శ్రీనివాసవిలాససేవధి/ప్రథమాశ్వాసము

ఓం

శ్రీనివాసవిలాససేవధి

శ్రేష్ఠలూరి వెంకటార్య ప్రణీతము,

ద్విపదకావ్యము

—♦♦♦♦§§♦♦♦♦—

ప్రథమాశ్వాసము

—♦♦♦♦§§♦♦♦♦—


శ్రీకాంత కిరవుగాఁ జెలగు పేరురము
వైకుంఠమిదె యంచు వంచినకరము
మలసి నిగ్గులు గుల్కు మకరకుండలము
లలరు కౌస్తుభశోభి హారమండలము
కంతు సంకునకు నగ్గలమైన గళము
వింతదర్పణము నవ్వెడు గండతలము
కరుణఁ జిల్కు వెడంద కన్నుల ఠీవి
చిరునవ్వు తేట రంజిల్లు కెమ్మోవి
కప్రపు నామంబు కళలీను మోము
దీప్రకిరీటంబు తెఱఁగొందు గోము10
ఘనకటితటి బద్ధ కనకాంబరంబు
కనదురుమేఖలాగణడంబరంబు
నలువఁగాంచిన తమ్మి నలువొందునాభి
కలన చాణూరుని కలఁచు నూరువులు
జనని రోలును బిగించఁగ నర్జునములఁ
దునియింప జరుగు ముద్దులజానుయుగము


బలిని దానమువేఁడి బలిమిఁ బెంపొంది
కొలిచి ముజ్జగములు గొన్నపాదములు
మకరతోరణదీప్తి మరగి సంపంగి
నికరంపు దండగా నీటొందు నిగ్గు 20
కనుగొన్న భక్తలోకముల కానంద
మొనరించు సోయగ ముల్లసిల్లంగ
[1]నంౙనచల లక్ష్మి యమరురూపమున
నంజనాచలసీమ నలరు పెన్ వేల్పు
కొలఁదికాని వరాలకును వరాలిచ్చి
మెలుసుబేరము లాడు మేటివర్తకుఁడు
వడ్డికాసుకు కాన్సువలయు గొడ్డాండ్ర
కడ్డిచేయ కొసంగు నాటలవాఁడు
తలనీలములుడించి తగువైన సిరులు
కలకెత్తి యనుచు వింతల యెమ్మెకాఁడు 30
కురువ దను గుఱించి కుమ్మరి మట్టి
విరులఁ బెట్టిన మెచ్చి వెసవిఱ్ఱవీఁగి
పుడమి రెండు నిజాంఘ్రి పూజననిధుల
నిడువిరుల్ దిగువగా నెదనెంచు జాణ
ఆమటిమ్రొక్కుల కలరి దాసులకు
కామితార్థములిచ్చు కరుణాపయోధి
తాతకుఁ దాతయై తానొక్క మనుజుఁ
దాత నీళ్ళని వేఁడు తచ్చనకాఁడు
జనములందఱుఁ జూడ సంపంగి చెట్టు
ననువుగా నడిపించు నైంద్రజాలికుఁడు40


చక్రవర్తి కొసంగి చక్రము విమతు
లాక్రమించిన చక్రమందినమేటి
వేరువేరుగ రూపు వేళవేళలకు
నేరుపునను జూపు నెఱమాయలాఁడు
చక్కఁదనము మించు జవరాండ్రఁబొంచి
దక్క పెనంగు గద్దరిహొంతకారి
ఆహూయరక్షకుం డార్తశరణ్యుఁ
డా హర బ్రహ్మాది కాత్మమిత్రుండు
నందకుమారుఁ డానందమయుండు
నందకధరుఁ డుమానందనారాధ్యుఁ 50
డఖిల కారణ కారణాదికారణము
ముఖరిత శ్రుతి చతుర్ముఖ సన్నుతుండు
కరుణాది కానంత కల్యాణగుణుఁడు
పరమాత్ముఁ డగుణుఁడు భవరోగవైద్యుఁ
డాద్యుఁ డనాద్యుఁ డత్యమలయోగీంద్ర
వేద్యుం డవేద్యుండు విశ్వాత్మకుండు
విశ్వాతిరిక్తుండు విశ్వరక్షకుఁడు
శాశ్వతికాకార సంసారదూరుఁ
డఘటన ఘటనా సమర్థవిలాసుఁ
డఘవినాశన వాసనార్థ ప్రకాశుఁ60
డాకిటి విధజగ దాధారమూర్తి
శ్రీ కరోల్లాసుండు శ్రీనివాసుండు
మీనకచ్ఛప కిటి మృగరాజవదన
మాననటు విప్రమహిప రూపముల
మునిసాది వేషముల్ మును తాధరించి


జనుల శిక్షించి యాసరణి సంసరణ
మవఘళించు జనాళి నటు నటింపించు
తనర యా కపటనాటక సూత్రధారుఁ
డసదృశాలంకార హావభావములు
రసచమత్కృతు లతిరమ్యభూమికలు70
వరుసనేర్పి మదీయవాణిని వాణి
కరము నటించంగఁ గరుణించుఁ గాత!
అనుచు నాయిలువేల్పు నల నెలదాల్పు
కనుఁగొన్న పెన్నిధిఁగరుణాంబు నిధిని
అలమేలు మంగా సమంచిత వక్షు
విలసత్సరోజాక్షు వేంకటాధ్యక్షు
భావించి సేవించి ప్రార్థించి నతులు
గావించి మఱియు జగత్త్రయీ జనని
కలశాంబునిధిరాజ కన్యకా మణిని
నలమేలుమంగమ్మ నర్మిలిఁగొల్చి80
శేషాహి సౌపర్ణ సేనాధిపులకు
శేషతన్ మ్రొక్కి యశేషదేశికుల
కెఱిగి సాష్టాంగంబు నెలమి సద్భక్తి
వఱలంగ వాధూల వంశావతంసు
వాచాతిగజ్ఞాన వైభవు సస్మ
దాచార్యు నన్నావి యప్పలాచార్యు
భజియించి వాల్మీకి బాదరాయణుని
సుజన సమ్మతులైన సుకవివర్యులను
బేర్కొని పొగడి యభీష్ట సిద్ధికిని
గోర్కులుబ్బ రసజ్ఞకోటి సంతసిల90


నొకకావ్య మొనరింప నూహదలంచి
యకళంక సత్కథ లరయుచుండంగ
సిరులొందునెలను మించినమోమువాఁడు
హరినీల రుచిఁగెల్వనగు గోమువాఁడు
కమలసంపదఁగేరు కన్నులవాఁడు
విమలోర్ధ్వ పుండ్రంబు విలసిల్లువాఁడు
డంబైన మకరకుండలములవాఁడు
హొంబట్టు వల్లెవాటొప్పినవాఁడు
బురుసారుమాల్ గట్టి పొలుపొందువాఁడు
నెరరాజసంబున నీటైనవాఁడు100
చిరునవ్వువెన్నెలఁ జిల్కెడువాఁడు
కరుణారసముఁజల్లు ఘనమైనవాఁడు
రమణీయలీలల రంజిల్లువాఁడు
కమలాస్త్రుమించుచక్కదనంబువాఁడు
పూజూర్హుఁడగు మహాపురుషుఁ డొక్కరుఁడు
రాజబింబాస్యయౌ రమణితోఁగూడి
మెఱుఁగుబంగరుమేడ మీఁదనుండంగఁ
గరమచ్చెరువుమీఱఁగాంచి నే నందుఁ
జేరి నివ్వెరపాటుచే నిల్వఁగరుణ
భూరివైభవుఁడట్టి పురుషుండు నన్ను110
గరిమ నీక్షించి యో కవివర్య మున్ను
ధర సంస్కృతప్రాకృతముఖ భాషలను
ద్రవిణాంధ్రములఁ బ్రబంధము లెన్నియైన
సవరించితిని మాకు సంతసం బెసఁగ
నొకకృతి శేషాచలోరువైభవము


ప్రకటితాలంక్రియా స్పదవర్ణనలను
విసువక శృంగార వీరాద్భుతాది
రసములు భావముల్ రంజిల్లునట్లు
ద్విపద లోకులకెల్లఁ దెలివిడిగాన
ద్విపదగాఁ దెలుఁగునఁ దేటగావించు.130
వారాహ వామన బ్రహ్మాండ పాద్మ
గారుఁడస్కందమార్కండేయముఖ్య
బహుపురాణోక్తసం బాధంబు వలన
గహనమై పెనుగొన్న కథ చిక్కు దీర్చి
శరధిలోఁ గలరత్న జాతంబు లేర్చి
మెఱుఁగుసాననుదీర్చి మెలకువన్ దిద్ది
భూషణంబొనరించు పొలుపున కర్ణ
భూషణంబుగను సల్పుము చెల్వుగుల్క
తొలుత భాగవత భక్తులు మాకు కబ్బ
ములుకూర్చి ధన్యతఁ బొల్చి రన్నటులఁ140
గలగని మేల్కాంచి కడుచోద్యమునను
తలఁచి తలంచి తత్కలన నూహించి
శ్రీనివాసులె యిట్లు చెలగుచు చెలిమి
నానతిచ్చుటగాదె యని నిశ్చయించి
మానితభాగ్యసంభావన నెంతె
నానందరసవార్థి యాత్మనుప్పొంగ
వారాహవామనబ్రహ్మాండ పాద్మ
గారుడాదిపురాణ కథలు శోధించి
కసటుదేర్చి ప్రసిద్ధకథ సంగ్రహించి
వెసచిత్రకథ చాల విస్తృతఫణితిఁ


గదియించి పునరుక్తి కథ ద్రోచి మొదలు
తుద యేర్పరించి బంధుర సంగతులను
పూర్వోత్తరవిరోధములుదోఁచ నీక
సర్వసమాధానసరణి దీపింప
ఘటియించి తగునలంకారముల్ గలుగ
... ... ... ...
నతులశృంగార వీరాద్భుత రసము
లతిశయించఁగవిభావాది భావములు
భావుకభావసంభావ్యత నలరఁ
గావించి పటుమహాకావ్యలక్షణము150
వెలయఁ దెనుంగున ద్విపదకావ్యముగ
నల వేంకటాద్రిమాహాత్మ్యమింపొంద
శ్రీనివాసవిలాససేవధి యనఁగ
భూనుతవిఖ్యాతి పొసఁగ సల్పెదను.
శయ్యకుఁదగిన యుజ్వల మృదుపదము
లొయ్యారినడలు శుభోరుకాంతియును
నలువొందు సూక్ష్మత నడుమఁ జెన్నొంద
చెలఁగనుచ్చైస్తన శ్రీనలంకృతులు
వితతలక్షణముల విఖ్యాతిఁ జెంది
యతులితసద్వృత్తు లమర వహించి160
సరసభావంబులు సౌకుమార్యంబు
తెరలెడు బెళుకులు తియ్యబల్కులును
మలసిమించు సువర్ణమయమూర్తి యగుచు
లలితశృంగారలీలల సొంపు నింపు
గైకొని సుముఖియై గడుప్రసన్నతను


శ్రీకాంత కెనగాఁగ చెలఁగుమత్కా[2]వ్య
కన్యకుఁగలశాబ్ధి కన్యకావిభుఁడు
ధన్యచరిత్రు డుదారశేఖరుఁడు
రతిరాజజనకుఁడౌ రమణీయమూర్తి
యతిలోకవైభవు డతిపుణ్యకీర్తి170
అఘహారి గుణహారి యహితసంహారి
అఘటనఘటనావిహారియౌ శారి
పతిగాఁగఁదగునంచు భావించి కాంచి
మతిలోన హర్షించి మరియు నూహించి

ప్రాకృత భాష


ఇందరక్ఖ యధే ఉపేంద ముయుం ద
చందచూళత్థుత జలజత్థజణయ

శౌరసేని


కమణియ్యకహ దెచ్చగవ్వసంతిఅర
యమిసహ దాణిం పియంకాహి ణాహ

మాగధి


శిళివహూవళ్ల హే శిదలో అశుళహె
శిఖివచ్ఛళుఇళంగె చిళతళపుళుశె 180

పైశాచి


గునపున్నకాలున్న కొత్థుహాహలన
అనహమతనలూప అరియ మంతాహి

చూళికోక్తి


సలచక్ఖ చకతీసె చనరక్ఖనపల
కులుతలకున పాహి కోవింతలాచ


భాండీరం


దేవు రే పదిమక్ఖ దీనరక్ఖణు రె
పావణచరిదు రే పణమేమి తుహ రె

ఇందులకు ఛాయ



ఇంద్రరక్షక హే ఉపేంద్రముకుంద
చంద్రచూడస్తుత జలజాస్త్రజనక
కమనీయకథ దైత్యగర్వశాంతికర
యమసఖే దానీం ప్రియంకురునాథ 190
శ్రీవధూవల్లభ శ్రితలోక సులభ
శ్రీవత్సరుచిరాంగ చిరతరపురుష
గుణపూర్ణకారుణ్య కౌస్తుభాభరణ
అనఘమదనరూప ఆర్య మాం త్రాహి
శరజాక్ష జగదీశ జనరక్షణపర
గురుతరగుణ పాహి గోవిందరాజ!
దేవ భో పద్మాక్ష! దీనరక్షణ భొ!
పావనచరిత భో! ప్రణమామి త్వాం భొ!
అని యిట్టి బాసల నచ్చెరువెసఁగ
కొనియాడుచును వేగఁగని కొల్చి మఱియు200
శ్రీచిత్రకూటపురీ నివాసునకు
ప్రాచిత భువనకారణవిలాసునకు
దుగ్ధాబ్ధికన్యకా ధూర్వహస్థితికి
ముగ్ధగోపాంగనా మోహనాకృతికిఁ
గిరిరాజరక్షణ కారుణ్యనిధికిఁ
బరమయోగీశ్వర భావనావధికి
భక్తపరాధీన పార్థసారథికి


వ్యక్తసాధుజనేప్సి తార్థసేవధికి
కల్యాణగుణగణ కరశీలునకును210 .
... ... ... ... ... ...
భువనమౌక్తికచయ ప్రోతసూత్రునకు
దివిజసన్నుతవసుదేవపుత్రునకు
నరకసంహారి కానందకారికిని
ధరణిధారికి బుధాంతరవిహారికిని
స్థిరకృపావేశి రక్షితబిడౌజునకు
హరవిరిం చ్యార్చ్యపాదాంభోజునకును
అతిమహోదార భూర్యమరభూజునకు
వితతతేజునకు గోవిందరాజునకుఁ
బూనిసమర్చితంబుగ నే నొనర్చు
శ్రీనివాసవిలాససేవధి యందు 220 .
భవనపావన గుణాద్భుతతమ మహిమఁ
గవినుతంబగు కథాక్రమ మెట్టి దనిన

కథా ప్రారంభము.


