శ్రీభర్గ శతకము - కూచిమంచి తిమ్మకవి . రెండవ భాగము

51.

శా. ఆకుల్ మెక్కదెమేఁక? చెట్టుకొననొయ్యన్ వ్రేలదేపక్షి? పె న్గాకుల్ గ్రుంకవెనీట? గాలిఁగొనదే నాగంబు? బల్గొందులన్ ఘూకంబుండదె? కోనలం దిరుగదే క్రోడంబు? నిన్గాంచినన్ గా కిన్నింటను ముక్తిచేకుఱునె? భర్గా! పార్వతీవల్లభా!

52.

మ. ధర మృద్దారుశిలామయప్రతిమలన్ దైవంబు లంచుం బర స్పరవాదంబులఁ బోరుచున్ నిబిడసంసారాంధులై మేలు చే కుఱకే మగ్గములోని కండెలగతిన్ ఘోరార్తులై ప్రాకృతుల్ కరముం జచ్చుచుఁబుట్టుచుంద్రుగద! భర్గా! పార్వతీవల్లభా!

53.

మ. జననీగర్భ మహామహోగ్రనరక స్థానవ్యథం గొన్నినా ళ్లెనయన్ బాల్యకుమారతాదశలఁగొన్నేడుల్ వధూమీనకే తనగేహభ్రమఁగిన్నినాళ్ళు ఘనవృద్ధప్రాప్తిఁ గొన్నేళ్ళుఁబా యనిదుఃఖంబులఁ బ్రాణి గుందుఁగద? భర్గా! పార్వతీవల్లభా!

54.

శా. కేదారాదిక పుణ్యభూముల కశక్తిం బోవఁగారాదు; బల్ పేదర్కంబున దానధర్మవిధులోలిం జేయఁగారాదు గా కేదే నొక్కతరిన్ సమస్తభువనాధీశున్ నునుం గొల్వఁగా రాదో? కానరుగాక దురాత్ములు భర్గా! పార్వతీవల్లభా!

55.

మ. తరుణీశుంభదురోజకుంభములపై ఘమిల్లబంధంబుపైఁ గరమూలంబులపైఁ గపోలములపైఁ గందోయిపై మోముపై నిరతంబున్ విహరించు చిత్త మెపుడున్ నీయందొకప్డేనిఁ జే ర్పరుగా మూఢులదేమిదుష్కృయమొ? భర్గా! పార్వతీవల్లభా!

56.

మ. మినునొక్కప్పుడుఁగొల్వనేరక వృథామిథ్యాప్రచారంబులం గములై వాఁగులయందునెల్ల మునుగంగాఁ బుణ్యముల్సేరునే! తమి నశ్రాంతము నీటఁగ్రుంకులిడి యేధర్మంబు లార్జించెనో కమఠగ్రాహి ఢులీకుళీరములు! భర్గా! పార్వతీవల్లభా!

57.

హరి దైవంబు; విరించి సర్వభువనాధ్యక్షుండు బృందారకే

శ్వరుడాఢ్యుండు హుతాశనుండుపతి భాస్వంతుండు వేల్పండ్రు లో నరయన్నేరరుగా శివాత్పరతరం నాస్తీతివాక్యార్థమే కరణిం గోవిదు లైరో కాని మఱి! భర్గా! పార్వతీవల్లభా!

58.

శా. వేయేనూఱు పురాణముల్ సదివినన్ వేదాంతముల్ గన్న నా మ్నాయంబుల్ పరికించినన్ స్మృతులువేమాఱుల్ విమర్శించిన న్నీయందాఢ్యతదోఁచుచున్నయదివో నిక్కంబుభావింపఁగా గాయత్రీపతివై తనర్చుటను భర్గా! పార్వతీవల్లభా!

59.

