శ్రీరంగమహత్త్వము/ద్వితీయాశ్వాసము

శ్రీరంగమహత్వం

ద్వితీయాశ్వాసము

క.

శ్రీపతి కల్యాణ గుణా
లాప! సమున్నిద్ర భద్రలక్షణ విలస
ద్రూప! శశివిశద కీర్తి
వ్యాపిత దిక్సీమ! బాగయప్రభురామా!

1


వ.

అవధరింపు మఖిలకథాకథన చాతురీజనిత జనరోమహర్షణుం డగు వ్యాస
శిష్యనందనుండు దివ్యబోధను లగు శౌనకాది తపోధనులకుఁ జెప్పినట్లు —
శ్రీరంగావతార ప్రసంగంబు తెల్లంబుగా విని యుల్లం బనురాగిల్ల నాగదంత
మునివర్యుండు పారాశర్యుతో — మహాత్మా! సత్యలోకంబున లోకపితామహు
నకు నిలవేల్పగు భుజంగతల్పుం డేకారణంబున నిక్ష్వాకుచేత నానీతుం
దయ్యెఁ దవ్వృత్తాంతం బంతయు సవిస్తరంబుగా నెఱింగింపు మనిన—
నాసంయమీంద్రుం డతని కిట్లనియె.

2


శా.

వైకుంఠాంఘ్రి సమర్చనాకలన హేవాఠుండు లోకోత్తర
శ్లోకుం డార్తజనావనోదితదయాలోకుండు ప్రత్యర్థిలుం
ఠాకుం డర్థిహితార్ధదానగుణగణ్యశ్రీకుఁ డేపార ని
క్ష్వాకుం డర్కకులామృతాంబునిధి రాకాచంద్రికాలోకుఁడై.

3


వ.

ఆరాజశేఖరుం డాత్మగతంబున.

4


శా.

దైవవ్యాకులితాత్ములై -విషయచింతామగ్నులై-రోషమో
హావేశావిలచిత్తులై - భవదవిద్యామత్తులై -దుర్భవ
వ్యావృత్తిం బ్రసరించు మానవులభావం బింద్రియార్ధంబులం
దావైరాగ్యము పొంది మోక్షపదవీ ధర్మం బపేక్షించునే.

5


వ.

మున్ను మత్పితృపితామహులైన వైవస్వతవివస్వంతు లమితానుభావు
లగుటం-గమలభవలోకంబున కరిగి-యురగ గణార్చితుండై యురగరాజ

పర్యంకంబున వెలుంగు రంగమందిర సందర్శనంబు గావించి- నిరర్గళ
భోగాపవర్గంబులం జెంది రందు మార్గంబు నాకు దుర్గమంబై యున్న దనిన
నస్మత్పుత్రపౌత్రాదుల నెన్ననేల యిది గావున నాతెఱంగు పొందుపడు
నంతకు నసురాంతకు భజియింతునని చింతించి యనంతతపోనిష్ఠుం డగు
వశిష్ఠున కంతఁదద్వృత్తాంతం బంతయు నెఱింగించిన నమ్మునిసత్తముం
డానృపోత్తమున కిట్లనియె.

6


క.

ఈతలఁపు మేలు జనవర
నీతపమున సంభవించు నిజ మెంతయుఁ బ్ర
ఖ్యాత పురాతన మునితతి
చేతన్ మును వింటి - వినుము చెప్పెద నీకున్.

7


చ.

జగదుపకారబుద్ధి నరిశాసన! నీవు తపం బొనర్పఁ బ
న్నగపతిశాయి దివ్యభవనం బజుఁ డప్పుడు తాను దెచ్చి నీ
కగణితభక్తి నిచ్చు-నది యాదిగ నీపురినుండు ధర్మపా
రగు లగు యుస్మదన్వయ ధరావరు లెల్ల భజింపఁ బెంపునన్.

8


క.

అటు కొంతకాల మరుగఁగఁ
బటువిక్రమశాలి రామభద్రుఁడు గుణలం
పటుఁ డగు విభీషణున కా
దఁట నొసఁగిన నిజపురమున కదిగొని చనుచున్.

9


తే.

నడుమఁ గావేరికడ దృగానందమైన
యిందు పుష్కరిణీతటి నిడి-కదల్ప
నలవికా కేఁగఁ గల్పాంత మందునుండి
బ్రహ్మలోకంబునకుఁ బోవు పార్ధివేంద్ర!

10


క.

ప్రతికల్పము నీగతి నా
గతుఁ డగు దివినుండి భువికి గమలోదరుఁ డా
శతధృతి దినములు దఱిగిన
నతులిత నిజదివ్యపదమునందు వసింతున్.

11

క.

కావేరీతీర్ధస్థితు
లై వెలసిన దాక్షిణాత్యులం దనిశము-ల
క్ష్మీవరుడు రంగశయనుఁడు
దా వదలఁడు కరుణ వారితప మెట్టిదయా!

12


క.

ధారుణి గల నానావిధ
దారుణ దురితము లొనర్చు తామసు లైసన్
శ్రీరంగ దివ్యదేశము
జేరఁగఁ గలిగినను ముక్తిఁ జెందుదు రధిపా!

13


క.

క్రిమికీట విహగ మృగ తిమి
కమరాది ఖగోరగములు గను తమ తిర్య
క్త్వము దొఱఁగి శాశ్వతస్థితి
యమిత శ్రీరంగమందు నావాసమునన్.

14


క.

హరికృప గల ఘనులకుఁ గడు
నిరవగు నానెలవు నిలువ నితరుల కెల్లం
బురహర జలజభవాదిక
సురకృత విఘ్నముల నచటఁ జొరరా దెపుడున్.

15


మ.

వనజాత ప్రియవంశభూపణ లసద్వర్ణాశ్రమాచార-వ
ర్ధనులై - ధీధనులై - ముకుందపదసక్తస్వాంతులై - శాంతులై
ఘనులై సజ్జనులైన సాల్వికులు రంగక్షేత్రమం దెన్నఁ డెం
డును గ్రందై చరియింతు రప్పు దడఁగుం దుర్వారవిఘ్నావళుల్.

16


వ.

అది గావున-

17


ఉ.

దక్షుఁడవై జగజ్జనహితంబుగ నిప్పుడుఁ బూని శ్రీమద
ష్టాక్షరమంత్రచింతనపరాయణచిత్తుఁడవై - భజింపు మ
బ్జాక్షుఁ బయఃపయోధితనయాభినయాలన చారు చంచల
ద్వీక్షణ చంద్రికారుచుల వేదుకఁ జొక్కు చకోరవల్లభున్.

18

వ.

అని నిజకులగురుం డగు నయ్యతివరుం డుపదేశించిన హర్షించి-యతని
కభివందనం బొనర్చి - వీడ్కొని యమ్మహీకాంతుండు - సకాంతుండై -
కాంతారంబున కరిగి యచట నిర్ద్వంద్వుండును వశిష్ఠాశ్రమసమీపంబునఁ
దనదేవి పరిచర్య లొనర్ప నిష్పరిగ్రహుండును - నిశ్చలుండునునై తపం
బొనర్చు నంత.

19


ఉ.

తాఘనమయ్యె నల్గడ నిదాఘము, దూరనిరస్తచైత్రిక
శ్లాఘము, మార్గగాభిమత చండమయూఖ నిరోధ విస్ఫుర
న్మేఘము, తోయదానపరిమృష్ట మహాఘము, శుష్య దంబుమా
ర్గౌఘము, సర్వజంతువపు రుద్గత భూరినిదాఘ ముర్వరన్.

20


సీ.

అతిమరుద్ధూత శాఖాన్యోన్యసంఘట్ట
నోద్ధాగ్ని దగ్ధదావోత్కరంబు
చండభాను ప్రభాసహ సముజ్జృంభణా
టోప ప్రభిన్న గండోపలంబు
మృగతృష్ణికా సమున్మిష దంబుధిస్ఫుర
దవిరతోదన్య నానాధ్వగంబు
తప్త తోయాశ యాంతర్లుర త్పారీన
కమర నక్ర గ్రాహ సముదయంబు


తే.

చిటపకోటర సంలీల విహగకులము
నగలతాకుంజ విభ్రాంత మృగచయంబు
శాదనిర్మగ్న భూదార సైరిభంబు
నగుచు మించె నిదాఘసమాగమంబు.

21


క.

ప్రాణికిఁ దను వొసఁగు జగ
త్ప్రాణ పయఃపాదపములు పటుఘర్మపరి
క్షీణములై కోరె జగ
త్ప్రాణపయఃపాదపాంతరంబులఁ దమకున్.

22


క.

మునికన్యార్పిత జలములఁ
తనుపగు తమపాదులందుఁ దరువులనీడల్
గనుపట్టి నిలిచె దినకర
ఘనతర పరితాపభీతిఁ గదలనికరణిన్.

23

ఉ.

అట్టి యనేహముం గడపె నానృపకేసరి నాల్గుదిక్కులం
బిట్టు మిడుంగురుల్ జెదఱ భీకరవహ్నులు మండుచుండఁగా
నెట్టన మధ్యభాగమున నిల్చి పదాగ్రము నేలనూది-మా
ర్వెట్టని చూపు లుగ్రకరబింబముపై నిడి యూర్ధ్వబాహుఁడై.

24


వ.

తదనంతరంబ-

25


మ.

జలదాటోపవిశాల మింద్రధనురంచద్వారుణీకూల-ము
త్కలికాలంబ కదంబసాల వనమధ్యస్ఫారసవ్యావళీ
కలనావాల ముదారకేతకపరాగవ్యాళ ముర్వీధర
స్థలనృత్యన్మదకేకిజాల మగువర్షాకాల మొప్పెం గడున్.

26


వ.

వెండియు-

27


సీ.

శుంభదంభోధర స్తోమ భీమారంభ
గంభీర గర్జా విజృంభణంబు
దృగసహ్య చటుల దీధితిమత్సముద్దామ
సంకుల జీమూత సంకరంబు
జంఝూమరుద్ధత స్ఫారధారాసార
నీరంధ్రతమ ధరణీనభంబు
రోధోనిరోధకాగాధపాథఃపూర
వాహినీ వర్ధిత వార్ధిజలము


తే.

కర్దమస్థల చంక్రమక్రమ సగర్వ
దద్దురోత్తరవికట పృధగ్విధప్ర
భూత నిర్ఘోష బధిరితాశాతటంబు-
నగుచు మించె నభోనభస్యాంతరంబు-

28


శా.

ధారాళాంబుదబృంద నిర్భర నిరోధవ్యాప్తి నాశాంతముల్
భూరిధ్వాంతమయంబులైన జను లేప్రొద్దున్ రవిం గానమిం
దా రూహించుచునుందు రాఁకొనుట మధ్యాహ్నంబు- నుద్దామని
ద్రారంభంబున రేయిటం బగట బోధావాప్తిఁ బ్రత్యూపమున్.

29

ఉ.

ఆసమయంబున్ విరహితావరణం బగుచోటఁ బ్రౌఢప
ద్మాసనబద్ద విస్ఫురితుఁడై బహులాశనిజాత పాతసం
త్రాసము లేక భూరిజలధారల నెప్పుడు దొప్పదోఁగుచుం
జేసెఁ దపంబు రాజకులశేఖరుఁ డక్షయధైర్యశాలియై.

30


ఉ.

అంత నిరంతరంబును దురంతసమున్నతిమంతమయ్యె - హే
మంత ముదారవిస్ఫురితమంజులమౌక్తికజాల ఝల్లరీ
కాంతిలసత్తుషార కణికాపరిగుంభిత భిల్లభీరుసీ
మంతము దుర్గమక్రమవిమర్దిత పద్మవనాంత మెంతయున్.

31


వ.

మఱియును.

32


సీ.

ప్రత్యూషజృంభిత ప్రాలేయ దుర్లక్ష్య
మాణ పద్మభవాండ మండలంబు,
సంకులద్వాసర సమయ మందిరభవ
ద్యోత ఖద్యోత భానూత్కరంబు-
ఏతత నిశీధినీ వేళాసహస్పీత
శీతరుగ్బింబ విజృంభణంబు
శీతాంశు దుర్దినవ్రాత సంచితకరీ
షాగ్నిధూమావృతాళాంతరంబు


తే.

నగుచు నంతంత కెగసె నీహారధరణి
ధర సముదూత నిబిడశీతల సమీర
ణాభిసంపాత జాత మాయాతభీత
జంతుసంకాన మగుచు హేమంత మంత.

33


తే.

హిమముచే నంబరం బెల్ల నిమురుగొనఁగ
సుష్టకరుఁడును గరము లొయ్యొయ్య సాఁచి,
తాను ననలాంశ ధరియింపఁ బూనె ననఁగ
నెంత యనవచ్చు నింక హేమంత మహిమ.

34


శా.

