శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము
శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము
తృతీయాశ్వాసము
−◆◇◇◆−
శ్రీకంఠ భక్తవత్సల
లోకాధిప వినుత సర్వలోకాధీశా
రాకేందుకోటి భాస్వర
ప్రాకట గంగోత్తమాంగ పర్వతలింగా! 1
అవధరింపుము దేవ చిదంబరాఖ్య
నటన తంత్రంబులోన విస్ఫుటము గాఁగ
చెప్పఁబడిన త్రికూటాఖ్య శిఖర మహిమ
మాంధ్ర కృతిఁ జేసితిని నీకు నర్పణముగ.2
ఇంక బ్రహ్మశిఖర మహత్వంబును తన్మధ్యస్థ నూతన కోటీశలింగ సమీపస్థ
లింగంబులం గలియుగాది వచ్చోట ముక్తులగు సాలంక భక్తపుంగవాభీర
కన్యావతంసంబుల కథావిధానం బవధానంబున నేర్పరించి విన్నవించెద
నదెట్లనిన. 3
అచ్చటి బిల్వకాననము లచ్చటి నిర్మల ద్రోణికాచయం
బచ్చటి నిర్ఝర ప్రతతు లచ్చటి గైరికధాతు భాసనం
బచ్చటి దివ్య కందరము లచ్చటి సిద్ధ మునీంద్ర మండలం
బిచ్చఁదలంపఁ జెప్పఁ దరమే పరమేష్ఠికినైన నెంతయున్ , 4
ఆచటి కోటీశ్వరాలయం బద్భుతంబు
శ్రాంత హరి రథ్య ఖుర సమాక్రాంత శాత
కుంభ కుంభావళీ ప్రోత్థ గురుతరాగ్ర
గోపురాధఃకృతస్ఫార గోపురంబు. 5
ఆ కోటీశ్వర గేహ దక్షిణ విశాలై... నీతస్థలి
శ్రీ కల్యాణ మనోజ్ఞ వాసగతుఁడై సిద్ధిప్రదుండౌచుసు
శ్లోకుండౌ గణనాథుఁ డద్భుతగతిన్ శోభిల్లు కోటీశ్వరుం
డాకల్పాంతముగొల్చు నెమ్మదిని మోదంబంది సద్భక్తిచేన్ .6
ఆ లోకేశ నివాస పశ్చిమదిశా వ్యాసక్త సమ్యగ్దృష
జ్జ్వాలా కల్పిత దివ్యగేహమున వాచాతీత మాహాత్మ్య సు
శ్రీ లాలిత్యవిలాస భాస మగుచుం జెన్నొంది కన్విందు గా
సాలంకేశ్వర లింగమూర్తి యమరున్ సద్భక్త సంసేవ్యమై.7
కోటీశావసధాంచితోత్తరదిశా కుడ్యైక నీడంబునన్
సాటిన్ మించిన సత్ప్రభావ గరిమన్ సంతాన కోటీశుఁ డా
సూటిన్నిల్చి సమస్తభక్తతతికిన్ సొంపొందు సంతోష మె
ప్పాటం గల్గగజేయుఁ దన్మహిమ దెల్పన్ శక్యమే యేరికిన్.8
ఆ కోటీశ్వరు వామభాగమున నత్యాశ్చర్యకృద్దోణికా
నీకాధస్థిత బిల్వమూలమున వాణీనాథ సంసేవ్యమై
రాకాచంద్ర మయూఖ దీధితిని మార్కండేయ లింగంబు సు
శ్లోకంబై భవమృత్యు సంహరణమై శోభిల్లు నెంతేనియున్, 9
ఆ దేవేశ్వరు తూర్పువాఁకిట మహార్హస్ఫార నీలాశ్మ శో
భా దివ్యాయత మంటపంబునము శుంభద్దృష్టిపాతంబు నా
హ్లాదం బొప్పగ లింగమూర్తి పయి లీలందీర్చు నందీశుఁ డా
మోద స్ఫూర్తివసించు యోగితతి తన్మూర్తి న్మది న్నిల్పగన్ . 10
ఆ దేవోత్తము ప్రాగ్దిశా స్థలమునం దా రామలింగేశ్వరుం
డాదిబ్రహ్మమయుండు మౌనిజనతాధ్యక్షుండు మోక్షప్రదుం
డాదిత్యేందు కృశానులోచనుఁడు నిత్యానంద సంధాయియై
ప్రోది న్నిల్చి సమస్తలోకముల సమ్మోదమ్ముతోఁ బ్రోచెడిన్ . 11
అట్టి యా రామలింగేశ్వరాలయంబు
దక్షిణంబున సోపాన తలమునందు
వర గుణోపేత యాభీరవంశజాత
ప్రీతి వసియించి శ్రితజనాభీష్ట మొసఁగు.12
శివుని జూడగ నేగు భవులకు నెదురుగ
గరిమ నిల్చిన ముక్తికాంత యనఁగ
దక్షిణామూర్తియై ధవుఁడు ముందర రాగ
వెనుక వచ్చిన గిరితనయ యనఁగ
నఖిలాద్రి శోభా జయాఢ్యమౌ తద్గిరి
లాలితాద్భుత జయలక్ష్మి యనఁగ
త న్నగప్రాంత కాంతార మధ్యమున ను
న్నతి వసించు వనదేవత యనంగ
ప్రకటకోటీశ సోపాన పటలినడుమ
చారు దృఢ దారు నిర్మిత సద్మమందు.
నిరత సంతోషచిత్తయై నిలిచియుండు
పృథుల శివభక్తి మాన్య యాభీరకన్య. 13
ఆ కోటీశ్వరు దక్షిణాశను త్రిమూర్త్యాకారమై యుల్లస
ల్లోకాలోక పరీత విశ్వధరణీ లోకస్తుతానేక సు
శ్లోక శ్రీకర భక్తలోక హృదయాస్తోకేష్ట దాసక్రియా
శ్రీకంబై తనరారుచుండు నెపుడున్ లింగత్రయం బున్నతిన్, 14
ఆ లింగత్రయ మొకటయి
యోలి మహాలింగమయ్యెనోయన నోంకా
రా లలితాఖ్యను కోటీ
శాలయము వెనకను లింగ మలరుచు మండున్ .15
ఆ మ్మహాస్థల సంరక్షణార్థముగను
దుర్గ భైరవు లిద్ద రస్తోక మహిమ
నిల్చియుండిరి యద్దేవు నిలయమునకు
ప్రాగ్దిశాస్థలి వేదిక పడమరందు,16
ఆ కోటీశ్వరు గర్భగృ
హా కలిత ద్వారపాలకాగ్రణు లుద్య
ల్లోకానీకము బ్రోచుచు
నాకల్పస్థాయిగాగ నలరుదు రచట౯.17
మఱియు నా త్రికూటాద్రి శిఖరి గుహాంత
రాంతరంబుల బిల్వ వనాంతరముల
లింగమూర్తులనేకముల్ లెక్క వెట్టఁ
దరమె శేషాహికైన వాస్తవముగాఁగ, 18
ఇది బ్రహ్మశిఖర తదగ్రస్థిత నూతన కోటీశ్వరాది దివ్యలింగ ప్రశంసనం
బింక సాలంకుండను భక్తపుంగవుడు నాభీరకన్యావతసంబును నీ
త్రికూటేశ్వరుండగు కోటీశ్వరు నారాధించి ముక్తిగాంచిన కథావిధానం
బెఱింగించెద -- 19
కలితాకాశ నదీ తరంగ చయ రంగ త్తుంగ డోలాచల
త్కలహంస ప్రకర ప్రకేళి కలనా కౌతూహలాలోకనో
జ్జ్వల సౌధాంత వస త్వయోజ వదనావారంబు శ్రీ యెల్లమం
ధల సత్పట్టణ మిందిరాసుదతి నిత్యావాస గేహాకృతిన్ . 20
అమిత వరణంబు చక్రవాళాద్రి గాగ
నమల పరిఘాంబు వావరణాంబువుగను
రమ్య సౌధాళి భూధర రాజిగాఁగఁ
దనరి యా పురి బ్రహ్మాండ మనఁగ వెలయు. 21
పుర సౌధావృతమైన యంబరమునం బో సందు లేమిన్ సుధా
కరుఁడా సోరణగండ్ల దూరి చనఁగా కాంతల్ కరాగ్రంబులన్
సరవింబట్టి నిజాస్య బింబములతో సాటౌనొ కాదో యటం
చరయన్ మోములఁ జేర్పఁగా దిలకమై వ్యాషించు కస్తూరి పం
క రసంబంట కళంకమం చనియె లోకం బా కళాశాలికిన్ ,22
చంద్రశాలల రతిఁ దేలు సతులు కురుల
విరులు జారిన పేటికల్ ధరకుఁద్రోయ
నవియు నా శింశుమారంబు నందె జేరి
తిరుగ తారక నిరి యీ ధరణిజనులు.23
పరిఘాంచజ్జలకేళిలోల పరిరాడ్యామావళుల్ వేడ త
త్పరిఘాంబు ప్రతిబింబితామితవనీ ప్రాంచత్సుమశ్రేణి వి
స్ఫురణంగాయతడంబుబింబితములై శోభిల్లు ప్రాసాద గో
పుర సాలాగ్రము లెక్క చూతు రటు సమ్మోహంబుచే నెంతయున్ 24 .
ఆతత సౌధకీలిత మహామణులం బ్రతిబింబితార్క సం
ఘాతముఁగాంచి తద్గ్రహణ కాలములన్ గ్రసియింపవచ్చు నా
కేతుసమూహమోయనఁగ కేతనపంక్తిగృహాంగణంబులన్
ఖ్యాతి వహించి మించెను పటాంచల వాత విధూత మేఘమై.25
నలువ శివుండు శేషుఁడును నాలుగు నైదును వేయు నోళ్ళచే
బలికిరి వేద మాగమము భాష్యము, న ప్పురిలోని బ్రాహ్మణుల్
వలుకుదు రేకవక్త్రకములన్ నిగమాగమ భాష్యజాలముల్
చలమున వారితోడను ప్రసంగము వేయఁదరంబె యేరికిన్ .26
ఆ పురి రాజహంసులు మహాంబర వీథిని రాజహంసులం
దీపిత కీర్తి విక్రమ సుదీధితిచేత తిరస్కరింప సం
తాపము నొంది వార లటు దైవ నగేంద్రము బాసియేగి యా
కోపముచే తమోగ్రహణ కుంఠిత విగ్రహులైరి చూడఁగన్ 27
బేరమెఱుగక తాను గుబేరుఁడయ్యే
ధనదుఁడనుచును లాభంబు దప్పకుండ
బేరములుజేసి తాము కుబేరులైరి
తత్పురీస్థిత వణిజులు ధనము కలిమి.28
బలుఁడు హలంబుబూని నిరపాయముగా యమునాతటంబునన్
చలమున దున్ని సస్యఫల సంగతిఁ గాంచెనెయంచు నెంచుచున్
హల మటు బూని వేడ్క నిఖిలావని దున్ని సమస్త సస్యముల్
ఫలితముగాఁగ జేతురు శుభస్థితిఁ ద త్పురి శూద్రు లెంతయున్ .28
తారలా యివి గావు మారుని వలచేతి
తలిరాకు నెలబాకు తళుకులేమొ
తళుకులా యివి గావు దర్పకు నెమ్మేని
మెఱుగారు సొమ్ముల మెఱవులేమొ
మెఱపులా యివి గావు మీనాంకునెలతోడి
ప్రతిలేని జిగిజాగి లతికలేమొ
లతికిలా యివి గావు రతిరాజునకునిచ్చు
కలిత మంగళదీప కలికలేమొ
యనుచు సభికులు నుతియింప నఖిల దేశ
సభిక సభలందు నాట్యము ల్సలుపనేర్చి
ధనములార్జించి కామతంత్రముల మించి
వారపతు లుందు రప్పురవరమునందు, 29
మఱియు నిట్లు ప్రచండోద్దండ వేదండ ప్రకాండ కాండోద్భట రథ తురంగ
చతురంగ సేనాసమేతంబై యఖండ లక్ష్మీకటాక్ష వీక్షాడంబర విడంబితం
బగు న న్నగరీవతంసంబునందు భక్తకులశ్రేష్ఠుండును కోరె వంశ సుధాం
భోధిరాకాశశాంకుండును సాలంకాఖ్యుండగు నొక్క భక్తపుంగవుం
డనుజ చతుష్టయ సహితుండయి విరాజిల్లు తత్ప్రభావం బెట్టిదనిన.30
ఫాలంబునను సితభస్మ త్రిపుండ్రంబు
కరముల రుద్రాక్ష కంకణములు
గండపాళిని తామ్రకుండల ద్వితీయంబు
శిరమున రుద్రాక్ష వరకిరీట
మురమున భుజముల నురు భస్మరేఖలు
గళమున రుద్రాక్ష కంఠమాల
ముఖమున పంచార్ణ మూలమంత్రంబును
సందికట్టునఁ దరుణేందు ధరుడుఁ
గలిగి పుంభావభక్తి నా గరళకంఠు
భ క్తజనముల శ్రీ పాదపద్మములకు
పూజగావించి మోదించు భూరియశుఁడు
కోరెవంశసుధాంభోధి కుముదహితుఁడు.31
అమ్మహాత్ముండు మహిత నిష్ణానురక్తి
సేయు శివపూజ మహిమంబుఁ జెప్పఁదరమె
షట్స్థలంబుల షడ్లింగ సదనములను
వర్ష దర్పణ లీల లేర్పడ రచింతు,32
సాలంకయ్య కథ
భక్తస్థలంబున భక్తుఁడై విలసిల్లె
మాహేశ్వరస్థలి మహిత నిష్ఠు
డై ప్రసాదస్థలి నవధానియై ప్రాణ
లింగాఖ్య సుస్థలి లీన తాను
భవుఁడౌచును శరస్థల వివర్థితానందు
డై యైక్య సుస్థలి నైక్యుఁడగుచు
గురు లింగజంగమాకుంఠితై క్యస్థితి
నెఱిఁగి తద్రూపంబు లిష్టగతిని .
