శ్రీరస్తు


శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః.



శ్రీమదుత్తరరామాయణము



పీఠిక.


______


శ్లో. చరితం రఘునాథస్య శతశోటిప్రవిస్తరం,
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనమ్'.
రామాయ రామభద్రాయ రామచన్ద్రా య వేధసే,
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః,

§§§§ఇష్టదేవతా ప్రార్థనము§§§§


శ్రీ రాధాధరబింబము దొరయురాచిల్కన్ నిజోరస్థ్సలీ
రారాజన్మణికాంతి రాఁ బిలిచి తద్రా కేందుబింబాననా
స్మేరాంకూరముచేఁ గృతార్థుఁ డగుచుం జె ల్వొందు గోపాంగనా
జారగ్రామణి కృష్ణుఁ డీవుత మహైశ్వర్యంబు మా కెప్పుడున్. 1

≈≈≈≈లక్ష్మీ స్తుతి≈≈≈≈≈


సీ. పుష్కరవిహరణస్ఫురణంబు వహియించి యచలానుగుణవృత్తి యవధరించి
    యార్యాభిగణ్యసౌకర్యంబును రహించి ప్రబలహిరణ్యవర్ధనత మించి
    త్రిభువనాంచితరూపవిభవంబు ప్రాపించి భృగుకులంబు పవిత్రముగ జనించి
    యంభోధిభంగలీలాసక్తి వర్తించి కామపాలనరీతి ఖ్యాతిఁ గాంచి

తే. పుణ్యజనములపూజనములు గ్రహించి
    కలికితన మెందు నిట్టిది కలదె యనఁగఁ
    జెలువుచెలువున నలు వొందు కలిమిచెలువ
    మెచ్చి నిచ్చలు మాకోర్కు లిచ్చుఁగాత. 2


                      §§§ శివస్తుతి §§§

చ. వనితరొ వెండికొండ నెలవంకలు పెక్కు వహించెఁ జూచితే
    యని సరసోక్తిఁ దా ననిన నచ్చపుగందపుఁబూఁత గుబ్బ జా
    ఱిన నునుఁబైఁటకొంగు సవరించుచు నవ్విన గౌరిఁ గౌఁగిటం
    దనిపెడు చంద్రశేఖరుఁ డుదారకృపన్ మముఁ బ్రోచుఁ గావుతన్. 3
 
                    §§§ పార్వతీస్తుతి §§§

ఉ, ఊరక చుట్టుకొన్నఁ గమలోత్పలపంక్తులు వాడు నంచునో
    యేఱును గూర్చి చుట్టితివ యెంతటిజాణవు మేలు మేలు నీ
    నేరుపు మెచ్చవచ్చు నని నిచ్చలు మచ్చిక శంభుఁ గేరు నీ
    హారగిరీంద్రకన్యక దయామతిఁ గోర్కులు మా కోసంగుతన్ . 4
 
                     §§§ బ్రహ్మస్తుతి §§§

చ. భువనములం బ్రసిద్దిఁ గని భూరితరోర్మివరప్రభావ మొం
    ది విధునిరాక కుబ్బుచు నుదీర్ణగుణాంచితరత్నరాశియై
    కవులు సమాశ్రయింపఁ దగి కర్బురగర్భత శ్రీగురుత్వముం
    దవులుసరస్వతీశ్వరుఁ డుదారత మాకుఁ జిరాయు వీవుతన్. 5

                    §§§ సరస్వతీస్తుతి §§§

చ. తనహృదయాంబుజాతమునఁ దార్కొనునాథగతానురాగవా
    హిని వెలి గ్రమ్మఁ జేసెనొకొ యీగతి నాఁగ విధాతచెంగటన్
    దనరి జపాప్రసూనసవిధస్ఫటికాకృతిరక్తిఁ గుల్కు వా
    గ్వనజదళాక్షి మా కొసఁగుఁగాత వచోరచనాచమత్కృతుల్. 6

