క. ధర శాలివాహనుం డను
నరనాయకమౌళి పెనుప నలువై విభవా
కరము ప్రతిష్ఠానం బను
పుర మలరు న్వేల్పుఱేనిప్రోలుం బోలన్. 5

క. అప్పురిఁ గుబేరుకలిమికి
దప్పులు ఘటియించు సోమదత్తుం డనుపే
రొప్పు నొకవైశ్యుఁ డలరుఁ గ
కుప్పటలిని గీర్తివల్లికోటులు ప్రాకన్! 6

సీ. నవరత్నములు సువర్ణమును వెండియును లో
హాంతరములు పటలాంశుకములు
గోవజవ్వాది కుంకుమపూవు పచ్చక
ప్పురముఁ బన్నీరుచెంబులుఁ బటీర
తరుఖండపటలి యందలపుఁ గొమ్ములు జల్లి
సవరము ల్పాదరసంబు జాజి
యింగువ లేలాలవంగము లోడపోఁ
కలును గోరోచనగంధకములు
తే. కొచ్చికుక్కలు మానిసిక్రోఁతు లరిది
పంచెవన్నెలచిలుకలు బహువిధముల
పారువాతిన్నె లిఁకమీఁద బలుక నేల
పొదలు వానింటఁ బులిజున్ను మొదలుగాఁగ. 7

క. ఈళయు ముమ్మెంగియు బం
గాళము పైగోవ మొదలుగాఁ బొదలెడుద్వీ
పాళిఁగలసరకు లాతని
కౌలున దిగు మాట నిజముగలవాఁ డగుటన్. 8

శా. ఏయూరం దనయాపణంబు మఱియిం కేబేరిపేరైన నా
త్మాయత్తం బగువిత్త మేయడవియందైన న్నిజద్రవ్య మీ
చాయన్సంపద వృద్ధి బొంద ధనదస్పర్ధాళుఁడై నిల్బెఁబో
యాయూరవ్యుఁడు గోట్లకుంబడగ లెన్నైనం బ్రమోదంబునన్. 9

చ. వలసిన బేరము ల్దెలియవచ్చినవారలు వాదుగల్గువా
రలు తెగగుత్తగొల్లలును రత్నపరీక్షలవారు కార్యము
ల్గలిగిన యింగిలీషులముఖాములు చెంగట నుల్లసిల్లఁగాఁ
గొలువొసఁగు న్మహీశుగతిఁ గోమటి యాత్మగృహాంగణంబునన్. 10

క. అతఁడు ధూర్తచకోర
ఖ్యాతంబగు నొక్కచిలుక నతులితగమనా
యాతేరితవిజ్ఞానస
మాతులశేముషిఁ గృపాళుఁడై పోషించున్. 11

తే. అప్పురంబునఁ గామసేనాభిధాన
యైన వెలచాన మీఱు జయైకతాన
మీనకేతననలినప్రసూనశరస
మానతానూనవీక్షావితాన యొకతె. 12

ఉ. కారుమెఱుంగురాచిలుక కస్తురివీణె పదాఱువన్నె బం
గారము నచ్చుకుప్పె తెలిగంబుర వెన్నెలలోని తేట సిం
గారపుఠీవి లేనగవు గల్గిన చక్కెరకీలుబొమ్మ యొ
య్యారపుజీవగడ్డ యన నచ్చెలి మెచ్చులు గాంచె నెంచఁగన్. 13

సీ. ప్రత్యక్షబాహాటపాంచాలనటనలు
గనుపట్టఁగాఁ బుస్తకములు చదువుఁ

గనుఁగొన్న రూపమచ్చున నొత్తినట్టులఁ
దళుకొత్త భావచిత్రములు వ్రాయు
నట్టువకాని యందముగాక వింతగాఁ
గోపులు గల్పించుకొనుచు నాడుఁ
జేరి తంబుర మీటి సారసుథాసూక్తి
దేటలూరఁగ వింతపాటఁ బాడు
తే. జాతివార్తలు దొలఁక రసంబు గులుకఁ
గవిత రచియించుఁ గల్పించి కతలు నుడువు
మనసు గరఁగంగఁ దీయనిమాటలాడు
జిలుకరౌతుకటారి యవ్వెలమిటారి. 14

