శ్రీకామినీవక్షు జితహిరణ్యాక్షు - భువనపాలనదక్షుఁ బుండరీకాక్షు
వివిధగీర్వాణాద్యు వేదాంతవేద్యుఁ - బరమతత్త్వాపాద్యు భవరోగవైద్యు
శోభితగుణధాము సురసార్వభౌము - మౌనిమానసహంసు మథితోగ్రకంసు
శేషాహివరతల్పు సిద్ధసంకల్పు - నీలోత్పలవ్యూహ నీలాంబువాహ
నీలాద్రిసంకాశు నిబిడప్రకాశు - నిర్మలతరదేహు నిగమాంతగేహు
గోపాంగనాకుంభకుచశాతకుంభ - కుంభకుంకుమ చారుగురుతరాకారు
వేణునాదామోదు విహితప్రసాదు - నవ్యక్తు నతవేద్యునాద్యు నద్వంద్వు
నధ్యాత్ము నచ్యుతు నాద్యంతరహితు - నిర్గుణు నిఖిలాండనిర్మాణనిపుణు
నిర్వాణు నిర్మలు నిత్యు నిశ్చింతు - సర్వజ్ఞు సాకారు సచ్చిదానందు
సర్వతోముఖరూపు సత్యస్వరూపు - నఖిలహిరణ్యగర్భాండనాయకుని
వివిధలోకాధీశు వేంకటాద్రీశు - నధిక తేజోమూర్తి నలరెడువాని
గంగానదీజన్మకారణం బనఁగ - బొగడొందు తనపదాంభోజముల్‌ సూపి
యింపొంద వైకుంఠ మిదియ సుమ్మనుచు - సొంపొంద వలకేలఁ జూపెడువాని
ఘనదైత్యగర్వాంధకారంబు లెల్ల - మానుప దేదీప్యమానమై వెలుఁగు
చక్రగదాశంఖశార్గంబు లెపుడు - తలకొని యిరువంకఁ దాల్చినవాని
నరకంట సిరితోడ నలిగి భూకాంతఁ - గలసి యిద్దఱలోనఁ గైలాటమిడుచు
వలపునఁ గడకంట నలరెడువాని - నెండవెన్నెలతోడ నేకమై కూడి
రెండుకన్నుల సంధి రెట్టింపుచున్న - గగనంబు దాఁకినకన్నులవాని
ద్రవిళాంగనాఘనస్తనమండలాగ్ర - పరిరంభ జృంభిసంభ్రమవిలాసముల
బెరసినకుంకుమపీతాంబరంబు - కడఁగి రింగులువాఱఁ గాసించువాని
బ్రహ్మాండమైయుండి బ్రహ్మమైయుండి - పరమాణువైయుండి పరమమైయుండి
సచరాత్ముఁడై చరియించువాని - నమరాద్రితో మాద్రియగు వేంకటాద్రి
నున్నతోన్నతలీల నుండెడువాని -శృంగారవిఖ్యాతి చెలువంబురీతి
నొయ్యారములబాగు నొసపరిలాగు - రాజసంబులసొంపు రసికతపెంపు
సరసత్వములచెల్మి చతురతకల్మి - సకలజనానందసంస్తుతిచేత
వినివిని యొక బాల వికచాంబుజాక్షి - చెలువ కోకిలవాణి చిగురాకుఁబోణి
తలఁపులవిశ్రాంతి తలిరాకు బంతి - వలరాజు చిగురెల్లి వలపులవెల్లి
కడివోనిపూముల్కి కన్నులకల్కి - చిత్తంబు చిగురించి స్వేదంబు వెంచి
సిగ్గులు వో సురిఁగి చింత లోఁబెరిగి - కాంక్షలఁ గడుఁ బొదలి గర్వంబు వదలి
కోరికి మదిఁ బేరి కోపంబు మీఱి - వినుకలి దలపోసి వెరవులఁ బాసి
వెట్టల కెదురేఁగి వెతలను గ్రాగి - యున్నంతఁ జెలిభావ మువిదలు చూచి
