక్షతోప
      హారముల గొల్చి కట్టినచీర విడచి, నీడఁ జూచుట యొప్పు నన్నేతిలోన.

గీ. ధరణిసురు పేదఁదెచ్చి సదక్షిణాంక, ముగను నుత్తము తెరకు లోనుగనొనర్చి
      మరల వెలువడి మార్తాండమండలంబుఁ, జూచి కరములు మొగిచి యస్తోకభక్తి.
లయగ్రాహి. తామరసమిత్రవిను తామరవరేణ్యజన
                        తామరవిదూరశిత తామరసనేత్రా
            రామ నిరతాచితధరామర నిశాచరవి
                        రామనిగమస్తుత నిరామయసుఖ శ్రీ
            కామితనిధాన సనకానుసూతిప్రియ య
                        కామన తపఃఫలదకామ రిపుమూర్తీ
            నీ మరుఁగుఁ జొచ్చితిని నేమమున నన్మనుప
                        వేమరమర ల్దొరుగ వేమెరుగు తండ్రీ.
ఉ. నిన్ను నుతింపనట్టి శ్రుతి నీమహిమంబులు గాని శాస్త్రముల్
      నిన్ను భజింపకున్న యతి నీస్తుతులంటని సత్పురాణముల్
      నిన్ను బ్రధానుఁగా దలఁపనేరని ముక్తులు లేరు దేవ యా
      పన్నశరణ్య భాస్కర యపారయశస్కర శ్రీ పురస్కరా.
గీ. అనుచు వినుతించి విప్రభోజన మొవర్చి, తాను పారణఁ జేయునుత్తముఁడు పొందు
      నాయురారోగ్యభాగ్యవంశాభివృద్దు, లనఘ యిఁక పౌర్ణమీవ్రతం బవధరింపు.
గీ. పౌర్ణముల నాచరించిన పాపపుణ్య, కర్మఫలములు తను జేరుకాలమునకు
      మనుజుఁ డరువదివేలేఁడు లనుభవించు, గాన పర్వంబునం దధికంబు ఫలము.
క. ఎఱిఁగియు నెఱుఁగకఁ జేసిన, పరిహర మద్దినమునంద పాటిలు స్నానాం
      తరమున జితేంద్రియుండై, నరుఁ డక్షతమండలములు నలుమూలలుగాన్.
గీ. ఉంచి లక్ష్మీ హరిని నావహించి క్షీర, కలశ మాపయి నుంచి యక్కలశములకు
      నావహింపఁగవలయు పంచాయుధములు, నలుగడల నాల్గుకలశము న్నిలుపవలయు.
గీ. ప్రాణబుద్ధీంద్రియమనఃప్రపంచ మట్టి, కలశమున నిల్చునది సుమంబులను బూజ
      చేసి యందావహించు నశేషదైవ, తముల వేర్వేరఁ బొగడి పార్ధన లొనర్చి.
క. తా నాప్రాగ్దిశ ననలుని, బూని ప్రతిష్ఠించి త్రిమధుపూర్తిని హేమం
      బై నడలెంతన్మంత్ర, స్నాన మొనర్చునది కలశసరణుల చేతన్.
గీ. తిలలు నన్నంబు నుప్పు విత్తులును బసపు, దాన మొనరించి యాచార్య దక్షణలను
      సిరికొలఁది దానములు చేసి మరుదినమున, బ్రాహ్మణారాధన మొనర్పంగవలయు.
క. తామును బారణ సేయుట, నోముతెఱఁ గిందులను మనోరుజ లడఁగున్
      సేమములు గలుగు పౌర్ణమి, నీమము లగుస్నానదాననియమము లెల్లన్.

క. ప్రతిపద్వ్రతంబు మిక్కిలి, నతిశయముగ నలికి మ్రుగ్గులమరించి క్రియా
      చతురులయి తండులంబులఁ, జతురశ్రమంమండలంబు సలుపుట యొప్పున్.
గీ. నలినలోచను నావాహనం బొనర్చి, రేకురాల్పని నవపుండరీకములును
      ప్రేమఁబూజించి పాలుఁ బంచామృతంబు, నారగింపంగఁ జేసిన న్మేరలందు.