సీ. పలుకుముద్దులకుఁ గోవెలజియ్యగాండ్రెల్లం
గుంటెనకాండ్ర వెన్వెంటఁబడఁగఁ
జనుజక్కవలు గన్న సన్న్యాసులైనను
దలవరివారితోఁ జెలిమి సేయఁ
దళుకుఁజూపులకు విద్వాంసులైనను నిజ
రామలతోడ రారాపొనర్పఁ
బొలుపున కాచార్యపురుషులైనను దమ
వేషభాషలమీఁద వెగటు పడఁగఁ
తే. దెఱపిగని చూచినట్టి పతివ్రతలును
నిజకులాచారవృత్తిపై నెటికె విఱువ
వింతయొయ్యార మెసఁగఁ గోవెలకుఁ బోయి
మరలి యింటికి వచ్చు నమ్మచ్చెకంటి. 15

చ. తొలఁకెడుతత్తఱంబువగతోఁ దొడనిగ్గు హిజారుమీఁద మె
ట్రిలువడినొంటికట్టున ఘటించిన చీరసగంబు మూపుపై

నలవడబోటి దట్టి మొదలైనవి తేఁ దిరుమంజనంపువే
ఫలు దఱితప్పెనంచు నవలా భయమందుచు నిల్లు వెల్వడన్. 16

క. కొడుమెత్తుకొఱకు గుడికిన్
నడుచు న్వెలపడుచు నాభినామమునుం గ్రొ
మ్ముడిసౌరు న్మడిచారు
న్వడిజాఱుంబైఁట వింతవగఁ గనుపింపన్. 17

సీ. తానున్న కేళికంతటికి గణాచారి
పెక్కుసుద్దులు మ్రోయు పెద్దబేరి
పేరుకోఁదగినట్టి యూరలేని యుటంకు
పరులబుద్ధులకుఁ జొప్పడనిమంకు
కల్లలు పచరించి గద్దించుతాటోటు
పూనియొక్కరి కీయలేని జూటు
కలహంబె కూడుగా మెలఁగెడుగయ్యాళి
నిష్ఠురత్వము సూపు నెఱకరాళి
తే. బేరజపుగట్టిజంత పాడూరిసంత
చలము సాధించు దిట్ట రోసాలపుట్ట
లోకముల కెల్ల సూచి యల్లుండ్రబూచి
యెంచఁగల యుచ్చమల్లి యయ్యింతితల్లి. 18

తే. దాని నుతియింపఁ దరమౌనె తాటకావ
ధూటితల్లియొ పూతనతోడఁబుట్టొ
శూర్పనఖమేనగోడలొ చూడ లంకి
ణీతనూజయొ యనఁగ వన్నియకు నెక్కె. 19

సీ. ఇరుగింటిదయ్యంబు పొరుగింటికినిగూబ
యెదురింటివారల కెదురుచుక్క
వాడకుఁబగ యూరివారలతలనొప్పి
పెంపుడుకూఁతుండ్ర పెద్దపిడుగు
పరదేశులకుఁ బులి బాఁపలగాలంబు
యాచకకోటుల కాసవిఱుపు
దాసర్లమిత్తి సన్న్యాసుల తెరబొమ్మ
జోగిజంగాలకు సొంటికొమ్ము
తే. పాఠకులకొట్టు నట్టువపాలియదురుఁ
గ్రోవి భరతంపుటయగారి గుండెదివులు
బట్టువాకట్టు బవనీలపాముకూన
యనఁగ విఖ్యాతిఁ గాంచు నాయాఁడుఁగూచి. 20

సీ. గూనివీఁ పనరాదు కోలమూతినిజాఁచుఁ
గొడిపెమో మనరాదు గొడఁగసాగు
బాకిమో మనరాదు పగసాటి బెదరించు
నొంటిప ల్లనరాదు కంటగించు
నరవెండ్రు కనరాదు నాఁడెల్ల జగడించు
వాటుగా లనరాదు చేటుఁదెచ్చుఁ
జెవు డనఁగారాదు చేట యెత్తుకవచ్చు
గ్రుడ్డిక న్ననరాదు గొట్టుసేయు
తే. వెఱ్ఱి యనరాదు పైఁబడి వెక్కిరించు
గామి డన రాదు మొగమున గంటువెట్టు
పెంకి యనరాదు వట్టిగుంపెనలు సేయు
ముద్ది యనరాదు గ్రుద్దు నయ్యెద్దుమొద్దు. 21

క. గడెతడవు వేసటలచే
సుడివడ కటు తనదు ప్రాఁతసుద్దులు విన్నన్
వడినిచ్చు నొక్కపుచ్చిన
యడగొంటుం బడుకక్రిందియాకులు రెండున్. 22

