శృంగారశాకుంతలము/తృతీయాశ్వాసము
శృంగారశాకుంతలము
తృతీయాశ్వాసము
శ్రీకర పతిహిత కార్యని
శాకరసౌందర్య బంధుసత్కవిజనప
ద్మాకరసూర్య పయోర
త్నాకరగాంభీర్య వెన్నయ ప్రభువర్యా!1
క. దిననాథుం డుదయించిన
జననాథుం డుచితభంగి సంధ్యావిధు లె
ల్లను దీర్చియున్న సమయం
బున సేనావిభుఁడు వచ్చి ముకుళితకరుఁడై.2
గీ. తోఁట కొల్లాడఁ బోయిన తోఁడిసములు
నేటివేఁటకు మృగములు గాట మనుచు
వేడ్కతో వచ్చియున్నారు వేఁటకాండ్రు
వేగ విచ్చేయుఁ డనినఁ బృథ్వీవిభుండు.3
సీ. కొమ్ముల నుదకంబు గోరాడి [1]వేఁజల్లు
కలఁచి క్రీడింపనీ కాసరములు
దంష్ట్రాంకురముల ముస్తలు త్రవ్వి భుజియించి
[2]సుఖవృత్తి నుండనీ సూకరములు
గడుపార మేసి మ్రాన్గను సేసి [3]నీడల
నెమరు వెట్టుచు నుండనీ మృగములు
నిష్ఠురజ్యాబంధనిర్బంధమునఁ బాసి
గవిసెన నుండనీ కార్ముకంబు
తే. వలలు, బోనులుఁ గౌలేయకులము, మగుడఁ
బట్టణమునకు సకలంబు వెట్టి యనుపు,
పనుపు మృగయులఁ దమతమ పల్లియలకుఁ
జాలు మృగయావిహారవిశ్రామసుఖము.4
గీ. ఆశ్రమాంతికమున వేట యనుచితంబు
నేము నేఁడును ఱేపును నిచట నిలిచి
మునులఁ బొడగని వారల ననునయించి
పిదపఁ బురి కేఁగుదెంచు టభ్యుదయకరము.5
వ. ఏ మిక్కడ నుండు దివసంబుల నాశ్రమంబులకు రాయిడి గాకుండ
మదీయస్యందనంబును, సారథియు, నీవు, మాండవ్యుండును, గతిపయాప్త
పరిజనంబునుం దక్క, దక్కిన శతాంగమాతంగతురంగపదాతి
వర్గంబు దుర్గంబున కనుపు మనిన నతండును నట్ల కావించె. ఇట్లు సకల
సైన్యంబునుం గరిపురి కనిచిన నారాజోత్తముండు చిత్తంబు శకుంతలా
యత్తంబు చేసి ఱిత్తమాటల మాండవ్యసేనాపతులతోడ నేమేనిఁ బ్రసం
గంబు జరుపుచునుండె నయ్యవసరంబున.6
గీ. వరతపోధను లిద్ద ఱం దరుగుదెంచి
సవినయంబుగఁ గృతనమస్కారుఁడైన
ధరణిపతి మౌళి మంత్రాక్షతములు పెట్టి
వరుస నాసీనులై మృదువాక్యములను.7
మ. అతిరాత్రం బను పేరిట న్మఘము సేయం బూని కణ్వాశ్రమం
బు తపస్వు ల్భవదంతికంబునకు మమ్ముం బెట్టి పుత్తేర వ
చ్చితి మిచ్చోటికి నుల్లసద్విజయలక్ష్మీశాలి వచ్చోటికిం
గ్రతుసంరక్షణ యొనర్ప [4]రావలయు నక్షత్రేశవంశాగ్రణీ!8
మత్తకోకిల. జంభశాత్రవతుల్యవైభవ, చక్రవాళబహిస్తమ
స్తంభనక్షమకీర్తివల్లభ, చానవాహితఘోణిరా
ట్కుంభికుండలిరాజ కచ్ఛప కుంభినీధరబంధుదో
స్తంభసంభృతభూమిమండల, సంగరోరగకుండలా.9
క. బాణాసనబాణతను
త్రాణకృపాణములతో రథస్థుఁడ వై, నీ
వేణాంకకులజ! రాదగుఁ
[5]గౌణపదుర్జనులు గలరు క్రతువిఘ్నకరుల్.10
క. [6]అనవుడు నట్టే కాకని
జనపతి యమ్మౌనివరుల సన్మానముతో
ననిచి రణోచతపటుసా
ధనసంపద సొంపుగా రథస్థుం డగుచున్.11
వ. పచేళిమంబు లగు పనస, సహకార, నారికేళ, ఖర్జూర, జంబూ, జంబీర,
రంభా, కపిత్థ, కర్కంధూ, తిందుక సౌగంధికాది సుగంధబంధురఫలంబు
లును, నొడిపి ప్రాలు, దూసరిబియ్యంబు, నివ్వరివడ్లు, గునుకు, లూద
లాదిగాఁ గలుగు వన్యధాన్యంబులు, ముడియలం, గావళ్ళం పెట్టించు
కొని కదలి కదలికా, చందన, స్యందన, మరువకా, గరు, కురవకా,
గోక, పూగ, పున్నాగ, భూర్జ, ఖర్జూర, సర్జ, కార్జున, శిగ్రు, న్యగ్రోధ ,
గుగ్గులు, మధూక, వ్యాధ, కింశుక, ఇంగువ, చూత, జంబీరో, దుంబర,
కదంబ, వంజుల, కుంజరాశన, కరంజ, భల్లాతకీ, సల్లకీ, చిరబిల్వ, బిల్వ
ప్రముఖ, వివిధ, విటపికోటరక్రోడక్రీడాచిక్రోడ, కంక, కలవింక, కంపి
జల, ఖంజరిట, కపోత, పారావత, శారికా, శుక, పిక, శిఖాతళావళి
ముఖరితం బగు వనంబునం బ్రవేశించి, యతిచపలవిపులకపిలంఘనంబులం,
గరువలితాకులం బాయక రాలు పండ్ల నవిసి తొరఁగు ననేకవిధ
స్వాదురసంబులు పెనువఱదలై పండి పగిలిన కాననేక్షు దండ ప్రకాండం
బులం బర్వ నిర్ముక్తంబు లగు ముక్తాఫలరాసులపైఁ బొరలిచి [7]పరవం
దామ్రపర్ణీస్థలవిశేషంబు నభినయించు నభిరామప్రదేశంబులం గనుంగొను
చుం జనిచని తాపసపరిషదుపనిషదుపబృంహితబ్రహ్మవిద్యాతర్క