శ్రీమదుత్తరరామాయణము/తృతీయాశ్వాసము
శ్రీరస్తు
శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః
శ్రీమదుత్తరరామాయణము
తృతీయాశ్వాసము
_____: o :_____
శ్రీవనితానిభనీళా
దేవీకుచమృగమదాభ దేహరుచిఝరీ
గోవర్ధనలీలాధృత
గోవర్ధనశిఖరి వేణుగోపాల హరీ.
తే. అవధరింపుము కుంభసంభవమహర్షి , చంద్రుఁ డిట్లను శ్రీరామచంద్రు జూచి
జానకీనాథ యిటు లద్ద శాననుండు, విత్తవిభువీటిపై దండు విడిసినపుడు, 2
మ. భటకోలాహలముల్ మహారథికశుంభచ్ఛంఖఘోషంబు లు
ద్భటదంతావళబృంహితంబులు హయప్రత్యగ్రహేషార్భటుల్
పటహాద్యద్భుతవాద్యభేదరవముల్ బ్రహ్మండ భాండచ్ఛిదా
పటిమన్ మించె విరోధిరాడ్యువతిగర్భభ్రూణముల్ భేదిలన్.
§§§ కుబేరుఁడు దశగ్రీవునిమీఁదికి యక్షులను బంపుట §§§
వ. అప్పుడప్పర్వతప్రదేశంబున నుక్కళం బున్న యక్షకిన్నరు లన్నరవాహానున కిది
విన్నవింపకయ మించి మన మొక్కించుక శరపరంపరల ముంచిన మాట
వచ్చునని కొంచి కొంద ఱందుఁ దరలక కొంద ఱలకాపురంబున కరుదెంచి
యుదంచితప్రాభవంబు మెండుకొన నిండుకొలు వున్నకిన్నరేశ్వరున్ బొడగని. 4
క. వందనములు నేసి పరా, కిందుకళామౌళిమిత్ర యిదె నేడు చమూ.
బృందముతో దశవదనుఁడు, నందాతీరమున విడిసినాఁ డని తెలుపన్. 5
తే. ఆకుబేరుఁడు నవ్వి బళా మఱేమి, దశ ముఖుఁడు మంచిపని సేయఁ దలఁచె హితవు
దలఁచిన్ మఱిముక్కుకోతలనుచుమాట, నేఁడునిజమయ్యె నిఁకనేల నెనరుదలఁప.
ఆ. మొగముఁ బొడువ లేనిముంగోప మిఁక నెప్పు, డలకఁజొచ్చెనేనిఁ జులుకనగుదు
మటుల చేయ నీయ కాఁగి భండన మాచ,రింపుఁ డనుచు వారిఁ బంపుటయును.
§§§ యక్షరాక్షసుల యుద్ధము §§§
ఉ. యక్షువరాజ్ఞ మౌళి నిడి యక్షులు నకుల నిప్పు లుర్ల హ
ర్యక్షములో యనన్ గహకహార్భటు అభ్రము నిండఁ జేయుచున్
రాక్షససేనఁ దాఁకి రల రాక్షసులున్ నలిరేఁగి మార్కొనన్
ద్ర్యక్షధరాధరం బదరె నంబుజపత్త్ర గతిన్ దదుధ్ధతిన్ . 8
మ. అసిఘర్షోదితవిస్ఫులింగమయ మై యస్త్రానలాభీలకీ
లసముజ్జృంభిత మై గదాముసలశూలప్రాససంప్రేరణా
వసరాన్యోన్యకృతాభినందనవచోవ్యాపార మై యక్షరా
క్షససంగ్రామము సూచు ఖేచరులకున్ గల్పించె దృక్పర్వముల్. 9
శా. దోరుత్తుంగతరంగముల్ నిగుడఁ దద్ఘోరాసిమీన ప్రభల్
మీరన్ సైనికచంద్రు లుబ్బొసఁగ గాంభీర్యం బవార్యంబుగా
భేరీభాంకృతిరావ మొప్పఁ గరిభూభృత్కోటి మీ టొందఁగాఁ
బోరాడెన్ వడి యక్ష రాక్షసబలాంభోరాసు లొండొంటితోన్. 10
వ. అప్పుడు. 11
ఉ. కూలెడు నేనుఁగుల్ దెరలుగుఱ్ఱములున్ వడి ద్రెళ్లు తేరులున్
వ్రాలెడిటెక్కెముల్ దునిసి వమ్మగుఛత్త్రము లాడునట్టలున్
దూలెడిరూవులున్ దొరఁగుతోరపునెత్తురు టేఱు లందుపైఁ
దేలెడుపీనుఁగుల్ గలిగె ధీరతఁ బోరెడు రెండుసేనలన్ . 12
ఉ. రాక్షససేనముందటఁ దిరంబుగ నిల్చి రణం బొనర్చు న
య్యక్షులఁ జూచి పంక్తి ముఖుఁ డక్షముఁడై నిజసైన్యరక్షణా
ధ్యక్షుల మార్కొనన్ బనిచి తానును నిర్వదిచేతులన్ గదా
సిక్షురికాదిసాధనవిశేషవిజృంభము గానుపించినన్ 13
చ. చెదరక యక్షులున్ దనుజశేఖరు బిట్టెదిరించి భీకర
ప్రదరపరంపరల్ గురిసి పైపయి నైకవిధాయుధచ్ఛటల్
గుదిగొన నించి బీరమునఁ గో యని యార్చినచో మహోదరుం
డుదురున నొక్క ఘోరగద యూని కృతాంతునిలీల నుగ్రుఁ డై . 14
క. వాయువు బలువడిఁ గుజములఁ ద్రోయు తెఱంగున గదాహతులచే క్షితిపాల్
గా యక్ష సేనఁ గూల్చె భ,ళీ యని శుకసారణాదు లెల్ల నుతింపన్. 15
శ. శుకసారణధూమ్రాక్షా, దిక సేనాధీశు లొక్క దెస దశకఠుం
డొకదెస యక్షుల జమువీ, టికి నతిథులఁ జేసి రోహటింపక యధిపా. 16
ఆ. అపుడు పఱచుయక్షు లతిభీతులై పూరి, మఱచుయక్షు లొడలు పఱచుయక్షు
లఱచుయక్షు లై మహావాతధూతజీ, మూతరీతిఁ జని రరాతు లలర. 17
ఉ. విచ్చిన నొచ్చినన్ వెఱచి వేఁడిన నోడిన వారిఁ బోవ నీ
కచ్చెడుగుల్ దయారహితు లై యలకాపురిఁదాక గోటలోఁ
జొచ్చినదాఁక వెంటఁబడి శూలములన్ బలితంపుటీఁటెలన్
గుచ్చిరి చొచ్చి వచ్చి రదిగో నని పౌరులు దల్లడిల్లఁగన్. 18
§§§ సంయోధకంటకుం డనుయక్షువ రేణ్యుఁడు యుద్ధము సేసి పాఱి పోవుట §§§
మ. ప్రకటకోధములన్ ధనాధిపతి పంపన్ వేగ సంయోధకం
టకుఁడన్ యక్షవరేణ్యుఁ డొక్కఁ డపు డడ్డం బై పురద్వార ము
త్సుకతం జొచ్చునిశాటకోటిపయి శక్తుల్ దోమరంబుల్ శర
ప్రకరంబుల్ గురియించి నిల్చెఁ దనశౌర్యం బందఱున్ మేలనన్. 19
శా. ఆరక్షోబల మాతనిన్ గడవలే కాకంపమున్ జెందఁగా
మారీచుం డెదిరించి శాతశరసంపన్నత్వమున్ జూప న
వ్వీరుండు గద యెత్తి వానిశిరమున్ వ్రేయన్ వెసన్ గూలె స
త్ప్రారంభం బుడి వోవ నేలఁ బడుపుణ్యభ్రష్టుచందంబునన్ . 20
ఉ. కూలి ముహూర్తమాత్రమునకున్ దెలివిన్ గని తాటకేయుఁడున్
వాలుమెఱుంగుఁదూపు లనివారణ యక్షుని మేన గ్రుచ్చి యా
భీలతఁ జూపినన్ సమర భీతి జనించి యతండు దాళఁగా
జాలక వీఁగి పోయిన నిశాచరు లార్చిరి సంభ్రమంబునన్. 21
వ. ఇవ్విధంబున నంయోధకంటకుం డా యోధనంబు విడిచి, యోధధర్మంబు దలకడచి సాఱిన
మీఱినకౌతుకంబునం బది మొగంబులఁ గుతుకం బగుమందస్మితంబుతో నలకమొగంబు దాఁటి మేటికిరీటి
పచ్చఱాజంతులన్ గనుపట్టుకోట వాకిటిరచ్చపట్టుకొట్టంబున నట్టనడి తెరువుం బట్టుకొని నూర్మొనలపట్టెంబు
వట్టువేల్పుఁజలుపలన్ గట్టిన గోపురంబు డాసి వాసిగలచిగురుఁదొగరులం దెగడుపగడంపుద్వారబంధంబు
లురలం ద్రోచి మగఱాలబోరుతలుపులు వీడన్ దన్నిపదాఱువన్నెహొన్నుపనులన్ జూడన్ జూడ వేడుక
యగు నగరిముందరివైడూర్యతోరణస్తంభంబుకడక స్తంభసంరంభమునన్ జొచ్చి వచ్చునక్కుంభకర్ణాగ్రజున్
గనుంగొని. 22
§§§ దౌవారికుం డగుసూర్యభానునిఁ దుత్తుమురై పడ దశగ్రీవుండు గొట్టుట §§§
తే. అచటి దౌవారికుఁడు మహాహసితతీవ్ర
భానుఁ డగుసూర్యభానుఁడప్పంక్తిముఖున
కడ్డమై యెందు వచ్చెద వనుచు నతని
జుట్టు నరుదెంచు దైత్యుల బి ట్టదల్చె. 23
ఉ. సింధువు మించి రా విడనిచెల్లెలికట్ట తెఱంగునన్ సురా
బంధుబలంబు నిల్పి నిలుపన్ నిల కేఁగెడుపం క్తికంఠు గ
ర్వాంధునిఁ జూచి పోకు నిలుమా చలమా ఫలమా బలా ప్తి కీ
బంధుల నొంప వచ్చు టని పల్కి మహాగద పూన్చి వై చినన్ . 24
శా. కుంభీందంబు మృణాళమున్ దునుములాగున్ దోఁప దానిన్ భుజా
శుంభల్లీల సురారి ద్రుంపఁ గని యక్షుం డుగ్రుఁ డై తోరణ
స్తంభంబు బెకలించి వైవ నతఁడున్ దానన్ ధరన్ గూల క
య్యంభోజూసనదత్తదివ్యవరమాహాత్మ్యంబునన్ గ్రూరుఁ డై 25
క. అత్తోరణంబు కొని నడు, నెత్తివగుల సూర్యభానునిన్ మొత్తినచోఁ
దుత్తుమురై వాఁ డిలఁ బడె, నత్తఱి బరువెత్తె నచటియక్షగణంబుల్, 26.