శా. అఘంటాపథపద్ధతిన్ శివ శివే త్యాలాపసంశీలులై రేఘస్రంబులుద్రోచుపుణ్యతములుర్విన్ బ్రహ్మహత్యాద్యనే కాఘౌఘంబులు వాసి తావకపదప్రాప్తిన్ విడంబింతురౌ ద్రాఘిష్ఠప్రభుతాగుణోల్లాసన! భర్గా! పార్వతీవల్లభా!

60.

మ. పృథివిన్ మార్త్యుఁ డొకప్డునీశిరముపై బిల్వీదళంబొకట త్యాధికాహ్లాదముతోడ నిడ్డ నదియాహా! ఘోటకాందోళికా రథనాగాంబరపుత్రపౌత్రవనితా రత్నాదులై యెప్పుఁబో ప్రథితాదభ్రసితాభ్రశుభ్రయశ! భర్గా! పార్వతీవల్లభా!

61.

మ. మిము సేవించుటచేతఁగాదె చిరలక్ష్మీసంగతుల్ శౌరికిన్ నముచిద్వేషికి శాశ్వతస్థితమహానాకాధిపత్యంబు, వా గ్రమణీభర్త కశేషసృష్టిరచనా ప్రావీణ్యమున్ గల్గె నీ క్రమ మజ్ఞుల్ గనలేరుగాని భువి భర్గా! పార్వతీవల్లభా!

62.

శా. వాణీశాంబుజలోచనప్రముఖ గీర్వాణార్చితాంఘ్రిద్వయున్ క్షోణీభాగశతాంగునిన్ గజహరున్ శ్రుత్యంతవేద్యున్ నినున్ బాణాదిప్రమథోత్తముల్ గొలిచి మేల్పట్టూనిరౌ సంతత ప్రాణివ్యూహమనోంబురుడ్భవన! భర్గా! పార్వతీవల్లభా!

63.

శా. దారిద్య్రంబుదొలంగు, మృత్యువెడలున్ దవ్వౌనఘవ్రాతము ల్ఘోరవ్యాధులు గండదోషము లడంగున్ జారచోరవ్యథల్ దూరంబౌ, నహితానలగ్రహగణార్తుల్ వీడు నిక్కంబు నీ కారుణ్యం బొకయింత గల్గునెడ భర్గా! పార్వతీవల్లభా!

64.

మ. సుత, పద్మాకర, దేవతాగృహ, వన క్షోణీసురోద్వాహ, స త్కృతి, నిక్షేపము లంచునెంచ నలువౌ నీసప్తసంతానముల్ హితవారంగనొనర్చుపుణ్యమెనయున్ హేలాగతిన్మర్త్యుఁడొ క్కతఱిన్ మిమ్ముఁదలంచెనేని మది భర్గా! పార్వతీవల్లభా!

65.

మ. అమరం ద్వత్పదపంకజాతయుగళ ధ్యానక్రియాశ్రాంతసం భ్రమలీలన్ విలసిల్లుడెంద మొరులన్ బ్రార్థింపఁగా నేర్చునే? సుమనోనిర్ఘరిణీసువర్ణకమల స్తోమాసవాలంపట భ్రమరం బేఁగునే తుమ్మకొమ్మలకు భర్గా! పార్వతీవల్లభా!

66.

మ. శివుఁజూడందగదండ్రు గొందఱధముల్ చిత్రంబుతారెన్నఁడు న్రవిచంద్రాగ్ని గృహిక్షమాపవననీ రవ్యోమముల్ నీస్వరూ పవిశేషంబు లటంచుఁ దెల్ప వినరో భావింప నమ్మూర్ఖపుం గవు లెల్లం దదధీనతన్ మనరొ భర్గా! పార్వతీవల్లభా!

67.

మ. ద్విపగంధరవిభూషణాంబరవధూ వీటీభటాందోళికా తపనీయాదులచేత మత్తిలి బుధేంద్రశ్రేణిఁ బీడింతురౌ తపనప్రోద్భవఘోరకింకరగదా దండోగ్రదుఃఖంబు లొ క్కపుడుందుష్ప్రభులేలయెంచరకొ? భర్గా! పార్వతీవల్లభా!