యీముద్దరాలికి నీవిలాసినికి - నీపూవుఁబోడికి నేలొకో నేఁడు
వివరింపఁ దలఁపులు వింత లై తోఁచెఁ - బంచశరాసక్తి ప్రభవింపఁ బోలు
నింతలో మరుఁడు దండెత్తకమున్న పచ్చనివిలు చేతఁ బట్టకమున్న
చిగురంపగమి చికిలి సేయక మున్న - కోకిల మద మెత్తి గొణఁగకమున్న
కీరంబు వాయెత్తి కెలయకమున్న - రాయంచ లెదిరించి రాయకమున్న
సుదతి కారామంబు చూపి మరుపిచ్చి - మాటలమాటున మఱపింత మనుచు
నారామఁ దోడ్కొని యారామమునకుఁ - జనుచోట నెదిరె వసంతోత్సవంబు
పాంథులనునుసిగ్గు బయ లైనరీతి - కారాకు లెడలి వృక్షంబులు నిలిచె
తగ విరహులకోర్కి తలిరించె ననఁగ - నవకమై చిగుళులు ననిచె భూజముల
వలరాజురాకకు వనమహీజములు - కలయఁ గట్టినమేలుకట్లో యనంగ
నిండారఁ దరువులనీడలు నిండెఁ - గోల తమాల తక్కోల కాకోల
తాల హింతాలకోత్తాలకుద్దాల - సాలబాలరసాల జాలనేపాల
తారజంబీరమందారఖర్జూర - గంధఫలీకుండఘనపిచుమంద
తరువులు విరువులై తలిరించి మించెఁ - దీఁగలు సోగలై తెగమాఱి పాఱె
వనలక్ష్మి పూర్ణయౌవనవీథియందుఁ - గడఁగిమాధవుఁడు వేడ్కలఁ గ్రొత్తగాఁగ
నొత్తిననఖపంక్తు లున్నచందమునఁ - గింశుకంబులు గోరగించి మోదించె
గురువింద లిగిరించె గుత్తులు నించె - మాకందతరు లేచె మల్లెలు పూచెఁ
బొన్నలు వికసించెఁ బొగడలు నించెఁ - బనసలు నెరిసె సంపంగలు విరిసె
మలయజంబు లెలర్చె మరువంబు పేర్చె - నేవంకఁ జూచిన నెల్ల భూజములు
శాఖోపశాఖ లసంఖ్య మై నిగుఁడ - బూవుగుత్తులచేతఁ బూపలచేతఁ
బరిపక్వరసపూర్ణఫలములచేత - గగనమండల మెల్లఁ గలయ నందంద
కప్పిన నిబిడాంధకారంబు దోఁపఁ - దారనివిరు లెల్లఁ దారలు గాఁగఁ
గురియుపూఁదేనెల క్రొమ్మంచుమించ - మలయఁబుప్పొళ్లదుమారంబు రేఁగఁ
గేలీగృహాంగణాంకితఘననూత్న - వజ్రప్రకాశదివ్యప్రభావలుల
వెలుఁగొంది దట్టంపు వెన్నెల గాయఁ - గుముదాకరంబులఁ గూటంబు మాని
కుముదాకరంబులఁ గొమరు దీపించి - పద్మరాగప్రభాప్రౌఢిమ వంపఁ
బద్మరాగప్రౌఢిమ దోఁప - జ్యోతిర్లతాక్రాంతశోభితశ్రీలు
బాలార్కకిరణసౌభాగ్యంబు లొదవ - సకలవనాంత విశ్రాంత పాంథులకుఁ
బగలు రేలై తోఁచుఁ బరికింప రేలు - పగళులై తోఁచి విభ్రాంతి పుట్టించు
నత్యంతవేగవిహారమారుతము - సొరిది నవ్వనవీథి సొచ్చినంతటను
గడఁగి గందపుఁగొండకందువ మఱచి - క్రమ్మఱ నొకవంకఁ గదలిపోలేక