§§§ మాణిభద్రుఁడు పోరి వ్రేటు పడి పార్శ్యమాలి యని పేరు వడయుట §§§
క. అలబలము లిటుల పఱచిన, నలబల మెసఁగన్ దశాస్యుఁ డసురావళితో
నలకఁ గలఁపంగ నది గని, పలికె ధనేశుండు మాణిభద్రునితోడన్. 27
క. నొచ్చిరి మనయక్షులు పుఁరి, జొచ్చిరి రాక్షసులు బాలిశుని దశముకునిన్,
జెచ్చెర నెదిర్చి నీవా, రిచ్చ నలర విశ్రమింప నిది దఱి నీకున్ . 28
తే. అనిన సామి హాసాదని యమితసమర, దోహళంబున నతఁడు చతుస్సహస్ర
యక్షవీరులు దనతోడ నరుగు దేరఁ, గల్పకాలాంతకునిలీలఁ గదలి వచ్చె. 29
ఉ. వచ్చినమాణిభద్రుబడి వచ్చిన సైనికకోటి గోటలోఁ
జొచ్చిన రాక్షసో త్తములు స్రుక్క గదల్ గొని మోఁది తూపులన్
గ్రుచ్చి కటారుల నఱికి కుంతములం బడగ్రమ్మి యార్చినన్
విచ్చిరి నొచ్చి యప్పురము వెల్వడి రుక్కులు నక్కి రక్కసుల్ . 30
వ. ఇవ్విధంబున. 31
ఉ. నాలుగు వేలయక్షులును నల్గడఁ గొల్వఁగ మాణిభద్రుఁ డ
వ్వేళ దశాస్యుసైన్యముల వెన్కొని నొంపఁగఁ దద్వరూథినీ
పాలకుఁ డాప్రహస్తుఁ డురు బాహుబలంబున యక్షవాహినీ
పాలుని బిట్టెదిర్చె మును పాఱెడుసేనల కు బ్బొనర్చుచున్. 32
క. దళకర్త లిరువు రిటువలెఁ, దలపడి పోరాడ రెండు దళములఁ గలయో
ధులు నుద్భటు లగుభటులును, గలయంబడి పోరి రుత్సుకత వెలయంగన్. 33
శా. కై లాసాది గుహాల్ ప్రతిధ్వను లొసంగన్ దివ్యసందాలకా
కూలక్ష్మారుహపాళి మూలములతోఁ గూలన్ భుజాస్ఫాలనో
ద్వేలధ్యానము లంఘ్రిఘట్టనము లెంతే మీఱఁగాఁ బోరి ర
ప్పౌలస్త్యద్వయసైనిక ప్రవరు లభ్యామర్దబద్ధ స్పృహన్ 34
వ. తత్సమయంబున, 35
చ. కరము చలంబు మీఱ దశకంఠునిమంత్రి ప్రహస్తుఁ డుగ్రుఁ డై
కరముసలంబునం గడపె గ్రక్కున వేవురుయక్షులన్ మహో
దరుఁడు మహోదరుం డయి గదాహతి వేవుర నొంచెఁ దాటకా
వరతనయుండు ద్రుంచె గరవాలమునన్ ద్విసహస్రయక్షులన్.. 36.
వ. ఇప్పరుసున నిజపార్శ్వచరు లయిన చతుస్సహస్రయక్షప్రవరులం బరిమార్చి,
పేర్చిన ప్రహస్తాదుల గనుంగొని నిర్ణిద్రరౌద్రంబున మాణిభద్రుండు వానిపై నురవడించిన. 37
శా. ధూమ్రాక్షుం డెడ చొచ్చి శాతశరవిద్ధున్ జేసి పెల్లార్చినన్
దామ్రాక్షుం డయి యక్షు డారిపు గదన్ దాటించినన్ వాతధూ
తామ్రంబున్ బలె వాఁడు మూర్చిల స్వకీయాంఘ్రిస్ఫురద్ఘట్టనన్
నమ్రత్వం బహిరాజు సెంద ఘటకర్ణ జ్యేష్ఠుఁ డత్యుగ్రుఁ డై . 38
క. ఆమాణిభద్రుఁ గదిసి శి, తామితశరవృష్టి గురియ నతఁ డతికుపితుం
డై మూఁడుతూపు లసుర, గ్రామణి పేరురము నాటఁగా చేయుటయున్. 39
ఉ. అందున నొచ్చి పంక్తిముఖుఁ డల్గి గదాహతి మాణిభద్రుమౌ
ళిం దిలకించి కొట్టినఁ జలించి యతం డలమౌళి యోరపా
టొందెఁ దదాదిగా రఘుకులోత్తమ యాయన పార్శ్వమౌళి నాఁ
జెందె నభిఖ్య యంత వెఱుచేఁ బఱచెన్ బరసేన లార్వఁగన్ 40
వ. ఇత్తెఱంగున దళవాయి తొలంగి పోయినన్ గనుంగొని. 41
§§§ ధనదుఁడు యుద్ధరంగమునకు వచ్చి దశగ్రీవునకు బుద్ధులు సెప్పుట §§§
సీ. పిడుగుఁజప్పుడులతోబెడిదంపుటడిదముల్ జళిపించుచును భటావళులు గొలువ
జయజయ నవనిధీశ్వర మహేశ్వరమిత్త్ర యనుచుఁ జారణకోటు లభినుతింప
జవనకంఖాణ రాజము లెక్కి కిన్నరగ్రామణు లుభయభాగములఁ గొలువ
నుద్భటాహంపూర్వికోక్తులు వెలయఁ గింపురుష యోధులును గ్రిక్కిఱిసికొలువ
తే. బద్మ శంఖాద్యనిధులు రూపంబు లూని, కొలువ బంగారుఁ దేరెక్కి గురగదాది
సాధనములొప్పఁ గిన్న రేశ్వరుఁడు వచ్చి, చుఱుకుఁజూపులదశకంతుఁజూచిపలికె.
ఉ. తమ్ముఁడవంచు నీ కొకహితం బెఱిఁగింపఁగ దూతఁ బంచినన్
వమ్మొనరించి నాపలుకు వానిని జంపి ననున్ జయింప రే
ద్రిమ్మరిగుంపుతోడ నరు దెంచితి ని న్న న నేల నీకు డెం
దమ్మున మేలు గాఁ దలఁచు నన్నె యనన్ దగుఁగాక దుర్మతీ. 43
ఉ. రోగికి భక్ష్యభోజ్యముల రోగము హెచ్చుగతిన్ బటుక్రుధా
యోగికి నీకు మాదృశహితోక్తులఁ గ్రోధము మించు మాటికిన్
నీగుణ చర్య లేటి కివి నింద యొనర్పఁగ నీకె తెల్లమౌ
రాఁగలమృత్యువుం బొరసి రౌరవబాధలఁ బొందుచున్నెడన్ . 44
ఉ. ఆపద లావహించుదురహంకృతి నీగతి మూర్ఖుఁడుగ్రపుం
బాపము లాచరించి విషపాన మొనర్చి శరీర మంతయున్
వ్యాపక మైనఁ జింతిలుజడాత్మువలెన్ యమపాశబద్ధుఁడై,
పాపఫలంబుఁ జెందునెడఁ బాపముఁ జేసితి నంచు వందురున్. 45
ఉ. అన్నకుఁ దండ్రికిన్ గురున కాపద యెవ్వఁ డొనర్చు వానిఁగ
న్గొన్న మహోగ్రపాతక మగున్ దను వస్థిర మృత్యు వెప్పుడున్
సన్నిహితస్థితిన్ మెలఁగు సంపద పుణ్యవశం బటంచు లో
నిన్నియు నెంచి ధర్మము వహించుజనుండు కృతార్థుఁ డెయ్యెడన్. 46
చ. కలగక బుద్ధిపూర్వకముగా జనుఁ డేక్రియఁ జేయుఁ దత్క్రియా
ఫల మనుభూతిగా నిది శుభం బశుభం బిది యంచు రెంటినిన్
దెలిసి సుకర్మమున్ సలుప దేవత లందఱు మెత్తు రిందున్
గలిమియు బల్మి యిచ్చటనె కల్గు సుఖంబె లభించు నచ్చటన్ 47
చ. ధనమణివస్తువాహవనితాజనతాదులు బల్మి సంతరిం
చిన యవి యంచు ధర్మములు సేయక యుండిన నేమి యంచు న
య్యనిమిషు లందఱున్ బగతు రంచు మహాపద లొంద నున్నని
న్ననుజుఁడ నన్నఁ గల్గు నిరయంబు రయంబున రమ్ము పోరికిన్ . 48
§§§ దశకంఠుఁడు ధనదుని మాయా యుద్ధమున గెల్చి యతని పుష్పకంబుఁ గొనుట §§§
క. అని తమదొర దూఱెడు ధన,దుని మారీచ ప్రహ స్తధూమాక్షశుకా
ద్యనిమిషరివుమంత్రులు మా, ర్కొని నిలువఁగ లేక చనిరి కోఁచతనమునన్ .49
చ. అని నిటులాత్మమంత్రులు ధనాధిపుకో లల కోర్వలేమి న
ద్దనుజవరేణ్యుఁ డుగ్రనిశితప్రదరంబుల వాని ముంచినన్
గనలుచు డాసి కిన్నరశిఖామణి వాని కిరీటపంక్తి ఖం
గున రొద సేయ భూరిగదఁ గైకొని బెట్టుగ మోది యార్చినన్. 50
మ. కడుఁ గోపించి దశాననుం డతనివక్షః పీఠము జొచ్చి పో
యెడు న ట్లుగ్రశరంబు వేయుటయు యక్షేశుండు ధీరత్వ మే
ర్పడఁ గోదండగుణారవం బఖలదిగ్భాగంబులన్ నిండ న
ప్పుడు వహ్న్య స్త్రము వైవ వాఁ డడఁచె నంభోబాణ వేగంబునన్ , 51
మ. శరసంధానదృఢాపకర్షణకృతుల్ జ్యాఘోషణంబుల్ పర
స్పరధిక్కారము లొక్కచందమున మించన్ విశ్రవఃపుత్రు లి
ర్వురుఁ గ్రొన్నెత్తుటఁ దోఁగుచుఁ గెరలుచున్ రోషించుచున్ డాయుచున్
హరియుగ్మం బన నిద్ద ఱిద్దఱయి శౌర్యస్పూర్తిఁ బోరాడఁగన్ . 52
క. రణమున వివిధాయుధధా, రణమున సరి పోరుయక్షరాక్షసవరులన్ ,
బ్రణుతించిరమరులసురా, గ్రణియున్ మాయఁగొని న్యాయ్యరణవిముఖుండై .53
సీ. ఒకసారి మేఘమై యుడువీథిఁ గనుపించుఁ గనుపించి పిడుగు లుగ్రముగఁగురియు
నొకతేప సింహమై యుద్వృత్తిఁబఱతెంచుఁ బఱతెంచి కహకహార్భటివహించు
నొకతూరి కొండయై యురలీల నెదిరించు నెదిరించి యెగసి బిట్టదరఁ జేయు
నొకమాటు వార్ధియై యూర్తులతో మించు మించి రోదసియెల్ల ముంచి వైచు
తే. నొక్కపరివ్యాఘ్రమైవచ్చునొక్కనారి, దంష్ట్రి యైతోఁచు నొకమరి దారుణాహి
కరణి గనిపించు నొక మాఱు గానిపింప, కడఁగు మాయానిరూఢినయ్యసురవరుడు
చ. ఇటువలెఁ బెక్కుమాయల ధనేశ్వరునిన్ భ్రమియించి విక్రమో
ద్భటగతి మించి నిష్ఠురగదన్ దల మోఁదినఁ గ్రొత్త నెత్తురుల్
జొటజొటఁ గాఱఁ బూచినయశోకము గాలికిఁ గూలుచాడ్పునన్
దటుకున వ్రాలెఁ దేరిపయి దానవసైన్యము లుల్ల సిల్లఁగన్ . 55
మ. ధనధుం డీగతి మూర్ఛఁ జెంది పడ సంతన్ సూతుఁ డ త్తేరు గ్ర,
క్కున నందాతటినీసమీపమునన్ గొంపోయె యక్షుల్ భయం
బున వృక్షంబులు వ్రాకియున్ గిరిబిలంబుల్ సొచ్చియున్ విచ్చి కా
ననముల్ దూఱియుఁ గోనలన్ బడియు దైన్యం బొంది రెంతేనియున్. 56
తే. మూర్చమునిఁగినధనదుసముఖముఁ జేరి, శంఖపదాదినిధులు విశ్రాంతి మాన్చె
నంత దశకంధరుఁడు నిట్టులన్నఁ గెలిచి, సొలయ కాతనినగరంబుసొచ్చియచట.
