శుకసప్తతి/పదునాలుగవకథ
త్పాకము రాకనిశీథిని
పోకఁడ గని యంత నంతిపురమున కరిగెన్. 401
క. చని దిన మను వననిధినీఁ
దినయదియై రాత్రి పేరి దీవిం గని య
వ్వనజాక్షి యూఱడిలి నృపు
నెనయం జనుదేఱఁ జిలుక యిట్లని పలికెన్. 402
శా. కాంతా సంతసమయ్యె నామది వధూకందర్పుఁడౌ నద్ధరా
కాంతుం జేరఁగ నుత్సహించియును మద్గాథాసుధాలోలుప
స్వాంతత్వంబునఁ జేరవచ్చెదు భవత్సౌలభ్యసాద్గుణ్య మే
నెంతంచు న్గొనియాడ నేర్తు మఱి నీవే నీకు జో డిమ్మహిన్. 403
క. [1]క్రమ్మఱ నొకకథఁ దెలిపెద
ధమ్మిల్లోత్ఫుల్లకుసుమధామంబులపై
దుమ్మెదలు చిమ్మిరేఁగం
గొమ్మా తలయూఁచి మెచ్చికొమ్మా పిదపన్. 404
పదునాలుగవకథ
చ. అని తెలుపందొడంగె విను మంబుధి మోహపురాణివాసమై
తనరెడు కృష్ణతీరమునఁ దామ్రపురం బనుకాఁపుటూరు భూ
వనరుహగంధి నెమ్మొగము వైఖరిమీఱు విశేషకాంతి వ
ర్తనము వహించి మించు విదితంబుగఁ జూపఱ కిం పొనర్చుచున్. 405
చ. కొలుచు సమగ్రభంగి నొనగూడ దివాణపువారిచేతికాఁ
కలుహుసివోవఁగాఁ గఱవుకాల మెఱుంగక పూసబొట్టులం
బలికలినీళ్లుఁ జందనపుమానికెఁ గొల్చినమాళ్లు గల్గి శో
భిలుదురు రెడ్డిబిడ్డలు కుబేరుని పిల్లలనంగ నచ్చటన్. 406
[2]తే. అచట నొక రెడ్డి వెలయు హలాంకుఁ డనెడి
పేరుగలవాఁడు కులములోఁ బెద్దయింటి
వాఁడు బొంక నెఱుంగనివాఁడు వాఁడు
పట్టినదియెల్ల బంగారు పనులపట్ల. 407
సీ. అచ్చమై వాకిట రచ్చఱాయి మెఱుంగు
పంచతిన్నెలు గొప్ప పారిగోడ
కంపతెట్టులును రాకట్టు ముంగిలి మల్లె
సాలెదేవరయఱచవికె యొకటి
కోళ్ల గూండ్లును గొఱ్ఱు కుఱుగాడి యేడికో
లులు కాఁడి పలుపులు గలుగు నటుక
దూడలు పెనుమూవకోడెలు కుఱుకాఁడి
గిత్త లీనినమేటిగిడ్లదొడ్డి
తే. యిఱుకుమ్రానుపెరంటిలో నెక్కుబావి
మునుఁగలును జొప్పపెనువామి జనము రుబ్బు
ఱోలు పిడకలకుచ్చెల దాలిగుంత
దనర నిరతంబు వెలయు నాతనిగృహంబు. 408
తే. అతనికి సుకేశి యనియెడు నాలి వెనుక
నబ్బె గుణవతి యనఁగ నిల్లాలొకర్తు
చిత్తసంభవు చేకత్తి చివుకుపోవఁ
జేవదొరకినమాడ్కి నచ్చెరువు గాఁగ. 409
సీ. సాక్షాత్కరించిన జలదేవత యనంగ
నీలాటిరేవున నీటుచూపు
రథముపైఁ గనుపించు రతిదేవి యన జొన్న
చేనుఁ గాచుటకు మంచియ వసించుఁ
గేళికాగళితమౌక్తికము లేఱెడు వనాం
బుజపాణినా నిప్పపూవు లేఱుఁ
గాలచక్రముఁ ద్రిప్పు కమలనాభునిశక్తి
నా నూలువడుక రాట్నంబుఁ ద్రిప్పు
తే. మేఁతగొని వచ్చు తమ్మిరుమ్మీపిరంగి
దొరతురంగీవిలాసంబు దొరయఁగొల్చు
గంప లింటికిఁ దెచ్చు నాకాపుబిగువు
టొగవగల గుబ్బలాఁడి యొక్కొక్క వేళ. 410
సీ. తిరునాళ్లకై పోయి తిరుపతిలోఁ గొన్న
నొక్కుపూసలపేరు టెక్కుసూప
జిగికుందనముఁ గూర్చి మగఁడు చేయించిన
మెఱుఁగుకమ్మలు వింతయొఱపు నెఱప
దనుఁ జూడవచ్చుచోఁ దల్లి తెచ్చిన యట్టి
యల్లికనాను సోయగ మెసంగ
మొదటికోడలి దంచుఁ దుది నత్తయిచ్చిన
చుట్టుమెట్టెలజోడు సొంపునింపఁ
తే. గడియములు కెంపురవలయుంగరము వెండి