ఆహేమంతదినంబులం ధరణిపాలాగ్రేసరుం డద్భుతో
త్సాహాటోపమునం గళద్వయసపాథఃపూర మధ్యస్థుఁడై

యాహారంబు జలంబగా నచలదేహస్వాంతుఁడై నిర్జర
వ్యూహంబుల్ వెఱఁగందఁగా మెఱసె నత్యుగ్రప్రకారంబునన్.

35


వ.

అంత-

36


ఉ.

సంతత పుష్ప సౌరభ సుజాతిదిగంతము - పాంథమర్మభి
త్కుంత, ముదాత్త మత్తపిక ఘోషిత మన్మథరాజ్య వైభవో
దంతము, జంతుజాతసుఖదస్థితిమంతము, దూరధూత హే
మంతము, సంతతార్తిగ సమగ్రత్య జూపె వసంతమంతటన్.

37


వ.

వెండియు.

38


సీ.

కలకంఠ మధురవాగ్వైఖరీకారణ
మహిత సారస్వత మంత్రవిద్య
నానావనీజాత నవయౌవన ప్రదాం
చిత రసాయనయోగ సిద్ధఘటిక
కుసుమసాయక నిరంకుశ రాజ్యసప్తాంగ
సన్నాహ వైభవాస్థానసీమ
మందమందాగత మలయాని లాంకుర
వ్యాపార సులభ ఘంటాపథంబు


తే.

చేతనద్వంద్వ సౌఖ్యసంజీవకరణి
విరహిదశ మదనావేశ విషమవేళ
శిశిరమదకుంభి సంరంభ సింహమూర్తి
లీల నేతంచె మధుమాస కాలమంత-

39


ఆ వె

పసిమిఁ దాసి, ముదిరి, పసరింకి, పరుసనై,
పలుపు మిగిలి, తుదలు పగిలి, తలఁకి,
పండి, తొడిమ లెడల నెండుచుఁ గారాకు
డుల్లెఁ దరుల రవము పెల్లుగాఁగ.

40


క.

కారాకు రాల లేఁజిగు
లీరిక లెడనడఁగి శాఖ లేక విధంబై

వే రెఱుకపడక యుండెను
భూరుహములు కొన్ని దివసములు వనవీథిన్.

41


వ.

తదనంతరంబ-

42


సీ.

గుమురులై నయముదూకొని మోసు లెడరి లేఁ
జిగురాకు వెట్టి కెంజిగి దలిర్చి,
జొంపముల్ గొని జగజంపుగాఁ బొదిలి, క్రొ
న్ననలొత్తి మొగ్గలఁ దనరి, నిగ్గు
దులకించి, మొగడలు ద్రోచి లోరేకులు
బిగిసి తుదల్విచ్చి నిగిడివచ్చు
పూవుగుత్తుల మించి పూఁపల నిండారి
పిందెలై యొగరెక్కి, పెరిగి పులుసు


తే.

మిగిలి కరిగట్టి కలఁగి, దోరగిలఁ బాఱి,
యారఁ బండిన ఫలముల నమరు గెలల
వ్రేఁకదనమున గొమ్మలు విఱ్ఱవీఁగి
పరగెఁ దరువులు కన్నుల పండు వగుచు.

43


చ.

గునియుచు గుజ్జమావి నెలఁగొమ్మల నిమ్ములవ్రాలి సోఁగలేఁ
గొనలు దెమల్చి కెంజిగురు గుంపులు లంపులుమేసి క్రొవ్వి-వీఁ
కను నొగరెక్కి డగ్గుపడుకుత్తుకలం గొదలేని నూతన
స్వనములు పంచమశ్రుతుల జట్టికొనం జెరలించెఁ గోవెలల్.

44


చ.

మెకముల క్రొత్తనెత్తురుల మించు నునుంబులి గోరుబాగు-సొం
పుకుఁ బసఁజూపు వాఁడి కొనముక్కునఁ బక్వఫలంబు లొల్తి యం
జక వెసఁగ్రమ్ము తియ్యనిరసంబులు కుత్తుకబంటిఁ గ్రోలి-రా
ట్ఛుకములు పోతరించి రొదచొప్పడ నెల్లెడఁ బల్కెఁ బెల్లుగన్.

45


చ.

లరవిరి కమ్మఁదమ్మి విరులందుల నెందును సోడుముట్ట న
బ్బురముగ నుబ్బు మేలివలపుల్ పసిఁ గొంచుఁ మూఁగి లో
గుఱువులు వాఱి కర్ణికలఁ గొందులవాచవు లూరు తేనె ము
మ్మరముగఁ గ్రోలి యన్నుకొని మానక ఝమ్మని మ్రోసెఁ దుమ్మెదల్.

46

చ.

మిలమిలమంచు మించు చలి మించుల ముద్దులచందమామ-కాం
తులఁ దులఁదూఁగుక్రొమ్మొలకతూఁడుగొనం గబళించి త్రుంచి వి
చ్చలవిడి మేసి గబ్బుఁగొని సమ్మదనాదము లొప్పఁజేసి లీ
లల మలసెం గొలంకులకెలంకుల రాజమరాళదంపతుల్.

47


సీ.

తళుకుసుపాణి ముత్యాలమించుల మించి
మెలయుచుక్కల మేనిమెఱుఁగుఁ దఱిమి,
కలికిరాయంచఱెక్కల రేవగిలుమాడ్కి
విరిమల్లెగుత్తుల మురుపుఁ దెగడి
చదువుతొయ్యలిమేని చాయ నుల్లసమాడి
వెలిదమ్మి మొగదల తెలివి గెలిచి
జిగిమీఱు తొగరెక్క సిరులకు నసమిచ్చి
పాపరాయనివన్నె కేపుచూపి


తే.

పాలమున్నీటితరఁగల పనల నంచి
కొండయల్లుని మైతెల్పు కొంచపఱచి
కుప్పతిలు చుట్టుగొండపైఁ గొనలుసాఁగి
వెలఁది వెన్నెల లెల్లడ వెల్లివిరిసె.

48


ఉ.

సారఁపుఁదేటవెన్నెల రసంబులు మేలిమి నల్లగల్వపూఁ
గోరల నించి చందనపుఁగుబ్బలిపైఁ జనుదెంచుగాడ్పులన్
సారెకుఁ జల్లజేసి మృదుచంచుపుటంబులచేఁ జకోరముల్
కోరిక నిచ్చె మచ్చిఁగఁ జకోరిక లింపులఁ గోరగింపఁగన్.

49


ఉ.

గందపుఁగొండ నెత్తముల కందువ నేలకితీవయిండ్లలో
గెందలిరాకుపాన్పున సుఖించి నితాంతరతిశ్రమంబులం
జెందిన చెంచుగుబ్చెతల చెక్కులఁజిమ్ము జవాదివాసనల్
విందులు సేయుచున్ మెలఁగె వేమఱుఁ గోమలగంధవాహముల్.

50


వ.

అట్టి వసంతసమయంబున నవ్వనంబున దపోనిరతిశయంబున
వర్తించు నమ్మార్తాండకులమండను తేజోనుభావంబు భావం
బులు గలంప నిలింపు లాత్మపదభ్రంశనాశంక నందఱు పురందరు

పాలికిం జని యత్తెఱం గెఱింగించినఁ గించితానతముఖుండై శత
మఖుం డంతరంబున దత్వ్రతభంగంబు సేయ నుపాయంబు విచా
రించి పంచశర సంచలిత జగద్ధీరతావైభవుం డగుమనోభవుం
దలంచిన తత్క్షణంబ-

51


సీ.

కప్పారు నెఱివెండ్రుకలకొప్పు కొప్పుగాఁ
బారిజాతంపుఁబూబంతి మెఱయ
రతి పదాలక్తకాంకితమైన నొసలిపై
నిలువుఁగస్తురిబొట్టు చెలువు మిగుల
గేయూరముద్రలు గీల్కొన్న గళమున
మౌక్తికంబుల కంఠమాల యమరఁ
జెదరు గంధపుఁబూఁత జెన్నొందునురమునఁ
బద్మరాగంబుల పదక మొలయ-


తే.

సరస సంభోగశృంగార సహజమహిమ
లలితయోజన లావణ్యలక్ష్మిఁ బెనుప
ననుపమాన జగన్మోహనైకమూర్తి
దర్పకుఁడు వచ్చె నింద్రునాస్థానమునకు.

52


క.

వలరాజు రూపరేఖా
విలసనములు దనవిసనక వీక్షించెడిచో
నిలువెల్లఁ గన్ను లగుటకు
ఫలమెల్లను గలిగె నమరపరిపాలునకున్.

53


ఉ.

అప్పుడు పుష్పబాణురుచిరాకృతి దప్పక చూచి చిత్తముల్
ద్రిప్పఁగ లేక కొర్కితఱితీపులఁ బ్రేమలెలర్ప మానముల్
దప్పి చలించి ఘర్మసలిలం బెసఁగం బులకించి నివ్వెటల్
గప్పి విచిత్రరూపములకైవడి నిల్చి రమర్త్యభామినుల్.

54


వ.

ఇట్లు వచ్చిన భావసంభవు బహువిధంబుల సంభావించి జంభారి నిజకార్యారంభం
బెఱింగించి మఱియు నారమాకుమారున కిట్లనియె.

55

చ.

అమరుల దివ్యబాణ నిచయంబుల పెల్లు దృణీకరించి-ద
ర్పమునఁ జరించు పోటరులు, భామల కోమలహాస దృగ్విలా
సముల ధృతుల్ గలంగి వివశత్వము నొందుట విశ్వలోక-దు
ర్దమ భవదీయ కోరిక శరంబుల బల్మిగదా! మనోభవా!

56


ఉ.

ఏకమనస్కులై తగుల మెందును లేక విరక్త ధర్మశి
క్షాకరులైనవారి నొకసందున డెందముఁ జూచి చించి-బ
ల్కాఁకలు సేయు నీకు మహిళా సహచార దృఢావివేకుని
క్ష్వాకుఁ బరాభవించు టనఁగా సరకా నరకాంతకాత్మజా!

57


వ.

అని యగ్గించి తత్కాల సముచితసత్కారంబుల నతనిఁబ్రీతుఁ గావించి
వీడ్కొలిపి తత్కార్య సహాయంబుగా—సురగణికా నికాయంబును-బంపిన
నయ్యచ్చరలు వియచ్చరేంద్రుపంపునఁ గందర్పునకు ముందఱ నిలచి
యమ్మహీపాలుండు తపంబొనర్చు వనంబుఁ బ్రవేశించి యందు-

58


సీ.

కొమరారు చెంగల్వకొలఁకుల కెలఁకులఁ
బూఁదేనెఁ దనివొందు పొదల మొదలఁ
బొరలెత్తు కర్పూర తరువుల మఱువుల
మది కింపుగల యెటిమడలకడల
విలసిల్లు శశికాంతవేదుల వీదులఁ
గేలి కిమ్మగు మేటిగిరుల తరుల
నింపుగాఁ బండిన యీడల నీడల
చెలువైన సురపొన్న చెట్లపట్ల-


తే.

నాకుఁదీవెలక్రేవల నతిశయించు
పోకమ్రాకులజోకల వీఁక నెగయు
ఘనపరాగంబు రాగంబు బెనుప నెసఁగు
మొగిలివనముల మనముల ముద మెలర్ప.

59


క.

మెలఁగుచు, మధురసముల జడి
కలగుచు లీలాభినయ సమంచిత గతులన్
పిలఁగుచు, నవసరసోక్తులఁ
జెలఁగుచు, నృపుఁ జేరి వేల్పుచేడియ లచటన్.

60

సీ.

పాదపల్లవ మృదుస్పర్శఁ జూతంబుల
సుకరాంఘ్రి హతుల నశోకములను,
గలభాషణంబులఁ గర్ణికారంబుల
వదనాసవంబుల వకుళములను
బరిరంభణంబులఁ గురువకప్రతతుల
దృగ్విలాసంబులఁ దిలకములను
దరహాసకాంతి సంతతి సురపొన్నల
సమదరాగంబులఁ జంపకముల


తే.

నసమ సమగీత లహరిఁ బ్రియాళములను
జారుముఖ గంధముల సింధువారములను
ప్రౌఢ నఖరాంకురక్రీడఁ బాటలముల
నాదరంబార నందందఁ బ్రోదిచేసి.

61


సీ.

అతివ! చందన లింకాంచితం బీవనం
బిదియేల నీమోము నిట్లకాదె,
పల్లవోల్లాసిని! పడఁతి యీ తరుశాఖ
నీ జాడ లదియును నేలఁబోలు
లలితాంగి! మాధవీలతిక పుష్పిణియైన
నంటఁగా రాదు నీ వందుఁ జనకు
వనజాక్షి! కాంచనావలి కాససేసెదు
జగ మంతయును దద్వశంబకాదె,


తే.

మెరసి లోకోత్తరంబై సమీరణంబు
దక్షిణంబౌట యెఱుఁగవా తరుణి యిపుడు
బాల నీసొమ్ము రాజీవజాల మెల్లఁ
దలఁప మాకేల కైవర్తతతికిఁగాక.