ప్రాణ భావాఖ్య లింగ సంబంధములుగ
జేసి నిత్యంబు శివపూజ సేయుచుండు
వీరశైవుండు షడ్వర్గ విజయశాలి
ప్రకట రుచిహేళి సాలంక భక్తమౌళి. 33
శ్రుతుల పురాణాద్యాగమ
వితతుల శివుఁ డధికుఁ డనుచు వేమఱు వినుటన్
శ్రుతిమత మని శివభక్తిని
సతతము నంగీకరించి సలుపుచునుండున్ .34
కఠిన కాయికవృత్తి యుత్కటముగాఁగ
జేసి యార్జించు ద్రవ్యంబుచేత జంగ
మాళిఁ బూజించుటే ముఖ్యమని తలంచి
కట్టెలమ్మేటి నెఱకాయకంబు పూని,35
తమ్ములతోడగూడి విహితమ్ముగ న న్నగరాజమెక్కి నె
త్తమ్ముననుండు న వ్వనవితానమునందున నొప్పు పెద్ద భూ
జమ్ముల శాఖలెక్కి పయిసాగిన కట్టెలు కొట్టితెచ్చి తా
నమ్మిన తత్క్రయంబుననె నాతఁడొనర్చును జంగమార్చనల్.36
కోటికిఁబడగెత్తు వన కీ
రాటకు లవ్వీట గలుగ రాయస్థితికై
పాటించి వారి నడుగరు
జూటేందుకళావతంసు జూచిన కతనన్.37
ఆ పురంబున గట్టెల నమ్ముకొఱకు
నా త్రికూటాద్రికూటంబులందుగల్గు
శుష్కతరువులు ఖండించి పొలసి యంత
కోటిలింగేళ్లు దర్శించుఁ గోర్కెదీర38
మఱియు నన్న గేంద్రంబునం దహంహంబునుం దిరుగుచుండి యతం డయ్యై
యడవుల విహరించు సిద్ధ సమాజంబుల జాడలు వీక్షించి తన మనంబున
నిట్లని వితర్కించె 39
ఈ ద్రోణికలచెంత నిందాక నొక సిద్ధుఁ
డతి నిష్ఠ జలకంబు లాడబోలు
నీ బిల్వతరుసీమ నిందాక నొక సిద్ధుఁ
దీశ్వరార్చారూఢి నెసఁగబోలు
నీ తరుచ్ఛాయల నిందాక నొక సిద్ధుఁ
డాసక్తి విశ్రాంతి నందబోలు
నీ గుహాంతరవీథి నిందాక నొక సిద్ధుఁ
డురుసమాధిస్థితి నుండబోలు
తలఁప నీ స్థలంబందున త త్తదుచిత
కలిత చిహ్నంబు లేర్పడ గానిపించె
సిద్ధులెప్పుడు న గ్గిరి సేవసేయ
నరులు సేవించుటే వింత. నాకుఁ జూడ.40
ఈ నగరాజ మందున మునీంద్రు లనేకులు నిల్చియుండుటన్
మానుగ నిన్నగంబు మునిమంద యటంచు వచింతు రిచ్చటన్
బూని తపంబు జేసిన నపూర్వ సుఖంబులు భోగభాగ్యముల్
మానిత మోక్ష సంపద లుమాపతి యిచ్చును మానవాళికి.41
అని విచారించి యతండు.42
లీల నగరాజు ధారణలింగమైన
కోటిలింగంబు బూజించుకొనుట శైవ
ధర్మ లోపంబు గాదని దలఁచి యమిత
పూజ గావించెఁ గోటీశుఁ భూరిభక్తి. 43
అంత శరత్కాలంబు ని
తాంతాచ్ఛాంభో విహార తత ధవళ గరు
త్క్రాతాంబుజాత పటలీ
కాంతం బరుదెంచె శీతకారణమగుచున్ .45
ఉష్ణాంకు కిరణ జాలం
బుష్టత్వముమానె నహ్నియుడిగెను తీవ్రం
బుష్టంబులైన వస్తువు
లుష్ణత్వముమాని శైత్య మొందెను వేగన్ .45
శివుఁడు ఫాలమునందుఁ జేర్చె నగ్నిజ్వాల
వెన్నుండు కార్చిచ్చు వేగమ్రింగె
పాధోనిధానంబు బాడబానలమానె
కమలారి సూర్యసంగతి వహించె
నంభోదములు వైద్యుతానలస్థితులయ్యె
వజ్రి వజ్రంబు కేవలముబూనె
తరువు అంతర్వహ్ని నిరవొందగా దాల్చె
శిలలు లోవహ్నిని జేర్చుకొనియె
జనము లింటింట కుంపటు లెనయ నిల్పి
రడవులందున నెగడులు గడలుకొల్పి
రపుడు వనచరు లా శీత మఖిలలోక
బాధలొనరింప నెంతయు భయమునొంది.46
అట్టి శీతకాలంబునఁ బ్రొద్దుపొడుపునఁ జల్లని నీటందోగి యమ్మహాత్ముండు
సీతభసిత లిప్తపదేహండై భద్ర రుద్రాక్ష మాలాలంకృతగ్రీవుండై పంచాక్షరీ
జపంబు చేయుచుఁ గోటీశ్వర మహాలింగంబునకు షోడశోపచార పూజలు
గావించి కోటీశ్వరాష్టోత్తర శతనామంబుల బిల్వపత్రార్చనంబు జేసి మల్లికా
మాలికా దామంబు లా లింగమూర్తి కంతటంజుట్టి యీ లింగంబే మల్లికార్జున
లింగంబయ్యెననుచు భావించి హృత్పద్మంబున ధ్యానంబు సేయుచుండె మఱియు. 47
దక్షిణాయనమందు నుద్ధతి వహించి
మంచు తన రుచి మిగుల మాయించెననుచు
మంచుకొండకు నేగి యా మంచు నణప
నర్కుడంతట నుత్తరాయణము నొందె.48.
శిరమునఁదాల్చె గంగ శశిశేఖరు డా హరి వార్ధిఁ జొచ్చె వా
గ్వరుఁడు సరోజ పీఠిక నివాసము నేసెను వార్ధి యిందునిం
బోరసె సుధాంధు ల య్యమృతముం గొనిరంతయు మండువేసవిం
దురధిగమార్కతాప మతి దుస్సహమైనను భీతచిత్తులై .49
ప్రసను పాంధుల సతు లిచ్చు వారిఁ ద్రాగి
యిది ధరామృత మతి తృప్తినిచ్చే మాకు
నింక నధరామృతము వీరియెడను గలుగు
నది లభించిన నమృ తత్వ మబ్బు వండ్రు,50
అట్టి వేసవి ఘోర వనాంతరముల
నెండగాలికి నోర్చి కోటీశు పూజ
సేయుటకు బిల్వదళము లమేయ పుష్ప
వితతి దెచ్చును సాలంకవిభుఁడు భక్తి.51
ఆలయక పుండరీక వకుళావళి తా నొక దండఁజేసి నీ
ర్మలమగు లింగమూ ర్తి కటు మౌళిని జుట్టుట నెంచి చూడఁగా
నలువ కపాలమాలిక ఘనంబుగ మూర్ధముఁజుట్టికొన్న యా
మలహరు దివ్యవిగ్రహ సమత్వము గాంచివలీలఁ దోఁచెడిన్ . 52
ఇట్లు ఘర్మకాలంబున నిర్మల చేతస్కుండై దుర్మలిన వినాకనియగు శంభు
పూజ సత్కర్మ నిరతుండై చేయుచుండే నంత.53
కర్షకజన సంతతికిని
హర్షం బొదవంగ ప్రకటితాద్భుత లీలా
కర్షణమై సుకరంబగు
వర్షఋతువు వచ్చెఁ బథిక వర్గము బెగడన్ 54 .
కఠిన రవిరశ్మితప్త లోకంబునకును
తాప మణఁగింప నాఘనతతులుపూని
కఠిన జనతాభితప్త లోకంబునకును
తాప మణఁగింపవే ఘనతతులు జగతి. 55
అట్లు కాదంబినీ ప్రకాండం బకాండ విలయ జలధిపోలిక నదీనదంబు లేకంబు నేయుచు బ్రవర్షించు కాలంబున గిరిఝరి ప్రాంత కాంత కాంతా రంబుల సరిత్సరోవర తీరంబులం దిరుగుచు సాలంకుండు నిర్విశంకుండై కదంబ వాటికా కుసుమ కదంబంబుల దండలు గట్టి కోటీశ్వర శిరోభాగం బనం జుట్టి పాటల రుచిరుచిర జటాజూట కోటరంబగు సదాశివమూర్తి నలంకరింపంజేసి పూజింపుచుండు సమయంబున.56
ఉత్సాహవృత్తము :
వారిదంబు లభ్రమం దవారితంబులై మరు
త్ప్రేరితంబులై యుగాంత భీమనీరదచ్చటా
స్ఫారితంబులై మసారసార నీలిమ ప్రభా
పూరితంబులై ధరాగ్రభూమి జేరె నుద్ధతిన్.
స్రగ్గర
శుంభర్గంభీరగర్జాస్ఫురణయు చపలా శోభయున్ దిక్తటంబుల్
కుంభింపన్ సంభృతాంభః కులికములగుచున్ గుంభినీవ్యాప్తలీలా
స్తంభాంభోవాహపంక్తుల్ చదల బౌదలుచున్ సైరికామోద వృత్తిన్
గుంభద్రోణంబుగాఁగన్ గురిసెను విమలాకుంఠ ధారాసమృద్ధిన్. 58
అట్లు సంవర్త సంవర్తకాది మేఘ
సమితి యొకసారి వర్షింప సాగినట్లు
భూరీ ధారాధరంబులు ఘోరవృష్టి
గురియ భీతిల్లి లోక మాకులత బూనె.59
అట్టి జడివానయందు దాననుజ సహిత
ముగను దిరుగుచుఁ జలికి బిట్టుగ చలించి
కఠిన పాషాణ వృత గుహాంగణము జేరి
యభవు కోటీశు నీకు నిట్లని నతించె.60
జయజయ కోటీశ్వర శివ
జయజయ కోటీశ యీశ జయ సర్వేశా,
జయజయ కోటిసురార్చిత
జయజయ కోటీశలింగ స్మరమదభంగా! 61
ఆపదల నిన్నుఁ దలఁపుచు
నీ పదలక్ష్యంబు నెవఁడు నియతి భజించున్
శ్రీపదలబ్ధి దనర్పగ
సాపదలక్షితునిఁ జేసి సలుపుదు వతనిన్. 62
ఓ కోటీశ్వర, యో కృపాజలవిధీ, యో శై లకన్యాపతీ,
యో కోటీశ్వర, యో జగత్ప్రయగతీ, యో భక్తరక్షారతీ,
యో కోటీశ్వర, యో దయామయమతీ, యో కోటిచంద్రద్యుతీ
యో కోటీశ్వర, పాహిపాహి యని దా నుచ్చైస్వరం బొప్పఁగన్. 63
పంచ స్తవములు జదుపుచు
పంచేంద్రియ విషయదూరుఁ బంచాస్యు శివున్
పంచాశుగహర హరునిన్
బంచ బ్రహ్మస్వరూపుఁ బ్రస్తుతిఁ జేయున్ . 64
విశ్వవందిత, విశ్వాత్మ, విశ్వనాథ
విశ్వపాలక, విశ్వాఢ్య , విశ్వవినుత
దేవకోటీశ కోటీశదివ్యలింగ
యి మ్మహోపద్రవము బాపి యిపుడె బ్రోవు.65
అని చింతింపఁగ భక్తపుంగవున కాయాసంబు బుట్టించె నీ
ఘన వర్షొద్ధతియంచు నెంచి మదిలోఁ గారుణ్య మేపారఁ జ
య్యన వారించెఁ దటిల్లతాభయదగర్జారావు సంపాతయు
గ్ఘన సంఘాతము చంద్రశేఖరుఁడు భక్తానంద సంధాయియై.66
ఘనతరోద్ధాన మడఁగిన గానిపించు
పరమహంస స్వరూప విస్ఫురణ భంగి
ఘన తరోద్ధాన మడఁగిన గానిపించె
బరమహంస స్వరూప విస్ఫురణ మంత. 67
అప్పుడు గుహాంతరాళంబు వెల్వడి దశదిశావలోకనంబు నేసి, యమ్మహో త్పాతంబు కోటీశ్వరానుగ్రహంబునం బాసెగదా యవి దేవు జూడం జను'నెడ నడుమ నిర్ఝరనిర్ఘాత ప్రభిన్న కుట్టిమ స్థలంబున నతి స్థూలంబగు నొక్క నిధానకలశం బీక్షించి యది శివాజ్ఞాగతంబని యెఱింగి తమ్ములుం దానును దాని నతిప్రయత్నంబువ నిజగుహాంతరంబునకుం జేర్చి దానివలన దినదిన ప్రవర్ధమాన మహైశ్వర్యవిభవుండై యఖండ మహిమానుభావంబున జంగ మార్చనలు సేయుచు శివజ్ఞాన సంపన్నులగు మహాత్ములవలన శివపురాణ
శ్రవణంబు వేయుచు నిత్యంబును గోటీశ్వరారాధనం బొనర్చుచు, కాలంబు
సుఖానుకూలంబుగాఁగడుపుచుండి యొక వేళ జంగమార్చనంబును నొక
వేళ శివపూజయు, నొక వేళ శివమంత్రజపంబును నొక వేళ శివధ్యాన సమాధి
నిష్ఠయు నొకవేళ కోటీశ్వర లింగార్చనంబునుం గావింపుచుఁ బరమానంద
కందళిత స్వాంతుండై యొక్క నాఁడు –68
తన యిలు వెలువడి యొక్కఁడె
మునిసేవితుఁ గోటిలింగమును బూజింపన్
జనుచుండి నడుమఁ గాంచెను
వనమొక్కటి పత్రపుష్పఫలపూర్ణంబున్.69
ఆ వనరాజమందు భువనాపను శంకరుఁ బూజసేయఁగాఁ
భావన వృక్షశాఖల శుభప్రసవావళిఁ గోయుచున్న యా
ధీవనజాతగర్భులగు దిన్యమునీంద్రులఁ జూచి వారి స
త్పావన పద్యుగంబునకు భక్తిరతిన్ నఁతిజేసి ముందటన్,70
పోవ పోవఁగ నంత నపూర్వమహిమ
గలుగు సహకార వనరాజి గానుపించె
మదన సహకార మిది మధుమాసమునను
చోద్యమగు దీని మహిమంబుఁ జూతమనుచు.71
చని చని ముందట.72
అంత గమలాకరంబులై యలరునట్టి
చారు కమలాకరంబులు సరణి నరిగి
బిల్వ కాంతారమొక్కటి ప్రేమఁగాంచి
తద్ద్విలాసంబు వీక్షించి తనివిసనక.73
లయగ్రాహి ;
అందుగల చిత్రముల యందముల జూచి తరుబృందముల నీడలను పొందుగ
మనోజ్ఞా ! నందరసమగ్నులయి యిందుధర పూజన మమందముగఁ జేయు
చును డెందములు సౌఖ్య స్పందగతి లింగములయందు నలియింపుచు
పురందరముఖామరుల కందని మహత్త్వం | బందగల భక్తులను కొందఱిని
జూచీ మది సందడిలు భక్తి ముద మంది యతఁ డంతకా.74
ఇచ్చటను శంకరార్చన
విచ్చల విడిఁజేయ మదికి వేడుకపు
సచ్చరితు లిచట నీశ్వరు
నచ్చుగఁ బూజింప మోక్షమందుట యరుదే :75
అనుచుఁ జింతించి సాలంకుఁ డాత్మలోన
సారసాకర కాసార సారతీర
భూరి శాఖాతికయ బిల్వమూలమందు
మౌననియతి పద్మాసనాసీనుఁడగుచు. 76
ఉద్ధూళన త్రిపుండ్రము
లిద్ధ గతిన్ దాల్చి యతఁడు నీశ్వర సేవా
బద్ధాత్ముఁ డగుచు నెంతయు
సిద్ధాసనమందు నిల్చి శివుఁ జింతించెన్.77
కరతలంబుననున్న కలితేష్టలింగంబు,
దశవిధాలోకన దశను జూచి
చూపువెంబడి లింగరూపంబులోఁ జేర్చి,
లోసాక్షియగు తెల్విలో నమర్చి
ప్రాణలింగమునందుఁ బ్రామాణ్యగతిఁ గూర్చి,
భావలింగైక్యత పదిలపరచి
యందులోఁ దానైక్యమంది చిదాకాశ
మూర్తియై యానందభూతిఁ గాంచి
కొంతసేపు సమాధిచే గుణము లణఁచి
మరలఁ దెలివొంది కోటీశు మానసమున
పూజ గావింపఁదలఁచి యా పురవిరోధి
సుగుణరూపంబుఁ జింతించి స్వాత్మయందు.78
శరదిందుకోటిసుందరమూర్తి గలవాని
పటు జటామకుట విభ్రమమువాని
నీలకాంబరీ నీలకంఠమువాని
భుజగేంద్రహార విస్ఫురణవాని
వరదాభయమృగాగ్నికరచతుష్కమువాని
వ్యాఘ్రాజినాంబర ప్రభలవాని
వేదమంజీరాఢ్య పాదపద్మమువాని
వేదాంతవేద్యుని వేదమయుని
ఆ పరాశక్తి సహితుని యా పరాత్ము
నా మహామహు కోటీశు నాత్మనిలిపి "
పూజగావించె నుపచారముల నొనర్చి
భక్తిశీలుండు సాలంక భక్త వరుఁడు.79
అంత గనువిచ్చి చూచిన యా క్షణంబ
యిష్టఫలదాయియైన కోటీశ్వరుండు
జంగమాకృతి దాల్చి విశాల బిల్వ
మూలవేదిక వసియించె ముదము గదుర.80.