కుప్పె సౌరంబు కుఱుమాపుకూనలమ్మ
చీర కుడిపైఁటలోపలి సిస్తుఱవిక
యెసఁగఁ జరియించు నిట్టు లయ్యెమ్మెలాఁడి. 411
తే. దానివలలకుఁ జిక్కి మోదమునఁ జొక్కి
యుండెడుహలాంకుఁ డొక్కనాఁ డుదయవేళ
మితి యెఱుంగక తుంపురు ల్మీఁదఁబడఁగ
జొన్నకూడును మజ్జిగ జుఱ్ఱి లేచి. 412
సీ. మొలకు సగంబును దలకు సగంబుగాఁ
గట్టిన యయగారి కరలచీర
పైనల్లకముల పచ్చడమును దోలు
పావలు చేతిలోఁ బట్టుకఱ్ఱ
కత్తెఱగడ్డంబు కఱకు జుంజురు మీస
ములు రోమశంబైన పలకఱొమ్ము
మొలయుంగరము వ్రేల వలముగాఁ దీర్చిన
నాభినామము బీదనరము లమరు
తే. గడుసుఁబిక్కలు గలిగిన మడమలమర
వెంట నిరువంకఁ బెంపుడువేఁపు లరుగఁ
గెలనఁ దగు నెడ్లకొట్ట మీక్షించికొనుచు
నింటివెలుపలి తిన్నియ కేగుదెంచె. 413
చ. దుసికిలజాఱు కోరసిగ దుప్పటినీటు లలాటిపట్టికం
బొసఁగు విభూతిపైఁ బసుపుబొట్టును దొట్టిన కల్లు చొక్కు వె
క్కసముగ నెఱ్ఱవాఱిన వికారపుఁ జూపులుగాఁ గనంబడ
న్వెసం జను దెంచె నొక్కబవనీఁడు తదీయసమీపభూమికిన్. 414
తే. పచ్చి జమలిక వాయించి వరుసతోడఁ
దాతతండ్రుల చౌదరితనము లెల్ల
నెన్ని కైవార మొనరించి యింపు నెఱప
నతనిఁ గూర్చుండనిడుకొని యాదరమున. 415
మ. కలలో దేవర చెప్పె రేయి యెదుటం గన్పించి నెయ్యంబు వా
టిల నీపాలికి దేవుఁ డింక బవనీఁడే యంచుఁ దానాఁడగా
వలె నేబాఁపనమొప్పెలైన సరియే వారెల్ల సాత్కాలు నీ
వలె గోరించిరె నిన్నె కొల్తు ననుచు న్వర్ణించుచో నంతటన్. 416
తే. ముదుక తలపాగయును బాహుమూలమందు
గవిలె చర్మపుటొఱలోని కత్తిగంట
మలతి నీర్కావిదోవతు లమరి గ్రామ
కరణ మేతెంచి రెడ్డిచెంగట వసించె. 417
క. ఈరీతి నెల్లవారలుఁ
జేర హలాంకుండు రచ్చసేయఁ దదీయాం
భోరుహముఖి సరికాఁపుటొ
యారులఁ గూడుకొని నిజగృహాంతరసీమన్. 418
తే. దివసమంత వితాపోయె నవుర రారె
గుంపునంపును లేకుండ గుండుపోగు
గాఁ బదాఱింటితరమునుగాఁగ నూలు
వడకరే యంచు నొండొరు ల్నొడివికొనుచు. 419
క. వడిదారము చెవులుం ద్రొ
క్కుడుపలకయు దిండు కదురు గుంజలును ద్రొ
క్కుడుబొమ్మయునుం ద్రిప్పుడు
పుడకయునుం గలుగు రాట్నములు గైకొనుచున్. 420
తే. ఎడమదెస దొడ్డుగా వైచి యేకులెల్లఁ
గెలనఁ బలువగ వేఁపుడుగింజ లునిచి
చేవపీఁటలమీఁద నాసీనలైన
వారలై వావివరుసలు నదరికొనుచు. 421
సీ. గుంపునంపును లేక కొనసాగఁ బ్రోగువెం
ట మెఱుంగుఁజూపు పేరెములువారఁ
బ్రాయంపుపడుచులఁ బనిగొంటివే దూది
యనెడి పాటలఁ దేనెచినుకు లీన
నేకుతోఁ జెలఁగు కేలెత్తుచో భుజమూల
కాంతులు బయలు బంగారు సేయఁ
బుడుకఁ ద్రిప్పెడురయంబునఁ బైఁటజూచుచో
మినుకుగుబ్బలు తళుక్కని రహింప
తే. ముడిచికొన్నట్టి తెలిగంజి మడతచీర
లరిదితొడనిగ్గుచే పసు పంటినట్లు
పొసఁగఁ జరణాభ త్రొక్కుడుబొమ్మమీఁద
బచ్చెన ఘటింప వడికి రప్పద్మముఖులు. 422
సీ. పోలిరెడ్డికి మగపోఁడిమి లేదుగా
గాది కేలాగునఁ గడుపునిక్కె
వదరకే మగవారు వచ్చెద రదె చక్కఁ
జెక్కుకో పయ్యెదచెఱుఁగుకొండి