62


క.

ధవళేక్షణ! లీలార్థం
బవతంసముగాఁగఁ గువలయముఁ దాల్చెఁ జెలీ
చెవి నమరసత్యవతిగా
భువి నిక దలఁమోపు మాసెఁబో ఫణిపతికిన్.

63

వ.

అని యివ్విధంబున నిచ్ఛారూపచతురసల్లాపంబులఁ బ్రమోదంబునొంది
వినోదించుచు.

64


క.

ఓసరసిజాక్షి! యిది గడు
నోసరమని యేల దవుల నోసరిలెదు నీ
కేసరములు వలసిన నీ
కేసరములు గూర్పు లలితకేసరములుగాన్.

65


చ.

తలఁపులు నిక్క, నిక్కపుముదమ్ములఁ దమ్ముల సంచలించు ని
య్యలులకు లోఁగి లోఁగినుకనందెద నందెదవేల, చంపకా
వలి వలినున్నమొగ్గల నివారణ వారణయాన-కోయు-మిం
పలరఁగ దానఁ దేటి రసమానదు మానదు లేఁతపూవులన్.

66


క.

ఎలమావుల వలరాయని
యలమావుల శుకపికంబు లాఁగినవేల్పుం
బొలమావుల విరహార్తుల
దలమా వులుకక[1] చరింపఁ దరుణీ యిచటన్.

67


సీ.

ఏపారువనలక్ష్మి యిమ్ములు దమ్ములు
తుహినాంశు నెనరు కందువలు దొవలు,
భ్రమరనాయకు లేలుపల్లెలు మల్లెలు
కందర్పు సిరులు చెంగల్వవిరులు,
నెసఁగుపూమొగ్గల యెల్లలు మొల్లలు
వలఁపు సంపదలు చేవంతిపొదలు
తొలినెయ్యములకుఁ బోదులు విరవాదులు
నవవిహారదములు నారదములు


తే.

వేడుకల కామెతలు కురువిందలతలు
రసికజనముల మెచ్చుల రచ్చపచ్చ

యనుచుఁ గుసుమాపచయకేళి కంతకంత
కంతరంగములన గుతూహల మెలర్ప.

68


సీ.

పదముల కెంజాయఁ బఱచి నిల్చినచోటఁ
జిగురాకు పంచిన చెలువు నెఱపఁ
దీగకైవడి గౌను సాగనిక్కిన నీవి
వెడజాఱ నతనాభి బెడఁగు దెలుపఁ
బరువంపువిరులపైఁ బచరించుచూడ్కులు
మెలమెల్ల నన్నులై తెలపు చూపఁ
గేలుసాఁచిన నివ్వగిలు కక్షకాంతులు
జిగిచన్నుఁగ్రేవల జీరువాఱ-


తే.

మలఁగి జఘనంబు వెనుకకు మాగ నిగిడి
వేళ్లపై ముద్రికల మించు వెల్లికొనఁగ
వాఁడివాలారుకొనగోళ్ళ వలను మెఱసి
కోర్కులే చరింపఁ జూపులు గోసెనోర్తు-

69


సీ.

చెమటచిత్తడి చాలఁ జెలువొందు నొసలిపైఁ
గుఱుచక్రొన్నెఱులు గైకోలునెఱపఁ
వెడఁదకన్నులకెల్లు బెడయుచూపులు వాలు
ఝళిపించుగతి దళతళనఁ బొలయఁ
గదలు బింకపుఁజన్నుగవ నిండుపఱపున
నిఱుపేద కౌఁదీఁగ తరలఁబాఱ
ధట్టించి తుదవ్రేళ్ళఁ దట్టుచో వెస నుంగు
రముల కాంతులు బిత్తరములఁ దాఁటఁ


తే.

నక్షరోచులు నెఱయ గంకణము లొరయఁ
చెరలి మొలనూలుమెలఁగ నందియలు సెలఁగ
సంతసము బెంప నూర్పులు సందడింపఁ
బ్రోడ యొక్కతె కందుకక్రీడ సలిపె.

70


క.

కరతలరుచి నరుణంబై
ధరఁ దననఖకాంతిచే సితంబై దృష్టి

స్ఫురణ నిడ నసితతరమై
కరమొప్పెను బంతి మూటిగతి నొక్కటియున్.

71


సీ.

సరిలేని బంగారుజలపోసనము వీణె
మెఱుఁగు డాచనుగుబ్బమీద నిల్పి
తులలేని వజ్రకాంతులపెల్లు వెదచల్లఁ
గొనగోళ్ళ తంత్రులుగూడమీఁటి
నిగ్గులు దులకించు నిడువాలుఁగన్నులు
తళుకుసారెలమీఁద దడఁబడంగ
గంకణంబులు ఘలుఘల్లున బహుతాళ
గతులు వాయించుసంగతులు నెఱపఁ


తే.

గ్రమముతో మంద్ర మధ్య తారకల శుద్ధ
మిశ్రసాళగముల రాణమీఱ రాగ
వితతిఁ దగుమిత్రములు మేళవించి పాడెఁ
దెఱవ యొక్కతె సంగీతదేవి యనఁగ.

72


క.

నిరుపమ వీణావాద్య
త్వర- నితరకుచంబు గదరెఁ దరుణీమంచాం
తరితోన్నతవామపయో
ధర సందర్శనము లేమిఁ దా వడఁకుగతిన్.

73


వ.

మఱియును.

74


సీ.

క్రీడామయూరంబు నాడించెఁ కంకణ
క్వణచారు కరతాళగతుల నొకతె,
కామతంత్రరహస్య గర్భోక్తు లొఱపుగాఁ
గలికి రాచిలుకకుఁ గఱపె నొకతె
ముఱియుచు నటియించు ముద్దురాయంచకు
నెఱి మందయానంబు నేర్పెనొకతె
మహనీయయౌవనోన్మాదంబు పెంపున
దీగయుయ్యెల వేడ్కఁ దూఁగె నొకతె

తే.

ధవళ శశికాంత వేదికాంతరమునందుఁ
చెలులతోఁ గూడి వలరాజు గొలిచె నొకతె
లలిత సహకార మాధవీలతల కెలమిఁ
బరిణయోత్సవలీలలు నెఱపె నొకతె.

75


వ.

ఇట్లు బృందారక సుందరీబృందంబు బహప్రకారంబుల మదన వికార కార
ణంబు లగు లీలావిలోల సంధిభావంబులు పచరించియుఁ గేళీ విహారంబుల
సంచరించియు-నసమశృంగార భంగీవిశేషంబుల మెఱయు నా రాజతపోధను
చిత్తంబుఁ జిత్తజాయత్తంబు చేయంజాలక -

76


ఉ.

మేనక విన్ననై నిలిచె, మెల్లన మో మర వాంచె రంభ-లో
నూనిన వింత నివ్వెఱఁగు నొందెఁ దిలోత్తమ-గర్వహీనయై
దీనత నొందె నూర్వశి, మదిఁ జలియించె ఘృతాచి యన్యకాం
కానిచయంబు లెల్ల దవుదవ్వుల నుండె భయంబు పెంపునన్.

77


వ.

అట్టి యెడ ముక్కంటి మగతనంబు సగంబుగాఁ బెనంగిన నెఱజోదు ప్రమో
దంబున బ్రయాణసమయ సముచిత సన్నాహ సంరంభ విజృంభితుండై -
బొండుమల్లెల బొమిడికంబును-గొజ్జంగి వజ్రాంగియుఁ జొన్నగుబ్బెల రాగె
వల్లులును మెఱయ, హరినీలజాలంబుల డాలు నేలు నలువునం బొలుపు మిగులు
కొదమతుమ్మెద గొనయం బెక్కించి మించుగాఁ దొడిగిన యించువిల్లునం
బెల్లు నిగిడి-పల్లవుల యుల్లంబులఁ గాడిపాఱు కోరచూపులు గల కళావతుల
కలికి కనుజిలు కడల ధగధగలం బొలయు మెఱుఁగులు గుఱిగొన బసని
కుసుమరసముం గులికి పులుగడిగి గఱులు దీర్చి వంకలొత్తిన గ్రొత్తలై
యున్న మదనమోహన వశీకరణ సంతాపనాభిధానంబుల నొప్పారు సహకార
సారసాశోక శిరీష కోరక ప్రదరంబులు నిలచి సవరించిన కవదానలు ధరి
యించి కట్టాయితంబై విరిదమ్మి బండికండ్లును బిసకాండపుటిరుసులును,
బొగడ మొగడల చీలలును దొగల నొగలును మొగలి రేకుల పలుకయుఁ
గలువకాఁడియుఁ గురువేరువాగంబులును సంతరించి వసంత సారథి తిన్ననై
యున్న క్రొన్నన మునికోలఁ గదల్చి యదల్చినం గెరలి చెరలి కొట్టుచు
మిన్నులపై బాఱు చిలుకవారువంబుల రయంబున దళతళం బొలయు
దిక్కులఁ బిక్కటిల్ల వెన్నెల నెదచల్లు వెల్లియుఁ గలిగి తనరు తనరథంబు

రతి సమేతంబుగా నెక్కి, మధుమధురసపాన సంభ్రమ ద్భ్రమద్భ్రమర
ఝుంకార కాహళారావంబులు జెలంగ-నుభయపార్శ్వంబులఁ గదలివచ్చు-కల
కంఠ వీరభట పటలంబుల నంతకంతకు సంతసం బొలయ సేనా
ముఖంబునం గలయఁ బొలయు మలయానిలయముచేత నాఘాతంబులగు తరు
వ్రాతంబుల నెసఁగు కుసుమ పరాగంబు నభోభాగంబునఁ బర్వి సర్వంబు
పదిలంబగు నిజప్రతాపానల స్ఫులింగజాలంబు ననుకరింప నరుంధతీపతి
యాశ్రమంబు సొత్తెంచి యచ్చట రిచ్చవడియున్న యచ్చరలఁ దెలిపి కలిపి
కొని యామహీపాలు సమీపంబునకుం జనునప్పు డమ్మహాత్ముండు.

78


చ.

ఎసఁగిన బాహ్యసంచరణ మెల్లను మాన్చి మరల్చి-యెద్దెసం
దుసికిలనీక నెమ్మనముతోఁ బిరిగొల్పిన చూపు దేవతా
విసక శిరోవతంస మగు విష్ణునిపై నిడి నిస్సమీరణ
ప్రసరణ దేశదీపరుచిరస్థితి నిశ్చల యోగయుక్తుఁడై.

79


ఉ.

ఉన్న తెఱంగుఁ జూచి రభసోన్నతి మిన్నదలంగ నార్చుచుం
బన్ని శుకాన్య పుష్ట మధుపప్రకరామరకామినీ తతిన్
మున్నిడి చందనాచల సముద్ధత మందమరుత్సహాయ సం
పన్నతఁ బేర్చి యందఱకుఁ బ్రాపుగ నిల్చి యదల్చి బల్విడిన్.

80


మ.

సరి గెందామర మొగ్గనారస, మలిజ్యావల్లి సంధించి-భా
సుర మాణిక్యమయోర్మికారుచులు చక్షుష్కోణశోణద్యుతుల్
బెరయం జక్రవిభాకృతిం దనువు శోభిల్లన్ వడిందీసి ని
ర్భరముష్టిన్ వెస డాసి యేసె మరుఁ డారాజన్య చూడామణిన్.

81


తే.

అట్లు పుంఖాను పుంఖంబు లగుచు నిగుడు
నతను బాణపరంపర లానృపాలు
నిచ్చఁ దెరలింపఁ జాలక విచ్చిపోయె
జగతిఁ బూవుల కది సహజంబ కాదె.

82


క.

తా నసమాస్త్రుం డనియును
మానవపతి మానినీ సమన్వితుఁ డనియుం

బూని మది దురభిమానము
మానక నటు పెనఁగి మరుఁడు మ్రాన్పడియుండెన్.

83


వ.

అయ్యవసరంబున-

84


తే.

అడఁగె మలయానిలుండు సొంపఱె వసంతు
డలులు విభ్రాన్తినొందెఁ, గోయిలలు బెదరె,
జెదరి మోములు వాంచె రాచిలుక పిండుఁ,
జిన్నఁబోయిరి దివిజ రాజీవముఖులు.

85


వ.

అంత నిక్ష్వాకు భూకాంతుం డంతర్నివృత్త హృషీక వ్యాపారుండై యుదయ
దరుణ కిరణ నికర వికసిత సరసీరుహదళ శోభావిడంటకంబు లగు నంబ
కంబు లల్లన విచ్చి పురోభాగంబున-

86


మ.

కనియెన్ మారు, జగద్విమోహన శుభాకారున్, సమారూఢయౌ
వన శృంగారు, శుకాలి కోకిల పరీవారున్, లలాభావలో
కన భూరివ్రత భంజన స్ఫురదహంకారున్, సముద్ధూతచే
తన సంకల్ప ఫలావతారు, విరహార్త ప్రాణి సంహారునిన్.

