శ్రీనివాసవిలాససేవధి/పంచమాశ్వాసము

శ్రీనివాసవిలాససేవధి

పంచమాశ్వాసము


శ్రీకరగుణజాత శ్రితపారిజాత
శ్రీకరగ్రహధన్య శ్రీకంఠమాన్య
చతురాగమస్తుత్య జగదాత్మకృత్య
చతురానసత్రాణ చతురావతరణ
చిత్రకూటవిహార జితయాతువీర
చిత్రకూటనివాస చిత్రవిలాస
గోత్రారిముఖసేవ్య కుశలానుభావ్య
గోత్రా [1] హితబిడౌజ గోవిందరాజ
అవధరింపుము దేవ య మ్మునీశ్వరులు
వివిధకధారీతి విని విస్మయమున 10
నా సూతునకు మ్రొక్కి యలరుచు వినుతి
సేసి పౌరాణికశేఖర నీవు
సదయత వేంకటాచలవై భవంబు
కుదురుగాఁ దెలుపంగఁ గుతుకం బెసంగె
శ్రీనివాసులు వనసీమ వేఁటాడఁ
బూని వృషాసురుఁ బొలియించు టెటుల
నల పద్మినీకాంత నంది పెండ్లాడఁ
గలుగు టెబ్భంగి యా కలియుగాగమము


నం దెట్లు విహరించు నంతయు మాకుఁ
బొందుగాఁ దెలుపవే పుణ్యచరిత్ర ! 20
అనుటయు నాసూతుఁ డ మ్మునీశ్వరుల
కనుపమవృత్తాంత మటు వివరింపఁ
దలఁచి పురాణముల్ దడవి యవ్యాసు
నిలిపి భావంబున నెమ్మి ని ట్లనియె
యమిచంద్రులార ! మీ రడిగినయట్టి
విమలవృత్తాంతంబు వేడ్కగా వినుఁడు
వెన్నుఁడు మున్ను శ్రీ వేంకటాచలము
తిన్నగా భూమికిఁ దెప్పించి యందు
బహువై భవంబులు పరిఢవిల్లంగ
విహరింపుచును నిత్యవివిధోత్సవములు 30
సురవరుల్ సవరింప సురుచిరకరుణ
ధర భక్తవరదుఁడై తనరు నత్తఱిని
యల నీలకంఠాశ్రమాంతికంబునను

వృషషాసురుని కథ.

బలపరాక్రములఁ బ్రతిలేనివాఁడు
వృషభాసురుం డను వీరుఁ డొక్కరుఁడు
వృషభధ్వజు భజించి వివిధాస్త్రములను
సకలమాయలఁ జెంది చావకయుండ
ప్రకటవరంబునన్ బడసి కయ్యముల
నింద్ర చంద్రాదుల నెందు నెంచకనె
సాంద్రగర్వంబున సంచరింపుచును 40
నరుల బాధింపుచు నగరరాష్ట్రములఁ
జెరుపుచు జవరాండ్రఁ జెఱలుబట్టుచును


సురలకిన్నరుల యక్షుల రాక్షసులను
తరిమికొట్టుచు మదోద్ధతి మీఱ నుండె
అతఁ డొకనాఁడు శేషాద్రిశృంగంబు
లతులితమణికాంచనాంచితశ్రీల
కనుపట్టినన్ జూచి కరము చింతించి
వనభూమి నెందుండి వచ్చె నీకొండ
ఒకనాడు నిం దిది యుండుట లేదు
ప్రకటింప నెవ్వఁడో ప్రబలమాయావి 50
తనశక్తిఁ గల్పించి తగిలి యిందుండుఁ
గనుఁగొని యతని నే ఖండింతుగాక
యనుచుఁ గ్రొవ్వునఁజేరి యందెల్ల వెదకి
కొనుచుఁ జరింపఁగ గోవిందుఁ డపుడు

గోవిందుఁడు శేషశైలమున వేఁటాడఁ బోవుట.

వనమున వేటాడ వలసి సైన్యేశుఁ
దన సైనికుల తోడఁ దరలనేమించి
సురలుగంధర్వులు శూరకింకరులు
సరసకిరాతవేషముల మెలంగఁ
దురగంబుపై నెక్కి దుమికించుకొనుచు
దొరతనంబు చెలంగ దుందుభిప్రముఖ 60
భీకరవాద్యగంభీరనాదంబు
ఢాకమీఱఁగ శార్జటంకృతుల్ మెఱయ
వెడలంగ గుమిగూడి వేటకాం డ్రపుడె
కడువడి నరుదెంచి కణితిచర్మముల
బలుటోపులును చేతబట్టినవిండ్లు


సెలగోల లిరువంకజిక్కంబు లురులు
వలలు పగ్గంబులు వాకట్టుమందు
లలరంగఁ దను వెంటనంటి జాగిలము
లరుదేరఁగా భీకరాకారములను
గరివించు జముని కింకరులో యనంగ 70
నలువొప్ప కాటుకనడగొండ లనఁగ
బలిసిన చీకట్లబారులో యనఁగ
ధర నాడు కఱమొగుల్ తండమో యనఁగ
పురిగొన్న భేతాళముల గుంపులనఁగ
కడక మించగ నిల్చి కరములు మోడ్చి
మడిసూడునాసామి మాబంటుతనము
లీసోట సింగంబు నీడి శికాడి
కోసబారక పట్టి కొట్టి శెండెదము
బెబ్బులి మీసంబు పెకలిస్సి కాడి
కబ్బిగా పై యెక్కి కాడి యాడెదము 80
గొప్ప యేనుంగుల కొమ్ములుడిస్సి
తిప్పి తొండము బట్టి తీసి తెస్పెదము
మెకముల నొక కోల మిడిశిపో నేసి
మొకమైన కోరలు మొక్కపుస్పెదము
మాసాసములు సూడు మాసామి యనుచు
యాసబాసల బీరమెచ్చఁ బల్కుచును
కరి వరాహ లులాయ ఖడ్గ సింహముల
శరభ భల్లుక వృక శార్దూలములను
తొలఁగి పోనియ్యక దోర్విక్రమమునఁ
బొలియించి కొన్నిటిఁ బొదలి పగ్గముల 90


బిగియించి కొన్నిటి బెట్టుగాఁ జేత
తగఁబట్టి కొన్నిటి తరిమి కొన్నిటిని
కడు నిట్లు వేటాడఁగాఁ జూచుకొనుచు

శ్రీనివాసుని వృషాసురుం డడ్డగించుట.

వడి నుత్తరపుదిశ వనజాక్షుఁ డరిగె
అపు డా వృషాసురుం డల శ్రీనివాసుఁ
గుపితుఁడై కెలనఁ గన్గొని యడ్డ మరిగి
యీ గిరి సృజియించు నిట్టి మాయావి
వేగ నీతని సైన్యవితతి ఖండించి
యితనిఁ బట్టెద నంచు నెంచి బె ట్టార్చి
యతిరయంబునఁ జేరి యనికి మార్కొనిన 100
శబరులందరు వానిఁ జయ్యనఁ గ్రమ్మి
ప్రబలముద్గరముల పట్టెసంబులను
పరిఖకుంతంబుల ప్రాసభల్లముల
పరశుతోమరముల బహుళాస్త్రములను
కొట్టి చుట్టుకముట్టి గుదుపల శిలల
బెట్టుగాఁ బ్రహరింప బెదరక వాఁడు
తనదు శూలంబుచేతనె వారి నొంచెఁ
గినుక వీగఁగఁ దోలి కెనిసి ముకుందు
వడి మార్కొనిన శ్రీనివాసుఁ డా యసుర

ముకుందుడు వృషాసురునిపై విష్వక్పేనుంబంపుట.

నడచ విష్వక్సేను నయ్యెడఁ బనిచెఁ 110
బనిచిన న వ్వెన్నుపడవాలు కడగి
మొనసిన కోపాగ్ని ముంచుకై వడిని


అసురపైని జ్వలించు వస్త్రముల్ గురియ
మసలక నవ్వాఁడు మార్మలయుటయు
నపుడె యిమ్ముల గ్రమ్మి యమరగంధర్వు
లపరిమితాయుధాహతి నొంప వాఁడు
కంపించి తనమాయ ఘనసైన్యగణము
పెంపొంద సృజియించి భీకరోద్ధతుల
చెలగి వెన్నునిసేనఁ జీకాకుసేయ
నలగి విష్వక్సేను నైంద్రగాంధర్వ 120
సౌరాగ్నిమారుతాస్త్రంబుల నసుర
వీరసైన్యంబుల వేగఁ ద్రుంచుటయు
వృషభాసురుఁడు సైన్యవిభువిక్రమమున
విషముదీసిన త్రాచు విధమున నూర్చి
నిజసేనయంతయు నీల్గుట యరసి
భుజబలశక్తిచే భువి సైన్యవిభుఁడు
దుర్జయుం డని యెంచి తొలఁగక మరియు
నిర్జరాహితమాయ నిర్మించి కడక
దనుజసైన్యంబు లుద్ధతకరిఘటలు
ఘనరథంబులు తురంగప్రకాండములు 130
లెక్క కెక్కుడుగాఁగ లెస్స పైకొల్పి
గ్రక్కున సైన్యేఁశు గణములఁ దరిమి
యంతఁ బోక మురారి నడరిన వాని
నంతకాలయమున కనుపఁగా నెంచి

శ్రీనివాసుఁడు వృషాసురునిపైఁ జక్రప్రయోగము సేయుట.

శ్రీనివాసుఁడు తన చేతి చక్రంబు
నూనినకిన్కఁ బ్రయోగించుటయును


ఆ చక్ర మపుడె కాలాగ్నిచందమున
నాచక్రవాళ మూటాడి చలింపఁ
దరలి యత్యుగ్రమై దైత్యసేనలను
కరకరి దహియింపఁగాఁ జూచి యపుడె 140
యతఁడును జ్ఞానోదయం బౌట నరసి
ప్రతిలేని విష్ణుచక్రం బిది దనుజ
కులము ద్రుంపక పోదు గోవిందు నిపుడె
చెలిమి భజించి నే సేయు నేరంబు
క్షమియింపఁ బ్రార్ధించి సమసి మోక్షంబు
విమలతనొందనౌ‌ వెత యేలయనుచు
తలఁచి వేంకటనాథు ధ్యానించి దేవ!
జలజాక్ష వేంకటాచలనాథ! శరణు
నా తప్పు గాచి నన్ మన్నించి నీదు
హేతియోగంబున నియ్యవే ముక్తి 150

వృషాసురునకు జ్ఞానోదయంబై యానగ మాతనిపేరఁ బరగ వరముగొనుట.

నాపేరిటనె యిట్టి నగము విఖ్యాత
మై పెంపుమీఱంగ నగు వరం బొసఁగు
మనుచుఁ బ్రార్థించగా నంబుజాక్షుండు
కనికరంబున నట్ల కరుణించుటయును
వానిఁ జక్రము ద్రుంచి వడి ముక్తుఁ జేసె
నా నగంబు వృషాద్రి యను నాఖ్యఁ జెందె
పటులీల వెంకటపతి శ్రీనివాసుఁ
డటుల రక్కసులఁ వెంటాడి యాలమున
హతులైనభటుల కటాక్షామృతముల
బ్రతికించి గ్రమ్మరం బరతెంచి వేగ 160


నానందనిలయంబునందు శ్రీభూము
లానందమునఁ గొల్వ నలరుచుఁగొన్ని
యుగముల బహువిలాసోల్లాసమునను
జగదేకరక్షణక్షమకేళి నుండె

నారాయణపురంబున విష్ణుభక్తుఁడగు నాకాశరాజు కథ.