అంత నిర్వర్తి తేశ్వరధానుండగు సాలంకుం డెదుటఁ గనఁబడు నాజంగమ
మూర్తి సాక్షాత్కోటీశ్వరుఁగాఁ దలంచి యభివాదనంబొనర్చి, తనయింటికిం
దోడితెచ్చి, నిత్యంబు జంగమార్చన వ్రతంబున కేర్పఱచుకొని యమ్మహా
పురుషున కర్పించిన పయశ్శేషంబాహారంబుగా నఖండ నిష్ణాపరుండై
యుండునంతఁ గొంతకాలంబున కతం డంతర్హితుండైన జింతాక్రాంతుండై
యగ్గిరి ప్రాంత వనాంతరంబులు వెదకి,యెందుం బొడగానక నిరశన
వ్రతుండై యుండు నా సమయంబున81
ఆనందవల్లి కథ
పుండరీకభవాండ కరండ నిహిత
మండితామూల్య రత్నప్రకాండ మనఁగ
నిండు సంపద జనులకు నుండఁదగిన
కొండకావూరు తద్గిరిదండ నుండు.82
ఆ రమణీయ పట్టణమునందున నింద్రసమాన కీర్తి వి
స్తారుఁడు, మేరుధీరుడు, సుధాబ్ధిగభీరుఁడు, వీత దుష్క్రియా
చారుఁ డుదారుఁ దాత్త సునిచారుఁడు శాశ్వతభాగ్యయుఙ్మహా
భీరుఁడు దా సునందుఁడని పేరువహించి ధరిత్రి మించెడిన్.83
ఏ వంశమందు బెరిగెనో
శ్రీ వల్లభుఁడైన శౌరి శ్రీకరుఁడును ము
న్నే వంశమందుఁ బుట్టెనో
యా వంశమునను సునందుఁ డచట జనించెన్.84
కందరి యన నొకసతి సతి
సుందరి నుద్వాహమయ్యె, శుభగుణుఁ డతఁ డా
నందకధరుఁడు పయోనిధి
నందన నుద్వాహమైన నయముదలిర్పన్ .85
ఆ సతీమణి గలిసి నిత్యానురక్తి
నందనను గాంచె నాత డాఁనందవల్లి
యను లతాంగిని, నదియు దినాభివృద్ధి:
బడసె వాసంత మల్లికావల్లిబోలె.86
నంద నందనుఁడయ్యే నా నాథుఁ డల సు
నంద నందన నాదు నే ననుచు లక్ష్మీ
యా సునందున కాత్మజయై జనించె
ననఁగ నానందవల్లి తా నతిశయిల్లే.87
హరుఁడు కోటీశుఁడై త్రికుటాద్రియందు
నిలువఁ దద్భక్తి తత్రాంత కలిత నగరి
గరిమ నానందవల్లినా నెఱి జనించే
నట్లు గాకున్న బుధజనాహ్లాదమగునె.88
మఱియు నబ్బాల శిశుత్వంబునందు నిచటి కోటీశనిలయ త్రికూట కూటం బులం జూచు వైఖరి మెల్లనం గనువిచ్చి చూడఁ దొడంగె. శివభక్తి రహితులై చెడు జనంబుల శిక్షించిన నవ్వు చందంబున నవ్వసాగె. శివనామంబు వలుకు లీల మెల్లనం బలుకఁ బూనె. కోటీశ్వరదర్శనంబున - కరుగు రీతిఁ దడబడుచు నడుగిడఁగఁ దొడఁగెఁ నంత కౌమారసమయం బగుటయు నాభీరమతల్లి యానందవల్లి తల్లిదండ్రులు వేయు హారవల్లరులును ఫుల్లకల్హార మల్లికా మాలికలనుం దిగనాడి భద్రరుద్రాక్షమాలికలు గ్రీవాలం కారంబుగా ధరింపును మేనంబూయు కర్పూర కస్తూరికాపటీర గంధ చర్చా చర్చ నుత్సాదనంబు చేసి భసితాంగరాగం బంగంబునం దనురాగంబునం బూయుచు బోటు లాటలంబాడు జిలిబిలి పాటల నటులోటఁబుచ్చి మాటి మాటికిఁ గోటీశమీఁది గాథల మాటలు నోటికి సూటిపఱచుచు నింద్రి యంబులఁ దత్తద్విషయంబు లనుభవించునెడఁ గోటీశ్వరార్పణంబు సేసి గ్రసింపుచు నిట్లఖండ భక్తి భావనావశంబుననుండు నవసరంబున వధూమ తల్లియగు నానందవల్లికిఁ దల్లి యిట్లనియె.89
అమ్మ మనయింట సకల భాగ్యంబులుంట
నవియు భోగింప కీ లీల నవయదగునె
నవలతాతన్వి యీ తపోనటనలెల్ల
ఆపసులకుగానిఁ చిన్నారి తరుణి కగునె ?90
అనిన నెయ్యంపుఁదల్లికి గారాబు కూతు రిట్లనియె. 91
అమ్మ యిం దుండు భోగ భాగ్యంబులెల్లఁ
జెడును గూడంగ రావెందుఁ జెడదు శంభు
భక్తి కూడంగ వచ్చును ముక్తి నొసఁగు
దీని విడనాడ వచ్చునే మానవులకు? 92
శివభక్తి కలుగు మీఁదట
నవిరళ సద్భోగభాగ్య మబ్బినమేలౌ
ధవుఁడున్న మీఁద నింతికి
నవభూషణ స్రగ్విలేపనంబులువోలేన్ ,93
లోని నిక్షేపమెఱుఁగక దానిమీఁద
నిలిచి సంసారమొనరించు నిస్వునట్ల
హృదయగతుఁడైన యీశ్వరు నెఱుఁగలేక
బాహ్యమున నీళ్లు వెదకును పామరుండు.94
జననీ : మనము కోటీశ్వర స్థలములోన
నుండి యద్దేవు గొల్వకయుండఁ దగునే ?
తుచ్ఛసంసార విషయ సందోహములను
మరగి యురగేంద్ర భూషణు మఱవఁదగునె?95
కామముఖారులం గెలిచి గాఢవిరక్తిని శంభుభక్తుఁడై
కామవిదారిఁ గొల్చినను గల్గును మోక్షసుఖంబు లిప్పుడే
కాముకుఁడై దురింద్రియ వికారములంబడి శంభుఁ గొల్చినం
గామసుఖంబులం దనిసి కాంచును దాఁ గ్రమముక్తి నెంతయున్ .96
గరిమతో భోగమోక్షముల్ గలుగఁజేయు
నిహపరంబుల శివభక్తి యేమి చెప్ప
నట్టి భక్తిని వర్ణించి యల్పమతులు
విషయ విభ్రాంతిఁ జేడుదురు వెఱులగుచు.97
ఇట్లు కావున, మనము కోటీశునందు
మనము గదియించి విషయవాసనలు త్రుంచి
పూజఁగావింతు మనిన నా పువ్వుటోడి
తల్లిదండ్రులు భక్తి చిత్తమున దాల్చి.98
పరమానంద మగ్నులై కోటీశ్వర ధ్యానలీన చిత్తులై యుండిరంత నా
సునందుండు.99
తనయావివేకసాకము
తనయాప్తుల కెల్లఁ దెలిపి త్త్వస్థితిచే
త నయానురాగ వృత్తిని..
తన యాత్మఁ దలంచే శివునిఁ దద్దయుభక్తిన్ .100
బాలిక యిది శివభక్తి
శ్రీ లలితయ యగుట దీని శివభక్తునకున్
లీల వివాహము నేయుట
మేలంచుఁ దలంచె నతఁ డమేయ మనీషన్ .101
అంత నానందవల్లికి దిదృక్షు జనానందవల్లి ఫలప్రాయంబగు యౌవన
ప్రాయంబు దోపఁ ద్రిజగన్మోహిని యగు మోహినీకాంతయుం బోలె
నక్కాంత నితాంతకాంతికాంతయై విరాజిల్లుచుందే నంత.102
కమల కచ్ఛప కాహల కరభ పులిన
పుష్కరావర్త వీచికా భూభృ దబ్జ
బిస శశాంక వయోవాహ విజయకరము”
లలితపాదాది వేణికాంతాంగకములు.103
మగువ సౌందర్య వారాశి మథనజనిత
లక్ష్మీయో యన సౌభాగ్య లక్షణముల
కెల్ల నిల్లయి యౌవనం బేపుమీఱ
స్మరవీరోధిని మోహింపఁ జాలియుండె. 104
అట్టి వయః కాలంబున
గట్టిగఁ గోటీశు నభవు గామించఁగ నే
పట్టున నన్యుల పైఁదగఁ
బుట్టునే కామంబు భక్తి పూర్ణాత్ములకు.105
కోటీశున్ మదిఁ బూజనేయు, నభవుం గోటీశుఁ జింతించు,దాఁ
గోటీశున్ వెలి జూడనేగు, నుడువుం గోటీకు నామావళిన్ ,
గోటీశార్చన సేయుచుండును మనఃకోటిం దివారాత్రముల్
గోటీశుండె సమస్త విశ్వమని సంకోచంబు మానున్ మదీన్ . 106
ఆ తలోదరి హృదయాంబుజాత పీఠి
గోటిలింగంబు నిల్పి యకుంఠ భక్తి
బూజఁ గావించు సంకల్ప పుష్పములను
ప్రకట జీవోపహార మప్పనము నేసి. 107
ఇభరాడ్గామిని బాహ్యదేశమున గోటీశార్చనల్ నేయఁగా
శుభ సద్వస్తు వితానముల్ గొనుచు నా క్షోణీధ్ర కూటాగ్ర భూ
విభవోపేత శివాలయంబునను, సంవిల్లింగముం జూడఁగా
నభయం గొప్పగ నేఁగుచుండును వయస్యానీక సంయుక్తయై. 108
భస్మత్రిపుండ్రాంక ఫాలభాగముతోడ
విమల రుద్రాక్షహారములతోడ
కోటీశ భావనాకుంఠితమతితోడ
పంచాక్షరీ జపప్రౌఢితోడ
కరగత రుద్రాక్ష కంకణంబులతోడ
శివభక్తి లాంఛన స్థితులతోడ
నానంద హృష్టరోమాంచితాంగము తోడ
మహిత యోగారూఢ మహిమతోడ
దనరి యా యింతి కోటీశు దర్శనంబు
సేయఁగా నేఁగు నచ్చటి సిద్ధసమితి
భక్తి యీ లీల మూర్తియై వచ్చెననఁగ
భూమి నానందవల్లి, కాంతామతల్లి109
ప్రత్యహం బట్టు లయ్యింతి పర్వతేంద్ర
మెక్కి యచ్చట కోటీశు నిష్టలింగ
మూర్తిఁగాఁజేసి పూజించుఁ బూని ప్రాణ
భావలింగంబులం దైక్య పదవినొంద.110
సేయు నుత్తరశైవ సంసిద్ధి లేక
యుండియును, దాను సద్భక్తియుండు కతన
షట్థ్సలాధ్వావధానంబు చంద్రవదన
చి త్తమున చంద్రధారణచేసి నియతి. 111
పూజించున్ శివుఁ బుష్పదామములచేఁ బూబోఁడి కోటీశ్వరున్
రాజచ్చంద్ర కళావతంస సమమై రంజిల్ల మౌళిస్థలిన్
తేజస్ఫూర్జిత ధూపదీపముల నెంతే నిచ్చు మాధుర్య వి
భ్రాజ ద్దివ్యఫలోపహార మొసఁగున్ భక్త్యన్వితస్వాంతయై. 112
అతివ ! మధుమధుర ఫలోపహార మొసఁగి
విసము మెసఁగిన చేదు నిం పెసఁగ మాన్చె
నిరతమృష్టాన్న నైవేద్య నియతివలన
నాది భిక్షుత్వ ముడిగించె నభవునకును.113
ఇట్లు నిరంతరం బబ్బాల బాలేందు మకుటు నారాధింపుచుండి యంత నొక్క
నాఁడు మహాశివరాత్రియం దోంకార నదీజలంబుల స్నానంబుజేసి, సితభసితో
ద్ధూళన త్రిపుండ్ర రుద్రాక్షమాలికాలంకృతదేహయై శివనామామృతాంచిత
రసనయై శివధ్యానలీనచిత్తయగుచు, నొక్కతియ య క్కు ధరేంద్రంబెక్కి
యక్కడ రుద్ర శిఖరాగ్రస్థ కోటీశ్వర మహాలింగంబు షోడశోపచార పూజా
విధానంబుచే నారాధనంబుజేసి, తత్య్రాంతకాంతబిల్వవనాంతర మధ్యంబు
నం దొక్క శ్రీతరుమూలంబున పద్మాసనాసీనయై, జితేంద్రియ మరున్మనో
వికారియై, కోటీశ్వరలింగంబు హృదయరంగంబున నిల్పి యంత మానస
పూజావిధానం బధిష్ఠించి మఱియు—114
వటమూలరత్న విస్ఫుట వేదికామధ్య
హాటకోల్లసిత సింహాసనమున
శతకోటి కందర్ప సౌందర్యమహిమతో,
కలితశరన్మేఘ కాంతితోడ
సితభాను భానుళుచినయనములతోడ
దరహాసశోభి వక్త్రంబుతోడ
వరదాభయ మృగాగ్నికర చతుష్కంబుతో
మౌనముద్రాచ్ఛన్న మహిమతోడ
దనరి భక్తార్తి హారియౌ మునిశరణ్యు
మదనహరు నీలకంఠు నుమాసహాయు
హృదయగతుఁజేసి, తన్మూర్తిఁ జెదరకుండ
నిలిపి పూజించె నాభీర లలన భక్తి.115
జలజలోచన రాజోపచారములను
పూజఁ గావించి తల్లీన బుద్ధియగుచు
తన్ను జగములు మఱచి నేత్రములు మూసి
చొక్కి యంతట కనువిచ్చి చూచునపుడు.116
ఆ లలన భక్తి యుక్తికిఁ
జాలంగా సంతసించి జంగమరూప
శ్రీలలితుఁడు కోటీకుఁడు
బాలామణి కెదుట నిలచె బ్రస్ఫుటలీలన్.117
ఆమూర్తిఁగాంచి డగ్గరి
భామిని సాలంక భక్తవరునకు వని ము
న్నీమూర్తిగా దె కన్పడె
నా మూ ర్తినిఁ గొలుతునే ననంతము ననుచున్.118
ఆమహాత్ముఁడు క్షీరోపహార మొకటి
దక్క నన్యంబు గొనఁడని తానెఱింగి
యుంట, గోక్షీరములు దెచ్చి యువిద భక్తి
నర్పణము సేయు నిత్యకృత్యంబుగాఁగ.119
మున్ను సాలంక సద్భక్త పుంగవుండు
క్షీర మాతని కొసఁగి తచ్ఛేష మాత్మఁ
దృప్తిగాఁజేసి శేషమప్రా ప్తమైన
వాసరంబుల నుపవాసవ్రతము జేసె .120
నేనును గోక్షీరము లీ
మౌనీంద్రున కొసఁగి శేషమాహారముగా
బూనెద తచ్ఛేషంబును
లేనియెడం దనువు విడుతు లీల దలిర్పన్ .. 121
అని యి భీరాంగన
ఘనమగు తద్వ్ర తము బూనఁ గదలక యతఁడున్
దన యిచ్చజనక నిచ్చెను.