87


క.

కని నిర్వికారగతి న
మ్మనుజవరాగ్రేసరుండు మరునకు (ను) మరు
ద్వనితల కతిథి సపర్యా
ఘన సత్కారము లొనర్చి కడువినయమునన్.

88


క.

సంతసమె కుసుమశర? వ
సంత! సముల్లాసమే? కుశలమే దివిష
త్కాంతాజనంబ! త్రిభువన
సంతాపహరప్రచార సౌఖ్యమె పవనా!

89


చ.

అని మధురోక్తు లొప్పఁ దమ కందఱకుం బ్రియమాచరించు-న
మ్మనుజవరేణ్యు ధైర్యగరిమంబునకున్ వెఱఁగంది యొండొరుం

గనుఁగొని సమ్మదంబు మతికంపము విన్నదనంబు లజ్జయుం
బెనఁగొన నంతరంగమునఁ బిమ్మిటిగొంచు రహస్యభాషలన్.

90


క.

ఈతగు, లీతెగు, వీతెలి,
వీతాలిమి, యీ విరక్తి యొఱుగంటిమె యీ
భూతలపతి గలఁగడు మన
చేఁతల, వ్రతసిద్ధి యుల్లసిలుగా కింకన్.

91


వ.

అని యగ్గించి రంతఁ గంతుం డమ్మహీకాంతున కిట్లనియె.

92


ఉ.

నీవు తపస్వి వౌదు ధరణీవర, యింద్రియముల్ వశంబు నీ
కే విధి నేనియుం గెలువ నెవ్వరు నోపరు, మున్ను జంగమ
స్థావరముల్ మదేక విజితంబులు-నా కగపాటు లేని భూ
తావలి గల్గెనేని యిధి యంతయుఁ గ్రోధముచే హతంబగున్.


క.

వెఱపింప వచ్చి-వెఱచిన
తెఱఁగున ననుగెలుతు నని మదిం బూని హరుం
డఱిముఱిఁ గ్రోధము చేతం
బఱివఱియై తపము విడిచి పాఱఁడె మొదలన్.

94


క.

మిక్కుటమగు వలఁపుతమిం
గుక్కుటమై చనిన దేవకులనాయకునిన్
మక్కువ తగవు దలంపమి
నక్కమలాసనుని నెఱుఁగవా లోకమునన్.

95


శా.

కామక్రోధవశంబు విశ్వమును దత్కామంబు క్రోధంబు నా
జ్ఞాముద్రాధరు లబ్జనాభునకు నాసర్వేశు సేవించుటన్—
భూమీశోత్తమ నీవు మత్సముఁడవే మున్నీకు లోనైతి-మే
లా మాటల్ గయికొందుగాక భువనాలంఘ్యార్థలోకోన్నతుల్.

96


వ.

అని ప్రశంసించి తచ్ఛాప(తత్ + శాప) భయంబున నచ్పోట నిమిషమాత్రంబు
నిలువ శంకించి మగిడి తనపోటువిధంబు-నిక్ష్వాకు సన్పిధానంబున నైన

నిజపరాజయంబును సురరాజున కెఱింగించి-యథాస్థానంబున కరిగి రంత-
దురంతకార్యచింతాసంతాపితస్వాంతుండై మరుద్వంతుండు-

97


మ.

పటుబాహాబల దర్పితామరచమూపశ్రేణి గొల్వన్ సము
త్కటదీప్తానల విస్ఫులింగవిసరోగ్ర క్రూరధారాశత
త్రుటితగ్రావ గరుద్వితాన మగు నస్తోకాస్త్రముం బూని-యు
ద్భట దానాకుల గండమండల మహాదంతావళారూఢుఁడై.

98


క.

అతిరయమున నాధరణీ
పతికడ కరుగుటయుఁ దనకుఁ బ్రభుసముచితస
త్కృతు లాచరింపఁ బూనిన
యతని తపస్సిద్ధిఁ గని మహారోషమునన్.

99


క.

గిరిభేది వైచె నన్నర
వరుపైఁ బటు కుటిల కరినవైరివ్రజ ని
ర్భరగర్భ తిమిర సముదయ
హరణదినారంభహేళి నాదంభోళిన్.

100


వ.

ఇట్లు ప్రయోగించినఁ బ్రపంచితదీర్ఘనిరోషభీషణంబై —తనమీఁద నడరు
వజ్రాయుధంబు బెడిదంపుటురువడి కించుకయుఁ జంచలింపక యమ్మను
తనయుండు సకలభక్తభయత్రాణపరాయణం బగునారాయణదేవుని
చక్రంబుఁ దలంచి తత్క్షణంబ.

101


సీ.

ప్రళయమార్తాండమండల చండతరసము
ద్భూత భూరిప్రభాపుంజ మగుచు,
ఘనసహస్రార నిర్గతమహోగ్రానల
జ్వాలావలీఢ దిగ్వలయ మగుచు,
సహజ తేజోవిశేష క్షణాంతర్భూత
సర్వదివ్యాస్త్ర విస్తార మగుచుఁ
గఠిన నిర్ఘాత సంఘాత భీషణఘోష
నిర్భిన్న రాక్షసీగర్భ మగుచు,

తే.

సకల శుకముఖ్య మునియోగిజన సమగ్ర
మహిత నిగమార్ధ సంస్తూయమాన మగుచు
వచ్చె మానసవేఁగమై వనజగర్భ
దాసభయకర్శనంబు-సుదర్శనంబు-

102


వ.

ఇట్లు వచ్చు నమ్మహాస్త్రరాజంబు తేజంబున దౌదౌలన దళితసంరంభంబై
దంభోళి పొడ వడంగిపోయినఁ గని జంభారి సిగ్గుపడి బెగ్గడిల దిగ్గన కనక
గర్భుపాలికిం జని తద్విధం బంతయుఁ జెప్పిన నప్పరమేష్టి యాశ్చర్యంబు
నొంది వైవస్వతనందను మనోరథమహత్త్వంబు దెలియం గోరి నిమీలితాష్ట
నయనారవిందుండై యానందంబున డెందంబునఁ గనువిచ్చి చూచి యా
భూవరోత్తము చిత్తము శ్రీరంగశయనప్రవృత్తం బగుటయెఱింగి-మైయెఱుం
గక యొల్లంబోయి మెల్లన తెలిసి నిజస్వామి యగుశ్రీరంగధాముని సన్నిధానం
బున కరిగి సురగణసమేతంబుగా సాష్టాంగప్రణామం బాచరించి, కృతాంజ
లియై ముఖకంజంబులు పుంజంబులుగా నూరకున్న యన్నలువపైఁ గృపాకటా
క్షంబు నిగిడించి పుండరీకాక్షుం డిట్లనియె.

103


చ.

జలరుహగర్భ నీదెసఁ బ్రసన్నుఁడ నేను విషాద మేల నా
తలఁ పెఱిఁగింతు నీకు నది తప్పదు విన్ము మదేతదంచితో
జ్వల శుభమూర్తితోఁ దరణివంశమహీధవ రాజధానియై
వెలయు నయోధ్య కేఁగెదను విశ్రుత రంగగృహాన్వితంబుగన్.

104


సీ.

అచట నిక్ష్వాకుధరాధీశ్వరుఁడు మొద
లయిన తత్కులజనతాధిపతులు-
గొలువ మహాయుగంబులు నాల్గు పరిపూర్ణ
మగుదాఁక నుండి యనంతరంబ
చోళమండలమునఁ జూడనొప్పారు కా
వేరీమహానది తీరమునను
జంద్రపుష్కరిణీల సత్రదేశమున మన్వం
తరంబులు రెండునైదు నిలచి


తే.

యంత భవదీయమగు దివసాంతమైన
నేఁగుదెంచెద నీయున్నయెడకు మగిడి

యిపుడు పూజించె దీసుగతాగతంబు
లిట్లు ప్రతివాసరంబును నే నొనర్తు.

105


వ.

ఈక్రమంబున భవదీయ ద్వితీయపరార్ధంబు సమాప్తంబైన నీకు ముక్తి
నొసంగెద, నొక్కవిశేషంబు వినుము, ప్రతిమా సమారాధనంబు జేసి యొక
వాసరంబు లేకయున్న మహాదోషంబు సంభవించుఁ బ్రాయశ్చిత్తంబును
వలయు, నాటునెల లెడపడినఁ బునఃప్రతిష్టాపనంబు కర్తవ్యంబు, తత్ప్ర
సాదకైంకర్యాదు లౌదవినం బ్రతివిధానం బవశ్యకర్తవ్యం బని తత్పరవేదు
లెన్ను దుర్నియమంబు లన్నియు-దివ్యసైద్ధమానుషార్చనలయందగాని భుక్తి
ముక్తినిధానంబై స్వయంవ్యక్త ప్రధానంబైన శ్రీరంగంబందున లేవు—నీ వను
దినంబు నన్నుఁ బూజించెదవు గాన నీకార్యం బంగీకార్యం-బిక్ష్వాకునకు
శ్రీరంగం బిమ్ము పొమ్మనినం దెలివొంది శతానందు డాక్షణంబ.

106


మ.

సురయక్షాసుర సిద్ధసాధ్యభుజగ స్తోమంబు గొల్వ న్మునీ
శ్వర వేదస్తుతినాదముల్ సెలఁగ దార్క్ష్యస్కంధపీఠంబునం
బరగన్ రంగనికేతనం బిడి మహీపాలుండు నిత్యవ్రత
స్థిరుఁడై యున్నతపోవనంబునకు దెచ్చెం దివ్యమార్గంబునన్.

107


క.

కొనివచ్చి యమ్మహీశ్వరుఁ
డనురక్తి నొనర్చు బహువిధార్చనములు గై
కొని యిచ్చె రంగధామము
ఘనరుచి ధగధగిత దిఙ్ముఖస్తోమంబున్.

108


మ.

అటు శ్రీరంగమహావిమానము నిజైకాయత్త మైనన్ - సము
త్కట హర్షంబునఁ దానె మోచుకొని యిక్ష్వాకుండు సామంతులుం
భటులున్ మంత్రులు ద న్నెదుర్కొన శుభప్రౌఢిం బ్రవేశించె-ది
క్తటచంచద్ధ్వజతోరణంబగు నయోధ్యాపట్టణోత్తంసమున్.

109


క.

ఆపురమున కుత్తర మగు
గోపురమున కెట్టయెదుటఁ గ్రోశార్ధమునం
దీపిత సరయూతమసా
ద్వీపవతీ ద్వితయమధ్యదేశమునఁ దగన్.

110

మ.

సమభూమిం బరమోత్సవంబునఁ బ్రతిష్టాపించె శ్రీరంగముం
గమనీయావృత నారికేళ కదళీ ఖర్జూర నారంగమున్
విమలార్థప్రతివాక్యవిశ్రుత వనీవిశ్రాంతసారంగమున్
సమభావార్యవిలోకితాభినవమోక్షశ్రీ నటీరంగమున్.

111


సీ.

పదపడి యద్దివ్యభవనంబు చుట్టును
గోటలు నట్టళ్లు గోపురములుఁ
బటుకవాటంబులుఁ బందిళ్లు నరుగులు
గాంచనమయములుగా నొనర్చి
పూజనాపరు లగుభూసురోత్తములకు
బహుపరిచారికాప్రకరమునకు
విష్ణుధర్మరహస్యవిదులైన ఘనులకు
జాబాలిమునికిఁ గశ్యపవశిష్ఠ


తే.

వామదేవాదు లగువారివారి కుచిత
మైన నెలవులు రచియించి యందు నిలిపి
తదనుమతి శాస్త్రచోదితోత్సవము లెల్ల
వివిధ విభవాన్వితముగఁ గావించె హరికి.

112


వ.

విశేషించి ఫాల్గుణమాసంబునఁ బూర్వఫల్గుని నక్షత్రంబున బుత్రపౌత్ర
సహితుండై -యవభృధసహితం బగుమహోత్సవం బొనర్చె-నివ్విధంబున
బ్రతివర్షంబును జరుగుచుండు నంత నయ్యిక్ష్వాకువంశ పారంపర్యంబున.

113


క.

శశి మరుదశన దిశాకరి
దశన శరచ్ఛరదశారదాశరధరరా
ట్పశుపతి విశదయశోనిధి
దశరథుఁ డుదయించె నమితదమనోరథుఁడై.

114


శా.

ఆరాజేంద్రుఁడు పుత్రలాభనిరతుండై యశ్వమేధంబు పెం
పారం జేయఁగ దన్మహోత్సవదిదృక్షాయత్తులై వచ్చి రా

పారావారవసుంధరాతలమునం బ్రఖ్యాతులై సంతతో
దారైశ్వర్యసమగ్రు లైననృపు లుద్యత్సైన్యసంయుక్తులై.