ఆయెడ చంద్రవంశాభరణుండు
శ్రీయశోయుక్తుండు శిష్టసమ్మతుఁడు
ధర్మైకనిరతుం డుదారుండు మిత్ర
వర్మయన్ రాజు దుర్వారతేజుండు
నారాయణపురంబునన్ రాజ్యభరము
భూరిభుజాశక్తిఁ బూని భూజనుల 170
నరయుచు నుండంగ నతనికి భాగ్య
పరిపాకమున విష్ణుభక్తుఁడై తనయుఁ
డాకాశరాజన నవతీర్ణుఁడగుచు
నాకాశసేతుమధ్యావనియెల్లఁ
దనరఁ బాలింపుచు ధరణి యన్ కన్యఁ
బెనుపునఁ బెండ్లాడి ప్రేమచెలంగ
విహరింపుచును క్రతువితతి సల్పుచును
బహువత్సరంబులు ప్రఖ్యాతుఁ డగుచు
నుండి పుత్రార్థమై యొకయిష్టి సలుప
దండనదీతీరధరణి శోధించు 180
నెడ హలాగ్రంబున నెంతయుఁ గాంతి

ఆకాశరాజునకుఁ గన్యకారత్నము దొరకుట.

గడలుకొనఁగ నొక్క కన్యకారత్న
మత్యంతశిశువుగా నందుఁ గన్పడిన


నత్యద్భుతంబుగ నా బాలఁ జూచి
యెత్తి యాకాశభూమీశుఁ డెంతయును
చిత్తం బలరి యక్కుఁజేర్చి సంభ్రమము
నిగుడఁ జింతింపుచు నిలుచున్న వాని
వగదీర నశరీరవాణి యిట్లనియె
వినుము మహారాజ వెన్నుండు నీకు
తనయఁగా నీబాల దయసేసెఁగాన 190

ముకుందుఁడే నీ కల్లుఁడగునని యాకాశవాణిచెప్పుట.

నీ కన్య సంతసంబెసఁగఁ బోషింపు
లోకోన్నతులు పుత్రులుంగలిగెదరు
హరి ముకుందుండు నీ యల్లుఁడై యెల్ల
సిరులు భాగ్యంబులుం జెలిమి నీ కొసఁగు
ననుటయు నతివిస్మయంబున నతఁడు
తనదు పట్టపురాణి ధరణి రావించి
దేవభాషితమును దెలిపి యీ బాల
నీవు కూతురుగాఁగ నెమ్మిఁ బోషించు
మని చేతి కొసఁగిన నా దేవి శిశువుఁ
గనికరంబున నంది కని కరంబునను 200
చెలఁగి ముద్దాడుచుఁ జెలువంబు నిగ్గు
గులుకును వర్ణించుకొనుచు సంతోష
మలర నంతిపురంబు నందు కుందనపు
గొలుసులు బూన్చు రంగుల రతనంపు
మెరుగు తొట్లను పాన్పుమీదట నునిచి
వొరపుజోలలఁ బాడి యూఁచి లాలింప


నా నాడె భాగ్యోదయమున నాకాశ
భూనాథరమణి యద్భుతముగా గర్భ
మెలమిని ధరియించి యింపు దీపింపఁ
గలికిమైఁ గొన్ని లక్షణములు దాల్చె 210

ధరణీదేవి గర్భచిహ్నములు.

తళుకుమోమున వెల్లఁదనము చెలంగి
తెలిగన్నుగవవడ దేలుచు సొలసి
పలుమ రంబువు గ్రోలు పనిఁబూనె రసన
యిల మట్టిచవియయ్యె నెదకెన్నియున్న
ఘనకుచంబులమొనఁ గప్పు ను బ్బెసఁగె
నునుసోగయేర్చడె నూగారునకును
బలువిడి యై కౌను పాటి గన్పట్టె
నలసత నడల నింపలరె నెంతయును
చపలత మదిఁబుట్టి సవరించెఁ గోర్కె
లెపుడు మేనఁ జెమర్ప నెచ్చె నూరుపులు 220
పసరురేక లురోజపాళికె మెఱసె
పసిడిమెఱుంగు మైఁ బాటిల్లె మిగుల
నీరహి తనరారు నింతినిఁ జూచి
భూరమణునకు నుప్పొంగె సమ్మదము
అంతఁ గుమారోదయం బౌట నవని
కాంతుండు బహుకోటికాంచనమణులు
గోగణంబులు పదికోట్లును కోటి
నాగముల్ హయములు నాలుగుకోట్లు
బుధులను దానంబు భూమియుక్తముగ
విధిపూర్వకంబుగా వేగఁ గావించె. 230


చామరచ్ఛత్రరాజన్యచిత్రములె
తా మిగులగ సర్వధనముల నొసఁగి
తన వసువులు విప్రతతి కియ్యగల్గు
తనయునికిని వసుదానుఁ డన్ పేరు
ఘనతమీరఁగ నామకరణంబు చేసెఁ
దనరుచు నవ్వసుదానుండు విదియ
శశిలీల నభివృద్ధిఁ జయ్యనఁ గాంచె
విశదవివేకుఁ డై విద్యలు నేర్చి
సామును సాధించి శస్త్రాస్త్రపటిమ
భూమి విఖ్యాతుఁడై పొగడొందుచుండె 240

పద్మిని సౌందర్య వర్ణనము.

జనపాలుఁ డలకన్య జలజపర్యంక
మునఁ గాంచుకతమున మును పద్మిని యని
చెలిమి సంజ్ఞ యొనర్పఁ జెలఁగు నాకన్య
కలితనూతనచంద్రకళచందమునను
గ్రమమునఁ బెరుగుచుఁ గమలావధూటి
రమణీయరూపంబు రంజిల్లఁ దాల్చి
సౌందర్యసారపున్ సరసియో యనఁగ
కుందనపుందళుకుల గనో యనఁగ
నిరతాద్భుతవిలాసనిధియో యనంగ
సిరులొందు లావణ్యసింధువో యనఁగఁ 250
దనరుచు ప్రాయంబు దన మేన మొనయఁ
గనకాంగి వెడదకన్గవ బెళ్కు లందె
కడుసోగ నెరులు వక్రత నేర్చుకొనియె
తడలేని నడలును దాల్చె మాంద్యంబు


తియ్యబెల్లితనంబు దేలె మాటలను
నొయ్యారపుబెడంగు లొందెను కులుకు
మొలకచన్గవకొంత మొనచూపసాగె
నలువొందుపిరుదు లౌన్నత్యంబుఁ బూనె
వెలఁదియంగంబులు వింత లయ్యె నని
తలచి లేఁగౌను నెంతయుఁ గృశించంగ 260
నది చూచి శైశవం బటు జారఁగడఁగె
పొదలె జవ్వనము సొంపున నెచ్చె నపుడు
చెలులతో నాబాల శృంగారవనుల
నెలమి నాడుచు చాల నిం పొందుచుండె

శ్రీనివాసుఁడు చెంచురూపమువ వేటకుఁ బోవుట.

ఆయవసరమునం దా శ్రీనివాసుఁ
డొయ్యన వేటకు నుద్యుక్తుఁడగుచు
చెంచురూపు వహించి సెలవిల్ ధరించి
మించుపన్నియ చాల మించిన శాల
చెఱఁగు జారఁగఁ జుట్టి సిగపైన గట్టి
బుఱుసారుమాల్ గట్టి పొలుపొందు నట్టి 270
మృగనాభితిలకంబు మెప్పుగాఁ బెట్టి
వగమీఱ నొక కేల వడి నేజబట్టి
చొక్కమౌ నొకజక్కి సొగసుగా నెక్కి,
యక్కజంపుదువాళి యలరు వాహ్యాళి
పిక్కటిల్లఁగ ధాటిఁ బెగడక మేటి
కక్కసిభటు లంటఁ గదిసిరా వెంట
మితపరిజనముగా మెఱయంగ వెడలి
యతిరయంబున నేగె యాజ్ఞేయదిశను


కనకముఖరి చెంత కానల నంత
మొనసి వేటాడుచు మోద ముప్పొంగ 280
మదగజంబుల ద్రుంచి మగ్గించి పులులఁ
జదిచి సింగంబుల శరభాళి నడచి
కుదియించి పందులఁ గొట్టిఖడ్గముల
పొదలునీహామృగంబును వెంబడించి
చనిచని యాకాశజనపాలునగర
ఘనతరోద్యానంబుఁ గదియ నేగుటయు
ఘోటవేగంబునఁ గూడి రాలేక
నాటవికభటాళి యందందు చెదరి
కానక విభుని యా కానల వెతక
నేనుఁగు లవ్వారి కెంతయు బెదరి 290
యులికి రాఁ జూచి య య్యువిదలు వెఱచి
తరులచాటుకుఁ జేరి తల్లడిల్లుచును
హాహారవము మీఱ నార్చుచుండంగ
నా హరి తురగంబు నందు వెంబడిగ
నరుదెంచినం జూచి య య్యళ్కు దీరి
హర్ష విస్మయముల నలరుచుండంగ
వారణేంద్రము శ్రీనివాసు నీక్షించి
మీరి పోఁజాలక మించిన భక్తి
నెరుగుచందంబున నెత్తరంబైన
శిరము వంచి కరంబు చెలఁగఁ బై కెత్తి 300

స్వర్ణముఖరిచెంత కానమున పద్మిని వేంకటాధీశుఁజూచుట.

వినయంబుతోడుత వేవేగ మరలి
తన గుంపుతో వనాంతరమున నరుగ


నది చూచి కడుచోద్యమందె డెందమున
మదిరాక్షి యాకాశమహిబాలతనయ
యా వేంకటాధీశు హావభావములు
ఠీవియు మహిమ మేటితనంబు నరసి
యెవ్వఁ డి వ్వనమున నివ్వేళ వచ్చె
పువ్వువిల్కానిసొంపున నున్నవాఁడు
చంద్రబింబమువంటి జక్కిపై నెక్కి
ఇంద్రనీలపురంగు నీను మేనొరపు 310
కెందమ్మి యొడికంబు గేరు పాదములు
కుందనపున్ శాల గొమరొప్పు తొడలు
శింగంపుగౌను మంచి వెడందరొమ్ము
రంగొందు చేతులు రాజసలీల
మించు చూపుల కెంపు మెఱయు కెమ్మోవి
యించువిల్తుని విండ్ల నెంచనిబొమలు
పాలకాయొంటులం బరగు వీనులును
నీలోత్ఫలచ్ఛాయ నిరసించు మీస
మెలమిని కస్తూరి నిడు తిలకంబు
పొలుపొందు కొంత మూపున జారు సికయు 320
బురుసారుమాలు మెప్పుగ గట్టు సొగసు
మురువుమీరినయట్టి మోహనాకారు
ననవిల్తుకేళిఁ జెందని మే న దేల
యని యెంచి పులక మైయడరంగ నిలిచె
శ్రీ వేంకటేశుఁ డా చెలువను జూచి
భావించి తన మది బాళి రెట్టింప
ఔరౌర యీచాన యందచందములు


హారివిలాసంబు లంగకాంతియును
కలకల నగు మోము కళలూరు నుదురు
సొలపు గుల్కెడి చూపు సోగ కీల్జడయుఁ 330
దళుకు చెక్కిళ్లు గుత్తపుఁ జన్నుదోయి
పలుచని లేఁగౌను బటువైన పిరుదు
నొయ్యారపున్నడ యొసపరితనము
నెయ్యెడ జవరాండ్ర కిటులఁ జూచితిమి

పద్మిని చెలికత్తెలతోడ శ్రీనివాసుఁడు సంభాషించుట.