                   §§§ విఘ్నేశ్వరస్తుతి §§§

మ. కలుషేభావళి నాఁప నంకుశము విఘ్నక్ష్మాధరశ్రేణి వ్ర
     క్కలు గావింప వరస్ఫురత్కులిశమున్ గర్వప్రమత్తారివీ
     రుల బంధింపఁగఁ బాశ మున్నతమనోరుగ్రేణువుల్ మాన్పఁ బు
    ష్కలదానాంబువు లూనువే ల్పడఁచు మత్కావ్యాంతరాయచ్ఛటల్. 7

                   §§§ ఆంజనేయస్తుతి §§§

 సీ. శైశవంబుననె భాస్కరు మ్రింగె నితనితేజమున కేఘనుఁ డింక సదృశుఁ డనుచు
     హనుతటోద్దతి వజ్ర మడఁచె నీతనితనుద్రఢిమ కేమిఁకఁ బోల్పఁ దగు నటంచు
     నురుధాటిఁ గడలిలో మెఱసె నీతనిగభీరతకు నెయ్యది యింకఁ బ్రతి యటంచు
     వాలాగ్రమున గిరుల్ వ్రాల్చె నీతని ధైర్యసంపద కిఁక నెవ్వి సాటి యనుచు
తే. జానకీరామచంద్రు లేశౌర్యవంతు
     పటుగుణస్ఫూర్తు లప్పటప్పటికి నెంతు
     రామహాశాంతు నతిదాంతు నరికృతాంతు
     నతులమతిమంతు హనుమంతు నభినుతింతు. 8

                         §§§ సుకవిప్రశంస §§§

ఉ. ఏకవిజిహ్వఁ దొల్త నటియించె సరస్వతి పాదనూపురో
   ద్రేకఝళంఝళార్భటులు దిక్కులఁ బిక్కటిలంగ నేశుభ
   శ్లోకునిమానసాబ్జమున శోభిలెఁ దారకహంస మట్టివా
   ల్మీకిమహర్షి శేఖరునమేయగుణాకరు నాశ్రయిం చెదన్. 9

మ. ధరణీభృన్మణిమౌళివర్తనములం దళ్కొంది యార్యోక్తివై
     ఖరి ప్రాపించి యహీనవిస్పురదలంకారాప్తి శోభిల్లి భూ
     రిరసారూఢిఁ జెలంగి యర్థవరమైత్రిం జొక్కి మేథా కవీ
     శ్వరులన్ గొల్చెద సన్మమనోహరకళాచంచత్ప్రభావాధ్యులన్. 10

                    §§§ కుకవినిరాకృతి §§§

చ. సరసతఁ దామునుం దెలియఁ జాలరు చెప్పిన నీసు లేక యా
    దరణ వహించి యూఁకొనరు తప్పులె పట్టుదు రొప్పుఁ గన్న మె
    చ్చరు వెడయుక్తు లెన్నుదురు శక్తులు గా రొకఁడై న నింపు చే
    కుఱ రచియింప నట్టి చెడుగుల్ విన నోర్తురె సత్ప్రబంధముల్. 11

వ. అని యిష్టదేవతాప్రణామఖేలనంబును విశిష్టకవి స్తుతిమేళనంబును నికృష్టకవి
    జనావహేళనంబునుం గావించి. 12

                    §§§ కృతి ప్రశంస §§§

మ. పరమశ్రావ్య మఘవ్యయామితకథాభవ్యంబు దీవ్యత్సుధీ
     పరిషత్సంతతసేవ్య మబ్జభవసంభావ్యంబు నై మించును
     త్తరరామాయణ కావ్యమున్ మృదువచోధారార్థ సందర్భని
     ర్భరతత్తద్రసముల్ రహింప రచియింపం బూనితిన్ వేడుకన్. 13

మ. వరుసం దిక్కనయజ్వ నిర్వచనకావ్యం బై తగం జేసె ను
     త్తర రామాయణ మందునన్ మఱి ప్రబంధం బూని నిర్మించు టే
     సరసత్వం బని ప్రాజ్ఞులార నిరసించం బోకుఁడీ రాఘవే
     శ్వరుచారిత్రము నెంద ఱెన్నిగతులన్ వర్ణించినం గ్రాలదే. 14