యోసి లేవే మల్లి వేసాలు సేయకు
మగవార లెఱుఁగని మర్మ మెద్ది
నీ కేటి సిబ్బితి నెరరాగవై మించి
యడఁగఁదొక్కినదాన వత్తగారిఁ
తే. బెద్ది వినలేదె మనసుబ్బు పెరఁటిగోడ
దాఁటగా మామ గనెనఁట యేటి సుద్ది
యెసఁగి మగఁ డొల్లకున్న నదేమిసేయు
ననుచుఁ గసివోవఁ బలుమాటలాడికొనుచు. 423
తే. ఎన్నికలుపట్టి పుంజంబు లేర్పరించి
పంటకఱ్ఱలు మఱితోడుపడగ లూఁచ
కండె లొనరించి చాలించి కాఁపుటింతు
లున్న యవ్వేళ నద్భుతం బుట్టిపడగ. 424
సీ. నునుపుగా దువ్వి తీర్చిన కెంపుబాలేందు
పసమీఱు నొసటి కెంబసుపుబొట్టు
మెడతోలు పావాలు నిడుదగవ్వలదండ
సన్నంపుఁ జికిలిదర్శనపుఁ బేరు
నెడమచేఁ బళ్ళిక నిడినబండా రన్య
పాణిఁ బట్టిన నాగపడిగకోల
కటిఁ గాసెకట్టుగాఁ గట్టిన చెంగావి
నిద్దంపుగుబ్బల నీలిఱవికె
తే. పదయుగంబున గజ్జెలు బాగునెఱపఁ
బరశురామునిపైఁ బాటఁ బాడికొనుచు
సొంపుమీఱంగ నెక్కలో జోగటంచు
ముంగిటికి వచ్చి నిలిచె మాతంగి యొకతె. 425
తే. దానికై యిల్లుగల రెడ్డిసాని జోగు
పెట్టుటకుఁ బోయి పొదిగిలిపట్టి నిలిచి
గణకుఁ గని వానిప్రాయంపు కలిమియెల్లఁ
గొల్లలాడుదునని యెంచికొనియె నంత. 426
సీ. మెలిపెట్టి చుట్టిన తెలిపరంగి ముడాసు
పైలవేటాడబ్బు పనులఁ జెలఁగు
బంగరువ్రాఁతలపట్టు హిజారు కం
బరు చీనినిమతానిపాడునొసలు
తనుకాంతి గనుపింపఁ దనరు నంగీజోడు
వలిపెంపు శాలువ వల్లెవాటు
పడుదలలోన డాబాకత్తి వదలుపా
పోసులు గోరంటఁబొలుచు గోళ్లు
తే. నడుమసీలున్న తోలుడా ల్బెడఁగుసూప
నభయముగ వెంట నరుదెంచు సభరువాఁడు
నమరు ముస్తైదుతేజితో నరుగుదెంచె
దారుణాకారుఁడైన యుద్దారుఁ డొకఁడు. 427
తే. వచ్చి యయ్యూరివెలుపలి రచ్చరావి
క్రేవ దుర్వారుఁడై ‘తలారికి బులావు
ధగిడికే’ యనుమాటకుఁ దలఁకి రెడ్డి
తోడివారలతోఁ జేని త్రోవఁబట్టె. 428
క. అంతటఁ దదీయగేహా
భ్యంతరముం జొచ్చెఁ గరణ మతిభయమునఁ ద
త్కాంత తదాకృతి గొంతకుఁ
గొంత విలోకించి మించి గుణవతి యాత్మన్. 429
తే. కోరినప్పుడె యీతనిఁ గూర్పవచ్చె
నొక్కొ నాపాలి యాదేవుఁ డొకరిపాలి
బంటుగా కిట్లు తురకరూపంబు దాల్చి
యనుచుఁ దలపోసి యేకాంతమగుటఁ దెలిసి. 430
క. అళుకక రమ్మని భయముం
దెలుపుచుఁ దద్భూమిసురుని దేవర యఱలో
పలనుంచి కమ్మలూఁగం
గులుకుచుఁ దాఁ గడపమీఁదఁ గూర్చుండె వెసన్. 431
తే. కలికిచూపుల మాటల కందువలను
జేరిక లొనర్చి మేకొనఁ జేసి వాని
నెనసి యప్పుడె దేవరయిల్లు పడుక
యిల్లు గావించె నంతఁ బూర్ణేందువదన. 432
క. అది మొదలుగ నాతనిచే
వదలక మఱి తాననంగ వాఁడనఁగా నె
మది వేఱులేక తమి న
మ్మదవతి మన్మథునిలంకె మానిసి యయ్యెన్. 433
సీ. కలికిమాటలు కిలకిలనవ్వు లోరచూ
పులు మోవిఱుజుపులు గులుకునడలు
బెళుకునందములు గొబ్బిళ్లపాటలు కొప్పు
సవరించు నేర్పు చేసన్నవగలు
గోటిచిమ్ములు తెచ్చికోలు నివ్వెఱలేని
వెఱుపును నెచ్చెలి వెన్నుచఱపు
మోముద్రిప్పులు బొమముడి ఱొమ్ముతాటింపు
రానిజంకెన కావరంపుఁ బొవరు