అని మెచ్చుకొనుచు నొయ్యన చెంతఁజేరి
వనజాక్షులార! యివ్వనమున నొక్క
మృగ మేగఁ గంటిరే! మీరు నిక్కముగ
తగఁ దెల్పుఁ డనవుడా తరుణులు బెగడి
మది భయంబు విరాళి మదము విస్మయము
గదురంగ నతనికిఁ గడక ని ట్లనిరి 340
ఏ మృగంబును గాన మేము నీవిటుల
కామిను లొంటి నిక్కడ నాడు వేళ
నళుకు శంకయు లేక యడుగుట సోద్య
మిల చూపరులు మెత్తురే యో! కిరాత!
ఆకాశభూపాలు నాత్మజ యిచట
నేకతంబున నాడు టెఱుఁగవే నీవు
నిలువక చను మింక నిలిచినఁ జాల
కలుగును శాస్తి కింకరులు గన్‌గొనిన
ననుటయు శ్రీ వేంకటాచలవిభుఁడు
ననబోణుల విడంబనములకు నగుచు 350


అలివేణులార! యౌ! నందుల కేమి
యలర నే నొకటి మి మ్మడుగ నెంచితిని
కలయట్లఁ దెలుపు డీ కన్నియ యెవతె
కుల మెద్ది యెవ్వాని కూతు రేమిటికి
నీవనంబున మీర లేగితి రిటుల
నా విధంబులు విన హర్ష మయ్యెడిని
అనుచు తురంగంబు నయ్యెడ డిగ్గి
కనికరంబు చెలంగఁ గదిసి పల్కుటయు
వనజాక్షు లా శ్రీనివాసు మృదూక్తి
వినవిన వీనుల విందుగా నునికి 360

చెలికత్తెలు పద్మినిజన్మవృత్తాంతమునాతని కెఱింగించుట.

నలరి కొంత ప్రమోద మాత్మ జనింపఁ
జెలిమిని దిలకించి చేరికె నిల్చి
విను నరోత్తమ యిట్టి విరిబోణి జనన
మనుపమకీర్తి యీ యాకాశవిభుఁడు
యాగార్థముగ భూమి హలముఖంబునను
బాగుగా శోధించుపట్ల న య్యవని
దళనంబునన్ బద్మదళశయ్యమీద
నెలమి మైకని బాల యెసఁగినఁ గాంచి
తనదు పుత్రికగాఁగఁ దనరంగఁ బెనిచె
ననఘత పద్మినియను పేరు నిడియె 370
తరుణవసంతంబు తగుట నిం దిపుడు
విరులఁగోయఁగ మమ్ము వెంటఁ దోడ్కొనుచు
నరుదెంచె వృత్తాంత మంతయు దాచ
కెరుగఁ దెల్పితిమి నీ యిర వెద్ది నీదు


పే రేమి యేటికిఁ బ్రియమున నిటుల
నారయ నడిగితి వది దెల్పవలయు
నావు డర్మిలి చిఱునగ విగురొత్త

వాసుదేవుఁడు వారలకుఁ దన్నెఱింగించుకొనుట

దెేవోత్తముఁడు వాసుదేవుఁ డచ్చెలులఁ
దిలకించి వినుడు నా తిరమైనయిరవు
చిలువలరాగొండ చీకట్లుబాపు 380
వేవెలుంగుకులంబు వెలయించువాఁడ
నా వారు పండితుల్‌ ననుఁ గృష్ణుడండ్రు
వనముల వేటాడ వచ్చితి నిందు
కనకాంగులార! యా కన్యాలలామ
సొగసు చక్కదనంబుఁ జూచి మేలొంది
తగ నెమ్మి నడిగి తింతగ నేర మేమి
యని వెండియును నమ్మృగాక్షి నీక్షించి
ననబోణి నీకు నెంతయు మేలువాఁడ
తమి నిల్వజాల గాంధర్వక్రమమునఁ
గమలాస్త్రుకేళి నన్ గలిసి యెల్లెపుడు390
నెడబాయ కెదఁజెేరి యెలమి నానంద
ముడుగని రతిఁ జెందుచుండఁగా రాదె
వలరాజుతూపుల వాడియల్గులకు
సొలయకుండఁగ నన్నుఁ జోడుగాఁ గూడి
విరహతాపమునఁ బల్విడియైన దప్పి
ధరియింప నధరామృతం బాననీవె
కలికి నా వీనుల కసిదీర ముద్దు
పలుకులతేనియల్‌ పైఁ జిల్కఁగదవె



భామరో విరిదీఁగపైఁ బూన్చు కరము
నా మూపునం జేర్చి నన్నేలుకోవె 400
యనుచును బల్కు. న య్యుంగజుజనకుఁ
గనుఁగొని ననబోణి కడు మరుల్‌ బూని
చెలిమిపెంపువహింవ సి గ్గగ్గళింప
నెలమి పెంపువహింప నెద చెమరింప
పలుకక తలవాంచి బాళిరెట్టించి
సొలయుచూపుల నించి సుదతులఁ గాంచి
పొదమంచు నొక విరిపొదచెంత జేరి
మదనవంచన మది మాటుచుండంగ

పద్మినికై వెదకుచున్న సైనికులామెను పల్లకిలో నింటఁజేర్చుట.

నంతలో సైనికు లార్భటింపుచును
కాంతారమంతయు గమలాక్షు వెదకి 410
యచ్చోటు జేరంగ నళికి యచ్చెలులు
విచ్చలవిడి తోట వెడలఁ బద్మినిని
పల్లకి నిడుకొని బలువడి నగరి
కల్లన నరుగంగ నా కన్నె వెన్ను
నొరపుశింగారంబునుల్లంబునందు
మరులునఁ దలఁచుచు మరుకాక సొలసి
మరలి చూచుచు నేగ మదనగురుండు
విరహంబు మది వెల్లి విరియ న వ్వైలఁది
చెలువంబునకుఁ జొక్కిా చింతతో మగుడి
తలవని తలఁపుగాఁ దగిలి వీరెల్ల 420
నిం దెేల వచ్చిరి యిట్టి వేళ నని
కందువ విన్ననైై కళవళంబునను


కమిలి బిట్టూర్చుచు గాంభీర్యమునను
తమకంబు లిముడక తన సేనఁ గలిసి
తురగంబు నెక్కి బంధురవేగమునను

సేనతోఁగలిసి యిల్లుచేరిన శ్రీనివాసుని విరహవర్ణనము.

నిరుపమం బగునట్టి నిజమందిరంబు
నఫుడె ప్రవేశించి యందఱి ననిచి
కపటమన్మథమాయ కాక రెట్టింప
అలివేణి మీద మోహమున నేమియును
బలుకక విరిపాన్పుపైఁ బవ్వళించి30
చెలులతో నాడక శృంగారవనము
తిలకించక కొలంకుదెస దృష్టియిడక
కొలువుకూటంబునఁ గూర్చుండఁబోక
జలకంబుగొనక వేసటఁ గలపంబు
లలఁదక యింపుగా నారగించకయె
చలువకట్జుక విరిసరులఁ గైసేసి
యలరక నెందుల నర్మిలి మనసు
నిలుపక నూరక నిస్సంగుపగిది
సంతతధ్యాననిష్టత నుండు కరణిఁ
గాంతఁ జింతింపుచుఁ గంతునిబారి30

గలకనొందుచు బైలు గౌగిలింపుచును
తలయూచి వికవిక తనలోనె నగుచు
భ్రమసి చూచుచు నుల్కి భామఁ బేర్కొనుచుఁ
దమి నిదురఁ దొలంగి తనలోఁ గరంగి
న్యాయంబు మరచి ధైర్యంబుం బోవిడిచి
పాయని విరహాగ్ని జడలుచుండంగ


అం దా ముకుందుని యాకార మరసి
యందఱు బల్ వెఱగంది సందియము
కొందళించఁగ గుజగుజ లాడు నప్పు
డిందిరారమణుని హృదయజ్ఞమైన 450

శ్రీనివాసుని వకుళమాలిక ప్రబోధించుట.

వకుళమాలికె చాల వలతియౌ నొక్క
సఖియ యై విభుఁజేరి సరసత మీఱి
నుగుణత మెఱయంగ సొగసు చెలంగ
నగణితామోదంబు నలర నిట్లనియె
పద్మాస్త్రజనక ! యో పరమకారుణిక !
పద్మామనోహర ! భక్తమందార !
దేవాదిదేవ ! ప్రతీతప్రభావ
దేవర విబ్భంగి ధీరతఁ దొలఁగి
కడు విన్ననై యుండు కారణం బేమి
తడవాయ బోనమై తడయ నేమిటికి 460
జలకంబు నవధరించఁగ సమయంబు
జలజమందిరఁ జేరఁ జని విన్నవించ
నళుకుచున్నది లేవవయ్య నెయ్యముగ
తిలకించితే వధూతిలకమున్ నిన్ను
వలపించఁగలయట్టి వలతియున్ గలదె
తెలిసె నీ చిత్తంబు దేవ శ్రీదేవి
సొలయించఁ దలఁచిన జూటుతనంబొ
పొలయల్క యేమైనఁ బుట్టెనో రేయి
కలకఁదేరిచి నేను ఘటియింప లేనె
తెలుపవే నీ మది తెలియ నాతోన 470


కావలసిన పనుల్ కా నోపు గాక
ఈవేళ భుజియింపు మిభరాజవరద
అనవుడు శ్రీ వేంకటాచలరమణుఁ
డనుపమంబుగఁ బల్కు నా బెడబల్కు
లాలించి లాలించి యంగీకరించి
శ్రీలలనామణి చెలిమి వడ్డింప
సరసాన్నభక్ష్యభోజ్యము లారగించి
పరిపూర్ణ హృదయుఁడై పరిమళభరిత
మృగమదమిళితకాశ్మీరసారోద్రు
దగరుచందనరస మలది నెమ్మేన 480
మకుటకుండలహారమౌక్తికహార
చకచకత్కంకణస్ఫార కేయూర
మంజీరమేఖలామణిపతకాది
రంజితాభరణముల్ రమణ ధరించి
బంగారువన్నియఁబరగు చెంగావి
రంగుగా రింగువారం గటిఁ గట్టి
సరిలేనిక్రొవ్విరి సరులు గై సేసి
మరుని మాయలు మరుల్ మరలంగఁ దరలి
కలువరాచలువరా గద్దియంజేరి
యెలమి మీఱఁగ నుండు నేకాంతవేళ 490
శుకవాణినిఁ దలంచి సొలయుచు మించి

వకుళమాలికతో శ్రీనివాసుఁడు తనవిరహకారణమును దెలుపుట.

