పీఠిక

పాలవేకరి కదిరీపతికాలము

జాతివార్తారచనాచమత్కారవిలసితమును సరసకవితామనోహరమును నగు శుకసప్తతి యను ప్రశస్తప్రబంధమును రచియించిన కదిరీపతి చంద్రవంశక్షత్త్రియుఁడు. అచ్యుతగోత్రుఁడు. అనంతపురమండలమునఁగల కదిరి లేక ఖాద్రి రాజ్యమునకు నధినేత. ఖాద్రి యందు శ్రీ నరసింహస్వామి యీతని యిష్టదైవము. ఈతని వంశీయులలోఁ గూటస్థుఁడు ‘తాడిగోళ్ల’ అను గ్రామమున నివసించుటచే, నీతని తాతవఱకును గలనామముల ముందు ‘తాడిగోళ్ల’ అను పేరు వెలయుచుండెడిది. శుకసప్తతి గద్యనుఁ జూచిన నీవిషయము తెల్లమగును.

"ఇది శ్రీ మత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగతకవితాధార పాలవేకరికులకలశాంభోధిసుధాకర తాడిగోళ్ళ కరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవివక్షణానుసంధాయక కదిరీపతినాయక ప్రణీతంబైన శుకసప్తతి యను మహాప్రబంధమునఁ బ్రథమాశ్వాసము."

కదిరీపతి [1]శుకసప్తతి కృత్యాదిని తన వంశక్రమము నిట్లు తెలిపియున్నాఁడు:—
తనవంశమునకుఁ బాలవేకరి యను పేరువచ్చుటకుఁ గారణము గదిరీపతి యిట్లు చెప్పియున్నాఁడు.

"ఆ రసికావతంసకుల మాత్మసముద్భవహేతుభూతమై
ధీరత పాలవెల్లి జగతిం దగెఁ దన్మహిమం బపారగం
భీరఘనాఘసంభరణ భీమబలప్రతిభాప్తి గాంతు నం
చారయఁ బాలవేకరి కులాఖ్య వహించె నుదంచితోన్నతిన్.
ఆమహితాన్వవాయ వసుధాధిపు లచ్యుతగోత్రపాత్రు లు
ద్దామభుజాపరాక్రమవిదారితఘోరమదారివీరులై
భూమిభరించి రానృపుల భూతి మహోన్నతి నేలె భోగసు
త్రాముఁడు తాడిగోళ్ళ పురధాముఁడు శ్రీ పెదయౌబళుం డిలన్.

పై పద్యమున వర్ణింపఁబడిన 'పెదయౌబళుఁడు తాళికోట యుద్ధమున క్రీ. శ. 1565లో మరణించిన యళియరామరాజుకాలమున నున్న ట్లీక్రింది సీసపద్యపాదమువలనఁ దెలియు చున్నది.

"అళె రామరాజేంద్రు బలవద్రిపుల ద్రుంచు కలని కేధీరుండు కర్తయయ్యె" కావున నీతఁడు క్రీ. శ. 1560 ప్రాంతమువాఁ డని చెప్పనొప్పును.

ఈతఁడు మహావీరుఁ డగుటయేగాక మహాభక్తుడై శ్రీఖాద్రి నరసింహునకు భోగమండపాదులు గట్టించి ప్రఖ్యాతిం గాంచెను.

ఆవెనుక నీతని వంశమునఁ బ్రసిద్ది చెందిన వాడు కదిరీపతి నాయకుని తాత కరెమాణిక్యరాజు. ఈతఁడు రామరాయల సరిగద్దియ నొడ్డోలగమున నుండి, రామనామధ్యాననిష్ఠాగరి ష్ఠుఁడై, రామరాయక్షమావరదత్త బిరుదాంకితరాజచిహ్నితుఁడై ప్రకాశించెను. ఈ రామదేవరాయలు , క్రీ. శ. 1534-1614 వఱకును విజయనగరసామ్రాజ్యమును సమర్థతతో నేలిన వీరవేంకటపతిరాయల వెనుక రాజ్యమునకు వచ్చి క్రీ. శ. 1630 వఱకును పాలించెను. కావున నీ కదిరీపతి 'తాత యగు కరెమాణిక్యనృపాలుఁడు క్రీ. శ. 1620 ప్రాంతమువాఁడు.

తాతవెనుక కదిరీపతి, పెద్దతండ్రి రామభూపతి 'శ్రీరంగరాయదత్తమత్స్యమకరధ్వజాఢ్యుఁడు' అని పొగడ్త కెక్కినవాఁడు. ఈ శ్రీరంగరాయలు విజయనగరసామ్రాజ్య ధీశులలో గడపటివాఁడని చెప్పఁదగును. ఈతఁడు క్రీ. శ. 1542 సంవత్సరమున సింహాసనము నధిష్ఠించి యిరువది మూఁడేండ్లు పరిపాలించెను. ఈతని కాలమున ననఁగా క్రీ.శ. 1665 సంవత్సరమున మహమ్మదీయు లీ రాజ్యము నాక్రమించుకొనిరి. కావున కదిరీపతి పెదతండ్రి క్రీ. శ. 1650 ప్రాంతమువాఁ డగుట స్పష్టమే.