సీ. శాతకుంభ స్తంభ సాహస్రములు గల్గి వైడూర్యతో రణావళులు గల్గి
నవ్యమౌక్తికవితానవితానములు గల్గి శశికాంత వేది కాచయము గల్గి
సొగసైనమగఱాలసోపానములు గల్గి కప్పుఱాలోవలయొప్పు గల్గి
కామితార్థము లిచ్చుఘనవృక్షములు గల్గి వికచకల్హార దీర్ఘికలు గల్గి
తే. మానసజవంబు గల్గి కామగతి గల్గి
కామరూపంబులు వహించుగరిమ గల్గి
ప్రబలు పరమేష్ఠిరజత పుష్పకముఁ గాంచి
యందు పై నెక్కి యతఁడు తారాద్రి కరిగె. 58
మ. తరళోత్తుంగ తరంగ ఘుంఘుమరవోద్యద్దివ్యనందారవిం
దరజోబృందమరందతుందిలమిళిందధ్వానసంబంధగం
ధరమాబంధురమంథరానిలునిచేతన్ శ్రాంతి వాయన్ ధనే
శ్వరుఁడున్ దెప్పిఱి భీతి నేనఁగొని లజ్జన్ జేరె వీ డయ్యెడన్ 59
§§§ దశవదనుఁడు సపరివారంబుగాఁ గైలాసంబున కేఁగుట §§§
ఉ. ఆజతనూజ వింటివె దశాననుఁ డిట్టులఁ బుష్పకంబుతో
నాజి జయంబునున్ బొదసి యాపలఁ బోవుచుఁ జూచె ముందటన్
రాజత శైలమున్ దపనరథ్యనిరోధకృదత్యుదగ్రతా
రాజిత సాలమున్ దటచరత్కరిసింహతరక్షుకోలమున్. 60
తే. చూచియచ్చోటివింతలుచూడవలసి, బలసియిరువంకలనుదైత్యభటులుగొలువఁ
జెలువ మొలికెడునమ్మహాశిఖర మెక్కి, యక్కడఁజరింపమారీచుఁ డతనికనియె.
మ. కలధౌతాచలదీధితిప్రచయమో గంగా ప్రవాహాంతరో
జ్వలడిండీరనికాయమో శబరయోషాధన్వముక్తాస్త్రని
ర్దళితప్రాంచితచామరవ్రజమొ నా రంజిల్లు రెండాఱుచే
తులఱేఁ డుండినఱెల్లుటిల్లుఁ గనుమా దోషాచరగ్రామణీ. 62
సీ. శైలజాసహచరోజ్జ్వలరుద్రకన్యకాచరణలాక్షా పంక మొరసినదియొ
యిది నగం బనుపేర నింపొందుఁ గావున విపులంబుగాఁ బల్లవించినదియొ
తనగిరీశత్వ మందఱకుఁ దోప నభంబు మించు పెంజడలు వహించినదియొ
సానుభాగచరద్భుజంగభోగమణీసమంచితప్రభ నాక్రమించినదియొ
తే. లేక ధననాథు గెలిచి త్రిలోకవిజయ, వాంఛ నరుదెంచు దేవరవారిదోఃప్ర,
తాప మిట నుండినదియొనాఁ దరుణతరణి, కిరణగతిగైరికముల నిగ్గిరి వెలింగె.
చ. తిరముగ జై త్రయాత్ర చనుదెంచిన నిన్ గని యీకుభృత్తు ని
ర్ఝరములఁ బాద్య మిచ్చిరవిసంజ్వలితార్కమణీవిభాపరం
పరల నివాళి సేసి వనభవ్యశుకాదివిహంగమోక్తివై
ఖరి నుతి సల్పెడిన్ రజతకాంతుల నెల్లదనంబుఁ జూపుచున్ 64
సీ. చిగురుజొంపముల రంజిల్లె నీయెలదోఁట చెలువ పర్ణకు వేడ్కసేయు నేమొ
విరిగల్వవిరులచే వెలసె నిక్కొల నిందుఁ జంద్రజూటుఁడు గేళి సల్పు నేమొ
సంతానకుసుమవాసన లూనె నిక్కోన దేవకన్యకలు వర్తింతు రేమొ
పువ్వుఁబుప్పొడిదుమ్ము పొదలె నిప్పొదలలో విద్ధాళు లెపుడు వసించు నేమొ
తే. తనరె బహుబిల్వరుద్రాక్షుతరువు లిచటఁ
బ్రమథవర్యుల కివి రచ్చపట్టులేమొ
యనుచు మారీచుఁ డెఱిఁగింప నచట నచట
నయ్యసుర భర్త విహరించునవసరమున. 65
సీ. చిమ్మచీకటి గ్రమ్ముక్రొమ్మావిగుమి నల్లి బిల్లి రుద్రాక్షపందిళ్లనడుమ
వడిఁ బాఱువిరితేనెవాఁకలదరులవెంబడి ఘుమ్ము మనుమృగమదము తావిఁ
బొలుపొందువిరవారిపొదలలోఁ గుప్పలు వడుసురపొన్నపుప్పొడిదుమార
మొలసిన లేఁదెమ్మెరలయెమ్మె గనుకమ్మ బంగరుఁబూఁదోఁటపజ్జ సమరు
తే. మరకతనిబద్ధభూముల మలయు రేవె, లుంగుఱాతిన్నియలఁజె న్నెసంగుపొగడ
మ్రావినీడల దగునొక్కకోనలోనఁ, బుష్పకవిమాన మటు సాగి పోక నిలిచె.
చ. నిలిచినఁ బంక్తి కంధరుండు నివ్వెఱఁ గంది యిదేల యిచ్చటన్
నిలిచెను శక్తుఁడే యొకఁడు నిల్పఁగ దీనికి దుర్గమస్థలం
బులు గలవోటు చూడుఁ డటఁ బొండని మంత్రులఁ బంప వార ల
క్కెలఁకుల సంచరించి పరికించియు హేతువు గాన కయ్యెడన్. 67
మ.అలమారీచుఁడు దేవ వింటె యిది యక్షాధ్యక్షునిన్ గాని య
న్యులఁ బైసూని చరింపదో యతఁడు క్రోధోద్రేకి యై నిల్పెనో
తెలియుం డం చనునంతలో వికటుఁ డై దీప్తాస్యుఁడై కుబ్జుఁ డై
బలధుర్యం డగునంది యందుఁ గని యప్పౌలస్త్యుతో నిట్లనున్ 68
చ. నిలిచె విమాన మంచు రజనీచర నివ్వెఱఁ గంద నేల యీ
నెలవున దేవితో హరుఁడు నేఁడు విహారము సేయుచున్న వాఁ
డలగరుడోరగామరవియచ్చరు లోడుదు రీడఁ జూడ నిం
దుల కరుదెంచి నీ బలముతోఁ జెడి పోక తొలంగు నావుడున్ 69
చ. పటపట పండ్లు గీటుకొని పంక్తిముఖాసురభర్త పుష్పకం
బటు డిగి శంభుఁ డెవ్వఁ డహహా నను నిల్పెడునంత వచ్చెనే
యిట నిను నీశివున్ నిలువనిచ్చిన నట్టుల కాదె యంచుఁ ద
త్తటముననుండి యగ్గిరివతంసముక్రిందికి వచ్చి చెచ్చెరన్.
క. ఉరుశూలముఁ గొని రెండవ, హరునివలెను దీప్తవిగ్రహము మీఱఁగ వా
నరముఖ మొందిన నందిని, బరికించి దశాననుండు పకపక నగియెన్. 71
తే. ఇవ్విధంబునఁ దనుఁ జూచి నవ్వుచున్న, యతివిమూఢుని దశకంఠు నట్టె చూచి
యపరశివుఁ డైననందీశుఁ డాగ్రహము వ, హించి కటతట మదరఁగా నిట్టులనియె.
§§§ నందికేశ్వరుఁడు దశగ్రీవుని శపించుట §§§
చ. కపివదనుండ నైనననుఁ గన్గొని నీవవమానదృష్టితో
నిపుడు హసించినాఁడ విట నీదృశవక్త్రముఖుల్ నఖాయుధుల్
కపు లిఁక నీకులం బడపఁ గల్గెద రంతటఁ గండగర్వమున్
దపమునఁ బుట్టుబెట్టిదముఁ దామె యడంగెడు రాక్షసాధమా. 73
శా. శాపోక్తుల్ పచరింప కున్న నెదిరించన్ రాదె యంటేని నిం
దాపారంపరి మున్నుగా మృతుఁడవే నా కిట్టిపీనుంగుపై
నేపున్ జూపఁగ నర్హ మౌనె యిదిగా కీచేయుపాపంబుచే
నాపద్వార్థి మునింగిపోవఁ గల వేలా యింక నిన్ నొంచఁగన్. 74
క. అని యానంది శపించిన, విని యానందించి సురలు విరులు గురిసి ర
వ్వినువీథి దేవదుందుభు, లును మొరసెన్ బెరసె సుఖము లోకము లెల్లన్. 75
ఉ. అంత దశాననుండును మదాంధుఁడు గావున శప్తుఁ డయ్యు నొ
క్కింతయుఁ జింత లేక మఱి హెచ్చినభీషణరోషవహ్ని నే
త్రాంతరశోణకాంతులు బయల్పఱుపన్ గలధౌతశైలరా
డంతికవర్తి యై పలికె నగ్రమునన్ నిలుచున్న నందితోన్. 76
ఉ. పెక్కులు ప్రేల నిచ్చినను బ్రేలవె నీపశుబుద్ధి మాటలన్
దక్కునె చక్కఁగా నెదిరిఁ దన్ను నెఱుంగ వటుండు పుష్పకం
బిక్కడ నాఁగి మీయధిపుఁ డింక సుఖంబున నుండుఁ గాని లే
యెక్కిన వెండికొండ నిదె యేఁ బెకలించి రజంబు సేసెదన్. 77
§§§ దశగ్రీవుఁడు కైలాసము నెత్తఁగా శివుఁడు పాదాంగుష్ఠముచే నదుముట §§§
వ. అని దురాగ్రహంబునన్ బలికి యద్దశగ్రీవుండు రవిగ్రహంబు నొరయునుదగ్రవిగ్రహంబుతో నమ్మహాగ్రావంబు శిఖరాగ్రం బనర్గళలీలన్ బట్టి యిట్టట్టుఁ గద