వకుళమాలికఁ జూచి వావిరిఁ బలికె
వినఁగదే విరిబోఁణి విస్మయం బొకటి
మును కానలో నేను మొనసి వేటాడ


నరుగుచో నల్ల నారాయణపురము
సరసఁ బూఁదోఁటలో సరిలేని యొక్క
కన్నియఁ గనుగొంటి కడుమరుల్ గొంటి
నెన్నియు నన నేల యెన్ని చూడంగ
నా మగువకు సాటి యగు నట్టి బోణి
భూమిని జనియింపఁ బోల దెంతైన 500
పుత్తళిబొమ్మ యా పొలతియై యొరపు
చిత్తరువును వ్రాయఁ జెల్ల దెల్లెడను
వలరాయునిష్ట దేవతయె యీ లీలఁ
చెలువొంద విలసిల్లు చెలువయో కాక
సౌందర్యసారవిస్తారావతార
మిందుబింబాస్యగా నింపొందు టేమొ
యవ్వనలక్ష్మియై యలరి మేనంది
పువ్వుఁబోణిగ నిల్చి పొలుపొందెనేమొ
లేక ముజ్జగముల లేమ లీ లీల
నా కండ్ల కింపుఁబూన్పఁగఁ జాలువారె 510
చాల నా లోలాక్షి చక్కదనంబు
లీలలున్ మరువంగ లేనె నీయాన
వలరాజు విరిగోల వడి కోర్వఁజాల
వల పుబ్బగాఁ దాళవశమటే చాల
నీవు నాయెడ ప్రేమ నించితివేని
వేవేగ నీ నేర్పు వెలయించి నాదు
వెతలబల్విడి రేచు విరహంబు దీర
నతివను గూర్చి పుణ్యము గట్టుకోవె
నావు డా ననబోణి నగుచు నో దేవ


నీవు మేలొందుట నేను నమ్ముదునె 520
యీ వంచనకు నేమి యెల్లవారలను
నీవె మోహింపించు నెఱ మాయదారి
వెదను నిస్సంగత నెసఁగి బల్మాయ
వదలక లోకభావనఁ జేసె దిచట
అదిగాక సరిలేని యందచందముల
మదిరాక్షి యలమేలుమంగ యుండంగ
మరియు నొక్క మిటారి మహి నీదు దృష్టి
కరయ తాళినయట్టి యంగన గలదె
నే నెఱుంగుదు సామి నిక్కంబు దెల్పు
మా నాతి కెందుకై యాశించి [2]తనఁగ 530

పద్మావతియం దాతని యనురాగమునకుఁ గల కారణము

చిఱునగ విగురొత్త శ్రీనివాసుండు
మఱియు నత్తరుణి ప్రేమను జూచి మొదట
నా వరవర్ణిని యర్ధించి తన్ను
భావించు తెరగు తెల్పగ నిట్టు లనియె
కను మట్టి కథ నీకు వివరింతు నింతి
మునుపల్ల కృతయుగంబున బృహస్పతికి
సుతుఁ డొక్కఁడు కుశధ్వజుం డనువాఁడు
సతతంబు స్వాధ్యాయశాలియై తపము
నెఱుపుచు మద్భక్తినిష్ఠుఁడై యుండు
పఱగ నాతఁడు వేదపఠనంబు సల్పు 540
వేళ నాతని ముఖవివరంబునందు
బాలికె జనియించె భవ్యరూపమున


వేదవతి వృత్తాంతము

వేదంబునన్ సంభవించిన కతన
వేదవతి యనంగ విఖ్యాతి యయ్యె
నది యౌవనము నొంది యలరంగఁ జూచి
సుదతిని మోహించి సురదైత్యవరులు
నరకిన్నరేంద్రులు నయమున నతనిఁ
గర మొప్ప వందించి కడు బ్రియంబునను
నతివను దనకు నిమ్మనియుఁ బ్రార్థింప
నతఁడు వారి కొసంగ కపు డిట్టు లనియె 550
వెన్నుఁ డల్లుఁడుగాఁగ వేడుచుఁ దపము
లెన్నైన సల్పుచు నిటులున్న వాఁడ
పన్నగశయుఁ దక్క పరుని కెవ్వనికిఁ
గన్నియ నే నియ్యఁగాఁ జాల ననుడు
మరియు నా బాలయు మరుగన్న హరునె
వరియింతు నని చాల వ్రత మూనియున్న
దనుటయు వా రేగి రందు శంభుఁ డను
మనుజవల్లభుఁ డల్ల తరుణిపై మరులు
పట్టఁజాలక యట్టి బ్రహ్మర్షి వరుని
పట్టి వధించెఁ దద్బ్రాహ్మణహత్య 560
పాపాత్ము నవ్వాని భస్మంబుసేసె
నా పరితాపంబు నాపఁగలేక
అల మునిపత్నియు నాత్మేశు మేను
నలమి యుజ్వలితాగ్ని నటు ప్రవేశించె
నా వేదవతియును నబల యెంతయును
భావించి తన తండ్రి పట్టు ప్రతిజ్ఞఁ


గమలాక్షుని వరించి కడతేర్తు ననుచు
హిమవద్వనంబున ఋషివృత్తినుండి
యటుల కాషాయకృష్ణాజినంబులను
జటలను ధరియించి స్ఫటికాక్షమాల 570
కరమునఁ దాల్చి యోగస్థితి మెఱయ
పరమపవిత్రమౌ బృసిని గూర్చుండి
జ్ఞానభక్తివిరాగశమదమక్షమలఁ
బూని నిరంతరంబును నన్ గురించి
వ్రతము సల్పుచునుండ రావణుం డనెడు
హతకుఁ డచ్చటి కేగి య వ్వేదవతిని
గని జవ్వనంబు చక్కదనంబు నిగ్గు
తనరు ని వ్విరిబోణి తపము సేయంగ
నె వ్విధాత విధించె నెంచంగ నతని
య వ్వెఱ్ఱితనము నెంతనవచ్చు నకట 580
యెసఁగునే దోసపం డెనుపకట్టలకు
బిసమునఁ బలుకొండఁ బేర్చుటగాదె
యతులభోగంబుల కై న ప్రాయంబు
నతి తపఃక్లేశంబు నందింపఁ దగునె
కామసౌభాగ్యంబు గాలిఁ బోఁబుచ్చి
కోమలి వ్యర్థమై కుం దిట్టి దీని
నవరూపమును యవ్వనము తన రుచులు
భువి సఫలత నొంది భోగయోగ్యముగ
వెలయనేయుదు నంచు వే మది నెంచి
చెలిమిని బలిమినిన్ శృంగారలీలఁ 590
బొదలు మాటల బాళి బుట్టించు నట్ల


వేదవతీ రావణుల వాగ్వాదము

మదమునఁ జేరి యో మదిరాక్షి యెవతె
వెవ్వని సతివి పే రేమి యే కతము
క్రొవ్విరివంటి మై గోముఁ గందించి
పసలేని పరలోక ఫలముల నమ్మి
కసటైన తపముచే గాసి నొందెదవు
వికృతాంగకులు నతి వృద్ధులు నిటుల
సుకృతచర్యల మేను స్రుక్కించి దివిని
జననాంతరంబునన్ సౌఖ్యంబు వలసి
వనవాసదుఃఖ మోర్వఁగఁ దగుఁగాక 600
వరసౌఖ్యనిధి యైన వయసున నిట్ల
తరుణీమణిరొ నీకుఁ దగునె యీ చర్య
యనుచుఁ జెంతకు వచ్చు నా దశగ్రీవుఁ
గనుఁగొని య మ్మౌనికన్య గన్విచ్చి
తన తపోబలమునఁ దద్వృత్త మరసి
తనర నాతిథ్యంబుఁ దగ ము న్నొసంగి
జననంబు మొదలుగా సకలాత్మకథయు
జనకవృత్తాంతంబు సవ్యసంకల్ప
మంతయు వినిపించి యతనికి మరియుఁ
జింతితం బెఱుగింపఁ జెలువ యిట్లనియె. 610
పురుషోత్తముముకుందు భువనసంభావ్యు
హరిని జామాతగా నర్ధించు తండ్రి
పూనిక నెరవేర్ప బుద్ధి నూహించి
నేను న వ్వెన్నుని నెమ్మి వరింపఁ
దపము సల్పెద నగధారినిఁ దక్క


నపరు నెవ్వరి నొల్ల ననుడు రావణుఁడు
కోపించి యో వెఱ్ఱి కోమలి వెన్ను
నేపాటివాఁ డంచు నెంచి వరించఁ
గోరెద వరయంగఁ గులమున బలిమి
సారవిక్రయమున చాతుర్యమునను 620
నా సరివాఁడె యా నారాయణుండు
దాసరి వానితో తగు లేల నీకు
ముందర నతఁడు నా ముందర గినిసి
చిందరవంద రై చెదరి బె ట్టదరి
యుదరి సేనలు దాను నురకఁడే సమితి
బెదరి యంబుధిఁ జొచ్చి పెలుచ పాతాళ
వివరంబు చొరఁబారి వెస నొంటిగాడు
నవుచుఁ గానల దూరి యట నోరు తెఱచి
బతిమాలి వెండియుఁ బాపఁడు జోగి
యితఁడన వెల్లనై యిల సిగ్గు విడిచి 630
సాది నంచు ననాదిజగ ముడాయించె
యేదియు నొక కులం బెంచరా కెందు
నూ రిది యనరాక యొక్క పేరొంద
నేరక భిక్షుకనికరమున్ గూడి
నత్రభోజియె యౌచు జరుగు న వ్వాని
నత్రప వరియింప నగు ఫలం బేమి
సురరాజును కుబేరు స్రుక్కించి గెల్చి
మెరయు నన్ను వరించి మేలొందు మనిన
ఆ నీచు మాటకు హరిహరి యనుచు
వీనులుం గరములన్ వేవేగ నదిమి. 640


యులికి మో మటు ద్రిప్పి యోరి దురాత్మ ?
బలుమదంబున నిట్లు బలుకంగఁ దగునె
పురుషోత్తము ముకుందు భువనైకబంధు
పరమకారుణికస్వభావు మాదేవు
పోనాడకుర నోరు పుచ్చిపొయ్యేను
మాను మీ మాటలు మాటికి సూర్యు
పై దుమ్ముఁ జల్లినం బడుఁ దన మోము
మీదనే గాక న మ్మిహిరున కేమి
నీవు నిందించిన నీ జిహ్వ చెడియె
పావనమూర్తి కా పరిభవం బేది 650
బాలిశ యికఁ జాలు పదివేలు పొమ్ము
కాలంబు డగ్గిరెఁ గాఁబోలు నీకు
నావు డత్యుగ్రత నయనముల్ మెఱయ
రావణుఁ డా బాల రమ్య కేశములు
బట్టి తీసి రథంబు పై కెత్త నబల
దిట్టతనంబుతోఁ దెగువ వాటిల్ల
నరిగి యా నీచాత్ము డంటిన కురుల
బలిమినిఁ ద్రుంచంగ బదరుచు తనదు
కరముఁ బూన్పఁగ నది ఖడ్గమై వాడి
కురుల ఖండించిన కోమలి నిలిచి 660
యోరి దురాచార యోగి నే నగుచు
భూరివ్రతంబులన్ బొలుపొందు నన్ను
నంటితి విపుడె ని న్నతితపశ్శక్తి
మంటిపాలుగ గ్రాల్చి మ్రగ్గెంచలేనె
చిరతరార్జితపుణ్య సిద్ధి తగ్గునని