తే. మొలకసిగ్గులు వట్టి కొంకులును వలపు
చాటునిలకడ లలఁతివేసటలుఁ జూపు
గడియలో వాని దారునఁ గన్నయపుడె
కొమ్మ మారునిజంత్రంపుబొమ్మకరణి. 434
సీ. పొరుగూరి సంతకుఁ బోవువారలచేతఁ
దెప్పించుఁ బోఁకలు తెల్లనాకు
మితిలేని కూలి చాకెత కిచ్చి కైకొను
గడియకొక్కటి గాఁగ మడుపుఁజీర
లూరినంబికి మోహ మూరించి తెప్పించి
పూను మాపటివేళఁ బూవుటెత్తు
లగసాలె కేమైన నర్పించి పలుమాఱు
మెఱుఁగుపెట్టించుఁ గ్రొమ్మిసీమికమ్మ
తే. లనుదినంబును దలగడు గవధరించు
నరిది గందపు నెఱపూఁత లలవరించుఁ
గమ్మసారాయికై సంచకర మొసంగు
చిత్తజాయత్తయై కాఁపుచిన్నెలాఁడి. 435
వ. ఇవ్విధంబున నున్నంత. 436
క. ఆపల్లె నుల్లసిల్లెడు
కాపులకుఁ బురోహితత్వగౌరవమునకుం
బ్రాపగుచు నొకమహీసురుఁ
డేప్రొద్దు సుశర్మ యనఁగ నింపెసలారున్. 437
ఉ. అక్కట పొట్టచించిన నొకక్షర మైనను రాదు టెక్కులుం
డక్కులు గాని య మ్మనిన డ మ్మననేరఁడు వేదమందు సొం
పెక్కిన యన్నివిద్యల నహీనుఁడ నేనని కాపువారిచే
మ్రొక్కులు గొంచు నాతఁడు సమున్నతగర్వము హత్తివర్తిలున్. 438
చ. తెరువరు లైనయట్టిపరదేశమహీసురు లర్థవాంఛఁ ద
త్పురమున కేగుదేర వెడదోస్యములం బచరించి వారి ని
ర్బరగతినోడఁ గూయుఁ దమబాపఁడె గెల్చెనటంచుఁ గాపుల
చ్చెరుపడ నాదుకంటికి దిసింతురె వీరని యాతఁ డుబ్బునన్. 439
క. జలముల మొసలియు గుహలోఁ
బులి గందపుమ్రానిమీఁద భుజగముబలె నా
హలిక గ్రామంబున నతం
డలరుం బరు లెవ్వరైన నడుగిడకుండన్. 440
క. అతని కుటుంబిని పతిదే
వతయై వర్తిల్లు శీలవతి యనఁగ నరుం
ధతికిం బ్రతియై గుణసం
తతికిం గతి యగుచుఁ బురజనంబులు మెచ్చన్. 441
తే. అమ్మహీసురుఁ డొక్కనాఁ డాహలాంకు
డెలమి వింతటి పండుగ కలిమి వెలయఁ
జేయునార్తలు వినుచుఁ దాఁ జేనికడకు
నేగు తత్తఱ మొనగూడ నిల్లువెడలి. 442
సీ. అఱుతఁ గీల్కొన్న ముత్తరములథావళి
యంసాగ్రమున గోనె యసిమిసంచి
కట్టినముతకనీర్కావిధోవతియు నా
పై బిగించినయది ప్రాఁతబట్ట
తలచుట్టుకొన్న చింపులబైరవాసంబు
చెమటచేఁ గరంగెడు సేసబొట్టు
మారేడుబుఱ్ఱలో మంత్రాక్షతంబులు
పదములవిజ్జోడు పాదరక్ష
తే. లొడిసి పంచాంగ మొకకేలఁ బొడుపువ్రేల
వెండియుంగరమును మెడవ్రేలుముఱికి
జందెములు నవ్యయాచ్యుతస్మరణమాస్య
సీమఁ గనుపింపఁ బఱతెంచెఁ జేనికడకు. 443
ఉ. వచ్చినఁ బెద్దరెడ్డి సుగవాసివి మేలిపుడైన నీడకున్
వచ్చితె యంచు బావయనువావిని ద్రస్తరలాడి బాపఁ డా
యిచ్చటఁ జల్లువిత్తు ఫలియించునె వేళగుణం బెఱింగి నా
యిచ్చకు మెచ్చుగా వదరు మిప్పుడ నన్విని యాతఁ డుబ్బుచున్. 444
ఉ. చెప్పిన నేమి లేదుగద చింపులదోవతిఁ జూడు మేను మీ
కెప్పుడు మేలుఁగోరి మఱియెక్కలిదేవికి గ్రామగంగకుం
జప్పిడిఁ దించు మ్రొక్కుకొనుజాడ లెఱుంగవె యిట్టిపట్ల నే
చొప్పున నాశ్రితుం గరుణఁజూడరుగా కదియేల యిత్తఱిన్. 445
ఉ. నిన్నటిరేయి నాయెదుట నిల్చెఁజుమీ కలలోన మీకు మే
ల్పన్నెడు పేరటా ల్నిలిచి బాపఁడ రెడ్డికిఁ దెల్పరాదె న