గీర్వాణగణప్రాణనిర్వాణప్రవీణతాధూర్వహ దుర్వార గర్వాకరదర్వీకరభీకరంబు లైన వింశతికరంబులు సారించి హుంకరించి యహంకరించి పదిమొగంబులు జేగుఱింప వేగురించుసాహసోత్సాహసంపదలతో నిజభుజాంగదంబు లొండొంటితో నొరయ నిజాట్టహాసంబున గుహాకుహరంబులు మార్మొరయ నిజవిలోకనంబుల మిడుంగుఱులు గురియ నిజదంతసంఘర్షణంబున దిగ్గజంబులు సెవుడు వొరయ నిజప్రతాపంబు మెఱయ నిర్నిమిత్త మీమహీభృత్తు హత్తి మత్తవృత్తిన్ జూప నేల యని తద్బలంబులు తనపై నురవడించెనో యన శరభసింహశార్దూలమదేభ ప్రముఖవనజంతువులు క్రేళ్లుఱక మహోరగంబులు సరగ నరుగఁ గూడక చూడ గొప్పలగు పిప్పలాదితరువులన్ జుట్టుకొని బుసకొట్టుచు నవియునున్ జాఁపకట్టు వడ నొడళ్లు నలఁగి పడగ లవిసి సమసినఁ దదగ్రజాగ్రన్మణులు ఫణిభూషణున కద్దురవస్థ నుడువన్ బరువులిడుచున్న వడువున దవ్వుల మిడిసిపడ గడగడ వడంకుచు నుడుగనిజడుపునన్ దముఁ గౌఁగిలించుచెంచుమించుఁబోడులకౌగిళ్ల ననంగి పెనంగి వారియనుంగుమగ లడుగు నోపఁ గూడక దబ్బునం గూలి నెత్తంబుపట్టులఁ బొర్లిగింతలు వెట్ట నట్టివింతలుగని యెట్టివింతలుపుట్టెనని రచ్చపట్టుచెట్టుల క్రీనీడలన్ గ్రీడలు సాలించి యన్నెలవున నిలువ లేక వేల్పుఁగలువకంటులు క్రొమ్ముడులు వీడఁ గీలుగంటు లంసంబులపై జీరులాడఁ దళుకుజెక్కులు సెమరింపఁ గులుకుగుబ్బలు పులకింప నెన్నొసళ్ల ముంగురులు నెఱయఁ జిగురుఁగెమ్మోవుల నిట్టూర్పులు దొరయ నిజాధిపభుజాస్తంభంబు లూతఁగొని తద్రయంబునన్ జెంగటి విమానంబు లెక్కికొని తమ్ముఁ గ్రమ్మఱన్ బుట్టినవారిఁగాఁ దలంప నిలింప హృదయంబు గలంపన్ జాలునారభటులతో వీరభటు లిరువంకల నిలిచి పెక్కుచందంబుల నభినందింప నందికేశ్వర గణేశ్వర చండికేశ్వర ప్రముఖ మహాప్రమథగణేశ్వరులు శరశరాసనపట్టినప్రాసకరవాలభిందిపాలతోమరముద్గరగదాకుంతక్షురికాదిసాధనంబులు గైకొని సర్వజ్ఞునియనుజ్ఞ వడయుటకై యతనియగ్రభాగంబున నలబలంబులు సేయుచు నిలువుఁ గొలువు సేయఁ బార్వతీపరమేశ్వర క్రీడోచిత మణిఖచిత సౌధప్రాకార గృహకుడ్య గోపురతోరణస్తంభాదులు బ్రద్దలు వాఱి తద్దయుఁ బ్రకంపనంబు వహింప సహింప రానిదరంబునన్ గరంబులు పిసికుకొనుచుఁ బదకంజమంజీరసంజాతశింజారవంబులు సెలంగ
నలుగడలన్ దిరుగుచు రుద్రకన్యక లనన్యశరణ్య లయి దైన్యంబు నొంద నరవిందబాంధవాదిగ్రహంబులు త్రోవలు దొలంగ నింద్రాదిలోకపాలకలోకంబులు హాహాకారంబులతో బట్టబయల నిలిచి చూచుటకు బెట్టులికి యిట్టలం బగుమొగుళ్ల తెట్టువలలో మఱుఁగుపడి యాకట్టిడిపొట్టక్రొవ్వున నిట్టిబెట్టిదంబు గావింప గట్టువిల్లు వట్టినదిట్ట యెట్టు మట్టుపెట్ట కున్నవాఁడో యని యొక ళ్ళొకళ్లతోఁ బలుకుచుఁ గనుంగొనఁ
బ్రత్యంతపర్వతంబు లున్మూలంబు లై పొడ వడంగఁ బెద్ద పెద్ద గండోపలంబులు పై పై నుండి
పెళపెళమనుచప్పుళ్లతో డుల్లి చఱులనురలి పడన్ బడలు వడక బాతాళంబులోఁతుగనుపాఁ తగలించి
పుండరీకంబుఁ బెకలించు మదవేదండప్రకాండంబుడంబున ఝరీమండలహారిపరంపరలు నలువంకలఁ దొరంగ
ఖనిస్థలీవినిర్గతనీలమణీరమణీయమధుకరంబులు నలుగడలఁ జెదరఁ గనకవకుళకేతకీకురంటకాశోకమధూక
కేసరప్రముఖభాసురకుసుమవిసృమరపరాగవిసరంబు నలుదెసల నొరసికొన నవ్వెండికొండ పెకలించి కందుక
క్రీడ గావింపగన్ గడంగె నయ్యవసరంబున. 78
మ. అసురాధీశకరావధూతకలధౌతాద్రిన్ బదం బూన లే
క సఖుల్ గొల్వ వనంబులో మెలఁగునగ్గౌరీసరోజాక్షి మే
ను సెమర్పన్ దనుమధ్యమున్ వడఁక నాందోళింప నేత్రప్రభల్
వెస నేతెంచి కవుంగిలించుకొనియెన్ విభ్రాంతయై శంభునిన్ . 79
వ. ఇవ్విధంబున. 80
ఉ. బంగరుఁదళ్కుజెక్కులను బంజులకమ్మలడాలు చిందుద్రొ
క్కంగ మెఱుంగు జన్నుగవకంచుకపున్ముడి వీడఁగా హఠా
లింగసుఖం బొసంగినచెలిం గవుఁగింటనె యుంచి యల్గఁ డ
య్యెం గఱకంఠుఁ డద్రి నతఁ డెత్తఁగఁ గాముకు లెగ్గు లెంతురే. 81
శా. శంభుం డద్రికుమారికాస్ఫురదురోజద్వంద్వశుంభత్పరీ
రంభం బెట్టుడుపంగ వచ్చు నయినన్ గ్రౌర్యంబు దీఱన్ భుజా
రంభం బీగతిఁ జెంది యెంతసుఖ మౌరా నెమ్మదిన్ వీనియా
స్తంభోజ్జృంభ మొకింత మాన్పి పిదపన్ సౌహార్దమున్ జూపెదన్ . 82
క. అని తలఁచి లేఁతనగ వా, ననమునఁ దగ శంభుఁ డాసనము డిగ్గక మున్
దన వామపదాంగుష్ఠం, బున నదిమె దశాస్యుహస్తములు క్రిందుపడన్ 83
తే. ఇటుల యదిమిన భుజశౌర్య మెడలి బడలి, యడలి యొడలి మదోద్వృత్తి సడలి శూలి
కాలిపెనువ్రేలు దెమలించి కరము లెత్తు, కొన సమర్థత లేక రజోవిభుండు. 84
మ. కులశైలంబులపెన్ బిలంబులు బదుల్ ఘోషింప శేషాహి మూ
ర్ఛిల భూచక్రము దిర్దిరన్ దిరగ జేజేపెద్ద భీతిల్లఁ జు
క్కలు రాలన్ దివి పెల్లగిల్ల సుర లాకంపింప నంభోనిధు
ల్గలఁగన్ దిక్తటు లొడ్డగిల్లఁ బదినోళ్ళన్ బెట్టు వాపోవఁగన్. 85
క. తలఁచిరి మనుజు లకాండ, ప్రళయం బిది యనుచు దిగులుపడి రమరేంద్రా
దులు యక్షసిద్ధసాధ్యులు, కలఁగిరి తొలఁగిరి పదంబు గ్రహరాణ్ముఖ్యుల్ . 86
శా. ఈరీతిన్ జగముల్ దలంకఁగను వేయేం డ్లార్తుఁడై కూయఁగా
నారక్షోవిభుదైన్యపాటుఁ గని దైత్యశ్రేణి కన్నీరు ము
న్నీరై పాఱఁగ నేమొనర్తు మనుచున్ నిర్విణ్ణతన్ జెంద న
మ్మారీచాదికు లాతనిన్ గని యసామాన్యప్రబోధంబునన్ . 87
తే. పలికి రవధారు దైతేయపట్టభద్ర, భద్రగజచర్మధారిపై భక్తి యుంచి
యంచితోక్తుల నతని నుతించితేని, నీవిరోధంబు నెడఁబావు నీక్షణమున. 88.
క. హరుఁ డున్నతకరుణానిధి, శర ణన్నఁ బరిగ్రహించు జగతి నతనికిన్
బురు డున్నదె యజకనకాం, బరు లెన్నఁగ లేరు తత్ప్రభావం బనినన్. 89.
§§§ దశగ్రీవుండు శివుని నుతించి యతనివలన వరములు లోనైనవి వడయుట §§§
శా. ఆపన్నుం డగు పంక్తికంఠుఁ డిది యౌనంచున్ లలాటేక్షణ
శ్రీపాదాంబుజముల్ మనోంబుజమునన్ జింతింపుచున్ వేదవి
ద్యాపాండిత్యము సర్వశాస్త్రకుశలత్వంబున్ మహాసాహితీ
నైపుణ్యంబును గానుపింపఁ బొగడెన్ గంగోర్మితుంగార్భటిన్. 90.
శా. ఆస్తోత్రంబున కామనోద్రఢిమ కాధ్యానాప్తి కాయీశ్వరుం
డస్తోకప్రియ మావహించి పెనువ్రే లావేళఁ బై నెత్తినన్
హస్తంబుల్ వెడలంగఁ బాపికొని దైత్యస్వామి ఫాలస్థల
న్యస్తప్రాంజలి యై నుతింపఁ దొడఁగెన్ గంభీరవాగ్గుంభనన్ . 91
రగడ.
జయజయ శంకర సాధువశంకర, జయజయ రిపుభటచయనాశంకర
శరణు నిరంజన సజ్జనరంజన, శరణు ప్రభంజనజవగజభంజన
పాహి పురాహవబంధురవిక్రమ, పాహి యవిద్యాసంకరవిక్రమ
యచ్చుగ నినుఁ దెలియవు తొలిచదువులు, మెచ్చిన నిత్తువు మేలగుపదవులు
నీ కెవ్వరిపై నిలువదు కోపము, లోకుల కెంచఁ దెలుపుదు ప్రతాపము
పరుఁడు స్వజనుఁ డనుభావవిభేదముఁ, బొరయదు నీమది పూర్ణామోదం
బభవుని భవుని న్నమితదయాపరు, నభినుతింప బ్రహ్మాదులు నోపరు
ఖలుఁడ మదాంధుఁడఁ గలుషోత్కృష్టుఁడ, జలచిత్తుఁడ గడుజడుఁడ నికృష్ణుఁడ
నే మిముఁ బొగడఁగ నెంతటివాఁడను, స్వామీ మద మఱి శర ణన్నాఁడను
నీదాసుఁడ నిక నేరము లెంచకు, నాదుర్వృత్తి మనంబున నుంచకు
మెఱుఁగక చేసితి నిపు డపచారము, శరణన్నను గడ సనదె విచారము
వలసితి నీసేవకులమహత్త్వము, దెలిసితి నియ్యెడ దేవరసత్త్వము
నీకను దెఱచిన నెగడును జగములు, నీకను మూసిన నిలువవు జగములు
యిట్టినీకు సరి యే నని హెచ్చితిఁ, బొట్టక్రొవ్వు సనఁ బొగడఁగ వచ్చితి
నాగుణ మెంచకు ననుఁ బాలింపుము, నీగుణ మెంచెద నీ వాలింపుము. 92
చ. అని తనుఁ బ్రస్తుతించినదశాననుఁ జూచి పురారి నవ్వుచున్
దనుజవరేణ్య నీ స్తుతికిఁ దద్దయు మెచ్చితి ధైర్యశాలి వౌ
దనుమతి యిచ్చితిన్ జను ప్రియం బగుచోటికి నీభుజాబలం
బనితరసాధ్య మంచు విని యారయ నిల్పితి నింతె యియ్యెడన్. 93
తే. మత్పదాంగుష్ఠపరిపీడ్యమానరజత, పర్వతము క్రిందఁ జేతులు పడినయపుడు
జగము లద్రువ విరావంబు సలిపి తందు, వలన రావణుఁడను పేర వెలయు మనిన.