115


ఆ.

వసుధలోన ధర్మకర్మ సురుచిర వి
ఖ్యాతి నెసఁగు చోళభూతలేశుఁ
డజతనూజ విరచి తానందవిభవాభి
రాముఁడైన రంగధాముఁ జూచి-

116


క.

ఆదేవు దివ్యమూర్తి
శ్రీ దనచిత్తమునఁ గదియఁ జేర్చి నితాంతా
మోదామృతమునఁ బులకలు
జాదుకొనం జూడ్కి దివియఁ జాలక మదిలోన్.

117


మ.

అతులంబైన తపోవిశేషమున నీయబ్జాక్షు నిక్ష్వాకుఁ డీ
గతి మెచ్చించి విరించిమందిరసురంగం బైనరంగంబు నూ
ర్జితశక్తిం గొనివచ్చె నిచ్చటికి, నారీతిన్ మహావైష్ణవ
వ్రతనిష్ఠారతిఁ బూని మత్పురికి రాఁ బ్రార్ధింతు నిద్దేవునిన్.

118


చ.

అని తలపోయుచున్ దశరథాధిపు యాగము సుప్రయోగమై
యొనరినదాక నయ్యెడన యుండి యతండు దుదిం బ్రియంబునన్
ఘనముగఁ జేయు సత్కృతులు గైకొని క్రమ్మఱ నాత్మపట్టణం
బున కరుదెంచి నిర్బర తపోనియమోద్యమ చిత్తవృత్తుఁడై.

119


తే.

ఇందు పుష్కరిణీతటి కేఁగి యచటఁ
దపము గైకొన నానృపోత్తముని జూచి
తత్సమీపంబునందు నితాంతనియతిఁ
బాయకున్న మునీశ్వరప్రకర మెలమి.

120


క.

ఓ నరనాథోత్తమ! నీ
మానసమున నేమికోర్కి మసలినఁ దపముం
బూనెద వది చెప్పఁగఁ దగు
నేనియు నెఱిఁగింపు మనిన నృపుఁ డిట్లనియెన్.

121

చ.

హరి నతిభక్తి గొల్చి యజుఁ డాదియుగంబునఁ గన్న రంగమం
దిరము పయోజమిత్రకులదీపకుఁ డమ్మనుపుత్రుఁ డెట్లు చె
చ్చెరఁ గొనివచ్చె నాత్మపురిసీమకు నట్ల తదాలయంబు మ
త్పురి కిటమీఁద నేను గొనిపోవుటకై తప మాచరించెదన్.

122


వ.

ఏను లోకహితార్థంబుగా నీయర్ధంబు సమర్ధింపం బూనితి మీచేత ననుజ్ఞాతుం
డనగదా! యని నమ్మహాత్ము అతని కిట్లనిరి-

123


క.

ఏలాప్రయాస మవనీ
పాలక? నీతలఁపు మున్న ఫలియించిన దా
కీలెఱిఁగి శీఘ్ర మింకం
జాలింపు తపస్వివేషసంచారంబుల్.

124


వ.

అది యెట్లనిన-

125


ఉ.

ఉన్నది యీ ప్రదేశమున కుత్తరదిక్కునఁ గ్రోశమాత్రధా
త్రిన్నృప మీపురాతనపురీస్థల నుప్పురనాథుఁ గాదె రౌ
ద్రోన్నతి మున్ను పుష్పశరు నుక్కడగించినలీల నీక్షణా
త్పన్న కృశానుకీలముల భస్మము జేసె హరుం డుదగ్రుఁడై.

126


తే.

ఆపురప్రాంతమునఁ గల దగ్నికల్పుఁ
డైన దాల్భ్యమునీశ్వరు నాశ్రమంబు,
నచటి కొకనాఁడు మేము కార్యాభిలాష
నరిగి సుఖగోష్టిమై నున్న యవసరమున.

127


చ.

హరి చనుదెంచి దాల్భ్యముని యస్మదుపేతముగాఁగ భక్తిసు
స్థిరమతిఁ జేయుపూజనలు చేకౌని, సారదయాసుధారస
స్ఫురిత కటాక్షవీక్షణరుచుల్ పొలయన్ మముఁ జూచి మేదురా
చర మధుర స్వరంబు జలదస్వనభంగిఁ జెలంగ నిట్లనున్.

128


ఉ.

తాపసులార! మీయభిమతం బొడగూర్చుటకై కవేరక
న్యాపులినస్థలంబున నిశాధిపపుష్కరిణీతటిన్ జగ
ద్రూపితరంగమందిరముతోఁ జనుదెంచి వసింతు వేగ మీ
లోపల నెందుఁ బోక మదిలోఁ జలియింపక యుండుఁ డీయెడన్.

129

వ.

ఎట్లనిన.

130


ఉ.

లోకభయంకరుం దశగళుం బరిమార్చుట కేను రామభ
ద్రాకృతి నర్యమాన్వయమునందు జనించి యయోధ్యలోనఁ బు
ణ్యాకరమైన రంగనిలయంబు విభీషణు కిత్తు నాబుధ
శ్లోకుఁడు దేర మీరు ననుఁ జూచెద రీడ ననంతపీఠికన్.

131


వ.

అని యానతిచ్చి యప్పరమేశ్వరుం డరుఁగఁ దోడనకూడి నేను మును మార్తాండ
మండలపర్యంతంబును గొలిచి చని మరలి వచ్చునెడ భవద్వంశకర్త యగు
వికర్తనుండు మమ్ముఁ గనుఁగొని యిట్లనియె.

132


సీ.

మున్ను పద్మజలోకమున రంగశాయి నే
నర్చించి మద్వంశ్యులైన నృపులు
దేవ! నీచరణాబ్జసేవ సేయఁగ నుండ
వలయు నీవని మ్రొక్కి వరముగాఁగ
గోరిన గరుణ గల్గొని యయోధ్యాపురిఁ
గావేరిదరిఁ జిరకాల మేను
వసియించి ప్రీతి భవత్కులీనులచేతఁ
బూజఁ గైకొనియెద భూరిదారు


తే.

ణౌఘ కలివేళ గతిశూన్యమైన ప్రాణి
తతికి సులభుఁడ నయ్యెద-ధర్మరహితు
లైన నాస్తికు లెపుడు క్రందై చరింతు
రపుడు దుర్లభమగు నస్మదాశ్రయంబు.

133


వ.

అని యానతిచ్చెఁ గావున శ్రేయోభిలాషంబు లగువారికి గావేరీ తీరంబున
చోళవంశసంభవుండైన ధర్మవర్మాపదేశంబున నవశ్యంబును శ్రీరంగ
నాయకుండు వేంచేయునది తప్పదని చెప్పిన లోకబాంధవు భాషణంబులఁ
బరితోషణంబు నిగుడ మగిడి వచ్చి యచ్చట నున్నవార మచ్యుతుండును
దాశరథియై యవతరించినాఁ డచిరకాలంబునన యస్మన్మనోరథంబు సిద్ధించు,
రఘునాథ దయాభూషణం డగు విభీషణుం డెప్పుడిచ్చటికి రంగధామంబుఁ

దెచ్చునప్పుడ నీకెఱింగించెద-మంతదాఁక భవద్రాజధానియగు నీచోళపురం
బునన యుండి మహీపాలనంబు సేయుము పొమ్మని సమ్మదం బిద్దియని
యమ్మానవేశ్వరుం డరిగె—ననంతరంబ—

134


సీ.

అహిమాంశుకుల రోహణాచల స్థలమున
నలరిన దివ్యరత్నాంకురంబు,
జానకీమృదులభుజాపంజరంబున
రంజిల్లి విహరించు రాజశుకము,
యోగమానస భూసురోద్యానవనములఁ
గలయ వర్తించు శిఖావళంబు
నగజామృడస్తవ నవమధుద్రవములఁ
జవుల నింపునఁ జొక్కు షట్పదంబు -


తే.

కలిత కరుణాసుధారస కలశజలధి
దశరథాధిప సుకృతసంతానఫలము
భక్తహృద్వర్తి తారకబ్రహ్మమూర్తి
రాజపరమేశ్వరుండు శ్రీరాఘవుండు.

135


క.

రాముడు హరి మణినివహ
శ్యాముఁడు శుచిధాముఁ డమరసన్నుత సుగుణో
ద్దాముఁడు రక్షితసుజన
స్తోముఁడు జనదృక్చకోరసోముఁడు మఱియున్.

136


సీ.

ఎవ్వని సుగుణంబు లీశానుముఖ్యులు
చెలఁగి కైవారంబు చేయుచుందు
రెవ్వనికరుణచే నెసఁగు ధన్యులకు నా
కల్పాంతమగు నిర్వికారపదము
ఎవ్వని గొలుచువా రిచ్ఛసేయరు కల్ప
తరు కామధేను చింతామణులను
ఎవ్వనికడకంటి కెఱుపు వచ్చినమాత్ర
బ్రహ్మాది దివిజులు పగులుచుందు

తే.

రెందు నెవ్వని చరణారవిందరజము
పెంపు గౌతమసంయమి పెండ్లిపెద్ద
యతఁడు జగదేకచాపదీక్షాగ్రగురువు
రామభద్రుండు లోకాభిరామమూర్తి.

138


వ.

అమ్మహాధనుర్ధరవరేణ్యుండు—

139


సీ.

కన్నెకయ్యమునంద ఘటితనాకపురీక
వాటికఁ దాటక గీటణంచె,
దూలుకూఁకటినాడ లీలఁ గౌశికయాగ
భంజనోత్సాహు సుబాహు జంపెఁ
దల యెగగట్టునత్తఱి దేవదైత్యదు
స్తరము ధూర్జటి ధనుర్వరము విఱిచె
నలవోక దొరసి హేలాజితాఖిలనృప
స్తోము భార్గవరాము దూలఁదోలె


తే.

దండకావనమార్గ సంతత నిరోధు
రచితసుజనాపరాధు విరాధు నఱికె,
దళిత సకలామరుని జతుర్దశసహస్ర
దితిజముఖరుని ఖరుని వధించెఁ గడిమి.

139


క.

ఆచలితకరణ కనకమృ
గోచితలీలావిమోహితోర్వీతనయా
లోచన హృదయుని సదయుని
నీచున్ మారీచుఁ గడపె నేలం గూలన్.

140


క.

బంధురశరహతు నేసెఁ గ
బంధుని, బహుదుర్జనైకబంధుని గృతని
రృంధునిఁ బృధుతరకరిన
స్కంధునిఁ బ్రావీణ్యవిస్రగంధునిఁ గలనన్.

141


చ.

పరిచరుగాగ నేతె నిరపాయచరిత్రుని, శత్రుకానన
స్ఫురదురువీతిహోత్రుని సముజ్వలమేరుసమానగాత్రునిం

బరమపవిత్రు, సన్ముని సుపర్వతతి స్తుతిపాత్రునిన్, మనో
హర ఫలశేముషీ కబళితాంబుజమిత్రుని వాయుపుత్రునిన్.

142


శా.

లీలం దార్కొని యేసె నుగ్రరణకేళిన్ వాలి వాలిం బ్రభా
హేళిన్ హేమసరోజమాలి, కరివాహిత్యాటవీకీరి, ను
త్తాలవ్యాళ కరాళవాల పరిబద్ధస్థూల పౌలస్త్యకం
ఠాలిం బూజితశూలి నప్రతిమబాహాసత్వశాలిం బదన్.

143


క.

కిష్కింధాపురి నిలిపెను
బుష్కరహితతనయు సునయు భూనుతవినయున్
నిష్కాశిత రిపుజీవుని
నిష్కలిభావుం బ్రతాపనిధి సుగ్రీవున్.

144


మహాస్రగ్ధర.

బలిమిం గట్టించె నత్యుద్భట భిదురధురాపాత భీతావనీభృ
త్కుల సంరక్షావినిద్రుం గుపితజలచరక్రూరసంఘట్టనోద్య
జ్జల నిర్ఘోషాధిరౌద్రుం జనితమణిసుధాచంద్రలక్ష్మీస్ఫురద్రుం
బ్రళయాంత స్సుప్తవిశ్వంభర భరితకృపా ప్రాప్తభద్రు న్సముద్రున్.

145


మ.

హతు గావించె సపుత్రమిత్రముగ దీప్తాస్త్రంబులం గాంచన
క్షితిభృద్ధన్విధరాధరోద్ధరణశక్తిప్రౌఢ దోర్దండసం
గత భాస్వద్ఘనచంద్రహాస నిశితోగ్రక్రూరధారా సమా
హత భీతప్రపలాయితాదితిసుతేంద్రైరావణున్ రావణున్.

146


వ.