రామభూపతి తమ్ముని కొమారుఁ డగు కదిరీపతియు శ్రీ. శ. 1660 ప్రాంతమున నుండుట నిర్వివాదముగా నేర్పడుచున్నది. మఱియు నీతఁడు శుకసప్తతియందు మొదటికథలో నాంగ్లేయుల నిట్లు పేర్కొనినాఁడు.

చ. “వలసిన బేరముల్ తెలియవచ్చినవారును వాదు గల్గువా
    రలు మఱి గుత్త గొల్లలును రత్నపరీక్షలవారుఁ గార్యముల్
    గలిగిన యింగిలీసుల ముఖాములుఁ జెంగట నుల్లసిల్లగాఁ
    గొలువున నుండుఁ జూపరులకున్ గనుపండువు సంఘటిల్లఁగాన్. (1-86)

ఇంగ్లీషువారు క్రీ.శ. 1639 సంవత్సరమున మదరాసున తొలుత వర్తకస్థాన మేర్పఱచుకొనిరి. వారు రాజ్యముకొఱకుఁ గాక కేవల వర్తకవ్యాపారనిమగ్నులుగా నుండుకాలముననే యారంభదశలో శుకసప్తతిరచనము జరిగినట్లు పైపద్యము చెప్పుచున్నది. ఈ విషయమును పైకాలమునే స్థిరపఱచుచున్నది, కావున కదిరీపతికాలము పదునాఱవశతాబ్దమున నుత్తరార్ధ మని చెప్పఁదగును.

'శుకసప్తతి' యను పేరు సార్థకముగా నిందు డెబ్బదికథ లుండవలసినది. కాని ప్రస్తుతము లభించిన శుకసప్తతియందు ముప్పదికథలు మాత్రమే గలవు. ఈకథలలో పెద్దకథలును నుపకథలును గలవు. శుకసప్తతిలో నేఁడు పెద్దకథ లిరువదియొకటియు చిన్నకథలు తొమ్మిదియుఁ గలవు. ఉపలబ్ధము లగు తాళపత్రపుస్తకములయందును నేఁడు ముద్రితమైన నాలుగవ యాశ్వాసమునఁ గొంతభాగమువఱకును గన్పట్టుచున్నవి. ఇప్పటికీ నూఱేండ్లక్రిందటఁగూడ శుకసప్తతియందు ముప్పదికథలు మాత్రమే లభించినట్లును నీగ్రంథమునకు 'శుకత్రింశతి' అనుట సమంజసమనియు బ్రౌనుదొరవారు శుకసప్తతి గ్రంథమునకుఁ దాము దయారుచేయించిన శుధ్ధలిఖితప్రతియందు వ్రాయించి యున్నారు. ఈ వ్రాతప్రతి క్రీ. శ. 1931లో సంపుటీకరణము చేయఁబడి నేడు ప్రాచ్యలిఖితపుస్తకాగారమున నున్నది,

సంస్కృతమున శుకసప్తతి యరు గ్రంథము కలదు – అది యముద్రితము ఈ గ్రంథము తెలుఁగుగ్రంథమునకు కేవలమూలముగాదు. సంస్కృతమున కిది యనుకరణముగాని భాషాంతరీకరణము గాదని బ్రౌనుదొరవారి యభిప్రాయము.

కదిరీపతినాయకునకు నూఱేండ్లతరువాత నయ్యలరాజు నారాయణామాత్యుఁ డను కవి 'హంసవింశతి, యను ప్రబం ధము రచియించియున్నాడు. శుకసప్తతికిని హంసవింశతికిని కథారచనమునను గద్యపద్యములయందును పెక్కుపోలిక లగపడుచున్నవి—నారాయణామాత్యుఁడు కదిరీపతినాయకునకుఁ దరువాతివాఁ డగుటచే శుకసప్తతి వరవడిగా, కొన్ని విశేషములఁ జేర్చి హంసవింశతిరచనము గావించెను. ఈ రెండింటిని సమగ్రముగాఁ బరిశీలింపవలసియున్నది.

విద్యారత్న :

నిడదవోలు వేంకటరావు, M. A.

  1. శుకసప్తతి తొలుత కాకినాడ బాలసరస్వతీముద్రాలయమున శ్రీ. శ. 1909 సంవత్సరమున ముద్రితమైనది. ఆకాలమున వెలువడిన సుప్రసిద్ధపత్త్రికలలో నెన్నఁదగిన 'శ్రీ సరస్వతి' పత్రిక యందు ప్రకటితమైనది. అందు కృత్యాది పద్యములను నాంధ్ర సాహిత్య పరిషత్తువారు క్రీ. శ. 1929 లో శుక్ల-చైత్ర వైశాఖి పరిషత్పత్త్రికలోఁ బ్రకటించినారు. కృత్యాదిపద్యములఁ బరిషత్తు ప్రకటింపకున్న చో నీరాజకవి చరిత్రము మన కీపాటియైన తెలియదు. కీర్తిశేషులు వీరేశలింగము పంతుల వారి కవిచరిత్ర రచనాకాలమున కివి యలభ్యము లగుటచే వారీ కవికాలనిర్ణయము చేయుట కనువుపడలేదని వ్రాయుట తటస్థించినది. కృత్యాదిపద్యములతోఁ గూడ నిప్పటి కాఱేండ్ల క్రిందట ననఁగా క్రీ. శ. 1935 సంవత్సరమున “వావిళ్ల” వారి శ్రీరామముద్రాలయమున నీగ్రంథ మభిరామముగ ముద్రితమైనది.