ఉ. ఆదశకంఠుఁ డీశ్వరున కానతుఁ డై శివ నన్నుఁ బ్రోవ నా
హ్లాదము గల్గెనేని నిసుమంతకొఱంతయు లేనియాయువున్
నీ దగుచంద్రహాసమును నెమ్మి నొసంగు మటన్న శంభుఁ డ
క్కైదువు నిచ్చి పిమ్మట నఖండతరాయువు నిచ్చి యి ట్లనున్. 95
మ. దితిజాధీశ్వర నీవు గోరిన క్రియన్ దీర్ఘాయువున్ నీకు ని
చ్చితి నీ క్రొవ్వున నీతిఁ జేకొనక దుశ్శీలుండవై మ మ్మనా
దృతినొందించితి వేని మావరము మమ్మే చేరుఁ బొమ్మన్నచో
నతఁ డాశూలికి మ్రొక్కి వీడ్కొని విమానారూఢుడై యుబ్బుచున్ . 96
క. తనపరివారము గొల్వఁగఁ, జనియెన్ రజతాద్రి డిగ్గి స్వచ్ఛందగతిన్
మనుజేశ్వర యని కుంభజుఁ, డినకులునకుఁ దెల్పి మఱియు ని ట్లని పలికెన్. 97
§§§ రావణుని చర్యలు §§§
మ. ఇనవంశోత్తమ వింటె పంక్తివదనుం డీలాగు కైలాసవా
సునిచే మన్ననఁ గాంచి పొంగుచుఁ బ్రహస్తుండాది యౌ సైనికుల్
దనుఁ గొల్వన్ జని హేమకూటహిమవత్ప్రాంతంబులన్ గంధమా
దననీలాచలపారియాత్రములమీఁదన్ గ్రీడ సల్పెన్ రహిన్. 98
వ. మఱియును. 99
సీ. చరియించు నొకవేళఁ జంబూనదీతీరసౌవర్ణవాలుకాస్థలములందు
విహరించు నొకపూట వేల్పురాతోఁటల బొదలుగొజ్జెగపూవుఁబొదలయందుఁ
గ్రీడించు నొకతఱిఁ గేసరశ్వేతాంజనాద్యద్రిరాడధిత్యకలయందు
నలరు నొక్కెడఁ గేళి నరుణోదమానసప్రముఖదివ్యసరోవరములయందు
తే. నన్నెలవులందు మెలఁగెడునమరఖచర, యక్షకిన్నరసిద్ధవిద్యాధరాప్స
రోభుజంగాదికులు మహాక్షోభ మొంది, తన్నుఁ గనుఁగొని పాఱ నద్దశముఖుండు.
సీ. పట్టణం బన రాదు కట్టాయితంబు గా నట్టె ముట్టడి చేసి చుట్టు విడియు
బలవంతుఁ డనరాదు బలియుఁ డై యెంతదవ్వుల నున్న వడి నేఁగి గెలిచి వచ్చు
సురజాతి యన రాదు కర మల్గి యెట్టు సన్నఁ జననీక శస్త్రాస్త్రసమితి నొంచు
ధరణీశుఁ డన రాదు తనకు నోడితి నన్నదాఁక నీరసమున వీఁకఁ జూపుఁ
తే. బాయవునెలంత యనరాదు పాపమునకు, భయపడక యెట్టులైనను బట్టికలయు
నర్హవస్తువులటఁ గల వనఁగరాదు, దుడుకుమైఁ జొచ్చి కొనితెచ్చు దుష్టుఁ డతఁడు.
——♦♦ వేదవతిని జూచి రావణుండు మోహించుట ♦♦——
వ. ఇచ్చెలువున్ దనయిచ్చకు వచ్చినమచ్చున నచ్చటచ్చట నచ్చపలుండునిచ్చలు
మెలంగుచు నొక్కనాడు హిమవత్పర్వతంబునకు నుత్తరదిగ్భాగంబున నొక్క
సుందరోద్యానంబు సందర్శించి యచ్చట. 102
సీ. ఘనమండలము సుధాకరమండలము నిండునటుల మోమునజటాచ్ఛటలు నెఱయ
వలఁజక్కవలు చిక్కువల నొప్ప మృదువల్కలంబునఁ గుచలికుచంబు లొరయ
బెళుకుఁజూపుల లేడి గెలిచి కై కొనియెనో నాఁ గ్రిందఁ గృష్ణాజినంబు వెలయ
నఖపాళిబెడఁగుమాన్పకు మంచు నుడులు గై వ్రాలె నా స్ఫటికాక్షమాలికదగఁ
తే. గౌసుమరజంబు దొరసినకల్పలతిక , బాగున విభూతి చేత మైతీఁగ వెలుఁగ
నొంటి గిరికన్యవలెఁ దపం బున్నతపసి, కన్నెనొక్కతెఁ జూచి రాక్షసవిభుండు.
తే. చూచి యాచెల్వచెల్వంబులోచనముల, కబ్బురంబును గాంక్షయు నుబ్బొనర్పఁ
బుష్పకము డిగ్గి సరభసంబుగఁ దదగ్ర, భాగమున నిల్చి పలికెనప్పంక్తిముఖుడు.
సీ. నీకులం బెయ్యది నీనామ మే మందు రెవ్వరి దానవే యిందువదన
కలికి లేఁబ్రాయంబుఁ గానపాల్ గావించి యేల కృశించెదే యిగురుఁబోడి
నీప్రాణనాథుఁ డై నిను నేలుభాగ్యమెవ్వానికిఁ గల్గెనే వన్నెలాఁడి
యేతపం బొనరించి యీ చెల్వుఁగంటివో యింకఁ దపంబేల యేణనయన
తే. కాకఁ జెందినపసిఁడిసలాక వంటి, తనువు వెండియుఁ గళఁ గాంచు నని తలంచి
చూపఱులయిచ్చ వేమఱుదాప ముంచె, దేమి నీచర్య లెఱిఁగింపవే లతాంగి.
ఉ. నీబిగిగుబ్బచన్నులకు నీ నెఱిపెన్నెఱు లున్నఠీవికిన్
నీబటువుంబిఱుందులకు నీయెలప్రాయపుఁగల్మి కింతిరో
యీబసుమంబు కప్పురమె యీతిరివేణియె పట్టుజీర లే
యీబిఱు సైనవల్కలము లీతప మిష్టమనోజభోగమే. 106
సీ. అణుమధ్య నీమధ్య మణిమంబు వహియించు మహికటి నీకటి మహిమ గాంచు
గిరికుచ నీకుచగిరు లొందు గరిమంబు నలినాక్షి నీఱెప్పలలరు లఘిమ
ఘన వేణి నీ వేణి మను ఘనశ్రీప్రాప్తి నతివ నీమెయి ప్రకామ్యతకు నెక్కు
నంగన నీభర్త యఖిలేశతకుఁ దగుఁ జెలి నీకు వశి యగుఁ జెఱకువిల్తు
తే. డిన్ని వైభవములు గల్గి యిగురుఁబోడి, బేలతనమున నీతపం బేలచేయఁ
గొదవయొదవిన దిది యంచు మృదులఫణితిఁ, జెవులకీయెడఁ బండువుసేయుమనిన.107
క. ఆ నెలతయు నప్పలుకులు, వీనుల కెడఁ జేసి వాని విశ్రవుసుతుఁ గాఁ
దా నెఱిఁగి హీనుఁడనక య, హీనత నాతిథ్య మొసఁగి యి ట్లని పలికెన్.108
మ. దనుజాధీశ కుశధ్వజుం డనుతపోధన్యుండు ము న్నొప్పు నా
యన వేదంబు పఠించువేళ నుదయంబై నేను వాపోవఁగా
ననుఁ బ్రేమంబునఁ జూచి వేదవతి యన్నామంబుఁ గావించి పెం
చిన లేజవ్వన ముప్పతిల్లుటయు జేజేలు మునుల్ రాజులున్ 109
క. నను వలచిన ధిషణసుతుం, గని వేఁడిన హరికి నిత్తుఁ గాని యొరున కి
వ్వనితామణి నీ నని యె, వ్వని కైన నొసంగఁ డడుగవచ్చిన వేళన్. 110
వ. ఇవ్విధంబున. 111
శా. ప్రత్యాఖ్యానముఁ జెంది యందఱుఁ జనన్ బాపాత్ముఁ డౌదంభుఁడన్
దైత్యుం డొక్కడు వచ్చి మజ్జనకునిన్ దా వేఁడి యీ నన్న చో
నత్యంత క్రుధఁ బూని ఖడ్గమున నిద్రాసక్తు ఖండించి యా
హత్యన్ వాడు నశించె నత్తపసియిల్లా లగ్నిఁ జొచ్చెన్ వెతన్. 112
తే. తల్లియును దండ్రియును జన్నఁ దనయభాగ్య
మునకుఁ గలఁగియుఁ గలఁగక పూర్ణ నిష్ఠ
జనకుని ప్రతిజ్ఞఁ గడతేర్తునని తలంచి
వెన్నునిగుఱించి యిటఁ దప మున్నదాన. 113
క. కంటివ యిచ్చటివింతలు, వింటివ నాపూర్వకథ సవిస్తరముగఁ జే
కొంటివ యాతిథ్యము దడ, వుంటివ యిటఁ జనుము రాక్షసో త్తమ యనినన్".