ఇట్లనన్యసాధ్యంబు లగు మహానుభావప్రతాపతేజోవిశేషాదిగుణంబుల
నఖిలజగన్నుతుండై దశరథసుతుండు సమస్తసామ్రాజ్యభోగంబుల ననురా
గిల్లుచు శశ్వదైశ్వర్యం బవార్యంబుగా-నశ్వమేధయాగం బుపక్రమించి, భూ
చక్రంబున విక్రమకళాధన్యులగురాజన్యులఁ దన్మహోత్సవంబునకు రప్పిం
చుచు-ధర్మవర్మావనీవరుఁ బిలిపించిన నతండును-నిఖిలదేశాగతానేకభూపాలావ
లోకనజాత కౌతూహలాయిత శాతోదరీనరణ మణినూపుర ఝళంఝళధ్వనిత
గోపురంబగునయోధ్యాపురంబుఁ బ్రవేశించి-యారఘునందన చరణారవింద
సందర్శనంబునఁ గృతార్థీకృతజన్ముండై -తన్మఖంబు పరిపూర్ణంబగునంతకు
నందుండి మరలి నిజపురంబునకుం జని-యంత నిక్కడ-

147

క.

వితత వసంతగుణావలిఁ
బొత పగునెల నినుఁడు మీనమున నున్నతఱిన్
సితసప్తమి శనిరోహిణి
నతిశుభలగ్నమున వాసరాగమవేళన్.

148


చ.

హితుఁ డగు నవ్విభీషణున కిచ్చె దశాననవైరి లీల స
న్మతి నఖిలార్చనోపకరణంబులతో బహుచిత్రశిల్పక
ప్రతతులతో మహీసురతపస్విసమాజముతో మహోత్సవ
స్తుతమణి హేమవస్తుతతితో శుభసీమము రంగధామమున్.

149


ఉ.

ఇచ్చిన భక్తి సంభ్రమము లిచ్చఁదలిర్పఁ బ్రదక్షిణంబు ము
న్వచ్చి నమస్కరించి జతనంబున మస్తమున న్వహించి పెం
పచ్చుపడంగ రాక్షసబలావలితో నిజపట్టణంబుకై
చెచ్చెర నేఁగి యేఁగి యభిజిత్సుముహూర్తము చేరునత్తఱిన్.

150


సీ.

అనువైన తామరపాకుఁ జప్పరముల
నలరి క్రీడించు రాయంచకవలు,
రాజిల్లు కల్వపూగాజుటోవరులలోఁ
దవిలి పాయని యళిద్వంద్వములును
వావిరి లేనాఁచు దీవపందిరులలోఁ
దనుపొందు జలచరదంపతులును
జెంగల్వదడెల తరంగడోలికలలో
మేలమాడెడు చక్రమిధునములును


తే.

దరులఁ బండినసహకార తరులఁ బ్రేమ
గోరి విహరించు మదకేకిశారికలును
గలిగి పథికుల కింపులు గడలుకొలుపు
విమలతరపుణ్యవారిఁ గావేరిఁ జేరి.

151


క.

విలసిత వనలక్ష్మీకర
కలిత నవస్ఫటికముకురగతి నతిరుచిర

స్థలమున మలయానిల మడు
చలిత తరంగానుమేయ సలిలం బగుచున్.

152


క.

ఏపారు చంద్రపుష్కరి
ణీపరిసరభూమి రంగనిలయ మిడియె-నా
లోపల నచ్చోళనృపతి
తాపసులును వచ్చి రతిముదంబున నటకున్.

153


ఆ.

వచ్చి దైత్యవంశవరునకు నుచిత స
త్కృతు లొనర్చి భక్తి యతిశయింప
రంగశాయి చరణరాజీవపూజనం
బాచరించి ప్రముదితాత్ము లయిరి.

154


వ.

అంత ననంతగుణగరిష్టుండగు నాదనుజశ్రేష్ఠుం డాసరోవరంబునం గరంబు
నియమంబునఁ దత్కాలకరణీయంబు లాచరించి సమంచితోపదారపూర్వకం
బుగా సావధానంబున శ్రీరంగరాజపూజావిధానంబు దీర్చి సప్రదక్షిణ
ప్రణామం బాచరించి వేదశాస్త్రపురాణోక్తంబు లగు శ్రీవైష్ణవసూక్తంబుల
నభినుతించి గమనోన్ముఖుండైన యతనికిఁ గృతాంజలియై యన్నరేంద్రుం
డిట్లనియె,-

155


క.

అకుటిలమానస సుజన
ప్రకటితసౌజన్య జన్యపాటిత వినుత
ప్రకర మముఁ గూర్చి యిచ్చట
నొకకొన్నిదినంబు లెలమి నుండఁగవలయున్.

156


ఉ.

నావుడు నాతఁడెల్లి మనువందన మా ఫణిరాజశాయికిన్
శ్రీవెలయంగ నుత్సవముచేసిన యట్టిదినంబు గావునన్
భూవర మత్పురంబునకుఁ బోవలయన్ వెస నన్న నాదశ
గ్రీవుసగర్భుతోడ నృపకేసరి యిట్లను నెమ్మిఁ గ్రమ్మఱన్.

157


మ.

విమలంబై తనుపొందునీయుభయకావేరీ సరిన్మధ్య మీ
రమణీయోన్నత సైకతస్థలము లీ రాజీవషండంబు లీ

భ్రమరాంచత్తరుసాంద్రచంద్రసరసీప్రాంతంబు లత్యంతహృ
ద్యము లిచ్చోటన జేయు ముత్సవము దైత్యవ్రాతచూడామణీ.

158


ఆ.

అనిన నట్లకాకయని నిల్చె నచ్చోట
దానవేశ్వరుండు, తత్క్షణంబ
తగు పదార్థములు ముదంబున సమకట్టె
ధర్మవర్మ ధరణిధవవరుండు.

159


శా.

నిర్మింపించె ననల్పశిల్పరచనల్ నేత్రాభిరామంబుగా
ధర్మద్వార కవాటవేదిచయ కుంభస్తంభశుంభద్ద్యుతుల్
ఘర్మాంశుప్రభ గప్పి దిక్కుల వెలుంగం బూప సూపాన్నస
ర్పిర్మద్యాంబు పయః పయస్యఫలగుప్తి స్ఫీతశాకావళుల్.

160


శా.

భూనాథాగ్రణి యొక్కనాట నలఘుస్ఫూర్తిన్ రచింపించెఁ దా
నానాదేశ సమాగతద్విజ మహీనాథార్య శూద్రాది సం
స్థానార్హంబులుగా మరావళులుఁ బ్రాసాదంబులుం దంతివా
హానీకాయతనంబులున్ విపణిరథ్యామంటపశ్రేణులున్.

161


క.

ఈభంగి నసమసంప
ద్వైభవ సామగ్రి నభినవంబుగ నిచ్ఛా
లాథ సముత్సుకుఁ డగునా
భూభుజుఁ డొనరింప దైత్యపుంగవుఁ డెలమిన్.

162


తే.

సహ్యకన్యాతటావాస సంయమీంద్ర
సమితితో విధిశిష్యపంచకముతోడ
నమ్మహారాజవరునితో సావధాన
బుద్ధియై యాగమోక్త ప్రసిద్ధవిధిని.

163


చ.

చెలువగు చంద్రపుష్కరిణి చేరువఁ జారువనాంతవీథి నిం
పులు మదినింపు మేలిసురపొన్నల క్రింద సువర్ణమంటప
స్థలమున నిందుకాంతఘటితం బగు వేదికమీఁద నున్నతో
జ్జ్వల మణిపీఠికన్ మృదు భుజంగమరాజ విశాల శయ్యపైన్.

164

క.

ఉత్సవ మొనర్చె నాశ్రిత
వత్సలునకు నఖిలభువనవందితునకు
వత్స ప్రశస్త కౌస్తుభ
వత్సఃస్థలునకుఁ గరేణువర వరదునకున్.

164


సీ.

అగరు ధూపముల మిన్నగల వాసన కెక్కి
జడివట్టి కుసుమ వర్షములు గురియ
భేరీ మృదంగ శంఖారావముల మించి
చారణ స్తోత్ర నిస్వనము లెసఁగ
ముక్తాత పతదీప్తులు మీఱి ఖేచరీ
కరచలచ్చామరకాంతు లొలయ
ధ్వజరణత్కింకిణీతాళ సంగతి నింపు
దనరు నచ్చరల నృత్యములు మెఱయ


తే.

ననిశకర్పూర తైలధారాతి దీప్త
దీపమాలిక లానత దివిజమకుట
పద్మరాగాంతరంబులఁ బ్రతిఫలింప
మాసరము లయ్యె నుత్సవ వాసరములు.

166


ఉ.

సమ్మద లీల నిట్లు దివసంబులు తొమ్మిచి చెల్లినం బ్రభా
తమ్మునఁ బూర్ణచంద్రతిథి తత్పద సంశ్రయులై విరక్తులై
నెమ్మిఁ జరించు వైష్ణవ ముని ప్రకరంబులతో-దళాస్యు లేఁ
దమ్ముఁడు వేడ్కమై నవభృధం బొనరించె సమంచితక్రియన్.

167


వ.

ఇట్లతం డొనర్పు సముచితసత్కారంబుల బరితోషితుండై విభీషణుం
డర్ధమాసవ్రతంబునఁ దత్పుణ్యక్షేత్రంబున వసియించి, మఱునాఁ డరుణో
దయ సమయంబున గమనోన్ముఖుండై యద్దివ్యవిమానరత్నంబు నావ
హింపం బూని తరలింప నోపక యుండ మదభరాఖండల ప్రచండ వేదండ
పంచాకాండ మండితంబు లగు బాహుదండంబులు బెండువడఁ బెనంగి
యొందొండ నిట్టూర్పు లెగయఁ దగఁదొట్టి నెట్టుకొనిన వగలఁ బొగులుచు
నిలాతలంబునఁ బడిపొరల నతనిపైఁ గరుణాంతరంగితం బగు నపాంగంబు
నిగుడ శ్రీరంగనాయకుం డిట్లని యానతిచ్చె,-

168

మ.

పరమాహ్లాదన మీకవేరతనయాపర్యంత మీ చంద్రపు
ష్కరిణీవారి సుధానుకారి జనలోక స్తుత్యుఁ డీ ధారుణీ
శ్వరుఁ డస్మత్పదభక్తు లీమును లుదంచత్పుణ్యు లిట్లౌట నా
కీర వీరావు వసింతు నీయెడన పొ మ్మీవంక నీలంకకున్.

169


క.

విను మితిహాసం బొక్కటి
దనుజాధీప వింధ్యధరనికటమునన్
మును పేరుకల మహానదు
లొనరఁగ నొక్కెడన గూడి యున్నట్టితఱిన్.

170


క.

విశ్వావసుఁ డనుగంధ
ర్వేశ్వరుఁ డచ్చోటి కెలమి నేతెంచి మదిన్
విశ్వాస మొదవ మ్రొక్కుచు
శశ్వద్గతి దక్షిణంబు చనినం బిదపన్.

171


ఆ.

మ్రొక్కె నితఁడు దనకు మ్రొక్కె నీతఁడు దన
కనుచు నీసు వాసికై కడంగి
తమక మొదవ సదులు తమలోన వాదించె
ఘనరవంబు మింటఁ గడలుకొనఁగ.

172


చ.

అతఁడును దక్షిణాబ్ధికి రయంబున నేఁగి భుజంగతల్పసం
గతు నను నవ్యదివ్యమృదుగానవిశేషములన్ భజించియున్
వ్రతముగఁ బౌష్యమాసమున వాసము తత్తఱిఁ జేసి భానుఁ డూ
ర్జితగతి నుత్తరాయణము చెందిన గ్రమ్మఱి యేఁగుదెంచుచున్.

173


క.

ఆనతుఁ డగుటయు నానదు
లీనతి నీ వాచరించు టెవ్వరి కనినన్
భూనుత మహిమాధిక మీ
లో నెవ్వరు దాని కని పలుకుచుం జనియెన్.

174


ఉ.

ఆతఱి నమ్మహానదుల కయ్యెఁ బరస్పర గౌరవాల్పతా
హేతుక మైనవాద మదియెల్లఁ గ్రమంబున శాంతిఁ బొందె నే

రీతిని జక్కఁగాక ముదిరెం జగడంబు గడం గవేరసం
జాతకు నంబుజోదరు లసత్ఫదపంకరుహప్రసూతకున్.

175


ఉ.

ఈసున నచ్చలం బొదవ నీగతి నిద్దఱు వాదొనర్చి ప
ద్మాసనుపాలికిం జని మహాత్మ! సమస్తసరిద్వరేణ్యపు
ణ్యాసమలీల మాయిరువురం దరయన్ ఘన మెవ్వరన్న నా
వాసి వియత్తరంగిణి కవశ్యము జొప్పడునంచుఁ జెప్పినన్.

176


క.

తొల్లిటివడి జెడి సంభ్రమ
మెల్లను వెస నడఁగి కంఠ మెడవడి రంతుల్
జెల్లక యుబ్బరి వంతలు
పెల్లై కావేరి దైన్యపీడిత యగుచున్.