న్నెన్నఁడు దిన్నె బెట్టి నుతియించుచుఁ గొల్వరటంచుఁ బల్కె నా
కన్నుల నీరు దొట్టి పులక ల్గనుపట్టెడుఁ జూడు మిప్పుడున్. 446
క. అన రెడ్డి మనసు గరఁగం
గనుఁగవ నీరొదవి జాఱఁగను బాపఁడ నే
వినలేను తాళు చెప్పకు
మని మునుపటి దానిచిన్నె లాత్మకుఁ దోఁపన్. 447
క. ఆలని యెంచక మనియెడు
కాలంబునఁ దల్లిమాట గడవక దానం
నేలనిడి కాలరాచితి
నీలాగున వచ్చుననుచు నెవ్వఁ డెఱుంగున్. 448
తే. అనుచు ధైర్యంబుఁ దాల్చి యాయమ్మసత్య
మప్పుడేకంటి నింకఁ దా నడిగినట్లె
తీనెఁ బెట్టుక కొలిచెదఁగాని నేఁడు
మొదలు నామాటుగా నీవు మ్రొక్కికొనుము. 449
తే. అనియె నీరీతిఁ దానికై యవనిసురుఁడు
సివముపుట్టించి యపుడు చేఁజేతఁదీసి
కొనియెఁ బుట్టెఁడువిత్తులు కొలుచు మంచి
వేళవ చ్చితి ననుచు భావించుకొనుచు. 450
వ. అయ్యవసరంబున. 451
చ. తలపయిఁ బైఁటచుట్టపయిఁ దాల్చినపుట్టికలోనఁ బొల్చునం
బలిగల పంటియుం జిలుమువాయఁగ దోమిన కంచము న్సము
జ్జ్వలమగుచూపు డాలు ముఖవారిజవైరికి వెల్లపాపడ
ల్బలెఁ దగరెడ్డికోడలు విలాసముతోడుత నేగుదెంచినన్. 452
తే. అప్పు డవ్విప్రుఁ డలికఘర్మాంబుపటలి
జాఱి వీడెంపుచొళ్లుతో సంధి సేయ
బెరుఁగు నివ్వెరతో నోరు తెఱచికొనుచుఁ
దప్ప కీక్షించె దానిసౌందర్యమహిమ. 453
తే. చూచినప్పుడే విలుపాఱవై చి సరస
తామరసభీమతరగదాదండ మెత్తి
దండహత్తి మనోజుండు దండవెట్టె
నమ్మహీదేవు నెమ్మది రిమ్మవొడమ. 454
ఉ. అంతట రెడ్డి పంపఁగ మృగాక్షిగృహంబున కేగ దాని యా
ద్యంతశరీరసౌష్టవమునందు మెలంగు మనంబులోపలం
గంతులుగోరి కోరికలు గంతులు వైవఁ గృషీవలాజ్ఞ గే
హాంతర మొంది చెందు విరహజ్జ్వర ముజ్జ్వలమైనఁ గుందుచున్. 455
తే. అద్ధరాదేవుఁ డాహలికాబ్జవదన
గన్న కన్నుల కింటిలో గరితరూప
మెట్టులుండునొ కాని సహింపఁడయ్యెఁ
దద్బహుకృతోపచారవిధంబు లెల్ల. 456
సీ. కీలుగం టిదియేల పోలఁగా నునుఁగొప్పుఁ
గీల్కొల్పు కొమ్మంచుఁ గీజుపోరుఁ
బసుపుబొ ట్టిదియేల నొసటవిభూతిరే
ఖ యమర్చికొమ్మంచుఁ గంటగించుఁ
గాసెక ట్టిదియేల కపురుగా మైజారు
చీరఁదాల్చు మటంచుఁ జిమ్మ రేగు
లక్కాకు లివియేల చొక్కంపుటంచు క
మలు ధరించు మటంచు నలుకఁ గాంచు
తే. భార్యతో నాయమయు వెఱ్ఱిపట్టె నేమొ
యనుచు నాలాగె కావింప నతఁడు హలిక
లికుచకుచవేషమేకాని యకట దాని
యొరపు లేదని యాత్మలోఁ బరితపించు. 457
తే. గేస్తురా లొక్కపరి రతికేళిమీఁద
మనసుపాఱినఁ గంకటి మైలచీరఁ
బఱచి విడె మొల్లరే యంచుఁ బలుకరింపఁ
గుక్కకూఁతుర వలదంచు వెక్కిరించు. 458
సీ. ఒడిలోనఁ బంచాంగ ముంచుకొన్నది గాన
కెటుపోయె ననుచు నూరెల్ల వెదకుఁ
బనిలేనిపని వీథిఁ జనుచుఁ గ్రమ్మరు నాత్మ
గృహమంచు నెంచి యిల్లిల్లుఁ దూఱు
నపుడు భుక్తి యొనర్చి యవునషే సంకటి
తింటినా యని యింటి తెఱవ నడుగుఁ
గురుచదోవతి గట్టికొని యెవ్వరో యిట్లు
గట్టిపోయి రటంచుఁ గలవరించు
తే. గడియలోఁ దెల్లవాఱె భాస్కరుఁడు గ్రుంకె