సీ. రమనేలినట్టి గురస్తునందు రదేమొ
నేలమిన్నులు గొల్వ నేర్చుటరుదె
మేనకాంగననంటుకాని మెత్తు రదేమొ
సృష్టికిఁ బ్రతిసృష్టి సేయుటరుదె
కడవఁబుట్టినవానిఁ గడునుతింతు రదేమొ
పాథోధి పుక్కిటఁ బట్టుటరుదె
లంకఁగాల్చినవాని బింక మెంతురదేమొ
హెచ్చుమందులకొండఁ దెచ్చుటరుదె
తే. యనుచు మదితప్పితప్పి నీళ్లానిపూని
తోడిముదుసళ్లఁ బెక్కండ్ర గూడఁబెట్టి
పట్టి తలనొవ్వ రవ్వగాఁ బవలురేలు
వట్టిపగ్గెలు ప్రేలు నవ్వారజరఠ. 23

క. అది నెమ్మదివదలని చల
మొదవఁగఁ దనసుతకుఁ బైఁడి యొకనిద్దురకుం
పదివేలమాడ లీయక
కదియఁగ నీదెట్టి విటశిఖామణినైనన్. 24

క. ఆకామసేననవబి
బ్బోకము గనుఁగొనుట మదనభూతావేశ
వ్యాకులితమానసాంబుజుఁ
డ్రై కుందుచు సోమదత్తుఁ డతివిరహమునన్. 25

క. అక్కలికి కొనఁగవలసిన
రొక్కము పురహరుఁడు దానరూపము రతిగాఁ
జక్కెరవిలుతుఁడు వెఱపు
న్మొక్కలితన మెపుడుఁ దన్ను ముంపఁగ నుండెన్. 26

ఉ. అంతట నొక్కనాఁ డతఁ డొయారము మీఱఁగఁ గామసేన నే
కాంతమునందుఁ జేరి మనసారఁగఁ బుక్కిటివీఁడె మిచ్చి గి
ల్గింత లెసంగు కౌఁగిటి బిగింపుల నింపులనింపు పారువా
వింతరొద ల్ముదంబు నొదవించునటు ల్కలఁగాంచి వేడుకన్. 27

చ. తనచెలికానితోఁ బసిఁడిదార్చక యేనల కామసేనతో
నెనసితి నిన్న నంచు వచియించిన నాతఁడు దానియింటికిన్
జని మది నిల్పఁజాలక ప్రసంగవశంబున సోమదత్తుఁ
డినవచనంబు లెల్లఁ బ్రకటించినచో వెలముద్ది యుగ్రయై. 28

క. ఏ నెఱుఁగకుండ నాసుత
తో నెనయుట యెట్టు లిట్టిదుడుకులు గలవే
కానీ రొక్కం బీయక
పోనో చూచెదము తనప్రభుత్వం బనుచున్. 29

సీ. శ్లేష్మంబు కుత్తుకఁ జిఱ్ఱుబుఱ్ఱున కఱ్ఱు
కఱ్ఱును దగ్గు లగ్గలముఁ గాఁగఁ
జన్నులు తలఁగడ సంచులవలె వెళ్లి
పయ్యెదమీఁద జంపాల లూఁగ
బీదనరాలతోఁ బెరుఁగువాఁగడుపులో
బల్ల నల్లడలందుఁ దుళ్ళిపడఁగ

బుగ్గలాహిరియూటఁ బొడము వాసనతోడి
కంకినోటను జొంగ యంకురింపఁ
తే. దిరుకొళములోనఁబడిన క్రోఁతియునుబోలె
వడకుకొంచును నేచుట నెవ్వారిఁ గన్న
గ్రుడ్లు మిడికించుచును గుడ్లగూబరీతి
వేగఁ దనయిల్లు వెడలె నావృద్ధవేశ్య. 30

తే. అంతలోననె శాలివాహను దివాణ
మునకు నేగుటకై బంధుజనులు గొలువ
వచ్చునలసోమదత్తు నవ్వారవనిత
జనని వీక్షించి సందడి జడియ కరిగి. 31

తే. వెఱ్ఱి నీ రానుకతమున వెడలునట్టి
చొక్కుబోఁదట్టి యొకకన్ను వెక్కఁబెట్టి
దడిగఱవఁబోవు వేసిచందమునఁ బట్టి
పరుసమెచ్చఁగ నూరుజప్రముఖుఁ బలికె. 32

శా. అయ్యా యల్లుఁడ యెంతపెద్దఱికమయ్యా నిల్చిమాటాడనీ
వియ్యంజాలని సెట్టివా నెనరు లే దీపట్ల నిట్లైన నీ
వియ్యా లందఱి కేదిదిక్కు మఱి నీ వెన్వెంటనే వచ్చు మా
యయ్య ల్చెప్పరె నీకు మాకుఁ దగవీయాదాయమే కంటివో. 33