ఫణిరాజముఖులకుఁ బసలు పుట్టించు - ఫణిరాజగోత్రసౌభాగ్యంబు మరఁగి
కదిసి యాకాశగంగాతరంగముల - నాడెడునవ్యదివ్యాంగనాశ్రేణి
కుచకుంభలిప్త కుంకుమములతోడఁ - జల్లుఁ బోరాడు నిచ్చలు నొక్కవేళ
మాధవీనవలతామందిరామంద - సౌధవీథీఘనస్థలములు మెట్టి
తీఁగెయుయ్యల లూఁగు దిన మొక్కవేళ - శ్రీవేంకటేశు నూర్జితకృపావేశు
నినకోటిరుచిమంతు నిందిరాకాంతుఁ - గనుఁగొనఁ గోరి వేడ్కలు దొంగలింప
సకలదిగంతర స్థలములనుండి - చక్కని చిక్కని జవరాండ్రు నడవ
నడపులయెడల నెన్నడుములు బడలఁ - గస్తూరిపూఁతలు గరఁగి లోజాఱ
శిరసులజవ్వాది చెక్కిళ్లఁ గాఱ - నలసతఁ గనుఁగ్రేవ నలరు కామినుల
పయ్యద లెడలించి పాలిండ్లుదూరి - కుటిలకుంతలములఁ గునిసియల్లార్చి
చిగురాకుఁబోడుల సేదలు దీర్చి - గొబ్బునఁ దావి దిక్కులఁ జోడుముట్ట
నుబ్బున విహరించు నొక్కొక్కవేళఁ - తలకొని వనవీథిఁ దలవరివోలెఁ
గార్తవీర్యుఁడువోలెఁ గంతుఁడువోలె - నాగరికుఁడువోలె నానావిధముల
మలయుచు విహరించు మందానిలుండు - అంత నాకామినుల లందఱుఁ గూడి
చల్లనినెత్తావి చల్లెడుచోటఁ - దూఁగుటుయ్యలలఁ కందువల చెందొవల
కొలఁకులఁ గెలఁకులఁ గురివిందపొదల - భామలో రతిరాజు పసనిసామ్రాజ్య
సీమలో రసికుల చిత్తంబులోని - ప్రేమలో యనఁగ గంభీరంబు మెఱసి
కళుకులో చిగురాకు కరవాలుఁగొనల - తళుకులో విటులడెందములఁగాపాడు
ములుకులో యనఁగ నిమ్ముల నుల్లసిల్లి - బాలలో పుష్పాస్త్రు బంగారు నాట్య
శాలలో పూవింట జడికొన్న యంప - కోలలో తలఁపులో గుదికొన్న తాల్మి
చీలలో యనఁగ నచ్చెలు లెల్లఁ గూడి - యవయవశ్రీల నొయ్యారంబుదొరయ
ఘనవయోగర్వాంధకారంబు మెఱయఁ - దోరంపుటినరశ్మి దూఱక నిగుడి
మత్తిల్లునవలతామంటపవీథిఁ - దఱచుచీకట్లు బిత్తరములు చిమ్మఁ
దమముఖచంద్రవిస్తారదీధితులు - వెలుఁగొంద నలుగడ విహరించువారు
దట్టంపు లేమావి తరువుల క్రింద - సొంపైన పూఁదేనె సోనలఁ దడిసి
పొదరిండ్లచాటునఁ బొదిగొని నిలువ - తమముఖాంబుజములతావులఁ దగిలి
పైకొన్న యలికదంబముల సందడికిఁ - దప్పించుకొని తొలఁగ దాఁటెడువారు
చెలులతోఁ బడి దప్పి చెదరినసఖులు - రమణీయశుకపికారావంబు వినుచుఁ
జెలికత్తెలో యని చీరెడువారు - మదవతీజనులకమ్మఁదనంపుఁబూవు
బంతులసరసంబు పైకొనియాడఁ - జెదరినపుప్పొళ్ళచేఁ దొప్పఁదోఁగి