యరసి తాళితి నేనె యవని జనించి
నిను పుత్రమిత్రాది నివహంబుతోడ
ననిని గ్రుంగగఁ జేతు నంత నీ గర్వ
ముడుగు నంచు శపించి యోగక్లుప్తాగ్నిఁ
బడఁజొచ్చె న వ్వేదవతి నగ్ని దేవుఁ 670
డతిశీతలాత్మయై యంగీకరించి
కతిపయాబ్దములు దాఁ గైకొనియుండె
నంత దాశరథి నై యా సీత తోన
కాంతారమున నుండఁ గాను మారీచు
వంచనఁ దగిలి నే వనమునఁ జనఁగఁ
బొంచి రావణుఁడు గొబ్బున పర్ణశాల
చేరినన్ జానకి చింతఁ గలంగి
యారూఢమతి నగ్నిఁ బ్రార్థింప నతఁడు
ధరణిజఁ దనలోనఁ దాచి మున్నొండు
తరుణి తద్రూపంబు తగు వేదవతిని 680
వెడలింపఁగా నది వెస దొంట్టికినుక
యడరంగ నా రాక్షసాధము నింట
చేరియుండుక ప్రతిన జేసినయట్ల
దురమున పుత్రబంధుసమేతముగను
వాని ద్రుంపించి నావద్దకి వచ్చె
మానిని పూనిక మది చాల మెచ్చి
యఫుడు నే నంతయు యరసి య య్యగ్ని
నుపగూఢయగు సీత నొద్దఁ గాంక్షించి
వ్యాజాకృతి మహీజ వగ వచ్చు చెలిని
వ్యాజభాషణముల వహ్నిఁ జొరంగఁ 690


జేసిన నగ్ని నా చిత్త మెఱింగి
భూసుత నపుడె యింపుగఁ దెచ్చి యిచ్చె
అటు రహస్యోక్తుల నగ్ని దేవుండు
పటుమతి యగు నిట్టి భామాలలామ
నిన్నె బెడ్లాడంగ నెమ్మదిఁ గోరి
యున్నది సీతకు నుపకృతిఁ జేసెఁ
గావున నిచ్చెలిఁ గరుణించి యిపుడె
నీవు చేకొను మంచు నెమ్మి నర్ధింపఁ
గొన్ని యుగంబులకును మీద నటులఁ

సీత కుపకృతిచేసిన వేదవతి పద్మినిగా జనించి తన్ను వలపించెనని చెప్పుట

గన్నియ వరియింతుగాక యాకాశ 700
నృపపురంబున నయోనిజగాఁ జనించి
చపలాంగి నను జెందఁజాలు నం చేను
సరసిజగర్భాది సకలదేవతలు
వరునను వినుచుండ వర మొసంగితిని
యా వేదవతియే యుగాంతరంబునను
పావనవ్రతములు బహువుగా సల్ప
నల రుణం బెటు దీర్చనగు నంచు చాల
తలపుచుండుదు నదే తన ప్రభావమున
నవని నయోనిజ యై జనియించె
నవవిలాసంబుల నను వలపించె 710
కటకటా నే నెంత కఠినచిత్తుఁడనొ
మటుమాయఁ జేసి య మ్మగువ నిన్నాళ్ళు
తలచక భక్తి వ్రతంబులకైన
ఫలముగాఁ గరుణించి పడతిఁ జేకొనక


యెలయించి తది యెంచి యెలయించుబోణి
వలపించి సొలపించి వగఁ దలపించె
నిక నేల నొకవేళయిన తాళఁజాల
వకుళమాలిక నీవె వడిమీఱ వెడలి
చిత్తవేగము మించి చెలఁగు బిత్తరపు
తత్తడివై హత్తి తగు భటుల్ గొల్వ 720
వాణి నీటువహించి వాణి నీ వగుచు
రాణించు నారాజు రాణివాసమున
కరిగి ధరణి సేమ మరసి నీ నేర్పు
మెరసి మెరుగుబోణి మేల్మిఁ దోడుకొని
యరుదెంచితివయేని యపుడు నిన్ గూర్మి
నరుదెంచి కౌగిట నలముదుసువ్వె

వకుళమాలిక పద్మావతిని డో డ్తేర నారాయణపురంబున కరుగుట

అనవు డచ్చెలి వెన్ను నడుగుల కెరగి
వినయంబు దనరంగ వీడ్కొని వేడ్క
జేజేలరాతేజి చెలువు తేజంబు
రాజిల్లు నొకజక్కి రాజిగా నెక్కి 730
కాంచనవేత్రముల్ కరములఁ బూని
కంచుకిప్రకరంబు కడువడి నడర
లంకెకారులతో నలంకృతులగుచు
కింకరవరులు శంకింపక నడవ
నరుగుచు వేగమె యాస్వర్ణముఖరి
యరుత నగస్త్యాశ్రమావని హరుని
కనుఁగొని య చ్చెంత కాంతలు గొంద
రనుపమలీలల నరుదేరఁ గాంచి


యెలనాగలార ! మీ రెందుండి యిందు
బలుకాన నరుదెంచ పనియేమి దెల్పు 740
డనిన న వ్వనజాక్షు లా బెడఁ జూచి
ఘనవిస్మయంబు బొంగగ నిట్టు లనిరి
వినుము మావచ్చినవిధ మో మృగాక్షి
యనఘశీలుం డగు నాకాశరాజు
నారాయణపురంబునం దగు నతని
సారసేక్షణ భూమిసంజ్ఞఁ బెంపొందు
న ద్దేవి కొక కూతు రందచందముల
ముద్దుగుల్కుచు జగన్మోహనలీల
మీరుచు నాఖ్య పద్మినియనఁ దనరు

పద్మినివిరహావస్థను గూర్చి చెలులు చెప్పుట

నారామ యొక్కనా డారామసీమ 750
నలరులు గోయ నలరువిల్తునివలె
నలరూపురేఖల నలరు నొక్కరునిఁ
దిలకించి యారాజ తిలకున కెంతె
వలచి పూవిలుకాని వలఁ జిక్కి సొక్కి
మదిని సొంపునుఁ దక్కి మరులను స్రుక్కి
నిదురఁజెందకఁ గూడు నీరు నొల్లకనె
జలకంబు నాడక జలువఁ గట్టకనె
తిలకంబు దిద్దక తెలివిఁ గైకొనక
చెలులతోఁ బల్కక జిల్కకు ముద్దు
పలుకులు నేర్పక బలుకాకఁ బొరలి 760
మరులను సొలయంగ మహిపాలు రమణి
ధరణి యా కన్నియ తనుతాప మరసి


వెరగంది యెదఁగంది వెజ్జు రావించి
పరికించి జ్వరమంచు బ్రమియించి మించి
యసమాన చంద్రోదయంబు వసంత
కుసుమాకరంబునుఁ గొంచు రమ్మనిన
నలపేరు చెవిసోకి నంతనే కాక
బలువిడి యై మూర్ఛఁ బై కొనఁ గాంచి
శంకించి మది గ్రహశంకగా నెంచి
మంకుతనంబునన్ మంత్రవాదులను 770
బిలిచి చూపించగాఁ బెలుచ నవ్వారు
వెలయ యంత్రోద్ధారవిధి పూర్వకముగఁ
బూనికె దిగ్బంధము నొనర్చి మంత్ర
మానితాస్త్రస్తోత్ర మణులు పఠించి
యల కార్తవీర్య దుర్గాది దేవతల
నలరఁ భావించి తదాత్మతం జూచి
రమణి తాపంబుఁ దీర్పఁగ నిర్ణయింపఁ
దమకు శక్యముగామి ధరణి కిట్లనిరి.
ఈ చెలువకు నెద నెసఁగు దయ్యంబు
మాచేత నిర్ణయింపఁగ లోను గాదు 780
శ్రీవేంకటేశ్వరుఁ జేరి మ్రొక్కినను
పూవుఁబోణికి మేలుఁ బుట్టించు నతఁడె
బ్రహ్మాదులును కని పట్టరా నట్టి
బ్రహ్మభూతము దీనిఁ బట్టిన దమ్మ
యని మాంత్రికులు జన నద్దేవి విప్ర
జనమతంబునఁ జెలి సౌఖ్యంబు నొందఁ
నిందుకళామౌళి నిం దభిషిక్తు


ముందుగాఁ గావింపఁ బుత్తెంచె మమ్ము
ధరణీసురులచేతఁ దదభిషేకంబు
లరుదుగాఁ జేయించి నరిగెద మింత 790
నీ వెవ్వరమ్మ నీ నిలయ మెం దెందుఁ
బోవలె మాకు నింపుగఁ దెల్పు మనిన
వకుళమాలికయు భావమునఁ దా వచ్చు
సకలకార్యము ది గ్విజయ మాయె ననుచు
ముదము రంజిల్ల న మ్ముదితలఁ జూచి
సుదతులార వినుండు శుభదమై నట్టి
వెంకటాచలమె నా వీడు దలంప
వేంకటేశ్వరుఁడె మా విభుఁడు నన్ వకుళ
మాలిక యండ్రు మీ మహిపాలు రాణి
మ్రోలఁ బ్రయోజనంబులు గల్గి యునికి 800
నారాయణపురంబునకు వచ్చుదాన
నా రాజపత్నిని యందు గన్గొనఁగ
నగు నుపాయముఁ దెల్పుఁ డనిన నచ్చెలులు
మిగుల నాదరమున మేమె దోడ్కొనుచుఁ
జనియెద మది యట్టి సఖియతో విభుని
వనజాక్షి చెంతకు వచ్చుచుండంగఁ
నందుఁ బద్మిని విరహాగ్ని తాపమునఁ

పద్మావతి విరహవర్ణనము

గుందుచు కెంపెక్కు కన్గవ నశ్రు
లడర వెచ్చగఁ నూర్చి యుసురుసురనుచు
నుడుగక సల్పు శైత్యోపచారముల 810
నిదుఁ బ్రజ్వలింపగ నెడ హారమణులు


కడిమి చూర్ణముగాఁగఁ గమలనాళములు
చురచుర మాడంగ శూనంబు వెండి
సొరుగు గానంత మై జొబ్బిలిఁ జిలుకు
పన్నీరు జుయ్యంచు బలువేడి నిక్క
వెన్నెల కుల్కి కోవెల మ్రోత కలికి
యళికి చిల్కకుఁ దిగులంది లోఁ గుంది
మలయానిలమునకు మదిఁ దల్లడిల్లి
తనలోనఁ గనలంగఁ దల్లియు నల్ల
తనయఁ గాంచి కలంగి తారుచుండంగ 820

నారదుఁ దెఱుకత వేషమున వచ్చి యెఱుక చెప్పుట

నారదుఁ డప్పు డా నలినాక్షి విరహ
మారసి చెలిమనం బలరింపఁ దలఁచి
యొక యెఱుకతవేష మొంది పొందుగను
శుకమౌనివరుఁ గేల సుఖముగాఁ బూని
యయ్యెడఁ దనవీణ నాత్మజు గాఁగ
చయ్యన పయ్యదన్ జంక బిగించి
యిడి యొక్క జంక న య్యెరుకల బుట్ట
కడు సంకుగాజులు కరములఁ దాల్చి
దంతపుంగమ్మలు ధరియించి చెవుల
వింత మీరఁగ గురువిందదండలును 830
పాలపూసలు రాతిపగడముల్ గ్రుచ్చి
మేలుసరుల్ చాల మెడను సంధించి
వెదురు ముత్తెములు బర్వినఁ గుత్తికంఠి
కుదురుగాఁగై సేసి కొమరు మీరంగ
పురవీధి నింపుసొంపు రహింప నడచి