68.

శా. నానాద్వీపధరాధురావహనమా న్యస్ఫారబాహాబలా నూనఖ్యాతిసమేతు లైన శశిబిందుక్ష్మాతలేశాదిక క్ష్మానాథు ల్చనిపోవుట ల్దెలియరో సత్యంబులా దేహముల్? కానంజాలరుగాక దుర్నృపులు భర్గా! పార్వతీవల్లభా!

69.

మ. చవిలెల్ కాసులు వీసముల్ గొని యథేచ్చాలీలలంబ్రేలుదు ష్కవులన్మెచ్చుచు భవ్యకావ్యఘటనాశాలుల్ ప్రసంగించుచో నవివేకక్షితినాయకాధమవరుల్ హాస్యోక్తులం బొల్తురౌ కవితాసార మెఱుంగకుండుటను భర్గా! పార్వతీవల్లభా!

70.

మ. చెలుల న్బంధుల విప్రులన్ బ్రజల దాసీభృత్యమిత్త్రాదులం

గలవిత్తంబులు వృత్తులుం గొని కడున్ గారింతు రద్యక్షతం దలపంజాల రదేమొ మీఁదటికథల్ దర్పాంధకారాంధులై కలనైనన్ మహిభృద్దురాత్మకులు భర్గా! పార్వతీవల్లభా!

71.

శా. మన్నెల్లందమసొమ్మటంచు వసుధా మార్త్యోత్తమక్షేత్రముల్ కన్నారంగని యోర్వలేక దిగమ్రింగం జూతురల్పప్రభుల్ వెన్నప్పంబులొ బూరెలొ వడలొ భావింపంగ నొబ్బట్లొకో యన్నా! యెన్నఁగ వారిపాలి కవి? భర్గా! పార్వతీవల్లభా!

72.

మ. ప్రజలం గాఱియఁబెట్టి పెట్టియల నర్థంబెప్పుడు న్నించుచున్ ద్విజవిద్వత్కవివందిగాయకుల కేదే నొక్కటీలేక య క్కజమొప్పంబలుమూలలం దిరుగు భూకాంతాంళికిం గీర్తిధ ర్మజయౌద్ధత్యము లేక్రియంగలుగు? భర్గా! పార్వతీవల్లభా!

73.

శా. ఆజిన్ వైరివరూధినీమథనదీక్షారూఢిఁ గ్రాలన్ వలెన్ భోజుంబోలి సమస్తయాచకతతిం బోషించుచుండన్ వలెన్ తేజం బెప్పుడు నుర్విలోఁ బ్రజకుఁ జెందింపన్ వలెన్ గానిచో రాజా వాఁడు? తరాజుగాక! భువి, భర్గా! పార్వతీవల్లభా!

74.

శా. తేజంబొప్పఁ బురాకృతంబున జగద్ధ్యేయత్వదంఘ్రిద్వయీ పూజాపుణ్యఫలంబునం దమరిటుల్ భూపత్వముంగంటకున్ వ్యాజంబూనికడుంజెడంగవలెనా యాలింపరా యీనృపుల్ "రా జాంతే నరకం వ్రజే"త్తనుట? భర్గా! పార్వతీవల్లభా!

75.

మ. కవివిద్వద్ధరణీసుధాశనవరుల్ కార్యార్థులై యొద్ద డా సి వడిం జేతులుదోయిలించుకొని యాశీర్వాదముల్సేయ నె క్కువదర్పంబున నట్టిట్టుం బొరలకే కొర్మ్రంగిన ట్లుండ్రుగా రవళిం దుర్నృపు లేమియీఁగలరొ భర్గా! పార్వతీవల్లభా!

76.

శా. గాజుంబూస యనర్ఘరత్నమగునా? కాకంబు రాయంచయౌ నా? జోరీఁగ మధువ్రతేంద్రమగునా? నట్టెన్ము పంచాస్యమౌ నా? జిల్లేడు సురావనీజ మగునా? నానాదిగంతంబులన్ రాజౌనా ఘనలోభిదుర్జనుఁడు? భర్గా! పార్వతీవల్లభా!