ఉ. మానక కర్మభూమిపయి మానుష దేహముతో హితాహిత
    జ్ఞాన మెఱుంగు బ్రాహణుఁడు చారుకవిత్వము నేర్చి జానకీ
    జానికథల్ రచింపక యసత్కథ లెన్ని రచించెనేనియున్
    వాని వివేక మేమిటికి వానికవిత్వమహత్త్వ మేటికిన్. 15

ఉ. శ్రీకర రామమంత్ర జపసిద్ధిఁ బ్రసిద్దిఁ వహించి వెన్క వా
    ల్మీకి రఘుప్రవీరుకథలే రచియించి గదా చెలంగె ము
    ల్లోకములందు నెల్లమునులుం గొనియాడఁగ నట్టి దౌటఁ బు
    ణ్యాకర మైనరాముకథ హైన్యము మాన్పదె యెట్టి వారికిన్. 16

శా. ఆవాల్మీకిమనిషివర్యమతిమంథాహార్యసంశోభితం
     బై విశ్వాతిగకామితార్థఫలదం బై శ్రీపదం బై సుశ
     బ్దావాసం బయి మాధురిం దనరురామాంచత్కథాక్షీరపా
     రావారంబు సమాశ్రయింతుఁ గవితా ప్రఖ్యాతి కర్హంబుగన్. 17

చ. ఇహపర సాధకం బన రహించుప్రబంధ మొనర్ప శ్రీరఘూ
     ద్వహునిచరిత్రమున్ దొరకె వాసిగ నీకృతిరత్నమే మహా
     మహునకు సంతసంబున సమర్పణ సేయుదు నంచు నెమ్మదిన్
     దుహితకు భర్తనారయుజనున్ బలె యోజన సేయు చున్నెడన్. 18

                              §§§ కృతిపతి నిర్ణయము §§§

సీ. పొడువుఁగెంపు వహించుబెడిదంపునినుగెంపురహినింపు కంఠహారంబువాఁడు
    కోమలాంఘ్రులయోర గొనబురింగులు జాఱఁ గట్టినబంగారుబట్టవాఁడు
    శృంగారగతి మీఱి చెలువొంచుకస్తూరితిలకంబుచే ముద్దుగులుకువాఁడు
    మకరకుండలలోలమణిజాలరుచి మీఱఁ దళుకొత్తు చెక్కుటద్దములవాఁడు
తే. తలను వలగొన్నపించెపుదండవాఁడు, విమలశతపత్త్రజైత్ర నేత్రములవాఁడు
    మురళిడాచేతఁ గలజగన్మోహనుం డొ, కండు నాస్వప్నమునను సాక్షాత్కరించె. 19

క. ఏనును నతనిం బొడగని, ధ్యానంబున నలరు శ్రీమదనగోపాలుం
    డౌ నని కలలోననె పర, మానందముఁ జెంది మ్రొక్కియర్చించు నెడన్. 20

ఉ. అమ్మహనీయకీర్తి కరుణాన్వితుఁ డై యను వత్స నీప్రబం
    ధము మదంకితంబుగ నొనర్పు కృతార్థుఁడ వయ్యె దింతె కా
    దిమ్మహి వ సువాహనసమృద్ధరమారమణీయభోగభా
    గ్యమ్ములుఁ గల్గెడుం గృతియు నారవితారకమై ప్రకాశిలున్. 21

తే. శ్రీవెలయ మున్ను విష్ణుమాయావిలాస, యక్షగానంబు మాకెసమర్పణముగఁ
    జేసి తది యాదిగా మేము నీసుధాను, సారి వాక్కులఁజొక్కియున్నార మనఘ. 22