జాగు లేలంచు సందెపై సందెవార్చుఁ
గంతుమాయల నుమ్మెత్తకాయ దిన్న
పొలుపు సారెకుఁ దెల్పు నప్పుడమివేల్పు. 459
వ. ఇవ్విధంబునం బునఃపునఃప్రవర్ధమానమన్మథోన్మాదుండై యమ్మేదినీదేవుం డొక్కనాఁ డహర్ముఖంబున సంధ్యావందనార్థంబు తటాకలితవిటపిచ్ఛటాకం బగుతటాకంబున కరిగి తదీయతోయజామోదమేదురమధువ్రతవ్రాతతీవ్రతతారవంబులు బొలుచుచున్న సమయంబున. 460
క. మేలికడానిసడాకల
పోలికగల యిరుగుపొరుగు పొలఁతులతో నా
హాలికబాలిక శశిరే
ఖాలిక యచ్చటికి నీటికై యరుదెంచెన్. 461
క. వచ్చిన మేనికిఁ బ్రాణము
వచ్చిన యట్లైన మెచ్చి వసుథావిబుధుం
డచ్చపలాక్షీమణికి
ముచ్చటతోఁ జేతులెత్తి మ్రొక్కినయంతన్. 462
తే. అయ్యవా రెవ్వరికి మ్రొక్కెనంచుఁ బలుక
నెవ్వతెకు నేల మ్రొక్కునో యెమ్మెలాఁడి
నమ్మి యేదేవరకు మ్రొక్కినాఁడొ యనుచు
నవ్వుచేడెలఁ గూడి యన్నాతి చనియె. 463
క. వాలాయము దినదినమును
బాలామణి వచ్చుననుచుఁ బాఱుఁడు ప్రాతః
కాలమునఁ దత్తటాకము
కూలంబున ముక్కు పట్టుకొని కూర్చుండున్. 464
తే. ఉండి నీటికి వచ్చు నయ్యువిదఁ జూచి
సన్నగా మ్రొక్కు మ్రొక్కఁ దజ్జలజనయన
తనకు మ్రొక్కుటఁ దానాత్మఁ దలఁచితలఁచి
యేటి యాలోచన యటంచు నింటికరుగు. 465
క. అంతట విను మొకనాఁ డ
క్కాంతామణి యతని మనసుఁ గనవలె ననుచుం
జింతించి జోడుప్రాయపు
టింతుల నెడఁబాసి నీటి కేతెంచుటయున్. 466
తే. అతఁడు గనుఁగొని యిది సమయం బటంచు
మఱియు మఱియును మ్రొక్క నమ్మందగమన
కడవ యట డించి తెలిసెదఁగాక యనుచుఁ
జెంతకేతేర నాతఁడు చేర నరిగి. 467
క. ఆశీర్వాదము మేరుధ
రాశాసిభవత్కుచద్వయంబునకు సుధా
వేశలహాసాననరా
కాశశికిన్ నీకు మేలుగావలె నబలా. 468
క. ఇన్నిదినంబులు సనియె
న్మన్నన నీ వెన్నఁడైన మము నమ్మినవాఁ
డున్నాఁ డీబాఁపండని
వెన్నెలచూపులను జూడవే కద నన్నున్. 469
చ. అనవిని నవ్వి యవ్వికసితాంబుజలోచన పైఁటకొంగు కే
లున నులివెట్టుచుం దళుకుతళ్కునఁ జూపులఁజూచి రెడ్డి నీ
ఘనత యెఱింగి తా నడవఁగా నదిగాదని యేను జేయఁగ
ల్గినపని యేమియున్న దవులే దయఁబల్కితివేమొ యీగతిన్. 470
క. అది యుండనిమ్ము నే నడి
గెద నొక్కటి నీవు దినముఁ గేలెత్తి ముదం
బొదవఁగ మ్రొక్కు ఘటింతువు
గద యది యెవ్వరికిఁ దెలుపఁగావలె ననినన్. 471
తే. ఆతఁ డిట్లను నోజనజాస్య నీకుఁ
గాక యింకెవ్వరికి మ్రొక్కఁగాఁ గడంగు
సతులధర్మపవిత్రంబులైన నాక
రంబులనుమాట లీఁక నేల త్రవ్వవలయు. 472
క. అతిథినయి వచ్చినాఁడ
న్రతిభిక్ష యొసంగి నన్ను రక్షింపఁగదే
సతి నీపితృ దేవతలకు
గతి గల్గెడుననిన హలికకామిని కలఁకన్. 473
తే. అమ్మనేఁజెల్ల బాపనయ్యా మఱేమి
రజ్జులాడెదు మంచిగురస్తువగుదు
చేరిమాటాడినపుడే నాసిగ్గువోయె
నౌరయంటివి లెస్సబాగాయెఁ గాదు. 474
తే. ఓడ కిటువలె నీ వింతవాఁడ వేని
మించి తగినట్టి బుద్ధి చెప్పించవచ్చు
గ్రామమున కెల్ల మాలిమికాఁడ వగుట
బ్రతికిపోతివి పోర బాఁపనగరాస. 475