వనజాక్షికిఁ బ్రాణహాని వచ్చునటంచున్ .122
ఇట్లు నిల్చిన నయ్యింతియుఁ బ్రతిదినంబును విష్ణుశిఖర ప్రాంత కాంత
బిల్వకాంతారాంతరస్థిత పాపవినాశన లింగాగార ప్రాగ్భాగస్థ ద్రోణికాంత
ర్జలంబులందోఁగి తదంబుపూర పూరిత పూర్ణకలశంబు శిరోభాగంబున
ధరియించి రుద్రశృంగసంగత ప్రాచీన కోటీశ్వరలింగాలయ సమీప బిల్వ
భూజాతస్థితుండగు నమ్మహాపురుషమూర్తికి ఉదత్కలశోదకంబుల నభి
షేకంబుఁజేసి తత్రస్థ బిల్వ వనదళంబులం బూజించి, ధూపదీపంబులిచ్చి,
క్షీరోపహారంబొసగి, తచ్చేషంబు తాను బానంబొనర్చుచు, నిరశనవ్రతంబుఁ
బూని, కొంతకాలంబిట్లు గడుప, సాలంకాభిఖ్య భక్తవరుం డది విని
యమ్మహాత్ముండు తనకు దర్శన మిచ్చిన జంగమమూర్తి యగునని
భావించి,యగ్గిరి కరిగి, యచట న న్నగారోహణంబు జేయఁబూను
నవ్వల్లవీ పల్లవాధరంగని, నిజోదంతంబెఱింగించి, యీ పర్వతాగ్రంబున
నీచేతఁ బూజఁబడయుచుండు నమ్మహాత్మునకు సమయంబెఱింగి, నన్నెఱిం
గింపు మంతఁదాక నిచటికి వచ్చుచుఁ బోవుచుండెద ననిన నయ్యింతియు
నట్ల చేసెదననీ యమ్మౌనియు మౌనముద్రాధరుండగుట సమయంబుగామి
నెఱింగింపదయ్యె, నంతఁ గొంతకాలంబరిగిన గ్రీష్మసమయంబున నయ్యు
విద విష్ణుశిఖరప్రాంతస్థ ద్రోణికాజంపూరిత కలశంబు శిరంబున నిడికొని,
యమ్ముని సమీపంబువ కరుగునెడ నుష్టభాను రాను తప్తగాత్రయై
యలసి, యెట్టకేల కచ్చటి కరిగి యక్కలశం బచ్చోట నిలిపి బిల్వ
పత్రార్థం బరుగునంత నొక్క వాయనం జరుదెంచి యక్కలశంబు దోని
కినం గినిసి నేఁడాది ని న్న గేంద్రంబునకు వాయసంబు రాకుండెడు మని
శపించి బహు శ్రమాకలితయై యున్న యన్నాతికి దయాక్రాంతస్వాంతుండై.
యతం డిట్లనియె.123
బాల నిజగృహంబున సుఖోపాయముగను
నిలిచి విషయాభిలాషమై నిఖిల సుఖము
లనుభవించెడి నిండు యౌవనమునందు
వవమునందున నాయాపపడగనేల ?124
అన విని జవ్వని యమ్ముని
గనుఁగొని తా నిట్టు లనియెఁ గాయము ప్రాయం
బను విషయములును, గాలం
బును సత్యంబగునె వట్టి మోహము లేలా ?126
వయసు వేళల ననశన వ్రత తపోగ్ర
వన నివాసాది కృత్యము ల్వదలి కామ్య
సుఖములే కోరి, భోగింపఁ జూచెనేని
ముదిమి వచ్చిన నింతైనఁ గదల వశమె ?127
కామ మెక్కువౌను, కడియు నోటికి బోదు
ధనమునందుఁ బ్రేమ దగులు మిగుల
చిక్కువడుచు నుండు జింతల వంతల
ముదిమి మోక్ష సౌఖ్యమునకు తెరవె ?128
అనిన వీని యయ్యింతికి వైరాగ్యంబు గలుగుట నమ్మునీంద్రుండు దెలిసి,
జ్ఞానోపదేశంబు జేసియైన నీ వ్రతాయాసంబు మాన్పెదగాక యని తలంచి
యిట్లనియె 129
నీకు వైరాగ్య ముండుట నీలవేణి
జ్ఞాన ముపదేశ మొనరింపఁ బూనినాఁడ
భూరి పై రాగ్యమే జ్ఞాన కారణంబు
జ్ఞాన మెక్కడ వైరాగ్య హీనునకును?130
ముఱియు బాహాభ్యంతరమ్ముల దశదిశావకాశంబుల సంకట పరిపూర్ణంబై చిదాకాశంబగు బ్రహ్మం బొక్కటియె విరాజిల్లు, నందుఁ ద్రిగుణాత్మకమైన మాయాశక్తి తదభిన్నమై జనించిన నది యుపాధిగాగల చైతన్యం బీశ్వ రుండై బ్రహ్మవిష్ణు రుద్రరూపంబుల జగత్సర్గస్థితిలయంబు లొనర్చుచుండు, నమ్మాయాశక్తి యవ్యక్త మహదహంకార పంచమహాభూతంబులయ్యె, నీ భూతంబులు సూక్ష్మస్థూలాంశలవలన సూక్ష్మస్థూలదేహంబులును, సకల జగజ్జాలంబునయ్యె నయ్యచలంబగు చిదాకాశంబునందె సంకల్పశక్తి యుదయించె నదియ యవిద్యయనంబడు. తదధిష్ఠానచైతన్యంబె జీవుండనఁ బడి స్వరూప విస్మృతివలన ననేక కోటిజన్మంబులెత్తుచుండి సుకృత పరిపాకంబున మనుష్యుండై గురుముఖంబున స్వరూపస్మృతి ముక్తుండగు; నా ముక్తి ద్వివిధయగు నందు చిదాకాశంబున మనోలయంబు చేయుటయు, సర్వంబును బ్రహ్మంబుగా సర్వావస్థలయందును విస్మృతిలేక చూచుటయు, నందు రెండవముక్తి యుత్తమ మగు; నందు మొదటి ముక్తికి సంకల్ప క్షయంబును, రెండవ ముక్తికి వాసనాత్యాగంబును జేయవలయు, మనోలయా భ్యాసంబునంగాని వాసనాత్యాగముక్తి సంభవింపదు. వాసనాత్యాగంబునం ధర్మవ్యాధ తులాభారంబున వసిష్టాదులు పుత్రదారాది సహితులై జీవన్ముక్తు లైరి. కలియుగంబున సకలవర్ణాశ్రమంబులవారును శిశ్నోదరపరాయణు లును కామక్రోధలోభమోహమదమత్సరావృత్తులునునై బహువిధ వేదాంత గ్రంథశ్రవణంబునను మహా వ్యాఖ్యార్థిపదేశంబుల సేయు నయ్యధికారి గురుప్రాతంబులవలనను, తత్త్వజ్ఞానంబు తమకు దృఢంబై నట్లు భ్రమించి వాసనాత్యాగ యోగలక్షణం బెఱుంగకయె వసిష్ఠాదులంబోలి జీవన్ముక్తుల మని పలుకుదు రది యసంగతంబు. వారలు వాసనాత్యాగశీలురును, నెడనెడ మనోలయావధానులును భూత భవిష్యద్వర్తమాన జ్ఞానులును వర్ణాశ్రమా చార విధికర్మరతులును నిత్యకర్మత్యాగులునై శాపానుగ్రహ సామర్థ్యంబులు గలిగి యుందురు. వీరలు వాసనాగ్రస్తులై వర్ణాశ్రమ విధికర్మంబులు దొరంగి నిషిద్ధకర్మంబు లాచరింపుచు నిమిషమాత్రంబైన మనోలయంబు నేయ నేరక జ్ఞానులమని వృథాహంకారంబులం దిరుగుట వాసనాత్యాగ ముక్తిం గనలేరు. కలిగెనేని నిమిషమాత్రంబైన చిత్తవిక్షేపంబులం బాసి మనో లయానందంబేల యనుభవించ రట్లగుట కలియుగంబున మనోలయవాసనా త్యాగంబులు సంభవింపవు, మోక్షేచ్ఛగలవాఁడు మోచకుండగు నీశ్వరు
నుపాసించినఁ దదనుగ్రహంబున గామియైనఁ గామిత సుఖంబులబొంఢీ
దప ముక్తుండగు, నకామియైన సద్యోముక్తుండగు; నయ్యీశ్వరుండును
బహ్మవిష్ణు రుద్రాత్మకుండై పంచవింశతి లీలాభేదంబుల రామకృష్ణాద్యవ
గౌరభేదంబులు నానావిధంబులఁ గ్రీడించు నందు దక్షిణామూర్తి లీలా
స్వరూపం బుపాసించిన శ్రీఘ్రంబుగా సర్వేష్టసిద్ధులం బడసి సద్యోముక్తి
గాంచు నదెట్లనిన—— 131
మున్ను దక్షాధ్వరమున దక్షుఁడీశ్వరు
నిందింపగ విని యనింద్య యగుచు
దాక్షాయణీదేవి తనువు విసర్జించి
శీతాద్రిరాజ సంజాత యగుచు
వైరాగ్యమున మనోవైభవం బెడలింపఁ
బురవైరి దక్షిణామూర్తి యగుచు
వటమూల వేదిక వసియించి తను దానే
గను సమాధిని మహామునులు గొల్వ
బ్రహ్మమై యుండె నద్దేవు భజనచేత
నఖిల సిద్ధులు వాసనాత్యాగయోగ
ఘనసమాధి మనోలయక్రమము లిష్ట
సంపదున్నతి గల్గు నీజన్మమందే.132
ఆ దేవో త్తము డా సన
కాదుల క య్యాత్మవిద్య యలవడఁ బరపం
గా దయను ద్రికూటాద్రిని
బ్రొదిం గోటీశుఁడనఁగఁ బొలుపొందెఁగదాః 133
అట్టి కోటీశ్వరుఁడనేన యంబుజాక్షి :
నీదు సద్భక్తి కిని మెచ్చి నేఁడు జంగ
మాకృతి ధరించి సత్కృప నీకు బోధ
నేయ వచ్చితి మత్పూజఁ జేసి తీవు.134
మీ రుపదేశించిన యీ
సారతరాద్వైతబోధ సరణిని ముక్తి
శ్రీరాజ్య పదము గంటిని
ధీరోత్తమ! నీ బుణంబుఁ దీర్పఁగ వశమే ! 136
అవి తనదు వ్రతము దప్పక
వనజానన సేయుచుండ వలదని యును న
మ్ముని దలఁచెను మది మాయా
జనితోపాయంబు వ్రతము చాలించంగన్. 137
గర్భ చిహ్నంబుఁ గల్పింతుఁ గాంత కివుడె
యదియు నవమాస పూరితంబైన పిదప
నైన మానకయుండునే యతివ వ్రతము
చోద్యమగు దీనిధై ర్యంబు జూతమనుచు. 138
అమ్మహాత్ముండు దన యోగప్రభావంబున నయ్యింతికి గర్భంబుఁ గల్పించిన నదియు నవ మాసపూరితంబై బహుళాయాస కరంబైన నిది మహాద్భుతంబగు దైవ యోగంబనితలంచియు వ్రతంబుఁ జాలింపక చేయు నా తలోదరి ధైర్యంబునకు దయాళుండై య య్యతీంద్రుఁ. డిట్లనియె. 139
నీవు బ్రహ్మంబవై యున్న నిజము గనియు
గర్భభరమున నాయాస కలితవయ్యు.
వ్రతము మానకయుంట యద్భుతము గాదె
యేమి కారణ మెఱిగింపు మిందువదన ! 140
అనినంత నా తలోదరి యిట్లనియె. 141
గురుని మహోపదేశమున గూడిన మోక్షముగాంచి యంత న
గ్గురు విడనాడఁ జెల్లునటె? కోవిదవందిత యట్ల నేను నిం
దరయ వ్రతానుభావమున నాఢ్య భవత్కృప కర్హనౌచు ని
ర్భరత వ్రతంబు మానుట శుభంబగునే తలపోసి చూడగన్ ? 142
అన ముని పల్కు, నో యతివ ! యారయ నీ వచనంబు నుత్యమై
నను భవదీయ కష్టము మనంబున నేను సహింపలేక యి
ట్లనుటయె కాని సద్వ్రతము లక్కట ! యెందును మానవచ్చునే ?