చ. తన కిది దక్కె నంచు బ్రమదంబునఁ బం క్తి ముఖుండు మీనకే
తునిచిగురాకుబాఁకు మదిఁ దూఱినఁ దాలిమి మారి చేరఁగాఁ
జని యిది యేమి వెఱ్ఱి యెలజవ్వనమున్ బొలిపోవ విష్ణుఁ డం
చునె కలకాలమున్ దపసిచొప్పున దాఁటెదు వృద్ధ కాంతవై . 115
ఉ. వెన్నున కిత్తునంచు బలువేఁదుఱు సేకొని తండ్రి యీల్గుటన్
గన్నులఁ జూచియున్ హరియె కావలె నంచుఁ దపించె దూరకే
కన్నెఱికంబు కాఱడవిఁ గాచిన వెన్నెల సేసి యయ్యయో
నిన్నును ముంచె నీజనకుని గుదియించిన వెఱ్ఱి యియ్యెడన్ . 116
మ. హరి తానే బలవంతుఁ డైన మును మీ యయ్యన్ విరోధించి యొ
క్కరుఁ డుగ్రాసి వధింప నడ్డపడి దోర్గర్వంబు గాన్పించెనే
హరియన్నామము గప్పకున్ బెరయు నేలా యీవృధాభ్రాంతి యిం
తిరొ యింక ననుఁ బొందు మే లగు వయస్తేజః ప్రభావాఢ్యుడన్. 117
చ. అన విని కర్ణముల్ చిగురుటాకులఁ గేరెడు కేలుదోయిన
వ్వనజదళాక్షి మూసికొని వాని ననాదరదృష్టి జూచి యీ
చెనఁటివివాదముల్ విడువు శ్రీహరి నేఖలుఁ డైన నింద స
ల్పునె తగు బ్రహ్మవంశమునఁ బుట్టియు మూర్ఖత మాన వక్కటా 118
సీ. అన్వయంబుల కెల్ల నాది కారణభూతుఁ డగుతాతఁ గనినాతఁ డతఁడె కాఁడె
జపతపోమఖముఖాచారసారఫలంబు లరసి యిచ్చు ప్రదాత యతఁడె కాఁడె
నీయందు నాయందు నిఖిలాత్మలందంతరాత్మయై కనునాత్మ యతఁడె కాఁడె
సముఁడయ్యు దుష్టశిక్షయు శిష్టరక్షయుఁ బ్రతియుగంబునఁ జేయునతఁడె కాఁడె
తే. యాగమాంతరహాస్యార్ధ మతఁడె కాఁడె
యన్నిజగముల కధినాథుఁ డతఁడె కాఁడె
యట్టిహరి నెంచ నేరక హంకరించి
నిర్నిమిత్తంబ నిందింప నీకుఁ దగునె. 119
మ. పలుకుల్ వేయును నేల లెస్స వినుమా పౌలస్త్య నామేను నా
యెలప్రాయంబును నామనోగతులు నాయిచ్చాభిమానంబు లా
జలరుడ్ధారికె ధారవోసినవి దుష్కాంక్షల్ విసర్జించి పె
ద్దలు వర్తించు పథంబునన్ మెలఁగు మద్దైవంబుతో డయ్యెడున్. 120
తే. అనిపలికి యందు నిలక భయంబు దొలఁకఁ, గలఁకఁ బిల్లికిఁ దొలఁగురాచిలుకపగిది
నావలికిఁ బోవఁ దేఁటులయావళికిని, నతనునిశరావళికిఁ దాళ కసుర గదిసి. 121
చ. చెలి నునుమోవిపానకముచే వడ దేఱక మోము మోమునన్
బలుమఱుఁజేర్చి ముద్దిడక బాహులతాపరిబద్దుఁ జేసి న
న్నలమియుఁ గౌఁగిలింపక రహస్యముగా బహుబంధవైఖరుల్
దెలుపక పోవ నేల యని తెంపున వేణికఁ బట్టియీడ్చినన్ 122
చ. కలఁక దొలంగ వేదవతి గ్రక్కున బెత్తిలి యెత్తి వ్రేయుడున్
మలచపువేణి నట్టనడుమన్ దెగి చేతికిఁ దున్క చిక్కె నం
దుల కళు కొంది కైకసిసుతుం డిది దీనితపఃప్రభావ మం
చలవడి యున్న నచ్చెలియు నవ్వలికిన్ జని క్రోధమూర్తియై. 123
మ. ప్రళయాగ్నిజ్వలితేక్షణప్రభల నప్పౌలస్త్యునిన్ గాల్చున
ట్టుల వీక్షించి దురాత్మ నిన్నపుడె దుష్టుం డంచుఁ జింతించియున్
దెలివిన్ విశ్రవసుం దలంచుకొని యాతిథ్యంబు గావించి మా
ర్పలుకుల్ వల్కిన నింతయున్ గలిగె నోర్వన్ గూడునే యిం కిటన్. 124
శా. ఘోరస్ఫారమదీయోపదహనక్రూరార్చులన్ నీఱుగా
నీరూపంబు దహింప కోర్చితిఁ దపోనిష్టార్థలోభంబు చే
నోరీ నీ విపు డంటుకొన్న మెయి నేనొల్లన్ జ్వలద్వహ్నిలో
నీ ఱైనిన్ దునిమించుపూనికను జన్మింతున్ ధరన్ గ్రమ్మఱన్. 125
తే. అని మహోగ్రతఁ బలికి క్రోధాగ్నితోడ
నచట యోగాగ్నియును మండునటుల చేసి
యయ్యెదుట నిల్చి శ్రీహరి నాత్మ నునిచి
యేపు సెడి దైత్యుఁడును విన నిట్టు లనియె. 126
ఉ. ఏను నిజంబుగా హరిపయిన్ మది గల్గినదాన నేని నా
పై నలినాక్షుఁ డాత్మ యిడి పత్నిఁగఁ జేకొనుమాట తథ్య మౌ
నేని నయోనిజత్వమున నిద్ధర బుట్టి దశాస్యుఁ బుత్త్ర మి
త్త్రానుజయుక్తిఁ ద్రుంప నెప మయ్యెదఁ గా కని వహ్నిఁ జొచ్చినన్. 127
క. వేదవతిమాట నిజమగు, వేదమువలె ననుచు మ్రోసె వినువీథి మహా
మోదమునఁ గుసుమవర్షము, లాదిత్యులు గురిసి రప్పు డవనీనాథా. 128
తే. యతిసుతయు నిట్లు కైకసీసుతకృతావ,మానపవమానజాజ్వల్యమానకోప
దహనసంయోగయోగాగ్నిదగ్ధ యై వి,దగ్ధతాస్నిగ్ధదైవయత్నంబుకతన. 129
———♦§♦§♦ వేదవతియే సీత యైనదని రామున కగస్త్యుఁడు చెప్పుట ♦§♦§♦———
సీ. తనపద్మవాసినీత్వముఁ జూపువహి లంకఁ దోయజాంతరమునఁ దొల్తఁ బుట్టె
నిదె నీకు మిత్తి నై యేఁగుదెంచితి నన్నగతిఁ బంక్తిముకునకే కానఁబడియె
నతడు పెట్టియఁ బెట్టి యభ్ధి వేయించిన నబ్ధిఁకిఁ బుత్త్రి యౌ టచటఁ దెల్పె
బహుళోర్మివశమున బయలు దేఱి విదేహరత్నగర్భాగర్భరత్న మయ్యె
తే. జనకజననాయకుఁడు యాగశాలఁ గట్టు, చోట దున్నింపఁ నాఁగేటిసరసఁ దోఁచి
సీత యను పేరు వహియించి చెలువుగాంచి, ప్రేమశ్రీహరివగునిన్నుఁ బెండ్లియాడె. 130
తే. శంఖచక్రగదాఖడ్గశార్ఙ్గగరుడ, వాహనాదులు మాని యిక్ష్వాకుకులము
ఖ్యాతి గైకొన మానవాకార మూని, నట్టి ని న్నాశ్రయింతుఁ బట్టాభిరామ. 131
క. సాకేతనగరరాజము, వైకుంఠము నీవె హరివి వైదేహి రమా
కోకస్తని యీకపు లా, నాకపులు యథార్థ మిది ఘృణాగుణజలధీ. 132
క. కృతయుగమున వేదవతీ, సతి యై తప మొంది త్రేత జనకజ యై తా
మతిఁ దలఁచినటుల పట్టిన ప్రతినయు నెఱవేర్చెఁ దత్ప్రభావం బసదే.133
ఉ. నా విని రాముఁ డద్భుతమున్ గలశోద్భవుఁ జూచి యీసతిన్
రావణుఁ డట్లు దొల్లియును రాయిడి వెట్టెనె గ్రోధమూర్తి యై
పావకులోపలన్ బడిన బాలికఁ గన్గొని చేష్ట దక్కి వాఁ
డావల నెందుఁ బోయెఁ దెలియన్ వలయున్ వినిపింపుఁ డింపునన్ .134
మ. అనినన్ గ్రమ్మఱఁ గుంభజుం డనియె రామా యెయ్యెడన్ నీ వెఱుం
గని దేమున్నది యైన మాఘనత లోకంబుల్ ప్రశంసింప న
జ్ఞునిచందంబున నాలకించెదవు ప్రాజ్ఞుల్ నిచ్చ లోచూపులన్
గనునానందము నీవె కావె విను రక్షశ్చర్య లామీఁదటన్. 135
తే. అటుల వేదవతీకన్య యనలశిఖలఁ
జొచ్చి మ్రగ్గుటఁ జూచి యచ్చోటు వాసి
చపలుఁ డన్పంక్తిముకుఁడు పుష్పకవిమాన
మెక్కికొని భూమిఁ దిరుగుచు నొక్కనాఁడు. 136
———♦§♦§♦ మరుత్తుని యజ్ఞశాలకు వచ్చి రావణుఁడు యుద్ధము సేయుట ♦§♦§♦———
క. ఒకచో స్వాహాస్వరపూ, ర్వకవివిధాజ్యాహుతిప్రవర్ధితకీలా
ప్రకరానలధూమవ్యా,పక మగునొకసవనమండపము గనుఁగొనియెన్ 137
క. కని యెవ్వరిమఖమో క, న్గొని రమ్మని శుకుని సారణునిఁ బనుప హసా
దని పోయి తెలిసి క్రమ్మఱి, వినిపించిరి యిట్టు లనుచు వింశతిభుజుతోన్. 138
సీ. అవధారు జయరమాయత్తుఁ డైనమరుత్తసర్వంసహాభర్త సవనకర్త
యమరేజ్యుననుజుఁ డుగ్రమహత్త్వశాలి సంవర్తకుండు క్రతుప్రవర్తకుండు
బలభేదిశమనాంబుపతిముఖ్యు లనువేల్పు మన్నె వారు వహించుకొన్నవారు
కశ్యపాత్రివసిష్ఠకౌశికాదులు పుణ్యభాజనమ్ములు తత్సభాజనములు
తే. హైమమణికాంతిఁ దగుశాల యజ్ఞశాల
మెచ్చినాఁడు హరుం డర్థ మిచ్చినాఁడు
విప్రయోగంబు మునులచే సుప్రయోగ
మైన దని వారు దెల్పఁగా నాలకించి. 139
శా. ఆహా నాయెదుటన్ మఖం బొకటి సేయన్ బూనెనే వెఱ్ఱి యా
బాహాజన్ముఁడు విఘ్న మెట్లొదవదో భాగంబు లె ట్లందఁ గా
నూహన్ సేసిరొ చూత మీసుర లటంచు గ్రాహవక్రీడనో
త్సాహశ్రీ వహియించి యచ్చటికి దైత్యస్వామి యేతేరఁగన్. 140
సీ. నమ్మియున్నను గ్రమ్మి దొమ్మి సేయు నటంచు నెమ్మిరూపు సురాధినేత దాల్చె
నాఁకొన్న హరిఢాక చేకొన్నవాఁ డంచుఁ గాకవైఖరి దండకరుఁడు పూనె
మించినాఁ డితఁ డాక్రమించి యే మెంచునోయంచు నంచవిధంబుఁ గాంచె వరుణుఁ
డొండు చూడండు మూర్ఖుండు మండు నటంచుఁ దొండయై గండాఱియుండె ధనదుఁ
తే. డితరు లాతురు లై జాతిహీనరూప, ధారు లై పాసి రంత నద్దశముఖుండు
దారుణాకారుఁడై మరుత్తక్షితీంద్రు, కట్టెదుట వచ్చి నిలుచుండి యిట్టు లనియె.141
క. ఓయి మరుత్తణిక్షితివర, యే యుద్ధాపేక్ష నిచటి కేతెంచితి నా
తో యుద్ధమైనఁ జేయుము, వే యేటికి వెఱచితేని వెఱచితి ననుమా. 142
మ. నను నీరాజులలీలఁ జూడవల దన్నన్ నవ్వుతో నమ్మరు
త్తనృపాలాగ్రణి శత్రుకోటికులగోత్రప్రాభవాచారముల్
వినకే యుద్ధము సేయ నెవ్వఁడవు నీవృత్తాంత మాద్యంతమున్
వినఁ గాంక్షించెదఁ దెల్పు నావుడు మరుద్విద్వేషి గర్వంబునన్.143
మ. విను ముర్వీశ్వర నేఁ బులస్త్యకులుఁడన్ వేధోవరోద్యత్ప్రతా
పనిరూఢుండ దశాస్యనామకుఁడ మద్భ్రాతన్ ధనాధీశు ము
న్ననిలో గెల్చి విమానమున్ గొని త్రిలోకాతీతమాహాత్మ్య మొం