క. అని పల్కి యాకృపాళుఁడు, సనుటయు నే మేలుకాంచి స్వప్నమునందున్
     నను నేలుస్వామిఁ గనఁ గలి, గెనెయని రోమాంచకంచుకితగాత్రుఁడ నై. 23

మ. హనుమద్దివ్యపదారవిందమకరందానందనేందిందిరా
     త్ము ననేకాంధ్రకృతిప్రకల్పససమర్థుం బుష్పగిర్యప్పనా
     ర్యునిసత్పుత్త్రునిఁ దిమ్మనాఖ్యకవిచంద్రున్ మత్సహశ్రోతఁ బ్రొ
     ద్దుననే పిల్వఁగఁ బంచి కన్నకల సంతోషంబునం దెల్పినన్. 24

మ. అతఁ డానందముఁ జెంది నన్నుఁ గని యన్నా జాళువాపైఁడికిం
     గృతవర్ణాంచితరత్న మబ్బినటు లయ్యెన్ నీవు వాక్ప్రౌఢిమన్
     గృతి సేయంగఁ దొడంగు రామకథకుం గృష్ణుండు రా జౌటఁ బ్ర
     స్తుతి గావింపఁగ మాకు శక్యమె భవత్పుపుణ్య ప్రభావోన్నతుల్. 25



తే. అని కిరీటికి శౌరి తోడైనయట్టు, లమ్మహాకవి సాహాయ్య మాచరింపఁ
    గృతి నొనర్పఁగఁ బూనినయేను మొదట, నెంతు మద్వంశవిధ మది యెట్టులనిన.

                       §§§ గ్రంథకర్తృ వంశవర్ణనము §§§

సీ. అఖిలరాజాధిరాజాస్థానజనహృద్యవిద్యావిహారు లార్వేలవారు
    కల్పకబలికర్ణకలశార్ణవోదీర్ణవితరణోదారు లార్వేలవారు
    సజ్జనస్తవనీయసతతనిర్వ్యాజహారిపరోపకారు లార్వేలవారు
    ఘనదుర్ఘటస్వామికార్యనిర్వహణప్రవీణతాధారు లార్వేలవారు
తే. విమతగర్వాపహారు లార్వేలవార, లట్టి యార్వేలవారిలో నలఘుకీ ర్తి
    వెలయుశ్రీవత్సగోత్రారవింద హేళి, మహితగుణశాలి వల్లభామాత్యమౌళి. 27

ఉ, ఎల్ల భయంబులన్ విడువుఁ డేఁ గల నంచు వచించి ప్రేమశో
    భిల్ల భరించు బంధుజనబృందము డెందమునందు భక్తిరం,
    జిల్ల భజించు సంతతము శ్రీహరిదివ్యపదారవిందముల్
    వల్లభమంత్రి బుద్ధి సురవల్లభమంత్రి యమాత్యమాత్రుఁ డే. 28

క. శ్రీవల్లభుండు లక్ష్మీ, దేవిని మును పెండ్లియైన తెఱఁగునఁ దనకున్
    దేవేరిఁగ లక్ష్మాంబిక, నావల్లభమంత్రి పెండ్లియాడెన్ వేడ్కన్. 29

సీ. జడనిధిఁ బొడమనిజలజాతగేహిని చండికాఖ్యఁ దొఱంగు శైలకన్య
    బహుముఖావాసంబుఁ బాయుసరస్వతి గోత్ర భిత్సతి యనఁగూడనిశచి
    చక్రవిద్వేషణాశ్రయ గానిరోహిణి పతి ప్రతాపము మెచ్చి ప్రబలుసంజ్ఞ
    హీనవంశోత్పత్తి లేనియరుంధతి పృథుపంక మొందనిభీష్మజనని
తే. యీమె యౌ నని చుట్టంబు లెల్లఁ బొగడ, నగణితక్షాంతిసంపద నవనిఁ బోలి
    వల్లభునిసేవ సేయు నవార్యలలిత, లక్షణకదంబ కంకంటి లక్ష్మమాంబ. 30