సిబ్బెంపుమేనులఁ జెలఁగెడువారు - కొలికిఁదామరకొలంకులదండ (మెండు)
నిలిచి తమతమమేనినీడలపొలుఁపు - గనుఁగొని యానాగకన్నెలో యనుచు
వేడుకఁ బలుమాఱు వెఱఁగందువారు - నై సఖీరత్నంబు లంతంత నిలిచి
లేమా విలాసంబు లేమావి మంచి - లేమావిఁజేచాఁపలేమా యటంచుఁ
దిలకంబు దీర్పక తిలకించిచూడు - తిలకంబు మానినీతిలకంబ యనుచు
నడుగుకందువ గోరియడుగు నశోక - మడిగెడు బోఁటి నీ యడుగు లాననుచు
గర్ణికారంబు లాకర్ణింపఁ బలుకు - గర్ణికారమణీయకాంతిగా ననుచుఁ
గురవకావలికిఁ జేకుఱ వకావిరులు - కొమ్మకౌఁగిటఁ జేర్చుకొమ్మకాయనుచుఁ
గేసరంబుల బోఁటి కేసరంబులుగ - వారుణిఁదోఁచు దైవాఱగా ననుచుఁ
జతురభావంబుల సరసభాషణము - లాడుచు విహరించు నంతలోపలను
వనపాలకాంతలు వనవిలాసినులు - పొదిగొన్న చక్కని పుష్పకోమలులు
గర్వంపుఁజూపుల కమలలోచనులు - కైసేసి శృంగారగరిమలు వొదల
నఖిలలోకేశుమోహనమూర్తిఁ గాంచి - ప్రణయపూర్వకముగాఁ బ్రస్తుతి చేసి
యోదేవతారాధ్య యోభక్తసాధ్య - యోలోకమందార యోభవదూర
యోవేంకటాద్రీశ యోకృపావేశ - శృంగారవనకేలిఁ జిత్తంబు గలిగి
విచ్చేసి వేడ్కల విహరింపవలయుఁ - గోనేటిదరి నున్న కొదమసంపెంగ
తరువులు వికసించెఁ దముఁ గానరావు - గుఱిలేనిపువ్వులు గురిసి క్రిక్కిఱిసి
పరవనిచోట్లెల్లఁ బాన్పులై చూడఁ - బొగడల విశ్రాంతి పొగడ నచ్చెరువు
పొదిగొన్న సేవంతిపొదరిండ్లక్రిందఁ - బలుమాఱుఁ గురిసినపన్నీటిసోన
పలవల నునుజాలువాఱి దైవాఱి - యేఱులై యేప్రొద్దు నీఁతలఁ బాఱు
గందంపుమ్రాఁకులకడ నున్నఫణులు - చందనగంధులసౌరభంబునకుఁ
బైకొని మైగాలిఁ బసివట్టి తిరుగు - మెలఁగు మయూరగామినులౌట యెఱిఁగి
తఱచైనఘనసార తరువులక్రిందఁ - బొర లూడి రాలుకర్పూరంపుసిరము
తిన్నలై విహరింపఁ దిన్ననై యుండు - నని యని తరితీపు లతివలు వలుక
నఖిలలోకారాధ్యుఁ డతికృపామూర్తి - మగువల వయసు లామనికొల్లకాఁడు
భామల తలఁపులోపలి గారడీఁడు - వెలలేని వలపుల వేడుకకాఁడు
కోనేటిరాయండు కుంభినీస్వామి - శ్రీవత్సధారుఁ డాశ్రితవత్సలుండు
వెలఁదులమాటలు వేడ్క దీపింపఁ - జిత్తాబ్జమునఁ జేర్చి చిఱునవ్వు నవ్వి
యత్యంతరూపమహామూర్తి గాన - నఖిలశృంగారాబ్ధి కధిపతి గాన
సకలవైభవమహోజ్జ్వలతఁ బెంపొంది - గమనోన్ముఖుం డైనగదలు దానెఱిఁగి
పాదారవిందసంస్పర్శంబు సేయఁ - గోరిక దలకూడఁ గుండలికర్త (భర్త?)