దినవాఁడన్ రణభిక్ష యిమ్మనినఁ బృథ్వీనాయకుం డి ట్లనున్. 144
చ. అవుర మ ఱేమి నీ మహిమ యన్నను గెల్చితి నన్నమాట వి
న్న విశద మయ్యె నాయనధనం బగుపుష్పకమున్ గ్రహించినాఁ
డవు భళి యింట గెల్చికద డయ్యక రచ్చల గెల్వఁ బోవలెన్
భువనములందుఁ గీర్తియును బుణ్యము దీన సమృద్ధిఁ జెందవే. 145
ఉ. ఇంతటిధర్మశాలి నిఁక నెవ్వ రెదుర్కొని గెల్చువారు ర
మ్మంత ప్రియంబు గల్గినటు లైన రణం బొనరింప నేనె ని
న్నంతకుచెంతకున్ బనుతు నంతకు నేఁ దగువాఁడ నంచు నం
తంతకు రోస మీసు బెరయన్ ధరణీశుఁడు లేచె చెచ్చెరన్. 146
మ. శరచాపంబులు పూని వజ్రకవచస్ఫారప్రభల్ భూనభోం
తరముల్ నిండ నజాండఖండనసముద్యచ్ఛింజినీనిస్వన
స్ఫురణన్ రాజు దశాస్యుపైఁ జనఁగ నచ్చో నడ్డ మై ధారుణీ
శ్వరచూడామణి పోకు పోకు మని సంవర్తుం డుదాత్తధ్వనిన్. 147
చ. పలికె బళా మఱేమి మది భాసిల దీక్ష వహించి శత్రుపై
నలుగుట నాయమే యిది మహాక్రతు వించుక విఘ్న మైనచో
గులము నశించు నద్దశముకుండును దుర్జయుఁ డేల వీనితోఁ
జల ముపసంహరింపు పరుషత్వము నా విని యమ్మరుత్తుఁడున్. 148
శా. ఆసంవర్తునిమాటఁ జేకొని పరిత్యక్తాస్త్రకోదండుఁ డై
యీసున్ రోసము నుజ్జగించి చన దైత్యేంద్రుండు వీక్షించి నా
తో సంగ్రామము సేయ నోపక మరుత్తుం డోడెఁ జుండీ యటం
చాసన్నాద్రిగుహావళుల్ బదులు మ్రోయన్ బెట్టు చాటింపుచున్. 149
ఉ. అమ్మఖశాలఁ జొచ్చి కుపితాత్మకుఁ డై మునికోటిఁ ద్రుంచి యూ
పమ్ములు పెల్లగించి పశుపంక్తి హరించి ఘృతంబు వహ్నికుం
డమ్ముల నించి హోతల నడంచి యహో తల మంచు యాజకుం
డమ్మెయిఁ బల్క నొక్కగతి నక్కడఁ బాసి చనెన్ బలంబుతోన్. 150
క. హరిహయముఖ్యులు భయములు, గిఱికొన శిఖికాకహంసకృకలాసగతుల్
ధరియించి యమ్మహాపదఁ, దరియించి తదీయహితము దలఁచి ప్రియోక్తిన్. 151
సీ. కన్ను లీ కలచంద్రకములుగా ఘనవేళ నెమ్మిగా నెమ్మి కొసఁగెఁ
బెద్దకాలముమన్కి ప్రేతాత్మకతభుక్తి గలుగఁగా జముఁడు కాకమున కొసఁగెఁ
బాలును నీరు నేర్పఱుచునేర్పుఁ బయోవిహారంబు నుదధీశుఁ డంచ కొసఁగెఁ
దల వెండివలెనుండఁ దనువు బంగరుఁజాయఁ దులకించ ధనరాజు తొండ కొసఁగె
తే. నివ్విధంబునఁ దమతమయెలమికిఁ దగు
వరము లజ్జంతువుల కిచ్చి వారు సవన
భాగముల్ గొనిపోయి రప్పార్థివుఁడును
మఖము నెఱవేర్చె సంవర్తమౌనికరుణ. 152
చ. అటుల మరుత్తభూవిభునియజ్ఞధరాస్థలిఁ బాసి యార్చుచున్
బటహమహార్భటుల్ దిశలు బ్రద్దలు సేయ నజయ్యుఁ డై ధరా
విటులఁ బరాక్రమోద్భటుల వీఁకనెదుర్చుచు నోప మన్నచో
నటఁ దన గెల్పుఁ దెల్పుచు దశాస్యుఁడు ద్రిమ్మరె భూమి యంతయున్.153
సీ. పరిపంథిమదతమఃపంకజిన్వధిభూవిభుం డైనదుష్యంతభూవిభుండు
వైరిరాజప్రాణవాయుభుగ్భుజభుజంగాధిరాజై మించుగాధిరాజు
హరిశౌర్యఘటితాఖిలావీరమృగాపహరణాజిమృగయుఁ డై యలరుగయుఁడు
శత్రుహృద్భేదనక్షమచక్రదీర్ఘఘర్ఘరఘోషసురథుఁ డై క్రాలుసురథుఁ
తే. డహితనుతచారు గౌరవుం డగుపురూర
వుండు మొదలైననృపపుంగవులు మహోగ్రుఁ
డౌదశాస్యునితోడఁ బోరాడలేక
నోడితి మటంచు వచియించి రోహటించి. 154
——♦♦ రావణుం డనరణ్యమహారాజుతోఁ బోరుట ♦♦——
తే. ఏమి దెలిపెద నింక శ్రీరామచంద్ర,యొక్క నృపుఁడైన నెదిరింప నోపఁడయ్యె
రావణాసురుపై నగరణ్యనృపవ, రేణ్యుఁ డొకరుండు దాఁకె నిర్భీకుఁ డగుచు.
ఉ. ఆవివరంబుఁ దెల్పెద దశాననుఁ డిట్టుల నెల్ల రాజులన్
లావు దొరంగఁజేయు చొకనాఁడు బలాన్వితుఁ డై యయోధ్య కెం
తేవడి నేఁగుదెంచి పఱతె మ్మనరణ్యనృపాల పోరికిన్
నీవిపులప్రతాపము గణింతురు దిక్కుల శూరు లందఱున్. 156
క. అనుమాన మేల వెఱచిన, ననుమా యోడితి నటంచు ననుమాట చుఱు
క్కున మానవపతి చెవి సొర, ఘనమానము రోస మీసుఁ గనఁబడ ననియెన్.
ఉ. ఏల దురుక్తులాడె దసురేశ్వర మ మ్మెదిరించి పోరఁగాఁ
జాలుదు వేని ద్వంద్వమునఁ జక్కఁగ నిల్వుము పిల్కుమార్చెదన్
బేలతనంబుతో ఘనులు పెద్దఱికంబు గణించుకొందురే
యాలములోపలన్ తెలియు నందఱబీరము లంచుఁ బల్కుచున్. 158
సీ. పృథ్వీస్థలం బెల్లఁ బెల్లగింపఁగఁ జాలఁ బెం పొందునరదముల్ పెక్కువేలు
ఘనగాత్రమహిమ నాకాశ మెత్తెడుభంగి బెడఁగైనయేనుఁగుల్ పెక్కువేలు
చక్రవాళము నైనఁ జక్కదాఁటెడుధాటి బెరయుగుఱ్ఱమ్ములు పెక్కువేలు
కల్పాంతభైరవాకారులై శూరు లై బిరుదు లందినభటుల్ పెక్కువేలు
తే. మిక్కుటపువీఁక దిక్కులఁ బిక్కటిల్ల
నొక్కమొగిఁ దన్నుఁ గొల్వఁగా నుక్కుమీఱి
కదనమున కాయితం బయి కదలిపోయె
రావణునిమీఁద మనయనరణ్యనృపతి. 159
క. ఆవిభునిసైన్యపతులకు, రావణుసైనికుల కుగ్రరణ మయ్యెఁ ద్రిలో
కీవిస్మయావహోద్ధతి, దేవాసురయుద్ధ మైనతెఱఁగున నధిపా. 160
మ. దనుజుల్ నీలశిలోచ్చయోచ్చతను లుద్యద్బాహు లుగ్రాశని
ధ్వను లొక్కుమ్మడిఁ జుట్టు ముట్టి భటమస్తంబుల్ రథాంగంబు ల
శ్వనికాయోదర పార్వముల్ కరటిహస్తంబుల్ విదారించి య
య్యనరణ్యాధిపుసేన గాడుపు లరణ్యానిన్ బలెన్ గూల్చినన్.161
సీ. పడగలు గొడుగులు పావడల్ వీచోపు లొండొంటిపై వ్రాలి యుండు నెడలుఁ
దొడలును మెడలుచేతులుగాళ్లు వ్రేళ్లు ప్రక్కలుడొక్కలొక ప్రోఁగుగన్నయెడలు
నరము లెమ్ములు క్రొవ్వునంజుడుమెదడు ప్రేవులు నెత్తురొక్కటై కనయునెడెలు
హారకుండలకిరీటాంగుళీయకకంకణాంగదాదులు చూర్ణమైనయెడలు
తే. బహువిధాయుధశకలముల్ పడినయెడలుఁ, గలిగిపలలాశనోత్సవకారి యగుచుఁ
దనబలము నేలపాలైనయునికిఁ జూచి, యలిగి యనరణ్యభూపాలుఁ డౌడుగఱచి.162
చ. కరమున విల్లు పూని లయకాలకృతాంతునిలీల మౌర్విటం
కరణము దిక్కరిశ్రవణఘట్టనముల్ ఘటియింపఁ దేరు స
త్వరముగ సూతుఁడు నడుపఁ ద న్నెదిరించినఁ జూచి పంక్తికం
ధరుఁ డనరణ్యునిన్ బెలుచ నవ్వుచు నీసు వహించి యిట్లనున్.163
తే. ఆఁకలియు డప్పి గొన్న నరాదు లాహ, రింత నరసేన దెచ్చి యర్పించినటుల
చటులమామకశరశిఖజ్వాలికలకు, ని న్నొసఁగ వచ్చితే యన్న నృపుడు గదిసి.164
చ. దనుజుఁ గిరీటముల్ పదియుఁ దాఁక ననేకశరంబు లేసి యా
ర్చిన శతశాతబాణములచే దశకంఠుఁడు రాజు నొంచి యా
తనివిలు ద్రుంచి సారథివధం బొనరించి హయాంగముల్ దళిం
చిన రథిహీనుఁడయ్యు గదఁ జేకొని శత్రుని మోఁదె మోఁదినన్.165
తే. దండతాడితఫణిరీతి దశముఖుండు, పుడమి కుద్ధతి లంఘించి పిడుగుఁబోలు
కఱకుటఱచేతఁ దనమస్తకంబు వ్రేయ, వాయుహతసాలలీల భూవరుఁడు గూలె.166
ఉ. అగ్గతి నేలఁ గూలిన ధరాధిపుఁ గన్గొని పంక్తికంఠుడున్
బెగ్గిల గేక వేసి నగి బీరము లాడితి విప్పు డింతలో
దగ్గఱె నోటు మృత్యు వెచటన్ నను గెల్వఁగ నెవ్వఁ డోపు నీ
సి గ్గిటు సేసె నోటమి వచించిన నీదురవస్థ వచ్చునే.167
చ. అని తనుఁ దూల నాడిన జనాగ్రణి కన్నులు విచ్చి దైత్యునిం
గనుఁగొని నన్ను నీవిపుడు కాఱియఁబెట్టిన నేమి మీఁదటన్
నిను వధియించు నొక్క మహనీయచరిత్రుఁడు మత్కులంబునన్
జననము నొందు నిట్టిపరుషంబులు వల్కకు పొమ్ము రావణా.168
చ. పురుషుఁడు కర్మసంగమునఁ బొందు సుఖంబును దుఃఖ మెవ్వ రె
వ్వరికి విరోధముల్ సలువు వా రిది దైవవశంబు దీనఁగా
తరత వహింప నేఁ గనకదానమఖాధ్యయనాదికర్మముల్
వొరసితి నేనిఁ బల్కు పొలి వోవక నట్లగుఁ గాక యం చనన్.169
క. మించినతమిని సురల్ గురి, యించిరి మందారవృష్టి యిది నిజ మని మ్రో
172 178 174 175 శ్రీ మ దుత్తర రామాయ ణ ము యించికి పణవాదులు నుతి, యించిరి యనరణ్య నృపతిధృతివిభవంబుల్. 170 చ. అది సహియింప కచ్చెడు గహంకృతితో నిటువంటిసత్త్వమే కద నిను నింత సేసెఁ దుది గాంచియు వైరము మాన వంచు బ ల్గదఁ గొని మస్తకంబు వగుల వడి నొంచి జయంబుఁ గాంచి స నుడము వహించి యేఁగె నన మౌనికి నవ్వుచు రాముఁ డిట్లనున్ , 171 6. అరి నోర్వఁ జాలువీరులు, ధర నెక్కడ లేతో వీరధర్మము సెడెనో నరపతుల శౌర్య ధైర్య, స్ఫురణ లిటుల నేల గలసి షో నేమిటికిన్ , వ. వని పలికి యంత నిలువక, మ, అకటా సూర్యశశాంక వంశ్యు లగు బాహాసంభవుల్ నొచ్చి రే స్వక రాస్త్రంబులు హానిఁ జెందెనె మనస్సంపన్నతల్ గుందెనే యొకఁ డైనక్ రిపు నొంప కున్న కత మేమో విన్న విం తయ్యేడిక్ సకల స్తుత్యతపసిప్ర భావనిధి యీసం దేహముం దీర్ప వే. క. నా విని లోపాముద్రా, జీవిత నాయకుఁడు నగుచు శ్రీతికన్యాదృ ర్జీవంజీవహి తానన, జై వాతృకుఁ డైన రామచంద్రున కనియెన్ . మ. తనచే నిర్జితుఁ డైనశాత్రవునిదోర్దర్పంబుఁ గీర్తించిన? విని సంతోషముఁ జెందు నెట్టిఘనుఁడు విశ్వావసీ శాగ్రణీ హననం బోర్వక వానియోటము లే నీవాలింపఁ గాండించె దెం తని వర్ణింతును నీగుణస్ఫురణ రామా రాజచూడామణీ,