వనజదళాక్షి ! నీ నిజనివాసము జేరుము నేన వచ్చెదన్. 143
నేనువచ్చిన నీ వింట నిలిచి వ్రతముఁ
గడుపఁగా వచ్చు నాయానకలన నీకు
లేకయుండెడు నట్లౌట లేమ నీదు
భవనమున కేగు నీవెంట వత్తు నేను. 144
మరలి చూడక యరుగు మేమరక నీవు
నెచట మరలెద వచ్చోట నేను నిల్తు
ననిన మునివాక్యమాలించి యంబుజాస్య
ముందుగా నేఁగె మునియు పిఱుందనరిగి. 145
ఇట్లు ప్రాచీన కోటీశ్వరస్థానంబునందుండి య య్యాభీరాంగన ముందర వేఁగుచుండ వెనుక నమ్మహాత్ముండు మంధాన కుధర మథన కంధికబంధ శంభూత మహోద్భటార్భటిం జనుచుండఁ దదారావాకర్ణన విదీర్ణ కర్ణపుట యగుచు భీతిల్లి సోపానమార్గమధ్యంబున నిలువంబడి మఱలి చూచె నంతట. 146
మఱలి చూచుట యెఱిగి య మ్మౌనివరుఁడు
తరుణి కిట్లనె నియమంబుఁ దప్పి తీవు
నేను భూమికి దిగిరాను మాని తాజ
శిఖర మధ్యస్థబిలమున జేరినిలుతు. 147
అనుచు ముని పల్క నయ్యింతి యచటనిల్చి
ప్రసవకాలంబు దోఁచినఁ బడసె సుతుని
యది నిరీక్షించి మౌని య య్యద్రి బిలము
జేరి యందు సమాధి నేఁ జేతు ననియె. 148
ఆ మాట విని యింతి, యతనితో నిట్లను
దద్బ్రహ్మకూట మధ్యస్థ బిలము
లోన సమాధిని బూని నీవుండిన
వ్రతభంగమైన జీవనముగోరి
యిహలోకమందు నే నేల నిల్చెద నేఁడు
బ్రహ్మైక్యసంసిద్ధిఁ బడయుదాన
నిదె చూడు మనుచు దా నేకాగ్రచిత్తమై
కోటీశు హృత్పద్మకోశమందు
నిలిపి శరదభ్రరుచిరయు, నీలకంఠ
చంద్రమకుటయు, పటుజటాసాంద్రకాంతి
మహిత ఫణిరాజ భూషయు, మాననీయ
యైన తన్మూర్తిఁ బూజల నందఁజేసి. 149
మున్ను సనకాదులకు మౌనముద్రచేత
పరమవిజ్ఞాన మొసఁగిన భవ్యమూర్తి
యిదిగదా యంచు మదినెంచి యిందువదన
ధ్యానమొనరించి కనువిచ్చు నంతలోన. 150
దేహమందున బ్రహ్మాండ గేహమందు
బ్రహ్మమంతటఁ బూర్ణమై బరగుచుంట
సద్గురుండగు నిమ్మహాసంయమీంద్రు
కరుణచేఁగాక యొండు సంగతిని గలదె ! 152
అని విచారించి 153
అంతటఁ దత్ప్రసాదమున నాత్మసమాధినిఁ జెంది చిత్త వి
శ్రాంతి వహించి, యా సతి విరాజితచిద్గగనస్వరూపయై
యంతయుఁ దానె యౌచును శివైక్యతఁ జెందిన మౌనిచంద్రుఁడున్
స్వాంతమునందు సంతసిలి శైలగుహాంగణభూమి నిల్చినన్. 154
అంతట 155
నిత్య మా భీరకాంత దా నియతి వచ్చు
కాల మేగిన రాకున్న గడువిచార
మంది సాలంకుఁ డజ శిఖరాగ్రమెక్కి
యందు గుహపొంతనున్న య య్యతినిఁ గాంచి. 156
సాష్టాంగ మెఱిఁగిన సంయమి యిట్లను
సాలంక : మున్నొక్క సమయమందు
నీకు దర్శనమిచ్చి నే నంత నంతర్హి
తుండ నై రుద్రాఖ్యఁ దొడరు శిఖర
మందు వల్లవకాంత కగపడ న య్యింతి
వ్రతముజేసినను తద్వ్రతసమాప్తి
సేయఁగాఁ దద్గృహసీమకు నక్కాంత
తోఁగూడ నఱుగ నీత్రోవయందు
పరశివై క్యంబుఁ బ్రాపించెఁ బడఁతి యిప్పు
డేను నీ గుహాంతరమున నిల్వగోరి
నాఁడ గుహమీఁద గుడిగట్టి నయమెలర్ప
నందులో నూత్నకోటీశు నమర నిల్పు. 157
నిల్పి నీవును నిత్యంబు నియతిఁ దనర
బూజఁగావించి శివరాత్రిపూట భక్తిఁ
బ్రభలఁ గట్టించి వీరాంగ వాదనంబు
నెలఁగ నుత్సవమెంతయుఁ జేయవలయు. 158
కాంత సోపాన మధ్యమార్గంబునందు
ఘనసమాధిని శివునందుఁ గలిసె నిచట
నీవు గుడిఁగట్టి యందులో నిలుపు తత్స్వ
రూప మొక్క ప్రతిమ జేసి రూఢిదనర. 159
మును సోపానసథంబున
జనుదెంచెడి వారలెల్ల సద్భక్తిని నా
వనజాక్షిఁజూచి యంతట
ఘనమతిఁ గోటీశుఁ జూడఁగల్గు శుభంబుల్. 160
ఇట్లు కోటీశ్వర పూజా విధానంబుఁ జేయుచు నంత త్రిలోకోత్సవావసరంబగు శివరాత్రి వాసరం బరుదెంచిన నాసాలంకుం డుషః కాలంబున నోంకార నదీ జలంబుల స్నానం బొనర్చి భస్మోద్ధూళన త్రిపుండ్రంబులు ధరియించి
- గమనిక : ఇచ్చటనుండి అసలుప్రతిలో నొక కాగితము పోయినది.
నదెట్లనిన. 161
అష్టోత్తర శతనామములు
ఓంకార వార్ధి శీతాంశు రోంకార బిసపంకజః
ఓంకార పంజర శుక శ్చోంకారాచల కేసరీ. 162
ఓంకార మత్ర సంవేద్య శ్చోంకారాలయ సంస్థితః
ఓంకార పద్మినీ హంస శ్చోంకార వరకుంజరః. 163
నగరాజ సుతాజానిః నగరాజ ధనుర్ధరః
నవభూతి విలిప్తాంగో నాగాభరణ భూషితః 164
నాదామృత రసాస్వాదో నాదబ్రహ్మ స్వరూపకః
నాదాతీతో నాదపరో నాద మూల నివాసకః. 165
నాగాజిన ధరో నాదినాదీ నాదైక గోచరః
నతా ర్తితిమిరార్కాభః నానాభక్త జనావనః. 166
నారదాది మునిధ్యేయో నయవేదీ నరప్రియః
నామరూప పరిత్యక్తో నారాయణసుపూజితః. 167
మోహాంధకార తరణిః మోహకాంతార పావకః
మోహాబ్దికుంభ సంభూతో మోహానల మహాంబుదః. 168
ముగ్ధేందు భూషణో ముగ్ధో ముగ్ధావామాంగ సుందరః
మూలమాయాసమాసక్తో మూర్తిమత్కల్ప పాదపః. 169
కోటీశః కోమలాకారః కోటిసూర్యనమప్రభః
కోటిబ్రహ్మాండ సంచారః కల్పితాఖిల విష్టపః. 170
కుధరేశ్వర మధ్యస్థః కండలీశ్వర కుండలః
కపాలభృత్కృత్తివాసాః కాలకాలః కకుష్పతిః, 171
కపర్దీ కామధు క్కామీ కామదః కామనాశనః
కామేశీ వల్లభః కాంతః కాంతేందూపలభాకృతిః. 172
కేవలః కేశవారాధ్యః కేశాంతర సురాపగః
కీనాశగర్వనిర్హారీ కృపాశుః కృపణార్చితః. 173
కైతవాసుర సంహర్తా కలికల్మష నాశనః
కాలకంఠ కళామూర్తిః కల్పాంత నటనోత్సుకః, 174
కల్యాణదాయీ కళ్యాణః కళ్యాణాచల కార్ముకః
కాలరూపః కాలనేతా కాలాతీతః కలస్వనః. 175
టీకాకారో జ్లానరాశిః టంకాయుధ సముజ్జ్వలః
టంకార జ్యా సమాసక్తో మహాజగవశోభితః. 176
టంకతుల్య జటా యుక్తో టిప్పణీకృత సచ్ఛృతిః
శశ్వద్భాను సహస్రాభః శుంభత్పావకలోచనః. 177
శతానంద సమారాధ్యః శక్రాదిసుర సేవితః
శివ శాంతః శశధరః శర్వ శ్శక్తః 'శ్రితావనః. 178
శూలపాణి శ్శుభావాసః శుచిద శ్శుద్ధవిగ్రహః
శంకర శ్ళోభన శ్ళుద్ధః శమితార్తి శివప్రదః. 179
రాజతాచల శృంగస్థో రతిరాడ్దర్ప సంహరః
రామార్చిత పదద్వంద్యో రక్షితాఖిలచేతనః. 180
రజనీచర సంహారీ రసారథ విరాజితః
యక్షేశ మిత్రో యోగీశో యమి హృత్పద్మ భాస్కరః. 181
యమాదియోగ సంజాత విజ్ఞాన, సులభాకృతిః
యల్లమంద మహాద్రీంద్రశృంగ రంగ న్నికేతనః. 182
అని యిట్లు నామంబు లతిభక్తిఁ బఠయించి
ఫుల్లాంబురుణ్ముఖ్య పుష్పములను
బిల్వదళంబులఁ బ్రియమొప్పఁ బూజించి
ధూపదీపాళి నద్భుత రసాఢ్య
నైవేద్య నీరాజన నతిసుమాంజలి
ముఖ్యోపచారముల్ ముదము గదుర
నర్పించి యీశున కభిముఖంబుగ నిల్చి
నిశ్చలచిత్తుఁడై నిర్జితేంద్రి
యుండయి యనంత సచ్చిదఖండ నిరుప
మాన మానిత స్ఫురణ నెమ్మనమునందుఁ
దలఁప శక్యంబు గాకుంటఁ దత్పరాత్మ
సగుణ రూపంబు నిట్లని స్తవ మొనర్చె. 183
జయకోటీశ్వర, భోగమోక్ష ఫలదా, సాహస్రభాస్వద్ఘృణీ,
జయకోటీశ్వర, మౌనిహృజ్జలజవాసా, దైవత గ్రామణీ,
జయకోటీశ్వర, దైత్యసామజ ఘటా సంక్షోభ శుంభత్సృణీ,
జయ కోటీశ్వర, భోగి భూషణ, శివా చంద్రార్ధ సంశోభితా! 184
అని వినుతింపుచు నచ్చటి
జనముల నీక్షించిపలికె సాలంకాఖ్యుం
డనఘాత్ములార ! మీరలు
వినుఁడీ కోటీశు మహిమ విమల మనీషన్. 185
భక్తచిత్త తాపకరుల, పాపమతుల
గర్వ మద దురహంకార గతు లడంచి
భృత్యులుగఁ జేసి భక్తులఁ బ్రీతిఁ బ్రోచు
నట్టి దైవంబు కోటీశుఁ డవనియందు. 186
శీఘ్రకాలంబునందు నశేష వాంఛ
లొసఁగి దుర్జనకృత బాధ లొందకుండఁ
జేసి ప్రత్యక్షముగఁ జూపు శివుఁడు భక్త
పోషి కోటీశుఁ డిష్టముల్ పొసఁగ నిచ్చు. 187
కోటీశార్చన సత్ఫలంబు సుమనః కోటీశతం బొందదే ?
కోటీశానునిఁ గొల్చినన్ దనలస త్కోటీశుఁడై యుండఁడే ?
కోటీశస్తుతిఁ జాతురంగికచమూ కోటీశతల్ గల్గవే ?
కోటీశుండె చరాచరాత్మక జగత్కోటీశుఁ డెంతేనియున్. 188
సంతరింపరాని సంసార విభ్రమ
భయమడంచి దుష్టపదము బాపి
బ్రోచు కోటిలింగమూర్తిని గొల్తురు
భక్తు లాత్మయోగ భజనులగుచు. 189
సర్వోపద్రవ తాపరోగ భయ కృజ్జాడ్యంబులం బాపుచున్
సర్వారిష్ట దరిద్ర శాత్రవ వినాశం బొప్పగాఁ జేయుచున్
సర్వానందము లిచ్చు మృత్యుహరుఁడౌ సర్వజ్ఞుఁ గోటీశ్వరున్
గీర్వాణాసుర సిద్ధసాధ్య మనుజుల్ కీర్తించు టాశ్చర్యమే ? 190
అమ్మహాదేవుఁ గోటీశు నజ్ఞులైన
తజ్ఞులైనను సర్వశాస్త్రజ్ఞులైన
మూర్ఖులైనను భ క్తిచేఁ బూని తలఁప
సకల సిద్ధులు గల్గును సత్యముగను. 191
కరుణావారిధియై, జగత్త్రితయ రక్షాశాలియై సేవకా
మరభూజంబయి, చిన్మయంబయి, మహామాయాంధకార ప్రభా
హరణార్కద్యుతియై, స్వభక్త జనతాయాపక్షయాపాదియై
పరమాత్ముండగు కోటిలింగము మదిన్ భావింపఁగాఁ జెల్లదే? 192
ధరణి మనుష్యానందము
తరియైనన్ దివిని దేవతానందంబున్
గురుఁడై బ్రహ్మానందము
పరగన్ గోటీశుఁ డిచ్చు భక్తుల కెపుడున్. 193
వరకోటీశ్వర సత్కృపోన్నతి సుదృగ్భావంబు గల్గున్ మనో
హర కాంతాసుత పుత్త్రికాధన మృదువ్యాహార బాహ్యార్థ వి
స్తర శాస్త్రాగమ వేదతర్క కవితాస్వారస్య విద్యావళీ
గరిమల్ దీర్ఘతరాయువుల్గలుగు సాకల్యంబుగా నెంతయున్. 194
మూర్తిత్రయ శిఖరంబై
కీర్తింపఁగఁ దగినయట్టి గిరివరు మీఁదన్
మూర్తిత్రయ మయుఁడై శివు
డార్తిచ్ఛిత్కోటి లింగమై విలసిల్లున్. 195
ఇల మూర్తిత్రయ మూలమై దనరు కోటీశాను సేవింపఁగా
నల మూర్తిత్రితయంబు వశ్యమగు నెట్లన్నన్ ధరిత్రిన్ విని
శ్చల భూజస్ఫుట మూలమున్ బెరుకఁ దచ్ఛాఖావళుల్ వెంబడిన్
చలనంబొందుచు వచ్చురీతిని మహా సౌభాగ్యమూలాంబునన్. 196
ఇట్టి కోటీశుఁ గొల్వక యితర దైవ
వితతి సేవించుటెల్లను వెఱ్ఱితనము
నికట భాగీరథీనదీనీర ముడిగి
మరుమరీచిక సేవించు మనుజునట్ల. 197
తరువు పుష్పఫలమ్మిచ్చు తఱి యెఱింగి
యమర భూజంబు ఫలమిచ్చు నడిగి నపుడె
యమరు విత్తులు ఫలము దేహాంతరమున
విన్నివిధముల నిచ్చుఁ గోటీశ్వరుండు. 198
మూఁడు కూటంబులను జాల మొనసియున్న
య న్నగేంద్రంబు పంచదశాక్షరి యన
కలిత సౌభాగ్య మోక్షము ల్గలుగఁజేయుఁ
ద న్నుపాసనఁ జేసెడి ధన్యులకును. 199
స్థలలింగ తీర్థకోటుల
కలఘుతర మహాధికార మబ్బుటవలనన్
గలిగెను గోటీశాభిధ
మిలలో నా లింగమూర్తి కేమనవచ్చున్ ? 200
మాలిని :
దిగధిపనుతకీ ర్తిన్, దివ్య కోటీశమూర్తిన్
విగళిత సమవర్తిన్, భీతభక్త ప్రపూర్తిన్
మృగధరు నతిభక్తిన్, మించి పూజించిరేనిన్
ఖగ గమనసమానాఖండభాగ్యంబు గల్గున్. 201
కోటీశుఁ గొలుచు సజ్జన
కోటికి నందంగరాని కోర్కులుగలవే ?