శ్రీనైమిశారణ్యసీమను వ్యాస
మౌనికిఁ బ్రియశిష్యమణియన సూతుఁ
డున్నతమణిపీఠి నుండఁ బురాణ
సన్నుతకథలు వే సరసవాక్ప్రౌఢి
శౌనకాదిమునీంద్ర సంఘంబు వినఁగ
వీనులకింపుగా వివరించువేళ
సన్మౌౌను లాతని కంజలిసేసి
... ... ... ... ... ...230



మును పెక్కులుపురాణములు మాకు మీరు
వినుపించితి రొకొండు వినఁగఁగోరెదము
వ్యాసులకరుణ మీ కల పురాణేతి
హాసముల్ హస్తతలామలకముగ
విదితమ్ము లగుఁగాన వెఱపింత లేక
గదిసి యిత్తఱి యడుగంగఁబూనితిమి
ధరణిలో నతిపుణ్యతమమైనక్షేత్ర
వరమెద్ది భువనపావనగిరి యెద్ది
యెందు ముకుందుఁ డయ్యిందిరఁ గూడి
పొందుగా విహరించు భూరిలీలలను 240.
విచ్చలవిడి మ్రొక్కి వేఁడువారలకు
నిచ్చలు కరుణచే నిచ్చునిష్టంబు
లెక్కడ బ్రహ్మాదు లీశ్వరుఁ గాంచి
యెక్కువ భవబంధ మెడలఁజాలుదురు
భోగమోక్షము లెందు భూజనుల్ సెంద
యోగి దుర్లభబోధ మొందుదు రెట్టి
కథ వినినంతనే కలుగు సంపదలు
ప్రథితపుణ్యము లందు పాతకం బణగు
నేది విన్నంతనే యెల్లవేదంబు
లాదరంబున విన్న యట్లగు నట్టి250.
స్థలము గల్గెనయేని దాచక తెల్పు
ప్రలసద్వివేక ! పౌరాణికచంద్ర!
అనవుడు సూతుఁ డత్యాశ్చర్య మొంది
ఘనచింత నూహించి ఘటికాద్వయంబు
ప్రత్యభిజ్ఞానంబుఁ బాటిల్లఁ గాంచి


యత్యంతసమ్మోద మలర నిట్లనియె.
మౌనీంద్రులార యిమ్మహి రహస్యంబు
జ్ఞానవిజ్ఞానైక సాధనస్థాన
మరయంగ శుద్ధసత్వాస్పదం బైన
పరమపదం బొండు భావింప శేష260.
గిరి యొండుగాక యీక్షితిని 'వేఱొొండు
కరము చూడఁగ వినఁగాఁ దగ దెందు
నైన వైకుంఠ [3]మమర్త్య గమ్యంబు
గానఁ బ్రత్యక్షమై కనుఁగొనరాదు
దేవమనుష్యాది దృశ్యమై భూమి
నీ వేంకటాద్రి యింపెసఁగు నట్లగుట
వైకుంఠము దొఱంగి వనజాక్షుఁ డిదియె
చేకొని విహరించు శ్రీకాంతతోన
నిది మీకుఁ దెలుపంగ నేఁ గోరుచుందు
నది మీర లడుగుట నద్భుతం బయ్యె270.
నద్భుతం బాగిరి యతులితమహిమ
అద్భుతతర మందు హరివిహారంబు
నా కథావృత్తాంత మత్యద్భుతంబు
లోకింప నింతయు లోకాద్భుతంబు
ఆదివరాహమై హరి సృష్టి వేళ
ప్రాదుర్భవించుట పరమాద్భుతంబు
కిటిరూపమున నిట్టి క్షితినుద్భవించి
చటులత వేంకటాచల భర్తయైన
పుణ్యచరిత్ర మద్భుతతమం బని య



గణ్యవాక్పటిమ వొంగఁగఁ బఠించినను280.
తెలిపినన్ శుభములు తిరముగా సిరులు
కలితసౌఖ్యారోగ్యఘనభాగ్యకీర్తు
లలఘువైభవము లత్యర్ధముం గల్గి
వెలయుదు రటు గాన వినుఁడు తెల్పెదను
నావుడు మౌను లానంద ముప్పొంగ
నీవసుధోద్ధార మిటు సల్ప [4]నిటకు
నాదివరాహమై యవతీర్ణుఁ డగుట
యాదిగ శ్రీ వేంకటాద్రివైభవము
వివరింపు మన విని వే సూతుఁడటుల
వివిధ వృత్తాంతముల్ వివరింపఁదొడఁగె.290.

శ్రీ రమణుఁడు వరాహావతారమున భూమి నుద్ధరించుట.


శ్రీ రమణుఁడు మున్ను శేషతల్పమున
క్షీరాబ్దిని శయించి చెలఁగునవ్వేళ
లీలచే భువనముల్ సృజియించుకోర్కె
నాలోన తననాభి నంబుజం బొప్పఁ
గలిగించి యా దివ్యకమలంబునందు
నలువఁబుట్టించి యా నలువకు స్మృతుల
దయ నుపదేశించి తతపంచభూత
మయలోకనిచయ నిర్మాణపాటవము
కల్పింప నారీతి కమలసంభవుఁడు
కల్పాదియందు లోకములు సృజింపఁ300.
బూని నీరము వహ్ని పుడమిని గాడ్పు

1.


వానిన బరువుచే వసుధ మున్నీట
మునిగి కూర్మమువెన్ను మోసియుండంగఁ
గని దానిఁబై నేతగా నేరకునికి
వరమకారుణికాత్మఁ బద్మనాభుండు
చిరునగ వానన శ్రీకిఁ దళ్కొనఁగ
కౌతుకం బొప్ప నాకస్మికంబుగను
శ్వేతవరాహమై చెలువొందె నపుడు
అట్టి మహావరాహాకృతి నండ
ఘట్టనోద్ధతపరాక్రమ ముట్టిపడఁగ310.
ఘుర్ఘురాయితమహా ఘోరరవంబు
నిర్ఘాతశతకోటి నీటణంగించె
మెఱుగుకోరలతీరు మేతముస్తలను
దొరలంగఁ గొఱకుచోఁ దునియలై వ్రీలి
దండిగా సెలవులఁ దగిలిన వెండి
కొండ ఖండంబుల కొమరున నమరె
బుసకొట్టునట్టి యూర్పులకుఁ గలంగి
కనరెత్తి సప్తసాగరము లుప్పొంగె
కడలినీరెల్ల నగ్గలిక నింకించు
బడబాగ్ను లన కండ్లు ప్రబలి కెంపెక్కె 320.
పక్కున బ్రహ్మాండభాడంబు వగుల
నిక్కరించెను చెవుల్ నిష్ఠురాకృతిని
చలిగట్టుపై తాలసాలంబు లనఁగ
బలురోమములు నిట్రుపాటున నిలిచె
గొరిసెలధాటిచే ఘోర్ణిల్ల జలధి
దిరదిర దిరిగె నల్దిక్కు లాకసము



[5]హరుఁడు విస్మయమొందె నది చూచి బెదరి
పరమేష్ఠి నివ్వెఱపాటున నిలిచె
అప్పు డాపెనుబంది యతిజవం బంది
యుప్పొంగు ప్రళయకాలోదధి జలము330
చొచ్చి చెర్లాడి హెచ్చుగ సుళ్లురేచి
విచ్చలవిడి నొక్క వేదండవరము
కొలను సొచ్చిన యట్లు కొందలమెసఁగ
నల మందరము కవ్వమై త్రచ్చుకరణి
బిరబిర తెరలుబ్బి పెంపొంది మ్రోయ
నురుగు తెట్టియలు మిన్నుల నిండ నెగయ
వెసవెస పాతాళవీధిఁ గలంచి
యసురపుంగవు హిరణ్యాక్షు గన్ గొనియె
అట్టిదైత్యుని భీకరాకారమునను
గట్టు కైవడి తొలంగఁగ నిల్చి యెదుట340
కనుగ్రుడ్లు నిప్పులుగ్రక్కంగ నోరు
పెనుబొంద చందాన బెట్టుగాఁ దెఱచి
యడరినపిడుగుల ట్లార్చి యెంతయును
పొడవైన చేతుల పూన్కి నంబుధులు
తెరవిచ్చి పాయలై తెఱువిచ్చి తొలఁగ
నురువడి[6] నడరిన యురువేగమునను
గిరగిర దిరుగుచుఁ గెరలి లోఁదెరలి
మొరయు నార్భటి మారుమొరయున ట్లుబికి
సుడివడ నీరముల్ సుడిఁబడి కలగ


తొడివడ నటఁజేరి దొరకె నిం దొక్క350.
భక్షణం బని వేగఁ బఱచిన వాని
నాక్షణంబ వరాహ మలుకచేఁ దాఁకె
తాకిన యసుర నత్తఁఱి దత్తరమున
వీఁక దప్పక గిన్క వేగ ధట్టించి
పిడికిటఁ బొడిచిన బెట్టు రోసమునఁ
గడిమికోరల వాఁడి గావించి మించి
వడిమీఱ సురరాజు వసుధాధరంబుఁ
గడక వజ్రముచేత ఖండించినటుల
కరిరాజకుంభంబు కంఠీరవంబు
గురుతరనఖరేఖఁ గొట్టిన యటుల360.
తనకఠోరకరాళదంష్ట్రాగ్రమునను
తునియించి గొరిజలఁ ద్రొక్కి ౘక్కాడ
రక్కసుం డీల్గె తద్రక్తంబు లెగిసి
యక్కజంబుగ నిండ నంభోధిజలము
నంతయుఁ గలయంగ నరుణీభవించె
నంతట నాదంష్ట్రి యతివేగమునను
ఆదికూర్మము వీఁపునందుండు ధరణి
నాదరంబుగ గాంచి యవలీలగాఁగ
నొక కోరమొన నొత్తియుబుకఁ బైకెత్తి
యెగసి వెల్వడివచ్చి యిల ధాత కిచ్చి370.
ఫణిరాజుపడగలపై నిల్ప నపుడు
ప్రణతులు గావించు పద్మసంభవుని
కల్పాంత మిటువలెఁ గాఁగ లోకములు
కల్పించు మిఁక నొండు గలుగ దపాయ


మనుచు నానతియిచ్చి యఖిలభూచక్ర
మనువుగాఁ గనుఁగొంచు నట సంచరించి
కులపర్వతమ్ములు కుదురుగా నుంచి
జలధుల విభజించి చంద్రసూర్యులకు
నుచితతేజములతో నుండ నేమించి
రుచిరమౌ గౌతమీరోధము చేసి380
చెంతను భక్తితో సేవించుగరుడు
సంత వీక్షించి యిట్లని యానతిచ్చె

వైనతేయుఁడు హరియాజ్ఞచే వైకుంఠమునుండి రత్ననగరాజమును దెచ్చుట



పక్షీంద్ర నీవు నిబ్బరమున నేగి
యక్షీణలక్ష్మిచే నలరువైకుంఠ
నగరంబునను మన నగరిలో రత్న
నగరాజ మొకటి యున్నదిగదా దాని
భువికిఁ దేవలె నిందు భూరిలీలలను
దవులుగా విహరింపఁ దమిబుట్టు మదిని
ఇందిరారమణిని హితపారిషదుల
నిందురా తోడ్కొని యేగి వేవేగ390
ననుచు నియోగించి యావైనతేయు
ననిచి గౌతమిదాటి యలకౌతుకమున
మరి కుంభజావాసమహితదిగ్భాగ
మరయుచు గౌతమి కరువ దామడను
స్వర్ణముఖర్యాఖ్యవాహినిచెంత
స్వర్ణ[7]నగాధిత్యసదృశమౌ నొక్క


వనముఁ గన్గొని దానివైఖరి [8]కలరి
వినుతిసేయుచు నందు విహరించుచుండె
అపు డట్టివనభూమి హరికటాక్షమున
విపులలక్ష్మి వహించె వివిధభూజములు400.
చందన మందార చంపకాశోక'
తిందుక జంబీర దేవదారువులు
తాల తమాల హింతాల తక్కోల
నారికేళామ్ర మన్మథ సింధువార
పారిజాతార్జున పనస శైలూష
నారంగ పున్నాగ నాగకేసరము
లామలక కదంబ కాశ్వత్థ వకుళ
తామస తింత్రిణీ తపసాఖ్యములును
న్యగ్రోధ సప్తప ర్ణాశ్వక ర్ణార్క
శిగ్రుకరంజక శ్రీఫల కుటజ410.
కరవీర మరువక కంకేలికోల
కురవ కురంటక కోవిదారములు
పిచుమంద జంబూ విభీతక హరిత
లిచు ళాభ యాలర్క నింబ ఝింటికలు
సాల కాకోల రసాల దాడిమలు
పాలాశ శాల్మలి పాటలంబులును
సురభి ప్రియాళ రించోళ ఖర్జూర
సరళ వంశాగురు సహకారములును
తిలక లవంగ జాతిక పూగ ఖదిర
కలివాస శింశుపా కర్ణికారములు420.


కదళీవనంబులు కలువబావులును
పొదలైన మల్లెలు బొండుమల్లియలు
చేవంతులును పచ్చచేవంతిగములు
తావిరంజిల్లు గేదంగిమొత్తములు
జాదులు విరిజాజి సన్నజాజులును
పూదోటలఁజెలగు పూపొదరిండ్లు
కమలాకరంబులు కల్హారములును
విమలకాసారముల్ విపులనిర్ఝరము
లంతంతకును వసంతావాసమనఁగ
నెంతయు వింతగా నింపొందెనందు.430
అపు డట్టిపక్షికులాధినాథుండు
విపులవిక్రమమున వినువీథి కెగసి
వారిదంబులు రెక్కవడిఁ దొలఁగంగ
భూరిమారుతపదంబులు విలంఘించి
స్వర్గలోకము దాఁటి వడి మహర్లోక
మార్గంబును ధరించి మరి జనలోక
మాతపోలోకంబు లవలీలఁ గడచి
ధాతకు నిరవుగాఁ దగు నత్యలోక
ము నతిక్రమించి సమున్నతాజాండ
ఘనవివరము దూరి గడిమీఱి యవల440
నావరణజలంబు లగ్నిమండలము
నావాతబంధంబు నంధకారంబు
పెనుబయల్ వెనుకఁబోఁ బెట్టురికి
ఘనవిరజానది గర్భంబు సొచ్చి
కడతేరి యద్దరి కడిమిమైఁ జేరి



నడచి యావైకుంఠనగరోపకంఠ
మగుట సద్భక్తి సాష్టాంగమెఱంగి
తగువినయంబుతోఁ దడయ కేగంగ
నుద్యానవనసీమ నుండుభూజములు
విద్యాధరాప్సరుల్ వివిధకిన్నరులు450.
క్రీడామృగంబులు కేకిశారికలు
చూడనౌ హంసముల్ శుకకోకిలములు
సప్రాకృతంబులై యమలవిజ్ఞాన
దీప్రంబు లగుటచేఁ దిలకించి యతని
సేమ మరసి యక్కుఁజేర్చి సంతసిలి
ప్రేమ నాతిథ్యంబు పెనుపొందఁ జేయ
వడిఁదేఱి యాతండు వారి వీడుకోని
వడినేగి యాపురద్వారంబు గాంచె
నందు నూరును పదియారు వన్నియల
కుందనఁబులు చెక్కు గోపురంబులను460.
పులుగురా నేటిరూపులు దాల్చి మెఱుఁగు
పులుఁగురాఱాల గుంపుల డా లెసంగ
చెలఁగుడాలులు తమ శేఖరంబులుగఁ
[9]గులుకుఘాంటికులు పల్కుల నాదరింప
చలువగా డ్పొలయ నైజపటాళి వీవ
నలరుచు నొయ్యన నరుగు నత్తఱిని
వివిధమణీగృహ వీధికాతతులు
ధవళేందుకాంత సౌధప్రకాండములు
విస్తృత వైడూర్యవేదికావళులు
నిస్తుల ముక్తామణీకవాటములు470.