- అగస్త్యమహర్షి కార్తవీర్యార్జునుని ప్ర తాపము రామునకుఁ దెలుపుట +
క. అశ్రమమున ధరఁ దిరుగుచు, విశ్రవసుసుతుఁడు - ర్తవీర్యార్జునవా గ్రశ్రవసాదుల కోడిన, విశ్రుతకథలు గల వవియు విను మని పల్కెన్ . శా, ఆహంసోన్నతవ సౌధరుచి సౌధాంభోధిది వ్యాపగో ద్వాహోపక్ర మసూచకోపరిచరత్పాండుచ్ఛదగ్రామణీ సాహస్రచ్ఛదనిసు తాంబుకణచంచ” }క స్తోమ మై మాహిష్మత్యభిధానప త్తినలలామం బొప్పు భూమీశ్వరా. శా. ఆ ప్రో లర్జున చక్రవర్తి కృతవీర్యమణిభృత్తీ రవా ప్రత్యక్ష శశాంక మూర్తి నత దారిద్ర్యా విచ్ఛేదనో దీపణి ప్రదయానువర్తి ద్విచతురిద్దంతి రాష్ట్రంతకాం తిప్రద్యోతితకీర్తి యేలు నెపుడు దేవేశ్వర స్ఫూర్తితోన్ . నీ. అనవద్య బాహాసహస్రముల్ డనచక్ర భావ నణిమాది విభవంబు లల్ల దత్తాత్రేయ గురుకృప దనుముంచుకొనుటఁ దెలుప సంతతౌదార్య మష్టాదశ ద్వీపంబు లే లెడితనకలి, నెఱుక పఱుప , దక్షిణనాయకత్వ మనేక సతులతో విహరించుతిన నేర్పు విస్తరింప 176 177 178 179 మంతయు బట్టబయలు సేయ 107 తృతీయ శ్వా సము 180 181 మ. చని ను 183 185 తే. సార్వభౌములలాముఁ డై జగతి యేలే, న ప్రతిహత ప్రతీపశాహా ప్రదీప్త దావపావక కీలికాదగ్ధదుర్జ, నార్జునుం డగుకార్తవీర్యార్జునుండు. క. ఆసార్వభౌముఁ డమితవ, శాసంగతసార్వభౌముచందమున బహు స్త్రీ సంయుతుఁ డై యొక నాఁ, డాసన్న సరిద్విలోక నాదృతిఁ జనియెక్.. వింధ్యాచలసార్వభౌమనిక బాంచన్నర్మం దాతీరభా గ్వన సౌభాగ్యము మెచ్చి హైహయధరావ జ్రాయుధుం డంగనా జన తానేక విధాంగ సంపదలతో సామ్యంబు లౌ వస్తువుల్ గనుఁగొంచుక్ లతకూనలక్ దొరసి వేడ్క సెందెఁ జైత్రుల బలెన్ . 182 శా. తత్కాలంబున రావణాసురుఁడు దైత్య రామణుల్ గొల్వ ద్యత్కౌ బేరవిమాన 'మెక్కికొని యుద్ధా పేజ్ రా సర్వభూ భృత్కోటీర కుటీర రత్ననిక రాఖీలద్యుతి ప్రస్ఫుర త్పత్కంజద్వయుఁ డర్జునుం డనెడివార్తల్ భూమిలో మించినన్ , క, అతిలోషంబున మాహి,ష్మతికి జని రావణుండు సమరస్పృహ తి నాయాగతి సూయధి, పతికి దెల్పుఁ డన సార్వభౌమునిమంత్రుల్ . 184. వ. అతనితో నిట్లనిరి. సీ. బలు వేసడముల పై బండ్ల పై బ్రబలోష్ట్రపం క్తిపై ముందుగా బరువు లేగఁ డదనువ ర్తనలీల దారుణాయుధరుచుల్ దిలకింప సుభటముఖ్యులు సనంగ రథికహస్తిపక తౌరంగికుల్ వలగొని మేడ మై కనుఁజూపు మేర నడవ నెవ్వారి జేర రానీయక బహుళంచుకులు బరాబరులు సేయ తే. నవ్యపల్యం కారోహణము లొనర్చి, రాణివాసంపుసతులు పార్శ్వములఁగొలువ భద్రగజమెక్కి మారాజు ప్రాభవమున, నర్మ దాతీరవని కేఁగినాఁడు నేడు. 186 శా. నేఁడే వచ్చునో వచ్చునో వని స్త్రీయుక్తి ఁ గ్రీడించుచుక రాడో రాజులచి త్తముల్ దెలియు నే రకు గోకులాధ్యక్ష యె వ్వాడు మాపురిఁ జేరి నీకరణి గర్వస్ఫూర్తి ని ట్లాడఁగా లేఁ డుగ్రుండ వతండు వచ్చి నను బాళి? రము మే లౌ ననన్ . శా. ఆమాటల్ విని నవ్వి పంక్తి వదనుం డౌరౌర యీబూ మె లే లా మాయేలిక నా ప్రయాణకథ లెల్లడ్ విన్న వాఁడై వధూ స్తోమంబుం గొని డాఁగ నేగె రణభీతు జేరి పోవాడు నే భూమిక్ రావణుఁ డంచు వారి నగుచుఁ బోయెక్ మదోద్రేకియై. తే. ఇటుల మాహిష్మతీపురాధీశుఁ గాన కసుర యచ్చోటు వాసి సైన్యముల డాసి యలప్రహ స్తుండు మొదలైన యఖిలమంత్రి పుంగవులు గొల్వ నవ్వలఁబోయి పోయి, జెంతల 187 188 189 108 190 శ్రీ మ దుత్తర రా మా య ణ ము దళ గ్రీవుండు ఏంధ్యాచలంబున కేఁగుట మ. అవలోకిం చె దశాననుం డెదుట దివ్య సైణవీణారవ శ్రవణోల్లాసరసోన్న మళ్ఫీణిఫణారత్న ప్రభావా త్తభీ తివిధాన తటకుంఘీంకృతి కటద్దీవ్యద్గుహాయాతమౌ నివ రార క్తజటాంశుకింశుక ఘృణిః విధ్యా చలగ్రామణిన్ . వ, కని యక్కొండచక్కటికిఁ జక్క నరిగి సురగరుడ గంధర్వాది దేవ తా'మిథునం బుల నిధువనంబులకు దగుపృథువనంబులోఁ దరలనియిరుల కిర వగుతోరంపు టీరంపుగుంపులఁ బెంపు గనుమవ్వంపుదీ వ్వెలవలె నివ్వటిల్లుగ నగనని మణులకై కెరలుమధుకరనికరంబులగతులు తెమ్మరలవలనఁ జలనంబు నొందునలరుల యందుండియు దొరంగుమరందధారాబృందంబువాకలం కలసి ప్రవహించు సెలయేటినీటి తుంపరల దొరసి మందగతులం దిరుగు మందపవనంబుల దార్కొని యావటించుసానుచరద్భు జంగ సంఘంబులపూత్కారంబుల్ బెగ డువడి వడి నిగుడ బకువు లిడుతమపడుచులజడుపు దీర్చుట కెదురువచ్చు తపసి పెద్ద లక టితటీరమణీయతర వ్యాఘ్రచర్మంబులడంబులఁ గని తల్లడంబునక్ రేళ్లు జుకుక న్నె లేళ్లకు మొల్లంపుఁబచ్చిక లను మచ్చిక లెచ్చరించుపచ్చ పొగనుల చెం గటక్ గనుపట్టు వీలర త్నాకరంబులవి భాగదంబంబు లంబుదనికురుంబంబు లని యుఁ డదుపరి ప్రద్యోతిత జ్యోతిర్ల యవి తానంబులు తటిల్ల తా ప్ర తానంబు లని యు నెంచి యాఁ గా దని పన్ని దంబులు సజచి పజ తెంచి పరికించి మృష యైన నోడినవారిఁ గేరడంబు లాడు చెంచుమించుఁబోడులక రాంచలళ రాసనో న్ముక్తదురాసదశ రాసారంబులక్ బగిలిన వేణువులనుండి రాలు మెఱుంగుము త్తి యంపుటాలు దం ంబు లని ఖండింప దివురుశిఖండి ప్ర కాండంబుల విప్పుగలకప్పుఁబిం చెంబుల నొప్పుసాంద్రతర చంద్రకద్యోతము లింద్ర చాపద్యుతు చరించు రాయంచల చంచూపుట చరణారుణ ప్రభాస్ఫురణంబుల లించు జేXజులతోఁ గరంబు మీఁ టగుకూటఝాటంబుల౯ గ్రీడించుచు నప్పం క్తి కంధరుండు. +- రావణుఁడు నర్మద యొడ్డున జేరి శివపూజ చేయుట మ. అచలోపాంతమునం గనుంగొనియెఁ దుంగాభంగభంగానిలా భచర్యఖేచర బాలికాతిలక భాక్పాలస్థలీఘర్మదక్ బ్రచుర న్నా తకశర్మదక స్వమహిమ ప్రధ్వ స్తనానాసరి స్క్రాచయాంతర్మద నర్మద జలగళద్దంతావళో చ్చైర్మదన్ . మ. కని గోయషిక చక్ర సారసబక క్రౌంచాదినానాఖగ ధ్వనుల వీనులుఁ జంచదూర్మిలులితావ రేశలం గన్నులు వనజాతోత్పలసార సౌరభముల నాసల్ తదీయానిలం బున మేనుల్ సఫలత్వ మొండ దితి భూమూర్ధన్యుఁ డుత్సాహి యై. లని గౌఁగి 191 192 198 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/133 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/134 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/135 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/136 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/137 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/138 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/139 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/140 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/141 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/142 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/143 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/144 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/145 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/146 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/147 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/148 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/149 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/150 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/151 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/152 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/153 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/154 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/155 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/156 పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/157