క. సరసిజసంభవు వాణిం, గురు నింద్రుని నావహించి కోర్కెలతో నె
      ల్లరఁ బొగడి పూజఁజేసిన, తరువాతను వాయనప్రతానము వలయున్.
క. మఱునాఁడు విదియతిథి స, ద్గురు నారాధించి విద్యకు నుపక్రమ మా
      చరియించి చదువదొరకొని, ధరణీసుర భోజనంబు తాఁ జేయనగున్.
క. తా వెనుక నారగించుట, యీవిధమున నోచి యపుడు యిటులాడె గురుం
      డావాక్యము జవదాటక, కేవల గురుశిష్యనియతి క్షితిఁగొనవలయున్.
సీ. కనుమ్రోల శయనింపఁ గా దెట్టివేళల గురుపరాధీనాత్మనిరతి మేలు
      తద్వధూమణిఁ గన్నతల్లిగా భావించి సోదరబుద్ధి తత్సుతులఁ జూచి
      యతనితనూజుల నతఁడె కా భావించి యాచార్యుఁ దండ్రిగా నాత్మనునిచి
      గురుఁ డపుత్రకుఁడైన పుత్రత వహించి ధనరుణకర్తవ్యమున జెలంగి
      మెలఁగునది శిష్యధర్మ మీ మేరననుచు, వానిఁ దనుదానె శారద వచ్చిపొందు
      తథ్యమైన ద్వితీయతావ్రతంబు, సిద్ధసారస్వతజ్ఞానసిద్ధి కొఱకు.
ఉ. స్నాన మొనర్చి శుభ్రనవతండులమండల మాచరించి యా
      పైని నిశాతపుష్పదళపద్మము వ్రాసి సరోజవాసినిన్
      దాన సమావహించి కరతామరసంబులు పద్మనేత్రముల్
      దాని మృణాళబాహులను దత్సదృశానన మట్టిపాదముల్.
గీ. తన్మరందవశాళికుంతలవిలాస, ఫాలము తదీయకింజల్కభావిభాసి
      కోమలాకారమూర్తిని గానుతించి, కోరు టొప్పగు నవ్వేళ కోర్కు లెల్ల.
గీ. దళములందు సరస్వతి దాంతి భూతి, రతియు కాంతియు విద్య సన్మతియు మైత్రి
      యన వెలయు దివ్యశక్తుల నావహించి, తేవలయు వారికడ దిశాదేవతలను.
గీ. ప్రజ్ఞయును మేధయును సత్యప్రభయు ఛాయ
      క్షమయుఁ గీర్తిము దయయు నా జనిన పేళ్ల
      దేవతల నావహించి ప్రాగ్దిశను శ్వేత
      రక్త పీతాశితాంగవర్ణక్రమమున.
క. ఆవరణమునకు వీరల, కావలిగా నుంచి యునుపఁగావలయ నదీ
      దేవీదక్షారుణసి, ద్ధావిశిఖావిశ్వ చండతరనామ కలన్.

గీ. ద్వారమున నుండనగు మ్రోల వక్రతుండ, కాలరేపేక్షణావలి నీలకాయ
      దీపవదనభృచ్ఛిరోదీప్తకోవృ, లనఁల నడుమను జుట్టులఁ దనరు నిధులు.
గీ. వ్యాసదక్షులు క్రతుమును లత్రికాండ, ధామకవులును వాశిష్ఠ వామదేవ
      జతపరాయణ శాండిల్య కణ్వ, మౌని మైత్రేయులును చుట్టు నానవలయు.
క. గంధము జవాది మృగమద, ముం దట్టపుణుందకప్రమును గుంకుముమున్
      కుందమ్ములునుం దమ్ములు, పొందమ్ములు నందములుగఁ బూజకు వలయున్.
గీ. పనస కదళీ రసాలాది పక్వఫలము, లమరుఁ జెరుకులు నెలనీళ్ళు నాకుఁ బోక
      రెండుబిరువలు బోనిచి యేర్పరించి, యాచరింపంగవలయుఁ బూజాదివిధులు.
క. ఏనంవిధమండలమున, శ్రీవరుబీజమును యుక్తి శ్రీదేవిని ది
      గ్దేవతులు ననుస్వారస, మావహనామాదిమాక్షరాళి నిడఁ దగున్.