క. నలుగురిలో ని ట్లాపని
పలుకఁగఁ దగదైన వెఱ్ఱిపట్టినకతనం
దెలిపెద నీకేరోసము
గలిగిన బ్రతికితిమి మంచికార్యం బిదియున్. 33

క. ఇయ్యెడఁ గలగిన రోవెల
యియ్యక నా కెఱుక లేక యిటు నే నింటం
దయ్యమువలె నుండఁగ మా
తొయ్యలితో నెట్లు కూడితో నే నెఱుఁగన్. 35

క. పైఁడేమి బ్రాఁతి యిదిగో
నేఁ డిచ్చెదు మ్రుచ్చు వగల నెలఁత రమింపం
బోఁడిమి చెడదే మఱి బురి
కాఁడవుఁ దగ కొదవలే జగంబు లెఱుంగున్. 36

తే. నిన్ననే నన్ను మొఱఁగి నాచిన్నదాని
నక్కటా యోడరేవున నమ్మికొందు
వేమిటికొ జాఱవిడిచితి వింతెకాని
యంత దబ్బఱకాఁడ వీవౌదొ కావో. 37

తే. మంచిమణులకు వెలఁ బొసఁగించువేళ
హెచ్చువెలలకు సొమ్ము చేయించుచోట
నగరి జాలెలు నీయింట నిగిడియున్న
వింత మాకేల మారొక్క మిచ్చిపొమ్ము. 38

క. అన సోమదత్తుఁ డద్భుత
మున నచ్చట నిల్చి వెఱ్ఱిముద్దియ కలలో
నెనసితి నీదు తనూభవ
ననుపమరతి నింతెకాని యన్య మెఱుంగన్. 39

తే. అనిన నమ్ముద్ది మంచి దట్టైన నేమి
నాతనూభవవలన ననంగసౌఖ్య
మబ్బెఁగద నీకు నిదియు లేదన్న నందు
వర్థ మిప్పించి యవ్వల నడుగుపెట్టు. 40

క. అని రట్టుసేయ నచ్చటి
జనములు సొమ్మీయకునికి చనదని వగదెం
చిన దాని దోడుకొనిపో
యె నతం డింటికిని రొక్క మిచ్చెద నంచున్. 41

క. చని ధూర్తచకోరమునకు
దనవృత్తాంతంబుఁ దెలుపఁ దత్కీరము న
వ్వి నిజంబుగఁ గెలిపించెద
నిను వెఱవకు మనియె వైశ్యనీరజగంధీ. 42

క. ఆవైశ్యునిఁ దత్కీరం
బేవిధి గెలిపింపవలయు నెఱిఁగింపఁగదే
నీవే జాణ వటన్నన్
భావించుచుఁ జిలుకతోఁ బ్రభావతి పలికెన్. 43

క. ఏలాగున గెలిపించెనొ
బాళిమెయిం బ్రహ్మలోకపర్యంతము నే
నాలోచన యొనరించితిఁ
జాలదు నాహృదయ మిది నిజంబుగఁ దెలియన్. 44

వ. అనిన విని యవ్విహంగమపుంగవం బనంతరకథావిధానం బిట్లని తెలుపం దొడంగె నవ్విధంబున నాధూర్తచకోరంబు దత్తప్రతిజ్ఞం బైనవిత్తంబు సోమదత్తునిచేత మూటగట్టించి దానికిం గట్టెదుర నొక్కనిలువుటద్దంబుఁ బెట్టించి పెద్దలతో నవ్వెలముద్దిం బిలిపించి దర్పణప్రతిబింబితార్థంబుఁ గైకొనుమని పలికిన నచ్చటివారును స్వప్నదృష్టంబునకు నిదియె సమానంబని నిర్ణయింప నప్పణ్యవృద్ధయు నగణ్య లజ్ఞానమ్రవదనయై సదనంబునకుం జనియెనని పల్కునవసరంబునం బ్రభాతం బగుటయు. 45

క. అంతిపురంబున కరిగి ది
నాంతమున న్నృపతిఁ జేరి నరిగెడుతమితోఁ
జెంతకు వచ్చినకోమటి
యింతింగని చిలుకరాయఁ డిట్లని పలికెన్. 46

క. రమణీ యాధూర్తచకో
రముకథ యిఁకఁ గొంత కలదు రాజవియోగ
భ్రమమడఁచి తెచ్చికోల్నె
య్యము తోడుతనైన వినుమటంచుం బలికెన్. 47

క. ఆగతి నింటికిఁ జని యా
బోగము ముసలాపె యాత్మపుత్రికతో నా
జాగెల్ల దెలిపి పరిభవ
యోగంబున మదికి ఖేద మొదవఁగ నంతన్. 48