177


ఉ.

బాహ్యచరంబు గాని శుచిభావమునన్ మదవన్మరాళసం
వాహ్యధర ప్రచారుఁ డగువాని గుఱించి సమస్తనిమ్నగా
సహ్య తపఃక్రియల్ నెఱపి జహ్నుసుతాధికతాభిలాష-నా
సహ్యవసుంధరాధరవిశాలతటంబు బెక్కువర్షముల్.

178


క.

సరివారిలోన భంగము
పొరసిన సుడియై గలంక పొడమినఁ గెలనం
బరు లుండిన దనజీవన
మొరులకు లోఁతీక మెలఁగు టుచితముగాదే.

179


క.

ఈ పగిదిఁ జరింపఁగ- వా
ణీపతి చనుదెంచి సురధునీ సామ్యం బీ
నోపుదు గొను మధికత్వము
నాపని గా దొసఁగ వికచనాళీకముఖీ.

180


చ.

అని చనినం గవేరునిబ్రియాత్మజ మత్ప్రతిబింబ మొక్కచో
ననువుగ నిల్పి భక్తి నెఱపార భజించిన మెచ్చి యిచ్చెదం
గొనుము వరంబు నీ కనినఁ గోమలి గోరెఁ ద్వదీయపాద సం
జనన ఘనప్రతాప యగజాహ్నవి మీఱుమహామహత్వమున్.

181

క.

కోరిన గంగానది కా
గౌరవ మస్మత్రసక్తిఁ గలిగెఁ దదాధి
క్యారూఢియు మద్భక్తి య
వారితముం గలుగకున్న వశమే పొందన్.

182


వ.

కావున నీకు గంగాధిక్యంబు గల్గునట్లుగా భవదుభయ ప్రవాహమధ్యంబున -
మధ్యందిన దినకరప్రభాసుందరం బగురంగమందిరంబునఁ దిరంబుగా వసిం
చెద ననిప్రతిజ్ఞ చేసితి నట్లగుట నీప్రదేశనివాసం బవశ్యకర్తవ్యం బని యానతి
చ్చిన దచ్చరణారవిందంబులకు నభివందనం బాచరించి ముకుళీకృతకరాంబు
జుండై యారావణానుజుండు.

183


తే.

ఇందిరాధీశ! నీతలం పిట్టిదేని
నిత్యసేవకవృత్తిమై నిన్నుఁ గొలిచి
యేను నిచ్చోట నుండెదఁ గాని విడువఁ
జాల భవదీయ పాదాంబుజములపొందు.

184


ఉ.

నావుడు నిట్లనుం దనుజనాయకుతో హరి కర్మభూమి మ
ర్త్యావలి నుద్ధరించుటకునై యిటు నీయవతార మొందితిం
గావున నిక్కడ న్నిలువఁ గార్యము గల్దటుగాన నెంతయున్
నీవు వసింపనేల రజనీచర! పొమ్ము భవత్పురంబుకున్.

185


తే.

అచట రాఘవకరుణాకటాక్షలబ్ధ
మహిత నిరపాయ దనుజసామ్రాజ్యసుఖము
లారవీందుతారకముగా ననుభవించి
మించెదవు మోక్షపదవి నామీఁద ననిన.

186


చ.

మది యురియాడ నాతఁడు రమావరు కిట్లను నే నశేషసం
పదలను గాంచి ముక్తి దనుఁ బ్రార్ధనఁజేయఁ దదర్థమై శుభా
స్పద మగురంగమందిరము భానుకులాధిపుఁ డిచ్చె నిచ్చ-నే
నవి దిగనాడి యేగతి నహీనభవాంబుధి విస్తరించెదన్.

187


సీ.

అనిన నప్పరమేశుఁడతనితో విన్ము వి
భీషణ మోక్షాభిలాషులైన

వారును ఘనభోగవాంఛాపరాయణు
లగువారు గల రెవ్వ రట్టిపురుషు
లందఱు నస్మదాజ్ఞానుపాలనము సే
యుదురు యాగవ్రతానూనదాన
ముఖ బహుశుభకర్మములు నాకుఁ బ్రియముగాఁ
గావింపుదురు నీకు నావిధమున


తే.

ధర్మ మెడలక మత్పరతంత్రవృత్తిఁ
దగిలి రాజ్య మొనర్పుము తలఁపు నన్ను
నేను నిన్ను నుపేక్షింప నేఁగుదేర
వలవ దెన్నఁడు నీవు నీవారు నిటకు.

188


వ.

మఱియు నొక్కవిశేషంబు విను మెల్లకాలంబును బట్టణాభిముఖుండనై
వీక్షింపుచుండుదు. పంచజనులు పాపకర్ము లగుటఁ జేసి నీవల ననుగ్రహంబు
సేయుచు నన్నభిలషించి దూరదేశాగతు లయినవారలకుఁ బరమపద
ప్రాప్తియు-మనోరథంబులు నిత్తు, నీద్వీపంబు పుణ్యభూమి యగుటంజేసి
యచ్చోటనెయుండి సంస్మరింపు, మత్యంతసుకృతంబు సంభవించు-నొక్కొక
యేటఁ బుణ్యదినంబులందు మత్సందర్శనంబున కతిరహస్యంబుగాఁ గామ
రూపంబు గైకొని రమ్ము-పొమ్మని మఱియు నిట్లనియె.

189


ఆ.

ధర్మములును సకలకర్మఫలంబులు
పరిహసించి శరణుఁ జొరుము నన్ను
నిదియె నీకు మోక్షపదపరప్రాప్తికి
నలినహస్య మైన యట్టిమతము.

190


చ.

అని హరి పల్కినన్ వినతుఁడై మరియొండన నోడి-లంకకుం
జనియే విభీషణుండు, మునిసంఘములో నిట ధర్మవర్మయున్
విముతవిశిష్టపూజనలు వేడుకఁ జేయుచునుండె భక్తహృ
ద్వనజవిహర్తకున్ దవనివారణకర్తకు రంగభర్తకున్.

191


క.

అది యాదిగఁ గావేరీ
నదిఁ జెలువగు పులినతలమునన్ హరికి నిజా

స్పదమగు శ్రీరంగం బు
న్నది భజదపవర్గసాధనంబై నేడున్.

192


వ.

అని చెప్పి యప్పరాశరతనయుండు సవినయుండగు నాగదంతమునీశ్వరునితో
విట్లను నీప్రకారంబున భువనరక్షణపరాయణుండగు నారాయణుండు నిజా
వతార ప్రసంగంబు, సాంగంబుగా సుపన్యసించి, వెండియు సుబోధుఁ
గనుంగొని.

193


మ.

త్రిజగత్పావనతీర్థసారములు శక్తిశ్రీనిజాకారముల్
భజదిచ్ఛాఫలదప్రచారములు శుంభన్మంగళాకారముల్
కుజనవ్రాతవిదూరముల్ మధురనిర్ఘోషాదిగంభీరముల్
విజితా మౌఘవికారముల్ దలఁపఁ గావేరీపయఃపూరముల్.

194


క.

నీ వింపుమిగుల నీనది
గావింపుము నియతి సమవగాహాదివిధుల్
సేవింపు మెపుడు నను మది
భావింపుము రంగశయనుఁ బంకజనయనున్.

195


తరల.

అనుచు నీగతి భక్తవత్సలుఁ డైనయాహరి కర్ణమో
హన సుధామధురోక్తులం దగ నానతిచ్చినఁ బ్రీతుఁడై
మునిజనోత్తముఁ డాసుబోధుఁడు పూనితద్వచనక్రమం
బునఁ జరించుచునుండె దోషవిముక్త సాత్వికవర్తనన్.

196


ఉ.

ఈకథవిన్న వ్రాసినఁ బఠించిన నాయురనామయత్వముల్
చేకుఱు వేదవిత్త్వ, రిపుజిత్వ, ధనిత్వ, సుఖిత్వముల్ దిరం
బై కలుగున్ మహీసురనృపార్యజఘన్యజకోటి కున్నతుల్
బైకొను వంధ్య పుత్రుఁ గనుఁ బాయు ననేకభవార్జితాఘముల్.

197


వ.

అని యివ్విధంబునఁ బ్రసంగవశమునఁ గావేరీమహత్వం బుపదేశించె, వేద
వ్యాసమునీంద్రుండు చంద్రపుష్కరిణీప్రభావంబు దెలుపు తలంపున నాగ
దంతసంయమి కిట్లనియె.

198


చ.

అనుపమ దివ్యబోధమహిమాధికుఁ డైన సనత్కుమారస
న్ముని మును చంద్రపుష్కరిణి పొంత దపం బొనరించెఁ బైపయిం

ఘన మగునంతరాయములు గైకొన కెంతయు శాంతచిత్తుఁడై
యనిలమ క్రోలుచుం బటుశిఖానలపంచకమధ్యమంబునన్.

199


క.

ఆతని తీవ్రతపస్స్థితి
చేతస్తాపం బొనర్పఁ జింతాకులుఁడై
ధాతకడ కమరనికరస
మేతుండై చని సురేంద్రుఁ డిట్లని పలికెన్.

200


మ.

ఘనతేజుండు సనత్కుమారుఁడు మహోగ్రస్ఫూర్తి నుర్విం దపం
బొనరన్ సల్పెడు నిప్పు డేనతని యుద్యోగంబు వారింతుఁ బొ
మ్మనుచుం బన్నిన విఘ్నముల్ చనియె వమ్మై నీ వుపేక్షించి-ని
ల్చిన నేకక్షణమాత్ర లోకములు భస్మీభూతముల్ సేయఁడే!

201


క.

కావున నింద్రపదం బౌ
నావల నొం డెద్దియైన నరుఁ దదభీష్టం
బీవేళఁ దడయ కొసఁగి ని
రావిలముగఁ జేయు జగము అరవిందభవా.

202


వ.

మేము నిన్ను శరణు జొచ్చి నార మెయ్యది కర్తవ్యం బది యానతిమ్మని
యాఖండలుం డూరకుండె - ననంతరంబ తత్సభాంతరంబునకు నుమా
కాంతుం డేతెంచి శతమఖ ప్రముఖ నిఖిల బర్హిర్ముఖులఁ గనుంగొని తదా
గమన ప్రయోజనం బడిగి వారలు సనత్కుమార ఘోరతపోభీతు లగుట
దెలిసి జలజాసనుం గనుంగొని.

203


క.

ఇది యేటిరాక తలఁపె
య్యది సేయఁగఁ దగినకార్య మెద్ది జగం బా
పద యెట్లు వాయు ననవుఁడు
త్రిదశజ్యేష్ఠుండు వామదేవున కనియెన్.

204


చ.

అరయ సనత్కుమారుఁడు యుగాంత్యమహాచల తీవ్రతేజుఁ డె
వ్వరికినిఁ దత్తపం బుడుపవచ్చునె మోక్షపదాభిలాషమై

పరఁగెడునాతఁ డిట్టిపని పంకజనాభుని చేతిదౌట నా
హరి కిది విన్నవింపు మన మందఱముం జనుటొప్పు డిత్తఱిన్.

205


వ.

అని యాక్షణంబ కదలి చని.

206


మ.

అరవింద ప్రభవుండు గన్గొనియె మధ్యస్థానసుప్తాంబుజో
దర పర్యంక భుజంగపుంగవ సముద్యద్భూరిభోగాగ్ర వి
స్ఫురితానేక నిరర్ఘ దివ్యమణి సంభూత ప్రభాపుంజ పం
జర జాతాభ్రపదభ్రమాకులిత భాస్వత్సారథిన్ నీరధిన్.

206


వ.