గీ. భక్తి శ్రీసూక్తమున విష్ణుసూక్తమునను, తత్తదుచితంబుగా దిశాదైవతముల
      సూక్తములఁ బూజతేలి విశుద్ధభక్తి, తోన గావింపవలయు గోదాన మపుడు.
క. జలములు రాజల పాలుం, దిలలున్ బసపుపొడి యామతించినకలశం
      బులదాన మైదువల కీ, వలయు గురుపూజ సేయవలమున్ బిదపన్.
గీ. శారదాస్తవ మొనరించి గోరి యిట్లు, నోచి మఱునాఁడు పారణ యాచరింప
      వచ్చు తనుదానె విద్యయు యేరికైన, కోరి కోరికలెల్ల చేకూరు నపుడు.
క. విదియన్ గావించు వ్రతం, బిది నోమిన వారి కిందు నిష్టము లొసఁగున్
      తదియన్ గావించు వ్రతం, బిది నీ కేర్పఱతుఁ దెలియుమని యిట్లనియెన్.
సీ. తండులంబులఁ బద్మమండలం బమరించి పుండరీకమునట్ల నిండ నునిచి
      యందు శ్రీగిరినరసింహు నావాహన మొనర్చి హారకేయూరమంజీరకటక
      కుండలగ్రైవేయకోటీరచక్రాదిసాధన సౌవర్ణశాటికాభి
      రాముగా భావించి రాజీవముఖపుష్పరాజిచే నెంతయుఁ బూజ చేసి
      గుడము పాలును నైవేద్య మిడి తదీయ, సన్నిధిని గీతవాద్యప్రసంగవిధుల
      వెలబోల నలంకారకలశ మొకటి, యుంచి చక్రంబుపై నావహించవలయు.
క. ఆదిక్కు లెనిమిదింటన్, బాదుగఁ గలశంబు లునుపఁ బడునందులఁ జ
      క్రాదిమపంచాయుధములుఁ, బ్రోదిగ శరశక్తిఁ బద్మములు నిడవలయున్.
గీ. దిక్పతుల నాత్మదలచి తదీయకుంభ, ములు ప్రధానమహాకుంభమునకుఁ బోలె
      భక్తి గైసేయనగు దిశాధిపతులకెల్ల, నావహింపంగవలయు తదంతరమున.
క. మొదలు సందర్శనజపమున్, దుది దిక్పాలకులజపము దొరకొని యాదిం
      పదివెలుంగ దదీయున్, వదలకఁ గావించునది ధృవశ్రీ లొదవున్.

గీ. అరుతనగ్ని బ్రతిష్టించి యావుపాలు, నేతహోమంబు వేలిచి నేతఁజాల
      సంస్కరించుటఁ దగు ద్రవ్యసంచయంబు, దానహోమంబు సేయుందంబు వినుము.
సీ. ఒనరంగ తేనె నాయుఃకాముఁడై వేల్చు శ్రీకాముఁడై బిల్వచిరదళముల
      నారోగ్యకామకుఁ డర్థి శ్రీలతలను హత్తి సంతానార్థి యుత్తరేణి
      నపమృత్యు పరిహారనిపుణాత్ముఁడుగఁ జూచి తుష్టిగోరినవాఁడు తొగలచేత
      నర్థంబుఁబొరయువాఁ డలజాజికొమ్మల నరిజయంబొందువాఁ డంబుజముల
      వేల్వనగు నెన్నియాహుతు ల్వేల్చివాని, ద్విగుణముగ తర్పణములు తద్విగుణములుగ
      జపము గావించి తా సుదర్శనము గూర్చి, యరసి మము బ్రోచు నీజ్వాల యనఁగవలయు.
క. భుజియించి యుచితవి ..., ద్విజు లభిషేకం బొనర్ప దిక్పాలకులన్
      భుజియించి సాధనమ్ముల, నిజమహిమము లాత్మనుంచి నిపుణత మెఱయన్.