క. అల్లక్ష్మమాంబయం దా, వల్లభనామ ప్రధానవర్యుడు గనియెన్
    బల్లవ బాణాకారున్, హల్లకహితకీర్తిధారు నయ్యనధీరున్. 31

మ. కనకాహార్యసమానధైర్యుఁ డగుకంకంట్యయ్యనామాత్యవ
     ర్యునకుం బ్రాక్తనమంత్రు లద్యతనమంత్రుల్ విశు
     ద్ధనయోద్యుక్తిఁ బరోపకారవినయౌదార్య ప్రసక్తిన్ మృదూ
     క్తి నిజస్వామిహితోరుకార్యఘటనాధీశ క్తి నీడౌదురే. 32

క. అయ్యనవద్యగుణావని, యయ్యనమంత్రిమణి నరసమాంబ వివాహం
    బయ్యె నహార్యకుమారిని, నెయ్యంబునఁ బెండ్లి యయిన నెలతాల్పురహిన్. 33

సీ. వసియింప ప్రభుఁ డురం బొసఁగినచో వనజాతంబు డాయుశ్రీసతి హసించి
    ప్రియునిసామేన నుండియును తత్తేజంబు సైరింపఁ జాలనిశాంభవి నగి
    విభుసమ్ముఖంబున వెలసియు బహురసజ్ఞాధీన యైన బ్రహ్మాణిఁ దెగడి
    తన కెందు గతి యైనధవునిలావణ్యంబుఁ గలయునప్పు డడంచుగంగఁ గేరి

తే. యేకొఱంతయు లేక యస్తోకభక్తి, చే నిజేశునిపరిచర్య సేయు నెపుడు
    ధర్మగుణధామ పతిదేవతాలలామ, భవ్యమతిపేటి నరసమాంబావధూటి. 34

క. ఆనరసమాంబగర్భాం, భోనిధి నమృతాంశుచందమున దానయశో
    నూనవిభావిభవైకని, ధానం బగునప్పయ ప్రధానుఁడు వొడమెన్. 35

మ. దయమానాత్తదయాబ్ధిగుప్తకవివిద్యావైదుషీ భోజభూ
     దయితగ్రామణి పూర్వదాతృమహిమాధఃకారిదానప్రభూ
     తయశోధౌతదిశావకాశుఁడు మహోద భూతవామాంగుడ
     ప్పయమంత్రీశ్వరుఁ డమ్మహామహు నుతింపం జెల్లదే యెయ్యెడన్. 36

తే. వినయమున కిమ్ము దాక్షిణ్యమునకు నెలవు
    సత్యమున కాస్పదము సదాచారమునకు
    బ్రాపు నైపుణ్యమునకుఁ జేపట్టు గొమ్మ
    యలవియె నుతింపఁ గంకంటి యప్పుఘనుని. 37

క. జననుతుఁ డయ్యప్పఘనుం, డనఘు డు చిదురూరినరసయకుఁ దిమ్మమకున్
    దనుజామణి యై గుణములఁ, బెనుపొందిననరసమాంబఁ బెండిలియయ్యెన్. 38

సీ. తలఁప సురాధీశుతల్లి గాకుండెనే నదితి నించుక సాటి యనఁగ వచ్చు
    రూఢిగా దోషాకరునిఁ బెంపకుండెనే ననసూయ నింత జో డనఁగ వచ్చు
    శక్తి గర్భీకరించక యుండెనే నరుంధతి నొక్కగతి నీ డనంగ వచ్చు
    జనులు నిందింప మందునిఁ గాంచకుండెనే ఛాయఁ గొంత సమంబు సేయవచ్చు
 తే. నక్కొదవ లున్న వార లయ్యతివకుఁ బ్రతి
     యౌదురే యని బుధు లెంచ నతిశయిల్లె
     నప్పయామాత్యమౌళి యర్ధాంగలక్ష్మి
     నయదయాదిగుణాలంబ నరసమాంబ. 39