77.

శా. కోపంబెక్కువ, తాల్మియిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబుతీల్, కాపట్యంబుఘనంబు, లోభమునహంకారంబు దట్టంబు, హృ చ్చాపల్యం బధికంబు, ద్రోహమతి విస్తారంబు, చీ! యిట్టిదు ర్వ్యాపారప్రభు లేరిఁ బ్రోతు రిఁక భర్గా! పార్వతీవల్లభా!

78.

శా. హృద్వీథిం గనరుం దిరస్కృతియు బిట్టేపార నొక్కప్పుడున్ సద్వాక్యంబును దర్శనం బిడని రాజశ్రేణి కాశింతురౌ "విద్వద్దండమగౌరవం" బనుస్మృతుల్ వీక్షింపరా దుర్నృపా గ్రద్వారంబుల వ్రేలు పండితులు? భర్గా! పార్వతీవల్లభా!

79.

మ. అపవర్గం బొనగూడునో చిరసుఖాహ్లాదంబు చేకూరునో జపహోమాధ్యయనార్చనాదిక మహాషట్కర్మముల్డించి దు ష్కపటోపాయవిజృంభమాణధరణీ కాంతాధమాగారని ష్కపట భ్రాంతి జరింతు నార్యు లిల భర్గా! పార్వతీవల్లభా!

80.

మ. అకటా! జుత్తెఁడుపొట్తకై కృపణమర్త్యాధీశగేహాంగణా వకరక్షోణిరజశ్చటావిరతసం వ్యాప్తాంగులై క్రుంగి నె మ్మొకముల్ వెల్వెలఁబాఱవ్రేలుదురదేమో యెందులంబోవనే రక ధీమజ్జను లెంతబేలలకొ! భర్గా! పార్వతీవల్లభా!

81.

మ. అతిలోభిన్ రవిసూనుఁడంచుఁ గపటస్వాంతున్ హరిశ్చంద్రభూ పతియంచున్ మిగులం గురూపిని నవప్రద్యుమ్నుఁడంచు న్మహా పతితున్ ధర్మజుఁడంచు సాధ్వసమతిం బార్థుడటంచు న్బుధుల్ ప్రతివేళన్ వినుతింతు రక్కఱను భర్గా! పార్వతీవల్లభా!

82.

మ. జనసంస్తుత్యమహాప్రబంధఘటనా సామర్థ్యముల్ గల్గు స జ్జను లత్యల్పుల దీనతం బొగడుదుర్ జాత్యంధతం జెందికా కనువొప్పందమరెన్నఁడున్ "సుకవితా యద్యస్తిరాజ్యేనకి" మ్మనువాక్యంబు వినంగలేదొమును? భర్గా! పార్వతీవల్లభా!

83.

సుగుణోద్దామమహాకవింద్రఘటితా క్షుద్రప్రబంధావళుల్ జగదుద్దండపరాక్రమక్రమ విరాజద్భూమి భృన్మౌళికిన్ దగుఁగా కల్పుల కొప్పునే? కరికిముక్తాకాయమానంబుసొం పగుఁగా కొప్పునే యూరఁబందులకు? భర్గా! పార్వతీవల్లభా!

84.

మ. పటులోభాత్మున కెవ్వరైనఁ గడఁకంబద్యాదులర్పించినం గుటిలుండై యవియెల్ల నిల్పుకొనఁగా గోరండునిక్కంబహా! దిట మొప్పారఁగ నిల్పుకోఁగలదె ధాత్రిన్ గొంతసేపైన మ ర్కటపోతం బురురత్నహారంబులు? భర్గా! పార్వతీవల్లభా!

85.