పసిఁడిపాదుకల స్వభావమై నిలువఁ - గైకొని మెట్ట నక్కడిచోటు లెల్లఁ
బ్రతిపదంబును మోక్షపదములై నిలువ - నింద్రాది దిక్పతులిరువంకఁ గొలువఁ
గమలభవాదులు గదిసి తో నడవఁ - గిన్నర గంధర్వ ఖేచర యక్ష
గరుడ విద్యాధర గాన మానములు - వీనుల కిం పొంద విందులు సేయ
విరివైన యుద్యానవీథులు సొచ్చి - విశ్రాంత భూముల విహరించుచోట
నేవేళ నేకాల మెక్కడఁ దలఁచె - నావేళ నాకాల మక్కడఁ గలిగి
సకలపదార్థగోచరములై యుండి - చతురవిద్యాగోష్ఠిఁ జరియించునంత
నఖిలాదినాథు మోహన మహామూర్తిఁ - బలుమాఱు మును విన్న భామాలలామ
చెలులకు మన సీక చిత్తంబు రాక - పొలుపైనయలవోకఁ బ్రొద్దులు వోక
సఖులతోఁ బుష్పాపచయకేలిఁ దగిలి - యున్నంతఁ జెలిభావ మువిదలు చూచి
పువ్వులు జడిగొన్న పొదరిండ్లు దూఱి - కాంతల నొండొంటిఁ గడవంగఁ బాఱి
తఱచైనవిరు లెల్లఁ దమ వని కోరి - చెదరిన లతలెల్లఁ జేరంగఁ దీసి
యందనిక్రొవ్విరు లందంది కోసి - తావి వోవకయుండఁ దలిరులు మూసి
రాలినపుప్పొళ్లు రాసులు చేసి - యనిలంబు కెదురు మహాఫణి వ్రాసి
తుమ్మెదదాఁటులఁ దొలఁగఁ దూపొడిచి - పై కాపుగాఁగ సంపంగలు ముడిచి
చేతులపన్నీరు చెలులపైఁ దుడిచి - పయ్యదఁబూఁదేనె పలుమాఱుఁ బిడిచి
యారామవీథుల నతివలు మెలఁగి - యొఱపైన చోటుల నొయ్యనఁ తొలఁగి
దట్టంపువిరు లెల్లఁ దమవని చెలఁగి - మరునమ్ములో యని మదిలోనఁ గలఁగి
బింబంబు లని యోష్ఠబింబంబులకును - బైకొన్న చిలుకలఁ బట్టంగఁ దలఁచి
వల నైనకరపల్లవంబులు చాఁపఁ - బల్లవంబులభ్రాంతిఁ బదరి కోయిలలు
చేరినఁ బయ్యెదచెఱఁగులఁ జోఁపఁ - బయ్యదబయ లైన పాలిండ్లు చూచి
జక్కవదోయిమచ్చరమున మొరయఁ - గరమూలరుచుల బంగారుతో బెరయ
నుబ్బునఁ జనుఁగవ లొండొంటినొరయ - నొసలికస్తూరులునూఁగురుల్‌ బెరయ
వలఁతులై పొలఁతులు వనవిహారములఁ - బొదలిక్రొవ్వులు మించఁబువ్వులుగోసి
శంబరారాతిఁ బచ్చనివిలుకానిఁ - బచ్చపుల్గుల తేరిపైన బిత్తరిని
బొదిగొన్న కమ్మఁదూపుల పోటువాని - దనరిన చంద్రకాంతపు వేదిమీఁదఁ
దలఁపులోపలివానిఁ దగవారఁ పూఁచి - పొలుపొందఁ బువ్వులఁ బూజలు చేసి
యొప్పైనపూఁదేనె నుపహారమిచ్చి - మ్రొక్కుచుఁ దాంబూలములు సమర్పించి
సరససంగీత ప్రసంగ వాక్యములఁ - బ్రొద్దులు పుచ్చుచుఁ బొలఁతు లున్నంత
వైభవంబుల వనవాటికలందు - విహరించుచున్న గోవిందు ముకుందు
సత్యభామాకాంతు సకలవిశ్రాంతు - తిరువేంకటాద్రీశు దేవదేవేశు
భానుకోటిస్ఫూర్తి భాసిల్లువాని - పంచాస్త్ర కోటి సౌభాగ్యంబువాని
గోటానఁ గోటులై కొలఁదులు మీఱి - గుఱు తిడఁగా రానిగుణములవాని
రాకకు వెఱఁగంది రాకేందు వదన - రాకవెన్నెలలఁ బరా కైనకాంత