మఱియు నమ్మహార్ణవంబు సముదీర్ఘమద దుర్ణివారంబులై విస్రంభ
విహారంబులఁ బరిభ్రమించు కుంభకుంభీర తిమింగల మకర
కర్కటాది జలగ్రహంబుల సమగ్రకోలాహలంబుల నినుమడించి బ్రహ్మాండ
భాండోదర నిరంతర జంతుసంతాన నిర్ఘోష ప్రతిఘోషంబుకైవడి నెడపడక
విశ్వ విశ్వంభరాభారధురీణకరేణు కర్ణకుహరంబులు చెపుడుపడ నడరు
బెడిదంపు మ్రోతలును దుర్వారవే గావహాది మహామారుతప్రేరితంబు లై
చూడ్కులకు వెక్కసంబుగా నెక్కడఁ జూచిఁన దండతండంబు లగుచు
నొండొంటి నొత్తుకొని వచ్చు నుత్తుంగతరంగ సంఘట్టనరయంబున వొడమి
యెడములం గూడి దరులకుఁ దొట్టి తెట్టువలు గట్టి యస్తోకంబులై కౌస్తుభా
కల్పునకుఁ దల్పం బగుభుజంగపుంగవుఁ డప్పటి కెడలించిన కుప్పసంపుతిప్పల
చొప్పున రసాతలాభీల క్రీడానురాగకలితనాగకన్యకాబృందంబు పందెంబునకై
యెగవైచిన ముక్తాఫలకందుకంబునుంబోలె వియచ్చరు లచ్చెరువునొంద
నుచ్చలితం బగు బిందు సందోహంబులును, నితరనిమ్నగా సంగంబుల
భంగంబు నెఱపు తనవలనఁ బండితా భావంబు భజియించి యంబరంబు
వదలక నిద్రా త్యాగంబునుం బోలె ననిమిషాలోకనయై యున్న మిన్నేటిఁ
దేర్చుటకై నేర్పునఁ బరిభవించిన దీర్ఘబాహార్గళంబుల లీల నభ్రంకషంబు లై
గ్రాలు కల్లోలంబులును భూతకాలంబున నమృతోత్పాదన సమయంబున దేవ
దానవ వ్యూహ బాహాపసవ్య సవ్యాకృష్యమాణఫణిరాజ రజ్జువలయ వలయితా
మంధర మందర పరిభ్రమణ విలులితంబు లగు పయఃపూరంబుల విభ్రమ
విశేషంబుల నెందును బాయకున్నవొకో యనుశంక నంకురింపం జేయు
విపులా వర్తంబులును, బక్ష విచ్ఛేదనారంభ విజృంభితుం డగు జంభారి వలని

భయంబునం బెకలి వచ్చి దఱియం జొచ్చియుం దదనుధావన సందేహ
కరంబు లయి నిక్కిచూపు ధరాధరనికరంబుల శిఖరంబులఁ బోలెఁ నత్యు
న్నత విస్తారాయామ రమణీయంబులై, రజితమహారజిత రత్నౌషధీ ప్రముఖ
ప్రశస్త వస్తువిశేషంబుల ప్రోవుల దీవులును, బయోధి గర్భ నిర్భర బాడ
బానల శిఖాకలాపంబు లక్కడక్కడఁ బిక్కటిల్లి వెలికి నిగిడిన బాగునం
గొనలుసాఁగి సోనలై సొబగు మిగిలి పొదలి పొదిగొని యంబరభాగంబునఁ
బరఁగి రాగిల్లు తరుణారుణ కిరణజాలంబుం గేలిగొనఁ జాలి యుపాంత
ప్రదేశంబుల నక్షుద్రంబులగు విద్రుమలతా చయంబులును, స్వాధీనలై యభి
సారికా లీల లంగీకరించిన తరంగిణుల యెడ నాత్మీయ దక్షిణ నాయకత్వం
బెఱుకపడఁ దత్తదుచిత సంకేత స్థలంబుల విలసించుచందంబున మందానిల
స్పందమాన మందార మంజరీ మకరంద నిష్యంద బిందు సందోహ శీతల
సికతాతలంబులం గల వేలావనాంతరంబులఁ గ్రయ్యంబాఱిన నదీ సంగమ
స్థానంబులును, మధ్యభాగంబున యోగనిద్రాపరాయణుం డగు నారాయణు
దివ్య దేహకాంతి ప్రవాహ యోగంబునఁ గృష్ణత్వంబు గైకొన్న రూపున దీపించు
నంతర్గత క్షీరగ్రాహి నీలమణి ధామంబుల నతిశ్యామంబు లగు నాగంబు
లును, భువనద్రోహులు పాతాళబిలంబులం దాఁగియున్న దైతేయు వ్రాతం
బులఁ బరిమార్ప ననువుపడుటకై క్షీరకాండంబు లొండొండ క్రోల నాఖండ
లుండు పుత్తేర నరుగుదెంచిన బలాహక సందోహంబులుంబోలె వప్రక్రీడా
లోలంబులైన వన్యకుండాలంబులుం గలిగి, యపవర్గంబునుం బోలె ముక్తాస్ప
దంబై , యచలగహ్వరంబునుంబోలె హరినిద్రాసుఖోచితంబై, యచ్యుత
కరంబునుంబోలె నారూఢచక్రంబై, యంబుదాగమనంబునుంబోలె నహిమకర
భాసురంబై, యమరాద్రియంబోలె నత్యాప్తచంద్రపాదంబై, యశ్వర
త్నంబునుఁబోలె నసమ సుధారాజితంబై, యాహవరంగంబునుంబోలె నతి
ప్రభావలక్షితదివ్యకాండంబై, సురభిసమయంబునుంబోలె సుజాతసుమనో
బహులంబై, రమణీనితంబంబునుంబోలె రత్నగర్భాభిరామమేఖలంబై, మెఱసి
గాంభీర్యంబునకు విస్రంభస్థానంబును, మాధుర్యంబునకు ధుర్యంబును
మర్యాదకు నాదికారణంబును, నౌదార్యంబునకు నాకరంబును, నద్భుతభయాన
కంబులకు దానకంబును, నాధిక్యంబునకు నావాసంబును, నాది తిమి
కమఠ భూదారవిహారంబున కాధారంబును, నతిమహత్త్వంబున కాస్పదంబును,

ననుపమానంబునునై పెంపొంద డెందంబునం దనుభావంబున గొని
యాడుచుఁ దీరంబు సేరి, శరణాగతశరణ్యుం డగు నప్పుండరీకాక్షు
నిట్లని స్తుతించె.

208


సీ.

హరికి మ్రొక్కెద షడ్గుణైశ్వర్యసంపన్ను
నకు శాంతునకుఁ బరునకుఁ బరాత్ము
నకు నగణితతేజునకుఁ బరమేష్ఠ్యాత్ము
నకు బరమేశ్వరునకు ననంత
నిరుపమభూత్యైకనిధికిఁ బరాపరే
శునకు నచింత్యరూపునకు నాది
కర్తకు విశ్వభోక్తకు నక్షయానందమూ
ర్తికి నిత్యతృప్తునకు నిత్య


తే.

శుద్ధునకు నీకు దేవ యీసురపతియును
హరుఁడు నేనుఁ జరాచరోత్కరము నీవ
జగము లన్నియు నీయందు సంభవించి
నీవ రక్షింపఁగా మను నీరజాక్ష!

209


ఆ.

సకలవేదములును సంకల్పసంసృతి
కారణములు నీకుఁగాక యంత
కర్తృభోక్తలును జగన్నాథ నీవు నీ
విక్రమాధిగతము విశ్వచయము.

210


క.

సదసత్పరుఁడవు సర్వ
త్రిదశ శరణ్యుఁడవు వాక్తతికి వాంఛుఁడ వె
య్యది విబుధదృశ్య మగుపద
మది యుష్మత్పరమధామ మంబుజనాభా!

211


వ.

భవచ్చరణ శరణాగతుల మమ్ము రక్షింపు మఖిలంబు యెఱుంగు
దని ప్రస్తుతించి కాంచనగర్భుండును నిర్భరానందంబున నమ్ముకుందున
కభివందనంబు గావించి యూరకుండె, నప్పు డాఖండపరశుండును నాఖండ

లుండును, బహువిధంబులఁ బ్రస్తుతించిరి, యిత్తెఱంగున నందఱుఁ బ్రార్ధింప
వారలయెడఁ బ్రసన్నుండై పారావారమధ్యంబున.

212


సీ.

దివ్యవిగ్రహకాంతి దిగ్విలాసినులకుఁ
గర్ణోత్పలశ్రీలు గడలుకొలుప
మహిత నానాకల్ప మణిదీప్తు లంబర
స్థలిఁ జిత్రరచనలు సంఘటింప
నభినవాంశుకరుచు లాపగాకుచహరి
ద్రాయోగశంక నీరధికి నింప
శంఖచంక్రాంశుపుంజము జరత్కౌముదీ
బాలాతపంబుల పసలు చూప


తే.

సితవిశాలాయతేక్షణశ్రీలు కుముద
వారిరుహవికాసమునకు వన్నెనెఱప
గరుణ మూర్తీభవించె నిక్కరణి సనఁగ
నెలమిఁ బ్రత్యక్షమయ్యె లక్ష్మీశ్వరుండు.

213


క.

అప్పరమేశ్వరుఁ గనుగొని
యప్పుడు, ప్రమదంబు భయము నద్భుతమును లో
ముప్పిరిగొన శ్రుతిమతములు
చొప్పడ సుతియించి రదితిసుతు లానతులై.

214


ఉ.

అవ్విబుధవ్రజంబు నుతు లంబురుహోదరుఁ డాదరించి లే
నవ్వు దొలంకుచూపుల మనంబుల దుస్స్థితు లెల్లఁ బాపి మీ
రెవ్వరు మీకు నిచ్చటికి నిప్పుడురాఁ గతమేమి యీగతిం
బర్విన నవ్వ యెయ్యది సమస్తముఁ జెప్పుడు నాకు నావుడున్.

215


క.

శ్రవణామృతమును మేఘా
రవగంభీరంబు నగుధరాధరుపలుకుల్
దివిజజ్యేష్ఠుఁడు విని భ
క్త్యవనతుఁడై విన్నవించెఁ బ్రాంజలి యగుచున్.

216

ఆ.

ఏను గమలభవుఁడ నీతండు శశిమౌళి
హరిహయుం డితండు సురలు వీర
లింతవట్టువార మెపుడు నీపదములు
గోరి తలఁచి బ్రదుకువార మీశ!

217


ఉ.

దేవ! సనత్కుమారుఁ డతితీవ్ర తపోరతి నున్నవాఁడు లో
కావలి తత్ప్రతాప మహితార్చికి మండెడు, వానికోర్కినే
మై వివరింపఁ దీర్ప నసమర్థుల మౌటను భూతకోట్లకున్
నీవు శరణ్యుఁ డౌటను మునిస్తుత! నీ కిది విన్నవింపఁగన్.

218


క.

మావచ్చుట యిట మీఁదట
దేవర చిత్తంబుకొలఁది తెల్లం బని భా
పావిభుఁడు నూరకుండిన
శ్రీవల్లభుఁ డంత దరహసితవదనుండై.

219


చ.

వనజభవున్ హరుం ద్రిదశవల్లభుఁ జూచి సనత్కుమారస
న్ముని దపమాచరించుపని మున్న యెఱుంగుదుఁ దన్మనోరథం
బనితరసాధ్య మట్లగుట నంతయు నేనొకజాడ దీర్చిపొ
మ్మనియెదఁగాని మీరు చనుఁడా తమవీడులకున్ ముదంబునన్.

220


తే.

పద్మసంభవ! నాదృష్టిపథమునందుఁ
బడినవాఁ డెప్పుడైన నాపదఁ దొఱంగి
చిరతరైశ్వర్యసుఖములఁ జెంది వెలుఁగు
ననియె మఱి చెప్పనేల నీయట్టివారి.

221


చ.

అనినఁ గృతార్థులై ప్రమదమారఁ దదీయపదారవిందవం
దన మొనరించి తద్వరశతంబులు గాంచి, విశేషకాంతియౌ
వన కరుణావలోక మృదువాగ్విభవంబు లనేకభంగులన్
వినుతులు సేయుచున్ జనిరి విశ్వపితామహముఖ్యదేవతల్.

222


వ.

అని యిట్లు కృష్ణద్వైపాయనుండు నాగదంతున కెఱింగించిన తెఱంగు.

223

ఆశ్వాసాంతము

మ.

ప్రతిభాషోదిత సర్వశాస్త్ర కలనాపాండిత్వ! సద్ద్వాదశీ
వ్రత సంకల్పిత గోహిరణ్యమణిభూవస్త్రాన్నదానాభిత
ర్పిత ధాత్రీసురబృంద! మందరమహీధృధైర్య! వీణాదిసం
గతసంగీతకళావిలోల! బుధలోకస్తుత్య! నిత్యోదయా!

224


క.

జరఠఫణికమఠపరిదృఢ
కరికిరి కులకుధర విధృత ఘనతర ధరణీ
ధరభరణక్షమ దక్షిణ
కళఖరకరవాల! వినుతగర్వవిభాళా!

225


మాలిని.

రుచిరమణికలాపా! రూపపుండ్రేక్షుచాపా!
ప్రచుర విబుధపుణ్యా! బ్రహ్మవంశాగ్రగణ్యా!
విచలిత రిపుచేతా! విఠ్ఠలేంద్రానుజాతా!
సచివకుల లలామా! చాగయామాత్యరామా!

226


గద్యము
ఇది
శ్రీమద్భ్రమరాంబావరప్రసాదలబ్ధసారస్వత
విలాస గౌరనామాత్యపుత్ర సుకవిజనమిత్ర
సుధీవిధేయ భైరవనామధేయప్రణీతం
బైనశ్రీరంగమహత్త్వం బనుపురాణకధయందు
ద్వితీయాశ్వాసము

  1. 63 నెం. పద్యానికి ఈ గుర్తు పెట్టి కవిగారు *తలమా+ఉలుకక, ఈ సంధి లాక్షణికమతవిరుద్ధము అని వ్రాసినారు. ఆ ప్రతిలో ఇది 279 నెం పద్యం.