శృంగారశాకుంతలము/తొలిపలుకు
తొలిపలుకు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు శ్రీ యం. ఆర్ . అప్పారావుగారు చేసిన సూచన ననుసరించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తెలుగుభాషలోని ప్రాచీన సాహిత్యము అందరికి అందుబాటులో నుండునట్లుగా ముద్రించి ప్రకటించవలెనని నిశ్చయించినది. తెలుగుభాషలోని పూర్వగ్రంథ సముదాయము ఈనాడు పాఠకునికి సక్రమముగా సరసమైనధరకు లభ్యమగుట లేదు. ఈ లోటును తీర్చి ప్రాచీనగ్రంథసంచయమును విడివిడిగా ప్రకటించుటకు సాహిత్య అకాడమీ, ఒక ప్రణాళికను సిద్ధము చేసినది. ఈ ప్రణాళిక ప్రకారము ఈకార్యక్రమము మూడు తరగతులుగా విభజించనైనది. మొదటిది ప్రాచీన ప్రబంధాల ప్రకటన; రెండవది మహాభారతము, భాగవతము, హరివంశము, భాస్కరరామాయణము, బసవపురాణము, భోజరాజియములను సంగ్రహించి ప్రకటించుట; మూడవది భారతభాగవతాలనుండియు, నాచన సోమన, కంకంటి పాపరాజు, కూచిమంచి తిమ్మకవి రచనలనుండియు భాగాలను ఏర్చి కూర్చి ప్రకటించుట. మొదటి తరగతిలో 27 ప్రబంధాలను 27 సంపుటాలుగా, రెండవ తరగతిలోని గ్రంథములను 15 సంపుటాలుగా, మూడవ తరగతిలోని గ్రంథాలను 8 సంపుటాలుగా మొత్తము 50 సంపుటాలను ప్రకటించు కార్యక్రమము స్వీకరించవలెనని అకాడమీ తీర్మానించినది.
ఈ ప్రణాళిక ప్రకారము ప్రతి సంపుటము 1/8 డెమ్మీ సైజులో క్యాలికో బైండుతో 200 పేజీల గ్రంథముగా నుండవలెనని నిర్ణయించనై నది. ప్రతిగ్రంథములో గ్రంథకర్తనుగూర్చి, గ్రంథ ప్రాశస్త్యమును గూర్చి వివరించు సుమారు 40 పేజీల పీఠికను చేర్చ వలెనని నిశ్చయించనై నది. ప్రతి సంపుటము వెల ఒక రూపాయి మాత్రమే. ఈ విధముగా యీ సంపుటాలన్నిటిని సుమారు 5 సంవత్సరముల కాలములో ముద్రించి ప్రకటించవలెనని అకాడమీ కార్య వర్గము తీర్మానించినది.
మేము కోరినంతనే ఈ సంపుటము సిద్ధముచేయు బాధ్యతను స్వీకరించి, నిర్ణయించిన గడువులోపల వ్రాత ప్రతిని మాకార్యాలయానికి అంద జేసిన శ్రీమతి నాయని కృష్ణకుమారిగారికి అకాడమీ పక్షాన కృతజ్ఞతలు.
పైన పేర్కొనిన 50 సంపుటాల వ్రాత ప్రతులను సిద్ధము చేసి ముద్రించుటకు, అవసరమైన డబ్బును పూర్తిగా అకాడమీకి యిచ్చుటకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానము గావించి యిందులో కొంత డబ్బును విడుదలకూడ చేసినవి. ఇందుకు అకాడమీపక్షాన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. అనుకొనిన వ్యవధిలో సంపుటాలను సిద్ధముచేసి, ఆంధ్రపాఠకలోకానికి అందజేయుట జరుగగలదని విశ్వసించుచున్నాము.
హైదరాబాదు,
15.5.1967.
దేవులపల్లి రామానుజరావు,
కార్యదర్శి