తుల లేని పచ్చల తోరణములును
వెలలేని పగడాల వేయుకంబములు
దృష్టింపరానట్టి దీప్తుల కెంపు
లష్టాంగవజ్రంబు లంతరాంతరము
లంతయుఁ దాచిన యట్టికుడ్యములు
వింతనీలములు బర్వినగవాక్షములు
పొలుపొందు కాంచనపుష్పరాగములు
మలచిన యాస్థానమంటపంబులును
జీవదంతంబులఁ జెలఁగు సెజ్జలును
జీవిపాంచాలికాంచిత విటంకములు480.
నిలువుటద్దములు పన్నిన పడకిండ్లు
నిలువునిగ్గొడిక మందినకురుంజులును
గాణిక్యనటన రంగస్థలంబులును
మాణిక్యములఁ బొల్చు మజ్జనశాల
లాణిముత్యమ్ముల హవణించు నంబు
వేణికాయంత్రముల్ వెలయుమేడలును
చలువరానిగనిగల్ సవరించుమించు
చలువఱాలఁ జెలంగు చప్పరంబులును
గోరోచనచ్చవి గుల్కుపాన్పలర
పేరోజనంబులఁ బేర్చుమంచములు490.
చమరవాలంబుల జల్లు లుల్లసిలి
యమరవాటిల్లు నాయతవితానములు
మణిశైలములమించు మఱపించి మించు
రణరణన్నవరత్న రథకదంబములు
నిరుపమ చింతామణీచిత్ర సింహ


పరివారితోన్నత భద్రపీఠములు
కలితకాంచన పత్రికాధూయమాన
లలితశుద్ధాంత డోలా యంత్రములును
విధుముఖజనవచోవిసరానువాద
మధురోక్తశారికా మణిపంజరములు500.
కనుఁగొన నానందకరములై మెఱయఁ
దనరు నప్పురియొప్పిదములు వర్ణింప
వశమె శేషునకైన వాక్పతికైన
నసమేక్షుణునకైన నజునకునైన
నా నందకాయుధునాలయంబరయ
నానందరసఘనమై తేజరిల్లు
బద్ధచేతనులకుఁ బ్రాపించరాని
శుద్ధసత్త్వైకవిస్ఫూర్తి రంజిల్లు
నిత్యముక్తాత్ముల నిలుచుప్రోలగుచు
నిత్యసత్యజ్ఞాననివహమై యొప్పు510
సూర్యచంద్రాగ్నులు చొరరాని దివ్య
భూరి తేజఃపుంజముగఁ దేజరిల్లు
వేనూరువేవేలవేలక్షకోటి
పూని యొక్కెడఁగూడి పొదలక నిలిచి
మెఱయు మెఱుంగుల మెఱుఁగులేయైన
నరయ ననంతకోట్వర్కులేయైన
సరిగఁబోల్పంగ నచ్చటి మిణుంగురుల
కురుఁజునిగ్గుకురాదు గొనరాదుసువ్వె
అట్టి వైకుంఠపురాంతరంబునను
దిట్టయే చని వైనతేయుండు వీధిఁ 520



బొలుచుమేడలు మేడఁ బొలయుపుల్గులును
పులుఁగులతోఁబల్కు పుణ్యపూరుషులు
పురుషులు ధరియించు భూషణంబులును
వరభూషణమ్ముల వరలునమ్మణులు
మణికీలితంబైన మందిర గణము
గణనీయనూక్తుల క్రమమునఁగుశల
మడుగంగ నటుసేమమంతలు వడసి
నుడుల కలవిగాని నూత్న [10]విభూతి
భవనుతుఁడై నట్టి పరిధూతభవుని
భవనప్రతీహార భాగంబు నేరి530
యచల బంగరుబెత్తు లనువుగాఁ బూని
యచిరప్రభానిభం బైనఖడ్గంబు
పడఁతల ధరియించి పసిడిపుట్టంబు
కడుమిన్నగాఁ గట్టి కరతలంబులను
సవరణచెలగంగ శంఖచక్రములు
వివిధభూషణములు వెలయంగఁ దాల్చి
వరకిరీటంబు శ్రీ వత్సలాంఛనము
నురమునఁ గౌస్తుభం బొప్పు మురారి
సారూప్యమున నిల్చు జయవిజయులను
గూరిమి భజియించి కుశలము లడిగి540
తా వచ్చురాకయుఁ దడయక తెల్పి
దేవనియోగంబు దెలియ నిట్లనియె
వినుఁడు శ్రీ రమణుండు వెన్నుండు ధరణిఁ
దనలీల విహరింపఁదలఁచి యిందుండు



పడవాలు మొదలుగాఁ బరిజనంబులను
దడయక దోడ్కొని తతవిహారాద్రి
తెమ్మని నసుబంచె దేవాజ్ఞ యట్లు
నెమ్మితోఁ జనుఁడని నియమించి మఱియు
సైన్యపతికిఁ బారిషదులకు మ్రొక్కి
మాన్యత నిందిరామందిరోద్యాన550.
మరయుచు నరిగి యం దారత్నశైల
మరుదుగాఁ గనుఁగొని యాత్మ రంజిల్ల
ఘనలీలనిందెకా కమలావధూటి
వనజాక్షుడును గూడి వదలని ప్రేమ
సరసంబులాడుచు సరివలపులను
మురువుగా నేకతంబున రహః కేళి!
సలుపుదు రిందెకా సారకహ్లార
జలజోత్పలంబుల సరుల నొండొరులఁ
గయిసేసి కస్తూరికాతిలకములు
ప్రియమున దిద్దుచు బిగువుకౌగిళ్ల560.
మెలఁగుదు రీపాన్సు మృదుపల్లవముల
జెలిమి నిందేకాదె చెలగి జూదంబు
వింతగా నాడుచు వేడ్క నందుదురు
చెంత నీపాళి యాచెలువుఁ దెల్పెడిని
మచ్చిక నిచ్చోట మలయుచు నిరుపు
రిచ్చటభుజియింతు రీభాజనమున
నీ సరోవరమున నీఁదులాడుచును
భాసురజలకేళి పాటింతు రెపుడు
గుహచెంత నిందెకా కొమరుమీఱంగ
విహరింతు రడుగు లివ్వేళఁ గన్పట్టె570.


నిరువురు నిచ్చోటనే విరుల్ గోసి
రరయఁగాదేని యిట్లలరునే తోట
ఈపొన్ననీడనే యెనసి కూర్చుండి
రేపున నటుగాన నిది కరం బెసఁగె
నౌర యీతరువులయందంబు వేయి
నోరులచేనైన నుతియింపఁ దరమె
పగడంపువన్నియ పరగినతరులు
ధగధగద్రుచులచేఁ దనరెడుఁ గాదె
మరకతమణికాంతి మలయు నీమహిజ
వరము లింపొందెడి వనభూషలగుచు580
చంద్రకాంతచ్ఛవి జల్లుచు నిట్టి
సాంద్రద్రుమము లొప్పసాగె నయ్యారె
మే లిట్టిలతికలు మిసిమిబంగారు
డాలు మించంగ నాట్యము సేయదొడఁగె
భళిరె యీపొదరిండ్లు బటువుముత్తెముల
కొలఁది లేమొగ్గలగుత్తులఁ దాల్చె
నిచ్చటిమృగములు నిన్నివన్నియల
మెచ్చుచు మారీచమృగలీలఁ బూనె
నెన్నెన్నివింత లియ్యెడఁ గాననయ్యె
వెన్నుఁడు విహరించు వెల్గు లబ్బుటను590
బాపురె యీశృంగపాళి రత్నములఁ
జూపట్టుచున్నది సొబగు రంజిల్ల
నిది వింత యీఝరి యెనలేని పసిమి
యుదిరి కడానిడా లూని రాణించె
నని మెచ్చిచూచుచు నచ్చెరువంది


వినుతించు వెస మ్రొక్కు వెండియు లేదు
మొనసి ప్రదక్షిణంబులు సేయు భక్తి
పెనుపొంద భావించుఁ బేర్మినటించు
నానందభరితుఁడై యానందకధరు
నానతిఁదలపోసి యతివేగ డాసి600.
పటులీల నా గిరి బలిమి నెత్తంగ
కటిని బంగరుశాల్వ కడిమి బిగించి
మేరుశైలాయితమేయైన సాటి
గా రూఢిఁ గొన్నశిఖరసంఘములును
నల రోహణాద్రిసహస్రంబులైన
తుల సేయరానట్టి తుంగశృంగములు
మంచుకొండలకోటి మార్కొని గెలువ
మించిన కూటముల్ మిగులఁ గ్రాలంగ
ఫణిరాజఫణములపగిది మాణిక్య
ఘృణి నొప్పు సానువుల్ కెలన దీపింప610
మహనీయమందిరమండలాకృతిని
గుహలు లతాగృహకోటులు దసర
నా లతాగృహములయందుఁ గిన్నరులు
కేళిని బొందుచు గీతముల్ సేయ.
నల గీతు లాలించి యలరి యౘ్చరలు
లలితనాట్యంబులు లయమీఱ సలుప
నా నటనము మెచ్చి యచట బర్హంబు
లూని [11]కలాపిక లుగ్గడించంగ


నా తాళమానంబు లంది మయూరు
లాతతలాస్యంబు హవణింపుచుండ620.
నట్టి లాస్యంబున కతిహర్ష మొంది
నెట్టన శుకహంసనికరంబు వొగడ
నగలక్ష్మి చూడ నన్నగరా జొనర్పు
సొగసు నాటకశాలచొప్పున నొప్పు
బాపురే యనఁగ ముప్పదియోజనముల
చాపును మూఁడు యోజనముల వెళుపు
కలిగి వెన్నునిపాన్పుగా నుల్లసిల్లు
చిలువరాయనిరూపు చేకొని మెఱసి
మరియుఁ గోటికిరీటమండలిఁ దాల్చి
వరుసగ మణిసానువరభూష లంది630.
జాతరూపావని జాతరూపాగ్య్ర
పీతాంబరం బింపు పెంపొందఁ గట్టి
నృత్యన్మయూరికోన్నిద్రబర్హంబు
లత్యంతరుచు లీన హంసచక్రంబు
రహి శంఖచక్రపరంపరగాఁగ
బహుళపద్మాకర పంక్తులకాంతు
లమితలోచనవదనాభఁ జూపంగ
విమలనిర్ఝరహారవితతి శోభిల్ల
స్ఫారవిరాట్స్వరూపంబునఁ బొలుచు
నారాయణుండే కా వలువుండు నట్టి 640.
నారాయణాద్రిఁ దిన్నగ నుద్దరించి
భూరిభుజాశక్తి బూని మూపునను
వారక నంటి విష్వక్సేనముఖులు


కూరిమి రాఁగ చంగున నింగి కెగసి
నిజపక్షవిక్షేపనిష్ఠురోద్ధతుల
గజిబిజి బ్రహ్మాండఘటము లూఁటాడ
మెఱసినట్టులు కండ్లు మిఱిమిట్లుగొనఁగ
సురకిన్నరాదులు చూచి నివ్వెఱుగు
పడి కంప మొంద సప్తసముద్రపాళి
సుడివడి ఘోర్ణిల్లుచును బెట్టు మొరయ650.
కులగిరుల్ దిర్దిర కుమ్మరిసారె
పొలుపునఁ దిరుగంగ భూనభోంతరము
దిక్కులు బోరునన్ దీరనిరొదలఁ
బిక్కటిల్లగ లోకభీకరంబుగను
జవసంజనితభూరిజంఝానిలంబు
భువనపాళిక నిండి భూరుహంబులను
పెకలించి సుడిగాడ్పు బిసబిస విసర
వికలజీర్ణపలాశవితతి యనంగ
భ్రమియింపగాఁ జని ప్రౌఢవేగమున
నిమిషమాత్రనే తెచ్చి నీరజేక్షణుని660.
సమ్ముఖమున పారిషదులును దాను
నెమ్మి కేల్మోడ్చి వినీతుఁడయి నిలిచి
నిలిచిన విహగాగ్రణిని బూర్ణకరుణఁ
దిలకించి యా వాసుదేవుండు చెంత
సారసకలహంసచక్రవాకములు
సారసోత్పలలతాచయముల గవలు
గూడి మృణాళముల్ గొని మెసవుచును
వేడుక విహరింప విరులతేనియలు


గ్రోలుచు తుమ్మెదల్ రొప్పు ఝంకృతులు
చాల వీనుల కెల్ల సంతసం బెసఁగ670.
తటజమందార చందన కుంద వకుళ
కుటజ చంపక వట కోవిదారములు
నాగకేసర తాల నారంగ పనస
పూగ పున్నాగ జంబూ ముఖద్రుమము
లతిశీతలచ్ఛాయ లడరించు శాఖ
లతులితచ్ఛవి గప్పి యావరింపుచును
పుష్పవత్కీర్ణముల్ బొదలంగనీక
పుష్పధారావర్షములు గురియంగ
నల్ల నీడలజాడ నరిగి తెమ్మెరలు
చల్లదనము తావి చల్లంగ మెఱయు680.
స్వామిపుష్కరిణియన్ సరమునుఁ జూపి
ఈ మహాసరసిపై నెనగంగ ధరణి
నిడు మన నాతఁ డయ్యెడ సమంబైన
పుడమిని యా దివ్యభూధరం బునిచె

దేవతలు వరాహస్వామిని స్తుతించుట


అప్పుడు వినువీధి నలరులసోన
లొప్పె వేల్పులభేరు లులిసె నచ్చరలు
నటియించి రటు జూచి నలినసంభవుఁడు
నిటలాక్షు డింద్రుండు నిర్జరమునులు
సతివిస్మయంబున నచ్చోటి కరిగి
క్షితివరాహస్వామి సేవించి భక్తి690.
ప్రణుతించి దేవ యో భక్తమందార