సీ. పుట్టలమ్మ యటన్నఁబో యెంతలేదను
సందివీరుల టన్న జాము గొణుగు
నెక్కలమ్మ యటన్న నొక్కటికొదవను
బోతురాజు లటన్న బూతు నుడువు
ధర్మరాజు లటన్న దబ్బఱలే తిట్టుఁ
గంబమయ్య యటన్నఁ గ్రాసి యుమియు
గ్రామగంగ యటన్నఁ గాదా మరో యను
దేవాదులన్న గద్దించి చూచు
తే. నిన్ని దేవళ్లఁ గొలిచి నేనేమి గంటి
పోయి పచ్చని పులుగాసిపులుఁగుచేత

మోసపోయితి ననికుందు మొనయుఖేద
మారట మొనర్ప విసివి యయ్యారిబసివి. 49

సీ. నట్టింట దేవళ్లుపెట్టెఁ బెట్టినతిన్నెఁ
గొట్టించి వెసఁ బందిగూడు చేసె
మెడనున్న పాదాలు విడిచి యెవ్వరిఁగన్న
మొరుగుతలారికి మురువు చేసె
బానలో దాఁచిన పట్టుపుట్టము చించి
పొదుగుడు కోళ్లకుఁ బొత్తి చేసె
దేవాదుల కడెంబు దిగిచి కమ్మతగాని
పట్టికానికి మొలకట్టు చేసెఁ
తే. గాటిఱేనికి మీఁదుగాఁ గట్టి యున్న
గట్టివరహాని వరహానిగాఁగఁ జూడఁ
కాడఁబోఁగూడ కొక్కమాటాడకుండ
గుండనికి రంగుబంగారు గోరుసేసె. 5

తే. అంతఁ దత్పుత్రి కీరమా యింత చేసె
దాని నంజుడు దినకున్న నేను సాని
కూఁతురనె యంచుఁ దల్లిని గుస్తరించి
మఱియు నవ్వార్త యూరెల్ల మఱవనిచ్చి. 51

క. వలసిన సతికే చిన్నెలు
గలవో యచ్చిన్నెలెల్లఁ గనుపించుచు న
వ్వెలవెలఁది సోమదత్తుని
వలకు న్లోపఱిచి మేలువానిం జేసెన్. 52

తే. చేసి యొకనాఁడు మీయింటి చిలుక కతలు
చెప్పునందురు నామాట చిన్నఁబుచ్చ

కిపుడె తెప్పించరా దాని యెడను గలుగు
పొలుపు గనుఁగొని మరల నంపుదము గాని. 53

చ. అనవిని సోమదత్తుడు నిజాప్తులఁ బంచిన వారు దెచ్చినం
గనుఁగోని కామసేనయు వికాసపుమాటలుగా వచించి యెం
దును సరిలేక మించు నలధూర్తచకోరశుకాగ్రగణ్యముం
దనగృహసీమ మంచుకొని దబ్బఱ నెయ్యము నిబ్బరంబుగన్. 54

తే. కొన్ని దినములు చన రోషకుటిలహృదయ
వనజయై దీనిమాంసంబు వండుమనుచుఁ
జిలుక నెవ్వరు గనకుండఁ జేతికొసఁగ
బోనకత్తియ వెస పాకభూమి కరిగె. 55

మ. అపు డాధూర్తచకోరకీరవర మయ్యాపన్మహాంభోధి యే
నిపుణత్వంబున నీఁదఁగావలయు నీ నేర్పెల్ల శోభిల్లఁగాఁ
జెపుమా చూతమటంచుఁ బల్కి తెలియం జింతంపఁగా నవ్వి వై
శ్యపయోజాస్యకుఁ జిల్క తక్కిన కథాంశం బిట్లు తెల్పెం దగన్. 56

క. ఆరీతిఁ బాకగేహముఁ
జేరిన యావంటలక్క చిలుకం దఱుగం
గోరి పచనక్రియాచిం
తారతితో నీలకత్తి నలుగడ నెమకన్. 57

ఉ. అత్తఱిఁ దాని జూచి శుక మంగన యెంతటిపుణ్యమూర్తివో
బత్తిజనింప నాదుచెఱఁ బాపెదుఁ గావున నిన్నువంటి య
త్యుత్తమ కేను నేర్పెడు ప్రయోజన మున్నదెయైన నామనం
బుత్తలమందె నీకిటుల యో జరయింతటి పాటొనర్చెనే. 58