క. అన్నరసమాంబయందు స,మున్నతగుణుఁ డప్పనార్యముఖ్యుఁడు గనియెన్
    సన్నుతినిఁ బాపరాజా, ఖ్యు న్నరసింహాభిధానుఁ గులము వెలయఁగన్. 40

తే. వారిలోఁ బాపరాజాఖ్యవ న్నెఁ గన్న, వాఁడ నేఁ బూర్వకృతపుణ్య వాసనావి
    శేషమునఁగృష్ణ దేవునిఁ జెలఁగికొలిచి, తత్కృపమహాకృతియొనర్పఁదలఁచినాడ. 41

ఉ. కాంచనగర్బశంకరముఖ త్రిదశేంద్రులు ప్రౌఢరీతిఁ గీ
    ర్తించిన మెప్పుతో విననికృష్ణుఁడు మత్కృతకీర్తనం బ్రహ
    ర్షించి వినున్ స్వకీయకృపచే విలసిల్లెడు వాక్కులౌటఁ దా
    ర్వెంచినచిల్కపల్కు వినఁ బ్రీతి వహింపక యుందురే దొరల్. 42

శా. వైదర్భీ విలసద్విలాసమునఁ జెల్వంబూని సత్యో క్తి నెం
     తే దీపించి కళందజోజ్జ్వలరసాప్తిన్ మించి భద్రాత్మకం
     బై దీవ్యద్ఘనలక్షణాశ్రయసమాఖ్యం గాంచుమత్కావ్య మా
     హ్లాదం బిచ్చుగ్రహింపఁ గృష్ణునకు నర్హంబే కదా యెయ్యెడన్. 43.

సీ. శ్రీరుక్మిణికి మకరికలు చెక్కుల వ్రాసి సత్యకీల్జడలకు బూసరులు సుట్టి
    జాంబవతికిఁ గొప్పు చక్కఁగా నిడి మిత్రవిందకుఁ బుక్కిటివిడె మొసంగి
    భద్రసిబ్బెంపుగుబ్బల గంధ మలఁది సుదంతకు దిలక మందముగ దిద్ది
    కాళింది ముఖఘర్మకణము గోటను మీటి లక్షణయడుగుల లాక్ష యుంచి

తే. నీళకు మణివిభూషణపాళి దొడగి, నవ్యవకులంబు రాధకర్ణమునఁ జెరివి
    వెలఁదిమిన్నలు పదియాఱువేలు గొలువ, మించు కృష్ణునిశృంగార మెంచ వశమె. 44

                      §§§ షష్ఠ్యంతములు §§§

క. ఏవంవిధగుణనిధికిన్, దైవతచాతకఘనాఘనప్రతినిధికిన్
    లావణ్యరసాంబుధికిని, సేవకసేవధికి మౌనిచింతావధికిన్. 45

క. పురుషగ్రామణికి నురోం, తరభృతరమణికిని బూతనాప్రాణమరు
    ద్ధరణోగ్రఫణికి వినతా, మరమణికి మహామహోరమాద్యోమణికిన్. 46

క. ఆనతవిందునకున్ శ్రుతి, నానటితపదారవిందునకు నుదితయశో
    దానందునకు సదాత్మస, దానందున కవితశివశతానందునకున్. 47

క. కందళితానందశతా, నందసుతానూనగాననవనాధృతికిన్
    గుందశరత్కందమరు, త్తుందభరప్రభువిభాపృథుయశోరతికిన్. 48

క. నీలమణీనీలఘృణీ, జాలతృణీకరణనిపుణచారుతనునకున్
    శూలధరాభీలకరా, వేలశరాకారఘోరవిహృతిఘనునకున్. 49

క. వివిధావతారునకు నఖ, రవిజితతారునకు బరధరశతారునకున్
   స్తవనదవప్లుషితసుదృ, గ్భవకాంతారునకు భువనభయతారునకున్. 50

క. వ్రజగజగమనాలోలున, కజగరవరజరఠవారణాభీలునకున్
    సుజనైకకృపాళునకున్, గుజనవిఫాలునకు మదనగోపాలునకున్. 51
                                    ____________