గుణగణాధార త్రిగుణవర్జితాత్మ
ఈవె జగత్కర్త వీవె రక్షితవు
నీవె సంహర్తవు నీవె బ్రహ్మంబు
ధర నుద్ధరించి తందరిని బ్రోచితివి
స్థిరమైన నీదు శక్తి ప్రభావమున
నే మెల్ల నీవిచ్చు నియ్యధికార
మోమజాలుదు మిఁక నొకటన నేల
సర్వశక్తివి సర్వజగదాత్మ వీవ
సర్వభూతదయైకజలనిధి వీవ700
యనఘాత్ముఁడు గజేంద్రుఁ డాదిమూలంబ
యని నిన్ను దలఁచెఁ గా కన్యుల మదిని
దలఁచెనే సురమునుల్ తగువేళ నిన్ను
గొలుతురు గా కన్యుఁ గొలువఁ బోవుదురె
సరవిగా భజియించు సకలజీవులకు
వరము లిచ్చెద ని ట్లెవ్వా రియ్యఁగలరు
భువనరక్షకుఁ గాదె భూమిక లిటుల
నవధరించితి వీవె నభవుండ వీవు
పరమకారుణికస్వభావ నీయమిత
వరగుణోత్కరములు వర్ణింపగలమె710
తనుధారు లిట్టు లీదారుణరూప
మును జూచి భయమున మూఢు లయ్యెదరు
చాలించి యీమూర్తి సౌమ్యరూపమున
మే లొసంగవె జనుల్ మేము గొల్వఁగను
నావు డా సురల కానందం బెసంగ
సేవింప నింపైన శ్రీనివాసుం డయి


నిలిచి వారు నుతింప నిఖిలేప్సితములు
ననువున నొసఁగి యంతట నాత్మమాయ
నంతర్హితుండైన నా శ్రీనివాసుఁ
డంతర్హితుండయ్యె నద్భుతంబుగను720
అటుల తిరోధాన మందు గోవిందుఁ
బటుభావనం గాంచి బ్రహ్మాదు లప్పుడు
తమనివాసములకుఁ దరలి యేగుటయు
రమణీయమైన నారాయణగిరిని
తపనీయగోపురాస్థానమంటపని
రుపమభద్రాసనద్యుతు లింపు నింప
యత్నదుస్సాధస్వయంవ్యక్తమైన
రత్నవిమానంబు ప్రాదుర్భవించె
నందు ముకుందుండు వ్యక్తరూపమున
నిందిరం దిరమైన యెలమితో నలమి730
వదలక నంత విష్వక్సేనగరుడు
లుదితభక్తిని జెంత నుడిగముల్ సేయ
నిత్యముక్తులు భక్తి నెరి నోలగింప
సత్యసంకల్పత్వసత్యకామతలు
ప్రత్యక్షముగ నాత్మభావంబుఁ జూడ
నిత్యంబు లీలైకనిరతభావమున
నొక్కొక్కయెడ నదృశ్యుం డయి మరియు
నొక్కొక్కవేళ మాయోపగూఢుఁ డయి
యొకచో వరాహమై యుదయించు మూర్తి
యొకచో నృసింహమై యొనరు రూపమున740
నొక్కెడ శ్రీనివాసోజ్జ్వలాకృతిని


నొక్కెడ వరరాజయోగ్యవేషమున
వనవిహారమ్ముల వరదరిసలుప
లను విలాసముల డోలాఖేలనముల
నిష్కుటరోహణాన్విత<ref> వ్రా.ప్ర. న్వితకేశవస్వామి,/ref> మగు స్వామి
పుష్కరిణిని శుభాంబుక్రీడనమున
వాహనారోహణవారితవిహృతి
సాహసమృగయాప్రసంగకలీల
నవ్యాజదీనావనాసక్తి నెపుడు
భవ్యసంచారంబు పరఁగ సల్పుచును750
శ్రీ వేంకటాచలశృంగాంతరమున
నీవగ యుగము లెన్నేనియు నుండె
ననుచు సూతుఁడు వరాహపురాణసరణి
వినుతింపగా మునుల్ విస్మితాత్ములయి
బాదరాయణపాదపంకజభృంగ
వేదాంతనిధి వీవు విశదంబు గాగ
వైకుంఠకిటివైభవంబును వేంక
టాకుంఠితాతిమాహాత్మ్యంబు లోక
మాన్యపురాణక్రమమున దెల్ప విని
ధన్యుల మైతిమి తగ నందు స్వామి760
పుష్కరిణి యనంగ భువి నెట్లు గలిగె
పుష్కరాక్షున కది ముద మెట్లు సల్సె
శ్రీపతి నెవ్వారు సేరి గన్గొనిరి
యేపగిదిని యాతం డిల విహరించె
నంతయుఁ దేటగా నాద్యంత మిపుడు


సంతోషముగ సవిస్తారంబు దెలుపు
మనుచు ప్రార్థించిన నమ్మునీంద్రులకు
వినవిన నమృతంబు వెదజల్లినటుల
నభినవానందంబు లతిశయించంగ
శుభకథావ్యాఖ్యాత సూతుఁ డిట్లనియె770.

స్వామిపుష్కరిణి ప్రభావము.


యమిచంద్రులార నారాయణ శైల
విమలవైభవములు వివరించుతఱిని
స్వామిపుష్కరిణిం బ్రసంగసంగతిగ
నేమును సంగ్రహాకృతిని బేర్కొనిన
నదె మీర లడిగెద రట్టి మాహత్మ్య
మెదనుంచి పలుకంగ నెవ్వరితరము
పదినూరుమోముల ఫణిరాజుకైన
వదనాయుతము గల్గు వనజాక్షుకైన
స్వామిపుష్కరిణిస్రవంతిప్రభావ
భూమ గణింపను బొగడంగ వశమె?780.
ఐన నే వినినంత యరసి మీ కిపుడు
పూని తెల్పుదు మహాద్భుత ముద్భవిల్ల
పావన మిది మహాపాపహరంబు
భావితారోగ్యసంపత్కారణంబు
కేవలశ్రవణసంకీర్తనామృతము
సావధానము మీఱ సమకట్టి వినుఁడు.
మును పా హరి వరాహమూర్తియె ధరణి
కనుఁగొని చింతించి కల్పాదియందు


ప్రళయతమఃకృతాపావనత్వమున
కెలమి నిష్కృతిఁజేయ నిచ్ఛించి మదిని790.
నిజపదోద్భవయైన నిర్జరతటిని
నిజముగా నెప్పుడు నిత్యయౌ కతనఁ
బ్రళయవేళను దానిఁ బ్రళయవైకుంఠ
విలసితోద్యానప్రవిష్టమౌ నట్టి
స్వామిపుష్కరిణిలో సంగతి నునిచి
యే మేను గా నని యుర్వికిఁ బిలువ
గంగతో స్వామిపుష్కరిణియు వచ్చె
సంగతిశుచిగాఁగ సలిపె నీ భూమి
జలజాక్షుఁడును గేళిసరమైన దీని
తొలఁగక తత్తటి ధ్రువముగా నిలిచెఁ800.
గావున స్వామి పుష్కరిణి లోకైక
పావని హరిమనఃప్రమదంబు సల్పు
దానిఁ దలంచిన తలఁగు నఘంబు
మానితపుణ్యసంపదయుఁ జేకురును
స్వామిపుష్కరిణియన్ సంజ్ఞఁ బేర్కొనిన
భూమి సదారోగ్యభోగభాగ్యములు
పుత్రపౌత్రసమృద్ధి పుణ్యకీర్తులును
ధాత్రీతలస్వామితయును సిద్ధించు
నై రమ్మదసరోవరాఖ్యఁ జెన్నొంది
సారెకు హరికేళిసరసిగాఁ జెలఁగు810.
ఆ తీర్థముఁ ప్రదక్షిణావృత్తినతులఁ
బ్రీతిఁ బూజించిన స్త్రీ శూద్రులకును
గోరిక లెల్లఁ జేకూరు నెల్లెడలఁ


దీరు నాపద లెల్ల దివ్య సౌఖ్యములు
కలుగు నెంతయు లక్ష్మి కదలక యింట
నెలకొను హరిభక్తి నిత్య ముప్పొంగ
నల తీర్థతీరమునందు వరాహుఁ
గొలిచి పూజించినఁ గోటిజన్మముల
కలుషసంఘంబు తక్షణమే తొలంగు
తలఁచిన నిష్టసంతానంబు గలుగు820
బహుభాషణము లేల బధిరాంధమూక
విహతాంగవంధ్యాదివివిధజనంబు
లాపుణ్యతీర్థంబునందు వత్సరము
రేపకడనె మున్గి శ్రీకాంతుఁ గొల్చి
నియమంబు మీఱంగ నిత్యకృత్యంబు
నయపరులై విధానక్రమంబునను
వ్రత మాచరించి యవ్వత్సరాంతమున
క్షితిసురపూజ లా శ్రీనివాసులకుఁ
బ్రీతిగా భక్తి సల్పిన యట్టివారి
కేతీరునను గోర్కె లీడేరు సువ్వె830
వినికి చూడ్కియుఁ బల్కు వినుతాంగపటిమ
తనయులుం గలుగును తథ్య మెంతయును
అది గల్గు నిది గల్గ దని సంశయంబు
మది నుంచకుఁడు తీర్థమహిమ యట్టిదియె

శంఖణుఁడను చంద్రవంశపురాజు కథ



ఇతిహాస మొక్కటి యిట్టి యర్థమున
ప్రతిబంధ మయ్యె నప్పరిపాటి వినుఁడు


ఇద్ధరఁ గాంభోజ మేలువాఁ డొకఁడు
బుద్దిసంపన్నుండు భూరివైభవుఁడు
మంత్రివశ్యుఁడు సాంగమంత్రకోవిదుఁడు
సంత్రాసితాఖిలశత్రుమండలుఁడు 840
నీతిశాస్త్రజ్ఞుఁడు నిఖిలార్థవేది
ఖ్యాతిమంతుఁడు పరాక్రమపంచముఖుఁడు
తురగరేవంతుఁడు దోర్బలాన్వితుఁడు
సరసాగ్రగణ్యుండు శస్త్రాస్త్రవిదుఁడు
శరదభ్రశంకరాచలహారహీర
శరచామరపటీరసారకర్పూర
పారదడిండీరఫణివరక్షీర
శారదరాభ్రేభసంఘనీహార
శంఖేందుజాహ్నవిసదృశసత్కీర్తి
శంఖణుండను రాజు చంద్రవంశజుఁడు850
కలఁ డాతఁడు విచిత్రకళల భోజుండు
కలనైన పగర బెన్గలనైన నన్య
కాంతలపాలిండ్లు కైసేయఁ డెందు
పంతంబునను ద్యూతపటిమఁ జేకొనఁడు
వేడకము నిచ్చు వేడెనే నర్థి
వేడినంతకు హెచ్చు వేవేగ నిచ్చు
నాడఁడు పెక్కు ల ట్లాడెనే నంటి
యాడినంతయు నిక్క మైయుండఁ జేయు
నెంచఁడు నేరంబు లెంచెనేని బుధు
లెంచంగ శిక్షించు నెయ్యెడ ఖలుల860
నలుగఁ డల్పంబున కలుగునే నొకడ
నలుకరేఁచువిరోధి నపుడె ఖండించు


వినయపరుండయ్యు విమతులయెడల
ననయంబు భీషణుం డగుచుఁ జెలంగు
వీతలోభుఁడయైన విబుధసంగతుల
నాతతలోభంబు నాత్మ వహించు
భయదూరుఁడయ్యును పరమశాంతాత్ము
లయినవిప్రులపట్ల నతిభీతి మెలఁగు
ధరఁ దాన యఖిలస్వతంత్రుడై యుండి
గురుజనపరతంత్రగుణములఁ బరగు870
నలహరిశ్చంద్రశంతనుముఖ్యభూప
తులకన్నఁ బుణ్యుం డతులధర్మశీలు
డాశాధిపసమానుఁ డగు నట్టి యతఁడు
కాశినిమించు సాంకాస్యాఖ్యపురిని
రాజ్యపాలనకళారక్తుఁడై ప్రజల
ప్రాజ్యభుజాశక్తిపటిమఁ బ్రోచుచును
భూలోకగతుఁడైన పురుహూతుపగిది
శ్రీల వైభవములఁ జెలఁగుచుండంగ
మహనీయశీలుండు మాళవాధిపుఁడు
విహితధర్మపరుండు విజయుఁ డన్వాఁడు880.
రతికన్నఁ జక్కని రమణీలలామ
ప్రతిలేక నటియించు బంగరుబొమ్మ
మెఱుఁగుకన్నను నిగ్గుమెఱయు పూఁబోడి
మరునిదీమమువంటి మానినీమణిని
మొనసి లేజవ్వనంబునఁ బొల్చుదానిఁ
దనకూతుఁ గనుఁకొని తగ నిట్లు దలంచె
ఆమని లేఁదీవె యలరినయట్లు


ఈ మెలఁతకు మేన నెసఁగె జవ్వనము
ప్రాయంబువచ్చిన బాల నిట్లుంచ
న్యాయంబు గాదు నా నరపాలుఁ డెవఁడు890.
దీనిరూపవిలాసదీప్తుల కెనయఁ
బూనుచక్కదనంబు బొలుపొందువాఁడు
కులశీలములె యింపు గురుజనంబులకు
బలపరాక్రమములే భావించు తండ్రి
యమితసంపదలకు హర్షించు మాత
రమణీయరూపంబు ప్రార్థించు కన్య
కావున మన మెంతగా మంచివరుని
భావించి తెచ్చిన బాలికామణికి
మన సెట్టులుండునో మన కేల యింక
వనిత కిప్పుడు స్వయంవరము చాటించి900.
రాజుల నందఱ రావింపవలయు
రాజాస్య తనకైన రమణు వరించు
నని నిర్నయంబుగా నరసి దూతలను
జననాథులకు నిట్టి సరవి చాటించ
బనిచి నిజావాసపట్టణం బెల్ల
దనరఁ గైసేయఁ బ్రధానుల బంచె
వారలు నారత్నవతి యనుపురము
గారవంబునను సింగారింపఁ దొడఁగి
బంగారుమేరువుల్ బలుకురుంజులును
రంగైన కేతువారంబులు దనరు910.
పందిరు లుత్తుంగభవనభాగములు
పొందైన తోరణంబులును గావించి


పచ్చలతోరణప్రకరంబుఁ గట్టి
పచ్చకప్రపుముగ్గు బరఁగఁ బెట్టించి
విరులసరుల్ బూన్చి వివిధవిధులను
నెరయ నెచ్చోటఁ బన్నీరు జిల్కించి
యల గృహపాళిక ననటికంబములు
నిలిపి మంచలు దీర్చి నీటు మీఱంగ
హొంబట్టు మేల్కట్టు లొరుగుదిండులను
కెంబట్టు సుళువుసకినెలపానుపులు920.
తాపితాబిల్లలు తగుచిత్రపటము
లేపట్ల సవరించి హెచ్చుతివాసు
లేపుగఁ బరపించి లేఖాంగలనఁగఁ
జూపట్టు గణికల సొగసు మీఱంగఁ
దాళవైఖరుల నృత్తము సల్పుచుండ
మేళంబు లెయ్యెడ మిక్కిలి మెఱయ
వీణారవంబులు వెలయించి రపుడు
రాణించె నాపురరత్న మెంతయును
అంతట మహికాంతు లట్టి వృత్తాంత
మంతయు విని కాంత నంతరంగమునఁ930.
దలఁచి మోహంబునఁ దడయక వెడలి
నిలిచినపాళెన నిలువక తమక
మడర హుటాహుటి నప్పురంబునకు
వడి నేగ శంఖణవసుధాధిపుఁడును
చతురంగబలముతో సన్నాహ మెసఁగ
నతులితోన్నతిఁ బటహార్భటి చెలఁగ
దివినుండి భువిడిగ్గు దేవేంద్రుకరణి