యేటికి మపసం సేవన
లేటికి కృష్యాదిబాధ లీ మనుజులకున్? 202
తరళ :
గరళ కంధరు, భక్తవత్సలు, కామితార్థదు, శంకరున్,
పురనిషూదను, చంద్రశేఖరు, భూతనాయకు, శాశ్వతున్,
గురుతరాకృతి, దక్షిణాస్యుని, గోటిలింగముఁ గొల్చినన్
దొరకు నిప్పుడె భుక్తి ము క్తికి దుష్టశత్రువినాశమౌ. 203
చిత్రపదము :
గురువరేణ్యునిన్ గోటిలింగమున్
పరశివాకృతిన్ భక్తి వేద్యునిన్
దురితదూరునిన్ దుష్టసంహరున్
గరిమగొల్చినన్ గల్గు సౌఖ్యముల్. 204
చిత్తక్షోభము మాన్పు, సౌఖ్యరసముం జిందించు, దుర్మాన దు
ర్వృత్తుల్ జేయు విరోధముల్ గెడపుచున్ భృత్యత్వ మెవ్వారికిన్
గృత్యంబై చనఁజేయు స్వస్థలమునన్, గీలించు సంపద్దశల్
నిత్యంబున్ నిజభక్తసంతతికి నోలిన్ గోటిలింగం బిలన్. 205
కోరినను గోరకుండిన
గోరంగారాని యట్టి కోరికలైనన్
కూరిమి భక్తుల కిచ్చును
వారక కోటీశుఁ డట్టివారలు గలరే ? 206
కల్పతరువుల నురమణి కామ ధేను
వులను దివినుంచి ధాత యీ యుర్వియందు
నుంచెఁ గాబోలు కోటీశు నుచిత సరణి
నిట్లు గాకున్న నొసఁగునే యిష్టములను ? 207
దక్షిణామూర్తి దైవంబు దయదలిర్ప
నిలఁ ద్రికుటాద్రియందుఁ గోటీశుఁడయ్యె
ముక్తియన నెంత యా దేవు భక్తతతికి
ముక్తసంగులు గొల్తు ర మ్మునిశరణ్యు. 208
పంచచామరము :
చరాచర ప్రశస్త లోకసాక్షియైన యీశ్వరున్
పరాపర స్వరూపు సర్వభక్త లోకపాలకున్
పురారి నీశు కోటిలింగమూర్తి శంభుఁ గొల్చినన్
నిరాకరించవచ్చు ఘోర నిషురోగ్ర సంసృతిన్. 209
భుజంగవ్రయాతము :
భుజారూఢ భోగింద్రభూషావిశేషున్
నిజానందుఁ గోటీశు, నిత్యంబు గొల్వన్
గజస్యందనాందోళికాయాన జాలం
బజస్రంబు గల్గున్ మహామాయ గెల్చున్. 210
ఒక మహాస్థలి కీశుఁడై యొప్పుచున్న
దై వమును గొల్చి ముక్తికిఁ బోవవచ్చు
నిమ్మహాస్థలిఁ గోటీశు నెసఁగఁ గొల్చి
యేవి కాంచంగవచ్చునో యెఱుగరాదు. 211
స్రగ్ధర :
కోటీశున్ గోపవాహున్ గులిశ ధరనుతున్ ఘోరపాప ప్రణాశున్
జూట స్థాబ్జారిఖండున్ సుమహిత ఫణీరా ట్ఛుభ్రహారాభిరామున్
పాటీరాంభోజ తారాపతి సుశర శరద్వారిదోదారకాంతిన్
సూటిన్ సేవించిరేనిన్ స్ఫురతరవిభవస్ఫూర్తియున్ గీర్తులొందున్. 212
దొనల నీరంబు లభిషేకమునకు గలుగ
దనర భూజింప బిల్వ పత్రములు గలుగ
వని ఫలంబులు నై వేద్యమునకు గలుగ
ఏల యర్చింప రీ దేవు హీనమతులు ? 213
అనుచు నందఱు వినఁ బల్కి య మ్మహాత్ము
డాత్మ చిత్తంబుఁ గోటీశునందు నుంచి
యన్య మెఱుఁగక యానంద మతిశయిల్ల
చలన మెంతయు లేక నిశ్చలత నిలిచి. 214
కావించి మఱియు నాపోవక కోటీశ్వర లింగంబునందు హృదయారవిందంబుఁ జేర్చి దృష్టి నిల్పి, యానందబాష్పబిందుసందోహంబు నయనారవిందంబులఁ గందళింపఁ గంచుకిత రోమాంచాంచిత శరీరుండగుచు గద్గద కంఠుండై యిట్లని స్తుతించె. 215
విశ్వమంతయు నీవయై వేఱు లేక
నిలిచి యుండుటఁ గంటి నీ నిశ్చయంబు
దొలఁగకుండఁగఁ జేయవే తొలఁగెనేని
నిట్టి తెలివికి ఫలము లే దెంచిచూడ. 216
నీ మహిమాస్పద భక్తిని
నీ మహి కొఱతేమి లేక యే నుండుటచే
పామరులగు దుర్జనులను
వేమఱు యాచింపఁబోవు వెత మానెగదా ! 217
పలుకుల్ నీమతియందు, మానసము నీ పాదాబ్జమం, దీక్షణం
బులు నీ రూపమునందు, హస్తములు నీపూజావిధానంబునం,
దల కర్ణంభులు నీకథాశ్రవణమం దర్పించి దీపింప ని
శ్చల వృత్తిం దయఁజేసి ప్రోవఁగదవే సర్వజ్ఞ కోటీశ్వరా ! 218
అని యా లింగముఁ గౌగిలించుకొని, తా నానంద బాష్పాళిచే
దనరంగా నభిషేకమిచ్చి, తన హృత్కంజంబునున్ శుద్ధ వా
సవయన్ ధూపము దెల్పి, దీపముగ విచ్చన్ గూర్చి యాత్మార్పణం
బొనరించెన్ శివభక్తిపూర్ణుఁడయి, వాచ్యోంకారవర్గంబుచేన్. 219
ఇట్లు గావించి సాలంకుఁడేమిచెప్ప
దనివిచాలక యా లింగదర్శనంబు
చేసిచేసి మహానందసిద్ధిఁగాంచి
యెలమి నద్దేవుఁ గనుఁగొని యిట్టులనియె. 220
బాధయొనర్చియు న య్యై యెడల పరిచ్ఛిన్నంబులై జడంబులైన వ్యజనాదులయందు జనించి సుఖంబొసంగిన రీతి నపరిచ్ఛిన్నుండును నదృశ్యుండైన యీశ్వరుండును సృష్టి స్ధితి లయ కృత్యంబులఁ బ్రాణులకు బాధ యొనర్చియు న య్యె యెడల బరిచ్ఛిన్నంబులై జడంబులయిన లింగంబులం దావిర్భవించి భక్తులకు నిష్టార్ధసిద్ధియును ముక్తియును గావించునన నేన దృష్టాంతంబగుదునని యందఱు వినఁ బల్కి మఱియు నిట్లనియె. 221
కోటీశానుని బాసి యుండగఁలనా ఘోరంపు సంసార దు
ష్కూటంబందున జిక్కి సొక్కుచు మనఃక్షోభా ర్తిపాలౌ నస
త్కోటిం గూర్ప కనందు భక్తతతితో గూడంగ నీ యద్రిరా
ట్కూటాగ్రంబునం జేర్పవయ్య నిను నే గొల్తున్ దివారాత్రముల్. 222
కోటీశ్వర ! కోటీశ్వర !
కోటీశ్వర ! యనుచు భక్తికొలఁది నుతింపన్
గోటీశ్వర ! వారల ధన
కోటీశులఁ జేయఁగల వకుంఠిత లీలన్. 223
అనుచు నుతియించు సాలంకు నాత్మవేది
గాంచు కోరిక మదిలోన గడలుకొనఁగ
సిద్ధసంతతి చనుదెంచి శీఘ్రముగను
బలికె నాతనితో మృదుభాషణముల. 224
సాలంక ! నీవంటి సద్భక్తు నెచ్చట,
వినమును జూడము వేయునేల ?
కలియుగం బిదియౌటఁ గనుపడ కే మిట్లు
గుహలలో దాగి త్రికూట నాథు
కోటీశుఁ బూజించి కోర్కెతో నణిమాది
సిద్ధిసంతానంబుఁ జెందినాము
కూటత్రయంబున గుహలును బిలములు
బహుళంబు లుండు నీ పర్వతమున
నందుఁ గల చిత్రములఁ జెప్ప నలవి యగునె
యమర తరువులు సురభు లయ్యమృతనదులు
గలవు తత్ప్రాంతములయందు నిలిచి సిద్ధ
పటలి కోటీశుఁ గూర్చి తపంబు సేయు. 225
ఇమ్మహాస్థలి మహిమంబు లేల చెవ్ప
నెంత జెప్పిన మూఢాత్ము లెఱుఁగలేరు
చెప్పకుండినఁ బ్రాజ్ఞులు తప్పకుండ
గాంచెదరుగాన మౌనంబె గాంతుమింక. 226
అని చెప్పి సాలంకా ! నీవును నిర్విశంకుండవై యిమ్మహాశివరాత్రి నుపవాస జాగరంబులు సేసి కోటీశ్వరలింగంబునకు బిల్వపత్రార్చనంబుజేసి తదాజ్ఞాప్రకారంబుగాఁ బ్రభలుకట్టించి సేవింపుమని యానతిచ్చి, యంతర్దానంబుజేసిన నతండు నా దిక్కున కభిముఖుండ్లై నమస్కరించి నంతట.227
బహు ధనవంతు లౌట నిజభాగ్యసమృద్ధికొలంది భక్తిచే
బహుళ విచిత్రవైఖరి ప్రభానికురుంబము గట్టి చుట్టునన్
బహువిధ వాద్యముల్ మొరయ భక్తవరుం డతఁ డేఁగుదెంచుఁ దా
నహహ వచింప శక్యమె మహాద్భుతమైన తదుత్సవస్థితిన్: 228
మును సతీవతి హిమవంతమునకుఁ బుత్రి
యై జనించిన వైరాగ్య మధిగమించి
దక్షిణామూర్తి రూపంబుదాల్చి శివుఁడు
మునులతోడ నీ కుధరేంద్రమునకు వచ్చె. 230
వచ్చిననాటనుండి హిమవన్నగపుత్త్రి బ్రతిష్ఠ జేయలే
దిచ్చట నెవ్వఁడైన నిపు డీవు ప్రతిష్ఠయొనర్పఁ బూనుటల్
పిచ్చితనంబు గాదె మదిలేదె వివేకము నీకటన్న నా
సచ్చరితుండు దా వినియు సాహసధర్మము మాన కెంతయున్. 231
తరుణేందుధరుని సేవకు
కొఱతయగునుగాదె యిచట కుధరేంద్ర సుతన్
వరభక్తి నిలుపకుండిన
మఱియును ధరలోన బయలమాటలు నిజమే? 232
అని చింతింపుచు నా నగేంద్రసుత దివ్యాగార మధ్యస్థలీ
ఘనపీఠస్థితజేయఁ దత్ప్రతిమ వేగన్ మాయమైపోయినన్
మనమం దెంతయు జింతనొందుచును దన్మధ్యస్థ పీఠమ్మునం
దున గూర్చుండి సమాధినిష్ఠకు మదిన్నూల్కొల్పి ధర్మాత్ముఁడై. 233
లింగమునందుఁ బ్రాణములు లీనమొనర్చి మనోలయంబుచే
నంగవికారము ల్దెలియ కాత్మశివైక్యనిరూఢి నిర్గుణా
సంగ సుఖప్రభావమయ సత్యచిదాత్మకు డౌచు నెంతయున్
లింగము దానయౌచు రహినిల్చె శిలాగృహపీఠికాస్థలిన్. 234
సాలంకేశ్వర లింగం
బాలోన నిలింప సేవ్యమయ్యెను ధరలో
నా లింగమూర్తిఁ గొల్చిన
గాలుని భయ మడఁగు ముక్తికల్గును వేగన్. 235
ఆతని తమ్ములు మువ్వురు
చేతోజాతారి భక్తిశీలురు సుజన
వ్రాతాభినుతులు సద్గుణు
లా తీరుగ లింగమూర్తులైరి ధరిత్రిన్. 236
ఆ లింగంబులు మూఁడు బ్రహ్మహరిరుద్రాఖ్యాతలింగంబు లా
సాలంకేశుని యీశులింగము ప్రభాంచ ద్దివ్యకోటీశ్వరుం
డాలోకింప సదాశివాఖ్యమగు లింగాకారమై యొప్ప నా
శైలోత్తంసము సొంపుమీరు నిల పంచబ్రహ్మలింగాఢ్యమై. 237
ఆ నగేంద్రము మీఁదట నజ్ఞులైన
ప్రాజ్ఞులైన సుధీంద్రియప్రతతి నిలిపి
తపముజేసిన సిద్ధియౌ తద్విపర్య
యంబుగాఁజేయ సిద్ధిలే దరసిచూడ. 238
అట్లు సాలంకు డచట శివై క్యమైన
యంతమీదఁ ద్రికూటాభిధాద్రియందు
మహిత శివరాత్రినాఁడు నమర్త్య మర్త్య
వితతి యుత్సవమొనరించు విభవ మెసఁగ. 239
అందు దేవోత్సవం బెట్టిదనిన. 240
గరుడ గంధర్వ యక్ష కిన్నర సుపర్వ
సిద్ధ సాధ్యదిగీశ్వర శ్రీశ కమల
గర్భ దేవర్షి బ్రహ్మర్షి గణము లుత్స
వంబు గనుగొన వేడుక వత్తు రెలమి. 241
మును దేవేంద్రుఁడు శంభురాజ త్రిజగన్మూర్ధాభి షేక స్థితిన్
గనుటం డా శివరాత్రి కాలమున రంగారన్ ద్రికూటంబునం
దున గోటీశ్వరు బూజఁ జేసినను జెందుం బ్రహ్మపట్టంబునా
కనుచుం దివ్య గజాధిరూఢుడయి డాయన్ వచ్చు నచ్చోటికిన్. 242
భవవిద్వేషి మఖంబునందున హవిర్భాగంబు భక్షింప సం
భవమౌ కల్మష మీత్రికూటమున దీపానేక రూపంబుచే
శివరాత్రి న్నిశి భక్తసంఘముల కక్షీణాంధకారంబు బా
ప వినాశంబగు నంచుఁ బావకుఁడు ఠేవన్ వచ్చు నచ్చోటికిన్. 243
శివభక్తౌఘము మున్నెఱుంగకయె నే శిక్షింపగాఁ బోయి యా
శివుచే శిక్షితవృత్తినైతి నిక నే శ్రీమత్త్రికూటాద్రిపై
శివరాత్య్రాగత భక్షులం గనుచుఁ దచ్చిహ్నంబులుం జూచి వా
రి విసర్జించెదనంచు నంతకుఁడు బేర్మిన్ వచ్చు నచ్చోటికిన్. 244
శివు కారుణ్యముచే దిగీశ్వరుఁడనై చెన్నొందితిం గాని యా
శివభక్షిక్రియ లే నెఱుంగను పలాశి ప్రనస్ఫురద్వంశసం
భవముం గాంచుట నీ శివోత్సవమునన్ భక్తిక్రియల్ గాంతు నం
చువిలాసంబున వచ్చు నిరృతియు దా సొంపొంద నచ్చోటికిన్. 245
సర్వజలాధినాథునిఁగ శంభుఁడు నన్నొనరించె నింక నీ
సర్వజనంబు లుత్సవము సంగతి నచ్చటఁ గూడ వారికిన్
బర్వు పిపాసఁ బాపఁగ శుభాంబువు లచ్చటఁ గల్లజేసి యా
శర్వునిఁ బ్రీతుఁజేతునని సాగరవల్లభుఁ డేఁగు దెంచెడిన్. 246
దరఁ గోటీశ మహోత్సవాగత సుభక్తశ్రేణి మార్గంబునన్
స్ఫురితోష్ణాంశు మయూఖపుంజములచే శోషింపకుండంగ స
త్వరతం బోయి తదీయ ఘర్మజలముల్ వారింప గోటీశ్వరా
దరణంబందెద నంచు నాపవను డుద్యత్ప్రీతి నేతెంచెడిన్. 247