క. ఏను ద్రికాలం బెఱుఁగుదు
మానిని పదినాళ్లలో సమంచితరేఖా
సూనవయి నిండుజవ్వన
మూనంగా నీకు హేతు వున్నది సుమ్మీ. 59

వ. ఇంత యెఱింగిన నీ కీయపాయంబుఁ దప్పించుకొనరాదే యని యంటివేని యలంఘనీయంబగు విధివిధానం బిట్టి దని నిశ్చయించి యున్నదాన నది యట్లుండె నవయౌవనాపాదకం బగు నొక్కమంత్రంబు నా కభ్యాసం బైయుండు; నది నాతోడనె పోయెడుం గదా యను విచారంబు తీరకునికి నీకు నుపదేశించెద దానివలన నీకుఁ బ్రాయంబు వొడముట కడుగనేల నీవిచ్చినవారికిం గలదు కాలయాపనంబు సేయక యిచ్చోట గోమయంబున నలికి మ్రుగ్గువెట్టు మనుటయు నావృద్ధ సంభ్రమాశ్చర్యానురుద్ధయై యచ్చిలుకఱేని నచ్చట నునిచి తదుక్తప్రయోజనంబులకుం బోయిన. 60

క. ఆధూర్తచకోరము గరు
దాదృక్పటపటనినాద మడరం బరదు
స్సాధంబై వరమానా
బాధత్వర మెఱయఁగా నభంబున కెగిరెన్. 61

తే. ఎగిరి చెంగట నీశానగృహములోన
గూళ్లు పెట్టిన చిలుకలఁ గూడుకొనియె
దానిఁ గానక భయమంది బోనకత్తె
కార్కవాకవపాకపాకం బొనర్చె. 62

క. ఆకామనేన మదిఁ జిం
తాకలుషత మాని సోమదత్తునితో నే

లేకున్నతఱి బిడాలం
బాకీరముఁ బట్టి చంపె ననుచుం బొంకెన్. 63

క. అటుకనుక నేర్పుగలిగినఁ
గుటిలాలక నేఁడు నీవు కోరినపనికే
గుట తగు లేకుండినచో
నిటనుండియె మరలు మని శుకేంద్రుడు పలికెన్. 64

తే. అంతలోనన యరుణోదయంబు మించ
నాప్రభావతి యంతఃపురాంతరమున
కరిగి యానాఁటి రేయి భూవరునిఁ జేర
నేగుచోఁ జిల్క యక్కల్కి కిట్టు లనియె. 65

తే. అతివ ధూర్తచకోరశుకావతంస
మంత చేసిన గామసేనాంబుజాత
గంధిఁ జెఱతు నటంచుఁ గంకణము గట్టె
నెట్లు చెఱపంగవలయు నీ వెఱుఁగఁ జెపుమ. 66

క. అని పలికి తెలియ నేరని
వనితామణిఁ జూచు కీరవల్లభుఁ డది దా
వినిపింపఁ దొడఁగె ననితర
జనితర సంస్తవ్యవచనసంభావ్యముగన్. 67

క. ఆరీతిఁ దలఁచి ధూర్తచ
కోరము తత్క్రియకు వేళఁ గోరుచు నుండన్
మారునిచెలిఁ జెనకెడు నొ
య్యారముగల కామసేన యంతటిభక్తిన్. 68

క. ఒకనాఁడు కోవెలకు నే
గి కపర్దికి మ్రొక్క గర్భగృహమునఁ దన్మూ

రికి వెనుక డాగికొని యా
శుక మిట్లని పలికెఁ దద్వచోగతిగాఁగన్. 69

ఉ. మెచ్చితి నీదు భక్తికి సమిద్ధవిశుద్ధకళాభివృద్ధికిన్
దచ్చనగాదు నాపలుకు దప్పదు చొప్పడుఁ గాయసిద్ధి యే
నిచ్చెద నీవుఁ దల్లియు మఱెవ్వరితో నెఱిఁగింపఁ బోక యీ
వచ్చుసరోజశాత్రవుని వారమునాఁ డిటు రండు వేడుకన్. 70

క. తొలునాఁడు బోడలై ని
శ్చలభక్తిం జోగులకును జంగాలకు మీ
యిలు చూఱవిడిచి యిటురా
వలయున్ వైష్ణవుల కొసఁగవల దేమైనన్. 71

క. వారు శివద్రోహులు గద
యీరసమున శైవమతము హెచ్చఁగరా దం
చేరీతినైనఁ జెఱతురు
నారీమణి వారిమాట నమ్మకు మింకన్. 72