రవళి నేగెడు రతిరాజుచందమున
రత్నవతీనగరంబున యువతి
రత్నంబు గైకొన రహి నేగె నంత940.
వచ్చినయారాజవరుని భూవరులు
విచ్చలవిడిఁ జూచి వీనిరూపంబు
వీని విలాసంబు వీని వైభవము
వీని యొయారము వెలఁది కల్గొనిన
మసలను వరియింప మనమునఁ దలఁప
దని యాస లుడిగి తియ్యనివిల్తుకాక
లురవడి మది నంట నుస్సురు మనుచు
పొరలుచుఁ జింతతోఁ బొగులుచుండంగ
నారాజులను మాళవాధినాథుండు
కూరిమితో నెదుర్కొనుచు రప్పించి950.
[12] తగినబిడారు లందఱికి నొసంగి
వగమీఱ నులుపాలు వరుసఁ బెట్టించె
ఈ రాజు లందంద నీటు లుల్లసిల
నారయ నిరవలంబాయాసి నగుచు
నే నుండరా దంచు నినుఁడు సిగ్గుననె
తాను గ్రుంకె ననంగఁ దపనుండు గ్రుంకె
వీరల యనురాగవిసరంబు విరిసి
మీరి వెళ్లురికి యెమ్మెయి న పరాశ
నెలకొనెనొ యనంగ నిరుపమరాగ
మిల నపరాశ నెంతేనియు నడరె960.
నారాజులకు మోము లటు నల్లనైన
తీరునఁ దమముచే దిఙ్ముఖంబులును


నల్లఁదనము దాల్చె నవతారలకును
వెల్లఁదనము దోచువిధమున నంత
తారలరుచి ననంతము తెల్లఁబారె
సారమందస్మితచంద్రిక లెసఁగ
వెస శంఖణముఖంబు వీఁకఁ జంద్రుండు
లసమానకళలచెల్వమునఁ జెలంగె
తరుణివేమరులున ధరణీశు లపుడు
విరహతాపముఁ జెందువెరవున నందు970.
మక్కువఁ దనుకవల్ మాయ నాయెనని
జక్కవల్ విరహజసంతాప మొందె
నట్టిఱేలకు రమణ్యభినివేశమున
నట్టి రే యుగయుగంబై యుండె మదికి
నంత వియుక్తుల నడరి యేయుటలు
కంతుఁడు చాలించఁగా వానిధర్మ
దారలు మ్రోయుచందానఁ గుక్కుటము
లారవంబు లొనర్చె నానిశాంతమున
తరుణావళీరక్తిఁ దా మ్రుచ్చిలించి
యరుణుండు ధృతరక్తియై కానఁబడియె980.
నినుఁ డగ్నికిరణ మయ్యెడఁ గొని యరుణు
నెనయ ననూరుగా నిడి రథంబునను
వినువీథిఁ ద్రిప్పంగ వెడలెనో యనఁగ
ఘనరక్తి నుదయాద్రిఁ గనుపట్టె నంత
అంధకారకిరాతుఁ డణఁగంగ ముదము
సంధిల్ల జెలువొందె జక్కవకవలు
తమవల్లభకరంబు తను వంటినపుడె


తమిమీఱఁ బద్మిని దనరె నుల్లసిలి
కళలంది పద్మినీ కాంతసంగతికిఁ
గలువ సిగ్గున వేగఁ గన్నులు మోడ్చె 990
నావేళ భూపాలు లందఱు రేయి
పూవుఁబోడివిరాళిఁ బొరయక నిదుర
జేగురించినకండ్లు చిడుముడిపాటు
తావిమించిన మేను తమకు రంజిల్ల
మజ్జనంబై చల్వమడుగులు గట్టి
అజ్జగా తిలకంబు హవణించి నుదుట
కలపంబు లలఁది మై కలితభూషణము
లలరుచుఁ దాల్చి యొయ్యారంబు మీఱ
పరిచారకులు చెంతఁ బరిచర్య సేయ
వరుస మంచెలమీద వైభవం బొప్ప1000
విరులతూపులవానినిశ్వరూపంబు
కరణి ధారణిగాఁగ గడు మెఱయంగ
అపుడట్టి మాళవాధ్యక్షకుమారిఁ
జపలేక్షణులు మంచి సంపంగినూనె
యంటి జలక మార్చి హరువుగా నూనె
గంటి వైచి హరిద్ర గలయు కుంకుమము
వన్నె మీఱఁగఁ బూసి వలిపెంపుమణుగు
నన్నెఱి తడి యొత్తి నయమైన మెఱుఁగు
చెంగావి పావడ చెలువొందఁ గట్టి
బంగారు సరిగంచు బలురంగు మించు1010.
దువ్వటంబు ఘటించి దురుసుచన్దోయిఁ
బువ్వులజంటల పొంబట్టు రవికె


బిగువుగాఁ దొడిగించి పేర్మి ఫాలమున
మృగనాభి తిలక మెమ్మెను దిద్ది ముద్దు
చెక్కుల మకరికల్ చెలువొప్ప వ్రాసి
చక్కగాఁ గండ్ల కంజనములు దీర్చి
కమ్మలు భావిలీల్ కంకణమ్ములును
వొమ్మైన హారమ్ము లుంగరంబులును
సందిదండలు కంఠసరులు బారీలు
నందెలు మెట్టియల్ హరువు మేఖలయు1020.
బంగరొడ్డాణంబు బన్నసరములు
ముంగర పాపటబొట్టును చంద్ర
వంకయు మురువులు వరుసఁ గై సేసి
పొంకంబుగఁ దురాయిఁ బూనిచి కొంద
రందంబుగా గంద మలఁద నెమ్మేన
పొందుగా జడ యల్లి పొలతి వేఱోర్తు
నెరికురులను తావి నెఱిమించునటుల
విరులు సరుల్ చుట్టి వెళ్లె రాణింప
రతనంపుకమలంబు రహి కీలు గొలుప
నతిమోహనాంగియై యా తటిల్లతిక1030.
పొలుపున నపరంజిబొమ్మచందమున
వలనొప్ప నప్సరోవనితచాడ్పునను
చెలఁగుచు వెడలి నెచ్చెలు లెందరేని
కొలువఁగ బెత్తులు గొని యన్నగార్లు
ముందరి జనబృందముల నివారింప
నందఱుం గనుఁగొని యర్మిలిఁ బొగడ
లీల మధూకమాలిక చేతఁ బూని


చాల మాణిక్యహంసకములు మ్రోయ
ధళధళభూషణతతమణుల్ మెఱయ
వలరాజువంటి భూవరుని వరింప1040.
నతులసంభ్రమముతో నరదంబు నెక్కి
రతిలీల రాజమార్గము ప్రవేశించె
వచ్చుచో నా కన్యవైఖరిఁ జూచి
మెచ్చుగాఁ బురజనుల్ మేడలనుండి
మఱిమఱి దిలకించి మగువ లమ్మగువ
మురువుకు మురు లంది ముచ్చట మీఱ
నీ రమణి వరింప నవనికి భాగ్య
మారూఢిఁ గలుగునో యతఁడె ధన్యుండు
పదివేలజన్మముల్ బలు సూదిమొనను
పద మటు లూని తపంబు సల్పినను1050.
గాక యీ కమలాక్షిఁ గలియు సుఖంబు
చేకూరునే యెంత శ్రీమంతునకును
మనలను మగువలై మహి సృజియించి
వనజసంభవుఁ డెంత వంచన చేసె
నై నను దీనిమే నంటి పెనంగఁ
గా నొక సొమ్ముగాఁ గల్పించఁడాయె
నీ రంగు నీయంగు నీ యొయారంబు
నీ రూపు నీ కైపు నీ విలాసంబు
లీ కుల్కు లీ తళ్కు లీ బెళ్కుచూపు
లీ కల్కితనముల నెంచి చూడంగ1060.
నింతయు నీ యింతి కెసఁగెను గాక
కాంతల కింతైనఁ గలుగునే జగతి


మునుపు మోహినియైన మురవైరిరూపు
గనుఁగొన నిదె బోలు కంతునియింతి
యేమొ యీ మదిరాక్షి యే మహీపాలుఁ
బ్రేమ మీఱంగ వరించునో గాక
వనజాస్త్రుఁడైన నవ్వనితఁ గూడంగ
ఘనతపం బొనరించఁగావలెఁ గాదె
యనుచు విస్మయ మంది యలరుచుఁ జూడ
ననఁబోఁడి మంచెల నడుచక్కి నరిగె1070.
అయ్యెడ కలవాణి యనునొక్క దాది
చయ్యన నా రాజసంఘంబుఁ జూచి
వారి యూరును పేరు వంశవైభవము
వారక తెలిసినవనిత తా నగుట
వనజేక్షణకు వారి వరుసగాఁ జూపి
వినుతించి వేర్వేర వినుతింపఁ దొడఁగె
కలికిరో! తిలకించఁగదవె యీ రాజు
బలశాలి రతికళాపాంచాలుఁ డిందు
కులజుఁ డా వనరాశికువలయం బేలఁ
గల మేటి నకులుఁడన్ కర్నాటవిభుఁడు1080.
వీని వరించ నో వెలది! నీ వెంచి
తేని చేకొననచ్చు నింద్రభోగములు
నావు డా కన్య యన్నరనాథుఁ జూచి
భావ ముంచమి నగి పలుకక నిలిచె
నిలుచుబాలమనంబు నెమ్మదిఁ దెలిసి
కలవాణి యవ్వలికడ కేగి బలికె
కలికి చూచితివె యీ కాశ్మీరరాజు


పలికి బొంకనివాఁడు భండనంబునను
పరరాజమత్తేభపంచవక్త్రుండు
నిరుపమప్రాభవ నిర్జరేంద్రుండు1090
వితరణకర్ణుండు విఖ్యాతకీర్తి
క్రతుమంతుఁ డను పేరు గలవాఁడు వీఁడు
వరియించితేని దుర్వారసౌఖ్యములు
నిరతంబు చేకూరు నీలాహివేణి!
అనవుడా మదిరాక్షి యటు మోముఁ ద్రిప్పఁ
గని సమ్మతముగామి కలవాణి యవల
నుండు నొక్క నృపాలు నువిదకుఁ జూపి
మండలేంద్రుఁడు వీఁడు మత్స్యభూవిభుఁడు
చాతుర్యగాంభీర్యశౌర్యధుర్యుండు
ఖ్యాతిమంతుఁడు సుప్రకాశుఁడన్ రాజు1100.
వీనిఁ బెండ్లాడవే విరిఁబోణి యనిన
పూనినవీరిదండ పూఁబోణి డించె
మనసు వీనెడ లేదు మదవతి కనుచు
కనుఁగొని కలవాణి కడిమి ముందరను
పేరోలగంబున్న పృథివీశుఁ జూచి
వారిజేక్షణ వీఁడు వంగభూవరుఁడు
సత్యకీర్తిసుతుండు సంజయాఖ్యుండు
కృత్త్యంబరుని చెంతఁ గినియక దనరు
వలరాజుచందంబువాఁ డిటు లెస్స
తిలకింపఁగదె వధూతిలకమా! వీని1110.
చెట్టఁ బట్టితివేని సిరులు భోగములు
మట్టుమీఱగఁ గల్గు మతమె నీ కనిన


ఆవలికథఁ దెల్పు మనె నంబుజూక్షి,
యా వనితను జూచి యటు కలవాణి
యరిగి పురోవర్తియగు నృపుఁ జూచి
తరుణీలలామ! యీ ధాత్రీవరుండు
భోజనృపాలుండు పుణ్యశీలుండు
తేజోంబుజాప్తుండు దేవారిసుతుఁడు
జనదేవుఁ డను రాజు సౌందర్యశాలి
కనకాంగి! మొగ మెత్తి కనుఁగొను మితని1120
వీనిపొందుకు వేల్పువిరిబోణులైన
మానసంబునఁ గోరి మరులు చెందుదురు
అనిన సమ్మతి లేని యా యంబుజాక్షిఁ
గని యవ్వలికి నేగి కలవాణి వలికె
వీఁడె పాండ్యవిభుండు విశ్రుతకీర్తి
వాఁడిమీఱినవాఁడు వైరులయెడల
నరసాగ్రగణ్యుండు జయవర్మ యనెడు
నరపాలుఁ డితఁడే ననబోణి! చూడు
ఇతఁ డింపుగాఁడేని యెలనాఁగ! యతఁడు
ప్రతిలేని చోళభూపాలవర్యుండు1130
శ్రుతవంతుఁడను రాజు సురరాజతుల్యుం
డతులవిక్రమకళాహతవైరిబలుఁడు
నలకూబరజయంతనవరూపశాలి
యలివేణి యీతని నంగీకరించు
మీతఁడు సరిపోడె యిభరాజగమన!
ఈతఱి తిరిగి చూ డీ రాజవరుని
ఇతఁడె కాంభోజభూమీశ్వరాత్మజుఁడు


వితతపరాక్రమవీరసింహంబు
చంద్రవంశంబున జనియించి కీర్తి
చంద్రికల్ వెదజల్లు సర్వజ్ఞమౌళి1140
శంఖకుందమ[13]రాళచంద్రసత్కీర్తి
శంఖణుఁడను రాజు జలజాస్త్రసముఁడు
తిలకింపవే సిగ్గుతెర పుచ్చి వీఁనిఁ
గలికి నీ కెనయైన కాంతుఁ డితండె
కుందనంబును మణి గూడిన పగిది
పొందు దీనికి నీకుఁ బొసఁగు నిక్కంబు
నెల వెన్నెలను జెంది నీటైన యట్ల
యెలనాఁగ! నిను బొంది యితఁడు రంజిల్లు
రతి మదను వహించి రహి మీఱినట్లు
పతిగాఁగ నీతని బాల చేకొమ్ము1150
నా విని మాళవనరనాథుకన్య
భావించి తనమదిఁ బతిగా వరించి
ఈక్షణోత్పలదాన మెసఁగంగఁ బూన్చి
లక్షితమధుకమాల్యంబును వైచె
అంతనే దుందుభు లార్భటి మ్రోసె
కాంతలదీవనల్ కడువేడ్కఁ జెలఁగె
మంచలు దిగి యేగు మహిపాలురకును
ముంచినచీకట్ల ముఖపద్మపాళి
ముకుళించె శంఖణుముఖచంద్రుఁ డలరి
ప్రకటించె శ్యామానుభావకలక్ష్మి1160