ఎనయ నిధిప్రదాత జగదీశుని మిత్రుఁడనై తదుత్సవం
బున ఘనవైభవంబులను బూర్తియొనర్పకయుంట యొప్పునే
యని ధనదుండు యక్షనివహంబులు గొల్వ విమానయానుఁడై
ఘనమతియై త్రికూటపతిఁ గన్గొనవచ్చును స భ్రమంబునన్. 248
పరమేశానుఁడనయ్యు దిక్పతులలో భాసిల్లి యేనుంట సు
స్థిర కోటీశ మహోత్సవంబునకు నీ దిక్పాలకశ్రేణితో
సరిగాఁ బోవలెనంచు నెంచి మది నీశానుండు వేంచేయు భా
స్వరతారాచలకూట సన్నిభ మహోక్షారూఢుఁడై వేడుకన్. 249
హర్యజుల్ సతతంబు హర్యజనామక
శిఖరస్థులయ్యును శివమహోత్స
వాడంబరముఁ జూడ నమరులతోడుత
తమలోకములనుండి తత్త్రికూట
శైలయాత్రకుఁ బోవ స్వాంతంబునను గోర్కె
జనియింప బరివారసహితులగుచు
వై కుంఠ సత్యలోకౌకసుల్ గుమిగూడి
కడువేడ్కతోడ వెంబడిని నడువ
శ్రీమహాలక్ష్మీ వాణియుఁ జేరి కొలువ
బ్రబల ఖగరాజ సితగరు ద్వాహనముల
నెక్కి దేవర్షితతు లిరుప్రక్కలందు
స్తవము సేయంగ వత్తు రుత్సవముఁ గనఁగ. 250
దివ్య విమాన యానులయి దేవగణంబులు మింటనుండి రా
భవ్య తరాప్సరోంగనలు పాటలు బాడుచు ముందు ముందుగా
నవ్యమరాళయానలయి నాట్యము సేయుచు వచ్చుచుండ స
ద్ద్రవ్యసమృద్ధి నగ్గిరివరంబు జెలంగె మహాద్భుతంబుగన్. 251
ఇట్లు సర్వసుపర్వనికాయం బరుదెంచి యమ్మహామహీధరాధిత్య కాంత కాంత బిల్వకాంతార మధ్యంబునం బ్రవేశించి మహాశివరాత్రిం దత్తద్ద్రోణి కాజలంబుల స్నానంబు సేసి భస్మోద్ధూళిత త్రిపుండ్రాంకిత గాత్రులును భద్ర రుద్రాక్షమాలికా భరణులును, పంచాక్షరీ జపపరాయణులునై త్రికోటీశ్వర లింగంబునకు మహాన్యాసపూర్వకంబుగా నభి షేకంబుచేసి షోడశోపచారంబులం బూజింపుచుందు రిది దివ్యోత్సవంబు మనుష్యుల కగోచరం బింక మనుష్యోత్సవం బెట్టిదనిన. 252
మాఖ శుక్ల ప్రతిపదాది మాఖబహుళ
వరచతుర్దశి పర్యంత మురుగజాశ్వ
మహిష కాసర గోవృషోన్మద వరాహ
కుక్కుట శునక మార్జాల కోటిఁ దెచ్చి. 253
మొక్కుబడి దీర ద్రిప్పుదు రక్కుధరము
నకుఁ బ్రదక్షిణంబుగను జనంబు భక్తి
నభవ కోటీశ కోటీశ హరహరా మ
హేశ యను నినాదము నభం బెల్లనిండ. 254
ప్రతి దినంబును శుద్ద పాడ్యమి మొదలుగా
మాఘ మాసంబున మనుజు లా త్రి
కూట కూటంబుల గురునితంబంబుల
వర బిల్వ కాంతార వాటికలను
దొనల తీరంబున ఘన తటాక ప్రాంత
ముల తింత్రిణీ వృక్ష మూలములను
కాసారముల చెంత గండోపల శ్రేణి
నీడల వల్లికా నిలయములను
వీరమాహేశ్వరాళికి విప్రతతికి
భక్తి సంతర్పణము జేసి పార్థి వార్య
శూద్ర సంకీర్ణకులుల కక్షుద్ర గతిని
నన్న మిడుదురు కోటీశ్వరార్పణముగ. 255
అమ్మహాస్థలి మాఘ మాసమ్మునందు
స్నానములు జేసి భూసుర సమితి కన్న
దాన మొవరింప నశ్వ మేధంబు లొక్క
కోటి చేసిన ఫలమబ్బు కుధరతనయ. 256
అంత శివరాత్రి చేరువైన దిశల
నుండియేతెంచు తండోపతండముగను
వరప్రభాతతి తన్మహోవై భవంబు
శేషభాషాపతులకైన జెప్పఁదరమె. 257
నిడుదలౌ వేణువుల్ నిలువుగా సవరించి
పై చిత్రపటములు బాగ గట్టి
శిఖరాగ్ర కలశముల్ చెలువుగాఁ బొసఁగించి
ముకుర నికరము నిమ్ముగ నమర్చి
పుష్పమాలికల నింపుగ నంతటం జుట్టి
ఘంటాశతము లిరుగడల గట్టి
నందివాహనము లానందమొంద ఘటించి
యామీఁద లింగంబు నమర నిల్పి
ప్రభలు రచియించి శకటముల్ వాహకులును
మోసికొనిరాగ వీరాంగములు చెలంగ
ప్రజలు సనుదెంతు రానందభరితు లగుచు
నెల్లమందేశుఁ గోటీశు నీశుఁ జూడ. 258
ఊరూరం బ్రభ లేగుదెంచు నెడలన్ యోగ్యంబుగా ముందటన్
వీరాంగంబు శివంబులాడు జనముల్ వేశ్యాంగనా నాట్యముల్
భేరి మర్దళ కాహళ ధ్వను లఖర్వీభూతమై నిండ వి
స్తార ప్రక్రియ సేవ సేయుదురు రాజద్వీథులం దెంతయున్ . 259
ఏవీటం గనుఁగొన్న నచ్చటనె కోటీశుండు ప్రత్యక్ష స
ద్భావం బందిన యట్లు దోఁచెడిని శుంభల్లీలఁ దత్సేవలం
దావిర్భూత మహోత్సవంబుగన నాహా యిట్టి యాశ్చర్యముల్
లేవెందుం జతురబ్ధి మధ్య యగు నుర్వి న్సర్వదేశంబుల౯. 260
మఱియుఁ బ్రాగాద్యష్ట దిగంతరాళంబులనుండి మహాపథంబులంజను దెంచు సితాసిత పీతారుణ ప్రభాసముదాయంబులగు ప్రభానికాయంబులు నలుగడల మహోత్తుంగ మృదంగ శంఖపటహకాహళ వీణా వేణుతాళఘంటా నినాదంబు లొక్కమొగి నాకాశం బనవకాశంబు నేయుచు, నసంఖ్యాకంబగు జనం బరుదేఱ నందు వేదశాస్త్ర పురా గమ తర్కవ్యాకరణ మీమాంసా కావ్యనాటకాలంకారాది విద్యలు శిష్యగణంబులకు బాఠంబుఁ జెప్పుచు దారపుత్త్రబంధు సహితముగా వచ్చు బ్రాహ్మణ కదంబంబును, కదంబకుసుమ గుళుచ్ఛచ్ఛాయాచ్ఛాదిత పృష్ఠభాగంబులై జలధరాంతర్గత జలం బాకర్షించి నిజభూత్కారంబుల దెసలు నిండం బ్రవహింపంజేయు చందంబున శుండా దండంబులు మీఁది కెత్తికొనిచను మహోద్దండ వేదండ తండంబులును, వేదండతండంబుల ననుసరించి పథంబునఁ దపన తాపంబునఁ గందు జనం బులకు నిజఖుర పుటోద్ధూత ధరణీవరాగంబున తిగ్మాంశు బింబంబు నాక్రమించి విశ్రాంతిజేయు నభంగ తురంగంబులును, తురంగముల గముల పిఱుందన నతి గమనవేగంబున దేవయా నంబుల యానంబుల నూనంబు గావింప నవి విగతమానంబులై విమానంబులనం బరఁగి లఘుత్వంబువలనం దూలంబుల లీల మింటందూల విజృంభించు సముత్తంగ శతాంగంబులును, శతాంగంబుల సంగతి సింగంబుల భంగి సింహనాదంబులు సేయుచు విగత కోశంబులగు కరవాలంబుల తళతళచ్ఛాయల ఛాయాధిపతిచ్ఛాయల మాయిం పంజాలు సముద్భట వీరభటనికరంబులును గల చతురంగ సైన్యంబులతోడం జనుదెంచు రాజశేఖరులును రాజశేఖర మిత్రసమాన సంపదలు గలిగి ప్రచ్ఛాదిత రాంకవాంబరచ్ఛాయ తటిల్లతావితానంబుగా చక్ర ఘోషంబు లఱుములుగాఁ గాదంబినుల డంబు విడంబించు శకటపరంపరల వలన నానావిధ వస్తువర్షంబుల వర్షించు పర్జన్యులోయన నరుదెంచు వణిగ్జన సముదయంబును, సముదిత యాదోనిధానంబు ననుకరింపుచు సకల వస్తు సంపూర్ణంబై యఖండ మండలాకారంబుగాఁ జనుదెంచు నైరికతండంబును, నమ్మహాదేవు కోటీశు మోహింపం జేయ నేతెంచు విష్ణుమోహినీ రూపకోటియోయనఁ జెలువొందు వారవిలాసినీ సమూహంబును కలిగి విరించనుఁ డుదంచిత సృష్టికృత్యంబుచేత సృజించిన జనంబు నమ్మహా దేవునకుం జూప నాకర్షించిన రీతి వచ్చు నసంఖ్యాకంబగు జనంబును నా జనంబునకు స్థితికృత్యపరుండైన విష్ణునిచేత పోషణార్థంబు కల్పింపంబడిన నానావిధ పదార్థంబులన విపణివీథిన్ విరాజిల్లు నానావస్తుజాతంబును గలిగి శివరాత్రి యుదయకాలంబనం దన్నగేంద్రం బఖండవై భవోపేతంబై ప్రకాశించు నెంతయు. 261
ఆనగేంద్రంబు సేవింప నరుగుదెంచు
మేరు మందర నీలాద్రి తారశిఖరి
వితతియన దీపితారుణ సిత మరీచి
పట కుటీరంబు లొప్పు తత్ప్రాంతమునను. 262
ఆత్రికూటాద్రి సన్నిధి నద్భుతముగ
వీథికాశత సాహస్ర విపణిలక్ష
లక్షితంబౌచు హయగజరథపదాతి
బూరితంబై న యొక మహాపురము దనరు. 263
ఆపురవీథులందు వణిగగ్రణు లంగణసీమలన్ మహో
ద్దీపిత వస్తుజాలములు దెచ్చి నగంబులరీతి రాశిగా
దాపుటచేత సజ్జనవితానము తృప్తివహించి భూమియం
దేపురమందునై న గలదే యిటులంచుఁ దలంచు నెంతయున్. 264
ఒకవంక నవవిధప్రకట ధాన్యశ్రేణి
యొకచోట ఫలరాసు లొక్కయోర
కర్పూర కస్తూరికా గంధసారంబు
లొకచెంత గుడసితా సుకరమధువు
లొకసీమ నవరత్న నికరపేటిక లొక్క
చో మణిభూషణస్తోమ మొక్కు
యెడ చిత్రవస్త్రాళి యేర్చడ నొకచాయ
దారులోహజ సుసాధనచయంబు
గలిగి విశ్వమునందునఁ గలిగినట్టి
వివిధ వస్తుపరంపరల్ వెలయుచుండ
సకల భోగై కనిలయమై సకలసౌఖ్య
భవనమై యొప్పుచుండు నప్పట్టణంబు. 265
అందుండు సర్వజనములు
పొందుగ శివరాత్రినాఁడు భోగస్థితులం
జెందక యాకోటీశ్వరు
నందె మనోరూఢి నిలిపి యచలస్ఫురణన్. 266
సరగద్రోణికలందు స్నానంబులొనరించి
సలిలార్ద్ర వస్త్రసంకలితు లగుచు
భస్మత్రిపుండ్రాంక ఫాలంబు లనువొంద
భసితంబు మేన నేర్పడఁగఁ బూసి
శిరమున కోటీశశిఖరి మారుగ శిలల్
కీలించియును ముక్తకేశు లగుచు
దంపతుల్ గైదండ లింపుగా సవరించి
మ్రొక్కులు దీరగా ముదము గదుర
నభవ కోటీశ కోటీశ హరహరా మ
హేశ యనుచును తనువులం దెరుకమాని
మానితానందసుధను నిమగ్నులగుచు
కొండదిరుగుదు రచ్చటనుండు జనులు 267
జంగమమూర్తులై శివుఁడు శైలముడిగ్గి తదుత్సవంబు బ్రే
మంగని సంతసించి గరిమంబునఁ బూజలొనర్చు భక్తకో
టింగను వేడ్క నెమ్మది ఘటింపఁగ నెంతయు వచ్చెనోయనన్
జంగమకోటి యచ్చటి కసంఖ్యముగాఁ జనుదెంచు నెంతయున్. 268
జంగమంబులు శివుఁడని చాటు శ్రుతులు
నమ్మి జంగమపూజ లున్నతి నొనర్చు
జంగమప్రాణియౌ భక్తజనము మనము
లీన మొనరించుఁ గోటీశు లింగమంద. 269
వీరమాహేశ్వరాచార సంపన్నులౌ
యారాధ్యు లచ్చట నధికభక్తి
నొగిఁ ద్రికూటాద్రీంద్రు నురమున ధారణ
లింగమౌ కోటీశు లింగమూర్తి
నిష్టలింగమునందు నెసఁగ నాకర్షించి
ప్రాణలింగమునందుఁ బట్టుకొలిపి
ధావలింగమునందు బరిణమింపఁగఁ జేసి
యల మహాలింగమం దనువుపఱిచి
స్వాత్మతోగూడ నేకమై సమరనైక్య
తృప్తిచేతను సన్మనోధిప్రవృత్తు
నాత్మఁగలయంగ నంత సర్వాంగలింగు
లగుచు నానంద మొందుదు రద్భుతముగ. 270
అరయ యోగీంద్రు లా త్రికూటాగ్రమందు
నీశు శివు జగత్కోటీశు నెసఁగఁ జూతు
రట్ల యోగీంద్రు లీ త్రికూటాగ్రమందు
జూతు రీశ్వరుఁ గోటీశు శుద్ధమతిని. 271
సర్వమును బ్రహ్మమని చూచు శాంతనిధులు
సర్వమయుఁడైన కోటీశు శంభు జూడ
నరుగు దెంతురు నిస్పృహులయ్యు నింక
నన్యులెవ్వరు నచ్చోటి కరుగకుంద్రు. 272
శివ హర నామోచ్చారణ
మవిరళముగఁజేయు జనుల యారావంబుల్
చెవిసోఁకి ఖగమృగాదులు
శివలోకముఁజేరు నరులు సేరుట యరుదే ! 273
సకల వర్ణాశ్రమాచార సహితులయ్యు
విగత వర్ణాశ్రమాచారవిధిఁ జరించు
పరమహంస లనంగ నేర్పఱుపరాక
నచట నందరు నేకమె యలరుచుంద్రు. 274
కనకగిరిచుట్టు తిరుగు నర్కునికి రాక
సాగనందునఁ దత్ప్రభాచయము నుత్స
వంబు జూడఁగ నంపిన వచ్చినట్లు
ప్రభలు నగరాజు చుట్టును బ్రబలి నిలచె. 275
లలిఁ ద్రికూటాద్రిరాజు మేఖలలచుట్టు
వలిత ఘంటారవములు దిక్కులనునిండ
మేఖలాకారముగఁ జాల మెఱయు ప్రభలు
పత్ప్రభాదీప్తి భానుమత్ప్రభల మీఱు. 276
ఆకోటీశ్వరు దర్శనార్థముగ నత్యతంబుగా వచ్చు నా
లోకాలోక పరీత విశ్వధరణీలోకస్థు లాయాసముల్