మ. భువిలో మేదరసెట్టి చివ్వతడకల్ పొంకంబుగా నల్లి పె స్రవళిన్ సంతలనెల్లఁదిప్పు క్రియ దైన్యంబెచ్చఁగా దుష్కవుల్ తివుటొప్పం జెడుకబ్బపుందడక లోలిం ద్రిప్పఁగా నద్దిరా! కవితల్ కాసుకు గంపెఁడయ్యెఁగద భర్గా! పార్వతీవల్లభా!

86.

మ. అవివేకక్షితినాయకాధమసభా భ్యాస ప్రదేశంబులన్ బవళు ల్రేలునుజుట్టఁబెట్టుకొని దుష్పాండిత్యముల్చూపుచుం గవిముఖ్యుంబొడగాంచి జాఱుదురు వేగం; బుండవి ల్గన్న కా కవులట్లే నిలఁబోక కాకవులు భర్గా! పార్వతీవల్లభా!

87.

మ. భువిలో నిక్కలిదోషహేతుకమునం బొల్పారి గోసంగులున్ బవినాలున్బలుమోటకాఁపుదొరలుం బాషాండులు న్దాసరుల్ సివసత్తుల్ నెఱబోయపెద్దలును దాసేయుప్రభుల్ దుష్టకా కవులు న్మీఱిరికేమి చెప్పనగు? భర్గా! పార్వతీవల్లభా!

88.

మ. కలుముల్నిక్క మటంచునమ్మితులువల్గర్వాంధులై యెన్నఁడు న్బిలిభిక్షంబులు వెట్టకుండ్రు పిదప న్బ్రాణంబులంబాసియా ఖలులృమౌదురో, వాండ్రుగూరిచినరొక్కం బెల్ల నేమౌనొకో కలుషోద్గాఢతమస్సహస్రకర! భర్గా! పార్వతీవల్లభా!

89.

తులువ ల్పెట్ట భుజింపలేక ధనమెంతోనెమ్మదింగూర్చిమూ లల దట్టంబుగఁబాఁతుకొన్న నృపతుల్వాలెంబు నిర్మోహులై పలుచందంబులఁ గట్టి కొట్టి మిగులన్భాదించి రోధించుచుం గలసొ మ్మెల్ల హరించుచుండ్రుగద! భర్గా! పార్వతీవల్లభా!

90.

మ. చెనఁతుల్గూర్చుధనంబుమ్రుచ్చులకు దాసీవారయోషాహు తాశన దుష్టక్షితిపాలక ప్రతతికిన్ సంరూఢిఁ జేకూరుగా, కనపద్యప్రతిభావిభాసిత బుధేంద్రానీకముం జేరునే? కనదుద్దామపరాక్రమప్రథిత! భర్గా! పార్వతీవల్లభా!

91.

మ. ధరణిన్ సద్గురుచెంత నెందఱుఖలుల్ దార్కొన్ననచ్చోటికే కరమర్థి న్బుధులేఁగుచుండుదురు నిక్కంబారయన్ గంటకా వరణోజ్జృంభితకేతకీవని కరుల్ వాలెంబుగాఁ జేరవే? కరుణాదభ్రపయఃపయోనిలయ! భర్గా! పార్వతీవల్లభా!

92.

శా. లోకానీకమునందు దుర్గుణులు కల్ముల్ గల్గియున్నప్డు ప ల్గాకుల్ దార్కొని మెల్లమెల్లనే దురాలాపంబులంగేరుచుం గైకొండ్రెల్లపదార్థల్నిజమహో కార్కూఁతలం గ్రోల్చుచు న్గాకు ల్వేములఁ జేరుచందమున భర్గా! పార్వతీవల్లభా!

93.

మ. చదువు ల్వేదపురాందము ల్గయితలు స్సబ్బండువిద్దెల్ గతల్ మొదలెన్నేనిగ విద్దుమాంసువు లదేమో తెల్పఁగావింటిఁగా నదిగో చౌలకు మాలదాసరి శటాలైగారి జ్ఞానమ్మలెన్ గదియంజాల వటండ్రు ముష్కరులు భర్గా! పార్వతీవల్లభా!