యెరుకెరుకో యవ్వ యెఱుక యో యవ్వ
కొల్లాపురము యెరుకులదాన నవ్వ
కల్లగా దిందుఁ దార్కాణ నా మాట
మొరిటెలలో నించి ముత్తెముల్ దెండు
బురకనికిని మంచి బువ్వఁ బె ట్టవ్వ 840
యను పల్కుల రవంబు లాలించి ధరణి
కనికరంబునఁ బిల్వఁగాఁబంచి దాని
మొరిటెలలో ముత్తెములు నించి యుంచి
విరిబోణికిని మేలు వివరించి మించి
యెఱుక దెల్పుమటంచు నెలమితో నడుగ
యెఱుకత కేల్మోడ్చి యెదను భావించి
చెంగల్వరాయ యో చెంచోబుళేశ
మంగళగిరినాథ మంగమ్మతాయి
గోవిందరాజ యో కొండలరాయ
వావిరి నిజమైన వా కియ్యఁగదవె 850
అని మ్రొక్కుకొనుచు నందందరిఁ బొగడి
కనువిచ్చి యయ్యింతిఁ గనుఁగొని పలికె
చేసూపవమ్మ నే సెప్పుదు యెఱుక
వాసిమీరఁగ నాదు వాక్కు, నిక్కంబు
వెలఁదికి నే మింత వెత యంచు మదిని
దలఁచి యడిగెద వవ్వ తగ మేలుఁ గలుగు
మగువకు నల్లని మగవాని మీఁదఁ
దగిలిన మరులచేఁ దాపంబు వొడమె
అలయకు మిప్పుడే యా వన్నె కాని
చెలిమిఁ దెల్పఁగ నొక్క చెలియ రాఁగలదు 860


ఎఱుకత యొక చిలుకనిచ్చి చనుట

చిలుకలకొలికి యీ చిలుకఁగైకోవె
కలకదీరఁగ నిది కత లెన్నియైనఁ
దెలుపనేర్చును విభుఁ దెచ్చి కూర్చంగ
కలదంచు నొసఁగి యా కలికి కా చిలుక
నయ్యింతి కనుపించ కరిగిన భ్రమసి
యయ్యెడఁ జోద్యంబు నంది రందరును
అంతలోనే కాంత లవనీశురాణి
యంతఃపురము జేర నరుదెంచి తమరు
పోయివచ్చు తెరంగు పొసగఁ దెల్పుటయు
పాయనిప్రేమ న ప్పడతులఁ జూచి 870
సంతసం బెసఁగ నా జనపతి రాణి
వింతయై యున్నది వెలఁది యెందుండి
వచ్చె నం చడుగంగ వా రట్టి తెఱఁగు
లచ్చుపడగఁ దెల్ప నరసి యా దేవి
లేచి యా వకుళమాలిక నాదరించి
యాచోట మణికాంచనాసనంబునను
కూరిమిఁ గూర్చుండి కుశల మన్యోన్య
మారసి ముచ్చట లాడుచుండంగ

వకుళమాలిక ధారుణిదేవికిఁ దన వచ్చినకార్యం బెఱింగించుట

వకుళమాలికను భూవరురాణి పొగడి
యొకనాడు నిందు రా వువిదరో యిపుడు 880
వచ్చిన పని యేమి వాంఛితం బెద్ది
ఇచ్చెద నిపుడె నీ కెద శంకవలదు
నీవు రాగల్గుట నే ధన్యనైతి


పావనం బయ్యె నా భవనంబు నిపుడు
నావు డా నృపపల్ని నయభాషణముల
కేవల సంతోషకీలిత యగుచు
వరవర్ణిని వివేకవంతురాల వని
కరుణయు సత్యంబు కలదాన వనుచు
వినుతిసేయఁగ మున్ను విను నంతకన్న
కనులపండువు గాఁగఁ గననయ్యె నిపుడు890
నేను వచ్చిన పని నెమ్మితో వినుము
పూని యాకార్యంబు బొసగించ మేలు
శ్రీ వేంకటవిభుండు శ్రీనివాసుండు
తా వేఁటవచ్చి నీ తనయను జూచి
మే లొందె నతని కా మేలంత నొసఁగి
మేలొందు మీ బాల మేల్మి శ్రీదేవి
తానె యై విభు నురస్థలము కాపురము
నేనాడు విహరించు నెడలేని యట్టి
యానందరస మోలలాడంగ వచ్చు
భానువంశ్యుఁడు హిమభానువంశజను900
వరియింప సంబంధవైభవం బొప్పు
నరపాలుఁ డీవు బాంధవులు మంత్రులును
దెలియ వివారించి దేవాధిదెేవ
కలశాంబునిధికన్యకాభర్త నీకు
నల్లుఁడౌ తన భాగ్య మందగోరినను
తెల్లమి నాతోడఁ దెలివిడి సేసి
తడయక పెద్దల తగ వెంటఁగూర్చి
వడి నంపు మనుడు భూవరురాణి యలరి


నలరుబోణిరో భాగ్య మాయె మాయావి
యల వేంకటేశ్వరుఁ డనుచు న మ్మునులు910
బలుకంగఁ విందు న ప్పంకజాక్షుండు
నిలవరం బొప్ప మా నెలతుకఁ జెలిమిఁ
దలఁచునే యతనికిఁ దగునె మాకన్య
యలమేలుమంగ హృదంతరంబునను
నిలుకడ నుండి రానిచ్చునె యొరులఁ
దలఁపున నమ్మంగ తాళ దీమాట
యైనను నీవంటి యతిధన్యశీల
పూని పల్కినమాట బొంకగా దౌట
విన సంగతంబయ్యె వెస నారదుండు
మును దెల్పె వెన్నుఁ డీ ముదితఁ బెండ్లాడు920
ననుచు నా హరి వేంకటాధిపుం డగుట
విని యుందు నటుగాన విషయంబు లేదు
శ్రీకాంతుఁ డగు దెేవుఁ జెట్టబట్టంగ
మా కన్నె యెన్ని జన్ముములఁ దపంబు
సలిపెనో కాని నిశ్చయముగా నిట్టి
కులము ధన్యతజెందు గొబ్బున రాజు
కిదితెల్పివడి నిర్ణయించి యవ్వార్తఁ
బదపడి నీకుఁ దెల్సగ వత్తునుండు
మనుచు నా దొరసాని యరిగినన్ కన్య
విని యట్టి సంతోషవృత్తాంత మెల్ల930
చెక్కిళ్ళ పులకలు చిగురొత్తఁ జిత్త
మెక్కువ ముదమంద నెలమి నచ్చెలువ
నలమి కౌఁగిటఁ జేర్చి యాదరంబునను


చెలువుని సుద్దులు చెలఁగుచు నడుగ
తలచును సిగ్గునం దలవంచుకొనుచు
పొలతిరో మగుడ నెప్పుడుబోదు వూరి
కను నెఱుంగనియట్ల అమ్మ యే మనియె
నను రాజులును మంత్రులంగీకరించ
కేమందురో యని యెదలోనఁ గలఁగు
కామించి విభుఁడు మున్ కడువేఁడు నపుడె 940
కలయంగ లే నైతిగా యంచు సొలయు
సొలసి తా వెసనొందు సుద్దులు దెలుప
చిలుక నంపుదు నంచు చింతించి యింతి
చెలిమి న న్నెప్పుడు చిత్తంబునందు
తలఁతువో యిది జూచి తలచుకొమ్మనుచు
జిలుక నా విరిబోణి చేతికి నొసఁగె
అంతలో యద్దెవి యెరిగి వేరొక్క
యంతస్తున న్నిల్చి యాకాశవిభుని
అల మంత్రులను బిల్వనంపి యంతయును
తెలిపిన నా రాజు తెలివియు ముదము.950
 
దేవి యాకాశవిభునితోఁ దెలిపి ముహూర్తవిశ్చయము గావించుట

నచ్చెరువును హెచ్చ నంగీకరించి
మచ్చిక నిజబంధు మంత్రులతోడ
మంతనం బొనరించి మంచిలగ్నంబు
చింతితకల్యాణసిద్ధికి నరయ
ధరణీసురలఁ బిల్చు తఱి దెేవగురుఁడు
వరపురోహితరీతి వచ్చి పద్మినికి
శ్రీనివాసులకును జెలఁగు పొంతనము


లూనిన సిద్ధాంతయుక్తి నిర్ణయము
సేసి కన్యకు మృగశిర యౌట శ్రీని
వాసుల తార శ్రవణ మౌట యరసి 960
మాధవమాసంబె మహనీయమైన
మాధవోద్వాహకర్మమునఁ బ్రశస్త
ముత్తరఫల్గునియును దంపతులకు
నుత్తరోత్తరమహాభ్యుదయం బొనర్చు
గావున నత్తారకను మీనలగ్న
మా వివాహాక్రియ కగునంచుఁ దెలుప
వారెల్ల హర్షి౦చి వకుళమాలికెకుఁ
గూరిమి మీఱంగ కోకలు మణులు
ఘనభూషలును గంధకస్తూరికలును
తనరు తాంబూలముల్‌ దగు మున్నొసంగి970
దేవున కీలగ్న దినములు దెల్పి
కావించు మిచ్చట కల్యాణ మనుచు
తరుణీమణినిఁ బంపి తన రాజధాని
కరము రంజిలు నలంకార మొనర్ప
నధికారుల నృపాలుఁ డప్పుడే పనిచె
నధికసన్మతిఁ దూతి యలరుచు నడచె
అప్పు డా కింకరు లధిపతియాజ్ఞ

పురాల౦కరణము

చొప్పునఁ బురమెల్ల శోభిల్ల మిగుల
చంద్రకాంతనిశాంతసంతానదాంత
చంద్రశాలారత్నసౌధజాతములు 980
కాంచనమేరువుల్‌ కాయమానములు


ప్రాంచితస్థిరతరరథనికాయములు
విడుదుల కొప్పుఁగా వేవేలు బన్ని
కడిమి హొంబట్టు మేల్కట్టులు గట్టి,
కలిత పాంచాలికా గణము రంజిల్ల
విలసదాస్థానికావితతి గైసేసి
ప్రతిగృహంబును సుధాభరములఁ దీర్చి
ప్రతివీథి నురుచిత్రపటములు బూన్చి
వరున నవ్వీథుల ధ్వజముల్‌ ఘటించి
కరమొప్ప ధ్వజముల ఘంటల్‌ బిగించి 990
ఘంటల పావడల్‌ గదియ సంధించి
జంటగా తోరణసరులు గీలించి
పడితోరణాలు మువ్వలు తగు ల్కొల్పి
యెడల నద్దపుబిళ్ళ లెనయించి మెఱయ
నందందు చందువ లందందు మీఱ
క్రందుగా విరిచప్పరంబు లమర్చి
గోపురోజ్వలశాతకుంభకుంభములు
గోపురాంభోరుహకోటుల నలర
రంగొంద రాజిలు రాజవీథికల
శృంగార మొనరించి చెలఁగ నెల్లెడను1000
పన్నీరు జిల్కి రంభాస్తంభపాళి
వన్నెమీరఁగ గ్రుహద్వారాళి నిలిపి
లలితవైఖరుల నలంకరించి రటు
పొలుపుదీపించి యప్పురలక్ష్మి యంత
నమరావతిని గెల్చి యలక నదల్చి
యమరు బల్కొమరు బెంపలర రాణించె


అయ్యెడ నా దూతి వాహయముమైపై నెక్కి
చయ్యన చని చని సంభ్రమంబులను
శ్రీవేంటాచలశిఖరంబుఁ జేరి
దేవునిఁ బొడగాంచి తెరవ యొసంగు1010
చిలుకను జూపి యచ్చెలువ దెేవరకు
నలువున మనవి విన్నపము సేయంగఁ
బనిచె దీనినటంచు పలికె వెండియును
తన దూతకృత్యంబు ధరణి పల్కులును
రాజుతాత్పర్య మా రాజాస్య వలపు
రాజితలగ్ననిర్ణయమును దెలుప
విని మోద ముప్పొంగ వేంకటేశ్వరుఁడు
కనికరంబునఁ దూతిఁ గౌగిట జేర్చి
రాచిల్క చెలిమతో రంజిల్లు కరుణఁ
జూచిన కేల్మోడ్చి శుక మిట్టు లనియె1020