నపుడు మాళవవసుధాధినాథుండు
నుపచరింపుచు శంఖోణోర్వీశమౌళి
కా కన్నియకుఁ బెండ్లి యపుడె కావించె
లోకు లుత్సవము లాలోకించి పొగడ
పరిభవంబును బొందు పార్థివులెల్ల
కరకరి చింతించి కాతరబుద్ధి
దొమ్మిచేయఁ దలంచి దొడరి మాళవుఁడు
గ్రమ్మిన నిలువ శక్యంబు గా దనుచు
గాంభోజుపై నీర్ష్య కడు వెల్లివిరియ
సంభృతలజ్జ మించగ నేగి రంత1170
అల వధూవరు లాత్మ హర్షించి కొన్ని
నెల లుండి వెనుక నా నృపుఁ డరణంబు
నొసఁగి పంపించ వా రుల్లసిల్లుచును
పొసగిన తమతమ పురముల కేగి
సతతంబు రతితంత్రసౌఖ్యానుభూతి
నతులితానందంబు లందుచు నుండి
రటులఁ గొన్ని దినంబులై న శంఖణుఁడు
పటుతరనిజరాజ్యపాలన మఱచి
గణకుల మంత్రులఁ గనుఁగొన కాప్త
గణముల డిగనాడి కామభోగముల1180
పరవశుఁడై గురుబంధుహితో క్తి
నరుచిఁ జేయుచు నెప్పు డంతఃపురంబు
తరలక నెవరికి దరిశన మీక
తరుణిరతాసక్తిఁ దగిలియుండఁగను
గొన్ని దినంబులకును మీఱి యహితు


లున్నతైశ్వర్యంబు నొంది రాజ్యాంగ
మంతయుఁ గ్రమమున నాక్రమించుకొని
కొంత పేరడిగాఁగ గొహ రడగించి
మంత్రిమిత్రాదు లేమరి యుండునట్లు
తంత్రంబు లొనరించి తచ్చనచెలిమి1190.
గావించి సామంతగణ సైనికులను
రావించి నలుదిక్కు రాయిడి చేసి
పురమున నొకకొంత పోటు బుట్టించి
మరి భేదదానసామముల లో జెరివి
కూటయోధులు గుంపు గూడి గ్రమ్మినను
పాటించి యా మాట బహుదినంబులకు
వనితాభుజిష్యల వచనంబువలన
విని శంఖణుఁడు బైలువెడలి కోపమున
శరచాపధారియై చనిన నా రమణి
వెరచి పిరుందనె వెడలినఁ జూచి1200.
యింతితో చింత యిం తేల నీ వుండు
మంతఃపురంబున నర్థక్షణంబు
పురము ముట్టడి చేయఁ బూనిన వైరి
ధరణీశబలముల దరలంగఁ గొట్టి
సొచ్చుపాళెము లెల్ల చూరలుబట్టి
విచ్చిపోఁదఱుముదు వెఱవ నేమిటికి
ననవుడు వల్లభు నలమి కౌఁగిటను
వనజాక్షి కన్నీరు వరుద గట్టంగ
విభునిసాహసవృత్తి విడిపించఁ దలఁచి
యభిమతనీతిగా నతని కిట్లనియె1210.


అవనీశులకు మంత్రు లాప్తులు కోశ
మవికలరాష్ట్రంబు నఖిలదుర్గములు
చతురంగబలములు స్వవశంబు లగుచుఁ
బ్రతిపాలితములై నఁ బరుఁ గెల్వవచ్చు
నివి యెల్ల నొరునిచే నిచ్చినరాజు
భువి వైరుల జయించి పొగడొందఁ గలఁడె?
రమణ మోసము వచ్చె రాజనీతులకు
క్రమ మెఱుఁగక నీవె రాజ్యతంత్రంబు
పరునియం దిడి మిత్రబంధువర్గముల
నరయక గజతురగాదిసైన్యములఁ1220
బరికింపక ధనంబు పాటి చేకొనక
గురుజనమంత్రిముఖ్యులమాట వినక
ననిశంబు కామభోగాసక్తిఁ దగిలి
ధనబలసంగ్రహాస్థఁ దొలంగి యుంటి
వేనును నీమంత్రు లెచ్చరింపంగ
నానాఁడు దెల్పిన నదియు నీమదికి
విన నింపు గాదయ్యె విధివశం బటుల
వెనుక చింతించుట వెఱ్ఱికార్యంబు
ఇప్పుడు నీవరులపై నేగంగ నెవ్వ
రుపబలంబుగ వచ్చి యోర్చువా రిచట1230
పగర లందఱు గూడి పై విడియంగఁ
దగునె నీ వొకఁడవే తారసంబగుట
కలహంబునకుఁ దఱిగా దిట్టివేళ
నిలయంబునం దిఁక నిలువంగరాదు
రమ్ము పోదము మధ్యరాత్రమ్మునందె


ఇమ్ము దప్పిన వేళ నెమ్మి యేమిటికి
ననుచు యోజనఁ దెల్పు నా వన్నెలాడిఁ
గనుఁగొని దైన్యంబు గదురంగ జనువు
ముమ్మరించగ నతిముగ్ధభావమున
కొమ్మను వెంటఁ దోడ్కొని నడురేయి1240

పురము రాజ్యము ధనంబులను బో విడిచి
నరపతి ఘోరకాననముల కరిగె
అరుగుచో నామాళవాధిపుకన్య
ధరణి మోపినఁ గందు తన పాదములను
పలుగురాళ్లును [14]ముండ్లు బలుకంప లడరు
బలుకానఁ బ్రియునివెంబడి నంట నడవ
చిగురులకన్నను జిగికోమలికము
తగునట్టి యడుగుల తగిలి కంటకము
లెడలేక నాట నయ్యెలనాఁగ నొప్పె
దడయుచుఁ జీకటిఁ దడవాడికొనుచు1250

తోవఁ గానక పొదల్ దూరి మేనెల్ల
దీవెలుకంప లెంతేఁ గొట్టి జీరు
కొనునట్టి బల్ చురుకును నెరుంగకయె
గునుకగంటికి రూఢీ కోరెందగుములు
కుంతళంబులఁ బట్టి గుంజి యీడువగ
నంతయుఁ దప్పించి యరుగుచో నెదుట
గుటగుట రొప్పుచు కోల్పులుల్వెలుగు
లటవీభములు వరాహములు గార్పోతు


కదుపులు రేచులగములు సింగములు
పొదలుచు భీకరంబులుగాఁ జరింప1260.
నళుకుచు మై కంప మందంగ నిలుచు
నళికుంతలను జూచి యవనీవిభుండు
కడు శోకమున నెదఁ గనలుచు నూతఁ
బడి వెడలఁగలేని ఫణిరాజుపగిది
బోనునఁ జిక్కు బెబ్బులిచందమునను
కాననోదంబునఁ గాల్మ్రొగ్గి ద్రెళ్లు
వనదంతిచాడ్పున వగ మీఱ నూర్చి
నను జెట్టఁబట్టంగ ననబోఁడి నీకు
కడలేని యాపదల్ గలిగెఁగా నింత
యిడుమలఁ బడి కుందు నీ పాటుకన్న1270.
పగరపైఁ బడి తెగి పడిన మే ల్గాదె
మగుడక దావాగ్ని మ్రగ్గిన లెస్స
మాళవరాజకుమారివై యెల్ల
వేళల వేవేలు వెలఁదులు గొలువ
నలరుదోటల చల్ల నగు చప్పరముల
నెలకొని యాడుచు నిరతిభోగంబు
లనుభవింపుచునుండు నట్టి నీ విపుడు
ఘనభయంకరమృగాకరమైనయట్టి
వనభూమి భయ మొంది వణకుచు నిటుల
మొనసి దుఃఖాబ్ధిని మునుఁగగా నయ్యె1280.
కటకటా విధి యెంత కరుణావిహీనుఁ
డటవి నివ్విరిబోణి నలయించఁ దగునె
యనుచు కన్గవఁ గ్రమ్మి యశ్రువుల్ దొరుగ


తనదుకౌఁగిటఁ జేర్చి తరుణితత్పదము
లరచేతఁ దడివి ముం డ్లన్నియుఁ దీసి
నెరి బుజ్జగింపుచు నెనరు సంధిల్ల
యలరుదండ ధరించునటుల బాళి
నలరుబోణిని యెత్తి యక్కునఁ బూని
యహిభయంబున దూర మరిగెడుమాడ్కి
నహిభయంబున నిల్ప కరిగె బల్కుడిగి1290
చిటుకు మనఁగ నళ్కు చింతయు నిగుడ
పటుగతి నుదయమౌపాటికి నైదు
యోజనంబులు దాటి యొక్కెడ గాన
నేజనంబుల గానకిచ్చిననాన
విన్ననై పొదరిండ్లు విడిదిగా నిలిచి
యన్నువ వడఁ దీర్చి యాదరింపుచును
చనిచని యందందు ఝరులును దరులు
ఘనగిరులును జరుల్ గనుగొంచు నంత
నికటభూమిని మండనితరామగిరిని
ప్రకటగోదావరి భవ్యలహరిని1300
నిపుణవిహారసన్నిహితనృహరిని
యపవర్గకారిణి యగు ధర్మపురిని
సేవించి విజితనంసృతి మృగతృష్ణ
పావనవాహినిభరితయౌ కృష్ణ
తిలకించి యిందిరాధీశుకాపురము
కలితసంపద మించు కాంచికాపురము
చూచి మాణిక్యభాసురకవాటంబు
........................................


భావించి లోకసంభావితవారి
కావేరిఁ గాంచి యక్కడ రంగధాము1310
పరమదయోద్దాముఁ బ్రణమిల్లి యవల
నరిగి కన్గొని చంపకారణ్యలోలు
శ్రీ రాజగోపాలుఁ జెలిమి భజించి
యారాజముఖితో రయంబు నరిగి
దక్షిణపాథోధితటభూమిఁ జేరి
వీక్షించి యలరుచు వెలఁది కిట్లనియె

సముద్రవర్ణనము.


జలరాశి చూచితే జలజాతనయన!
ఇల యెల్ల జుట్టుక యెటు మట్టిమేర
లొకపట్టునను లేక యుండియు నీతిఁ
బ్రకటించి మర్యాద పాటించు రాజు1320
పొలుపున నిట్టి యంభోధిరా జెపుడు
చెలియలికట్ట మించి యొకింత రాఁడు
గాక తరంగసంఘాతఘాతమున
కీ కట్ట యానునె యెయ్యెడనైన
ప్రబలోర్మికావధూపరిధూయమాన
నిబిడాచ్ఛశీకరనికరచామరము
లలర ననంతాంతరాక్రాంతవిశద
జలదమండలమయచ్ఛత్రంబు మెఱయ
ఘనపాండుడిండీరఖండహారములు
దనర విద్రుమలతాతతిచిత్రచేల1330
మంతరాళాంతరీపాంతికరత్న
సంతతోన్నతమహాచలకిరీటంబు


[15]సావేగమృగనాభిసారాంగరాగ
మావేలవితతశంఖారవంబులును
విపులాంగకచ్ఛపవితతిఖేటములు
నిపుణతిమింగిలనికరకింకరులు
విలసిల్లగా వినువీధిపై కెగసి
బెళుకు జూపి నటించు "పెనువాలుగలును
నటుల విద్యలు జూపు నాకేభఘటలు
ఘటితధ్వజంబులుగా బారు లిడగ1340.
జలమానుషావళిసైన్యంబు గొలువ
పొలుపొంది నిధి మహాంబుధిచక్రవర్తి
జలనిధి హరిలీలఁ జక్రప్రయుక్తి
వలన మహాశరవాహిను లడఁచి
వేలుపులను మన్చి విఖ్యాతి గాంచి
నీలమేఘచ్ఛాయ నెలకొనె చూడు
మీ శరధియె కాదె యినవంశకర్త
దాశరధి భజించి తను వేడ మున్ను
తననీటఁ గొండలతండముల్ తేల్చి
ఘనసేతు వొనరింపగా వరం బొసఁగె1350.
నలువకుక్షిని గాంచనం బుంచె ననుచు
నిలమణుల్ తన కుక్షి నిడియె నీ కడలి
యల్లుని కల్లుఁడై యలరు నీ యబ్ధి
నెల్ల వింతలు గల్గు టే మద్భుతంబు
ఘోరనక్రవిహారఘూర్ణితవీచి
వారసంస్ఫాలితావనిభృద్ధురూద్ద


గంభీర నాళముల్ కకుబంతరాళ
జృంభత్ప్రతిధ్వానసృష్టిచే నిట్టి
భువిభూతసంఘాతముల కెల్లఁ జెవులు
చెవుడుపడంగ మించి మృదంగభంగ1360
ఢక్కార ఢమఢమ డ్రటహటాత్కార
ధిక్కార మొనరించు తీరు వహించె
మదిరాక్షి! చూడు మీ మహీతరాజీవ
మిది నీదు కన్గవ కెన యౌదు సంచు
కడు మిట్టిపడనేల కాంచునే లీల
జడధిసంభవమైన సంభ్రమం బింతె
యెలనాఁగ నీ వేణి కెన యౌదు నంచు
నల నాగ మురుభోగ మందనేమిటికి
చెలగు నామోదంబు చెల్లునే తనకు
మలక మాత్రమే గాక మరి యేమి గలదు1370
మగువ నీ మోవితో మలయుదు ననుచు
పగడంబు జగడంబు పచరించఁ దగునె
సరసత తనకెందు సాగునే వట్టి
పరుసంబె తనవంకపా టెట్లు దీరు
చాన ! నీయూరుతో సరివత్తు ననుచు
నా నాచుతీవె తా నలరంగ నేమి
ఈ చక్కఁదన మొందు టెట్లకో తనదు
కౌచు బాపుకొనంగఁ గలదె తా ననుచు
ముచ్చటాడుచు నా సముద్రతీరమున
వచ్చు తెరల శైత్యవైఖరివలన1380
మయివడదీర నెమ్మది భువనాతి


శయనంబయిన దర్భశయనంబుఁ గాంచి
యిందుబింబానన యిందు భూరుహము
క్రింద నమితకీర్తి కృతి ధని రామ
చంద్రుఁ డబ్ధిగురించి సౌమిత్రిబఱచు
సాంద్రదర్భాంకురచ్ఛటఁ బవ్వళించె
కావున కల్యాణకర మిట్టి పురము
పావనతర మభ్యపంకజాకరము
శ్రీ తాళవననీలజీమూతభరము
వేతాళపుర మిదె వెలది ! కన్గొనుము1390
వనధి సేతు వొనర్పవలసి రాఘవుఁడు
మును నవ పాషాణములు నాటె నిచట
ఈ సైకతశ్రేణి యెంత ధన్యంబొ
శ్రీసఖపాదాబ్జచిహ్నముల్ దాల్ప
ననుచు నానందాశ్రు లడర భావించు
వినతులు గావించు వెసను సేవించు
నర్థించు శ్రీరామునామంబు మిగుల
కీర్తించు నిటుల భక్తి దలిర్ప నతఁడు
దుష్టరావణవంశధూమకేతువును
స్పష్టపాతకజాతశయనహేతువును1400
సీతాంగనామోదజీవధాతువును
వీతకల్మషరఘువీరసేతువును
గాంచి యంజలికంజకలితమౌళి యయి
ప్రాంచితానందపూర్ణాద్భుతం బడర
తిలకించితే లోకతిలకమౌ దీని
కలితవసుంధరాకాంతకుఁ గాంతుఁ