క. అనుమాటలు చెవినిడ కా
యన యిట్లనిపలుకుఁ దన్మృగాక్షీమణితో
జనుమనుచుఁ ద్రోయ విస్తరి
చినిగెడునన్నట్లు వలపు చెడ్డది సుమ్మీ. 476
సీ. పట్టెవర్ధనము నీపాదాబ్దములు సోఁక
మ్రొక్కినఁగాదషే ముద్దుగుమ్మ
జందెము గుబ్బచన్ను లంటఁగఁ గౌఁగి
లించినఁగాదషే మించుఁబోఁడి
వేల్మి వేల్చినచేత వెస నీకు వక్కాకు
లిచ్చినఁగాదషే యిందువదన
వేదము ల్గడుఁ జదివిననోట నీమోవి
యానినఁగాదషే యబ్జనయన
తే. యింతకంటెను నన్ను నీ వేమి సేయు
దనుచు నొండాడవేని ప్రియంబుఁగంటి
నీవు తెచ్చినకడవలో నీళ్లు దెమ్ము
ధారవోసెద నావిప్రధర్మ మెల్ల. 477
క. వేదము చదివినఫలము
న్వాదించినఫలము సంధ్య వార్చినఫలముం
బైదలి నీకు నొసంగెదఁ
గాదనినం బ్రహ్మహత్య కట్టెదుసుమ్మీ. 478
తే. అని యతఁడు వల్క నచట నేకాంత మగుట
మరుఁడు ప్రక్కలు పొడిచి సమ్మతముఁ జెందు
మనుచు నిర్బంధ మొనరింప నతని కనియెఁ
గలికి నాలుగుదిక్కులుఁ గలయఁజూచి. 479
క. నసగొట్టు బాఁపనయ్యా
పిసవెఱ్ఱికిఁ దగులుపడి తపింపఁగనేలా
బసవద్దు గదలకుండెడు
వసతికి రమ్మచటి కేను వచ్చెదఁ బొమ్మీ. 480
తే. అనిన సంభ్రమమంది యయ్యవనిసురుఁడు
శీఘ్రమేవ త్వదీయేష్ట సిద్ధిరస్తు
స్వస్తిరస్తు తథాస్తు తథాస్తు హలిక
వనజగంధి యటంచు దీవనలొసంగి. 481
సీ. వలుదలై మెఱయు పార్వణపుముద్దలవంటి
వలిగుబ్బ లెన్నఁడు వ్రచ్చికొందు
బంచపల్లవముల మించినపెదవి యాఁ
కలిదీర నెన్నఁడు గఱచికొందుఁ
గొనలుగల్గినదర్భకోటినేలిన కురు
ల్గట్టిగా నెన్నఁడు పట్టుకొందుఁ
బంచామృతముఁ గ్రిందుపఱచు వాక్సుధచవు
ల్తనివంద నెన్నఁడు ద్రావికొందు
తే. ననుచుఁ గోరుచు నవ్వుచు నాడికొనుచు
సారె గేరుచుఁ జూచినవారు వీని
పుట్టు కిష్కంధలోను గాఁబోలుననఁగ
నాసుశర్మయు నాత్మగేహమున కరిగె. 482
తే. ఇవ్విధంబునఁ దనయింటికేగి హలిక
కాంత రమ్మనె బసవద్దు గదలకుండు
చోటికక్కట యదియెట్టుచోటు తెలియ
నడుగలేనైతినని ఖిన్నుఁడై కృశింప. 483
ఉ. శీలవతీశిరోమణి విచిత్రతరంబగు భర్తహర్ష మ
వ్వేళనుదోఁచు తద్వ్యథయు వేమఱుగన్గొని చేరి దీనతా
శ్రీలలితంబుగా నతఁడు చెప్పిన నించుక చింతనేసి వా
చాలసమానమాధురి విశాలము గాంచి రహించ నిట్లనెన్. 484
క. బసవద్దు గదలకుండెడు
వసతియు నన్నదిది యన్న వనజారికళా
లసమానమౌళిగోవెల
మసలక యటు పొండు నేఁటి మాపటి కనినన్. 485
క. పరమామోదత నెంతటి
వెరవరి విది తెలిసినపుడె విద్వాంసునికూఁ
తురవగు దని యతఁ డా సుం
దరి వడ్డింపంగ భోజనము దీర్చి వెసన్. 486
సీ. సోలనీటను నీడఁ జూచుచుఁ బట్టెవ
ర్ధనము నిండఁగ నక్షతలను మెత్తి
యడుసులోఁబడు వరాహముచంద మొదవంగఁ
దగ వేఁపచెక్కగందం బలంది
నరసినసిగలోన నంబివాఁ డిచ్చిన
గన్నేరుపూవులు కొన్ని తుఱిమి
తడియాఱి యాఱకుండెడు ప్రాఁతదోవతి
బట్ట వేమఱుఁ బింజవెట్టి కట్టి
తే. కూర్మిసతి పెట్టెలో దాఁచికొన్ననల్ల
గరలపండుగుచీరఁ బైఁ గప్పుకొనుచు
నతనుఁ డెసకొల్ప దేవాలయంబుఁ జేరి
ప్రొద్దుగ్రుంకకమున్నె సొంపులు జనింప. 487