చెలులపై నలులపైఁ జిత్తంబు వదలి - కురులపై విరులపైఁ గోర్కులు సడలి
పికముపై శుకముపైఁ బ్రేమంబుమఱచి - నతనురాకకునుగూర్చినతనురాకకును
దొలఁగక పులకలు తోఁ ద్రోపులాడఁ - దలకొన్నకనుఁగ్రేవ తపములు వీడ
నుడివోనినునుసిగ్గు లూడనిఁబాడ - నంతంత మరుబలం బచ్చన లాడ
నిరువురచిత్తంబులెదుళులుచూడఁ - బరువులో మురువును భయములోవెరువుఁ
జిత్తంబుతిమురును జెక్కులచెమరు - భావంబుకదలును బలుకులోఁ గొదలు
మానంబు మఱపును మరుచేతివెఱపు - నలకలజాఱును నలసంబుతీరుఁ
గ్రాఁగినమతి నొప్పి కనుఁగ్రేవ డప్పి - చెలికత్తెమూఁపుపైఁ జేర్చినచేయి
యల్లార్చి ఱెప్ప వేయనికన్నుదోయి - తనమేయిఁ జెలి దండ దాఁచినబాగు
నంతలో మైమఱ పైయున్నలాగు - కనుఁగొని చెలులెల్లఁ గడు వెఱఁగంది
యలరినవేడ్కల నబ్జాక్షిఁ జూచెఁ - జూచినయంతన సూనాస్త్రగురుఁడు
జూపులు తూఁపులై సోఁకె నొండొరులఁ - దనరాజ్యలక్షణోత్తర మైన తన్విఁ
గప్పంబుగా నిచ్చెఁ గందర్పుఁ డనఁగ - గంభీరనాయకుఁ గాంచెనో యనఁగఁ
దీపులవిలునారితిండి మోపెట్టి - పూవుఁదూపులయంపపొది వెంటఁగట్టి
చిన్నారివిరిదమ్మిచిలుకుఁ జేఁబట్టి - యల్లన పొడచూపె నారతిరాజు
ఈయింతితో విభుఁ డింపొందు ననుచుఁ - నేపునఁ గీరంబు లేచి పై రొప్పె
నీకొమ్మ మదికోర్కులీడేఱు ననుచుఁ - జాలిచేరువఁదీర్చె జక్కవదోయి
తరలాక్షి మదిలోన దరికొన్న విరహ - మాఱెడువీపుగా పనెడుచందమున
నుబ్బునఁ బైవీఁచె నొయ్యనిగాలి - కమలామనోనాథు కరుణాకటాక్ష
వీక్షణం బతివపై వెల్లిగొన్నట్లు - పరిపూర్ణచంద్రికాప్రభలు పైఁ బర్వఁ
గడిమి నుద్దీపనకారణం బగుచు - లావుగా మరునిబలం బెల్ల నొదరఁ
గడు నింపులై యుండఁ గారింపు లౌను - నెలమిఁ గారింపులేయింపులై యుండుఁ
బ్రియములైనవియె యప్రియములైయుండు - నప్రియంబులె ప్రియంబై యుండుఁ జూడ
నాలోనఁ జెలులెల్ల నాలోలనేత్రఁ - బరికించి విరహతాపస్ఫూర్తి దెలిసి
యీరామపోరాము లేమిట మాను - నీకాంతవలవంత లేవంకఁ దీరుఁ
జూడదు తలయెత్తి శ్రుతి దండెఁ గూర్చి - పాడదు చెలులెల్లఁ బైకొన్న సరస
మాడదు చిలుకతో నందంపుమాట - లాడదు వెడమాఁట లాడెడిఁగాని
కొంచదు ప్రాణంబు గుఱుతుగాఁజేసి - యెంచదు వీణె వాయించదు పరిణ
మించదు మది సంభ్రమించదు చెలియ - కించుకేనియును సయించదు కాని
కప్పదు చనుదోయి కనుఁ గ్రేవఱెప్ప - విప్పదు తనప్రాణవిభుమీఁదిమనసు
త్రిప్పదు మదిలోన దీకొన్నప్రేమ - చెప్ప దెవ్వరితోడఁ జెప్పునోకాని
పెట్టదు కస్తూరి పేర్కొని చేతఁ - బట్టదు సేవంతిబంతి నెత్తమ్మి
ముట్టదు సిగ్గుల మొద లించుకైనఁ - బుట్టదు తలఁ పెందుఁ బుట్టునోకాని
తాపంబు మేనఁ బ్రతాపింపఁ దొడఁగె - నూర్పులు మిగుల నిట్టూర్పులై నిగుడెఁ