డొనరించు కీల్ జడయో ముక్తసౌధ
మున కెక్కు సౌపానములపంక్తి యిదియ
ప్రబలమౌ రావణ ప్రాణమారుతము
కబళించి మించిన కాళాహి యిదియ1410
యవని ధరించు రత్నాకరకాంచి
సవరించురాక ట్టెసగు సీల యిదియ
సముదగ్రమలయగజము రాక్షసేంద్ర
కమలాహృతికిఁ జూచు కరదండ మనఁగ
తనకూతు హరియింప దశముఖుఁ ద్రుంప
కినుక రెట్టించి యీ క్షితి వనరాశి
విల్లుగా తీర ముర్వీస్ధలిఁబూన్చు
భల్లకాండం బిది భావించి చూడ
నీ సేతు వద్భుతం బెద నుద్భవిల్ల
భాసురాకారవైభవము చూపెడిని1420
అమరాలయంబు కా పధికమై నిండ
శమనాలయము బిండు సల్పె నీసేతు
విల దీనిఁ దలఁచిన నెల్ల పాపములు
దొలఁగును గనుగొన్న దొరకు నిష్టములు
స్నానదానంబులు సలుపు ధన్యులకు
మానితమోక్షమెమ్మయి కరస్థంబు
దీని మాహాత్మ్యంబు దెలిసి వర్ణింపఁ
గా నేర రీశుండు కమలజుండైన
అని నుతింపుచు నంత నఘశై లకోటిఁ
హసనోగ్రశతకోటి యగు ధనుష్కోటిఁ1430
గని యందు దుర్వారకల్మషంబులను


మునుకొని గడుగంగ మునిగి యాతీర్థ
విధులఁ దీర్చి జపించి వెస మళ్లి యచట
మధుసూదనుని సేతుమాధవుఁ గొల్చి
అమితనిర్మలబోధు నా రామనాథుఁ
గ్రమమునఁ బొడఁగాంచి గంగాదితీర్థ
తతి నవగాహించి తగ బ్రహ్మకుండ
మతులసీతాతీర్థ మగ్నితీర్థంబు
మొదలుగా నారుణమోచనతీర్థ
మది తుదగాఁ గల్గు నన్నితీర్ధముల1440
సరయుచు నందెల్ల నవగాహనాది
కరణీయములు సల్పె కొంతయుఁ దాను
బహువాసరము లిట్లు పరమమోదమున
మహిపాలుఁడు వసించి మరలి యనంత
శయనజనార్దనస్థలములఁ జూచి
భయహారిణినిఁ దామ్రపర్ణి నా కన్య
గ్రుంకి వైకుంఠము వృషభాచలంబు
నంకెను మలయాద్రి యదుగిరి గాంచి
యందందు శ్రీపతి నర్చించి మౌని
బృందామితాశ్రమప్రియకరలహరి 1450

స్వర్ణముఖరీవర్ణనము.



నల స్వర్ణముఖరి రయంబునఁ జేరి
తిలకించి యదియున్న తెఱఁగు భావించి
మది సంతసంబు విస్మయము పెంపొంద
మదిరేక్షణకుఁ జూపి మరియు నిట్లనియె
ఈ మహానదిఁ జూడు మిభరాజగమన!


భూమహిళాకంఠభూషణం బనఁగ
హల్లకపద్మరాగావళి మెఱయు
తెల్లదమ్ములును ముత్తెములు రాణింప
నాచులన్ పచ్చరాల్ నలువు శోభిల్ల
మేచకాబ్జమణిసమృద్ధి నింపొంది1460
బహువిచిత్రప్రభాభరితవిస్ఫూర్తి
రహి మించు చూడ్కులు రంజిల్ల మరియు
గండుమీలు వెడందకన్నులు గాఁగ
నాడు నిగ్గులతమ్మినెమ్మోము గాఁగ
నీలోత్పలగణంబు నెఱికురుల్ గాఁగ
లోలతరంగముల్ భుజములు గాఁగ
బలుజక్కవలు గుబ్బపాలిండ్లు గాఁగ
నలరు శైవలము రోమావళి గాఁగ
పొలుపుమీఱిన సుడి పొక్కిలి గాఁగ
తలమైన యా సైకతము శ్రోణి గాఁగ1470
చెలఁగు ప్రవాహంబు చేలంబు గాఁగ
కలహంసగమనంబు కడు నుల్లసిల్ల
తనవిభుఁ గలయంగఁ దమకించి నడచు
ననబోఁడికరణి యీనది యున్న దిపుడు
ఈతటినీతటి హేరాళముగను
మాతులుంగార్జున మదన మాధూక
పారీభద్ర కపిత్థ పనస జంబీర
నారంగ ఖర్జూర నారి కేళముల
మాలతి మల్లికా మాళవికాంచ
నైలా వకుళ పాటలీక్ష్వాదిలతలు1480


ఘనసారకదళికాకదళీవనములు
కనుఁగొన నింపొందె కనులపండువుగ
నీకాన మునిచంద్రు లెవరున్నవారొ
గాక యిట్లెసఁగునే కాననభూమి
తాపసాశ్రమము లీ తరి యెన్నియైన
చూపట్టుచున్నవి చోద్యంబు గాఁగ
ఈవల్కలములు మహీరుహంబులును
ప్రావేల్లితంబులై పరగుచున్నవియ
వారలు మునులె కావలయు నిశ్చలత
తీరభూములఁ దపస్థితి నున్నవారు 1490.
వారల నండ గోవ్యాఘ్రసింహేభ
సారంగవృకకిటిసారమేయాది
ఘోరజంతువు లెల్లఁ గూడి యాడుచును
వైరం బెడలి శాంతి వరలెడు నౌర
యనుచుఁ గన్గొనుచు నత్యాశ్చర్యమునను
చనిచని యా శుకాశ్రమమును గాంచె
కని యట్టి వనికి యేగంగ గంగాయ
మునలకన్న నగణ్యపుణ్యకారణము
సారసమాస్వాదసమదసంచార
..................................1500.
చంచల్లతాంచితచంచరీకప్ర
పంచవిపంచికాభవరవోత్కరము
రుచిరాంగనతరమా రుచిరూపభాను
రచితసంతతవాసరము పద్మసరము
తిలకించి యాచుట్టు తిరిగి యా కొలని


చెలువంబునకు మెచ్చి చింతించి కొంత
వనజాక్షి యా సరోవరమున్న సొబగు
మనమున కెంత సమ్మదము సల్పెడిని
సురకిన్నరాదులు సొంపున నిందు
విరిబోణులను గూడి విహరింతు రేమొ 1510.
మౌనీంద్రు లియ్యెడ మన నేత్రములకుఁ
గానరాకయె తపోగరిమ నుండుదురు
వినవచ్చుచున్నది విశదమౌ పలుకు
కనుఁగొన మెవ్వారిఁ గడు చోద్య మయ్యె
కలికి చూచితివె యీ కమలాకరమున
పులుగులు కనఁ గూడి పొలుపొందు తెఱఁగు
పచ్చతివాసీలు పఱచినయట్టి
రచ్చకూటంబుల రాజు లున్నటుల
కంజదళాళిపైఁ గడు బారు దీరి
రంజిల్లుచున్నవి రాజహంసములు1520.
జక్కవ యిది ప్రాణసఖి కూర్మి సగము
మెక్కి యిచ్చినతూఁడు మెసవ నింపొంది
సారసం బొకటి లక్షణపక్షపాళిఁ
జేరి నెమ్మది నిద్ర సేయంగ సాగె
తమ్మిచాటుకు నేగు తన కొమ్మఁ గాన
కిమ్ముల వెదకెడు నీ నీరుకోడి
ఈ కురరి నిజేశు నెడబాసి దీన
యై కూత లిడుచున్న దశ్రువుల్ దొరుగ
[16]కమలసౌధము నెక్కి కాంతతో నొక్క
భ్రమరంబు మధుపాన పరవశ మయ్యె1530.


నని చూపి రమణి కయ్యవనీశుఁ డందు
మునిగి జపార్చనములు దీర్చినంత
సరసిజమిత్రుఁ డా శంఖణుకరణి
పరరాజమండలోల్బణ ముద్భవిల్ల
పగలు మించె నటంచు పటుతేజ ముడిగి
మగువతో వనరాశిమధ్యంబుఁ జొచ్చె
అపు డిందుఁ డుదయాచలాగ్రంబునందు
నుపమించగాఁ గాంచనోన్నతసౌధ
మునఁ బెంపుమీఱు కెంపులకుంభ మనఁగ
ఘనతమోమత్తేభఘటలను ద్రుంచి1540
చిందు నెత్తుటఁ దడసినసింగ మనఁగ
నంద మొందెను గలశాంబుధితనయుఁ
గని యుబ్బి జగ మెల్లఁ గప్పెనో యనఁగఁ
దనరుచు వెన్నెల ధర నింగి నిండె
అది చూచి యలరుచు నన్నరేంద్రుండు
సుదతియు నొకచోట సుఖనిద్రఁ జెంది
తెలిసి వేకువ లేచి దివ్య మౌనట్టి
జలజాకరంబున స్నానాదివిధులు
సలిపి యావనభూమిఁ జరియించు పక్షి
కులముల మృగముల గుంపులఁ జూచి1550
కొనుచు నచ్చటి వృక్షకుంజపుంజములు
కనుఁగొంచుఁ దత్ఫలకందమూలములు
భుజియింపుచును రొప్పు పులులకు మత్త
గజముఖ్యములకు సింగంబుగుంపులకు
బలుశరభంబులబారుల కింత


యళుకక దిరిగి యింపగుచోటఁ బండి
యతివతో ముచ్చటలాడుచు నిటుల
నతఁడు కొన్నిదినంబు లయ్యెడ నుండె
ఒకనా డతఁడు బుద్ది నూహించి దుఃఖ
మకట నే మత్తుండనై యేల నుంటి1560.
నమ్మఁదగనివారి నమ్మి యిట్లేల
సొమ్ములు రాజ్యముల్ సుఖములు విడిచి
యడవులఁ బడనాయె నలివేణి యిట్లు
పడరానియిడుములు పడనాయె నకట
పసిడిమేడల నాడు భామిని యిందు
వసివాడఁ బొదరిండ్ల వర్తించనాయె
విరులపానుపులపై విహరించు పడతి
చురుకైన ముండ్లపై సొలయంగనాయె
బలు తూగుటుయ్యెలఁ బవళించు చెలువ
పలురాతిదిన్నెలఁ బడియుండనాయె1570.
మగువలు గొలువగా మలయు మానవతి
మృగములు బెదిరించ మెలగంగ నాయె
సరసాన్నపానముల్ చవిఁ జూచునింతి
విరసకందంబులు వేడంగనాయె
కటకటా విధి యెంత కఠినుఁడో సిరుల
నటమటించి కడింది యాపదల్ పెట్టె
నెవ్వరు దిక్కింక యేమి సేయనగు
నెవ్వరు నా మది నెడ దీర్చువారు
అనుచు నసహ్యశోకాగ్నిచేఁ గంది
కనుగవ నశ్రువుల్ కడు వెల్లివిరియ1580.


నురగంబుకైవడి నూర్చి యెంతయును
తరుణితోఁ బలుకక తనలోనే గుంది
తాను తెంపొనరించఁ దమకించు తఱిని
వానికి నాకాశవాణి యిట్లనియె
ఓహోమహీపాల! యుడుగుమీ యిట్టి
సాహసంపు తలంపు సరగ రాజ్యంబుఁ
జెంద నుపాయంబు చెలిమిఁ దెల్పెదను
ముం దెఱుంగని శోకమును మాని వినుము
మహి నిచ్చటికిఁ గ్రోశమాత్రంబునందు
గహనాంతరమున వేంకటశైల మనఁగ1590.
నొక గిరి యున్నది యోగిసేవితము
సకలపుణ్యకరంబు స్వామిపుష్కరిణి
యన నొక సరమున్న దందు నీ వచట
జని యట్టి సరసిలో స్నానంబుఁ జేసి
యా సరోవరతటి హరిని గురించి
మాసషట్కము పూజ మరువక వినుము
సలుపుచుండుదువేని స్వామిపుష్కరిణిఁ
గలితవైభవమునఁ గమలేక్షణుండు
నీకోరిక లొసంగు నిక్క మింతయును
చేరుకు భాగ్యంబు చింత యేమిటికి1600.
అనవు డా శంఖణుం డద్భుతం బొంది
కనుఁగొని దిక్కు లాకసమును నెందు
నొకజనంబును లేమి నులికి మై వడక
బ్రకటోక్తి యిటు వినఁబడె నశరీర
పలుకులో స్వప్నంబొ భ్రమయొ నిక్కంబొ


తెలియ దెట్లైన మేల్ దెలుపుట గాదె
యడవిలోఁ బరదేశినైన నే నెందుఁ
దొడరి వైరులచేత దొరకినరాజ్య
మెందు నే నది మళ్ల నెట్లు చేకొందు
నం దుపాయం బెట్టి దగు నకాలమున1610.
నిది యసంభావితం బెంచి చూడంగ
తుది దైవయత్నంబు దుర్బలం బగునె
దైవంబె శరణ మెంతయు నెల్లవారి
కావిధి గా కిట్లడవులఁ దరమె
యింత చేసినవిధి కే మసాధ్యంబు
సంతసంబున నట్లు సలుపుదు గాక
యని నిశ్చయించి యయ్యతివను లేపి
తనమనంబునఁ గల్గు తలఁపెల్లఁ దెలిపి
సుదతియుఁ దాను నచ్చోనుండి కదలి
ముదమున నుత్తరముఖముగాఁ జనియె1620.
చని యందుఁ గాపిలాశ్రమసమీపమున

వెంకటాచల వర్ణనము.