సీ. ధర్మవిరోధి యూధశిరోధిదళన చక్రాయుధం బెపుడు నాయంగరక్ష
      గర్వితాసురవధూగర్భనిర్భేదనా పాంచజన్యము ప్రాణబలము నాకు
      పౌండ్రకసాశ్వనప్రధ్వంసనంబైన గద మాకు సర్వమంగళవిధాయి
      శేషకాంహ్వోలతోచ్ఛేదకంబైన నందకము నీ కిహపరానందకరము
      దివ్యశరములు వర్షించు దివిజరిపుల, నెంచుశాఙ్గంబు భేదము ల్దీర్చు మాకు
      నబ్జలోచను శక్తి కుంతాగ్రచయము, నేడు మొద లెల్లపనులఁ జేదోడు మాకు.
గీ. అనుచు భావించి సకలక ల్యాణకార, ణంబయిన బుద్ధి నీరాజనంబు లొంది
      దానము లొసంగి విప్రసంతానమాంత్రి, తాక్షతలు మౌళిఁ దాల్చుట యది వ్రతంబు.
క. విమరియుండక నాదిమ, యామంబున దీర్పనగు మహావ్రత మిది పై
      జా మైన నిష్పలంబగు, నీమత మాబ్రహ్మచేత నిర్మిత మయ్యెన్.
క. చవితిం బారణ భూసుర, నివహము భుజియింప వెనుక నియమిత మయ్యెన్
      భువి నిది నోమినవారికి, నవిరళమతిఁ బొందరాని యర్థము గలదే.
క. సువ్రత మనఁ జెల్లు చతు, ర్థీవ్రత మీవ్రతములకు నధిక మైజను రా
      జవ్రతమునకున్ వలె నిది, యవ్రత మేమనక వినఁగనకు నెట్లన్నన్.
సీ. దంతుల రుజకు భౌమాంతరిక్షోత్పాతములకు గుఱ్ఱముల వ్యాధులకు రాష్ట్ర
      రోగంబులకు శాంతిరూపప్రదం బిది ద్వాదశారత్నమార్గముగ నరుగు
      మూరెడుపొడవున నేరుపాటుగ వైచి మెట్టు లేర్పఱచి నమ్మేరలందు
      ముమ్మూల హోమకుండమ్ములు ద్రవ్వించి ఖాదిరోదుంబరాదళము బిల్వ
      చలదళరసాలసాలాశములును దిలలు, మాషతండుల గోధూమమధుఘృతములు
      పాలును హవిస్సు నాల్గుదిగ్భాగములను, వేల్చియున్నను నడుచక్కి వేల్వవలయు.

గీ. అలికి ప్రాగ్దిశ మ్రుగ్గు లిడి యందుమీఁద, నారుతూముల బియ్యంపుటరుగు వైచి
      బహుళశృంగారపూర్ణకుంభంబునడుమ, నునిచి దిక్కులకలశంబు లునిచి యటుల.
క. అందుల నడిమికుంభము, నందున్ శ్రీనారసింహు నావాహింపన్
      పొందుగ ప్రాగ్దిశ నరుఁ డొక, టందంబుగఁ దీర్చి వహ్ని నట నిల్పనగున్.
గీ. నచట నాజ్యాహుతి సమగ్ర మగ్నిశుద్ధి, కొఱకు సుష్టువుచే నరహరిసమాఖ్య
      బీజమంత్రంబులను వేల్చి పిదప తామ, సృష్టకృత్తమహోమంబు చేయవలయు.
గీ. హేతశాలాంతరస్థలినున్న మొదటి, కుంభముఖమున గేలుంచికొని నృసింహు
      జపము గాయత్రిజపము కడమ, కలశములు పట్టి గావింపవలయు ద్విజులు.
గీ. అంతయు సహస్రమునుగాక నాచరింప, వెనుకయజమానుఁ డింద్రాదివినుతి సేయు
      నతని సింహాసనంబుపై నర్థి నునిచి, యగ్రకుంభోదకముల నీరార్పవలయు.
క. ఇతరములగు కలశంబూల, నతని గజాశ్వాదికముల నభిషేకింపన్
      హితమగు రక్షాకరమున, పతి కారతు లెత్తవలయు భద్రాపేక్షన్.
క. ప్రథితంబ బగునీరాజన, కథనం బిది యనుచు బుధనికాయము పలుకున్
      రథగజతురగపదాతి, ప్రధన జయాభ్యుదయవాంఛ బాటింపంగన్.