క. ఈదారిఁ జేరి యేచెలి
రాదాయె నిదేమి యనుచు బ్రాహ్మణుఁడు బహి
ర్వేదికి వచ్చుచుఁ గోవెల
లోఁ దూఱుచునుండె నంతలోనఁ దలారుల్. 488
తే. అతని తహతహ గనుఁగొని యౌర యీతఁ
డేవధూమణి రాకకో యిచట నున్న
వాఁడు మంచిది యదియును వచ్చినపుడె
పట్టుద మటంచుఁ బొంచి రో పద్మనయన. 489
ఉ. హాలికబాలికామణియు నంత నిజాంగముమీఁదనున్న ని
ద్రాళుమనోధినాథుని కరముల మెల్లనె డించి సాహస
శ్రీలసమానయై వెడలి శీఘ్రగతిం జనుదెంచి చొచ్చె దే
వాలయము న్మనోరథపరాయణుఁడైన సుశర్మ మెచ్చఁగన్. 490
క. గురికాఁడు రాక మన మీ
తరుణీభూసురులఁ బట్టఁదగదని చుట్టుం
బురిగొనుచుండిరి యాతల
వరు లంతట నదియు నతనివాంఛలు దీర్చెన్. 491
క. ఆలోన యామికావళి
యాలోచన యెఱిఁగి మగని హలికాళికచం
జాలిజడకుండఁ గావఁగ
శీలవతీకాంత కొంతచింత యొనర్చెన్. 492
క. అని మఱియు నా ప్రభావతిఁ
గనుఁగొని యచ్చిలుక పలికెఁ గలికీ యిఁక న
వ్వనితామణి వారలనే
యనువునఁ గావవలెఁ దెలియ నడిగెదఁ జెపుమా. 493
క. అని యడిగిన కథ కద్భుత
మున మునుఁగుటఁ బలుకలేని ముద్దియమొగమున్
గనుగొని యదియుం దెలిపెద
వినుమనియెం జిలుక యమృతవిధమధురోక్తిన్. 494
తే. అట్లు తలపోసి యొకయుపాయంబుఁ గాంచి
బళ్ళెమునఁ బెద్దజోతి యేర్పఱుచుకొనుచు
నిల్లు వెలువడి దేవతాగృహము చేరఁ
దెగువమై వచ్చె శీలవతీలతాంగి. 495
క. ఆనాతిఁ జూచి తలవరు
లేనెలఁతయొ గండదీప మెత్తఁగ వచ్చెం
బోనిమ్మని కనుగొన న
మ్మానిని గుడిసొచ్చి కనియె మగని న్మగువన్. 496
క. కని వచ్చితి వెఱవకుఁ డని
తనచేలము దాని కిచ్చి దానిపటంబుం
దనకటి ధరియించి రయం
బునఁ బళ్లెర మీవు గొంచుఁ బొమ్మని పనిచెన్. 497
క. [3]పనిచిన మెచ్చుచు హలికాం
గన యీశ్వరుమ్రొక్కు చెల్లెఁగద యింక మము
న్మునపటివలె మనుపుము దయ
నని చని పతిప్రక్క ముగ్ధయై పవళించెన్. 498
ఉ. అంతఁ దలారు లాత్మవిభుఁ డచ్చటికిం జనుదేర జారవృ
త్తాంతము దెల్పఁ బట్టుఁడని యాతఁడనం గుడిసొచ్చి దివ్వటీ
ల్చెంతకుఁ దెచ్చి చూచి యిది శీలవతీసతి యీతఁ డెంచఁ ద
త్కాంతుఁ డటంచు సిగ్గువడి తప్పెఁ బ్రయోజన మంచుఁ బోయినన్. 499
తే. రమణుఁ దోడ్కొని తనమందిరమున కరిగె
శీలవతియంచు వచియించు చిలుకఁ జూచి
యాప్రభావతి యప్పుడే యదిగొఁ దెల్ల
వాఱెనని యేగెనంత నగారమునకు. 500
క. చని నాఁటిరేయి నరపతి
నెనయం దద్గేహసీమ కేగెడుదానిం
గనుఁగొని యొకకథ వినుమని
యనియెం గీరంబు పలుకు లమృతము దొలఁకన్. 501
- ↑ ఇది హంసవింశతిలోగూడ గలదు.
- ↑ ఉ. అందున వానికెల్లను హలాంకుఁ డన న్నొకపెద్దరెడ్డి చె
ల్వొందు సుభోగుఁడై నగరిలోపల వన్నియగన్న యట్టివాఁ
డందునఁ బెద్దకాఁ పనుచు నందఱుఁ గొల్వఁగ లెక్కలేని వె
ల్లందగుమిన్కులుం గలిగి యాతఁడు రాజిలుచుండు నప్పురిన్. - ↑ క. అప్పు డాశీలవతికేల నొప్పుపళ్ళె
మెలమి తానందుకొని కాఁపుటింతి శివుని
మ్రొక్కుచెల్లించువిధమున ముద్దునడల
గుడివెడలి చేరె నిల్గుల్కుగుబ్బలాడి.