కనకమయంబులౌ ఘనశిఖరములు
ధళధళమెఱయు రత్నమ్ములచరులు
చలినిగ్గురాగనుల్ సవరించు వణుకు
లచ్చపుపచ్చరా లలరు కందరము
లెచ్చైన నీలంబు లెసగు సానువులు
కాంచనద్యుతి మించు గహనభూజములు
మించుతీగలడాలు మెచ్చని లతలు


చిత్రవర్ణముల రంజిలు మృగంబులును
నేత్రోత్సవము సేయ నిరుపమకాంతి 1630
మలయంగ జాజ్వల్యమానరూపమున
విలసిల్లుచుండు శ్రీ వేంకటాచలము
చేరికఁ గాంచి మించిన సంతసమున
వారిజాక్షియుఁ జూచి వర్ణన సేయ
నొయ్యన గిరి నెక్కి యుచితమార్గమున
నయ్యెడ తీర్థంబు లరయుచు నతఁడు
నారాయణాద్రిచెంతను దూర్పుకడను
సారసారసవారసౌరభపూర
పూరితమారుతపోతసంచార
చారువౌ నొకవృక్షషండంబుఁ జేరి 1640
అందు బాలురకైన నవలీలఁ గేల
నంది కోయఁగనైన యమృతోపమాన
రసము లొల్కెడు ఫలరాజభారమున
వసపోక నెంతయు వ్రాలు రెమ్మలను
మీరిన ముంతమామిడిగుంపు పనస
నేరెళ్లు తియ్యని నిమ్మలగుములు
దాడిమల్ కిత్తళ్లు దనరంగఁ బుష్ప
పాళికె వెదజల్లు పాటలాశోక
వరనాగకేసర వకుళ పున్నాగ
కరవీర కేతకి కనకవారములు 1650
మొదలైన భూరుహంబులు తీరభూమి
ముదము సల్పంగ నంబుజము లుత్పలము
లలర సత్పురుషుల యంతరంగంబు


పొలుపున నిర్మలంబులు ప్రసన్నంబు
లై మహాపుణ్యంబులగు నుదకముల

స్వామిపుష్కరిణియొద్ద శంఖణుఁడు తపంబొనర్చుట.

స్వామి కిం పొనరించు స్వామిపుష్కరిణి
సకలతీర్థములకు స్వామిని యగుటఁ
బ్రకటింపుచుండ నా పార్ధివేంద్రుండు
కనుగొని తనమదిఁ గడు హర్షమొంది
మును బయల్ పల్కులు మొనసి తెల్పంగ1660
విన్న లక్షణముల వెస నిశ్చయించి
వన్నెలాడికి దానివై భవం బెల్ల
తెలుపుచు నిదె సుమ్ము దేవతారాధ్య
మిలఁ గల్గువారల కిష్టంబు లొసఁగు
నిదె లోకపావన మిది పుణ్యతీర్థ
మిది యోగిసేవితం బిదియె వైకుంఠ
మానితోద్యానసమాగతం బిదియ
చాన సేవించుమీ స్వామిపుష్కరిణి
యనుచు నంజలికంజ మౌదలఁ జేర్చి
వినతుఁడై పొగడుచు దెసఁ బ్రదక్షిణము1670
గావచ్చి యాచెంతఁ గనుపట్టు పట్టు
క్రేవతీర్థంబున గ్రుంకిడి సాంధ్య
కరణీయములొనర్చి కడిమి నందొక్క
పరిశుద్ధతమభూమిఁ బటుపర్ణశాలఁ
గావించుకొని ఫలకందముల్ నియతి
గా “వేళ భుజియించి కాంతతో నిట్లు


పూని నిత్యవ్రతంబుగ నాఱు నెలలు
శ్రీనివాసార్చనల్ సేయుచు నుండ

శ్రీనివాసుండు శంఖణునకుఁ బ్రత్యక్షంబై వరంబులొసఁగుట.

నొకవేళ కోటిసూర్యోదయదీప్తి
ప్రకటితంబై నట్ల పదివేలకోట్లు 1680
మెఱుపు లొక్కెడఁ గూడి మెఱసినయటుల
మెఱయుచు రత్ననిర్మితమైన యొక్క
దివ్యవిమానంబు దేదీప్యమాన
భవ్యప్రభలు నభోభాగంబు నిండ
నా సరోవరతరంగాంతరంబునను
భాసురాంబురుహాంబుపటలి బాపుకొని
వెడలె దేవగణంబు విస్మయం బొందె
తొడివడ నైలింప దుందుభుల్ మ్రోసె
వన్నెమీరగ పుష్పవర్షంబు గురిసె
కిన్నరగంధర్వగీతముల్ నెగడె 1690
నచ్చరల్ నర్తించి రాగమోక్తులను
.... ...... ....... ...... ...... ..... ......
హరి చతుర్భుజుఁడు హేమాంబరధరుఁడు
కరధృతశంఖచక్రగదాయుధుండు
కమలాయతాక్షుండు కౌస్తుభాంచితుఁడు
సమదనీలాంబుదశ్యామగాత్రుండు
శ్రీవత్సచిహ్నుండు శ్రీకాంతుఁ డపుడె
ఆవిమానంబున నావిర్భవించె


అంతట నల శంఖణావనీంద్రుండు
సంతోషవిస్మయశంక లుప్పొంగఁ 1700
దన యెదుటనె వచ్చి దయమీర నిల్చు
వనజలోచను శ్రీనివాసు నీక్షించి
యానందబాష్పము లలర మేనెల్ల
పూనినపులకముల్ పొలుపొంద భీతి
వడకుచు సంభ్రమవార్థిలోఁ దేలి
కడఁగి యంతట వివేకము సంభవిల్ల
నరసి యీశ్వరు డంచు నలరి సాష్టాంగ
మెఱఁగు లేచు జొహారు లిడు ప్రదక్షిణము
దిరుగుఁ బేర్కొనుచు నర్తించు హసించు
పరువడి ద్రొక్కు నిబ్బరమున మ్రొక్కు 1710
సొలయు నిల్చును చక్కఁజూచు నుతించు
తలచుక నిష్టముల్ తడవి యర్థించు
నిటుల భ్రాంతునిమాడ్కి నెసగు నారాజుఁ
జటులకరుణఁ జూచి జనపాల! నీకు
నేది వాంఛిత మది యిపుడె యియ్యంగఁ
గాదె వచ్చితి మదిఁ గలవెల్ల నడుగు
మనుచు శ్రీవల్లభుఁ డాన తిచ్చుటయు
జనవల్లభుఁడు చాల సంతోష మొంది
శ్రీవల్లభ! ముకుంద! శేషశైలేశ!
నీ వెఱుంగని దేమి నే విన్నవింతు 1720
నీ వొసంగినయట్టి నిజరాజ్య మెల్ల
భూవరుల్ గుమిగూడి పొదివి చేకొనిరి


నీకృప లేకున్కి నే నోట మొంది
యీకాననంబుల నిటు లున్నవాఁడ
దీనవత్సల దయాదృష్టిచే నాదు
దీనతఁ బాపవే దేవదేవేశ!
అనవుఁ డాతని హరి యాదరింపుచును
వినుము కాంభోజేంద్ర వెస నీకు రాజ్య
మిచ్చితిఁ జను మింక నేల సంశయము
విచ్చి వైరులు తామె వీగిపోయెదరు 1730
స్వామిపుష్కరిణిలో స్నానంబు సేయు
నామనుజుల కెల్ల నాపదల్ దొలఁగు
రాజ్యంబు చేకురు ప్రార్థనకొలది
పూజ్యతయును గల్గు భువనంబునందు
నని యానతిచ్చి యయ్యంబుజాక్షుండు
వనజోద్భవాదిదేవతలు నుతింప
మానితమాయచే మణివిమానంబు
తాను నాక్షణమె యంతర్థాన మొందె.
అంతట బ్రహ్మాదు లందఱు హరిని
చింతించి యా రాజశేఖరువలన 1740
స్వామిదర్శనము పావనమైనయట్టి
స్వామిపుష్కరిణిదర్శనము లభించె
నని కొనియాడి నిజాలయంబులకుఁ
జనినంత నా రాజు సకియతోఁ గూడ
వేడుక నలరుచు వేంకటాచలము
నాడె డిగ్గి రయంబునన్ నిజపురికి
నరుగుచుండఁగ నట్టి యవనిపాలురకుఁ


గరము రాజ్యార్థమై కలహంబు పొడమి
చతురంగబలములు సమయంగ వారు
హతబుద్ధులై చెందినట్టి రాజ్యంబు 1750
సరసశంఖణుమంత్రిజనులచే నిచ్చి
ధరణీశు రావించి తసరుపట్టంబు
కట్టుఁ డనుడు వారు కడువడి నెల్ల
పట్టుల వెదకుచుఁ బరతెంచి విభుని
గోదావరీతీరకుంజాంతరమున
నాదరంబునఁ గాంచి యట్టి వృత్తాంత
మంతయుఁ దెల్పి వాహనములమీఁద
నింతిని మహికాంతు నిడుకొని యరిగి
పురముఁ జేరంగ నా భూపతుల్ వచ్చి
సిరులు మించఁగ నభిషేకంబుఁ జేసి 1760
రంతట సాంకాస్యమను పురంబునను
సంతుష్టచిత్తుఁడై శంఖణాహ్వయుఁడు
నంభోజముఖియు మహాసౌఖ్య మరల
కాంభోజదేశంబు కరుణఁ బాలించి
క్రతువులు సలుపుచుఁ గడు ధర్మనిరతి
శ్రుతులఁ బోషింపుచు సిరు లొందుచుండె.
కావున స్వామిపుష్కరిణివైభవము
లీ వసుధ నుతింప నెవరికిఁ దరము
మునుపు వాల్మీకిసన్ముని యానతిచ్చు
వినుతేతిహాసంబు వివరించి తిపుడు 1770
ఈ కథవినువారి కిష్టసంపదలు
చేకురు భాగ్యంబు సిద్దించు నిజము


అట్టిస్వామిసరసి వాయవ్యకోణమున
నలరు వరాహతీర్థాఖ్య వహించి
తనరు పావనత నుత్తరభాగమునను
ధనదతీర్థంబన ధనదభాగ్యదము
చాల నీశాన్యదిశను బుణ్యకరము
గాలవతీర్థముగా నుతి కెక్కు
కరము తూరుపున మార్కండేయతీర్థ
వరముగా నాయుష్యవర్థనం బగును 1780
ఆగ్నేయదిశను మహాపావనముగ
నగ్నితీర్థంబను నాఖ్యఁ జెన్నొందు
రమణీయదక్షిణప్రాంతంబునందు
యమతీర్థమన నొప్పు నఘమోచనముగఁ
జెలఁగు రాక్షసదిశ సిద్ధిదం బగుచు
చెలువంబు దనరు వాసిష్ఠతీర్థంబు
పడమట నశ్వత్థపాదపచ్ఛాయఁ
గడు వాయుతీర్థవిఖ్యాతి నింపొందు
నడుమ సరస్వతినామకం బగుచు
కడలేని విద్యాప్రకాశంబు నిచ్చు 1790
నొకనాఁట నిన్నిట నొనర గ్రుంకిడిన
సకలలోకులకు నాస్వామిపుష్కరిణి
భోగభాగ్యంబులు పుత్రసంపదలు
యోగిదుర్లభముక్తియు నొసంగు సువ్వె
స్వామిపుష్కరిణిని స్నానంబు సలిపి
శ్రీ మించఁగ వరాహు సేవించ కెవఁడు
వేంకటేశ్వరుఁ గొల్వ వెడలు నవ్వాని
సంకల్పితార్థ మెంచఁగ వ్యర్థ మౌను


స్వామిపుష్కరిణీతీర్థ మాహాత్మ్యము.

వినుఁ డామహాతీర్థవిభవ మెంతయును
మునులార! తెల్పెద ముదము రంజిల్ల 1800
క్షమ ధనుర్మాసశుక్ల ద్వాదసులను
విమలారుణోదయవేళలయందు
భువిఁ గల్గు గంగాదిపుణ్యతీర్థములు
జవమున స్వామిపుష్కరిణిలో వచ్చి
తమయందుఁ గ్రుంకు పాతకులపాపములు
తము నంటకుండఁ బ్రార్థన సేయుచుండు
నావేళ నందు స్నానాదికృత్యములు
గావించువారికిఁ గామితార్థములు
సిద్ధించు నిద్ధరఁ జెలఁగు గంగాది
శుద్ధనదీసరస్తోమావగాహ 1810
పుణ్యఫలం బబ్బు పురుషోత్తముఁడు న
గణ్యకారుణ్యవీక్షలఁ బ్రోచు వారి
ననుచు రహస్యార్థ మమ్మునీశ్వరుల
కెనయ సూతుఁడు దెల్చె నింపు దీపింప
అనుచుఁ జిత్రార్థసమర్థనాకలిత
ఘనసర్గవిశ్రుతకవిముఖ్యుపేర
విపులానుభావభావితసంవిధాన
కపటనాటకజగత్కారణుపేర
భాసురాంగశ్రుతిభారతిభవ్య
లాసికాగీతవిలాసునిపేర 1820
తారకాంతకపితృద్వంద్వా[17]ద్యతీత


తారకమంత్రాభిధానునిపేర
ప్రత్యాహృతోత్తరాపత్యచైతన్య
సత్యనిత్యబ్రహ్మచర్యునిపేర
క్షీరపారావారసీకరాసార
పూరితనిజముఖాంభోజునిపేర
పావనభక్తాప్తబంధునిపేర
గోవిందరాజముకుందుని పేర
శ్రేష్ఠలూర్యన్వయశ్రేష్ఠశీలుండు
ప్రేష్ఠమహాయశశ్రీధురీణుండు 1830
గోత్రభారద్వాజగోత్రవర్థనుఁడు
సూత్రుఁడాపస్తంబసూత్రానువ ర్తి
అష్టభాషాకవిత్వార్జితప్రోద్య
అష్టావధానవిఖ్యాతభైరవుఁడు
శ్రీ కృష్ణయార్యలక్ష్మీగర్భవార్థి
రాకాసుధానిధి రాజపూజితుఁడు
వివిధవిద్యాశాలి వేంకటార్యుండు
సవరించు శ్రీనివాసవిలాసమునను
హరువొంద నిది ప్రథమాశ్వాసమగుచు
ధరఁ బొల్చు నాచంద్రతారకంబుగను 1840

ప్రథమాశ్వాసము, సమాప్తము.

  1. వ్రా.ప్ర. అంజనాచల
  2. వ్రా ప్ర. "చలగు మతనికృతి"
  3. వ్రా.ప్ర. మత్యన్ గమనీయంబు.
  4. వ్రా.ప్ర. సల్బవేటికి.
  5. వ్రా.ప్ర. హారూఢ.
  6. వా. ప్ర. నడవినయ్యూరువేగ.
  7. వ్రా.ప్ర. స్వర్ణగణాద్యంస
  8. వ్రా. ప్ర. కలిగి
  9. వ్రా.ప్ర.ఘంటికల
  10. వ్రా. ప్ర . వైభవము.
  11. వ్రా. ప్ర. భరతులుని కళాచికలు,
  12. వ్రా. ప్ర. తనదుబిడారు
  13. వ్రా. ప్ర. కుందమరంద
  14. వ్రా.ప్ర. ముండ్లు బరికింప లడరు
  15. వ్రా. ప్ర. నైవేల,
  16. వ్రా.ప్ర. కమహా
  17. వ్రా. ప్ర. న్వధీత.