గీ. ఋత్విగాచార్యదక్షిణలెల్ల నొసఁగి, భూరియిడి వస్తువాహన భూహిరణ్య
      దాసదాసీపశుగ్రామదానములను, ధరణిసురవర్గమును చాలఁ దనుపవలయు.
శా. వేలల్ గట్టు విభూషణంబు లిడి లక్ష్మీవంతుఁడై పిమ్మటన్
      శాలాంతస్థలి నిర్గమించి జయనిస్సాణాదివాద్యధ్వనుల్
      మ్రోలన్ భోరు కలంగ నాప్తబల మామోదంబుతోఁ గొల్వ భూ
      పాలుం డాత్మపురంబు చేరవలయుం బంధుల్ హితుల్ దోడుగన్.
క. నగరు ప్రవేశించిన పగిది, నగరిపురోహితులు వాహనపుశాలల నే
      నుఁగుహయకాలల, మిగిలిన కలశోదకములు మితి జల్లఁ దగున్.
గీ. అచ్చటచ్చట నరసింహు నావహించి, పూజ లొనరించి తక్కువేల్పులను గొలిచి
      బలిబహిర్భూములను జల్లి కలయభూతి, తృప్తి యొనరించి శాలలందెల్ల వరుస.
క. భూసురభోజనవిధు ల, త్యాసక్తి నొనర్చి వార లాశీర్వాద
      శ్రీసరణి నక్షతము లిడి, నాసరసిం బూన్చు నవివాహములన్.
గీ. జనులకెల్లను బలము రాజన్యుఁ డగు, జన్ము లతనికి బల మగ్రజన్ములకును
      బలము నిగమంబు నీశుండు బలము వేద, ములకు నటుగాన రంగేశు గొలుచు టురువు
గీ. అనుచు రంగప్రశంస సేయంగ దడవు, జయరథుఁడు సేయు పాపసంచయము లెల్ల
      పోయిఁ బోయె కృతార్థుఁడై పోయెఁ బురికిఁ, బ్రీతిఁబ్రాచేతసాధ్యసుప్రీతుడగుచు.

క. గారుడసంహితలోపల, సారాంశం బగువ్రతప్రచారము లెల్లన్
      భారద్వాజులు తద్గురుఁ, డారసి విను ముదమునొందె నవనీనాథా.
క. అనవుఁడు మార్కండేయుని, గని హేమకనృపతి బల్కె కథ సాంగముగా
      వినవలయు వ్రతములను సా, టున బల్కిన నాకు నేర్పడునె యొకమాటన్.
క. జయరథుడు పురికిఁజని యే, క్రియ మెలఁగెం బ్రోచ నీధరిత్రి యెటుల దు
      ర్ణయవృత్తి యేమి యొనరిచి, నయినట్టి తెఱంగు దెలుపు మన యిట్లనియెన్.
శా. వేదోద్దారణమందరోద్ధరణభూవిన్యస్తదంష్ట్రాగ్రప్ర
      హ్లాదాంహ్యోధుబలీంద్రశిక్షకర సాధ్యక్ష్మాత్వయోత్పన్నవి
      చ్ఛేదిప్రాభవ రావణాహిత యదుశ్రేష్ఠాత్మ కౌంతేయర
      క్షాదారాదికలోకరత్న రజిఘాసాయత్నలీలారతా.
క. శరణాగతభరణా హిత, కరుణా పరిపూర్ణనయన కాసారమునీ
      శ్వర సుప్రసన్న లక్ష్మీ, తరుణీనాథాయమాన తతభుజమధ్యా.
వనమయూరం. చండతరకోటి రుచిజాల నమదీశా
      ఖండల విరించిముఖ కంధితనయా హృ
      త్కాండజ మధువ్రత విఖండిత నిశాటా
      పాండవసహాయ నిరపాయ మునిగేయా.

గద్య
ఇది శ్రీవేంకటేశ్వర వరప్రసాదాసాదిత చాటుధారానిరాఘాట సరస చతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకల విద్వజ్జనాధార కట్ట హరిదాసరాజగర్భాబ్ధి
చంద్ర వరదరాజేంద్రప్రణితంబైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యం బను మహాప్రబంధంబునందు
అష్టమాశ్వాసము.