లేకుండ న్నగమెక్క నాత్మదిశ నర్థిన్ దిక్పతుల్ నిచ్చెనల్
జోకం బెట్టినరీతి నాల్గుదిశలన్ సోపానముల్ వర్తిలున్. 277
అందు శరదిందు మందార కుంద బృంద
చందనామరవాహినీ సాంద్ర కాంతి
కాంత నవసుధాధౌత నితాంత దీప్తి
బ్రాగ్దిశారూఢ సోపానపటలి యమరు. 278
ఆసోపాన పథంబుజేరి ప్రభ లుద్యద్దివ్య కోటీశ్వరా
వాసం బంటగ నేఁగుచో నపుడు దుర్వారోరు భేరీధ్వనుల్
భూసంత్రాసముగాఁగఁ బర్వి గుహలం బూర్ణంబులై నిండినన్
వాసిన్ బుట్టుఁ బ్రతిధ్వనుల్ దశదిశాభాగంబు గప్పున్ వెసన్. 279
మఱియు నా ప్రభానికాయం బరుగునెడ ననేక వీరాంగ వాదనంబులును, పటహ ఢంకా వేణు వీణా మృదంగ శంఖ ఘంటా నినాదంబులును, నిరు గడలం జనుదెంచు జనుల కోలాహలార్భటులును వొక్కమొగి భూనభోంతరాళంబులు నిండ నన్నగేంద్రంబు నా దమయంబై విరాజిల్లు చుండు; నా ప్రభానిచయంబునందుఁ గొన్ని తార హార హీర తార తారాచలాఖండ లోద్దండ వేదండ డిండీరఖండ శ్రీఖండాభ చ్ఛవిబంధురంబులును, కొన్ని రసాలపల్లవ హల్లక తరుణారుణ ఘుసృణ మసృణ భాసురంబులును, కొన్ని తప్తకాంచన ప్రసూనోదంచిత హరిద్రాక్షుద్రభద్రద్యుతివితాన వితతంబులును, కొన్ని విచిత్రచ్ఛాయాడంబరాంబర ప్రభాచ్ఛాదన కిమ్మీర వర్ణంబులును, కొన్ని విచిత్ర పుష్పపల్లవాలంకృతంబులును, కొన్ని స్వసంవృత పటవిచిత్రిత నంది భృంగిరిటోమామహేశ్వరలింగ బ్రహ్మ విష్ణ్వాది సర్వసుపర్వవిగ్రహంబులునున్తై కోటీశ్వరాలయ ప్రదక్షిణంబున కరుగునెడ నెడనెడ భూతి రుద్రాక్షమాలాలంకృతదేహులై ప్రమథగణంబులంబోలు గణంబులు కోటీశ్వరధ్యానలీనమానసులై జనంబులు మ్రొక్కు మ్రొక్కుబడుల లోపంబుల దేహతాపంబులు జనింపఁ దదీశ్వరప్రేరిత వాక్యంబులఁ దదుపద్రవ శాంతిగాఁగ నంతనంత సంగీత వాద్య నృత్యంబులు సెలంగ సోపానమార్గమధ్యాభీరకాంతా గృహంబునకుంఁ బ్రదక్షిణంబు గావించుచు దక్షిణలొసంగి కోటీశ్వరాలయ ప్రాంతంబున కేఁగి ప్రదక్షిణ త్రయం బొనరించి తద్దేవున కభిముఖంబుగా నిల్చునెడ గణంబులు సేయుచు నానందపరవశులై భజింప మ్రొక్కులు చెల్లించి మరల నేతెంచు సమయంబున యాచకగణంబులు సోపానతలంబున దేవతాగణంబుల భజింపుచు వచ్చు గణంబుల యెదుట నిలిచి వినుతింపఁ గోటీశ్వరాలయంబునకుఁ బ్రదక్షిణార్థం బరుగుదెంచు ప్రభానిచయంబునకు మార్గంబియ్య నోరసిల్లుచుండు నెడ విశాలస్థలంబుల విశ్రమింపుచు, తత్పర్వతాథస్థిత వనాంత రంబులకుం జేరియుండు నింక జనంబు లెక్కు టెట్లనిన- 279
చేదుకో కోటప్ప చేదుకో కోటప్ప
చేదుకో కోటప్ప చేదుకొనుము
అను వాక్యములు మింటనంటఁగా సోపాన
పటలి, నెక్కుటఁ బుట్టు బడలికలను
శీతలచ్ఛాయా విశేష భూషితములౌ
తరుమూలములయందుఁ దనర నిలిచి
పటుచిత్ర చిత్రిక ప్రభల నీక్షించు న
య్యానందవశమున నడఁగఁజేసి
యంతమీఁదట మార్గమధ్యంబునందుఁ
బటు దృషత్ఖండ మండిత భవనమునను
నిలిచియిండిన యాభీరలలనఁ గాంచి
శిరమువంచి నమస్కృతుల్ చేసి భక్తి. 280
కానుక లొసఁగుచు ముందట
బూని యఖండంబు నిలిపి పూజింపుచు త
ద్ధ్యానంబుంజేసి యవ్వల
మానితగతి నరుగుచుంద్రు మనుజులు భక్తిన్. 281
అంత సోపానపద్దతి నధిగమించి
యద్భుతంబై న కోటీశ్వరాలయంబు
గాంచి తదుపాంత కాంతార కాంతసీమ
విశ్రమించి పథశ్రమ వినిమయించి. 282
కోటీశు గుడిచుట్టు గోపురంబు లనంగ
గోపురం బొరసిన కొనలుగలిగి
కొనల గీలించిన గు రుతర కలశముల్
గగనస్థ తారకాగణము గాఁగ
గగనస్థ తారకాగణము లగ్రస్థల
మల్లీమతల్లికా మాలికలుగ
మాలికాకారతరి మురారి నిలయంబు
చుట్టు నిల్చిన ప్రభఁ జూచిచూచి
యద్భుతాక్రాంతచిత్తులై యహహ ! యిట్టి
యుత్స వంబులు గలవె యీ యుర్వియందు
సేతు కాశీ పురాంతర ఖ్యాత భూము
లేఁగి చూచితి మీ చిత్ర మెందు లేదు. 283
అని చింతింపుచు దేవదేవుని మహార్హావాస ప్రాగ్ద్వార మం
దున నందీశ్వరుఁ జూచి మ్రొక్కులిడి ముందుంబోవ నూహించి యా
జన సమ్మర్దము జూచి భీతిలుచు నోజన్ గోటిలింగేశ్వరున్
గను టెట్లో యిట నంచు నెంచుచు మదిం గాంక్షల్ విజృంభింపఁగన్. 284
ఎట్టకేలకు గుడిలోన నెట్టుకొనుచు
బోయి యిచ్చట గుడ ఘృత భూరి శాలి
తండుల సువర్ణ కలధౌత తామ్రఖండ
ములను కానుక లిచ్చి సమ్మోద మొదవ. 285
కోటీశాభిధ లింగమూర్తిని జగత్కోటీశు నీక్షింపుచున్
సూటిం జూపుల వెంటనంటి మదిలోఁ జోద్యంబుగా నిల్చునా
కోటీశాకృతి బైటికేఁగునని సంకోచించి నేత్రంబు ల
ప్పాట న్మూసిరనం బ్రహర్షమున రెప్పల్ మూతు రచ్చో జనుల్. 286
అట్లు సలలితానంద మహానుభూతిఁ
బూత చేతస్కులై తమ మ్రొక్కులెల్ల
దీర్చి మఱలంగ మ్రొక్కుచు దిగి నగేంద్ర
ముత్సవంబులు గావింతు రుర్వియందు. 287
అందు బ్రాహ్మణు లా నగేంద్రాగ్రసీమ
నిలిచి యుపవాసములు జేసి నిద్రమాని
ఘనత మీఱి లింగోద్భవ కాలమందు
పూని గోటీశునకు బిల్వపూజ జేసి. 288
అచ్చోటి యుత్సవమును వి
యచ్చర సేవ్యంబుఁ జూచి యద్భుత మొదవన్
సచ్చరితు లైనవారికి
నిచ్చట వసియింపగల్గు నెప్పుడు ననుచున్. 289
అని మనంబునం దలంతు రెంతయు. 290
పరమానురాగ వశమున
ధరణీసురు లచట బ్రహ్మతత్త్వ విచారం
బురుభక్తిఁ జేయుచుందురు
పరమానందంబుతోడఁ బ్రజ్ఞాన్వితులై. 291
సామగానంబులు సదివెడువారును
వేదాంశాస్త్రముల్ వినెడువారు
శివపూజ లర్థితోఁ జేసెడువారును
పరగ భాగ్యంబులు వల్కువారు
పంచ స్తవంబులు పఠియించువారును
స్మరణంబు భక్తిచే సల్పువారు
శివపురాణంబులు నెప్పెడివారును
శివపద ధ్యానంబు సేయువారు
దృఙ్మనః ప్రాణముల నొక్కదిక్కుఁ జేర్చి
నిర్వికల్ప సమాధిలో నిల్చువార
లగుచు విప్రులు శివరాత్రియందు జాగ
రంబు సేతురు మహితోత్సవంబు దనర. 292
పుష్కర తాడన ధ్వనులు బోరుకొనం దగఁ దన్నగాగ్రయు
క్పుష్కర మధ్య సంభవ సుకోమలశోభిత వాసనా మిళ
త్పుష్కరజాలముల్ గొనుచు ము క్తిపదంబును గూడువట్టి యా
పుష్కరకేశు మూర్దమునఁ బూజ నొనర్తురు భక్తియుక్తిచేన్. 293
గుడిపై నఖండదీపము
పుడమికి గనిపింపఁ జూచి భూమీజనముల్
నడురేయి మింట సూర్యుడు
పొడమె నిదేమొయని భీతిఁ జొందెద రచటన్. 294
గిరిరాజ మూర్ధసంకీలితాద్భుత రుచి
జ్యోతిర్ల తాకృతి స్ఫురణ లనఁగ
కుధరేంద్ర సానుసంకుచితాభ్రమండల
లాలిత నవతటిల్లతిక లనఁగ
తద్గిరీశ గిరీశ తత శిరోభాగస్థ
పీతభాస్వర జటావితతి యనఁగ
భూధరాగ్ర విహార భూరిసిద్ధ వ్రాత
విజ్ఞానదీపికా విభవ మనఁగ
పర్వతము మీఁద గుడి చుట్టు ప్రభలచుట్టు
వనులచుట్టు నసంఖ్యముల్ ప్రజలు వెట్టు
నమలరోచిరఖండదీపములు వెలుఁగు
గరిమతోడ లింగోద్భవ కాలమునను. 295
గిరిక్రింద జరుగు నుత్సవ
మరుదై వర్తింప నమరు లంబరవీథన్
వర దివ్యయాన గతులై
పరికింతురు సతులఁగూడి ధావంబలరన్. 296
జగతిలోఁ గల్గు పుణ్యభూస్థలుల యందు
సేయు నుత్సవకోటులు చెప్పనేల?
ధర్మకర్తల యాధీనతను వహించు
నిచటఁ గోటీశ్వరాధీన మెంచిచూడ. 297
నగరాజమెక్కు ప్రభలును
దిగు ప్రభలును గుడికిఁ జుట్టుఁ దిరిగెడి ప్రభలున్
దిగువ ధరాతలమందున
మిగుల న్వసియించు ప్రభ లమేయము లచటన్. 298
మఱియు దిగువ నిలుచు ప్రభ లనంతంబు లందు నొక్కొక్క ప్రభాసమీపంబున వీరాంగ వాద్య నృత్య విద్యావిలాసంబు లమేయంబుగా బ్రవరిల్లు చుండు నెంతయు. 299
శరదభ్ర సన్నిభ సామజ సంఘము
ల్ఘనతరాంతస్థ నక్రములుగాఁగ
నవవిధ వాద్య సన్నాదముల్ తత వాయు
జనిత తరంగ ఘోషములుగాఁగ
పర్వతస్థాపి తాఖర్వ దీపచ్ఛటల్
రాజితాంతర్లీన రత్నములుగ
పవమానవేగ సంప్లవమాన కేతన
పటములు వీచికా పటలములుగ
బరగి యీ యుత్సవముఁ జూడవచ్చినట్టి
యఖిల దేశాగత మహాజనాంబురాశి
తనరి కోటీచంద్ర నందర్శనమున
పొంగిపొరలి నగేంద్రంబు ముంచకున్నె. 300
ఆకసమునుండి భూమికి నరుగుదెంచి
యుత్సవముజూచు తారల యొప్పు దెలిపి
కొండ క్రిందను దీపితాఖండ దీప
వితతిభాసిల్లు నద్భుతోన్నతిఁ దనర్చి. 301
పై నున్న జనము లాపై న నిల్చినయట్టి
ప్రభలకుఁగట్టు దర్పణములందు
క్రింది యుత్సవములఁ బొందుగా నీక్షించి
బహుళోత్సవంబు లీపర్వతమున
బరగుచున్నవటంచు భ్రాంతిచే భావించి
యందె ; నిల్చిరి గిరిక్రింద జనులు
క్రిందటి ప్రభల నింపొందు నద్దములందు
కుధరంబుపైనుండు గుడినిగాంచి
అచటి భక్తులఁ బ్రోవఁ గోటీశ్వరుండు
పరగ గుడితోడఁ గ్రిందికి వచ్చె ననుచు
భ్రాంతి నీక్షించి యచటనే పాయకుందు
రద్భుతముగాదె యాచంద మరసిచూడ.302
గిరిక్రింద నుండు జనములు
పరగన్ దమరుండుచోట భక్తిస్ఫురణన్
వర లింగమూర్తి నిలుపుచు
గరిమన్ బూజింతు రిష్టకార్యార్థముగన్. 303
తద్గిరిప్రాంత కాంత కాంతారమందు
వీరమాహేశ్వరాచార విధిఁ జరించు
భక్తతతికి గోటీశ్వరార్పణముగాఁగఁ
జెలఁగి మా హేశ్వరార్చనల్ చేయుచుంద్రు. 304
బహురుద్రాక్షజటాధరుల్ సతతమున్ భస్మత్రిపుండ్రాంకితుల్
ముహురుద్ధూళన దీప్తదేహు లతిసమ్మోదాత్ము లుద్యన్మతుల్
బహిరంతస్థిత లింగలీన హృదయప్రాణేంద్రియౌఘుల్ మహా
మహు లేతెంతురు తత్త్రికూటపతిప్రేమన్ బూజగావింపఁగన్. 305
కై లాసంబుననై న దక్షిణదిశా కైలాసమందైన హృ
త్కాలుష్యంబులు బాపు శ్రీనగ హిమక్ష్మాభృత్తులందైన నీ
లీలన్ వేఁగ బ్రసన్నమూర్తియయి గౌరీశానుఁ డిష్టార్ధముల్
చాలాయిచ్చుట లేదటంచు జనముల్ చర్చింతు రచ్చోఁ దగన్. 306
ఈ త్రికోటీశు కరుణచే నిష్టసిద్దు
లొదవు మాకంచు జనుదెంతు రుర్విజనులు
ఈ త్రికోటీశు కరుణచే నిహమునందె
ముక్తియగు నంచు వచ్చు ముముక్షు వితతి. 307
ఇంద్రవ్రజము :
కోటీశ కోటీశ త్రికూట యంచున్
పాటించి కీర్తింతురు భక్తు లెల్లన్
కూటస్థుఁడీ లౌకికకోటి కెల్లన్
గోటీశుడే యంచును గోర్కెమీఱన్. 308
వనతరుచ్ఛాయలను నిల్చి వనజపత్ర
శతములను బూజసేతురు సర్వమయుని
కోటిలింగేశు విశ్వేశు కోటికోటి
పద్మజాండాధినాథుని భక్తి తోడ. 309
మగధ పాంచాల కోసల మద్ర పాండ్య
చోళ కురు కాశ మత్స్య నేపాళ గౌళ
సాల్వ కుంతల ముఖ్యదేశస్థ జనులు
వత్తురా కోటిలింగోత్సవంబుఁ జూడ. 310
వచ్చి తమ కోరుకోర్కులు
విచ్చలవిడి కోరుకొనుచు వెనుకటి మ్రొక్కుల్
సచ్చరితులగుచు దీర్చుచు
మచ్చిక కోటీశుఁ జూచి మఱలుదురు వెసన్. 311