పద్మినిపంపిన చిలుక స్వామితో చేయు విన్నపము

దెేవాధిదెేవ! యోదీనమందార!
భావజజనక! స్వభాపకారుణిక!
విను పద్మినీకాంత విన్నపం బెల్ల
నిను విరిదోటలో నెమ్మి కన్గొనిన
యదిమొదల్‌ నా మనం బంటి నీయందె
కుదురుకొన్నది నీదు గుణబాళి మరగి
నను జూరరాదయ్యె నలినాక్షి యనియె
మనసున జనియించు మరుఁడు పల్మరును
మరులుబుట్టించి యామరని బీరమున
మరల బల్‌ కాక ముమ్మరముగా నిచ్చి1030


యలయించఁ బూనె నీ యాత్మజుం డగుట
కలకఁ బుట్టించె నోకరుణాబ్ధి యనియె
మొమొటము దొరంగి మొనసి యాచంద
మామ వెన్నెలచిచ్చు మైనిఁ జల్లుచును
నీ మోముగోముఁ జెందిన గర్వమునను
బాములఁ బెట్టెదో పరమాత్మ యనియె
నీవు దొంగతనంబు నేర్చినాధైర్య
మీవగ హరియించె దింతయుఁగాక
కనుగూర్చినంత నన్ గదియంగ వచ్చి
కనఁబడకనే డాగి గాసిబెట్టుచును1041
జాపుజూపులను వంచనఁజేసె దించ
రాపోర్వఁజాల నోప్రాణేశ యనియె
నన్నేలుకోవె పన్నగశాయి యనియె
జన్నెపట్టితి నీకు జగదీశ యనియె
అనవు డా శ్రీ వేంకటాచలవిభుఁడు
మనమున మరులుగ్రమ్మఁగ నెమ్మొగమునఁ
జెలిమియున్ చిఱునవ్వు జిందులు ద్రొక్క
కులుకుచూపులుఁ దయం కొమరొంద చిలుక
నెంతయు మన్నించి యింపు దీపింప
ఇంతికి నానవా లెద నంటి పొదలు.1050

పద్మిని తులసీదామము వానవాలుగా బంపుట

తులసికాదాముంబు తుదలేని రత్న
కలిత మాలికె యిచ్చుకరణి నొసంగి
వేగ వచ్చెద నని వివరించు మనుచు
బాగుగాఁ బుత్తెంచ పనిఁబూని మ్రొక్కి


యా శుక మాక్షణం బాకాశవీథి
యాశుఁగ రయమున నరిగి యా కన్య
కరవిందలోచను కంతరంగంబు
కరుణయు మధురవాక్యము నెఱింగించి
యత డిచ్చు కస్తూరికాంచితదామ
మతులితామోాదంబు లలరంగ నొసగె 1060
నొసగిన నా బాల యున్నతానంద
మెసఁగఁ జేకొని దాని నెంతయుఁ బాళి
గులుకుకన్నుల నొత్తుకొను నెద నుంచు
మొలకచన్నులఁ బూన్చు ముద్దుగా మెడను
ధరియించు వెండియు దనమౌళిఁ దాల్చుఁ
గరమొప్ప మొగమునఁ గదియించుకొనుచు
మరియు నాథుఁడె కాఁగ మదినిభావించి
పొరిఁ గౌఁగలించు వే పొాలయల్క సొలయు
కొసరును వెస దూరుకొను నిట్లు తమిని
బిసజాక్షి భ్రమయుచుఁ బెలుచనే తెలివిఁ 1070
జిలుకచెలినిఁ బిల్చి చెలఁగుచు నిల్చి
యలరుచుఁ బలుమాఱు నల సుద్దు లడుగు
గడుమనోరథమునఁ గాంతునిఁ గలిసి
కడలేని సరససౌఖ్యము లందుచుండు
అయ్యవసరమునం దా వెన్నుఁ డెదను
తొయ్యలిపై మరుల్‌ త్రోద్రోపు లాడ
కడలేని తమకంబుఁ గడు ముమ్మరముగ
నడరంగ నెంతయు నంతరంగమున
నెప్పుఁ డెప్పుడు సారసేక్షణం జూతు


వెన్నుని వివాహసన్నాహము

నెప్పుడు కల్యాణ మెసఁగ జేకొందు1080
నను తత్తరంబున నా సైన్యవిభునిఁ
గనుఁగొని చెల్మిఁ బొంగఁగ జేరఁబిలిచి
అమరగంధర్వయక్షాదికిన్నరుల
కమలజు హరిని దిక్పతుల రావించి
చీటిఁ బంపు మటంచు సెలవిచ్చి భక్త
కోటికి శుభయాత్రకును బయనంబు
తెలియఁ జాటింపించి తెరవలు వినఁగ
అలవేలుమంగకు నట్టి వృత్తాంత
మంతయుఁ దెలిపిన న ద్దెేవి యలరి

అలమేల్‌మంగ శ్రీవివాసునకుఁ దలయంటుట

కాంతుని కపుడ శింగారం బెసంగ1090
బంగారుగిన్నె సంపఁగినూనెఁ దెచ్చి
మాంగల్యవాద్యముల్‌ మలసి మ్రోయంగఁ
దగిన పేరంటాండ్రు ధవళముల్‌ బాదడ
సనగుణకాముని సతుల్‌ సొరిది సేస లిడ
కులుకుచుఁ దానె కుంకుమగంధములను
నలుగులుఁబెట్టి తిన్నగఁ దాళగతులఁ
గంకణంబులు ఘల్లు ఘల్లనఁ గాంచి
కింకిణుల్‌ మొరయుచు కెరలి నటింప
జిగి పిరుందున వేణి చిందులు ద్రొక్క
వగ మీఁది హారముల్‌ వరుస నాడంగ1110
ముంగరముత్యంబు మోవి నర్తింప
ముంగురులును ఫాలమునఁ దాండవింప


చిరుచెమటలు మేనఁ జెలువుఁ గుల్కంగ
హరువుగాఁ దలయంటె నద్భుతలీల
అటుల నూనియ యంటి యలమేలుమంగ
చటులత ధాత్రిగాఁ జంబీరజాతి
ఫలసారములు గంధపటవాసకములు
నలఁది యామోదించు నాకాశగంగ

స్వామి నలంకరించుట

జలములు జలకంబు సదగ నాడించి
చలువను తడయొత్తి చక్కని కురుల.1110
రంగొంద నొసగి సామ్రాణిధూపంబు
శృంగారమొసగంగ సిగవైచి మెరుగు
బంగారుదుప్పటి బాగుగాఁ గట్టి
అంగరాగ మొనర్చి హరిచందనముల
పైఁ బచ్చికస్తూరి పట్టెలుఁ దీర్చి
నయమొప్ప కప్రపునామంబు దిద్ది
మగరాల నిగ మించు మంజీరములును
ధగధగ మౌక్తికోదగ్ర మేఖలలు
నవపద్మరాగసంతతకంకణములు
నవకం బెసంగు తిన్నని యుంగరములు1120
హరువైన పచ్చని యంగదంబులును
మురువైన మురువులు ముంగామురములు
నవరత్నపతకముల్‌ నవ్యహారములు
వివిధేంద్రనీలపు విడి నేవళములు
భువనమోహనము లౌ బుజకీర్తికలును
నవరణవైదూర్యచయ కంఠసరులు


మకరకుండలములు మాణిక్యఖచిత
మకుటంబు తగఁ బూన్చి మందారవికచ
దామముల్‌ కైసెసి తామరుల్‌మీఁద?
రామాభిరాముఁడై రంజిల్ల విభుని.1130
యగణితసౌందర్య మరసి చెక్కిటను
సొగసుగాఁ గస్తూరిచుక్క బొట్టిడియు
మరియొక్క కొమ్మ హుర్మంజి ముత్యములు
నెరయు బాశికము వన్నియ మీరఁగట్టి
వాణి శర్వాణి గీర్వాణేంద్రసతియు
నాణెంబుగా నల్ల నారాయణునకు
వేరువేరుగ భక్తి వెలయ గర్పుార
హారతు లెత్తి రయ్యంబుజాక్షునకు
నాదరంబున సూవె నందం బొకర్తు
పాదుకల్‌ దొడిగించె పడతి వేరొకతె.1140
చామర లమర కంజాతాక్షు లిడిరి
కోమలి యొకతె చేకొనె రంగు హరిగె
కొంద ఱూడిగములు కొమరొందఁజేసి
రందు కొందఱు బెత్తు లంది బారిడిరి
సేనాధినాథుండు సిద్దగంధర్వ
సైనికవరులతో సన్నద్ధుఁ డగుచు
సందడింపఁగ పక్షిసార్వభౌముడును
క్రందుగాఁ జెలువొంది రాజవాహ్యమయె
నచ్చరల్‌ నర్తించి రచ్చెరు వెచ్చ
విచ్చలవిడి పుష్పవృష్టియుఁ దనరె.1150
అంతనా బ్రహ్మాదు లందఱు నందు


సంతోష మెసఁగంగఁ జనుజెంచి వేగ
శ్రీనివాసుల కింపు చెలగు వస్తువులు
కానుక లొనరించి క్రమమునం గొలువ
దెేవదుందుభులును ధృతిమీర మొరయ

వైనతేయుపై నెక్కివచ్చుట

నా వైనతేయుపై నలరుచు నెక్కి
యలమేలుమంగ నిజాంకపాళికను
చెలిమి నుంచుక వేగ శ్రీవేంకటేశుఁ
డరుగుచుండఁగ విని యాకాశవిభుఁడు
గురుపురోహిత బంధుకోటులతోడ. {{float right|1160 }

అకాశవిభుని యెదుర్కొలు

దూరం బెదుర్కొని తోడ్కొని తెచ్చి
స్ఫారరత్నోన్నత ప్రాసాద మొకటి
విడిపట్టు గావింప విచ్చేసి యందు
కడు నా విభుం డిచ్చు కానుక లంటి
నారాయణపురంబునన్ రాజగృహము
జేరంగం బద్మినిఁ జేకొను తమిని

రాజమార్గంబుననే స్వామినిజూచుటకు పౌరాంగనలయుత్సాహము

యారాజమార్గంబు నం దా మురారి
భూరివైభవము లుప్పొంగ నేగంగఁ
బౌరాంగనామణుల్‌ బాళి నాదెేవు
కూరిమిందిలకించుకోరికె మీరి. 1170
లలిమించ తమ మే నలంకరించంగ
నలరి కరంబులన్ హంసకంబు లిడి