బగలెమృగాక్షికి వ(ఁబ?)గలుగాఁ జొచ్చె - రాత్రులింతికి శివరాత్రులై తోఁచె
శిశిరోపచారవిశేషభావనలు - సేయంగవలె నని చెలులెల్లఁ గూడి
పైకొని యేప్రొద్దుఁ బన్నీరువారిఁ - బూచిన గొజ్జంగపొదరింటిలోను
బద్మాక్షిఁ జల్లనిపాన్పుననునిచి - యొడఁగూర్పఁదొడఁగిన నుపచారవిధులు
పలుమాఱు విపరీతభావంబులైన - ముగ్ధలు తమలోన మోములు చూచి
యంతంత నొకరొక రచనలు చేసి - యీవేళఁ దడ వేల హేలావిశాల
శశికాంతమణికాంత సౌధాంతరములఁ - జలువలనెలవులఁ జంద్రాస్య నునిచి
గుప్పుఁడు పుప్పొళ్లు కుచములమీఁదఁ - గప్పుఁడు చెంగావి కప్రంపుబడిమి
త్రిప్పుఁడు చెలులెల్లఁ దిరిగిరానుండఁ - జెప్పుఁడు మనవులఁ జెప్పెడి దేమి
చిలుకుఁడు పూఁదేనె చెలిమేన నిండ - నలుకుఁడు శ్రీగంధ మప్పటప్పటికిఁ
గులుకుఁడు పన్నీరు కోమలితోడఁ - బలుకుఁడు పలుమాఱుఁ బలుకరింపుచును
బాయుఁడు నునుగాలి పైకొననిండు - ద్రోయుఁడు సొబగైనతొలువిరులెల్ల
వేయుఁడు కమ్మఁగ్రొవ్విరులు పైపైని - సేయుఁ డింతటిలోన శీతలక్రియలు
అనుచు శైత్యోపచారాదులు సేయ - నల్లనల్లన తాప మగ్గలం బైన
ధవళాక్షి యున్న చందము చూచి చెలులు - కంటికిఁ గలకంఠకంఠిభావంబు
జ్ఞానమొక్కటియు నజ్ఞానంబు నూఱు - మాటాడు టొక్కటి మౌనంబువేయి
తాలిమి లేశంబు తమకంబు లక్ష - కోరికమదిలోనఁ గోటానఁగోటి
మణుఁగులైయున్నవి మగువకు నేఁడు - తనప్రాణవిభునిఁ గందర్పుని గురునిఁ
దేకయుండిన నింతిఁ దేర్పంగరాదు - పోక మీరిపు డలవోక సేసినను
రాకనేఁడతఁడు నిరాకరించినను - అదయుండుమరుఁడు తీవ్రాస్త్రకోవిదుఁడు
ఒడ లెఱుంగకయుండు నొక్కొక్కవేళ - నెంతకు నలుగునో యీయింతిమీఁద
నని యందులోఁ బ్రోడయగుమేటిబోటి - యుడివోనిభయమేలయోచెలులార
కరుణాకటాక్షు లోకైకసంరక్షు - శరణాగతత్రాణు సకలపారీణు
విశ్వలోకేశు శ్రీవేంకటాధీశుఁ - గనుఁగొని యీబాల గాసిల్లియున్న
చందంబు విభుఁడు మెచ్చఁగ విన్నవించి - విచ్చేయునట్లు గావించి తేకున్న
నెచ్చెలులార నానేర్పు లేమిటికి - నని చెలిఁ జెలులతో నప్పనచేసి
కదలి మోహనమూర్తి కడకేగి యంత - సకలసురాసురసంఘంబులెల్ల
నంతరాంతరముల నంతంత నుండి - యేకాంతసుఖగోష్ఠి నింపొందువాని
గనుఁగొని పూగుత్తి కానుక యిచ్చి - మ్రొక్కి హస్తాంబుజంబులు మోడ్చిపలికె
దేవ జగన్నాథ దేవతారాధ్య - యఖిలాండధౌరేయ యార్తవిధేయ
యారామసీమావిహారాంతరముల - మారామ నీరూపు మహనీయమూర్తి
గన్నులపండువుగాఁ గనుఁగొన్న - యంతనుండియును బుష్పాయుధుఁ డేయు
తలిరంపగమి నొంప ధరియింపలేదు - ఎటువంటి మోహంబొ యెట్టితాపంబొ
యేలాగుతమకంబొ యేమిభావంబొ - యేచందములచూపొ యేతరితీపొ