94.

శా. పో! పో! బాఁపఁడ! దోసె డూదలిడినం బోలేక పేరాసల న్వాపోఁజాగితివేమి! నిసదువు తిర్నామంబులో! సుద్దులో భూపాళంబులొ లంకసత్తెలొ బలా బొల్ల్యావుపోట్లాటలో కా! పాటింపనటండ్రుబాలిశులు భర్గా! పార్వతీవల్లభా!

95.

మ. అదిగో బాఁపనయల్లుభొట్లయకు ముందప్పయ్యతీర్తంబులో నదనం"గిద్దెఁడుకొఱ్ఱనూక లిడితిన్ అబ్బబ్బ! తిర్నామముల్ సదువంజాగిన మాలదాసరయలన్ సంతోసనాల్ సేసితిం గద" యంచుంబలుమోటులాడుదురు భర్గా! పార్వతీవల్లభా!

96.

శా. రాలన్ దైలము తీయవచ్చు భుజగవ్రాతమ్ముల న్బేర్లఁగా లీల న్బూనఁగవచ్చు నంభోనిధి హాళి దాఁటఁగావచ్చు డా కేల న్బెబ్బులిఁ బట్టవచ్చు విపినాగ్ని న్నిల్పఁగావచ్చు మూ ర్ఖాళిం దెల్పఁ దరంబె యేరికిని? భర్గా! పార్వతీవల్లభా!

97.

శా. ఆఁకొన్నప్పుడు వంటకంబయిన బియ్యంబైన జావైనఁగూ రాకైన న్ఫలమైన నీరమయినన్ హాలింగల ట్లిచ్చుచున్ జేకోనౌఁ బరదేశులం గృహులకు న్సిద్ధంబు గావింప ఛీ! కాకున్న న్మరి యేఁటికొంప లవి? భర్గా! పార్వతీవల్లభా!

98.

మ. మడతల్వల్కునృపాలుతోఁ బలుమాఱున్మారాడుపెండ్లాముతోఁ జెడుజూడం బ్రచరించునాత్మజునితోఁ జేట్పాటుగోర్లెంకతో బొడవంజూడఁగవచ్చు కార్మొదవుతోఁ బోరాడుచుట్టంబుతోఁ గడతేరం దరమా గృహస్థునకు? భర్గా! పార్వతీవల్లభా!

99.

శా. కాకిన్శాశ్వతజీవిగా నునిచి చిల్క న్వేగ పోకార్చి సు శ్లోకుం గొంచెపుటేండ్లలోఁ గెడపి దుష్టుంబెక్కునాళ్లుంచి య స్తోకత్యాగి దరిద్రుఁ జేసి కఠినాత్మున్ శ్రీయుతుంజేయి నా హా! కొంకేదిఁక నల్వచెయ్వులకు? భర్గా! పార్వతీవల్లభా!

100.

మ. ధరలో నెన్నఁగ శాలివాహన శకాబ్దంబుల్దగ న్యామినీ కరబాణాంగశశాంకసంఖ్యఁజెలువై కన్పట్టు (సౌమ్యా) హ్వ య స్ఫురదబ్దంబున నిమ్మహాశతక మేఁ బూర్ణంబుగావించి శ్రీ కరలీల న్బుధు లెన్న నీకిడితి భర్గా! పార్వతీవల్లభా!

101.

ధనధాన్యాంబరపుత్త్రపౌత్త్రమణిగోదాసీభటాందోళికా వనితాబంధురసింధురాశ్వ (మహితైశ్వర్యంబు) దీర్ఘాయువు న్ఘనభాగ్యంబును గల్గి వర్ధిలుదు రెక్కాలంబుఁ జేట్పాటులే క నరు ల్దీని బఠించిరేని భువి భర్గా! పార్వతీవల్లభా!


శ్రీభర్గ శతకము సంపూర్ణం