కడిమిని కాళ్ళఁ గంకణములు బెట్టి
నడుమున తీఁగె కంధరనొడాణంబు?
వ్రేళ్ళ మెట్టెలు బూన్చి వెస నుంగరములు
లోలత చరణాంగుళుల పొసఁగించి
చిల్లలసరిపెణుల్‌ పిరుదుపైఁ దాల్చి
అల్ల మేఖల గుబ్బలందు సంధించి
కదియించి మల్లెమొగ్గల దండ లెదను
పొదలు కీల్జెడ హారములును గైసేసి.1180
కన్నులఁ గస్తూరికారేఖఁ దీర్చి
తిన్నగాఁ గాటుక తిలకంబు దిద్ది
తడవాటు మీరంగ దత్తరంబునను
పొడవైన మేడల పూనికమీఱ
సోపానములవెంట సొలసి యొండొరులు
త్రోపునూకుల నెక్కి తొలగక నిక్కి
యల గవాక్షంబుల నాననాబ్జములు
నిలిపి కన్నులతేట ని గ్గగ్గళింప
బారుగా నమ్ముఖపంక్తు లిరుగడల
సౌరగంగాంబుజ చయశంక నెరప. 1190
తమకటాక్షద్యుతుల్‌ ధారగా నిగుడి
రమణఁ గలువలతోరణములై మెఱయఁ
దిలకించి వేంకటాధీశు సోయగముఁ
బులకించి మైవలపునఁ జొక్కువారు
పరమాత్ముఁడితఁ డంచు భావించి యెదల
మెరసినభక్తి నర్మిలి మ్రొక్కువారు
ఇతఁడెకా యెడబాయ కిందరిఁ జెందు


చతురుఁ డటంచు విస్మయ మొందువారు
తిరుములకొండ నీ దేవుఁ డిష్టములు
కరమిచ్చు నని కోరికలు జెందువారు.1200
అలమడే నన్నని యాస రెట్టింప
సొలపు మించఁగ సొగసులు గుల్కువారు
ఇల నీత నర్చింతు మిపుడైన ననుచు
పొలుపొందు తమిఁ బుష్పములు జిల్కువారు
సేవింప నెలమి రంజిలు కటాక్షముల
నా వనితలకు భాగ్యము లొసంగుచును
చని వేగ నా రాజసదనంబునందు
వినతుఁడై కల్యాణవేదిఁ గూర్చుండె

పద్మావతిని చెలులుపెండ్లి కూతుగాఁగై సేయుట

అపుడా నృపాత్మజ కభ్యంజనంబు
చపలాక్షు లొనరించి జలకంబు దీర్చి 1210
సరిగంచు చెంగావి చక్కఁగా గట్టి
మురువొంద రవికెయు ముద్దుఁగాఁ దొడిఁగి
జడయల్లి క్రొవ్విరి సరులును జుట్టి
కడువేడ్కగాఁ దిలకంబును బెట్టి
పంజులకమ్మలు బవిరెలు సరులు
రంజల్లు కంకణ రత్నమేఖలలు
బంగరొడ్డాణంబు బన్నసరములు
ముంగామురలు రత్నముద్రితోర్మికలు
పొందైన కుతికంఠి భూరిహారములు
సందిదండలు కంఠసరులు తాళీలు.1220
ముంగరముత్యంబు మురువుబావ్లీలు


రంగొంద నివిమొదల్ రత్నభూషణము
లన్నియు వరుసగా నమరఁ గై సేయ
కన్నెకుఁ గొందఱు కమలలోచనలు
కలపంబు నలఁది శింగారం బెసంగ
తొలకరి క్రొమ్మించుతోఁ దులతూగుఁ
మెయినిగ్గుజగ్గున మించి రాణించ
ప్రియుని మోహింపించు బిరుదు చందమున
నెలవంక లిరువంక నీటు వాటిల్ల
పొలుపొందు బాసికంబును గట్టి రంత. 1230
కమలసంభవుఁడు వెంకటనాథుచేత
నమితగోదానంబు లాచరింపించి
యా రాజవిభుఁ జూచి యధిప లగ్నంబు
చేరిక యయ్యె న చ్చెలువ రావించి
పురుషోత్తమునకు నింపుగ దారబోసి
పరమకృతార్థతం బరగు మి వ్వేళ
తడయనేటికి నన ధరణీవిభుండు
వడిఁ గన్యఁ బిలిపించి వరునిపీఠమున

పద్మావతీ వివాహవర్ణనము.

నునిచినన్ వైఖానసోక్తక్రమమునఁ
బనుపడి యా బృహస్పతి రమాపతికి, 1240
ప్రతిసరకంకణ బంధపూర్వముగ
వితతాంకురార్పణవిధి సల్ప మునులు
పుణ్యాహవాచనంబు లొనర్చి సూత్ర
గణ్యరీతిగను సంకల్పంబు దెల్ప
మధుకైటభారికి మధుపర్క మొసఁగి


పృథివీశుఁ డల కన్య పెనుపొంద తెరను
నిలిపిన వెన్నుండు నెమ్మితో కొమ్మ
తిలకించి ముదముజెంది చెలంగునవుడు
శ్రీనివాసునకు మున్ శ్రీదేవి నబ్ధి
పూని భక్తిని దారబోసినయటుల. 1250
ధరణీధరునకు నా ధరణీవిభుండు
ధరణీకుమారి నత్తరి దారవోసె
భువనైకదాతయై పొలయు శ్రీవిభుఁడు
యవనిజకై దాన మంది కేల్చాచె
వాణీశమతమున వనజాక్షి నతఁడు
పాణిగ్రహముసేసె బాళిఁ జేకొనుట
అంగనామణికిఁ గంఠాభరణముగ
మాంగల్యసూత్రంబు మమతసంధించె
దేవవాద్యము మ్రోసె దివి పుష్పవృష్టి
భూవలయము నిండఁ బొలుపొందఁ గురిసె. 1260
పాడిరి గంధర్వభామ లచ్చరలు
నాడిరి ముదమున నలరె లోకములు
అయ్యెడ దంపతు లన్యోన్య మెలమిఁ

తలంబ్రాలు.

జయ్యన తలిబ్రాలు సవరించినంత
జగతీజనములకు సంసారపుముడి
తగిలించిపెట్టిన తనకు నా జనులు
వీడుకువీడుగా వెలయఁ గొంగుముడి
వోడక పెట్టిరి యొగి దంపతులకు
తేజంబుగా నగ్నిదేవుం డెసంగ


లాజహోమము

లాజహోమంబు లీలగ సల్పి రపుడు. 1270
పదములుమూటి కొప్పని వాఁడు సప్త
పదములు నడిపించె భామలలామ

అరుంధతీ దర్శనము

తరుణికి నా యరుంధతి జూపె శౌరి
కరుణఁ జూడంగ తగరె పతివ్రతలు

స్త్రీలపాటలు

మరివధూవరులను మణిపీఠి నునిచి
తరుణులు కొందఱు ధవళముల్ బాడ
జయమంగళము జగజ్జనని యౌ సతికి
జయమంగళము జగజ్జనకు డౌ హరికి
జయజయ పద్మిని జలజాయతాక్షి
జయజయ పద్మాప్త జలజాతనాభ. 1280
మంగళం బలమేలుమంగమ్మ కెపుడు
మంగళం బహిరాజమహిభృద్విభునకు
ననుచు పాటలు పాడి హారతు లెత్తి
రనుపమాంగులు హరి కబ్జమందిరకు
అంత సాంగముగాగ నంతయు సల్పి
కాంతయు దాను నుత్కలిక మీరంగ
నూరేగి యందఱి కుడుగర లొసఁగి
సారకాశ్మీరరసముల వసంత
మెసఁగ చల్లాడి య య్యిందఱఁ గూడి
బిసజాక్షి తనుగొల్వ ప్రియమొంది బువ్వ 1290
మారగించి చతుర్ముఖాదులు వొగడ


నా రాజశేఖరుం డరణమ్ము గాఁగ
వారణస్యందనవాజిరత్నములు
భూరిభూషాంబరంబులు నొసగంగ

శ్రీనివాసులు పద్మినితో వెంకటాద్రిని గృహప్రవేశముచేయుట

సకలసంభ్రమము లెసంగ బంగారు
చికిలిపల్లకులపై చెలువ లేతేర
నరగజంబులు వేణునాగస్వరములు
మురువందు చెంగులు ముఖవీణియలును
స్వరమండలములు రావణహస్తవీణ
లొరపైన తంబుర లురుమర్దళములు 1300
డక్కలు గిడిబిడల్ డమురుగంబులును
అక్కని వీరణాల్ చక్రవాద్యములు
తాళముల్ గజ్జ లింతయు సరిగాఁగ
మేళవించిన రక్తి మిగుల రాణించు
లలితగంధర్వమేళముచెంత వింత
గులుకంగ ముందర గోముఖ శంఖ
కాహళకాది భాంకారంబు దిక్స
మూహాంతజంతుల మోహింపఁజేయ
విడిదిచెంతను మామ వీడ్కొని గరుడుఁ
గడువేడ్క నెక్కి ముక్కంటియు నలువ. 1310
ఇరుదండ చామర లింపుగా వీవ
సురభామినులు పూల సురటీలు విసర
ఫణిరాజు ముక్తాతపత్రంబు బూన
మణివేత్రములు దాల్చి మరి సైన్యపతులు
భటసంఘములు బరాబరిచేసి నడవ


పటుగీతి నారదపర్వతుల్ బొగడ
విస్తృతాగమముల వివిధసంయములు
స్వస్తివాచనములు సలుపుచు నడర
రాజవైఖరి నేగి రహి వేంకటాద్రి
రాజిల్లు నిజమందిరము ప్రవేశించి 1320
చింతామణీ చిత్రసింహాసనమున
కాంతామణులుఁ దాను గరిమఁ గూర్చుండి
విధిశంకరేంద్రాదివిబుధుల మునుల
నధికసన్మతిచేసి యనిచి భక్తులకు
కామితార్థములెల్ల కరుణ నిచ్చుచును
శ్రీమించి విహరించె శ్రీనివాసుండు,
ఈగతిం బద్మిని నిందిరావిభుఁడు
బాగుగాఁ బెండ్లాడు పావనకథను
నిజభ క్తిఁ జదివిన నెమ్మితో వినినఁ
బ్రజలకుఁ గల్యాణ భాగ్యసంపదలు 1330
పొదలు సామ్రాజ్యంబు భోగమోక్షములు
కుదురుగ లభియించు గోరిన ట్లెల్ల
అని విచిత్రార్ధసమర్ధనాకలిత
ఘనసర్గవిశ్రుతకవిముఖ్యు పేర
విపులానుభావభావితసంవిధాన
కపటనాటక జగత్కారణుపేర
భాసురాంగశ్రుతి భారతిభవ్య
లాసికాగీత విలాసునిపేర
తారకాంతక పితృద్వంద్వాన్వధీత
తారకమంత్రాభిధానునిపేర. 1340


ప్రత్యాహృతోత్తరాపత్యచైతన్య
సత్యనిత్యబ్రహ్మచర్యునిపేర
క్షీరపారావార శీకరాసార
పూరితనిజముఖాంభోజునిపేర
పావనభక్తాప్తబంధునిపేర
గోవిందరాజముకుందునిపేర
శ్రేష్ఠలూరన్వయశ్రేష్ఠశీలుండు
ప్రేష్ఠమహాయశశ్రీధురీణుండు
గోత్రభారద్వాజ గోత్రవర్ధనుఁడు
సూత్రుడాపస్తంభసూత్రానువర్తి 1350
అష్టభాషాకవిత్వార్జితప్రోద్య
దష్టావధాన విఖ్యాతబైరుదుడు
శ్రీకృష్ణయార్యలక్ష్మీగర్భవార్ధి
రాకాసుధానిధి రాజపూజితుఁడు
వివిధవిద్యాశాలివెంకటార్యుండు
సవరించు శ్రీనివాసవిలాసమునను
హరువొందునిది పంచమాశ్వాసమగుచు
ధరఁబొల్చు నాచంద్రతారకంబుగను

పంచమాశ్వాసము. సంపూర్ణము.



____________
  1. "హితమపేరౌజ " అని. వ్రా. ప్ర. పాఠము.
  2. వ్రా. ప్ర. పాఠము. " యాశించితే నుండు"