క. అని పల్క నాల్గుదిక్కులు
గనుఁగొని శంకరునిమాటగా నమ్మి కృపా
వననిధి హర త్రిభువనపా
వన ధీరస్వాంత యనుచు వర్ణించి వెసన్. 73

క. గుడివెడలి వైష్ణవులు గను
పడకుండఁగఁ జెలుల నరిగ పట్టుమటంచుం
బడఁతి తన యింటికడకున్
పడిఁ జని నిజజననిఁ బిలిచి నగుమొగ మలరన్. 74

క. హరుఁ డానతిచ్చినాఁ డె
వ్వరితోఁ జెప్పకుము సోమవారమునాఁ డి

ర్వురకు నెలప్రాయ మిచ్చుం
జరయు న్మృతి లేదు సంతసం బయ్యఁ గదా. 75

చ. ఆన విని వృద్ధవైశ్య పులకాన్వితయై నవయావనంబు నే
నెనసితినేని యీపడుకటిల్లు మదీయము నీవు వేఱె యిం
టను బవళింపుమన్న జగడాలకు రాకుమె యూర నీవు నే
నును గడియింపఁ జొచ్చినఁ దనూభవ గోడలు పైఁడిసేయమే. 76

సీ. ఇప్పుడే తెచ్చి నీ కిచ్చెదఁ గాని యీ
తళుకుఁగమ్మలు నేనె తాల్చికొందు
నృపులచేఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీ
పెద్దముక్కఱ నేనె పెట్టికొందు
నృపునిచేఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీ
బొగడలజోడు నేఁ బూన్చికొందు
నెటులైనఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీ
మట్టెలు నేఁ గాళ్లఁ బెట్టికొందు
తే. నౌర నీవు గడించిన వనుచు నా కొ
సంగకుండిన మఱి నేను సంతరించు
సొమ్ము మీఁదట నీ కీయఁ జూడు నాప్ర
తాప మని పల్కి యుత్సాహచాపలమున. 77

సీ. కుఱుచనెరు ల్దువ్వికొని కొప్పు సవరించుఁ
బరువెత్తి కాటుకబరిణ వెదకు
సొంపుతో నద్దంబుఁ జూచి పండ్లిగిలించుఁ
బడఁబోవుచును ముద్దునడలు నడచు
గోరంబుగా సారె గుంటకన్నులు ద్రిప్పుఁ
జూపఱ నగు నోరచూపుఁ జూచు

గరిడి కేగెదనంచుఁ గాసె దాల్పఁగఁ బోవు
బాకినో రెగనెత్తి పాటపాడు
తే. నింటి కెవ్వారు వచ్చిన నెనయుఁ దనకు
నదిగొఁ బైఁడీయ వచ్చి రటంచు లేని
బింక మెక్కించుకొని సారె బిగియునపుడె
ప్రాయ మేతెంచె నంచు నప్పణ్యవృద్ధ. 78

తే. ఇప్పు డెట్లున్న దాన మీ రేల చెప్ప
రౌర లెస్సాయె నని యొద్దివారిఁ దిట్టు
గుంపుగొని చూచువారలఁ గొట్టఁబూను
వెరఁగుపడి యింటిబిడ్డల వెక్కిరించు. 79

వ. ఇవ్విధంబున బహుప్రకారదుర్వికారంబులు మీఱఁ గుమారిం జేరి. 80

క. ఏమో తెలుపఁగ వచ్చితి
భామా యీలోన మఱపుపాటిల్లెఁ గదే
యేమీ మఱవక తనకు
న్సేమంబును బ్రాయమిచ్చు శివుఁ డుండంగన్. 81

క. గడువీలో మన మేగతి
నడువన్వలె నేమి చెప్పినాఁడు శివుఁడు నీ
వడిగితివొ లేదో తెలియం
బడుచువుగద నీకుఁ దెలియఁబడ దింతైనన్. 82

తే. పడుచవే గాకయుండినఁ బ్రాయ మిపుడె
యిమ్మనఁగరాదె సోమవార మ్మటంచు
గడు వొడటియేల యింతలోఁ గాలమేమొ
దేశమేమొ కదా యంచుఁ దెలియునటవె. 83

క. అనిన విని కామసేనా
వనజానన విన్నయట్టి వచనము లెల్లన్
వినిపించిన నేమేమీ
యని యమ్ముదిజంత చింత యాకులపఱపన్. 84

క. బ్రదు కెల్లఁ జక్కనగునని
మది నమ్మితిఁ గూఁతురా ప్రమాదము రాదే
తుది నిల్లు చూఱవిడిచిన
నిదియేమో మీఁది కార్య మెవ్వఁ డెఱుంగున్. 85