తొలిచూపు నీరూపు తొలఁగుటలేదు - కన్నీరు మున్నీరు కడగానరాదు
చెలియున్నవిధమును జెప్పకపోదు- తరళాక్షి దురవస్థ తలఁపగాఁ గాదు
ఇంతట విచ్చేసి యింతి మన్నించి - కంతుసామ్రాజ్యసౌఖ్యముల నొందింపు
మని విన్నవించిన యబ్జాక్షిఁ జూచి - తలఁపులు తలఁపులు తార్కొని యుండఁ
జిత్తంబు చిగురొత్తఁ జిఱునవ్వు నవ్వి - భామకు మౌక్తికాభరణంబు లిచ్చి
మది నుబ్బి పన్నీట మజ్జనం బాడి - రసికతఁ బీతాంబరము దిండు దీర్చి
మృగమదపంకంబు మెయి నిండఁ బూసి - పారిజాతాదిపుష్పము లెల్ల ముడిచి
సౌపర్ణవాహనోజ్జ్వలతఁ బెంపొంది - విద్యాధరాహ్లాదవీణానినాద
గానామృతాంభోధికల్లోలములను - నుబ్బుచు నంతంత నోలలాడుచును
జంద్రాస్య యున్నపూఁజవికె కేతెంచి - యల్లన దర్వీకరాంతకు డిగ్గి
కొలిచి వచ్చినదేవకోటుల ననిచి - కామినిభావంబుఁ గనుఁగొనునంతఁ
గుసుమాస్త్ర తాపసంకులత వహించి - యలరుఁ బానుపుమీఁద నందందపొరలఁ
జెలిమేన నంటినచెంగల్వఱేకు - లెలమిఁ గాంతునిరాక కెదుళులు చూచు
గతి నొప్ప నిలువెల్లఁ గన్నులై యమరఁ - గ్రాఁగినగందంబు క్రమ్మఁ బన్నీటఁ
దోఁగినచెంగావి తొడరి శైత్యమునఁ - గ్రాఁగినహృదయంబు రతిరాజుచేత
మ్రాఁగినమతియుఁ బ్రమాదంబువలన - నీఁగినవగలును నేత్రాంబుధార
లాఁగినఱెప్పలు నైయున్నయింతిఁ - గనుఁగొని కరుణావికాసచంద్రికలు
నీలోత్పలాక్షిపైఁ నిండంగఁ జల్లి - భామిని యున్నపూఁబానుపు చేరి
చిట్టంటుచేఁతల సేదలు దీర్చి - చెదరినయలకలచిక్కెల్లఁ దీర్చి
యెడలేనిపులకలయింపు పుట్టించి - కళలమర్మంబులకడ గానుపించి
యాలింగనాదిసౌఖ్యముల నొందించి - కరఁగించి మరగించి కలికిఁ గావించి
యుడివోనిసురతాబ్ధి నోల లాడించి - చిత్తజసామ్రాజ్యసింహాసనమున
బాలికారత్నంబుఁ బట్టంబు గట్టి - యరవిరిసిగ్గులు నాత్మనిగ్గులును
మితిలేనితావులు మెఱుఁగుమోవులును - గనుఁగ్రేవకెంపులుఁ గలికిసొంపులును
ముద్దులేఁ జెమరును మోములకొమరుఁ - గలిగినశృంగారగరిమలతోడ
వందిమాగధుల కైవారంబుతోడ - సిద్ధవిద్యాధరశ్రేణులతోడఁ
దనతోడఁ గూడినతన్వంగితోడ - వృషభాద్రినాథుఁ డుర్వీసతిప్రియుఁడు
వేడ్కతో నగరప్రవేశంబు చేసె - నని భక్తిఁ దిరువేంకటాద్రీశుపేరఁ
గారుణ్యలక్ష్మీప్రకాశునిపేర - రాజితాఖిలలోకరక్షణుపేర
లాలితబహుపుణ్యలక్షణుపేర - పృథులదానవసైన్యభీషణుపేర
భూరికౌస్తుభరత్నభూషణుపేర - గురుభరద్వాజైక గోత్రపావనుఁడు
నందాపురీవంశనాయకోత్తముఁడు - అనఘుఁడు తాళ్లపాకాన్నయార్యుండు
మధురంపుశృంగారమంజరి చెప్పె - ధరమీఁద నాచంద్రతారకం బగుచుఁ
గడిమిఁ బెంపొందు మంగళమహాశ్రీల
శ్రీకృష్ణార్పణమస్తు - మంగళమహా శ్రీ శ్రీఁ జేయున్‌.