తే. ఆశపడి బోడనైన నేనగుదుఁగాని
యింటిసొ మ్మొక్కకాసైన నీయ నొకని
కొల్ల నే జవ్వనంబు మొఱ్ఱో యి దెట్లు
తగదు నీమాట నే వినుదానఁ గాను. 86

క. అనఁ గామసేన యంతటి
పని రారాదమ్మ కుముదబాంధవధరుఁ డా
డినమాటకుఁ దప్పటవే
యని సమ్మతిపఱిచి నిర్భరాహ్లాదమునన్. 87

క. త్యాగధ్వజ మెత్తించి స
మాగతయాచకుల కీశ్వరార్పణ మనుచున్
బోగముచెలి ధనమెల్లం
బ్రోగులుగా నొసఁగె సకలము న్వినుతింపన్. 88

సీ. పట్టెనామంబుఁ గీడ్పఱిచి నూతనవిభూ
తిని ద్రిపుండ్రంబులు దీర్పవచ్చు
ద్వయము పోఁబెట్టి శైవపురాణపద్యపా
ఠికల వేమాఱుఁ బఠింపవచ్చు

వనమాలికలు పాఱవైచి రుద్రాక్షపూ
సలపేరు లఱుత నెక్కొలుపవచ్చు
విష్ణుసుకీర్తన విడిచి శంకర హర
శబ్దము లుచ్చరించంగవచ్చు.
తే. గాని భుజములు కాయలు గాచి యున్న
తప్తముద్రలు మఱుపెట్టఁదరమె యనుచు
వైష్ణవు లభావవైరాగ్యవైభవంబుఁ
బొంద నది శైవుల కొసంగె భూరిధనము. 89

వ. ఇవ్విధంబుగా నిజాంశుకావశిష్టంబుగా గృహప్రముఖంబు లగుధనంబులు సకలభూషణంబులును ద్యాగంబు గావించి యమ్మించుఁబోఁడి జననీయుతంబుగాఁ బ్రతీక్షించుచు నయ్యిందువాసరంబు ప్రసన్నం బగుటయు. 90

చ. తిరుపతి కొప్పు లందముగఁ దీర్చిన బూడిదబొట్లు మంచి వే
ర్పఱచిన మించునట్టి రుదురక్కలపేరులుఁ గావికోకలున్
హరశివశబ్దము ల్దగ మృగాంకకళాధరుగేహసీమ కే
గిరి గుడిమేళము ల్పొదలఁ గిన్నరకంఠియుఁ దానితల్లియున్. 91

క. చని భావజారి సేవిం
చి నిజంబగుభక్తి నొంది చెంత వసింపం
గనుఁగొన వచ్చిరి బహుయో
జనదూరమునందుఁ గల్గు జనసంఘంబుల్. 92

తే. ఇవ్విధంబున భూజను లెల్లఁ జూడఁ
బ్రొద్దుకైవ్రాలుదాఁక నప్పొలతు లుండి
యేమొ సర్వేశ్వరుం డిట్లు తామసించె
ననుచుఁ జింతించుచున్న యయ్యవసరమున. 93

తే. గోపురముమీఁద ధూర్తచకోరకీర
మెక్కి ప్రజలార మీకేల తిక్కపట్టె
వీరిబగిసికి మఱి గారవించి హరుఁడు
కాయసిద్ధి యొసుగునే కల్లగాక. 94

క. అని వారు తన్నుఁ దునుమం
బనుచుటయును వారికొంప చెఱచుటకై దే
వుని వెనుకనుండి తా నా
డినమాటకు వార లచ్చటికి వచ్చుటయున్. 95

క వినిపించిన నింతేనా
యని యందఱు నవ్వ లజ్జ నానతముఖులై
చని రవ్వేశ్యలు తచ్ఛుక
మునకుం గలనేర్పు నీకుఁ బొసఁగ న్వలయున్. 96

క. అనినఁ బ్రభావతి మది మిం
చిన వెఱఁగున నిన్నువంటి చిలుకలనేర్పు
ల్గననగునె యనుచు వేగుట
గనుఁగొని వెసం జనియెఁ గేళికాగృహమునకున్. 97

క. ఆనాఁటిరేయి బాళి
న్భూనాయకమౌళిఁ జేరఁబోయెడుతఱి న
మ్మీనాయతాక్షి జూచి ప్ర
సూనాంబకతురగ మతులసూక్తిస్ఫురణన్. 98

క. వేసారక మద్వచనసు
ధాసారము మెచ్చ నీకె తగుఁగావున నీ
వీసారి యొక్కకథ విను
మాసారిజయస్తనద్వయా యని పలికెన్. 99